1. షోడశీపూజతో శ్రీరామకృష్ణులలో సాధన ఆకాంక్ష సమసిపోవడం
షోడశీ పూజతో శ్రీరామకృష్ణుల సాధన వ్రతం పరిసమాప్తమైంది. పన్నెండు సుదీర్ఘ సంవత్సరాల కాలంపాటు ఆయనను అవిశ్రాంతంగా వివిధ ఆధ్యాత్మిక భావనలలో సాధనలు అనుష్ఠింప చేసిన భగవదనురాగం అనే పవిత్రాగ్ని నిరంతరం ప్రజ్వరిల్లుతూనే వచ్చింది. షోడశీపూజతో పూర్ణాహుతి నందు కొని ఆ పవిత్రాగ్ని చల్లబడింది. చల్లబడక మరేం చేయగలదు? ఇంతకు మునుపే ఆహుతి నివ్వక శ్రీరామకృష్ణుల వద్ద ఆయనదంటూ ఏదైనా మిగిలి ఉందా? లేదు. సంపద, మన్నన, పేరు ప్రతిష్ఠలు ఇత్యాది లౌకిక వాంఛలన్నిటినీ ఆయన చాలాకాలం క్రితమే ఆ సాధనాగ్నికి ఆహుతి నిచ్చేశారు. తమ హృదయం, ప్రాణం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం – వీటినన్నింటినీ ఒకదాని వెంట ఒకటిగా ఆ పవిత్రాగ్ని భయంకర జ్వాలల పరం చేసివేశారు. వివిధ సాధనా పథాలననుసరించి నానాభావాలలో జగజ్జననిని దర్శించాలనే ఏకైక ఆకాంక్ష మాత్రం ఆయనలో మిగిలి ఉంది. ఇప్పుడు మిగిలివున్న ఆ ఒక్క ఆకాంక్షను కూడ ఆ పవిత్రాగ్నికి ఆహుతి ఇచ్చేశారు. అలాటప్పుడు ఆ సాధనాగ్ని చల్లబడక ఏంచేస్తుంది?
2. అందుకు హేతువు
శ్రీరామకృష్ణుల మనోవ్యాకులతను ఎరిగిన జగజ్జనని మొట్టమొదట తన దర్శనభాగ్యం కలిగించి పిదప అసాధారణ గుణసంపన్నులైన సాధకశ్రేష్ఠులతో పరిచయం కావించింది. వారి సహాయంతో వివిధ శాస్త్రీయ మార్గాలను అనుసరింపచేసింది. వాటిలో కలిగిన అనుభవాలను తమ ప్రథమ దర్శనంతో పోల్చి చూసుకొనే అవకాశం ఆయనకు కలిగించింది. అలాంటప్పుడు ఇక ఆమెను కోరడానికి ఏం ఉన్నది? తంత్రశాస్త్రాలు నిర్దేశించిన అరవైనాలుగు సాధనలను ఒక్కొక్కటీ ఆయన అనుష్ఠించడం జరిగి పోయింది. భారతదేశంలో ప్రాచుర్యంలోవున్న వైష్ణవ సంప్రదాయంలోని శాంత దాస్యాది పంచభావాలను ఆధారంగా చేసుకొని భక్తిసాధనలన్నీ కూడ అనుష్ఠింపబడ్డాయి. సనాతన వైదిక మతానుసారమైన సన్న్యాసదీక్షను పరిగ్రహించి నిర్విశేష నిరాకార బ్రహ్మదర్శనం పొందారు. జగజ్జనని యొక్క లీలావిలాసంతో భారతేతర దేశాలకు ఉనికిపట్టై ఉన్న మహమ్మదీయ మత సాధన కూడ అనుష్ఠింపబడి తత్సాధనా ఫలం కూడ లభించింది. కాబట్టి ఇప్పుడు జగజ్జననిని దేనిని చూపమని గాని దేనిని వెల్లడిచేయమని గాని ఆయన కోరగలరు?
3. అద్భుత రీతిలో క్రీస్తుమత పరిపూర్ణత్వాన్ని శ్రీరామకృష్ణులు సంతరించుకోవడం
కాని షోడశీపూజ జరిగిన ఒక సంవత్సరం తరువాత జగజ్జననిని మరొక సాధనామార్గం ద్వారా దర్శించుకోవాలనే ఆకాంక్ష శ్రీరామకృష్ణులలో జనించింది. అప్పటికి శంభుచరణ్ మల్లిక్ అనే వ్యక్తి ఆయనకు పరిచయస్థుడయ్యాడు. అతడు శ్రీరామకృష్ణులకు బైబిల్ చదివి వినిపించేవాడు. ఈ విధంగా ఆయనకు ఏసుక్రీస్తు పావన జీవితాన్ని గురించి, క్రీస్తు స్థాపించిన మతం గురించి తెలియవచ్చింది. ఆ సంప్రదాయ మార్గంలో సాధనలు అనుష్ఠించాలనే కోర్కె ఆయన మనస్సులో మెదలింది. ఆ కోర్కె మనస్సులో మెదలీమెదలగానే జగజ్జనని దాన్ని అద్భుత రీతిలో నెరవేర్చి ఆయనను కృతార్థుణ్ణి చేసింది. ప్రత్యేకమైన ప్రయత్నం చేయవలసిన అవసరం ఆయనకు కలుగలేదు. ఆ సంఘటన యిలా జరిగింది: దక్షిణేశ్వర కాళికాలయానికి దక్షిణ దిక్కున యదుమల్లిక్ ఉద్యానగృహం ఉన్నది. శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు అక్కడకు వ్యాహ్యాళిగా వెళ్ళడం కద్దు. మొదటిసారి శ్రీరామకృష్ణులను దర్శించినప్పటినుండి యదుమల్లిక్, అతడి తల్లి ఆయన పట్ల అత్యంత భక్తిప్రపత్తులు కనబరచేవారు. కాబట్టి వారు ఉద్యానగృహంలో లేని సమయంలో కూడ శ్రీరామకృష్ణులు అక్కడకు వెళ్ళినప్పుడు ఉద్యానగృహ సిబ్బంది కచ్చేరీ తలుపులు తెరచి ఆయనను అక్కడ కూర్చుని కొంచెంసేపు విశ్రమించవలసిందిగా కోరేవారు. ఆ గది గోడలకు చక్కని చిత్తరువులు వ్రేలాడుతూ కనిపించేవి. వాటిలో తల్లి ఒడిలోవున్న బాలక్రీస్తు చిత్తరువు ఒకటి ఉంది. ఒక రోజు ఆ గదిలో కూర్చుని తదేకదృష్టితో ఆ చిత్తరువును తిలకిస్తూ ఏసుక్రీస్తు అద్భుత జీవిత చరిత్ర గురించి ఆయన చింతనచేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ చిత్రం సజీవమై దివ్యకాంతితో ప్రకాశించసాగిందని, ఆ తల్లి, తనయుడు బాలఏసు దేహాల నుండి కాంతిపుంజాలు బయల్వెడలి తమ హృదయంలో ప్రవేశించి తమ మానసిక భావనలనన్నిటినీ ఆమూలాగ్రం పరివర్తనం చెందించినవని ఆయన చెప్పేవారు. జన్మసిద్ధమైన హైందవ సంస్కారాలన్నీ అంతరంగంలో ఒక మారుమూల ఒదిగిపోగా, దాన్లో పూర్తిగా భిన్నమైన సంస్కారాలు ఉదయించడం చూసి ఆయన శతవిధాల తనను నియంత్రించుకోవడానికి ప్రయత్నించి జగజ్జననిని హృదయపూర్వకంగా, “అమ్మా! ఏం వింతమార్పులు నాలో తీసుకు వస్తున్నావు?” అని ప్రార్థించారు. కాని అన్నీ నిష్ఫలమయ్యాయి. ఆ సంస్కార తరంగాలు ఉద్ధృతమై ఆయన మనస్సులోని హైందవ సంస్కారాలనన్నిటినీ ముంచెత్తివేశాయి. ఫలితంగా హిందూ దేవతామూర్తుల పట్ల ఆయనకున్న భక్తి, ప్రేమలు అదృశ్యమైపోయాయి. వాటి స్థానే ఏసుక్రీస్తుపట్ల, ఆయన సంప్రదాయం పట్ల గొప్ప భక్తి విశ్వాసాలు శ్రీరామకృష్ణుల హృదయంలో పాదుకుపోయాయి. అవి క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ఏసుక్రీస్తుమూర్తి ఎదుట ఫాదిరీలు ధూపదీపాదులు అర్పించడం ఆయనకు దర్శింపచేశాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో కూడిన ప్రార్థనల రూపంలో వారి హృదయ ఆతురతను అవి వెల్లడించాయి. పిదప శ్రీరామకృష్ణులు కాళికాలయానికి తిరిగివచ్చి అంతరంగ సంఘటనల చింతనలో లీనమైపోయారు. కాళికాలయానికి వెళ్ళి జగజ్జననిని దర్శించుకోవాలనే విషయం ఆయన పూర్తిగా విస్మరించారు. ఈ రీతిలో మూడు రోజులపాటు ఆ భావతరంగాలు ఆయన మనస్సుపై ఆధిపత్యం చలాయించాయి. చివరకు మూడవ రోజు చీకటిపడ్డాక ఆయన పంచవటి గుండా నడచిపోతూ ఉన్నప్పుడు ఒక అద్భుత దృశ్యం గాంచారు. ఉజ్జ్వల గౌరవర్ణుడైన ఒక అద్భుత దివ్యమానవుడు తదేక దృష్టితో ఆయనను అవలోకిస్తూ ఆయన వైపుగా రాసాగాడు. ఆ వ్యక్తి విదేశీయుడని, విజాతీయుడని చూసిన క్షణంలోనే శ్రీరామకృష్ణులు గ్రహించారు. పొడవైన అతడి కళ్ళు అతడి ముఖారవిందానికి అద్భుత శోభను సంతరింపచేస్తున్నాయి. అతడి ముక్కు ఒకింత చప్పిడిదైనప్పటికీ ఆతడి అందానికి ఏమాత్రం కొరతగా లేదు. శ్రీరామకృష్ణులు ఆ సుందర ముఖారవిందంపై తొణికిసలాడే అద్భుత దివ్యభావ ప్రకటనం గాంచి ‘ఇతడెవరా?’ అని అబ్బురపోయారు. ఆ దివ్యమూర్తి దగ్గరకు రాగానే శ్రీరామకృష్ణుల హృదయాంతరాళం నుండి, “ఏసు ప్రభువు, దుఃఖయాతనల నుండి జీవులను ఉద్ధరించడానికి ఎవరు తన హృదయ రక్తాన్ని సమర్పించారో, ఈశ్వరునితో అభిన్నుడైన పరమయోగి, మహా ప్రేమికుడు ఇతడే ఆ క్రీస్తు, ఆ ఏసు ప్రభువు” అనే పలుకులు వెలువడ్డాయి. అంతర్వాణి అలా పలుకుతూ ఉన్న సమయంలో ఏసుక్రీస్తు, శ్రీరామకృష్ణులను ఆలింగనం చేసుకొని, ఆయన దేహంలో విలీనమైపోయాడు. వెంటనే శ్రీరామకృష్ణులు భావసమాధిమగ్నులై బాహ్య చైతన్యాన్ని కోల్పోయి కొంతసేపు సగుణ బ్రహ్మంతో తాదాత్మ్యం చెందారు. ఆ విధంగా ఏసుక్రీస్తు దర్శనం పొంది ఆయన (క్రీస్తు) అవతారమూర్తి అనే విషయంలో ఈషణ్మాత్ర సందేహరహితులయ్యారు.
4. శ్రీరామకృష్ణుల ఏసుక్రీస్తు దర్శనం ఋజువు కావడం
ఇది జరిగిన చాలాకాలం తరువాత మేం శ్రీరామకృష్ణులను సందర్శించే సమయంలో ఒకరోజు ఆయన ఏసుక్రీస్తు ప్రస్తావన తెచ్చి, “నాయనలారా! మీరు బైబిల్ చదివారు కదా! ఏసుక్రీస్తు భౌతిక లక్షణాలను గురించి దాన్లో ఏం వ్రాసి వుంది? ఆయన ఎలా కనిపించేవాడు?” అని అడిగారు. “మహాశయా! బైబిల్లో ఎక్కడా ఆయన భౌతిక వర్ణన మేం చూడలేదు. కాని యూదుడుగా జన్మించడం చేత ఆయన మేనిఛాయ ఉజ్జ్వల గౌరవర్ణంలో ఉండటం, విశాల నేత్రాలు, చిలుకవంటి కొక్కెపు ముక్కు ఉండటం తథ్యం” అని మేం జవాబు ఇచ్చాం. మేం అలా చెప్పగానే శ్రీరామకృష్ణులు, “కాని ఆయన ముక్కు ఒకింత చప్పిడిదై ఉండటం నేను చూశాను. ఆయనను అలా ఎందుకు చూశానో తెలియడం లేదు” అని అన్నారు. అప్పటికి ఏ మాటా ఆయనకు చెప్పకపోయినా మేం ఇలా ‘భావసమాధిలో ఆయన చూసిన స్వరూపం వాస్తవమూర్తితో ఎలా సరిపోలుతుంది? అందరి యూదుల మాదిరే ఆయన ముక్కు దీర్ఘంగా ఒకింత మెలిదిరిగి ఉండటం నిశ్చయం’ అని యోచించాం. కాని శ్రీరామకృష్ణుల మహాసమాధి తదనంతరం ఏసుక్రీస్తు శరీర నిర్మాణం గురించి మూడు విభిన్న వర్ణనలు ఉన్నాయని, వాటిలో ఆయన ముక్కు ఒకింత చప్పిడిగా ఉండేదనే వర్ణన ఒకటి ఉందని మాకు తెలియవచ్చింది.
5. బుద్ధుని గురించి శ్రీరామకృష్ణుల దృక్పథం
ప్రపంచంలో ప్రాబల్యం వహించిన ప్రధాన మతాలన్నిటిలో శ్రీరామకృష్ణులు పరిపూర్ణత్వాన్ని పొందడం చూసి బుద్ధభగవానుని గురించి ఆయనకు ఎలాంటి అభిప్రాయం ఉండేదనే ప్రశ్న పాఠకులలో తలెత్తవచ్చు. కనుక దానిని గురించి మాకు తెలిసిన విషయాలు ఇక్కడ పొందుపరచడం సముచితం. హైందవ జనసామాన్యం బుద్ధుని ఏ రీతిలో పరిగణించారో ఆయన కూడ అదే విధంగా పరిగణించారు. అంటే సదా ఆయన బుద్ధుణ్ణి భగవదవతారంగా విశ్వసించి హృదయ పూర్వకంగా పూజ్యభావంతో ఆరాధించారు. అంతేగాక పూరీక్షేత్రంలోని శ్రీ జగన్నాథ –సుభద్రా – బలరాముల రూపంలో బుద్ధదేవుని అవతారతత్త్వం ఈనాటికీ అభివ్యక్తం అవుతూవుందని ఆయన విశ్వసించారు. జగన్నాథుని అనుగ్రహంతో జాతిభేదా లేవీ పాటింపబడవనే విఖ్యాతి పూరీక్షేత్రానికి కలిగినదని విని శ్రీరామకృష్ణులకు ఆ క్షేత్రాన్ని సందర్శించాలనే తీవ్రేచ్ఛ జనించింది. కాని తాను అక్కడకు వెళితే తమ శరీర పతనం తథ్యమని ఎరిగి, జగజ్జనని సంకల్పం కూడ అందుకు విరుద్ధంగా ఉందని యోగదృష్టితో తెలుసుకొని ఆ సంకల్పం నుండి విరమించుకొన్నారు.* గంగాజలాన్ని ప్రత్యక్ష ‘బ్రహ్మవారిగా’ (అంటే జల రూపంలో వ్యక్తమౌతున్న బ్రహ్మం) శ్రీరామకృష్ణులు సతతం పరిగణించేవారనే విషయం ఇదివరకే తెలిపివున్నాం. అదే విధంగా జగన్నాథుని అన్నప్రసాదం స్వీకరించగానే మనస్సు నుండి విషయాసక్తి తొలగిపోయి పవిత్రమౌతుందనీ, ఆధ్యాత్మిక భావధారణకు ఉపయుక్తమౌతుందనీ శ్రీరామకృష్ణులు దృఢంగా విశ్వసించేవారు. విధిలేక ఒకింతసేపు విషయాసక్తుల మధ్య గడపవలసిన నిర్బంధం ఎదురైతే, పిదప వెంటనే ఆయన కాసిని గంగాజలాన్ని, ఒకింత జగన్నాథుని ‘ఆట్కే’ (అంటే వండిన అన్నాన్ని జగన్నాథునికి నివేదించిన తరువాత దానిని ఎండబెట్టి ప్రసాదంగా సమర్పించడాన్ని ‘ఆట్కే ప్రసాద్’ అంటారు) ప్రసాదాన్ని నోట్లో వేసుకొనేవారు. అంతేగాక అట్లే చేయమని శిష్యులకు, భక్తులకు చెప్పేవారు. అంతేగాక పైన చెప్పిన బుద్ధుడు భగవదవతారమనే శ్రీరామకృష్ణుల విశ్వాసానికి తోడుగా మరొక సంగతి కూడ మాకు తెలియవచ్చింది. శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో ముఖ్యుడు, గొప్ప కవి, నాటక ప్రయోక్త అయిన గిరీశ్ చంద్రఘోష్ బుద్ధుని జీవిత చరిత్రను నాటకంగా రచించి ఉన్నాడు. ఆ నాటక ప్రదర్శనను తిలకించిన శ్రీరామకృష్ణులు, “బుద్ధదేవుడు భగవదవతార మూర్తి అనే విషయం నిశ్చయం. ఆయన స్థాపించిన సంప్రదాయానికి, వైదిక జ్ఞానమార్గానికి మధ్య ఎటువంటి వ్యత్యాసమూ లేదు” అంటూ వ్యాఖ్యానించారు. యోగదృష్టితో ఆయన ఆ విషయం తెలుసుకొని అలా చెప్పారని మా దృఢనమ్మకం.
6. జైన, సిక్కు సంప్రదాయాల పట్ల శ్రీరామకృష్ణుల భక్తి విశ్వాసాలు
జైనమత ప్రవక్తలైన తీర్థంకరులను గురించీ, సిక్కుమత ప్రవక్తలైన నానక్ నుండి గురుగోవింద సింగ్ వరకు ఉన్న పదిమంది గురువులను గురించీ ఆయా మత సాధకుల నుండి అనేక విషయాలు శ్రీరామకృష్ణులు తమ జీవిత ఉత్తరార్ధంలో వినివున్నారు. వారి పట్ల విశేష ప్రేమ, విశ్వాసాలు ఆదరణలు ఆయనకు ఉండేవి. ఆయన గదిలో వివిధ దేవతామూర్తుల చిత్రాలతోపాటు ఏసుక్రీస్తు చిత్తరువు ఒకటి, తీర్థంకర మహావీరుని శిలా విగ్రహం ఒకటి ఒక ప్రక్కన ఉండేవి. ఆ చిత్రాలన్నిటితోబాటు ఈ రెండింటి ముందు కూడ ప్రతి ఉదయం, సాయంత్రం సాంబ్రాణి ధూపం ఆయన అర్పించేవారు. వారి పట్ల విశేష భక్తి ఆదరణలు కనబరచినప్పటికీ తీర్థంకరులలో ఎవరినినైనాగాని, పదిమంది గురువులలో ఎవరినైనాగాని ఆయన భగవదవతారంగా అభివర్ణించడం మేం వినలేదు. పదిమంది సిక్కు గురువులను గురించి ఇలా “వీరందరూ జనక ఋషి యొక్క అవతారాలు; రాజర్షియైన జనకుడు ముక్తి పొందుతున్న సమయంలో లోకశ్రేయస్సు ఒనరించాలనే ఆకాంక్ష ఆయనలో జనించిందనే విషయం సిక్కులు నాకు తెలిపారు. కాబట్టి ఆయన నానక్ నుండి గురుగోవిందసింగ్ వరకు పదిమార్లు అవతరించి, సిక్కు మతాన్ని స్థాపించి ఆ తరువాత నిర్విశేష బ్రహ్మంలో శాశ్వతంగా విలీనమైపోయాడు. సిక్కుల ఈ లోకోక్తి మిథ్య అని చెప్పడానికి ఏ కారణమూ కనిపించడం లేదు” అని చెప్పేవారు.
7. శ్రీరామకృష్ణులకు వారి అద్భుత అనుభూతులపై సమగ్ర అవగాహన
సకల మత సాధనలన్నిటిలోను సిద్ధి పొందిన పిదప శ్రీరామకృష్ణులు అసాధారణమైన కొన్ని అనుభూతులు చవిచూశారు. వాటిలో కొన్ని ఆయనకు సంబంధించినవి, కొన్ని సాధారణ ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినవి. వాటిలో కొన్నిటిని ఇదివరలోనే పాఠకులకు తెలిపి ఉన్నప్పటికీ, ఇక్కడ ప్రధానమైన వాటిని గురించి ప్రస్తావిస్తున్నాం. సాధనలన్నీ సమాప్తం అయిన తరువాత జగజ్జననిలో లీనమై భావముఖంలో నెలకొనివున్న కాలంలోనే ఆయనకు ఆ దివ్యానుభూతుల సమగ్ర అవగాహన కలిగి ఉంటుందని భావిస్తున్నాం. శ్రీరామకృష్ణులు యోగదృష్టి సహాయంతో అవగాహన చేసుకొన్నప్పటికీ, మేం వాటికి యుక్తియుక్తమైన వివరణను ఇవ్వడానికి ప్రయత్నిస్తాం.
8. శ్రీరామకృష్ణులకు తమను గురించిన అభిప్రాయం: i. తాము ఒక భగవదవతారం
మొట్టమొదట – తానొక భగవంతుని అవతారమని, ఆధికారిక పురుషుడని, తాము అనుష్ఠించిన ఆధ్యాత్మిక సాధనలన్నీ ఇతరుల నిమిత్తమే అని శ్రీరామకృష్ణుల దృఢవిశ్వాసం. ఇతరుల సాధన జీవితంతో తమ సాధన జీవితాన్ని పోల్చి చూసినప్పుడు ఆ రెండింటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉండటం తమ వివేచనాశక్తితో గమనించారు. సామాన్య సాధకుడు ఏదో ఒక్క భావమార్గాన్ని అవలంబించి, జీవితాంతం ఆ మార్గంలో సాధనలు అనుష్ఠించి, భగవద్దర్శనం పొంది పరిపూర్ణ తృప్తిని పొందుతాడు. కాని శ్రీరామకృష్ణుల విషయం వేరు; ప్రతి భావ సాధనలోను స్వల్ప వ్యవధిలోనే ఆయన సాఫల్యం చెందారు. కాని అన్ని మతాల, అన్ని భావాల ప్రకారం సాధనలు అనుష్ఠించి విజయులయ్యేటంత వరకు ఆయన సంతృప్తి చెందలేదు. కారణం లేని కార్యం ఉండదు. తమ విషయంలో ఎందుకు ఇలా జరిగిందనే కారణాన్ని కనుగొనబోయి, యోగారూఢులై తత్కారణాన్ని (అంటే తాము అవతారపురుషులని) పైన పేర్కొన్న రీతిలో ఆయన తెలుసుకొన్నారు. తాము శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు, సర్వశక్తిమంతుడైన ఈశ్వరుని విశేష అవతారం కావడంవల్లనే తమ విషయంలో అలా జరిగిందని ఆయన గ్రహించారు. అంతేకాక అసాధారణమైన తమ సాధనలు ఆధ్యాత్మిక రాజ్యానికే ఒక కొత్త వెలుగును తీసుకువచ్చాయని, ఆ సాధనలన్నీ సర్వజీవ కల్యాణం కోసం అనుష్ఠింపబడినవే కాని తమ వ్యక్తిగత అక్కరలను తీర్చుకోవడానికి కాదని కూడ ఆయన గ్రహించారు.
ii. తమకు ముక్తి లేదనే విషయం
జీవులందరిలా తమకు ముక్తి లేదని ఆయన ప్రగాఢ విశ్వాసం. సాధారణ తర్కంతో దీనిని అవగతం చేసుకోవడానికి ఎవరికైనా ఎంతో సమయం పట్టదు. ఎవరు ఈశ్వరుని నుండి అభిన్నుడో, ఈశ్వరాంశ సంభూతుడో, శుద్ధ బుద్ధ ముక్తస్వభావుడో, అక్కరలులేని పరిమితిలేని అలాంటి వ్యక్తి యొక్క ముక్తిని గురించిన ప్రస్తావన ఎందుకు? భగవంతుడు, ఎంత కాలం జీవులను ఉద్ధరింపపూనుకొంటాడో, అంతవరకు ప్రతీయుగంలోనూ ఆయన అవతరించి ఈ ఉద్ధరణ కార్యాన్ని నిర్వర్తించే ఆ వ్యక్తికి ముక్తి ఎలా అన్వయించబడుతుంది? శ్రీరామకృష్ణులు తరచూ చెప్పినట్లు, “జమీలో ఎక్కడ ఉపద్రవం చెలరేగినా కార్యనిర్వహణాధికారి అక్కడకు పరుగెత్తుకొని వెళ్ళక తప్పదు” అన్నది సత్యం. యోగదృష్టితో తమను గురించి పై విషయాలతోబాటు మరో విషయం కూడ ఆయన గ్రహించారు. వాయవ్య దిశను చూపుతూ, భవిష్యత్తులో మళ్ళీ తాము ఆ వైపునకు రావలసి వస్తుందని ఆయన మాతో పదే పదే చెప్పివున్నారు. ఆగమన సమయాన్ని గురించి కూడ గురుదేవులు తమకు తెలియచేశారని మాలో కొందరు భక్తులు* చెబుతున్నారు. వారితో ఆయన “రెండు వందల సంవత్సరాల పిదప నేను ఆ వైపునకు రావలసివుంది. అప్పుడు అనేకులు ముక్తి పొందుతారు. ఆ సమయంలో ముక్తి లభించని వారు అప్పటి నుంచి దీర్ఘకాలం వేచివుండవలసి ఉంటుంది” అని అన్నారట.
iii. తమ మరణాన్ని గురించిన ఎరుక
భావసమాధి స్థితిలో ఆయన తన మరణాన్ని గురించి అది తటస్థించడానికి చాలాకాలం క్రితమే తెలుసుకొన్నారు. ఒకరోజు దక్షిణేశ్వరంలో భావావిష్టులై ఉన్నప్పుడు మాతృదేవితో ఆయన ఇలా చెప్పారు: “ఎవరంటే వారి చేతుల నుండి నేను తినడం, కలకత్తాలో రాత్రుళ్ళు గడపడం, ఎవరో అంతకు మునుపే కాస్త తిన్న ఆహారం నేను ఆరగించడం – ఇవి జరగడం నువ్వు ఎప్పుడు చూస్తావో, అప్పుడు నా మరణం సమీపంలో ఉన్నదని గ్రహించు.” మరో సందర్భంలో మాతృదేవితో, భావావిష్టులై ఆయన, “అవసానదశలో పాయసాన్నం తప్ప మరేమీ తినను” అని చెప్పారు. ఇదెలా యథార్థంగా జరిగిందో మరోచోట* మేం తెలిపివున్నాం.
9. ఆధ్యాత్మికతకు చెందిన అనుభూతులు: i. అన్ని మతాలూ సత్యాలే – ఎన్ని మతాలో అన్ని మార్గాలు
ఇప్పుడు మేము రెండవ కోవకు చెందిన ఆయన అనుభూతులు, అంటే ఆధ్యాత్మికతకు చెందిన అనుభూతులను నమోదు చేస్తున్నాం. అన్ని మతాల సాధనలలోను సిద్ధిని సముపార్జించిన తదనంతరం ‘అన్ని మతాలూ సత్యాలే – ఎన్ని మతాలో అన్ని మార్గాలు’ అనే ప్రగాఢ విశ్వాసం శ్రీరామకృష్ణులకు కలిగింది. యోగశక్తితోను, సాధారణ వివేచనతోను శ్రీరామకృష్ణులు దాన్ని అవగతం చేసు కొన్నారు. ప్రధాన మతధర్మ సాధనలన్నిటినీ అనుష్ఠించి, ప్రతి సాధన చరమ ఫలాన్నీ ఆయన అనుభవైకవేద్యం చేసుకొన్నారు. ఈ సత్యాన్ని ప్రకటించి లోకంలో నెలకొనివున్న ధర్మగ్లానిని అరికట్టి, మతవైషమ్యాన్ని ఆపడమే ప్రస్తుత యుగంలో యుగావతారులైన శ్రీరామకృష్ణుల ఆవిర్భావ ఉద్దేశం అని గ్రహించడానికి ఎవరికీ ఆట్టేసేపు పట్టదు. ఇంతకు మునుపు ఏ అవతారపురుషుడూ సాధనలు అనుష్ఠించి, ‘మతాలన్నీ కూడ సత్యాలే, భగవత్ సాక్షాత్కారానికి మార్గాలే’ అనే సత్యాన్ని తమ తమ జీవితాలలో సంపూర్ణంగా అనుభూతం చేసుకొని, ఆ సత్యాన్ని ప్రకటించి ఉండలేదు. ఆధ్యాత్మిక మత సిద్ధాంతాల ఉదారత మేరకు అవతారపురుషుల ఘనతను నిర్ణయించినప్పుడు, ఆ సత్యాన్ని ప్రకటించినందుకు నిస్సంశయంగా అగ్రతాంబూలం శ్రీరామకృష్ణులకే అందించవలసి ఉంటుంది.
ii. ప్రతివ్యక్తీ తన మనఃస్థితుల మేరకు ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత తత్త్వాలను అంగీకరింపవలసిందే!
ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం – ఆధ్యాత్మిక పురోభివృద్ధి మేరకు ప్రతి వ్యక్తికీ ఇవి స్వతస్సిద్ధంగా వచ్చి ఉంటాయి. ‘కాబట్టి ఇవి పరస్పర విరుద్ధాలు కావు, కాని మనిషి ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నప్పుడు కలిగే పరిణామ వికాసంపై అవి ఆధారపడి ఉన్నవి’ అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. శాస్త్రాలను అవగాహన చేసుకోవడంలో శ్రీరామకృష్ణులు పొందిన ఈ అనుభూతులు ఏ విధంగా తోడ్పడతాయో కాస్త యోచిస్తే స్పష్టమౌతుంది. సత్యద్రష్టలైన ఋషులచే ఆవిష్కృతం కాబడి వేదాల, ఉపనిషత్తుల, ఇతర శాస్త్రాలలో లిపిబద్ధం చేయబడినా ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత మత సత్యాలు సరైన రీతిలో అర్థంచేసుకోబడక ఎంత గందరగోళం ఉత్పన్నం చేశాయో, అకారణంగా శాస్త్రోక్త ఆధ్యాత్మిక మార్గం ఎంత జటిలమైనదో మాటల్లో చెప్పతరంకాదు. ఆ మత శాఖల పరస్పర సముచిత సామరస్యాన్ని కనుగొనలేక, ఈ మతాలను అవలంబించే వారు శాస్త్రపాఠాలకు తప్పుడర్థాలు జోడించియైనా సరే తాము ప్రచారం చేస్తూన్న మత సంప్రదాయం ఒక్కటే శాస్త్రాల యొక్క కచ్చితమైన వ్యాఖ్యానమని ఋజువుపరచడానికి గట్టి ప్రయత్నమే చేశారు. వ్యాఖ్యాతల ఈ ప్రయత్న ఫలితంగా శాస్త్రవిచారం అనే పేరు వినగానే జనంలో భయం గూడుకట్టుకోసాగింది. ఈ భయం వారిలో శాస్త్రాలపట్ల విశ్వాసాన్ని సడలించింది; తద్ద్వారా భారతదేశపు ఆధ్యాత్మికతకు భ్రష్టత పట్టింది. అందుకనే యుగావతారులైన శ్రీరామకృష్ణులకు ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అనే ఈ మూడు మత సిద్ధాంతాలను స్వకీయ జీవితంలో విభిన్న దశలలో అనుభూతం చేసుకొని, వాటి అద్భుత సామరస్యాన్ని జనబాహుళ్యానికి ప్రచారం చేయవలసిన ఆవశ్యకత కలిగింది. శాస్త్రమర్మాన్ని సమగ్రరూపంలో అవగతం చేసుకోగోరితే వాటిని గురించి శ్రీరామకృష్ణుల ఈ నిశ్చితాభిప్రాయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం ఒక్కటే మార్గం:
“అద్వైత సాక్షాత్కారమే చరమస్థితి అని తెలుసుకో; అది మనోవాక్కులకు అతీతమైన అనుభూతి.”
“విశిష్టాద్వైతం వరకు ఉన్న స్థితులను మనోబుద్ధుల ద్వారా అవగాహన చేసుకోవచ్చు, వర్ణించవచ్చు. ఈ స్థితిలో నిత్యం, లీల ఈ రెండూ సత్యాలే. ఈ స్థితిలో చిన్మయ నామం, చిన్మయధామం, చిన్మయశ్యాం (అంటే భగవంతుడు, ఆయన నామం, ఆయన ధామం) అన్నీ చిన్మయస్వరూపాలే.
“విషయాసక్తి ప్రబలంగా ఉన్న సామాన్యులకు ద్వైతభావ మార్గమైన, భక్తిమార్గమే ఉపయుక్తం. నారదపంచరాత్రంలో నిర్దేశించినట్లు బిగ్గరగా భగవన్నామ సంకీర్తనాదులను గానం చేయడమే సముచితం.”
iii. సామాన్యులు కర్మయోగం ద్వారా ప్రగతి నొందుతారు
మనిషి ఆధ్యాత్మిక జీవితంలో కర్మలకు పరిమితిని నిర్ణయించి శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: “సత్వగుణోపేతులైన వ్యక్తుల కర్మ స్వతస్సిద్ధంగానే తొలగిపోతుంది; ప్రయత్నం మీద కూడ వారు కర్మ ఒనరించలేరు. ఉదాహరణకు ఒక ఇంటి కోడలిని తీసుకోండి. కోడలు గర్భందాల్చి ప్రసవకాలం సమీపించేకొద్దీ గృహకృత్యాలు తగ్గుతూవస్తాయి. ప్రసవానంతరం ఆమెకు మరే పనీ ఉండదు, బిడ్డ ఆలనాపాలనా తప్ప. కాని సత్వగుణరహితులైన ఇతరులందరూ భగవంతునిపై పూర్తిగా భారం మోపి, సంపన్నుని గృహంలో పనిచేసే దాసీలా* సంసారిక కర్తవ్యాలను అనాసక్తులై నిర్వర్తించాలి. ఈ విధమైన కర్తవ్య నిర్వహణకే కర్మయోగం అనిపేరు. భగవంతుని నామజపంతో ఆయనను ధ్యానిస్తూ పైన తెల్పిన రీతిలో అనాసక్తతతో ఇతర కర్తవ్యాలను నిర్వర్తించడం – ఇదే వారికి తరుణోపాయం.
iv. ఉదార దృక్పథ సంప్రదాయ సుస్థాపన
జగజ్జనని చేతుల్లో ఉపకరణప్రాయులైన తాము, తమ జీవితంలో ప్రకటితమైన ఉదారతత్వానికి ఉపయుక్తమైన ఒక నూతన సంప్రదాయాన్ని స్థాపింపవలసి ఉందని శ్రీరామకృష్ణులు గ్రహించారు. మథుర్బాబు జీవించి ఉన్నకాలం లోనే శ్రీరామకృష్ణులకు ఈ సంగతి అనుభవంలోకి వచ్చింది. ఆధ్యాత్మిక పురోగతికై భక్తులనేకులు తమ వద్దకు రానున్నారని జగజ్జనని తమకు తెలిపిందని ఆయన మథుర్కు చెప్పారు. తదనంతర కాలంలో ఇది వాస్తవమైందని చెప్పడం అనవసరం. కాశీపూర్ ఉద్యానగృహంలో ఒకసారి ఆయన తమ ఛాయాచిత్రాన్ని తిలకిస్తూ, “ఉత్కృష్ట యోగావస్థను కనబరచే ఛాయాచిత్రం ఇది. రాబోయే కాలంలో ప్రతి గృహంలోనూ ఈ మూర్తి* పూజింపబడుతుంది” అని మాకు చెప్పారు.
v. కడపటి జన్మలో ఉన్న వారంతా ఆయన వద్దకు వస్తారు
“ఎవరికి ఈ జన్మ కడపటిదో వారందరూ నా వద్దకు ఆధ్యాత్మిక ఉన్నతికై వస్తారు” అని తమ యోగశక్తితో ఆయన గ్రహించడమే కాక దానిని ప్రగాఢంగా విశ్వసించారు కూడ. దీనిని గురించిన మా అభిప్రాయాన్ని పాఠకులకు మరోచోట* తెలియచేసినందున ఇక్కడ తిరిగి చెప్పడం లేదు.
10. విభిన్న సమయాల్లో శ్రీరామకృష్ణులను దర్శించిన ముగ్గురు ప్రసిద్ధసాధకులు వెలిబుచ్చిన అభిప్రాయాలు
శాస్త్రపారంగతులైన ముగ్గురు ప్రసిద్ధ సాధక – పండితులు శ్రీరామకృష్ణుల సాధనాకాలంలోని మూడు ప్రధాన ఘట్టాలలో ఆయన వద్దకు వచ్చారు. వారు కళ్ళారా ఆయన ఆధ్యాత్మిక స్థితులను తిలకించారు. వాటిపై చర్చించే అవకాశం కూడ వారు పొందారు. శ్రీరామకృష్ణులు తాంత్రిక సాధనలో సిద్ధులైన పిదప పద్మలోచన పండితుడు ఆయనను దర్శించాడు. వైష్ణవ సాధనలలో శ్రీరామకృష్ణులు పరిపూర్ణత్వం సంతరించుకొన్న తదుపరి వైష్ణవచరణ్ ఆయనను కలుసుకొన్నాడు. శ్రీరామకృష్ణులు సాధనలన్నీ పూర్తిచేసి, తద్ద్వారా జనించిన దివ్యశోభతో వెలుగొందుతున్న సమయంలో ఆయనను దర్శించుకొనే ప్రత్యేక అవకాశం గౌరీపండితుడికి దక్కింది. “మీలో భగవదావిర్భావాన్ని, దివ్యశక్తి అభివ్యక్తీకరణను నేను చూస్తున్నాను” అని పద్మలోచన పండితుడు శ్రీరామకృష్ణులను చూడగానే అన్నాడు. శ్రీరామకృష్ణులు భావసమాధిమగ్నులై ఉండగా చూసి వైష్ణవచరణ్ ఆయనను భగవదవతారంగా కీర్తిస్తూ సంస్కృతంలో ఆశువుగా స్తుతించాడు. అదే విధంగా శ్రీరామకృష్ణులను చూడగానే గౌరీపండితుడు “నేను చదివిన శాస్త్రాలలో వర్ణింపబడిన ఉత్కృష్ట ఆధ్యాత్మిక స్థితులన్నీ మీలో ప్రత్యక్షంగా అభివ్యక్తమై కానవస్తున్నాయి. అంతేకాదు, ఆ శాస్త్రాలలో నమోదుకాని అత్యున్నత భావావస్థలు కూడ మీలో ప్రత్యక్షంగా అభివ్యక్తమై ఉండటం చూస్తున్నాను. మీ స్థితి వేదవేదాంతాలు, తదితర శాస్త్రాలలో పేర్కొన్న స్థితులనన్నిటినీ అతిక్రమించి చాలాదూరం పోయింది. మీరు మానవమాత్రులు కారు. అవతారాలన్నిటికీ ఏది మూలమో ఆ వస్తువు మీరే” అని పలికాడు. శ్రీరామకృష్ణుల అపూర్వ జీవిత చరిత్రను, ఇంతకు మునుపు పేర్కొన్న ఆయన అద్భుత అనుభూతులను చదివినప్పుడు ఆ ప్రసిద్ధ సాధక పండితులు శ్రీరామకృష్ణులను ముఖస్తుతికై అలా ప్రశంసించలేదన్న విషయం మనం స్పష్టంగా గ్రహించగలం. ఆ సాధక పండితులు దక్షిణేశ్వరానికి విచ్చేసిన సమయాలను ఈ క్రింది విధంగా రూఢిపరచవచ్చు:
11. పండితుల ఆగమన సమయాల నిరూపణ
ప్రప్రథమంగా దక్షిణేశ్వరంలో వసిస్తూ ఉన్నప్పుడు శారదామాత గౌరీ పండితుణ్ణి అక్కడ చూసింది. మళ్ళీ, మథుర్బాబు సజీవుడై ఉన్నప్పుడు గౌరీపండితుడు దక్షిణేశ్వరానికి వచ్చాడన్న విషయం శ్రీరామకృష్ణుల నుండి మేం విన్నాం. కాబట్టి గౌరీపండితుడు క్రీ.శ. 1871 వ సం ॥ లో ఎప్పుడో దక్షిణేశ్వరానికి వచ్చి క్రీ.శ. 1873 వ సంవత్సరం వరకు శ్రీరామకృష్ణులతో నివసించి ఉన్నట్లు తెలియవస్తోంది. తాము సముపార్జించిన శాస్త్రజ్ఞానాన్ని తమ స్వీయ జీవితాలలో ఆచరణయుతం చేయగోరిన సాధక – పండితులను చూడాలనే ఆకాంక్ష సదా శ్రీరామకృష్ణులకు ఉండేది. శ్రీయుత గౌరీకాంత భట్టాచార్య తర్కభూషణ్ (గౌరీపండితుని పూర్తిపేరు) పైన పేర్కొన్న సాధకుల కోవకు చెందినవాడు. కనుక అతణ్ణి చూడగోరి మథుర్బాబు ద్వారా ఆహ్వానం పంపి శ్రీరామకృష్ణులు అతణ్ణి దక్షిణేశ్వరానికి రావించారు. శ్రీరామకృష్ణుల జన్మస్థలానికి సమీపంలో ఉన్న ఇందేశ్ గ్రామ వాస్తవ్యుడు గౌరీపండితుడు. హృదయ్ తమ్ముడైన రాంరతన్, మథుర్బాబు ఆహ్వాన పత్రికను తీసుకొనివెళ్ళి గౌరీపండితుని దక్షిణేశ్వర కాళికాలయానికి తోడ్కొని వచ్చాడు. సాధనానుష్ఠాన ఫలితంగా గౌరీపండితుడు సముపార్జించిన అద్భుతశక్తి గురించి, దక్షిణేశ్వరం వచ్చాక శ్రీరామకృష్ణుల సాంగత్య ప్రభావంలో అతడిలో క్రమంగా పెల్లుబికిన తీవ్ర వైరాగ్యం ఫలితంగా అతడి సంసార పరిత్యాగ వైనం గురించి పాఠకులకు మరోచోట* వివరించాం.
‘అన్నమేరు’ ఉత్సవాన్ని మథుర్బాబు 1864 వ సంవత్సరంలో జరిపించాడని ‘రాణీ రాస్మణి జీవిత చరిత్ర’ అనే పుస్తకం రూఢిపరుస్తున్నది. ఆ సందర్భంలో పద్మలోచన్ పండితుని దక్షిణేశ్వరానికి ఆహ్వానించి, ఆతడికి కానుకలు చెల్లించాలనే తీవ్ర అభిలాష మథుర్కు కలిగిందని మేం శ్రీరామకృష్ణుల ముఖతా వినివున్నాం. ఇందుమూలంగా వేదాంతశాస్త్రపారంగతుడైన పద్మలోచన భట్టాచార్య తర్కాలంకార్ క్రీ.శ. 1864 వ సంవత్సరంలో శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చివుంటాడని తెలియవస్తోంది.
అట్లే ఉత్సవానంద గోస్వామి కుమారుడైన వైష్ణవచరణ్ దక్షిణేశ్వరానికి అరుదెంచిన సమయం సులువుగా నిర్ధారించవచ్చు. శ్రీరామకృష్ణుల అలౌకికత్వాన్ని గురించి వైష్ణవచరణ్ మొదట భైరవీ బ్రాహ్మణి యోగేశ్వరితోను, పిదప గౌరీ పండితునితోను చర్చించిన విషయం శ్రీరామకృష్ణుల నుండి మేం విన్నాం. బ్రాహ్మణిలా అతడు కూడ వైష్ణవశాస్త్రాలు పేర్కొంటున్న మహాభావ లక్షణాలన్నీ కూడ శ్రీరామకృష్ణుల మనశ్శరీరాలలో అభివ్యక్తమై ఉండటం చూసి విస్మయుడై, శ్రీరామకృష్ణులు శ్రీ గౌరాంగుని అవతారమనే బ్రాహ్మణి నిర్ణయంతో ఏకాభిప్రాయానికి వచ్చాడు. పైన ప్రస్తావించిన సంగతులు విన్న పిదప వైష్ణవచరణ్, శ్రీరామకృష్ణులు మధురభావ సాధనలో పరిపూర్ణులైన తదనంతరం, అంటే 1865 వ సం ॥ లో మొదటిసారి ఆయన వద్దకు వచ్చాడని గ్రహించవచ్చు. అప్పటినుండి అతడు 1873 వ సం ॥ వరకు తరచు దక్షిణేశ్వరానికి వస్తూపోతూ ఉండేవాడు.
12. తమ ఆంతరంగిక భక్తులను చూడగోరడం – బిగ్గరగా వారిని పిలవడం
పైన ప్రస్తావించిన అనుభూతులు కలిగిన తదనంతరం ఈశ్వరప్రేరణ ద్వారా శ్రీరామకృష్ణుల మనస్సులో ఒక కొత్త ప్రబలమైన ఆకాంక్ష తలెత్తింది. యోగారూఢ స్థితిలో గతంలో తాము చూసిన భక్తులను కలుసుకోవాలని, తమ ఆధ్యాత్మిక శక్తిని వారికి అందించాలని ఆయన ఎంతో ఆతురత చెందారు. దానిని గురించి ఆయన ఇలా చెప్పారు: “ఆ ఆతురతకు హద్దూ అదుపూ లేక పోయింది. పగటి వేళ యావత్తూ ఆ ఆతురతను మహాకష్టంతో ఏదోరకంగా హృదయంలో అదిమి ఉంచగలిగేవాణ్ణి. లౌకికుల పనికిమాలిన విషయతుల్యమైన ప్రసంగాలు వింటూ, అవి అసహనీయమైనప్పుడు వారంతా (రానున్న భక్తులు) వచ్చినప్పుడు భగవంతుని గురించి ప్రసంగించి ప్రాణం చల్లబరచుకొంటాను, నా ఆధ్యాత్మిక అనుభూతులు వారికి తెలిపి హృదయ భారాన్ని తగ్గించుకొంటాను అని ఏమేమో ఊహించుకొనేవాణ్ణి. వాళ్ళు వస్తారనే భావన నాలోను, నా చుట్టూ ప్రతి విషయంలోను అల్లుకుపోయి, ఎడతెరపి లేకుండా వారిని గురించే చింతన చేసే దశకు వచ్చేశాను. ఎవరికి ఏం చెప్పాలో, ఎవరికి ఏం ఇవ్వాలోనని సంసిద్ధుడనై ఉన్నాను. పగలు గడచిపోయి సాయంత్రం కాగానే నాలో ఉప్పొంగుతూవున్న ఆ ఆతురతను ఎంతటి సహనంతోనూ నియంత్రించు కోలేకపోయేవాడిని. మరోరోజు గడిచిపోయిందే, వాళ్ళు ఇంకా రాలేదే అనే ఆలోచన రేకెత్తేది. ఆలయంలో శంఖారావం మారుమ్రోగసాగినప్పుడు యజమానుల భవనం పైకెళ్ళి, మానసిక వ్యథ కారణంగా చెలరేగిన అశాంతితో, అశ్రుధారలు స్రవిస్తూండగా, బిగ్గరగా, ‘నా బిడ్డలారా ఎక్కడున్నారు? రండి, అందరూ రండి. మిమ్మల్ని చూడకుండా ఇక నేను ఉండలేను’ అని నేను పెట్టిన కేకలతో ఆలయ ఆవరణ ప్రతిధ్వనించేది. ఏ తల్లి అయినా తన బిడ్డలను చూడ డానికి ఇంతటి ఆతురతను అనుభవించిందో లేదో సందేహమే! ప్రేయసీ ప్రియులు లేదా మిత్రద్వయం పరస్పరం కలుసుకోవడానికి అంత తహతహ చెందివుంటారని నేనెన్నడూ విని ఉండలేదు! నేను అనుభవించిన ఆతురతతో ప్రాణం తల్లడిల్లిపోయేదనే చెప్పాలి. ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత భక్తులు ఒకరొకరుగా రాసాగారు” అని తమ అనుభూతి వాస్తవరూపం దాల్చడం గురించి తెలియజెప్పారు.
ఆ విధంగా శ్రీరామకృష్ణుల ఆతురతతో కూడిన పిలుపు తదుపరి భక్తులు దక్షిణేశ్వరానికి రావడానికి మునుపు కొన్ని ముఖ్యసంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు ప్రస్తుత విషయానికి ప్రత్యక్షంగా సంబంధించినవి కానందున, వాటిని ఈ గ్రంథం ప్రస్తుత విభాగపు అనుబంధంలో పొందుపరిచాం.