1. 1884 నాటికే శ్రీరామకృష్ణుల విశేష భక్తులందరూ వచ్చి చేరడం
పూర్ణుడు తప్ప యోగిక దర్శనాలలో శ్రీరామకృష్ణులు గాంచిన భక్తులందరూ 1884 వ సం ॥ పూర్తికాక మునుపే దక్షిణేశ్వరానికి వచ్చేశారు. 1885 ప్రారంభంలో పూర్ణుడు ఆయన వద్దకు వచ్చాడు. అతణ్ణి అనుగ్రహించిన తరువాత ఆయన, “పూర్ణుని రాకతో నేను దర్శనాలలో కాంచిన ఆ కోవకు చెందిన భక్తులందరూ వచ్చేసినట్లే. ఆ కోవకు చెందిన భక్తులు ఇకమీదట ఎవరూ రారు” అని అన్నారు.
2. ఈ కోవకు చెందిన భక్తులతో శ్రీరామకృష్ణుల ప్రవర్తన
పైన పేర్కొన్న ఆ కోవకు చెందిన భక్తులలో అనేకులు 1883 వ సం ॥ మధ్య కాలంలోనే వచ్చారు. ఈ సమయంలో నరేంద్రుడు తన కుటుంబ పోషణార్థం దారిద్ర్యంతో పోరాటం సాగిస్తున్నాడు. రాఖాల్ బృందావనానికి వెళ్ళివున్నాడు. పై కోవకు చెందిన భక్తులలో ఎవరైనా తమ వద్దకు రాబోతున్నప్పుడు ఆయన ముందుగానే, “ఈ రోజు ఆ వైపు నుండి (ఒక ఫలానా దిశను చూపుతూ) ఇక్కడకు చెందిన భక్తుడొకడు రానున్నాడు” అని చెప్పేవారు. లేదా అటువంటి వ్యక్తి వచ్చీరాగానే, “నువ్వు ఇక్కడి వాడివే” అంటూ ఆప్యాయంగా అతణ్ణి ఆహ్వానించేవారు. ఇంకా భాగ్యశాలులైతే వారు రాగానే వారి పట్ల ఆయన ప్రత్యేకంగా ఆకర్షితులై, వారికి తినిపించాలనీ, వారితో ఆధ్యాత్మిక విషయాల గురించి ముచ్చటించాలనీ, వారిని పదేపదే చూడాలనీ ఆయన ఎంతో తహతహ చెందేవారు. గత సంస్కారాల నుండి ఉత్పన్నమైన వారి నైజాన్ని ఆయన పరిశీలించి, అంతకు క్రితం నుండి తమ వద్దకు వస్తున్న అటువంటి నైజమే గల భక్తులకు వారిని పరిచయం చేసేవారు. అందువలన తమవంటి దృక్పథమే గల వ్యక్తులతో తమ తీరిక సమయాన్ని ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటించు కోవడంలో గడపగలరని శ్రీరామకృష్ణులు ఆశించేవారు. ఆహ్వానం లేకపోయినా అటువంటభక్తుల ఇళ్ళకు ఆయన వెళ్ళి, ముచ్చటైన సంభాషణతో వారి సంరక్షకులను ప్రసన్నులను చేసి, ఆ భక్తులు తమ వద్దకు నిరాటంకంగా రావడానికి మార్గాన్ని సుగమం చేసేవారు.
3. దివ్యభావంలో శ్రీరామకృష్ణులు వారి ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేయడం
ఆ కోవకు చెందిన భక్తుడు తమ వద్దకు వచ్చిన కాసేపటికి, అతణ్ణి ప్రక్కకు పిలిచి ధ్యానం చేయమని చెప్పి, దివ్యభావోద్వేగంలో ఆ భక్తుని ఛాతీనో లేదా నాలుకనో స్పృశించేవారు. శక్తిసమన్వితమైన ఆ స్పర్శతో భక్తుని మనస్సు అంతర్ముఖం కాగా అతడు అచేతనావస్థను చేరుకొనేవాడు. ఆ అవస్థలో అతడిలో సంచయమై ఉన్న గత సంస్కారాలు చైతన్యం పొంది అతడిలో ఆధ్యాత్మిక అనుభూతిని ఉత్పన్నం చేసేవి. గురుదేవుల ఆ దివ్యస్పర్శ మూలంగా కొందరికి జ్యోతి దర్శనం కలిగేది, మరి కొందరు దేవీదేవతల తేజోమయ రూపాలను దర్శించేవారు. ఇంకొందరు ప్రగాఢ ధ్యానమగ్నులయ్యేవారు లేదా అంతకు మునుపు ఎన్నడూ పొందని దివ్యానందాన్ని చవిచూసేవారు. కొద్దిమందికి హృదయ బంధనాలు తెగిపోయి భగవత్సాక్షాత్కారం కోసం తహతహలాడేవారు. మరికొందరు ఆధ్యాత్మిక భావోద్వేగ ప్రేరణతో సవికల్ప సమాధి పొందేవారు. బహు అరుదుగా ఏ ఒక్కరో నిర్వికల్ప సమాధి అనుభూతిని ముందుగానే ఒకింత చవిచూసేవారు.
ఇలా శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి తేజోవిరాజమాన మూర్తులను దర్శనాలలో గాంచినవారు కోకొల్లలు. ఒక రోజు తారక్‌లో (స్వామి శివానంద) ఆ దివ్యస్పర్శ వల్ల మహాభగవద్వ్యాకులతా, ఏడ్పూ పొంగిపొర్లాయనీ, ఫలితంగా అతడి హృదయ గ్రంథులన్నీ విడివడ్డాయనీ స్వయంగా గురుదేవుల నుండే మేం విన్నాం. నిరాకార ధ్యానం చేస్తున్న చిన్న నరేంద్రుడు ఆ దివ్యస్పర్శతో భావపారవశ్యంలో మగ్నుడైపోయాడు. కాని శ్రీరామకృష్ణుల దివ్యస్పర్శ ఫలితంగా నిర్వికల్ప సమాధి అనుభూతిని ముందుగానే చవిచూడగలిగింది నరేంద్రుడొక్కడే.
భక్తులను అలా స్పృశించడమే కాక కొందరికి శ్రీరామకృష్ణులు మంత్రదీక్ష కూడా ఇచ్చారు. మామూలు గురువుల మాదిరి దీక్ష ఇస్తున్నప్పుడు పూజ చేయడం గాని, జాతకాలు పరిశీలించడంగాని ఆయన చేసేవారు కారు. కాని యోగదృష్టితో శిష్యుల పూర్వ సంస్కారాలను కనుగొని, ‘ఇది నీకు తగిన మంత్రం’ అని తెలిపేవారు. నిరంజన్, తేజ్చంద్ర, వైకుంఠ్ మొదలైన వారిని ఆ విధంగా అనుగ్రహించినట్లు ఆయన ముఖతా మేం విన్నాం. కేవలం ఒక వ్యక్తి శాక్తుల కుటుంబంలో జన్మించాడు కాబట్టి అతడికి శాక్తమంత్రాన్ని లేదా వైష్ణవుల కుటుంబంలో జన్మించాడు కనుక వైష్ణవమంత్రాన్ని ఆయన ఇచ్చేవారు కాదు. వారివారి పూర్వ సంస్కారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే కొన్ని సమయాల్లో శక్తి ఆరాధకుడికి వైష్ణవ మంత్రాన్ని, వైష్ణవ ఆరాధకుడికి శక్తిమంత్రాన్ని దీక్షగా ఇవ్వడం కూడా కద్దు. అంటే శిష్యుల సంస్కారాల మేరకు ఎవరికి ఏది దోహదం చేస్తుందో వారికి ఆ ఉపదేశం చేసేవారనడం స్పష్టం.
4. శ్రీరామకృష్ణుల దివ్యస్పర్శ ఋజువు పరచే విషయం
సంకల్పమాత్రాన లేదా స్పర్శమాత్రాన మహాత్ములు ఇతరులలో ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపచేసి వారి మనస్సులను ఉన్నతోన్నత భావభూముల వైపుకు మరల్చగలరని శాస్త్రాలు వచిస్తున్నాయి. మహాపురుషుల ప్రభావం వేశ్యల, కాముకుల, పాపుల, దుష్టుల జీవితాలనే మార్చివేసినప్పుడు, వారి అంతరంగ శిష్యుల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏముంది? ఎంతో కాలం నుండి లోకంలో అవతారపురుషులుగా పరిగణింపబడి ఆరాధింపబడుతూన్న శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఏసుక్రీస్తు, చైతన్యుల వంటి మహాపురుషులు ప్రతి ఒక్కరిలో ఆ శక్తి అభివ్యక్తీకరణ విభిన్న పరిమాణాలలో కానవస్తూన్నది.
శాస్త్రాలు అలా వక్కాణిస్తూన్నప్పటికీ ప్రయోజనం ఏమిటి? అటువంటి అవతార పురుషుల అలౌకిక చేతల గురించిన ప్రత్యక్షజ్ఞానం సుదీర్ఘకాలం లేనందున లోకం వారి పట్ల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. అంతేకాదు, ప్రస్తుతకాలంలో భగవంతునిపై విశ్వాసం కూడా మూఢనమ్మకంగా, మానసిక దౌర్బల్యంగా పరిగణింపబడుతున్నది. భగవంతుని మీదే నమ్మకం పోయినప్పుడు, ఇక భగవదవతారాలను నమ్మటం గురించి వేరేగా చెప్పాలా? లోకుల మనస్సుల నుండి ఆ అపనమ్మకాన్ని తొలగించి వారిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపింప చేయడానికి ఈ ఆధునిక యుగంలో శ్రీరామకృష్ణుల వంటి మహాపురుషుల ఆవిర్భావం ఎంతో ఆవశ్యకం. ఆయనలో అటువంటి దైవశక్తి అభివ్యక్తీకరింపబడటం చూసినప్పుడే, గతకాలంలోని మహాపురుషులలో కూడా అట్టి శక్తులు ఉండేవనే నమ్మకం మాలో కలుగసాగింది. శ్రీరామకృష్ణులను అవతారపురుషులుగా విశ్వసించక పోయినా, ఆయనలో అభివ్యక్తమయ్యే మహాద్భుతశక్తిని చూసినప్పుడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఏసుక్రీస్తు, చైతన్యులు మొదలైన మహానుభావులు ఏ కోవకు చెందారో ఈయన కూడా ఆ కోవకే చెందిన వ్యక్తి అని మాత్రం అంగీకరించక తప్పదు.
5. ప్రతి భక్తుడూ శ్రీరామకృష్ణులను తన భావంలోని వ్యక్తిగా తలచడం
యువకులు, వృద్ధులు, గృహస్థులు, సన్న్యాసులు, సాకార- నిరాకార ఉపాసకులు మొదలైన వివిధ కోవలకు, వయస్సులకు చెందిన భక్తులు పలువురు భవిష్యత్తులో తమ వద్దకు రాబోతున్నారని శ్రీరామకృష్ణులకు ముందే తెలుసు. ఇలా వచ్చిన భక్తులలో చాలా వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, అందరిలోను ఒక సామాన్యాంశం కనిపిస్తుంది. వీరందరికీ తమ సాధన మార్గం మీద, తమ ఇష్ట దైవం మీద అచంచల విశ్వాసం ఏకాగ్రభక్తి ఉంటాయి; అంతేకాదు వీరిలో ప్రతి ఒక్కరూ భగవత్సాక్షాత్కారార్థం ఎటువంటి పరిత్యాగానికి సైతం సిద్ధమైనవారు.
శ్రీరామకృష్ణులు తమ భక్తుల నందరినీ ప్రేమ బంధనంతో తమతో కట్టి వేసి, ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక భావాన్ని పరిరక్షిస్తూ, సకల మత సిద్ధాంతాలలో కోవిదులైనప్పటికీ, అతడి(ఆ భక్తుడి) ఆధ్యాత్మిక భావం పట్లే తమకు అధిక ప్రీతి అని అతడు భావించే రీతిలో ఆయన మెలిగేవారు. అటువంటి అభిప్రాయం కలగడం వలన గురుదేవుల పట్ల ప్రతి శిష్యుడు అపార భక్తిప్రపత్తులు చెల్లించేవాడు. సంకుచిత శాఖాభిమానాలను వారు అధిగమిస్తూ పోతూ, శ్రీరామకృష్ణుల సత్సాంగత్యం, ఉపదేశాల ఫలితంగా ఎప్పుడు వారు ఉదారభావాలను సంతరించుకొనేవారో అప్పుడు ఆయన పరిపూర్ణతను అవగతం చేసుకొని ఆశ్చర్యచకితుల య్యేవారు. ఉదాహరణగా ఒక సామాన్య సంఘటన గురించి ప్రస్తావిస్తున్నాం.
6. ఒక ఉదాహరణగా బలరాం బోస్
కలకత్తాలోని బాగ్‌బజార్ వాస్తవ్యుడైన బలరాం బోస్ వైష్ణవుల కుటుంబంలో జన్మించాడు, వైష్ణవాన్ని తు.చ. తప్పక పాటించేవాడు. సంసార జీవితం గడుపుతున్నప్పటికీ ప్రాపంచికత అంటని వ్యక్తి; గొప్ప సంపన్నుడైనప్పటికీ నిగర్వి. ప్రతిరోజు ఉదయం పూజలో, ధార్మిక అధ్యయనంలో నాలుగైదు గంటలు గడిపేవాడు. అహింసను కచ్చితంగా పాటించేవాడు కావడం వలన ఏ కారణం చేత క్రిమికీటకాలకు సైతం హాని తలపెట్టేవాడు కాడు. బలరాంను మొట్టమొదటిసారి శ్రీరామకృష్ణులు చూడగానే చిరపరిచితుడిలా అతణ్ణి ఎంతో ప్రేమతో స్వీకరించారు. అతణ్ణి గురించి ఆయన ఇలా అనేవారు : “ఇతడు చైతన్య మహాప్రభువు అంతరంగ భక్తుడు. ఇక్కడికి (తమకు) చెందినవాడు. అద్వైత నిత్యానందులతో పాటు చైతన్యులు సంకీర్తనం చేస్తూ శ్రీహరి నామంతో దేశాన్ని ముంచెత్తివేసి, ఆబాలగోపాలాన్నీ తన్మయులను చేయడం భావపారవశ్య అవస్థలో నేనొక రోజు దర్శించాను. ఆ సంకీర్తనబృందంలో ఇతణ్ణి (బలరాం బసు) నేను చూశాను.”
7. శ్రీరామకృష్ణుల దర్శనానంతరం బలరాం ఆధ్యాత్మిక పురోభివృద్ధి
శ్రీరామకృష్ణుల దివ్యసాంగత్యంలో బలరాంలో అద్భుత పరిణామం జనించింది. ఫలితంగా సత్వరమే అతడు ఆధ్యాత్మిక జగత్తులో ఎంతో పురోగమించాడు. శాస్త్రాలు ఆదేశించే బాహ్యపూజల వంటి వైదీభక్తి ఆవరణాన్ని అతిక్రమించి, సంపూర్ణంగా భగవంతునికి పరాధీనుడై సదసద్విచారణ శీలాన్వితుడై సంసారంలో నిస్సంగుడై జీవించసాగాడు. భార్య, కొడుకు, సంపద ఇత్యాది తన సర్వస్వాన్ని భగవత్పాదపద్మాలకు అర్పించి, యావత్తు భగవంతునిదే అనే భావంతో ఆయన దాసునిగా, ఆయన ఆజ్ఞలు పాలించడానికి సదాసర్వవేళలా సిద్ధంగా ఉండి జీవించసాగాడు. సాధ్యమైనంత కాలం శ్రీరామకృష్ణుల పావన సాంగత్యంలో గడపడం ఒక్కటే క్రమంగా బలరాం జీవిత ధ్యేయమైంది. శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో పొందిన పరమశాంతిని తానొక్కడు మాత్రమే అనుభవించడంతో బలరాం ఆగిపోలేదు. తన బంధుమిత్రులు యావన్మందీ గురుదేవుల సాంగత్య లబ్ధి పొంది తద్ద్వారా పరమానందాన్ని అనుభవించాలనే ఆకాంక్షతో అందుకు సముచిత ఏర్పాట్లు చేయడంలో నిమగ్నుడైనాడు. ఆ విధంగా భగవంతుని దాసుడననే బలరాం వైఖరి కారణంగా అనేకులు శ్రీరామకృష్ణుల ఆశ్రయాన్ని పొంది తమ జన్మలను సార్థకం చేసుకొన్నారు.
8. అహింసా వ్రతం పట్ల బలరాం సంశయం
బాహ్యపూజ విషయంలో బలరాం అభిప్రాయం ఎలా మారిందో అదే విధంగా ఒకింత కాలంలోనే అహింసావ్రతాన్ని పాటించడంలో కూడా అతడి అభిప్రాయం మారింది. శ్రీరామకృష్ణుల సాంగత్య భాగ్యం కలగడానికి మునుపు, పూజ ధ్యానాదులకు భంగం కలిగించే దోమలకు సైతం బలరాం హాని తలపెట్టేవాడు కాడు. అలా వాటికి హాని చేస్తే తన ఆధ్యాత్మికత కుంటుపడుతుందని అతడి అభిప్రాయం. ఒక రోజు ధ్యానానికి కూర్చున్నప్పుడు, ‘మనస్సు స్వాభావికంగానే చంచలమైంది. అటువంటి మనస్సును ఏకాగ్రం చేసి తిరిగి భగవత్పాదపద్మాలవైపు మళ్ళించడమే. కర్తవ్యం, అదే ధర్మంగాని సదా ఈగలనూ, దోమలనూ రక్షించడం కాదే! కనుక ఏదో కొన్ని దోమలను చంపి ఒకింతసేపయినా మనస్సును భగవంతునిపై ఏకాగ్రం చేయడం అధార్మికం కాదు, పైగా జీవిత పరమ లక్ష్యానికి దోహదకారి కూడా’ అనే ఆలోచన బలరాం మనస్సులో మెదిలింది. అందు గురించి బలరాం ఇలా చెప్పేవాడు: “సుదీర్ఘకాలంగా పాటిస్తూవున్న అహింసావ్రతం ఆ ఆలోచనతో తలక్రిందులైంది. కాని నా మనస్సులో సంశయాలు పూర్తిగా తొలగిపోలేదు. కాబట్టి ఈ విషయంగా శ్రీరామకృష్ణులను సంప్రదించడానికి దక్షిణేశ్వరానికి బయలుదేరాను. ‘ఇతరుల మాదిరి ఆయన దోమలను చంపడం నేనెప్పుడు చూడలేదే!’ అని దారిలో వెళుతూ అనుకొన్నాను. అటువంటి సంఘటన నా కేదీ జ్ఞాపకం రాలేదు. నాకు తెలిసినంత వరకు నా కంటే అహింసా వ్రతాన్ని కఠోరంగా ఆయన పాటించేవారు. అప్పుడు ఒకనాటి సంఘటన నాకు జ్ఞాపకానికి వచ్చింది. ఒక రోజు లేత పచ్చికబయలు మీదుగా ఒక వ్యక్తి నడిచిపోతున్నప్పుడు, అది చూసి అతగాడు తమ ఛాతీ మీదుగా నడిచిపోతున్నంత బాధతో ఆయన సతమతమయ్యారు. ఆ గడ్డిపరకలో సైతం అభివ్యక్తమౌతున్న ప్రాణశక్తిని గుర్తించ గల చైతన్యమూర్తులు ఆయన! ఈ విషయం జ్ఞాపకం రావడంతో గురుదేవులను మళ్ళీ సంప్రతించడం అనవసరం, ఇదంతా నా మనోభ్రాంతి అనే నిర్ణయానికి వచ్చాను. అయినప్పటికీ ఆయనను దర్శించుకొని రావచ్చు కదా! మనస్సు పరిశుద్ధమౌతుం’ దని అనుకొన్నాను.
9. ఒక ఉదాహరణతో బలరాం సందేహ నివృత్తి
“దక్షిణేశ్వరం చేరుకొని గురుదేవుల గది గుమ్మం వద్దకు వచ్చాను. కాని గదిలోకి వెళ్ళడానికి ముందు ఆయన అప్పుడు ఏం చేస్తున్నారో చూసి ఆశ్చర్య పోయాను. తమ మంచంలో నక్కిన నల్లులను పట్టి చంపుతున్నారు! నేను ఆయనను సమీపించి, ప్రణామం చేయగానే, ‘ఈ దిండులో నల్లులు బాగా పెరుగుతున్నాయి. రేయింబవళ్ళు అవి నన్ను కుడుతూ నిద్రాభంగం కలిగిస్తున్నాయి. అందుకే వాటిని చంపుతున్నాను’ అని చెప్పారు. ఇక నా సంశయం గురించి ప్రశ్నించవలసిన అవసరం లేకపోయింది. ఆయన మాటలు, చేతలతో నా మనస్సు సంశయ రహితమైంది. కాని ఆశ్చర్యపోతూ ఇలా ఆలోచనలో పడ్డాను. గత రెండు మూడేళ్ళుగా వేళాపాళా చూడకుండా ఈయన వద్దకు వస్తున్నాను. ఉదయం వచ్చి, రాత్రి దాకా ఉండి తిరిగి వెళ్ళేవాణ్ణి. ఒకవేళ సాయంత్రం వేళ వస్తే, రాత్రి బాగా ప్రొద్దుపోయాకనే ఆయన వద్ద సెలవు పుచ్చుకొని తిరిగి వెళ్ళేవాణ్ణి. ఆ విధంగా వారానికి మూడు నాలుగుసార్లు ఇక్కడికి వచ్చేవాణ్ణి. కాని ఆయన ఇలా ప్రవర్తించడం నేనెన్నడూ చూడలేదు. నేడు ఆయన ఇలా చేయడానికి కారణం ఏమిటో! ఇంతకు మునుపు ఆయన అలా చేయడం నేను చూసివుంటే నా ఆధ్యాత్మిక భావానికి హాని వాటిల్లేదేమో! పర్యవసానంగా ఆయన పట్ల విశ్వాసాన్ని కోల్పోయి ఉండేవాడినేమో! అందువల్లనే పరమకారుణ్యమూర్తులైన శ్రీరామకృష్ణులు ఇంతకు ముందు ఎన్నడూ నా ముందు ఆ విధంగా చేయలేదని నేను అనుకొన్నాను.”
10. రెండు కోవల భక్తులు
యోగదృష్టిలో కానవచ్చిన భక్తులే కాకుండా ఈ కాలఘట్టంలో ఎందరో స్త్రీ పురుషులు శ్రీరామకృష్ణులను దర్శించి, శాంతి పొందగోరి దక్షిణేశ్వరానికి వచ్చారు. అందరినీ కూడా ఆయన ఆప్యాయతతో ఆహ్వానించి ఉపదేశాలతో కొందరిని, దివ్యభావపారవశ్యంలో స్పృశించి మరి కొందరిని అనుగ్రహించారు. కాలం గడిచేకొద్దీ శ్రీరామకృష్ణులను కేంద్రాకర్షణగా చేసుకొని భక్తబృందం విస్తృతించసాగింది. ఆ భక్తులలోని బాలురు, అవివాహితులైన యువకుల ఆధ్యాత్మిక జీవితాలను తీర్చిదిద్దడంలో శ్రీరామకృష్ణులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. అందుకు గల కారణాన్ని అనేక సందర్భాలలో “పదహారు అణాల (సంపూర్ణ) మనస్సును నిమగ్నం చేయకుంటే పరిపూర్ణ భగవత్సాక్షాత్కారం ఎన్నటికీ లభించదు. ఈ యువకుల మనస్సులలో భార్య, బిడ్డలు, సంపద, పేరుప్రతిష్ఠలు మొదలైన లౌకిక వస్తువుల ధ్యాస కించిత్తు కూడా లేదు; అవి నిర్మలంగా, స్వచ్ఛంగా ఉన్నాయి. ఇప్పుడు కనుక వారు ప్రయత్నిస్తే, భగవంతునికి నిండు మనస్సును అర్పించి, సకాలంలో భగవద్దర్శనం పొంది తరించగలుగుతారు. అందువలననే వారిని ఆధ్యాత్మిక పథంలో నిర్దేశింప నేనింత ఉత్సుకత చూపుతున్నాను” అని వెలిబుచ్చేవారు. అవకాశం దొరికినప్పుడల్లా శ్రీరామకృష్ణులు ఈ యువకులలో ప్రతి ఒక్కరినీ ఒక ఏకాంత ప్రదేశానికి తోడ్కొనివెళ్ళి యోగం, ధ్యానం మొదలైన విశిష్ట ఆధ్యాత్మిక సాధనలలో ఉపదేశాలు ఇచ్చేవారు. అంతేకాక కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించమని వారితో నొక్కివక్కాణించేవారు. అలాగే యోగ్యత మేరకు వారి వారి నిర్దిష్ట మార్గాలను చూపి, శాంత దాస్యాది భావాల ననుసరించి ఏ భావాన్ని చేపట్టితే తమ తమ ప్రత్యేక మార్గాలలో సత్వరమే పురోగమించగలరో ఆయా మార్గాలను ఆయన వారికి ఉపదేశించేవారు.
11. పురుషులకు శ్రీరామకృష్ణుల ఉపదేశ విధానం
అవివాహిత యువకులకు ఆధ్యాత్మికోపదేశాలివ్వడంలో శ్రీరామకృష్ణులు ఎంతో ఉత్సుకత చూపేవారని విని సామాన్య గృహస్థ భక్తులను ఆయన తక్కువ మేరకు అనుగ్రహించేవారని ఎవరూ అపార్థం చేసుకోరాదు. గృహస్థ భక్తులలో అనేకులకు తీరికగాని లేదా సామర్థ్యంగాని లేనందున, వారిని ఉన్నత ఆధ్యాత్మిక తత్త్వాలను ఆచరణలో పెట్టవద్దనీ, వాటిని అధ్యయనం చేయవద్దనీ చెప్పేవారు. కాని కామకాంచన అనురక్తిని క్రమంగా తగ్గించుకొంటూ, భక్తిమార్గాన్ని అవలంబిస్తూ చివరకు భగవత్ సాక్షాత్కారాన్ని పొందే రీతిలో వారిని తీర్చిదిద్ద ప్రయత్నించేవారు. మొట్టమొదట వారికి ‘తమ సొంత సంసారంలో’ కాక ‘భగవంతుని సంసారం’ లో జీవించమని ఉద్బోధించేవారు. సంసార కర్తవ్యాలను నిర్వర్తిస్తూ, అనురక్తిని, ‘నేను నాది’ అనే భావాన్ని వీడి సంపన్నుని ఇంట్లో పనిచేసే దాసీ మనస్తత్వాన్ని అలవరచుకోమని వారికి ఉపదేశించేవారు. తమ శక్తిమేరకు ఇంద్రియనిగ్రహాన్ని పాటించమని వారిని ప్రోత్సహించేవారు. “ఒకరిద్దరు బిడ్డలు పుట్టిన తరువాత భార్యాభర్తలు సోదరీసోదరుల్లా మెలగుతూ, తమ మనస్సులను భగవదాయత్తం చేయాలి” అని నొక్కి వక్కాణించేవారు. పైగా సదా సత్యపరిపాలన చేస్తూ అందరితోను సరళంగా ప్రవర్తించాలనీ, ఆడంబరంగా ఉండరాదనీ, సామాన్య అన్న వస్త్రాదులతో తృప్తిచెందుతూ దృష్టిని సర్వదా భగవంతుని మీదే కేంద్రీకరించాలనీ, రోజూ ప్రొద్దున సాయంత్రం పూజా జపం సంకీర్తనలు సలపాలనీ శ్రీరామకృష్ణులు గృహస్థ భక్తులను నిర్దేశించేవారు. వీటిని కూడా ఆచరించలేని గృహస్థులను మునిమాపువేళ ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని, చప్పట్లుకొడుతూ హరినామ భజన చేయమనేవారు. బంధుమిత్రులను ఆహ్వానించి అందరూ కలిసి ‘నామ సంకీర్తన’ చేయమనీ వారికి ఆయన ఉపదేశించడం కద్దు.
సామాన్యంగా స్త్రీలకు, పురుషులకు ఉపదేశం ఇస్తున్నప్పుడు ఆయన “కలియుగంలో నారదీయ భక్తిమార్గం చాలా అనువైనది. బిగ్గరగా భగవన్నామ సంకీర్తనం చేస్తే జీవుడు ఉద్ధరింపబడతాడు. కలియుగంలో మనుషులు అల్పాయుష్కులు, శక్తిహీనులు, అన్నగతప్రాణులు. అందుకే భగవత్సాక్షాత్కారార్థం అటువంటి సులభమార్గం వారికి నిర్దేశించారు” అని తెలియచెప్పేవారు. మళ్ళీ యోగం, ధ్యానం వంటి కఠోర సాధనలను గురించి విని ఎక్కడ నిస్పృహ చెందుతారోనని కొన్ని సమయాలలో ఆయన ఇలా చెప్పేవారు: “సన్న్యాసి అయిన వ్యక్తి తప్పక భగవంతుణ్ణి ధ్యానించి తీరతాడు. ఎందుకంటే సాంసారిక విధులన్నిటినీ పరిత్యజించడం భగవద్ధ్యాన నిమిత్తమే కదా! అటువంటప్పుడు అలా చేయడంలో ఘనత ఏముంది? కాని తల్లితండ్రులు, భార్యాబిడ్డలు, తదితరులు అనే భారమైన కర్తవ్యాలను నిర్వహిస్తూ ఎవడు భగవంతుణ్ణి ఒక్కసారైనా హృదయపూర్వకంగా ప్రార్థిస్తాడో, ఆ వ్యక్తి పట్ల భగవంతుడు ఎంతో ప్రసన్నుడౌతాడు. భగవంతుడు, ‘ఇంత పెద్ద భారాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ కూడా ఈ వ్యక్తి ఒకింతసేపైనా నన్ను గూర్చి తలచుకొంటున్నాడు. నిజానికి భక్తులలో ఇతడే అగ్రగణ్యుడు’ అని అనుకొంటాడు.”
12. భక్తులలో నరేంద్రుని ప్రాధాన్యం
యోగదృష్టిలో కాంచిన విశిష్ట భక్తులందరిలో నరేంద్రునికి ఎంత అత్యున్నత స్థానం శ్రీరామకృష్ణులు ఒసగారో మాటలలో వర్ణించలేం! విశిష్ట భక్తుల సంగతే ఇలా ఉన్నప్పుడు, సామాన్య భక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? యోగదృష్టిలో తాము చూసిన భక్తులలో కొందరిని గురించి ప్రస్తావిస్తూ ఆయన, “వీరంతా ఈశ్వరకోటులు. అంటే భగవంతుని ఒక ప్రత్యేక కార్యం నిర్వర్తించడానికై ఈ లోకంలో పుట్టిన కారణజన్ములు” అని అనేవారు. ఆ కొద్దిమంది ఈశ్వరకోటులను, నరేంద్రునితో పోల్చుతూ ఒక రోజు శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పారు: “నరేంద్రుడు సహస్రదళ పద్మం వంటివాడు. ఈ కోవకు చెందిన ఇతరులు కూడా పద్మాల వంటి వారే!కాని వారు పది, పదిహేను లేదా మహా అయితే ఇరవై దళాల పద్మాలవంటి వారు.” మరో సందర్భంలో ఆయన, “ఎంతోమంది భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు; కాని నరేంద్రుని వంటి వ్యక్తిమాత్రం ఎవరూ రాలేదు” అని అన్నారు.
శ్రీరామకృష్ణుల వచనాలను చక్కగా అవగతం చేసుకొని, ఆ పలుకుల, ఆయన అద్భుత చేతల అర్థాన్ని వ్యక్తం చేయగల వ్యక్తి నరేంద్రుడు తప్ప మరొకరు లేడంటే అతిశయోక్తి కాదు. శ్రీరామకృష్ణుల వచనాలకు నరేంద్రుని వ్యాఖ్యానం విని కొన్ని సమయాల్లో ఆశ్చర్యచకితులమై, ఇలా తలపోయడం కద్దు. ‘ఆహా! మేం కూడా ఇవే పలుకులను ఆయన ముఖతా విన్నాం కాని వాటిలో ఇంత నిగూఢార్థం ఇమిడి ఉందని అర్థం చేసుకోలేకపోయాం కదా!’ ఉదాహరణకు అటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం.
13. శ్రీరామకృష్ణుల వచనాల ప్రగాఢతను నరేంద్రుడు అవగతం చేసుకోవడం
1884 వ సం ॥ లో ఏదో ఒక సమయాన మా మిత్రుడొకడు దక్షిణేశ్వరానికి వచ్చాడు. అప్పుడు భక్త పరివేష్టితులై తమ గదిలో కూర్చున్న శ్రీరామకృష్ణులను చూశాడు. నరేంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆధ్యాత్మిక ప్రసంగాల మధ్య వేడుకలతో అందరూ ఆహ్లాదంగా ఉన్నారు. మాటల మధ్యలో వైష్ణవమత ప్రస్తావన వచ్చింది. వైష్ణవ మత సారాన్ని క్లుప్తంగా వివరించి, శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “భగవన్నామంలో రుచి, జీవులందరి పట్ల దయ, భాగవతుల సేవ అనే మూడు గుణాలను అలవరచుకొని ప్రతి వైష్ణవుడూ వాటిని పాటించాలని ఆ మతం బోధిస్తున్నది. భగవంతుడు, ఆయన నామం అభిన్నమైనవి. ‘నామం’, ‘నామ్ని’ రెంటి అభేదాన్ని గ్రహించి భక్తిప్రపత్తులతో ఆయన నామాన్ని జపించాలి. కృష్ణుడు – వైష్ణవుడు లేదా భగవంతుడు – భక్తుడు ఒక్కటేనని గ్రహించి భక్తులను సదా గౌరవించాలి, నమస్కరించాలి, పూజించాలి. అట్లే విశ్వం యావత్తు కృష్ణుడికి చెందినదేనని హృదయపూర్వకంగా విశ్వసించి జీవులందరి పట్ల కరుణ వహించాలి.”
‘జీవులందరిపట్ల కరుణ వహించాలి’ అని ఆయన పలుకుతూ ఉండగానే ఆయన భావపారవశ్య స్థితిలోకి వెళ్ళిపోయారు. కొంతసేపటికి పాక్షిక బాహ్య చైతన్యం పొంది, ఆయన తిరిగి ఇలా కొనసాగించారు: “జీవుడి పట్ల దయ చూపడమా! నువ్వే అల్ప ప్రాణివి; అటువంటప్పుడు జీవుల పట్ల ఎలా దయ చూపగలవు? దయ చూపడానికి నువ్వెవడివి? దౌర్భాగ్యుడా, దయను అనుగ్రహించడానికి నువ్వెవడివి? కాదు, కాదు… జీవుల పట్ల దయ కాదు చూపవలసింది. వారిని సాక్షాత్తు శివునిగా ఎంచి సేవించాలి” అని కర్తవ్యాన్ని బోధించారు.
14. శ్రీరామకృష్ణుల ఈ వచనాల గూడార్థాన్ని గ్రహించిన నరేంద్రుడు – విశదీకరించడం
ఆ భావసమాధిలో శ్రీరామకృష్ణులు పలికిన వచనాలు అక్కడున్న భక్తులందరూ వినసాగారు; కాని ఆ పలుకులలోని అంతరార్థాన్ని ఎవరూ కనుగొన లేకపోయారు. గురుదేవుల భావావస్థ ఉపశమించాక గదిలో నుండి వెలుపలకు వచ్చిన నరేంద్రుడు మాత్రమే ఇలా పలికాడు: “ఆహా! గురుదేవుల వచనాలలో ఈ రోజు నేనెంత అద్భుత ప్రకాశాన్ని చూడగలిగాను! శుష్కమైనదనీ, కఠినమైనదనీ, అర్థంకానిదని అపార్థం చేసుకోబడే వేదాంత (అద్వైత) జ్ఞానాన్ని తీయని భగవద్భక్తితో సమన్వయం చేశారు ఈ రోజు గురుదేవులు. పరమ సత్యాన్ని చేరుకోగలిగే సరిక్రొత్త సులభ మార్గాన్ని ఆయన ఈ రోజు చూపించారు. ‘లోకాన్ని లోకులను అన్నిటినీ పరిత్యజించి, అరణ్యాలకు వెళ్ళి, భక్తి ప్రేమ, దయ మొదలైన కోమల భావాలనన్నింటినీ నిర్దాక్షిణ్యంగా హృదయం నుండి కూకటివ్రేళ్ళతో సహా పెకలించివేయాలి. అప్పుడే, అలా చేసినప్పుడే అద్వైతజ్ఞానం పొందగల’ మని సుదీర్ఘకాలంగా వింటూ వచ్చాం. సాధకులు ఎవరైనా ప్రాచీన గ్రంథాలలో నిర్దేశించిన రీతిలో ఆ అద్వైత జ్ఞానాన్ని పొందాలని ప్రయత్నించినప్పుడు ఈ యావత్తు లోకాన్ని, లోకంలోని ప్రతి వ్యక్తిని తన సాధనామార్గంలో ఆటంకాలుగా పరిగణించవలసి వచ్చేది. ఈ వైఖరి, వారిలో సమాజం పట్ల ఒక రకమైన ఏవగింపును ఉత్పన్నం చేసి, తరచు వారిని సరైన ఆధ్యాత్మిక పథం నుండి వైదొలగచేసేది. కాని భావావస్థలో శ్రీరామకృష్ణులు ఈ రోజు వచించిన దానిని బట్టి అరణ్యపరమైన వేదాంతాన్ని జనావాసంలోకి తీసుకొనిరావచ్చుననీ, దైనందిన లౌకిక జీవితంలో ఆచరించవచ్చుననీ తేటతెల్లమౌతున్నది. ప్రతి వ్యక్తి తన పనిని చేసుకుపోతూ ఉండవచ్చు. దాన్లో ఎలాంటి హానీ లేదు. భగవంతుడే తన ముందు ఈ జగత్తు, దాన్లోని జీవులందరిలా అభివ్యక్తమౌతున్నాడని పరిపూర్ణ విశ్వాసం అతడు ముందుగా కలిగివుండాలి. జీవితంలో అనుక్షణం తాను చూసే వ్యక్తులు, తాను ప్రేమించే, గౌరవించే, సానుభూతి చూపే వ్యక్తులందరూ ఆ పరమాత్ముని అంశలనే అతడు భావించాలి. ఈ విధంగా ప్రపంచంలోని యావన్మందినీ శివునిగా చూడగలిగితే, వారికంటే తాను శ్రేష్ఠుడనని అనుకొనే ఆస్కారం ఎక్కడ? లేదా వారిపై కుపితులవడం, ద్వేషించడం లేదా వారిపై దర్పం ప్రదర్శించడం లేదా వారి పట్ల దయ చూపడం అనేది ఎలా సాధ్యం? ఆ విధంగా శివస్వరూపులుగా జీవులను సేవించడం వల్ల సాధకుని హృదయం పావనత్వాన్ని సంతరించుకొంటుంది. కొద్ది కాలంలోనే తాను కూడా నిత్యశుద్ధ బుద్ధ ముక్తుడైన శివుని అంశననే ప్రగాఢ విశ్వాసం అతడిలో పాదుకొంటుంది” అని గురుదేవుల వచనాలకు నిగూఢ అర్థం వివరించి చెప్పాడు.
గురుదేవుల ఆ వచనాల నుండి భక్తిమార్గంపై కూడా గొప్ప కాంతి ప్రసరించడం మనకు గోచరిస్తుంది. జీవులందరిలో భగవంతుణ్ణి దర్శించలేనంత వరకు భక్తి పరాకాష్ఠకు చేరడమూ, జీవిత పరమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడమూ అసాధ్యం. భగవత్సాక్షాత్కారానికి రాజమార్గమైన నిష్కామకర్మ మార్గాన్ని అనుసరించే సాధకులు కూడా ఆ వచనాల నుండి ఎంతో వెలుగును పొందగలరు. ఎందుకంటే, ఏ పనీ చేయకుండా ఊరకనే కూర్చోవడం బద్ధజీవులకు అసాధ్యం కనుక శివజ్ఞానంతో జీవారాధన చేయడమే కర్తవ్యమనీ, అలా చేస్తేనే సత్వరం వారు తమ గమ్యాన్ని చేరుకోగలరనీ మళ్ళీ చెప్పడం అనవసరం. భగవంతుడు కనుక నాకొక అవకాశం ఇస్తే ఈ రోజు నేను విన్న ఈ పరమ సత్యాన్ని లోకమంతటా చాటుతాను. పండితులకు, పామరులకు, ధనికులకు, పేదలకు, బ్రాహ్మణులకు, నిమ్న కులస్థులకూ ఉపదేశిస్తాను అని నరేంద్రుడు పలికాడు.
అద్భుతమూర్తులైన శ్రీరామకృష్ణులు అదే విధంగా సదా భావపారవశ్య స్థితిలోకి వెళ్ళి మానవ జీవితానికి భక్తి కర్మ జ్ఞానయోగాలపై నూతన వెలుగును ప్రసరింపచేయడం కద్దు. దురదృష్టవంతులం కావడం వలన ఆయన వచనాల అంతస్సూచనలను అప్పుడు మేం గ్రహించలేకపోయాం. గురుదేవుల ఆ దివ్య వచనాలను సాధ్యమైనంత మేరకు అవగతం చేసుకొన్నది మహామేధావి అయిన నరేంద్రుడొక్కడే. అలా అర్థం చేసుకొని అప్పుడప్పుడు వాటి లోకోత్తర ప్రాధాన్యతను ప్రకటించి మమ్మల్ని ఆశ్చర్యచకితులను చేసేవాడతడు.