యే మే మతమిదం నిత్యమనుతిష్ఠన్తి మానవాః ।
శ్రద్ధావన్తోఽనసూయన్తో ముచ్యన్తే తేఽపి కర్మభిః ॥ భగవద్గీత, 3–31
ఈ నా మతాన్ని (బోధన) దోషదృష్టి లేకుండా శ్రద్ధాపూరితులై, సర్వదా అనుష్ఠించేవారు కూడా కర్మబంధముల నుండి విముక్తులవుతారు.
1. శ్రీరామకృష్ణుల ‘గురుభావం’ గురించి తెలుసుకోని జనసామాన్యం
ఆంగ్ల విద్యాభ్యాసం చేసి, పాశ్చాత్య భావాలను, ఆశయాలను సంతరించుకొన్న కేశవచంద్రసేన్ వంటి కొద్దిమంది ఆధునిక హైందవులలో మాత్రమే శ్రీరామకృష్ణులు ఆధ్యాత్మికతను ప్రసారం చేశారనీ లేదా ప్రగాఢతరం చేశారనీ కలకత్తా జనసామాన్యం అభిప్రాయం. ఈ అభిప్రాయం సరికాదు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో నివసిస్తూన్నారనే విషయం వారికి తెలియడానికి చాలాకాలం క్రితమే ఎందరో ప్రసిద్ధ సాధువులు, సాధకులు, గొప్ప శాస్త్రపండితులు వంగదేశంలోని వివిధ ప్రాంతాల నుండి, ఉత్తర భారతదేశం నుండి ఆయన వద్దకు వచ్చారు. అలా వచ్చి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఆయన ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చూసి, ఆయన ‘గురుభావ’ సహాయంతో నిర్జీవమైన తమ ఆధ్యాత్మిక జీవనానికి తిరిగి ప్రాణం పోసుకొన్నారు; తద్ద్వారా నూతన భావాలను, శక్తిని సంతరించుకొని వాటిని ఇతర ప్రాంతాలలో అనేకులకు అందించడానికి వెళ్ళిపోయారు. కాని ఈ విషయం కలకత్తా వాసులైన చాలామందికి అసలు తెలియదు.
2. ‘పువ్వులు వికసించగానే తుమ్మెదలు వాటంతట అవే వచ్చి చేరుతాయి’
శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు : “పువ్వులు వికసించగానే తుమ్మెదలు వాటంతట అవే వచ్చి చేరుకుంటాయి. వాటిని ఎవరూ ఆహ్వానించ నవసరం లేదు. భగవద్భక్తి, ప్రేమ నిజంగా నీలో జనించగానే, భగవద్దర్శనం కోసం అంటే సత్యసాక్షాత్కారార్థం తమ జీవితాన్ని ఎవరు పరిత్యజించారో లేదా పరిత్యజింప నిశ్చయించుకున్నారో అటువంటి వారు వివరణకు అందని ఒక ఆధ్యాత్మిక నియతి ప్రభావంలో నీ వద్దకు వస్తారు.” మొట్టమొదట భగవత్సాక్షాత్కారం, ఆయన దర్శనం, కృపను పొందాలన్నదే శ్రీరామకృష్ణుల అభిప్రాయం. మానవాళికి శ్రేయస్సును ఒనగూర్చే శక్తిని పొందాలంటే ముందుగా భగవదాదేశం పొంది ఉండాలి; తదనంతరమే ధర్మప్రచారానికీ, లోకశ్రేయస్సుకూ ఉపక్రమించాలి. అలా భగవదాదేశం పొందని పక్షంలో, “నీ మాటలను ఎవరు లక్ష్యపెడతారు? ఆచరించమని నువ్వు చెప్పిన దాన్ని వారెందుకు పాటిస్తారు, అసలు ఎందుకు వింటారు?” అని ఆయన చెప్పేవారు.
3. ధార్మిక విషయాలలో పెక్కు మంది పరిమిత జ్ఞానం కలవారే
భగవదనుభూతి పొందనంతవరకూ నిజానికి మనం అందరమూ ఒకే స్థితిలో ఉన్నవారమే. జన్మ-జరా-మరణాలతో కూడిన ఈ నిరర్థక సంసారంలో సర్వదా వసిస్తూనే, పాండిత్య గర్వాలతో ఇతరులకంటే అధికులమని మనం విర్రవీగుతూ ఉంటాం. భౌతిక విజ్ఞానంలో మనం ఎంతగా పురోగమించినప్పటికీ, అతి నిగూఢమైన జగజ్జనని యొక్క ‘మాయారాజ్యం’ లో ఉంటూనే ఉంటాం. ఇంద్రియాలకు, లోభ-అత్యాశలకు, మృత్యు భయానికి లోబడినందున పరిణమించే దుస్థితి మనలను వెన్నంటుతూనే ఉంటుంది. “నే నెవరిని? ఎందుకు ఇక్కడకు వచ్చాను? ఎక్కడికి పోవాలి? పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధిల తోడ్పాటుతో సత్యాన్ని తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ, అడుగడుగునా వాటి చేతనే వంచింపబడుతూ, భ్రష్టుపట్టే మనం ఆడుతున్న ఈ ఆట లక్ష్యం ఏమిటి? వాటి పట్టు నుండి ఎన్నటికైనా విడివడడం సాధ్యమేనా? ముక్తులం కాగలమా?” మొదలైన శాశ్వత సమస్యల విషయంలో ఎడతెగని అజ్ఞానాంధకారం లోనే మనం జీవిస్తున్నాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యథార్థ జ్ఞానశూన్యులే; దానిని పొంద సంసిద్ధులే. కాని ఈ జ్ఞానాన్ని వారికి అందించే వారెవరు? ఒకవేళ నిజానికి ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగేవారు ఎవరైనా ఉంటే వారు దానిని ఎంతైనా ఇవ్వవచ్చుగాక! కాని, భ్రాంతిలో పూర్తిగా మునిగిపోయివున్న మనిషి తాను బోధింప తలచినది తనకు అవగతమై ఉండాలన్న విషయం అర్థం చేసుకోడు. పైగా పేరుప్రతిష్ఠల కోసమో, మరేదో స్వార్థం కోసమో తాను పొందని దానిని ఇతరులకు ఇవ్వడానికి లేదా ఇస్తూ ఉన్నట్లు నటించడానికి పరుగులు పెడతాడు; ఫలితంగా ఒక అంధుడు మరొక అంధుడికి దారి చూపే రీతిలో, బోధకుడూ బోధితుడూ ఇద్దరూ ఇక్కట్లలో పడతారు.
4. శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక ప్రచార వైనం
కాబట్టి శ్రీరామకృష్ణులు లోకం నడిచే మార్గానికి పూర్తిగా విరుద్ధమైన మార్గంలో నడిచారు. పరిపూర్ణ త్యాగ వైరాగ్య సంయమాలను ఒకే చోట నిశ్చింతులై ప్రశాంతంగా ధీర సుస్థిరులై వసిస్తూ అభ్యసించి జగజ్జనని చేతిలో అనువైన ఉపకరణంగా తమను తీర్చి దిద్దుకొన్నారు. సమగ్ర సత్యాన్ని అనుభూతం చేసుకుని, యథార్థమైన లోకశ్రేయస్సుకై కార్యాదర్శాన్ని ప్రజ్వలించారు. భగవల్లబ్ధి పొంది, అనంతరం ఇతరులకు ప్రదానం చేయడానికి తాము సముపార్జించిన జ్ఞాన భాండారాన్ని తెరిచారు. ఆహ్వానం లేకపోయినా జ్ఞానపిపాసువులు పరిగెత్తుకుంటూ ఆయన వద్దకు రాసాగారు. ఆయన దృక్కులచే, స్పర్శచే పునీతులైన వారు తాము తరించినట్లు భావించుకున్నారు; ఆయన వినూత్న భావాలను తాము పోయిన ప్రతి చోటా ప్రచారం చేస్తూ అనేకులను తరింప చేయసాగారు. ఎందుకంటే, మనం ఎక్కడున్నా మనలోని భావాలనే వ్యక్తం చేస్తూ ఉంటాము కనుక. ఈ విషయాన్నే శ్రీరామకృష్ణులు సరళ గ్రామీణ శైలిలో ఇలా చెప్పేవారు: “త్రేన్చినప్పుడు ఎవరు ఏం తిన్నారో ఆ వాసనే బయటకు వస్తుంది. దోసకాయ తింటే దోసకాయ త్రేనుపే వస్తుంది; ముల్లంగి తింటే ముల్లంగి త్రేనుపే వస్తుంది.”
5. భైరవీ బ్రాహ్మణిని కలుసుకొన్నప్పటి శ్రీరామకృష్ణుల స్థితి
భైరవీ బ్రాహ్మణిని కలుసుకోవడం శ్రీరామకృష్ణుల జీవితంలో ఒక ముఖ్య సంఘటన. ఆ సమయం నుండే ఆయన ఒక వంక ఆధ్యాత్మిక సాధనలలో సత్వర పురోగతిని పొందుతూ వచ్చారు; మరో వంక ఆయన వ్యక్తిత్వంలో ‘గురుభావం’ విస్పష్టంగా అభివ్యక్తం కాసాగింది. అలాగని ‘గురుభావం’ తొలి నాళ్ళలో ఆయనలో అభివ్యక్తం కాలేదని అనుకోరాదు. దాదాపు ఆయన జీవితంలో అన్ని స్థితులలో, బాల్యం నుండి కూడా, ‘గురుభావం’ ఆయనలో అభివ్యక్తం అయిందని గత అధ్యాయాలలో స్పష్టీకరించాం. శ్రీరామకృష్ణుల దీక్షాగురువులు సైతం తమ ఆధ్యాత్మిక జీవితంలోని లోటుపాట్లను ఈ ‘గురుభావ’ తోడ్పాటుతో సరిదిద్దుకున్నారనే సంగతినీ ఇదివరలోనే తెలియజేశాం.
6. శ్రీరామకృష్ణుల అత్యున్నత అవస్థను ఇతరులు అవగతం చేసుకొన్న తీరు
భైరవీ బ్రాహ్మణి రాకకు పూర్వం శ్రీరామకృష్ణుల అసాధారణమైన భగవదనురాగం, వ్యాకులతలు అనేకుల దృష్టిలో ఉన్మాదంగా, శారీరక రుగ్మతగా కానవచ్చేవి; ప్రఖ్యాత వైద్యులు ఆయనకు చికిత్స కూడా చేశారు. ఆ సమయంలో సాధకుడైన తూర్పు వంగదేశ వైద్యుడొకరు, శ్రీరామకృష్ణులను చికిత్స నిమిత్తం గంగాప్రసాద్సేన్ అనే వైద్యుని ఇంటికి వచ్చినప్పుడు చూడడం తటస్థించింది. శ్రీరామకృష్ణుల శరీరంలో కానవస్తున్న లక్షణాలన్నీ నిజానికి యోగాభ్యాస ఫలితంగా జనించిన అసాధారణ మార్పులని ఈ వైద్యుడు తన అభిప్రాయం వెలిబుచ్చినా, అప్పుడు ఎవరూ ఆయన అభిప్రాయాన్ని లక్షించలేదు. భగవత్ప్రేమతో కలిసి ఉన్నప్పటికీ అవి ఉన్మాద లక్షణాలనే, మథుర్బాబుతో సహా అందరూ నిశ్చయించుకున్నారు.
కాని భక్తిశాస్త్రాలలో నిష్ణాతురాలైన బ్రాహ్మణి మాత్రం శ్రీరామకృష్ణుల శరీరంలో కానవచ్చే లక్షణాలు, దేవతలకు సైతం దుర్లభమైన అనన్య భగవద్భక్తికి నిదర్శనంగా మనస్సులో జనించే మార్పులయొక్క బాహ్యవ్యక్తీకరణయే అని ప్రప్రథమంగా గుర్తించి, వెల్లడించింది. అలా ఆమె తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడంతోనే ఆగిపోలేదు. అతీంద్రియ మానసిక పరివర్తనలకు అనుగుణంగా అప్పుడప్పుడు శరీరంలో కూడా కచ్చితంగా ఇటువంటి (అంటే శ్రీరామకృష్ణులలో కనిపిస్తున్న) లక్షణాలే వ్యక్తం అవుతాయని బ్రాహ్మణి భక్తిశాస్త్రాలను సోదాహరణంగా చూపింది; మూర్తీభవించిన దివ్యప్రేమ రూపిణియైన రాధాదేవి, శ్రీకృష్ణ చైతన్యులు, ప్రాచీన ఆచార్యులు, యోగులలో ఇటువంటి శారీరక లక్షణాలు కానవచ్చాయని కూడా తెలియచేసింది. ఆ తరువాత భక్తిశాస్త్రాలలో నమోదైన లక్షణాలను శ్రీరామకృష్ణుల శరీరంలో అభివ్యక్తమయ్యే లక్షణాలతో ఆమె పోల్చి, తన వాదనను ఋజువు చేసింది. బ్రాహ్మణి అలా చేయడం చూసి, తల్లి భరోసాతో రెట్టించిన బలం పుంజుకొన్న పిల్లవాడిలా శ్రీరామకృష్ణులు ఆనందించారు. మథుర్బాబుతో సహా కాళికాలయంలోని వారంతా బ్రాహ్మణి చెప్పింది విని ఆశ్చర్యంతో అవాక్కయ్యారు. “శాస్త్రాలలో నిష్ణాతులైన పండితులను రావించు; నా మాటలలోని సత్యాన్ని వారు కూడా ఆమోదించేటట్లు ఋజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని బ్రాహ్మణి, మథుర్తో చెప్పినప్పుడు వారు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు.
7. బ్రాహ్మణి విన్నపం మేరకు పండిత సదస్సు
ఆశ్చర్యపోవడం విశ్వసించడం కాదు కదా! ఊరూపేరూ లేని, భిక్షాటనతో జీవించే ఒక స్త్రీ మాటలను, పాండిత్యాన్ని ఎవరు మాత్రం విశ్వసించడానికి సంసిద్ధంగా ఉంటారు? అందుచేతనే ఆమె పలుకులు కూడా పైన చెప్పిన తూర్పు వంగదేశ వైద్యుని పలుకుల్లా మథుర్, తదితరులపై ఎలాటి ప్రభావమూ చూపలేక పోయేవి. కాని శ్రీరామకృష్ణుల ప్రమేయంతో కథ అడ్డం తిరిగింది. చిన్న పిల్లవాడిలా హఠంపట్టి ఆయన, మథుర్ను, “గొప్ప పండితులను రావించి, బ్రాహ్మణి చెబుతూన్న విషయం పరీక్షించి చూడాలి” అని అడిగారు. సంపన్నుడైన మథుర్ ఇలా ఆలోచనలో పడ్డాడు : “అలా చేయడంలో నష్టమేమిటి? చిన్న భట్టాచార్యుల చికిత్స నిమిత్తం వైద్యులకు, ఔషధాలకు ఎంతో డబ్బు ఖర్చవుతున్నది. పండితులు వచ్చి శాస్త్రప్రమాణంతో బ్రాహ్మణి వాదనను వమ్ము చేసినప్పుడు కనీసం ఒక్క సత్ఫలితమైనా ఒనగూరుతుంది. అలా జరగడం తథ్యం. నిష్కపటియైన భట్టాచార్య, పండితుల పలుకులు విశ్వసించినప్పుడు తాను ఏదో ఒక రుగ్మతతో బాధపడుతున్నట్లు తప్పక గ్రహిస్తాడు. తత్ఫలితంగా తన మనస్సును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. నలుగురూ నడిచే త్రోవ పట్టక, ‘నేను చేస్తున్నది, అవగతం చేసుకున్నదే సముచితం; ఇతరులు అవగతం చేసుకుని నన్ను చేయమన్నది తప్పు’ అని భావిస్తూ, తన మనస్సును పట్టపగ్గాలు లేకుండా వదలివేసే వ్యక్తి పిచ్చివాడు కాక మరేమౌతాడు? లోకులు వెర్రివారు అయ్యే తీరు ఇదే. పండిత సదస్సును సమావేశపరచకుండా, బ్రాహ్మణి పలుకులనే భట్టాచార్య గుడ్డిగా నమ్ముతూవుంటే ఆయన మానసిక అస్తవ్యస్థత, శారీరక రుగ్మత ప్రకోపం చెందడం తథ్యం.” ఇలా తర్జనభర్జన పడి చివరికి కొంత ఉత్సుకత కారణంగా, కొంత శ్రీరామకృష్ణుల పట్ల ఉన్న ప్రేమాభిమానాల చేత మథుర్ పండిత సదస్సును ఏర్పాటు చేయడానికి అంగీకరించాడు.
8. వైష్ణవచరణ్, గౌరీపండితులను ఆహ్వానించడం
ఆనాటి కలకత్తా పండితగోష్ఠిలో వైష్ణవచరణ్కు ఎనలేని గౌరవ మర్యాదలు ఉండేవి. దేశంలో పలుచోట్ల ఆయన భాగవతం చదివి వినిపిస్తూ చక్కగా వ్యాఖ్యానించేవారు; అందువల్ల జనసామాన్యంలో కూడా ఆయన ఎంతో ఖ్యాతి గాంచారు. అందుచేతనే శ్రీరామకృష్ణులు, మథుర్ బాబు, బ్రాహ్మణి ఆయనను గురించి విని ఉన్నారు. కాబట్టి వైష్ణవచరణ్ను పండిత సదస్సుకు ఆహ్వానించాలని మథుర్బాబు నిశ్చయించుకున్నాడు. అదేవిధంగా బాంకూరా జిల్లాలోని ‘ఇందేష్’ కు చెందిన గౌరీపండితుడు కూడా తన అసాధారణ శక్తి, అరుదైన పాండిత్యానికి ఖ్యాతి పొందాడు. ఈయనను కూడా మథుర్ పండిత సదస్సుకు ఆహ్వానింప నిర్ణయించుకొన్నాడు. ఈ విధంగా వైష్ణవచరణ్, గౌరీపండితుడు దక్షిణేశ్వరానికి రావడం తటస్థించింది. వారిద్దరి గురించి అప్పుడప్పుడు శ్రీరామకృష్ణుల నుండి మేం ఎన్నో విషయాలు విన్నాం. ఆ విధంగా వారి గురించి మాకు తెలిసినదంతా పాఠకులకు ఇప్పుడు తెలుపడానికి ప్రయత్నిస్తాం.
9. వైష్ణవచరణ్ పేరు ప్రతిష్ఠలు
వైష్ణవచరణ్ గొప్ప పండితుడే కాదు, శ్రద్ధాళువైన మహా సాధకుడుగా కూడా ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న వ్యక్తి. ఆయన భగవద్భక్తీ, వేదాంత పాండిత్యం, విశేషంగా భక్తిశాస్త్రాల గురించిన ప్రగాఢ పరిజ్ఞానం ఆనాటి వైష్ణవ సమాజం అంతటిలో ఆయనను అగ్రగణ్యునిగా చేశాయని చెప్పడం అతిశయోక్తి కాదు. ధార్మిక ప్రాధాన్యమైన ప్రతి బహిరంగ ఉత్సవంలోనూ ఆయనదే అగ్రతాంబూలం. ధార్మిక పరమైన తుది నిర్ణయాలలో వారు ఆయనను సంప్రదించి, ఆయన వెలిబుచ్చిన నిర్ణయాలను శిరసా వహించేవారు. అంతేకాక శ్రద్ధాళువులైన పలువురు సాధకులు సముచిత మార్గానిర్దేశాలకై ఆయనను ఆశ్రయించి, ఆయన సలహాలను తు.చ. తప్పక పాటించేవారు. అందువలన శ్రీరామకృష్ణుల భావావస్థ ప్రగాఢ భగవద్భక్తి ఫలితంగా జనించిందో లేక అదొక శారీరక రుగ్మతో నిర్ణయించడంకోసం వైష్ణవచరణ్ను తోడ్కొని రావాలని మథుర్ బాబు సంకల్పించడంలో ఆశ్చర్యం లేదు.
10. శ్రీరామకృష్ణుల శారీరక మంటను బ్రాహ్మణి ఉపశమింప చేయడం
ఈ లోపు శ్రీరామకృష్ణుల అవస్థ గురించిన తన అభిప్రాయాన్ని ఋజువు పరిచే ఒక ముఖ్య నిదర్శనాన్ని బ్రాహ్మణి చూపించింది; ఇది ఆమెకు ఎంతో సంతోషాన్ని, ఇతరులకు విస్మయాన్ని కలిగించింది. బ్రాహ్మణి, దక్షిణేశ్వరానికి రాక పూర్వం నుండి తీవ్రమైన శారీరక మంటతో శ్రీరామకృష్ణులు బాధ పడుతున్నారు. రకరకాల చికిత్సలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. సూర్యోదయంతో ప్రారంభమయ్యే ఆ మంట రోజు గడిచేకొద్దీ తీవ్రతరమై మిట్టమధ్యాహ్నానికి భరింపరాని తారాస్థాయికి చేరుకొనేది; అప్పుడు ఆయన గంగానదిలో రెండు మూడు గంటలసేపు మునిగి, తడిగుడ్డను తలమీద పెట్టుకొని ఉండవలసి వచ్చేది. ఈ సంగతి స్వయంగా ఆయనే మాతో చెప్పారు. ఎక్కువసేపు నీళ్ళలో మునిగివుంటే జలుబు లేదా మరేదో రుగ్మతతో బాధపడవలసి వస్తుందేమోనన్న భయంతో ఇష్టం లేకపోయినా నీళ్ళలో నుండి వెలుపలకు వచ్చేసేవారు. అందుచేత యజమానుల భవంతిలోని ఒక గదిలో తలుపులు, కిటికీలు అన్నీ మూసి తడిగుడ్డతో తడిసిన చలువరాతి నేలమీద ఆయన దొర్లేవారు.
బ్రాహ్మణికి ఈ విషయం తెలిసీ తెలియగానే, ఆయన రుగ్మతకు ఒక క్రొత్త వివరణను ఆమె కనుగొన్నది. అది ఎలాంటి రుగ్మతా కాదనీ, తీవ్ర భగవత్ వ్యాకులత కారణంగా జనించిన అసాధారణ ఆధ్యాత్మిక ఘటన అనీ ఆమె చెప్పింది. భగవత్సాక్షాత్కార నిమిత్తం జనించే తీవ్ర వ్యాకులత వలన కలిగే భౌతిక మార్పులు శ్రీరాధారాణి, చైతన్య మహాప్రభువుల వంటి వారి జీవితాలలో తరచూ కానవచ్చేవని బ్రాహ్మణి తెలిపింది. ఈ ఆధ్యాత్మిక ‘రుగ్మత’ ను నయం చేసే ఔషధం కూడా అసాధారణమైనదే! అది : సువాసనలు వెదజల్లే పూమాలలతో రోగిని అలంకరించడం, చందనాది సుగంధాలను దేహానికి అద్దడం.
బ్రాహ్మణి నిర్దేశించిన చికిత్సా విధానానికే గాక, ఆమె చేసిన రోగ నిర్ధారణకు కూడా మథుర్బాబుతో సహా అందరూ నవ్వుకున్నారు. వాళ్ళు ఇలా అనుకొన్నారు: ‘ఎన్ని ఔషధాలు వాడినా, మధ్యమ నారాయణ, విష్ణువంటి ఎన్ని తైలాలు మర్దన చేసినా కించిత్తు కూడా తగ్గుముఖం పట్టని రోగాన్ని, అసలు అది రోగమే కాదని ఆమె నిర్ణయించడం ఎంత అర్థరహితం!’ కాని బ్రాహ్మణి నిర్దేశించిన సులువైన, ప్రమాదరహితమైన చికిత్సకు అభ్యంతరం చెప్పడానికి ఎవరికి మాత్రం ఏం ఆస్కారం ఉంది! ఒకటి రెండు రోజులు ఆ చికిత్స చేయించుకొని అది నిష్ప్రయోజనమని తెలుసుకొని శ్రీరామకృష్ణులే మానివేస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. బ్రాహ్మణి సూచించిన మేరకు శ్రీరామకృష్ణులను పూల మాలలతో, సుగంధ లేపనంతో అలంకరించారు. కాని అందరినీ విస్మయం కలిగించే రీతిలో శ్రీరామకృష్ణుల శారీరక మంట మూడు రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయింది. కాని సందేహ ప్రాణులు నిజాన్ని అంత తేలికగా అంగీకరిస్తారా? అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు రోగ ఉపశమనానికి తమ సొంత వివరణలు ఇవ్వకుండా ఉండలేరు. కాకతాళీయంగా రోగ ఉపశమనం జరిగిందన్నారు. ఇంతకు క్రితం భట్టాచార్యుల శరీరానికి మర్దించిన విష్ణుతైలమే అసలు సిసలైన ఔషధం. వైద్యుడు చెప్పిన దానిని బట్టి ఆ విషయం స్పష్టమౌతున్నది. ఆ తైలం ఇప్పటి వరకూ సత్ఫలితాలను ఇస్తూ వచ్చింది; బ్రాహ్మణి చెప్పిన చికిత్స జరిపించకపోయినా ఒకటి రెండు రోజుల్లో ఆ తైల వాడకమే, శారీరక మంటను పూర్తిగా ఉపశమింప చేసేది. కనుక రోగం నయంకావడం కేవలం కాకతాళీయమే! బ్రాహ్మణి మాటను పట్టించుకోకుండా పూజారిగారు ఆ తైల వాడకాన్ని కొనసాగించాలన్న అభిప్రాయాన్ని తెలియజేసారు.
11. శ్రీరామకృష్ణుల మితిమీరిన ఆకలి బాధను బ్రాహ్మణి నివారించడం
ఇది జరిగిన కొద్ది కాలంలోనే, జనం ‘రోగం’ గా పరిగణించిన మరో ఉపద్రవం శ్రీరామకృష్ణుల మీదికి ముంచుకొచ్చింది. బ్రాహ్మణి సూచించిన సులువైన చికిత్సా విధానంతో ఇది కూడా నయమైందని శ్రీరామకృష్ణుల ముఖతా మేం విన్నాం. ఆ విషయంగా ఆయన ఇలా చెప్పారు : “ఆ సమయంలో మితిమీరిన ఆకలితో బాధపడేవాణ్ణి. ఎంత తిన్నా తృప్తి కలిగేది కాదు. కడుపునిండా తిన్నా, వెంటనే మళ్ళీ ఆకలి దహించేది. తిన్నా తినకపోయినా సదా ఆకలి దహించివేసేది. రేయింబవళ్ళు ఆ ఆకలి ఎడతెగకుండా కొనసాగేది. ‘ఇదొక క్రొత్త రోగమా?’ అనే ఆలోచన మదిలో మెదలింది. బ్రాహ్మణికి ఈ విషయం చెప్పాను. అందుకు ఆమె ఇలా చెప్పింది : ‘నాయనా, భయపడకు. భగవత్ సాక్షాత్కార మార్గంలో పయనించే వ్యక్తులకు అటువంటి అవస్థలు అప్పుడప్పుడు కలుగుతాయని శాస్త్రాలు వచిస్తున్నాయి. ఈ నీ ఆకలి రోగాన్ని నేను నయం చేస్తాను.’ తరువాత మథుర్ బాబుకు చెప్పి ఒక గదిలో అటుకులు, మరమరాలు, సందేశ్, రసగుల్లా, లూచీ వంటి మధుర భక్ష్యాలను రాశులుగా అమర్చిపెట్టే ఏర్పాటు చేయించింది. అలా మధుర భక్ష్యాలు వగైరా గదిలో పెట్టించాక, ‘నాయనా! రాత్రింబగళ్ళు ఈ గదిలోనే ఉండిపో; ఎప్పుడు ఏది తినాలనిపించినా నిశ్చింతగా తిను’ అని నాతో చెప్పింది. ఆ గదిలో అటూ ఇటూ నడుస్తూ, ఆ భక్ష్యాలను తేరిపార చూస్తూ, అప్పుడొక కుప్ప నుండి, ఇప్పుడొక కుప్ప నుండి భక్ష్యాలను తీసుకొంటూ నేను తినసాగాను. ఈ విధంగా మూడు రోజులు గడిచిపోయాయి; ఆ మితిమీరిన ఆకలి పూర్తిగా తగ్గిపోయింది. హమ్మయ్య అనుకొన్నాను.”
12. యౌగిక క్షుత్తు: శ్రీరామకృష్ణులలో దానిని మేం చూసిన వైనం
యోగావస్థ, అంటే మనస్సు భగవంతుడిలో లీనమై ఉండే అవస్థ; ఈ అవస్థ సాధకులలో సహజం, స్వాభావికం కావడానికి మునుపు, కొన్ని సందర్భాలలో ఆ తరువాత కూడా పైన పేర్కొన్నట్లు కొందరిలో మితిమీరిన ఆకలి జనించడం గురించి మేం వినివున్నాం. అంతేకాక తదుపరి కాలంలో శ్రీరామకృష్ణుల జీవితంలోనూ కాస్త తేడాతో అటువంటి అవస్థలు కలగడం మేం కళ్ళారా చూసి ఆశ్చర్యచకితులమైనాం. తొలుత అనుభవించినట్టి ఎడతెగని ఆకలి బాధను తదనంతర కాలంలో ఆయన పొందలేదు. అప్పుడు ఆయన భావావస్థలో సాధారణంగా తినగలిగే ఆహారానికి నాలుగైదు రెట్లు అధికంగా తీసుకుని, సునాయాసంగా జీర్ణం చేసుకోవడం మేము చూశాం. అటువంటి కొన్ని సంఘటనలను ఇక్కడ వివరిస్తే పాఠకులు ఈ విషయాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు.
13. మొదటి ఉదాహరణ: పెద్ద మిఠాయి ముక్కను తినడం
పాఠకులకు ఇంతకు మునుపే ఒక ఉదంతం* గురించి చెప్పివున్నాం. శ్రీరామకృష్ణులు భక్తురాండ్ర పట్ల ఎలా అవ్యాజ కరుణతో మెలిగేవారో ప్రస్తావించిన సందర్భంలో ఈ ఉదంతం తెలిపాం. బాగ్బజార్ వాస్తవ్యులైన కొందరు స్త్రీలు ‘భోలా’ మిఠాయి దుకాణం నుండి మీగడతో తయారుచేసే ‘సర్’ అనే పెద్ద మిఠాయి ముక్కను కొని, ఆయన కోసం దక్షిణేశ్వరానికి వచ్చారు. శ్రీరామకృష్ణులు అక్కడ లేకపోవడంతో ఆ మిఠాయిని ఆయన గదిలో ఉంచి, ఎంతో ప్రయాసతో మహేంద్రనాథ్ గుప్త ఇంటికి వెళ్ళి, అక్కడ శ్రీరామకృష్ణులను కలుసుకున్నారు. ఆయనతో మాట్లాడుతూన్నప్పుడు, శ్రీరామకృష్ణులు ‘లావు బ్రాహ్మణుడు’ అని పేర్కొనే ప్రాణకృష్ణ ముఖోపాధ్యాయ్ హఠాత్తుగా అక్కడకు రావడం, ఆ స్త్రీలు ఎలా శ్రీరామకృష్ణులు కూర్చున్న మంచం క్రింద నక్కి కూర్చోవడం మొదలైన వివరాలన్నీ ముచ్చటించాం. అక్కడే శ్రీరామకృష్ణులు భోజనం ముగించి బాగా ప్రొద్దుపోయాక దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు. భావావస్థలో ఆ రాత్రి ఆకలి వేయగా ఆ భక్తురాండ్రు తెచ్చిన మిఠాయిని దాదాపు పూర్తిగా ఆరగించారని కూడా ఆ సందర్భంలో చెప్పాం. ఇప్పుడు అటువంటి మరికొన్ని సంఘటనలను ఇక్కడ వివరించనున్నాం. ఆయన జీవితంలో ఇటువంటి సంఘటనలు దాదాపు ప్రతినిత్యం జరిగాయి కనుక ‘కొన్నింటిని’ అని పేర్కొన్నాం. అందుచేత వాటి నన్నింటినీ ఉదహరించడం అసాధ్యం.
14. రెండవ ఉదాహరణ: కామార్పుకూర్లో రెండుసేర్ల మిఠాయి, మరమరాలను ఆరగించడం
మలేరియా వ్యాధి తాండవించి జనక్షయం గావించడానికి పూర్వం వంగదేశంలో అత్యధిక భాగం, ప్రత్యేకించి రాఢ్ ప్రాంతం, విస్తృత నీటి వనరులతో, పళ్ళతోటలతో, పచ్చని వరిపొలాలతో కళకళలాడేది; ఆరోగ్యకరమైన వాతావరణ విషయంలో హుగ్లీ, బర్డ్వాన్ వంటి జిల్లాలు భారతదేశ వాయవ్య ప్రాంతానికి ఏమాత్రం తీసిపోలేదని వృద్ధులు చెబుతూ ఉంటారు. ఆ రోజుల్లో జనం, బర్డ్వాన్ వంటి ప్రదేశాలకు వాతావరణ మార్పిడి కోసం వెళ్ళేవారని వారు చెప్పేవారు. బర్డ్వాన్కు సుమారు ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న కామార్పుకూర్ కూడా ఆరోగ్యకర వాతావరణానికి నెలవై ఉండేదని చెప్పడం అతిశయోక్తి కాదు. కనుక అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు ఆరోగ్యం పుంజుకోవడానికై కామార్పుకూర్కు వెళ్ళడం కద్దు. శరీరం పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించక పన్నెండు సంవత్సరాల అసాధారణ సాధనానుష్ఠానాల వలనా, నిరంతరం భావసమాధిమగ్నులై ఉన్నందున శ్రీరామకృష్ణుల దేహదార్ఢ్యం దెబ్బతిన్నది. కనీస శారీరక పరిశ్రమను కూడా ఓర్వలేని దుర్బలులై, ఆయన తరచు అనారోగ్యానికి గురయ్యేవారు. కాబట్టే సాధనలు ముగించాక వాతావరణ మార్పిడి కోసం ప్రతి సంవత్సరం శ్రీరామకృష్ణులు కామార్పుకూర్ తదితర చుట్టుపట్ల ప్రదేశాలకు పోయి, అక్కడ ‘చాతుర్మాస్యం’ (అంటే వర్షాకాలపు నాలుగు నెలలు) గడిపి కలకత్తాకు తిరిగి వచ్చేవారు. అటువంటి సందర్భాలలో ఆయన మేనల్లుడూ, విశ్వాసపాత్రుడూ, సేవకుడూ అయిన హృదయ్ ఆయన వెంటే ఉండేవాడు. ఆ ప్రయాణాల ఖర్చులన్నింటినీ భరించడమేకాక, ఆ కుగ్రామాలలో శ్రీరామకృష్ణులు ఇబ్బంది పడరాదనే తలంపుతో మథుర్ అవసరమైన సామగ్రి సైతం ఆయనతో పాటు పంపించేవాడు. కుమార్తెను ప్రప్రథమంగా అత్తవారి ఇంటికి సాగనంపుతున్నప్పుడు తల్లి ఆమెతో బాటు సారె పంపుతుంది; అదే విధంగా మథుర్, భక్తి పరాయణురాలైన అతడి భార్య జగదాంబదాసీ శ్రీరామకృష్ణులు కామార్పుకూర్కు వెళుతున్నప్పుడు ఆయనతో పాటు నిత్యావసర సామగ్రినంతా పంపించేవారు. ఎందుకంటే గ్రామంలోని శ్రీరామకృష్ణుల కుటుంబ స్థితిగతులు ఆ దంపతులకు తెలియనివి కావు; ఆ కుటుంబం శివుని కుటుంబం వంటిది. తాతముత్తాతల కాలం నుండీ ఆ కుటుంబ సభ్యులకు భవిష్యత్తు నిమిత్తం ఎంతోకొంత సమకూర్చుకుని ఉంచుకోవాలనే ఈషణ్మాత్రమైన ధ్యాస కూడా ఉండేది కాదు. లభించిన దానితోనే జీవనం సాగిస్తూ, ఎట్టి పరిస్థితిలోను సత్యమార్గం వీడక వర్తించడమే ఆ కుటుంబ ఆచారం. శ్రీరఘువీరుని పేరిట ఉన్న అర ఎకరం పొలంలో పండిన పంటతో కుటుంబాన్ని వెళ్ళబుచ్చేవారు. ఆ ధర్మపరాయణ కుటుంబానికి ఆ గ్రామ కిరాణా అంగడే ఉగ్రాణం; దక్షిణలు మొదలైన వాటి ద్వారా లభించే స్వల్ప పైకంతో ఆ రోజుకు మాత్రం సరిపడే నిత్యావశ్యకాలైన పప్పు, ఉప్పు, నూనె, కాయగూరలు ఇత్యాదులను ఆ అంగడి నుండి కొనుగోలు చేసుకొనేవారు. తక్కిన రోజులలో అన్నం, చెరువు గట్ల మీద పెరిగే ఆకుకూరలతో సంతృప్తితో ఆనందంగా గడిపివేసేవారు. సర్వకాల సర్వావస్థలలో తమ కుల దైవమైన శ్రీరఘువీరుని మీదే ఆధారపడి ఉండేవారు. ఆ కుటుంబ స్థితిగతులు బాగా తెలిసి ఉండడం వలనే శ్రీరఘువీరుని పేరిట కొన్ని ‘భిగా’ ల వరిపొలాన్ని కొనుగోలు చేసి వారికి ధారాదత్తం చేయాలనే బలీయమైన కోర్కె* మథుర్బాబుకు ఉండేది. ఆ దృష్ట్యా శ్రీరామకృష్ణులతోబాటు గృహనిర్వహణకు అవసరమైన నిత్యావసర వస్తువులను మథుర్ పంపేవాడు.
చాతుర్మాస్య కాలంలో ఏటేటా శ్రీరామకృష్ణులు కామార్పుకూర్కు వెళ్ళేవారని మునుపే చెప్పుకొన్నాం. మలేరియా వ్యాధి ఆ ప్రాంతాలలో సోకి, తాండవిస్తూన్న సందర్భంలో ఒక సంవత్సరం శ్రీరామకృష్ణులు కామార్పుకూర్ వెళ్ళారు; ఆ రోగం వాతబడి ఎంతో బాధ అనుభవించారు. ఆనాటి నుండి స్వగ్రామానికి వెళ్ళకూడదని సంకల్పించుకున్నారు. మళ్ళీ ఎన్నడూ ఆయన అక్కడకు వెళ్ళింది లేదు. తమ మరణానికి ఎనిమిది లేక పది సంవత్సరాలకు మునుపు అలా సంకల్పించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ అంతకు మునుపు ఒక సంవత్సరం ఆయన కామార్పుకూర్కు వెళ్ళారు. ఆయనను చూడడానికీ, ఆయన ఆధ్యాత్మిక వచనాలు వినడానికీ ఇరుగుపొరుగు స్త్రీ పురుషులు సతతం ఆయన వద్దకు తీర్థప్రజగా వచ్చారు. అవిచ్ఛిన్నమైన ఒక దివ్యానందలహరి అప్పుడక్కడ ప్రవహించింది. ఆయనను చూడవచ్చిన వారిని సేవించడంలో ఆ ఇంటి స్త్రీలు ఎంతో ఆనందం పొందారు. ఆ ఆనందంలో రోజులు ఎలా గడిచిపోయాయో ఎవరికీ తెలియరాలేదు. రాంలాల్ తల్లి (రామేశ్వర్ భార్య), ఆమె కుమార్తె లక్ష్మి, మాతృదేవి శారదాదేవి అప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నారు.
ఒక రోజు చీకటిపడి మూడు గంటలు గడిచాయి. శ్రీరామకృష్ణులను చూడవచ్చిన ఇరుగు పొరుగు స్త్రీలు పురుషులు సెలవు పుచ్చుకొని తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. శ్రీరామకృష్ణులు గత కొన్ని రోజులుగా ఆజీర్తితో బాధపడుతున్నారు. సగ్గుబియ్యం, బార్లీనీళ్ళు మాత్రమే ఆయన ఆహారంగా పుచ్చుకొంటున్నారు. ఆ రాత్రి కూడా కాసిని పాలు, బార్లీనీరు పుచ్చుకొని, నిద్రకు ఉపక్రమించారు. ఆ ఇంటి స్త్రీలు చివరకు భోజనం చేసి, ఇంటి పనులన్నీ ముగించి పడుకోబోతున్నారు.
ఆ సమయంలో శ్రీరామకృష్ణులు తమ పడకగది తలుపులు హఠాత్తుగా తెరుచుకొని భావావస్థలో తూలుతూ, రాంలాల్ తల్లిని ఇతరులను ఉద్దేశించి, “మీరందరూ పడుకున్నారా! నా కేమీ ఆహారం ఇవ్వకుండానే పడుకున్నారేమిటి?” అని అడిగారు. ఆ మాటలకు విస్తుబోయి రాంలాల్ తల్లి, “అదేమిటి! ఇప్పుడే కదా నువ్వు తిన్నావు” అని బదులిచ్చింది. అందుకు ఆయన, “ఎప్పుడు తిన్నాను? ఇప్పుడే కదా నేను దక్షిణేశ్వరం నుండి వచ్చాను. నా కెప్పుడు ఆహారం ఇచ్చారు?” అని అడిగారు.
ఈ మాటలకు ఆ స్త్రీలందరూ ఆశ్చర్యపోయి, ఒకరి మొహాలు ఒకరు చూసుకొన్నారు. భావావస్థలో ఆయన అలా మాట్లాడుతున్నారని వారు గ్రహించగలిగారు. కాని వాళ్ళిప్పుడు ఏం చేయగలరు? ఆ అర్ధరాత్రి ఇంట్లో తినడానికి ఏమీ లేదు. మార్గాంతరం ఏమిటి? రాంలాల్ తల్లి కాస్త సంకోచిస్తూ, “ఇంట్లో మరమరాలు తప్ప ఇంకేమీ లేవు. మరమరాలు తింటావా? అవి కాసిని తిను. అవి కడుపుకు చెరుపు చేయవు” అని అంటూ, ఒక పళ్ళెంలో మరమరాలు పోసి, ఆయన ముందు పెట్టింది. ఆ మరమరాలు చూసి శ్రీరామకృష్ణులు పిల్లవాడిలా కోపగించుకొని, “వట్టి మరమరాలు మాత్రమే తినను” అంటూ మారాంచేశారు. రాంలాల్ తల్లి ఆయనను బుజ్జగింప ప్రయత్నించింది. “కడుపు నొప్పితో నువ్వు బాధపడుతున్నావు; మరేదీ నీకు సరిపడదు. పైగా ఈ అపరాత్రి దుకాణాలన్నీ మూసివేసి ఉంటారు; కనుక సగ్గుబియ్యం కాని, బార్లీకాని కొనుక్కురావడం సాధ్యం కాదు. ఈ రాత్రికి ఇవి కాస్త తిను. తెల్లారగానే నీ కోసం చారు, అన్నం వండుతాను.” కాని ససేమిరా ఆయన వినలేదు. మారాం చేస్తున్న పిల్లవాడిలా ఆయన పదే పదే “వీటిని నేను తినను” అంటూ మొండికేశారు.
ఇక గత్యంతరంలేక రాంలాల్ను దుకాణానికి పంపారు. అతడు ఒక దుకాణానికి వెళ్ళి కేకలుపెట్టి ఆ దుకాణదారుణ్ణి నిద్ర నుండి లేపాడు. దుకాణం నుండి రెండు పౌండ్లు (సుమారు ఒక కిలో) మిఠాయి కొని ఇంటికి తెచ్చాడు. సాధారణంగా ఒక మనిషికి సరిపడే దానికంటే కాస్త ఎక్కువగానే మరమరాలు, ఈ మిఠాయి ఒక పళ్ళెంలో పెట్టి శ్రీరామకృష్ణుల ముందు ఉంచారు. ఆయన కూర్చుని సంతోషంగా ఆ ఆహారాన్ని పూర్తిగా తినేశారు. ఆయన అలా తినడం చూసి ఆ కుటుంబ సభ్యులంతా గాబరాపడ్డారు. ‘ఆహా! అజీర్ణంతో బాధపడుతూ నెలలో సగం రోజులు సగ్గుబియ్యం, బార్లీతో గడిపే మనిషి ఈ అపరాత్రివేళ ఇంత ఆహారం తిన్నాడు. తప్పక రేపు ఏదో ఉపద్రవమే సంభవిస్తుంది’ అనే ఆలోచనలో పడ్డారు వారందరూ. కాని మర్నాడు ఆయన మామూలుగానే ఉండడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ అపరాత్రివేళ అంత ఆహారం తిన్నా కూడా ఆయన ఎలాంటి ఇబ్బందికీ గురికాలేదు.
15. మూడవ ఉదాహరణ: రెండుకిలోల చద్దన్నం, చేపల పులుసుతో తినడం.
మరో సందర్భంలో ఆయన కామార్పుకూర్లో ఉన్నప్పుడు జయరాంబాటిలోని అత్తగారింటికి వెళ్ళారు. ఒకరోజు రాత్రి భోజనంచేసి పడుకొన్నారు. కాని కాస్సేపటికే లేచి, “నాకు చాలా ఆకలి వేస్తూన్నది” అన్నారు. ఈ మాటలు విని ఆ ఇంట్లోని స్త్రీలు ఆదుర్దాపడ్డారు. తినడానికి ఆయనకు వారు ఏం ఇవ్వగలరు? ఆ రోజు ఇంట్లో ఏ శ్రాద్ధకర్మో లేదా అట్లాంటిదేదో నిర్వహించడం వలన సంతర్పణ జరిగింది. ఆ కారణంగా ఇంట్లో ఎలాంటి ఆహారమూ మిగలలేదు. ఒక చద్దన్నం మాత్రం ఉంది. ఈ విషయం మాతృదేవి సంకోచిస్తూ శ్రీరామకృష్ణులకు చెప్పగా, ఆ అన్నాన్నే తీసుకురమ్మన్నారు. ఆ అన్నంలో కలుపుకోవడానికి కూర ఏమీ లేదని మాతృదేవి చెప్పింది. అందుకు ఆయన, “కాస్త వెతికి చూడరాదా? ప్రొద్దున మిరపకాయ, చింతపండు కలిపి ‘చేప’ వంటకం చేశారు కదా! ఆ వంటకం కాస్త మిగిలి ఉందేమో చూడు” అని అన్నారు. వెంటనే మాతృదేవి వెతికి చూడగా కూరగిన్నెలో కాస్త పులుసు అంటుకొనివున్న ఒక చిన్నచేప కాస్త కనిపించింది. దాన్నే ఆమె తీసుకువచ్చి ఆ చద్దన్నంతోబాటు ఆయనకు వడ్డించింది. ఆ అర్ధరాత్రి ఆయన ఆ చద్దన్నం (దాదాపు రెండు కిలోలు), ఆ చేప పులుసుతో కలిపి తిని, స్థిమితపడ్డారు.
16. నాల్గవ ఉదాహరణ: దక్షిణేశ్వరంలో అర్ధరాత్రి సేరు హల్వా తినడం
ఆయన దక్షిణేశ్వరంలో ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు ఇలాగే జరగడం కద్దు. ఒకనాటి అర్ధరాత్రి శ్రీరామకృష్ణులు లేచి, రాంలాల్ను పిలిచి, “నాకు బాగా ఆకలిగా ఉంది” అని అన్నారు. అప్పుడు ఏం చేయాలి? సామాన్యంగా కొంత మిఠాయి, భక్ష్యాలు ఆయన గదిలో ఉండేవి; కాని ఆ సందర్భంలో ఏదీ లేదు. గత్యంతరం లేక రాంలాల్ నహబత్కు వెళ్ళి విషయం మాతృదేవికీ, ఇతర భక్తురాండ్రకూ తెలిపాడు. వారు హడావిడిగా లేచి, పొయ్యిరాజేసి, ఒక రాచిప్ప నిండా దాదాపు సేరు హల్వా వండారు. ఒక భక్తురాలు ఆ హల్వాను శ్రీరామకృష్ణుల గదికి తీసుకువచ్చింది. గదిలో ఒక మూల చిన్నదీపం మినుకుమినుకుమంటున్నది. రాంలాల్ ప్రక్కనే కూర్చుని ఉన్నాడు. భావావిష్టులై గదిలో పచార్లుచేస్తున్న శ్రీరామకృష్ణులను చూసి ఈమె ఆశ్చర్యపోయింది. ఆ ప్రశాంత నిశ్శబ్ద నీరవ నిశీథిలో భావోద్వేగంతో దేదీప్యమానంగా ఆయన వదనం ప్రకాశిస్తూన్నది; దేని ముందు సమస్త విశ్వం ఇచ్ఛామాత్రంగా సమాధిలో లీనమై మళ్ళీ ఇచ్ఛా మాత్రంగా అభివ్యక్తమౌతుందో ఆ విశాలమైన నేత్రాల స్థిర అంతర్దృష్టి; అనన్య మనస్కుడైన ఆ గురుగంభీర పద విక్షేపణం; ఉద్దేశరహితమైన ఆ స్వానంద విచారణం – చూసిన తక్షణం ఆ భక్తురాలి హృదయం ఒక అవ్యక్తభావంతో నిండిపోయింది. ఆ స్థితిలో శ్రీరామకృష్ణుల దేహం బాగా లావు, పొడవు అయినట్లు ఆమెకు అనిపించింది; ఆయన మానవమాత్రునిగా కాక ఎవరో దేవత, స్వర్గం నుండి దుఃఖాక్రందనాలతో నిండిన ఈ మానవ లోకానికి దిగివచ్చి, ఈ గంభీర నిశీథిలో గోప్యంగా ఠీవిగా ఆ గదిలో పచార్లు చేస్తూన్నట్లుగా ఆమె భావించింది. కరుణార్ద్రహృదయులై ఈ మరుభూమిని మళ్ళీ స్వర్గంలా మార్చడం ఎలాగని, దానికొక మార్గం అన్వేషింప నిమగ్నులై ఉన్నట్లుగా ఆమెకు అనిపించింది. తనకు బాగా తెలిసిన శ్రీరామకృష్ణులు ఆయన కారని ఆమెకు నిశ్చయంగా అనిపించింది. ఆయనను సమీపించేకొద్దీ ఆమె గగుర్పాటు చెంది, అవ్యక్తమైన భక్తిపూర్వకభీతి ఆమెను ఆవరించింది.
శ్రీరామకృష్ణులు కూర్చోవడానికి రాంలాల్ అంతకు మునుపే గదిలో ఒక ఆసనం వేసివుంచాడు. ఆ భక్తురాలు సంభ్రమ సంకోచాలతో మెల్లగా వెళ్ళి ఆ హల్వా రాచిప్పను ఆసనం ముందు పెట్టింది. శ్రీరామకృష్ణులు కూర్చుని ఆ గంభీర భావావస్థలో నెమ్మదిగా ఆ హల్వాను పూర్తిగా తిన్నారు. ఆ భక్తురాలి మనోభావాలను ఆయన పసిగట్టారేమో? ఎవరు చెప్పగలరు? తమను సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్న ఆమెను గమనించి ఆయన, “ఎవరు తింటున్నారో చెప్పగలవా? నేనా లేక మరెవరోనా?” అని అడిగారు. అందుకు ఆ భక్తురాలు, “మీలో మరెవరో ఉన్నట్లు, వారే తింటున్నట్లు నాకు కనిపిస్తూ ఉంది” అని జవాబిచ్చింది. ఆ జవాబు విని శ్రీరామకృష్ణులు, “సరిగ్గా చెప్పావు” అంటూ నవ్వారు.
17. ఆధ్యాత్మిక భావోద్వేగాలు: శ్రీరామకృష్ణుల శారీరక మార్పులు
ఇటువంటి ఎన్నో సంఘటనలను పేర్కొనవచ్చు. శక్తివంతమైన ఆధ్యాత్మిక భావోద్వేగాలు చెలరేగిన సందర్భాలలో ఆయన దేహంలో అవి గొప్ప మార్పులను ఉత్పన్నం చేసేవి; ఆయన శారీరక కదలికలు, తినడం, త్రాగడం, ప్రవర్తన ఇత్యాదులు విభిన్న ప్రకృతిని సంతరించుకొని ఆయనను పూర్తిగా మరొక వ్యక్తిలా వ్యక్తపరచేవి. అయినప్పటికీ ఆయన ప్రవర్తన ఎంత విపరీతాకృతిని దాల్చినా, ఆ ఆధ్యాత్మిక భావాల అనంతరం ఆయన శరీరంలో ఎటువంటి వ్యాఘాతం కానవచ్చేది కాదు. మనలో నెలకొన్న మనస్సు, మన భౌతిక దేహాలను వినూత్నంగా తీర్చిదిద్దుతుందన్నది సైద్ధాంతికంగా అంగీకరించే విషయమే; కాని ఈ మార్పు ఎలా జరుగుతుందో తెలియరాదు. దీనిని గురించి అనేకులు సందేహం వెలిబుచ్చుతారు. కాని శ్రీరామకృష్ణుల జీవితంలో దాదాపు సర్వసామాన్యమైపోయిన ఈ సంఘటనలు మేము దర్శించాం. ఈ విషయాన్ని ఇక్కడతో ఆపి అసలు విషయానికి వద్దాం.
18. దక్షిణేశ్వరంలో జరిగిన పండిత సదస్సుకు వైష్ణవచరణ్ హాజరు కావడం
వైష్ణవచరణ్ గురించి భైరవీబ్రాహ్మణి నుండే మథుర్బాబు తెలుసుకొన్నాడని కొందరు చెబుతారు. ఆ తరువాత శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మికావస్థలలో ఏదైనా శారీరక రుగ్మత ఉందేమోనన్న విషయం తేల్చి చెప్పడంలో తనకు సలహా ఇస్తాడేమోనని వైష్ణవచరణ్ను దక్షిణేశ్వరానికి ఆహ్వానించాడంటారు. ఏది ఎలా వున్నా ఇది జరిగిన కొద్దికాలానికే వైష్ణవచరణ్ దక్షిణేశ్వరానికి వచ్చాడు. ఆ సందర్భంలో ఒక చిన్న పండిత సదస్సు ఏర్పాటు చేశారని మనం ఊహించవచ్చు. వైష్ణవచరణ్తోబాటు మామూలుగా కొద్దిమంది శ్రద్ధాళువులైన సాధకులు, పండితులు వచ్చే ఉంటారు. ఇక విదుషీమణియైన బ్రాహ్మణి, మథుర్ గోష్ఠిలో ఉండనే ఉన్నారు. శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక అవస్థను నిర్ణయించవలసిన అంశం, కాబట్టే మేం దానిని సదస్సు అని పేర్కొన్నాం.
19. శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక అవస్థ గురించి చర్చ
చర్చ మొదలైంది. చుట్టుప్రక్కల జనాల నుండి తాను విన్నవి, స్వయంగా తాను కళ్ళారా చూసిన శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక భావ స్థితులను బ్రాహ్మణి అభివర్ణించింది. ప్రాచీన భక్తిమార్గ ఆచార్యవరుల అనుభవాలుగా శాస్త్రాలలో నమోదైన అవస్థలతో శ్రీరామకృష్ణుల ప్రస్తుత అవస్థను పోల్చి, భైరవీ బ్రాహ్మణి ఆయన అవస్థా, ప్రాచీన ఆచార్యుల అవస్థా ఒక్కటే అని తన అభిప్రాయం ప్రకటించింది. వైష్ణవచరణ్ను ఉద్దేశించి, “దీనిని గురించి మీకు భిన్నాభిప్రాయం ఉండే పక్షంలో, సవివరంగా నాకు తెలుపగోరుతున్నాను” అని చెప్పింది. దైవబలంతో శక్తిమంతురాలైనదో అన్నట్లుగా, తన బిడ్డను రక్షింపబూనే తల్లిలా వీరదర్పంతో శ్రీరామకృష్ణుల పక్షాన్ని సమర్థింప బ్రాహ్మణి ఉద్యుక్తురాలైంది. ఈ పండిత సదస్సుకు కారణభూతులైన శ్రీరామకృష్ణులు అప్పుడు ఎలా స్పందించారు? మనం ఆ దృశ్యాన్ని ఊహించుకోవాల్సిందే! ఆయన పూర్తిగా ఉదాసీనులై, ‘ఆత్మానందం’ లో రమిస్తూ, చిరునవ్వులు చిందిస్తూ వాగ్వాదాలు చేస్తున్న జనం మధ్య కూర్చుని ఉన్నారు; అప్పుడప్పుడు తన చిన్ని సంచీ నుండి సోంపుగింజలనో, చలవ మిరియాలనో నోట్లో వేసుకొంటూ, ఆ చర్చ తనను గురించి కాక మరెవరి గురించో సాగుతున్నట్లు వింటున్నారు. మధ్యమధ్యలో వైష్ణవచరణ్ను తట్టుతూ, “ఒక్కొక్కప్పుడు నాకు ఇలా అవుతుంది” అంటూ తన స్వీయస్థితిని ఆయనకు చెబుతున్నారు.
20. వైష్ణవచరణ్ నిర్ణయం
వైష్ణవచరణ్ గొప్ప సాధకుడు. ఆ సాధన ఫలితంగా సంతరించుకున్న సూక్ష్మదృష్టి సహాయంతో, శ్రీరామకృష్ణులను చూడగానే ఆయన ఒక మహా పురుషుడని గ్రహించినట్లు కొందరు అభిప్రాయపడ్డారు. దానికి తోడు బ్రాహ్మణి తెలిపినదంతా విని ఆమె అభిప్రాయంతో వైష్ణవచరణ్ హృదయపూర్వకంగా ఏకీభవించాడని శ్రీరామకృష్ణుల ముఖతా మేం విన్నాం. అంతేకాక, ప్రధానమైన ఏ పందొమ్మిది భక్తిభావాలు ఏకకాలంలో నెలకొన్న ఏ స్థితిని; భక్తిశాస్త్రాలు మహాభావమని పేర్కొంటున్నాయో, భావమయియైన శ్రీమతి రాధారాణి, చైతన్య మహాప్రభువుల జీవితాలలో మాత్రమే ఆ మహాభావ స్థితి అభివ్యక్తమైనదో, అటువంటి మహాభావ లక్షణాలన్నీ ప్రస్తుతం శ్రీరామకృష్ణులలో అభివ్యక్తం కావడం చూసి ఆశ్చర్యపోతున్నాననీ వైష్ణవచరణ్ ప్రకటించాడు. పూర్వజన్మ సుకృతఫలంగా సామాన్య జీవి జీవితంలో ఎప్పుడైనా ఈ మహాభావం కించిత్తు అభివ్యక్తమైతే, ఈ పందొమ్మిది భావాలలో రెండు లేక మూడు మాత్రమే అతడిలో వ్యక్తమౌతాయి. గతంలో ఏ జీవీ ఆ పందొమ్మిది భావాల తాకిడిని అరికట్టడంలో సమర్థుడు కాలేకపోయాడు; భవిష్యత్తులోను ఏ జీవీ సమర్థుడు కాబోడని శాస్త్రాలు వచిస్తున్నాయి. వైష్ణవచరణ్ పలుకులు విని మథుర్బాబు, తదితరులు దిగ్భ్రమతో స్తబ్ధులైనారు. ఇక శ్రీరామకృష్ణులు విస్మయానందాలతో, “ఆయన ఏమంటున్నాడో చూశావా! ఇదొక రుగ్మత కాదని తెలిసి సంతోషిస్తున్నాను” అని మథుర్తో అన్నారు.
21. ‘కర్తాభజ’* తత్సంబంధిత మతసంప్రదాయాల పట్ల శ్రీరామకృష్ణుల దృక్పథం
శ్రీరామకృష్ణుల మహోన్నతావస్థ గురించి వైష్ణవచరణ్ వెలిబుచ్చిన దృక్పథం కేవలం నోటిమాట కాదు. అప్పటి నుండి ఆయన శ్రీరామకృష్ణుల పట్ల అపరిమిత భక్తిప్రపత్తులు చూపసాగాడు. ఆనాటి నుండి ఆయన తరచు దక్షిణేశ్వరానికి వచ్చి శ్రీరామకృష్ణుల దివ్యసాహచర్య ఆనందాన్ని ఆస్వాదించసాగాడు. తాను చేస్తున్న నిగూఢ సాధనల గురించి తెలిపి, వాటిపై శ్రీరామకృష్ణుల అభిప్రాయాన్ని తెలుసుకోగోరాడు. అంతేకాక తనలా తనతోబాటు సాధనలు చేస్తున్న భక్తులు కూడా శ్రీరామకృష్ణుల పరిచయాన్ని పొంది తనలా ఆయన దివ్యసాంగత్య ఆనందాన్ని పొందాలనే ఉద్దేశంతో ఆయన అప్పుడప్పుడు ఆ సాధకుల వద్దకు ఆయనను తోడ్కొని వెళ్ళేవాడు.
పవిత్రత మూర్తీభవించిన శ్రీరామకృష్ణులకు కూడా నిగూఢ సాధనలు చేస్తూన్న ఆ సాధకులతో కలసిమెలసి తిరుగుతూ, వారి జీవితాలు, సాధనల గురించి తెలుసుకొనే అవకాశం లభించింది. తద్ద్వారా ఆయన ఈ విషయం గ్రహించారు: లోకుల దృష్టిలో ఆ సాధనలు ఎంత తుచ్ఛంగా, గర్హనీయంగా కనిపించినా ‘భగవత్సాక్షాత్కార నిమిత్తం చేస్తున్నాను’ అనే ప్రగాఢ విశ్వాసంతో ఎవరైనా అటువంటి సాధనలు శ్రద్ధతో చేస్తూపోతే అవి పతనానికి దారితీయవు సరికదా క్రమంగా వాటి తోడ్పాటుతో సాధకుడు వైరాగ్యం, ఆత్మసంయమం పెంపొందించుకొని, ఆధ్యాత్మిక సాధనలో పురోగమిస్తాడు, భగవద్భక్తిని సంతరించుకొంటాడు.
కాని ప్రప్రథమంగా ఆ తుచ్ఛ సాధనానుష్ఠానాలను గురించి విని, కళ్ళారా స్వయంగా వాటిని చూసినప్పుడు తనలో చెలరేగిన ఆలోచనలను అనేకసార్లు మాకు ఇలా ఆయన తెలిపారు : “వీళ్ళు గొప్పగా మాట్లాడతారు; అదే సమయంలో అంత నికృష్ట అనుష్ఠానాలకు పాల్పడతారెందుకో?” మళ్ళీ ఆయనే చివరికి తన అభిప్రాయాన్ని మార్చుకొన్నానని మాతో చెప్పారు కూడా. అందుకు కారణం: ఆ సాధకులలో కూడా శ్రద్ధాళువులైన కొందరు భగవంతుని పట్ల విశ్వాసం వహించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడమే! ఈ ‘కర్తాభజ’ సంప్రదాయస్థుల పట్ల మాలో ఉన్న ద్వేషాన్ని తొలగించడం కోసం వారి పట్ల ఉన్న తమ నమ్మకాన్ని శ్రీరామకృష్ణులు ఇలా వ్యక్తంచేశారు : “వారి పట్ల మీరెందుకు ద్వేషం వహించాలి? వారిది కూడా ఒక మార్గమే; అయితే తుచ్ఛమైనది. ఇంటి లోపలికి వెళ్ళడానికి ప్రధాన ద్వారం, వెనుక ద్వారం, మరుగుదొడ్డి పరిశుభ్రం చేసే వ్యక్తి వెళ్ళడానికి ఒక ద్వారం ఉన్నట్లుగానే భగవంతుని భవనంలోకి ప్రవేశించడానికి అనేక ద్వారాలు ఉంటాయి. వారిది మలిన ద్వారం. ఏ ద్వారం గుండా వెళ్ళినా అందరూ చేరుకొనేది ఇంట్లోకే. మీరూ వారితో కలసిమెలసి వారిలా వ్యవహరించాలా? కాదు. మీరు అలా చేయకూడదు. కాని వారి పట్ల ద్వేషం వహించకూడదు.”
22. పూర్తి ప్రాపంచిక భోగాసక్తిపరులైన వ్యక్తులు కోరే మతం
ప్రాపంచిక భోగవాసనలతో తపించే మనస్సు, వైరాగ్యమార్గాన్ని అంత సులభంగా అనుసరిస్తుందా? హృదయపూర్వకంగా, పవిత్రభావంతో భగవదన్వేషణకు ఉద్యుక్తం అవుతుందా? సామాన్యంగా మనస్సు పవిత్రతలో కూడ కొంత అపవిత్రతను అంటిపెట్టుకొని ఉంటుంది; కామకాంచనాలను అది పరిత్యజించినప్పటికీ వాటి ‘వాసన’ కై ఉబలాటపడుతుంది. తపస్సాధనలు, హృదయపవిత్రత ద్వారా జగజ్జననిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నప్పటికి, కొందరు ఆమె సంతృప్తికై కామాన్ని ప్రకోపించే పాటలు పాడమని బోధించాయి. ఇటువంటవిపరీత పద్ధతుల బోధన చూసి ఆశ్చర్యపడనక్కరలేదు, వాటిని నిరసించనూ పనిలేదు. అనంతకోటి బ్రహ్మాండ నాయికయైన మహామాయ కల్పించిన కామకాంచన సంకెళ్ళు మనిషిని ఎంత గట్టిగా బంధించివేస్తాయో దీని ద్వారా విశదమౌతుంది. ఆమె కరుణించి ఈ కఠోర బంధనాన్ని తొలగించకపోతే ముక్తి పొందడం జీవుడికి అసాధ్యం అనే విషయం సుస్పష్టం. ఎవరికి ఏ మార్గంలో ముక్తిని పొందడంలో తోడ్పడుతుందో గ్రహించడం మానవాతీతమని దీని ద్వారా విశదమౌతున్నది. అతిస్పష్టమౌతున్న మరొక విషయం : మన మనస్సుల ప్రవృత్తుల ధోరణులను ఒక వంక, మరో వంక శ్రీరామకృష్ణుల అనుపమాన దివ్యజీవిత మర్మాన్ని సునిశిత తులనాత్మకంగా అధ్యయనం చేస్తే ఆయన మానవాతీతులనీ, పరమ పురుషుడైన భగవంతుడే మనవంటి వారి పట్ల కరుణ వహించి లేదా తన ఇచ్ఛమేరకు తుచ్ఛమైన ఈ మురికి సంసారంలోకి కొద్దికాలం కోసం అవతరించి వచ్చారనీ తెలియవస్తుంది. బాహ్య దృష్టికి ఆయన ఎంత దీనాతిదీనులుగా కానవస్తున్నా, జ్ఞానదృష్టికి మాత్రం రాజరాజేశ్వరుడుగా జీవించి వెళ్ళిపోయారనే విషయం గోచరిస్తుంది.
23. తంత్రశాస్త్రాల వైశిష్ట్యం:చరిత్ర
వైదిక యుగాలలో ప్రాబల్యం వహించిన యజ్ఞయాగాదులలో (దీనికే కర్మకాండ అని పేరు) యోగం, భోగం రెండూ నిండి ఉన్నాయి. ఇంద్రాది దేవతలను యాగాదుల ద్వారా, అట్లే ఉపాసనాదుల ద్వారా అర్చించి మెప్పించడం; అట్లే వారి నుండి పొందిన రూపరసాది భోగ వస్తువులను (ఇహంలోగాని లేదా పరంలోగాని) నియమానుసారంగా భోగించడం – ఇలా యోగం, భోగం ఈ రెండూ మానవ జీవితోద్దేశంగా ఈ కర్మకాండ నిర్దేశించింది. ఈ విధంగా వేద నిర్దిష్ట క్రియాకలాపాలను సంయమ పూర్వకంగా అనుష్ఠిస్తూ ఉంటే కాలక్రమాన మనస్సు కొంతవరకైనా వాసనా రహితమూ, పవిత్రమూ అవుతుంది. ఆ స్థితికి చేరుకున్నాక ఉపనిషత్తులు అభివర్ణించిన శుద్ధభక్తితో భగవంతుణ్ణి ఆరాధించి కృతకృత్యుడు కాగలుగుతాడు. అంటే భగవత్సాక్షాత్కారం పొంది ముక్తుడు అవుతాడన్నమాట.
కాని బౌద్ధయుగంలో ఇది విపరీత మార్గాన్ని పట్టింది. వాసనాశూన్యులై (సంసారం విడిచి) అరణ్యంలో వసిస్తూ అత్యంత శుద్ధభావంతో యోగ్యులైన* సాధకులకు మాత్రమే ఉపయుక్తమైన కఠోర సాధనామార్గం, వివేచనారహితంగా భోగవాసనలతో తపించిపోతున్న ప్రాపంచికులందరికీ నిర్దేశింపబడసాగింది. ఆనాటి రాజ్యాంగ యత్రాంగం కూడా బౌద్ధసన్న్యాసుల ఈ ప్రయత్నానికి ఎంతో తోడ్పడింది. తత్ఫలితంగా ప్రవృత్తి మార్గాన్ని అనుసరిస్తున్న మనిషిని (అంటే ప్రాపంచిక సుఖాల కోసం అర్రులుచాస్తూన్న మనిషిని) నియమిత భోగమార్గంలో నడిపిస్తూ క్రమంగా అతణ్ణి నివృత్తి మార్గంలోకి (త్యాగ వైరాగ్య మార్గంలోకి) పురోగమింప చేస్తూన్న వైదిక యజ్ఞయాగాదులు బాహ్యంగా లుప్తమైపోయాయి. కాని లోపలి కోర్కెలన్నీ అంత సులభంగా లుప్తమౌతాయా? కావు. కాబట్టే అవి నిశ్శబ్ద అర్ధరాత్రుళ్ళలో, భయంకర నిర్జన శ్మశానాలలో అతిగోప్యంగా తుచ్ఛ తాంత్రిక సాధనరూపంలో అభివ్యక్తం కాసాగాయి. ఈ విధంగా వైదిక యజ్ఞ యాగాదులు వ్యవహారచ్యుతమై నిష్ఫలం కావడం చూసి (నిర్వహించే యజమానులు, నిర్వర్తించే పురోహితులు లేకపోవడంచేత) యోగీశ్వరుడైన పరమశివుడు వాటినన్నిటినీ విభిన్న రూపంలో, తంత్రాల రూపంలో* సజీవం చేశాడని తంత్రశాస్త్రాలు చాటుతున్నాయి. ఈ క్రింది వదంతిలో నిజానికి ఒక గొప్ప సత్యం దాగివుంది; ఎందుకంటే వైదిక క్రతువులలో ఉన్నట్లే ఈ తంత్రాలలోనూ యోగం, భోగం కలసి ఉండడం మనకు కనిపిస్తున్నది కనుక. అంతేకాక ఈ తంత్రాలలో కానవస్తున్న మరో విశేషం వైదిక కర్మకాండ సదా ఉపనిషత్తులు నిర్దేశిస్తూన్న జ్ఞానకాండ నుండి వేరుగా, సుదూరంగా ఉండడం. కాని తంత్రాలలో మాత్రం అలాకాక ప్రతీ తంత్రసాధన కూడా అద్వైతజ్ఞానంతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగివుండడం మనకు స్పష్టంగా తెలుస్తూన్నది. ఇదే తంత్రాల వైశిష్ట్యం. ఈ క్రింది ఉదాహరణ ఈ అంశాన్ని స్పష్టం చేస్తుంది.
ఏదో ఒక దేవతామూర్తిని పూజించడానికి నువ్వు కూర్చున్నావనుకుందాం. అప్పుడు మొట్టమొదట నువ్వు చేయవలసింది : మూలాధార చక్రంలో నిద్రాణంలో ఉన్న కుండలినీశక్తిని మేల్కొల్పుతున్నావనీ, సుషుమ్నా మార్గం ద్వారా క్రమంగా దానిని శిరస్సులోని సహస్రార చక్రానికి కొనిపోతున్నావనీ, అక్కడ కుండలినీతోపాటు జీవుడివైన నువ్వు భగవంతునితో ఐక్యమైన స్థితిలో ఉన్నావనీ భావించాలి. ఆ తరువాత ఆ పరమాత్మ నుండి విడివడి జీవస్వరూపాన్ని మళ్ళీ దాలుస్తున్నావనీ, ఆ పరమాత్మ ఘనీభూతమై నీ ఇష్టదేవతా రూపంలో అభివ్యక్తమౌతున్నాడనీ భావించాలి. అనంతరం ఆ ఇష్టదేవతను నీ లోపల నుండి వెలుపలకు తీసుకువస్తున్నావనీ, పిదప ఫలపుష్పాది పూజోపకరణాల ద్వారా ఆ దేవతను పూజింప ఉపక్రమిస్తున్నట్లూ ఊహించుకోవాలి.* మానవ జీవిత పరమావధి ప్రేమ ద్వారా భగవంతునితో తాదాత్మ్యం చెందడం. ఈ పై క్రియ ఆ ప్రయత్నానికి ఎంత ఉపయుక్తమైనదో గమనార్హం. నిజానికి వేలాది సాధకులలో బహుశా ఏ ఒక్కడో మాత్రమే పై క్రియను సక్రమంగా నిర్వర్తించి ఫలాన్ని పొందగలడు. అయినా ప్రతి ఒక్కరూ ఆ క్రియను కొద్దోగొప్పో చేయడానికి ప్రయత్నించినా అది మేలు ఒనగూరుస్తుంది. కారణం ఎడతెగకుండా ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తే క్రమంగా సాధకుడు పురోగమిస్తాడు. ఈ విధంగా తంత్రాలలో పేర్కొన్న ప్రతి క్రియ కూడా అద్వైతజ్ఞానంతో కూడుకొన్నదై సాధకుడికి అతడి పరమావధిని అడుగడుగునా జ్ఞాపకం చేస్తూవుంటుంది. ఇదే వైదిక కర్మకాండల నుండి భిన్నమైన తాంత్రిక సాధనలలో మనకు కనిపించే నూతనత్వం మరియు ఈ తాంత్రిక సాధనా ప్రణాళిక భారతీయులపై అంత విస్తృత ప్రభావం చూపడానికి కారణం.
24. తంత్రాలలో ‘వీరాచారం’ ఎలా ప్రవేశించింది?
తంత్రాలలో కానవచ్చే మరో కొత్త భాగం : జగత్కారణ స్వరూపిణియైన మహామాయను మాతృభావంతో, అంటే తల్లిగా పూజించాలనే ఆదర్శాన్ని ప్రబోధించడం. ఫలితంగా స్త్రీమూర్తులనందరినీ పరమ పవిత్ర దృష్టితో చూడాలనే ఆదర్శం జనించింది. వేదాలను, పురాణాలను తరచిచూస్తే, తంత్రాలలో ఉన్నట్లు ఈ భావం ఏకరీతిగా వాటిలో కనిపించదు. వేదాలలోని సంహితల భాగంలో స్త్రీ-శరీర ఆరాధన లవలేశంగా కొన్నిచోట్ల చూడవచ్చు, అంతే. ఉదాహరణకు ఈ సంహితలలో వధువు యోని, ‘ప్రజాపతేః ద్వితీయ ముఖం’, అంటే సృష్టికర్తయైన ప్రజాపతి ‘రెండవ ముఖం’ అని అభివర్ణింపబడింది; అంతేగాక పెళ్ళికూతురు తేజస్సంపన్నుడైన సంతానాన్ని కనగలదనే ఉద్దేశంతో, ‘గర్భం దేహి సినీవాలి’* – ఈమె సద్గర్భాన్ని పొందుగాక అనే మంత్రాల ద్వారా దేవతలందరూ ఆ ‘యోని’ లో పూజింపబడాలని, అట్లే ఆ అంగాన్ని పరమ పవిత్ర దృష్టితో చూడాలని విధింపబడింది. కాని ఈ ‘యోని లింగాల’ పూజ వైదిక కాలం నుండే భారతదేశంలో ప్రాబల్యం వహించిందని పై విషయం చూసి అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే ఈ ‘యోని లింగాల’ పూజ ప్రప్రథమంలో బాబిలోనియాలోని సుమేర్ జాతులలోనూ, అట్లే ఆ జాతులకు చెందిన ద్రావిడులలోను స్థూలరూపంలో ఉండినట్లు చారిత్రక ఋజువులున్నాయి.
ఇకపోతే భారతదేశ తంత్రాలు ఒకవంక వేదాలలోని కర్మకాండ, జ్ఞానకాండల స్ఫూర్తిని తమ ప్రతి క్రియాకలాపంలోను ఐక్యం చేసుకొన్నాయి; అట్లే మరోవంక యోగ్యులైన కొంతమంది సాధకులకు ఆధ్యాత్మిక సాధనలో తోడ్పడగలవని తలచి పైన పేర్కొన్న స్త్రీ శారీరక ఉపాసనను కూడా అవి ఒక భాగంగా చేసుకొన్నాయి. కాని ఆ ఉపాసనలోని స్థూలమైన మొరటు భావాన్ని చాలా వరకు మార్చి, దానితోపాటు వైదిక యుగ ఉపాసనలోని ఉన్నత ఆధ్యాత్మిక భావాన్ని జోడించి ఆ ఆదర్శాన్ని సమగ్ర రూపంలో వికసింప చేశాయి తంత్రాలు. తంత్రాలలోని ‘వీరాచారం’ ఈ రీతిలోనే ఉత్పన్నమైనట్లు కానవస్తోంది.
భోగవాసనలతో ఊరి అందులో కూరుకుపోయిన మనుష్యులు స్థూల రూపరసాది విషయాలను కొంతైనా భోగించకుండా ఉండలేరని తంత్రశాస్త్రకారులకు బాగా తెలుసు. అయినా తమకు అత్యంత ప్రియమైన ఆ భోగ వస్తువుల పట్ల ఏదోరకంగా వారిలో పూజ్యభావం జనింప చేయగలిగితే – కొంతకాలం భోగాలలో మునిగి తేలినప్పటికీ – వారు ఆ పూజ్యభావ సత్ఫలితంగా క్రమేణా ఆత్మసంయమాది ఆధ్యాత్మిక సుగుణాలను పెంపొందించు కోవడం తథ్యం అని వారి భావన.
కాబట్టే తంత్రశాస్త్రకారులు ఇలా ప్రబోధించారు : “స్త్రీ శరీరం నిజానికి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం; స్త్రీని మానవమాత్రురాలిగా చూడడం మానుకోవాలి. స్త్రీని జగజ్జననిగా సదా పరిగణించాలి. ప్రతి స్త్రీ సాక్షాత్తు జగజ్జనని విశిష్ట అభివ్యక్తీకరణ అని ఎరిగి సదా స్త్రీలందరి పట్లా పూజ్యభావంతో మెలగాలి. స్త్రీ పాదోదకాన్ని పుచ్చుకోవాలి. పొరపాటుగానైనా స్త్రీని నిందించడంగాని, కొట్టడం గాని చేయరాదు.”
25. ప్రతి తంత్రంలోని ఉత్తమ, అధమ భాగాలు
తంత్రశాస్త్ర సాహిత్యంలో ఈ క్రింది వాక్యాలను ఉదాహరణగా మనం చూడవచ్చు :
- యస్యాః అంగే మహేశాని సర్వతీర్థాని సంతిరై ॥
- ఓ మహేశ్వరీ! స్త్రీ శరీరంలో సమస్త పుణ్యక్షేత్రాలూ నెలకొని ఉన్నాయి.
- – పురశ్చరణోల్లాస తంత్రం, 14 వ పటలం
- శక్తౌ మనుష్యబుద్ధి స్తు యః కరోతి వరాసనే ॥
న తస్యమంత్ర సిద్ధిః స్యాద్విపరీతం ఫలం లభేత్ ॥ - ఓ దేవీ! ఎవడు స్త్రీని మానవమాత్రురాలిగా చూస్తాడో, అతడు ఏనాడూ మంత్రసిద్ధుడుకాలేడు; పైగా విరుద్ధ ఫలితాన్నే (అంటే భ్రష్టతనే) పొందుతాడు.
- – ఉత్తర తంత్రం, 2 వ పటలం
- శక్త్యాః పాదోదకం యస్తు పి బేద్భక్తిపరాయణః ।
ఉచ్ఛిష్టం వాపి భుంజీథా తస్య సిద్ధిరఖండితా ॥ - స్త్రీ తన బొటన వ్రేలిని ముంచి పవిత్రం చేసిన తీర్థాన్ని భక్తితో త్రాగేవాడికి, ఆమె ఎంగిలిని శ్రద్ధాళువై ప్రసాదంగా పుచ్చుకొనేవాడికి సిద్ధి కలగడం తథ్యం.
- – నిగమ కల్పద్రుమం
- స్త్రియో దేవాః స్త్రియః పుణ్యాః స్త్రియ ఏవ విభూషణమ్ ।
స్త్రీ ద్వేషానైవ కర్తవ్య స్తాసు నిందాం ప్రహారకం ॥ - స్త్రీలే దేవతలు, స్త్రీలే పవిత్రులు, సమాజానికి ఆభరణాలు. కాబట్టి స్త్రీలను ద్వేషించరాదు, గర్హించరాదు, కొట్టరాదు. (అంటే స్త్రీలను పూజించడం దేవతలను పూజించినట్లే, స్త్రీలను నిందించడం దేవతలను నిందించినట్లే అవుతుంది.)
- – ముండమాలాతంత్రం, 5 వ పటలం
26. వైష్ణవం: క్రొత్త ఉపాసనా విధానం
పైన పేర్కొన్న శాస్త్రోపదేశాలు ఎంత ఉదాత్తమైనవైనా ఏం లాభం? కాలక్రమంలో తాంత్రిక సాధకులు భగవంతుణ్ణి పొందాలన్న ఆదర్శాన్నే విస్మరించి, హేయమైన అతీంద్రియ శక్తులను, సిద్ధులను పొందడంలో తలమునకలయ్యారు. ఈ కాలఘట్టంలో నానారకాల అస్వాభావిక సాధనలు, భూతప్రేత పిశాచాదుల ఉపాసన లాంటివి తంత్ర శాస్త్రంలో చొరబడి, తంత్రశాస్త్రాన్ని ప్రస్తుత హేయస్థితికి దిగజార్చాయి. కాబట్టే ప్రతి తంత్రంలోను ఉత్తమం అధమం, మంచి చెడు, ఉచ్ఛం నీచం అనే రెండు రకాల విభాగాలు ఉండడం మనం చూడవచ్చు. కొన్ని సందర్భాలలో ఉన్నత స్థితికి చెందిన భగవదుపాసనలో హేయ సాధనలను చొప్పించడం కానవస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ నైజానికి అనుగుణమైన తంత్ర సాధనను ఎంపిక చేసుకొంటున్నారు.
27. ఈ సాధన పద్ధతి నుండి ‘కర్తాభజ’ మొదలైన సంప్రదాయాల ఉత్పన్నం, వాటి సారాంశం
శ్రీచైతన్య మహాప్రభువుల అవతరణతో తాంత్రిక సాధనలో మరో పరిణామం ఏర్పడింది. జనసామాన్యంలో ద్వైతభావం (అంటే భక్తిభావం) ప్రచారం చేయడమే శ్రేయస్కరమని భావించి అద్వైతానికి దారితీసే తాంత్రిక సాధనలను చాలావరకు వదలివేసి కేవలం తంత్రాలలోని మంత్రాలను, బాహ్య ఉపాసనలను మాత్రమే చైతన్యులూ, ఆయన ఉత్తరాధికారులూ ప్రచారం చేశారు. పై ఉపాసనలో వారు ఒక వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇతరులు తనను ఎలా సేవించాలని ఇష్టపడతాడో సాధకుడు తన ఉపాసనా దైవాన్ని అదే రీతిలో సేవించాలని వారు ప్రబోధించారు. సాధకులు నైవేద్యంగా అర్పించిన ఫలమూలాదులను తాంత్రిక దైవాలు దృష్టిమాత్రంతో పవిత్రీకరిస్తాయని తంత్రశాస్త్రాలు వచిస్తున్నాయి. కాబట్టి నైవేద్యంగా అర్పించిన ఆ పదార్థాలను ప్రసాదంగా ఆరగిస్తే అవి సాధకులకు కామక్రోధాది ప్రవృత్తుల పట్ల అనాసక్తతను, ఆధ్యాత్మికతపట్ల ఆసక్తిని పెంపొందిస్తాయని సామాన్యంగా విశ్వసిస్తారు. కాని వైష్ణవాచార్యులు ప్రవేశపెట్టిన నూతన సాధన పద్ధతితో నైవేద్య పదార్థాలను దేవతలు తమ దృక్కులతో పవిత్రం చేయడమేకాక, కొన్ని సందర్భాలలో సాధకుల భక్తి ప్రగాఢత మేరకు నైవేద్యంలోని స్థూలభాగాలను సైతం స్వీకరిస్తారనే విశ్వాసం ప్రాబల్యం పొందింది. ఇంతేకాక ఈ సాధన పద్ధతిలో వైష్ణవాచార్యులు అనేక మార్పులు ప్రవేశపెట్టారు కూడా. సాధ్యమైనంత వరకు తంత్రాలలో కానవస్తున్న ‘పశ్వాచారా’ నికి* , బాహ్యశౌచానికి ఎంతో ప్రాధాన్యతను ఇవ్వడం వాటిలో ప్రధానమైనవి. మనసా-వాచ-కర్మణా పూర్తి శౌచాన్ని పాటించి, ‘జపాత్ సిద్ధిః జపాత్ సిద్ధిః జపాత్ సిద్ధిః’ జపం ద్వారా భగవత్సాక్షాత్కారం కలగడం తథ్యం, నామమే బ్రహ్మం, అంటే భగవన్నామంతోనే భక్తుడు భగవత్సాక్షాత్కారం పొందగలడనే భావాన్ని జనసామాన్యానికి ఈ వైష్ణవాచార్యులు ప్రబోధించారు.
కాని ఆ తొలి వైష్ణవాచార్యుల ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. వారు నిష్క్రమించిన కొద్దికాలంలోనే వాసనాపూర్ణమైన మనస్సు వారు నిర్ణయించిన పవిత్ర ఉపాసనా విధానంలో అపవిత్ర భావాలను ప్రవేశింప చేసింది. ప్రవృత్తి పూర్ణుడైన మనిషి వారు ప్రబోధించిన సాధనలలోని సూక్ష్మపవిత్ర ఆశయాలను విడిచిపెట్టి, స్థూలాంశాలను మాత్రమే స్వీకరించాడు. తన ఉపపతి (విటుడు) పట్ల స్త్రీ చూపే ప్రగాఢ ప్రేమాకర్షణలను అలవరచుకొని, వాటిని భగవంతుని వైపుగా మరలించడానికి బదులు మనిషి, తానే ఉంపుడుగత్తెను ఉంచుకొనే స్థితికి దిగజారాడు. ఈ విధంగా వైష్ణవాచార్యులు నిర్దేశించిన శుద్ధ సాధన మార్గంలో భోగాన్ని ప్రవేశపెట్టి దానిని తన నైజానికి అనుకూలించే స్థాయికి దిగజార్చాడు. అంతకంటే ఏం చేయగలడు మరి? అత్యంత పావన జీవితం గడపడానికి యోగ్యుడు కాదు కదా! యోగం, భోగం రెండూ కలగలసిన సాధన పద్ధతిని మాత్రమే అతడు జీర్ణించుకోగలడు. ఆధ్యాత్మికానుభూతి కావాలి, కాని అదే సమయంలో రూపరసాది సుఖాలను చవిచూడాలని అర్రులు చాచాడు. ఈ కారణంగానే వైష్ణవ సంప్రదాయంలో కర్తాభజా, ఆవుల్, బావుల్, దరబేశ్, సాఇ మొదలైన రహస్య సాధన సమాజాలు ఉత్పన్నమైనాయి. కాబట్టే ఈ రహస్య సంప్రదాయాల మూలంలో యోగం, భోగం కలగలసిన అతిప్రాచీన వైదిక కర్మల తీరుతెన్నులు కానవస్తాయి. దీనితో పాటు ప్రతి సాధనానుష్ఠానంతో అద్వైత భావాన్ని జోడించాలనే తాంత్రిక ఆచార్యులు ప్రవేశపెట్టిన ప్రక్రియ ధోరణి కూడా కనిపిస్తుంది.
28. ‘కర్తాభజ’ మొదలగు సంప్రదాయాల మేరకు సాధ్య, సాధనలు
భగవంతుడు, ముక్తి, ఆత్మసంయమం, పరిత్యాగం, ప్రేమ మొదలైన అంశాలను గురించి కర్తాభజ మొదలైన సంప్రదాయాల భావాలను ఒకింత వివరిస్తే పైన మేం తెలిపిన విషయాన్ని పాఠకులు సులభంగా అవగతం చేసుకో గలుగుతారు. ఈ సంప్రదాయాలను గురించి ముచ్చటిస్తు న్నప్పుడు శ్రీరామకృష్ణులు అనేక సందర్భాలలో మాకు వాటిని గురించి అనేక విషయాలు తెలిపారు. సరళమైన తేటతెల్లని పలుకులలో వారి బోధనలు ఉండేవి. ఆ పద్యపాదాలు, ఆ పదజాలం వ్యక్తంచేసే భావాలను జనసామాన్యం అర్థం చేసుకోవడంలో ఎంత వరకు దోహదం చేస్తాయో వాటిని పాఠకుడు స్వయంగా విన్నప్పుడు తెలుసుకోవచ్చు. కర్తాభజ మొదలగు సంప్రదాయస్థులు భగవంతుణ్ణి ‘ఆలేక్ లతా’ అని పేర్కొంటాడు. ‘అలక్ష్య’ అనే సంస్కృత పదం నుండే ‘ఆలేక్’ పదం ఉత్పన్నమైంది. ‘ఆలేక్’ అంటే మనోవాక్కులకు అతీతుడైన పరమాత్మ, శుద్ధసత్త్వ సంపన్న మానసంలో ప్రవేశించి లేదా ఆధారం చేసుకొని అభివ్యక్తమౌతాడు. ఎవరిలో అలా అభివ్యక్తమౌతాడో అతడే ‘కర్త’ లేదా గురువు. భగవంతుణ్ణి ఆ విధంగా అభివ్యక్తం చేసుకున్న వ్యక్తిని ఆ సంప్రదాయస్థులు ‘సహజ్’ బిరుదంతో గౌరవిస్తారు. భగవద్భావం నిజానికి ఎవరిలో అభివ్యక్తమౌతుందో, అటువంటి యథార్థ గురువే ఆ సంప్రదాయస్థులకు ‘ఉపాస్యు’ డౌతాడు. కాబట్టే ‘కర్త’ నే (గురువునే) భగవంతుడిగా భజించే, ఆరాధించే సంప్రదాయస్థులను ‘కర్తాభజా’ అంటారు.
‘ఆలేక్లత’ యథార్థ స్వభావం, విశుద్ధ మానసంపై దాని ప్రభావం గురించి ఆ సంప్రదాయస్థులు ఇలా చెబుతారు :
‘అది అవ్యక్తంగా వస్తుంది అవ్యక్తంగానే పోతుంది
ఎవరూ ‘ఆలేక్’ ను చూడలేరు
ఎవరు ఈ ‘ఆలేక్’ ను తెలుసుకొంటాడో
ఆతడే ముల్లోకాలలో గురువౌతాడు.’
‘సహజు’ డైన వ్యక్తి లక్షణం : అతడు సదా ‘అచ్యుతు’ డుగా ఉంటాడు. అంటే స్త్రీతో సాహచర్యం నెరపుతూ ఉన్నా ఎన్నటికీ అతడిలో ‘కామభావం’ తలెత్తదు. అటువంటి వ్యక్తిని గురించి వారు ఇలా చెబుతారు : ‘రమణేర్ సంగే ధాకే, నా కరే రమణ్’ – రమణితో సహవాసం చేస్తూన్నా రమణం (రతిక్రియ) చేయడు.
కామకాంచనమయమైన సంసారంలో పూర్తిగా అనాసక్తుడై మెలగలేని సాధకుడు ఎన్నటికీ ఆధ్యాత్మిక పురోగతి పొందడు. కాబట్టే కర్తాభజ సంప్రదాయ సాధకులకు వారు ఇలా ఉపదేశిస్తారు :
‘వంట చేయి, కూరలు వడ్డించు, కాని వంటపాత్రను తాకవద్దు
పాము ముందు కప్పను ఆడించు, కాని కప్పను మ్రింగివేయకుండా చూడు,
అమృత సాగరంలో స్నానమాడు, కాని శిరోజాలు తడవనివ్వకు’.
తంత్రశాస్త్రాలు సాధకులను పశువు, వీరుడు, దివ్యుడు అని ఎలా మూడు తరగతులుగా విభజిస్తున్నాయో అదే విధంగా వైష్ణవ సంప్రదాయం కూడా సాధకులను యోగ్యతానుసారంగా నాలుగు తరగతులుగా వర్గీకరిస్తున్నది. అవి : 1. ఆవుల్, 2. బావుల్, 3. దర్బేశ్, 4. సాఇ. అందరికంటే ‘సాఇ’ ఉత్కృష్టుడు, అంటే సిద్ధి పొందిన వ్యక్తి మాత్రమే ‘సాఇ’ అవుతాడన్నమాట.
“వీరందరూ నిరాకార భగవంతుణ్ణే ఉపాసిస్తారు” అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఆ సంప్రదాయానికి చెందిన కొన్ని పాటలను మాకు ఆయన పాడి వినిపించేవారు. ఉదాహరణకు ఈ క్రింది పాట చూడండి :
మునుగవే లోతుకు మునుగవే మనసా
సర్వేశు సౌందర్య సంద్రంబునందు
అట్టడుగు లోతులను అందగలవేని
ప్రభు ప్రేమరత్నము పొందెదవచట ॥ ము ॥
వెదుకవే హృదయాన వెదుకవే మనసా
వెదుకవే దానిలో బృందావనంబు
శ్రీకృష్ణచంద్రుడు క్రీడించు నెపుడు
భక్తబృందము కూడి పాడియాడుచును ॥ ము ॥
వెలిగింపవే మనసా వెలిగింపు జ్యోతి
వెలిగింపవే నిత్య విజ్ఞానదీప్తి
ఆరకుండగజేయు మా దీపశిఖను
నిరతము కదలక నీ డెందమందు ॥ ము ॥
నీ పడవ నెవ్వరు నెట్టుచున్నారు
గట్టిదౌ నేలపై పట్టి త్రోయుచును
అతడె నీ గురువని అనియె కుబీరు*
భావింపు మా గురుపద పద్మములను ॥ ము ॥
ఈ విధంగా గురువును పూజించడం, అందరూ సమావేశమై పూజ భజనాదులలో నిమగ్నులై ఉండడం ఆ సంప్రదాయస్థుల ప్రధాన సాధనలు. వీరు విగ్రహారాధనను తిరస్కరించనప్పటికీ, సామాన్యంగా విగ్రహారాధన చేయరు. గురుపూజ సంప్రదాయం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనది. ఉపనిషత్కాలం నుండే గురుపూజ ప్రాబల్యం వహించినట్లు కనబడుతున్నది. అందుకు కారణం: ‘ఆచార్యదేవో భవ’* – ఆచార్యుణ్ణి దేవుడిగా భావించు వంటి వచనాలను ఉపనిషత్తులలో మనం చూడవచ్చు. దేవీదేవతలను పూజించడం ఆనాడు అసలు వాడుకలోనే లేదనిపిస్తోంది. కాలక్రమంలో గురుపూజ ఎన్ని రూపాలను సంతరించుకున్నదో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
పైగా శుచి–అశుచి, మంచి–చెడు మొదలైన భేద భావాన్ని మనస్సు నుండి పూర్తిగా తొలగించుకోవడం నిమిత్తం ఆ కర్తాభజాది సంప్రదాయ సాధకులు రకరకాలైన సాధనానుష్ఠానాలను పాటించవలసి వచ్చేది. “సాధకులు ఈ అనుష్ఠానాలను గురించి గురుశిష్య పరంపరానుగతంగా ఉపదేశాలు పొందేవారు” అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు; వాటిలో కొన్నింటిని ఆయన అప్పుడప్పుడు మాకు చెప్పడం కూడా కద్దు.
29. శ్రీరామకృష్ణులను, వైష్ణవచరణ్ పరీక్షించడం
“వేదాలను, పురాణాలను చెవితో వినాలి. కాని తంత్రాలు విధించిన సాధనలు ప్రత్యక్షంగా అనుష్ఠించాలి, అభ్యాసం చేయాలి” అని శ్రీరామకృష్ణులు తరచు వచించేవారు. నిజానికి భారతదేశంలో స్మృతులను అనుసరించేవారు చాలా వరకు ఏదో ఒక తాంత్రిక సాధనను అనుష్ఠించడం చూడవచ్చు. పరిశీలించి చూస్తే న్యాయ, వేదాంతాలలో నిష్ణాతులైన పండితులు, అనుష్ఠానంలో తాంత్రికులే. భాగవతాది భక్తిశాస్త్రాలలో కోవిదులైన వైష్ణవ పండితులు నిజానికి కర్తాభజ మొదలైన సంప్రదాయాల రహస్య సాధనలు అనుష్ఠించేవారుగానే కనిపిస్తారు. వైష్ణవచరణ్ కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే. కలకత్తాకు ఉత్తరాన కొన్ని మైళ్ళ దూరంలోని కాఛిబాగాన్ కర్తాభజ రహస్య సమావేశంతో వైష్ణవచరణ్కు అత్యంత సన్నిహిత సంబంధం ఉండేది. ఆ సంప్రదాయానికి చెందిన స్త్రీలు, పురుషులు అనేకులు అక్కడే వసించి, వైష్ణవచరణ్ ఉపదేశానుసారం సాధనలు చేస్తూవుండేవారు. శ్రీరామకృష్ణులను ఆయన కొన్ని సందర్భాలలో అక్కడకు తోడ్కొని వెళ్ళారు కూడా. శ్రీరామకృష్ణులు సదా సర్వవేళలా నిర్వికార స్థితిలో నెలకొని ఉండడం, భగవత్ప్రేమ ఫలితంగా అపూర్వ భావసమాధి మగ్నులు కావడం గమనించిన అక్కడి స్త్రీలు కొందరు ఆయన జితేంద్రియుడో కాదో తెలుసుకోగోరి ఆయనను పరీక్షించారని తెలియవస్తున్నది. ఫలితంగా ‘అతుత్ సహజ్’ అనే మహోన్నతమైన బిరుదునిచ్చి ఆయనను గౌరవించారని మేం విన్నాం. బాలక స్వభావులైన శ్రీరామకృష్ణులు, వైష్ణవచరణ్ అభ్యర్థన మేరకే నిస్సంకోచంగా అక్కడకు వెళ్ళారు. వారు తమను ఆ విధంగా పరీక్షిస్తారని ఆయనకు అసలు తెలియదు. ఏది ఏమైనా మళ్ళీ ఎన్నడూ ఆయన అక్కడకు వెళ్ళలేదు.
30. శ్రీరామకృష్ణులను భగవదవతారంగా వైష్ణవచరణ్ గుర్తించడం
శ్రీరామకృష్ణుల సౌశీల్యం, పావనత్వం, భక్తిపారవశ్యకత వైష్ణవచరణ్ను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. తత్ఫలితంగా ఆయనలో శ్రీరామకృష్ణుల పట్ల భక్తిప్రపత్తులు నానాటికీ అధికరింపసాగాయి. చివరకు అతడు, శ్రీరామకృష్ణులు భగవదవతార పురుషులని బహిరంగంగా అంగీకరింప వెనుకాడలేదు.
31. ఆసక్తికరమైన గౌరీపండితుని అతీంద్రియశక్తి.
వైష్ణవచరణ్, శ్రీరామకృష్ణుల వద్దకు వస్తున్న కొద్ది కాలానికే ఇందేష్కు చెందిన గౌరీపండితుడు దక్షిణేశ్వరానికి రావడం తటస్థించింది. అతడు సుప్రసిద్ధుడైన తాంత్రిక సాధకుడు. అతడు దక్షిణేశ్వరానికి మొదటిసారి వచ్చినప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి మేం శ్రీరామకృష్ణుల ముఖతా విన్నాం. కఠోర తపస్సాధనల ఫలితంగా గౌరీపండితుడు ఒక అద్భుతశక్తిని సంతరించుకొన్నాడు. (తర్కశాస్త్రంలో ఎవరినైనా పరాజితులను చేయగలగడమే ఆ శక్తి) తర్కశాస్త్ర చర్చకు ఆహ్వానితుడై వెళ్ళినప్పుడు, తర్కం జరుగనున్న సభామండపంలోకి ప్రవేశించే ముందు, ‘హా, రే, రే, రే, నిరాలంబో లంబోదర జనని కం యామి శరణం!’ అని బిగ్గరగా కొన్నిసార్లు ఉచ్చరించిన తదుపరే సభలోకి ప్రవేశించేవాడు. పండితుడి నోటి నుండి మేఘగంభీర స్వరంలో వెలువడిన వీరభావ సూచకాలైన ఆ పలుకులు, విన్న ప్రత్యర్థులందరి గుండెల్లో ఒక అవ్యక్త భీతిని రగిలించేవని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఇందుమూలంగా రెండు లాభాలు కలిగేవి. 1. ఆ పలుకులు గౌరీపండితుని శక్తిని పూర్తిగా జాగృతం చేసేవి. 2. ఆ పలుకులతో ప్రత్యర్థులను జడిపించి, ముగ్ధులను చేసి వారి శక్తిని దోచుకొనేవాడు. పండితుడు అలా బిగ్గరగా ఉచ్చరిస్తూ మల్లయోధునిలా కుడి అరచేతితో ఎడమ అరచేతిని చరుస్తూ చరుస్తూ సభలో ప్రవేశించేవాడు; పూర్వం ఢిల్లీ చక్రవర్తుల సమక్షంలో సభాసదులు ఏ రీతిలో మోకాళ్ళమీద చేతులు పెట్టుకొని కూర్చునేవారో, ఆ విధంగా కూర్చుని శాస్త్ర వాగ్వాదం ప్రారంభించేవాడు. అప్పుడు గౌరీపండితుణ్ణి వాగ్వాదంలో ఓడించడం ఎవరికైనా అసాధ్యమని శ్రీరామకృష్ణులు చెప్పేవారు.
గౌరీపండితుడికి అటువంటి శక్తి ఉందని అంతకు మునుపు శ్రీరామకృష్ణులకు తెలియదు. కాని పండితుడు కాళికాలయంలో ప్రవేశించి హా, రే, రే, రే అంటూ బిగ్గరగా ఉచ్చరించిన మరుక్షణమే, తనలో నుండి ఏదో శక్తి ప్రేరేపించడంతో శ్రీరామకృష్ణులూ అవే అక్షరాలను అతడి కంటే బిగ్గరగా ఉచ్చరించారు. వెంటనే పండితుడూ ఆ అక్షరాలనే శ్రీరామకృష్ణుల కంటే మరింత బిగ్గరగా ఉచ్చరించాడు. అది విని ఉత్తేజంతో శ్రీరామకృష్ణులు ‘హా, రే, రే, రే’ అంటూ మరింత బిగ్గరగా ఉచ్చరించారు. రెండు వైపుల నుండి వారు అలా ఒకరికంటే ఒకరు బిగ్గరగా ఉచ్చరించడంతో, బందిపోటు దొంగలు పడ్డప్పుడు చెలరేగే కోలాహలం, అలజడి అక్కడ నెలకొన్నాయని నవ్వుతూ శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఆ శబ్దం వచ్చిన వైపుకు కర్రలు, కటారులు పుచ్చుకొని ఆలయ కాపలావారు ఆదరాబాదరా పరుగెత్తుకొంటూ వచ్చారు. తక్కిన వారంతా భయంతో బిర్రబిగుసుకుపోయారు. గౌరీపండితుడు, శ్రీరామకృష్ణుల కంటే బిగ్గరగా ఆ అక్షరాలను ఉచ్చరించలేకపోవడంతో, మౌనం పాటించవలసి వచ్చింది. ఈ సంఘటనతో పండితుడు ఒకింత చిన్నబుచ్చుకొని కాళికాలయంలోకి ప్రవేశించాడు. శ్రీరామకృష్ణులూ, క్రొత్తగా వచ్చిన పండితుడూ ఈ కోలాహలాన్ని సృష్టించారని గ్రహించి, అక్కడ గుమిగూడిన జనం నవ్వుకొంటూ వెళ్ళిపోయారు. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు : “తదుపరి జగజ్జనని గౌరీపండితుడి జీవిత విజయ రహస్యాన్ని నాకు వ్యక్తం చేసింది. ప్రత్యర్థుల శక్తులను నిర్వీర్యం చేసి తనను అజేయుడయ్యేలా చేస్తూవచ్చిన శక్తిని నాటితో అతడు కోల్పోయాడు. అతడి శ్రేయస్సు నిమిత్తమే జగజ్జనని ఆ శక్తిని దీనిలోకి (శ్రీరామకృష్ణులలోకి) ఆకర్షించి వేసింది.” ఆనాటి నుండి క్రమక్రమంగా గౌరీపండితుడు, శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక స్థితికి ముగ్ధుడై, పూర్తిగా ఆయన పట్ల విధేయుడై వర్తించసాగాడు.
32. దేవీభావనతో తన భార్యను గౌరీపండితుడు ఆరాధించడం
గౌరీపండితుడు గొప్ప తాంత్రిక సాధకుడని మునుపే చెప్పుకొన్నాం. ప్రతి సంవత్సరం దుర్గాపూజ సందర్భంలో గౌరీపండితుడు పూజకు అవసరమైన ఏర్పాట్లన్నీ స్వయంగా తానే చేసుకొనేవాడు. తన భార్యను వస్త్రభూషణాదులతో అలంకరించి, పసుపు కుంకుమలు అలదిన పూజాపీఠం మీద ఆసీనురాలిని చేసి, జగజ్జననిగా భావించి మహాభక్తితో ఆమెను పూజించేవాడు. ఈ విషయం మేం శ్రీరామకృష్ణుల ముఖతా విన్నాం. లోకంలోని స్త్రీలందరూ సాక్షాత్తు జగన్మాతృ స్వరూపిణులనీ, వారందరిలోను జగన్మాత జగత్పాలన శక్తీ, ఆనందప్రదాయిని దివ్యానంద శక్తీ విశేషంగా అభివ్యక్తమౌతాయని తంత్రాలు చాటుతున్నాయి. కాబట్టే స్త్రీల నందరినీ పవిత్రభావంతో పూజించాలి. స్త్రీలలో స్వయంగా జగజ్జనని నెలకొని ఉన్నదనే విషయం విస్మరించి, వారిని భోగ్యవస్తువుగా మాత్రమే ఎంచి, కామ భావంతో చూస్తే, అది జగజ్జననిని అవమానించడమే అవుతుంది; దాని పర్యవసానం అటువంటి వారు అంతులేని దుఃఖాలకు లోనవడమే. దేవీ మాహాత్మ్యంలో (చండీ లేదా దుర్గా సప్తశతి) దేవతలు, దేవిని ఇలా స్తుతిస్తున్నారు:
విద్యాః సమస్తాస్తవ దేవి భేదాః
స్త్రియః సమస్తాః సకలా జగత్సు ।
త్వయైకయా పూరితమమ్బయైతత్
కా తే స్తుతిః స్తవ్యపరాపరోక్తిః ॥
దేవీ! విద్యలన్నీ నీ వివిధ అంశాలు. లోకంలోని స్త్రీ లందరూ (నీ) వివిధ కళలు (అంశాలు) కలిగి ఉంటారు. తల్లీ! ఈ జగత్తు యావత్తూ నువ్వే నిండి ఉన్నావు. స్తుతింపదగిన సకల వస్తువుల పరాపరోక్తి (ముఖ్యోక్తీ, గౌణోక్తీ) రూపమైన నిన్ను నిజానికి ఏ స్తుతులు వర్ణించగలవు?
“ఓ దేవీ! నువ్వు జ్ఞానస్వరూపిణివి; లోకంలోని మానవులు పొందుతున్న అంతులేని చిన్నా, పెద్ద విద్యలన్నీ నువ్వే. నువ్వు ఆ విద్యల రూపంలో అభివ్యక్త మౌతున్నావు; లోకంలోని స్త్రీలందరూ నీ అభివ్యక్తీకరణలే. నువ్వొక్క దానివే లోకం యావత్తు వ్యాపించి, సర్వత్రా నెలకొని ఉన్నావు. అసదృశయైన నువ్వు వర్ణనాతీతురాలివి. నీ అనంత గుణాలను ఎవరు స్తుతించగలిగారు? ఎవరు స్తుతించగలుగుతారు?”
-దేవీ మాహాత్మ్యం, 11.6
భారతదేశంలో అనేకులు ఈ స్తోత్రాన్ని నిత్యం చదువుతూనే ఉంటాం. కాని దౌర్భాగ్యం ఏమిటంటే కొన్ని నిమిషాలపాటైనా స్త్రీ దేహాన్ని దేవీ భావంతో చూసి, సముచిత భక్తిప్రపత్తులు చెల్లించి, హృదయాలలో పరమానందాన్ని పొంది తరింప, కనీస ప్రయత్నమైనా చేసేవారు ఏ కొద్దిమందైనా కనిపిస్తారా? జగజ్జనని విశేషంగా అభివ్యక్తమయ్యే స్త్రీమూర్తులను అపవిత్ర దృష్టితో చూస్తూ ప్రతి రోజూ వందలాది పర్యాయాలు ఆమెను అవమానించకుండా ఉండేవారు ఎందరున్నారు? ఓ భారతదేశమా! స్త్రీమూర్తుల పట్ల చూపే పాశవిక వైఖరీ, జీవుణ్ణి, శివుడిగా సేవించడం విస్మరించడమే ప్రస్తుత ఈ నీ దుర్దశకు హేతువులు. జగజ్జనని కరుణించి నీ పాశవిక వైఖరిని ఎప్పుడు తొలగిస్తుందో ఆమెకే ఎరుక!
33. గౌరీపండితుడి విచిత్ర హోమ విధానం
గౌరీ పండితుడి మరొక అద్భుతశక్తిని గురించి మేము శ్రీరామకృష్ణుల ముఖతా విని ఉన్నాం. ఉత్కృష్ట తాంత్రిక సాధకులు నిత్యపూజ ముగించాక సాధారణంగా హోమం చేస్తారు. నిత్యం కాకపోయినప్పటికీ గౌరీపండితుడు కూడా తరచు హోమం నిర్వర్తించేవాడు. కాని ఆయన హోమం చేసే విధానం ఎంతో విచిత్రంగా ఉండేది. ఇతరులలా ఆయన హోమం చేసేవాడు కాదు. సామాన్యంగా నేలపై మట్టితోగాని లేదా ఇసుకతోగాని వేదికను నిర్మించి, దానిపై కట్టెలు పేర్చి అగ్ని రగిలించి ఆహుతులు సమర్పించడం పరిపాటి. గౌరీ మాత్రం తన ఎడమ చేతిని నిరాధారంగా ముందుకు చాచి, దానిమీద ఒక మణుగు (82 పౌండ్లు) కట్టెలు పేర్చి, వాటిని రగిలించి, మండుతున్న అగ్నిలో తన కుడిచేతితో ఆహుతులు వేసేవాడు. హోమ కార్యం పూర్తిచేయడానికి చాలాసేపు పట్టేది. అంతసేపు చేతిని నిరాధారంగా చాపుకొని ఉంచడం, మణుగు కట్టెల భారాన్ని భరించడం, మండుతున్న కట్టెల ఉష్ణాన్ని అంతసేపూ ఓర్చుకొంటూ, మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని విధివిహితంగా భక్తిప్రపత్తులతో ఆహుతులు సమర్పించడం మాకు అసాధ్యమనే అనిపించింది. స్వయంగా శ్రీరామకృష్ణుల ముఖతా ఈ అసాధారణ కృత్యం గురించి విన్నప్పటికీ కూడా మొదట్లో మాలో అనేకులం నమ్మలేకపోయాం. మా విస్మయావస్థను గమనించి శ్రీరామకృష్ణులు “ఆహా! అతడలా చేయడం నేను కళ్ళారా చూశాను. ఇదీ అతడి అద్భుత శక్తులలో ఒకటి” అని చెప్పారు.
34. వైష్ణవచరణ్, గౌరీపండితుడు కూడా పాల్గొన్న దక్షిణేశ్వరంలో జరిగిన సదస్సు
గౌరీ పండితుడు దక్షిణేశ్వరానికి వచ్చిన కొద్దిరోజులలోనే వైష్ణవచరణ్ వంటి కొందరు సాధక – పండితులను మథుర్ ఆహ్వానించి, ఒక సదస్సు ఏర్పాటు చేశాడు. క్రొత్తగా వచ్చిన గౌరీపండితునికీ, ఇతర పండితులకీ మధ్య శాస్త్ర ప్రమాణాలపై చర్చ జరిపించి, మునుపటిలా శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక అవస్థను రూఢి పరచుకోవడమే ఈ సదస్సును ఏర్పాటు చేయడంలోని ఉద్దేశం. కాళికాలయానికి ఎదురుగా ఉన్న నాదమండపంలో ఉదయం వేళ సదస్సు ప్రారంభమైంది. వైష్ణవచరణ్, కలకత్తా నుండి రావడం ఆలస్యం కావడంతో, శ్రీరామకృష్ణులు గౌరీతో కలిసి సభా స్థలానికి బయలుదేరారు. సభలోకి ప్రవేశించే ముందు శ్రీరామకృష్ణులు కాళికాలయానికి వెళ్ళి, జగజ్జనని పాదారవిందాలను భక్తిప్రపత్తులతో అర్చించారు. భావసమాధిమగ్నులై ఆయన ఆలయం నుండి బయటకు వచ్చీరాగానే వైష్ణవచరణ్ ఆయన పాదాలమ్రోల భక్తిప్రపత్తులతో వాలిపోయాడు. అతణ్ణి చూసీచూడగానే ఆధ్యాత్మిక భావోద్వేగ స్ఫూర్తితో శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులై, వైష్ణవచరణ్ భుజాలమీదకెక్కి కూర్చున్నారు. తన జన్మ ధన్యమైనట్లుగా భావించి వైష్ణవచరణ్ పరమానంద భరితుడైనాడు. సంస్కృతంలో ఆశువుగా ఒక స్తోత్రాన్ని రచించి శ్రీరామకృష్ణులను స్తుతించాడు. సమాధిమగ్నులై ఉన్న శ్రీరామకృష్ణుల అనుగ్రహపూర్ణ తేజో విరాజమానమైన మూర్తిని దర్శించి, హృదయం ఆనందంతో ఉప్పొంగ వైష్ణవచరణ్ ఆలాపించిన మనోహర స్తోత్రగానం విని అక్కడున్న మథుర్ ప్రభృతులు భక్తి పెల్లుబుకగా మహదానందంతో చిత్తరువులా నిలబడిపోయారు. కాస్సేపటికి శ్రీరామకృష్ణుల సమాధి భంగమైంది. అప్పుడు మెల్లగా అందరూ ఆయనతో కలిసి నాదమండపంలోకి వెళ్ళి, కూర్చున్నారు.
సదస్సు ప్రారంభమైంది. కాని గౌరీపండితుడు ప్రప్రథమంలోనే హఠాత్తుగా ఇలా చెప్పాడు : “ఈయన (శ్రీరామకృష్ణులను చూపుతూ) ఆ పండితుడిపై అంతటి కృపను వర్షించినప్పుడు, నేను ఈ రోజు ఆయనతో వాదించలేను. ఒకవేళ వాదించినా నాకు ఓటమి తథ్యం. ఎందుకంటే ఆయన (వైష్ణవచరణ్) నేడు దైవకృప అనే ఆయుధం ధరించి ఉన్నాడు. అంతేకాక ఆయన కూడా నా దృక్పథాన్నే వహించినట్లు కానవస్తున్నది. కనుక ఈ వ్యవహారం గురించి చర్చించడం వృథా.” ఇతర శాస్త్రాంశాల మీద కొంతసేపు చర్చ జరిపిన తరువాత సదస్సు ముగిసింది.
వైష్ణవచరణ్ పాండిత్యాన్ని చూసి గౌరీపండితుడు ఆ రోజు ఆయనతో చర్చించడానికి వెనుకాడాడని భావించడం సరికాదు. శ్రీరామకృష్ణుల దివ్యత్వం, జీవన విధానాదులు చూసి, దీర్ఘకాలిక తపశ్చర్యల ఫలంగా జనించిన అంతర్దృష్టితో దక్షిణేశ్వరంలో బస చేసిన ఆ కొద్దిరోజులలోనే గౌరీపండితుడు, ‘శ్రీరామకృష్ణులు సామాన్యులు కారు, మహాపురుషులు’ అని తన హృదయాంతరాళాల్లో గ్రహించాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత ఒక రోజు శ్రీరామకృష్ణులు, గౌరీపండితుణ్ణి “ఇలా చూడు! వైష్ణవచరణ్ దీనిని (తమను చూపుతూ) అవతారమంటున్నాడు. అలా కావడం సాధ్యమేనా? నువ్వు ఏం అనుకొంటున్నావో కాస్త చెప్పు” అని అడిగారు.
35. శ్రీరామకృష్ణుల గురించిన గౌరీ దృఢ విశ్వాసం
ఆ ప్రశ్నకు గౌరి గంభీరంగానే జవాబిచ్చాడు : “వైష్ణవచరణ్ మిమ్మల్ని అవతారం అని మాత్రమే అంటున్నాడా? అతడు మరీ తక్కువగా అంచనా వేశాడు. ఎవరి అంశలు యుగాలపర్యంతం లోకహితార్థం ఈ ఇలలో అవతారాలుగా జన్మిస్తూ ఉంటాయో, ఎవరి శక్తి మూలంగా వారు తమ పనులు చేయడంలో కృతకృత్యులవుతారో ఆ పరమాత్మే మీరు అన్నది నా దృఢ విశ్వాసం.” ఆ మాటలు విని శ్రీరామకృష్ణులు నవ్వుతూ, “ఓహో! ఆయన కంటే రెండాకులు ఎక్కువే చదివినట్లున్నావు! అలా అనుకోడానికి నాలో ఏం చూశావో చెబుతావా?” అని అడిగారు. అందుకు గౌరీ ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు : “శాస్త్రాధారాలు, స్వానుభవం నుండే నేను అలా చెబుతున్నాను. ఎవరైనా ఇందుకు విరుద్ధమైన అభిప్రాయం వెలిబుచ్చితే, నా దృఢనిశ్చయాన్ని ఋజువు చేయడానికి సంసిద్ధుణ్ణి” అని అన్నాడు.
ఆ తరువాత శ్రీరామకృష్ణులు చిన్నపిల్లవాడిలా, “మీరు ఏమిటేమిటో చెబుతున్నారు; వాటి గురించి ఎవరి కెరుక? నాకు వాటి గురించి ఏమీ తెలియదు” అని అన్నారు. “నిజమే. ‘మీరెవరో మీకే తెలియదు’ అని శాస్త్రాలూ వచిస్తూన్నాయి. అటువంటప్పుడు మీ గురించి ఇతరులు ఎలా తెలుసుకోగలరు? అనుగ్రహించి మీరెవరికి వెల్లడిస్తారో, వారు మాత్రమే నిజం తెలుసుకోగలుగుతారు” అని గౌరీ పండితుడు జవాబిచ్చాడు.
36. గౌరీపండితుడి వైరాగ్యం
పండితుడి ప్రగాఢ విశ్వాసాన్ని వెలిబుచ్చే పలుకులు విని శ్రీరామకృష్ణులు మందహాసం చేశారు. రోజులు గడిచేకొద్దీ శ్రీరామకృష్ణుల పట్ల గౌరీపండితుడికి ఆకర్షణ అధికం కాసాగింది. శ్రీరామకృష్ణుల దివ్య సాహచర్యంలో పండితుడి శాస్త్రజ్ఞానమూ, సాధన ఫలితాలూ సాఫల్యం సంతరించుకొని, సంసారం పట్ల తీవ్ర అనాసక్తత రూపంలో అభివ్యక్తం కాసాగాయి. నానాటికీ అతడి మనస్సు పాండిత్యం, గౌరవం, సిద్ధులు మొదలైన వాటి పట్ల అభిలాషను కోల్పోసాగింది; అతడి మనస్సు భగవంతుడి పాదపద్మాల వైపుగా మరలిపోసాగింది. ఇప్పుడు గౌరీపండితుడిలో మునుపటి పాండిత్య అహంకారం, చర్చ పట్ల అభిరుచి, ఆ దర్పం పూర్తిగా మటుమాయమయ్యాయి. భగవంతుడి పాదపద్మాలను పొందడానికి సమస్త ప్రయత్నాలూ చేయకుండానే విలువైన సుదీర్ఘ కాలాన్ని వృథా చేసుకొన్నానని పండితుడికి ఇప్పుడు అర్థమైంది. ఆ రీతిలో కాలాన్ని ఇకమీదట వృథా చేయకూడదనుకున్నాడు. సర్వసంగ పరిత్యాగం చేయాలని దృఢంగా సంకల్పించుకున్నాడు; తన జీవితంలో మిగిలి ఉన్న ఆ కొద్దిరోజులను భగవంతుడి మీదనే పూర్తిగా ఆధారపడుతూ, భక్తిపూరిత హృదయంతో, పరమ వ్యాకులతతో ఆయనను ప్రార్థిస్తూ గడిపివేసి తద్ద్వారా భగవత్సాక్షాత్కారం పొంద నిశ్చయించుకున్నాడు.
ఈ విధంగా శ్రీరామకృష్ణుల దివ్యసహచర్యంలోనూ, భగవద్ధ్యానంలోనూ గౌరీపండితుడు రోజులూ, నెలలూ గడిపివేయసాగాడు. చాలాకాలం ఇలా ఇంటి నుండి దూరంగా ఉండిపోవడంతో, ఆయన భార్య, కుమారుడు తదితర కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి రావలసిందిగా పదేపదే ఆయనకు ఉత్తరాలు వ్రాయసాగారు. అందుకు కారణం : ఆయన ఒక ‘ఉన్మాద సాధువు’ తో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నాడనీ, తత్ఫలితంగా ఆయన మనస్సు లౌకిక విషయాల పట్ల ఎంతో అనాసక్తి వహిస్తూన్నదనీ వాళ్ళకు అనుమానాస్పదంగా తెలియరావడమే. తన కుటుంబ సభ్యులు దక్షిణేశ్వరానికి వచ్చి తనను మళ్ళీ సంసార జీవితంలోకి లాక్కునిపోతారనే ఆలోచన పండితుడిలో మెదలి, బలపడింది. ఆయనకు వచ్చిన ఉత్తరాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. సుదీర్ఘంగా ఆలోచించిన తరువాత పండితుడికి ఒక చక్కని మార్గం కనిపించింది. ఒక సుముహూర్తం ఆసన్నం కావడంతో, పండితుడు శ్రీరామకృష్ణుల పాదపద్మాలకు ప్రణమిల్లి, సెలవు ఇప్పించమని కంట తడిపెట్టుకొని ఆయనను అర్థించాడు. “ఇదేమిటి గౌరీ! హఠాత్తుగా సెలవు పుచ్చుకుంటున్నావెందుకు? ఎక్కడకు వెళతావు?” అని శ్రీరామకృష్ణులు అడిగారు. అందుకు చేతులు జోడించి పండితుడు, “నన్ను ఆశీర్వదించండి, నా మనోవాంఛ సిద్ధిస్తుంది. భగవత్సాక్షాత్కారం పొందకుండా నేను తిరిగి రాను” అని జవాబిచ్చాడు. ఆనాటి నుండి గౌరీపండితుడి జాడ ఎంత అన్వేషించినప్పటికీ ఎవ్వరికి తెలియరాలేదు.
37. వైష్ణవచరణ్ను, గౌరీపండితుణ్ణి శ్రీరామకృష్ణులు ఉదహరించడం
వైష్ణవచరణ్, గౌరీపండితుల జీవితాల నుండి వివిధ సంఘటనలను గురించి అనేకసార్లు శ్రీరామకృష్ణులు మాతో ప్రస్తావించారు. మరికొన్ని సందర్భాలలో ఏదో అంశం చర్చిస్తూ ఆ పండితులు ఆ అంశం మీద వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ఆయన మాకు తెలిపేవారు. ఒకరోజు శ్రద్ధాళువైన ఒక సాధకుడికి ఉపదేశం చేస్తూ, అతడితో, “మనిషిలో నిజంగా తన ఇష్టదైవాన్ని చూడగలిగినప్పుడు భగవత్సాక్షాత్కారం కలుగుతుంది. నరలీలలో విశ్వాసం ఏర్పడినప్పుడే పరిపూర్ణజ్ఞానం కలుగుతుందని వైష్ణవచరణ్ తరచు వచించేవాడు” అని శ్రీరామకృష్ణులు చెప్పడం మాకు బాగా జ్ఞాపకం.
38. కాళీ, కృష్ణులు అభిన్నులన్న విషయంపై గౌరీపండితుడి అభిప్రాయం
కాళీ, కృష్ణుల మధ్య భేదభావం కనబరిచే ఒక భక్తుణ్ణి గమనించి శ్రీరామకృష్ణులు అతడితో ఒకసారి ఇలా అన్నారు : “ఎంత అపరిపక్వ భావం! కాళీ, కృష్ణుడు, చైతన్యుడు, మిగిలిన అందరి అభివ్యక్తీకరణ నీ ఇష్టదైవమే అని గ్రహించు. ఈ అపరిపక్వ భావం కారణంగా నీ ఇష్టదైవాన్ని విడిచిపెట్టి చైతన్యుణ్ణి ఆరాధించమంటున్నావా? కానే కాదు. కాని ఈ మినహాయింపు ధోరణి విడిచిపెట్టు. నీ ఇష్ట దైవమే, కృష్ణుడు చైతన్యుడు తదితర దివ్య అభివ్యక్తీకరణలు అనే దృఢవిశ్వాసం కలిగి ఉండు. కోడలు అత్తగారింటికి వెళ్ళి అత్తమామలను, మరదళ్ళను, మరుదులను అనురాగంతో సేవించడం నువ్వు చూడలేదా? కాని భర్తతో మాత్రమే ఆమె శయనిస్తుంది, తన భావనలను అతడితో మాత్రమే పాలుపంచుకొంటుంది. భర్త మూలంగానే ఆ కుటుంబంలోని సభ్యులందరూ తనకు సొంతమయ్యారని ఆమెకు చక్కగా తెలుసు. అదే విధంగా నీ ఇష్టదైవం మూలంగానే ఆయన ఇతర అభివ్యక్తీకరణలతో నీకు సంబంధం కలిగింది కనుక వారందరి పట్లా భక్తిప్రపత్తులు చెల్లించాలి. ఈ విషయం గ్రహించి నీదైన దురభిమానాన్ని పారద్రోలు. ‘కాళీ గౌరాంగులు ఒక్కరే అని ఎప్పుడు అవగతమౌతుందో అప్పుడే యథార్థ జ్ఞానం కలిగినట్లు తెలుస్తుంది’ అని గౌరీ చెప్పేవాడు అని తేటతెల్లమొనర్చారు.
39. తన ప్రేమాస్పదుణ్ణి భగవంతుడి ఒకానొక రూపంగా పరిగణించడాన్ని గురించి వైష్ణవచరణ్
తన కుటుంబంలోని ఒకరి పట్ల ప్రగాఢ అనురక్తి అలవరచుకొన్న ఫలితంగా ఒక ఫలానా భక్తుడి మనస్సు ప్రశాంతతను కోల్పోవడం ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులు గుర్తించారు. అప్పుడు ఆ భక్తుడికి తన కుటుంబంలోని ఆ సదరు వ్యక్తిని భగవంతుడి ఒకానొక రూపంగా భావించి, సేవించమని ఆయన ఉపదేశించారు. తన మేనల్లుడి పట్ల ప్రగాఢ అనురాగాన్ని అలవరచుకొన్న ఒక భక్తురాలికి ఆ మేనల్లుణ్ణి బాలగోపాలుడిగా భావిస్తూ సేవించమని శ్రీరామకృష్ణులు ఉపదేశించారనీ, అలా ఆచరించిన ఫలితంగా కొద్దికాలంలోనే ఆమె భావసమాధిని కూడా పొందగలిగిందనీ ఇంతకు మునుపే* పాఠకులకు తెలిపి ఉన్నాం. తాము ప్రేమించే వ్యక్తి పట్ల భగవంతుని యందు చూపే భక్తిప్రపత్తులు నెరపాలని ఉపదేశించే సందర్భాలలో శ్రీరామకృష్ణులు, వైష్ణవచరణ్ ప్రస్తావన తెచ్చి ఈ అంశంలో అతడి ఉద్దేశాన్ని ఇలా తెలిపేవారు : “తాను ప్రేమించే వ్యక్తిని ఇష్టదైవంగా పరిగణించి చూసినప్పుడు, అతడి మనస్సు సత్వరమే భగవంతుడి మీద లగ్నమౌతుంది అని వైష్ణవచరణ్ తరచు చెప్పేవాడు.” ఇలా అంటూ శ్రీరామకృష్ణులు మరింత విశదీకరించేవారు: “అలా చేయమని వైష్ణవచరణ్ తన సంప్రదాయానికి చెందిన స్త్రీలకు ఉపదేశించేవాడు. ఆయన అలా చెప్పడం నిందార్హం కాదు. ఎందుకంటే ఆ స్త్రీలందరిదీ ‘ఉపపతి వైఖరి’ కదా! ఒక స్త్రీకి తన ఉపపతి పట్ల ఎంతటి ఆకర్షణ ఉందో అంత ఆకర్షణను భగవంతుడి పట్ల ఆరోపించుకోగోరతారు వాళ్ళు.” అయినా అటువంటి ప్రమాదకరమైన సాధన పద్ధతిని జనసామాన్యానికి బోధించకూడదనీ, అలా బోధిస్తే వ్యభిచారం పెచ్చు పెరిగిపోతుందనీ శ్రీరామకృష్ణులు నొక్కివక్కాణించేవారు. కాని భర్తను గాని, కుమారుణ్ణి గాని లేదా సమీప బంధువుని గాని భగవద్రూపునిగా ఎంచి ప్రేమించి, సేవించడం పట్ల ఆయనకు ఎటువంటి అభ్యంతరమూ ఉండేది కాదు. పైగా తమ పాదపద్మాలను ఆశ్రయించిన అనేకమంది భక్తులకు ఈ సలహానే ఇచ్చేవారని మాకు బాగా తెలుసు.
40. ఈ ఉపదేశం శాస్త్ర సమ్మతమే; యాజ్ఞవల్క్య – మైత్రేయ సంవాదం
కాస్త తరచి చూస్తే పై ఉపదేశం శాస్త్రవిరుద్ధం కాదనీ, పైగా అదొక క్రొత్త పద్ధతి కూడా కాదనీ మనం గ్రహించవచ్చు. “భర్తలో ఆత్మస్వరూపుడుగా భగవంతుడు నెలకొని ఉండడం వలననే భార్యకు, భర్త ప్రియతముడౌతున్నాడు; భార్యలో భగవంతుడు ఉండడం వలననే భార్య పట్ల భర్తకు ఆకర్షణ జనిస్తున్నది”* అని ఉపనిషత్కారుడైన ఋషి యాజ్ఞవల్క్య – మైత్రేయి సంవాదం మూలంగా బోధిస్తున్నాడు. లోకంలో మనకు ప్రియమైన, ఆకర్షణీయమైన అన్ని వస్తువులను, వ్యక్తులను ప్రియస్వరూపుడూ, ఆనంద స్వరూపుడూ అయిన ఆ భగవంతుని అంశలుగా పరిగణించాలి; ఆ దృక్పథం నుండే వాటిని ప్రేమించాలని ఉపనిషత్ ఋషులు అనాది కాలం నుండి మనకు బోధిస్తూ వస్తున్నారు. తదనంతర కాలంలో భక్తిగ్రంథకారులైన నారదాదులు మానవుడికి పరమహానికర శత్రువులైన కామక్రోధాదులను భగవంతుని వైపుకు త్రిప్పాలనీ, అట్లే సఖ్య, వాత్సల్య, మధుర భావాదుల ద్వారా భగవంతుణ్ణి ఉపాసించాలనీ బోధించారు. ఇలా చేయడంలో ఈ ఆచార్యులు మునుపటి ఉపనిషత్ ఋషుల అడుగుజాడలనే అనుసరించారన్న విషయం సుస్పష్టం. కాబట్టి పైన ఉదహరించిన శ్రీరామకృష్ణుల ఉపదేశం శాస్త్రపరమైనదని అనడంలో ఎలాంట సంశయమూ లేదు.
41. అవతార పురుషులందరూ శాస్త్రాలనే అనుసరిస్తారు
భగవదవతారమూర్తులందరూ క్రొత్త ఆధ్యాత్మిక పద్ధతులను ఆవిష్కరిస్తారు. అయితే ఆ మార్గాలు, వెనుకటి శాస్త్రబోధనలకు విరుద్ధమైనవిగా ఉండవు సరికదా, శాస్త్రాలలో నిర్దేశించినట్లుగానే ఉంటాయని చెప్పనవసరం లేదు. ఏ అవతారమూర్తి జీవితాన్నైనా అధ్యయనం చేస్తే ఈ విషయం అవగతమౌతుంది. ఆధునిక యుగ ప్రవక్తయైన శ్రీరామకృష్ణుల జీవితంలో ఈ అంశం ప్రస్ఫుటంగా కానవస్తూన్నదని వివరించడానికే ఈ పుస్తకంలో ప్రయత్నించాం. ఆయన జీవితం ప్రతి మలుపులోను మనకు శాస్త్రాల పట్ల ఆయన కనబరచిన గౌరవాస్పద వైఖరే తారసపడుతుంది. కాని పాఠకులకు ఈ విషయం స్పష్టం చేయడంలో విఫలులమైతే, కేవలం అది మా పరిమిత మేథస్సు లోటుపాటే కానీ, ‘ఎన్ని మతాలో, అన్ని మార్గాలు’ అన్న మహోన్నత ఆధ్యాత్మిక సత్యాన్ని అనుభవం ద్వారా తెలియచేసిన శ్రీరామకృష్ణుల పొరపాటు మాత్రం కానేకాదు.
లౌకికుడూ, జిత్తులమారీ అయిన పాశ్చాత్యుడు, ఇతర దేశాల సంప్రదాయాలను, ధార్మిక సంస్థలను విమర్శించే సందర్భంలో ఒక ప్రమాణాన్ని, తమ సంప్రదాయాలను విమర్శించేటప్పుడు ఆ ప్రమాణాన్ని త్రోసివేసి, తమకు సానుకూలమైన వేరొక ప్రమాణాన్ని అనుసరిస్తాడు. ఈ పాశ్చాత్య ద్వంద్వనీతిని అనుకరిస్తూ మనం వేటిని ‘తుచ్ఛమైన కర్తాభజా’ ది సంప్రదాయాలని అసహ్యించుకొంటామో ఆ రహస్య సంప్రదాయాల నుండి మొదలుపెట్టి, అతిశుద్ధమైన ‘అద్వైత వేదాంతం’ వరకు గురుదేవులైన శ్రీరామకృష్ణుల దృష్టిలో ప్రతి ఒక్క మతం భగవత్సాక్షాత్కారానికి తీసుకువెళ్ళే మార్గంగా సముచిత గౌరవస్థానం పొందింది; యోగ్యతానుసారం సాధకులకు బోధింపబడింది.
“మహాశయా! అంత ఉన్నత స్థితికి చెందిన సాధకురాలైన భైరవీ బ్రాహ్మణి కూడా ఐదు మకారాలతో* సాధన చేయడం ఎందుకో?” అని ఆ అనుష్ఠానాల పట్ల జుగుప్సతో మేం శ్రీరామకృష్ణులను అనేక సందర్భాలలో ప్రశ్నించాం. “అంత గొప్ప పండితుడూ, భక్తుడూ అయిన వైష్ణవచరణ్ తన సాధన నిమిత్తం పరస్త్రీని నాయికగా పరిగ్రహించడం తప్పు కాదా?” అని కూడా అడిగాం.
మా పై ప్రశ్నలకు శ్రీరామకృష్ణుల జవాబు ఇలా ఉండేది : “వాళ్ళు అలా చేయడంలో తప్పు ఏమీ లేదు. అది భగవత్సాక్షాత్కారానికి మార్గం అని నూటికి నూరుపాళ్ళు వాళ్ళు విశ్వసించేవారు. భగవత్సాక్షాత్కారం కలుగుతుందని హృదయపూర్వకంగా, చిత్తశుద్ధితో ఎవరు దేనిని విశ్వసిస్తారో దానిని తప్పు అని చెప్పరాదు, నిందించరాదు. ఎందుకంటే ఏ భావాన్ని అయినా కచ్చితంగా అనుసరిస్తే దాని ద్వారా సర్వభావమయుడైన భగవంతుణ్ణి పొందవచ్చు. ప్రతి ఒక్కరూ తమ భావవైఖరిని అనుసరించే భగవంతుణ్ణి ప్రార్థించాలి. అంతేగాని ఎవరి ఆధ్యాత్మిక భావాన్నీ గర్హించకూడదు, అట్లే ఇతరుల భావాన్ని తమ భావంగా చేసుకోవడానికి ప్రయత్నించనూ కూడదు.” అలా అంటూ సదానందమయులైన శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు ఈ క్రింది పాటను పాడేవారు.
ఓ మనసా, నీలోనే ఉండిపో, మరెవరి చోటుకు పోబోకు,
నీ హృదయంలో వెదకితే, కోరుకున్నదంతా అప్రయత్నంగా లభిస్తుంది
సకల సంపదలకు ఆలవాలమైన ఆ చింతామణి (నీలోనే ఉన్నది), నీ
కోర్కెలన్నిటిని ఈడేరుస్తుంది
(ఓ మనసా) ఆ చింతామణి ప్రాంగణాన ఎన్ని రత్నరాశులు పడివున్నవో!
ఓ మనసా, ప్రయాసతో కూడి తీర్థయాత్రాదులు చేయాలని అశాంతి పొందకు
(నువ్వు) మూలాధారం* లో ఉన్న త్రివేణి* లో ఆనందంగా స్నానమాడి సేదతీర
వెందుకని?
ఓ కమలాకాంతా* ఈ ప్రపంచం మిథ్య, ఇంద్రజాలమని తెలుసుకో
లేకపోతున్నావా?
ఈ కుండలోనే* విరాజిల్లుతున్న ఆ ఐంద్రజాలకుణ్ణి* గుర్తించలేదా!