1. శ్రీరామకృష్ణుల పరీక్షా విధానం
మొట్టమొదటిసారి కలుసుకొన్నప్పటి నుండే నరేంద్రునిలోని అత్యున్నత ఆధ్యాత్మిక లక్షణాలను, కార్యరూపం దాల్చే శక్తులను గుర్తించిన శ్రీరామకృష్ణులు తమ అసాధారణ నిస్వార్థ అనురాగంతో అతణ్ణి ఎలా ఆకట్టుకొన్నారో మేం ఇంతకు మునుపే మరోచోట తెలిపివున్నాం. ఆధ్యాత్మిక విషయాలలో అతడికి శిక్షణను ఇస్తున్నప్పటికీ అప్పుడప్పుడు అతణ్ణి పరీక్షకు గురిచేసేవారు. నరేంద్రుణ్ణి పరీక్షించే పద్ధతులను, తీరులను గురించి ఇక్కడ క్లుప్తంగా వివరించడం ఎంతో అవసరంగా తోస్తున్నది.
కూఛ్బిహార్ వివాహం గురించి తలెత్తిన అభిప్రాయభేదాల వలన బ్రహ్మసమాజం రెండుగా విడిపోవనున్నప్పుడు శ్రీరామకృష్ణులు, కేశవ్‌తో “నీ సమాజంలో సభ్యుల సంఖ్యను పెంచడం నిమిత్తం పరీక్షించకుండానే ఎవరినిపడితే వాళ్ళను చేర్చుకొంటావు. అటువంటప్పుడు సమాజం చీలిపోవడంలో వింతేముంది? క్షుణ్ణంగా పరీక్షించకుండా నేనెవరినీ స్వీకరించను” అని చెప్పారు.
నిజమే. తమ వద్దకు వచ్చే భక్తులను వారికి తెలిసే రీతిలోనే లేదా తెలియని విధంగానో శ్రీరామకృష్ణులు ఆశ్చర్యకర రీతుల్లో పరీక్షించేవారు. నిరక్షరాస్యులైన ఒక వ్యక్తి కనీవినీ ఎరుగని విధానాలలో కౌశలాన్ని ఎలా సముపార్జించుకొన్నారో ఆలోచిస్తే ఎవరైనాసరే ఆశ్చర్యపోక తప్పదు. సహజంగానే ఈ ప్రశ్న తలెత్తుతుంది : “గత జన్మలలో సముపార్జించుకొన్న జ్ఞానం ఇప్పుడు వ్యక్తమౌతూన్నదేమో? లేదా ప్రాచీన ఋషులలా ఈ జన్మలోనే అనుష్ఠించిన సాధనల ద్వారా లభించిన అతీంద్రియ దర్శనం లేదా సర్వజ్ఞత్వానికి ఫలమా అది? లేదా అంతరంగ భక్తుల వద్ద తమను అవతారపురుషునిగా ప్రకటించిన మేరకు అభివ్యక్తమయ్యే శక్తి ప్రదర్శనా అది?” అని సహజంగానే ఇటువంటి ప్రశ్నలు మనలో తలెత్తినప్పటికీ, జవాబుల కోసం వాటిని ఇప్పుడు నొక్కివక్కాణించ తలచలేదు. కేవలం ఇప్పుడు సంఘటనల పరంపరను నిర్దుష్టంగా వివరిస్తాం; వాటి గురించిన నిర్ణయం పాఠకులకే వదలివేస్తున్నాం.
2. సాధారణమైన పరీక్షా విధానం
ఆ పరీక్షా విధానాలను తెలియచెప్పే కొన్ని సంఘటనలను పొందుపరిస్తే, పాఠకులకు శ్రీరామకృష్ణులు అవలంబించిన ఆ అసాధారణ పద్ధతులు చక్కగా అవగతమౌతాయి. కాని వాటిని అర్థం చేసుకోవాలని ప్రయత్నించే ముందు, శ్రీరామకృష్ణులు పరీక్షార్థం అవలంబించే విధానాల, ఉపాయాల గురించి తెలుసుకొని ఉండాలి. ఎవరైనా ఆయన వద్దకు రాగానే, ఆయన ఆ వ్యక్తిని విచిత్రంగా తిలకించేవారు. అలా చూసినప్పుడు ఆయన మనస్సు ఆ వ్యక్తి పట్ల ఆకర్షింపబడితే, ఆధ్యాత్మిక విషయాల గురించి ఒకింత మాట్లాడి, అప్పుడప్పుడు రమ్మని అతడితో చెప్పేవారు. ఆ వ్యక్తి తరచు రాసాగినప్పుడు, సూక్ష్మంగా పరిశీలించి అతడిలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక సంస్కారాల గురించి కచ్చితమైన ఒక నిర్ణయానికి రావడానికి ప్రయత్నించేవారు. ఆ సందర్భంలోనే అతడికి తెలియకుండానే, అతడి అవయవ నిర్మాణం, మానసిక ప్రవృత్తులు, లౌకిక సుఖభోగాల పట్ల అతడికున్న అనురక్తి తీవ్రత, ముఖ్యంగా కామినీకాంచనాల పట్ల అతడికి గల అనురక్తి, తమ పట్ల అతడి మనస్సు ఏ మేరకు ఆకర్షింపబడుతూన్నదో కూడా నిశితంగా గమనించేవారు. అతడి మాటల, చేతల, ప్రవర్తన నుండి పై భోగట్టా సేకరించేవారు. ఆయన పరిశీలన ఎంత సునిశితంగా, సమగ్రంగా ఉండేదంటే, ఆ వ్యక్తి స్వభావాన్ని సంపూర్ణంగా ఆయన కేవలం కొద్దిరోజులలోనే గ్రహించగలిగేవారనడం అతిశయోక్తి కాదు. తదనంతరం ఆ వ్యక్తి మనస్సులో బాహ్యపరిశీలన స్పష్టం చేయలేని, లోతుగా దాగివున్న విషయం దేనినైనా తెలుసుకోగోరితే శ్రీరామకృష్ణులు తమ సూక్ష్మ యోగిక అంతర్దృష్టి సహాయంతో ఆ విషయాన్ని గ్రహించేవారు. ఈ విషయంగా ఒక రోజు ఆయన మాతో ఇలా చెప్పారు :
“తెల్లవారుజామున ఏకాంతంగా కూర్చుని మీ శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నప్పుడు అమ్మ (జగజ్జనని) మీ గురించి అన్ని సంగతులు – మీలో ఎవరెవరు ఎంతవరకు పురోగమించారో, ఏ అడ్డంకుల కారణంగా ఎవరు ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించ లేకపోతున్నారో – దర్శింపచేసేది.” పై వచనాల నుండి తెల్లవారుజామున మాత్రమే శ్రీరామకృష్ణుల యోగనేత్రాలు తెరుచుకొనేవని మాత్రం పాఠకులు పొరపడకూడదు. ఎప్పుడనుకొంటే అప్పుడే, సంకల్ప మాత్రంగా ఆయన ఉన్నత భావభూములను అధిరోహించి ఆ యోగదృష్టిని సంతరించుకోగలరని, ఇతర సమయాలలో ఆయన మాటల వలన తెలియవస్తున్నది. ఉదాహరణకు “అద్దాల అల్మారా వైపు చూసినప్పుడు దాన్లోని వస్తువులన్నీ ఎలా స్పష్టంగా కనిపిస్తాయో, అట్లే ఒక వ్యక్తిని చూసీచూడగానే అతడిలోని ఆలోచనలూ, గత సంస్కారాలూ మొదలైనవన్నీ కొట్టొచ్చినట్లే నాకు కానవస్తాయి.”
3. విశిష్ట ఆధ్యాత్మిక భావసంపన్నులైన వ్యక్తులను కలుసుకొన్నప్పుడు శ్రీరామకృష్ణులలో భావ పారవశ్యం కలగడం
మామూలు భక్తుని స్వభావాన్ని తెలుసుకోగోరినప్పుడు శ్రీరామకృష్ణులు అవలంబించే పరీక్షాపద్ధతి పై రీతిలో ఉండేది. కాని ప్రత్యేకమైన అంతరంగ భక్తుల విషయంలో ఈ విధానం కొంచెం వ్యత్యాసంగా ఉండేది. అటువంటి అంతరంగ భక్తులను గురించి జగజ్జనని, ఆయన ఉన్నత భావభూములలో నెలకొని ఉన్నప్పుడు కలిగిన దివ్యదర్శనాలలో తెలియచేసేది. తాము అనుష్ఠించిన అసాధారణ సాధనల ఫలితంగా ఆయన మనశ్శరీరాలు సూక్ష్మ ఆధ్యాత్మిక శక్తులు సంతరించుకొన్న పరికరంగా మారింది. తద్ద్వారా ఆ శక్తులను తమలో పదిలపరచుకోవడమే కాక, ఇతరులలో ఆ శక్తుల ఉనికిని తెలుసుకోవడం కూడా ఆయనకు సుసాధ్యమే అన్న విషయం ఈ పుస్తకంలో వేరొక చోట తెలిపే ఉన్నాం. ఇది అక్షర సత్యం.
ఒక ఫలానా ఆధ్యాత్మిక భావం సంతరించుకొన్న ఒక వ్యక్తిని చూడగానే, శ్రీరామకృష్ణుల మనస్సు కూడా దివ్యప్రేరణతో అదే ఆధ్యాత్మికభావంతో నిండిపోయేది. అట్లే, ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక భావభూమిలో నెలకొనివున్న ఒక వ్యక్తితో సాంగత్యం కలుగగానే, ఆయన మనస్సు కూడా సహజంగానే అదే భావభూమిని అధిరోహించి ఆ వ్యక్తి మనస్సులోని భావనలను వెల్లడించేది. నరేంద్రుని ప్రథమ సందర్శన సందర్భంతో ముడివడిన శ్రీరామకృష్ణుల అనుభూతులను జ్ఞాపకం చేసుకొంటే, పాఠకులకు మేం చెబుతున్న విషయం అవగతమౌతుంది.
4. వ్యక్తులను పరీక్షించడంలో శ్రీరామకృష్ణులు అవలంబించే నాలుగు పద్ధతులు
శ్రీరామకృష్ణులు అంతరంగ భక్తుల విషయంలో యోగిక శక్తులను వినియోగించినా, సామాన్య భక్తుల విషయంలో ఉపయోగించే సాధారణ పరీక్షా పద్ధతులను వారి పట్ల ఉపయోగించేవారు కాదని భావించరాదు. మామూలు స్థితిలో ఉండేటప్పుడు సామాన్య భక్తుల మాదిరి, నరేంద్రునితో సహా అంతరంగ భక్తుల మాట తీరు, ప్రవర్తనలను ఆయన సునిశితంగా పరిశీలించేవారు. అలా పరీక్షించేటంత వరకు ఆయన నిశ్చింతులయ్యేవారు కారు. ఈ విషయం ఎంతో ప్రధానం కనుక పాఠకులు దీనిని సమగ్రంగా తెలుసుకోవడం సముచితం. భక్తులను పరీక్షించడంలో శ్రీరామకృష్ణులు అవలంబించే పద్ధతులను నాలుగు ప్రధాన విభాగాలుగా వర్గీకరించాలి. వీటిని స్థూలంగా ఇంతకు మునుపే వ్యక్తపరచి ఉన్నాం; ప్రస్తుతం వాటిని సోదాహరణంగా వివరించబోతున్నాం.
5. ముఖ కవళికలను బట్టి మానసిక సంస్కారాలను రూఢి పరచుకోవడం
మొదటిది : కొత్తగా వచ్చిన వ్యక్తి శారీరక లక్షణాలను పరిశీలించి అతడి పూర్వసంస్కారాలను శ్రీరామకృష్ణులు ధ్రువీకరించుకొనేవారు. మన ఆలోచనలు, చేతల రూపంలోకి తర్జుమా అవుతూన్నప్పుడు, అవి మన శరీరంపై, మెదడుపై కొన్ని ప్రత్యేక ముద్రలను విడిచిపోతాయి. ఆధునిక శరీర ధర్మశాస్త్రం, మనస్తత్త్వ శాస్త్రం ఈ విషయాన్ని ఎంతో మేరకు ఋజువు చేసి మా నమ్మకాన్ని రూఢిపరచాయి. వేదాలు, తదితర శాస్త్రాలు ఈ సత్యాన్ని ప్రాచీనకాలం నుండే మనకు తెలియచేస్తున్నాయి. వేదాలు, స్మృతులు, పురాణాలు, దర్శనాలు, తదితర హైందవ శాస్త్రగ్రంథాలు, ‘శరీరాన్ని కల్పించేది మనస్సని ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నాయి. ఒక మనిషి ఆలోచనాసరళి సదా మంచి లేక చెడు మార్గంలో పోతుప్పుడు, అతడి శరీరంలో ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి అనువుగా మార్పులు కలిగి, రూపాంతరం జరుగుతుంది. మనిషి శరీర అవయవ నిర్మాణాన్ని పరికించి అతడి నైజాన్ని సూచించే అనేక సామెతలు వాడుకలో ఉన్నాయి. కాబట్టే వివాహ సమయంలో, మంత్రదీక్షను ఇచ్చేటప్పుడు వధువు, శిష్యుల శరీరాలను ఆపాదమస్తక పర్యంతం నిశితంగా పరీక్షించడం నేటికీ అత్యావశ్యకంగా పరిగణింపబడుతున్నది.
6. ఈ విషయంలో శ్రీరామకృష్ణుల అద్భుత పరిజ్ఞానం
అటువంటప్పుడు శాస్త్రాల పట్ల నమ్మకం గల శ్రీరామకృష్ణులు తమ శిష్యుల శారీరక లక్షణాలను పరిశీలించి ఉంటారనడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. కాని మాటల సందర్భంలో శారీరక లక్షణశాస్త్రం గురించి అనేక విషయాలు చెప్పేవారంటే, అవన్నీ వారికెలా తెలిశాయో అని మేం విస్తుపోయే వారం. బహుశా ఈ విషయాలన్నీ పొందుపరచబడిన ఒక పురాతన గ్రంథాన్ని చదివో లేక ఎవరైనా చదువుతుండగా విని ఉంటారేమోనని మాలో మేం తర్జనభర్జన పడేవారం. కాని ఇప్పటి దాకా అటువంటి గ్రంథం గురించి కనీవినీ ఎరుగలేదు కనుక మా భావన నిరాధారమైనదిగా కనిపిస్తోంది. కాబట్టే స్త్రీ పురుషుల ప్రతి అంగ లేదా ఇంద్రియ నిర్మాణం దైనందిన జీవితంలో మనకు తారసించే ఒక ప్రత్యేక వస్తువును పోలి కనిపిస్తే అది ఏ మంచి లేదా చెడు గుణాలను సూచిస్తుందో వారు చెప్పేటప్పుడు మేం ఆశ్చర్యపోతూ వినేవారం. ఆయన ఇలా చెప్పేవారు : “ఉదాహరణకు మనిషి కళ్ళను తీసుకోండి. కొందరి కళ్ళు పద్మపత్రాలలా ఉంటాయి; మరికొందరి కళ్ళు ఎద్దు కళ్ళను పోలివుంటాయి. కొందరివి యోగి కళ్ళలా ఉంటాయి. పద్మపత్రాలు పోలిన కళ్ళుగల వ్యక్తి సదాలోచనాపరుడు; ఎద్దు కళ్ళను పోలిన కళ్ళున్న వ్యక్తిలో కామం అత్యధికంగా ఉంటుంది; యోగుల కళ్ళుగల వ్యక్తుల కళ్ళు ఊర్ధ్వముఖమై, ఎర్రబారి ఉంటాయి. దేవతల నయనాలు మరీ పెద్దవి కాకపోయినా, పొడవుగా చెవుల వరకు వ్యాపించి ఉంటాయి. మాట్లాడుతున్నప్పుడు క్రీగంట చూసే అలవాటు గల వ్యక్తులు సామాన్యుల కంటే ఎక్కువ తెలివితేటలు గలవారై ఉంటారు” అని చెప్పేవారు.
అట్లే వ్యక్తుల సాధారణ శరీర నిర్మాణం గురించి ప్రస్తావిస్తూ ఆయన “భక్తుల శరీరాలు స్వాభావికంగానే చాలా మృదువుగా ఉంటాయి; వారి కాళ్ళ చేతుల కీళ్ళు ఒదులుగా (అంటే సులభంగా వంగే రీతిలో) ఉంటాయి. భక్తుని శరీరం సన్నగా ఉన్నా కూడా కోణాకృతిలో కీళ్ళు కనిపించని తీరులో ఎముకలూ, కండరాలూ అందంగా అమరివుంటాయి” అని చెప్పేవారు.
ఒక ఫలానా వ్యక్తి తెలివి మంచికా లేక చెడుకా దేనికి దారితీస్తుందనే విషయం నిర్ధారణ చేసుకోవడానికి శ్రీరామకృష్ణులు ఆ వ్యక్తి ముంజేతిని తమ చేతుల్లోకి తీసుకొని, దానిని ఒదులుగా ఉంచమనేవారు. ఆ తరువాత దాని బరువును తూచేవారు. సాధారణంగా అందరి ముంజేతుల కంటే అది తక్కువ బరువుగా ఉందనిపిస్తే అతడి మనస్సు పావనమైనదని పరిగణించేవారు. మొట్ట మొదటిసారి స్వామి ప్రేమానంద (బాబూరాం) దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు, శ్రీరామకృష్ణులు అతడి ముంజేయి పుచ్చుకొని బరువు తూచారని మేం ఇంతకు మునుపే తెలిపివున్నాం. అయినా ఆయన ఎందుకు అలా చేశారో మాతో చెప్పలేదు కనుక ఆ సందర్భంలో ఏ ఉద్దేశంతో ఆయన అలా చేశారో అక్కడ మేం ప్రస్తావించ లేదు. కాని మరో సందర్భంలో జరిగిన సంఘటన వలన మేం ఆ నిర్ణయానికి రాగలిగాం. ఆ సంఘటనను క్రింద వివరిస్తున్నాం:
7. ముంజేతి బరువును తూచి వ్యక్తి స్వభావాన్ని నిర్ధారించడం
శ్రీరామకృష్ణులు కాశీపూర్ ఉద్యానంలో వ్యాధిగ్రస్తులై ఉన్నప్పుడు, ఈ రచయిత తమ్ముడు, చారుచంద్ర చక్రవర్తి ఆయనను చూడడానికి ఒకరోజు అక్కడికి వచ్చాడు. అతణ్ణి చూసి శ్రీరామకృష్ణులు ఎంతో ప్రసన్నులైనారు. అతణ్ణి తమ ప్రక్కనే కూర్చోబెట్టుకొని, కుశల ప్రశ్నలు వేసి, అతడికి వివిధ ఆధ్యాత్మిక ఉపదేశాలిచ్చారు. ఈ రచయిత అప్పుడు అక్కడకు వచ్చినప్పుడు ఆయన, “ఈ కుఱ్ఱవాడు నీ తమ్ముడా?” అని అడిగారు. అవునని రచయిత తల ఊపగానే, శ్రీరామకృష్ణులు, “చాలా మంచివాడు. నీ కంటే కూడా తెలివైనవాడు. ఈతడి తెలివి మంచికా లేదా చెడుకా, దేనికి దారితీస్తుందో చూస్తాను” అంటూ, ఆ కుఱ్ఱవాడి ముంజేతిని తమ చేతుల్లోకి తీసుకొని బరువు చూశారు. తరువాత, “శ్రేయోదాయకమైన తెలివే” అని వచించారు. పిదప రచయితను ఆప్యాయంగా, “ఇతణ్ణి కూడా నేను ఆకర్షించనా? (అంటే, అతడి మనస్సును లౌకిక జీవితం వైపు నుండి భగవంతుడి వైపుకు మరల్చనా?) ఏమంటావు?” అని అడిగారు. “చాలా మంచిదండీ. అలాగే చేయండి” అని ఈ రచయిత బదులిచ్చాడు. శ్రీరామకృష్ణులు క్షణం యోచించి, “వద్దు, అలా చేయను; ఇప్పటికే ఒకణ్ణి (రచయితను) తీసుకొన్నాను. మరొకణ్ణి తీసుకొంటే మీ తల్లితండ్రులు, ముఖ్యంగా మీ అమ్మ చాలా బాధ పడుతుంది. నా జీవితంలో చాలా మంది శక్తులను (తల్లులను) బాధపెట్టాను. మరెవరినీ ఇక బాధించబోను” అని అన్నారు. ఇలా అంటూ ఆ కుఱ్ఱవాడికి ఇంకొన్ని ఉపదేశాలిచ్చి, తినడానికి తినుబండారాలనిచ్చి, సాగనంపారు.
8. ఇతర లక్షణాలు స్వభావ తీరుతెన్నులను వెల్లడించడం
అవయవ నిర్మాణం మాదిరిగా నిద్ర, మలమూత్ర విసర్జన వంటి సాధారణ దైనందిన క్రియలు కూడా విభిన్న గతసంస్కారాలు సంతరించుకొని ఉన్న వ్యక్తులలో ఎంతో విభిన్నంగా ఉంటాయని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. కాబట్టి అనుభవజ్ఞులు ఈ క్రియల నుండి ఆరాలు తీసి వ్యక్తుల స్వభావాలను నిర్ధారించగలరని ఆయన తరచు చెప్పేవారు. ఉదాహరణకు, నిద్రించేటప్పుడు అందరూ ఒకే రకంగా ఊపిరి పీల్చుకోరు అని ఆయన తెలిపేవారు. “భోగి ఊపిరి పీల్చుకోవడం ఒక రకంగా ఉంటుంది, విరాగి ఊపిరి పీల్చుకోవడం తద్విరుద్ధంగా ఉంటుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు భోగి మూత్రధార ఎడమ వైపుకు, విరాగిది కుడివైపుకు పోతుంది; అట్లే యోగి మలాన్ని పందులు మొదలైన జంతువులు ముట్టవు” అని శ్రీరామకృష్ణులు చెబుతూండేవారు.
9. ద్వారకాపలాదారు హనుమాన్ సింగ్
పై విషయానికి సంబంధించిన ఒక సంఘటనను శ్రీరామకృష్ణులు మాకు వివరించారు. మథుర్బాబు కాలంలో దక్షిణేశ్వర కాళికాలయ కాపలాదారుగా హనుమాన్ సింగ్ అనే వ్యక్తిని నియమించారు. కాపలాదారులు పలువురు ఉన్నప్పటికీ హనుమాన్ సింగ్ పట్ల లోకులు ఎక్కువ గౌరవం కనబరచేవారు. హనుమాన్ సింగ్ ప్రసిద్ధుడైన మల్లుడే కాక, ఆధ్యాత్మిక సాధకుడు కూడా కావడమే అందుకు కారణం. ఒకసారి మరో మల్లుడు దక్షిణేశ్వరానికి వచ్చి, హనుమాన్ సింగ్‌ను తనతో మల్లయుద్ధానికి సవాలు చేశాడు. హనుమాన్ సింగ్‌ను మల్లయుద్ధంలో ఓడించి, అతడి నౌకరీ సంపాదించాలన్నదే ఈ మల్లుని ఉద్దేశం. ఈ మల్లుని దేహదార్ఢ్యం, బలం మొదలైనవి హనుమాన్సింగ్ గమనించాడు. కాని అతడి సవాలును అంగీకరించడానికి ఏమాత్రం తటపటాయించలేదు. పందేనికి ఒక రోజు నిర్ణయించారు; ఆ పందేనికి మథుర్బాబు వంటి వారిని న్యాయనిర్ణేతలుగా వ్యవహరించమన్నారు.
పందెం నిర్ణీతమైన రోజుకు ఒక వారం ముందునుండే ఈ కొత్త మల్లుడు రాసుల కొద్దీ పౌష్టిక ఆహారాన్ని ఆరగిస్తూ, కసరత్తు అభ్యసించసాగాడు. తద్విరుద్ధంగా ఆంజనేయ భక్తుడైన హనుమాన్ సింగ్, ఉదయం స్నానం చేసినప్పటి నుండి తన ఇష్టదైవ మంత్రాన్ని రోజంతా జపిస్తూ, సాయంత్రం ఒక్కపూట మాత్రమే భోజనం చేయసాగాడు. హనుమాన్ సింగ్ భీతిచెంది, గెలవగలనన్న ఆశను పూర్తిగా విడిచిపెట్టి ఈ రకంగా చేస్తున్నాడని అంతా అనుకోసాగారు. శ్రీరామకృష్ణులకు, హనుమాన్ సింగ్ పట్ల ప్రేమాభిమానాలున్నాయి. అందుచేత పోటీకి ఒక రోజు ముందు అతణ్ణి పిలిచి, “నువ్వు పౌష్టికాహారం తినడం లేదు, వ్యాయామం అభ్యసించడమూ లేదు; అటువంటప్పుడు ఆ కొత్త మల్లుని గెలవగలవా?” అని అడిగారు. హనుమాన్ సింగ్ సభక్తికంగా ఆయనకు మ్రొక్కి, “మీ అనుగ్రహం ఉంటే తప్పక గెలుస్తాను. రాసుల కొద్దీ ఆహారం తింటే దేహానికి బలం చేకూరదు; తిన్న ఆహారం జీర్ణం చేసుకోవాలి. రహస్యంగా ఆ కొత్తమల్లుడి మలాన్ని పరికించి చూశాను. అతడు తన జీర్ణశక్తికి మించి ఆరగిస్తున్నాడు” అని విన్నవించాడు. తరువాత పోటీలో హనుమాన్ సింగ్, ఆ కొత్తమల్లుణ్ణి ఓడించాడని శ్రీరామకృష్ణులు మాతో చెప్పారు.
10. స్త్రీల ఆధ్యాత్మిక నైజాన్ని రూఢి పరచుకోవడం
పురుషుల మాదిరే స్త్రీల అంగనిర్మాణం గురించి శ్రీరామకృష్ణులు ఎన్నో విషయాలు చెప్పేవారు. అంగనిర్మాణాన్ని గమనించి కొందరు స్త్రీలను ఆయన ‘విద్యాశక్తు’ లని, అంటే ఆధ్యాత్మిక పథంలో పురోగమింప పురుషులకు దోహదం చేసేవారని పరిగణించేవారు. అట్లే పురుషులను సంసార లంపటంలోకి ఈడ్చే స్త్రీలను ‘అవిద్యా శక్తు’ లని ఆయన పేర్కొనేవారు. ఆయన ఇలా చెప్పేవారు : “ఆహారం, నిద్ర, ఇంద్రియాసక్తి మొదలైనవి విద్యాశక్తులలో స్వాభావికంగానే ఎంతో మితంగా ఉంటాయి. తమ భర్తలు భగవత్ప్రసంగం వింటూవుంటే వారి హృదయాలు ఆనందంతో పులకించిపోతాయి. స్వయంగా వారే భగవత్ప్రసంగం చేస్తూ భర్తలకు ఉన్నత ఆధ్యాత్మిక ప్రేరణను కల్పిస్తారు. తమ భర్తలను సదాసర్వదా నిమ్న అభిరుచుల, చేతల నుండి పరిరక్షిస్తూ, వారి భగవత్సాక్షాత్కారార్థం సకల విధాల దోహదం చేస్తుంటారు. ఇక అవిద్యాశక్తుల నైజం, చేతలు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. వీళ్ళు శారీరక సుఖాలను ఎంతగానో అపేక్షిస్తారు, మితిమీరిన తిండి, నిద్ర వాంఛిస్తారు. తమ స్వసుఖాలలో తప్ప మరే విషయంలోను భర్తలు శ్రద్ధ వహించకుండా అడ్డుపడడమే వీరి ముఖ్యోద్దేశం. భర్తలు ఆధ్యాత్మిక విషయాల గురించి తమతో మాట్లాడితే, వీరు అసంతృప్తి చెందడమే కాక చిరాకుపడడం కూడా కద్దు” అని స్త్రీల అంగాలు, వారి స్వభావాల గురించి చెప్పేవారు.
అట్లే ఎవరిలో భోగాసక్తి ఏ మేరకు ఉంటుందో స్త్రీల జననేంద్రియ బాహ్యాకృతి సూచిస్తుందని కొన్ని సమయాలలో శ్రీరామకృష్ణులు చెప్పేవారు. అవి (యోనులు) వివిధ ఆకృతులలో ఉంటాయని కూడా ఆయన తెలిపేవారు. కొన్ని ఆకృతులు స్వల్ప కామప్రవృత్తిని సూచిస్తాయని ఆయన వచించేవారు. ఏ స్త్రీల పిరుదులు నల్లగండుచీమల వెనుక భాగాలలా కుంభాకారంలో ఉంటాయో, అట్టి స్త్రీలలో పాశవిక ప్రవృత్తి (కామం) మితిమించి ఉంటుందని కూడా శ్రీరామకృష్ణులు తెలిపేవారు.
11. నరేంద్రుని శారీరక లక్షణాలపై శ్రీరామకృష్ణులు వెలిబుచ్చిన అభిప్రాయం
శారీరక లక్షణాలను పరిశీలించి మనిషి నైజాన్ని నిర్ధారించడం గురించి శ్రీరామకృష్ణులు మాతో చెప్పిన విషయాలెన్నో! జనుల నైజాన్ని తెలుసుకొనే ప్రక్రియలలో దీనిని కూడా ఒకటిగా పరిగణించి, దాని తోడ్పాటుతో నరేంద్రునితో సహా తమ భక్తుల నందరిని ఆయన పరీక్షించారు. నరేంద్రుణ్ణి అలా పరీక్షించి, సంతృప్తులై ఆయన అతడితో “నీ శరీరంలోని అవయవాల లక్షణాలన్నీ చాలా బాగున్నాయి. ఉన్న దోషం ఒక్కటే; నిద్రిస్తున్నప్పుడు నువ్వు బరువుగా శ్వాస పీలుస్తుంటావు. అలా బరువుగా శ్వాసించే వ్యక్తి అల్పాయుష్కుడని యోగులు వచిస్తుంటారు” అని చెప్పారు.
12. అతిసామాన్యమైన పనులలో వెల్లడయ్యే మానసిక ప్రతిచర్యలను, ఇతర కార్యకలాపాలు వెల్లడించే కామకాంచన ఆసక్తి తీవ్రతలను పరిశీలించడం ద్వారా మనిషిలోని స్వాభావిక సంస్కారాలను తెలుసుకోవడం
చేతలలో వ్యక్తమయ్యే మానసిక స్థితులను పరిశీలించడం ఆయన అవలంబించే రెండవ పద్ధతి. వ్యక్తుల కామకాంచన ఆసక్తిని అంచనా వేయడం ఆయన అవలంబించే మూడవ పద్ధతి. కొత్తగా వచ్చిన వ్యక్తిని శ్రీరామకృష్ణులు కొంతకాలం పరిశీలించి చూసేవారు; ఆ తరువాత అతడిలో మంచి సంస్కారాలు కానవస్తే, అతణ్ణి తమ అంతరంగ భక్తులలో చేర్చుకోవాలని నిశ్చయించుకొని, అతడిలోని లోపాలను సవరింప సముచిత ఉపదేశాలిచ్చేవారు. అవసరమైతే అతణ్ణి సుతిమెత్తగా చీవాట్లు పెట్టేవారు కూడా. అలాగే ఆ వ్యక్తిని ఎంపిక చేస్తున్నప్పుడే, ఆ వ్యక్తి సన్న్యాసిగానో లేదా గృహస్థ శిష్యునిగానో తన జీవితాన్ని మలచుకోబోతాడో ముందుగానే గ్రహించి, ప్రారంభం నుండే తదనుగుణంగా ఉపదేశాలిచ్చేవారు. అందుకే శ్రీరామకృష్ణులు తమ వద్దకు వచ్చే ప్రతి వ్యక్తిని, అతడు వివాహితుడో కాడో, సామాన్యంగా జీవితం గడిచి పోవడానికి కుటుంబ ఆర్థిక పరిస్థితులు వీలు కల్పిస్తాయో లేదో, ఒకవేళ అతడు సంసార పరిత్యాగం చేయగోరితే కుటుంబ బాధ్యతను చేపట్టే దగ్గరి బంధువు లెవరన్నా ఉన్నారో లేదో ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకొనేవారు.
13. యువకుల గురించి శ్రీరామకృష్ణుల అభిప్రాయం
పాఠశాల, కళాశాల విద్యార్థుల పట్ల శ్రీరామకృష్ణులు సదా కారుణ్యం వహించేవారు. ఆయన “వాళ్ళ మనస్సులు భార్య, బిడ్డలు, పేరుప్రతిష్ఠలు ఇత్యాది బంధాలతో చిక్కువడిలేదు. (సరైన శిక్షణ పొందితే) వాళ్ళు తమ మనస్సులను పూర్తిగా భగవంతునిపై మరల్చగలరు” అని వాళ్ళను గురించి అనేవారు. అందుకే యువకులలో ఆధ్యాత్మిక భావాలను జనింపచేయడానికి ఆయన ఎంతో ప్రయత్నించేవారు. పై అభిప్రాయాన్ని ఆయన వివిధ దృష్టాంతాలతో వ్యక్తం చేసేవారు. ఆయన ఇలా చెప్పేవారు : “మనస్సు ఆవాల పొట్లం వంటిది; ఒక్కసారి ఆ పొట్లం చిట్లి, ఆవాలు చిందరవందరగా క్రిందపడిపోతే వాటిని ఏరడం దాదాపు అసాధ్యం.” లేదా “గొంతు ముదరిపోయిన చిలుకకు ‘రాధాకృష్ణ’ నామం ఉచ్చరింప నేర్పడం దుస్సాధ్యం.” లేదా “పచ్చి ఇటుకలపై పడ్డ ఆవుగిట్టల ముద్రలు సులభంగానే చెరిపివేయవచ్చు, కాని కాల్చబడిన ఇటుకలపైబడ్డ ముద్రలను చెరిపివేయడం సాధ్యం కాదు.” కాబట్టే ఇంకా సంసార పంకిలం అంటని యువకులను తరచి తరచి ప్రశ్నించి వారి సహజ నైజం సంసారం వైపుకు మొగ్గుతుందో లేక పరిత్యాగం వైపుగా మొగ్గు చూపుతుందో తెలుసుకొనేవారు శ్రీరామకృష్ణులు. వారు అర్హులని ఆయనకు తోస్తే, పరిత్యాగ పథంలో పురోగమింప సముచిత ఉపదేశాలు వారికి ఇచ్చేవారు.
14. తమ వద్దకు వచ్చే భక్తుల చర్యల నన్నిటిని ఆయన గమనించడం
తమ వద్దకు వచ్చే ఒక ఫలానా వ్యక్తి చర్యల నన్నింటిని సునిశితంగా పరిశీలించి అతడి మానసిక స్థితులను తెలుసుకోవడంతోనే శ్రీరామకృష్ణులు ఆగి పోయేవారుకారు; అతడెంత సరళ స్వభావుడో, సత్యసంధుడో, మాటలను చేతలలో ఏ మేరకు చూపుతున్నాడో, ప్రతి చేతను వివేచనతో నిర్వర్తిస్తున్నాడో లేదో, తనకు బోధించిన సత్యాలను అతడు ఎంతవరకు విశ్వసిస్తున్నాడో మొదలైన విషయాలన్నీ ఆయన సునిశితంగా పరిశీలించేవారు.
15. కొన్ని ఉదాహరణలు
కొన్ని రోజులుగా దక్షిణేశ్వరానికి తరచు వస్తూన్న ఒక యువకుణ్ణి హఠాత్తుగా శ్రీరామకృష్ణులు, “ఎందుకు వివాహం చేసుకోవు?” అని అడిగారు. అందుకు ఆ యువకుడు “మహాశయా, ఇంకా నా మనస్సు నా వశంలోకి రాలేదు; ఇప్పుడు నేను వివాహం చేసుకొంటే, నా భార్య పట్ల గల అనురక్తితో హితాహితాల వివేచనాశక్తిని కోల్పోతాను. కామాన్ని జయించగలిగిన నాడే వివాహం చేసుకొంటాను” అని జవాబిచ్చాడు. ఆ జవాబు నుండి ఆ యువకుడి అంతరాన అనురక్తి ఉన్నప్పటికీ, అతడి మనస్సు పరిత్యాగ మార్గం వైపుకు ఆకర్షింపబడిందని శ్రీరామకృష్ణులు గ్రహించి నవ్వుతూ “కామాన్ని జయించిన తదనంతరం నీకు ఇక వివాహం చేసుకోవలసిన అవసరమే ఉండదు” అని చెప్పారు.
ఒక రోజు మరొక యువకుడితో అనేక విషయాల గురించి ముచ్చటిస్తూ శ్రీరామకృష్ణులు, అతడితో “చూడు, ఇదేమిటో చెప్పగలవా? ఎంత ప్రయత్నించినా ఒంటిపై బట్టను ఉంచుకోలేకపోతున్నాను, సదా జారిపోతూనే ఉంటుంది; ఎప్పుడు జారిపోతుందో నాకు ధ్యాసే ఉండదు. వయస్సు పైబడ్డ నేను అలా నగ్నంగా వెళ్ళడమా! అయినప్పటికీ నగ్నంగా ఉన్నట్లు నాకు అనిపించదు. ఇంతకు మునుపు ఎవరైనా నన్ను ఆ స్థితిలో చూస్తున్నారనే ఎరుకే ఉండేదికాదు. నగ్నంగా ఉన్న నన్ను చూసిన వారు సిగ్గుపడతారని ఇప్పుడు ఒడిని ఒక వస్త్రంతో కప్పుకొంటున్నాను.” ఇలా అని అతడిని “నువ్వు నా మాదిరి (నగ్నంగా) జనం ముందు నిలబడగలవా?” అని ప్రశ్నించారు. అందుకు ఆ యువకుడు, “మహాశయా, అలా చేయగలనో లేదో నిశ్చయంగా చెప్పలేను. కాని మీరు చెయ్యమంటే కట్టు బట్టలను విప్పేస్తాను” అని జవాబిచ్చాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు, “అయితే కట్టుబట్టను విప్పి, తలపాగాలా చుట్టుకొని ఆలయ ప్రాంగణం చుట్టూ తిరిగిరా, చూస్తాను” అని అన్నారు. “అలా చేయలేను, మీ ముందు మాత్రమే విప్పగలను” అన్నాడు ఆ యువకుడు. ఆ మాట విని శ్రీరామకృష్ణులు, “అనేకులు అలాగే అంటుంటారు. ‘మీ ముందు నగ్నంగా నిలబడడానికి సిగ్గుపడం. కాని ఇతరుల ఎదుట నగ్నంగా నిలబడలేం’ అని చెబుతారు” అని అన్నారు.
16. గంగలో పోటు
ఈ సందర్భంలో మాకు మరో సంఘటన జ్ఞాపకానికి వస్తున్నది. అది వెన్నెల రాత్రి; కృష్ణపక్షం విదియో లేదా తదియో. మేం రాత్రి పడుకొన్న కాసేపటికే గంగలో పోటు వచ్చింది. శ్రీరామకృష్ణులు మంచం మీద నుండి లేచి, “గంగలో పోటు చూడడానికి అంతా రండి” అంటూ గంగ గట్టు వద్దకు పరుగెత్తుకొని పోసాగారు. ప్రశాంతంగా ప్రవహిస్తూన్న స్వచ్ఛమైన గంగానది హఠాత్తుగా అడ్డుతిరిగి మహావేగంతో, గట్టుమీదికి ఉవ్వెత్తు అలలతో ఎగిరి పడుతూండడం చూసి, ఉల్లాసంతో చిన్నపిల్లవాడిలా శ్రీరామకృష్ణులు నాట్యం చేయసాగారు. ఆయన మమ్మల్ని పిలిచినప్పుడు మేం నిద్రమత్తులో ఉన్నాం. ఆయన పిలుపు విని, లేచి బట్టలు సవరించుకొని వెళ్ళేసరికి కాస్త ఆలస్యమైంది. కాబట్టి మేం నది గట్టు వద్దకు వెళ్ళేసరికి నదిలో పోటు ఆగిపోయింది. మాలో కొందరం ఒకింత చూడగలిగాం, తక్కిన వారు అదీ చూడలేకపోయారు. శ్రీరామకృష్ణులు అప్పటి దాకా ఆనందంలో మునిగివున్నారు. నదిలో పోటు వెళ్ళిపోయిన తరువాత మమ్మల్ని చూస్తూ, “మంచిది, నదిలో పోటును చూశారా?” అని అడిగారు. మేం దుస్తులు కట్టుకొని వచ్చే లోపుగానే నదిలో పోటు వెళ్ళిపోయిందని విని, ఆయన, “మూర్ఖుల్లారా! బట్టలు ధరించి వచ్చేవరకూ పోటు మీ కోసం వేచి ఉంటుందా? నాలా మీరూ బట్టలు విడిచి ఎందుకు పరుగెత్తుకొని రాలేదు?” అని అన్నారు.
17. జీవితలక్ష్యం భగవత్సాక్షాత్కారమే అన్న భావనతో విధులను నిర్వర్తించు
“వివాహం చేసుకోవాలనుకొంటున్నావా? ఉద్యోగం చేస్తావా?” అని శ్రీరామకృష్ణులు అడిగే ప్రశ్నలకు, మాలో కొందరం, “మహాశయా, వివాహం చేసుకోవాలనే ఆకాంక్ష లేదు, కాని ఉద్యోగం చేయక తప్పదు” అని జవాబు ఇచ్చేవారం. స్వాతంత్ర్య పిపాసువులైన శ్రీరామకృష్ణులకు ఈ జవాబు ఎంతో అనుచితంగా తోచేది. ఆయన ఇలా అనేవారు : “వివాహం చేసుకోకుండా, గృహస్థ బాధ్యతలను స్వీకరించకుంటే, జీవితాంతం మరొకరికి సేవలో ఉండడం ఎందుకు? మీ నిండు మనస్సును భగవంతునికి అర్పించి ఆయనను ఆరాధించండి. మనిషిగా జన్మించాక ఇంతకంటే చేసే మహత్కార్యం ఏముంది? ఒంటరి జీవితం గడపడం అసాధ్యమనుకొంటే, వివాహం చేసుకో. కాని భగవత్సాక్షాత్కారమే జీవిత పరమ లక్ష్యమని మరచిపోవద్దు. ధర్మమార్గంలో గృహస్థుడిగా జీవించు.” జీవిత లక్ష్యం గురించి ఇదే ఆయన నిశ్చితాభిప్రాయం.
కాబట్టి ఆధ్యాత్మిక మార్గానికి యోగ్యులనీ, మంచి సాధకులనీ తాము పరిగణించిన యువకులైన భక్తులు ఎవరైనా వివాహం చేసుకొన్నాడని గాని, లేదా ఏ అవసరమూ లేకుండానే సామాన్యులలా కేవలం ధనసంపాదన నిమిత్తమే ఉద్యోగం చేస్తున్నాడని గాని లేదా పేరుప్రతిష్ఠల తహతహతో మరేదైనా లౌకిక కార్యకలాపాలలో మునిగివున్నాడని గాని తెలియవస్తే శ్రీరామకృష్ణులు ఎంతో వ్యథ చెందేవారు.
తమ యువభక్తుడైన నిరంజన్ (కాలాంతరంలో స్వామి నిరంజనానంద) ఉద్యోగం చేస్తున్నాడని విని, అతడితో ఆయన, “వృద్ధురాలైన నీ తల్లిని పోషింప నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. కనుక నేను సహించగలను; లేకపోతే నీ ముఖం కూడా చూడలేకపోయేవాణ్ణి” అని అన్నారు.
మరొక యువభక్తుడైన చిన్న నరేంద్రుడు వివాహం చేసుకొని శ్రీరామకృష్ణులను దర్శింప కాశీపూర్ ఉద్యానానికి వచ్చాడు. అప్పుడాయన అతడి మెడ చుట్టూ చేతులు వేసి, పుత్రశోకంతో విలపించే తీరులో, పదేపదే “నాయనా, భగవంతుణ్ణి విస్మరించి సంసార సాగరంలో పూర్తిగా మునిగిపోకుండా ఉంటావు గాక!” అంటూ బోరున విలపించారు.
18. భగవద్విశ్వాసం, మూర్ఖత్వం విభిన్నమైనవి; సత్ అసత్ విచక్షణ సదా చేస్తూండాలి
కొత్తగా జనించిన భగవత్ప్రేమ ప్రేరణలో కొందరు భక్తులు, ‘విశ్వాసం లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించలే’ రన్న ఉపదేశాన్ని తప్పుగా అర్థం చేసుకొని, విచక్షణారహితంగా ప్రతి విషయాన్నీ, ప్రతి వ్యక్తినీ నమ్మాలని భావించడం కద్దు. అటువంటి భక్తులను చూసీచూడగానే శ్రీరామకృష్ణులు వారి పొరపాటును గ్రహించి, వారిని మందలించేవారు. విశ్వాసంతోనే ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని లోకులకు ఆయన ఉపదేశించే వారు. కాని సదసత్ విచారణతో ఏది వాంఛనీయమో, ఏది కాదో నిర్ణయించాలని కూడా ఆయన నొక్కి వక్కాణించేవారు.
శ్రీరామకృష్ణుల ఆప్త శిష్యుడొకడు (స్వామి యోగానంద) ఒకసారి అంగడిలో ఒక మూకుడు కొన్నాడు. ఆ అంగడివాడికి అన్యాయం చేయడం తప్పని ధర్మోపదేశం చేసి, పరీక్షించకుండానే ఆ మూకుడు కొన్నాడు. తిరిగి వచ్చాక చూస్తే ఆ మూకుడులో పగులు కనిపించింది. ఆ విషయం శ్రీరామకృష్ణులకు తెలిసింది. ఆ శిష్యుణ్ణి పిలిచి, సుతిమెత్తగా చీవాట్లుపెట్టి, ఇలా చెప్పారు : “భక్తుడుగా ఉండడం వలన మూర్ఖుడివి కావడం ఎందుకు? ధార్మికతను అభ్యసించడానికా ఆ అంగడివాడు అంగడి నడుపుతున్నది? అంగడివాణ్ణి నమ్మి, ఒక్కసారి కూడా పరీక్షించకుండా నువ్వు మూకుడును తీసుకురావడానికి ధర్మనిష్ఠే కారణమా? మళ్ళీ ఎన్నడూ అలా చేయవద్దు. ఏదైనా వస్తువు కొనాలనుకొంటే నాలుగైదు అంగళ్ళలో విచారించి దాని అసలైన ధరను తెలుసుకోవాలి. కొనేటప్పుడు ఆ వస్తువును క్షుణ్ణంగా పరీక్షించాలి. అంగడి వాళ్ళకు కొసరు ఇచ్చే వాడుక ఉంది కనుక, ఆ కొసరు కూడా అడిగి పుచ్చుకోకుండా రాకూడదు” అని సామాన్య విషయాలలో కూడా సునిశిత దృష్టి అవసరమని తెలియజేసేవారు.
19. విభిన్న మానసిక స్వభావాలుగల వ్యక్తులకు విభిన్న బోధనలు
ఒక ఫలానా మానసిక స్వభావం ఉండడం వలన కొందరు వ్యక్తులు ఆధ్యాత్మిక జీవితం పేరిట ఎంతో సాధుస్వభావులు కావడం కద్దు. తత్ఫలితంగా కొన్ని సమయాలలో ఆధ్యాత్మిక మార్గం నుండి వారు పతనం చెందడమూ జరుగవచ్చు. కోమల స్వభావులైన స్త్రీ పురుషులు తరచు ఈ ప్రమాదంలో పడిపోతుంటారు. అందువలన శ్రీరామకృష్ణులు సదా అటువంటి వ్యక్తులకు కాస్త కఠినంగా ఉండమనీ, కఠిన ప్రవృత్తి గలవారికి కాస్త కోమలంగా వ్యవహరించమనీ బోధించేవారు. మాలోని ఒక భక్తుడి (స్వామి యోగానంద) హృదయం ఎంతో కోమలంగా ఉండేది. విపరీత పరిస్థితులలో సైతం అతడికి ఎన్నడూ కోపం వచ్చేది కాదు, కనీసం పరుషంగా కూడా మాట్లాడేవాడూ కాదు. వివాహం చేసుకోవడం అతడి నైజానికి పూర్తి విరుద్ధం, అతడికి అటువంటి ఉద్దేశమూ ఉండేది కాదు. కాని కన్నతల్లి కన్నీళ్ళకు ద్రవించిపోయి హఠాత్తుగా ఒక రోజు వివాహబంధంలో చిక్కువడి పోయాడు. ఆ వివాహం అతడినెంత నిరాశానిస్పృహలకు గురిచేసిందో, అతడెంత హతాశుడయ్యాడో వర్ణించలేం. శ్రీరామకృష్ణుల ఆశ్రయం, ఉపశమన వచనాలు మాత్రమే అతణ్ణి ఆ సందర్భంలో కాపాడగలిగాయి. తనలోని అపరిమిత కోమలత్వాన్ని, మెతకదనాన్ని నియంత్రించడం నేర్చుకొని, ఏ పనినైనా పర్యాలోచించి చేయడాన్ని అలవరచుకోగలడనే ఉద్దేశంతో శ్రీరామకృష్ణులు ఒక కంట అతణ్ణి కనిపెట్టసాగారు.
నిరంజన్ (1862-1904) కాలాంతరంలో స్వామి నిరంజనానంద. మార్చి 1896 సం ॥ లో ఆలంబజార్ మఠంలో తీసిన ఛాయాచిత్రం.
యోగీన్ (1861 -1899), కాలాంతరంలో స్వామి యోగానంద. మార్చి 1896 సం ॥ లో ఆలంబజార్ మఠంలో తీసిన ఛాయాచిత్రం.
సామాన్య విషయాల సహాయంతో అతడికి తగిన శిక్షణ ఏవిధంగా ఆయన ఇచ్చారో స్పష్టంగా తెలుసుకోవడానికి ఒకటి రెండు ఉదాహరణలు ఇక్కడ ఇస్తున్నాం. శ్రీరామకృష్ణుల వస్త్రాలు, వస్తువులు ఉన్న పెట్టెలో ఒక రోజు బొద్దింక కనిపించింది. అప్పుడు ఆయన, “దీన్ని గది బయటకు పట్టుకుపోయి చంపిరా” అని అతడికి చెప్పారు. అతడు దాన్ని పట్టుకొన్నాడు; కాని బయటకు వెళ్ళి దాన్ని చంపకుండా, వదలిపెట్టేశాడు. అతడు తిరిగి రాగానే “ఆ బొద్దింకను చంపేశావా?” అని అడిగారు. అతడు సిగ్గుపడి, “లేదండి. బయట విడిచిపెట్టి వచ్చాను” అని జవాబిచ్చాడు. ఆయన అతణ్ణి చీవాట్లుపెట్టి, “చంపమని చెబితే, వదలిపెట్టి వస్తావా? నేను చెప్పినట్లే చెయ్యాలి. లేకుంటే భవిష్యత్తులో క్లిష్ట పరిస్థితుల్లో నీ ఊహ ప్రకారం వ్యవహరించి తదనంతరం పశ్చాత్తాప పడవలసి వస్తుంది” అని మందలింపు ధోరణిలో చెప్పారు.
20. యోగానందకు ఉపదేశించడం
ఒక రోజు యోగీన్ (స్వామి యోగానంద) పడవలో దక్షిణేశ్వరానికి వస్తున్నాడు. ప్రయాణీకులలో ఎవరో ప్రశ్నించగా, కాళికాలయంలో వసిస్తూన్న శ్రీరామకృష్ణుల వద్దకు వెళతున్నానని అతడు చెప్పాడు. ఈ మాట వినగానే ఆ సదరు ప్రయాణీకుడు శ్రీరామకృష్ణులను దూషింప నారంభించాడు : “ఓ! ఆయన కేవలం ఒక కపట వేషధారి, ప్రజలను మోసగిస్తున్నాడు. షడ్రసోపేతంగా భుజిస్తాడు, మెత్తని పరుపుల మీద పవళిస్తాడు, బడి పిల్లల మనస్సులను మార్చివేస్తాడు” అన్న అతని దుర్భాషలు విని యోగేన్ ఎంతో బాధపడ్డాడు. అతణ్ణి ప్రతిఘటించాలని అనుకొన్నా తన మృదు స్వభావం కారణంగా మరుక్షణమే ఇలా ఆలోచనలో పడ్డాడు : “అవగతం చేసుకోవడానికి కించిత్తు ప్రయత్నం కూడా చేయకుండా అనేకులు గురుదేవుల గురించి చెడుగా భావించుకొని, దుర్భాషలాడుతుంటారు. కాని దీనికి నేనేం చేయగలను?” ఇలా ఆలోచించి ఆ వ్యక్తి మాటలను ఖండింప కనీస ప్రతిఘటన కూడా చేయకుండా, మౌనంగా ఉండిపోయాడు.
శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చిన తరువాత మాటల సందర్భంలో, పడవలో జరిగిన సంఘటనను పూసగుచ్చినట్లు ఆయనకు వర్ణించి చెప్పాడు. అహంకార రహితులూ, దూషణభూషణలకు అతీతులూ అయిన శ్రీరామకృష్ణులు ఆ సంఘటన గురించి విని తేలిగ్గా నవ్వేస్తారని యోగీన్ భావించాడు. కాని తద్విరుద్ధంగా ఆయన స్పందించారు. ఆ సంఘటనను మరో దృక్పథంలో పరికించి, ఆయన ఇలా వ్యాఖ్యానించారు : “ఆహా, అకారణంగా అతడు నన్ను దుర్భాషలాడాడు, నువ్వేమో ఏ ప్రతిచర్యా చేయకుండా, మౌనంగా తిరిగి వచ్చేశావే? శాస్త్రాలు ఏం వచిస్తున్నాయో తెలుసా? తన గురువును పరాయివాడు ఎవరైనా తూలనాడితే అతగాడి తలను నరికివేయాలి లేదా ఆ చోటు నుండి తక్షణమే నిష్క్రమించాలి. ఆ దుర్భాషలను ప్రతిఘటిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నువ్వేమో వచ్చేశావు!”
21. నిరంజన్‌కు విభిన్న ఉపదేశం
శిష్యుల మానసిక ప్రవృత్తులననుసరించి శ్రీరామకృష్ణుల ఉపదేశాలు ఎలా విభిన్నంగా ఉండేవో మేం తెలుపబోయే ఈ క్రింది సంఘటన నుండి పాఠకులు అవగతం చేసుకోవచ్చు. నిరంజన్ (కాలాంతరంలో స్వామి నిరంజనానంద) సహజంగానే ఉద్రేక స్వభావం గలవాడు. ఒక రోజు నిరంజన్ పడవలో దక్షిణేశ్వరానికి వస్తున్నప్పుడు, పై విధంగానే కొందరు ప్రయాణీకులు శ్రీరామకృష్ణులను దుర్భాషలాడడం విన్నాడు. తక్షణం అతడు తీవ్రంగా వారిని ప్రతిఘటించాడు. అలా ప్రతిఘటించినప్పటికీ వారు నిందాలాపాలు ఆపకపోవడంతో ఆగ్రహంతో పడవను ముంచివేయడానికి సిద్ధపడ్డాడు. నిరంజన్ మహాబలిష్ఠుడు, పైగా గజ ఈతగాడు. కోపంతో అతడి ముఖం ఎర్రబారడం చూసి ప్రయాణీకులు భయంతో వణకిపోతూ, తమను క్షమించి, పడవను ముంచివేసే ప్రయత్నం విరమించమని పదేపదే వేడుకొన్నారు. తదనంతరం శ్రీరామకృష్ణులకు ఈ విషయం తెలిసి నిరంజన్ను చీవాట్లు పెట్టారు. అతడితో ఇలా చెప్పారు: “కోపం ప్రమాదభరితమైనది, గర్హించవలసింది. కోపానికి లోనుకావచ్చా? సజ్జనుడి కోపం నీటి మీద వ్రాసిన గీతలా, తక్షణం మాయమైపోతుంది. అనుచితంగా మాట్లాడడమే హీనబుద్ధుల లక్షణం. అటువంటి విషయాల గురించి వాళ్ళతో కలహానికి దిగితే, జీవితపర్యంతమూ ఆ రీతిలోనే గడప వలసి వస్తుంది. అటువంటి వారిని క్రిమి కీటకాలలా పరిగణించి, వారి మాటలను పట్టించుకోకూడదు. కోపానికి వశవర్తివై ఎంత అపకారానికి ఒడిగట్టబోయావో ఒక్కసారి యోచించి చూడు. ఆ పడవ నడిపేవాళ్ళు ఏం తప్పు చేశారని పాపం వారికి హాని చేయ పూనుకొన్నావు?”
22. భక్తురాండ్రకు ఉపదేశం
పురుషులకు మాదిరిగానే శ్రీరామకృష్ణులు భక్తురాండ్రకు వారి స్వభావానికి అనుగుణంగా ఉపదేశాలిచ్చేవారు. మృదుల స్వభావం గల ఒక స్త్రీకి ఆయన ఇలా మందలింపు ధోరణిలో ఉపదేశించటం మాకు జ్ఞాపకం: “నీకు పరిచయస్థుడైన ఒక ఫలానా పురుషుడు ఎన్నో ప్రయాసల కోర్చి నీకు అన్ని విషయాలలోను సహాయం చేశాడనుకొందాం. కాని నీ అంద చందాల వ్యామోహంలో పడి అతడి దుర్బల మనస్సు నీకై తపిస్తుందనుకొందాం. అటువంటప్పుడు అతడి పట్ల దయ తలుస్తావా లేదా ఒక్క తన్నుతన్ని అతడినుండి వైదొలగిపోతావా? కాబట్టి ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ, ఎవడంటేవాడి మీద విచక్షణారహితంగా దయచూపడం సాధ్యం కాదని గ్రహించుకో. దయ చూపడానికీ ఒక హద్దు ఉంటుంది. దేశ కాల పాత్రలను బట్టే దయ వహించాలి.”
23. హరీష్ వృత్తాంతం
పై విషయానికి సంబంధించిన మరో సంఘటన మాకు జ్ఞాపకం వస్తున్నది. హరీష్ బలిష్ఠుడైన యువకుడు. అతడికి అందమైన భార్య, చిన్నబిడ్డ ఉండేవారు. అతడి ఆర్థిక పరిస్థితులు మొత్తం మీద బాగానే ఉండేవి. శ్రీరామకృష్ణులను కొన్నిసార్లు దర్శించుకోగానే అతడి మనస్సు గొప్ప వైరాగ్య భావాలతో నిండిపోయింది. అతడి ముక్కుసూటి నైజం, నిష్ఠ, ప్రశాంతత చూసి శ్రీరామకృష్ణులు ఎంతో ప్రసన్నులై, అతడికి ఆశ్రయం ఇచ్చారు. అప్పటి నుండి హరీష్ దక్షిణేశ్వరంలోనే శ్రీరామకృష్ణులను సేవిస్తూ, జపధ్యానాలు తదితర ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తూ ఎక్కువ కాలం అక్కడే గడపసాగాడు. తల్లితండ్రుల ఒత్తిడి, అత్తవారి సాదర ఆహ్వానం, భార్య, సంతానం ఇవేవీ హరీష్‌ను కదలించలేకపోయాయి. అతడు మౌనవ్రతం పాటిస్తూ, ఎవరి వ్యాఖ్యలను పట్టించుకోకుండా తన దారిలో పోసాగాడు. అతడి శాంతస్వభావాన్ని, నిష్ఠను మాకు ఎత్తి చూపించే ధోరణిలో శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు మాతో, “అసలు సిసలైన మనుషులు హరీష్‌లా ఉంటారు. వారు ప్రేరణలన్నిటికీ స్తబ్ధులై ఉంటూ, ఎలాంటి ప్రతిస్పందనా వ్యక్తం చేయరు” అని చెప్పేవారు.
24. “దయ చూపే సందర్భం కాదిది”
హరీష్ ఆ విధంగా లౌకిక వ్యాపారాదులన్నీ మూటగట్టి, ఆధ్యాత్మిక సాధనలలో ఉన్నప్పుడు, అతడి కుటుంబంలోని యావన్మందీ ఎంతో బాధపడుతున్నారనే వార్త అతడి చెవినపడింది. అతడి భార్య, భర్త వియోగాన్ని ఇక ఏమాత్రం భరించలేక అన్నపానాదులను దాదాపు త్యజించిందనీ అతడికి తెలియవచ్చింది. ఇదంతా విని కూడా హరీష్ నిర్లిప్తంగా, మౌనంగా ఉండిపోయాడు. అతడి మనస్సులో ఏముందో తెలుసుకోగోరి ఒక రోజు శ్రీరామకృష్ణులు అతణ్ణి ప్రక్కకు పిలిచి, “నీ భార్య ఎంతో బాధపడుతోంది. ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆమెను చూసి రాకూడదా? ఒక రకంగా ఆమెను చూసుకొనే వాళ్ళు ఎవరూ లేరనే చెప్పాలి.* కాబట్టి ఆమె పట్ల దయ చూపటంలో తప్పేముంది?” అని అన్నారు. అందుకు హరీష్, “మహాశయా, దయ చూపే సందర్భం కాదిది. ఒకవేళ దయ చూపడానికి ఇంటికి పోతే, సంసార మోహంలో పడిపోయి, నా జీవిత ప్రధాన కర్తవ్యాన్ని విస్మరిస్తానేమో! దయచేసి నన్నలా చేయమని ఆదేశించకండి” అని వినమ్రంగా జవాబిచ్చాడు. హరీష్ జవాబుతో శ్రీరామకృష్ణులు ఎంతో ప్రసన్నులయ్యారు. అతడి మాటలను అప్పుడప్పుడు మాతో ప్రస్తావించి అతడి వైరాగ్యాన్ని ప్రశంసించేవారు.
25. వ్యక్తుల మామూలు దైనందిన చేతల ఆధారంగా ఉపదేశించడం
మామూలు దైనందిన చేతలను పరిశీలించి మా మనస్సులలోని మంచి, చెడు గుణాలను శ్రీరామకృష్ణులు ఎలా తెలుసుకొనేవారో చూపడానికి ఎన్నో ఉదాహరణలు పేర్కొనవచ్చు. నిరంజన్ అధికంగా నెయ్యి తినడం చూసి, “అంత నెయ్యి తింటున్నావే! చివరకు నువ్వు లోకుల కుమార్తెలనూ, కోడళ్ళనూ లేవదీసుకుపోయేట్లున్నావే?” అని అనేవారు. మరొక వ్యక్తి ఎక్కువసేపు నిద్రించడం గమనించి ఆయన ఎంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యశాస్త్రం అధ్యయనం చేయాలనే తీవ్ర ఆకాంక్షతో ఆయన ఆదేశాన్ని పాటించని మరొక వ్యక్తిని చూసి “కోర్కెలను ఒకటి వెంట ఒకటిగా వదలివేయడానికి బదులు నువ్వు వాటిని పెంచుకొంటున్నావు; అటువంటప్పుడు ఆధ్యాత్మిక ప్రగతిని ఎలా పొందగలవు?” అని అడిగారు. ఇతర అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు ఇటువంటి ఎన్నో ఉదాహరణలను పాఠకులకు తెలిపివున్నాం. కాబట్టి మరిన్ని ఉదాహరణలు పేర్కొనడం అనవసరమని భావిస్తున్నాం.
26. తమను గురించిన వ్యక్తుల అంచనాల ద్వారా శ్రీరామకృష్ణులు వారి ఆధ్యాత్మిక ప్రగతిని రూఢిపరచుకోవడం
పైన పేర్కొన్న పరీక్షా పద్ధతుల ద్వారా తమ ఆశ్రిత భక్తుల నైజాన్ని గ్రహించి, వారి లోటుపాట్లను ఎలా సవరించుకోవాలో ఉపదేశించేవారు. అంతేగాక ఆ ఉపదేశాలు ఏ మేరకు కార్యరూపం దాల్చాయో పదేపదే గమనిస్తూ ఉండేవారు. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని రూఢి చేసుకోవడంలో ఆయన ఒక ప్రత్యేక విధానాన్ని అవలంబించడమూ కద్దు. ఆయన అవలంబించే ఆ విధానం ఇది : ఏ భక్తిప్రపత్తుల ప్రేరణతో ఒక వ్యక్తి తమ వద్దకు ప్రప్రథమంగా ఎలా వచ్చాడో, ఆ భక్తిప్రపత్తులు క్రమేణా పెంపొందుతున్నాయో లేదో పరిశీలించడం ఆయన ఒక నియమంగా ఎంచుకొన్నారు. ఆ విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో, కొన్ని సమయాలలో శ్రీరామకృష్ణులు ఫలానా వ్యక్తి తమ ఆధ్యాత్మిక స్థితులను లేదా తమ ప్రవర్తనను ఏ మేరకు అవగతం చేసుకొన్నాడో అని ఆ వ్యక్తిని ప్రశ్నించేవారు. తక్కిన సమయాలలో ఆ వ్యక్తికి తమ వచనాల పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉందో లేదో ఆయన గమనించేవారు. మరికొన్ని సమయాలలో ఎవరి సాంగత్యంలో ఆ వ్యక్తి ఆధ్యాత్మిక భావం పెంపొందుతుందో వారిని అతడికి పరిచయం చేసేవారు. ఆధునిక ప్రపంచంలో ఆధ్యాత్మికతకు ప్రతిరూపంగా తమను సహజంగా అతడు గుర్తించే దశకు వచ్చేదాకా ఆయన ఆ శిష్యుని ఆధ్యాత్మిక ప్రగతి గురించి నిశ్చింతులై ఉండలేకపోయేవారనడం అతిశయోక్తి కాదు.
27. దీనిని గురించి మరింత వివరణ
పైన చెప్పిన విషయం విని పాఠకులు ఆశ్చర్యపడతారనడంలో సందేహం లేదు. కాని కాస్త ఆలోచించి చూస్తే అలా ఆశ్చర్యపోవడానికి ఆస్కారం కనిపించదు. పైగా శ్రీరామకృష్ణులు అలా ఆలోచించడం సహజమూ, యుక్తియుక్తమూ అని కూడా తెలియవస్తుంది. అలా ప్రవర్తించడం తప్ప ఆయనకు మరో ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే లోకంలో ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగని ఆధ్యాత్మికత తమలో అభివ్యక్తమౌతూందన్న విషయం ఆయనకు ఎరుకే. సుదీర్ఘకాల కఠోర తపశ్చర్యలు, ప్రగాఢ ధ్యాన సమాధులు పొందడం ఫలితంగా ఆయనలో అహంకారం సంపూర్ణంగా దగ్ధమై పోయిందనీ, భ్రమలోపడే ఆస్కారం కించిత్తు కూడా లేనేలేదనీ మేం మరొకచోట వివరింప ప్రయత్నించడం పాఠకులు చూడవచ్చు.
ఆయన మనస్సులో అపరిమిత స్మృతి, అనంత జ్ఞానం అభివ్యక్తమౌతుంటాయి. పర్యవసానంగా లోకం మునుపు ఎన్నడూ కనీవినీ ఎరుగని ఆధ్యాత్మిక ఆదర్శం తమ ద్వారా వ్యక్తమౌతుందనే ప్రగాఢ నమ్మకం ఆయనలో ఉదయించింది. కాబట్టి ఆ ఆదర్శాన్ని చక్కగా గ్రహించి, దాని వెలుగులో తమ జీవితాలను ప్రకాశింప చేసుకొనేవారు ఈ ఆధునిక యుగంలో ఆధ్యాత్మిక ప్రగతిని సునాయాసంగా పొందగలరని ఆయన నమ్మడం సహజమే కదా! కనుక ఆయన వద్దకు వచ్చే భక్తులు ఆయన గురించి పైన పేర్కొన్న విషయాలు చక్కగా అర్థం చేసుకొన్నారో లేదో, అర్థం చేసుకొని ఉంటే ఆయనలో అభివ్యక్తమయ్యే ఉదార ఆధ్యాత్మిక భావాలకు అనుగుణంగా తమ జీవితాలను తీర్చిదిద్దుకొనే ప్రయత్నాలు చేస్తున్నారో లేదో ఆయన క్షుణ్ణంగా పరిశీలించడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు.
పైన ప్రస్తావించిన తమ మనోనమ్మకాన్ని శ్రీరామకృష్ణులు వివిధ రీతుల్లో వ్యక్తం చేసేవారు. తరచు ఆయన “నవాబుల కాలంలో చెలామణిలో ఉండిన నాణేలు బాదుషాల కాలంలో చెల్లవు” ; “నేను చెప్పినట్లు ముందుకు పోతే తిన్నగా లక్ష్యాన్ని చేరగలవు” ; “జననమరణ పరంపరలో చివరి జన్మను చేరుకొన్నవాడు (అంటే ముక్తిని పొంద సిద్ధంగా ఉన్నవాడు) మాత్రమే ఇక్కడకు వచ్చి ఈ చోటి (అంటే తమ) ఉదార ఆదర్శాన్ని స్వీకరిస్తాడు”* ; “నీ ఇష్టదైవం దీన్లో (తమను చూపుతూ) వసిస్తూన్నాడు; కనుక దీని మీద ధ్యానించడం, నీ ఇష్టదైవం మీదే ధ్యానించడమౌతుంది” అని చెబుతూండేవారు.
శిష్యులకు తమ పట్ల గల విశ్వాసం, తమను గురించి కలిగిన అవగాహనను ఎలా రూఢిపరచుకొనేవారో కొన్ని ఉదాహరణల ద్వారా వివరించ బోతున్నాం. అప్పుడు పాఠకులు మేం చెప్పిన విషయాన్ని మరింత చక్కగా గ్రహించవచ్చు.
28. ఆయనను గురించి వివిధ భక్తుల విభిన్న అంచనాలు
శ్రీరామకృష్ణుల దర్శనభాగ్యం ద్వారా ఆయన అహేతుక కృపను పొందగలిగిన వ్యక్తులందరికీ, ఏకాంతంలోనో లేదా కొద్దిమంది మాత్రమే ఉన్నప్పుడో హఠాత్తుగా ఆయన, “సరే, నన్ను గురించి నీ అభిప్రాయం ఏమిటి? నేనెవరిని?” అని భాగ్యశాలియైన ఒక ఫలానా భక్తుణ్ణి ప్రశ్నించే వారనే విషయం సువిదతమే. తమకు కొంతకాలంగా సన్నిహితంగా తెలిసిన వ్యక్తులనే ఆయన అలా ప్రశ్నించేవారు. కాని కొన్ని సమయాలలో క్రొత్తగా తమ వద్దకు వస్తూవున్న వ్యక్తులను కూడా అలా ప్రశ్నించేవారు. చాలాకాలం మునుపే యౌగిక దర్శనాలలో కానవచ్చిన భక్తులే వీరు. వారినుండి వచ్చే జవాబుల వైవిధ్యాన్ని వర్ణించడం కష్టం. ఆ జవాబులు క్లుప్తంగా చెప్పాలంటే ఇలా ఉండేవి : “మీరు ‘నిజమైన సాధువులు’, ‘నిజమైన భక్తులు’, ‘మహాపురుషులు’, ‘సిద్ధపురుషులు’, ‘అవతార పురుషులు’, ‘సాక్షాత్తు చైతన్యులు’, ‘సాక్షాత్తు పరమేశ్వరులు’, ‘స్వయంగా ఆ భగవంతుడే మీరు’.” భగవదవతారం పట్ల నమ్మకంలేని కొందరు బ్రహ్మసమాజస్థులు, “మీరు శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఏసుక్రీస్తు, చైతన్యులతో సమానులైన భగవత్ప్రేమికులు” అని జవాబు చెప్పేవారు.
విలియమ్స్* అనే ఒక క్రైస్తవుణ్ణి అలా ప్రశ్నించినప్పుడు అతడు, శ్రీరామకృష్ణులు సాక్షాత్తు భగవంతుని పుత్రుడైన, నిత్యచిన్మయరూపుడైన ఏసుక్రీస్తు అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలా జవాబులు చెప్పిన వ్యక్తులు శ్రీరామకృష్ణులను ఏ మేరకు అవగతం చేసుకొన్నారో మాకు తెలియదు; కాని తమ జవాబుల ద్వారా ఏకకాలంలో శ్రీరామకృష్ణులను గురించీ, భగవంతుణ్ణి గురించీ తమకున్న అభిప్రాయాలను వెల్లడించారన్నది మాత్రం సత్యం. శ్రీరామకృష్ణులు వారి జవాబులను పైన ప్రస్తావించిన వెలుగులోనే స్వీకరించి, వారి ఆధ్యాత్మిక వైఖరులకు అనుగుణంగా ఉపదేశించేవారు. సకల ఆధ్యాత్మిక భావమూర్తులైన శ్రీరామకృష్ణులు వారి భావానికి హాని కలిగించకుండా, ప్రతి ఒక్కరిని వారి భావంలో చరమావస్థను చేరుకొనేలా చేసి, దేశకాలాతీతుడూ, సత్యస్వరూపుడూ అయిన భగవంతుని సాక్షాత్కారం పొంద దోహదం చేసేవారు. కాని ఆ వ్యక్తి తన సొంత భావాన్ని వ్యక్తీకరించాడో లేదా మరొకరి భావాన్ని అనుకరిస్తున్నాడో మాత్రం గమనించేవారు.
29. భక్తుడైన పూర్ణచంద్రుడి ఉదాహరణ
శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చినప్పుడు పూర్ణుడు* కేవలం బాలుడనే చెప్పాలి. అప్పుడు అతడి వయస్సు పదమూడేళ్ళకు కాస్త పైబడి ఉండవచ్చు. ఆ సమయంలో శ్రీరామకృష్ణుల పరమభక్తుడైన శ్రీ ‘మ’ (కథామృత రచయిత) శ్యాం బజార్లో దయాసాగరుడైన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన పాఠశాల ప్రథానోపాధ్యాయుడుగా ఉంటున్నారు. సహజంగా దైవ భక్తి గల బాలురను ఆయన దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణుల వద్దకు తోడ్కొని వచ్చేవారు. ఆ విధంగా ఆయన తేజ్చంద్ర, నారాయణ్, హరిపద, వినోద్, చిన్న నరేన్, ప్రమథ (పల్టు) మొదలైన బాగ్బజార్‌కు చెందిన బాలురను ఒక్కొక్కరినే వెంటబెట్టుకు వచ్చేవారు; వీరంతా శ్రీరామకృష్ణుల వద్ద ఆశ్రయం పొందారు. కాబట్టి మాలో కొందరం ‘మ’ ను ‘పిల్లలను అపహరించే పంతులు’ అని తమాషాగా పేర్కొనేవారం. అలా ఆయనను మేం పేర్కొనడం విని శ్రీరామకృష్ణులు, ‘సరైన బిరుదు’ అంటూ నవ్వుకొనేవారు. ‘మ’ ఒక రోజు మూడవ తరగతి పిల్లలకు పాఠం చెబుతూవున్నప్పుడు పూర్ణుడి మంచి స్వభావం, తియ్యని పలుకులు ఆయనను ఆకర్షించాయి. త్వరలోనే ఆయన పూర్ణుణ్ణి, శ్రీరామకృష్ణులకు పరిచయం చేసే ఏర్పాట్లు చేశారు. పూర్ణుడి సంరక్షకులు కఠిన స్వభావులు కనుక ఆ ఏర్పాట్లు గోప్యంగా జరిగాయి. ఎందుకంటే ఈ విషయం ముందుగా వారికి తెలిస్తే గురుశిష్యులిద్దరూ వాళ్ళ చేతుల్లో ఇబ్బందికి గురికాక తప్పదు. పూర్ణుడు మామూలు వేళకు బడికి వచ్చి, బాడుగ బండిలో దక్షిణేశ్వరానికి వెళ్ళి గురుదేవులను దర్శించుకొన్నాడు. బడి వదిలే వేళకు దక్షిణేశ్వరం నుండి తిరిగి బడికి వచ్చేశాడు. ఇంటికి మామూలు వేళకే తిరిగి పోగలిగాడు.
30. పూర్ణుడి ఆధ్యాత్మిక అర్హత గురించి శ్రీరామకృష్ణులు
ఆ రోజు పూర్ణుణ్ణి చూసి శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించారు. అతడికి ఆప్యాయంగా తినుబండారాలు ఇచ్చారు; ఉపదేశాలు చేశారు. అతడు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు, “అవకాశం ఉన్నప్పుడల్లా ఇక్కడకు వస్తూ ఉండు. బండిలోనే రా, బండి బాడుగ ఇక్కడ ఇచ్చేటట్లు ఏర్పాటు జరుగుతుంది” అని అతడితో చెప్పారు. ఆ తరువాత ఆయన మాతో ఇలా చెప్పారు : “పూర్ణుడు నారాయణాంశ సంభూతుడు. సత్త్వగుణ సంపన్నుడైన సాధకుడు. ఈ రకంగా చూసినప్పుడు, నరేంద్రుని తరువాతి స్థానం ఇతడిదే. పూర్ణుడి రాకతో ఇంతకు మునుపు దివ్యదర్శనాలలో నేను చూసిన భక్తులు అందరూ వచ్చినట్లే! కాబట్టి భవిష్యత్తులో ఆ కోవకు చెందిన వ్యక్తులు ఇక రారు” అని వ్యాఖ్యానించారు.
31. పూర్ణుడి పట్ల శ్రీరామకృష్ణుల ఆప్యాయతానురాగాలు
శ్రీరామకృష్ణులను దర్శించుకొన్న తరువాత పూర్ణుడిలో నాడు అసాధారణమైన మానసిక పరిణామం జనించింది. శ్రీరామకృష్ణుల తోడి గతజన్మ స్మృతి అతడిలో జాగృతమైంది. దాంతో అతడు అంతర్ముఖుడైనాడు. అతడి కళ్ళ వెంట ఆనందాశ్రువులు ధారలు కట్టాయి. సంరక్షకుల భయంతో ఎంతో కష్టం మీద తనను అదుపులో ఉంచుకొని ఆ రోజు ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆనాటి నుండి పూర్ణుణ్ణి తరచు చూసి, అతడికి స్వయంగా తినిపించాలనే ఆరాటం శ్రీరామకృష్ణులలో తీవ్రం కాసాగింది. అవకాశం దొరికినప్పుడల్లా అతడికి రకరకాల తినుబండారాలను పంపించేవారు. ఆ తినుబండారాలు తీసుకెళ్ళి పూర్ణుడికి ఇచ్చే వ్యక్తితో ఎవరికీ తెలియకుండా ఇచ్చిరమ్మనేవారు. ఆ విషయం ఇంట్లో తెలియవస్తే అతణ్ణి ఇంట్లో బాధిస్తారని తెలిసే అలా గోప్యంగా శ్రీరామకృష్ణులు ఇవ్వమనేవారు.
32. పూర్ణుడి దృష్టిలో శ్రీరామకృష్ణులు
పూర్ణుణ్ణి చూడాలనే ఆరాటంలో శ్రీరామకృష్ణుల కళ్ళవెంట ఎడతెగని అశ్రువులు స్రవించడం మేం అనేక సందర్భాలలో చూశాం. ఆయన ఆ ప్రవర్తనకు మేం ఆశ్చర్యపోవడం చూసి ఆయన ఒక రోజు మాతో “పూర్ణుడి పట్ల నేనిలా ఆకర్షితుడనవడం చూసి మీరు ఆశ్చర్యపోతున్నారు. కాని నరేన్‌ను ప్రప్రథమంగా చూసినప్పుడు నేను అనుభవించిన తపన, ఆ సందర్భంలో నేను పడ్డ ఆరాటం మీరు చూసివుంటే, మీరెలా స్పందించే వారో నేను ఊహించుకోలేను” అని అన్నారు. పూర్ణుణ్ణి చూడాలనే ఆరాటం మరింత తీవ్రమైనప్పుడు ఆయన ఆ రోజు మధ్యాహ్నం బాగ్‌బజార్‌లోని బలరాం బోస్ ఇంటికో లేదా ఆ ప్రాంతంలోని మరొక భక్తుని ఇంటికో వెళ్ళేవారు. తరువాత బడికి కబురు పంపి పూర్ణుణ్ణి తమ వద్దకు పిలిపించుకొనేవారు. పూర్ణుడు రెండవసారి శ్రీరామకృష్ణులను ఈ విధంగానే దర్శించాడు. అతడు ఆ రోజంతా తన్మయత్వంలో మునిగిపోయాడు. ఆ సందర్భంలో శ్రీరామకృష్ణులు అతడికి కన్నతల్లిలా స్వయంగా తమ చేతులతో తినిపించారు. పిదప, “సరే, నా గురించి నువ్వు ఏమనుకొంటున్నావు? నేనెవరిని?” అని అతణ్ణి ప్రశ్నించారు. అసాధారణ హృదయ ప్రేరణకు భక్తి తోడవగా పులకాంకితుడైన పూర్ణుడు, “సాక్షాత్తు ఆ దేవుడే మీరు” అని జవాబిచ్చాడు.
‘మ’ గా పిలువబడే మహేంద్రనాథ్ గుప్త (1854-1932), శ్రీరామకృష్ణ కథామృత రచయిత.
పూర్ణచంద్ర ఘోష్ (1871-1913)
33. పూర్ణుడికి శ్రీరామకృష్ణుల ఉపదేశం
బాలుడైన పూర్ణుడు చూసీచూడగానే తమను సర్వశ్రేష్ఠ ఆదర్శ రూపునిగా స్వీకరించడం చూసి శ్రీరామకృష్ణుల విస్మయానందాలు మేరమీరాయి. హృదయ పూర్వకంగా పూర్ణుణ్ణి ఆశీర్వదించి మహాశక్తివంతమైన మంత్రంతో దీక్షను ఒసగారు. సాధన రహస్యాలను వెల్లడిచేస్తూ అతడికి ఉపదేశం చేశారు. దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చాక పదేపదే మాతో ఆయన ఇలా చెప్పసాగారు : “సరే, పూర్ణుడు ఇంకా బాలుడే కదా! ఇంకా బుద్ధి వికసించలేదు. అయినప్పటికీ అతడు ఈ విషయాన్ని (అంటే ఆధ్యాత్మిక పరాకాష్ఠ తమలో ఉందని) ఎలా అర్థం చేసుకొన్నాడు? దివ్యసంస్కారాల ప్రేరణతో మరి కొందరు కూడా ఆ ప్రశ్నకు సరిగ్గా అలాంటి జవాబు ఇచ్చివున్నారు. తప్పకుండా అతడిలో మంచి పూర్వజన్మ సంస్కారాలు ఉండే తీరాలి. ఇటువంటశుద్ధసాత్త్వికుల హృదయాలలో స్వతఃసిద్ధంగానే సత్యం పరిపూర్ణంగా ప్రకాశిస్తూ ఉంటుంది.”
34. సంసారియైనప్పటికీ పూర్ణుని మహత్త్వం
అనివార్య పరిస్థితుల కారణంగా పూర్ణుడు వివాహం చేసుకొని, సంసార జీవితం గడపవలసి వచ్చింది. అయినప్పటికీ దృఢవిశ్వాసం, భగవంతునిపైనే ఆధారపడే స్వభావం, సాధన పట్లగల అభిలాష, నిరహంకారం, నిస్వార్థత్వాది సద్గుణాలన్నీ అతడు పుణికిపుచ్చుకొన్నాడని అతడితో సన్నిహిత సంబంధమున్న ప్రతి ఒక్కరికీ సువిదితమే.
35. రెండవ ఉదాహరణ – వైకుంఠనాథ్
తమ ఆశ్రిత భక్తులను శ్రీరామకృష్ణులు అదే విధంగా ప్రశ్నించడం గురించి మరొక ఉదాహరణ. శ్రీరామకృష్ణుల గదిలో శ్రీచైతన్య మహాప్రభువు సంకీర్తన చేస్తున్న చిత్తరువు ఒకటి ఉండేది. మాకు బాగా పరిచయస్థుడైన ఒక వ్యక్తిని, అతడు దక్షిణేశ్వరానికి వస్తున్న కొత్తలో ఒక రోజు శ్రీరామకృష్ణులు ఆ చిత్తరువును చూపుతూ, “వారంతా దివ్యభావోద్వేగ పూరితులై ఎలా ఉన్నారో చూశావా?” అని అడిగారు.
ఆ వ్యక్తి: మహాశయా, వారంతా నిమ్నకులస్థులండీ!
శ్రీరామకృష్ణులు: అదేమిటి? అలా అనవచ్చా?
ఆ వ్యక్తి: నిజమండి; నేను నదియాకు చెందినవాణ్ణి. సాధారణంగా ఈ వైష్ణవులందరూ నిమ్నకులస్థులేనండి.
శ్రీరామకృష్ణులు: నువ్వు నదియా వాస్తవ్యుడివా! అలా అయితే నీకు మరో ప్రణామం.* సరే, రాం తదితరులు దీన్ని (తమను చూపిస్తూ) అవతారమని అంటారు. దీనిని గురించి నువ్వు ఏమనుకొంటున్నావు?
ఆ వ్యక్తి: మహాశయా, వారంతా మిమ్మల్ని తక్కువగానే అంచనా వేశారండి.
శ్రీరామకృష్ణులు: అదెలా? వాళ్ళు భగవదవతారమంటున్నారు, నువ్వేమో తక్కువగా అంచనా వేశారంటున్నావు.
ఆ వ్యక్తి: అవునండి; అవతారం భగవంతుడిలో ఒక అంశ మాత్రమే కదా! నాకు మాత్రం మీరు సాక్షాత్తు ఆ పరమశివుడిగానే కనిపిస్తున్నారు.
శ్రీరామకృష్ణులు: నువ్వేమంటున్నావు?
ఆ వ్యక్తి: నా మనస్సుకు అలా తోస్తున్నప్పుడు నేను చేయగలిగిందేముంది? శివుణ్ణి ధ్యానించమని మీరు నాకు చెప్పివున్నారు. కాని ఎంత ప్రయత్నించినా నా కది సాధ్యం కాలేదు. ధ్యానం చేయడానికి కూర్చోగానే మీ వికసితవదనం తేజోమయంగా నా ముందు ప్రత్యక్షమయ్యేది. మీ వదనాన్ని త్రోసిరాజని శివుణ్ణి ధ్యానించలేకపోయాను; అలా చేయాలనే కోర్కె కూడా నాలో జనించలేదు. అందువలన మిమ్మల్నే శివుడిగా ధ్యానించసాగాను.
శ్రీరామకృష్ణులు: (ఆప్యాయంగా నవ్వుతూ) అలా మాట్లాడవద్దు. నేను నీ చిన్ని వెంట్రుకకు సమానమైన వాణ్ణని నాకు తెలుసు.(ఇద్దరూ నవ్వారు)సరేలే! నీ గురించి ఎంతో ఆందోళన చెందేవాణ్ణి; ఈ రోజు ఆ ఆరాటం తీరిపోయింది.
శ్రీరామకృష్ణుల ఆ చివరి వచనాలను ఆ వ్యక్తి ఆ సమయంలో అర్థం చేసుకొన్నాడో లేదో మాకు తెలియదు. కాని శ్రీరామకృష్ణులు అతడు చెప్పింది విని ప్రసన్నులయ్యారని మాత్రం మాకు తెలుసు. మాకు కావలసింది ఆయన ప్రసన్నత, అనుగ్రహం మాత్రమే. అంతటితో మేం సంతృప్తులయ్యేవారం. ఆయన వచనాలనన్నింటినీ అర్థం చేసుకోవాలనే కోర్కె మాకు ఉండేది కాదు. ఆ వ్యక్తి ఆ రోజు తమను సర్వశ్రేష్ఠ ఆధ్యాత్మిక ఆదర్శంగా స్వీకరించాడని గ్రహించే ఆయన అలా అన్నారని (అంటే ఆ ఆరాటం తీరిపోయిందని) మేం భావించుకొన్నాం.
36. పలుకులు, చేతలు భిన్నంగా ఉండే వ్యక్తిని విశ్వసించరాదు
తమను ఆశ్రయించిన భక్తులందరూ తమనూ, తమ విధానాలనూ సునిశితంగా పరిశీలించాలనీ; అలా పరిశీలించిన తదనంతరమే తమ యథార్థ తత్త్వం పట్ల విశ్వాసం వహించాలనీ ఆయన నొక్కివక్కాణించేవారు. తరచు ఆయన మాతో “సాధువును పగటిపూట, రాత్రివేళ కూడా పరిశీలించండి. తదనంతరమే అతణ్ణి విశ్వసించండి” అని చెప్పేవారు. ఇతరులకిచ్చే ఉపదేశాలను సాధువు స్వయంగా ఆచరిస్తున్నాడో లేదో పరిశీలించమని శ్రీరామకృష్ణులు సదా మమ్మల్ని హెచ్చరించేవారు. తలపులు, పలుకులు, చేతలు ఒక్కటిగా ఉండని వ్యక్తిని ఎన్నటికీ నమ్మవద్దని ఆయన చెబుతుండేవారు. ఈ సందర్భంగా అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు ఒక కథ చెప్పేవారు:
37. వైద్యుడు, రోగి కథ
ఒక ఫలానా వ్యక్తి పిల్లవాడు సదా అజీర్ణంతో బాధపడేవాడు. ఒక రోజు ఆ వ్యక్తి పిల్లవాణ్ణి ఒక మారుమూల గ్రామంలో ఉన్న సుప్రసిద్ధ వైద్యుడి వద్దకు చికిత్సకై తీసుకువెళ్ళాడు. ఆ వైద్యుడు కుర్రవాణ్ణి పరీక్షించి రోగ నిర్ణయం చేశాడు. కాని మందుమాకులు ఏవీ ఇవ్వకుండా వారిని మర్నాడు రమ్మన్నాడు. మర్నాడు ఆ తండ్రీకొడుకులు వైద్యుడి వద్దకు వచ్చినప్పుడు అతడు, ఆ పిల్లవాడితో, “బెల్లం తినడం మానుకో, రోగం నయమౌతుంది. మరే మందూ అవసరం లేదు” అని చెప్పాడు. ఆ మాటలు విని తండ్రి, “అయ్యా, ఈ మాట నిన్ననే చెప్పి ఉండవచ్చు కదా! ఇంత శ్రమపడి ఇవాళ మేం రావాల్సిన అవసరం ఉండేది కాదు” అంటూ వాపోయాడు. అందుకు ఆ వైద్యుడు “నిన్న ఇక్కడ కొన్ని బెల్లపు జాడీలు ఉండడం నువ్వు చూశావు కదా! కుర్రవాడికి బెల్లం తినవద్దని నిన్ననే చెప్పివుంటే, ‘ఈ వైద్యుడు చిత్రమైన వ్యక్తిలా ఉన్నాడు. స్వయంగా తానే అంత బెల్లం ఒక పక్క తింటూ మరోపక్క నన్ను మాత్రం తినవద్దంటాడే!’ అని అతడు తప్పక అనుకొని ఉంటాడు. అప్పుడు నా మాటల్లో కుర్రవాడికి ఏమాత్రం గురి కుదరదు. అందువల్లే ఆ బెల్లపు జాడీలను అక్కడ నుంచి తీసివేసిన తరువాతే ఈ మాట చెప్పవలసి వచ్చింది” అని వివరించాడు.
38. భక్తులు శ్రీరామకృష్ణులను పరీక్షించడం
శ్రీరామకృష్ణుల ఉపదేశం మేరకు మేమంతా ఆయన ప్రవర్తనను, జీవన విధానాలను సునిశితంగా పరిశీలించేవారం. మాలో కొందరు అలా పరీక్షించడానికి ఏమాత్రం తటపటాయించేవారు కారు. మేం చిత్తశుద్ధితోనే ఆయనను పరీక్షిస్తున్నామనీ తద్ద్వారా మా భక్తివిశ్వాసాలు పెంపొందుతాయనీ తెలిసే ఆయన మా పరీక్షలకు సంతోషించినట్లు తోస్తున్నది. ఇందుకు ఈ క్రింది సంఘటన ఒక స్పష్టమైన ఉదాహరణ.
స్వామి యోగానంద గురించి కొన్ని విషయాలు ఇంతకు మునుపే చెప్పుకొన్నాం. ఈ కథకు ఇతడే నాయకుడు; ఈ కథను అతడి నుండే తరువాత మేం విన్నాం. ఈ కథను చెప్పడానికి ముందు అతణ్ణి గురించి క్లుప్తంగా పరిచయం చేయవలసివుంది.
39. మొదటి ఉదాహరణ: స్వామి యోగానంద కథ
స్వామి యోగానంద పూర్వాశ్రమ నామధేయం యోగేంద్రనాథ్రాయ్ చౌధురి. పేరుప్రఖ్యాతులున్న సువర్ణ చౌధురీల వంశంలో అతడు జన్మించాడు. అతడి తండ్రి నవీన్‌చంద్ర ఒకప్పుడు సంపన్నుడైన జమీందారు. ఆ కుటుంబం తరతరాలుగా దక్షిణేశ్వరంలోనే వసిస్తూ ఉంది. యోగేంద్రుడి ఇంట్లో పూజాదికాలు సదా జరుగుతూండేవి; ఆ ఇల్లు కీర్తనలతోను, భాగవతాది పారాయణలతోను సదా మార్మోగుతూ ఉండేదని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇవన్నీ యోగేంద్రుడి బాల్యంలోను, అంతకు మునుపు జరిగిన విషయాలు. తమ సాధన కాలంలో హరికథ ఆలకించడం కోసం ఆ ఇంటికి పలుమార్లు వెళ్ళినట్లు, ఆ కుటుంబ సభ్యులతో పరిచయం కూడా ఉండినట్లు శ్రీరామకృష్ణులు చెబుతూవుండేవారు. కాని యోగేంద్రుడు యౌవనంలోకి అడుగు పెట్టే సమయానికి గృహ కలహాలు, తదితర కారణాల వలన ఆ కుటుంబం ఆస్తి పాస్తులన్నీ కోల్పోయి దాదాపు దారిద్ర్యావస్థకు చేరుకొంది.
40. యోగీన్ శుభసంస్కారాలు, అతడి తెలివితేటలు
చిన్ననాటి నుండి యోగేంద్రుడు మృదుమధుర స్వభావాన్ని సంతరించుకొన్నాడు. అసాధారణ సుగుణాలతో అతడు జన్మించాడనడం అతిశయోక్తి కాదు. బాల్యం నుండే తాను ఈ ప్రపంచానికి చెందినవాణ్ణి కాననీ, తన నిజమైన ఆవాసం ఇక్కడ కాదనీ, తన చిరపరిచిత నేస్తాలు ఇప్పటికీ ఎక్కడో సుదూరంలో ఉన్న నక్షత్ర మండలంలో ఉన్నారనీ అతడు సదా భావిస్తూ ఉండేవాడు. అతడు కోపగించుకోవడం మేం ఎన్నడూ చూడలేదు. “కామాన్ని సంపూర్ణంగా జయించినవాడు మనలో ఎవరైనా ఉన్నాడంటే అతడు యోగేంద్రు డొక్కడే” అని స్వామి వివేకానంద తరచు అనేవారు. అందరిని బోళాగా నమ్మే అతడి సరళత్వాన్ని తొలగింప శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు చీవాట్లు పెట్టినప్పటికీ, యోగీన్ మూర్ఖుడు మాత్రం కాడు. తన కర్తవ్యాలను ప్రశాంతంగా చేసుకుపోతూవున్నప్పటికీ, లోకుల చేతలను పరిశీలిస్తూనే ఉండేవాడు. వారి గురించి అతడికి ఏర్పడ్డ నిర్ణయాలు ఎన్నటికీ సత్యదూరమయ్యేవి కావు. ఇది తన తెలివితేటల పట్ల ఒక రకమైన గర్వాన్ని అతడిలో కలిగించింది.
41. యోగీన్ ఈశ్వరకోటికి చెందినవాడు
దక్షిణేశ్వర వాస్తవ్యుడు కావడం వలన యుక్తవయస్కుడు కాక మునుపే యోగీన్కు శ్రీరామకృష్ణులను దర్శించే భాగ్యం కలిగింది. మొదటి పరిచయంలోనే యోగీన్ని చూసి శ్రీరామకృష్ణులు సంతోషంతో పొంగిపోయారు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం తమ వద్దకు వస్తారని చాలా కాలం క్రితమే జగజ్జనని దివ్యదర్శనాలలో చూపించిన భక్తులలో యోగీన్ కూడా ఒకడని ఆయన గుర్తించారు. అంతే కాదు, అతడు తమ వద్దకు వచ్చిన కొద్ది కాలంలోనే జగజ్జనని అనుగ్రహంతో ఈశ్వరకోటులైన ఆరుగురిలో యోగేన్ ఒకడని శ్రీరామకృష్ణులు గ్రహించారు.
42. యోగీన్ వివాహం, అతడి పశ్చాత్తాపం
దయనీయంగా తల్లి విలపించడంతో, తనకు ఎంత మాత్రం ఇష్టం లేకపోయినా యోగేన్ హఠాత్తుగా వివాహం చేసుకొన్నాడని ఇంతకు ముందే చెప్పి ఉన్నాం. అతడు ఇలా చెప్పేవాడు : “వివాహం చేసుకొన్న మరుక్షణమే భగవత్ సాక్షాత్కారం పొందాలనే ఆశ అడుగంటిపోయింది. కామినీకాంచన పరిత్యాగమే ఎవరి ప్రథమోపదేశమో అటువంటి శ్రీరామకృష్ణుల వద్దకు ఇక ఎందుకు వెళ్ళాలి? సౌమ్యహృదయం కారణంగానే నా జీవితాన్ని నాశనం చేసుకొన్నాను. జరిగిన దానిని జరుగకుండా చేయలేం. ఎంత త్వరగా మరణిస్తే నా కంత మంచిది. ఇంతకు మునుపు శ్రీరామకృష్ణులను నిత్యం దర్శించేవాణ్ణి; కాని ఈ సంఘటన తరువాత ఆయన వద్దకు వెళ్ళడం పూర్తిగా మానుకొన్నాను. హతాశుడనై పశ్చాత్తాపంతో కుమిలిపోతూ రోజులు గడపసాగాను. కాని శ్రీరామకృష్ణులు నన్ను విడిచిపెట్టలేదు. పదేపదే తమ వద్దకు రమ్మని కబురు పంపసాగారు. ఎంతకీ నేను వెళ్ళకపోవడంతో ఆయన నన్ను రప్పించుకోవడానికి ఒక యుక్తి ప్రయోగించారు.”
“నా వివాహానికి ముందు కాళికాలయంలోని ఒక వ్యక్తి ఏవో వస్తువులు కొనమని నాకు కొన్ని రూపాయలు ఇచ్చివున్నాడు. ఆ మొత్తంలో కొన్ని అణాలు నా వద్ద మిగిలాయి. ఒక వ్యక్తి ద్వారా ఆ వస్తువులు పంపుతూ, మిగిలిన పైకం త్వరలోనే పంపుతానని ఆ కాళికాలయంలోని వ్యక్తికి కబురు పంపించాను. ఈ విషయం శ్రీరామకృష్ణులకు తెలుసు. కాబట్టి కోపం నటిస్తూ ఒక రోజు ఒక వ్యక్తితో ‘ఏం మనిషివయ్యా నువ్వు? మిగతా పైకం తిరిగి ఇవ్వలేదు సరికదా ఎప్పుడు ఇస్తావో అదీ చెప్పిపంపలేదు. నువ్వు వస్తువుల కోసం ఖర్చు పెట్టింది ఎంతో తెలియచేస్తూ, మిగిలింది ఇచ్చివేసివుండాలి’ అని నాకు కబురు పంపారు.
ఆ మాటలు నా అహాన్ని బాగా దెబ్బతీశాయి. నేను ఇలా అనుకొన్నాను: ‘సన్నిహితంగా ఇంతకాలం మెలగిన తరువాత కూడా శ్రీరామకృష్ణులు నన్ను మోసగాడిగా భావిస్తున్నారా? సరే, ఈ రోజే అక్కడకు ఎలాగోలా వెళ్ళి ఈ వ్యవహారం తేల్చుకొంటాను; ఆ తరువాత మరెన్నడూ కాళికాలయం వైపు ముఖం కూడా తిప్పను.’ అని రోషపడి నిరాశానిస్పృహలు, పశ్చాత్తాపం ముంచెత్తగా, నేనప్పుడు దెబ్బతిన్న అభిమానంతో దాదాపు జీవచ్ఛవంలా ఉన్నాను. ఆనాటి మధ్యాహ్నం కాళికాలయానికి వెళ్ళాను. కట్టుబట్టను చంకలో ఉంచుకొని, భావ పారవశ్యంలో తమ గదికి వెలుపల నిలబడి ఉన్న శ్రీరామకృష్ణులను దూరం నుండి చూశాను. నన్ను చూడగానే గబగబా ముందుకు వచ్చి ఇలా అనసాగారు: ‘ఓ! వివాహం చేసుకొంటే మాత్రం ఏమిటి! లక్ష వివాహాలు చేసుకొన్నా ఇక్కడి (తమ) అనుగ్రహం ఉంటే ఏ కీడు నిన్ను దరిచేరదు. సంసార జీవితం గడుపుతూ భగవత్సాక్షాత్కారం పొందగోరితే, ఒక్కసారి నీ భార్యను ఇక్కడకు తోడ్కొనిరా; సంసార జీవితాన్ని పరిత్యజించి భగవంతుణ్ణి పొందగోరితే, అదీ నీకు సాధ్యపడేలా చేస్తాను.’ అని అర్ధబాహ్య పారవశ్యస్థితిలో ఉన్న శ్రీరామకృష్ణుల ఆ వచనాలతో పోయిన నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్లయింది. వెంటనే నా నిరాశానిస్పృహలు మాయమైపోయాయి. కళ్ళవెంట అశ్రుధారలు ప్రవహిస్తూండగా ఆయన పాదాల మ్రోల వాలిపోయాను. ఆయన కూడా ఎంతో ఆప్యాయంగా నా చేయి పుచ్చుకొని గదిలోకి దారితీశారు. బాకీ పైకం సంగతి ప్రస్తావించబోయాను కాని ఆయన ఆ మాటనే వినిపించుకోలేదు”. ఇలా ఆ ఉదంతాన్ని మేము విని ఉన్నాం.
సర్వసంగ పరిత్యాగం చేసే సన్న్యాసికి ఉండే సంస్కారాలతోనే యోగీన్ జన్మించాడు. వివాహం చేసుకొన్నప్పటికీ, ఆ భావం మాత్రం కించిత్తు కూడా మార్పుకు లోనుకాలేదు. తన ఏకైక అభయప్రదాతయైన శ్రీరామకృష్ణుల సేవలోనే యోగీన్ ఎక్కువ సమయం గడపసాగాడు. తమ కుమారుడు వివాహం చేసుకొన్నా సంపాదన పట్లా, సంసారం పట్లా ఎంతో ఉదాసీనంగా వ్యవహరించడం చూసి అతడి తల్లితండ్రులు ఫిర్యాదు చేయసాగారు. యోగీన్ ఇలా చెప్పాడు : “ఒక రోజు మా అమ్మ, ‘సంపాదించాలని నీకు లేకపోతే ఎందుకు వివాహం చేసుకొన్నావు?’ అని నిలదీసి అడిగింది. అందుకు నేను, ‘నువ్వు విలపిస్తూ ఉండడం చూడలేకనే వివాహం చేసుకొంటున్నానని పదేపదే నీ కప్పుడు చెప్పాను కదా’ అని చెప్పాను. ఆ జవాబు విని ఆమె మండిపడి, ‘ఓహో! బాగానే ఉంది. లోలోపల ఇష్టం లేకపోతే నా కోసం వివాహం చేసుకొంటావా? ఎవరైనా ఈ మాట నమ్ముతారా?’ అని అడిగింది. ఆ మాటలు విని దిగ్భ్రాంతి చెంది, ‘భగవంతుడా! ఎవరి దుఃఖాన్ని చూడలేక నిన్ను సైతం విడిచిపెట్టడానికి సిద్ధమైనానో ఆమే ఇలా అంటున్నదే! ఎంత దౌర్భాగ్యం! ఒక్క గురుదేవులు తప్ప తలపులు, పలుకులు ఒక్కటే అయిన వ్యక్తులు ఈ లోకంలో మరెవరూ లేరు’ అని అనుకొన్నాను. అప్పటి నుండి ఈ లోకం పట్ల రోత పుట్టింది. నాటి నుండి రాత్రిళ్ళు కూడా గురుదేవుల వద్దే గడపసాగాను.”
43. దక్షిణేశ్వర కాళికాలయంలోనే యోగీన్ రాత్రిళ్ళు కూడా గడపడం
ఒక రోజు పగలంతా దక్షిణేశ్వర కాళికాలయంలోనే గడిపి సాయంత్రం కాగానే శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకొని భక్తులందరూ వెళ్ళిపోవడం యోగీన్ చూశాడు. దగ్గర మరెవరూ లేకపోవడం వలన శ్రీరామకృష్ణులు ఇబ్బంది పడతారేమోనని యోచించి యోగీన్ ఆ రాత్రి అక్కడే గడపదలచుకొన్నాడు. రాత్రి యోగీన్ అక్కడే గడపడం పట్ల శ్రీరామకృష్ణులు కూడా సంతోషం వెలిబుచ్చారు. ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకొంటూ రాత్రి ఎంతో పొద్దుబోవడం వారు గమనించలేదు. అప్పుడు పది గంటలు అయింది. శ్రీరామకృష్ణులు కాస్త ఉపాహారం తీసుకొన్నారు. యోగీన్ భోజనం చేశాక అతణ్ణి కూడా తమ గదిలోనే పడుకోమని చెప్పి ఆయన నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటాక ఆయన బహిర్భూమికి పోవలసి వచ్చింది. యోగీన్ వైపు చూస్తే అతడు గాఢనిద్రలో ఉన్నాడు. నిద్ర లేపితే ఇబ్బంది పడతాడేమోనని ఆయనే ఒంటరిగానే పంచవటి మీదుగా సరుగుడు తోపు వైపుకు బయలుదేరారు.
44. శ్రీరామకృష్ణుల పట్ల యోగీన్కు సంశయం కలగడం
జీవితాంతం యోగీన్ ఎంతో తక్కువ సమయం నిద్రించేవాడు. ఆ రోజు శ్రీరామకృష్ణులు గదిలో నుండి బయటకు వెళ్ళిన కాసేపటికే యోగీన్కు మెలకువ వచ్చింది. లేచి చూస్తే గది తలుపులు తెరిచి ఉన్నాయి, శ్రీరామకృష్ణులు మంచం మీద లేరు. ఇంత రాత్రివేళ ఆయన ఎక్కడకు వెళ్ళారా అని ఆశ్చర్యంలో తలమునకలయ్యాడు. ఆయన శౌచాదుల నిమిత్తం వాడే చెంబు మొదలైనవన్నీ అక్కడే ఉన్నాయి. బహుశా ఆయన ఆరుబయట పచార్లు చేస్తున్నారేమోనని యోగీన్ అనుకొన్నాడు. అప్పుడు అతడి మనస్సులో భయంకరమైన అనుమానం చెలరేగింది. “అయితే శ్రీరామకృష్ణులు నహబత్లో వసిస్తున్న తమ భార్య వద్దకు వెళ్ళారా? ఈయన కూడా చెప్పేదొకటి, చేసేది మరొకటి కోవకు చెందే వ్యక్తా?” అని సందేహించాడు.
45. యోగీన్ సందేహ నివృత్తి
“అలాంటి ఆలోచన మదిలో మెదలగానే నాలో అనుమానం, భయం తదితర భావనలు చెలరేగాయి. ఎంత అనుచితమైనా నిజాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకొన్నాను. తరువాత నేను దగ్గరలోనే ఒక చోట నిలబడి నహబత్ తలుపు వైపు చూడసాగాను. కొన్ని నిమిషాలు అలా నిలబడ్డానో లేదో పంచవటి నుండి ఎవరో నడచివస్తున్న చెప్పుల సవ్వడి వినవచ్చింది. కాసేపట్లో శ్రీరామకృష్ణులు నా ముందుకు వచ్చారు. ‘ఓ, ఇక్కడ నిలబడి ఉంది నువ్వా!’ అని ఆప్యాయంగా నన్ను పలకరించారు. ఆయన గురించి అలా అనుమానపడినందుకు సిగ్గుతో చచ్చిపోయాను, తల పైకెత్తలేకపోయాను, నోట మాట రాలేదు. నా ముఖం చూసి ఆయన అంతా అర్థం చేసుకొన్నారు. అయినా తప్పుపట్టక నన్ను అనునయిస్తూ, ‘భేష్, మంచిదే. సాధువును పగలూ పరిశీలించు, రాత్రీ పరిశీలించు. ఆ తరువాతే విశ్వసించు’ అలా అంటూ తమతో రమ్మని చెప్పి తమ గది వైపుకు నడిచారు. అనుమాన పిశాచం వాతబడి ఎంత పెద్ద అపరాధం చేశానోగదా అనే ఆలోచనలతో ఆ రాత్రి నా కిక నిద్రపట్టలేదు.”
46. గురువు పాదపద్మాలకు యోగీన్ ఆత్మసమర్పణ
స్వామి యోగానంద అలా చేసిన అపరాధానికి పూర్తి ప్రాయశ్చిత్తమే చేశాడు. అతడు సంపూర్ణంగా గురుదేవుల పాదపద్మాలకు తనను ఆత్మసమర్పణ గావించుకొన్నాడు. తన జీవితాన్నంతా, ముందుగా శ్రీరామకృష్ణుల సేవకు, ఆయన మహాసమాధి అనంతరం మాతృదేవి సేవకు అర్పించాడు. తీవ్రవైరాగ్య సంపన్నుడు, భక్తిజ్ఞానాలను సమానంగా సంతరించు కొన్నవాడు, సమాధ్యవస్థలు పొందినవాడు అయిన యోగీన్ వంటి యోగి తారసపడడం ఎంతో అరుదు. అతడు 1899 వ సం ॥ భౌతికకాయాన్ని వీడి పరమపదంలో లీనమైపోయాడు.
47. నరేంద్రుని చేతలను శ్రీరామకృష్ణులు పరిశీలించడం
నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వస్తున్నప్పటి నుండి శ్రీరామకృష్ణులు అతడి చేతలనన్నిటిని పరిశీలించేవారని ఇంతకు ముందే చెప్పుకొన్నాం. ఆ పరిశీలనల పర్యవసానంగా ధైర్యం, సాహసం, ఆత్మసంయమం, ధార్మికత పట్ల అభిలాష, ఏ సత్కార్యానికైనా ఆత్మత్యాగం చేయడం మొదలైన సద్గుణాలన్నీ నరేంద్రుడిలో స్వాభావికంగానే ప్రదీప్తమౌతున్నాయని ఆయన గ్రహించారు. శుభసంస్కారాలు అతడిలో ఎంత దృఢంగా పాదుకుపోయి ఉన్నాయంటే ఏ విపరీత పరిస్థితులలోనూ లేదా ఎలాంటి ప్రలోభంలోనూ ఇతరులలా అతడు ఎలాంటి నిమ్నకార్యానికి ఒడిగట్టలేడని కూడా శ్రీరామకృష్ణులు తెలుసుకోగలిగారు. ఇక నరేంద్రుడి సత్యనిష్ఠను గురించి చెప్పపనిలేదు. కఠోరమైన అతడి సత్యనిష్ఠను గమనించి శ్రీరామకృష్ణులు ఎంత ముగ్ధులైనారంటే నరేంద్రుడి మాటలను ఆయన అక్షరాల నమ్మేవారు. అంతేకాదు నిజం తప్ప పొరపాటుగానైనా నరేంద్రుడి నోట అసత్యం వెలువడదనీ, యాదృచ్ఛికంగా అతడి మనస్సులో మెదలే ఆలోచనలన్నీ నిజమై తీరుతాయనీ ఆయనకు ప్రగాఢ విశ్వాసం కుదిరింది. కాబట్టే ఆయన నరేంద్రుణ్ణి సదా సత్యం విషయంలో ప్రోత్సహిస్తూ ఇలా చెప్పేవారు: “త్రికరణశుద్ధిగా ఎవడు ఎప్పుడూ సత్యాన్నే అనుష్ఠిస్తూ ఉంటాడో అతడు తప్పక సత్యస్వరూపుడైన భగవంతుని సాక్షాత్కారం పొందగలడు. పన్నెండు సంవత్సరాలు త్రికరణశుద్ధిగా సత్యవ్రతాన్ని పాటించే వ్యక్తి సత్యసంకల్పుడౌతాడు” అని శాస్త్రరీత్యా వివరించి చెప్పారు.
48. ఒక తమాషా సంఘటన
నరేంద్రుని సత్యనిష్ఠ పట్ల శ్రీరామకృష్ణులకు ఏర్పడ్డ ప్రగాఢ విశ్వాసం గురించి ఒక తమాషా సంఘటన మాకు గుర్తుకు వస్తున్నది. ఒక రోజు మాటల సందర్భంలో శ్రీరామకృష్ణులు భక్తుడి నైజాన్ని చాతకపక్షితో పోల్చుతూ “చాతకపక్షి దప్పిక తీర్చుకోవడం కోసం సదా వర్షపు నీటికై ఎదురుచూస్తూ ఉంటుంది. అట్లే భక్తుడు కూడా తన హృదయ ఆవేదనను, సర్వ కామనలను తొలగింప సదా ఒక్క భగవంతుడిపై మాత్రమే ఆధారపడి ఉంటాడు” అని అన్నారు. నరేంద్రుడు అప్పుడు అక్కడే కూర్చునివున్నాడు. హఠాత్తుగా అతడు, “మహాశయా, చాతకపక్షి వర్షపు నీటిని తప్ప మరే నీటిని త్రాగదనే లోకోక్తిలో నిజం లేదు; ఇతర పక్షులలా అదీ చెరువుల, నదుల నీటిని త్రాగుతుంది. ఒక చాతకపక్షి అలా త్రాగడం కళ్ళారా చూశాను” అని అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, “అదెలా? చాతకపక్షి ఇతర పక్షులలా జలాశయాలలోని నీళ్ళను త్రాగుతుందా? అటువంటప్పుడు సుదీర్ఘకాల నా నమ్మకం వమ్ము అవుతుంది. నువ్వు స్వయంగా చూశావు కాబట్టి, దానిని గురించి నా కెలాంటి సందేహమూ లేదు” అని చెప్పారు. కాని బాలక స్వభావులైన ఆయన అలా అనడంతోనే తృప్తి చెందలేదు. చాతకపక్షిని గురించిన తన నమ్మకం వమ్ము అయింది కనుక తన ఇతర నమ్మకాలూ వమ్ము అవుతాయేమోననే ఆలోచనలోపడ్డారు. అలా ఆలోచించి ఖీన్నులయ్యారు.
ఇది జరిగిన కొన్ని రోజులకు నరేంద్రుడు ఒకరోజు హఠాత్తుగా శ్రీరామకృష్ణులను పిలిచి, “అదుగో అక్కడ చూడండి, మహాశయా! చాతకపక్షి ఎలా గంగాజలాన్ని త్రాగుతున్నదో చూడండి” అని చెప్పాడు. శ్రీరామకృష్ణులు పరుగున వచ్చి, నరేంద్రుడు చూపిన పక్షిని చూసి పకపక నవ్వారు. ఎందుకంటే అది చాతక పక్షి కాదు. మళ్ళీ నవ్వుతూ, “అది గబ్బిలం. ధూర్తుడా, గబ్బిలాన్ని చూసి చాతకపక్షిగా ఎంచి నాకెంత ఆరాటం కలిగించావు. ఇకపై నీ మాటలను ఏవీ నమ్మను” అని అన్నారు.
49. నరేంద్రుడి ఆత్మసంయమం
గౌరవం, శిష్టాచారం, సౌందర్య ప్రశంస మొదలైన ఉదాత్త ఉద్వేగాల ప్రేరణతో స్త్రీలను చూసినప్పుడు పురుషుల మనస్సు మెత్తబడడం సహజమే. కాని అందుకు కారణం ఆ ఉదాత్త భావప్రేరణ కాదనీ, సూక్ష్మమైన కామ సంస్కారాలనీ శాస్త్రాలు వచిస్తున్నాయి. అటువంటి సంస్కా రాలూ, అభివ్యక్తీకరణలూ నరేంద్రుడిలో పూర్తిగా లుప్తం. అది గుర్తించి శ్రీరామకృష్ణులు ఉప్పొంగిపోయారు. స్త్రీ అందచందాలకు ఏనాడూ నరేంద్రుడు ఆకర్షితుడు కాడనే ప్రగాఢ నమ్మకం శ్రీరామకృష్ణులలో పాదుకుపోయింది. తరచు భావసమాధులు పొందుతూండడం వల్ల మేమెంతో గౌరవం చూపే ఒక భక్తుడితో* నరేంద్రుణ్ణి పోలుస్తూ, ఒకరోజు శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు : “స్త్రీలు ఒలకబోసే హొయల ముందు ఇతడు మైమరచిపోతాడు. కాని నరేంద్రుని విషయం తద్విరుద్ధం. అతణ్ణి నేను సునిశితంగా గమనించాను. అటువంటి పరిస్థితుల్లో ముఖం త్రిప్పేసుకొని, ‘వీళ్ళు (స్త్రీలు) ఎందుకు ఇక్కడున్నారు?’ అని పెడముఖంగా ఉంటాడు.”
50. నరేంద్రునిలో భౌతిక లక్షణాలను చూసి భక్తి తీవ్రతను గుర్తించడం
జ్ఞానం, పురుషత్వం నరేంద్రునిలో అధికంగా అభివ్యక్తమై ఉన్నప్పటికీ కోమలత్వానికి, భక్తిభావానికి కొదవ లేదని అనేక సందర్భాలలో శ్రీరామకృష్ణులు వచించడం కద్దు. నరేంద్రుడి సామాన్య చేతల ద్వారా అభివ్యక్తమయ్యే మానసిక స్థితులను, శారీరక లక్షణాలను పరిశీలించి ఆ తరువాతే ఆయన ఆ నిర్ణయానికి వచ్చారు. నరేంద్రుని ముద్దుగొలిపే ముఖ కవళికలను పరిశీలిస్తూ ఒక రోజు శ్రీరామకృష్ణులు, “శుష్క జ్ఞానం గల వ్యక్తికి ఎక్కడన్నా ఇటువంటి కళ్ళు ఉంటాయా? జ్ఞానంతో పాటు స్త్రీకి స్వాభావికమైన భక్తిభావం కూడా నీలో ఉంది. ఎవరిలో కేవలం పుంభావం మాత్రమే ఉంటుందో వారి వక్షపు మొనల చుట్టూ నలుపు మచ్చ ఉండదు. మహావీరుడైన అర్జునుడికి ఆ నలుపు మచ్చ లేదు” అని నరేంద్రుడితో చెప్పడం మాకు జ్ఞాపకం.
51. శ్రీరామకృష్ణుల ఉదాసీన వైఖరిపట్ల నరేంద్రుని స్పందన
పైన ప్రస్తావించిన నాలుగు పద్ధతులలోనే కాక మాకు తెలిసిన, తెలియని ఇతర రీతులలో కూడా శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి పరీక్షించారు. వాటిలో ఒకటి లేదా రెండు ముఖ్యమైన వాటిని ఇప్పుడు పాఠకులకు తెలుపనున్నాం. నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులు అధిక సమయం అతడితోనే గడిపేవారని ఇంతకు మునుపే తెలిపి ఉన్నాం. నరేంద్రుడు దూరంగా కనబడగానే శ్రీరామకృష్ణుల మనస్సు తమ శరీరాన్ని విడిచి పరుగెత్తుకొని వెళ్ళి అతణ్ణి ప్రియాలింగనం చేసుకొనేదని చెప్పడం అతిశయోక్తి కాబోదు. నరేంద్రుణ్ణి చూసిన తక్షణం, “అదుగో న…., అదుగో న….” అంటూ శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో మగ్నులైపోవడం మేం ఎన్నిసార్లు చూశామో చెప్పడం కష్టం. కాని ఆ పరిస్థితికి ఒక అంతరాయం ఏర్పడింది. ఒక దశలో శ్రీరామకృష్ణులు అతడి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం కానవచ్చింది. మామూలుగానే ఒక రోజు నరేంద్రుడు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఆయన ముందు కూర్చుని, చాలాసేపు ఎదురుచూశాడు. కాని శ్రీరామకృష్ణులు కనీసం అతడి క్షేమం గురించి కూడా విచారించక పూర్తిగా ఉదాసీనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు బహుశా ఆధ్యాత్మిక భావోద్వేగంలో ఉన్నారేమోనని నరేంద్రుడు అనుకొన్నాడు. చాలాసేపు అలా నిరీక్షించి, చివరకు గది బయటకు వచ్చి హాజ్రాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ పొగత్రాగసాగాడు. ఇంతలో శ్రీరామకృష్ణులు ఇతరులతో మాట్లాడడం వినిపించి నరేంద్రుడు మళ్ళీ గదిలోకి వచ్చి ఆయన వద్ద కూర్చున్నాడు. కాని శ్రీరామకృష్ణులు మాత్రం అతడితో ఒక్కమాట కూడా మాట్లాడక మంచం మీద అటువైపు తిరిగి పడుకొన్నారు. ఆ పగలంతా అలాగే గడిచిపోయి, సాయంత్రం కాసాగింది. అయినప్పటికీ శ్రీరామకృష్ణుల వైఖరిలో ఎలాంటి మార్పు నరేంద్రుడికి కనిపించలేదు. కాబట్టి ఆయనకు ప్రణామం చేసి కలకత్తాకు తిరిగి వెళ్ళిపోయాడు.
మళ్ళీ ఒక వారం తిరక్కుండానే నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చాడు. శ్రీరామకృష్ణుల ఉదాసీన వైఖరి అట్లే ఉండడం గమనించాడు. ఆ రోజు కూడా అతడు హాజ్రా, తదితరులతో పిచ్చాపాటీ మాట్లాడుతూ రోజంతా గడిపి, సాయంత్రం కాగానే ఇంటికి బయలుదేరాడు. నరేంద్రుడు మూడవసారి, నాలుగవసారి దక్షిణేశ్వరానికి వచ్చాడు కాని శ్రీరామకృష్ణుల నిర్లిప్త వైఖరిలో మార్పు ఏమీ అతడికి కనిపించలేదు. అయినప్పటికీ ఆ ఉదాసీన ధోరణికి అతడు బాధపడలేదు. మామూలుగానే శ్రీరామకృష్ణుల వద్దకు వస్తూనే ఉన్నాడు. నరేంద్రుడు ఇంటి వద్దే ఉంటున్నప్పుడు, శ్రీరామకృష్ణులు ఎవరినో ఒకరిని పంపి అతడి క్షేమ సమాచారం తెలుసుకొనేవారు. కాని అతడు తమ వద్దకు వచ్చినప్పుడు మాత్రం ఎప్పటిలా తమ ఉదాసీన వైఖరిని కొనసాగించసాగారు. ఇలా ఒక నెల గడిచింది. అయినా తమ ఈ నిర్లక్ష్య ధోరణి కారణంగా నరేంద్రుడు రావడం మానుకోక పోవడం గమనించారు శ్రీరామకృష్ణులు. ఒక రోజు అతణ్ణి పిలిచి “సరే, నేను ఒక్క మాట కూడా నీతో మాట్లాడటంలేదు. అయినప్పటికీ నువ్వు ఇక్కడకు వస్తూనే ఉన్నావు. ఎందుకు అలా చేస్తున్నావు?” అని అడిగారు. అందుకు నరేంద్రుడు, “మీతో మాట్లాడడం కోసమా నే నిక్కడకు వస్తున్నాను? మీ రంటే నా కెంతో ఇష్టం. మిమ్మల్ని చూడగోరే నే నిక్కడికి వస్తున్నాను” అని జవాబు చెప్పాడు. ఆ జవాబుతో శ్రీరామకృష్ణులు ఎంతో ప్రసన్నులై “నిన్ను సరిగా ఆదరించకుంటే రావడం మానివేస్తావేమోనని నిన్ను పరీక్షించాను. ఇంతటి ఉదాసీన వైఖరిని, అనాదరణను సహించడం నీ వంటి ఉన్నతస్థాయి ఆధ్యాత్మిక సాధకుడికే చెల్లింది. మరొకరైతే ఎప్పుడో వదలిపెట్టేసేవారు, మళ్ళీ ఎన్నడూ ఇటు తొంగి చూసేవారే కాదు” అని ప్రశంసించారు.
52. భగవత్ సాక్షాత్కారం పొందగోరి, నరేంద్రుడు అతీంద్రియ శక్తులను త్యజించడం
మరో సంఘటన గురించి ప్రస్తావించి ఈ అధ్యాయాన్ని ముగిస్తాం. భగవత్ సాక్షాత్కారార్థం నరేంద్రుడి హృదయం ఎంత ఆవేదన చెందిందో ఈ సంఘటన నుండి చక్కగా అవగతమౌతుంది. ఒక రోజు శ్రీరామకృష్ణులు, నరేంద్రుణ్ణి పంచవటి వైపుకు తోడ్కొని వెళ్ళి, అతడితో “సుదీర్ఘకాల తపస్సు ఫలితంగా అణిమాది అష్టసిద్ధులు నాకు లభించాయి. కాని కట్టుబట్ట ఉందో లేదో అనే ఎరుకేలేని నా వంటి వ్యక్తికి ఆ సిద్ధులను ఉపయోగించే సందర్భమూ, అవకాశమూ ఎక్కడుంది? కాబట్టి అమ్మతో చెప్పి ఆ సిద్ధులన్నింటినీ నీకు ఇప్పించాలని అనుకొంటున్నాను. ఎందుకంటే, ఆమె పనిని నువ్వు ఎంతో చేయవలసి ఉందని ఆమె స్వయంగా నాతో చెప్పింది. ఆ శక్తులన్నీ నీకు దత్తమైతే, అవసరమైనప్పుడు ఉపయోగించుకోగలుగుతావు. మరి నువ్వేమంటావు?” అని అడిగారు. శ్రీరామకృష్ణులను దక్షిణేశ్వరంలో మొట్ట మొదటిసారి చూసిన నాటి నుండి అనంతమైన దివ్యశక్తి ఆయనలో అభివ్యక్తమౌతూ ఉందన్న విషయం నరేంద్రుడికి అనుభవైకవేద్యమే. అందువలన ఆయన ఈ వచనాలను నమ్మక పోవడానికి ఎలాంటి కారణమూ నరేంద్రుడికి లేదు. కాని అతడి హృదయంలో గుప్తమై ఉన్న భగవద్భక్తి ఏ వివేచనా చేయకుండా ఆ శక్తులను స్వీకరింప సమ్మతించలేదు. నరేంద్రుడు కాసేపు తీవ్రంగా ఆలోచించి, “మహాశయా! ఆ శక్తులు భగవత్సాక్షాత్కారానికి నాకు దోహదం చేస్తాయా?” అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, “ఆ విషయంలో సహాయం చేయలేవు. కాని భగవత్సాక్షాత్కారం పొందిన తరువాత, జగజ్జనని పనులు నిర్వర్తిస్తున్నప్పుడు అవి నీకు బాసటగా ఉంటాయి” అని చెప్పారు. ఆ మాటలు విని నరేంద్రుడు “అలా అయితే మహాశయా, వాటి అవసరం నాకు లేదు. ముందు భగవత్సాక్షాత్కారం పొందనివ్వండి. ఆ తరువాత వాటిని స్వీకరించాలో వద్దో నిర్ణయించుకొంటాను. ఆ అద్భుత శక్తులను ఇప్పుడే పొందితే, నా లక్ష్యాన్నే విస్మరించి, స్వార్థపరుడనై వాటిని అనుచితంగా ఉపయోగిస్తే సర్వనాశనమైపోవడం తథ్యం” అని వాటిని తిరస్కరించాడు.
అణిమాది అష్టసిద్ధులను శ్రీరామకృష్ణులు నిజంగానే నరేంద్రుడికి ప్రసాదించ దలచుకొన్నారో లేక అతణ్ణి పరీక్షించే ఉద్దేశంతో అలా అడిగారో ఇతమిత్థంగా చెప్పడం కష్టం. కాని నరేంద్రుడు వాటిని నిష్కర్షగా తిరస్కరించడం పట్ల శ్రీరామకృష్ణులు ఎంతో ప్రసన్నులయ్యారని మాత్రం కచ్చితంగా చెప్పగలం.