అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ ।
పరం భావమజానన్తో మమ భూతమహేశ్వరమ్ ॥ –భగవద్గీత 9.11
సర్వభూత మహేశ్వరుడనైన నా పరతత్త్వం ఎరుగక, మానవ రూపంలో అవతరించిన నన్ను (చూసి) మూర్ఖులు అలక్ష్యబుద్ధితో చూస్తారు.
1. చిన్ననాటి నుంచే శ్రీరామకృష్ణులలో గురుభావం అభివ్యక్తీకరణ
చిన్ననాటి నుండి శ్రీరామకృష్ణులలో గురుభావం అభివ్యక్తమవ్వడం మనకు కానవస్తుంది. అయినా యౌవనంలో నిర్వికల్ప సమాధి పొందిన తదనంతరమే ఆ గురుభావం పరిపూర్ణంగా అభివ్యక్తం అయిందన్న విషయం అంగీకరింపక తప్పదు. శ్రీరామకృష్ణుల ఘనతను అతిశయింపచేసే ఉద్దేశంతో పై వాస్తవాన్ని మేం అతిశయోక్తిగా వెల్లడిస్తున్నామని ఎవరూ భావించరాదు. శ్రీరామకృష్ణుల జీవితాన్ని నిష్పాక్షికంగా విమర్శనాత్మకంగా అధ్యయనం చేసిన వారికి ఈ విషయం స్పష్టమౌతుంది. శ్రీరామకృష్ణుల జీవిత అద్భుత సంఘటనలను తన విమర్శనాత్మక శక్తి మేరకు అధ్యయనం చేసిన ఏ వ్యక్తికైనా సరే, ఆయనను అంచనా వేయడంలో అతడి నిర్ణయాత్మకశక్తి దిగ్భ్రమ చెందడం, మొద్దుబారడం తెలియవస్తుంది. మాలో అనేకులం సంశయించి శ్రీరామకృష్ణులను ఎంత విమర్శనాత్మక దృష్టితో పరీక్షించామంటే, ప్రస్తుతకాలంలో అనేకులకు బహుశా ఆ విధంగా పరీక్షించాలనే ఊహ సైతం తట్టదేమో! ఆ విధంగా మాలో అనేకులం పరీక్షించబోయి ఓటమి చవిచూసి, సిగ్గుతో తలలు వంచుకొన్న సందర్భాలు కోకొల్లలు. ఈ విషయాన్ని ఒకింత చూచాయగా పాఠకుడికి రెండవ అధ్యాయంలో తెల్పేవున్నాం, ఇకమీదట మరింత తెలుపనున్నాం. అప్పుడు పాఠకుడు, తానే స్వయంగా నిర్ణయించుకోగలడు.
2. ‘మొదట ఫలములు, పండ్లు పిదప పువ్వులు’ –ఇదే ప్రతి అవతార పురుషుల విశిష్టత
నిత్యముక్తులైన ఈశ్వరకోటుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులు, “సొర, గుమ్మడి వంటి తీగమొక్కలలో మొదట కాయలు తరువాత పువ్వులు” అని వచించేవారు. ఈ మాటలకు వివరణ – ఈశ్వరకోటులు ఆధ్యాత్మిక జీవితంలో సిద్ధిపొంద అనుష్ఠించే సాధనలన్నీ స్వప్రయోజనం నిమిత్తం కాదు – ఇతరులకు చూపడానికే! అంటే ఎవరైనా ఆధ్యాత్మిక జీవితంలో సిద్ధి పొందగోరితే తమలా వారూ అట్టి సాధనలు అనుష్ఠించి తీరాలి. ఈ మహాత్ముల జీవితాలను క్షుణ్ణంగా పరికిస్తే ఒక విషయం స్పష్టమౌతుంది. అదేమంటే – దేనిని పొంద వారంత కఠోర సాధనను అనుష్ఠిస్తారో ఆ పరిపూర్ణజ్ఞానం కలిగిన జ్ఞానులు ఎలా వర్తిస్తారో వీరూ చిన్ననాటి నుండే ప్రతి విషయంలోనూ అట్లే ప్రవర్తించడం. వారిని చూస్తే జన్మతః వారికి ఈ జ్ఞానం ఉన్నదని అనిపిస్తుంది. అవతారపురుషుల కంటే ఒక మెట్టు క్రింది శ్రేణికి చెందిన నిత్యముక్తులు లేదా ఈశ్వరకోటుల విషయంలో ఇది సత్యమైనప్పుడు ఇక అవతారపురుషులకు ఆ జ్ఞానం చిన్ననాటి నుండి సహజంగానే ఉంటుందని చెప్పడం అనవసరం. అట్టి జ్ఞానం వారి జీవిత పర్యంతం అభివ్యక్తమవ్వడం చూడవచ్చని శాస్త్రాలు పేర్కొంటాయి. విభిన్న యుగాలకు చెందిన అవతారపురుషులందరిలోను మనకొక గొప్ప సాదృశ్యం కానవస్తుంది. ఉదాహరణకు, స్పర్శ మాత్రంచేత ఇతరులలో ఆధ్యాత్మికతను మేలుకొల్పడం ఏసుక్రీస్తు, చైతన్యమహాప్రభువు, శ్రీరామకృష్ణుల జీవితాలలో మనం చూడగలం. ఇదే విధంగా వారి జీవితాలలో అట్టి అనేక సంఘటనలు మనం చూడవచ్చు. అవతారపురుషుల ఆగమన వార్త కొందరు సత్పురుషులకు అలౌకికంగా ముందుగా తెలిసివచ్చేది. బాల్యం నుండే వారిలో గురుభావం అభివ్యక్తం అయ్యేది. కారుణ్యంతో తాము ఇలలో అవతరించడం సామాన్య జీవుల ఆధ్యాత్మికోన్నతికై విశేష సాధన మార్గాలు చూపడానికే అన్న విషయాన్ని వారు చిన్నతనం నుండి ఎరిగేవుంటారు. ఇలాంటి సాదృశ్యాలు ఎన్నో వీరిలో మనకు కానవస్తాయి. కాబట్టి చిన్నతనంనుండే శ్రీరామకృష్ణుల జీవితంలో గురుభావం అభివ్యక్తమై ఉందన్న సంగతి విన్నప్పుడు ఎవరూ ఆశ్చర్యపోనవసరంలేదు. వారంతా ఒక విశిష్ట శ్రేణికి చెందినవారు. సామాన్యుల జీవితాలలో అట్టి సంఘటనలు అసంభవం కనుక ఈ అవతారపురుషుల జీవితాలలో సైతం అలాంటివి సంభవించవని భావించడం పెద్ద పొరపాటే అవుతుంది.
3. శ్రీరామకృష్ణులలో గురుభావ ప్రథమ అభివ్యక్తీకరణ
శ్రీరామకృష్ణుల జీవితంలో గురుభావ ప్రథమ అభివ్యక్తీకరణకు ఒక ఉజ్జ్వల నిదర్శనం ఆయన జన్మస్థలమైన కామార్పుకూర్లో మనకు కానవస్తుంది. అప్పటికి వారికి ఉపనయనం అయింది కనుక ఆయన వయస్సు అప్పుడు తొమ్మిది లేక పదేళ్ళు ఉండవచ్చు. ఆ సమయంలో గ్రామ జమీందార్లయిన లాహాల ఇంట్లో శ్రాద్ధకర్మ సందర్భంగా ఆ ప్రాంతపు ప్రసిద్ధ పండితులు ఆహ్వానితులై వచ్చారు. అంతమంది పండితులు ఒకచోట సమావేశమైనప్పుడు వారి మధ్య తీవ్ర శాస్త్రవివాదం సహజంగానే చెలరేగింది. ఒక ప్రత్యేక శాస్త్రాంశం గురించి వారు ఎలాంటి నిర్ణయానికీ రాలేకపోయినప్పుడు బాల గదాధర్ (శ్రీరామకృష్ణులు) తానెరిగిన ఒక పండితుణ్ణి, “ఈ వాదాంశాన్ని ఇలా నిర్ధారించవచ్చునేమో!” అని సూచించాడు. ఆ గ్రామ బాలురు పలువురు కేవలం ఉబలాటంతో మాత్రమే అక్కడకు వచ్చారు. అంగవిన్యాసాలతో పండితులు గోలగోలగా చేస్తూన్న వాగ్వాదం పిసరంత కూడా వారికి అర్థంకాలేదు. కొందరు బాలురు ఇదంతా ఎగతాళిగా భావించి నవ్వసాగారు. మరికొంతమంది బాలురు పండితుల అంగవిన్యాసాలను అనుకరిస్తూ గోలచేయసాగారు. మరికొందరు ఇదేమీ పట్టించుకోక ఆటపాటల్లో మునిగిపోయి ఉన్నారు. అలాంటప్పుడు ఈ అసాధారణ బాలుడు పండితుల వాదోపవాదాలన్నిటిని శ్రద్ధగా ఓపిగ్గా విని, అంతా అర్థంచేసుకొని ఒక చక్కని నిర్ణయానికి రావడం చూసి ఆ పండితుడు ఎంతమాత్రమూ ఆశ్చర్యపోలేదు. తరువాత ఈ పండితుడు గదాధర్ నిర్ణయాన్ని తనకు తెలిసిన ఇతర పండితులకు తెలిపాడు. తమ వివాదాంశానికి అదొక్కటే వీలైన పరిష్కారం అని గ్రహించి దాన్ని తక్కిన వారికి విశదపరిచారు. తరువాత వారంతా తాము చర్చిస్తున్న వివాదాంశానికి ఇదే యుక్తాయుక్త పరిష్కారమని ఏకగ్రీవంగా అంగీకరించి, ఆ పరిష్కారం సూచించిన వివేకి ఎవరా అని ఆరాతీయసాగారు. ఆ పరిష్కారం సూచించినది బాలగదాధర్ అని వాళ్ళకు తెలియవచ్చినప్పుడు ఆ పండితులలో కొందరు ఆశ్చర్యచకితులై ఆ బాలుడు దైవీశక్తి సంపన్నుడని భావిస్తూ అతణ్ణే తదేకంగా చూడసాగారు. మరికొందరు పరమానందంతో అతణ్ణి తమ ఒళ్ళోకి తీసుకొని ఆశీర్వదించసాగారు.
4. ఏసుక్రీస్తు జీవితంలో జరిగిన ఇటువంటి సంఘటన
పై విషయంగా మరికొంత చర్చించడం అవసరం. క్రైస్తవమత స్థాపకుడు, అవతారపురుషుడు అయిన ఏసుక్రీస్తు జీవితంలో ఇటువంటి సంఘటనే ఒకటి జరగడం బైబిల్లో* కానవస్తుంది. ఏసుక్రీస్తు అప్పుడు పన్నెండేళ్ళ వయస్కుడు. పేదలైనా, భగవద్భక్తి పరాయణులైన అతడి తల్లితండ్రులు మేరీ, జోసెఫ్‌లు అతణ్ణి తోడ్కొని ఇతర యాత్రీకులతో కలిసి గెలిలీ మండలంలోని తమ స్వగ్రామం నజరెత్ నుండి జెరూసలేమ్‌లోని ప్రసిద్ధ ఆలయానికి పోయి భగవద్దర్శనం చేసుకొని, పూజ, బలులు అర్పించే ఉద్దేశంతో కాలినడకన బయలుదేరారు. యూదుల తీర్థయాత్ర సరిగ్గా హిందువుల తీర్థయాత్రలాగానే ఉంటుంది. యూదీయ భక్తులు బంగారు పెట్టెలో ఉంచబడిన ‘జెహోవా’ దేవుణ్ణి దర్శించుకొని తాము తరించినట్లు భావిస్తారు. దేవునికి వారు సాంబ్రాణి ధూపాలు అర్పించి, పువ్వులు, పళ్ళు, దుంపలు నైవేద్యంగా సమర్పించి, గొర్రెలు, పావురాలు వంటి జంతువులను బలి ఇస్తారు. కామాఖ్య, వింధ్యవాసిని వంటి పుణ్యతీర్థాలలో పావురాలు మొదలైన పక్షులను బలి ఇవ్వడం హైందవులలో నేటికీ ప్రచలితమే.
5. ఆనాటి యూదుల తీర్థయాత్ర
ఆరాధన, నివేదనలు, బలులు ఇవ్వడం పూర్తిచేసుకొని తోటి యాత్రీకులతో మేరీ, జోసెఫ్‌లు స్వగ్రామానికి బయలుదేరారు. ఆ కాలంలో వివిధ ప్రాంతాల నుండి జెరూసెలేమ్కు తీర్థయాత్ర చేసేవారి పరిస్థితి చాలావరకు మన దేశంలోని పరిస్థితులలాగే – అంటే రైలుమార్గాలు నిర్మించడానికి పూర్వం పూరీ మొదలైన పుణ్యక్షేత్రాలకు కాలినడకన వెళ్ళే యాత్రీకుల పరిస్థితిలానే ఉండేది. సుదీర్ఘమైన ఇరుకైన బాటలో అక్కడక్కడ చెట్లు, చెరువులతో శోభాయమానం చేసే స్థలాలు, వండుకొని తిని విశ్రమింప అక్కడక్కడ వెలసిన కొదవలేని సత్రాలు, దర్శనం చేయింప యాత్రీకుల వెంటబడి పీడించే పండాలు, బియ్యం, పప్పు మొదలైన నిత్యావశ్యక సరుకులు విక్రయించే అంగళ్ళు, దుమ్ము ధూళి, ఆదమరచి నిద్రించే యాత్రీకులను లేపి భగవంతుణ్ణి జ్ఞప్తికి తెచ్చే ఆ యాత్రీకుల ఆప్తమిత్రులైన దోమల గుంపులు, బందిపోటు దొంగల నుండి రక్షించుకొంటూ పరస్పరం సహాయం చేసుకోవడం కోసం యాత్రీకులు అనేకమంది పెద్ద సమూహంగా చేరి పయనించడం, చివరకు అచంచల విశ్వాసం, శరణాగతి – ఈ విధంగా భారతదేశంలో తీర్థ యాత్రలు ఎలా జరిగేవో అక్కడ కూడా ఆనాడు అట్లే జరిగేవి.
6. జెహోవా ఆలయంలో ఏసుక్రీస్తు శాస్త్రాలను విశదీకరించడం
ఏసుక్రీస్తు తల్లితండ్రులు తోటి యాత్రీకులతో అలా తిరిగి వస్తున్నప్పుడు అతడు తమతో లేకపోవడం గమనించి బహుశా తోటి యాత్రీకుల పిల్లలతో అతడు వెనుకబడి వస్తున్నాడనుకొన్నారు. కాని చాలాదూరం పయనించాక కూడా కుమారుడు కనిపించకపోవడంతో వాళ్ళు ఎంతో ఆందోళన చెంది, ఆ జనసమూహంలో వెతకసాగారు. ఆ సమూహంలో అతడు లేడని నిర్ధారణ చేసుకొన్నాక వాళ్ళు ఆతురతతో మళ్ళీ వెనక్కు జెరూసలేమ్‌కు వెళ్ళారు. అక్కడ పలుచోట్ల వెతికారు కాని కుమారుడి జాడ తెలియలేదు. చివరికి వాళ్ళు జెహోవా దేవాలయంలోకి వెళ్ళారు. అక్కడ ఏసుక్రీస్తు ఒకచోట పండితులైన సాధకుల నడుమ కూర్చుని శాస్త్రచర్చలో నిమగ్నుడై కనిపించాడు. పండితులకు సైతం పరిష్కారంకాని జటిల శాస్త్రాంశాలకు కనీవినీ ఎరుగని రీతిలో, అతిసరళంగా వివరణనిస్తూ వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు.
7. మాక్స్ ముల్లర్ దృక్పథ ఖండనం
మహాపండితుడైన మాక్స్ ముల్లర్ తాను రాసిన ‘శ్రీరామకృష్ణుల జీవితం – ఉపదేశాలు’ అన్న పుస్తకంలో పైన పేర్కొన్న ఏసుక్రీస్తు జీవిత సంఘటనలాంటిదే శ్రీరామకృష్ణుల జీవితంలో సంభవించడం గురించి సందేహం వెలిబుచ్చాడు. అంతటితో ఆగక ఆంగ్లం తెలిసిన శ్రీరామకృష్ణుల శిష్యులు తమ గురువు ఘనతను ద్విగుణీకృతపరచ ఏసుక్రీస్తు బాల్యజీవిత సంఘటనను, శ్రీరామకృష్ణుల జీవితంలో ప్రవేశపెట్టారని సంకుచితంగా వ్యాఖ్యానించాడు. మాక్స్ ముల్లర్ పాండిత్యం, మేధస్సు గణనీయమైనవే అయినప్పటికీ, మేం ఆయనతో ఏకీభవించలేక పోతున్నాం. ఈ విషయాన్ని విస్తరింపదలచలేదు. పైన చెప్పిన శ్రీరామకృష్ణుల బాల్యజీవిత సంఘటన గురించి కామార్పుకూర్లోని వయోవృద్ధులనుండి, శ్రీరామకృష్ణుల ముఖతా పలుమార్లు మేం ఈ విషయం విని ఉన్నాం అని మాత్రం చెప్పదలచాం.
8. శ్రీరామకృష్ణులు వివాహం ఎందుకు చేసుకొన్నారు? బంధువులు కోరినందుకా? కాదు
శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు ఆయన వివాహం ఎందుకు చేసుకొన్నారనే ప్రశ్న తలెత్తుతుంది. భార్యతో దాంపత్య సుఖం ఏనాడూ పొందగోరని వ్యక్తి అసలు ఎందుకు వివాహం చేసుకోవాలి? అందుకు కారణం కనుగొనడం ఎంతో కష్టం. యౌవనంలో ప్రవేశించగానే సదా భగవంతుని చింతనలో ఉండిపోవడం చేత ఆయన దాదాపు పిచ్చివారే అయ్యారు. అందుకు విరుగుడు వివాహమే అనుకొని బంధువులు ఆయన సంకల్పానికి విరుద్ధంగా వివాహం జరిపించారన్న సూచన సబబుగా కనిపించడం లేదు. చిన్ననాటి నుండి ఆయన సంకల్పానికి విరుద్ధంగా, ఎంత స్వల్పకార్యాన్ని అయినా ఆయనతో ఎవరూ చేయించగలిగేవారు కారు. పైగా ఆయన ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఏదో రకంగా దాన్ని చేసి తీరేవారు. ఉపనయన సమయంలో ధని అనే కమ్మరి కులానికి చెందిన స్త్రీని భిక్షామాతగా ఎంచుకోవడం ఇందుకొక ఉదాహరణ. కలకత్తాలో మాదిరి సామాజిక నియమ నిబంధనలు కామార్పుకూర్ లాంటి గ్రామాలలో అంతగా సడలి ఉండలేదు. అందుచేత ఎవరూ తమ సంకల్పం, ఇష్టం మేరకు ఏదీ చేయగలిగేవారు కాదు. శ్రీరామకృష్ణుల తల్లితండ్రులు పూర్వాచారపరాయణులు, ఉపనయన సందర్భాన ఒక బ్రాహ్మణస్త్రీనే భిక్షామాతగా ఎంచుకోవాలనే వంశాచారం ఒకటి ఉండనే ఉంది. అందుచేత ఒక కమ్మరి స్త్రీ నుండి ప్రథమ భిక్షను పరిగ్రహించరాదని కుటుంబ పెద్దలందరూ ప్రతిఘటించారు. కాని గదాధర్ పట్టుదల ముందు ఈ వ్యతిరేకత అంతా నీరుగారిపోయింది. ధని భిక్షామాత అయింది. అక్కడ వారి సంప్రదాయాలను బట్టి చూస్తే ఈ విషయం చాలా ఆశ్చర్యకరమైనదే. ప్రతి విషయంలోను ఇలాగే జరిగింది. శ్రీరామకృష్ణుల సంకల్పం, మాట ప్రతి విషయంలోను ఇతరుల ఆకాంక్ష, సంకల్పాలను త్రోసిరాజన్నాయి. అలాంటప్పుడు వివాహం అనే జీవితంలోని అతిప్రధాన ఘటన కేవలం బంధువుల ప్రోద్బలం కారణంగా నిరాక్షేపణీయంగా సమ్మతించారనడం ఎలా పొసగుతుంది?
9. సుఖీంచాలనే ఆకాంక్ష వలనా? కాదు
మళ్ళీ ఇలా అని కూడా చెప్పవచ్చు: “భగవదనురాగం చేత సమస్తాన్ని పరిత్యజించాలనే భావన చిన్ననాటి నుండి ఆయనలో ఉన్నదనే విషయాన్ని అంగీకరించవలసిన అవసరం ఏముంది? సామాన్యులలా వివాహం చేసుకొని సుఖీంచాలనే ఆకాంక్ష మొదట్లో శ్రీరామకృష్ణులకు ఉండి ఉండవచ్చు. కాని యౌవ్వనంలో అడుగిడగానే హఠాత్తుగా ఆయన మనస్సులో ఒక విప్లవాత్మకమార్పు జనించి ఉండవచ్చు. సంసారంపట్ల విరక్తి, భగవంతునిపట్ల అనురక్తి తుఫానులా ఆయన హృదయంలో చెలరేగి, ఆయన పథకాలను, ఆకాంక్షలను ధ్వంసంచేసి ఉండవచ్చు. కాబట్టి భగవత్ప్రేమ అనే ఈ ప్రచండ ఝంఝామారుతం చెలరేగడానికి పూర్వమే శ్రీరామకృష్ణుల వివాహం జరిగిపోయిందని చెబితే ఆక్షేపణలన్నీ సహజంగానే తొలగిపోతాయి.”
10. శ్రీరామకృష్ణులే స్వయంగా వధువు నా కోసం వేచి ఉందని చెప్పడం
ఈ వివరణ యుక్తియుక్తంగా కనిపిస్తున్నప్పటికీ ఈ వైఖరిలో కొన్ని తప్పని నిరూపించే అధిక్షేపాలు ఉన్నాయి. మొదటిది: శ్రీరామకృష్ణుల వివాహం ఆయన ఇరవై నాలుగవ ఏట జరిగింది. అప్పటికే పరిత్యాగ తుఫాను ఆయన హృదయంలో తీవ్రంగా చెలరేగుతూన్నది. ఎవరు జీవితాంతం తమ నిమిత్తం ఇతరులకు కించిత్తయినా కష్టం కలిగింప వెనుకాడేవారో అటువంట వ్యక్తి తనను వివాహం చేసుకొన్న ఆడపిల్ల జీవితాంతం కష్ట పడుతుందని బాగా ఎరిగి కూడా ఆలోచనారహితంగా ఆమెను వివాహమాడడానికి ముందంజ వేసివుండడం అసంభవం. రెండవది: లోతుగా ఆలోచించి చూసినప్పుడు శ్రీరామకృష్ణుల జీవితంలో ఉద్దేశరహితంగా ఏ కార్యమూ జరుపబడలేదని మనకు అవగతమౌతుంది. మూడవది: తమ ఇష్టప్రకారమే వివాహం చేసుకోవడం రూఢీయైన విషయమే. అందుకు కారణం వధువు కోసం వెతుకుతున్నప్పుడు ‘తన వివాహం జయరామ్బాటిలోని శ్రీరామచంద్ర ముఖోపాధ్యాయుని కుమార్తెతో జరగడం దైవనిర్ణయం’ అని ఆయన హృదయ్‌కు, తమ కుటుంబంలోని అందరికీ వెల్లడించడమే. పాఠకుడు ఈ విషయం విని ఆశ్చర్యపోవచ్చు లేదా నమ్మలేక ఇలా అనవచ్చు: “నమ్మరాని విషయాలు ఇలా కల్పించి చెప్పవచ్చా! ఇరవయ్యో శతాబ్దంలో ఈ కథనాలు అంగీకారయోగ్యాలా?” అందుకు మా జవాబు: “మీరు నమ్మినా నమ్మకపోయినా అది యథార్థమే. దీన్ని ఋజువుపరచేవారు పలువురు ఇప్పటికీ జీవించే ఉన్నారు. మీరెందుకు కాస్త విచారించి తెలుసుకోరాదు?” వధువు కోసం వెతుకుతున్న బంధువులకు నచ్చిన వధువు ఎక్కడా లభించకపోవడంతో, ఫలానా గ్రామంలో ఫలానావారి పిల్లను వెళ్ళి చూడండి. ఈ ఉద్దేశంతోనే ఆమె ‘గడ్డిపరకతో గుర్తించబడి ఉంది’* అని స్వయంగా ఆయనే వారితో చెప్పారు. కనుక తనకు వివాహం జరుగుతుందన్న విషయం ఆయనకు తెలుసన్నది స్పష్టం. అంతేకాక తమ వివాహం ఎక్కడ, ఎవరి కుమార్తెతో జరుగనున్నదో ఆయనకు తెలుసు అన్న విషయం ఇందుమూలంగా స్పష్టమౌతున్నది. అందుచేతనే ఆయన దానికి ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. భావసమాధి స్థితిలో ఆయన ఈ విషయం తెలుసుకొన్నారని మనం గ్రహించాలి.
11. శ్రీరామకృష్ణుల వివాహం ప్రారబ్ధకర్మను అనుభవించడానికా? కాదు
అలా అయితే శ్రీరామకృష్ణుల వివాహానికి అర్థం ఏమిటి? శాస్త్రపారంగతుడైన పాఠకుడు చికాకుపడి ఇలా అంటాడేమో: “ఎంత వెర్రితనం! గోరంతలు కొండంతలు చేయడం ఎందుకయ్యా? ముందుగా కొన్ని శాస్త్రాలు, ఇతర గ్రంథాలు సంప్రతించి ఆ తరువాత మహాత్ముల జీవిత సంఘటనలు నమోదు చేయ సాహసించు. శాస్త్రాలు ఇలా వక్కాణిస్తున్నాయి: భగవత్సాక్షాత్కారం లేదా పరిపూర్ణజ్ఞానం సంతరించుకొన్నాక జీవుడి సంచిత, ఆగామీ* కర్మలు రెండూ క్షయమౌతాయి. కాని జ్ఞానం సంతరించుకొన్నాక సైతం శరీరం ఉన్నంతదాకా జీవుడు ప్రారబ్ధకర్మను అనుభవించేతీరాలి. ఈ క్రింది ఉదాహరణ ద్వారా ఈ విషయం విశదమౌతుంది: ఒక వేటగాడి అమ్ములపొదిలో కొన్ని బాణాలున్నాయనుకోండి. ప్రయోగింప చేతిలో ఒక బాణం సిద్ధంగా ఉంది. ఇంతకు మునుపే ఒక బాణాన్ని చెట్టుకొమ్మమీద వ్రాలిన పక్షి మీద ప్రయోగించి ఉన్నాడు. ఆ క్షణంలో హఠాత్తుగా వేటగాడి మనస్సులో వైరాగ్యం జనించింది. ఇకపై జీవహింస చేయరాదని నిశ్చయించుకొన్నాడు. వెంటనే చేతబట్టిన బాణాన్ని, అమ్ములపొదిలోని బాణాలను విసిరి పారేశాడు. కాని ఇంతకు మునుపు పక్షి మీద ప్రయోగించిన బాణాన్ని అతడు ఉపసంహరించుకోగలడా? అతడి వీపుకు వ్రేలాడుతున్న అమ్ములపొదిలోని బాణాలు ‘సంచిత’ కర్మలు. ప్రయోగింప చేతబట్టిన బాణం ‘ఆగామీ’ కర్మ (లేదా ఇకపై చేయనున్న కర్మ). జ్ఞానం సంతరించుకొన్నప్పుడు ఈ రెండు రకాల కర్మలూ నశిస్తాయి. కాని ప్రారబ్ధకర్మ అతడు అంతకు మునుపే ప్రయోగించిన బాణం లాంటిది. దాని ఫలితాన్ని అతడు అనుభవించే తీరాలి. శ్రీరామకృష్ణుల వంటి మహాపురుషులు కేవలం ఈ ప్రారబ్ధ కర్మను మాత్రమే దేహంలో జీవిస్తున్నప్పుడు అనుభవిస్తారు. ఎందుకంటే ఈ ప్రారబ్ధ కర్మను అనుభవించడం అనివార్యం కనుక. తమ ప్రారబ్ధకర్మ ఫలితంగా తమ జీవితాలలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో వారికి తెలియవస్తుంది. అందుచేత తమ వివాహం ఎవరితో ఎక్కడ జరుగనున్నదో శ్రీరామకృష్ణులు తెలుపడంలో వింత ఏమీలేదు.”
12. ప్రారబ్ధకర్మను అనుభవించడం, అనుభవించకపోవడం పూర్ణజ్ఞాని ఇచ్ఛాధీనం
పై అభ్యంతరానికి మా సమాధానం: “శాస్త్ర విషయాలలో నిజానికి మేం అజ్ఞానులం. కాని మాకు తెలిసినంత మేరకు యథార్థజ్ఞానులు ప్రారబ్ధకర్మను సైతం అనుభవింపవలసిన అవసరం లేదు. ఏ మనస్సు ద్వారా సుఖదుఃఖాలు అనుభవింపబడతాయో ఆ మనస్సును జ్ఞాని శాశ్వతంగా భగవంతునికి అర్పించివేశాడు. అటువంటప్పుడు అతడి మనస్సుకు సుఖదుఃఖాలను అనుభవించే ఆస్కారం ఎక్కడుంది? ఒకవేళ అతడి శరీరమే ప్రారబ్ధకర్మను అనుభవిస్తుందని నువ్వు చెబితే, అది మాత్రం ఎలా సాధ్యం? జ్ఞాని కనుక ఏదో ఒక విశేష కారణంగా – ఉదాహరణకు పరులకు శ్రేయస్సు ఒనగూర్చాలనే ఉద్దేశంతో – తన అహంకారాన్ని ఏ కించిత్తు అయినా నిలుపుకొంటే, అప్పుడు మాత్రమే అతడికి మళ్ళీ మనశ్శరీరాలు అనుభూతమౌతాయి. అప్పుడు వాటి ద్వారా ప్రారబ్ధకర్మ అనుభవించబడుతుంది. దీని మూలంగా యథార్థ జ్ఞాని ఇచ్ఛ మేరకు ప్రారబ్ధ కర్మను అనుభవించగలడని, లేదంటే పరిత్యజించగలడని స్పష్టమౌతున్నది. అట్టి శక్తిని వారు పొందుతారు. కాబట్టే వారిని ‘జగజ్జయులు’, ‘మృత్యుంజయులు’, ‘సర్వజ్ఞులు’ అని పేర్కొంటారు.
13. ‘ఎవడు రాముడో, ఎవడు కృష్ణుడో అతడే ఇప్పుడు శ్రీరామకృష్ణుడు’ అన్న వారి పలుకుల దృష్ట్యా ఆయనను గురించి ప్రస్తావింప అవసరం లేదు
మళ్ళీ, శ్రీరామకృష్ణుల స్వీయానుభవాన్ని మనం నమ్మినప్పుడు ఆయనను సామాన్య జ్ఞానపురుషునిగా కూడా వర్గీకరించడం సముచితం కాదు. ఎందుకంటే, “ఎవడు రాముడో, ఎవడు కృష్ణుడో అతడే ఇప్పుడు రామకృష్ణుడు” అని ఆయన పలుమార్లు పేర్కోవడం మేం విన్నాం కనుక. అంటే, ఎవరు గత యుగాలలో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా అవతరించాడో ఆతడే ప్రస్తుతం శ్రీరామకృష్ణులుగా అవతరించి, అద్భుత లీలలను ప్రదర్శిస్తున్నాడు. దీన్ని విశ్వసిస్తే ఆయన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడైన భగవదవతారమనే విషయం అంగీకరించక తప్పదు. అటువంటప్పుడు ప్రారబ్ధకర్మ ఫలితంగా ఆయన వివాహం జరిగిందని చెప్పలేం. కనుక శ్రీరామకృష్ణుల వివాహం గురించి మరో వ్యాఖ్యానం ఇవ్వవలసి ఉంది. దాన్ని కింద పొందుపరుస్తున్నాం.
14. తమ వివాహం గురించి శ్రీరామకృష్ణుల పరిహాసం
తమ వివాహం గురించి శ్రీరామకృష్ణులు అనేక పర్యాయాలు మాతో ప్రస్తావించి, దాన్ని గురించి చమత్కారంగా పరిహసించేవారు. ఒకరోజు దక్షిణేశ్వరంలో ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు, బలరామ్బసు ప్రభృత భక్తులు ఆయన పక్కన కూర్చుని ఆయనతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణుల అన్నగారి కుమారుడైన రామ్‌లాల్ వివాహం నిశ్చయమైంది. ఆ కారణంగా మాతృదేవి కొన్ని నెలలు కామార్పుకూర్లో ఉండడానికి అదే రోజు దక్షిణేశ్వరం నుండి బయలుదేరారు.
శ్రీరామకృష్ణులు (బలరామ్‌తో): సరేగాని, నావంటి వ్యక్తికి వివాహ ప్రాధాన్యం ఏముంటుంది? కట్టుకొన్న బట్ట ఉందో, ఊడి జారిపోయిందో తెలియని వ్యక్తి జీవితంలో భార్య స్థానం ఏమిటి?
బలరామ్ నవ్వి, మౌనం వహించాడు.
శ్రీరామకృష్ణులు: ఓహ్! అర్థమైంది. (కంచం నుండి కాస్త కూర తీసి బలరామ్‌కు చూపుతూ) ఇందుకోసమే వివాహం. లేకుంటే నాకోసం ఈ విధంగా ఎవరు వండిపెడతారు! (బలరామ్, ఇతర భక్తులు నవ్వారు) నిజానికి నాకు భోజనం ఇలా ఎవరు చేసిపెడతారు? వారంతా ఇవాళ వెళ్ళిపోయారు (ఎవరు వెళ్ళారో భక్తులకు అర్థం కాకపోవడంతో) – రామ్‌లాల్ అత్త (మాతృదేవి); మీకు అర్థమైందా? రామ్‌లాల్‌కు వివాహం; కనుక అందరూ కామార్పుకూర్కు వెళ్ళారు. వాళ్ళు వెళుతున్నప్పుడు చూస్తూ నిలబడిపోయాను. ఏమీ అనిపించలేదు. నిజానికి ఎవరో పోతున్నట్లు అనిపించింది. కాని తరువాత నా కోసం ఎవరు వంటచేస్తారా అని ఆదుర్దా చెందాను. అర్థం కాలేదా? నానారకాల ఆహారం నా ఒంటికి సరిపడదు. కొన్ని సమయాల్లో భోజనం చేయాలనే ఎరుకే ఉండదు. నాకు ఎలాంటి ఆహారం సరిపడుతుందో ఆమెకు (మాతృదేవికి) తెలుసు. అందుకే ఇదీ అదీ చేసిపెడుతుంది. కాబట్టే ఇదంతా ఎవరు చేసిపెడతారో అన్న ఆదుర్దా.
15. హైందవులకు విధాయకమైన దశసంస్కారాలను నిర్వర్తింప గురుదేవులు వివాహం చేసుకొన్నారా? కాదు
దక్షిణేశ్వరంలో ఒక రోజు శ్రీరామకృష్ణులు తమ వివాహ ప్రస్తావన తీసుకువచ్చి ఇలా అన్నారు: “వివాహం ఎందుకు చేసుకోవాలో తెలుసా? బ్రాహ్మణ దేహానికి పది రకాల సంస్కారాలు నిర్వర్తింపబడాలి, దాన్లో వివాహం ఒకటి. ఆ పది రకాల సంస్కారాలు నిర్వర్తించబడినప్పుడే అతడు ఆచార్యుడు కాగలుగుతాడు.” మళ్ళీ ఆయన ఇలా అనేవారు: “పరమహంస లేదా పూర్ణజ్ఞాని అయిన వ్యక్తి పాకీవాని అవస్థ పర్యంతం రాజు, చక్రవర్తి అవస్థల వరకు అన్నిటినీ అనుభవించి ఉంటాడు. కాకుంటే నిజమైన వైరాగ్యం ఎలా జనిస్తుంది? అనుభవించని దానికై మనస్సు తహతహ చెందుతుంది, చంచలమౌతుంది. అర్థమైందా? పాచికలాటలో పావు గదులన్నీ దాటిన తరువాతే కైలాసం చేరడం చూడలేదా? ఇదీ అటువంటిదే.”
16. హైందవ వివాహం: తదాదర్శం
సామాన్య గురువులు వివాహమాడడానికి కారణం గురించి శ్రీరామకృష్ణులు అలా తెలిపినప్పటికీ, ఆయన స్వీయ వివాహానికి నేపథ్యంలోని మేం అర్థంచేసుకొన్న విశేష కారణాన్ని గురించి ఇప్పుడు విశదీకరిస్తాం. వివాహం చేసుకోవడం భోగించడానికి కాదన్న విషయం అడుగడుగునా శాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి. భగవంతుని సృష్టిని కొనసాగించడమనే నియతిని పాటిస్తూ, సద్గుణశీలురైన సంతానాన్ని కని సమాజానికి మేలు ఒనగూర్చడమే హైందవ వివాహోద్దేశం. శాస్త్రాలు పదే పదే ఈ అంశాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. అలాంటప్పుడు తన వివాహంపట్ల హైందవునికి ఎలాంటి స్వార్థమూ ఉండకూడదా? శాస్త్రాలు అలాంటి అర్థరహితమైన వాటిని బోధిస్తాయా? లేదు, అవి అలా బోధించవు. మానవుల బలహీనత, శాస్త్రకారులకు బాగా తెలుసు. దుర్బలురైన మనుష్యులు ఈ ప్రపంచంలో స్వార్థాన్ని తప్ప మరోదాన్ని అర్థంచేసుకోలేరన్న సంగతినీ, లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా చిన్న పనిని సైతం చేయడానికి ఒప్పుకోరనే సంగతినీ మానవ హృదయాంతరాళాల వరకు తరచి పరికించిన శాస్త్రకారులు చక్కగా గుర్తించారు. ఇలా గుర్తించీ పైన పేర్కొన్న ఆదేశాన్ని ఒసగారంటే దానికొక కారణం ఉండాలి. అదేమిటంటే,
17. అనుభవం, వివేచన – ఈ రెండూ జ్ఞానానికి దారితీస్తాయి
మనిషిలో ఉండే ఆ స్వార్థాన్ని సదా ఒక మహోన్నత ఆదర్శంతో జోడిస్తే అది మేలు ఒనగూరుస్తుంది. అలా చేయకుంటే పదేపదే పుడుతూ గిడుతూ సంసార బంధనంలో చిక్కువడి మనిషి అంతులేని దుఃఖాలను అనుభవించవలసి వస్తుంది. నిత్యముక్తమైన తన ఆత్మస్వరూపాన్ని విస్మరించి మనిషి బాహ్య జగత్తులోని రూపరసాది క్షణిక ఇంద్రియసుఖాల వైపు పరుగు లెత్తుతూ, అవన్నీ మధురమైనవనీ, రమణీయకాలనీ భ్రమిస్తున్నాడు. కాని లోకంలోని ప్రతి సుఖమూ దుఃఖంతో కూడివుంటుందనీ, సుఖభోగంతో పాటు దుఃఖాన్నీ స్వీకరించక తప్పదనీ గ్రహించగలవారు ఎందరున్నారు? “దుఃఖమనే కిరీటాన్ని ధరించే సుఖం వస్తుంది” అని స్వామి వివేకానంద తరచూ చెప్పేవారు. మనిషి సదా సుఖం కోసమే ఉబలాటపడుతూంటాడు. సుఖం తల మీద దుఃఖ కిరీటం ఉన్నదనీ, సుఖాన్ని తనదిగా చేసుకొంటే చివరకు దుఃఖాన్ని సైతం అనుభవించాల్సి వస్తుందని సుఖాలను అనుభవిస్తూన్నప్పుడు తలచనైనా తలచడు. అందుచేతనే శాస్త్రాలు అతడికి ఈ వాస్తవాన్ని జ్ఞప్తికి తెచ్చి, “నాయనలారా! సుఖాలను పొందడమే మీ జీవిత లక్ష్యంగా ఎందుకు పరిగణిస్తారు? సుఖాన్ని పొందగోరితే దుఃఖాన్ని కూడ ఆహ్వానించవలసి ఉంటుంది. కనుక నీ స్వార్థాన్ని ఒకింత ఉన్నతస్థాయికి చేర్చి సుఖమూ దుఃఖమూ నా గురువులు, దేని ద్వారా ఈ రెండింటి నుండి శాశ్వత విముక్తి పొందగలనో అదే నా యథార్థ స్వార్థం లేదా జీవితలక్ష్యం అని గ్రహించు” అని చెబుతున్నాయి.
కనుక వైవాహిక జీవితంలో అనివార్యాలైన నానా సుఖదుఃఖాది అనుభవాలను పొందుతూ, దానితోపాటు ఇది నిత్యం ఇది అనిత్యం, ఇది మంచి ఇది చెడు అనే వివేచన చేస్తూ చేస్తూ క్రమేణా సంసారంలోని సుఖాలన్నీ క్షణభంగురాలనీ, మొదట్లో సుఖదాయకాలుగా కనిపించినా చివరికి అవి తీవ్రదుఃఖాలకు దారితీస్తాయనే విషయం గుర్తించి, వాటిపట్ల విముఖత చూపుతాడు మనిషి. ఫలితంగా అతడిలో భగవద్భక్తి పెంపొందుతుంది. చివరికి భగవంతుడు ఒక్కడే పరాత్పరుడనీ, సారాలన్నిటి సారమనీ గ్రహించి ఆయన సాక్షాత్కారార్థం మహోత్సాహంతో ముందంజ వేస్తాడు. ఈ విషయం సుబోధకమయ్యేలా చేయడమే శాస్త్రకారుల అసలు ఉద్దేశం.
18. సుఖభోగాల ప్రేరణను అధిగమించడంపై శ్రీరామకృష్ణులు
అనుకూల ప్రతికూలతలను నిర్ధారించుకొని, అంటే వివేచించి సుఖభోగాలను అనుభవించే మనస్సు వాటిని పరిత్యజించగలదనడంలో ఎలాంటి సంశయమూ లేదు. అందుచేతనే శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: “నాయనలారా! సదసద్విచారం తప్పక ఉండాలి. సదా వివేచన చేస్తూ మనస్సుకు, ‘ఓ మనసా! దీన్ని ఆరగించాలి, దాన్ని ధరించాలి అంటూ ఎన్నింటినో అనుభవించాలని ఉవ్విళ్ళూరుతున్నావే! కాని ఏ పంచభూతాలతో బంగాళ దుంపలు, బియ్యం, పప్పుదినుసులు మొదలైనవి రూపొందాయో, రసగుల్లా, సందేశ్ ఇత్యాది తీపి తినుబండారాలు తయారయ్యేవి వాటితోనే కదా! ఏ పంచభూతాల నుండీ రక్తం, మాంసం, ఎముకలతో కూడిన స్త్రీశరీరం నిర్మితమైనదో వాటితోనే మళ్ళీ నీది, నాది, మనుష్యులందరిదీ, అట్లే పశువులు, మేకలు, గొర్రెలు మొదలైన జంతువుల శరీరాలన్నీ నిర్మితమైనవి.అటువంటప్పుడు వాటిని పొందాలని ఎందుకిలా సతమతమౌతున్నావు? వాటద్వారా సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుణ్ణి ప్రాప్తించుకోలేవు కదా! అప్పటికీ మనస్సు వాటిపట్ల మక్కువను వీడకుంటే, వివేచనతో వాటిని ఒకటి రెండుసార్లు అనుభవించి, చివరకు పరిత్యజించు. ఉదాహరణకు రసగుల్లాను తినాలని మనస్సు పట్టుబట్టిందనుకో, వద్దని ఎంత చెప్పినా వినకున్నదనుకో, ఎంత వివేచన చేసినా నిష్ఫలమైనదనుకో, అప్పుడు ఏం చెయ్యాలి? కొన్ని రసగుల్లాలు కొని, నోట్లో వేసుకొని, వాటిని నమిలి తింటూ, మనస్సుతో ఇలా చెప్పు: ‘ఓ మనసా! ఇవే రసగుల్లాలు. బంగాళదుంపల వంటి కాయగూరలలా ఇవి కూడ పంచభూతాల వికారాలనుండే ఉత్పన్నమైనాయి. ఇవి కూడ తినగానే రక్తమాంసాలు, మలమూత్రాలుగానే మార్పుచెందుతాయి. నోట్లో ఉన్నంత వరకే అవి తియ్యగా ఉంటాయి. గొంతు క్రిందికి పోయాక వాటి రుచి తెలియరాదు. పైగా వీటిని ఎక్కువగా తింటే అజీర్తి చేస్తుంది. అటువంటి వాటికై ఉబలాటపడుతున్నావే! ఛీ, ఛీ! తిన్నదేదో తిన్నావు. కాని ఇక మీదట మాత్రం తినగోరక.’ (భావిసన్న్యాస శిష్యుల వంక చూస్తూ) ఇటువంటి చిన్న విషయాలలో మాత్రం ఇలా వివేచనచేస్తూ వాటిని అనుభవించి తరువాత పరిత్యజించవచ్చు. కాని పెద్ద విషయాలలో (అంటే కామకాంచనాదులు) ఇది సాధ్యం కాదు. ఈ పెద్దవిషయాలను అనుభవింప పూనుకొన్న తక్షణమే వాటి బంధనంలో చిక్కుకుపోతావు. అందుచేతనే అలాంటి కోర్కెలను వివేచించి వాటిలోని దోషాన్ని కనుగొని వాటిని మనస్సు నుండి దూరంగా పారద్రోలాలి.”
19. ఇంద్రియ నిగ్రహ రాహిత్యమే ప్రస్తుత జాతీయ పతనానికి హేతువు
శాస్త్రాలు ఇలా వైవాహిక జీవిత ఉన్నతోద్దేశాన్ని పదే పదే ఉద్ఘాటిస్తున్నప్పటికీ, ప్రస్తుత కాలంలో ఎందరు తమ మనస్సులలో ఈ ఆదర్శానికి స్థానం ఇస్తున్నారు! తమ వైవాహిక జీవితాలలో తమ శక్తిమేరకు బ్రహ్మచర్యాన్ని (ఇంద్రియ నిగ్రహాన్ని) పాటిస్తూ తాము తరించి, సమాజాన్ని తరింప చేస్తున్న వారు ఎంత మంది ఉన్నారు? భర్తల పక్కన నిలబడి, భగవత్ సాక్షాత్కారం విషయం అటుంచి, లోకానికి హితం ఒనగూర్చే ఉన్నతాదర్శాలతో వారికి ప్రేరణనిచ్చే భార్యలు ఎందరున్నారు? ‘పరిత్యాగమే జీవితోద్దేశం’ అని గ్రహించి, భార్యలకు ఆ విషయం ఉపదేశించే భర్తలు ఎందరున్నారు? అయ్యో, భారతదేశమా! ‘భోగమే జీవన సర్వస్వమనే పాశ్చాత్య జడవాదం క్రమేణా నీ అస్థిమజ్జాల దాకా చొచ్చుకుపోయి, నిన్ను ఏ మేరకు వెన్నెముకలేని పశుప్రాయునిగా చేసివేసిందో ఒక్కసారి కాస్త యోచించి చూడు! శ్రీరామకృష్ణులు కారణరహితంగా తమ భావి సన్న్యాస శిష్యులకు ఆధునిక వివాహవ్యవస్థలోని దోషాలను ఎత్తిచూపుతున్నారా? “నాయనలారా! (భోగం ఒక్కటే జీవితోద్దేశం, జీవన సర్వస్వం అన్నది దోషమని మీరు అనుకొంటే వివాహ సమయంలో) ఒకటి రెండు అక్షింతలు, పువ్వులు చల్లడంతో ఆ దోషం తొలగిపోతుందంటారా? అది కళంకరహితమౌతుందా?”* వైవాహిక జీవితంలో ప్రస్తుతం కానవస్తున్న అత్యధికమైన భోగ లాలస మన దేశంలో మరే కాలంలోనూ ఉండివుండలేదు. ఇంద్రియ తృప్తి తప్ప వివాహానికి ఒక మహాపవిత్రమైన, అత్యున్నతమైన ఉద్దేశం మరొకటి ఉన్నదనే విషయం మనం ప్రస్తుత కాలంలో పూర్తిగా మరిచిపోయాం. కనుకనే రోజురోజుకు మనం పశువుల కంటే హీనస్థితికి దిగజారిపోతున్నాం. ఆధునిక భారతీయ స్త్రీ పురుషుల ఈ పశుభావాన్ని నశింపచేయడానికే జగద్గురువులైన శ్రీరామకృష్ణుల వివాహం జరిగింది. ఆయన జీవితంలోని ఇతర కార్యాల్లా వివాహమనే ఈ కార్యం సైతం లోకానికి మేలు ఒనగూర్చడం నిమిత్తమే జరిగింది.
20. మహోన్నత వివాహాదర్శాన్ని పునరుద్ధరించడానికే శ్రీరామకృష్ణులు వివాహం చేసుకొన్నారు
శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: “ఇక్కడ (అంటే తాము) చేస్తున్నదంతా మీ అందరికోసమే. నేను పదహారు అణాలు* పూర్తిగా చేస్తే బహుశా మీరు ఒక్క అణా చేయగలరేమో!” అందుచేతనే శ్రీరామకృష్ణులు వైవాహిక జీవిత భారాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని, సర్వుల ఎదుట మహోన్నత వివాహ ఆదర్శాలను ఆచరించి చూపారు. ఆయన కనుక వివాహం చేసుకోకుండా ఉంటే, గృహస్థ శిష్యులు, “వివాహం చేసుకోనందునే బ్రహ్మచర్య వ్రతం గురించి అంతగా చెబుతున్నారు. భార్యను ప్రేమతో తనదాన్ని చేసుకొని ఆమెతో ఏనాడూ కాపురం చేసి వుండనందునే ఆయన మాకు సుదీర్ఘ ధర్మోపదేశాలు చేస్తున్నారు” అని పలుకవచ్చు. కాబట్టే అటువంటి మతిలేని అభిప్రాయాలకు విరుగుడుగా శ్రీరామకృష్ణులు కేవలం వివాహం చేసుకోవడమే కాక, యౌవనవతియైన భార్యను దక్షిణేశ్వరంలో తమవద్ద ఉంచుకొన్నారు. జగజ్జనని పరిపూర్ణ దర్శనం పొంది దివ్యోన్మాద అవస్థ సహజసిద్ధమైపోయిన తరువాత, భార్యతో కలసి జీవిస్తూ, ఆమెలో జగజ్జనని అభివ్యక్తీకరణను ప్రత్యక్షంగా చవిచూస్తూ ఆమెను షోడశీ మహావిద్య అనే జ్ఞానంతో పూజించి, ఆత్మార్పణం చేసుకొన్నారు. ఆయన ఎడతెగక ఎనిమిది నెలలపాటు ఏకశయ్యాగతులై కూడ ఆమెతో దాంపత్య జీవితం గడపలేదు. ఆయన స్వయంగా కొన్ని సమయాలలో తమ జన్మస్థలమైన కామార్పుకూర్కు, తమ అత్తవారి ఊరైన జయరామ్ బాటికి వెళ్ళి ఒకటి రెండు నెలలు అక్కడ గడిపేవారు. ఆ సమయంలో తమ భార్యకు శిక్షణ ఇచ్చి ఆమె మనస్సులో శాంతి ఆనందాలను కలుగజేశారు.
21. దీనిపై మాతృదేవి వ్యాఖ్యానం
దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులతో గడిపిన కాలంనాటి సంఘటనలు జ్ఞప్తికి తెచ్చుకొని మాతృదేవి, భక్తురాండ్రకు ఇలా చెబుతూండేవారు: “ఆ కాలఘట్టంలో ఆయన రేయింబవళ్ళు ఎటువంటి దివ్యభావపారవశ్యంలో లీనమై ఉండేవారో నేను వర్ణించి చెప్పలేను. అర్ధబాహ్య దివ్యచైతన్య స్థితిలో ఎటువంటి అద్భుత వచనాలు ఆయన నోటి వెంట జాలువారేవి! కొన్ని సమయాల్లో ఆయన నవ్వేవారు, విలపించే వారు, కొన్ని సందర్భాలలో పారవశ్యంలో నిశ్చలులై పోయేవారు. రాత్రులన్నీ అలా గడిచి పోయేవి. ఎటువంటి అద్భుత పారవశ్యం! ఆ దృశ్యం చూసి నా దేహం యావత్తూ వణికి పోయేది. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఆదుర్దా చెందేదానను. భావసమాధి గురించి నాకప్పుడు ఏమీ అర్థమయ్యేది కాదు. ఇలావుండగా ఒక రోజు రాత్రి ఆయన సమాధి అవస్థ ఎంతకీ బయటకు రాకపోవడంతో భయపడిపోయి, ఏడుస్తూ హృదయ్‌ను పిలిపించాను. అతడు వచ్చి ఆయన చెవిలో భగవన్నామాన్ని ఉచ్చరించిన చాలాసేపటికి ఆయనకు బాహ్యచైతన్యం కలిగింది. ఆ తరువాత నేను భయంతో, ఆదుర్దాతో బాధపడుతున్నానని తెలుసుకొని ఎలాంటి సమాధి స్థితిలో ఏ భగవన్నామాన్ని తమ చెవిలో ఉచ్చరించాలో ఆయనే స్వయంగా నాకు నేర్పారు. తర్వాత నేనంతగా భయపడలేదు. ఆ నామాలను, మంత్రాలను ఆయన చెవిలో ఉచ్చరించగానే ఆయన మామూలు స్థితికి తిరిగి వచ్చేసేవారు. చాలా రోజులు ఈ విధంగా గడిచిపోయాయి. తమకు ఎప్పుడు ఎటువంటి భావసమాధి కలుగుతుందో అనే ఆదుర్దాతో నేను రాత్రుళ్ళు అసలు నిద్రించడం లేదని తెలుసుకొని ఆయన ఒక రోజు నన్ను విడిగా నహబత్లో పడుకోమని చెప్పారు.” దీపంలో ఒత్తిని ఎలా అమర్చాలో, ఇంట్లోని ప్రతి కుటుంబ సభ్యుని స్వభావం ఎలా అంచనా వేయాలో, వారితో ఎలా మెలగాలో, ఇతరుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు ఎలా వ్యవహరించాలో మొదలైన గృహసంబంధిత విషయాలను ఆయన తనకు ఎలా నేర్పారో మాతృదేవి చెప్పేవారు. భజన, కీర్తన, జపధ్యానాలు, సమాధి, బ్రహ్మజ్ఞానం గురించి కూడా ఆమెకు ఆయన బోధించారని పరమారాధ్యురాలైన మాతృదేవి తెలిపేవారు.
22. గృహస్థులకు బోధించే నిమిత్తమే శ్రీరామకృష్ణులు వివాహం చేసుకొన్నారు
ఓ గృహస్థులారా! మీలో ఎందరు మీ భార్యలకు ఈ విధంగా బోధన చేస్తున్నారు? ఏదో కారణంగా నేడు మీ మధ్య నుండే తుచ్ఛశారీరక సంబంధం తెగిపోయిన తదనంతరం కూడా మీ భార్యను జీవితాంతం గౌరవించి, అభిమానంతో ప్రేమించే వారు మీలో ఎందరున్నారు? కాబట్టే ఈ అద్భుత అవతారమూర్తి వివాహం చేసుకొని, ఒక్క రోజైనా శారీరక సంబంధాన్ని కల్పించు కోకుండా భార్యతో అపూర్వ దివ్యప్రేమ లీలను ప్రదర్శించడం కేవలం మీ నిమిత్తమే అని మేం చెబుతున్నాం. ఇంద్రియసుఖం కాక వివాహ వ్యవస్థకు మరో ఉన్నతోద్దేశం ఉందని, ఆ మహోద్దేశాన్ని లక్ష్యంగా చేసుకొని వైవాహిక జీవితంలో శక్తి మేరకు బ్రహ్మచర్యం పాటిస్తూ భార్యాభర్తలైన మీరిద్దరూ తరించడం ఎలాగో మీరు నేర్చుకోవడానికి ఆయన వివాహం చేసుకొన్నారు. అంతేకాక మేధావులు, పరాక్రమవంతులు, సద్గుణ సంపన్నులు అయిన సంతానానికి తల్లితండ్రులై నిర్వీర్యమై, నిస్తేజమై, అధోస్థితికి దిగజారిపోయిన భారతీయ సమాజానికి మేలు ఒనగూర్చడం ఎలాగో మీకు నేర్పడం కోసమే వారి వివాహం! గత యుగాలలో ఈ ఆదర్శాన్ని పాటించి చూపే ఆవశ్యకత కలుగలేదు. అప్పుడు జనం దాదాపు ఈ ఆదర్శాన్ని అంగీకరించడమే ఇందుకు కారణం. కాని నేడు అలా కాదు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, ఏసుక్రీస్తు, శంకరాచార్యులు, చైతన్యులు మొదలైన జగద్గురువులలా కాక శ్రీరామకృష్ణులు మనందరి హితం కోసం ఆ ఆదర్శానికి ఉదాహరణగా తమను మలచుకొన్నారు. శ్రీరామకృష్ణులు జీవితాంతం అనుష్ఠించిన కఠోర సాధనల, తపశ్చర్యల ఫలితంగా గతంలో కనీవినీ ఎరుగని, లోకంలో ప్రప్రథమంగా వైవాహిక జీవితపు పావన ఆదర్శంగా నిలిచారు. ఇక, శ్రీరామకృష్ణులు తరచూ చెప్పేటట్లు, “ఆ ఆదర్శానికి తగ్గట్టుగా మీ జీవితాలను మలచుకొని సార్థకం చేసుకోండి.”
23. శ్రీరామకృష్ణుల ఆదర్శాన్ని అనుసరించడంలోని ఆవశ్యకత
“కాని….” అంటాడు గృహస్థుడు. మీ అవస్థ మాకు తెలుసు. అందుకు సమాధానంగా ఆధ్యాత్మిక అనుష్ఠానాల గురించి స్వామి వివేకానంద ఏం చెప్పారో దానిని ఉల్లేఖీస్తున్నాం: “మీలో ప్రతి ఒక్కరూ శ్రీరామకృష్ణ పరమహంస అవుదామని భావిస్తున్నారా? అది జరిగేపని కాదు. ‘తొమ్మిది మణుగుల చమురు మండదు, ఆ రాధ నృత్యం చేయదు.’* ప్రపంచంలో పరమహంస శ్రీరామకృష్ణులు ఒక్కరే జన్మించారు. ‘సింహం మాత్రమే అరణ్యానికి రాజు.’” ఓ గృహస్థులారా! మీ ‘కాని…’ కి ఇదే విధంగా జవాబిస్తున్నాం. మీ భార్యతో కలిసి జీవిస్తూ ఆయనలా కఠోర బ్రహ్మచర్య వ్రతం పాటించడం మీ శక్తికి మించిన పని అని శ్రీరామకృష్ణులు చక్కగా ఎరుగును. ఆయనకు ఈ విషయం తెలిసినప్పటికీ, సోదాహరణగా తాను ఆ ఆదర్శాన్ని పాటించి చూపడం కనీసం దాన్లో ‘ఒక్క అణా’ వంతు (అంటే పదహారులో ఒక వంతు) అయినా మిమ్మల్ని చేయ ప్రోత్సహించడానికే. కాని ఒక్క విషయం స్పష్టంగా తెలుసుకో: శ్రీరామకృష్ణులు చూపించిన ఆ ఉన్నతాదర్శాన్ని అనుసరింప ప్రయత్నిస్తూ స్త్రీలను జగన్మాతృ స్వరూపిణులుగా పరిగణిస్తూ, శక్తిమేరకు హృదయపూర్వకంగా వారికి నీ నిస్వార్థ ప్రేమను అర్పించలేకపోయావో, మాతృస్వరూపిణులైన లోకంలోని స్త్రీలను కేవలం నీకు బానిసలుగా, నీ తుచ్ఛభోగ్య వస్తువులుగా ఎంచుతూ వారిని పశుదృష్టితో చూసావో – జాగ్రత్త, నీ వినాశనం నిశ్చయం, సత్వరమే దాపురిస్తుంది. శ్రీకృష్ణుని ఉపదేశం పాటించని యదువంశం ఏమైపోయిందో జ్ఞప్తికి తెచ్చుకో. ఏసుక్రీస్తు బోధనలను త్రోసిరాజన్న యూదులు ఏ దుర్గతి పాలయ్యారో యోచించి చూడు. అవతారపురుషులను ఉపేక్షించిన జాతులన్నీ సర్వకాలాల్లో వినాశం చెందడం చారిత్రక సత్యం.
24. శ్రీరామకృష్ణుల ఆదర్శంపై కొన్ని ఆక్షేపణలు: తత్సమాధానాలు
మరో ప్రశ్నకు జవాబిచ్చి వైవాహిక జీవితం ద్వారా శ్రీరామకృష్ణులు అభివ్యక్తం చేసిన అసాధారణ గురుభావ వికాస ప్రసంగాన్ని ముగించి, ఆయన గురుభావానికి సంబంధించిన ఇతర అంశాలను వివరిస్తాం. పైన చర్చించిన విషయాలు విన్న పిదప కూడా రూప రసాది భోగ్యవిషయాలకు బానిసయైన మనిషి మానసం తనలో ఇలా భావిస్తూ ఉంటుంది: శ్రీరామకృష్ణులు ఏమైతేనేం వివాహం చేసుకొన్నారు గదా! అటువంటప్పుడు కనీసం ఒక్క బిడ్డనైనా కని ఆ తరువాత భార్యతో ఎలాంటి శారీరక సంబంధమూ లేకుండా జీవించి ఉంటే బాగుండేది. అలా చేసివుంటే ప్రతి మనిషి కర్తవ్యమైన భగవత్సృష్టిని కొనసాగించే కార్యమూ, శాస్త్రాల ఆదేశాలను గౌరవించడం అనే పనీ ఆయన నిర్వర్తించినవారయ్యేవారు. ఎందుకంటే, ‘వైవాహిక జీవితంలో కనీసం ఒక్క బిడ్డనైనా కనాలి. అప్పుడే మనిషి పితృఋణం నుండి విముక్తుడౌతాడు’ అని శాస్త్రాలు ఆదేశిస్తున్నాయి కనుక. ఈ ఆక్షేపణకు మా సమాధానం:
మొదటిది: మన ఇంద్రియాలు, మనస్సు గ్రహించగల ఆ కొంతైనా నిజానికి సృష్టి అంటే? భిన్నత్వమే సృష్టి నియతి. ఈ క్షణం నుండి మనమందరం ఒకే విధంగా ఆలోచిస్తూ, ఒకే తీరుగా పనులు చేయడం ప్రారంభిస్తే, సృష్టి నశించడానికి ఇక ఎంతో సమయం పట్టదు. తరువాత నిన్ను ఇలా అడుగుతాం: “భగవత్సృష్టిని పాలించే నియమాలన్నిటినీ నువ్వు తెలుసుకొన్నావా? నువ్వు బ్రహ్మచర్యాన్ని విడనాడడం నిజానికి భగవత్సృష్టిని కొనసాగించే ఉద్దేశంతోనేనా? ఆత్మవంచన చేసుకోక, చిత్తశుద్ధితో సమాధానం ఇవ్వు. శ్రీరామకృష్ణులు చెప్పేటట్లు, ‘మనోమందిరంలో అసత్య ప్రమాణం చేయవద్దు.’ (భావేర్ ఘరే చూరి నాథాకే) సరే, సృష్టి కొనసాగే ఉద్దేశంతోనే నువ్వు ఆ నియమాన్ని పాటిస్తున్నావని అనుకొందాం. ఇతరులను కూడ అలాగే చేయమని చెప్పే హక్కు నీకు ఏముంది? సాధారణ విషయాలలో శక్తిని వృథాపరచకుండా, బ్రహ్మచర్యం లేదా ఉన్నత మానసిక శక్తులను అభివ్యక్తీకరణ చేయడం కూడ సృష్టి నియతులలో ఒకటి. అందరూ నీ మాదిరిగా తమ శక్తినంతా ఈ పశుప్రవృత్తులలోనే వ్యయం చేస్తూంటే, ఇక ఉన్నత ఆధ్యాత్మిక శక్తులను ఎవరు అభివ్యక్తంచేసి చూపగలరు? అలా జరిగే పక్షంలో ఉన్నత శక్తుల అభివ్యక్తీకరణ అసాధ్యం కదా!
రెండవది: శాస్త్రాల నుండి మనకు అనుకూలంగా ఉండే బోధనలను మాత్రమే ఎంపిక చేసుకోవడం మన స్వభావం; బిడ్డలను కనాలని శాస్త్రం నిర్దేశించినదని చెప్పడం కూడ ఈ కోవకు చెందిందే. కారణం ఏమిటంటే, ఆధికారిక యోగ్యత మేరకు శాస్త్రాలు మళ్ళీ “యద హరేవ విరజేత్ తద హరేవ ప్రవ్రజేత్”* అంటున్నాయి. అంటే – ఎప్పుడు భగవదనురాగం తీవ్రమై సంసారంపట్ల విరక్తి కలుగుతుందో అప్పుడే సంసారం పరిత్యజించాలి. కనుక శ్రీరామకృష్ణులు కూడ నీ అభిప్రాయం ప్రకారం చేసివుంటే ఈ శాస్త్రాదేశాన్ని పాటించేవారు ఎవరుంటారు? పితృఋణాన్ని తీర్చాలనే శాస్త్రాదేశం విషయంలో కూడ ఇదే వర్తిస్తుంది. నిజమైన సన్న్యాసి తన పుణ్యసంపత్తిచే తన ఏడు తరాల పితృపురుషులను ఉద్ధరిస్తాడని శాస్త్రాలు వచిస్తున్నాయి. అందుచేత (బిడ్డలను కనలేదు కనుక) శ్రీరామకృష్ణుల పితృఋణం తీరలేదే అని మనం కలత చెందనక్కరలేదు.
ఈ సత్యాన్ని మనకు బోధించే నిమిత్తమే శ్రీరామకృష్ణుల వివాహం జరిగిందని తేటతెల్లమౌతున్నది. మాతృదేవి జీవితాంతం శ్రీరామకృష్ణులను సాక్షాత్తు జగజ్జననిగా పూజించేవారు. తద్ద్వారా వైవాహిక జీవితంలో ఎటువంటి ఉన్నత, పవిత్ర ఆదర్శాన్ని ఆయన మన కోసం వదలిపెట్టిపోయారో మనం ఒకింత అయినా తెలుసుకోగలుగుతున్నాం. ఇతరుల నుండి తన బలహీనతను దాచుకోవచ్చు కాని తన భార్య నుండి దాచుకోలేకపోవడం సామాన్యంగా చూస్తూనేవున్నాం. దీనిని గురించి శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు మాతో ఇలా చెప్పేవారు: “బాబులు, న్యాయాధిపతులు, మేజిస్ట్రేట్లు మొదలైన గొప్పవారందరూ బయట ఎంత దంభం ప్రదర్శించినా, అందరూ భార్యాదాసులే! భార్యల ముందు వానపాములే! లోపల నుండి హుకుం వచ్చిందంటే, అదెంత న్యాయవిరుద్ధమైనదైనా ఆ ఆదేశాన్ని త్రోసిపుచ్చే సాహసం వీరెవరికీ ఉండదు.” కనుక ఎవరి భార్యయైనా తన భర్తను సాక్షాత్తు భగవంతునిగా హృదయపూర్వక భక్తిప్రపత్తులతో ఆరాధించినప్పుడు, ఆ భర్త ప్రచారం చేసే ఆదర్శంలో అణువంత కాపట్యం ఉండదనే విషయం సుస్పష్టం. శ్రీరామకృష్ణుల గురించి ఈ విషయంలో మేం నిశ్చయంగా చెప్పగలిగినట్లు మరే వ్యక్తిని గురించీ చెప్పలేం. తన భార్యతో శ్రీరామకృష్ణులు సలిపిన అద్భుత ప్రేమలీలలు అభివర్ణించవలసినవి ఎన్నో ఉన్నప్పటికీ అందుకు ఇది చోటుకాదు. శ్రీరామకృష్ణుల గురుభావ అభివ్యక్తీకరణను సూచించడానికి మాత్రమే ఈ అంశాన్ని ప్రవేశపెట్టాం.