సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ।
ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ ॥ –భగవద్గీత 18.64
అత్యంత గోప్యమైన ఈ నా శ్రేష్ఠతమ పలుకులు విను. నువ్వు నాకు ప్రియాతి ప్రియుడవు కనుక నీకు హితమైనదానిని తెలుపగోరతాను.
శ్రీరామకృష్ణులు విఖ్యాతులు కాక మునుపు కలకత్తా నగర ప్రజానీకంలోని విద్యా వంతులు, విద్యావిహీనులు కూడ భావం, సమాధి, అద్భుత దివ్యదర్శనాలు ఆధ్యాత్మిక అను భూతుల గురించి పూర్తిగా విజ్ఞులై ఉన్నారని చెప్పడం అతిశయోక్తి కాబోదు. విద్యావిహీనులైన జనసామాన్యానికి ఈ విషయం పట్ల భయ విస్మయాలతో కూడిన విడ్డూరమైన ఒక భావన ఉండేది. ఆధునిక విద్యావంతులు ఆధ్యాత్మిక నేపథ్యం కరువైన పాశ్చాత్య విద్యాప్రభావ ఫలితంగా అట్టి దివ్యదర్శనాలు, సమాధి ఇత్యాదివి కలగడం అసంభవమనీ లేదా అది మతి చెడిన వ్యవహారమనీ పరిగణించేవారు. ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన భావసమాధుల వంటి అనుభూతుల కారణంగా శరీరంలో ఏర్పడే మార్పులు మూర్ఛలవంటి రుగ్మతలనో, అసాధారణ వ్యాధులనో వారు భావించేవారు. పరిస్థితులలో ఎంతో మార్పు వచ్చినప్పటికీ, నేటికీ కొద్దిమంది మాత్రమే, నిజానికి భావం, సమాధుల అంతరార్థాలను అవగతం చేసుకోగలుగుతున్నారు. శ్రీరామకృష్ణులు సదా నెలకొనివున్న భావముఖావస్థను కించిత్తయినా అవగాహన చేసుకోగోరితే సమాధి తత్త్వాన్ని గురించి కొంతలో కొంత ఎరిగి ఉండడం చాలా అవసరం. కనుక ఆ విషయాల గురించి పాఠకులకు ఒకింత వివరింప ప్రస్తుతం ప్రయత్నిస్తాం.
1. సమాధి : మెదడుకు సంబంధించిన రుగ్మత కాదు
జనులకు సర్వసామాన్యంగా అనుభూతం కాని దానిని మనం ‘వైపరీత్య స్థితి’ గా పేర్కొంటాం. కాని ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన సూక్ష్మానుభూతులు ఎన్నటికీ సామాన్యుల మానసానికి అనుభవాలు కాజాలవు. అటువంటి అనుభూతులు పొందాలంటే శిక్షణ, దీక్ష, నిరంతర అభ్యాసం అవసరం. అసాధారణ దర్శనాలు, అనుభూతులు సాధకుణ్ణి క్రమేణా పవిత్రుని గావిస్తూ, నిత్యం నూతన శక్తిని, భావాలను అతడిలో పాదుగొలుపుతూ క్రమంగా శాశ్వత శాంతిని పొంద అతణ్ణి అర్హుని చేస్తాయి. అటువంటప్పుడు దివ్యదర్శనాలను, అనుభూతులను ‘వైపరీత్యం’ గా పరిగణించడం సబబేనా! ‘వైపరీత్యా’ లన్నీ మినహాయింపులేక మనిషిని దుర్బలుణ్ణి చేసి, అతడి మేధస్సు మొదలైన శక్తుల క్షయానికి దారితీస్తాయని ప్రతి ఒక్కరూ అంగీకరించ వలసిందే. కాని దివ్యదర్శనాల, దివ్యానుభూతుల ఫలితం ఇందుకు పూర్తి విరుద్ధం. కాబట్టి అట్టి ఫలితాలకు కారణం కూడా పూర్తిగా భిన్నమైనదనే అంగీకరించాలి. అలాంటప్పుడు ఆ దర్శనాదులను రుగ్మతలనో లేక మతిభ్రష్టత అనో పేర్కోరాదు.
2. సమాధి ద్వారా మాత్రమే – నిజమైన పారమార్థికతను, శాశ్వత శాంతిని పొందగలరు
అపురూపమైన ఆధ్యాత్మికానుభూతులు అట్టి దివ్యదర్శనాదుల ద్వారానే సర్వదా పొందబడుతున్నాయి. ఎంతకాలం దాకా చిత్తవృత్తులన్నీ ఆగిపోయి, మనిషి నిర్వికల్పావస్థకు చేరి, సర్వదా అద్వైత స్థితిలో సహజంగా నెలకొని ఉండజాలడో, అంతకాలం వరకు శాశ్వత శాంతికి అతడు అధికారి కాలేడు. ఇందుకు ఉదాహరణగా శ్రీరామకృష్ణులు, “ఒక ముల్లు శరీరంలో గుచ్చుకొన్నప్పుడు, మరో ముల్లుతో దాన్ని తీసివేసి, పిదప రెంటినీ పారవేయాలి” అని చెప్పేవారు. భగవంతుని విస్మరించి మనిషి ‘జగత్తు’ అనే ఈ వైపరీత్య స్థితికి చేరాడు. అంతులేని రూప రసాదులనే ఈ వైపరీత్యాలన్నీ పైన పేర్కొన్న ఆధ్యాత్మిక దర్శనాదులచే ప్రతిఘటింపబడి, మనిషి క్రమంగా అద్వైత స్థితికి చేరతాడు. అప్పుడతడు ‘రసోవైసః’* – భగవంతుడు రసస్వరూపుడు, అంటే పరమానంద స్వరూపుడనే ఋషి వాక్కు అనుభూతం చేసుకొని ధన్యుడౌతాడు. ఇదే మార్గం. ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన సిద్ధాంతాలు, అనుభూతులు, దర్శనాలు మొదలైనవన్నీ మనిషిని ఆ గమ్యం వైపే పురోగమింప చేస్తాయి. ఈ దర్శనాలు, అనుభూతులు మొదలైనవన్నీ సాధకుడు తన గమ్యంకేసి ఎంత పురోగమించాడో సూచిస్తాయని స్వామి వివేకానంద తరచు చెప్పేవారు. వాటిని ఆయన ‘పురోగమ పథంలో మైలురాళ్ళు’ గా అభివర్ణించారు. కనుక ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక భావం కాస్త తీవ్రతరం అయినప్పుడు లేక ధ్యానంలో ఒకటి రెండు దేవతామూర్తుల దర్శనం కలిగినప్పుడు ఆధ్యాత్మిక చరమావస్థను చేరుకొన్నట్లు పాఠకుడు తలచరాదు. అలా తలిస్తే అతడు భ్రమపడినట్లే. పారమార్థిక జగత్తులో ఇట్టి భ్రాంతికి లోనైతే సాధకులు తమ లక్ష్యాన్ని కోల్పోయి, గమ్యభ్రష్టులై ఒకరిపట్ల ఒకరు అసూయాద్వేషాలతో రగిలిపోతారు. భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకోబోయి ఇట్టి భ్రాంతిలో పడిపోతే అతడు మతమౌఢ్యుడు, మూఢవిశ్వాసి అవుతాడు. ఈ లోపమే భక్తిమార్గంలో ఎదురయ్యే గొప్ప ఆటంకం; ఇది హేయ సంకుచిత మనస్సు నుండి జనిస్తుంది.
3. ఆధ్యాత్మిక పురోగతికి దేవతామూర్తుల దర్శనాలే ప్రామాణికాలు కావు
అటువంటి దివ్యదర్శనాదులే సమగ్ర పారమార్థికతగా ఎంచి అనేకులు అట్టి అనుభూతులు కలగని వ్యక్తి పారమార్థికుడే కాడన్న తప్పుడు నిర్ణయానికి వస్తూంటారు. ఆధ్యాత్మికత, లక్ష్యవిహీనమైన అద్భుత దర్శనాదులను పొందాలనే తహతహ – ఈ రెండూ, వారికి ఒక్కటిగానే కనపడతాయి. కాని ఈ రీతిలో కాంక్షించడం మనిషిని పార మార్థికునిగా రూపొందించడం మాట అటుంచి అతణ్ణి అన్ని విధాలుగా దుర్బలునిగా దిగజారుస్తుంది. ఏది సుస్థిరతకు, శీలబలిమికి దారితీయదో, ఏది సత్యం నిమిత్తం ఏది పవిత్రతనే ఆధారం చేసుకొని సమస్త ప్రపంచాన్ని ఎదిరింప శక్తిని అందించజాలదో, ఏది వివిధ రకాల కోర్కెల నుండి విముక్తుణ్ణి చేయడానికి బదులు వాటిలో చిక్కుపడవేస్తుందో, అది ఆధ్యాత్మిక రాజ్యానికి పూర్తిగా విరుద్ధమైనదని గ్రహించాలి. నీ జీవితంలో అద్భుత దర్శనాదులు అట్టి ఫలాలు అందివ్వకుంటే, నీకు అటువంటి దర్శనాలు కలుగుతూ ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక రాజ్యానికి నువ్వింకా వెలుపలనే ఉన్నావని తెలుసుకో; ఆ దర్శనాదులు మెదడుకు సంబంధించిన రుగ్మత కారణంగా కలుగుతున్నాయనీ, కనుక అవి నిరర్థకమైనవనీ గ్రహించు. అందుకు మారుగా అద్భుత దర్శనాలు, అనుభూతులు కలుగకున్నప్పటికీ ఆధ్యాత్మిక బలాన్ని సంతరించుకొంటున్నావని నువ్వు గ్రహిస్తే, సరైనా మార్గంలోనే పయనిస్తున్నావని, యుక్త సమయంలో దర్శనాలు అనుభూతులు నీకు కలుగుతాయని కచ్చితంగా విశ్వసించు.
4. ఆధ్యాత్మికతకు నిజమైన చిహ్నాలు
శ్రీరామకృష్ణుల భక్తులలో పలువురు భావసమాధి పొందడం ఎరిగి, చాలకాలం నుండి గురుదేవులను దర్శించుకొంటున్నా తనకు అటువంటి అనుభూతి కలుగకపోవడంతో కలతచెంది మా మిత్రుడొకడు* కన్నీళ్ళపర్యంతంగా ఆయన వద్దకు వెళ్ళి తన హృదయావేదనను వెళ్ళబోసుకున్నాడు. అతడి గోడు విని, శ్రీరామకృష్ణులు అతణ్ణి అనునయించి, ఇలా అన్నారు: “నాయనా! అవివేకంగా వ్యవహరించకు. భావసమాధి పొందడంతో సమస్తం సిద్ధించినట్లేనా? అది అత్యున్నత స్థితా? నిజమైన విశ్వాసం, పరిత్యాగం దానికంటే ఎన్నోరెట్లు ఉత్కృష్టమైనవని తప్పక తెలుసుకో. నరేంద్రుడికి (స్వామి వివేకానంద) సామాన్యంగా అవి కలుగవే! కాని చూడు, అతడి పరిత్యాగం, విశ్వాసం, నిష్ఠ, తేజం ఎంత గొప్పవో.”
5. ఆధికారిక పురుషులు, ఈశ్వరకోటులు, జీవకోటులు
పరమనిష్ఠ, ప్రగాఢ విశ్వాసం, ఏకాగ్ర భక్తి – వీటి సహాయంతో సాధకుడి విషయేచ్ఛలన్నీ నిర్మూలంకాగా, భగవంతునితో ఏకత్వంపొంది అద్వైతస్థితికి చేరుకొనే సమయం ఆసన్నమైనప్పుడు పూర్వసంస్కారాల ప్రభావంతో అప్పుడప్పుడు కొందరు సాధకుల మనస్సులలో ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ తాను లోకహితం చేకూర్చాలనే పావన ఆకాంక్షలు జనించడం కద్దు. అటువంటి ఆకాంక్షల ప్రభావంతో వారప్పుడు అద్వైత స్థితిలో సమగ్రంగా నెలకొని ఉండలేరు. ఆ మహోన్నత స్థితి నుండి ఒకింత దిగువకు, ‘నేను, నాది’ అనే స్థితికి దిగివస్తారు. కాని ఆ ‘అహం’ ‘నేను భగవంతుని దాసుణ్ణి, బిడ్డను, అంశను’ అన్న భగవంతునితో నిరంతర సన్నిహిత బాంధవ్యంతో మెలగుతుంది. అటువంటి ‘అహం’ ఎన్నటికీ కామకాంచనాల జోలికి పోదు. ఆ ‘నేను’ భగవంతుణ్ణే ‘పరమసారం’ గా గ్రహించి, ప్రాపంచిక రూపరసాదులకై పరుగులెత్తదు. తన లక్ష్యం నిమిత్తం రూపరసాదులు ఏ మేరకు ప్రయోజనకారులో ఆ మేరకు మాత్రమే వాటిని అది అభిలషిస్తుంది. ఎవరు అప్పటి వరకు బద్ధులై ఉండి పిదప సాధనలు అనుష్ఠించి భగవత్సాక్షాత్కార సిద్ధిని పొంది, తదనంతర జీవిత పర్యంతం భగవంతుణ్ణి భక్తితో కొలుస్తూ జీవిస్తారో, వారిని ‘జీవన్ముక్తులు’ గా పేర్కొంటారు. కాని ఎవరు జన్మతః భగవంతునితో ఒక విశిష్ట సంబంధాన్ని కలిగి ఈ జీవితంలో ఎన్నటికీ సామాన్యుల్లా బద్ధులు కాకుంటారో వారిని ‘ఆధికారిక పురుషులు’, ‘ఈశ్వరకోటులు’, ‘నిత్యముక్తులు’ అని శాస్త్రాలు పేర్కొంటాయి. మరో వర్గానికి చెందిన సాధకులు అద్వైత సిద్ధిని పొందిన తదనంతరం లోకహితార్థం సైతం ఆ మహోన్నత స్థితినుండి దిగిరారు; వీరిని ‘జీవకోటులు’ అంటారు. ఇటువంటి వారి సంఖ్యే అత్యధికమని గురుదేవుల ముఖతా మేం వినివున్నాం.
6. అద్వైత స్థితిలోని పరిమాణ తారతమ్యాలు
పైన పేర్కొన్న అద్వైతానుభూతి పొందిన పిదప లోకశ్రేయస్సు నిమిత్తం నిర్వికల్ప సమాధినుండి దిగివచ్చేలోపు కూడా అఖండ సచ్చిదానంద స్వరూపమైన జగత్కారణంతో వారు అనుభవించే ఏకత్వంలో తారతమ్యం కానవస్తుంది. వారిలో కొందరు ఆ చైతన్య సాగరాన్ని కేవలం దూరం నుండే దర్శించినవారై ఉంటారు; కొందరు దాన్ని సమీపించి స్పృశించి ఉంటారు; మరికొందరు ఆ సాగర జలంలోని కొన్ని బిందువులను మాత్రమే గ్రోలి ఉంటారు. ఇందుకు దృష్టాంతంగా శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: “దేవర్షి అయిన నారదుడు ఆ చైతన్య సాగరాన్ని దూరం నుండి మాత్రమే చూసి తిరిగివచ్చాడు; శుకదేవుడు మూడుసార్లు ఆ సాగరాన్ని స్పృశించాడు; జగద్గురువైన శివుడు మూడు గుక్కలు మాత్రమే గ్రోలి బాహ్యచైతన్యం కోల్పోయి పడిపోయాడు.” అటువంటి ఈ అద్వైత భావస్థితిలో కేవలం కొన్ని క్షణాలైనా లీనమై ఉండే స్థితినే ‘నిర్వికల్ప సమాధి’ అని అంటారు.
7. సవికల్ప సమాధి: భావాల ప్రగాఢత
అద్వైతానుభూతిలో తారతమ్యాలు ఉన్నట్లే, ఏ భావాలు సాధకుణ్ణి అద్వైత స్థితికి కొనిపోతాయో, అద్వైత స్థితికి దిగువన ఉండే ఆ శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాల అనుభూతిలో సైతం సాధకుల యోగ్యత మేరకు తారతమ్యం ఉంటుంది. కొందరు వీటిలో ఏదో ఒక భావ పరిపూర్ణానుభూతి పొంది తరిస్తారు; మరికొందరు ఏదో ఒక భావంలో మాత్రమే అసంపూర్ణ అనుభూతి పొందుతారు. ఈ భక్తి భావాలలో ఏ ఒక్క దానిలోనైనా పరిపూర్ణానుభూతిని పొందడాన్నే ‘సవికల్ప సమాధి’ గా పేర్కొంటారు.
8. ఆధ్యాత్మిక భావాల మార్పు మేరకు శారీరక మార్పులు అనివార్యం
అత్యున్నత అద్వైత స్థితి నుంచి నిమ్న సవికల్ప స్థితి వరకు అన్ని రకాల ఆధ్యాత్మిక స్థితులలోను సాధకునికి అద్భుతమైన శారీరక మార్పులు, దివ్యదర్శనాలు కలుగుతాయి. ఈ దివ్యదర్శనాలు, మార్పులు వివిధ వ్యక్తులలో విభిన్నంగా కానవస్తాయి; కించిత్తు అనుభూతులతోనే కొందరిలో ఈ మార్పులు కానవస్తాయి; మరికొందరిలో ప్రగాఢ అనుభూతులు కలిగినా ఈ మార్పులు అంతగా కానరావు. ఇందుకు ఉదాహరణగా శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: “ఒక చిన్న మడుగులో ఒకటి రెండు ఏనుగులు ప్రవేశిస్తే చాలు, ఆ మడుగు అల్లకల్లోలమై నీరు పొంగి బయటకు ప్రవహిస్తుంది; కాని విస్తారమైన చెరువులో ఏనుగుల గుంపు ప్రవేశించినా నీరు మునుపటిలా నిశ్చలంగానే ఉంటుంది.” కనుక శరీరంలో ఏర్పడే మార్పులు, దర్శనాలు ఇత్యాదివన్నీ భావసమాధిస్థితి ప్రగాఢతకు చిహ్నాలు కాజాలవు.
9. ఉన్నత, నిమ్న భావ సమాధులను తెలుసుకొనే పద్ధతి
అయినా ఆధ్యాత్మిక అనుభూతుల ఆనుపానులను తెలుసుకోగోరితే ఇంతకు ముందు పేర్కొన్నట్లు నిష్ఠ, పరిత్యాగం, శీల బలిమి, విషయేచ్ఛల క్షీణత మొదలైన వాటి ద్వారా ఊహించుకోవలసిందే. భావసమాధిలో ఏ మేరకు ఉన్నదో కేవలం ఈ గీటురాయితోనే తప్ప మరి దేనితోనూ పరీక్షించి తెలుసుకోలేం. ఒక్క విషయం, ఎవరు సమస్త లౌకిక వాసనలన్నిటినీ విసర్జించి తాము శుద్ధ బుద్ధ ముక్త స్వభావులమని అనుభూతం చేసుకొంటారో వారిలో మాత్రమే శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాలలో ఏ ఒక్క భావమైనా పరిపూర్ణంగా ప్రకటితమౌతుందని మనకు స్పష్టం అవుతుంది; కామ కాంచనాసక్తులైన ప్రాపంచికులలో అది మృగ్యం. కామాంధులకు విషయాకర్షణ మాత్రమే స్ఫురిస్తుంది. లేశమైనా కామగంధంలేని మనస్సు భగవంతుని పట్ల అనుభూతం చేసుకొనే భావాకర్షణను విషయాసక్తులు ఎలా గ్రహించగలరు?
10. అవతారపురుషులు మాత్రమే అన్ని ఆధ్యాత్మిక భావాలను సమగ్రంగా అనుభూతం చేసుకోగలరు
భావసమాధి తత్త్వాన్ని గురించి గురుదేవుల ముఖతా మేం విన్నదాన్ని వివరింప ప్రయత్నించాం. పాఠకులకు సుస్పష్ట అవగాహనకు ఈ సందర్భంలో మరికొన్ని విషయాలు తెలుపడం అవసరంగా తోస్తున్నది. సాధకులలో శాంత దాస్యాది, అద్వైతభావానుభూతిలో తారతమ్యం కానవస్తూ ఉంటుందని పైన పేర్కొన్న విషయాలు విని అవతారపురుషులు కూడ సామాన్యులలా ఆధ్యాత్మిక రాజ్యపు ఏదో ఒక పరిమితుల మధ్య నిబద్ధులై ఉంటారని తలచరాదు. తమ ఇచ్ఛానుసారం వారు శాంత దాస్యాది ఏ భావాన్నైనా తమలో సమగ్రంగా అభివ్యక్తం చేయగలరు. అట్లే అద్వైత భావాన్ని అనుసరించి భగవంతునితో ఏకత్వం చెందడంలో వారెంత పురోగమించగలరంటే అది జీవన్ముక్తులకుగాని, నిత్యముక్తులకు లేదా ఈశ్వరకోటికి గాని, మరే మానవమాత్రునికిగాని సాధ్యం కాదు. రసస్వరూపంతోను, పరమానంద స్వరూపంతోను ఏకత్వంలో అంత పురోగమించి, తదుపరి దాని నుండి విడివడి మళ్ళీ ‘నేను, నాది’ అనబడే ఈ జగత్తుకు దిగి రావడం సామాన్యజీవులకు ఎన్నడూ సాధ్యంకాదు. అలా తిరిగి రావడం కేవలం ఒక్క అవతారపురుషులకు మాత్రమే సాధ్యం. వారి అద్భుత అనుభూతులను నమోదు చేసి అవతరించినవే వేదాది శాస్త్రాలు. కాబట్టే ఆ అవతార పురుషుల ఆధ్యాత్మికానుభూతులు వేదాది శాస్త్రాలలో నమోదు కాబడిన అనుభూతులను అధిగమించడంలో ఆశ్చర్యంలేదు. శ్రీరామకృష్ణులు ఇందుకు ఉదాహరణగా, “ఇక్కడి అవస్థ (అంటే ఆయన స్వీయ అనుభూతులు) వేదవేదాంతాలలో పేర్కొనబడ్డ స్థితులన్నిటినీ ఎంతో అతిక్రమించిపోయింది” అని చెప్పేవారు. శ్రీరామకృష్ణులు ఆ కోవకు చెందిన పురుషులలో ప్రథమగణ్యులు కావడంచేత ఆరు నెలల పర్యంతం నిర్వికల్ప సమాధిలో పూర్తిగా మగ్నులై ఉన్న తదనంతరం సైతం మళ్ళీ ‘బహుజన హితాయ’, ‘జనులకు బోధింప’ ‘నేను, నాది’ అనే ఈ జగత్తుకు దిగి రాగలిగారు. అదొక అద్భుత గాథ. ఈ సందర్భంలో దాన్ని గురించి ఒకింత ప్రస్తావించడం అసంగతం కాబోదు.
11. శ్రీరామకృష్ణుల వేదాంత చర్చకు బ్రాహ్మణి ప్రతికూలత
శ్రీ తోతాపురినుండి సన్న్యాసం పుచ్చుకొన్న మూడవ నాటికే శ్రీరామకృష్ణులు చరమానుభూతియైన నిర్వికల్ప సమాధి లేదా వేదాంతం పేర్కొనే భగవంతుడితో ఏకత్వం పొందడాన్ని సంతరించుకొన్నారు. ఆయన అప్పటికే తంత్రాలలో పేర్కొన్న సాధనలన్నింటిని అనుష్ఠించేశారు. ఆయన ఈ సాధనలు అనుష్ఠిస్తున్నప్పుడు అందుకు వలసిన సామగ్రిని సేకరించి, ఆ సామగ్రిని వినియోగించే విధానం ఇత్యాదులు ఆయనకు నేర్పి సహాయం చేసిన పండితురాలు భైరవీ బ్రాహ్మణి (గురుదేవులు ఆమెను ‘బామ్నీ’ అని సంబోధించేవారు). ఆ సందర్భంలో ఆమె దక్షిణేశ్వరంలోనే నివసిస్తూ ఉండేది. శ్రీరామకృష్ణుల ముఖతా మేం విన్నదేమిటంటే బ్రాహ్మణి ఆయనను శ్రీ తోతాపురితో మెలగవద్దని కట్టడిచేసిందట. “నాయనా, అతడితో అంతగా కలసిమెలసి ఉండవద్దు. ఇలాంటి వ్యక్తులకు భక్తి మృగ్యం. భగవంతుని పట్ల నీకున్న ప్రేమ, భక్తి నశిస్తాయి” అని చెప్పిందట. కాని శ్రీరామకృష్ణులు ఆమె ఉపదేశాన్ని లక్షించక, రేయింబవళ్ళు వేదాంత విచారణలో, వేదాంతానుభూతిలో మగ్నులు కాసాగారు.
12. నిర్వికల్ప సమాధిలో సతతం మగ్నులై ఉండాలని శ్రీరామకృష్ణుల సంకల్పం
పదకొండు నెలలు దక్షిణేశ్వరంలో గడిపిన తరువాత తోతాపురి వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు అప్పుడు ‘నేను, నాది’ అనే జగత్తులో ఉండిపోవడానికి బదులు అవిచ్ఛిన్నంగా భగవంతునిలో లీనమై, అద్వైత స్థితిలో నివసించాలని సంకల్పించారు. తదనుగుణంగా ఆయన వ్యవహరించ సాగారు. అదొక అద్భుత గాథ. అప్పుడు శ్రీరామకృష్ణులకు తమకు దేహం ఉన్నదనే స్పృహ ఉండేది కాదు. దేహాన్ని పరిరక్షించుకోవడానికి అవసరమైన తినడం, నిద్రించడం, శౌచాదుల భావనలు ఆయన మనస్సుకు స్ఫురించేవి కావు. ఇక ఇతరులతో సంభాషించాలి మొదలైన ఆకాంక్షల గురించి చెప్పనక్కరలేదు. ఆ స్థితిలో ‘నేను, నాది’, ‘నువ్వు, నీది’ అనే భావనల ఉనికే లేదు. ‘రెండు’ లేక ‘ఒకటి’ అనే భావన సైతం ఆ స్థితిలో జనించలేదు. ఎందుకంటే – ‘రెండు’ అనే జ్ఞానం ఉన్నప్పుడే కదా ‘ఒకటి’ అనే ఎరుక ఉంటుంది. ఆ స్థితిలో మనోవ్యాపారాలన్నీ నిశ్చలమైపోయాయి. పరిపూర్ణ శాంతి నెలకొన్నది.
కిమపి సతతబోధం కేవలానన్దరూపం
నిరుపమమతివేలం నిత్యముక్తం నిరీహమ్ ।
నిరవధి గగనాభం నిష్కలం నిర్వికల్పం
హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ ॥
ప్రకృతివికృతిశూన్యం భావనాతీతభావం । – వివేకచూడామణి, 408–9
సంక్షిప్త భావం: వివేక జ్ఞానసంపన్నుడైన సాధకుడు అనిర్వచనీయం, జ్ఞానరూపం, కేవలం ఆనందరూపం, అద్వితీయం, అనంతం, నిత్యముక్తం, వాసనాశూన్యం, ఆకాశంలా విస్తృతం, అఖండం, అసదృశం, వికల్పరహితం, ప్రకృతి – వికృతి శూన్యం వాఙ్మనోతీతం అయినటువంటి పూర్ణబ్రహ్మస్వరూపాన్ని తన హృదయంలో ధ్యానిస్తూ, సమాధి పొంది దానిలో ఐక్యమవుతున్నాడు.
నిర్వికల్ప సమాధిలో ఆనందం, కేవలం పరమానందం. దానికి దారి తెన్ను, అవలంబనం, రూపం, నామం ఏదీ లేదు. అనిర్వచనీయమైన ఆ ఆత్మస్వరూప స్థితిలో మనో బుద్ధులకు అతీతమైన భావాలన్నిటికీ అతీతంగా ఉండే ఆ అఖండ స్థితిలో, శాస్త్రాలు దేన్ని ‘ఆత్మతో ఆత్మ క్రీడ’ అని నిర్దేశిస్తున్నాయో – అనిర్వచనీయమైన అట్టి స్థితిలో శ్రీరామకృష్ణులు ఎడతెరిపి లేక ఆరు నెలలు ఉండిపోయారు.
13. శ్రీరామకృష్ణుల అనుపమాన మానసం
వేదాంతం అభివర్ణించే నిర్వికల్ప సమాధి అనుభూతి మార్గంలో ఏ లౌకిక వస్తువుగాని, సంబంధంగాని తమకు అడ్డంకి కాలేదని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఎందుకంటే జగజ్జనని నిమిత్తం తమ మనస్సు నుండి సమస్త ఆకాంక్షలనూ పరిత్యజిం చేశారు కనుక. ప్రతిదీ జగజ్జననికి అర్పిస్తూ ఆయన ఇలా పలికారు: “అమ్మా, ఇదుగో నీ జ్ఞానం, ఇదుగో నీ అజ్ఞానం, ఇదుగో నీ మంచి, ఇదుగో నీ చెడు, ఇదుగో నీ ధర్మం, ఇదుగో నీ అధర్మం, ఇదుగో నీ పుణ్యం, ఇదుగో నీ పాపం, ఇదుగో నీ ఖ్యాతి, ఇదుగో నీ అపఖ్యాతి – వీటినన్నిటిని స్వీకరించి నీ పాదపద్మాలపట్ల నాకు శుద్ధ భక్తిని ప్రసాదించి, నాకు నీ సాక్షాత్కారం కలిగించు.” ఆ విధంగా జగజ్జనని పట్ల శుద్ధభక్తి నిమిత్తం ఆమె పాదపద్మాల ప్రత్యక్ష దర్శనం కోసం సమస్త కోర్కెలను, వాసనలను త్యజించారు. అహేతుక ప్రేమ భక్తులను పొందడం అటుంచి, కనీసం దీన్ని మనం కించిత్తు అయినా ఊహించుకోగలమా? ఎప్పుడైనా నోరుజారి, ‘దేవుడా! నాకు ఉన్నదంతా స్వీకరించు’ అని పలికిన వెంటనే, అవసరం తీరగానే దేవుణ్ణి నెట్టివేసి అంతా ‘నాది’ అంటూ లాభనష్టాలు బేరీజు వేసుకొంటాం. ఏ పనినైనా చేస్తున్నప్పుడు ‘లోకులు ఏమనుకొంటారో’ అని యోచిస్తాం. నానారకాల ఆందోళనలకు గురై, అశాంతితో అనేక విషయాల వెంట పరుగులు తీస్తాం. భవిష్యత్తును గురించి యోచిస్తూ మనం బాధల అగాధాల, సుఖ శిఖరాల మధ్య జీవితం గడిపివేస్తూవుంటాం. యావత్తు ప్రపంచాన్ని తలక్రిందులు చేసి మన స్వార్థపరత్వానికి దాన్ని లొంగదీయలేకుంటే, ఆ ధ్యేయం నిమిత్తం కనీసం దాన్నొక మెలికెతిప్పే వేళ్ళూనిన అహం మనలో ఉన్నది. కాని శ్రీరామకృష్ణులకు మనవంటి కాపట్యపు మనస్సు లేదు; కనుకనే, “అమ్మా, ఇదుగో నువ్వు ఇచ్చినది యావత్తు తిరిగి పుచ్చుకో” అని అన్న మరుక్షణంనుంచి ఆయన మనస్సు ఎన్నడూ క్రీగంటనైనా వాటివంక పోయి ఎరుగదు. ‘అయ్యో! నోరుజారిందే. అలా అనకుండా ఉంటే బాగుండేదే’ అని కించిత్తు కూడ ఆయన వ్యాకులపడి ఎరుగరు. అందుచేతనే ఒకసారి జగజ్జననికి ఇచ్చివేశానన్న దేనిని సైతం శ్రీరామకృష్ణులు ‘నాది’ అని పేర్కొనకపోవడం మనకు కానవస్తున్నది.
14. శ్రీరామకృష్ణుల సత్యనిష్ఠ
ఈ సందర్భంలో మరో విషయం చెప్పగోరుతున్నాం. శ్రీరామకృష్ణులు, జగజ్జననికి తన మనశ్శరీరాలకు చెందిన ధర్మాధర్మాలు, పాపపుణ్యాలు, మంచి చెడులు, ఖ్యాతి అపఖ్యాతులు మొదలైన అన్నిటిని సమర్పించారు. కాని, ‘అమ్మా, ఇదుగో నీ సత్యం, ఇదుగో నీ అసత్యం, రెంటిని తిరిగి పుచ్చుకో’ అని మాత్రం చెప్పలేకపోయారు. అందుకు గల కారణాన్ని స్వయంగా ఆయన ఒకసారి మాకు తెలిపారు. “నేను ఆ విధంగా సత్యనిష్ఠను కూడ సమర్పిస్తే, ‘జగజ్జననికి సమస్తం సమర్పించివేశాను’ అనే సత్యాన్ని ఎలా పాటించినట్లవుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. సత్యనిష్ఠను తప్ప తక్కిన సమస్తాన్ని జగజ్జననికి సమర్పించిన శ్రీరామకృష్ణులలో ఎంతటి మహోన్నత సత్యనిష్ఠను మేం చూసివున్నాం! ఫలానా చోటుకు వస్తానని ఆయన అంటే, తప్పక చెప్పిన సమయానికి అక్కడకు వెళ్ళేవారు. ఫలానా వ్యక్తి నుండి ఒక వస్తువును స్వీకరిస్తానని ఆయన ఒకసారి చెబితే, మరెవరి వద్ద నుండీ ఆ వస్తువును ఆయన పుచ్చుకోరు. ఎప్పుడైనా ఫలానా పదార్థం తినననో లేదా ఫలానా పని చేయననో ఆయన చెప్పారంటే నాటి నుండి ఆ పదార్థాన్ని తినడంగాని, ఆ పనిని చేయడంగాని ఆయనకు సాధ్యమయ్యేది కాదు. “సత్యనిష్ఠాగరిష్ఠునికి సత్యస్వరూపుడైన భగవంతుని సాక్షాత్కారం కలుగుతుంది. సత్యాన్ని పాటించే వ్యక్తి పలుకులను జగజ్జనని వమ్ము కానివ్వదు” అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఆహా, శ్రీరామకృష్ణుల జీవితంలో ఈ అంశాన్ని గురించి ఎన్ని దృష్టాంతాలను మేం చూడలేదు! వాటిలో కొన్నింటిని ఇక్కడ ప్రస్తావిస్తాం.
15. మొదటి ఉదాహరణ
ఒక రోజు పరమ భక్తురాలైన గోపాలుని తల్లి దక్షిణేశ్వరంలో అన్నం వండింది. వంట సిద్ధమైన తరువాత శ్రీరామకృష్ణులు భోజనానికి కూర్చున్నారు. అన్నం బాగా ఉడకలేదు, బిరుసుగా ఉంది. శ్రీరామకృష్ణులు చిరాకుపడి, “ఈ అన్నాన్ని నేను తినగలనా? ఇకనుండి ఆమె చేతివంటను మరెన్నడూ తినను” అని అన్నారు. శ్రీరామకృష్ణుల ముఖతా ఈ మాటలు వెలువడగానే ప్రతి ఒక్కరూ, భవిష్యత్తులో గోపాలుని తల్లి జాగ్రత్తగా ఉండడానికే ఆయన అలా హెచ్చరించారని అనుకొన్నారు. లేకపోతే ఆమెను అభిమానించే శ్రీరామకృష్ణులు ఆమె చేతివంటను మరెన్నడూ తినకపోవడం సాధ్యమా? కాస్సేపయ్యాక ఆమెను మన్నిస్తారు, అంతటితో ఆ వ్యవహారం సమసిపోతుందనుకొన్నారు. కాని తద్విరుద్ధంగా జరిగింది. ఎందుకంటే, అది జరిగిన కొద్ది కాలానికే శ్రీరామకృష్ణులకు గొంతులో వ్రణం బయలుదేరింది. క్రమేణా ఆ వ్రణం తీవ్రమై ఆయనకు అన్నం తినడమే అసాధ్యమైపోయింది. ఈ విధంగా ఆకస్మికంగా ఆయన నోటివెంట వచ్చిన మాటలు పరిస్థితుల ప్రభావంతో యథార్థాలయ్యేవి.
16. రెండవ ఉదాహరణ
ఒకరోజు దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులు భావావస్థలో ఉన్నప్పుడు, “ఇప్పటి నుండి పాయసాన్నం తప్ప మరేమీ తినబోను” అని అన్నారు. మాతృదేవి ఆయనకు భోజనాన్ని తీసుకువస్తూ ఈ మాటలు విన్నారు. ఆ మాటలు ఆలకించి, శ్రీరామకృష్ణుల ముఖతా వెలువడిన మాటలు ఏనాడూ అబద్ధం కాబోవని ఆమెకు తెలిసి వుండడం చేత వణికిపోయి, “పాయసాన్నం ఎందుకు? మీకు అన్నం, చేపల పులుసు నేను వండిపెడతాను” అని అన్నది. “కాదు, పాయసాన్నం మాత్రమే తింటాను” అన్న మాటలే ఆ భావావస్థలో ఆయన నోటి నుండి వెలువడ్డాయి. ఇది జరిగిన కొద్దికాలానికే కంఠంలో వ్రణం బయలుదేరి ఆయన మరే ఇతర ఆహారమూ పుచ్చుకోలేకపోవడం తటస్థించింది. కేవలం పాయసాన్నం, పాలు–బార్లీ మాత్రమే పుచ్చుకొని గడపవలసి వచ్చింది.
17. మూడవ ఉదాహరణ
ఉదారుడు, సంపన్నుడు, సుప్రసిద్ధుడు అయిన శంభు చంద్ర మల్లిక్‌ను తమ నలుగురు సరఫరాదారులలో రెండవ వానిగా శ్రీరామకృష్ణులు పేర్కొనేవారు. రాణీ రాస్మణి కాళికాలయం సమీపాన అతడికొక ఉద్యానం ఉండేది. అతడక్కడ శ్రీరామకృష్ణులతో భగవత్ప్రసంగాలలో ఎక్కువ సమయం గడిపేవాడు. ఆ ఉద్యానంలో ఒక ఉచిత ఔషధశాలను అతడు నిర్వహించేవాడు. శ్రీరామకృష్ణులు తరచు కడుపు నొప్పితో బాధ పడేవారు. ఈ సంగతి శంభుమల్లిక్ ఒక రోజు తెలుసుకొని నల్లమందు కొద్దిమోతాదుల్లో ప్రతిరోజు పుచ్చుకొంటే నయమవుతుందని సలహా ఇచ్చాడు. అంతేగాక శ్రీరామకృష్ణులు కాళికాలయానికి తిరిగి వెళ్ళేటప్పుడు తనవద్ద నుండి దాన్ని తీసుకోమన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు సమ్మతించారు. తరువాత మాటల్లోపడి ఆ సంగతి ఇద్దరూ మరిచిపోయారు.
గోలప్ మాగా పేర్కొనే గోలప్సుందరి దేవి
యోగిన్ మాగా పేర్కొనే యోగీంద్ర మోహినీ విస్వాస్
18. జగజ్జనని ఆయనను తప్పటడుగు వేయనివ్వదు
శంభుబాబు వద్ద సెలవు పుచ్చుకొని తిరిగి వస్తున్నప్పుడు శ్రీరామకృష్ణులకు నల్లమందు సంగతి జ్ఞప్తికి వచ్చింది. నల్లమందు తీసుకోవడానికి ఆయన వెనుతిరిగి వచ్చారు. కాని అప్పటికే శంభుబాబు లోపలకు వెళ్ళిపోయాడు. శంభును పిలవడానికి బదులుగా అతడి మేనేజర్‌ను అడిగి కాస్త నల్ల మందు తీసుకుని తిరిగి రాస్మణి ఉద్యాన వనానికి బయలుదేరారు. కాని కాస్త దూరం రాగానే తల తిరిగినట్లయి ఎదురుగుండా ఉన్న బాటను చూడలేకపోయారు. తమ కాళ్ళు బాట ప్రక్కనున్న మురుగు కాలువ వైపు లాగబడుతున్నట్లు అనిపించింది ఆయనకు. ‘ఏమిటిది? ఇది కాలిబాట కాదే?’ అని అనుకొన్నారు. అదే సమయంలో ఇలా జరగడానికి కారణం కూడ ఆయనకు స్ఫురించలేదు. చివరకు తాను వెళ్ళవలసిన దారి ఇది కాదనుకొని శంభుబాబు ఉద్యాన వనంకేసి తిరిగారు. అటువెళ్ళే దారి స్పష్టంగా కనిపించింది. కొంచెం ఆలోచించి శ్రీరామకృష్ణులు, శంభుబాబు ఉద్యాన ముఖద్వారం వద్దకు తిరిగి వచ్చారు. బాటను చక్కగా ధ్రువపరచుకొని మళ్ళీ జాగ్రత్తగా రాస్మణి ఉద్యానంకేసి బయలుదేరారు. కాని కొన్ని అడుగులు ముందుకు వేశారో లేదో అదే దురవస్థ! బాటను చూడలేకపోయారు. కాళ్ళు వ్యతిరేక దిశకేసి లాక్కెళ్ళసాగాయి. ఈ విధంగా కొన్నిసార్లు జరిగాక అసలు సంగతి ఆయనకు స్ఫురించింది. శంభు తన వద్దనుండి నల్లమందు పుచ్చుకోమని కోరాడు. అందుకు మారుగా ఆయన అతడి మేనేజర్ నుండి శంభుకు తెలుపకుండానే పుచ్చుకొన్నారు. అందుచేతనే అమ్మ ఆయనను ముందుకు వెళ్ళనివ్వడంలేదు. శంభు ఆదేశం లేకుండా మేనేజర్ నల్లమందు ఇచ్చి ఉండకూడదు; తామూ శంభునుండే దాన్ని పుచ్చుకొని ఉండవలసింది. శంభు ఆయనను తననుండి పుచ్చుకోమనే కదా చెప్పాడు. దొంగతనం, అబద్ధం అనే రెండు తప్పులు దొర్లిపోయాయి. అందుచేతనే అమ్మ ఆయనను అటూ ఇటూ త్రిప్పుతూ, తిరిగి వెళ్ళనివ్వలేదు. ఇలా ఆలోచించి శ్రీరామకృష్ణులు శంభుబాబు ఔషధశాలకు తిరిగి వెళ్ళారు. అప్పటికి మేనేజర్ వెళ్ళిపోయాడు. పిదప ఆయన “ఇదుగో, నీ నల్లమందు” అని బిగ్గరగా పలికి నల్లమందు పొట్లం కిటికీగుండా లోపలికి పారేశారు. తదనంతరం రాస్మణి ఉద్యానం కేసి బయలుదేరారు. ఈసారి ఆయనకు తల త్రిప్పుడు లేదు, బాట స్పష్టంగా కనిపించింది. ఏ ఇబ్బందీ పడకుండా కాళికాలయానికి చేరుకోగలిగారు. “నేను పూర్తిగా అమ్మను ఆశ్రయించాను. అందుచేతనే అమ్మ నా చెయ్యి పుచ్చుకొన్నది. ఏ ఒక్క తప్పుటడుగూ ఆమె వేయనివ్వలేదు” అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఆయన జీవితంలో మేం విన్న ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. ఆహా ఎంతటి అద్భుత విషయాలు! సత్యనిష్ఠ పట్ల అంతటి భక్తిప్రపత్తులను, భగవంతునిపై అంతటి పరాధీనతను వీసమెత్తు అయినా మనం ఊహించుకోగలమా? భగవంతునిపై ఆ రకమైన పరాధీనతను గురించి శ్రీరామకృష్ణులు పదేపదే మాకు ఈ దృష్టాంతంలో తెలియచేసేవారు: “ఆ ప్రాంతంలో (అంటే ఆయన జన్మస్థలమైన కామార్పుకూర్లో) పొలాల మధ్య గట్లు ఉండేవి. జనం ఒక పల్లె నుండి మరో పల్లెకి ఈ గట్లమీదుగా నడచిపోవడం కద్దు. ఆ గట్లు బాగా సన్నవిగా ఉండేవి. తండ్రి చిన్నబిడ్డను చంకనెత్తుకొనేవాడు; లేకుంటే బిడ్డడు జారి పడిపోయే ప్రమాదం ఉంది. కాస్త పెరిగిన బిడ్డడు తండ్రి మరో చేతిని పుచ్చుకొని ఆ గట్లపై నడిచేవాడు. అలా పోతూవుండగా ఒక తెల్లగ్రద్దనుగాని లేదా మరిదేన్నో చూసి సంతోషంతో బిడ్డలిద్దరూ చప్పట్లు కొట్టసాగుతారు. తండ్రి తనను పట్టుకొని ఉన్నాడని ఎరిగిన చంకలోని బిడ్డ ఏ భయం లేకుండా ఆనందంగా కేరింతలు కొడుతూంటాడు. తండ్రి చెయ్యి పుచ్చుకొని నడుస్తూన్న బిడ్డ, గట్టు సంగతి మరచిపోయి, తండ్రి చెయ్యి విడిచి చప్పట్లు కొట్టడంతో జారి క్రిందపడి ఏడవడం మొదలుపెడతాడు. అదే విధంగా ఎవరి చేతిని అమ్మ పుచ్చుకొని ఉంటుందో అతడికి ఏ రకమైన భీతీ ఉండదు. కాని ఎవరు, అమ్మ చేయి పుచ్చుకొని ఉంటాడో అతడికి భయం ఉంటుంది, చేయి విడిచిన మరుక్షణం అతడు పడిపోతాడు.”
19. నిర్వికల్ప సమాధి మార్గంలో శ్రీరామకృష్ణులకు ఎదురైన అడ్డంకి
ఈ విధంగా తీవ్ర భగవదనురాగం కారణంగా లోకంలోని ఏ వస్తువు పట్లగాని లేక వ్యక్తిపట్లగాని మనస్సులో ఎలాంటి ఆకర్షణ లేదా వెనుకకు తిరిగి చూడాలనే ప్రతిబంధకంగాని లేకపోవడంచేత ఎలాంటి లౌకిక ఆకాంక్షలు లేదా వాసనలు శ్రీరామకృష్ణుల నిర్వికల్ప సమాధి మార్గంలో అడ్డంకులుగా నిలువలేదు. అడ్డంకిగా నిలిచింది కేవలం ఒక్కటే: ఇంతకాలంగా ఆయన ఎవరిని పరిపూర్ణ భక్తితో ఆరాధిస్తూ వచ్చారో, ఎవరిని ఆయన సారాలన్నిటి సారంగా, కారణాలన్నిటికి కారణంగా, పరాత్పరిగా భావిస్తూ వచ్చారో, ఏ దేవి ‘సౌమ్యా సౌమ్యతరా శేష సౌమ్యేభ్యస్త్వతి సుందరీ’ – జగజ్జనని ఆ అపురూప సౌందర్య మూర్తి ఒక్కటి మాత్రం ఆయన మార్గంలో అడ్డంకిగా నిలిచింది. ఆ సంఘటనను శ్రీరామకృష్ణులు ఇలా అభివర్ణించారు: “మనస్సును సమీకరించుకొని ఏకాగ్రం చేసిన మరుక్షణమే అమ్మ రూపం ఎదురుగా వచ్చి నిలిచింది. అప్పుడా రూపాన్ని అతిక్రమించి పోవడానికి మనస్కరించలేదు. ఎన్నిసార్లు మనస్సు నుండి సమస్తాన్నీ బయటకు పారద్రోలి వికల్పరహితం చేయ ప్రయత్నించినా, అన్నిసార్లూ అట్లే జరిగింది. చివరకు దీర్ఘంగా ఆలోచించి, మనస్సును కూడదీసుకొని జ్ఞానాన్ని ఖడ్గంగా పరిగణించి, ఆ ఖడ్గంతో ఆ రూపాన్ని మానసికంగా రెండుగా తెగనరికాను. అప్పుడు మనస్సు సంపూర్ణంగా వృత్తి రహితమైపోయింది. పిదప హుటాహుటిగా రివ్వున పైకెగసి నిర్వికల్పావస్థకు చేరింది.”
ఈ మాటలు మనకు అర్థరహితాలుగా స్ఫురించవచ్చు. ఎందుకంటే జగన్మాత ఏ మూర్తినీ మనం ఎన్నడూ సొంతం చేసుకొని ఎరుగమే! ఆమెతో అనురాగ బాంధవ్యాన్ని కల్పించుకోలేదు. హృదయపూర్వకంగా ఎన్నడూ ఎవరినీ ప్రేమించి ఎరుగం. హృదయ పూర్వకంగా, గాఢంగా మనం ప్రేమించేది ఈ తుచ్ఛమైన మనస్సును, రక్తమాంసాలతో కూడిన ఈ దేహాన్ని మాత్రమే. ఇందుచేతనే మరణంపట్ల లేదా మనస్సులో ఏర్పడే సమూల మార్పుల పట్ల మనకు అంతటి భయం. కాని శ్రీరామకృష్ణులకు అవేవీ లేవు. ఈ ప్రపంచంలో అత్యావశ్యకమైనది జగజ్జనని పాదపద్మాలు మాత్రమే అని ఆయనకు అంతరాంతరాళాలలో తెలుసు; కనుకనే తన సమయాన్ని ఆ దివ్య పాదపద్మాలను ధ్యానించడంలోనే గడుపుతూ, రేయింబవళ్ళు ఆ దివ్యమూర్తి సేవకే తమను అర్పించుకొన్నారు. అందుచేత ఆ దివ్యమూర్తిని మనోఫలకం నుండి తొలగిస్తే దానికి ఇక ఆధారమైనది ఈ ప్రపంచంలో ఏం ఉంటుంది? ఆ మనస్సు పూర్తిగా ఆలంబరహితమై, వృత్తిహీనమై నిర్వికల్పావస్థకు చేరింది.
పాఠక మహాశయా! నీకు ఆ విషయం అర్థం కాకుంటే, ఒక్కసారి దాన్ని ఊహింప ప్రయత్నించు. శ్రీరామకృష్ణులు జగజ్జననిని ఏ మేరకు తన ‘సొంతం’ చేసుకొన్నారో, ఎంతటి తీవ్ర ఉత్కంఠతో ఆమెను ప్రేమించగలిగారో ఊహించగలిగితే అప్పుడు నీకు అనుభూతం అవుతుంది.
20. సమాధ్యవస్థలో ఆరు నెలలు
శ్రీరామకృష్ణులు అట్టి నిర్వికల్పావస్థలో ఎడతెగక ఆరు నెలలకాలం గడిపారు. ఆ సంఘటన గురించి ఆయన ఇలా తెలిపారు: “సామాన్య జీవి ఏ స్థితినుండి తిరిగి రాజాలడో ఆ స్థితిలో నేను ఆరు నెలలు ఉండిపోయాను. ఆ స్థితిలో శరీరం ఇరవై ఒక్కరోజులు నిలిచివుండి పిదప చెట్టు నుండి రాలిపడే ఎండుటాకులా పడిపోతుంది. రేయింబవళ్ళ రాకపోకల ఎరుకే ఉండేది కాదు. చనిపోయిన మనిషి నాసికాపుటాలలోకి, నోట్లోకి ఈగలు ఎలా దూరేవో, అట్లే నా నాసికాపుటాలలోకి, నోట్లోకి ఈగలు దూరేవి. కాని ఆ స్పృహే నాకు ఉండేది కాదు. దుమ్ము ధూళి చేరి శిరోజాలు జడలు కట్టిపోయాయి. మలమూత్రాదులు నాకు తెలియకే జరిగిపోయేవి. అట్టి స్థితిలో దేహం ఎలా నిలవగలుగుతుంది? అప్పుడే రాలిపోయి ఉండేది. కాని ఆ సమయంలో ఒక సాధువు రావడం తటస్థించింది. అతడి చేతిలో ఒక చిన్న కర్ర ఉంది. నన్ను చూడగానే నా స్థితిని గుర్తించాడు. ఈ దేహం ద్వారా అమ్మ కార్యం ఇంకా ఎంతో చేయవలసి ఉందని, దీనిని పరిరక్షిస్తే అనేకులకు మేలు ఒనగూరుతుందని కూడ అతడు గ్రహించాడు. అందుచేత వేళకు ఆహారం తెచ్చి ఇస్తూ, పదే పదే నా శరీరాన్ని కొట్టి బాహ్యస్మృతి కలిగింప ప్రయత్నించే వాడు. కాస్త బాహ్యస్పృహ కలిగే సూచన కనిపించిన తక్షణమే కొంత ఆహారం నా నోట కుక్కేవాడు. ఆ విధంగా ఒక్కో రోజు ఒకింత ఆహారం నా కడుపులోకి వెళ్ళేది, ఒక్కో రోజు వెళ్ళేది కాదు. ఆ రీతిలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఆ తరువాత, ‘భావముఖంలో నెలకొని ఉండు; ప్రజల ఆధ్యాత్మిక జ్ఞానోదయం నిమిత్తం భావముఖంలో నెలకొని ఉండు’ అన్న అమ్మ ఆదేశం వినవచ్చింది. తదనంతరం అస్వస్థత, రక్తగ్రహణి పట్టుకొన్నాయి. పేగులు మెలికలు తిరిగిపోతున్నట్లు విపరీతమైన నొప్పి కలిగేది. ఆ నొప్పితో దాదాపు ఆరు నెలలపాటు బాధను అనుభవించాక క్రమేణా మనస్సుకు దేహస్మృతి కలుగసాగింది. అంతకు మునుపు సదా మనస్సు పైకెగసి నిర్వికల్పావస్థను చేరుకొని ఉండేది.”
21. శ్రీరామకృష్ణుల సమాధి స్థితిపై కెప్టెన్
శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందడానికి పది పన్నెండేళ్ళ క్రితం ఆయనను దర్శించే భాగ్యం పొందిన కొందరి ముఖతా మేం ఇలా వినివున్నాం: “ఆ సమయంలో సైతం ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కారు. ఇరవై నాలుగు గంటలూ భావసమాధిలో మగ్నులై ఉండేవారు. అలాంటప్పుడు ఎలా మాట్లాడగలరు?” నేపాల్ ప్రభుత్వాధికారియైన శ్రీ విశ్వనాథ్ ఉపాధ్యాయను శ్రీరామకృష్ణులు ‘కెప్టెన్’ అని సంబోధించేవారు. శ్రీరామకృష్ణులు మూడు రోజులు రాత్రింబవళ్ళు ఎడతెగని సమాధిలో మగ్నులై ఉండడం ప్రత్యక్షంగా తాను చూశానని విశ్వనాథ్ ఉపాధ్యాయ మాకు తెలిపి ఉన్నాడు. ప్రగాఢ సమాధి, దీర్ఘకాలం కొనసాగిన సందర్భాలలో మెడ నుండి వెన్నుపూస చివరి వరకు, మోకాళ్ళ నుండి పాదాల వరకు పైనుండి క్రిందుగా ఆవునేతిని సుతిమెత్తగా రుద్దేవారని కూడా అతడు చెప్పాడు. అలా రుద్దిన తరువాత ఉచ్చ సమాధిస్థితినుండి ‘నేను, నాది’ అన్న సామాన్య స్థితికి దిగిరావడానికి ఆయనకు సానుకూలమయ్యేదని కూడ అతడు చెప్పాడు.
22. దీనిని గురించి శ్రీరామకృష్ణుల ఉవాచ
అనేక సందర్భాలలో మాతో శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: “పై దిశగా నిర్వికల్ప స్థితికి పోవడమే ఈ మనస్సు నైజం. సమాధిలో మగ్నమయ్యాక దిగువకు రావడానికి ఇచ్ఛగించదు. మీ నిమిత్తం దీనిని బలవంతంగా దిగువకు తీసుకు రావలసివస్తుంది; క్రిందికి తీసుకురావడానికి ఈ శక్తి కూడ చాలదు. కాబట్టి ‘పొగ త్రాగుతాను’, ‘నీళ్ళు త్రాగుతాను’ ‘సూక్తను* తింటాను’, ‘ఫలానా వ్యక్తిని చూడబోతాను’, ‘సంభాషిస్తాను’ వంటి కొన్ని అల్పమైన కోర్కెలను ఆశ్రయిస్తాను. పదేపదే ఈ కోర్కెలను మననం చేసుకొంటూ మనస్సులో నిలిపి ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే మనస్సు క్రమేపీ దేహస్మృతి స్థితికి దిగివస్తుంది. మళ్ళీ దిగివస్తున్నప్పుడు హఠాత్తుగా ఆ దిశకేసి (పైకి) ఎగిరిపోతుంది. దాన్ని మళ్ళీ ఆ కోర్కెల ఆసరాలతో క్రిందికి తీసుకురావలసి వస్తుంది.” ఎంత అద్భుతం! ఆ విషయం విన్నప్పుడు మేం స్తబ్ధులమై ఇలా తలపోశాం: “ ‘అద్వైతజ్ఞానం కొంగున కట్టుకొని పిదప ఇష్టం వచ్చినట్లు వ్యవహరించు,’ అయితే మా జీవితాలలో దానిని అనుభూతం చేసుకోగలమా? ఆయన పాద పద్మాలవద్ద శరణువేడి ఆయన అనుగ్రహానికి వేచివుండడం ఒక్కటే మార్గం. కాని కొద్దిరోజులు అలా చేయ ప్రయత్నించినప్పుడు ఇబ్బందులు ఎదురయ్యాయి. శరణుజొచ్చిన తదనంతరం కూడ ఈ ధూర్త మనస్సు ఇలా అనుకొనేది: ‘గురుదేవులు ఇతరులకంటే నన్నే ఎందుకు అధికంగా ప్రేమించకూడదు? నరేంద్రుణ్ణి ప్రేమించినంతగా ఆయన నన్నెందుకు ప్రేమించరాదు? ఏ రీతిలో నేను అతడికంటే తక్కువవాణ్ణి?’ అద్భుతమైన శ్రీరామకృష్ణుల మానసిక వైఖరి విషయం ఇక చాలించి, మనం ప్రారంభించిన ప్రధానాంశాన్ని* కొనసాగిద్దాం.
23. భావానుగుణంగా ఏర్పడే శారీరక మార్పుల పట్ల ప్రాచ్య, పాశ్చాత్యుల దృక్పథాలు
శ్రీరామకృష్ణుల బోధల నుండి మేం గ్రహించిన మేరకు సమున్నత ఆధ్యాత్మిక చైతన్యం గురించి, సమాధితత్త్వం గురించి కొంత తెలుప ప్రయత్నించి, తరువాత ‘భావముఖ’ స్థితిని వివరిస్తాం. మనస్సులో ఉదయించే ఉన్నత లేక నిమ్న భావాలను అనుసరించి ఏదో ఒక రకమైన శారీరక మార్పులు కలుగుతాయని స్పష్టంగా ప్రస్తావించివున్నాం. ఇది దైనందిన అనుభవం కావడంచేత ప్రత్యేకించి ఇందుకు ఎలాంటి వివరణా అవసరం లేదు. కోపం వచ్చినప్పుడు ఒక రకమైన మార్పు, ప్రేమానుభూతి పొందినప్పుడు మరో రకమైన మార్పు కలగడం మన అనుభవంలోనిదే. మళ్ళీ ఎవరి మనస్సయినా పూర్తిగా సదాలోచనలతోగాని లేదా దురాలోచనలతోగాని నిండివున్నప్పుడు ఆ సదరు వ్యక్తి శరీరంలో ఎంత మార్పు కలుగుతుందంటే చూసిన తక్షణమే అతడి నైజాన్ని పసిగట్టవచ్చు. ఒక వ్యక్తిని చూసి మనలో మనం, ‘అతడు ఎంత కోపిష్ఠో’, ‘ఎంత కాముకుడో’, ‘ఎంత నిజాయితీపరుడో’ అని అనుకోవడం కద్దు. ఇట్టి దైనందిన ముఖవైఖరులు మా వాదనకు స్పష్టమైన ప్రమాణాలు. అట్లే క్రూరులు, విపరీతబుద్ధులు గలవారు సైతం ఏదో ఒక కారణంగా ఆరు నెలలపాటు సదా పవిత్ర భావాలతో నిర్మల జీవితాన్ని గడిపే పక్షంలో వారు ఎంతటి సరళవర్తనాన్ని, భావసూచనలను సంతరించుకొంటారో మనలో అనేకులం ప్రత్యక్షంగా చూసే ఉంటాము, “నీ మనస్సులో ఉదయించే ఒక భావం నైజం ఎటువంటిదైనప్పటికీ, అది నీ మెదడులో శాశ్వతంగా ఒక గుర్తును ముద్రించిపోతుంది. దాదాపుగా మంచి, చెడు సంస్కారాలు వెరసి నీ శీలం నిర్మితమై తదనుగుణంగా నువ్వు సజ్జనుడివిగానో దుర్జనుడివిగానో రూపొందుతావు” అని పాశ్చాత్య మనస్తత్వవేత్తలు వక్కాణిస్తారు.
24. సంస్కారరాశుల ప్రేరణా శక్తి కేంద్రం – కుండలినీ
ప్రాచ్య యోగులు, ఋషులు, అందునా ప్రధానంగా భారతదేశానికి చెందినవారు ఇలా చెబుతున్నారు: “మంచి, చెడు అనే ఆ రెండు సంస్కారాల రాశి మెదడులో రెండు కోవల గుర్తులను ముద్రించడంతో మాత్రమే ఆగిపోవు; అవి నీ చేత మంచీచెడూ కర్మలను చేయించే సూక్ష్మ ప్రేరణా శక్తులుగా మార్పుచెంది వెన్నెముక క్రింది భాగంలో ఉండే (యోగులు దీనినే మూలాధారచక్రం అని పేర్కొంటారు) మూలాధారమనే చక్రంలో సదా వసిస్తూ ఉంటాయి. జన్మజన్మాంతరాల నుండి సంచితంగా వస్తూన్న సంస్కారరాశులన్నిటి ప్రేరణాశక్తులకు ఇది కేంద్రం. (దీనికే ‘కుండలినీ’ శక్తి అనిపేరు) భగవత్సాక్షాత్కారం ద్వారా లేదా నిర్వికల్ప సమాధ్యనుభవం ద్వారా మాత్రమే ఈ సంస్కారాలనన్నిటిని నాశనం చేయడం సాధ్యమవుతుంది. కాకుంటే ఒక దేహాన్ని వదలి మరొక దేహానికి పోతున్నప్పుడు జీవుడు ఈ సంస్కారాల రాశిని ‘వాయువు పువ్వులనుండి గంధాన్ని కొనిపోయేటట్లు’* తన వెంట తీసుకుపోతాడు.”
25. మనశ్శరీరాల సంబంధం
అద్వైతజ్ఞానం లేదా భగవత్సాక్షాత్కారం సంతరించుకొనేంత వరకు శరీరానికి మనస్సుకు ఉన్న ఈ సన్నిహిత సంబంధం కొనసాగుతుంది. శరీరం మనస్సు పైన, మనస్సు శరీరంపైన ప్రతిచర్యలు చూపుతాయి. మళ్ళీ వ్యక్తిగతంగా శరీరం – మనస్సు మాదిరిగా వ్యక్తుల సమష్టియైన మానవజాతి యావత్తు, శరీర – మనస్సుల మధ్య అటువంటి సంబంధమే నెలకొని ఉంటుంది. నా శరీరం – మనస్సు, నీ శరీరం – మనస్సుపై ప్రతిచర్య చూపుతుంది; అట్లే నీ శరీరం – మనస్సు, నా శరీరం – మనస్సుపై ప్రతిచర్య చూపుతుంది. ఈ విధంగా స్థూలం లేదా బాహ్యజగత్తు, సూక్ష్మం లేదా ఆంతరిక జగత్తు శాశ్వతమైన సంబంధం కలిగివుండి పరస్పరం చర్య ప్రతిచర్యలు జరుపుకొంటూ ఉంటాయి. అందుచేతనే ఇతరులు బాధపడుతున్నప్పుడు నువ్వు కూడ బాధపడడం గమనించవచ్చు; అదేవిధంగా భక్తుల సాంగత్యంలో భక్తిభావన అప్రయత్నంగా నీలో ఉదయిస్తుంది. ప్రతిచోట ఇట్లే జరుగుతుందని గ్రహించాలి.
26. భావాలు సాంక్రమికాలు కావడం చేత సత్సాంగత్య ఆవశ్యకం
అందుచేత శారీరక రోగాలుగాని, ఆరోగ్యంగాని ఇతరులకు ఎలా సంక్రమిస్తాయో అట్లే ఆధ్యాత్మిక భావాలకు లేదా మానసిక పరివర్తనలకు కూడా సంక్రమించే శక్తి ఉంది. యోగ్యతగల వ్యక్తులపై కూడా ఆధ్యాత్మిక భావాలు ప్రభావం చూపిస్తాయి. కనుకనే భగవంతుని పట్ల అనురాగాన్ని ఉద్దీపింప సాధుసాంగత్య మహాత్మ్యాన్ని శాస్త్రాలు అంతగా శ్లాఘిస్తాయి. ఆ కారణంగానే శ్రీరామకృష్ణులు కొత్తగా వచ్చే దర్శనార్థులతో, “తరచూ ఇక్కడకు వస్తూవుండండి; మొదట్లో ఇక్కడకు తరచూ రావడం మంచిది” అని చెప్పేవారు.
27. మానసిక ఏకాగ్రత వలననే శారీరక మార్పు కలుగుతుంది
తీవ్ర భగవత్ప్రేమనుండి జనించే ఆధ్యాత్మిక భావాలు అసాధారణ శారీరక మార్పులను కొనితెస్తాయి. ఉదాహరణకు అటువంటి భగవత్ప్రేమ పెంపొందినప్పుడు సాధకులకు రూపరసాది విషయ భోగాలపట్ల ఆకర్షణ తగ్గిపోతుంది. కించిత్తు ఆహారం, కొద్దిసేపు నిద్ర చాలు. అట్లే కొన్ని రకాల ఆహార పదార్థాల పట్ల రుచి పెంపొందడం, కొన్నిటి పట్ల అరుచి కలగడం కానవస్తుంది. బంధువులతోటి సంబంధం, భగవంతుడి నుండి దారిమళ్ళించే లౌకిక సంబంధమైనవాటిని విషతుల్యంగా భావించి వాటిని పరిత్యజింపగోరతాడు. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణులు, “లౌకిక వ్యక్తుల, బంధువుల సాంగత్యం సహించలేక ఊపిరి ఆగిపోయి, ఆత్మదేహాన్ని విడిచిపోతున్నట్లు అనిపించేది” అని చెప్పేవారు. మళ్ళీ ఆయన ఇలా చెప్పేవారు: “పరమ వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించే వ్యక్తి శరీరంలోని మహావాయువు (కుండలినీశక్తి) అతడి తలకేసి ప్రచండ వేగంతో ప్రాకిపోతుంది.”
28. భక్తి, యోగ మార్గాల సమన్వయం
కనుక భగవత్ప్రేమ ద్వారా ఏ మానసిక పరివర్తనలు లేదా భావాలు ఉత్పన్నమౌతాయో, వాటికన్నిటికీ తదనుగుణమైన శారీరక ఆకృతి లేదా రూపు ఏర్పడుతుందనడం స్పష్టమౌతున్నది. మానసిక పరివర్తనలను లేదా ఆధ్యాత్మిక భావాలను వైష్ణవశాస్త్రాలు వాటిని ఐదు కోవలుగా విభజించాయి. అవి: శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాలు. అట్లే ఆధ్యాత్మిక భావాల ప్రభావంచేత ఏర్పడే శారీరక మార్పులనే యోగశాస్త్రాలు కుండలినీ శక్తి అనీ, షట్చక్రాలనీ అభివర్ణిస్తాయి.
29. కుండలినీ శక్తి, దాని అవస్థలు
కుండలినీశక్తి అంటే ఏమిటో కొంతమేరకు పాఠకుడికి పరిచయం చేసివున్నాం. గత జన్మలలోను, ఈ జన్మలోను జీవుడిలో ఏఏ మానసిక పరివర్తనలు, భావాలు ఏర్పడ్డాయో, ఏర్పడుతున్నాయో అవి యావత్తు కలిసి సూక్ష్మసంస్కార శక్తిగా మారి, తదనుగుణంగా జీవునిచే నానాశారీరక కర్మలను ఒనరించే మహాశక్తివంతమైన ప్రేరణాశక్తినే పతంజలి మొదలైన యోగసూత్రకారులైన ఋషులు ‘కుండలినీశక్తి’ అని పేర్కొన్నారు. ఈ శక్తి బద్ధజీవులలో దాదాపు పూర్తి నిద్రాణ స్థితిలో లేదా అవ్యక్త స్థితిలో నెలకొని ఉంటుందని యోగులు చెబుతారు. ఆ నిద్రాణస్థితినుండే జీవుడికి స్మృతి, కల్పన ఇత్యాది ప్రవృత్తులు సాధ్యమౌతాయి. ఏదో విధంగా అది పూర్తిగా మేల్కొని లేదా అభివ్యక్తమైనప్పుడు జీవుడికి పూర్ణజ్ఞానాన్ని ఒసగి భగవత్సాక్షాత్కారం కలిగిస్తుంది. నిద్రాణంలో ఉన్న ఈ కుండలినీశక్తి నుండి స్మృతి, కల్పన మొదలైనవి ఎలా ఉదయిస్తాయి? అనే ప్రశ్నకు మా సమాధానం: అది నిద్రాణంలో ఉంటున్నప్పటికీ పంచేంద్రియాల ద్వారా బాహ్యజగత్తులోని రూపరసాది విషయాల జ్ఞానం సతతం మెదడులో ఏ ప్రతిస్పందన కలిగిస్తుందో దాని ద్వారా ఒకింత చేతన క్షణికంగా కలుగుతుంది. ఉదాహరణకు దోమ కుట్టినప్పుడు నిద్రిస్తున్న వ్యక్తి చేయి ఎలా అసంకల్పితంగా దాన్ని కొడుతుందో లేదా కుట్టిన చోటును రుద్దుకొంటుందో అట్లే.*
30. జాగృతమైన కుండలినీశక్తి పురోగతి: షడ్చక్ర భేదనం: సమాధి
శిరస్సుకు పై భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రంలోని ఆకాశం లేదా స్థలంలో అఖండ సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ లేదా భగవంతుడు తన చైతన్యరూపంలో వసిస్తూంటాడని యోగులు చెబుతారు.* పైన వర్ణింపబడ్డ కుండలినీ శక్తికి ఈ కుండలినీశక్తి పురోగతి: పరమాత్ముని పట్ల అమిత ఆకర్షణ ఉంది. లేదా మరో విధంగా షడ్చక్ర భేదనం: సమాధి చెప్పాలంటే భగవంతుడు సతతం దానిని ఆకర్షిస్తూంటాడు. కాని అది నిద్రాణస్థితిలో ఉన్నందున కుండలినీశక్తి ఆ ఆకర్షణను గ్రహించలేదు. కాని అది జాగృతమైన తక్షణమే భగవంతుని ఆకర్షణను అది గ్రహించి, ఆయనను సమీపిస్తుంది. కుండలినీశక్తి భగవంతుని చేరే మార్గం కూడ మన ప్రతి ఒక్కరిలోను నెలకొని ఉంటుంది. ఈ మార్గం శిరస్సులోని సహస్రార చక్రంనుండి ప్రారంభమై, వెన్నెముక గుండా క్రింద ఉన్న మూలాధారం వరకు సాగుతుంది. యోగశాస్త్రాలు ఈ మార్గాన్ని ‘సుషుమ్నా మార్గం’ గా పేర్కొంటాయి. పాశ్చాత్య శరీరధర్మ శాస్త్రజ్ఞులు దీనినే ‘మధ్య మార్గం’ (canal centralis) గా అభివర్ణిస్తారు; కాని దీని ధర్మాలు, దీని ద్వారా సాధింపబడే ప్రయోజనం ఏమిటో వాళ్ళు ఇంతవరకూ కనుగొనలేకపోయారు. కుండలినీశక్తి ప్రారంభంలో పరమాత్ముని నుండి విడివడి ఈ మార్గం ద్వారానే మెదడు నుండి మూలాధారానికి దిగి, అక్కడ నిద్రాణస్థితిలో పడివుంటుంది. జాగృతమైన పిదప ఇదే (సుషుమ్నా) మార్గంగుండా కుండలినీశక్తి పైకి ఎగసి వెన్నెముకలోని ఆరు చక్రాల* ను ఒక్కటొక్కటిగా దాటుతూ చివరకు శిరస్సులో ఉన్న సహస్రార చక్రానికి చేరుతుంది. జాగృతమైన కుండలినీ శక్తి అలా ఒక చక్రం నుండి పై చక్రానికి చేరుతున్నప్పుడు జీవుడికి విచిత్ర అనుభూతులు కలుగుతుంటాయి. కుండలినీశక్తి సహస్రార చక్రాన్ని చేరగానే పారమార్థికతలోని చరమానుభూతి, అద్వైతానుభూతి ఏర్పడతాయి; జీవుడప్పుడు పరమాత్మతో, ‘కారణం కారణానాం’ – కారణాలన్నిటికీ పరమ కారణమైన పరమాత్మతో ఐక్యమైపోతాడు. సాధకుడు ఈ స్థితిలోనే తన విశేష భావపు చరమానుభూతిని పొందుతాడు. అప్పుడే ఏది సకల భావాలకు అతీతమైనదో, దేని నుండి మానవుల మనస్సులలో ప్రతిక్షణం సమస్త భావాలు ఉదయిస్తూంటాయో ఆ ‘మహాభావం’ లో అతడు లీనమైపోతాడు.
31. ఈ విషయంలో శ్రీరామకృష్ణుల అనుభవం
ఆహా, యోగశాస్త్ర నిగూఢ తత్త్వాలను శ్రీరామకృష్ణులు ఎంతటి సరళ పదాలతో మాకు వివరించారో కదా! ఆయన ఇలా చెప్పేవారు: “చూడండి. ఏదో పాదాల నుండి శిరస్సుకు పైకెగసి ప్రాకుతూపోయేది. ఈ శక్తి శిరస్సును చేరనంత వరకు స్పృహ ఉంటుంది; కాని అది శిరస్సును చేరిన తక్షణమే స్పృహ పూర్తిగా కోల్పోయేవాడిని. ఇక చూడడంగాని, వినడంగాని ఉండవు. మాట్లాడడం గురించి చెప్పపనిలేదు. ఎవరు మాట్లాడతారు! ‘నేను’, ‘నువ్వు’ అనే భావనే ఆ స్థితిలో లుప్తమైపోతుంది. ఆ శక్తి పైకెగసి ప్రాకుతున్నప్పుడు నేను ఎన్ని దర్శనాలు గాంచానో, వాటి స్వరూప స్వభావాలేమిటో సమస్తం మీకు తెలుపాలనే ఒక ఆకాంక్ష నాకు కలుగుతుంది. అది ఇంతవరకు (హృదయాన్ని చూపుతూ) లేదా మహా అయితే ఇక్కడికి (కంఠాన్ని చూపుతూ) చేరేవరకు మాట్లాడడం సాధ్యమే, మాట్లాడతాను కూడ. కాని ఈ స్థానం (కంఠం చూపుతూ) దాటి పైకి ప్రాకసాగినప్పుడు ఎవరో నా నోటిని బలవంతంగా నొక్కివేసినట్లవుతుంది, పూర్తిగా స్పృహ కోల్పోతాను. దాన్ని నియంత్రించలేను. (కంఠం చూపుతూ) దీన్ని దాటి పోయినప్పుడు ఎటువంటి దర్శనాలు చూస్తానో చెప్పగోరిన తక్షణమే మనస్సు పైకెగసిపోతుంది, ఆపైన మాట్లాడడం అసాధ్యమైపోతుంది.”
32. నిర్వికల్ప సమాధి అనుభూతులను వివరించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు
ఆహా! మనస్సు కంఠానికి పైనున్న చక్రాలను చేరుకొన్నప్పుడు ఎలాంటి దర్శనాలు, అనుభూతులు చవిచూస్తారో వాటిని గూర్చి మాతో చెప్పడానికి ఆయన తమను అదుపులో ఉంచుకోవాలని చేసిన విఫల ప్రయత్నాలు కోకొల్లలు. మా మిత్రుడొకడు ఇలా చెప్పాడు: “ఒక రోజు శ్రీరామకృష్ణులు, ‘ఈ రోజు మీకు అంతా వెల్లడిస్తాను, ఏదీ దాచను’ అని నొక్కి వక్కాణించారు. హృదయమూ, కంఠమూ వరకు నెలకొనివున్న చక్రాలను, వాటివద్ద తాము చవిచూసిన అనుభూతులను ఆయన స్పష్టంగా వివరించారు. పిదప భ్రూమధ్య స్థానం చూపుతూ, ‘మనస్సు ఇక్కడికి చేరుకోగానే పరమాత్ముని ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది. జీవుడు సమాధి స్థితుడౌతాడు. అప్పుడు జీవాత్మ పరమాత్మల నడుమ ఒక పలుచని పారదర్శక తెర మాత్రం అడ్డుగా ఉంటుంది. పిదప సాధకుడు ఈ అను భూతులను…..’ అంటూ, పరమాత్మ దర్శనం గూర్చి విశదంగా చెప్ప ప్రారంభించారో లేదో తక్షణమే సమాధి స్థితులైనారు. సమాధి అవస్థ నుండి బయటకు రాగానే మళ్ళీ ఆయన వివరింప ప్రయత్నించి మళ్ళీ సమాధిమగ్నులయ్యారు. అలా కొన్నిసార్లు ప్రయత్నించీ వివరింపలేక కళ్ళ నీళ్ళు పెట్టుకొని, ‘నాయనలారా! ఏదీ దాచకుండా సర్వం మీకు తెలియచేయాలనుకొన్నాను. అన్ని ప్రయత్నాలూ చేసినప్పటికీ, అమ్మ నన్ను మాట్లాడనివ్వలేదు. ఆమె నా నోరు నొక్కేసింది’ అని అన్నారు. మేం ఆశ్చర్యపోయి ఇలా అనుకొన్నాం: ‘ఆహా, ఎంత విచిత్రం! చెప్పాలని ఆయన ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కాని అలా చేయలేక పోతున్నారు. చెప్పలేకపోతున్నందున ఆయన బాధపడుతున్నారు కూడ. ఆమె, ఆ తల్లి తప్పక చిలిపి వ్యక్తిగా గోచరిస్తున్నది. ఈయన పవిత్ర విషయాలను, భగవత్సాక్షాత్కారం గురించిన విషయాలను వెల్లడింపనున్నప్పుడు అలా నోరు నొక్కివేయడం ఎందుకు?’ మాట్లాడ సుసాధ్యం చేసే మనస్సు, వివేకం ఇత్యాదులకు సుదీర్ఘ పరివ్యాప్తి లేదనే విషయం మేమప్పుడు అవగతం చేసుకొన్నామా? పైగా ఈ పరివ్యాప్తిని అతిక్రమించి పోలేకుంటే పరమాత్ముని పరిపూర్ణ దర్శనం కాదన్న విషయం మేం గ్రహించగలిగామా? మా మీది ప్రేమతో శ్రీరామకృష్ణులు అసాధ్యాన్ని సాధ్యం చేయ ప్రయత్నిస్తున్నారనే విషయం మేమప్పుడు అవగతం చేసుకొన్నామా?
33. సమాధి మార్గంలో కుండలినీ శక్తి ఐదు గతులు
సుషుమ్నా మార్గంగుండా కుండలినీశక్తి పైకెగసి పోతున్నప్పుడు తాము పొందిన అనుభూతులను శ్రీరామకృష్ణులు మాకు వివరించి చెప్పేవారు: “ఇలా చూడండి. సర్రునపైకెగసి శిరస్సుకు ఎగబ్రాకేది ప్రతిసారి అదే రీతిలో కదలిపోదు. దానికి ఐదురకాల గమనాలు(కదలికలు)ఉన్నవని శాస్త్రాలు వర్ణిస్తున్నాయి.
- చీమల గమనం: ఆహారం నోట కరుచుకొని చీమలెలా బారులుతీరి ప్రాకి పోతూవుంటాయో, అట్లే పాదాల వద్దనుండి ప్రాకిపోయే సంచలనం ప్రారంభమయ్యేది. అది నెమ్మదిగా పైకి ప్రాకి శిరస్సును చేరగానే సమాధి కలుగుతుంది.
- మండూక గమనం: కప్పలు రెండు మూడు గెంతులు వేసి, ఆగి మళ్ళీ రెండు గెంతులు వేసి అక్కడ ఆగి ముందుకు గమిస్తూ ఉంటాయి. అదే విధమైన సంచలనం పాదాల నుండి శిరస్సు వైపుగా కలిగేది; అది శిరస్సును చేరడంతోనే సమాధి ఏర్పడుతుంది.
- సర్ప గమనం: పాములు చుట్టచుట్టుకొనో లేదా నిడివిగానో నిశ్చలంగా పడుకొని ఉంటాయి. ఎర కంటబడ్డ తక్షణమో లేక భయపడినప్పుడో పాము మెలికలు తిరుగుతూ వంకరటింకరగా ఎరవైపుకు లేదా తాను దాగుకొనే చోటుకు కదలుతుంది. అదే రకమైన సంచలనం పైకి తిన్నగా శిరస్సుకు పోతున్నట్లు అనిపించేది. అది శిరస్సును చేరగానే సమాధి మగ్నులౌతారు.
- పక్షి గమనం: పక్షులు ఎలా తాము వ్రాలినచోటు నుండి మరోచోటుకు పోయేటప్పుడు హఠాత్తుగా లేచి ఒకసారి కాస్త ఎత్తులోను, మరోసారి కాస్త దిగువ గాను ఎగురుతూ ఎక్కడా ఆగక అనుకొన్న చోటుకు తిన్నగా పోయి వ్రాలుతాయో అట్లే అదే రకమైన చలనంతో కుండలినీశక్తి ఎగిరి సూటిగా శిరస్సును చేరుతుంది, సమాధి ఏర్పడుతుంది.
- మర్కట గమనం: కోతులు ఎలా ఒక చెట్టుకొమ్మ నుండి మరో చెట్టుకొమ్మకు చెంగున ఉన్నట్టుండి దూకుతూ రెండు మూడు గెంతులతో తాము అనుకొన్న చోటును చేరుకుంటాయో, అదే రీతిలో ‘కుండలినీ’ రెండు మూడు గెంతులతో చెంగున శిరస్సును చేరుతుంది; తక్షణమే సమాధి కలుగుతుంది.”
34. వేదాంతం పేర్కొనే సప్తభూములు
సుషుమ్నా మార్గంగుండా కుండలినీ పైకెగసి పోతూవున్నప్పుడు ప్రతి ఒక్క చక్రంలోను కలిగే దర్శనాలను గురించి శ్రీరామకృష్ణులు ఇలా వివరించేవారు: “వేదాంతం ఏడు భూముల గురించి ప్రస్తావిస్తుంది. ఒక్కో భూమిలో ఒక్కో రకమైన అనుభూతి కలుగుతుంది. సాధారణంగా మనస్సు దిగువ మూడు భూములలో పైకి క్రిందికి సంచరిస్తూ ఉంటుంది. దాని దృష్టి గుదం, జననాంగం, నాభి – అంటే తినడం, త్రాగడం, మైథునం ఇత్యాదుల – మీదే నిలిచి ఉంటుంది. ఏదో విధంగా అది ఈ మూడు భూములను అధిగమించి హృదయస్థానం చేరితే అప్పుడు ఆ సదరు వ్యక్తికి ‘జ్యోతి దర్శనం’ కలుగుతుంది. కాని హృదయస్థానానికి కొన్ని సమయాలలో ఎగసినప్పటికీ మళ్ళీ మనస్సు దిగువ మూడు భూములకు దిగిపోతుంది. హృదయస్థానాన్ని అధిగమించి ఎవరి మనస్సైనా కంఠస్థానం చేరితే అతడప్పుడు భగవంతుణ్ణి గురించి తప్ప మరే ఐహిక విషయాలనూ మాట్లాడలేడు. ఆ రోజుల్లో ఎవరైనా లౌకిక విషయాలను ప్రస్తావిస్తే బడితెతో నా తలను ఎవరో బాదుతున్నట్లు నాకు అనిపించేది. ప్రాపంచిక విషయాలు వినే ఆస్కారంలేని పంచవటికి పారిపోయేవాణ్ణి. లౌకిక వ్యక్తులను చూడగానే భీతిచెంది, నక్కి దాగుకొనేవాణ్ణి. బంధువులు శత్రువులుగా కానవచ్చేవారు. వాళ్ళు నన్ను అధఃపాతాళానికి పడదోయ ప్రయత్నిస్తున్నట్లుగా నాకు తోచేది. ఊపిరాడక ప్రాణం పోతున్నట్లు అనిపించేది. వారినుండి పారిపోతేనేగాని మనశ్శాంతి ఉండేది కాదు. కంఠస్థానం చేరినప్పటికీ మనస్సు మళ్ళీ గుదం, జననాంగం, నాభి స్థానాలకు దిగిపోయే అవకాశం ఉంటుంది. కనుక అప్పుడు కూడ అప్రమత్తంగా ఉండాలి. కంఠస్థానం అతిక్రమించి మనస్సు భ్రూమధ్యం చేరుకొన్నప్పుడు క్రిందికి పడిపోయే భయం ఇక ఉండదు. అప్పుడు ఆ వ్యక్తికి పరమాత్మ దర్శనం కలుగుతుంది. అవిచ్ఛిన్న సమాధి స్థితిలో మగ్నుడై ఉంటాడు. ఆ స్థితిలో ఈ చక్రానికి మెదడులోని సహస్రారానికి నడుమ గాజువంటి ఒక పారదర్శక పొర మాత్రం అడ్డంగా ఉంటుంది. ఈ అవస్థలో పరమాత్మతో తాదాత్మ్యం చెందినంత సమీపాన ఆయన కానవస్తాడు. కాని తాదాత్మ్యం ఇంకా జరుగలేదు. ఒకవేళ మనస్సు ఇక్కడనుండి క్రిందికి దిగే పక్షంలో, మహాఅయితే కంఠం లేదా హృదయస్థానం వరకు మాత్రమే దిగిరాగలదు. అంతకంటే దిగువకు పోలేదు. జీవకోట్లు (సామాన్య జీవులు) ఈ భూమినుండి ఎన్నడూ దిగిరారు. ఇరవై ఒక్కరోజుల అవిచ్ఛిన్న సమాధ్యనుభూతి తదనంతరం ఆ పొర చిరిగిపోతుంది. పరమాత్మునితో తాదాత్మ్యం చెందుతారు. సహస్రారంలో పూర్ణంగా పరమాత్మునితో లయమైపోవడాన్నే సప్తమభూమిని చేరుకోవడం* అని పేర్కొంటారు.”
35. శ్రీరామకృష్ణుల ధారణశీల శక్తి
వేదవేదాంతాలు, యోగశాస్త్రం గురించి శ్రీరామకృష్ణులు ప్రసంగించడం చూసి మాలో కొందరు కొన్ని సందర్భాలలో ఆయనను, “మహాశయా! మీరేనాడు చదువను వ్రాయను నేర్వ ప్రయత్నించలేదుకదా, అలాంటప్పుడు ఈ విషయాలన్నీ ఎలా గ్రహించారు?” అని అడగడం కద్దు. అలా సూటిగా అడిగిన ప్రశ్నకు అపురూపులైన గురుదేవులు విసుగుచెందక, చిరుదరహాసంతో ఇలా అనేవారు: “స్వయంగా నేను చదువుకోని మాట నిజమే. కాని ఎంతో విన్నాను. విన్నదంతా నాకు జ్ఞప్తిలో ఉంటుంది. నేను వేదవేదాంతాలు, దర్శనాలు, పురాణాలు గొప్ప విశ్వసనీయ పండితుల ముఖతా వినివున్నాను. ఆ విషయాలు విని, సారాంశం గ్రహించి వాటినన్నిటినీ (శాస్త్రాలను) దారంతో పువ్వులమాలగా గుచ్చి మెళ్ళో ధరించి, ‘అమ్మా, ఇదుగో నీ శాస్త్ర పురాణాలనన్నిటినీ నువ్వే పుచ్చుకో. నాకు శుద్ధభక్తిని ప్రసాదించు’ అని అమ్మ పాదపద్మాల మ్రోల అర్పించాను.”
36. సరళంగా అద్వైత స్థితిని శ్రీరామకృష్ణులు వివరించడం
వేదాంతం పేర్కొనే అద్వైతస్థితి లేదా భావాతీతస్థితిని గురించి ఆయన ఇలా చెప్పేవారు: “అది చరమ స్థితి. ఎలాగో తెలుసా? చాలకాలంగా ఒకరి ఇంట్లో ఒక సేవకుడు పనిచేస్తున్నాడనుకోండి. ఆ ఇంటి యజమాని అతడి సద్గుణాలపట్ల సంప్రీతుడైనాడు. అతడి మాటల్లో ఎంతో నమ్మకం ఉంది. అన్ని విషయాల్లోను అతణ్ణి సంప్రతించేవాడు కూడ. ఇలా ఉండగా ఒకరోజు యజమాని పరమానందభరితుడై, ఆ సేవకుని చేయి పుచ్చుకొని తన ఆసనంలో ఆసీనుణ్ణి చేయబోతాడు. యజమాని ఆ చర్యకు సేవకుడు విభ్రాంతితో బిత్తరపోతాడు. అయినా యజమాని అతణ్ణి లాగి ఆసనంలో కూర్చోపెట్టి, ‘ఇక్కడ కూర్చో, నువ్వు నేను ఒక్కటే’ అంటాడు. అద్వైత స్థితిని చేరడంకూడ అట్టిదే.”
37. ఒక ఉదాహరణ: స్వామి తురీయానంద
ఒకప్పుడు మా మిత్రుడొకడు* వేదాంతాధ్యయనంలో ఎంతో శ్రద్ధ వహించేవాడు. చిన్ననాటినుండి అతడు పాటిస్తున్న బ్రహ్మచర్యవ్రతానికి, భక్తికి, అచంచలత్వానికి గురుదేవులు ముగ్ధులై అతణ్ణి ఎంతో ప్రేమించేవారు. వేదాంతాధ్యయనం, ధ్యానం, భజనాదులలో నిమగ్నుడవడంచేత అతడు వెనుకటిలా శ్రీరామకృష్ణుల దర్శనార్థం రాలేకపోయాడు. ఆయన ఈ విషయం గమనించారు. ఇలావుండగా ఒకరోజు సామాన్యంగా మా మిత్రుడితోపాటు కలిసివచ్చే మరో యువకుడు ఒంటరిగా దక్షిణేశ్వరానికి రావడం చూసి శ్రీరామకృష్ణులు, “బాగుంది, నువ్వు ఒక్కడివే వచ్చావేమిటి? అతడు రాలేదా?” అని అడిగారు. అందుకు ఆ యువకుడు ఇలా జవాబిచ్చాడు: “మహాశయా! అతడు ఈ మధ్య తీవ్ర వేదాంతాధ్యయనంలో తలమునకలై ఉన్నాడు. రేయింబవళ్ళు అధ్యయనం, చర్చలు, వాదోపవాదాలలో గడిపివేస్తున్నాడు. అందుకే బహుశా కాలం వృథా అవుతుందని రాలేదేమో!” శ్రీరామకృష్ణులు ఆ జవాబు విని, మరేమీ పలుకలేదు.
38. వేదాంతం అంటే బ్రహ్మసత్యం – జగన్మిథ్య – అనుభూతి చెందడం
కొన్ని రోజుల తరువాత శ్రీరామకృష్ణుల దర్శనార్థం మా మిత్రుడు దక్షిణేశ్వరం రానేవచ్చాడు. అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు, “ఏమోయ్, ప్రస్తుతం నువ్వు వేదాంత విచారణలో తలమునకలై ఉన్నావని వినికిడి. చాలా మంచిది. దాని సారాంశం ‘బ్రహ్మసత్యం, జగన్మిథ్య’ – ఇదేనా లేక మరేదైనా ఉందా?” అని అడిగారు.
మిత్రుడు: అవునండీ! అది కాక మరేమిటి?
ఆ నాలుగు ముక్కల్లో గురుదేవులు సమస్త వేదాంత సారాన్ని తెలిపి తన కళ్ళు తెరిపించారని మా మిత్రుడన్నాడు. ఆ మాటలు విని విస్మయంతో, ‘నిజమే కదా, వారి ఆ నాలుగు మాటల సత్యాన్ని అంతరాంతరాళాలలో ప్రగాఢంగా విశ్వసిస్తే, వేదాంతం యావత్తు అవగతం చేసుకొన్నట్లే’ అని అతడనుకొన్నాడు.
శ్రీరామకృష్ణులు: వినడం, మననం చేయడం, ధ్యానించడం. బ్రహ్మమొక్కటే సత్యం, జగత్తు మిథ్య – అని మొదట ఆలకిస్తావు. తదుపరి మననం. అంటే విచారణ వివేచనలు చేస్తూ ఆ భావాన్ని నీ మనస్సులో దృఢంగా పాదుగొలుపుకొంటావు. ఆ తరువాత నిదిధ్యాసనం – అంటే మిథ్యా వస్తువైన జగత్తును త్యజించి సద్వస్తువైన బ్రహ్మాన్ని ధ్యానించడంలో మగ్నుడవౌతావు. ఇంతే! అయినా దీన్నంతా విని, అవగాహన చేసుకొన్న తదనంతరం కూడ మిథ్య అయిన దానిని త్యజింప ప్రయత్నించకుంటే ఏం ప్రయోజనం! అది లౌకికుల జ్ఞానం లాంటిది. అటువంటి జ్ఞానం మూలంగా వస్తులబ్ధి (భగవత్సాక్షాత్కారం) కలుగదు. దృఢవిశ్వాసం అవసరం, పరిత్యాగం అనివార్యం. అప్పుడు మాత్రమే విజయం సిద్ధిస్తుంది. అలా కాకపోతే, ‘ముల్లు లేదు, గుచ్చుకోలేదు’ అని పదేపదే చెబుతున్నా, ముల్లును తాకిన తక్షణం అది సూటిగా లోపలికంటా గుచ్చుకొని ‘అబ్బా’ అంటూ బాధతో అరుస్తావు. ‘జగత్తు లేదు, మిథ్య – ఉన్నది కేవలం బ్రహ్మం ఒక్కటే’ అంటూ ఏదేదో పలుకుతూ ఉంటావు. కాని రూప రసాది భోగ్యవస్తువులు కంటపడగానే, వాటినే ‘సత్య’ మనుకొని వాటి బంధనంలో చిక్కుకుపోతావు. ఒకప్పుడు పంచవటికి ఒక సాధువు వచ్చాడు. జనంతో ఎడతెగక వేదాంతం గురించి ప్రసంగించేవాడు. కాని ఆ తరువాత ఒక స్త్రీతో అతడు అక్రమ సంబంధం పెట్టుకొన్నాడనే వార్త తెలియవచ్చింది. బహిర్భూమికి అటుకేసి వెళ్ళినప్పుడు ఆ సాధువు అక్కడ కూర్చుని ఉండడం చూశాను. చప్పున అతణ్ణి, “నువ్వు వేదాంతం గురించి అంతగా ప్రసంగిస్తావు, మరి ఈ పుకారేమిటి?” అని అడిగాను. అందుకు అతడు ఇలా బదులిచ్చాడు: “దానిలో ఏముంది? నేను చేస్తున్నది తప్పు కాదని ఋజువు చేస్తాను, చూడండి. జగత్తు త్రికాలాలలో (భూత భవిష్యద్వర్తమానాలలో) మిథ్య అయినప్పుడు అదొక్కటి మాత్రమే ‘సత్యం’ ఎలా అవుతుంది? అదీ మిథ్యే అవుతుంది.” ఈ జవాబుకు చిరాకేసి, “నీ వేదాంతం మీద మూత్రవిసర్జన చేయ” అని అన్నాను. వేదాంతం గురించి లౌకికుల జ్ఞానం ఆ రీతిలోనే ఉంటుంది.
ఎడమవైపు: హరినాథ్ ఛటోపాధ్యాయ తదనంతరం స్వామి తురీయానంద (1863-1922), కుడివైపు: బాబురామ్ ఘోష్ తదనంతరం స్వామి ప్రేమానంద (1861-1918)
అక్కడితో సంభాషణ ముగిసింది. పంచవటి క్రింద శ్రీరామకృష్ణులు మా మిత్రుడితో కలిసి నడుస్తూ ఇదంతా అతడితో చెప్పారు. ఉపనిషత్తులు, పంచదశి మొదలైన క్లిష్టమైన గ్రంథాలు అధ్యయనం చేయకపోతే, న్యాయ సాంఖ్యాది దర్శనాలను చక్కగా ఆకళింపు చేసుకోకపోతే ఏనాటికీ వేదాంతం అవగతం కాదనీ, కనుక ముక్తి పొందడం అసాధ్యమనే అభిప్రాయంలో మునిగి ఉన్నాడు మా మిత్రుడు. నాటి శ్రీరామకృష్ణుల ప్రసంగం నుండి, వేదాంత విచారణ ఏకైక ప్రయోజనం ఆ ఒక్క సత్యంపట్ల హృదయంలో దృఢవిశ్వాసం కల్పించుకోవడమే అని మా మిత్రుడు గ్రహించాడు. బండెడు వేదాంత తర్కాది గ్రంథాలు చదివి కూడ, ‘బ్రహ్మ సత్యం, జగన్మిథ్య’ అన్న దృఢవిశ్వాసం కలగకపోతే, అన్ని గ్రంథాలు చదివినా లేదా చదవకున్నా ఒక్కటే, నిష్ప్రయోజనం అని గ్రహించాలి. పిదప మా మిత్రుడు శ్రీరామకృష్ణుల నుండి ఆనాటికి సెలవు పుచ్చుకొని కలకత్తాకు తిరిగి వెళ్ళిపోయాడు. నాటినుండి గ్రంథపఠనం కంటే ఆధ్యాత్మిక సాధనలలోనే మనస్సును కేంద్రీకరించాలని అతడు నిశ్చయించు కొన్నాడు. భగవత్సాక్షాత్కారం ఆధ్యాత్మిక సాధనల మూలంగా పొందాలని కృతనిశ్చయుడై, హృదయపూర్వకంగా నాటి నుండి అతడు వాటిని అనుష్ఠించడంలో నిమగ్నుడైనాడు.
శ్రీరామకృష్ణులు కలకత్తాలో ఎవరి ఇంటికైనా విచ్చేస్తే, ఆ వార్త ఆంతరంగిక భక్తులకు కొద్దిసేపట్లోనే ప్రాకిపోయేది. ఎవ్వరూ పనికట్టుకొని ఆ వార్తను ప్రచారం చేసేవారని అనుకోరాదు. శ్రీరామకృష్ణులను దర్శింప భక్తుల హృదయాలు సదా తహతహలాడేవి. పనుల ఒత్తిడిచేత వారు దక్షిణేశ్వరం వెళ్ళలేకపోతే వాళ్ళు తరచు ఒకరిళ్ళకు ఒకరు పోయి ఆయనను గురించి మాట్లాడుకొంటూ ఆనందించడం కద్దు. గురుదేవులు వస్తున్నారనే వార్త వారిలో ఎవరికైనా తెలిసిన మరుక్షణమే అప్రయత్నంగా అనేకులకు అది తెలిసిపోయేది. శ్రీరామకృష్ణుల అనుగ్రహం ద్వారా భక్తులు ఎలాంటి అనిర్వచనీయమైన ప్రేమబంధనంతో ముడివడ్డారో పాఠకులకు వివరించడం తేలిక కాదు. కలకత్తాలోని బాగ్‌బజార్, సిమ్లా, అహిరిటోలా పేటలలో గురుదేవుల భక్తులు అనేకులు వసించేవారు. అందుచేతనే అనేక సందర్భాలలో శ్రీరామకృష్ణులు ఈ మూడింట్లో ఏదో ఒక పేటకు వస్తూవుండేవారు. ఈ మూడు పేటలలో బాగ్బజార్కే ఆయన తరచూ వచ్చేవారు.
పై సంఘటన జరిగిన కొద్దికాలం తరువాత శ్రీరామకృష్ణులు ఒకరోజు బాగ్ బజార్‌లోని బలరాంబసు ఇంటికి వెళ్ళారు. ఈ వార్త తెలిసి ఆ పేటలో ఉంటున్న భక్తులలో అనేకులు ఆ ఇంట్లో గుమిగూడారు. మా మిత్రుడు హరినాథ్ అక్కడకు దగ్గర్లోనే వసిస్తున్నాడు. గురుదేవులు అతణ్ణి గురించి వాకబు చేశారు. వెంటనే అతడి మిత్రుడొకడు వెళ్ళి అతణ్ణి తోడ్కొని వచ్చాడు. మా మిత్రుడు బలరాం బాబు ఇంటి మొదటి అంతస్తులోని విశాలమైన కచ్చేరీ చావడిలోకి వచ్చి, భక్తులతో పరివేష్టితులై ఉన్న శ్రీరామకృష్ణులను చూసి ఆయనకు ప్రణామంచేసి ఒక్క ప్రక్కగా ఆయన సమీపాన కూర్చున్నాడు. గురుదేవులు చనువుగా అతడి క్షేమసమాచారాలు విచారించి, తమ ప్రసంగాంశాన్ని కొనసాగించారు. రెండు మూడు మాటలు వినగానే మా మిత్రుడు ఆ ప్రసంగం దేన్ని గురించో అర్థం చేసుకొన్నాడు. జ్ఞానంగాని, భక్తిగాని, ఆధ్యాత్మిక అనుభూతిగాని భగవదనుగ్రహం లేకుండా లభించదని శ్రీరామకృష్ణులు నొక్కివక్కాణిస్తున్నారు. తన మనస్సులోని చెడ్డ ఊహను తొలగించడానికే గురుదేవులు ఈ అంశాన్ని ప్రస్తావించారనీ, ఆ ప్రసంగం యావత్తు కేవలం తనను ఉద్దేశించి చేసినదేననీ వింటూవున్న మా మిత్రుడికి చటుక్కున స్ఫురించింది.
39. భగవదనుగ్రహం లేనిదే భగవత్సాక్షాత్కారం సిద్ధించదు
శ్రీరామకృష్ణులు చెబుతూవుంటే హరినాథ్ వినసాగాడు: “కామ కాంచనాలు నిజానికి మిథ్య అనే, త్రికాలాలలోను జగత్తు అసత్ అనే జ్ఞానం మనస్సులో దృఢంగా పాదుకోవడం అంత తేలికైన విషయమా? ఆయన కృప లేకుండా అది సాధ్యమా? భగవత్ కృప అటువంటి విశ్వాసాన్ని జనింపచేసినప్పుడు మాత్రమే అది సాధ్యమౌతుంది. స్వప్రయత్నంతో మనిషి అట్టి విశ్వాసాన్ని సంతరించుకోగలడా? ఆహా! అతడి శక్తి ఏపాటిది? ఆ స్వల్పశక్తితో అతడు చేసే ప్రయత్నం అంతంత మాత్రమే!” భగవంతుని కరుణను గురించి ఆయన అలా చెబుతూ సమాధిమగ్నులైనారు. కాస్సేపయ్యాక అర్ధబాహ్య దివ్యచైతన్యంలో ఆయన, “ఒక మార్గంలో ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించలేని మనిషి మరొక మార్గంలో చేయడానికి ప్రయత్నిస్తాడు” అని పలికి, ఆ భావావస్థలోనే ఈ పాట పాడసాగారు:
ఒరే కుశీలవ్, కొరిస్ కీ గౌరవ్ ।
ధొరా నా దిలే కీ పారిస్ ధొరితే ।
[ఒరే కుశలవులారా, గర్విస్తారెందుకు? నేను పట్టుకోనివ్వకపోతే నన్ను పట్టుకోగలిగే వారా? (అశ్వమేధయాగం చేస్తున్న శ్రీరాముడు వదలిపెట్టిన అశ్వాన్ని పట్టుకొన్నామని గర్వపడుతున్న లవకుశులతో అశ్వరక్షకుడైన హనుమంతుడు పలికిన మాటలివి.)]
శ్రీరామకృష్ణులు సమాధిలో ఉన్నప్పుడు 21 సెప్టెంబర్ 1879 లో తీసిన ఆయన ఛాయాచిత్రంలోని మందస్మిత ముఖారవిందం
పండిత్ శశిధర్ తర్కచూడామణి (1850-1928)
ఆ పాట పాడుతూన్నప్పుడు శ్రీరామకృష్ణుల కళ్ళనుండి నీరు ధారలుకట్టి కాలువలై ప్రవహించి, తివాచీపై పరచివుంచిన వస్త్రాన్ని తడిపివేశాయి. కరుణరసం ఉట్టిపడే ఆ అద్భుత బోధన వింటూ మిత్రుడుకూడా తనను తమాయించుకోలేక ఏకధారగా కన్నీరు స్రవించసాగాడు. వారిద్దరూ మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పట్టింది. “ఆ ఉపదేశం శాశ్వతంగా నా మనస్సులో పాదుకు పోయింది. భగవంతుని అనుగ్రహం లేకుండా ఏదీ సాధించలేమని ఆనాటినుండి నేను చక్కగా గ్రహించగలిగాను” అని మా మిత్రుడు చెప్పేవాడు.
40. స్వయంగా తమ వ్యాధిని నయం చేసుకోమన్న శశధర పండితునికి, శ్రీరామకృష్ణుల సమాధానం
శ్రీరామకృష్ణుల అద్వైతజ్ఞానపు ప్రగాఢతను గురించి ఇక్కడ ప్రస్తావించ కుండా ఉండలేం. కాశీపూర్ ఉద్యానవనంలో శ్రీరామకృష్ణుల వ్యాధి ప్రకోపించినదని విని ఆయన దర్శనార్థం శశిధర తర్కచూడామణి మరికొందరితోపాటు అక్కడకు వచ్చాడు. మాటల సందర్భంలో శశిధర పండితుడు, “మహాశయా! మీలాంటి మహాపురుషులు సంకల్ప మాత్రాన శారీరక వ్యాధులను పూర్తిగా నయంచేసుకోగలరని శాస్త్రాలలో మేం చదివి ఉన్నాం. వ్యాధి నయం కావాలనే తీవ్ర ఆకాంక్షను మనస్సులో కల్పించుకొని, ఏకాగ్రమైన మనస్సును వ్యాధిగ్రస్తమైన ఆ శరీరభాగంపై పరపితే వ్యాధి పూర్తిగా నయమౌతుంది. మీరు ఒక్కసారి అలా ప్రయత్నించకూడదా?”
అందుకు శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “ఆహా, పండితుడవైన నువ్వూ ఈ విధమైన సలహా ఎలా ఇస్తున్నావు? సచ్చిదానంద స్వరూపునికి అర్పించిన మనస్సును మళ్ళీ వెనుకకు తీసుకొని శిథిలావస్థలో ఉన్న ఈ అస్తిపంజరంపై ఎలా నిలిపి ఉంచగలను?”
41. వివేకానందాదులు అట్లే చేయమని పట్టుబట్టడం: ఆయన జవాబు
శశిధర పండితుడు మౌనం వహించాడు. కాని స్వామి వివేకానంద, ఇతర భక్తులు ఊరకే ఉండలేకపోయారు. పండితుడు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోగానే, వాళ్ళు శ్రీరామకృష్ణులను అలా చేయమని పట్టుబట్టారు. “మీరు వ్యాధిని నయం చేసుకోవాలి. మా నిమిత్తమైనా నయం చేసుకొని తీరాలి” అని పదేపదే ప్రార్థించారు.
శ్రీరామకృష్ణులు: ఆహా, వ్యాధితో బాధపడగోరతానా ఏమిటి? నయం కావాలనే కోరుకొంటాను, కాని ఆ కోరిక నా వ్యాధిని నయం చేస్తుందా ఏమిటి? నయంకావడం, కాకపోవడం అమ్మపైనే ఆధారపడి ఉంది.
స్వామీజీ: అయితే నయం చేయమని అమ్మను అడగండి. మీ ప్రార్థనను ఆమె తప్పక ఆలకిస్తుంది.
శ్రీరామకృష్ణులు: నీకు అలా చెప్పడం సులభం కావచ్చు. కాని అటువంటి ప్రార్థన నా నోటి నుండి వెలువడదు.
స్వామీజీ: అదేం కుదరదండీ. మీరు అమ్మను అడిగే తీరాలి. మా నిమిత్తం మీరా పని చేయాలి.
శ్రీరామకృష్ణులు: సరే, అమ్మను అలా కోరగలనేమో చూస్తాను.
కొన్ని గంటల తరువాత స్వామీజీ మళ్ళీ గురుదేవుల వద్దకొచ్చి, “మహాశయా! ఆమెను అడిగారా? అమ్మ ఏం చెప్పింది?” అని అడిగాడు.
శ్రీరామకృష్ణులు: అమ్మను ‘దీని మూలంగా (కంఠ వ్రణాన్ని చూపిస్తూ) ఏమీ తినలేకపోతున్నాను. నాలుగు మెతుకులు తినగలిగేటట్లు చెయ్యి’ అని అడిగాను. కాని అమ్మ, ‘ఎందుకు, (మిమ్మల్నందరినీ చూపించి) ఇందరి నోళ్ళ గుండా తింటున్నావు కదా’ అని అంది. సిగ్గుతో ఆపైన నాకు నోటమాట రాలేదు.
42. శ్రీరామకృష్ణుల అద్వైతభావ ప్రగాఢత
ఆహా, ఎలాంటి అద్భుత దేహబుద్ధి రాహిత్యం! ఎటువంటి అసాధారణ అద్వైత స్థితిలో ఆయన నెలకొని ఉన్నారు. ఆ కాలఘట్టంలో ఆరు నెలలపాటు కేవలం ఒక గిన్నెడు బార్లీగంజి మాత్రమే ఆయన నిత్యాహారం. అటువంటి అనారోగ్య పరిస్థితిలోసైతం, ‘ఇందరి నోళ్ళగుండా తింటున్నావు కదా’ అని జగజ్జనని పలుకగానే, ‘నేనెంత తప్పుపని చేశాను, అయ్యో ఈ క్షుద్రదేహాన్ని ‘నేను’ అని పేర్కొన్నానే’ అని అనుకొని ఆయన సిగ్గుతో తలదించుకొని మౌనంగా ఉండిపోయారు. పాఠకమహాశయా! ఈ భావస్థితిని ఒకింతయైనా మీరు శ్లాఘించకుండా ఉండగలరా!
43. నానారకాల శోధనలను అతి క్రమించిన శ్రీరామకృష్ణులు
ఆహా, ఎటువంటి మహనీయుని సాంగత్యభాగ్యం మేం పొందాం! జ్ఞానం- భక్తి, యోగ- కర్మ, ప్రాచీన-నవీన వీటి, అపూర్వ సర్వమత సమన్వయం ఆయనలో వెల్లివిరియడం మేం చూసివున్నాం. బ్రహ్మజ్ఞానియైన వ్యక్తి సర్వజ్ఞుడౌతాడనీ, అతడి ఆకాంక్షలు నిజరూపం దాల్చి అతడు సత్యసంకల్పుడౌతాడనీ ఉపనిషత్కారులైన ఋషులు వచించారు. బాహ్య ప్రపంచంలోని సమస్త వస్తువులు, సకల శక్తులు అటువంటి వారి సంకల్పానికి తలొగ్గి, వారి ఆకాంక్షల మేరకు మార్పుచెందుతాయి. అలాంటప్పుడు వారి స్వకీయ మనశ్శరీరాలు అట్లే పరివర్తన చెందుతాయనడంలో విచిత్రం ఏముంది? సత్యద్రష్టలైన ఋషుల పై ఉక్తుల సత్యత్వాన్ని పరీక్షించడం సామాన్యులకు అసాధ్యం. మా అల్పశక్తుల ద్వారా పరీక్షింప ఎంతవరకు సాధ్యమో ఆ మేరకు కాస్తోకూస్తో ప్రతివిషయంలోను అనుక్షణం శ్రీరామకృష్ణులను పరీక్షింప మేం వెనుకాడలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాని గురుదేవులు ప్రతి ఒక్క పరీక్షకూ నిలబడి నవ్వుతూ, పరిహాస ధోరణిలో, “ఇప్పటికీ అవిశ్వాసమే! విశ్వాసం, ప్రగాఢ విశ్వాసం వహించండి. ఎవరు రాముడిగా, కృష్ణుడిగా అవతరించాడో అతడే ఇప్పుడు (తమ శరీరం చూపిస్తూ) ఈ ఒరలో ఉన్నాడు. మారువేషంలో రాజ్య పర్యవేక్షణచేసే రాజులా ప్రచ్ఛన్న రూపంలో ఏతెంచాడు. ఎప్పుడు అతడి విషయం బాహాటమౌతుందో, గుసగుసలు ప్రారంభమౌతాయో అప్పుడతడు అక్కడ నుండి తొలగిపోతాడు. ఇదీ అట్టిదే” అని మాతో అనేవారు.
44. శ్రీరామకృష్ణుల అంతరంగ అనుభూతులు – బాహ్యజగత్తు వాస్తవాలు
శ్రీరామకృష్ణుల జీవితంలో జరిగిన అనేక సంఘటనలు పైన ప్రస్తావించిన ఉపనిషత్ సూక్తుల యథార్థతను మనకు గోచరింపచేస్తాయి. ఒక వ్యక్తి మానసంలో ఉత్పన్నమయ్యే భావనలు, ఆలోచనలు అన్నీ నిజానికి ‘స్వయం వేద్యాలు’. అంటే ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తాయి. వాటి ప్రమాణం, అవధి, తీవ్రతలను అతడొక్కడే అంచనా కట్టగలడు. ఇతరులు కేవలం వాటి బాహ్య సూచనలనుబట్టి ఊహిస్తారు. భావసమాధి ప్రకృతి లేదా స్వభావం కూడా సరిగ్గా ఇటువంటిదే. అంటే సామాన్యుల భావాలలా అది కూడ సాధకునికి ‘స్వయం సంవేద్యం’. అది కూడ మానసిక వికల్పం, మానసిక శక్తి అభివ్యక్తీకరణ మాత్రమే. అదికూడ మనస్సులోనే ఉదయించి, మళ్ళీ మనస్సులోనే లయించి పోతుంది. బాహ్యజగత్తులో తదనుగుణంగా వాటి ప్రతిరూపాలు, అంటే అవి వాస్తవం కావడం చూడడంగాని, చూపించడం గాని అసంభవం.
కాని శ్రీరామకృష్ణుల భావసమాధిలోని అనేక అంశాలలో ఇందుకు వ్యతిరేకమే కానవస్తుంది. పంచవటి చుట్టూ కంచె వేయించాలనే ఆయన ఆకాంక్షను ఉదాహరణగా చూద్దాం. సాధనానుష్ఠాన కాలంలో ఆయన స్వయంగా నాటిన పంచవటి మొక్కలను గొడ్లు మేసివేస్తూండడం చూసి ఆ చోటుకు కంచె వేయించగోరారు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే గంగానదిలో వెల్లువవచ్చి కంచెకు అవసరమైన మామిడి గుంజలు, నారతాడు ఇత్యాది సామగ్రి, చివరకు కొడవలితోసైతం అన్నీ కొట్టుకొనివచ్చి పంచవటి సమీపాన తేలాయి. వెంటనే ఆయన భర్తాభారి అనే కాళికాలయ తోటమాలి తోడ్పాటుతో కంచె వేయించారు. మరో ఉదాహరణ చూద్దాం: రాణీ రాస్మణి అల్లుడైన మథురనాథ్తో ఏదో సందర్భంలో వాదిస్తూ, “భగవంతుడు సంకల్పిస్తే, ఏదైనా సంభవమే. ఎర్రపువ్వులు పూచే మొక్కకు తెల్లపువ్వులు కూడ పూయవచ్చు” అని నిశ్చితంగా చెప్పారు. కాని మథురనాథ్ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఆ మర్నాడే తోటలోని ఎర్రమందారమొక్క ఒకే కొమ్మన ఎరుపు, తెలుపు రెండు రంగుల పువ్వులు పూచివుండడం ఆయన చూసి, ఆ కొమ్మను విరిచి తీసుకువచ్చి మథుర్కు చూపారు. ఇంకొక ఉదాహరణ తీసుకొందాం: తంత్రం, వైష్ణవం, వేదాంతం, ఇస్లాం – ఇలా శ్రీరామకృష్ణుల మనస్సులో ఎప్పుడెప్పుడు ఏయే సాధనలు అనుష్ఠించాలని ప్రగాఢ ఆకాంక్ష ఉదయించినా, ఆయా మతాలలో సిద్ధులైన గురువులు ఒకరొకరుగా దక్షిణేశ్వరానికి విచ్చేసి, ఆయనకు ఆ సాధనలలో దీక్షనిస్తూ వచ్చారు. మరో ఉదాహరణ: ఎంతోకాలం క్రితమే భావావస్థలలో గాంచిన తమ అంతరంగ భక్తులను చూడాలని ఆయన పరితపించి, వారిని ఎలుగెత్తి పిలిచారు. వారు రావడమూ, వారిని ఆయన గుర్తించి సాదరంగా స్వీకరించడమూ జరిగింది. ఇలా అనేక నిదర్శనాలు చూపించవచ్చు. వీటినన్నిటిని లోతుగా పరికించి చూస్తే ఒక విషయం స్పష్టమౌతుంది: శ్రీరామకృష్ణుల భావనలలో అత్యధికభాగం సామాన్యుల భావనల్లా, సంకల్పాల్లా కేవలం ఆలోచనలుగానే ఉండిపోలేదు. ఏదో ఒక అజ్ఞాతశక్తి ద్వారా ఆయన భావనలు, సంకల్పాలు బాహ్యజగత్తులో వాస్తవిక సంఘటనలుగా పరిణమించాయి. ఇవి యథార్థాలు; పాఠకులు తమ ఇష్టానుసారం చర్చించుకొని నిర్ణయించుకోవచ్చు.
45. విభిన్న భక్తులతో శ్రీరామకృష్ణుల విభిన్న సంబంధాలు
ఒక్క నిర్వికల్ప సమాధిలో మగ్నులై ఉన్నప్పుడు తప్ప మిగిలిన అన్ని వేళలా శ్రీరామకృష్ణులు ‘భావముఖం’ లో నెలకొని ఉండేవారనే సంగతి ఇంతకు మునుపే* తెలిపివున్నాం. అందుచేతనే విభిన్న భక్తులతో విభిన్న ఆధ్యాత్మిక ప్రేమ బాంధవ్యాలను – ఒక ప్రత్యేక భక్తునిపట్ల ఒక ప్రత్యేక బాంధవ్యం – కల్పించుకొని, ఆ సంబంధాన్ని చెక్కుచెదరక అట్లే నిలిపి ఉంచుకొనేవారు. అట్లే స్త్రీలనందరినీ జగజ్జనని శక్తుల, అంశల అభివ్యక్తీకరణలైన హ్లాదిని (ఆనందప్రదాయిని), సంధిని (పోషకదాయిని)గా భావిస్తూ, యావజ్జీవితం వారినందరినీ మాతృదృష్టితో చూసేవారనే విషయం ఇప్పుడు లోకవిదితమే. కాని ప్రతి భక్తునితోను ఒక ప్రత్యేక బాంధవ్యాన్ని కల్పించుకొని ఉండేవారనే సంగతి బహుశా వారికి తెలిసి ఉండకపోవచ్చు. కనుక ఆ విషయం గురించి ఇక్కడ ఒకింత ప్రస్తావించడం అప్రస్తుతం కాబోదు. శ్రీరామకృష్ణులు తమ భక్తులను శివాంశ సంభూతులు, విష్ణ్వంశ సంభూతులు అనే రెండు కోవలుగా వర్గీకరించేవారు. ఈ రెండు కోవలకు చెందిన భక్తుల స్వభావం, ప్రవర్తన, సాధనానురాగం మొదలైనవి వ్యత్యాసంగా ఉంటాయని ఆయన చెప్పేవారు. ఆ వ్యత్యాసాన్ని ఆయన స్పష్టంగా అవగతం చేసుకోగలిగేవారు. కాని ఆ వ్యత్యాసం ఏమిటో పాఠకులకు వివరించడం మా శక్తికి మించిన పనిగా భావిస్తున్నాం.
46. రెండు కోవల భక్తులు
కనుక శివ, విష్ణువు అనే పాత్రలు మూసలు లేక నమూనాలనీ, ప్రతి భక్తుని మానసిక వర్తనం ఈ రెండిటిలో ఏదో ఒక మూసలో పోతపోసి ఉంటుందనీ పాఠకులు క్లుప్తంగా గ్రహిస్తే చాలు. తమ భక్తులందరితో శ్రీరామకృష్ణులు శాంత దాస్య సఖ్య వాత్సల్యాది భావాల సంసర్గాన్ని, అంటే ఏ భక్తుడిలో ఏ భావం ప్రాధాన్యం సంతరించుకొందో తదనుగుణంగా అతడితో ఆ భావం ద్వారా ఆధ్యాత్మిక బాంధవ్యాన్ని నెలకొల్పుకొనేవారు. ఉదాహరణకు నరేంద్రనాథ్ లేదా కాలాంతరాన స్వామి వివేకానంద గురించి ఇలా చెప్పేవారు: “నరేంద్ర నా జతలాంటి వాడు. దీన్లో (తమను చూపుతూ) ఏది ఉందో అది స్త్రీ స్వభావంగలది. అతడిలో (నరేంద్రుణ్ణి చూపుతూ) ఉన్నది పురుష స్వభావం గలది.” అట్లే రాఖాల్ను (కాలాంతరాన స్వామి బ్రహ్మానంద) తమ మానసిక పుత్రునిగా భావించేవారు. ఈ రీతిలో తమ విశిష్ట భక్తులందరితో – గృహస్థులైనా, సన్న్యాసులైనా – ఒక్కో ప్రత్యేకభావ సంబంధంతో మెలగేవారు. అలాగే సామాన్య భక్తులందరూ నారాయణుని ప్రతిరూపాలని ప్రగాఢంగా విశ్వసించి, వారందరితో ‘శాంత’ భావ సంబంధాన్ని నెలకొల్పుకొని మెలగేవారని చెప్పనవసరంలేదు.
47. ప్రతి ఒక్క భక్తుని అంతరంగ ప్రవృత్తిని శ్రీరామకృష్ణులు ఎరిగి ఉండడం
ప్రతి ఒక్క భక్తుని ఆంతరంగిక ప్రవృత్తిని చక్కగా గ్రహించిన పిదపే శ్రీరామకృష్ణులు వారితో తదనుగుణమైన ఆధ్యాత్మిక బాంధవ్యాన్ని సుప్రతిష్ఠితం చేసుకొనేవారు. “గాజు పెట్టెలోని వస్తువుల్లా మనిషి మనసులోపల ఏం ఉందో నేను స్పష్టంగా చూడగలను” అని అందుచేతనే ఆయన చెప్పేవారు. తమ నైజానికి విరుద్ధంగా ఎవ్వరూ ఎన్నడూ ప్రవర్తించలేరు. కనుక ఏ భక్తుని కైనా శ్రీరామకృష్ణులతో ఏర్పడిన ఆధ్యాత్మిక బాంధవ్యానికి విరుద్ధంగా ప్రవర్తించడం అసాధ్యం. ఎన్నడైనా ఎవరైనా భక్తుడు మరో భక్తుణ్ణి అనుకరించి తన నైజానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, శ్రీరామకృష్ణులు చికాకుపడి అతడి తప్పిదాన్ని స్పష్టంగా ఎత్తి చూపేవారు. ఉదాహరణగా ఒక భక్తుని విషయం ప్రస్తావిస్తున్నాం. గిరీశ్చంద్ర ఘోష్‌ను భైరవాంశసంభూతునిగా శ్రీరామకృష్ణులు పేర్కొనేవారు. ఒకరోజు దక్షిణేశ్వర కాళికాలయంలో భావసమాధి స్థితిలో శ్రీరామకృష్ణులు, గిరీశ్‌ను భైరవునిగా గాంచారు. అందుచేతనే గిరీశ్ హఠాన్ని, పరుష వచనాలను ఆయన చిరునవ్వుతో సహించేవారు. ఎందుకంటే ఈ కఠిన వర్తనకు వెనుక దాగివున్న అతడి అసలు నైజం అతికోమలమైనదనీ, తన మీద పరాధీనుడై ఉండడంచేతనే అతడలా ప్రవర్తిస్తున్నాడనే విషయం ఆయనకు చక్కగా తెలుసు కనుక. ఒక రోజు మరో భక్తుడు గిరీశ్‌ను అనుకరించి శ్రీరామకృష్ణులతో పరుషభాషణం చేయడంతో, ఆయన ఎంతో అసంతృప్తి వ్యక్తంచేసి, ఆ తరువాత అతడి తప్పిదాన్ని తెలియచేశారు.
48. ఆధ్యాత్మిక పథంలో భక్తులను నానారీతుల్లో ఆయన పురోగమింప చేయడం
భావముఖంలో సుప్రతిష్ఠితులైన శ్రీరామకృష్ణులు ఆ విధంగా ప్రతి స్త్రీ, ప్రతి పురుషుని స్వాభావిక ఆధ్యాత్మిక భావాన్ని చక్కగా ఎరిగి, తదనుగుణంగా వారితోటి సర్వకాలీన ప్రేమ బాంధవ్యాన్ని కల్పించుకొన్నారు. ఆయన అలా ఆయా భావాలకు అనుగుణంగా ప్రతి భక్తుని భగవత్సాక్షాత్కారం దిశగా పురోగమింప అమలుపరచిన నానా పద్ధతులలో కొన్నింటిని ఇక్కడ ప్రస్తావించి ఈ అధ్యాయాన్ని పూర్తిచేస్తాం. కాళికాలయంలో కలిగిన జగజ్జనని ప్రప్రథమ దర్శనంతోనే ఆయన అద్వైత సాక్షాత్కారం పొందారు. తదనంతరం ఆ అద్వైతభూమి నుండి క్రిందికి దిగివచ్చాక సఖ్య వాత్సల్య మధుర భక్తి భావాల ఆనందాన్ని అనుభవింపగోరి, వాటిని అనుష్ఠించి, ప్రతి భావంలోను పరాకాష్ఠను చవిచూశారు. ఇది జరిగిన చాలాకాలం తరువాత ఆయన అంతరంగ భక్తులు రాసాగినప్పుడు, ఆ భక్తులకు సైతం భావసమాధి అనుభవం చవిచూపాలనే ఆకాంక్ష ఆయనలో జనించింది. అందు నిమిత్తం ఆయన జగజ్జననిని ప్రార్థించారు. వెంటనే ఆంతరంగిక భక్తులలో కొందరికి భావసమాధి అనుభూతి కలుగసాగింది. అటువంటి భావావస్థలో వారికి బాహ్య జగత్తు జ్ఞానం, దేహ జ్ఞానంతో కలిపి కొంతమేరకు లుప్తమై, వారి అంతరంగంలో విశేషమైన ఏదో ఒక భావన – ఉదాహరణకు భగవద్రూప ధ్యానం – ఎంత ప్రస్ఫుటం అయ్యేదంటే ఆ రూపం సజీవమై ప్రకాశిస్తూ వారి ముందు నిలబడి నవ్వడం, మాట్లాడడం మొదలైనవి చేయడం ఆ భక్తులు దర్శించేవారు. భక్తిగీతాలు, భజనలు వింటున్నప్పుడే ముఖ్యంగా వారు ఆ భావావస్థకు లోనయ్యేవారు.
49. భక్తులు : దేవీ దేవతల దర్శనాలు
శ్రీరామకృష్ణుల భక్తులలో మరో కోవకు చెందినవారున్నారు. భక్తిసంగీతం వింటున్నా వీరికి అటువంటి భావావస్థలు కలిగేవి కావు. కాని ధ్యాన సమయంలో వారికి దేవతామూర్తుల దర్శనాలు కలిగేవి. ప్రారంభంలో కేవలం రూపదర్శనం మాత్రం అయ్యేది. తరువాత ధ్యానం ప్రగాఢమయ్యేకొద్దీ ఆ దేవతామూర్తుల కదలికలను చూసేవారు. మాటలు వినేవారు కూడ. మళ్ళీ కొందరికి ప్రారంభంలో వివిధ దర్శనాలు కలుగుతూండేవి. కాని వారి ధ్యానం ప్రగాఢమైన తరువాత ఆ దర్శనాలు కలిగేవి కావు. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరి ప్రతి ఒక్కరి దర్శనాలు, అనుభవాలు వినగానే ఎవరు ఏ కోవకు చెందినవారో, వారి అప్పటి అవసరాలేమిటో, భవిష్యత్‌లో వారికి కలుగనున్న దర్శనాలు అనుభూతులు ఏమిటో యావత్తూ శ్రీరామకృష్ణులకు తెలిసిపోయేది. ఇందుకు ఉదాహరణగా ఒక భక్తుని విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం.
50. వైకుంఠ దర్శనం పొందిన ఒక భక్తుడు
మా మిత్రుడొకడు* శ్రీరామకృష్ణుల వద్ద ఉపదేశం పొంది, ధ్యానాది సాధనలు అనుష్ఠింపసాగాడు. ప్రారంభంలో ధ్యాన సమయాన తన ఇష్టదేవతను వివిధ రూపాలలో స్పష్టంగా దర్శించసాగాడు. అప్పుడప్పుడు దక్షిణేశ్వరానికి వచ్చి గురుదేవులకు అతడు తన అనుభవాలను తెలిపేవాడు. అతడి దర్శనాదుల సంగతి విని శ్రీరామకృష్ణులు, “చాలా మంచిది”, “ఇలా అనుష్ఠించు” అంటూ చెప్పేవారు. తదనంతరం ఆ మిత్రుడు ధ్యానం చేస్తున్నప్పుడు వివిధ దేవీదేవతా రూపాలన్నీ ఒక్క ‘రూపం’ లో లీనమైపోవడం దర్శించాడు. శ్రీరామకృష్ణులకు ఆ విషయం తెలిసినప్పుడు, “మంచిది, నీకు వైకుంఠ దర్శనం కలిగింది. ఇకపైన నీకే దర్శనాలూ కలుగవు” అని చెప్పారు. మా మిత్రుడు మాతో ఇలా చెప్పాడు: “నిజానికి ఆయన చెప్పినట్లే జరిగింది. ధ్యాన సమయంలో ఆ తరువాత ఏ దేవతారూపాన్నీ చూడగలిగేవాణ్ణి కాదు. భగవంతుని సర్వవ్యాపిత్వం, సర్వశక్తిత్వం మొదలైన సర్వోత్కృష్ట భావాలు ఉదయించి నా మనస్సులో నింపివేసేవి. ఆ సమయంలో దివ్యరూప దర్శనాలు చూడ ఎంతో ఇష్టపడేవాడిని; మళ్ళీ వాటిని పొందగోరి గట్టిగా ప్రయత్నించాను. కాని నా ప్రయత్నం విఫలమే అయింది; ఏ దివ్యదర్శనమూ ఆపైన నాకు కలుగలేదు.”
51. సాకారవాదులకు శ్రీరామకృష్ణుల ఉపదేశం
“ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సును ఒక పట్టుదారంతో ఇష్టదేవత పాద పద్మాలకు కట్టివేశాననీ, మనస్సు ఇక ఎక్కడకూ పోలేదనీ భావించుకోవాలి. పట్టుదారం అని ఎందుకు చెబుతున్నాను? ఎందుకంటే, ఆ పాదపద్మాలు అతిసున్నితమూ, అతికోమలమూ అయినవి కనుక; మరేదైనా దారంతో కట్టితే అవి గాయపడతాయి” అని సాకారవాదులకు (భగవంతునికి రూపం ఉన్నదని విశ్వసించే భక్తులకు) శ్రీరామకృష్ణులు ఉపదేశించేవారు. కొన్ని సందర్భాలలో ఇలా చెప్పేవారు: “ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే ఇష్టదేవతను చింతనచేస్తూ, ఇక తక్కిన సమయాలలో విస్మరించాలనా? కాదు, సదా కొంతపాలు మనస్సును ఆయన చింతనలోనే లగ్నంచేయాలి. దుర్గా ప్రతిమను పూజిస్తున్న సమయంలో ఒక దీపం వెలుగుతూ ఉండడం మీరు తప్పక గమనించే ఉంటారు. సదా సర్వ వేళలా దేవుని వద్ద ఒక దీపం వెలుగుతూనే ఉండాలి. అది ఆరిపోకుండా చూసుకోవాలి. అది ఆరిపోతే, ఆ గృహస్థుకి కీడు వాటిల్లుతుంది. అదే రీతిలో హృదయ పద్మంలోకి ఇష్టదైవాన్ని తోడ్కొనివచ్చి, ఆసీనుణ్ణి గావించిన పిదప, ఆయన ధ్యానం అనే ప్రదీపం సదా వెలుగుతూ ఉండేటట్లు చూసుకోవాలి. సంసార కర్తవ్యాలలో మునిగి ఉన్నప్పుడు, అప్పుడప్పుడు అంతరంగాన ఆ దీపం వెలుగుతూన్నదో లేదో గమనిస్తూ ఉండాలి.”
52. ధ్యానానికి మునుపు మనస్సును ప్రక్షాళన చేసుకో!
కొన్ని సమయాల్లో మళ్ళీ ఆయన ఇలా చెప్పేవారు: “ఆహా! ఆ రోజులలో ధ్యానానికి కూర్చోబోయే ముందు మనస్సు లోపల భాగాన్నంతా పూర్తిగా ప్రక్షాళన చేసుకొంటున్నట్లుగా నేను ఊహించుకొనేవాణ్ణి. మనస్సులో మలినం, ధూళి (విషయ చింతనలు, దురాలోచనలు) అలముకొని ఉంటాయి. వాటి నన్నిటిని శుభ్రంగా కడిగివేసి, అక్కడ ఇష్టదేవతను ఆసీనురాలిని చేస్తున్నట్లుగా భావించుకొనేవాణ్ణి. మీరు అదేవిధంగా చెయ్యండి.”
53. సాకారవాదమా, నిరాకారవాదమా? ఏది ఉత్కృష్టం?
భగవంతుని సాకార, నిరాకార ధ్యానాన్ని గురించి శ్రీరామకృష్ణులు ఒక సందర్భంలో మాతో ఇలా చెప్పారు: “కొందరు సాకారధ్యానం ద్వారా నిరాకారాన్ని చేరుకొంటారు, మరికొందరు అట్లే నిరాకార ధ్యానం ద్వారా సాకారాన్ని చేరు కొంటారు.” ఒక రోజు పరమ భక్తుడైన గిరీశ్ ఘోష్ ఇంట్లో మా మిత్రుడొకరు* శ్రీరామకృష్ణులను, “మహాశయా! సాకార భావన గొప్పదా, నిరాకార భావన గొప్పదా?” అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు ఇలా జవాబిచ్చారు: “ ‘పక్వ’, ‘అపక్వ’ అని రెండు రకాల నిరాకార భావనలు ఉన్నాయి. పక్వమైన నిరాకార భావన ఉత్కృష్టమైనది. దీనిని సాకార భావనతోనే చేరుకోవలసి ఉంటుంది. అపక్వ నిరాకార భావనలో కళ్ళు మూసుకోగానే – బ్రహ్మ సమాజస్థులకు* మాదిరే – అంతా చీకటిమయమే.” పాశ్చాత్య విద్యాభ్యాస ఫలితంగా అపక్వ నిరాకారోపాసనను అనుష్ఠిస్తూన్న మరో కోవకు చెందిన శ్రీరామకృష్ణుల భక్తులు కొందరున్నారు. క్రైస్తవ ప్రచారకులను అనుకరిస్తూ భగవంతుని సాకారోపాసనను గర్హించడంగాని లేదా భగవంతుని వివిధ ప్రతీకల రూపాలలో ఆరాధిస్తూ ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్న భక్తులను చూసి, ‘విగ్రహారాధకులు’, ‘గ్రుడ్డి నమ్మకస్థులు’ అని ద్వేషించడంగాని చేయరాదని వారిని శ్రీరామకృష్ణులు కట్టడి చేసేవారు.
54. సాకార, నిరాకారాల సామరస్యం
ఆయన ఇలా చెప్పేవారు: “ఆహా! భగవంతుడు సాకారుడు, నిరాకారుడు కూడా; అట్లే ఈ రెండింటికీ అతీతమైన మరెటువంటి వాడో ఎవరికెరుక? సాకారతత్త్వం ఎటువంటిదో తెలుసా? నీరు – మంచుగడ్డ లాంటిది. నీరు ఘనీభవిస్తే మంచుగడ్డ అవుతుంది. లోపల బయట నీరున్నదే మంచుగడ్డ. మంచుగడ్డ, నీరే తప్ప మరేమీ కాదు. కాని నీటికి ఎలాటి ఆకారమూ లేదు, కాని మంచుగడ్డకు ఆకారం ఉంది. అదేవిధంగా భక్తి అనే శీతలం ద్వారా అఖండ సచ్చిదానంద సాగరం ఘనీభవించి మంచుగడ్డలా వివిధ రూపాలను దాలుస్తుంది.” శ్రీరామకృష్ణుల ఈ ఉదాహరణ భగవంతుడు ఏకకాలంలో సాకార నిరాకారుడనే విశ్వాసం పాదుగొల్పి ఎందరికి మానసిక శాంతిని ప్రదానం చేసిందో చెప్పడం మా తరం కాదు.
55. స్వామి వివేకానంద అంధ విశ్వాసం
ఇక్కడ మరో విషయం ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాం. పైన పేర్కొన్న అపక్వ నిరాకారోపాసనకు చెందిన శ్రీరామకృష్ణుల భక్తబృందంలో స్వామి వివేకానంద అగ్రగణ్యుడు. ఈ కోవకు చెందిన భక్తులలోనే కాక, అన్ని కోవలకు చెందిన భక్తులలో స్వామి వివేకానందను గురుదేవులు అగ్రగణ్యుడిగా పరిగణించారు. పాశ్చాత్య విద్యాభ్యాస, బ్రహ్మసమాజ ప్రభావ ఫలితంగా అతడు సాకారవాద భక్తులను కొన్ని సమయాలలో సంకుచిత ధోరణిలో వ్యాఖ్యానించేవాడు. వాగ్వాద సమయాన అతడిలో ఈ ధోరణి ప్రస్ఫుటంగా ద్యోతకమయ్యేది. కాని శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు అతడికీ, సాకారవాద భక్తులకూ మధ్య తీవ్ర చర్చను పురిగొల్పి వేడుక చూస్తూవుండేవారు. అలాంటి చర్చలలో తరచూ అతడి వాదనాపటిమ ముందు ఎవ్వరూ నిలబడలేకపోయేవారు. కొందరు స్వామీజీ మేధస్సుకు స్థాణువులై లోలోన నొచ్చుకోవడం కూడ కద్దు. నరేంద్రుని గెలుపు గురుదేవులకెంతో ఆనందం కలిగించేది; ఆయన ఆ సంగతిని ఆనందంగా పలుమార్లు ఇతరుల ముందు వివరిస్తూ, “ఆ ఫలానా ఫలానా వ్యక్తి వాదనను ఆ రోజు నరేందర్ అలవోకగా చీల్చిచెండాడివేశాడు. ఆహా! ఎంతటి కుశాగ్రబుద్ధి” అని చెప్పేవారు. కాని సాకారవాదియైన గిరీశ్ఘోష్తో చర్చిస్తూ ఒక సందర్భంలో స్వామీజీ మౌనం వహించవలసి వచ్చింది. ఆ సందర్భంలో గిరీశ్ విశ్వాసాన్ని మరింత పరిపూర్ణం, ప్రగాఢం చేయగోరి శ్రీరామకృష్ణులు అతడి పక్షం వహించారని మాకు అనిపించింది. ఐనప్పటికీ మరో సందర్భాన శ్రీరామకృష్ణులతో ప్రసంగిస్తూ స్వామీజీ సాకారవాదులది ‘అంధ విశ్వాస’ మని ప్రస్తావించాడు. వెంటనే శ్రీరామకృష్ణులు, “మంచిది. నువ్వు పేర్కొంటున్న అంధ విశ్వాసమంటే ఏమిటో నాకు కాస్త వివరించి చెప్పగలవా? విశ్వాసమంతా గ్రుడ్డిదే కదా! కళ్ళున్న విశ్వాసం అంటూ ఏదైనా ఉందా? ‘విశ్వాసం’ లేక ‘జ్ఞానం’ అని మాట్లాడు. కాని విశ్వాసాలలో కొన్ని ‘కళ్ళున్నవి’, కొన్ని ‘గ్రుడ్డివి’ అని చెప్పడం ఎలా కుదురుతుంది?” అని ప్రశ్నించారు. “నాడు గురుదేవులకు ‘అంధవిశ్వాసం’ అంటే ఏమిటో వివరింప ప్రయత్నించి గట్టిచిక్కులో పడ్డాను. ఆ మాటకు ఎలాంటి అర్థాన్నీ కనుగొనలేకపోయాను. శ్రీరామకృష్ణులు చెప్పిందే యథార్థమని గ్రహించి, నాటినుండి ఆ నుడికారాన్ని ఉపయోగించడమే మానుకొన్నాను” అని స్వామీజీ తదనంతరం చెప్పడం జరిగింది.
56. అపక్వ నిరాకార వాదులకు ఉపదేశం
అపక్వ నిరాకారవాదులను, సాకారవాదులను శ్రీరామకృష్ణులు సమాన దృష్టితోనే చూసేవారు. ఏ విధమైన ధ్యానం తోడ్పడుతుందో కూడ వారికి చెప్పేవారు. “ఇలా చూడండి. ఆ రోజుల్లో భగవంతుణ్ణి నేను సమస్త విశ్వాన్ని ఆవరించిన మహాసముద్రంలా, నన్ను ఆ విస్తృత సచ్చిదానంద సాగరంలో మునిగి తేలుతూ, ఈదులాడే చేపలా ఊహించుకొనేవాడను. మళ్ళీ కొన్ని సమయాల్లో నేనొక ‘కుండ’ ననీ, ఆ నీళ్ళలో మునిగివున్నాననీ, నా లోపల వెలుపల అంతటా ఆ సచ్చిదానందు డొక్కడే పరివ్యాపించి ఉన్నాడనీ భావించుకొనేవాడను” అని చెప్పేవారు.
57. తమ రూపాన్ని ధ్యానించమని భక్తులకు ఉపదేశం
మళ్ళీ ఆయన ఇలా చెప్పేవారు: “చూడండి! ధ్యానానికి కూర్చునే ముందు ఒక్కసారి దీనిని (తమను చూపుకొంటూ) తలచుకోండి. ఎందుకలా అంటున్నానో తెలుసా? దీని పట్ల మీకు విశ్వాసం ఉంది కనుక. దీనిని తలచుకొంటే ఆయన (భగవంతుడు) జ్ఞప్తికి వస్తాడు. ఇది మీరు గమనించలేదా? ఆల మందను చూడగానే గోపాలకుడు, కుమారుణ్ణి చూడగానే అతడి తండ్రి, న్యాయవాదిని చూడగానే న్యాయస్థానం జ్ఞప్తికి వచ్చే రీతిలోనే ఇదీను. మీకు అర్థమైందా? మనస్సు ఇక్కడ, అక్కడ, సర్వత్రా చెల్లాచెదురై ఉంటుంది. దీనిని తలచుకోవడం మొదలుపెట్టగానే మనస్సు ఒక్కచోట ప్రోగై, భగవంతుని వైపుకు నిర్దేశించగానే సరైన ధ్యానం కుదురుతుంది.”
58. భగవంతుని తోటి బాంధవ్య ఆవశ్యకత
59. బాంధవ్యం ప్రగాఢమయ్యే కొద్దీ ఆయనపై ప్రేమపూర్వకంగా ఒత్తిడి తీసుకురావచ్చు
60. పథభ్రష్టయైన స్త్రీ ఉదాహరణ
అంతేకాక ఇలా చెప్పేవారు: “నీకు ఇష్టమైన ఏదో ఒక భగవద్రూపాన్నో లేక ఆధ్యాత్మిక భావాన్నో గట్టిగా పుచ్చుకో; అప్పుడే (సాధనలో) నీకు స్థిరత్వం ఏర్పడుతుంది. ‘ఆధ్యాత్మిక భావాల ద్వారా మాత్రమే భగవత్సాక్షాత్కారం సాధ్యం. అవి కొరవడితే ఆయన సాక్షాత్కారం కలుగుతుందా?’ అందుకే ఆధ్యాత్మిక భావాలు తప్పనిసరి. ఏదైనా ఒక భావాన్ని అలవరచుకొని భగవంతుణ్ణి ప్రార్థించాలి. ‘భావానుగుణంగానే లబ్ధి; అన్నిటికీ మూలం విశ్వాసం; భావం ద్వారానే భక్తి చిగురిస్తుంది. ఆధ్యాత్మిక భావాలు, విశ్వాసం తప్పనిసరి ఆవశ్యకాలు. గట్టి పట్టుదల అవసరం. అప్పుడే ఫలం సిద్ధిస్తుంది. ఆధ్యాత్మిక భావం అంటే ఏమిటో తెలుసా? భగవంతునితో ఒక బాంధవ్యాన్ని కల్పించుకొని, ఆ బాంధవ్యాన్ని అన్ని వేళలా– తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు – మన కళ్ళ ముందు తేజోమయం గావించుకోవడమే ఆధ్యాత్మిక భావంగా పేర్కొంటారు. ఉదాహరణకు: ‘నేను ఆయన దాసుణ్ణి’, ‘నేను ఆయన బిడ్డను’, ‘నేను ఆయన అంశను’ – దీనికే ‘పక్వాహంకారం’, ‘విద్యాహంకారం’ అని పేరు. ‘నేను బ్రాహ్మణుడను’, ‘నేను క్షత్రియుణ్ణి’, ‘నేను ఫలానా వ్యక్తి కుమారుణ్ణి’, ‘నేను ఫలానా వాడి తండ్రిని’ – ఇవన్నీ అవిద్యాహంకారం క్రిందికి వస్తాయి. వీటిని విడనాడాలి, పూర్తిగా త్యజించాలి. ఇవి అహాన్ని, ఆభిజాత్యాన్ని పెంపొందించి బంధాన్ని కల్పిస్తాయి. సదా కొంతపాలు మనస్సును భగవంతుని వైపుగా కేంద్రీకరించాలి. అలా చేసినప్పుడు మాత్రమే సిద్ధి లభిస్తుంది. ఒక ప్రత్యేక అనురాగ బాంధవ్యాన్ని సుదృఢపరచుకొని తద్ద్వారా భగవంతుణ్ణి తన వాడిగా చేసుకోవాలి. ఈ విధంగా మాత్రమే ఆయనపై ప్రేమపూర్వకంగా ఒత్తిడి తీసుకురాగలం. స్నేహం మొదలైనప్పుడు ‘మీరు’ అని సంబోధించుకొంటారు. ఆ స్నేహం సన్నిహితం కాగా ‘మీరు’ స్థానే ‘నువ్వు’ అని పిలుచుకోసాగుతారు. స్నేహం ముదిరి పాకానపడ్డాక ‘నువ్వు’ పోయి ‘ఏరా, రారా’ అని సంబోధించుకోవడం చూస్తాము. భగవంతుణ్ణి తన స్వకీయునికంటే కూడా పరమ ఆత్మీయుణ్ణిగా చేసుకోవాలి. అప్పుడే కార్యం సిద్ధిస్తుంది. పథభ్రష్టయైన ఒక స్త్రీని ఉదాహరణగా తీసుకోండి. ఒక విటుణ్ణి ఆమె ప్రేమింప నారంభిస్తుంది. ఎంత గోప్యతను, భయాన్ని, లజ్జను ప్రదర్శిస్తుందప్పుడు! ఆ ప్రేమ ముదిరి తారాస్థాయికి చేరినప్పుడు ఆ భావోద్వేగాలన్నీ పటాపంచలవుతాయి. ఆమె తన కుటుంబం నుండి బయటపడి నలుగురి ముందు బాహాటంగా ఆ విటుని చేయి పుచ్చుకొనే దశకు వస్తుంది. ఒకవేళ ఆ విటుడు ఆమె సంరక్షణ భారం స్వీకరింప వెనుకాడి, ఆమెను విడనాడగోరితే, ఆమె అతడి మెడచుట్టూ ఒక బట్ట బిగించి, ఇలా అంటుంది: “నీ నిమిత్తం ఇల్లూ వాకిలీ వదలిపెట్టి ఇలా అసహాయురాలనైనాను. ఇప్పుడు నన్ను విడనాడగోరతావా? నన్ను తప్పక పోషించాలి!” అదే రీతిలో భగవంతుని నిమిత్తం సర్వం త్యజించి ఆయనను తన సొంతవాణ్ణిగా చేసుకొన్న వ్యక్తి, ‘నీ నిమిత్తం సర్వం పరిత్యజించాను. ఇప్పుడు నాకు దర్శనం ఇస్తావా, లేదా?” అని నిలదీసి అడగవచ్చు.
61. భగవత్సాక్షాత్కార సంకల్పం
62. ఒక్కొక్కటిగా కోర్కెలను పరిత్యజించాలి
ఎవరిలోనైనా భగవదనురాగం సన్నగిల్లడం కనుగొంటే, ఆయన ఇలా అనేవారు: “ ‘ఈ జన్మలోనే కాకుంటే వచ్చే జన్మలో భగవత్సాక్షాత్కారం పొందుతాను?’ అని ఎందుకంటావు. అటువంటి ఉదాసీన భక్తి ఉండరాదు. ‘ఈ జన్మలోనే కాదు, ఈ క్షణంలోనే ఆయన అనుగ్రహంతో ఆయనను సాక్షాత్కరించుకొంటాను.’ అటువంటి పట్టుదల, విశ్వాసం కలిగివుండాలి. అన్యథా సఫలత సిద్ధిస్తుందా? ఆ గ్రామీణ (అంటే కామార్పుకూర్) ప్రాంతాలలో రైతులు ఎద్దులు కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు మొదట వాటి తోకల క్రింద చేతులు ఉంచి, పరీక్షిస్తారు. రైతులు తోకల క్రింద చేతులు ఉంచినప్పుడు కొన్ని ఎద్దులు కదలకమెదలక సేదతీర్చుకొనే రీతిలో నేలమీద పడుకొంటాయి. ఇటువంటి ఎద్దులు పనికిరావని వారికి తెలుసు. కాని తోకల క్రింద చేతులు పడగానే ఎగిరి గంతేసి త్రుళ్ళిపడే ఎద్దులు చురుకైనవి, మంచివి అని గ్రహించి వాటిని ఎన్నుకొంటారు. అదే రీతిలో ఉదాసీన భక్తి పనికిరాదు. బలాన్ని పుంజుకొని, విశ్వాసంతో, ‘నేను తప్పక భగవత్సాక్షాత్కారం పొంది తీరుతాను, దాన్లో ఎలాంటి సందేహమూ లేదు. ఈ క్షణంలోనే పొంది తీరుతాను’ అని పలుకు. అప్పుడు మాత్రమే సాక్షాత్కారం సిద్ధిస్తుంది.” మళ్ళీ ఆయన ఇలా కొనసాగించేవారు: “ప్రాపంచిక కోర్కెలను ఒక్కొక్కటీ విడిచిపెట్టాలి. వాటిని ఒక్కొక్కటిగా విడిచిపెట్టడానికి మారుగా వాటిని పెంచుకొంటాము; అలాంటప్పుడు విజయం సాధించగలమని ఎలా ఆశించగలం?”
63. గాలంవేసి చేపలు పట్టేటప్పుడు కనబరిచే పట్టుదల, ఓర్పు అవసరం
జపం, ధ్యానం, ప్రార్థనాదులను ఎంత అనుష్ఠిస్తూవున్నా పురోగమన సూచనలేవీ కానరాక నైరాశ్య సాగరంలో మునిగే తమ సాకార నిరాకార భక్తులందరినీ శ్రీరామకృష్ణులు ఇలా ప్రోత్సహించేవారు: “చేపలు పట్టగోరితే గాలానికి ఎర తగిలించి, చెరువు నీటిలో గాలాన్ని పడవెయ్యాలి. నువ్వు గాలం పుచ్చుకొని ఒడ్డున చాలాసేపు కూర్చుంటావు; చేపలున్న సూచనలేవీ కనబడనందున బహుశా చెరువులో చేపలు లేవనుకొంటావు. ఒకరోజు బహుశా ఒక పెద్దచేప త్రుళ్ళిపడడం గమనించగానే చెరువులో చేపలున్నాయన్న నమ్మకం నీకు కలుగుతుంది. మరో రోజు నీళ్ళపై తేలుతున్న బెండు కదలడం చూసి, చేప ఎర వద్దకు వచ్చినట్లు నీకు స్పష్టమౌతుంది. మరో రోజు బెండు నీళ్ళలో మునుగుతుంది; గాలం పైకెత్తి చూస్తే ఎరను మింగి చేప పారిపోయినట్లు తెలియవస్తుంది. మళ్ళీ నువ్వు ఎరను గాలానికి తగిలించి నిఘావేసి కూర్చుంటావు. చివరికి ఒక రోజు చేప ఎరను మింగిన మరుక్షణమే గాలంకర్రను లాగివేస్తావు; చేప నేలమీద పడుతుంది.”
64. భగవంతుని వినికిడి అతిసూక్ష్మం
కొన్ని సమయాల్లో ఆయన ఇలా చెప్పేవారు: “ఆహా! భగవంతుని వినికిడి అతి సూక్ష్మమైనది. ఆయన సమస్తం ఆలకించగలడు. నీ ప్రార్థనలోని విన్నపాలన్నీ ఆయన వినే ఉన్నాడు. నిస్సందేహంగా ఏదో ఒక రోజు నీకు దర్శనమిస్తాడు; కనీసం నువ్వు మరణించేటప్పుడైనా దర్శనం ఇస్తాడు.” కొందరితో ఆయన ఇలా చెప్పారు: “భగవంతుడు సాకారుడో లేక నిరాకారుడో మీరు నిర్ధారించుకోలేకపోతే, ఆయనను, ‘ఓ దేవా! నువ్వు సాకారుడవో నిరాకారుడవో నాకు తెలియదు; నువ్వు ఎటువంటి వాడివైనా సరే, దయచేసి నీ దర్శనం మాత్రం కలిగించు’ అని ప్రార్థించండి.” మరి కొందరితో ఆయన ఇలా చెప్పేవారు: “నిజంగానే భగవంతుణ్ణి చూడవచ్చు. మీరూ నేను కూర్చుని ఎలా మాట్లాడుకొంటున్నామో అట్లే ఆయనను చూడవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. ఇది నిజం, ముమ్మాటికీ నిజం.”
65. ఆధ్యాత్మిక భావ మగ్నులైనప్పటికీ; అన్నిటిపట్ల ఆయన నిశితదృష్టి
ఇరవై నాలుగు గంటలూ ఏదో ఒకానొక భావంలో ఎవరైనా మగ్నులైపోతే ఆ వ్యక్తి ఏ లౌకిక కర్తవ్యాన్నీ నిర్వర్తించలేనంతగా, ఏ చిన్న సాంసారిక విషయంపట్లా దృష్టిని నిలుప లేనంతగా ఆ భావంలో లీనమైపోతాడు. ఇది మన నిత్యానుభవ విషయం. ఆధ్యాత్మిక సాధనలలో లీనమైన వారి విషయంలోనేకాక, విజ్ఞానం, రాజకీయం ఇత్యాది రంగాలలో మగ్నులైన వారి జీవితాలలోను ఇట్టి ఉదాహరణలు అనేకం చూడవచ్చు. సామాన్యంగా అటువంటి వ్యక్తులు దేహ పారిశుద్ధ్యాన్నిగాని, నిత్య వినియోగ వస్తువులను యథాస్థానాలలో పెట్టివుంచడంగాని పాటించకపోవడం చూస్తాం. కాని ప్రగాఢ పారవశ్యంలో సదా నెలకొని ఉన్నప్పటికీ శ్రీరామకృష్ణుల జీవితంలో ఇటువంటి చిన్న విషయాలపట్ల సైతం, ఆయన శ్రద్ధ వహించడం మనం గమనించవచ్చు. ప్రగాఢ సమాధి మగ్నులై తమ దేహ స్ఫురణతోసహా సమస్త బాహ్యచైతన్యం కోల్పోయిన సందర్భాలలో మాత్రమే ఆయన అలా చేయలేకపోయేవారు. కాని సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ప్రతి విషయం పట్ల జాగ్రత్త వహించేవారు. ఇదేమంత తక్కువ ఆశ్చర్యపోవలసిన విషయంకాదు. అటువంటి మూడు ఉదాహరణలు ఇక్కడ పేర్కొంటాం.
66. మొదటి ఉదాహరణ
ఒకరోజు శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంనుండి రాంలాల్,* యోగానందులతో కలిసి బలరాం బసు ఇంటికి పోతున్నారు. అందరూ బండిలో ఎక్కి కూర్చున్నారు. బండి బయలుదేరి ముఖద్వారం వద్దకు రాగానే శ్రీరామకృష్ణులు, యోగానందుణ్ణి, “ఏమోయ్! వస్త్రం, తువ్వాలు తెస్తున్నావు కదా!” అని అడిగారు. అప్పుడు ఉదయం వేళ. అందుకు యోగానంద, “లేదండీ, తువ్వాలు మాత్రం తెచ్చాను. వస్త్రం తేవడం మరిచిపోయాను. వారు (బలరాం తదితరులు) మీకు కొత్తవస్త్రం సమర్పించడానికి తప్పక సంతోషిస్తారు” అని అన్నాడు. “నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ‘ఎటువంటి దౌర్భాగ్యుడు దాపురించాడు’ అని వారన్నారు. వారు ఇబ్బందిలో పడి, నిస్సహాయులౌతారు. బండిని ఆపి, వెళ్ళి దాన్ని తీసుకురా” అని గురుదేవులన్నారు.
ఆయన ఇలా కొనసాగించారు: “సజ్జనుడు, అదృష్టవంతుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంట కొరత ఏదీ ఉండదు, సమృద్ధి ఉంటుంది. కాని అదృష్టహీనుడైన దౌర్భాగ్యుడు వచ్చినప్పుడు మాత్రం అన్నీ నిండుకొంటాయి; ఇంట్లో ఏ రోజు ఏమీ ఉండదో ఆ రోజే వాళ్ళు వస్తారు. ఇక ఆ ఇంటి గృహస్థు ఆ అతిథిని సత్కరించడంలో పడే కష్టం ఇంతా అంతాకాదు.”
67. రెండవ ఉదాహరణ
శ్రీరామకృష్ణులు సజీవులై ఉన్న కాలంలో ప్రతాపచంద్ర హాజ్రా అనే వ్యక్తి దక్షిణేశ్వరంలో అనేకరోజులు గడిపేవాడు. మేమందరం ఆతణ్ణి ‘హాజ్రామహాశయా’ అని సంబోధించేవారం. శ్రీరామకృష్ణులు కలకత్తాలోని భక్తులను చూడ వెళ్ళేటప్పుడు కొన్ని సందర్భాలలో హాజ్రా కూడ ఆయన వెంట వెళ్ళేవాడు. అలాంటి ఒకానొక సందర్భంలో శ్రీరామకృష్ణులతోపాటు కలకత్తా నుండి తిరిగివస్తున్నప్పుడు హాజ్రా ఒక తువ్వాలు తీసుకురావడం మరచిపోయాడు. దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చాక గురుదేవులకు ఈ విషయం తెలియవచ్చింది. అప్పుడతడితో ఇలా అన్నారు: “భగవన్నామ స్మరణలో వంటిమీద బట్ట ఉందా అనే ధ్యాసే నాకు ఉండదు. అయినప్పటికీ నేను ఏనాడు నా తువ్వాలుగాని లేదా సంచీ గాని కలకత్తాలో మరచివచ్చింది లేదు. పిసరంత జపంతోనే నీకింత మతిమరుపా!”
68. మూడవ ఉదాహరణ : మాతృదేవికి ఉపదేశం
మాతృదేవికి, గురుదేవులు ఇలా బోధించారు: “బండిలోగాని పడవలో గాని ఎక్కేటప్పుడు అందరికంటే ముందుగా ఎక్కాలి. కాని దిగేటప్పుడు మాత్రం ఏ వస్తుమా విడిచిపెట్టలేదని నిర్ధారించుకొని మరీ దిగాలి.” చిన్న విషయాలలో సైతం గురుదేవులు అంత జాగ్రత్త వహించేవారు.
69. ఈ అంశంపై తుది మాట
ఎడతెగని ‘భావముఖం’ లో అలా నెలకొని ఉన్నప్పటికీ ఆవశ్యకాలైన విషయాల గురించి గురుదేవులు జాగ్రత్త వహించేవారు. ఒక వస్తువును దాని సముచిత స్థానంలో అట్టెపెట్టేవారు. నిత్యం తాము ఉపయోగించే బట్టలు, సుగంధ ద్రవ్యాల చిన్నసంచి మొదలైన వాటి గురించి స్వయంగా తామే జాగ్రత్త వహించే వారు. ఎక్కడకన్నా వెళుతున్నప్పుడన్నా లేదా తిరిగి వస్తున్నప్పుడన్నా అవసరమైన ఏ వస్తువునన్నా మరచిపోయారేమో లేక వదలిపెట్టి వచ్చారేమో విచారించేవారు. భక్తుల ప్రాపంచిక ఆధ్యాత్మిక వ్యవహారాలను సదా ఆరాతీయడం ద్వారా వారి పరిసరాలను వారి ఆధ్యాత్మిక సాధన అనుష్ఠానానికి ఎలా సానుకూలం చేయాలో ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు.
70. భావరాజ్యపు యథార్థ చక్రవర్తి శ్రీరామకృష్ణులు
71. దానిపై స్వామి వివేకానంద వ్యాఖ్యానం
శ్రీరామకృష్ణులు సమస్త భావాల సమష్టిరూపంగా మాకు ద్యోతకమయ్యే వారు. భావ రాజ్యంలో అటువంటి చక్రవర్తిని ఇంతకు మునుపు ఎన్నడూ చూసి ఎరుగం. ‘భావముఖంలో’ నిరంతరం నెలకొనివుంటూ, నిర్వికల్ప అద్వైత స్థితినుండి సవికల్పానికి చెందిన అన్ని రకాల స్థితులనూ తమలో పరిపూర్ణంగా అభివ్యక్తంచేసి, అన్ని వర్గాలకు చెందిన భక్తులకూ వారికి యుక్తమైన మార్గం, లక్ష్యం గురించి విశదపరిచి నైరాశ్యంలో అసాధారణ ఆశను, ప్రాపంచిక విషమ పరీక్షలు, కష్టాలలో అసదృశ శాంతిని, గొనివచ్చే అంధకారంలో అపూర్వజ్యోతిని రగిలించారు. మనందరికీ ఆయన ఎటువంటి సురక్షిత ఆశా స్వర్గమో, యావత్తు ఆధ్యాత్మిక రాజ్యంలో ఆయన ఎంతటి శక్తిని చలాయించారో తెల్పడం వర్ణనాతీతం. “ప్రాకృతిక జడశక్తులన్నిటినీ ఏదో రకంగా అదుపులోకి తెచ్చుకొని మహాద్భుతాన్ని చూపడం ఏమంత కష్టమైన పని కాబోదు. కాని ఈ పిచ్చి బ్రాహ్మణుడు (శ్రీరామకృష్ణులు) లోకుల మనస్సులను మట్టిముద్దల్లా చేసి, వాటిని అలవోకగా స్పర్శామాత్రాన కొంగ్రొత్త భావాలతో నింపి మూసపోసి, మళ్ళీ మళ్ళీ మూసపోయడం కంటే మహా ఆశ్చర్యకర విషయం నాకు మరొకటి కానరావడం లేదు” అంటారు స్వామి వివేకానంద.