1. శ్రీరామకృష్ణుల జీవితంలో దివ్యభావం
1873 వ సంవత్సరంలో షోడశీపూజ నిర్వర్తించి తమ సాధనలకు శ్రీరామకృష్ణులు భరతవాక్యం పలికారని ఇంతకు మునుపే తెలిపివున్నాం. ఆనాటి నుండి దివ్యభావ ప్రేరణతో తమ విధులన్నీ ఆయన నిర్వర్తించారని చెప్పడం సబబు కాదు. అప్పుడు ఆయన వయస్సు ముప్ఫై ఎనిమిదేళ్ళు. కాబట్టి ఆ దివ్యభావం ఆయన జీవితంలో పన్నెండేళ్ళ* కంటే కాస్త ఎక్కువకాలం కొనసాగింది. ఈ కాలంలో జగజ్జనని సంకల్పంతో ఆయన చేతలన్నీ కొంగ్రొత్త అసాధారణ లక్షణాన్ని సంతరించుకొన్నాయి. ఆ సంకల్ప ప్రేరణతో, ఆధునిక పాశ్చాత్య విధానంలో విద్యావంతులైన వారికి మతం, ఆధ్యాత్మికతలను అందించడంలో తన మనస్సును లగ్నం చేశారు. కాబట్టి పన్నెండేళ్ళ ఆధ్యాత్మిక సాధనా కాలంలో శ్రీరామకృష్ణులు ఆరేళ్ళు తాము సముపార్జించిన శక్తిని స్వయంగా తెలుసుకొంటూ, జనసామాన్యం ఆధ్యాత్మిక స్థితిని గ్రహిస్తూ గడిపినట్లు స్పష్టమౌతుంది. ఆ తరువాత సాటిలేని శక్తితో సనాతన ధర్మ పునఃస్థాపన కార్యంలో నిమగ్నులైనారు; పాశ్చాత్య భావాల, ఆదర్శాల ప్రగాఢ ప్రేరణతో మతం పతనం చెందడాన్ని అరికట్టగలిగారు. తమ ఈ కార్యాన్ని పూర్తిచేసి శ్రీరామకృష్ణులు ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఈ దివ్య కార్యాన్ని ఎలా నిర్వర్తించారో మా శక్తి మేరకు పొందుపరచనున్నాం.
2. దివ్యభావ ఆరంభం ఎలా గుర్తించబడింది
మేం ఇంతకు మునుపు చెప్పిన దాని నుండి పాఠకుడు, ముప్ఫై తొమ్మిదవ సంవత్సరం వరకు శ్రీరామకృష్ణులు, ఆధ్యాత్మిక సాధకుడు మాత్రమే అని భావించవచ్చు. కాని అది నిజం కాదు. మానవాళిని ఆధ్యాత్మిక మహాసత్యాలను అనుభూతం చేసుకోవడంలో పురోగమింప చేసిన లోకారాధకులైన జగద్గురువులలో, ప్రవక్తలలో, మత వ్యవస్థాపకులలో చిన్ననాటి నుండే జగద్గురువు లక్షణాలు అభివ్యక్తీకరించాయని ఈ పుస్తకం మూడవ విభాగంలో మేం విశదీకరింప ప్రయత్నించాం. శ్రీరామకృష్ణులలో కూడా ఆ జగద్గురువు లక్షణాలు ఆయన జీవితంలో బాల్యంతో సహా అన్ని దశలలోను అభివ్యక్తమవడం మనం చూడవచ్చు. ఈ లక్షణాల ప్రేరణతో తమ సాధన కాలంలో ఆయన అనేక కార్యాలను నిర్వర్తించడం మనం చూసివున్నాం. కాని తమ ముప్ఫై రెండవ ఏట సాధనలు పూర్తి చేసిన నాటి నుండి ఆయన దాదాపు ప్రతి పనిని ఈ ప్రేరణతో చేయడం మనం చూడవచ్చు. మథుర్బాబుతో తీర్థ యాత్రలు చేసినప్పుడు, ఆ తరువాత ఆయన చేతలన్నిటిలోను దీనిని మనం గమనించవచ్చు. ఆయనలో దివ్యభావ అభివ్యక్తీకరణ 1875 వ సం ॥ ప్రారంభమై, నిజమైన ఆధ్యాత్మిక ప్రచారానికి ఉపక్రమించారని చెప్పడానికి కారణం : అంతకు మునుపు ఆ దివ్యభావం పూర్తిగా లేదని కాదు; కాని అప్పటి నుండి ఆ దివ్యభావం అవిరామంగా ప్రవహించి, ఆయన జీవితోద్యమం స్పష్టంగా కచ్చితంగా అభివ్యక్త మైంది. అప్పటి నుండి పాశ్చాత్య భౌతికవాదం, భౌతికశాస్త్రంపై ఆధారపడ్డ సంస్కృతీ నాగరకతల పట్ల విరుద్ధ వైఖరిని ఆయన అవలంబించడం మనం చూడవచ్చు. ఆ భౌతికవాదం భారతదేశంలో చొరబడి ప్రతి వ్యక్తిని సనాతన ధర్మానికి విరుద్ధమైన జీవన వైఖరిని అవలంబించేలా చేయడమూ, వారిని ఆధ్యాత్మిక విలువల నుండి వైదొలగేలా చేయడమూ శ్రీరామకృష్ణుల పై వైఖరికి కారణాలుగా పేర్కొనవచ్చు. కాబట్టి ఆంగ్లేయ విధానంలో విద్యనభ్యసించిన వారికి నిజమైన ఆధ్యాత్మికతను బోధించి, తమ మార్గదర్శకత్వంలో సామాన్యజనుల జీవితాలలో దివ్యజ్యోతిని ప్రసరింప ఆయన హృదయపూర్వకంగా నిమగ్నులైనారు.
3. శ్రీరామకృష్ణులు, వారి దివ్యభావం ద్వారా పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం నుంచి భారతదేశానికి విముక్తిని కలిగించారు
అట్టి కార్యభారాన్ని వహించడానికి అత్యంత ఆవశ్యకత తలెత్తిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భగవత్సంకల్పం, దివ్యభావంలో నెలకొనివున్న శ్రీరామకృష్ణుల అసాధారణ ఆధ్యాత్మిక శక్తి తోడ్పాటు లేకుండా ఉంటే భారత జాతీయ ప్రత్యేకత, సనాతన ధర్మం తుడిచిపెట్టుకుపోయి ఉండేవనడం అతిశయోక్తి కాదు. కాస్త లోతుగా చూసినప్పుడు శ్రీరామకృష్ణులు అన్ని మత సంప్రదాయ సాధనాదులు అనుష్ఠించి తత్ఫలితంగా ఆవిష్కరించిన ‘మతాలెన్నో మార్గాలన్ని’ అనే మహోత్తమ సత్యం పాశ్చాత్య ఆశయాల ఆదర్శాల మోహాంధకారంలో పడివున్న జనానీకానికి వెలుగు చూపి మళ్ళీ వారిని సనాతన ధర్మానికి తిరిగి వచ్చేలా చేయడం మనం గ్రహించవచ్చు. ఆ విధంగా పాశ్చాత్య వెల్లువకు అడ్డుకట్ట పడింది, సనాతన ధర్మం పునః ప్రతిష్ఠించబడింది; భారతదేశం ఘోర దుర్ఘటన నుండి కాపాడబడింది. ఇక్కడే ఆయన జీవితోద్దేశాలు రెండు విధాలుగా నెరవేర్చినట్లు స్పష్టంగా నిరూపణమౌతుంది. మొదటిది, ప్రపంచంలోని మతాలన్నిటిని భారతదేశ సనాతన ధర్మమనే త్రాటిపైకి తీసుకువచ్చి, ఆ మతాలన్నీ సంపూర్ణ సత్యాలని నిరూపణ చేశారు; ఆ మతాలను అనుసరించే స్త్రీ పురుష సముదాయాల అభిరుచి, సంస్కారాలను బట్టే అవి విభిన్నాలుగా ఉన్నాయని ప్రకటించారు. రెండవది, భారతదేశ ఆత్మయైన శాశ్వత శాంతి, సౌహార్దం పాశ్చాత్య భౌతికవాదమనే సుడిగుండంలో పడి కొట్టుకొనిపోకుండా పరిరక్షించారు. భారతదేశంలో పాశ్చాత్య విద్యావిధానాన్ని 1836 లో ప్రవేశపెట్టారు. అదే సంవత్సరంలో శ్రీరామకృష్ణులూ జన్మించారు. ఇక్కడొక విచిత్రం మనకు అవగతమవుతుంది. భారతీయ సంస్కృతీ నాగరికతలను పెకలించివేసే పాశ్చాత్య విద్యావిధాన విజృంభణ ప్రారంభం, ఆ విద్యావిధానం కల్పించే కీడులను తొలగించి ఆ స్థానే భారతీయ విలక్షణ సంస్కృతిని పాదుగొలిపే ప్రయత్నారంభం ఏకకాలంలో సంభవించడమే ఆ విచిత్రం.
4. మానవ జీవితంలో దివ్యభావం ఎప్పుడు జనిస్తుంది
మానవ జీవితంలో ఆధ్యాత్మిక సాధనకు చరమరంగమైన పరిపూర్ణ దివ్యభావ సాక్షాత్కారం ఎంతో అరుదుగా కానవస్తుంది. జీవుడు, కర్మ బంధనాల నుండి భగవంతుని అనుగ్రహం వలన ముక్తుడైనప్పుడు ఆ భావాన్ని కించిత్తు చవిచూస్తాడు. ఒక వ్యక్తి (అంటే జీవుడు లేదా బంధనంలోని జనిస్తుంది ఆత్మ) బాహ్య అంతరేంద్రియాల నియంత్రణ, ఊపిరి తీసుకొన్నంత స్వతఃసిద్ధమూ, సులుమా అయినప్పుడు; ఆ పరమాత్మ ప్రేమలో తన గుర్తింపును కోల్పోయి ‘నేను’ అనే చైతన్యం శాశ్వతంగా సచ్చిదానందసాగరంలో విలీనం అయిపోయినప్పుడు; నిర్వికల్ప సమాధిలో మనోబుద్ధులు అన్ని రకాల మాలిన్యాలను వదలించుకొని శుద్ధసత్త్వరూపాలను సంతరించుకొన్నప్పుడు; దివ్యజ్ఞానాగ్నిచే మనస్సులోని కోర్కెల పరంపర దగ్ధమై, క్రొత్త సంస్కారాలూ కర్మఫలాలూ ఇకపై తలెత్తనప్పుడు మాత్రమే దివ్యభావ మధురలీల ప్రారంభమౌతుంది, అతడి జీవితం తరిస్తుంది. పరిపూర్ణ దివ్యభావ అభివ్యక్తీకరణ పొంది అనవరతం శాంతి, సంతృప్తులతో జీవితం ధన్యం చేసుకొన్న వ్యక్తిని కలుసుకొనే అవకాశం ఎంతో అరుదుగా గాని లభించదు. పైగా ఆకాంక్షారహితమూ, ఉద్దేశరహితమూ అయిన అటువంటి వ్యక్తి చేతలు సామాన్యుల మనోబుద్ధులకు ఎన్నటికీ గ్రాహ్యం కావు. కాబట్టి దివ్యభావంలో సుప్రతిష్ఠితుడైన వ్యక్తి మాత్రమే ఆ భావపు యథార్థ నైజాన్ని అవగతం చేసుకోగలడని చెప్పక తప్పదు. ఆ భావ ప్రభావంలో నిర్వర్తించే అసాధారణ చేతల నిజమైన ప్రాధాన్యతను మనబోటి మనోబుద్ధులు గలవారు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు; వారిని ప్రగాఢ భక్తి విశ్వాసాలతో కొలిచినప్పుడు మాత్రమే వారి చేతలు గ్రాహ్యమౌతాయి.
5. అవతార పురుషుల దివ్యభావాన్ని అవగతం చేసుకోవడంలోని క్లిష్టత
దివ్యభావ సమగ్ర అభివ్యక్తీకరణను అవతారపురుషులలో మాత్రమే కాంచగలం. ఇందుకు ప్రపంచ మతచరిత్రే తార్కాణం. అవతారపురుషులు సదా మనకు నిగూఢంగా కానరావడానికి కారణం అదే. ఊహ సహాయంతో మాయకు అతీతమైన బ్రహ్మజ్ఞాన స్థితి పాక్షిక చిత్రాన్ని గీయడం సాధ్యమే. దివ్యభావంలో స్వతఃసిద్ధంగా సుప్రతిష్ఠితులైన వ్యక్తుల చేతల, ఉద్దేశాలను కించిత్తు కూడా అవగతం చేసుకోవడం మనకు మించిన పని; కొన్ని సమయాలలో వారు మనలా తమ లక్ష్య సాధనకు ఎంతో శ్రమిస్తారు; కొన్ని సందర్భాలలో భగవంతునిలా అపారశక్తి సమన్వితులై అద్భుత కార్యాలను అలవోకగా చేస్తారు; దీనిని వివరించడం మనకు సాధ్యం కాదు. ‘ఎలా’ అన్నది ఒక మర్మంగానే మిగిలిపోతుంది. మూర్ఖంగా మనం వారి నిగూఢ చేతల లోతులను ఆరాతీయ ప్రయత్నిస్తే మన తర్కమే కాదు, ఊహ కూడా స్తబ్ధమౌతుంది. కాబట్టి ఈ సమయంలో శ్రీరామకృష్ణుల చేతలను తర్కబద్ధంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదని చెప్పడం అనవసరం. కనుక ఆ దివ్యభావ ప్రభావంలో ఆయన నిర్వర్తించిన కార్యాలను సాధ్యమైన మేరకు పేర్కొనడం మాత్రం చేయవచ్చు; ఆయన చేతలు, బోధనలు ఫలవంతమై వాటి ప్రాధాన్యత సుస్పష్టమైన నాడు వాటి ఉద్దేశాల గురించిన నిర్ణయానికి మీరే రాగలుగుతారు. సామాన్యంగా మనం ఒక కారణాన్ని దాని పరిణామాలను బట్టే అంచనా వేస్తాం. పరిణామం పెద్దదైనప్పుడు ఆ కారణం కూడా పెద్దదే అయివుంటుంది. కాబట్టి ఆ కాలఘట్టంలో ఆయన అసాధారణ చేతల గురించి లోతుగా ఆలోచిస్తే ఆయన మనశ్శరీరాల ద్వారా దివ్యభావం అభివ్యక్తమౌతూ ఉందనే మనం విశ్వసించవలసి ఉంటుంది.
6. శ్రీరామకృష్ణుల దివ్యభావంలోని ఏడుదశలు
దివ్యభావంలో సుప్రతిష్ఠితులై ఉన్న శ్రీరామకృష్ణుల చేతలన్నీ సనాతన ధర్మాన్ని సుస్థాపితం చేయడానికే అయినప్పటికీ, వాటిని కచ్చితంగా ఏడు తరగతులుగా వర్గీకరించవచ్చు. మొదటిది: తమ సతీమణి శారదాదేవి ఆధ్యాత్మిక జీవితాన్ని అసాధారణ రీతిలో తీర్చిదిద్ది, ఆమెను ఒక ఆధ్యాత్మిక శక్తికేంద్రంగా రూపొందించారు.
రెండవది: సమాజాన్ని ప్రభావితం చేసే, గొప్ప ఆదర్శాలను పాటించే సమకాలీన కలకత్తా ధార్మిక నాయకులనందరినీ ఆయన కలుసుకొన్నారు; వారి ఆధ్యాత్మిక జీవితాలను సుసంపన్నం చేయడంలో తమ ఆధ్యాత్మిక శక్తిని వినియోగించి, తోడ్పడ్డారు.
మూడవది: ఆ సమయంలో దక్షిణేశ్వరానికి వచ్చిన అన్ని సంప్రదాయాల వారి ఆధ్యాత్మిక దప్పికను ఆయన తీర్చారు.
నాల్గవది: తమ వద్దకు వచ్చిన భక్తులలో కొందరిని, తాము ఇంతకు మునుపే దివ్యదర్శనాలలో గాంచిన వారిని, తమ దివ్యోద్యమంలో సహచరులుగా జగజ్జనని ప్రత్యేకంగా గుర్తించిన వారిని, సామర్థ్యం మేరకు వర్గీకరించి, వారి ఆధ్యాత్మిక జీవితాలను తీర్చిదిద్దారు.
ఐదవది: వారిలో కొందరికి సన్న్యాసదీక్ష నొసగారు; ఆ విధంగా తమ కొంగ్రొత్త మహోదార ఆధ్యాత్మిక సిద్ధాంతాల ప్రచారానికి ఒక సౌభ్రాతృత్వాన్ని స్థాపించారు.
ఆరవది: కలకత్తా వాస్తవ్యులైన తమ భక్తుల ఇళ్ళను పదేపదే పావనం చేసి, ఆధ్యాత్మిక సంభాషణల, ఉపాన్యాసాది సేవల ద్వారా ఆ భక్తుల కుటుంబ సభ్యులలో, వారి ఇరుగుపొరుగు వారిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేశారు.
ఏడవది: అద్భుత ప్రేమానురాగాలతో తమ భక్తులను ముడివేసి వారి మధ్య హార్దిక అనుబంధాన్ని కల్పించారు; ఫలితంగా ఆ భక్తులు క్రమంగా ఉదార ఆధ్యాత్మిక సౌభ్రాతృత్వాన్ని సంతరించుకొన్నారు.
రెండవ విభాగం చివరన శ్రీరామకృష్ణులు 1874 లో పైన పేర్కొన్న ఏడు కార్యాలలో మొదటి దానిని ఎలా ఆచరించారో పాఠకులకు వివరించి ఉన్నాం. అదే విభాగం అనుబంధంలో 1875 లో బ్రహ్మసమాజ నాయకుడైన కేశవచంద్రసేన్ వద్దకు వెళ్ళి తన రెండవ కార్యాచరణను ఎలా పూర్తిచేశారో చర్చించాం. మళ్ళీ నాలుగవ విభాగంలోని 5, 6, 7 అధ్యాయాలలో పైన పేర్కొన్న మూడు, నాలుగు, ఆరవ కార్యాచరణల గురించి సూచనప్రాయంగా తెలిపివున్నాం. మిగిలిన అయిదు, ఏడవ కార్యాచరణలను శ్రీరామకృష్ణులు ఎప్పుడు, ఎక్కడ పూర్తిచేశారో ఇకముందు చూడబోతున్నాం.