నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః ।
మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ ॥ –భగవద్గీత 7–25
యోగమాయచే ఆవృతుడనై నేనందరికీ గోచరింపను. పుట్టుకలు, మార్పులు లేని నన్ను ఈ మూఢప్రపంచం ఎరుగదు.
1. అభిలషించిన మాత్రాన మనిషి గురువు కాలేడు
శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో జగజ్జనని పావన నిత్యపూజను ఉపక్రమించిన నాడే ఆయన జీవితంలో గురుభావం విశేషంగా అభివ్యక్తం కాసాగింది. అది శ్రీరామకృష్ణుల సాధనకాలం. భగవదనురాగ కారణం వల్ల ఆయన అప్పుడు దివ్యోన్మాద స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ గురువు సదా గురువుగానే ఉంటాడు, నాయకుడైనవాడు చిన్నతనంనుండే నాయకుడై ఉంటాడు. కొందరు కలిసి ఒక సమితిని రూపొందించి, పరస్పర సంప్రతింపులతో ఒకరికి గురువు లేదా నాయకుని పదవి కట్టబెట్టడం వంటిది కాదు ఇది. సమాజం ముందుకు వచ్చీరాగానే జనం మనస్సులు భక్తిప్రపత్తులతో నిండిపోయి, ఆ వ్యక్తి ముందు సాదరంగా తలలు వంచి తక్షణమే ఆయన బోధనలు అనుసరిస్తూ, ఆయన ఆజ్ఞలు శిరసావహిస్తారు. ఇదే నియతి. “నాయకునిగానే జన్మిస్తాడుగాని నాయకుడుగా తయారుచేయబడడు” అని స్వామి వివేకానంద చెప్పేవారు. అందుచేతనే సామాన్యులు ఏ పనులు చేస్తే సమాజం మండిపడి వారిని శిక్షిస్తుందో, లోకోత్తరులు ఆ పనులనే చేసినా అదే సమాజం వాటిని మక్కువతో అనుసరిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే – మహాత్ములు చేసే కార్యాలనే సామాన్యులు అనుకరిస్తారు. కార్యరూపంలో వారు దేనిని ప్రామాణికమని నిర్ణయిస్తారో దానినే లోకం అనుసరిస్తుంది’ అని వక్కాణిస్తున్నాడు (భ.గీ. 3–21). ఇది ఎంతో ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నా చిరకాలం నుండి ఇట్లే జరుగుతున్నది, ఇక ముందు సైతం ఇట్లే జరుగనున్నది. “నేటి నుండి ఇంద్రపూజ నిలిపివేసి దాని స్థానే గోవర్ధనగిరి పూజింపబడుగాక!” అని అన్నాడు శ్రీకృష్ణుడు. జనం అట్లే చేయనారంభించారు. “ఈనాటి నుండి పశుబలి ఆగిపోవుగాక!” అని వచించాడు బుద్ధుడు. అప్పటి నుండి ‘యజ్ఞార్థే పశవో సృష్టాః’ – యజ్ఞంలో బలులుగా ఇవ్వబడడానికే పశువులు సృష్టింపబడ్డాయి అనే శాస్త్రవచనాన్ని సమాజం తక్షణమే తోసిపుచ్చింది. సబాత్ (పవిత్ర) దినంలో కూడ భుజించడానికి తన శిష్యులకు ఏసుక్రీస్తు అనుమతిచ్చాడు. నాటి నుండి అది నియమమైంది. మహమ్మద్ పలువురు భార్యలను వివాహం చేసుకొన్నా జనం ఆయనను ప్రవక్తగా, త్యాగిపురుషునిగా, మతనాయకునిగా గౌరవించి, అనుసరించారు. అన్ని విషయాలలో చిన్నవైనా పెద్దవైనా సరే ఇదే వర్తిస్తుంది. లోకోత్తర పురుషులు చెప్పేవి, చేసేవి సదాచరణకు ప్రామాణికాలవుతాయి.
2. విరాట్ ‘అహంకారం’ : గురువు
ఎందుకు అది జరుగుతుందో ఇంతకు మునుపే మేం వివరించాం.* జగద్గురువుల స్వార్థపర క్షుద్రాహంకారం శాశ్వతంగా నశిస్తుంది. దాని స్థానాన్ని భావముఖంలో ఉండే విరాట్ అహంకారం ఆక్రమిస్తుంది. ఇదే ఇందుకు కారణం. అనేకులకు మేలు ఒనగూర్చ గోరడమే ఈ విరాట్ అహంకార స్వాభావిక నైజం. పువ్వులు వికసించగానే తుమ్మెదలు ఆ విషయం ఎరిగి తేనెను గ్రోలాలనే కోర్కెతో ఆతురతతో ఆహ్వానం లేకపోయినా వాటి చుట్టూ చేరతాయి. అట్లే ఎవరిలోనన్నా ఆ విరాట్ అహంకారం అభివ్యక్తమైతే, సంసార వ్యధలననుభవిస్తూన్న ప్రాపంచికులు తక్షణం ఆ విషయం ఎలాగో తెలుసుకొని ఆహ్వానహితులై ఆ వ్యక్తి వద్దకు పరుగెత్తి వస్తారు. ఎంతో కష్టపడి అనేక సాధనలు అనుష్ఠించి సిద్ధి పొందిన సామాన్యులలో ఈ విరాట్ అహంకారం కించిత్తు మాత్రమే అభివ్యక్తమౌతుంది. కాని జగద్గురువుల జీవితాలలో ఈ విరాట్ అహంకారం కొద్దికొద్దిగా బాల్యం నుండే అభివ్యక్తమౌతూవస్తుంది. బాల్యంలో కంటే యౌవనంలో ఈ అభివ్యక్తీకరణ అధికంగా ఉంటుంది. చిట్టచివరకు పరిపూర్ణ అభివ్యక్తత అద్భుత లీలలలో కానవస్తుంది. ఆ లీలలు దర్శించి విస్మయాశ్చర్యాలతో ఈ జగద్గురువులను భగవత్సములుగా భావిస్తారు. ఎందుకంటే, అప్పుడు వారిలో అభివ్యక్తమయ్యే ఆ అలౌకిక భావం, తినడం, త్రాగడం, నడవడం ఇత్యాది దైనందిన క్రియలలా అతి స్వాభావికమౌతుంది కనుక. అటువంటప్పుడు సామాన్యుడు చేయగలిగింది ఏముంటుంది? స్వార్థపరత్వమనే వడంబంతో ఆ జగద్గురువుల దివ్యత్వ ప్రగాఢతను అతడెలా కొలవగలడు? కనుక కింకర్తవ్యతామూఢుడై ఆ జగద్గురువులను భగవత్స్వరూపులుగా విశ్వసించి భక్తిప్రపత్తులతో వారిని ఆశ్రయిస్తాడు.
3. శ్రీరామకృష్ణులలో దాని స్వాభావిక అభివ్యక్తీకరణ
శ్రీరామకృష్ణుల జీవితాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు యౌవనంలో ఆయన సాధక దశలో ఉన్నప్పుడు అనునిత్యం ఈ గురుభావం క్రమేణా సువ్యక్తమవడం గమనించవచ్చు. పన్నెండు సంవత్సరాల కఠోరతపస్సాధనల అంతములో ఈ గురుభావం ఆయనలో పరిపూర్ణంగా అభివ్యక్తమై అత్యంత సహజమై పోయింది. కాని ఈ అవస్థకు చేరడానికి మునుపు, అంటే యౌవనంలో ఆయన సాధనలు అనుష్ఠిస్తున్నప్పుడు ఏ సమయంలో వారి ఏ అహంకారం వ్యవహరిస్తూ ఉండేదో సామాన్య మేధకు తెలిసేది కాదు. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు అది ‘సాధక అహంకారం’ గా వ్యక్తమయ్యేది; మరొకప్పుడు అది ‘విరాట్ అహంకారం’ తో ఐక్యమై గురుభావం అభివ్యక్తమయ్యేది. కాని సాధనలన్నిటిలో సిద్ధి పొందాక ఆ గురుభావం ఆయనలో ఎలా పరిపూర్ణంగా వికసించిందో, అది మరో కథ. సముచిత సందర్భంలో దాన్ని వివరిస్తాం. కాబట్టి యౌవనంలో సాధనలు అనుష్ఠిస్తున్నప్పుడు గురుభావపారవశ్యంలో అనేక సందర్భాలలో ఆయన ఎలా ప్రవర్తించేవారో పాఠకులకు ఒకింత తెలియజేయడం అవసరం.
4. సాధన కాలంలో గురుభావం, రాణీ రాసమణి, మథుర్పట్ల వారి ప్రవర్తన
శ్రీరామకృష్ణులు యౌవనదశలో ఉన్నప్పుడు కాళికాలయ వ్యవస్థాపకురాలైన రాణీ రాస్మణి, ఆమె అల్లుడైన మథురనాథ్లతో వ్యవహరిస్తున్నప్పుడు గురుభావం ఆయనలో ప్రథమంగా అభివ్యక్తం కావడం మనం చూడవచ్చు. మాలో ఎవ్వరమూ ఆ ఇద్దరినీ కళ్ళారా చూసే అదృష్టానికి నోచుకోలేదు. కాని శ్రీరామకృష్ణులను చూసిన ప్రథమ వీక్షణలోనే ఆయన పట్ల భక్తి, అనురాగం వారి హృదయాలలో ఉదయించి క్రమేణా అవి అసాధారణ ప్రగాఢతను సంతరించుకొన్నట్లు స్వయంగా శ్రీరామకృష్ణుల ముఖతా మేం విన్నాం. ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల ఇంతటి భక్తి విశ్వాసాలను చూపగలడనీ, అంత ప్రగాఢంగా అభిమానించగలడనే విషయం యథార్థంగా కాక కాల్పనిక కథలా బహుశా మాకు అనిపించి ఉండవచ్చు. ఎందుకంటే పైపై చూపులకు శ్రీరామకృష్ణులు ఆ సమయంలో ఒక నిరర్థక బ్రాహ్మణ పూజారి. మరి వారిద్దరూ, కులంరీత్యా కాకపోయినా ఐశ్వర్యం, గౌరవం, విద్యాబుద్ధుల పరంగా సమాజంలో అత్యంత ప్రముఖులు.
5. శ్రీరామకృష్ణుల విచిత్ర స్వభావం
చిన్నప్పటి నుండి శ్రీరామకృష్ణుల స్వభావం విచిత్రంగా ఉండేది. సంపద, గౌరవం, విద్యాబుద్ధులు, బిరుదులు వంటి వేటిని చూసి లోకులు ఒక వ్యక్తిని ఘనుడిగా పరిగణిస్తారో, వాటిని ఏమాత్రం శ్రీరామకృష్ణులు లక్షించేవారు కారు. శ్రీరామకృష్ణులు తరచూ ఇలా అనేవారు: “స్మారక కట్టడం* మీదకు ఎక్కి చూసినప్పుడు మూడు నాలుగు అంతస్తుల భవంతులు, ఎత్తైన చెట్లు, నేల మీద పెరిగే పచ్చిక అన్నీ ఒకే మాదిరిగా కనిపిస్తాయి.” చిన్ననాటి నుండి శ్రీరామకృష్ణుల మనస్సు సామాన్యంగా భగవద్భక్తి, సత్యనిష్ఠల కారణంగా మహోన్నత భూమిలో నెలకొని ఉండేది. అక్కడి నుండి చూసినప్పుడు మనం తబ్బిబ్బైపోయే, గర్వంతో విర్రవీగే సంపద, గౌరవం, విద్య మొదలైన వాటి గురించి మనలో కనిపించే తారతమ్యం ఆయనకు సమానంగా కానవచ్చేది. ఏ పనినైనా చేయడానికి ముందు, కచ్చితమైన నిర్ణయానికి వచ్చేముందు ఆయన మనస్సు ప్రగాఢంగా చింతనచేసి ఆ ఫలానా పని ఎందుకు చేయబూనాలి అని వివేచించేది. అట్లే ఒక ఫలానా వ్యక్తితో కలిగిన సంబంధం చివరకు ఎక్కడకు దారితీస్తుంది, ఇదే పరిస్థితులలో ఇతరులను ఆ సంబంధం ఎక్కడకు దారితీయించిందనేది కూడ ఆయన వివేచన చేసేవారు. అందుచేత ఏ విషయాలైనాగాని తమ అసలు ఉద్దేశాన్ని, పరిణామాలను ఆకర్షణ ముసుగులో దాచి తాత్కాలికంగానైనా ఆయనను ప్రలోభపెట్టగలిగేవి కావు. పాఠకుడు ఇలా అనవచ్చు: “ఈ విధంగా వివేచించే బుద్ధికి ప్రతి విషయంలో మొట్టమొదట దోషాలే కనిపిస్తాయి. ఆ కారణాన క్రియాశీలత్వాన్ని స్తంభింపచేసి ఏ పనినైనా చేపట్ట అసాధ్యమవుతుంది.” నిజానికి జరిగేది అదే. ముందు నుంచి ఏ మనస్సు వాసనారహితమై పవిత్రమై ఉండదో, ఏ మనస్సు భగవత్సాక్షాత్కారమనే మహోన్నత లక్ష్యంతో ప్రేరేపితమై ఉండదో, అటువంటి మనస్సు నిస్సందేహంగా మనిషిని నిష్క్రియునిగా, లక్ష్యరహితునిగా చేసివేస్తుంది, కొన్ని సందర్భాలలో దురాత్మునిగా కూడ చేసివేయడం కద్దు. అందుకు మారుగా మనస్సు పవిత్రమై, ఉన్నత లక్ష్యంచే ప్రేరేపించబడినప్పుడు అది అన్నిటి అంతరాంతరాళాలను చొచ్చుకొని పోయి, దోషాలను పసిగట్టి చూపుతుంది. దోషదర్శియైన ఈ బుద్ధి మాత్రమే మనిషిని భగవల్లబ్ధి అనే మార్గంలో సత్వరమే పురోగమింపజేస్తుంది. అందుకే శ్రద్ధాభక్తి సంపన్నుడైన సాధకుడు సర్వదా ఈ సంసారంలో పుట్టుక, చావు, వృద్ధాప్యం, రోగం, దుఃఖం మొదలైన బాధాకర దోషాలను స్పష్టంగా పరికిస్తూ వైరాగ్యం పెంపొందించుకోవాలని శ్రీకృష్ణుడు గీతలో (13.8) “జన్మమృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం” అని బోధిస్తున్నాడు. శ్రీరామకృష్ణుల స్వభావంలో ఈ ‘దోషదృష్టి బుద్ధి’ ఎంత చక్కగా పెంపొందిందో మనం గమనిద్దాం. బడిలో చేరినప్పుడు తర్కాలంకార, విద్యావాగీశ్ ఇత్యాది బిరుదులు పొంది ఖ్యాతిని ఆర్జించాలని ఆయన ఆశించారా? లేదు. అందుకు మారు ఆయన నిశిత దృష్టికి ఈ పెద్ద బిరుదులు సముపార్జించుకొన్న ఈ తర్కవాగీశులు, న్యాయచంచువులు సంపన్నుల వాకిళ్ళ వద్ద చేరి న్యాయ వేదాంత గ్రంథాల నుండి దీర్ఘ వాక్యాలను పఠనం చేస్తూ కేవలం పొట్టకూటికై ‘పప్పుబియ్యాలను’ ఆర్జించుకోవాలనే ఉద్దేశంతోనే తమ పాండిత్యం ప్రదర్శించడం కనిపించింది. వివాహం చేసుకొన్న పిదప కూడ శ్రీరామకృష్ణుల మనస్సు సుఖభోగాల వైపు పోయిందా? లేదు. రెండునాళ్ళ సుఖానికై చిరతంగా గుదిబండను మెడకు తగిలించుకోవడం, కోర్కెలను పెంచుకొని ధనం కోసం పిచ్చిగా పరుగులు పెట్టడం పెళ్ళికి నిర్వచనంగా ఆయన కనుగొన్నారు. అయినా ఆ రెండునాళ్ళ సుఖమూ లభిస్తుందన్న నిశ్చయం ఏదీ లేదు. ధనంతో లోకంలో ఏదైనా సాధించవచ్చు, దేనినైనా పొందవచ్చునని ధనం సముపార్జింప ప్రయత్నించారా? లేదు. అందుకు కారణం ధనంతో పప్పు, అన్నం, వస్త్రాలు, ఇటుకలు, మన్ను, కలప మొదలైనవి కొనుగోలు చేయవచ్చు, కాని భగవత్సాక్షాత్కారం లభించదు. కనుక పేరుప్రతిష్ఠల విషయంలోను అంతే. బీదసాదలకు సహాయంచేసి ‘మహాదాత’, ‘పరోపకారి’ అనే బిరుదులకై ప్రయత్నించ వచ్చునే? లేదు. ఆయనకు కనిపించింది ఇది: జీవితాంతం శ్రమించి మహా అయితే ఒకటి రెండు ఉచిత పాఠశాలలు స్థాపించవచ్చు, కొన్ని ధర్మ వైద్యశాలలు నెలకొల్పవచ్చు లేదా ఒకటి రెండు ధర్మశాలలు నడిపించవచ్చు. ఇలావుండగా ఏదో ఒక రోజు మృత్యువు ఆ దాతను కబళించివేస్తుంది. ఇక ప్రపంచం ఎప్పటిలాగే, సకల కొరతలతో అట్లే ఉండిపోతుంది.* ప్రతి విషయాన్నీ శ్రీరామకృష్ణుల మనస్సు ఆ రకంగా నిశితంగా పరికించి విరక్తిచెంది, భగవత్సాక్షాత్కారార్థం వ్యాకులత చెందడం మనకు స్పష్టమౌతుంది.
6. శ్రీరామకృష్ణులను గుర్తించడం సంపన్నులకు, పండితులకు కష్టసాధ్యం
అందుచేతనే అటువంటి విచిత్ర స్వభావులైన శ్రీరామకృష్ణులను గుర్తించడం, అవగతం చేసుకోవడం సామాన్యులకు, అందునా విశేషంగా సంపన్నులకు, పండితులకు కష్టసాధ్యం. ఎందుకంటే మొహమాటం లేకుండా ఉన్నదున్నట్లు చెప్పేవారు ఎవరూ లేనందున పేరుప్రతిష్ఠలు, ధన గర్వంతో విర్రవీగుతూ ఈ సంపన్నులూ, పండితులూ సత్యాన్ని వినే శక్తిని చాలావరకు కోల్పోతారు కనుక. అందుకే అలాంటి వ్యక్తులు శ్రీరామకృష్ణులను గుర్తించలేక ఆయనను అసభ్యంగా, పిచ్చివారిగా లేదా అహంకారిగా భావించడంలో ఆశ్చర్యంలేదు. అటువంటప్పుడు రాణీ రాస్మణి, మథుర్ శ్రీరామకృష్ణుల పట్ల కనబరచిన భక్తిప్రపత్తులు చూస్తే మరింత ఆశ్చర్యం వేస్తుంది. భగవత్ కృపాకటాక్షం వలననే వాళ్ళు శ్రీరామకృష్ణుల పట్ల తమ భక్త్యాను రాగాలను చెక్కుచెదరకుండా నిలుపుకోవడమే కాక, అనునిత్యం ఆయనలో అభివ్యక్తమయ్యే దివ్యగురుభావాన్ని చవిచూసి ఆయన పాదపద్మాల వద్ద సంపూర్ణంగా ఆత్మసమర్పణ చేసుకోగలిగారు. భగవదనుగ్రహమే లేకుంటే రాణీ రాస్మణి, మథుర్బాబు తమ గర్వాహంకారాలను వీడి మొదటి నుండి చివరి వరకు శ్రీరామకృష్ణుల విచిత్ర స్వభావం, పాతపద్ధతులను చూసి కూడా ఆయన పట్ల భక్తిప్రపత్తులు చెల్లించగలిగేవారా? ఉదాహరణకు: కాళికాలయ ప్రతిష్ఠ జరిగిన రోజు స్వయంగా అన్న రాంకుమార్ జగన్మాతను పూజించి, తల్లి అన్నప్రసాదాన్ని స్వీకరించాడు. కాని శ్రీరామకృష్ణులు మాత్రం శూద్రుల అన్నం తినవలసి వస్తుందని ఆ రోజు ఉపవాసం చేశారు. ఆ తరువాత కూడా కొంతకాలం వరకు గంగాతీరాన స్వయంగా వండుకొనే భుజించారు గాని ఆలయ ప్రసాదం స్వీకరింప ఇష్టపడలేదు. అట్లే ఎన్నిమార్లు కబురుచేసినా లౌకికుడని తలచి మథుర్‌తో మాట్లాడడానికే సంకోచించారు. అలాగే కాళికాలయ పూజారి పదవిని స్వీకరించమని మథుర్ ఎన్నిసార్లు ప్రార్థించినా ఆయన సమ్మతించలేదు. శ్రీరామకృష్ణులు ఈ విధంగా ప్రవర్తించినా కూడా రాణీరాస్మణి, మథుర్బాబుల భక్త్యానురాగాలు అచంచలంగా పెంపొందడం అసాధారణ విషయమే!
7. శ్రీరామకృష్ణుల పట్ల మథుర్ ఆకర్షణ: ఇతరుల అభిప్రాయం
అప్పటికి శ్రీరామకృష్ణుల వివాహం జరిగిపోయింది. ఆయన నిండు యౌవనంలో ఉన్నారు. వివాహానంతరం దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చి కాళీమాత పూజను చేగొన్నారు. అలా పూజాబాధ్యతను చేపట్టగానే ఇంతకు మునుపులా భగవత్ప్రేమతో మళ్ళీ ఉన్మత్తులై పోయారు. భగవత్సాక్షాత్కారం ఇంకా కలుగలేదనే వ్యధతో నేల మీదపడి దొర్లుతూ, నిర్దాక్షిణ్యంగా నేలకేసి ముఖాన్ని రుద్దుతూ, ‘అమ్మా, అమ్మా’ అని దయనీయంగా విలపించేవారు. జనం ఆయన చుట్టూ గుమిగూడి సానుభూతితో, “పాపం! తీవ్రమైన శూలనొప్పితో బాధపడుతున్నాడు కాబోలు. కాకుంటే ఎవరైనా ఇంత అశాంతికి గురౌతారా?” అని పలికేవారు.
కొన్ని సమయాల్లో పూజ చేస్తూ చేస్తూ పువ్వులను తన తలమీద పెట్టుకొని రాతిబొమ్మలా నిశ్చలంగా ఉండిపోయేవారు. మరొక్కప్పుడు పిచ్చివానిలా సాధకులు రాసిన గీతాలు చాలాసేపు పాడుతూ ఉండిపోయేవారు. ఇతర సమయాల్లో సాధారణ స్థితిలో ఉన్నప్పుడు అందరితో మామూలుగానే వ్యవహరించేవారు. కాని జగజ్జనని ధ్యానంలో రోజుకు ఏ ఒకటి రెండు సార్లో కాక తఱచూ, అదీ తీవ్రతరంగా జనించే భావావేశంలో ఆయనకు పరిసరాల స్పృహే ఉండేది కాదు, ఎవరి మాటలూ వినబడేవి కావు. ఎవరికీ జవాబు ఇచ్చే స్థితిలోనూ ఉండేవారు కారు. కాని అటువంటి సమయాలలో కూడ ఆయన దివ్యనైజాన్ని జనులు తరచూ అనుభూతం చేసుకొనేవారు. ఎందుకంటే, అటువంటప్పుడు సైతం ఎవరైనా ‘జగజ్జనని మీద ఒకటి రెండు పాటలు పాడి వినిపించండి’ అని అడగ్గానే, మధుర స్వరంలో పాట పాడనారంభించేవారు. అలా పాడుతూ పాడుతూ పాట భావంలో లీనమై తన్మయులైపోయేవారు.
ఈలోపు ఆలయ చిన్న అధికారులే కాక ప్రధానాధికారియైన కోశాధికారి సైతం శ్రీరామకృష్ణుల ‘అనాచారపు పూజను’ గురించి రాణీ రాస్మణి, మథుర్ బాబులకు ఈ విధంగా ఫిర్యాదు చేశారు: ‘చిన్న భట్టాచార్య’* ప్రతిదీ పాడుచేస్తున్నాడు. కాళీపూజ నైవేద్యాదులేవీ తగిన రీతిలో జరగడంలేదు. అలా అనాచారంగా పూజాదులు జరిగితే తల్లి వాటినెలా స్వీకరిస్తుంది?’ ఇలా ఫిర్యాదు చేసినప్పటికీ ఆలయ అధికారులు ఆశించిన ఫలితం దక్కలేదు. ఎందుకంటే, మథుర్బాబు ఎవరికీ చెప్పాపెట్టకుండా హఠాత్తుగా ఆలయానికి వచ్చి ఎవరికంటా పడకుండా శ్రీరామకృష్ణుల పూజావిధానం గమనించేవాడు. పూజ చేస్తున్నప్పుడు ఒక్కోసారి జగజ్జననితో మారాం చేస్తూ, మరోసారి బ్రతిమిలాడుతూ భక్త్యానందబాష్పాలు స్రవింప చిన్నబిడ్డ వంటి శ్రీరామకృష్ణుల ప్రవర్తనను మథుర్ గమనించాడు. ఆ తరువాత ఆలయ అధికారులకు ఇలా ఆదేశం ఇచ్చాడు: “చిన్న భట్టాచార్య ఎలా చేసినా, ఏమి చేసినా మీరు ఎవరూ అడ్డుపడకూడదు. ఆయనను తప్పుపట్టకూడదు. ఏ విషయమైనా ముందుగా నాకు తెల్పి, నా ఆదేశం మేరకు వ్యవహరించండి.”
రాణీ రాస్మణి కూడ అప్పుడప్పుడు ఆలయానికి వచ్చి తల్లి పుష్పాలంకారాన్ని చూసి, మధుర కంఠంతో శ్రీరామకృష్ణులు పాడే పాటలు విని ఎంత ముగ్ధురాలయ్యేదంటే, ఆమె కాళికాలయానికి వచ్చినప్పుడల్లా చిన్న భట్టాచార్యను జగజ్జననిపై పాటలు పాడమని అర్థించేది. శ్రీరామకృష్ణులు కూడ ఒక వ్యక్తి అభ్యర్థన మేరకు పాడుతున్నాననే విషయం పూర్తిగా మరచిపోయి, జగజ్జనని నిమిత్తమే పాడుతున్నట్లుగా పారవశ్యంతో పాడేవారు. ఆ విధంగా రోజులు దొర్లి పోతున్నాయి. ప్రపంచమనే అతిపెద్ద కుటుంబంలో మాదిరి కాళికాలయమనే చిన్ని కుటుంబంలో సైతం అందరూ స్వకీయ వ్యవహారాలలో మునిగిపోయి కాలం గడుపుతూ, తమ సాంసారిక విధులు, స్వార్థచింతనలన్నీ నెరవేరిన తరువాత కొంచెం తీరికవేళల్లో పరనింద, కట్టుకథలతో తమ విసుగును వదలించుకొని కాలక్షేపం చేసుకు పోసాగారు. అలాంటప్పుడు భగవత్ప్రేమతో చిన్న భట్టాచార్యులలో కలుగుతున్న మార్పులను గమనించే వారెవరు? ‘ఆతడొక పిచ్చివాడు. ఎలాగో యజమానుల చల్లనిచూపు అతడిపై పడింది. అందుచేతనే అతడు ఇంకా ఉద్యోగంలో ఉండగలిగాడు. కాని ఎంతకాలం ఆ ఉద్యోగం నిలుపుకోగలడు? ఒకానొక రోజు ఏదో అనాచారం జరగడం ఖాయం, ఉద్యోగానికి ఉద్వాసనా తప్పదు. పెద్దవారి మనస్తత్వం ఒకే రీతిలో ఉంటుందా ఏమిటి? పొంగిపోవడానికి ఎంతసేపు పడుతుందో మండిపోవడానికీ వారికి అంతేసేపు పడుతుంది.’ శ్రీరామకృష్ణుల గురించి అప్పుడప్పుడు ఆలయ అధికారులు తమలో తాము పై విధంగా మాట్లాడుకొంటూ ఉండేవారు అంతే. శ్రీరామకృష్ణుల మేనల్లుడూ, సేవకుడూ అయిన హృదయ్ అదే సమయంలో కాళికాలయంలో చేరాడు.
8. గురుభావ ఉద్వేగంలో రాణీ రాస్మణిని శిక్షించడం
ఇలావుండగా ఒక రోజు రాణీ రాస్మణి కాళికాలయానికి వచ్చింది. ఆలయ సిబ్బంది అంతా హడావిడిగా ఉన్నారు. సోమరిపోతులు సైతం నాడు తమ విధులను జాగ్రత్తగా నిర్వహించసాగారు. గంగలో స్నానంచేసి రాణి కాళికాలయానికి వెళ్ళింది. అప్పటికే కాళీపూజ, అలంకరణ ముగిశాయి. జగజ్జననికి ప్రణామం చేసి దైనందిన పూజార్థం కాళీప్రతిమ ఎదుట ఆసనం మీద రాణి కూర్చుంది. శ్రీరామకృష్ణులు పక్కనే ఉండడం చూసి జగజ్జననిపై పాడమని ఆయనను కోరింది. రాణికి ప్రక్కనే శ్రీరామకృష్ణులు కూర్చుని దైవపారవశ్యంలో కమలాకాంత్, రామ్‌ప్రసాద్ వంటి సాధకులు రచించిన పాటలు పాడసాగారు. ఒకవంక పూజ, జపం చేస్తూ రాణి ఈ పాటలు వినసాగింది. కాసేపు అలా గడిచాక హఠాత్తుగా శ్రీరామకృష్ణులు పాడడం ఆపి, విసుగ్గా, “ఇక్కడ కూడ ఆ ఆలోచనలేనా?” అని గద్దిస్తూ, అరచేత్తో ఆమె చెంప ఛెళ్ళుమనిపించారు. బిడ్డలు తప్పుచేసినప్పుడు తండ్రి కోపగించుకొని ఏ భావంతో వారిని శిక్షిస్తాడో, సరిగ్గా శ్రీరామకృష్ణులు అప్పుడు అదే భావంలో ఉన్నారు. కాని దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
9. తత్ఫలితం
రాణిని అలా శ్రీరామకృష్ణులు కొట్టడం చూసి ఆలయ సిబ్బంది, రాణి పరిచారికలు గావుకేకలు పెట్టారు. ద్వార కాపలాదారు శ్రీరామకృష్ణులను పట్టుకోవడానికి పరుగెత్తుకొచ్చాడు. ఆలయం నుండి వినవచ్చే కేకలు విని ఆలయ అధికారులు ఉత్కంఠతో అటువైపు రాసాగారు. కాని ఈ గందరగోళానికి ప్రధాన కారకులైన శ్రీరామకృష్ణులు, రాణీ రాస్మణి ఇద్దరూ ఆలయ సిబ్బంది హడావిడిని ఏమీ పట్టించుకోక ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు, ఆత్మలో నిశ్చల మనస్కులై, పెదవులపై దరహాస చంద్రికలు ఉదయిస్తుండగా ప్రశాంతంగా ఉన్నారు. ఇక రాణి? ఆత్మవిశ్లేషణ చేసుకొని చూడగా, తాను ఒక ముఖ్యమైన వ్యాజ్యెపు తీర్పు గురించి ఆలోచిస్తూ ఉన్నదేగాని, జగన్మాతను ధ్యానించడం లేదని గ్రహించింది. ఆమె సిగ్గుపడింది. పశ్చాత్తాపంతో బాధపడసాగింది. శ్రీరామకృష్ణులకు తన ఆలోచన ఎలా తెలియవచ్చిందా అని ఆమె ఆశ్చర్యపోయింది. ఆలయ సిబ్బంది అరుపులకు ఆమె తన ఆలోచనల నుండి బయటపడింది. ఆ అల్పబుద్ధులు అమాయకులైన శ్రీరామకృష్ణులపట్ల దౌర్జన్యంగా ప్రవర్తిస్తారేమోనని భయపడి, “భట్టాచార్య ఏ తప్పు చేయలేదు. ఆయనను తప్పుబట్టవద్దు” అని తీవ్రస్వరంలో వారిని ఆదేశించింది. తన అత్తగారైన రాణి ముఖతా జరిగింది యావత్తూ మథుర్ విని, ఆమె ఆదేశాన్ని సమర్థించాడు. కొందరు ఆలయాధికారులు ఎంతో నిరాశ చెందారు. కాని వాళ్ళు ఏమి చెయ్యగలరు? ‘పెద్దవారి వ్యవహారాలతో మనకేం పని?’ అని భావించి, వాళ్ళు కిమ్మనలేదు. ఈ ఉదంతం చదివినప్పుడు పాఠకుడు బహుశా ఇలా ఆలోచిస్తాడేమో: ‘ఇది ఎటువంటి విచిత్రమైన గురుభావం? మనిషిని కొట్టేటంత విపరీత గురుభావ అభివ్యక్తీకరణా?’
10. చైతన్యుల, ఏసుక్రీస్తు, శ్రీకృష్ణుని జీవితాలలో ఇటువంటి సంఘటనలే జరగడం
అందుకు మా సమాధానం: ప్రపంచ మత చరిత్రను పరికిస్తే అటువంటి సంఘటనలే జగద్గురువులైన అవతారపురుషుల జీవితాలలో నమోదై ఉండడం కనిపిస్తుంది. కాజీని శిక్షించి బుద్ధి గరపడం, గురుభావ పరవశుడై అద్వైత ఆచార్యుని కొట్టి అతడిలో భక్తిభావాన్ని ప్రసారం చేయడం వంటి చైతన్యుల జీవితంలోని సంఘటనలు జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆలోచించి చూస్తే అటువంటి సంఘటనలు ఏసుక్రీస్తు జీవితంలో జరిగి ఉండడం కనిపిస్తాయి.
ఎడమ రాధా గోవిందాలయం, కుడివైపు నటమందిరంతో విరాజిల్లుతున్న దక్షిణేశ్వర కాళికాలయం
శిష్యులతో పరివేష్టితుడైన ఏసుక్రీస్తు జెరూసెలేమ్లోని జెహోవా ఆలయానికి పూజ, బలులు అర్పింప వెళ్ళాడు. కాశీ, బృందావనం మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు హిందువుల మనస్సులలో ఎటువంటి పవిత్ర భక్తిభావాలు ఉదయిస్తాయో, జెరూసలేమ్‌లోని ఆలయాలను దర్శించినప్పుడు యూదులలో సైతం అట్టి భక్తిభావాలే ఉదయిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పైగా అప్పుడు ఏసుక్రీస్తు మనస్సు భావముఖంలో వసిస్తూ ఉంది. కనుక భగవత్ప్రేమతో పూర్తిగా నిండిపోయిన ఏసుక్రీస్తు దూరం నుండి ఆలయాన్ని చూడగానే భగవద్దర్శనార్థం పరుగెత్తాడు. ఆలయం వెలుపల ద్వారం వద్ద, ప్రాంగణంలో అనేకమంది ధన సంపాదన పరులను మోసగించడం మొదలైన లౌకిక వ్యవహారాలలో తలమునకలై ఉన్నారు. తీర్థయాత్రికులకు దైవదర్శనం అయిందో లేదో కూడ వీరు పట్టించుకోవడం లేదు. ఆలయ పూజారులు యాత్రికులనుండి కొంత ధనం గుంజుకోవడంలో శ్రద్ధవహించి ఉన్నారు. దుకాణదారులు పువ్వులు, పళ్ళు, జంతువులు విక్రయించి మరింత లాభం ఎలా ఆర్జించాలో అన్న చింతనలో మగ్నులై ఉన్నారు. పవిత్రమైన ఆలయంలో, భగవంతుని సమక్షంలో ఉన్నామనే సంగతే వారంతా మరిచిపోయారు. కానీ ఆధ్యాత్మిక భావావేశంలో మునిగిపోయి ఉన్న ఏసుక్రీస్తు ఆలయంలోకి ప్రవేశిస్తూన్నప్పుడు వీటిని వేటినీ లక్షించలేదు. ఆయన తిన్నగా లోపలికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకొన్నాడు. ఆలయంలో విరాజిల్లుతున్న పరమాత్ముడే తన హృదయాంతరాళంలో తన ప్రాణానికి ప్రాణంగా, ఆత్మస్వరూపుడిగా ఉన్నాడని అనుభూతి పొందిన ఏసుక్రీస్తు హృదయం దివ్యానందంతో పరవళ్ళు త్రొక్కింది. ఆలయం, ఆలయంలోని వ్యక్తులందరూ, వస్తువులన్నీ తనకు అత్యంత ప్రియమైనవిగా ఆయన భావించసాగాడు. ఎందుకంటే, ప్రియతముని దర్శనం తనకు కలిగింది ఇక్కడకు రావడం చేతనే కదా!
తరువాత మనస్సు ఒకింత క్రింది మెట్టుకు దిగి తన అంతరంగ భావాన్ని బయటి వస్తువులలో, వ్యక్తులలో చూడగోరినప్పుడు ఆయనకు పూర్తిగా విరుద్ధమైనదే కంటబడింది. తన ప్రియతముని సేవించే వారు ఒక్కరు కూడ ఆయనకు కనిపించలేదు. ప్రతి ఒక్కరూ కామకాంచనాలలోనే మగ్నులై ఉన్నారు. నిరాశతో, దుఃఖంతో ఆయన మనస్సు కుంగిపోయింది. ఆయన ఇలా అనుకొన్నారు: ‘ఏమిటిది? బయటకు వెళ్ళినప్పుడు ఇచ్ఛ మేరకు ప్రవర్తించండి. భగవంతుడు విశేషంగా అభివ్యక్తమౌతున్న ఆలయంలో ఈ లౌకిక వ్యవహారాలన్నీ ఎందుకు? ఇక్కడకు వచ్చి కొంతసేపు భగవంతుణ్ణి ధ్యానించి సంసార క్షోభను వదలించుకోవడానికి బదులు ఆ సంసారాన్ని ఇక్కడకు తీసుకురావడం ఎందుకు?’ ఈ విధంగా ఆలోచించిన ఏసుక్రీస్తు మనస్సు కోపంతో నిండిపోగా, ఉగ్రుడై చేత బెత్తం పుచ్చుకొని దుకాణదారులను తదితరులను బలవంతంగా ఆలయంనుండి బయటకు తరిమికొట్టాడు. అప్పుడు వారు కూడ ఏసుక్రీస్తు వచనాలతో తాత్కాలికంగా ఆధ్యాత్మికంగా జాగృతం చెంది, నిజానికి తాము తప్పుడు పనులు చేస్తున్న విషయం గ్రహించి తిరగబడక బయటకు వెళ్ళిపోయారు. కాని కరడు గట్టిన ప్రాపంచికులైన కొందరికి ఆ వచనాలు ఎలాంటి చైతన్యాన్నీ కలిగించక పోవడంతో వారికి బడితెపూజ చేయవలసి వచ్చింది. అప్పుడు వాళ్ళూ వెళ్ళిపోయారు. కాని ఎవరూ ఆ సమయంలో ఏసుక్రీస్తు మీద కోపం పూనలేదు, ఆయనకు హానిచేయ ఎవరూ సాహసించలేదు.
శ్రీకృష్ణుని జీవితంలో కూడా ఇటువంటివే అనేక సంఘటనలు మనకు కానవస్తాయి. ఉదాహరణకు: ఒక వ్యక్తి ఆయన చేతిలో దెబ్బలు తిని, జ్ఞానం పొంది, ఆయనను సాక్షాత్తూ భగవంతునిగా స్తుతించాడు. అలాగే పరమ బద్ధ జీవులు శ్రీకృష్ణునికి కీడుతలపెట్ట వచ్చినప్పుడు ఆయన పలుకులకు, నవ్వుకు విభ్రాంతులై కింకర్తవ్యతా మూఢులయ్యారు. పురాణ సంఘటనలు ప్రస్తుతానికి ఇక చాలు.
11. రాణీ రాస్మణి మహద్భాగ్యం
గురుభావం చేత ప్రేరితులై తమ వ్యక్తిత్వాన్ని పూర్తిగా విస్మరించి శ్రీరామకృష్ణులు ఇతరులతో ఎలా ప్రవర్తించేవారో, ఇతరులకు ఎలా బోధించేవారో అనడానికి పై సంఘటన ఒక చక్కని ఉదాహరణ. లోతుగా ఆలోచించి చూస్తే అదొక సాధారణ సంఘటనగా కనిపించదు. కాకపోతే స్వల్ప వేతనంతో పనిచేస్తున్న నిరర్థక పూజారి ఎక్కడ? ఎవరి సంపద, గౌరవం, తెలివి, సహనం, సాహసం, శక్తి ఆనాటి కలకత్తా మేధావులను సైతం చకితులను చేసిందో ఆ రాణీ రాస్మణి ఎక్కడ? శ్రీరామకృష్ణుల లాంటి పేద బ్రాహ్మణునికి, రాణి సమీపానికి వెళ్ళడమనేది దాదాపు అసాధ్యమైన విషయం అని మనం గ్రహించాలి. ఒకవేళ ఆమె వద్దకు వెళ్ళగలిగినా పొగడ్తలతో ఆమెను ఒకింత ప్రసన్నురాలినిగా చేసుకోగలిగితే తాను తరించినట్లు అతడు భావిస్తాడనే ఊహించుకోవాలి. కాని ఆ సంఘటన అందుకు పూర్తి విరుద్ధంగానే జరిగింది. రాణీ రాస్మణి తప్పును నిరసించడం తోనే ఆగక పైగా ఆమెను కొట్టడం! శ్రీరామకృష్ణుల వైపు నుండి చూస్తే ఇదో పెద్ద ఆశ్చర్యకరమైన విషయమే! మరి రాణి వైపు నుండి చూసినా, అందరి ముందు అలా దెబ్బతిన్నా ఆమె మనస్సులో ఏ రకమైన కోపంగాని, అహంకారంకాని, పగతీర్చుకోవాలనే భావనగాని రాక పోవడం ఎంతో ఆశ్చర్యకరం. కాని ఇంతకు మునుపే మేం తెలిపినట్లు స్వార్థగంధరహితమైన ‘విరాట్ అహంకారం’ మహాపురుషుల మనస్సులలో అటువంటి గురుభావంగా అభి వ్యక్తమైనప్పుడు ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా సామాన్యులు వారి ముందు తలొగ్గవలసిందే. అలా అయినప్పుడు భక్తురాలు, సాత్త్విక స్వభావురాలు అయిన రాణి విషయం గురించి వేరేగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే, సామాన్యంగా స్వార్థచింతనలతో నిబద్ధమై ఉండే సామాన్యుల మనస్సులు కూడ ఆ మహాపురుషుల కృపతో, శక్తితో ఉన్నత స్థాయికి చేరుతాయి కనుక. ఆ స్థితిలో మహాపురుషుల ఆదేశానుసారం చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఈ బద్ధజీవులకు ఉండదు. మళ్ళీ, శ్రీరామకృష్ణులు ఇలా చెబుతూ ఉండేవారు: “భగవంతుని విశేషాంశం అతడిలో లేకుంటే మనిషి దేనిలోనూ ఘనత వహించలేడు. కీర్తిప్రతిష్ఠలు, అధికారం, పదవి మొదలైన వాటిని జీర్ణించుకోలేడు.* ” సాత్త్వికగుణ సంపన్నురాలైన రాణీ రాస్మణిలో భగవంతుని విశేషశక్తి ఉండడంచేతనే శ్రీరామకృష్ణులు అలా ఆమెను కఠినంగా శిక్షించినా గురుభావ అభివ్యక్తీకరణ వలన ఆయన అనుగ్రహం పొందగలిగింది. గురుదేవులు ఆమెను గురించి ఇలా చెప్పేవారు: “రాణీ రాస్మణి జగజ్జనని అష్టనాయికలలో (పరిచారికలలో) ఒకతె. జగజ్జనని ఆరాధనను వ్యాప్తిచేయడానికే ఆమె ఈ లోకంలో జన్మించింది. కాబట్టే జమీనుకు చెందిన వ్యవహార ఉత్తర ప్రత్యుత్తరాల మీద వేయడానికి చేయించిన ముద్ర మీద ‘కాళీపదాభిలాషిణి, రాస్మణి దాసి’ అని చెక్కబడి ఉంది. రాణి ప్రతి పనిలోనూ జగన్మాత పట్ల ఆమెకు గల అచంచల భక్తి అభివ్యక్తమయ్యేది.”
12. భగవల్లీనమైన మనస్సు లక్షణాలు
మరో విషయం ప్రస్తావించాలి. భగవంతునిలో పరిపూర్ణంగా విలీనమైన మనస్సు వివిధ భావాలను అభివ్యక్తం చేస్తుంది. శంకరాచార్యులు వివేక చూడామణిలో దీనిని మనోహరంగా అభివర్ణించారు:
దిగంబరో వాపి చ సాంబరో వా త్వగంబరో వాపి చిదంబరస్థః ।
ఉన్మత్తవద్వాపి చ బాలవద్వా పిశాచవద్వాపి చరత్వవన్యామ్॥ 540 ॥
భగవద్దర్శనం లేదా ఆత్మసాక్షాత్కారం పొంది సిద్ధులైన జీవన్ముక్తులు జ్ఞానవస్త్రంతో అంటే దిగంబరంగానో లేక సామాన్యులలా వస్త్రాలు ధరించో లేదా (పులి లేదా జింక) చర్మ ధారులుగానో, పిచ్చివారిలాగానో లేదా కామకాంచనాలంటే తెలియని పసిబిడ్డలలాగానో, లేకుంటే శౌచాశౌచ వివర్జితులైన పిశాచాలలాగానో ఈ పృథివిలో స్వేచ్ఛగా విహరిస్తూవుంటారు.
13. జగద్గురువుల ప్రవర్తనను అవగతం చేసుకోవడంలోని జటిలతకు హేతువు
జగద్గురువులైన మహాపురుషులు సదా విరాట్ అహంకారంతో తాదాత్మ్యులై ఉండడం చేతనే సామాన్యుల దృష్టిలో వారి ప్రవర్తన ఆ విధంగా కనబడుతూ ఉంటుంది. కాని అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేయగల భగవంతుని గురుభావం విశేషంగా అభివ్యక్తమయ్యేది వీరి ద్వారానే. ఎందుకంటే, క్షుద్ర స్వార్థాహంకారం నశించినప్పుడే జగద్వ్యాపియైన విరాట్ అహంకారం, దానితో బాటు లోకకల్యాణం ఒనరించగల గురు భావం అభివ్యక్తమౌతుందనే విషయం ఇంతకు క్రితమే మేం తెలిపివున్నాం. భగవత్సాక్షాత్కార సంపన్నులైన ఈ మహాపురుషులలో కొందరు మళ్ళీ* భగవత్సంకల్పంతో గురువు లేదా ఋషి పదవులను అలంకరిస్తారు. ఇతరులకు బోధించడమనే ప్రయోజనం సాధింప ఇటువంటివారు సామాన్యులలా ధార్మిక ఆచరణలో గొప్ప నిష్ఠావంతులై ఉన్నట్లు, అధర్మాచరణాన్ని తీవ్రంగా నిరసించేవారైనట్లు ‘కానవస్తారు.’ కాబట్టే అధర్మాచరణ పట్ల క్రోధం, సదాచరణపట్ల ప్రగాఢానురాగం, నిష్ఠ, సంయమనం, వాదనాపటిమ, శాస్త్రపాండిత్యం – ఈ సద్గుణాలు పరిస్థితుల మేరకు ఈ గురుసత్తములలో అభివ్యక్తమౌతూ ఉంటాయి.* అయితే ‘కానవస్తారు’ అని అనడానికి కారణం ఏమిటంటే, నిజానికి ఈ మహాపురుషులు సర్వదా ‘ఏకమేవాద్వితీయం’ అయిన బ్రహ్మంలో ఐక్యమై ఉంటారు కనుక. అటువంటప్పుడు వారు మంచి చెడు, ధర్మం అధర్మం, పాపం పుణ్యం, జ్ఞానం అజ్ఞానం మొదలైన మాయ ఆవరణానికి చెందిన ద్వంద్వాలన్నిటికీ అతీతులై ఉంటారు. వారి దృష్టికి జగత్తు యావత్తూ బ్రహ్మమయంగానే గోచరిస్తుంది. అయినప్పటికీ ఇతరులకు మాయ ఆవరణనుండి బయటపడే మార్గం చూపడం నిమిత్తమే వారు ఆయా సద్గుణాదులను అవలంబిస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. సామాన్య గురువులు లేదా ఋషులు కూడ ఇతరుల శ్రేయస్సుకై తమ కాలాన్ని ఇదే రీతిలో గడుపుతూ ఉంటారంటే, అవతారపురుషుల విషయం ఇక చెప్పాలా? కాబట్టే వారిని గుర్తించడం, వారి ప్రవర్తనను అవగతం చేసుకోవడం సామాన్యులకు ఎంతో కష్టం. ప్రత్యేకించి ఆధునిక యుగంలో అవతరించిన శ్రీరామకృష్ణుల స్వభావం, ప్రవర్తనలను అవగాహన చేసుకోవడం మరీ కష్టం. అందుకు కారణం, గత యుగాలలో అవతరించిన ఏ మహాపురుషులను గురించి శాస్త్రాలు ప్రస్తావించాయో (అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మొదలైనవారు) వారిలో బాహాటంగా అభివ్యక్తమైన ఘనత, శక్తి, వైభవం ఇత్యాదులు శ్రీరామకృష్ణులలో గుప్తంగా మాత్రమే అభివ్యక్తమవడమే. అందుచేతనే ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి, ఆయన అనుగ్రహం పొందిన నిజమైన సత్యాన్వేషకులకు తప్ప, ఏదో రెండు మూడు పర్యాయాలు ఆయనను దర్శించి ఏదో పైపై పరిచయం మాత్రం ఉన్నవారికి శ్రీరామకృష్ణులలో నిక్షిప్తమైన మహాశక్తి గురించి తెలియవచ్చేది కాదు.*
వితర్కించి చూడు: ఆయనలో ఏ బాహ్యగుణం చూసి ఆయన పట్ల నువ్వు ఆకర్షితుడవవుతావు? పాండిత్యమా? ఆయన దాదాపు నిరక్షరాస్యులు. అయినా ఏకసంథాగ్రాహి కావడం వల్ల వేదవేదాంతాది శాస్త్రాలు ఆలకించి వాటిని పూర్తిగా అవగతం చేసుకొని తాపీగా కూర్చున్నారనే విషయం నీకు (బయటినుండి చూస్తే) ఎలా అర్థమౌతుంది? మేధావిగానైనా కనిపిస్తారా? లేదు. ఎవరి నోటి వెంట సదా, “నాలో ఏ ఘనతాలేదు. నాకు ఏమీ తెలియదు. అమ్మకు సర్వం తెలుసు” అనే వచనాలు మాత్రమే వెలువడతాయో, అటువంటవ్యక్తితో ఏ సంప్రతింపులు చేయగలవు? ఒకవేళ ఏదైనా సలహా అడిగినా, ‘అమ్మని అడుగు, అమ్మే నీకు తెలుపుతుంది’ అని చెప్పేవారు. ఆయన మాటలపట్ల విశ్వాసంతో ఆయన చెప్పినట్లు చేస్తావా? చెయ్యవు. బహుశా ఇలా యోచిస్తావేమో: ‘ఇదికూడ ఒక సలహాయేనా ఏమిటి? భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, నిరాకారుడు, చైతన్యస్వరూపుడు, తన ఇచ్ఛ మేరకు మనకు జ్ఞానం, ప్రతి విషయం గురించిన అవగాహన ప్రసాదించగలడని మనమంతా కథామాల, బోధోదయ* వంటి పుస్తకాలను చదివినప్పటి నుండి వింటూనే ఉన్నాం. అయినా ఆ సలహా పాటిస్తే పని అవుతుందా? అట్లే సంపద, పేరు ప్రఖ్యాతిని బట్టి ఆయనను అంచనా వేస్తావా? శ్రీరామకృష్ణులకు ఇవన్నీ సమృద్ధిగానే* ఉన్నాయి. వాటినన్నిటినీ పరిత్యజించమనే మొదటి నుండి నీకు ఉపదేశిస్తారు. ప్రతి విషయంలో ఇంతే – బయటి నుండి ఆయనను గుర్తించడం అసాధ్యం. కాబట్టి ఆయనను అంచనా వేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆయన పవిత్రతను, భగవద్భక్తిని, ప్రేమను చూసి వాటిచే నువ్వు ఆకర్షింపబడితే సరి. లేకుంటే నీకు ఆయనను అవగతం చేసుకోవడం నిన్ను మించిన పనే అవుతుంది. అందుచేత రాణీ రాస్మణి ఆ విధంగా కఠినశిక్ష ద్వారా అభివ్యక్తమైన శ్రీరామకృష్ణుల గురుభావాన్ని అభిమానం, అహంకారంతో త్రోసిరాజనక తన హృదయంలో పాదుగొలుపుకోవడం ఆమె మహద్భాగ్యంగా మేం పేర్కొంటాం.