అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ ।
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ॥
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥ – భగవద్గీత 4-6, 7, 8
నేను పుట్టుకలేని వాణ్ణి, అవ్యయుణ్ణి, సమస్త ప్రాణులకు ఈశ్వరుణ్ణి; అయినప్పటికీ స్వకీయ ప్రకృతిని లోబరచుకొని నా మాయ సహాయంతో అవతరిస్తూంటాను.
ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి, అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడల్లా నేను దేహం దాల్చి అవతరిస్తాను.
సాధు రక్షణార్థం, దుష్ట శిక్షణార్థం, ధర్మ సంస్థాపనార్థం నేను ప్రతి యుగంలోను ఉద్భవిస్తూ ఉంటాను.
1. బ్రహ్మజ్ఞానిని సర్వజ్ఞుడని వేదాలు పేర్కొంటాయి
బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి (బ్రహ్మజ్ఞాని) సర్వజ్ఞుడౌతాడని వేదాలూ, ఇతర శాస్త్రాలూ నొక్కివక్కాణిస్తున్నాయి. సామాన్యులలో మాదిరి బ్రహ్మజ్ఞానుల మనస్సులలో కృత్రిమ ఆలోచనలు ఏనాడూ ఉదయించవు. ఏ విషయం గురించియైనా తెలుసుకోవాలని, అవగతం చేసుకోవాలని వారు ఆశించగానే, తక్షణమే వారి అంతర్దృష్టికి అది సుస్పష్టమౌతుంది, అంటే దాని తత్త్వం వారికి విశదమౌతుంది. పై వేదవచనం వినగానే, దానిని మేం అవగతం చేసుకోలేకపోయాం; అందువలన దానిని ప్రతిఘటించాం, దాని యథార్థ భావాన్ని తెలుసుకోవాలనే లక్ష్యం లేనందున ఆ వేద దృక్పథానికి విరుద్ధంగా అనేక వాదాలు లేవనెత్తాం. “అదే నిజమైతే, భారతదేశ గత యుగాలనాటి బ్రహ్మజ్ఞానులు భౌతికశాస్త్రాల గురించి అంతగా అజ్ఞులై ఎందుకు ఉండిపోయారు. ఉదజని (హైడ్రోజన్), ఆమ్లజని (ఆక్సిజన్) వాయువుల సమ్మేళనం నీటిని ఉత్పన్నం చేస్తుందని ప్రాచీన భారతదేశంలోని ఏ బ్రహ్మజ్ఞానికైనా తెలుసా? విద్యుచ్ఛక్తి సహాయంతో (టెలిగ్రాఫ్, 1911) ఆరు నెలలు ప్రయాణంచేసిగాని (ఓడలో) చేరుకోలేని అమెరికా నుండి వార్తలను నాలుగైదు గంటలలో అందుకోవచ్చుననే విషయం ఆ బ్రహ్మజ్ఞానులు ఎవరూ ఎందుకు చెప్పిపోలేదు? లేదా విమానంలో మనిషి పక్షిలా ఆకాశంలో ఎగురుతూ పయనించగలడనే విషయం వారికెందుకు తెలియలేదు?” అని మేం వాదించే వారం.
2. వేదవచనాలు ఏ విధంగా సత్యాలన్న దానికి శ్రీరామకృష్ణుల వివరణ
శాస్త్రోక్తులకు పై విధంగా భాష్యం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే అవి అర్థహీనాలైపోతాయని శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చినప్పుడు మేం తెలుసుకొన్నాం. శాస్త్రభావం వేరు; శాస్త్రాలను ఆ వెలుగులో అధ్యయనం చేయకుంటే, వాటి యథార్థమైన అర్థాన్ని తెలుసుకోలేం. ఒకటి రెండు గ్రామీణ జీవన ఉదాహరణాలతో శ్రీరామకృష్ణులు శాస్త్ర వచనాల అర్థాన్ని విశదీకరించారు. ఆయన ఇలా చెప్పారు : “కుండలో అన్నం ఉడుకుతున్నది అనుకొందాం. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకుని చూస్తాం. వెంటనే అన్నం అంతా ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఎలా? అన్ని మెతుకులను పట్టుకొని చూడలేదు గదా! అటువంటప్పుడు నువ్వు ఈ నిర్ణయానికి ఎలా రాగలిగావు? అదే విధంగా ఈ ప్రపంచంలోని ఒకటి రెండు వస్తువులను పరిశీలించినప్పుడు ఈ యావత్తు జగత్తు నిత్యమో, అనిత్యమో, సత్యమో లేదా అసత్యమో తెలిసిపోతుంది. మనిషి పుడతాడు, కొంతకాలం జీవిస్తాడు, పిదప మరణిస్తాడు; ఆవు విషయంలో కూడా అదే నిజం వర్తిస్తుంది. ఈ విధంగా కొన్నిటిని పరిశీలించినప్పుడు నామ రూపాలు గల ప్రతిదీ ఈ నియతినే అనుసరిస్తుందని తేటతెల్లమౌతుంది. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు – వీటన్నిటికీ నామరూపాలున్నాయి. కనుక ఇవి కూడా అదే స్వభావం గలవి. ఈ విధంగా ఈ జగత్తులోని సమస్త వస్తువులూ ఇటువంటి స్వభావం గలవే అని తెలుసుకోగలవు. అప్పుడు నీకు లోకంలోని ప్రతి వస్తువు స్వభావం తెలియవస్తుంది కదా! ఈ ప్రపంచం (సంసారం) అనిత్యం, అసత్యం అని ఎప్పుడు నువ్వు తెలుసుకొంటావో అప్పుడిక దానిని నువ్వు ప్రేమించలేవు; మనస్సులో నుండి దాని ధ్యాసను వదలిపెట్టి, కోర్కెల నుండి విడివడతావు. అలా వాటిని నువ్వు పరిత్యజించిన మరు నిమిషమే జగత్కారణుడైన భగవంతుని అనుభూతి నీకు కలుగుతుంది. ఎవరికి ఇలా భగవత్సాక్షాత్కారం కలుగుతుందో అతడు సర్వజ్ఞుడు కాక మరేమౌతాడో చెప్పండి?”
3. ఒక వస్తువు ఆద్యంతాలు తెలుసుకోవడమే ఆ వస్తువును గురించి సమగ్రంగా తెలుసుకోవడమౌతుంది
శ్రీరామకృష్ణులు ఇలా విశదీకరించిన తరువాత మేం ఇలా అనుకొన్నాం: ‘ఆయన వచించింది నిజమే కదా! ఒక విధంగా చూస్తే భగవదనుభూతి పొందిన వ్యక్తి సర్వజ్ఞుడే కదా! ఒక వస్తువు ఆది మధ్య అంతాలను చూడగలగడం, ఆ వస్తువును గురించిన జ్ఞానమని మనం పేర్కొంటాం. కాబట్టి ఈ రీతిలో జగత్తును గురించి తెలుసుకోవడం లేదా అవగతం చేసుకోవడం కూడా జగత్తును గురించిన జ్ఞానంగానే తప్పక పేర్కొనాలి. మళ్ళీ, ఈ రీతిలో అవగతం చేసుకోవడం జగత్తులోని ప్రతి విశేష వస్తువుకూ వర్తిస్తుంది. కనుక యావత్తు జగత్తు, దానిలోని అన్ని వస్తువులు అనిత్యమని, అసత్యమని గ్రహించిన వ్యక్తిని తప్పక సర్వజ్ఞుడని పేర్కొనాలి. కాబట్టి శాస్త్రాలు చెప్పింది నిజమేనని అంగీకరింపక తప్పదు.’
4. బ్రహ్మజ్ఞాని సంకల్పాలన్నీ ఈడేరతాయి
“బ్రహ్మజ్ఞాని సంకల్పాలన్నీ నిజమౌతాయి, ఈడేరతాయి” అనే శాస్త్రోక్తికి పై వివరణ నుండి సరైన అర్థాన్ని మనం గ్రహించవచ్చు. చింతనాశక్తిని ఏకాగ్రం చేసి ఒక వస్తువును గురించి విచారణ చేసినప్పుడు ఆ వస్తువు గురించిన సమగ్రజ్ఞానం తెలియరావడం దైనందిన అనుభవంలోని విషయమే. అటువంటప్పుడు తన మనస్సును పూర్తిగా నియంత్రించుకొని ఒక వస్తువును గురించి ఏకాగ్రమైన మానసిక శక్తితో విచారణ చేసినప్పుడు బ్రహ్మజ్ఞాని ఆ వస్తువు గురించిన సమగ్ర జ్ఞానం అలవోకగా గ్రహించ గలగడం ఏమంత ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. అయినా ఈ అంశంపై మరికొంత పరిశీలించవలసి ఉంది. ఎవరు జగత్సారం యావత్తు కేవలం మిథ్య, అనిత్యం అని చక్కగా గ్రహిస్తాడో, ఎవరు జగత్కారణుడూ సర్వశక్తి స్వరూపుడూ అయిన భగవంతుణ్ణి ప్రేమ ద్వారా సాక్షాత్కరించుకొంటాడో అటువంటి బ్రహ్మజ్ఞాని మనస్సులో రైలుబళ్ళు, విధ్వంసకర యంత్రాలు మొదలైనవి సృష్టించాలనే సంకల్పంగాని, కోర్కెగాని ఎన్నడైనా జనిస్తుందా? అటువంటి సంకల్పాలు బ్రహ్మజ్ఞానుల మనస్సులలో ఉదయించడం అసంభవం. అటువంటప్పుడు వారు వాటిని ఎలా సృష్టించగలరు?
శ్రీరామకృష్ణుల పావన సాంగత్య ఫలితంగా మాకు ఈ విషయం స్పష్టంగా తెలిసింది. నిజానికి వారి మనస్సులలో అటువంటి సంకల్పాలు జనించడం అసంభవం. కాశీపూర్ ఉద్యానగృహంలో శ్రీరామకృష్ణులు నయంకాని కంఠ వ్రణంతో అమిత బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు మేము (స్వామి వివేకానంద, ఇతర శిష్యులం), మా శ్రేయస్సు కోసం తమ మనశ్శక్తితో వ్యాధిని నయం చేసుకోమని కంటతడిబెట్టుకొని ఆయనను ప్రార్థించాం. కాని ఆయనకు అలా ప్రయత్నించడంగాని, సంకల్పించుకోవడంగాని సాధ్యం కాలేదు. అలా చేయడానికి ప్రయత్నించి కూడా గట్టిగా సంకల్పించుకోలేకపోయినట్లు ఆయన తెలిపి, ఇలా కొనసాగించారు : “సచ్చిదానందం నుండి మనస్సును మరల్చి ఈ అస్థిమాంస పంజరం మీద లగ్నం చేయడం అసాధ్యమైంది. నేను సదా శరీరాన్ని హేయమైనదిగా, అల్పమైనదిగానే ఎంచుతూ వచ్చాను; మనస్సును జగజ్జనని పాద పద్మాలకు అర్పించివేశాను. అటువంటప్పుడు, నాయనలారా, మనస్సును ఆమె ధ్యాస నుండి మరల్చి ఈ దేహం మీదికి ఎలా త్రిప్పగలుగుతాను?”
5. శ్రీరామకృష్ణుల జీవితం నుండి మరొక ఉదాహరణ
మరో సంఘటన గురించి ఇక్కడ ప్రస్తావిస్తే పాఠకులకు పై విషయం సులభంగా అర్థమౌతుంది. ఒక రోజు శ్రీరామకృష్ణులు బాగ్‌బజార్‌లోని బలరాం బోస్ ఇంటికి వెళ్ళారు. అప్పుడు సమయం ఉదయం పది గంటలు. ఆ రోజు ఆయన అక్కడకు వెళ్ళే కార్యక్రమం ముందే నిర్ణయమైంది. కనుక నరేంద్రుడు మొదలైన యువభక్తులు కొందరు ఆయన దర్శనార్థం అక్కడకు వచ్చారు. అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులతోను, మధ్యమధ్యలో తమలో తాము వాళ్ళు అనేక విషయాల గురించి మాట్లాడుకోసాగారు. మాటల సందర్భంలో సూక్ష్మదర్శిని గురించిన ప్రస్తావన వచ్చింది. కంటికి కనిపించని అతిసూక్ష్మ వస్తువులను సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) గుండా చూడవచ్చుననీ, చిన్న వెంట్రుక కూడా దాని గుండా చూసినప్పుడు కర్రలా కనిపిస్తుందనీ, శరీరం మీద ప్రతి వెంట్రుక దాని గుండా చూసినప్పుడు బొప్పాయి ఆకు కాండం అంత బోలుగా ఉన్నట్లు కనిపిస్తుందని విని, శ్రీరామకృష్ణులు పిల్లవాడిలా ఆ సూక్ష్మ దర్శినిని చూడాలనే కుతూహలం వ్యక్తం చేశారు. ఎవరివద్ద నుండైనా సూక్ష్మ దర్శినిని తీసుకువచ్చి నాటి మధ్యాహ్నం ఆయనకు చూపించాలని భక్తులు అనుకొన్నారు.
వాకబు చేయగా స్వామి ప్రేమానంద సోదరుడూ, మా మాన్యమిత్రుడూ అయిన డాక్టర్ బిపిన్ బిహారీ ఘోష్ వద్ద సూక్ష్మదర్శిని ఉన్నట్లు తెలియవచ్చింది. వైద్యశాస్త్ర పరీక్షలలో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడైనందున కలకత్తా వైద్యకళాశాల వారు సూక్ష్మదర్శినిని అతడికి బహూకరించారు. ఆ పరికరాన్ని తీసుకువచ్చి గురుదేవులకు చూపించడం కోసం ఒక మనిషిని అతడి వద్దకు పంపించారు. విషయం తెలుసుకొని అతడే స్వయంగా ఆ పరికరాన్ని తీసుకుని సాయంత్రం నాలుగు గంటలకు అక్కడకు వచ్చాడు. పరికరాన్ని సరిగా అమర్చి, శ్రీరామకృష్ణులను దాని గుండా చూడమన్నాడు.
శ్రీరామకృష్ణులు లేచి ముందుకు వెళ్ళారు కాని సూక్ష్మదర్శిని గుండా చూడకుండానే తిరిగి వచ్చారు. ఎందుకు అలా చేశారని అడిగినప్పుడు, “ఇప్పుడు మనస్సు అత్యున్నత భావభూమిలో నెలకొని ఉంది. దానిని క్రిందికి తీసుకు రావడం అసాధ్యమైపోతున్నది” అని ఆయన అన్నారు. ఆయన మనస్సు క్రింది భావభూములకు దిగివస్తుందేమోనని మేం చాలాసేపు వేచిచూశాం. కాని ఆ రోజు ఆయన మనస్సు ఆ అత్యున్నత ఆధ్యాత్మిక భూమి నుండి క్రిందికి దిగలేదు. కనుక ఆ సందర్భంలో ఆయన సూక్ష్మదర్శిని గుండా చూడడం కుదరలేదు. ఇక చేసేదిలేక బిపిన్ బాబు మాలో కొందరికి చూపి, పరికరాన్ని తీసుకొని తిరిగి వెళ్ళిపోయాడు.
6. రెండు చైతన్య భూముల నుండి శ్రీరామకృష్ణుల దృక్పథం
దేహస్మృతి భావాన్ని విస్మరించి శ్రీరామకృష్ణుల మనస్సు ఎంత అత్యున్నత చైతన్య భూములకు అధిరోహిస్తుందో, ఆ భూములలో ఆయనకు అంతటి అసాధారణమైన దివ్యదర్శనాలు కలిగేవి. ఎప్పుడు ఆయన మనస్సు అద్వైత భావభూమిని చేరేదో అప్పుడు ఆయనకు దేహస్మృతి పూర్తిగా తొలగిపోయేది; హృదయ స్పందన, ఇంద్రియ వ్యాపారాలన్నీ కొంతసేపు ఆగిపోయేవి, శరీరం మృతకాయంలా పడివుండేది. ఆలోచన, ఊహ వంటి మానసిక పరివర్తనలన్నీ పూర్తిగా నిలిచిపోయి, ఆయన అప్పుడు అఖండ సచ్చిదానందంలో లయమైపోయే వారు. తదనంతరం ఆ మహోన్నత స్థితి నుండి నిమ్న భూములకు దిగివస్తునప్పౖడు సామాన్యుల మాదిరి మళ్ళీ ‘ఈ దేహం నాది’ అనే భావం ఆయనలో జనించేది; అప్పుడు మాత్రమే మనలాగే కళ్ళతో చూడడం, చెవులతో వినడం, చర్మంతో స్పర్శను అనుభవించడం, మనస్సుతో ఆలోచించడం చేయగలిగేవారు.
7. సామాన్యులు ప్రతి విషయాన్ని రెండవ రకంగానే చూస్తారు
మనిషి మనస్సు సమాధి భూమికి అధిరోహించడం, మళ్ళీ క్రమంగా క్రిందికి దిగడం గురించి కించిత్తు అనుభవం పొందిన ఒక సుప్రసిద్ధ పాశ్చాత్య తాత్త్వికుడు* , ‘సామాన్య వ్యక్తి దేహంలో ఉండే చైతన్యం సదా ఒకే స్థితిలో నెలకొని ఉండదు’ అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఈ అభిప్రాయం యుక్తియుక్తమైనదే, ప్రాచీన ఋషుల ఆమోదం పొందినదే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనిషి ఆధ్యాత్మిక గుర్తింపు నిజానికి అద్వైత చైతన్య భూమికి చెందింది; కాని అతడు అనంతకాలంగా దానిని గురించి పూర్తిగా మరిచిపోయాడు. అంతేకాక పంచేంద్రియాల ద్వారా మాత్రమే జ్ఞానం పొందవచ్చుననే దృఢనమ్మకాన్ని సంతరించుకొన్నాడు. కాబట్టే నిశ్చింతగా సంసార సాగరంలో లంగరు దింపి, జీవిస్తున్నాడు. శ్రీరామకృష్ణుల వంటి అధికారిక పురుషులు, జగద్గురువులు, అవతారపురుషులు ప్రతి యుగంలోను అవతరించి, పైన పేర్కొన్న ప్రవర్తనకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించి (అంటే భగవత్సాక్షాత్కారం, అతీంద్రియ జ్ఞానమే అసలైన జ్ఞానం అని చూపి) ఆ భ్రమను తొలగించివేస్తారని వేదాది శాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి.
8. శ్రీరామకృష్ణుల రెండు రకాల దృష్టి కోణాలకు కొన్ని ఉదాహరణలు
ఏది ఏమైనప్పటికీ లోకంలోని వస్తువులను, వ్యక్తులను మనం చూసే రీతిలో శ్రీరామకృష్ణులు చూసేవారు కాదనే విషయం సుస్పష్టం. ఉన్నత, ఉన్నతతర భావభూములను అధిరోహించినప్పుడు అవి ఎలా కానవస్తాయో, సదా ఆయన అదే దృష్టితో వ్యక్తులను, వస్తువులను చూసేవారు. కనుక మనలా ఏ విషయంలోను కూడా సంకుచిత భావం, పరిమిత దృష్టి ఆయనకు ఉండడం అసంభవం. అందువలననే మన పలుకులనూ, మన భావాలనూ ఆయన అవగతం చేసుకొన్నప్పటికీ, మేం మాత్రం ఆయన వచనాలను, భావాలను అర్థం చేసుకోలేకపోయేవారం. మనిషిని మనిషిగా, ఆవును ఆవుగా, పర్వతాన్ని పర్వతంగా మాత్రమే మనం తెలుసుకోగలం. మరి ఆయన దృష్టిలో? ఆయన కూడా మనిషిని మనిషిగా, ఆవును ఆవుగా, పర్వతాన్ని పర్వతంగా చూసేవారు. కాని అదే సమయంలో ఇవన్నీ నిజానికి ఆ పరమాత్ముని అభివ్యక్తీకరణలే అనీ, జగత్కారణమైన అదే సచ్చిదానందం వీటి గుండా ప్రకాశిస్తూవుందని కూడా ఆయన దర్శించేవారు. కేవలం తేడా ఏమిటంటే పలుచని లేదా దళసరి ఆవరణ భేదానుసారంగా ఆ పరమాత్ముని అభివ్యక్తీకరణ కూడా అధికంగానో తక్కువగానో వ్యక్తమౌతుంది. దానిని గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పడం మేం విన్నాం:
9. శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మికతను ఆపాదించే దృక్పథం
“చెట్టుచేమలు, మనుషులు, పశువులు, గడ్డి, నీరు తదితరాలన్నీ రకరకాల ఒరలు (కోశాలు)గా నాకు కనిపిస్తాయి. అవి తలగడ గలీబుల వంటివి. వాటిని మీరు చూడలేదా? వాటిలో కొన్ని ఎర్రరంగు ముతకబట్టతో, మరికొన్ని పట్టుబట్టతో, కొన్ని వివిధ రకాల బట్టలతో తయారు చేయబడతాయి. మళ్ళీ వీటిలో కొన్నిటిని గుండ్రంగా, చతుర్భుజాకృతిలో తయారుచేస్తారు. ఈ జగత్తు కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ, ఆ రకరకాల గలీబులన్నీ ఒకే ఒక్క పదార్థంతో, అంటే దూదితో నింపబడి ఉంటాయో, అలాగే మనిషి, ఆవు, గడ్డి, నీరు, పర్వతం మొదలైన అన్ని ఒరలలోను ఆ ఒక్క అఖండ సచ్చిదానందమే నిండివుంటుంది. నాయనలారా, నిజానికి అమ్మ (జగజ్జనని) రకరకాల ముసుగులు వేసుకొని లేదా రకరకాల రూపాలు దాల్చి, వాటిలోపల నుండి తొంగి చూస్తూన్నట్లు నేను దర్శిస్తూన్నాను. ఈ జగత్తు సదాసర్వదా ఆ విధంగా కనిపిస్తూ ఉన్న స్థితిలో నేను ఉన్నాను. నేనున్న ఆ స్థితిని అర్థం చేసుకోలేక లోకులు నా వద్దకొచ్చి నన్ను శాంతింప, ఊరడింపచేయడానికి ప్రయత్నించేవారు. నన్ను ఆ స్థితిలో చూసి రాంలాల్ తల్లి, తక్కినవారు విలపించే వారు. వారలా విలపించడం చూసినప్పుడు, (కాళికాలయాన్ని చూపుతూ) ఆ జగన్మాతే రకరకాల వేషాలు ధరించి వచ్చి అలా చేస్తున్నట్లు దర్శించేవాణ్ణి. ఆ విచిత్ర మారువేషం చూసి, ‘భలే వేషం దాల్చావే అమ్మా’ అంటూ పొట్టచెక్కలయ్యేలా నవ్వేవాణ్ణి.
“ఒక రోజు కాళికాలయంలో కూర్చుని తల్లిని గురించి ధ్యానం చేయసాగాను. ఎంత ప్రయత్నించినా ఆ రోజు తల్లి రూపాన్ని మనస్సులో లగ్నం చేయలేకపోయాను. పిదప ఏం చూశానో తెలుసా? రమణి అనే వేశ్య స్నానం చేయడానికి ఘట్టానికి వచ్చింది. అమ్మ ఆమెలా వేషం దాల్చి (అంటే ఆ రూపంలో అన్న మాట) ‘పూజాఘటం’ ప్రక్కన నిలబడి తొంగిచూడసాగింది. ఆ దృశ్యం చూసి, నవ్వేసి, ‘అమ్మా, ఈ రోజు నీకు రమణివి కావాలనే ఆకాంక్ష జనించిందా? సరే మంచిది. ఈ రోజు ఈ రూపంలోనే పూజను స్వీకరించు’ అని అన్నాను. ఆ విధంగా అమ్మ నాకు దర్శనమిచ్చి, ‘వేశ్యను కూడా నేనే. నేను తప్ప మరొకటి ఏదీ లేదు’ అనే విషయం నాకు ఆ రోజు స్పష్టం చేసింది.
“మరో సందర్భంలో బండిలో కూర్చుని మేఛో బజారు వీథి గుండా పోతున్నాను. అప్పుడు అమ్మ అందంగా చీర, నగలు ధరించి, తల దువ్వుకొని, నుదుట బొట్టు పెట్టుకొని, హుక్కా పీలుస్తూ, వరండాలో వేశ్య రూపంలో నిలబడి లోకులను ఆకర్షిస్తూ కనిపించింది. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోతూ, ‘అమ్మా, ఇక్కడ ఈ రూపంలో ఉన్నావా?’ అంటూ, ఆమెకు ప్రణామం చేశాను.”
ఉన్నత చైతన్య భూముల నుండి వ్యక్తులను, వస్తువులను (అసలు స్వరూపంలో) చూడడం మనం పూర్తిగా మరిచిపోయాం. అటువంటప్పుడు శ్రీరామకృష్ణుల అనుభవాలను మనం ఎలా అవగతం చేసుకోగలం?
10. శ్రీరామకృష్ణుల ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి సామాన్యులకంటే చురుకైనవి. సుఖభోగాల పట్ల అనాసక్తమై ఉండడమే అందుకు కారణం
శ్రీరామకృష్ణులు మామూలు దేహస్మృతి స్థితిలో ఉన్నప్పుడు సైతం సుఖభోగేచ్ఛ అణుమాత్రం కూడా ఆయనలో ఉండేది కాదు. ఆ కారణంగా ఆయన బుద్ధి, పరిశీలనా దృష్టి మనకంటే ఎన్నోరెట్లు తీక్షణంగా ఉండేవి. కాబట్టే ఆయన మనకంటే అధికంగా ఎన్నో విషయాలను గ్రహించి, అవగతం చేసుకో గలిగేవారు. మనలో ప్రతి ఒక్కరిలోనూ సుఖీంచాలి, భోగించాలి అనే కోర్కె తీవ్రంగా ఉండడం వలన తినడం, తాగడం, తిరగడం, చూడడం, పడుకోవడం మొదలైన ప్రతి ఒక్క పనిలోను మన సుఖానికి దోహదం చేసే విషయాలే సదా మన కళ్ళకు ఉజ్జ్వల వర్ణంలో కనిపిస్తూ ఉంటాయి; కాబట్టే మన మనస్సులు, మన సుఖానికి విరుద్ధమైన వస్తువులు, వ్యక్తుల పట్ల హేయభావాన్ని కలిగించి మన సుఖానికి దోహదం చేసే విషయాల వైపుకే ఎక్కువగా ఆకర్షింపబడతాయి. తత్ఫలితంగా అలా హేయభావాన్ని చూపిన వస్తువుల, వ్యక్తుల స్వభావాన్ని గురించి తెలుసుకొనే అవకాశం మనం కోల్పోతాం. ఇలా ఏదో కొన్ని వస్తువులను, వ్యక్తులను మాత్రమే మనవిగా, అంటే మన సొంతంగా చేసుకొనే ప్రయత్నంలోనే మన యావత్తు జీవితాన్ని గడిపివేస్తాం.
జనసామాన్యంలో, జ్ఞానసముపార్జన విషయంలో తారతమ్యం కనిపించడానికి కారణం ఇదే. కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియాలు మనందరిలో సరిసమానంగానే ఉన్నప్పటికీ వాటిని అన్ని విషయాలలోను సరిసమానంగా ఉపయోగించి మనం సమానంగా జ్ఞానాన్ని సముపార్జించుకోగలుగుతున్నామా? లేదే! కాబట్టే మనలో ఎవరికి స్వార్థపరత్వం, భోగేచ్ఛ తక్కువగా ఉంటాయో వారే ఇతరుల కంటే అధికంగా, సునాయాసంగా అన్ని విషయాలలోను అధికంగా జ్ఞానం సముపార్జించుకోగలుగుతున్నారు.
11. శ్రీరామకృష్ణుల కుశాగ్ర బుద్ధికి ఉదాహరణలు
మామూలు భావభూమిలో నెలకొని ఉన్నప్పుడు సైతం శ్రీరామకృష్ణుల పరిశీలనా దృష్టి ఎంతో కుశాగ్రంగా ఉండేది; అందుకు ఒకటి రెండు ఉదాహరణలు ఇక్కడ పేర్కొనడం అసంగతం కాబోదు. జటిలమైన ఆధ్యాత్మిక సత్యాలను అలవోకగా విశదీకరించడంలో ఆయన అందరికీ తెలిసిన దృష్టాంతాలు, ఉపమానాలు ఉపయోగించేవారు. వీటి ద్వారా ఆయన పరిశీలనా దృష్టి ఎంత నిశితమైనదో మనం గ్రహించవచ్చు. ఈ దృష్టాంతాల సహాయంతో ఒక దీప్తిమంతమైన చిత్రాన్ని దర్శింపచేసి, జటిలంగా కానవచ్చే సమస్యల పరిష్కారం సుసాధ్యమే అన్న విషయాన్ని శ్రోతల మనస్సులు అవగతం చేసుకొనేట్లు చేసేవారు.
అ. సాంఖ్యదర్శన తత్త్వాన్ని ‘ఇంటి యజమాని – ఇల్లాలు’ దృష్టాంతం ద్వారా సులభంగా విపులీకరించడం
ఒక రోజు చర్చిస్తూన్న సాంఖ్యదర్శన తత్త్వ విషయాన్నే ఉదాహరణగా తీసుకొందాం. ఈ విశ్వం యావత్తు పురుషుడు, ప్రకృతి – ఈ రెండింటి నుండే ఉత్పన్నమౌతుందనే విషయం గురించి మాతో ప్రసంగిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు: “ఆ (సాంఖ్య) సిద్ధాంతం ప్రకారం పురుషుడు అకర్త, అంటే ఏమీ చేయడు. పనులన్నింటినీ నిర్వర్తించేది ప్రకృతే. ప్రకృతి నిర్వర్తిస్తూ ఉన్న ఆ పనులన్నింటినీ పురుషుడు సాక్షీభూతుడుగా గమనిస్తూ ఉంటాడు అంతే. ప్రకృతి కూడా స్వతంత్రంగా ఏ పనీ చేయలేదు.” అక్కడున్న శ్రోతలలో గుమాస్తాలు, గణకులు, పాఠశాల, కళాశాల బాలురు, కొద్దిమంది వైద్యులు, న్యాయవాదులు, మేజిస్ట్రేట్లు కూడా ఉన్నారు. శ్రీరామకృష్ణులు వెలిబుచ్చిన సిద్ధాంతం వారందరికీ అవగతం కాలేదు. కాబట్టే గురుదేవుల వచనాలు విని (అవగాహన కాక) ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. అది గమనించి శ్రీరామకృష్ణులు ఇలా కొనసాగించారు : “వివాహం జరుగుతున్న ఇల్లు మీకు జ్ఞాపకం రావడం లేదా? ఇంటి యజమాని పనులన్నీ పురమాయించి ఒక చోట కూర్చుని తాపీగా హుక్కా త్రాగుతూ ఉంటాడు. కాని ఇంటి యజమానురాలు పసుపు మరకలున్న చీర ధరించి, ఆ పని పూర్తయిందా, ఈ పని మొదలయిందా అని పరిశీలిస్తూ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఆహ్వానితులైన స్త్రీలకు, పిల్లలకు స్వాగతం పలుకుతూ, మధ్యమధ్యలో భర్త వద్దకొచ్చి, ‘ఈ పని అలా చేయించాను, ఆ పని ఆ విధంగా చేయించాను, ఇది జరిగిపోయింది, అది ఇంకా జరగలేదు’ అని అభినయపూర్వకంగా చెబుతూ ఉంటుంది. అప్పుడు ఇంటి యజమాని హుక్కా త్రాగుతూ, ఆమె చెబుతూవున్న ప్రతి మాటకూ, ‘సరే, సరే’ అంటూ తన ఆమోదం వ్యక్తం చేస్తూ ఉంటాడు.” శ్రీరామకృష్ణుల ఆ వచనాలు విని అందరూ నవ్వేశారు. సాంఖ్యదర్శన తత్త్వం కూడా వారికప్పుడు అర్థమైంది.
ఆ. బ్రహ్మం, మాయ అభేదమైనవి : పాము కదులుతున్నా, పడుకొని ఉన్నా పామే
మరొక సందర్భంలో, ‘బ్రహ్మం – మాయ లేదా ప్రకృతి – పురుషుడు’, రెండూ వేర్వేరు తత్త్వాలు కావు, ఒక్కటే. ఒకే తత్త్వం ఒక దృక్పథం నుండి బ్రహ్మంగా, మరో దృక్పథం నుండి మాయగా కనిపిస్తూ ఉంటాయి’ అనే వేదాంత విచారణ జరుగుతూన్నది. ఆ విషయం మాకు అర్థం కాకపోవడం చూసి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు : “అదెలాగో మీకు తెలుసా? ఉదాహరణకు నిశ్చలంగా పడుకొని ఉన్న పామును, అలాగే కదులుతూ ఉన్న పామును తీసుకోండి. నిశ్చలంగా పడుకొని ఉన్న పామును పురుషుడితో పోల్చవచ్చు; ఈ స్థితిలో ప్రకృతి, పురుషుడితో కలిసి, ఐక్యమైపోతుంది. కదులుతూన్న పామును ప్రకృతితో పోల్చవచ్చు. అప్పుడు ప్రకృతి, పురుషుడి నుండి విడివడి, పనిచేస్తుంది.” పై వేదాంత విచారణలో ఇమిడివున్న తాత్త్వికాంశం అప్పుడు అందరికీ అర్థమైంది. ‘అయ్యో! ఇంత సులభమైన అంశాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయాం?’ అని అనుకొన్నాం.
ఇ. ఈశ్వరుడు మాయచే బద్ధుడు కాడు. ‘తన నోట్లో విషం ఉన్నా పాము చావదు.’
మరొక సందర్భంలో, బహుశ, “మాయ ఈశ్వరుడి శక్తి, అది ఆయనలోనే నెలకొని ఉంటుంది కదా? అటువంటప్పుడు ఈశ్వరుడు మనలాగే మాయాబద్ధుడా ఏమిటి?’ అనే ప్రశ్న లేవదీశారు. అది విని, శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “కాదు, నాయనలారా. మాయ ఈశ్వరుడికే చెందినా, అది సదా ఆయనలోనే నెలకొని ఉన్నా, ఈశ్వరుడు ఏనాడూ మాయాబద్ధుడు కాడు. ఈ విషయం చూడండి- పాము ఎవరిని కాటువేస్తుందో అతడు మరణిస్తాడు. పాము నోట్లో ఎప్పుడూ విషం ఉంటూనే ఉంటుంది. ఆ నోటి ద్వారానే పాము ఆహారం తింటుంది; అలా తింటున్నప్పుడు ఏదో కొంతపాలు విషం లోపలకు పోయే తీరాలి. కాని ఆ విషం దాని మీద పనిచేయదు, పాము చావదు. ఇదీ అలాగే.” అలా జరగడం సంభవమేనని అంతా అర్థం చేసుకొన్నారు.
శ్రీరామకృష్ణులు మామూలు చైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఏ విషయమూ (దాని యథార్థ స్వభావం) ఆయన చురుకైన పరిశీలనా దృష్టి నుండి తప్పించుకోలేదని పై ఉదాహరణల నుండి స్పష్టమౌతోంది. బాహ్యప్రకృతి లోపల సంభవించే పరిణామాలు ఆయన దృష్టికి అగోచరాలు కావు. ఇక మనిషి నైజం గురించి వేరేగా చెప్పాలా? పరికరాల (సూక్ష్మదర్శిని మొదలైనవి) తోడ్పాటుతో మాత్రమే కనుగొని, అవగతం చేసుకోగలిగే బాహ్యప్రకృతి పరిణామాలను గురించి మేం ఇక్కడ ప్రస్తావించడం లేదు.
12. భగవంతుడు తన నియతిని మార్చగలడు
ఈ సందర్భంలో మరో అంశం గమనార్హం. లోకుల దృష్టిని సామాన్యంగా ఆకర్షించని, బాహ్యప్రకృతిలో ఏర్పడే అసాధారణ మార్పులు లేదా అభివ్యక్తీకరణలు సైతం, మామూలు చైతన్య స్థితిలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణుల దృష్టిని ఆకర్షించేవి. ‘భగవత్సంకల్పం వలననే ఈ సృష్టి యావత్తు సాగిపోతున్నది; దీనిలో కానవచ్చే అభివ్యక్తీకరణలన్ని ఆయన సంకల్పాధీనాలే. ఈ లోకంలోని సమస్త వస్తువుల, వ్యక్తుల విధి నియంత్రకుడు భగవంతుడే’ అనే భావనను శ్రీరామకృష్ణుల మనస్సులో గాఢంగా ముద్రించడానికే ఏమో అన్నట్లు జగజ్జనని ఈ సృష్టిలో జరిగే అసాధారణ సంఘటనలను సదా సర్వదా ఆయనకు దర్శింపచేసేది. చిన్నతనం నుండి అటువంటి సంఘటనలను చూసిన ఫలితంగా, “ఎవరు నియమాలను అమలు పరుస్తాడో, ఆయనే సంకల్ప మాత్రాన వాటిని రద్దు చేయగలడు లేదా క్రొత్త నియమాలను అమలుపరచగలడు కూడా” అన్న శ్రీరామకృష్ణుల వచనాలకు, మనం స్పష్టమైన అర్థం తెలుసుకోగలం. అటువంటి కొన్ని సంఘటనలను ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాబోదు.
13. శ్రీరామకృష్ణులు: ‘తటిద్వాహకం’
కళాశాల రోజుల్లో ఆధునిక భౌతికశాస్త్ర ఆవిష్కరణలలో విద్యుచ్ఛక్తి గురించి చదువుతున్నప్పుడు మేం ముగ్ధులయ్యేవారం. ఒకరోజు శ్రీరామకృష్ణుల సమక్షంలో ఉత్సాహంకొద్దీ పై ప్రస్తావన తెచ్చి, దానిని గురించి పరస్పరం ముచ్చటించుకొంటున్నాం. మా సంభాషణలో ‘ఎలక్ట్రిసిటీ’ అనే మాట పదేపదే దొర్లడం గమనించి, చిన్నపిల్లవాడిలా ఆయన కుతూహలంగా, “మీరు దేనిని గురించి ముచ్చటించుకొంటున్నారు? ‘ఎలక్టిక్టిక్’* అంటే ఏమిటి?” అని అడిగారు. ఆ ఆంగ్ల పదాన్ని ఆయన అలా ఉచ్చరించడం చూసి మేం నవ్వు ఆపుకోలేకపోయాం. తరువాత విద్యుచ్ఛక్తిని గురించిన సామాన్య విషయాలు ఆయనకు తెలిపాం. ఆ సందర్భంలో పిడుగును నిరోధించే ‘తటిద్వాహకం’ (lightning conductor) ఉపయోగం గురించీ ఆయనకు తెలియచేశాం. పిడుగు ఎప్పుడూ ఎత్తైన చోటునే తాకుతుందనీ, కనుక ‘తటిద్వాహకం’ ఇంటి కంటే ఎత్తైన స్థానంలోనే అమర్చాలనే నియమం పాటించాలనీ చెప్పాం. మా వివరణను సావధానంగా ఆలకించి, పిదప శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు : “కాని నే నొక సందర్భంలో మూడంతస్తుల మేడను తాకకుండా, దాని ప్రక్కనే ఉన్న ఒక చిన్న పాక మీద ఆ దారుణమైన పిడుగు పడడం చూశాను. దీనిని గురించి మీరేమంటారు? నాయనలారా, ఈ సంఘటనలకు మినహాయింపులు లేని ఒకే తీరు వివరణ ఇవ్వగలరా? జగజ్జనని సంకల్పం మేరకే నియమాలు వర్తిస్తాయి; ఆమె సంకల్పానుసారమే అవి తలక్రిందులు చేయబడతాయి.”
అప్పుడు మేం ప్రకృతి నియమాలను (అంటే అవి అనుల్లంఘనీయాలని) శ్రీరామకృష్ణులకు విశదీకరింప ప్రయత్నించాం; కాని మథుర్బాబులా ఆ సందర్భంలో సరైన జవాబు ఇవ్వలేకపోయాం. “నిజానికి పిడుగు ఆ మూడంతస్తుల మేడ వైపుకే ఆకర్షింపబడింది; కాని మనకు తెలియని ఏదో కారణంగా హఠాత్తుగా దాని గతి మారి, ఆ పాక మీద పడింది. ఇలా ఏదో కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, వేలాది స్థలాలలో నియమానుసారం ఎత్తైన స్థలాల మీదే పిడుగు పడుతుంది” అంటూ మా విశదీకరణను కొనసాగించాం. కాని ప్రకృతిపరమైన సంఘటనలు అనుల్లంఘనీయమైన నియమం మేరకే జరుగుతాయన్న విషయం ససేమిరా శ్రీరామకృష్ణులు అంగీకరించలేదు. ఆయన ఇలా అన్నారు: “సరే, వేలాది చోట్ల మీరు చెప్పిన నియమం మేరకే పిడుగులు పడడం జరుగుతుందని ఆమోదించినా, ఆ నియమానికీ కొన్ని మినహాయింపులున్నాయనడం తథ్యం; కనుక ఆ నియమం ఏకరూపతను కోల్పోయిందనడం స్పష్టంగా తేటతెల్లమౌతున్నది.”
14. ఎర్రమందార మొక్కకు తెల్లమందార పువ్వు పూచిన సంఘటన
సర్వసాధారణంగా ఎర్రపువ్వులు మాత్రమే లేదా తెల్లపువ్వులు మాత్రమే పూచే మొక్కలు ఎంతో అరుదుగా తద్విరుద్ధ రంగుల పువ్వులు పూసిన సంఘటనలు వృక్షశాస్త్రజ్ఞులు నమోదుచేసి ఉన్నారు. కాని అలా జరగడం ఎంతో అరుదు; అలా జరగడం అసంభవమని చెప్పడం అతిశయోక్తి కాబోదు. కాని శ్రీరామకృష్ణుల జీవితంలో జరిగిన అటువంటి సంఘటనను పరికించండి. ‘ప్రకృతి నియమాలు అనుల్లంఘనీయాలు కావు, భగవత్సంకల్పం మేరకు అవి మార్చబడతాయి’ అని మాటల సందర్భంలో శ్రీరామకృష్ణులు, మథుర్‌తో ఒకసారి చెప్పడం జరిగింది. ఆ సందర్భంలోనే అటువంటి అరుదైన సంఘటన జరగడం గమనించి గురుదేవులు దానిని మథుర్కు చూపారు. ఒకే మందార మొక్క కొమ్మన ఎర్రమందార పువ్వు, తెల్లమందార పువ్వు పూయడం గురుదేవులు, మథుర్కు చూపిన సంఘటనను ఇక్కడ ప్రస్తావిస్తున్నామని పాఠకులు గమనించగలరు.
15. ‘ఈ సమస్త విశ్వం జగజ్జనని క్రీడారంగం’ – శ్రీరామకృష్ణుల ప్రగాఢ విశ్వాసం
శ్రీరామకృష్ణులు సజీవమైన* రాయిని చూశారని చెప్పుకొంటారు; అదే విధంగా మరొక సందర్భంలో మనిషి వెన్నెముక చివరి త్రికోణాకారపు చిన్న ఎముక కొద్దిగా సాగి, తదనంతరం మళ్ళీ మామూలు స్థితికి సంకోచించుకుపోవడం ఆయన చూశారు;* అట్లే ఆయన ఎందరో దేవతలను, ప్రేతాలను చూశారు. శ్రీరామకృష్ణుల జీవితంలో జరిగిన ఇటువంటి మరెన్నో సంఘటనలను గురించి మేం వినివున్నాం. అయినా నమ్ము తున్నామా? లేదు. పాశ్చాత్యాన్ని అనుకరిస్తూ సృష్టికర్తయైన ప్రకృతి యావత్తు జడమైనదనే, మేధాశక్తి రహితమైనదనే నిర్ణయానికి వస్తున్నాం. కాబట్టి ప్రకృతిలో కానవచ్చే అసాధారణ సంఘటనలు నియమోల్లంఘనాలనీ, ప్రకృతిని వ్యవస్థాబద్ధం చేసే నియమాలనన్నిటినీ మనం అవగతం చేసుకొన్నామనీ భావిస్తూ ఉంటాం.
కాని శ్రీరామకృష్ణుల దృఢవిశ్వాసం ఇందుకు విభిన్నం. బాహ్యాంతర ప్రకృతి యావత్తు జగజ్జనని క్రీడావిలాసమే తప్ప మరేమీ కాదనే విషయం ఆయన స్పష్టంగా గ్రహించారు. కాబట్టే ప్రకృతిలో కానవచ్చే ఈ అసాధారణ సంఘటనలు జగజ్జనని సంకల్పం మేరకే (అంటే నియమోల్లంఘనాలు కావు) జరుగుతున్నట్లు ఆయనకు కానవచ్చేది. ఈ దృఢవిశ్వాసం మూలంగా శ్రీరామకృష్ణుల మనస్సులో శాంత్యానందాలు మనలో కంటే ఎన్నో రెట్లు వెల్లివిరిసేవనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీరామకృష్ణుల జీవితంలో జరిగిన అటువంటి సంఘటనలు కొన్నిటిని ఇంతకు మునుపే ప్రస్తావించి ఉన్నాం, ఇక ముందు కూడా ప్రస్తావించనున్నాం.
16. ఉన్నత భావ భూముల నుండి ప్రత్యేక స్థానాలలో ఘనీభూతమై అభివ్యక్తమయ్యే ఆధ్యాత్మిక శక్తిని శ్రీరామకృష్ణులు గుర్తించడం
శ్రీరామకృష్ణులు ప్రతి వస్తువునూ, వ్యక్తినీ ఇంతకు మునుపే ప్రస్తావించిన రెండు దృక్పథాల నుండి పరికించి, పిదప వాటి గురించి ఒక నిర్ణయానికి వచ్చేవారు. సాధారణ చైతన్యభూమి నుండి మాత్రమే మనలా పరిశీలించి ఏ అభిప్రాయానికీ ఆయన వచ్చేవారు కారు. కనుక పుణ్య క్షేత్రాలను, పావన సాధువులను సందర్శించినప్పుడు ఆయన రెండు విధాల (రెండు భావ భూముల నుండి) ఆ క్షేత్రాల, సాధువుల ఆధ్యాత్మిక శక్తిని అంచనా వేసేవారు. ఉన్నత భావభూముల నుండి పరిశీలించినప్పుడు ఏ పుణ్య క్షేత్రంలో ఎంత ఆధ్యాత్మికశక్తి ఘనీభూతమై ఉందో అంచనా వేయగలిగేవారు; అంటే మనిషిని ఉన్నత భావభూములకు అధిరోహింప చేయగలిగే శక్తి ఏ క్షేత్రంలో ఏ మేరకు ఉన్నదో ఆయన గ్రహించగలిగే వారన్నమాట. రూపరసాది భోగ్య వస్తువుల పట్ల ఆసక్తిరహితమూ, పరమ పావనత్వాన్ని సంతరించుకొన్న శ్రీరామకృష్ణుల మనస్సే ఆ సూక్ష్మాంశాలను కనుగొనగలిగే అద్భుత పరికరం. ఏ పుణ్యక్షేత్రాన్నిగాని లేదా దేవాలయాన్నిగాని సందర్శించిన తక్షణం ఆయన మనస్సు ఉన్నత భావభూములను అధిరోహించి, ఆ స్థలంలో లేదా దేవాలయంలో నెలకొన్న దివ్యత్వ అభివ్యక్తీకరణను ఆయనకు వెల్లడించేది. అలా మనస్సు ఉన్నత భావభూములకు అధిరోహించిన స్థితిలోనే కాశీక్షేత్రాన్ని స్వర్ణమయంగా, కాశీలో మరణించే జీవులకు ముక్తి లభించే తీరును ఆయన దర్శించగలిగారు. అదే విధంగా బృందావనంలోని దివ్యత్వ ప్రత్యేక అభివ్యక్తీకరణను అనుభూతం చేసుకొన్నారు; అట్లే నవద్వీపంలో ఇప్పటికీ శ్రీచైతన్యులు సూక్ష్మరూపంలో వెలసి ఉండడం శ్రీరామకృష్ణులు గ్రహించగలిగారు.
17. శ్రీ చైతన్యుల బృందావన ఆవిష్కరణ
శ్రీకృష్ణుడు దివ్యలీలలు సలిపిన బృందావనంలో నెలకొని ఉన్న దివ్యత్వ అభివ్యక్తీకరణ అనుభూతిని పొందిన ప్రప్రథములు శ్రీచైతన్యులనే చెప్పుకొంటారు. ఆయన అవతరించడానికి పూర్వం ఆ వ్రజభూమిలోని పుణ్యక్షేత్రాలు దాదాపు విస్మృతాలే! చైతన్యులు ఆ స్థలాలలో సంచరిస్తున్నప్పుడు ఆయన మనస్సు ఉన్నత చైతన్యభూములను అధిరోహించి ఎన్నో యుగాల క్రితం శ్రీకృష్ణుడు ఎక్కడెక్కడ ఏఏ దివ్యలీలలు సలిపాడో అక్కడక్కడ ఆ దివ్య అభివ్యక్తీకరణ అనుభూతిని ఆయన పొందారు. చైతన్యుల అనుభవాలను విని యథార్థంగానే శ్రీకృష్ణుడు ఆయా స్థలాలలో దివ్యలీలలు సలిపాడని విశ్వసించసాగారు ఆయన శిష్యులైన రూపగోస్వామి, సనాతన గోస్వామి మొదలైనవారు. తదనంతరం ఈ శిష్యుల, ప్రశిష్యుల ముఖతా ఆ సంగతి విని క్రమక్రమంగా భారతీయులు యావన్మందీ విశ్వసిస్తూ వచ్చారు.
పైన పేర్కొన్నట్లు, చైతన్యులు బృందావనాన్ని ఆవిష్కరించిన తీరు మేం అవగతం చేసుకోలేదు; అలా ఆవిష్కరించడం సాధ్యం అనే విషయాన్ని మేం ససేమిరా ఒప్పుకొనేవారం కాదు. కాని ఉన్నత చైతన్యభూములను అధిరోహించి నిర్దిష్టంగా వస్తువులను, వ్యక్తులను సంశోధించి అవగతం చేసుకోగల గురువుల శక్తిని ప్రత్యక్షంగా చూసిన తరువాత అలా జరగడం సంభవమేనని విశ్వసించవలసి వచ్చింది. అయినప్పటికీ ఆ నిజాల పట్ల మాకు ఏర్పడిన విశ్వాసం అంతంత మాత్రమే! దీనిని గురించిన కొన్ని ఉదాహరణలను ఇక్కడ పొందు పరుస్తున్నాం.
18. శ్రీరామకృష్ణుల జీవితంలో అటువంటి సంఘటనలు. వన – విష్ణుపూర్‌లో తొలి మృణ్మయమూర్తి విగ్రహాన్ని దర్శించడం
శ్రీరామకృష్ణుల మేనల్లుడైన హృదయ్, కామార్పుకూర్కు సమీపంలోని సిహోర్ అనే గ్రామానికి చెందినవాడు. అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు, తమ స్వస్థలం నుండి దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చేముందు సిహోర్ వెళ్ళి కొన్ని రోజులు అక్కడ గడిపివచ్చేవారని ఇంతకు మునుపే పాఠకులకు తెలిపివున్నాం. ఒకసారి ఆయన సిహోర్‌లో బసచేసి ఉన్నప్పుడు హృదయ్ తమ్ముడైన రాజారాంకు, మరొక గ్రామస్థుడికి మధ్య ఏదో విషయంలో వాగ్వాదం వచ్చింది. ఆ వాగ్వాదం చిలికిచిలికి గాలివానయై చివరికి కొట్టుకొనే దాకా వెళ్ళింది. రాజారాం పక్కనే ఉన్న ఒక హుక్కా గొట్టంతో ఆ గ్రామస్థుడి తలమీద కొట్టాడు. గాయపడ్డ ఆ గ్రామస్థుడు, రాజారాం మీద దౌర్జన్యం చేశాడని వ్యాజ్యెం వేశాడు. ఆ సంఘటన శ్రీరామకృష్ణుల సమక్షంలోనే జరిగింది. శ్రీరామకృష్ణులు సత్యసంధులని తెలిసిన ఆ గ్రామస్థుడు ఆయనను సాక్షిగా పేర్కొన్నాడు. అందువలన శ్రీరామకృష్ణులు సాక్ష్యం ఇవ్వడానికి వన–విష్ణుపూర్‌కు వెళ్ళవలసి వచ్చింది. కోపంలో కళ్ళుమూసుకుపోయిన రాజారాంను, శ్రీరామకృష్ణులు బాగా చీవాట్లు పెట్టి, “అతడికి కొంత పైకం ముట్టజెప్పి రాజీ చేసుకో. లేకుంటే తీర్పు నీకు ప్రతికూలంగా రావడం తథ్యం. ఎట్టి పరిస్థితిలోనూ నేను అసత్యం పలుకను. జరిగింది జరిగినట్లు సాక్ష్యం ఇస్తాను.” దాంతో రాజారాం భయపడిపోయి, వ్యాజ్యాన్ని రాజీ చేసుకోవడంలో మునిగిపోయాడు. శ్రీరామకృష్ణులు ఈ సమయంలో వన–విష్ణుపూర్ పట్టణాన్ని చూడడానికి వెళ్ళారు.
19. వన–విష్ణుపూర్ పట్టణ స్థితిగతులు
ఒకప్పుడు ఈ వన–విష్ణుపూర్ పట్టణం ఎంతో సౌభాగ్యంతో వర్ధిల్లింది. ఇప్పటికీ అక్కడ వెలసివున్న లాల్బంధ్, కృష్ణబంధ్ వంటి పెద్ద కొలనులు, అనేక పెద్ద దేవాలయాలు (శిథిలావస్థలో ఉన్న వాటితో సహా), విశాలమైన శుభ్రమైన వీథులు, అంగళ్ళతో నిండిన బజార్లు, చక్కని ఇళ్ళను చూస్తే ఆ పట్టణ గత వైభవం కొట్టొచ్చినట్లు తెలిసిపోతుంది. వ్యాపారం, వృత్తి పనుల మీద ఆ పట్టణానికి తీర్థప్రజల్లా జనం వస్తూపోతూ ఉండడం చూడవచ్చు.
20. శ్రీ మదన్మోహన్ – మృణ్మయి
ఒకప్పుడు శక్తిమంతులైన విష్ణుపూర్ రాజులు ధర్మపరాయణులై, విద్యా పోషకులై అలరారారు. ఒకప్పుడు ఆ పట్టణం సంగీతానికి పెట్టింది పేరుగా కీర్తి గాంచింది. శ్రీచైతన్యుల అనుయాయులైన రూప, సనాతనాదుల నిష్క్రమణానంతరం విష్ణుపూర్ రాజవంశం వైష్ణవ సంప్రదాయాన్ని అవలంబించింది. కలకత్తా బాగ్‌బజార్‌లో ప్రతిష్ఠితమై ఉన్న శ్రీమదన్మోహన్ విగ్రహం ఒకప్పుడు ఈ రాజవంశానికి చెందినదే. గోకుల్ చంద్ర మిత్రా అనే వ్యక్తి ఒకప్పుడు ఒక విష్ణుపూర్ రాజుకు పెద్దమొత్తంలో ధనం అప్పుగా ఇచ్చాడట. అప్పు తీర్చవలసిన సమయం రాగానే మిత్రా ధనం తిరిగి పుచ్చుకోవడానికి బదులుగా, తనను ముగ్ధుణ్ణి చేసిన ఆ విగ్రహాన్ని అడిగి, తీసుకొన్నాడు. శ్రీమదన్మోహన్ విగ్రహమే కాక, విష్ణుపూర్ రాజులు మృణ్మయి అనే ఎంతో ప్రాచీనమైన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ దేవి ‘జాగ్రద్దేవత’ గా ప్రసిద్ధి గాంచింది. ఆ రాజవంశం క్షీణదశలో పడిన తరువాత, ఒక పిచ్చి స్త్రీ ఈ విగ్రహాన్ని పగలగొట్టిందట. అందువలన రాజకుటుంబం మరో కొత్త విగ్రహాన్ని చేయించి ప్రతిష్ఠించిందట.
శ్రీరామకృష్ణులు ఇతర దేవాలయాలను సందర్శించిన తరువాత ఈ మృణ్మయి దేవిని దర్శింప బయలుదేరారు. కాని దారిలో ఒక చోట భావపారవశ్య స్థితిలో ఆయన మృణ్మయిదేవి ముఖారవిందాన్ని మాత్రం దర్శించారు. ఆయన దేవాలయానికి వెళ్ళి కొత్తగా ప్రతిష్ఠితమైన దేవి విగ్రహాన్ని చూడగానే, తాను భావపారవశ్యంలో చూసిన దేవి ముఖంలా, ఈ దేవి ముఖం కనిపించలేదు. ఈ తేడాకు కారణం ఏమిటో ఆయనకు అంతుబట్టలేదు. వాకబు చేసిన తరువాత కొత్త విగ్రహం, పాత విగ్రహానికి భిన్నమైనదన్న యథార్థం తెలియవచ్చింది. కొత్త విగ్రహాన్ని మలచిన శిల్పి తన కౌశలం ప్రదర్శించడం కోసం దేవీ ముఖాన్ని మరో తీరులో మలచాడు. పగిలిపోయిన పాత విగ్రహం తలను ఒక బ్రాహ్మణుడు తన ఇంట్లో పదిలపరిచాడు. కొద్దికాలం తరువాత అతడు ఆ తలకు సరిపడే మరో విగ్రహాన్ని తయారు చేయించి, దాన్ని ఆ విగ్రహానికి అమర్చి, లాల్బంధ్ తటాకం వద్ద ఒక అందమైన చోట దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, నిత్యపూజాదికాలు నిర్వర్తింపసాగాడు.
21. లోకుల నైజాన్ని కనుగొనగలిగే శ్రీరామకృష్ణుల అంతర్దృష్టి – మొదటి ఉదాహరణ
తమ వద్దకు వస్తూవుండే వ్యక్తుల ఉద్దేశాలను, వైఖరులను కనుగొనగలిగే శ్రీరామకృష్ణుల శక్తిని నిరూపించే కొన్ని ఉదాహరణలను ఇక్కడ ప్రస్తావించడం సముచితం. శ్రీరామకృష్ణులు, స్వామి బ్రహ్మానంద* (రాఖాల్)ని తమ మానస పుత్రునిగా ప్రేమించేవారని ఇంతకు మునుపే పేర్కొన్నాం. ఒకరోజు రాఖాల్, శ్రీరామకృష్ణులు గదికి తూర్పు వైపున ఉన్న వసారాలో ఉత్తరం వైపుగా నిలబడి ఏవో విషయాల గురించి మాట్లాడుకొంటున్నారు. ఆ సమయంలో తోట వైపు నుండి పై కప్పు లేని జోడుగుర్రాల బండి ఒకటి రావడం వారు చూశారు. ఆ బండిలో కొందరు పెద్ద మనుషులు కూర్చుని ఉన్నారు. ఆ బండిని చూడగానే, ఆ బండి కలకత్తాకు చెందిన ఎవరో సంపన్నుడిదై ఉంటుందని శ్రీరామకృష్ణులు గ్రహించారు. శ్రీరామకృష్ణుల దర్శనార్థం కలకత్తా నుండి అనేకులు రావడం కద్దు. అందువలన వారు ఆ బండి రావడం చూసి ఆశ్చర్యపోలేదు.
కాని శ్రీరామకృష్ణుల దృష్టి బండిమీద పడగానే, ఆయన భయంతో కుంచించుకుపోయి, వారి దృష్టిలో పడకుండా గబగబా తమ గదిలోకి వెళ్ళి, కూర్చుండిపోయారు. ఆయన అలా ప్రవర్తించడం చూసి ఆశ్చర్యపోయిన స్వామి బ్రహ్మానంద కూడా ఆయనను అనుసరించి గదిలోకి వెళ్ళాడు. రాఖాల్ చూసీచూడగానే శ్రీరామకృష్ణులు, “వెళ్ళు, వెళ్ళు. వాళ్ళు ఇక్కడకు రాగోరితే, నే నిప్పుడు వారిని కలుసుకోలేనని చెప్పు” అని అన్నారు. శ్రీరామకృష్ణులు అలా నిర్దేశించగానే రాఖాల్ మళ్ళీ బయటకు వచ్చాడు. ఇంతలో ఆ పెద్దమనుషులు రానేవచ్చారు; వారు రాఖాల్ని సమీపించి, “ఇక్కడొక సాధువు నివసిస్తున్నారు కదా?” అని అడిగారు. అప్పుడు రాఖాల్ “అవును. ఆయనతో మీకేం పని?” అని వాళ్ళను అడిగాడు. అందుకు జవాబుగా వారిలో ఒక వ్యక్తి, “మా బంధువు లొకరు తీవ్ర రోగానికి గురియైనాడు. ఏ చికిత్స చేసినా నయం కావడంలేదు. అందుకు సాధువు ఏదైనా ఔషధం ఇవ్వగలరనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం” అని జవాబిచ్చాడు. ఆ జవాబు విని రాఖాల్ “మీరు పొరబడ్డారు. ఈయన ఎవరికీ మందుమాకులు ఇవ్వరు. బహుశా మీరు దుర్గానంద బ్రహ్మచారిని గురించి విని ఉంటారు. మందుమాకులకు ఆయననే కలుసుకోవాలి. పంచవటిలో ఒక కుటీరంలో ఆయన వసిస్తూన్నారు. మీరక్కడకు వెళ్ళి ఆయనను కలుసుకోవచ్చు” అని వాళ్ళకు చెప్పాడు.
ఆ పెద్దమనుషులు వెళ్ళిపోయిన తరువాత శ్రీరామకృష్ణులు, రాఖాల్తో, “వారిలో తమస్సు ఎంత కరడుకట్టుకుపోయి ఉందంటే, వారితో మాట్లాడడం సంగతి అలావుంచి, వారి వంక చూడనైనా చూడలేకపోయాను. భయంతో పారిపోయాను” అని చెప్పారు. అనునిత్యం ఉన్నత భావభూముల నుండి ప్రతి స్థలం, వ్యక్తి, వస్తువులో అభివ్యక్తమయ్యే (భగవత్) శక్తి తారతమ్యాలు (ఎక్కువ తక్కువలు) శ్రీరామకృష్ణులు గ్రహించగలగడం మేం ప్రత్యక్షంగా చూశాం. పదేపదే వాకబు చేసి ఆయన పేర్కొన్నట్లు సుగుణాలో లేదా దుర్గుణాలో నిజానికి ఆ సదరు వ్యక్తులలో ఉన్నాయని తేల్చుకొని, తరువాత ఆయన వచనాలను (నిశ్శంకతో) మేం నమ్మేవారం. మామూలు భావభూమిలో నెలకొని ఉన్న స్థితిలో పుణ్యక్షేత్రాదులలో శ్రీరామకృష్ణులు పొందిన అనుభవాలను కొన్నిటిని పాఠకులకు తెలియచేయడం అసంగతం కాబోదు.
22. రెండవ ఉదాహరణ: వివేకానందస్వామి తన స్నేహితుడిని దక్షిణేశ్వరానికి తీసుకురావడం
అతి ఉదారమనస్కుడైన స్వామి వివేకానంద చిన్నతనం నుండి పరుల యాతనలు చూసి ఎంతగానో చలించిపోయేవారు. అందువల్లే ఏ విషయంలోనైనా ఎవరి నుండి ఏదైనా మేలు ఒనగూరుతుందని తెలుసుకోగానే అలా చేయమని లేదా ఆ మేలు పొంద ఆ వ్యక్తి వద్దకు వెళ్ళడానికి తన మిత్రులను, బంధువులను ప్రోత్సహించేవారు. విద్య, ధార్మిక, తదితర విషయాలలో ఎల్లరినీ ప్రోత్సహించడం స్వామీజీ అలవాటు. పైన పేర్కొన్న నిజం ఆయన చర్యలలో సూచనప్రాయంగా తెలియవస్తుంది. ధ్యానం, ప్రార్థనల నిమిత్తం నియమిత రోజులలో వివిధ స్థలాలలో ఆయన సమావేశాలు ఏర్పాటు చేసేవారు. కళాశాల రోజుల్లో మహర్షి దేవేంద్రనాథ్ టాగూర్, కేశవచంద్ర సేన్ వంటి బ్రహ్మసమాజ నాయకులతో పరిచయం కలిగిన వెంటనే, తన మిత్రులలో అనేకులను వారి వద్దకు తోడ్కొని వెళ్ళాడు. యౌవనంలో అడుగిడగానే ఆయన నిర్వహించిన కార్యాలను పరికిస్తే ఆయన స్వభావం అవగతమౌతుంది.
శ్రీరామకృష్ణుల పావన సాంగత్యం పొంది, అసాధారణమైన ఆయన త్యాగ వైరాగ్యాలను, భగవద్భక్తిని చూసి తన మిత్రులను తోటి విద్యార్థులను ఆయన వద్దకు తోడ్కొని వెళ్ళి ఆయనతో పరిచయం కల్పించాడు. ఇలా చేయడం స్వామీజీ జీవితంలో ఒక ధార్మిక వ్రతంగా పరిణమించింది. కాని స్వామీజీ ఎవరినిపడితే వారిని, ప్రతి పరిచయస్థుణ్ణి శ్రీరామకృష్ణుల వద్దకు తోడ్కొని వెళ్ళారని మాత్రం పొరబడకూడదు. చాలా కాలంగా తనతో ఉన్న పరిచయ ఫలితంగా సజ్జనులని, ధార్మికులని గట్టిగా తెలిసిన వ్యక్తులనే స్వామీజీ, దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణుల వద్దకు తీసుకువెళ్ళేవారు.
23. ‘ఎంత ప్రయత్నం చేసినా ఎవరూ తాము కోరినట్లు కాలేరు’
ఆ విధంగా స్వామీజీ అటువంటి అనేకమంది మిత్రులను శ్రీరామకృష్ణుల వద్దకు తీసుకువెళ్ళారు. కాని శ్రీరామకృష్ణుల అంతర్దృష్టి వారి అంతరంగ ప్రవృత్తిలోకి చొచ్చుకునిపోయి ఆ వ్యక్తుల గురించి భిన్నంగా అంచనాలు వేయగలిగిందని, శ్రీరామకృష్ణుల, స్వామీజీ ముఖతా కూడా అప్పుడప్పుడు మేం విన్నాం. స్వామీజీ ఇలా చెప్పేవారు : “శ్రీరామకృష్ణులు నన్ను ఆదరించి ఆధ్యాత్మిక ప్రబోధంతో నన్ను అనుగ్రహించిన రీతిలో నా మిత్రులను అనుగ్రహించలేదని గ్రహించి, వారిని కూడా నన్ను అనుగ్రహించినట్లే అనుగ్రహించమని ఆయనను ఒత్తిడి చేశాను. కుర్రతనపు మూర్ఖత్వంతో ఈ అంశంపై అనేక సందర్భాలలో ఆయనతో వాదించడానికీ వెనుకాడలేదు. ‘ఎందుకు, మహాశయా? ఒకరిని అనుగ్రహించి మరొకరిని అనుగ్రహించని పక్షపాతబుద్ధి భగవంతుడికి ఎన్నటికీ ఉండదు. అటువంటప్పుడు మీరు నన్ను ఆదరించినట్లు నా మిత్రులను ఎందుకు ఆదరించడంలేదు? ఆసక్తితో, స్వయంకృషితో విద్యను ఆర్జించినవారు ఎవరైనా పండితులు కాగలరు. అదే విధంగా ప్రయత్నించి ఆధ్యాత్మిక అనుభూతిని కూడా పొందగలగడం తథ్యం.’ అందుకు శ్రీరామకృష్ణులు ‘నాయనా, నేనేం చేయగలను? వారందరిలో ఆబోతు వంటి పాశవిక వైఖరి నెలకొని ఉందని అమ్మ నాకు చూపించింది. ఈ జన్మలో వారికి ఆధ్యాత్మికానుభూతి కలుగదు. నన్నేం చేయమంటావు? అయినా నువ్వు చెబుతున్నదేమిటి? కేవలం సంకల్ప ప్రయత్నాలతో ఎవరైనా జీవితంలో తాము కోరుకొన్నట్లు కాగలరా?’ ఆయన వచనాలను అప్పుడు నేను పట్టించుకొనే స్థితిలో లేనని జవాబు ఇచ్చారు. దానికి నేనిలా అన్నాను : ‘మహాశయా, మీరేమంటున్నారు? సంకల్పించుకొని, ప్రయత్నంచేస్తే తాము కోరుకొన్నట్లు కాలేరా, ఏమిటి? తప్పకుండా కాగలరు. మీ మాటలను నమ్మలేక పోతున్నాను.’ నేను ఎంత చెప్పినా మళ్ళీ ఆయన, ‘నువ్వు నమ్మినా, నమ్మకపోయినా, అమ్మ నాకు చూపించింది అదే’ అని అదే మాట చెప్పారు. అప్పట్లో ఆయన మాటలను ససేమిరా ఒప్పుకొనేవాణ్ణి కాను. కాని కాలం గడిచేకొద్దీ, అనుభవం పొందిన కొద్దీ, శ్రీరామకృష్ణుల వచనాలే నిజమనీ, నా అభిప్రాయమే తప్పనీ అవగతం చేసుకోసాగాను.”
24. మూడవ ఉదాహరణ: శశధర పండితుణ్ణి చూడబోయినప్పుడు మంచి నీళ్ళు త్రాగే సందర్భంలోనిది
ఈ విధంగా ఎన్నో రీతుల పరీక్షించి, అర్థంచేసుకొన్న తరువాతే శ్రీరామకృష్ణుల వచనాలన్నిటినీ క్రమంగా నమ్మసాగానని స్వామీజీ చెప్పేవారు. శ్రీరామకృష్ణుల ప్రతి చర్యను, ప్రవర్తనను స్వామీజీ పరీక్షించారనడానికి స్వామీజీయే స్వయంగా మాకు చెప్పిన ఒక సంఘటనను గురించి ఇక్కడ వివరించడం అసంగతం కాబోదు. స్వామీజీ నుండి పండిత శశధర తర్కచూడామణిని గురించి విని, 1885 వ సం ॥ రథయాత్రోత్సవం నాడు ఆయనను కలుసుకోవడానికి శ్రీరామకృష్ణులు వెళ్ళారు. మాటల సందర్భంలో శ్రీరామకృష్ణులు, పండితుడికి ఇలా ఉద్బోధ చేశారు : “జగజ్జనని ప్రత్యక్ష ఆదేశం పొందిన వారు మాత్రమే నిజమైన ధర్మప్రచారకులు. ధర్మప్రచారకులమని చెప్పుకొనే ఇతరుల వాగాడంబరం వ్యర్థ ప్రగల్భమే అవుతుంది.” పిదప శ్రీరామకృష్ణులు తాగడానికి మంచినీళ్ళు అడిగారు. శ్రీరామకృష్ణులకు దాహం వేసే నీళ్ళు అడిగారో లేదా మరో ఉద్దేశంతో అడిగారో మాకు తెలియదు. ఎందుకంటే, ఎవరైనా సాధువో, సన్న్యాసో లేదా అతిథో లేదా ఫకీరో ఒక గృహస్థుడి ఇంటికి వెళ్ళి, ఏమీ పుచ్చుకోకుండా తిరిగి వెళ్ళిపోతే ఆ గృహస్థుడికి శుభం కాదని, ఆయన మాతో ఇంకో సందర్భంలో చెప్పివున్నారు. అందువలన ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు, ఆ గృహస్థుడు తానుగా ఏమీ సమర్పించకపోయినా లేదా మరిచిపోయినా, ఆయనే స్వయంగా అడిగి ఏదో ఒకటి తినడమో, త్రాగడమో చేసివచ్చేవారు. ఏది ఏమైనప్పటికీ, శ్రీరామకృష్ణులు మంచినీళ్ళు అడగ్గానే నామాలు పెట్టుకొని, జపమాల ధరించిన ఒక వ్యక్తి గబగబా వెళ్ళి ఎంతో మర్యాద కనబరుస్తూ ఒక గ్లాసు నీళ్ళు తీసుకువచ్చి ఆయనకు ఇచ్చాడు. ఆ గ్లాసు పుచ్చుకొన్నారేగాని, ఎంత ప్రయత్నించినా ఆయన నీళ్ళు త్రాగలేకపోయారు. అది చూసి పక్కనే ఉన్న మరో వ్యక్తి ఆ నీళ్ళు పారపోసి మరోగ్లాసు నీళ్ళు పట్టుకొచ్చాడు. శ్రీరామకృష్ణులు కాసిని నీళ్ళు త్రాగి, పండితుని వద్ద నాటికి సెలవు పుచ్చుకొని తిరిగి వెళ్ళిపోయారు. మొదట తీసుకువచ్చిన నీటి గ్లాసులో ఏదో పడివుంటుందనీ, అందువలననే శ్రీరామకృష్ణులు త్రాగలేదనీ అందరూ అనుకొన్నారు.
అప్పుడు తాను గురుదేవుల ప్రక్కనే కూర్చుని ఉన్నాననీ, కాబట్టి ఆ గ్లాసులో దుమ్ముధూళి లాంటివి ఏవీ పడకపోవడం తాను స్పష్టంగా చూశాననీ స్వామీజీ చెప్పారు. అయినప్పటికీ శ్రీరామకృష్ణులు ఆ నీరు త్రాగడానికి నిరాకరించారు. కారణం ఏమైవుంటుందోనని దీర్ఘంగా యోచించి బహుశ ‘స్పర్శ దోషం’ వలన గ్లాసు అపవిత్రమై ఉండవచ్చుననే నిర్ణయానికి వచ్చారు స్వామీజీ. అలా నిర్ణయానికి రావడానికి కారణం ఇది: ఎవరిలో విషయాసక్తి, కామకాంచన ఆసక్తి ప్రబలంగా ఉంటుందో, ఎవరు దగా, మోసం ద్వారా అన్యాయంగా ధనార్జన చేస్తారో, తమ విషయసుఖేచ్ఛ, లాలస తీర్చుకోవడానికి బాహ్యంగా ధార్మికవేషం వేస్తారో, అటువంటి వ్యక్తులు తినడానికి లేదా త్రాగడానికి ఏదైనా ఇచ్చినప్పుడు, వాటిని స్వీకరింప తాను చేతిని ముందుకు చాచలేకపోయేవాడినని శ్రీరామకృష్ణులు చెప్పడం స్వామీజీ వినివున్నారు. అటువంటి వ్యక్తుల స్వభావం తనకు ఇట్టే తెలిసిపోయేదనీ, తెలియకుండానే అటువంటి ఆహారం చేత పుచ్చుకొంటే తక్షణం తన చేతులు ముడుచుకుపోయేవని శ్రీరామకృష్ణులు చెప్పడం కూడా స్వామీజీ వినే ఉన్నారు.
ఆ ఆలోచన మదిలో మెదలగానే పై సంఘటనను పురస్కరించుకొని నిజానిజాలను తేల్చుకోవాలని స్వామీజీ సంకల్పించుకొన్నారు. తమతో దక్షిణేశ్వరానికి రమ్మని శ్రీరామకృష్ణులు ఎంత చెప్పినా కూడా తనకేదో అత్యవసరమైన పని ఉందని చెప్పి, ఆయనను బండిలో ఎక్కించి, పంపించివేశారు. పైన పేర్కొన్న పంగనామాల వ్యక్తి తమ్ముడితో స్వామీజీకి కొంత పరిచయం ఉంది. శ్రీరామకృష్ణులు వెళ్ళిపోయిన తరువాత, స్వామీజీ ఆ వ్యక్తిని ఒక ఏకాంత ప్రదేశానికి తోడ్కొని వెళ్ళి, అతడి అన్నగారి శీలం, స్వభావాల గురించి ప్రశ్నించారు. మొదట్లో అతడు జవాబు చెప్పడానికి తటపటాయించాడు. చివరకు, ‘నా అన్న దుర్గుణాల గురించి నేను ఎలా చెప్పగలను?’ అని మాత్రం అన్నాడు. అతడు చెప్పిన దానినిబట్టి కొంత నిజాన్ని అర్థం చేసుకోగలిగాను. తరువాత నాకు పరిచయం ఉన్న ఆ కుటుంబంలోని మరొక వ్యక్తిని అడిగి అంతా తెలుసుకొన్నాను. దాంతో నా సంశయం తీరిపోయింది. లోకుల మనస్సులను గురుదేవులు ఎలా తెలుసుకోగలిగారా అని ఆశ్చర్యపోయాను” అని స్వామీజీ మాకు విశదపరచారు.
25. శ్రీరామకృష్ణుల మనోనిర్మాణం, అంతర్దృష్టి
మామూలు భావభూమిలో ఉన్నప్పుడు సైతం శ్రీరామకృష్ణులు అన్ని వస్తువులలోని స్వతస్సిద్ధమైన, కంటికి కానరాని మంచి చెడు గుణాలను ఎలా గ్రహించగలిగేవారో మనం తెలుసుకోగోరితే ముందుగా ఆయన మనోనిర్మాణాన్ని అవగతం చేసుకోవాలి; ఈ మనో నిర్మాణమే అన్నింటిని అంచనాకట్టి సరైన నిర్ణయానికి రావడానికి దోహదం చేసే ప్రమాణాన్ని ఆయనకు కల్పించింది. ఈ పుస్తకంలో పలుచోట్ల దానిని గురించి సూచించివున్నాం. అందువలన దానిని గురించి ఇక్కడ క్లుప్తంగా ప్రస్తావిస్తే సరిపోతుంది. శ్రీరామకృష్ణుల మనస్సు ఏ లౌకిక వస్తువు పట్లా అనురక్తి పొందనందు వలన, అది పూర్తిగా ఆయన వశంలోనే ఉండేది; ఆ కారణం చేత సంకల్ప మాత్రాన ఒక వస్తువుపై మనస్సును లగ్నం చేయడం గాని లేదా ఉపసంహరించడం గాని చేయగలిగేవారు. అవాంఛనీయమని పరిత్యజించిన ఏ వస్తువునైనా సరే మళ్ళీ ఎన్నడూ కన్నెత్తి కూడా ఆయన చూసేవారు కారు. అనన్యసాధారణమైన నిష్ఠ, వివేచనాశక్తి, సమగ్ర సావధానతలు ఆయనకు మనస్సును నియంత్రించుకోగల శక్తిని ఒసగాయి. తత్ఫలితంగా ఎప్పుడు, ఎక్కడ, దేని మీద, ఎంతకాలం మనస్సును ఏకాగ్రం చేయగోరేవారో అంతకాలం ఆ సదరు వస్తువుపై మనస్సును లగ్నం చేయగలిగేవారు. క్షణమాత్రం కూడా ఆయన మనస్సు మరే ఇతర ఆలోచనలకు, ఊహలకు లోనయ్యేది కాదు.
ఆయన మనస్సు ఒక విచిత్రమైన రీతిలో వ్యవహరించేది. ఏదైనా ఒక వస్తువును స్వీకరించడమో లేక త్యజించడమో చేయాలనుకోగానే, ఆయన మనస్సులోని ఒక భాగం, రెండవ భాగంతో, “ఎందుకు అలా చేయగోరుతున్నావు?” అని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబు వస్తే, “సరే, మంచిదే, అలాగే చేయి” అని అంటుంది. ఆ నిర్ణయానికి వచ్చిన తక్షణమే మనస్సులోని రెండవ భాగం ఇలా చెబుతుంది : “నీ సంకల్పాన్ని అంటిపట్టుకొని ఉండు. తింటున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుకొంటున్నప్పుడు, నడుస్తూవున్నప్పుడు లేదా కలగంటున్నప్పుడు కూడా అందుకు విరుద్ధంగా ప్రవర్తించకు.” పిదప ఆయన మనస్సు దానిని ఏకగ్రీవంగా అంగీకరించి, తదనుగుణంగా వ్యవహరించేది. అచంచలమైన ఆయన నిష్ఠాగరిష్ఠత కాపరిలా నిలబడి మనస్సు ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించేది. కాబట్టి పొరపాటుగానైనా ఆయన తన నిర్ణయానికి విరుద్ధంగా ఎన్నటికీ వ్యవహరించేవారు కారు; లోపలి నుండి ఎవరో తన ఇంద్రియాలను కట్టిపడేసి ఆ రీతిలో ప్రవర్తించకుండా అడ్డుకొంటున్నట్లు ఆయనకు స్పష్టంగా స్ఫురించేది. వ్యక్తుల, వస్తువుల పట్ల ఆయన జీవితాంతం ప్రవర్తించిన తీరుతెన్నులను అధ్యయనం చేసినప్పుడు పైన పేర్కొన్న ఆయన వచనాలు మనకు అవగతమౌతాయి.
26. ఒక ఉదాహరణ
బాలుడైన గదాధర్ కేవలం కొద్ది రోజులు పాఠశాలకు వెళ్ళీవెళ్ళగానే, ‘బియ్యం, అరటికాయలు మూట కట్టుకోవడానికి ఉపయుక్తమైన ఈ పొట్టకూటి విద్య నాకు అవసరం లేదు. అటువంటి విద్యను నేను నేర్చుకోను’ అని చెప్పడం పరికించండి. తమ్ముడు ఇలా దారితప్పుతున్నాడని భావించి, పెద్దన్నగారైన రాంకుమార్ తనతో కలకత్తాకు తోడ్కొని వెళ్ళి స్వయంగా తన పర్యవేక్షణలో విద్య నేర్ప ప్రయత్నించాడు. కాని అట్టి విద్య కేవలం పొట్టకూటికై ఉద్దేశింపబడినదన్న గదాధర్లో చిన్ననాడు ఏర్పడిన అభిప్రాయాన్ని అన్నగారు మార్చలేకపోయాడు. కలకత్తాలో పాఠశాలను ప్రారంభించి తన శక్తిమేరకు విద్యార్థులకు విద్య నేర్పిస్తూన్నప్పటికీ, తన అన్నగారు కుటుంబాన్ని లోటులేకుండా పోషించలేకపోవడం గదాధర్‌కు తెలియని విషయం కాదు. పండితుడూ, సజ్జనుడూ అయిన తన పెద్దన్నగారు సంపన్నులను భట్రాజుల వలే పొగడి ధనం ఆర్జించడం కంటే, రాణీరాస్మణి కాళీకాలయంలో అర్చక పదవిని స్వీకరించడం ఎంతో సముచితమని శ్రీరామకృష్ణులు భావించి, అన్నగారు చేసిన ఆ పనికి తన ఆమోదముద్ర వేశారు.
27. రెండవ ఉదాహరణ
సాధన చేస్తున్న కాలంలో శ్రీరామకృష్ణులు ధ్యానానికి కూర్చోగానే శరీరంలోని కీళ్ళన్నీ కటకట శబ్దంతో యాంత్రికంగా మూసుకుపోయేవి. చాలా సేపటి వరకు ఆయనను కదలనివ్వకుండా కూర్చోబెట్టడానికే ఎవరో లోపల నుండి తమ కీళ్ళన్నిటికీ తాళం వేస్తున్నట్లు ఆయనకు అనిపించేది. అలా తాళం వేసిన వ్యక్తి మళ్ళీ వాటిని తెరవనంత వరకు శ్రీరామకృష్ణులు తన ఇచ్ఛమేరకు కాళ్ళను, చేతులను, మెడను కనీసం అటూ ఇటూ కదల్చలేకపోయేవారు. లేదా, ఒక త్రిశూలం చేత పుచ్చుకొన్న వ్యక్తి, ఆయన ప్రక్కనే కూర్చుని, “భగవంతుణ్ణి తప్ప మరి దేనిని గురించియైనా చింతన చేశావో, ఈ త్రిశూలంతో నిన్ను పొడిచివేస్తాను” అని బెదిరించేవాడు.
28. మూడవ ఉదాహరణ
పూజా సమయంలో జగజ్జననితో తాదాత్మ్యం చెందమని శాస్త్రాలు సూచిస్తున్నాయి. శ్రీరామకృష్ణులు, వారి మనస్సును శాసించగానే, అది అట్లే వర్తించేది. కాని జగజ్జనని పాదపద్మాలకు మందారపువ్వులు, బిల్వ పత్రాలు అర్పించబోతున్నప్పుడు, ఈ తాదాత్మ్యానికి విరుద్ధంగా ఎవరో బలవంతంగా తన చేతులను తన తల వైపుగా త్రిప్పివేయడం జరిగేది.
అదే విధంగా సన్న్యాసదీక్ష పుచ్చుకొన్న మరుక్షణమే ఆయన మనస్సు సమస్త జీవులలోను ఆ ఒక్క అద్వైత బ్రహ్మాన్నే దర్శించసాగింది. సన్న్యాసం స్వీకరించిన తదనంతరం పితృతర్పణం విడువబోతున్నప్పుడు ఆయన చేతులు కొంకర్లుబోయి, దోసిలిలో నీరు పట్టుకోలేకపోయారు. సన్న్యాసం పుచ్చుకోవడం వలన శాస్త్రవిహిత కర్మలు తమ నుండి వైదొలగాయని ఆయన అప్పుడు గ్రహించారు.
29. శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక అనుభవాలు: శాస్త్రాల ధ్రువీకరణ
అనాసక్తి, వివేచన, ఏకాగ్రత, నిష్ఠ మొదలైనవి ఆయన మనస్సుకు స్వాభావికమైనవని ఋజువు చేయడానికి ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు. శ్రీరామకృష్ణుల ఈ అనుభవాలు శాస్త్రాలలో పేర్కొనబడిన వాటితో కచ్చితంగా సరిపోవడం వలన, శాస్త్రోక్తులు సత్యమే అన్న విషయం ఋజువు అవుతున్నది. స్వామి వివేకానంద ఇలా చెప్పారు : “శ్రీరామకృష్ణులు ఈసారి ఇలలో విద్యాగంధం లేనివారుగా అవతరించడానికి ఇదే కారణం. హిందువుల వేదవేదాంత శాస్త్రాలను, ఇతరుల మత గ్రంథాలలో నమోదైన ఆధ్యాత్మిక స్థితులను నిరూపణ చేయడానికే, ఆ గ్రంథాలలో సూచించిన మార్గాలను అనుసరించి మనిషి నిజంగా ఆ ఆధ్మాత్మిక స్థితులను అనుభూతం చేసుకోగలడని ఋజువు చేయడానికే ఆయన విద్యాగంధం లేనివారుగా ఉండిపోయారు.”
30. అద్వైతజ్ఞాన ప్రమాణం
నిర్వికల్ప అవస్థను పొంది, అద్వైతానుభవాన్ని సంతరించుకోవడమే మానవ జీవిత చరమానుభూతి అని, శ్రీరామకృష్ణుల స్వాభావిక మనోస్థితిని పరిశీలించినప్పుడు సుస్పష్ట మౌతుంది. ఆ నిర్వికల్ప స్థితిలో, “నక్కలన్నీ ఒకే రీతిలో ఊళలు వేయడం” అనుభూతమౌతుందని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. నక్కల ఊళలన్నీ ఎలా ఒకే రీతిలో ఉంటాయో, అదేవిధంగా నిర్వికల్ప భూమికి చేరిన ప్రతి ఒక్కరూ; ఆ స్థితి నుండి దర్శించిన జగత్కారణుడైన భగవంతుణ్ణి గురించి వెలిబుచ్చే విషయమంతా ఒకేరకంగా ఉంటుందని ఆయన వచనాలకు అర్థం. ప్రేమావతారుడైన శ్రీచైతన్యులను గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు : “ఏనుగు బాహ్యదంతాలు శత్రువును ఎదుర్కోవడానికి, లోపలి దంతాలు ఆహారం నమిలి తినడానికి అమరివున్నాయి. అదే విధంగా శ్రీచైతన్యుల విషయంలో కూడా ద్వైతభావం బాహ్యవైఖరిగా, అద్వైత భావం ఆంతరిక వైఖరిగా ఒప్పారుతున్నాయి.” కాబట్టి సదా ఏకరీతిలో ఉండే అద్వైతభావమే ప్రతి విషయం నిర్ణయించడంలోను శ్రీరామకృష్ణుల ప్రమాణం అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వ్యక్తిగతంగాగాని, సమాజపరంగాగాని ఏఏ భావాలు, చర్యలు లేక కర్మకలాపాలు ఎంత మేరకు ఆ నిర్వికల్ప భూమికి చేర్చడంలో దోహదం చేస్తాయో, ఆ భావాలు మొదలైన వాటిని శ్రీరామకృష్ణులు ఆ మేరకు ఇతర భావాలకంటే ఉన్నతమైనవని పరిగణించేవారు.
31. దర్శనాలు రెండు రకాలు. స్వసంవేద్య మరియు పరసంవేద్య
ఆధ్యాత్మిక భావఫలితంగా శ్రీరామకృష్ణులకు కలిగిన దివ్యదర్శనాలను గురించి అధ్యయనం చేసినప్పుడు, వాటిలో కొన్ని కేవలం ఆయనకు మాత్రమే తెలియవచ్చేవిగా, మరికొన్ని ఇతరులు కూడా గ్రహించ గలిగేవిగా ఉండడం మనం కనుగొనవచ్చు. నిరంతర అభ్యాసం, నిష్ఠాగరిష్ఠత మూలంగా ఆయన స్వకీయ ఆలోచనలు ఘనీభూతమై, మూర్తిమంతమై ఆత్మగత అనుభవాలుగా రూపుదిద్దుకొని, ఆ రూపాలలో ఆయనకు అభివ్యక్తమయ్యేవి. అవి కేవలం ఆయనకు మాత్రమే గ్రాహ్యమయ్యేవి. ఉన్నతోన్నత భావభూములను అధిరోహిస్తూ నిర్వికల్ప భూమికి చేరుకోబోతున్నప్పుడూ లేదా భావముఖంలో నెలకొని ఉన్నప్పుడూ ఆయనకు ఇతర దర్శనాలు కలిగేవి. ఆ సమయంలో వాటిలోని విషయం ఇతరులెవరికీ తెలియకపోయినా వాటి యథార్థం గురించి – అప్పటికే అవి వాస్తవాలనీ లేదా భవిష్యత్తులో అలా జరుగనున్నవనీ – శ్రీరామకృష్ణులు తెలియజేసేవారు; ఆయన తెలిపినట్లే తదనంతరం నిజంగా అవి అలా జరగడం ఇతరులకు అనుభవమయ్యేది. వీటిలో మొదటి కోవకు చెందిన దర్శనాలు నిజమని గ్రహించాలంటే శ్రీరామకృష్ణులకు ఉన్న శ్రద్ధ, విశ్వాసం, భక్తి, నిష్ఠలు మనమూ కలిగిఉండాలి; లేదా ఏ ఉన్నత భూమిని అధిరోహించినప్పుడు ఆయనకు ఆ దర్శనాలు కలిగాయో, ఆ ఉన్నత భూమిని మనమూ అధిరోహించ గలగాలి. కాని రెండవ కోవకు చెందిన దర్శనాలు యథార్థమైనవని గ్రహించడానికి ఏ విశ్వాసంగాని, సాధనగాని అవసరం లేదు. ఎందుకంటే కాలక్రమంలో అటువంటివి సంఘటిల్లడం చూసి అవన్నీ యథార్థమైనవేనని నమ్మక తప్పదు.
32. వస్తువుల యథార్థ స్వభావంతోనే శ్రీరామకృష్ణులు సంతృప్తి చెందేవారు
శ్రీరామకృష్ణుల మనోనైజం గురించి ఇంతకు మునుపు మేం చెప్పిన దాన్ని బట్టీ, ఇప్పుడు ప్రస్తావించిన దాన్ని బట్టీ చూస్తే, అటువంటి మనస్సు మామూలు చైతన్యస్థితిలో నెలకొని ఉన్నప్పుడు కూడా ఊరకే ఉండిపోదని గ్రహించవచ్చు. ఎందుకంటే, తన ఎరుకలోకి వచ్చిన వస్తువుల, వ్యక్తుల స్వభావ ప్రవర్తనలను అధ్యయనం చేసి, సబబైన నిర్ణయానికి వచ్చేవరకు ఆ మనస్సు తృప్తి చెందేది కాదు. పండితులు శాస్త్రాధ్యయనం చేయడం పొట్టకూటి కోసమేనని చిన్ననాడే వివేచనతో గ్రహించి, పరిహాసంగా తాను పేర్కొనే ‘బియ్యం, అరటికాయలు’ సముపార్జించిపెట్టే విద్యను నేర్వ నిరాకరించారు. వయస్సు పెరిగేకొద్దీ అదే మనస్సు పలుచోట్ల పలురకాల వ్యక్తులతో సంసర్గం పొంది వారిని గురించి వివిధ నిర్ణయాలకు రాగలిగింది. ఆ నిర్ణయాలే మన ప్రస్తుత చర్చనీయాంశం.
33. శాక్తుల, వైష్ణవుల మధ్య నెలకొన్న విద్వేషం
శ్రీచైతన్యుల మరణానంతర కాలంలో ప్రారంభమైన శాక్తుల, వైష్ణవుల మధ్య ఏర్పడిన విద్వేషం అప్రతిహతంగా కొనసాగిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాంప్రసాద్ వంటి ఏదో కొద్దిమంది సాధకులు తమ సాధనల మూలంగా కాళీ కృష్ణుల ఏకత్వాన్ని అనుభూతం చేసుకొని, ఆ రెండు తెగల మధ్య చెలరేగుతున్న విద్వేష భావం తప్పని ప్రచారం చేశారు. అయితే వారి ఉపదేశాన్ని జనసామాన్యం ఖాతరు చేయలేదనీ, పాటలు, పరిహాసాలు, కథలు, ఒకరి దేవతలను మరొకరు కించపరచుకోవడం మూలంగా, ఆ విద్వేషభావం అట్లే కొనసాగిందనీ స్పష్టమౌతుంది. చిన్నతనం నుండి శ్రీరామకృష్ణులకు ఈ విషయం తెలియనిది కాదు. అంతేగాక, ఈ రెండు తెగల శాస్త్రాలలో పేర్కొన్న సాధనలు అనుష్ఠించి, వాటిలో పరిపూర్ణత్వం సంతరించుకొని, రెండు మార్గాలు సత్యాలే అని శ్రీరామకృష్ణులు అనుభూతం చేసుకొన్నారు. శాక్తుల, వైష్ణవుల మధ్య చెలరేగుతున్న ఈ విద్వేషానికి హేతువు ఆధ్యాత్మికత కొరవడడం మూలంగా వారిలో జనించిన దురహంకారమే, దురభిమానమే అని ఆయన స్పష్టంగా అవగతం చేసుకొన్నారు.
34. శ్రీరామకృష్ణులు ఆ విద్వేషం తొలగించిన వైనం
శ్రీరామకృష్ణుల తండ్రియైన క్షుదీరాం శ్రీరామచంద్రుని ఉపాసకులు. దైవికంగా శ్రీరఘువీరుని సాలగ్రామాన్ని పొంది, దానిని ఇంట్లో ప్రతిష్ఠించారు. శ్రీరామకృష్ణులు వైష్ణవుల వంశంలో జన్మించినప్పటికీ, చిన్నతనం నుండి ఆయన శివుని మీద, విష్ణువు మీద సరిసమానంగానే భక్తిప్రపత్తులు నెరపారనడం నిర్వివాదాంశం. బాల్యంలో ఒక సందర్భంలో శివుని వేషం ధరించి, అదే భావపారవశ్యంలో కొన్ని గంటల సేపు ఉండిపోయారనే విషయం నేటికీ ఇరుగుపొరుగు వారు చెప్పుకోవడం కద్దు. ఆ సంఘటన జరిగిన స్థలాన్ని అందుకు నిదర్శనంగా వారు చూపిస్తారు కూడా. మరొక సంఘటనను ఇక్కడ ప్రస్తావించవలసి ఉంది. ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులు, తన కుటుంబంలోని యావన్మందికీ విష్ణువు, శక్తి మంత్రదీక్ష ఒసగారు. వారి మనస్సులలోని విద్వేషాన్ని తొలగించడం నిమిత్తమే ఆయన అలా వ్యవహరించారని మనం ఊహించవచ్చు.
35. ఔషధ నిర్ణయం చేసి మందుమాకులిచ్చే సాధు సంప్రదాయానికి మూలం: క్రమేణా వారి ఆధ్యాత్మిక పతనం
ధర్మపాలకుడైన అశోక చక్రవర్తి జనసామాన్య శ్రేయస్సు కోసం విద్యను, ధార్మికతను ప్రచారంచేయ సంకల్పించడం అందరికీ సువిదితమే. మనుష్యుల, పశువుల శారీరక రుగ్మతల చికిత్స నిమిత్తం అతడు ఎన్నో వైద్యశాలలను భారతదేశంలో పలుచోట్ల నెలకొల్పాడు. ఓషధి మొక్కలు, మూలికలు మొదలైన వాటిని విరివిగా పెంచి అవి అందరికీ సులభంగా అందుబాటులో ఉండేట్లు ఏర్పాట్లు చేయించాడు. అంతేగాక బౌద్ధ సన్న్యాసుల ద్వారా ఔషధాలను, ఓషధి మొక్కలను విదేశాలకు పంపించాడు కూడా. ఆనాటి నుండే బహుశా ఔషధాలను సేకరించి, పదిలపరచుకొనే సాధుసంప్రదాయం ప్రారంభమై ఉండవచ్చు. ఆ వాడుక తాంత్రిక యుగంలో మరింత ప్రాబల్యం సంతరించుకొంది. ఆ వాడుక క్రమేణా సాధువుల ఆధ్యాత్మిక పతనానికి దారి తీయడం గమనించి తదనంతర యుగ స్మృతికారులు అందుకు వ్యతిరేకంగా గొప్ప అభ్యంతరం లేవదీశారు. కాని పూర్వాచారపరాయణమైన భారతదేశంలో నేటికీ ఆ వాడుక నశించలేదు. దక్షిణేశ్వరంలో వసించిన కాలంలోను, తీర్థయాత్రలు చేసినప్పుడు అనేకమంది సాధువులు అటువంటి అన్య విషయాల పట్ల ఆసక్తిపరులై, లౌకికతకు ఎరగావడం శ్రీరామకృష్ణులు చూసేవున్నారు. ఆ విధంగా సాధువులలో సైతం ఆధ్యాత్మికత కొరవడడం గురించి శ్రీరామకృష్ణులకు గట్టి నమ్మకం కుదిరింది. అందుకే మాతో పదేపదే ఆయన ఇలా చెప్పేవారు : “మందుమాకులిచ్చే, మంత్రతంత్ర ప్రయోగం చేసే, ధనం పుచ్చుకొనే, పంగనామాలు తిలకం వంటి గుర్తులు శరీరం మీద అద్దుకొని, పాదుకలను మాత్రమే ధరించే సాధువులను ఎన్నడూ విశ్వసించకండి. తాము గొప్ప సాధువులమని చాటుకోవడానికే వారిలా అతిగా చేస్తారు. ఆ గుర్తులు వారికి వ్యాపార ప్రకటనలలా వినియోగపడతాయి.”
36. వేషమాత్ర సాధువుల గురించి శ్రీరామకృష్ణుల అభిప్రాయం
పైన ప్రస్తావించిన విషయాన్ని బట్టి, వంచకులూ, భ్రష్టులూ అయిన సాధువులను పరికించి పాశ్చాత్య ధోరణులను అనుసరించే కొందరిలా శ్రీరామకృష్ణులు సాధుసంప్రదాయాల నన్నిటినీ రద్దు చేయగోరారని ఎవరూ అపార్థం చేసుకోరాదు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అప్పుడప్పుడు ఆయన ఇలా చెప్పేవారు: “కాషాయాంబరాలు ధరించి, భిక్షపైనే జీవించే సామాన్య సాధువును కూడా ఒక మంచి గృహస్థుడి కంటే శ్రేష్ఠునిగానే పరిగణించాలి; ఎందుకంటే, అతడు జపతపాదులేవీ అనుష్ఠించకపోయినా, పవిత్రునిగా (కామకాంచన రహితునిగా) యావజ్జీవితం భిక్షాన్నంతో గడపగలిగితే, అతడు సామాన్య గృహస్థుని కంటే పరిత్యాగ మార్గంలో ఎంతో పురోగమించినట్లే.” భగవంతునికై సర్వస్వాన్ని త్యజించడమే మనిషి శీలానికి, ప్రవర్తనకు గీటురాయిగా శ్రీరామకృష్ణులు పరిగణించేవారనడానికి పై వచనాలు తార్కాణాలు.
37. నిజమైన సాధువుల జీవితాలే శాస్త్రాలకు జీవం పోస్తాయి
ఏ సంప్రదాయానికి చెందినవారైనా – భక్తి మార్గావలంబులైనా లేదా జ్ఞాన మార్గావలంబులైనా – భక్తి నిష్ఠలున్న సాధువులను శ్రీరామకృష్ణులు గౌరవించే వారనడానికి అనేక ఉదాహరణలు మేం తెలిపివున్నాం. ఇటువంటి మహాత్ముల భగవదనుభూతి వలననే భారతదేశ సనాతన ధర్మమనే జ్యోతి జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ వస్తోంది. వీరిలో భగవత్సాక్షాత్కారం పొంది, నానారకాల మాయాబంధనాల నుండి విముక్తులైన వారు, వేదాది శాస్త్రాలను ఆధ్యాత్మిక సత్యాల కోశాగారంగా నిరూపణ చేసి, వాటి సాధికారికతను నెలకొల్పారు. వైశేషికాది హేతువాదులతో సహా భారతీయ దార్శనికులందరూ, సత్యద్రష్టలకు మాత్రమే వేదాలు వెల్లడైనాయని ఏకగ్రీవంగా ఆమోదించారు. కాబట్టే నిశిత అంతర్దృష్టి సంపన్నులైన శ్రీరామకృష్ణులు ఆ నిజాన్ని గ్రహించే ఆ మహాత్ములను గౌరవించారనడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు.
38. నిజమైన సాధువులలో కూడా సంకుచితత్వం ఉండడాన్ని శ్రీరామకృష్ణులు గమనించడం
నిష్ఠభక్తి గల సాధువులను శ్రీరామకృష్ణులు గౌరవించి, వారి సాంగత్యంలో అమితానందాన్ని పొందినప్పటికీ, వారిలో కొరవడిన ఒక లక్షణం కారణంగా ఆయన అనేక సందర్భాలలో బాధను అనుభవించారు. తనలా సమాన ప్రేమ, అభిమానాలతో వారు అన్ని సంప్రదాయస్థులతోనూ కలసి మెలసి మెలగకపోవడం శ్రీరామకృష్ణులు గుర్తించారు. అద్వైత సాధన మార్గంలో ఎంతో పురోగమించిన సాధకులలో కూడా ఈ సంకుచితత్వం పాదుకొని ఉండడం ఆయన గుర్తించారు. అటువంటప్పుడు భక్తి మార్గావలంబుల విషయం గురించి వేరే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా! అద్వైత భూమిని అధిరోహించి ఉదార సమభావాన్ని సంతరించుకోవడానికి మునుపే ఈ సాధువులు ఇతర మార్గావలంబులైన సాధకులను ఆధ్యాత్మికంగా అధములనీ లేదా క్రిందిస్థాయి వారనీ అవహేళన చేసేవారు. ఒకే గమ్యం వైపుగా పురోగమిస్తున్న సాధకులలో అటువంటి పరస్పర ఓర్వలేనితనం ఉండడం చూసి మహోదారభావ సంపన్నులైన శ్రీరామకృష్ణులు ఎంతో వ్యథ చెందేవారు. నిజమైన ఆధ్యాత్మికత కొరవడడమే ఇందుకు కారణమని ఆయన స్పష్టంగా గ్రహించారు.
39. పుణ్యక్షేత్రాలలో ఈ ఆధ్యాత్మికత కొరవడడం శ్రీరామకృష్ణులకు అనుభవైకవేద్యమే
దక్షిణేశ్వర కాళికాలయంలో నివసిస్తూన్నప్పుడు గృహస్థులలోను, సన్న్యాసులలోను ఆధ్యాత్మికత ఎంతగానో కొరవడి ఉండడం అనునిత్యం శ్రీరామకృష్ణులు ప్రత్యక్షంగా చూసేవారు. పుణ్యక్షేత్రాలూ, దేవాలయాలూ దర్శింప వెళ్ళినప్పుడు ఈ దోషాలు ఆయనకు ఏమాత్రం తక్కువగా కనిపించలేదు; పైగా మరింత హానికరమైనవిగా స్ఫురించాయి. మథుర్బాబు నుండి కానుకలు పుచ్చుకొనేటప్పుడు బ్రాహ్మణులు కలహించుకోవడం; కాశీలో తాంత్రిక సాధకులు తమ జగజ్జనని ఉపాసనను తిలకింప శ్రీరామకృష్ణులను ఆహ్వానించి జగజ్జననిని నామ మాత్రంగా పూజించి, పూజా నెపంతో తప్పత్రాగి అసభ్యంగా ప్రవర్తించడం; పేరుప్రతిష్ఠలకై దండి సన్న్యాసుల తహతహ; ఆధ్యాత్మిక సాధనల నెపంతో బృందావనంలో వైష్ణవ బాబాజీలు స్త్రీల సాంగత్యంలో గడపడం… ఇటువంటి మరెన్నో ‘వాస్తవాలు’ శ్రీరామకృష్ణుల నిశిత అంతర్దృష్టికి తమ అసలు రంగులలో కనిపించి, నాటి సమాజ స్థితిని, మనదేశ యథార్థ స్థితిని అవగతం చేసుకోవడంలో ఆయనకు దోహదంచేశాయి.
కేవలం ఈ సంఘటనలను పరిశీలించడం వలన కాక, ఇంతకు మునుపే ప్రగాఢ అద్వైత సత్యానుభూతిని సంతరించుకొన్నందు వలననే ఆయనకు ఆ విషయాలు స్పష్టమైనాయి. ఇంతకు ముందే ఆ పరమానుభూతిని పొందగలగడం వలననే వ్యక్తిగత, సామాజిక జీవిత పరమలక్ష్య భావన ఆయన మనస్సులో ప్రగాఢంగా నాటుకుపోయింది. కాబట్టే ఆ అనుభూతిపరంగా పరీక్షించడం వలననే ఆయన అన్ని విషయాలనూ అలవోకగా అర్థం చేసుకోగలిగేవారు. ఆయన మామూలు భావచైతన్య భూమిలో నెలకొని ఉన్నప్పుడు దైనందిన వ్యక్తిగత, సామాజిక సంఘటనల అధ్యయనం, అనుభవం, మానవజీవితంపై ప్రభావం చూపే అన్ని వస్తువుల విలువలను రూఢిపరచుకోవడంలో దోహదం చేశాయి. కనుకనే నిజమైన పురోగతి, నాగరకత, సదాచారం, విద్య, భగవద్భక్తి, నిష్ఠ, యోగం, కర్మ మొదలైన ప్రేరేపక శక్తులు మనిషిని ఏ గమ్యానికి తీసుకుపోతున్నాయో ఆయనకు రూఢిగా తెలిసిపోయేది. నిజమైన సాధుత్వం అంటే ఏమిటో ఆయనకు తెలియకపోతే ఫలానా సాధువు ఆధ్యాత్మికంగా ఏ మేరకు పురోగమించాడో ఆయన ఎలా అర్థం చేసుకోగలిగేవారు? సుదీర్ఘ కాలంగా అసంఖ్యాక సాధువులు భగవంతుణ్ణి చింతన చేయడం మూలంగానే పుణ్య క్షేత్రాలలో, దేవతావిగ్రహాలలో ఆధ్యాత్మికభావం సుసంఘటితమై అభివ్యక్తమౌతూ ఉంటుందనే విషయం నిశ్చయంగా ఆయనకు తెలియకపోతే, సత్యసంధులైన శ్రీరామకృష్ణులు, లోకులను తీర్థయాత్రలు చేసి అక్కడి విగ్రహాలను ఆరాధించి రమ్మని ఎలా ప్రోత్సహించేవారు? లేదా, వివిధ మతాలు, మతశాఖలు కొనిపోయే దిశను, చివరకు తీసుకుపోయే గమ్యాలను గురించి ఆయనకు తెలియకుంటే వాటిలో వ్యక్తమౌతూన్న మతసంకుచితత్వం గర్హనీయమని ఎలా అవగతం చేసుకోగలిగేవారు?
ఎన్నో శాఖాసంప్రదాయాలు, ఎందరో సాధువులు, ఎన్నో పుణ్యక్షేత్రాలు, దేవతావిగ్రహాలు, నానా మతాలు కోలాహల వాదాల ప్రతిధ్వనులు, శాస్త్రవచనాల అర్థాలు మన దైనందిన అనుభవంలోనివే. ఈ పరస్పర విరుద్ధ అనుభవాల నడుమ, కలహాల పట్ల మనం దురాకర్షణకు లోనై కొన్ని సమయాలలో ఒక ఫలానా మతం సరైనదనీ, మరొకటి కాదనీ భావిస్తూ ఉంటాం. అట్లే దైనందిన లౌకిక సంఘటనలను పరిశీలించి, అధ్యయనం చేసి మానవ జీవిత పరమావధి ఏదో రూఢి పరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం; ఆ ప్రయత్నంలో కొన్ని సమయాల్లో ఫలానా దానిని పరమావధిగా, మరికొన్ని సమయాలలో మరొక దానిని పరమావధిగా స్వీకరిస్తూ ఏ స్థిర నిర్ణయానికీ రాలేక అటూ ఇటూ ఊగిసలాడుతూ తరచు నాస్తికులుగా మారి, లౌకిక సుఖభోగాలే నిజమైన జీవిత పరమావధిగా పరిగణిస్తాం. అటువంటి స్థిరనిర్ణయానికి దారితీయని, సదా మారుతూవుండే నిర్ణయాల మూలంగా మన అనుభవాలు ఏ రకంగా మనకు దోహదం చేస్తాయి? తమ అద్భుత మనోనిర్మాణం ఫలితంగా శ్రీరామకృష్ణులు ఏ విషయాన్ని అయినా చూసిన తక్షణమే గ్రహించి, అవగతం చేసుకోగలిగేవారు. అటువంటి మహాపురుషుల లేక జగద్గురువుల సహాయం లేకుండా మనవంటి అపక్వ మనస్కులు నూరు జన్మలలో కూడా అర్థం చేసుకోలేమనడం ముమ్మాటికీ నిజం. ఆయన ప్రతి చర్య, ప్రవర్తన నుండి మన మనస్సులకూ, ఆయన మనస్సుకూ మధ్యనున్న హస్తిమశకాంతరాన్ని ఊహించుకోవచ్చు. కాబట్టే అవతారపురుషుల మనస్సులు రజస్సు, తమస్సు స్పృశించని శుద్ధసత్త్వ పదార్థంతో రూపొంది ఉంటాయని భక్తిశాస్త్రాలు వచిస్తున్నాయి.
40. తమ ఉదార (మత) సిద్ధాంతం గురించి శ్రీరామకృష్ణులు ఎరిగే ఉన్నారు
ఈ విధంగా దివ్యభావ, సామాన్య భావభూముల నుండి పరికించడం వలన దక్షిణేశ్వరానికి వచ్చిపోయే వ్యక్తుల నుండి, తీర్థయాత్రలు చేసే సందర్భంలో కలుసుకొన్న వ్యక్తుల నుండి దేశంలో నెలకొని ఉన్న ఆధ్యాత్మిక కొరత గురించీ, మతసంకుచితత్వం, అసహనం గురించీ, ఆయన చక్కగా అవగతం చేసుకోగలిగారు. అన్ని మత సిద్ధాంతాలు సరి సమానంగా సత్యాలే అయినప్పటికీ, వివిధ ప్రవృత్తులుగల వ్యక్తులు వివిధ మార్గాలలో అదే గమ్యాన్ని చేరుకోవడంలో అవి తోడ్పడతాయని ఆయన లోతుగా యోచించి కనుగొన్నారు; గత యుగాచార్యులు ఈ మతాల ఏకతా సత్యం గురించి అజ్ఞానులై ఉండి వుండవచ్చు లేదా ఇంకా సరైన సమయం ఆసన్నం కాలేదని భావించి ఉద్దేశపూర్వకంగానే అలా ప్రచారం చేసివుండక పోవచ్చునని శ్రీరామకృష్ణులు గ్రహించారు. సంకుచితరహితమైన ఆయన ఉదార వైఖరి, ప్రపంచానికి అతి నవీనమైనదనే విషయం ఆయన స్పష్టంగా తెలుసుకొన్నారు. ఈ ఉదార వైఖరి ఆయనతోనే అవతరించింది, ఆయనే లోకానికి దానిని అందించవలసి ఉంది.
41. ప్రప్రథమంగా శ్రీరామకృష్ణులు ఆధ్యాత్మిక అనుభవం ద్వారా వెల్లడించిన విషయం: మతాలెన్నో మార్గాలన్ని
లోకాన్ని ముగ్ధపరచిన “అన్ని మతాలూ సత్యాలే; మతాలెన్నో మార్గాలన్ని” అన్న విశాల దృక్పథా సిద్ధాంత వచనం ప్రప్రథమంగా శ్రీరామకృష్ణుల ముఖతా వెలువడిందని మనలో అనేకులం ఇప్పుడు అవగతం చేసుకోగలుగుతున్నాం. గత యుగాల ఋషుల, మతాచార్యులలో ఈ సిద్ధాంతం పాక్షికంగా అభివ్యక్తమైందని కొందరు ఈ విషయంలో అభ్యంతరం లేవదీయవచ్చు. కాని నిశితంగా పరిశీలించినప్పుడు ఆ ఆచార్యవరులు తమ మేధాశక్తిని ఉపయోగించి వాటిలో అత్యావశ్యకమైనవని తాము పరిగణించిన వాటిని రసమిశ్రమం చేసివుంటారని తేటతెల్లమౌతుంది. కాని గతయుగాల ఆచార్యులలా కాక శ్రీరామకృష్ణులు ఏ మతాన్నీ కించిత్తు కూడా వదలిపెట్టలేదు. తమ జీవితంలో సమధికోత్సాహంతో ఆ మత సాధనలు అనుష్ఠించి, ఆ మతాలు ప్రతిపాదించిన పరమగమ్యాన్ని చేరుకొని, ఆ పరమసత్యాన్ని అనుభూతం చేసుకొన్నారు. ఈ అంశాన్ని ఇక్కడ మరింత విపులీకరించాలన్నది మా ఉద్దేశం కాదు. శ్రీరామకృష్ణుల జీవితంలో బాల్యం నుండి కూడా ఈ విశాల దృక్పథ సిద్ధాంతం పాదుకొని ఉందనడానికి మాకు నిదర్శనాలు లభించాయని మాత్రమే పాఠకులకు చెప్పదలచుకొన్నాం. గత యుగాల ద్రష్టలూ, ఆచార్యులూ, అవతారపురుషులూ ప్రత్యేక మార్గంలో పరమగమ్యాన్ని చేరుకోవడం ఎలాగో సమాజంలో ప్రచారం చేసినప్పటికీ, వివిధ మార్గాలలో కూడా అదే పరమగమ్యాన్ని చేరుకోవచ్చునని మాత్రం వారిలో ఎవరూ ప్రచారం చేసి ఉండలేదు. కాని పుణ్యక్షేత్రాలు సందర్శించిన తదనంతరమే ఆధ్యాత్మిక జగత్తులో ఆ విశాలదృక్పథాన్ని తాము మాత్రమే అనుభూతం చేసుకొన్నామని శ్రీరామకృష్ణులు నిశ్చయంగా తెలుసుకోగలిగారు. సాధన కాలంలో సమస్త లౌకికవాసన కామనలన్నింటిని జగజ్జనని పాదపద్మాల చెంత హృదయపూర్వకంగా అర్పించి, ఈ సంసారంలోకి ఈ మాయావరణంలోకి ఇక తిరిగి రాకూడదని దృఢ సంకల్పం చేసుకొని నిర్వికల్ప అద్వైత భావభూమిలో నెలకొని ఉండగోరారు శ్రీరామకృష్ణులు. కాని జగజ్జనని అలా జరగనివ్వలేదు. అంతుబట్టని రీతులలో ఆయన దేహాన్ని పతనం చెందకుండా పరిరక్షించింది. లోకంలో సాధ్యమైనంత వరకు మత సంకుచితత్వాన్ని, వైషమ్యాన్ని తొలగించే ఉద్దేశంతోనే తమ దేహం పతనం చెందలేదని శ్రీరామకృష్ణులు అర్థం చేసుకొన్నారు. అంతేకాక ఈ విశాలధృక్పథా భావాన్ని గ్రోలడానికి లోకం దప్పికతో తపించి పోతూవున్నదనీ ఆయనకు తెలుసు. పై నిర్ణయానికి మేం ఎలా రాగలిగామో పాఠకులకు వివరింప ప్రయత్నిస్తాం.
42. లోకానికి ఆధ్యాత్మికతను అందివ్వడానికే జగజ్జనని తనకు అద్భుత శక్తిసంపత్తిని ఒసగిందని శ్రీరామకృష్ణులు గ్రహించడం
ఆధ్యాత్మికత లేదా సత్యసాక్షాత్కారం వట్టి మాటల వలన కాక, సాధన అనుష్ఠానాల వలన మాత్రమే లభిస్తుందని శ్రీరామకృష్ణులు చిన్ననాటి నుండీ విశ్వసించేవారు. సాధన కాలంలోనూ, పరిపూర్ణత్వాన్ని సంతరించుకొన్న తదనంతరం కూడా సుదీర్ఘ సాధనానుష్ఠానాల ఫలితంగా సముపార్జించుకొన్న శక్తులను ఇతరులలో ప్రవేశింప చేయాలని అప్పుడప్పుడు ఆయన అనుకొనేవారు. ఆయన ఈ భావనను ఇంతకుక్రితమే మేం అక్కడక్కడ* సూచనప్రాయంగా వెలిబుచ్చివున్నాం. జగజ్జనని అనుగ్రహించి అట్టి శక్తిని పుష్కలంగా తమలో సంచితం చేసి ఉందని అప్పటికే అనేక సందర్భాలలో ఆయన రూఢిపరచుకొన్నారు. మథుర్ మొదలైన కొందరిని ప్రత్యేకించి అనుగ్రహింప ఆమె ఆ శక్తిని పరికరంగా వినియోగించుకొంది. పర్యవసానంగా ఏదో కొద్దిమంది ధన్యులపై మాత్రమే జగజ్జనని అనుగ్రహం తన మనశ్శరీరాలనే పరికరం ద్వారా వర్షింపచేయడానికి మాత్రమే ఈ శక్తి ఉందని అప్పటి వరకు శ్రీరామకృష్ణులు విశ్వసించేవారు. అయినా ఆమె ఏ రీతిలో, ఎప్పుడు అటువంటి వ్యక్తులను కటాక్షించేదో ఆయనకు తెలిసేది కాదు. అన్ని విధాల కేవలం తల్లి మీద ఆధారపడే బిడ్డవంటి మనస్సు గల శ్రీరామకృష్ణులు ఆ విషయాన్ని అవగతం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. తమ ఆధ్యాత్మిక సందేశాన్ని యావద్దేశంలో ప్రచారం చేసి లోకాన్ని ఆధ్యాత్మిక ఉత్తుంగ తరంగంతో ముంచెత్తివేయవలసి వస్తుందనే విషయాన్ని మాత్రం అంతకుముందు ఎన్నడూ ఆయన కలలో కూడా ఊహించలేదు.
జగజ్జనని తమ మనశ్శరీరాల ద్వారా ఆ కొంగ్రొత్త లీలను తీర్థయాత్రానంతరం ప్రారంభించిందని ఆయన హృదయాంతరాళాలలో అప్పటినుండి భావించసాగారు. కాని ఆయన నిస్సహాయులు. ఏ ఉపాయం ద్వారా దానిని సాధించాలో, దాని నిమిత్తం జగజ్జనని తనను ఎలా రూపొందిస్తుందో లేదా దానిని సాధింప ఆమె తనను ఎక్కడకు తోడ్కొనిపోతుందో అనే విషయాల గురించి ఆయనకు ఏమాత్రం తెలియదు. ఆయన ఎప్పటికీ జగజ్జనని బిడ్డడే! ‘ఆమె నా తల్లి, నేను ఆమె బిడ్డను’ అన్న విషయం మాత్రమే ఆయనకు తెలుసు. తల్లి ఆకాంక్ష తప్ప ఆయన మదిలో మరెలాంటి ఆకాంక్ష జనించదు. తల్లిని వివిధ రూపాలలో, వివిధ మార్గాలలో తెలుసుకోవాలనే ఏకైక ఆకాంక్ష మాత్రమే బహుశా ఆయన సొంత కోర్కెగా పేర్కొనవచ్చు. కాని ఆ ఆకాంక్ష కూడా తన సంకల్పం వలననే ఆయన మనస్సులో ఉదయించిందనే విషయం అంతకు మునుపే ఆయనకు జగజ్జనని స్పష్టంచేసి ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక ఉద్యమ నిమిత్తమైన ఈ కొంగ్రొత్త అనుభవం మదిలో స్ఫురించగానే, జగజ్జనని బిడ్డడైన శ్రీరామకృష్ణులు పూర్తి పరాధీన వైఖరిలో ఆమె నేతృత్వంకై ఎదురుచూడసాగారు; ఆమె కూడా అంతకు మునుపులా తన బిడ్డతో ఆడుకోసాగింది.
43. ఆధ్యాత్మిక గురువుగా నిరహంకారులైన శ్రీరామకృష్ణులు
గంగామాయి పావన సాంగత్యంలో, దివ్యప్రేమలో లీనమైపోయినప్పుడు బృందావనంలోనే తన శేష జీవితాన్నంతా గడిపివేయాలనే ఆయన ఆకాంక్ష నుండి మనకొక విషయం స్పష్టమౌతుంది. అస్పష్టంగా ఆధ్యాత్మిక ఉద్యమ భావాలు ఆయన మదిలో ఉదయిస్తున్నప్పటికీ, అహంకార ప్రభావంలో పడి ఆధ్యాత్మిక గురువు పదవిని స్వీకరించే సాధారణ గురువులలాగా, మతప్రవక్తలలా ఆయనకు ఆ పదవిని అలంకరించాలనే ఉద్దేశం ఏనాడూ కలుగలేదు. “అమ్మ తన పనిని తానే నిర్వర్తించుకొంటుంది. ఈ లోకాన్ని ఉద్ధరింప, బోధింప నేనెవరిని?” అనే శ్రీరామకృష్ణుల జీవిత దృక్పథాన్ని కించిత్తు కూడా మేం అవగతం చేసుకోలేం. జగజ్జనని తన పనిని నిర్వర్తించే అద్భుత పరికరంగా ఆయనను రూపొందించింది ఈ దృక్పథమే. సతతం భావముఖంలో నెలకొని ఉండగల స్థితిని కల్పించింది ఈ దృక్పథమే అన్న విషయం నిర్వివాదాంశం. ఆయనలో అద్భుత గురుభావ అభివ్యక్తీకరణకు దారితీయించింది కూడా ఈ దృక్పథమే.
ఇంతకు మునుపు ఆ గురుభావం అభివ్యక్తమైనప్పుడు ఆయనకు ఆ విషయం తెలిసేది కాదు. ఆయన మనశ్శరీరాలను ఆశ్రయించి అది తన కార్యాన్ని నిర్వర్తించేది. ఆ పని పూర్తియైన తరువాతే జరిగినదంతా ఆయన అవగతం చేసుకోగలిగేవారు. కాని ఇప్పటనుండి ఆ గురుభావం ఎడతెగని రీతిలో ఆయనలో అభివ్యక్తమౌతూ ఉండడం వలన క్రమేణా ఆయన మనశ్శరీరాలు అందుకు అలవాటుపడి, అది సహజావస్థగా మారింది. ఎంత కాదనుకొన్నా ఆ గురుభావ శక్తి ఇప్పుడు శ్రీరామకృష్ణులను ఆధ్యాత్మిక గురుపీఠంలో సుప్రతిష్ఠితుని గావించింది. ఇంతకు మునుపు ఒక సామాన్య సాధకునిగా లేదా బాలకునిగా భావించుకోవడమే ఆయన మామూలు మనోస్థితి; అధిక సమయం ఆయన ఈ భావంలోనే నెలకొని ఉండేవారు. ఆ సందర్భంలో గురుభావం అప్పుడప్పుడు మాత్రమే అభివ్యక్తమయ్యేది. మరి ఇప్పుడో? కచ్చితంగా అందుకు వ్యతిరేకంగా జరగసాగింది; ఇప్పుడు అత్యధిక సమయం ఆయన గురుభావంలో నెలకొని ఉండేవారు; అందుకు అనుగుణంగా సామాన్య సాధక లేదా బాలక వైఖరి ఆయనలో అప్పుడప్పుడు మాత్రమే అభివ్యక్తం కాసాగింది.
44. అందుకు ఉదాహరణ – భావముఖంలో శ్రీరామకృష్ణులు జగజ్జననితో తగవులాడడం
అహంకారవశులై ఆధ్యాత్మిక గురువు పదవిని స్వీకరించడం శ్రీరామకృష్ణులకు అసంభవమైన పని. భావముఖంలో నెలకొని ఉన్నప్పుడు జగజ్జననితో చిన్నపిల్లవాడిలా తగవులాడడం ఇందుకు నిదర్శనగా పలుమార్లు మేం చూసి ఉన్నాం. పద్మం వికసించగానే తేనెటీగలు గుంపులు కట్టి వ్రాలే విధంగా, శ్రీరామకృష్ణులలో అభివ్యక్తమయ్యే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులై ఆధ్యాత్మిక పిపాసువులు అనేకులు దక్షిణేశ్వరానికి రాసాగారు. ఆ కాలంలో ఒక రోజు మేం ఆయనను దర్శింప వెళ్ళినప్పుడు భావముఖస్థితిలో ఆయన జగజ్జననితో మాట్లాడుతూండగా చూశాం. ఆయన ఇలా అంటున్నారు: “అమ్మా, ఏం చేస్తున్నావు? గుంపులు గుంపులుగా జనాన్ని ఎందుకు తోడ్కొనివస్తున్నావు? స్నానానికీ, తినడానికీ నాకు తీరిక అంటూ లేకుండా పోయింది.” ఆయన కంఠవ్రణంతో బాధపడుతున్న తొలి దశ అది. తన దేహస్థితిని ఉద్దేశిస్తూ ఆయన, “ఇది (తన శరీరాన్ని సూచిస్తూ) ఇప్పటికే చిల్లిపడిన మద్దెల. మరింతగా వాయిస్తే పూర్తిగా పగిలిపోతుంది. అప్పుడు ఏం చేస్తావు?” అని అన్నారు.
45. పై విషయానికి రెండవ ఉదాహరణ
మరొక సందర్భంలో మేం ఒకసారి దక్షిణేశ్వరంలో ఆయన పక్కన కూర్చుని ఉన్నాం. అప్పుడు 1884 వ సంవత్సరం అక్టోబరు నెల ప్రతాపచంద్ర హాజ్రా తల్లికి జబ్బు చేసిందనే వార్త తెలిసింది. ఇంటికి వెళ్ళి తల్లికి ఉపచర్యలు చేయమని హాజ్రాకు, గురుదేవులు నచ్చచెప్పసాగారు. మేం కూడా ఆ సందర్భంలో అక్కడే ఉన్నాం. కాని హాజ్రా ఇంటికి వెళ్ళకుండా వైద్యనాథ్ క్షేత్రానికి వెళ్ళాడనే సమాచారం తెలియవచ్చింది. ఆ వార్త విని శ్రీరామకృష్ణులు విసుక్కున్నారు. కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకొన్నాక, ఆయన మమ్మల్ని ఒక పాట పాడమని చెప్పి, పిదప భావ పారవశ్యులైనారు. ఈ సందర్భంలో కూడా శ్రీరామకృష్ణులు, జగజ్జననితో పిల్లవాడిలా తగవులాడసాగారు. ఆయన ఇలా అన్నారు : “అటువంటి పనికిమాలిన, బాధ్యతారహితులను ఇక్కడికి ఎందుకు తోడ్కొని వస్తున్నావు? (కాసేపు మౌనం వహించి) నే నంతగా పాటుపడలేను. ఒక సేరు పాలలో పావుసేరు నీళ్ళు కలిపినా ఫరవాలేదు; లేదా ఒక సేరు పాలలో ఒక సేరు నీరు. కాని ఇప్పుడు ఐదు సేర్ల నీళ్ళలో ఒక సేరు పాలు కలిపి ఉన్నారు. కట్టెలు రాజేయడానికి ఊది ఊది నా కళ్ళు మండుతున్నాయి. కావాలంటే నువ్వే వారి వ్యవహారం చూసుకో. ఇక నేను ఎంతమాత్రం ఊదలేను. అటువంటి వ్యక్తులను ఇకమీదట తోడ్కొని రావద్దు.” ఆ మాటలు విని ఆశ్చర్యచకితులమై మేం మౌనంగా కూర్చుండిపోయాం. శ్రీరామకృష్ణులు ఆ మాటలు ఏ దురదృష్టవంతుణ్ణి ఉద్దేశించి పలుకుతున్నారో అనుకొని భయంతో వణకిపోయాం. ఇటువంటి వాగ్వాదాలు నిత్యం శ్రీరామకృష్ణుల, జగజ్జనని మధ్య జరగడం కద్దు. ఇతరులు సన్మానం పొంద, దేని కోసం దేవులాడుతూంటారో ఆ గురువు పదవిని హేయంగా భావించి, దానిని తన నుండి ఉపసంహరింపచేయమని శ్రీరామకృష్ణులు నిత్యం తల్లిని కోరుతూ ఉండేవారని పై ఉదహరించిన తగవులాటలు స్పష్టీకరిస్తున్నాయి.
46. ‘నేను జగజ్జనని సామ్రాజ్యంలో కార్య నిర్వహణాధికారిని గందరగోళం చెలరేగిన చోట్ల శాంతి నెలకొల్పవలసి వస్తుంది’ – అని శ్రీరామకృష్ణులు గ్రహించడం
ఈ విధంగా ఇచ్ఛామయియైన జగజ్జనని తన మార్మిక లీల ద్వారా యావజ్జీవితం ఆయనకెన్నో అద్భుత, అసాధారణ అనుభవాలు అనుగ్రహించింది. ఇంతకు మునుపు మరే జగద్గురువులో సైతం కల్పించని విశాల దృక్పథ ఆధ్యాత్మిక భావాలను పుష్కలంగా శ్రీరామకృష్ణులలో ఆమె పాదు గొల్పింది. దానితో పాటు ఇతరులను తరింపచేయడానికి ఎంత గొప్ప ఆధ్యాత్మిక శక్తిని ఆయనలో నిక్షిప్తం చేసిందో, ఆ శక్తిని తద్ద్వారా ఇతరులకు అందివ్వడానికి తనను ఎంత అద్భుతమైన పరికరంగా రూపొందించిందో – ఈ విషయాలన్నీ జగజ్జనని, ఆయనకు దర్శింపచేసింది. ఒక వంక బయటి ప్రపంచంలో ఆధ్యాత్మికత పూర్తిగా కొరవడడం చూసీ, మరో వంక ఆ కొరత తీర్చడానికి ఆమె అనుగ్రహం వలన తనలో అద్భుత ఆధ్యాత్మిక శక్తి సంచితం కావడం గుర్తించీ శ్రీరామకృష్ణులు ఆశ్చర్య చకితులైనారు.
ప్రస్తుత యుగంలో జగజ్జనని మరొకసారి అజ్ఞాన మోహరూపంలో విచ్చలవిడిగా చెలరేగుతున్న రక్తబీజ రాక్షసుణ్ణి వధింప రణరంగంలో కాలు మోపిందని గ్రహించడానికి ఆయనకు ఎంతో కాలం పట్టలేదు; తల్లి అహేతుక కృపను లోకం మరొకసారి వీక్షించి తరిస్తుందనీ, అశేష కళ్యాణగుణమయి, అనంతకోటి బ్రహ్మాండనాయిక అయిన జగజ్జననిని జయ జయ ధ్వానాలతో స్తుతిస్తుందనీ ఆయన గ్రహించలేకపోలేదు. అత్యధిక ఉష్ణం మబ్బులను ఉత్పన్నం చేస్తునట్లు, చీకటి తదనంతరం వెలుగు ప్రసరించినట్లు, గడ్డుకాలం తరువాత సౌభాగ్యం కలిగే తీరుతుంది. అదే విధంగా ఎంతో కాలంగా ఆధ్యాత్మిక కొరతతో బాధపడుతున్న అసంఖ్యాక జనావళి అవసరం తీర్చడానికి జగజ్జనని అనంత కరుణ శ్రీ గురు రూపంలో అవతరించి మానవులతో కలసిమెలసి జీవిస్తుంది. జగజ్జనని అనుగ్రహించి ఈ విషయాన్ని శ్రీరామకృష్ణులకు స్పష్టం చేసింది. ఇటువంటివి జరగడం ఇదే మొదటిసారి కాదనీ, ఇంతకు మునుపు ఎన్నోసార్లు ఆయనతో తాను అటువంటి లీలలు సలిపాననీ, భవిష్యత్తులో కూడా ఆయనతో ఆ లీల జరుగనున్నదనీ జగజ్జనని, ఆయన గ్రహించేలా చేసింది. పైగా సామాన్య జీవులలా ఆయనకు ముక్తి కలుగదు. “జగజ్జనని విశాల సామ్రాజ్యంలో ఎక్కడెక్కడ శాంతిభద్రతలు కొరవడతాయో అక్కడక్కడకు రివ్వున వెళ్ళి శాంతిభద్రతలు నెలకొనేట్లు చేసే కార్యనిర్వహణాధికారి ఆయన” అని ఆమె సుస్పష్టం చేసింది. శ్రీరామకృష్ణుల వచనాల నుండి ఈ విషయాలన్నీ ఇప్పుడు మాత్రమే ఆయన గ్రహించారని తేటతెల్లమౌతున్నది.
47. తమ అంతరంగ భక్తులను కలుసుకోవడానికి శ్రీరామకృష్ణులు ఆతురత చెందడం
‘మతాలెన్నో మార్గాలన్ని’ అనే విశాలదృక్పథ భావాన్ని లోకహితార్థం జగజ్జనని స్వయంగా తమలో జనింపచేసిందనే విషయాన్ని గ్రహించడంతోపాటు, శ్రీరామకృష్ణుల వివేచనాత్మక మనస్సు మరొక విషయం గురించి విచారణ చేయసాగింది. తమ మనశ్శరీరాలను ఆశ్రయించి ఉన్న జగజ్జనని నుండి ప్రత్యక్షంగా ఆ నవీన విశాలదృక్పథ భావాన్ని స్వీకరించి తదనుగుణంగా తమ జీవితాలను మలచుకొని ధన్యులు కానున్నవారు, అంతేగాక ఆమె నుండి శక్తిని కూడా పొంది ఈ ఆధునిక యుగంలో ఆమె సలుపుతున్న ఈ నవ్యలీలలో పాల్గొని, ఆ విశాలదృక్పథ భావాన్ని ప్రచారం చేసి అనేకులను కృతార్థులను గావించేవారు ఎవరో తెలుసుకోవాలని శ్రీరామకృష్ణులు ఆరాటపడ్డారు.
శ్రీరామకృష్ణ – మథుర్నాథ్ల అనురాగ బాంధవ్యాన్ని విశదీకరిస్తున్న తరుణంలో, భావపారవశ్య స్థితిలో శ్రీరామకృష్ణులు భవిష్యత్తులో రానున్న తమ అంతరంగ భక్తులను చూశారనే విషయం మేం సూచనప్రాయంగా ప్రస్తావించి ఉన్నాం.* జగజ్జనని మార్మిక లీల వలన లోకంలో ఏ వస్తువు పట్లా అనురక్తి జనించని శ్రీరామకృష్ణుల మనస్సులో గతంలో అలా చూసిన ఆ భక్తుల ముఖాలు ఇప్పుడు ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ కానరాసాగాయి. ఆ అద్భుత యతివరేణ్యుల మనస్సు ఇప్పుడు సదాసర్వదా ఈ విషయాలను పదేపదే చింతన చేయడంలోనే లగ్నమైంది: ‘అలా రానున్న భక్తులు ఎందరై ఉంటారు? వారినెప్పుడు తమ వద్దకు అమ్మ తోడ్కొని వస్తుంది? వారిలో ఎవరి ద్వారా అమ్మ ఏ ప్రత్యేక కార్యం చేయించనున్నది? తనలా అమ్మ వారిని కూడా సన్న్యాసులుగా తీర్చిదిద్దుతుందా? లేదా వారు గృహస్థులుగానే ఉండిపోతారా? ఆ రానున్న భక్తులలో కనీసం ఒక్కరైనా జగజ్జనని లీలను సమగ్రంగా అవగతం చేసుకోగలరా? లేదా వారి జీవితకాలంలో ఆ లీలను పాక్షికంగా మాత్రమే అవగాహన చేసుకోగలరా? ఎందుకంటే, ఇప్పటి వరకు జగజ్జనని అద్భుత లీలను అర్థం చేసుకొన్నవారు ఏ కొద్దిమంది మాత్రమే ఉన్నారు.’ పై విషయాలనే యోచిస్తూ ఆయన రోజులు గడిపివేస్తున్నారు.
దీనిని గురించి ఆయన ఇలా చెప్పేవారు : “అప్పుడు మిమ్మల్నందరినీ చూడాలనే చెప్పనలవిగాని వ్యాకులతను అనుభవించేవాణ్ణి. తడి తువ్వాలును పిండుతూన్నట్లు ఎవరో హృదయాన్ని పిండివేస్తూన్న బాధతో అశాంతికి గురయ్యేవాణ్ణి. వెక్కివెక్కి ఏడ్వాలనిపించేది. కాని లోకులు ఏమనుకొంటారోనని అలా ఏడ్వలేకపోయేవాణ్ణి; ఏదో రకంగా నన్ను అదుపులో ఉంచుకొనేవాణ్ణి. కాని పగలు గడిచిపోయి, రాత్రి సమీపించి కాళికాలయంలో, విష్ణ్వాలయంలో హారతి సంగీతం వినరాగానే, ఇక నన్ను నేను అదుపులో ఉంచుకోలేకపోయేవాణ్ణి. ‘అయ్యో, మరో రోజు గడిచిపోయింది, వాళ్ళు ఇంకా రాలేదు’ అనుకొనేవాణ్ణి. ఆలయ యజమానుల భవంతి డాబా (కుఠీ) మీదికెక్కి, బిగ్గరగా, ‘నాయనలారా! మీరంతా ఎక్కడున్నారు?’ అంటూ కేకలు పెట్టేవాణ్ణి. పిచ్చివాణ్ణి అయిపోతానేమోనని అనిపించేది. పిదప, సుదీర్ఘ నిరీక్షణానంతరం మీరు ఒక్కరొక్కరుగా రాసాగారు. అప్పుడే నా మనస్సు కుదుటపడింది. మిమ్మల్ని ఇంతకు మునుపే చూసివున్నాను కనుక, మీరు రావడంతోనే గుర్తించగలిగాను. పూర్ణుడు (పూర్ణచంద్ర ఘోష్) వచ్చినప్పుడు, అమ్మ, ‘ఇతడి రాకతో నువ్వు (భావపారవశ్యంలో) చూసిన భక్తులందరూ రావడం పూర్తయింది. ఈ కోవకు చెందిన భక్తులు ఇకమీదట రారు’ అని తెలిపింది. మిమ్మల్నందరినీ అమ్మ నాకు చూపించి, ‘వీరంతా నీ అంతరంగ భక్తులు’ అని చెప్పింది. అద్భుత దర్శనం, అద్భుతంగా ఈడేరింది!” శ్రీరామకృష్ణుల ఈ వచనాల ప్రగాఢ అర్థాన్ని ఎవరు అవగతం చేసుకోగలరు! ఇవి మాలో ఎవరూ కల్పించిన మాటలు కావని స్పష్టం చేయడం కోసమే సాక్షాత్తు శ్రీరామకృష్ణుల వచనాలనే ఇక్కడ పొందుపరిచాం.
48. అంతరంగ భక్తులు వచ్చి తీరాలనే శ్రీరామకృష్ణుల ప్రగాఢవిశ్వాసం
తమ విశాలదృక్పథంతో కూడిన మతాన్ని అర్థం చేసుకొని, స్వీకరించగల భక్తులను సమీకరించుకొంటున్నప్పుడు ఆయనకు కలిగిన మరొక నమ్మకాన్ని గురించి అప్పుడప్పుడు స్వయంగా ఆయనే మాతో ఇలా చెప్పేవారు: “ఈ లోకంలో అంతిమ జన్మను అనుభవిస్తున్న వారందరూ ఇక్కడకు వస్తారు; ఎవరు భగవంతుణ్ణి కనీసం ఒక్కసారైనా నిజంగా ప్రార్థించి ఉంటారో, వారంతా ఇక్కడకు వచ్చే తీరాలి.” గురుదేవుల పై వచనాలు విన్న వారి మనస్సులలో ఎన్నో రకాల ఆలోచనలు చెలరేగాయి. అవి ఏమిటో వివరించడం ఎంతో కష్టం. ఆయన నమ్మకం పూర్తిగా యుక్తియుక్తం కాదనే నిర్ణయానికి కొందరు వచ్చారు. అసంబద్ధ ప్రలాపమని కొందరు నిర్ణయించారు. మరికొందరు దాన్లో ఆయన అహంకారం వ్యక్తమౌతూందన్నారు; కొందరు ఆయనకు మతి చెడిందన్నారు. కొందరు తాము అర్థం చేసుకోలేకపోయినా శ్రీరామకృష్ణులు చెబుతున్నారు కనుక అవి నిజమై తీరాలి అనుకొన్నారు. కాబట్టి యుక్తి తర్కాలతో వాటిని సమర్థించడం విశ్వాసానికి హాని వాటిల్లచేస్తుందని తలచి ఆ వచనాలను సూక్ష్మంగా తరచి చూడడానికి నిరాకరించారు. ‘గురుదేవులు స్పష్టంగా వాటిని వివరించినప్పుడే అర్థం చేసుకొంటా’ మని కొందరు భావించారు. అందుకే వాటిని నమ్మడమో లేదా నమ్మకపోవడమో రెండూ చేయకుండా, వాటిని గురించి వాదించే ఇరుపక్షాల వారి వాదాలను నిర్లిప్తంగా వింటూ ఉండిపోయారు.
కాని అహంకారం కించిత్తు అయినా లేకపోవడమే శ్రీరామకృష్ణుల సహజ స్వభావం కావడం వలననే, జగజ్జనని తన ఉదార భావాన్ని ఆయనకు అనుభవైక వేద్యం చేసిందనీ, యథార్థమైన ఆచార్య పదవిలో ఆయనను సుప్రతిష్ఠితులను గావించింది – అనే విషయాన్ని కనుక మేం పాఠకులకు అవగతం చేయించగలిగితే, ఆయన పై వచనాల అర్థాన్ని అవగాహన చేసుకోవడం అంత కష్టమేమీ కాబోదు. అంతే కాదు. ఆ వచనాలను మరింత తరచి చూసినప్పుడు ఎంత అలవోకగా, స్వాభావికంగా శ్రీరామకృష్ణులు అత్యున్నత ఆధ్యాత్మిక అవస్థను సంతరించుకోగలరనే విషయం పాఠకులు నిదర్శనపూర్వకంగా గ్రహించవచ్చు.
49. జగజ్జననికి పూర్తిగా పరాధీనులై ఉండడం వలననే శ్రీరామకృష్ణులకు ఆ నమ్మకం కలిగింది
జగజ్జనని బిడ్డయైన శ్రీరామకృష్ణులు తమ మనశ్శరీరాలను పరికించి చూసినప్పుడు, వాటిలో నిహితమైవున్న అపూర్వ ఆధ్యాత్మిక శక్తీ, దానిని ఇతరులకు ఒసగే సామర్థ్యమూ తమ స్వీయప్రయత్నం వలన లభించాయని ఆయన ఎన్నడూ, క్షణమాత్రం సైతం భావించింది లేదు. తన మార్మిక రీతిలో జగజ్జనని సలుపుతున్న లీలావిలాసమే వాటికి కారణమని కనుగొని శ్రీరామకృష్ణులు ఆశ్చర్య చకితులైనారు. అసంభవాన్ని సంభవం చేయగల సమర్థురాలైన జగజ్జనని విద్యావిహీనులైన ఆయన మనశ్శరీరాలను ఆశ్రయించి ఎంత బ్రహ్మాండమైన లీలావిలాసాన్ని సలుపుతున్నదో కదా! మూగవాణ్ణి వాచాలునిగా మార్చి, కుంటివాడి చేత పర్వతాలనే అధిరోహింప చేసి లోకాలన్నిటి చేత స్తుతింపబడిన ఆమె పూర్వకాల లీలలన్నింటినీ ఈ ప్రస్తుత లీల వేయి రెట్లు అధిగమించిందనడం అతిశయోక్తి కాబోదు! ఈ లీల మూలంగా వేదాలు, బైబిల్, పురాణాలు, కొరాన్, తదితర ధర్మశాస్త్రాలన్నీ సత్యాలుగా ఋజువైనాయి; ధర్మం మళ్ళీ ప్రతిష్ఠితమైంది, ఇంతకు మునుపు మరెవరి వలనా ఈడేరని ప్రపంచ ఆధ్యాత్మిక ఆవశ్యకత శాశ్వతంగా తీరింది. ‘జయం, తల్లీ, జయం! లీలామయియైన బ్రహ్మశక్తికి జయం!’ ఆ దర్శన ఫలితంగా ఇటువంటి ఆలోచనలే ఆయన మనస్సులో మెదలేవి. జగజ్జనని మాటలపట్ల, అనంత కరుణ, మార్మికశక్తి పట్ల గల ప్రగాఢ విశ్వాసం కారణంగా ఆ దర్శనాన్ని (ఆ అనుభూతిని) శ్రీరామకృష్ణులు సంపూర్ణ సత్యంగా గ్రహించారు. అలా విశ్వసించి ఆ లీలకు ఆస్కారం ఎంతవరకు ఉన్నదో, దానికి దోహదం చేసే వారెవరో, ఆ శక్తి బీజాన్ని ఎటువంటి వ్యక్తుల హృదయాలలో నాటాలో అనే ప్రశ్నలను తల్లిని అడిగి, జవాబుగా రానున్న తమ అంతరంగ భక్తులను భావపారవశ్య స్థితిలో దర్శించారు; అట్లే ఎవరికి ఈ జన్మ చివరిదో, ఎవరు భగవంతుణ్ణి మనసారా ఒక్కసారైనా ప్రార్థించారో, అటువంటి వారు మాత్రమే తమ ద్వారా జగజ్జనని వెల్లడించిన నవీన విశాల దృక్పథ భావాన్ని స్వీకరింప అర్హులని తెలుసుకొన్నారు. జగజ్జననికే పూర్తిగా పరాధీనులై ఉన్నందున శ్రీరామకృష్ణులు ఆ నిర్ణయానికి రాగలిగారు. తల్లి మీదనే పూర్తిగా ఆధారపడిన బాలుడు తల్లి నిర్ణయానికి కాక మరే నిర్ణయానికి తలఒగ్గుతాడు? జగజ్జనని మీదనే అలా పూర్తిగా ఆధారపడి ఉండడం వలననే శ్రీరామకృష్ణుల మనస్సులో అహంకారం జాడమాత్రంగా కూడా చోటుచేసుకోలేదు.
50. శ్రీరామకృష్ణుల పై వచనాల తాత్పర్యం
“ఎవరికి ఇది చివరి జన్మో వారు ‘ఇక్కడికి’ వచ్చి తీరాలి”, “ఒక్కసారైనా ఎవరు హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థించారో వారు ‘ఇక్కడికి’ వచ్చే తీరాలి” – ఈ వచనాలలోని ‘ఇక్కడికి’ అనే పదానికి ‘జగజ్జనని నవీన విశాల దృక్పథ మతం’ (మతాలన్నీ సత్యాలే అనే మతం) అని అర్థం చేసుకొంటే, అప్పుడది యుక్తియుక్తంగా ఉండి, ఎవరూ అభ్యంతరం తెలుపరు. ‘ఇక్కడికి’ అనే పదానికి పైన చెప్పినట్లు అర్థం చేసుకొన్న తక్షణమే మరో ప్రశ్న తలెత్తక మానదు. ‘ఎన్ని మతాలో అన్ని మార్గాలు’ అనే జగజ్జనని ఆ విశాల దృక్పథ మతాన్ని వారు (ఆంతరంగిక శిష్యులు) తమంతట తామే స్వీకరిస్తారా? లేదా ఎవరిని జగజ్జనని (అంటే శ్రీరామకృష్ణులను) పరికరంగా చేసుకొని ప్రప్రథమంగా లోకంలో ఈ విశాల దృక్పథ మతాన్ని ప్రకటించిందో ఆయన తోడ్పాటుతో మాత్రమే వారు దానిని స్వీకరిస్తారా? – ఇదే ఆ ప్రశ్న. మాకు తెలిసినంత వరకు పై ప్రశ్నకు జవాబు : పైన పేర్కొన్న ఆ విశాల దృక్పథ మతాన్ని పరిపూర్ణంగా అనుభూతం చేసుకొన్న తరువాతే పై విషయాన్ని నిర్ణయించడం సబబు. అలా ప్రత్యక్షానుభూతి పొందనంత వరకు మౌనం వహించడమే ఉత్తమం.
అయినా పాఠకుడు మా నిర్ణయాన్ని తెలుసుకోగోరితే మేం ఇలా చెప్పవలసి వస్తుంది: పై భావాన్ని సక్రమంగా అనుభూతం చేసుకోగలిగినప్పుడు, దానితో పాటు అదే సమయంలో జగజ్జనని ఎవరిని ప్రప్రథమంగా ఈ లోకంలోకి ఆ అన్ని మతాలకు సత్య సాక్షాత్కారాన్ని పొందిన మూర్తిగా చేసి తీసుకొని వచ్చిందో ఆయన (శ్రీరామకృష్ణులు) దర్శనం కూడా నీకు కలిగే తీరుతుంది; అప్పుడు నీ అంతట నువ్వే ఆ మూర్తి పావన సన్నిధిలో నీ భక్తిప్రపత్తులను గుమ్మరిస్తావు; అలా చేయమని అయన నిన్ను స్వాధికారంతో అడగరు, ఇతరులెవరూ అలా చేయమనీ చెప్పరు. కాని జగజ్జనని పట్ల నీకున్న భక్తే నీ చేత అలా చేయిస్తుంది. దీన్ని గురించి మరింత విపులీకరించ వలసిన అవసరం లేదు.
51. దివ్యభావం : దాని అర్థం
జగజ్జనని సంకల్పంతో ఎవరిలో ఈ గురుభావం సహజావస్థగా మారుతుందో, అంటే వారి వ్యక్తిత్వం ఆ గురుభావ ఘనీభూత రూపాన్ని సంతరించు కొంటుందో, అటువంటి వారి ప్రవర్తన – తినడం, తిరగడం, కార్యకలాపాలు, ఇతరులపై అహేతుక కరుణ చూపడం యావత్తు మనిషి బుద్ధికి గ్రాహ్యంకాని రీతిలో ఉంటుందని భారతీయ తాంత్రిక ఆచార్యులు పదేపదే వక్కాణించారు. ఆ విధంగా అభివ్యక్తమయ్యే గురుభావాన్ని తంత్రాలు ‘దివ్యభావం’ అని పేర్కొంటాయి. అలాగే ఆ దివ్యభావంలో సుప్రతిష్ఠితులైనటువంటి గురువులు, శిష్యులకు ఇచ్చే మంత్రదీక్ష, బోధనా పద్ధతులు కూడా శాస్త్రాల విధి నియమాలను ఉల్లంఘించి, అనూహ్య రీతులలో ఉంటాయి. వారు కనుక కరుణిస్తే ఎవరిలోనైనా గాని కేవలం సంకల్పంతో లేదా స్పర్శతో ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేసి, తక్షణమే వారిని సమాధిమగ్నులను గావించగలరు. లేదా ఇంకా పరిపక్వం చెందని శిష్యులలో పాక్షికంగా ఆ శక్తిని జాగృతం చేసి, కొంతకాలం గడిచాక ఆ శక్తి రగుల్కొనేలా చేసి ఈ జీవితంలోనే వారు ఆత్మ సాక్షాత్కారం పొందేలా అనుగ్రహింప సమర్థులు.
మంత్రదీక్ష గురించి తంత్రాలు ఇలా వచిస్తున్నాయి : గురుభావం కొంచమే తీవ్రంగా ఉన్న స్థితిలో గురువు, శిష్యుడికి ‘శాక్తీ’ దీక్షను ఒసగుతాడు. అదే గురుభావం అత్యంత తీవ్రమైన స్థితిలో (దీనికే ‘దివ్యభావం’ అని పేరు) ‘శాంభవీ’ దీక్షను ఇవ్వగలడు. సామాన్యులైన గురువులు ‘మాంత్రీ లేదా ఆణవీ’ దీక్షను మాత్రమే ఒసగాలని తంత్రాలు నిర్దేశిస్తున్నాయి.
‘శాక్తీ’, ‘శాంభవీ’ దీక్ష విధానాలను గురించి రుద్రయామల, షడన్వయ మహారత్న, వాయవీయ సంహిత, సారదా, విశ్వసార మొదలైన తంత్రశాస్త్రాలు ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాయి. ఈ సందర్భంలో వాయవీయ సంహిత నుండి కొన్ని శ్లోకాలను ఈ క్రింద ఉదహరిస్తున్నాం:
శాంభవీ చైవ శక్తీ చ మాంత్రీ చైవ శివాగమే ।
దీక్షోపదిశ్యతే త్రేథా శివేన పరమాత్మనా ॥
గురోరాలోకమాత్రేణ స్పర్శాత్ సంభాషణాదపి ।
సద్యః సంజ్ఞా భవేత్ జంతోః దీక్షా సా శాంభవీ మాతా ॥
గురుణా జ్ఞానమార్గేణ క్రియతే జ్ఞానచక్షుషా ।
మాంత్రీ క్రియావతీ దీక్షా కుంభమండలపూర్వికా ॥ (వీటి తాత్పర్యం క్రింద చూడండి)
52. శాంభవీ దీక్ష : శాక్తీ దీక్ష
‘శాంభవీ’, ‘శాక్తీ’, ‘మాంత్రీ’ అని మంత్రదీక్ష విధానాలు మూడు రకాలని పరమాత్ముడైన శివుడు తంత్రశాస్త్రాలలో బోధించి ఉన్నాడు. శ్రీ గురువు దర్శనంతో, స్పర్శతో లేదా సంభాషణ (ప్రణామాదులు) చేసిన క్షణానే జీవుడిలో జ్ఞానోదయం కలుగుతుంది. దీనినే శాంభవీ దీక్ష అని పేర్కొంటారు. రెండవదైన శాక్తీ దీక్షలో బ్రహ్మజ్ఞానియైన గురువు తన జ్ఞానచక్షువు ద్వారా శిష్యుడిలో తన శక్తిని ప్రవేశింప చేసి, అతడిలో ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేస్తాడు. ఇక మూడవదైన మాంత్రీ దీక్షలో మండలం రచించడం, ఘటాన్ని ప్రతిష్ఠాపించడం, దేవతను పూజించడం వంటి క్రియలు ముగించాక గురువు, శిష్యుడి చెవిలో మంత్రాన్ని ఉపదేశిస్తాడు.
శాక్తీ, శాంభవీ దీక్షలు తక్షణ ముక్తిని ప్రసాదిస్తాయని రుద్రయామల తంత్రం వచిస్తున్నది :
సిద్ధైః స్వశక్తిమాలోక్య తయా కేవలయా శిశోః ।
నిరుపాయం కృతా దీక్షా శాక్తేయీ పరికీర్తితా ॥
అభిసిద్ధిం వినాచార్య శిష్యయోరుభయోరపి ।
దేశికానుగ్రహేణైవ శివతా వ్యక్తికారణీ ॥
అంటే ఏ బాహ్యమైన తోడ్పాటు లేకుండా కేవలం తమ ఆధ్యాత్మిక శక్తి తోడ్పాటుతో మాత్రమే సిద్ధపురుషులు శిష్యులలో దివ్య జ్ఞానోదయం కల్పిస్తారో, అటువంటి దీక్షను ‘శాక్తీ’ దీక్షగా పేర్కొంటారు. ‘శాంభవీ’ దీక్షలో ఇవ్వాలనే, పుచ్చుకోవాలనే ఏ ఆకాంక్షా గురుశిష్యు లిద్దరిలో ఉండనే ఉండదు. కాని పరస్పరం కలుసుకొన్న తక్షణమే ఆచార్యుని హృదయంలో కరుణ పొంగిపొరలగా, శిష్యుణ్ణి అనుగ్రహించాలని గురువు తహతహ చెందుతాడు. అటువంటసంకల్పం మెదలగానే మరుక్షణమే శిష్యుడిలో అద్వైతజ్ఞానం ఉదయిస్తుంది; అతడు శిష్యరికాన్ని అంగీకరిస్తాడు.
53. అటువంటి దీక్షలకు యుక్తాయుక్త కాలనియమం పాటింపనవసరంలేదు
శాంభవీ, శాక్తీ దీక్షలను ఒసగడానికి యుక్తా యుక్త కాలనియమం చూడవలసిన అవసరం లేదని పురశ్చరణోల్లాసమనే తంత్రం వచిస్తున్నది.
దీక్షాయుం చంచలాపాంగి న కాలనియమః క్వచిత్ ।
సద్గురోః దర్శనాదేవ సూర్యపర్వే చ సర్వదా ॥
శిష్యమాహూయ గురుణా కృపయా యది దీయతే ।
తత్ర లగ్నాదికం కించిత్ న విచార్యం కదాచన ॥
ఓ పార్వతీదేవీ! వీరభావంలో, దివ్యభావంలో ప్రతిష్ఠితులైన గురువుల నుండి దీక్ష స్వీకరించడానికి కాలాకాల విచారణ చేయనవసరం లేదు. సద్గురు దర్శనం లభించిన మరుక్షణమే, శిష్యుణ్ణి అనుగ్రహించి గురువు పిలవగానే శుభ ముహూర్తమా కాదా అనే విచారణ చేయకుండానే దీక్షను స్వీకరించాలి.
54. దివ్యభావమూర్తులైన సద్గురువులలో శ్రీరామకృష్ణులు సర్వశ్రేష్ఠులు
దివ్యభావం సంతరించుకొన్న సామాన్యులైన గురువుల గురించే శాస్త్రాలు ఔపచారికం కాని విధానాన్ని నిర్దేశిస్తున్నప్పుడు దివ్యపురుషులైన శ్రీరామకృష్ణులను గురించి వేరే చెప్పాలా?జగజ్జననికి సర్వదా పరికర మాత్రులై అహేతుక దయాసింధుత్వంతో ఆయన ఇతరులకు ఏ విధంగా బోధించాలో, ఇతరులలో ఏ విధంగా ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింప చేయాలో ఎవరైనా ఎలా నిర్ణయించగలరు? ఎందుకంటే, శ్రీరామకృష్ణుల మనశ్శరీరాలను ఆశ్రయించి, అనుగ్రహంతో జగజ్జనని సలుపుతున్న ఆ లీల, తంత్రాలలో పేర్కొన్న దివ్యభావంలో సలుపుతున్న సాధారణమైన లీల వంటిది మాత్రం కాదు కనుక. పైగా కేవలం ఏ వ్యక్తిగత శిష్యుడి హితం కోసం కాక, సమస్త మానవకోటి హితం కోసం జగజ్జనని ఆయన ద్వారా అప్పుడు ‘ఎన్ని మతాలో, అన్ని మార్గాలు’ అనే మహావిశాల దృక్పథ భావాన్ని అభివ్యక్తం చేస్తూన్నది; దివ్యభావం సంతరించుకొన్న ఏ ఆధ్యాత్మిక గురుమా అప్పటి దాకా ఆ మహా విశాల దృక్పథ మతాన్ని అనుసరించిందీలేదు, అనుభూతం చేసుకొన్నదీ లేదు. కాబట్టే ఇప్పటి నుండి శ్రీరామకృష్ణుల జీవితంలో ఒక నూతనాధ్యాయం ప్రారంభమైందని మేం చెప్పాం.
55. అవతార పురుషులలో శక్తి అభివ్యక్తీకరణ
శ్రీరామకృష్ణుల పట్ల భక్తిప్రపత్తులున్న పాఠకుడు మా పలుకులు విని ఒకింత చిరాకు కనబరచి ఇలా అనవచ్చు : “మీరు చెబుతున్నదంతా ఏమిటి? శ్రీరామకృష్ణులు అవతార పురుషులని మీరు పరిగణించినప్పుడు, ఆయనలో పైన పేర్కొన్న ఆ దివ్యభావం లేదా ఆధ్యాత్మిక శక్తి సదాసర్వదా నెలకొని ఉండలేదని చెప్పడం సబబేనా?” అందుకు మా సమాధానం : “సోదరా, శ్రీరామకృష్ణుల వచనాల ప్రమాణంతోనే మేం అలా చెప్పాం. మానవ దేహాన్ని దాల్చినప్పుడు, అవతారపురుషులలో సైతం అన్ని రకాల దివ్యభావాలు లేదా దివ్యశక్తులు సదా సర్వవేళలా అభివ్యక్తం కావు. ఒక ఫలానా భావం లేదా శక్తి అవసరమైనప్పుడే వారిలో అది అభివ్యక్తమౌతుంది. కాశీపూర్ ఉద్యానగృహంలో కంఠవ్రణం వ్యాధితో పోరాడి శ్రీరామకృష్ణుల దేహం వట్టి ఎముకల గూడుగా శుష్కించిపోయినప్పుడు ఆ దివ్యభావం, శక్తి తమలో అభివ్యక్తమవడం గుర్తించి, ఆయన మాతో ఇలా చెప్పారు : “దీనిలోకి (అంటే ఆయన శరీరంలోకి) ఇకమీదట ఎవరినీ స్పృశించ అవసరంలేని శక్తి వచ్చిందని అమ్మ నాకు చూపుతున్నది. స్పృశించమని మీతో చెప్పినా చాలు, మీరు స్పృశించగానే ఇతరులలో ఆధ్యాత్మికత జాగృతమౌతుంది. ఈసారి కనుక అమ్మ దీనిని (తమ రోగాన్ని) నయం చేసిందంటే, ఇక ఇక్కడకు వచ్చే జనాన్ని అరికట్టడం మీకు అసాధ్యమౌతుంది. ఆ అరికట్టే ప్రయత్నంలో మీరు పడ్డ శ్రమకు ఫలితంగా జనించే ఒంటి నొప్పులు పోగొట్టుకోవడానికి మందులు పుచ్చుకోవలసి ఉంటుంది.” అప్పటి వరకు అభివ్యక్తం కాని శక్తిని తమలో ఆయనప్పుడు సంతరించుకొన్నారనే విషయం ఆయన పై వచనాల నుండి స్పష్టంగా తెలుస్తోంది. ఇటువంటి అనేక ఉదాహరణలు చూపవచ్చు.
56. శ్రీరామకృష్ణులు : కేశవచంద్రసేన్, తదితర భక్తులు
దివ్యభావ ప్రేరితులై పైన పేర్కొన్నట్లు శ్రీరామకృష్ణులు పరమ వ్యాకులతతో రానున్న తమ భక్తులను కేవలం కేకలుపెట్టి పిలవడంతోనే ఉపశమనం పొందలేదు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో వసిస్తూన్నారనే సమాచారం బెల్ఘారియా ఉద్యానవనానికి చేరితే, ఆయన దక్షిణేశ్వరంలో బసచేసి ఉన్నారనే సంగతి అక్కడ నుండి దాదాపు భక్తులందరికీ అందుతుందనే విషయం జగజ్జనని శ్రీరామకృష్ణుల హృదయాంతరాళాలలో తెలిపి, ఆయన్ని అక్కడకు తోడ్కొనిపోయి కేశవచంద్ర సేన్‌తో పరిచయం గావించింది. ఈ సంఘటన జరిగిన కొద్ది కాలంలోనే శ్రీరామకృష్ణుల విశేష కృపకు పాత్రులైన మరియు పూర్వం ఆయన భావపార వశ్యంలో చూసిన స్వామి వివేకానంద, స్వామి బ్రహ్మానంద మొదలైన భక్తులు ఒక్కరొక్కరుగా రాసాగారు. దివ్యభావంలో శ్రీరామకృష్ణులు ఈ భక్తులతో సలిపిన లీలా కథనాన్ని ఆయన కనుక మాచే చెప్పించ గోరితే, మరో సందర్భంలో అలాగే చేస్తాం. కాని ఇప్పుడు మాత్రం ‘గురుభావం’ అనే ఈ భాగాన్ని ముగిస్తూ, అపూర్వ దివ్యభావ ప్రభావంలో తమ భక్తులతో 1885 వ సం ॥ రథయాత్ర ఉత్సవ దినాలలో కొన్ని రోజులు గడిపిన వృత్తాంతం పాఠకులకు తెలుపుతాం.