1. అక్షయ్ వృత్తాంతం
శ్రీరామకృష్ణుల పెద్ద అన్నగారైన రామ్‌కుమార్ కుమారుడు అక్షయ్ గురించి పాఠకులకు ఒకింత పరిచయం ఇంతకు మునుపే చేశాం. పూజ్య తోతాపురి దక్షిణేశ్వరానికి అరుదెంచిన స్వల్పకాలానికే, 1865 వ సం ॥ లో అక్షయ్ కూడా అక్కడకు చేరుకొన్నాడు. రాధాకాంత ఆలయంలో అతడు అర్చకుడిగా నియమితుడయ్యాడు. అప్పుడు అక్షయ్ వయస్సు దాదాపు పదిహేడు ఏళ్ళు. అతణ్ణి గురించి కొంత ఇక్కడ తెలియచేయడం అవసరం.
2. అక్షయ్ సౌందర్యం
పుట్టగానే తల్లి మరణించడంతో తల్లిలేని ఆ బిడ్డడు కుటుంబంలోని అందరికీ విశేష ప్రీతిపాత్రుడయ్యాడు. 1852 వ సం ॥ లో శ్రీరామకృష్ణులు మొదటిసారి కలకత్తాకు వచ్చినప్పుడు అక్షయ్ మూడు లేక నాలుగేళ్ళవాడు. శ్రీరామకృష్ణులు కామార్పుకూరులో ఉన్నప్పుడు అక్షయ్‌ను తన ఒడిలోకి తీసుకొని ప్రేమతో లాలించేవారు. కాని రామ్‌కుమార్ మాత్రం ఎన్నడూ తన బిడ్డను ఒడిలోకి తీసుకోలేదు. అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు రామ్‌కుమార్, “మమకారం పెంచుకోవడం వృథా. ఈ బిడ్డ ఎక్కువ కాలం జీవించడు” అని జవాబు చెప్పేవాడు. తరువాత తనను, ప్రపంచాన్నీ మరచిపోయి సాధనానుష్ఠానాలలో శ్రీరామకృష్ణులు లీనమైపోయారు. అప్పటికి అక్షయ్ బాల్యావస్థను దాటి అందమైన యువకుడిగా పెరిగి పెద్దవాడయ్యాడు.
అక్షయ్ అమిత అందగాడని శ్రీరామకృష్ణులు, ఆయన బంధువుల నుంచి విని ఉన్నాం. అతడి మేనిఛాయ ప్రకాశవంతంగాను, శరీర సౌష్టవం సుకుమారం గాను ఉండేదని వారు చెప్పారు. సజీవ శివుని రూపు సంతరించుకొన్నట్లుగా కనిపించేవాడట.
3. సాధన పట్ల అక్షయ్ భక్తిప్రపత్తి
చిన్ననాటి నుండి శ్రీరామచంద్రుని పట్ల అక్షయ్ మహాభక్తి కలిగి ఉన్నాడు. తమ కులదైవమైన శ్రీ రఘువీరుని సేవలో అనునిత్యం ఎంతో సమయం గడిపేవాడు. కాబట్టి దక్షిణేశ్వరంలోని రాధాకాంత ఆలయ పూజారిగా నియుక్తుడవడం అతడి మనస్సుకు ఎంతో నచ్చింది. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: “శ్రీరాధా గోవిందుల పూజ నిర్వర్తిస్తున్నప్పుడు అక్షయ్ ఎంత ప్రగాఢధ్యానంలో నిమగ్నుడై పోయేవాడంటే, ఆలయంలోకి ఆ సమయంలో వచ్చేపోయే జనసమూహం గురించి అతడికి ఎరుక ఉండేది కాదు. రెండు గంటలు గడిచిన తరువాత మాత్రమే అతడు బాహ్యస్పృహలోకి వచ్చేవాడు.” ఆలయంలో దైనందిన పూజ నిర్వర్తించి పంచవటికి వెళ్ళి, అక్కడ చాలాసేపు శివ పూజలో గడిపేవాడని హృదయ్ నుంచి మేం విని ఉన్నాం. పిదప స్వయంగా వంట చేసుకొని భోజనం చేసి, భాగవత పఠనంలో నిమగ్నుడయ్యేవాడు. అంతేగాక భగవత్ ప్రేమకై జనించిన వినూత్న ప్రేరణతో అతడు కంఠంలో, అంగిలిలో అప్పుడప్పుడు రక్తం వచ్చి, వాచేటంత అధికంగా న్యాసాన్ని, ప్రాణాయామాన్ని ఒనరించేవాడు. అంతటి భక్తి, భగవత్ప్రేమలు గల అక్షయ్ శ్రీరామకృష్ణులకు విశేష ప్రేమపాత్రుడు కావటంలో ఆశ్చర్యంలేదు.
4. అక్షయ్ వివాహం
కొన్నేళ్ళు గడిచాయి. అప్పుడు 1869 వ సంవత్సరం సగం గడిచిపోయింది. అక్షయ్ ఈ మనోప్రవృత్తి గురించి తెలుసుకొన్న అతడి పినతండ్రి రామేశ్వర్, ఈ మనోవైఖరిని అక్షయ్ నిరోధింప అక్షయ్‌కు వధువును వెదుకసాగాడు. కామార్పుకూర్కు మరీ దూరంలో లేని కూచ్కోల్ గ్రామంలో అనుకూలమైన వధువు లభించగానే అక్షయ్‌ను తోడ్కొని పోవడానికి రామేశ్వర్ దక్షిణేశ్వరానికి వచ్చాడు. అది చైత్రమాసం. వారి ప్రయాణానికి ఆ మాసం అశుభమని ఆక్షేపాలు లేవదీసినప్పటికీ రామేశ్వర్ పెడచెవినబెట్టాడు. పరాయి ఊళ్ళో తాత్కాలికంగా వసిస్తూ స్వగ్రామానికి బయలుదేరడంలో ఈ శాస్త్రనిషేధం వర్తించదని చెప్పి వారు ప్రయాణం కట్టారు. ఇంటికి తిరిగి వెళ్ళిన స్వల్పకాలంలోనే, 1869 వ సం ॥ వైశాఖ మాసంలో అక్షయ్ వివాహం జరిగింది.
5. వివాహానంతరం అక్షయ్ తీవ్రవ్యాధి గ్రస్తుడవడం
వివాహమైన కొన్ని నెలల తరువాత అత్తవారి ఇంట్లో ఉన్నప్పుడు అక్షయ్ తీవ్ర వ్యాధిగ్రస్థుడయ్యాడు. ఆ సమాచారం తెలియగానే రామేశ్వర్ అతణ్ణి కామార్పుకూర్కు తోడ్కొనివచ్చి చికిత్స చేయించసాగాడు. అక్షయ్ కాస్త కోలుకొన్నాడు. తరువాత అతణ్ణి దక్షిణేశ్వరానికి పంపటం జరిగింది. అక్కడ ఉల్లాసంగా ఉండడంతో ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు కనిపించింది. కాని హఠాత్తుగా ఒకరోజు అక్షయ్ జ్వరపీడితుడయ్యాడు. వైద్యులు అది సాధారణమైన జ్వరంగా భావించి త్వరలోనే తగ్గుతుందని చెప్పారు.
6. అక్షయ్ బ్రతకడని శ్రీరామకృష్ణులు చెప్పిన భవిష్యవాణి
వివాహానంతరం స్వల్పకాలంలోనే అక్షయ్ అత్తవారి ఇంట్లో వ్యాధిగ్రస్థు డయ్యాడని తెలుసుకొన్న శ్రీరామకృష్ణులు ఇలా అన్నారని హృదయ్ నుంచి మేం విన్నాం: “హృదూ! శకునాలు ఏమీ బాగోలేవు. రాక్షస గణానికి చెందిన వధువుతో అక్షయ్‌కు వివాహం జరిగింది. పిల్లవాడు బ్రతకడని భయపడుతున్నాను.” అక్షయ్‌కు తిరగబెట్టిన జ్వరం మూడు నాలుగు రోజులకు కూడా తగ్గుముఖం పట్టకపోవడంతో ఆయన హృదయ్‌ను పిలిచి ఇలా అన్నారు: “హృదూ! వైద్యులు రోగ నిర్ధారణ చేయలేకపోతున్నారు. అక్షయ్‌ది జటిలమైన, తీవ్రజ్వరమై ఉంటుంది. నీ తృప్తికోసం మంచి వైద్యుణ్ణి రప్పించి చికిత్స చేయించు. కాని పిల్లవాడు నిశ్చయంగా బ్రతకడనిపిస్తోంది.”
7. హృదయ్‌కు కలిగిన భయం
హృదయ్ ఇలాచెప్పాడు: “ఆయన అలా చెప్పగా విని, ఆయనను నిలదీసి, ‘మామా! అలా మాట్లాడవద్దు. నీ నోటి నుండి అలాంటి పలుకులు రానివ్వకు’ అన్నాను. అందుకు ఆయన, ‘కావాలని నే నలా అంటున్నానా? దైవీ ప్రభావంతో అప్రయత్నంగా నా నోరు అలా పలుకుతున్నది. జగజ్జనని నాకు ఏం తెలుపుతుందో, ఏం చెప్పమంటుందో అదే నేను పలుకుతాను. అక్షయ్ మరణించాలని నేను కోరుకొంటానా?” అని గురుదేవులు తెలియజెప్పినట్లు హృదయ్ మాతో అన్నాడు.
8. అక్షయ్ మరణం: శ్రీరామకృష్ణుల ప్రవర్తన
శ్రీరామకృష్ణుల ఈ మాటలతో హృదయ్ భయభీతుడైనాడు. మంచి వైద్యులను పిలిపించి అక్షయ్‌కు నానావిధాల చికిత్స చేయించసాగాడు. కాని రోగం విషమించసాగింది. దాదాపు ఒక నెల రోజులు అక్షయ్ బాధపడ్డాడు. అక్షయ్ అంతిమక్షణాలు సమీపించినవని గ్రహించి శ్రీరామకృష్ణులు అతడి శయ్య వద్దకు వెళ్ళి, “అక్షయ్! ‘గంగా, నారాయణా, ఓం రామా’ అని ఉచ్చరించు” అన్నారు. అక్షయ్ ఒకటి, రెండు, మూడు సార్లు ఆ మంత్రాన్ని ఉచ్చరించి తుదిశ్వాస విడిచాడు. అక్షయ్ మరణించగానే హృదయ్ ఎంత హృదయవిదారకంగా విలపించాడో శ్రీరామకృష్ణులు భావ పారవశ్యంలో అంతగా నవ్వారని హృదయ్ నుండి మేము విన్నాం.
9. అక్షయ్ మరణం పట్ల శ్రీరామకృష్ణుల మనోక్లేశం
ప్రియతముడూ, పుత్రసమానుడూ అయిన అక్షయ్ మరణాన్ని ఉన్నత భావభూమి నుండి వీక్షించి శ్రీరామకృష్ణులు ఆ విధంగా నవ్వినా ఆయన హృదయంలో ఆ సంఘటన ఆఘాతం కలిగించలేదని చెప్పటం సబబు కాదు. చాలాకాలం తరువాత ఈ సంఘటన గురించి ఆయన మాతో పలుమార్లు ప్రస్తావించారు. భావపారవశ్యంలో తాను మరణాన్ని ఒక అవస్థ నుండి మరొక అవస్థకు మారటంగా పరిగణించినప్పటికీ, బాహ్యచైతన్యంలోకి దిగివచ్చినప్పుడు అక్షయ్ మరణం తనలో తీవ్ర మనస్తాపాన్ని కల్గించిందని శ్రీరామకృష్ణులు చెప్పేవారు.* అక్షయ్ మరణానంతరం శ్రీరామకృష్ణులు మరెన్నడూ మథుర్బాబు భవంతిలో నివసించలేదు.అక్షయ్ ఆ భవంతిలోనే మరణించడం అందుకు కారణం.
10. పూజారిగా రామేశ్వర్ నియామకం
అక్షయ్ మరణానంతరం శ్రీరామకృష్ణుల చిన్న అన్నగారైన రామేశ్వర్ రాధాగోవింద ఆలయ పూజారిగా నియుక్తుడయ్యాడు. కామార్పుకూర్లోని కుటుంబ బాధ్యత అంతా అతడిదే కావటం చేత రామేశ్వర్ సదా సర్వవేళలా దక్షిణేశ్వరంలో ఉండలేక పోయేవాడు. అర్హుడూ, విశ్వసనీయుడూ అయిన వ్యక్తికి తన అర్చక విధులను అప్పగించి రామేశ్వర్ అప్పుడప్పుడు కామార్పుకూర్కు వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ గడిపేవాడు. రామచంద్ర ఛటోపాధ్యాయ, దీనానాథ్ అనే ఇద్దరు వ్యక్తులు రామేశ్వర్ స్థానే పూజాదికాలు నిర్వర్తించేవారని మేము వినివున్నాం.
11. మథుర్‌తో రాణాఘాట్‌లో శ్రీరామకృష్ణు – దరిద్రనారాయణ సేవ
ఈ కాలఘట్టంలోనే శ్రీరామకృష్ణులను తోడ్కొని మథుర్బాబు తన జమీకి, తన స్వీయ గురువు ఇంటికి వెళ్ళటం జరిగింది. అక్షయ్ మరణంతో శ్రీరామకృష్ణులకు కలిగిన మనస్తాపాన్ని ఉపశమింప మథుర్ బహుశా ఇలా చేసివుండవచ్చు. ఎందుకంటే: పరమభక్తుడైన మథుర్ ఒక వంక శ్రీరామకృష్ణులను సాక్షాత్తు భగవంతునిగా ఎంచి ఆధ్యాత్మిక విషయాలన్నిటిలో ఆయన సూచనలు పాటించేవాడు. మరొక వంక లౌకిక విషయాలన్నిటిలో ఆయనను అమాయక బాలునిగా ఎంచి అన్ని విధాల ఆయనను సంరక్షించే బాధ్యత తనదిగా భావించేవాడు. ఈ ప్రయాణంలో ఒక ఫలానా గ్రామంలోని స్త్రీ పురుషుల దయనీయ స్థితిని చూసి శ్రీరామకృష్ణులు ఎంతగానో చలించిపోయారు. వారినందరినీ ఆహ్వానించి తలకు రాసుకోవడానికి నూనె, ఒక కొత్త వస్త్రం, కడుపారా తిండి మథుర్ చేత ఇప్పించారు శ్రీరామకృష్ణులు. రాణాఘాట్‌కు సమీపంలోని కళాయ్ఘాట్ అనే చోట, చూర్ణీ కాలువలో మథుర్ శ్రీరామకృష్ణులతో నౌకావిహారం చేస్తూన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని హృదయ్ తెలిపాడు.
12. మథుర్ పూర్వీకుల గృహంలో శ్రీరామకృష్ణులు
‘సత్క్షీర’ అనే ప్రదేశానికి సమీపంలోని ‘సోనాబేడే’ అనే గ్రామంలో మథుర్ పూర్వీకుల గృహం ఉందని హృదయ్ మాకు చెప్పాడు. ఈ గ్రామానికి చుట్టు ప్రక్కల గ్రామాలు మథుర్ జమీకి చెందినవి. శ్రీరామకృష్ణులను తన జమీకి మథుర్ తోడ్కొని వెళ్ళాడు. మథుర్ కుల గురువు ఇల్లు ఈ ప్రాంతానికి అతి దగ్గరలోనే ఉంది. ఆ సమయంలో గురువు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకాల విషయంలో కొట్లాట జరుగుతోంది. ఆస్తి పంపకాల విషయంలో మథుర్ను మధ్యవర్తిగా వ్యవహరించమని వారు కోరారు. ఆ గ్రామం పేరు తాలామగ్రో. ఆ గ్రామానికి పోతున్నప్పుడు శ్రీరామకృష్ణులను, హృదయ్‌ను తన ఏనుగు అంబారీ మీద కూర్చోబెట్టి, మథుర్ పల్లకీలో కూర్చున్నాడు.* మథుర్ గురువు పుత్రులు ప్రేమాదరాలతో సేవించడం చూసి శ్రీరామకృష్ణులు ఆనందభరితులై కొన్ని వారాలు అక్కడే గడిపిన తర్వాత దక్షిణేశ్వరానికి తిరిగివచ్చారు.
13. ‘కలుటోలా’ హరిసభలో, కాల్నా, నవద్వీపాది ప్రాంతాలలో శ్రీరామకృష్ణులు
దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చిన అనతికాలంలోనే శ్రీరామకృష్ణులకు సంబంధించి కలకత్తాలోని ‘కలుటోలా’ అనే పేటలో ఒక విశేష సంఘటన జరిగింది. ఈ పేటలోని కాళీనాథ్ దత్తా లేదా కాళీనాథ్ధర్ అనే వ్యక్తి ఇంట్లో హరిసభ జరుగుతూ ఉండేది. (హరినామ సంకీర్తన జరుపుకొనే సమావేశాన్నే హరిసభ అంటారు) ఆ సభకు ఆహ్వానితులైన శ్రీరామకృష్ణులు అక్కడకు వెళ్ళి భావపారవశ్యంలో శ్రీచైతన్యుల ఆసనం (సంకీర్తన జరుగుతున్నప్పుడు శ్రీ చైతన్యుల గౌరవార్థం ప్రత్యేకంగా కేటాయించిన ఆసనం) మీద కూర్చున్నారు. ఈ సంఘటన గురించి విపులంగా మరొకచోట* వర్ణించాం. ఈ సంఘటన జరిగిన అనతికాలంలోనే శ్రీరామకృష్ణులకు నవద్వీప్ సందర్శించాలనే ఆకాంక్ష జనించింది. మథుర్బాబు ఆయనను కాల్నా, నవద్వీప్ మరికొన్ని ప్రదేశాలకు తోడ్కొని వెళ్ళాడు. కాల్నాలో శ్రీరామకృష్ణులు, భగవాన్‌దాస్ బాబాజీ అనే ఉత్తమ వైష్ణవ భక్తుని కలుసుకోవడం, నవద్వీపంలో ఆయన పొందిన అద్భుత దర్శనం గురించిన వివరాలు మరొకచోట పొందుపరిచాం.* ఈ పవిత్ర స్థలాలను శ్రీరామకృష్ణులు బహుశా 1870 లో సందర్శించి ఉంటారు. నవద్వీపంలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు ప్రగాఢ భగవదుద్దీపనం చెందలేదు. కాని నవద్వీపం సమీపంలోని గంగాతీరపు ఇసుక దిబ్బల మీదుగా వెళుతూ ఉన్నప్పుడు ప్రగాఢ భగవదుద్దీపనం పొందారు. మథుర్ మొదలైనవారు ఇందుకు కారణం ఏమిటని అడిగారు. చైతన్యుల లీలాస్థానమైన ప్రాచీన నవద్వీపం కాలాంతరంలో నదిలో మునిగిపోయింది. ఆ లీలాస్థానాలపై ఇసుక మేటవేసి ఈ దిబ్బలు రూపొందాయి. అందుచేతనే ఆ దిబ్బల మీదుగా పోతున్నప్పుడు తనకు ప్రగాఢ భగవదుద్దీపన కలిగిందని శ్రీరామకృష్ణులు వివరించారు.
14. మథుర్బాబు నిస్వార్థ భక్తి ప్రపత్తులు
పధ్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు నిరంతరాయంగా శ్రీరామకృష్ణులకు సేవలు ఒనరించాడు మథుర్బాబు. అతడి మనస్సు ఎంత స్వార్థ రహితమైనదో చాటిచెప్పే హృదయ్ తెలిపిన ఒక ఉదంతాన్ని ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాబోదు. ఒకసారి మథుర్బాబు శరీరపు కీలు ఒకదాన్లో కురుపు లేచి అతడు మంచాన పడ్డాడు. శ్రీరామకృష్ణులను చూడాలనే మథుర్బాబు ఆతురతను ఎరిగిన హృదయ్, శ్రీరామకృష్ణులకు ఆ విషయం తెలిపాడు. కాని శ్రీరామకృష్ణులు, “నేను వెళ్ళి ప్రయోజనం ఏమిటి? ఆ కురుపును నయం చేయగలనా ఏమిటి?” అన్నారు. శ్రీరామకృష్ణులు రాకపోవడం చూసి మథుర్ ఒకరి తరువాత మరొక దూతను ఆయన వద్దకు పంపి, తన మనోవాంఛితాన్ని తెలియపరిచాడు. ఈ ప్రార్థనలను మన్నించి శ్రీరామకృష్ణులు అతడి వద్దకు వెళ్ళారు. శ్రీరామకృష్ణులను చూడగానే మథుర్ ఆనందం అవధులు దాటింది. అతికష్టంతో లేచి దిండ్లను ఆనుకొని కూర్చుని, “బాబా! కాస్త మీ పాదధూళిని ప్రసాదించండి” అన్నాడుమథుర్.
అందుకు శ్రీరామకృష్ణులు, “నా పాదధూళితో నీకు ఏం ఒనగూరుతుంది? నీ కురుపును అది నయం చేస్తుందా?” అని అడిగారు.
ఆ మాటలకు మథుర్, “బాబా! నే నంత నీచుడనా? నా కురుపు నయం కావాలనా నీ పాదధూళిని కోరుతున్నాను? దాని కోసం వైద్యులు ఉన్నారు. భవ సాగరాన్ని దాటగోరే నీ శ్రీచరణ ధూళిని అర్థిస్తున్నాను” అని అన్నాడు.
అతడి మాటలు విన్న మరుక్షణమే శ్రీరామకృష్ణులు భావపారవశ్యం చెందారు. మథుర్ తన తలను శ్రీరామకృష్ణుల పాదాలమ్రోల వాల్చి ధన్యుడనైనట్లు భావించాడు. అతడి కళ్ళవెంట ఆనందాశ్రువులు ప్రవహించాయి. ఇది జరిగిన అనతికాలంలోనే మథుర్ స్వస్థుడయ్యాడు.
15. మథుర్, శ్రీరామకృష్ణుల పరస్పర ప్రేమ, ఆరాధన
ఆ కాలంలో శ్రీరామకృష్ణుల పట్ల మథుర్కు గల ప్రగాఢ భక్తి విశ్వాసాలను సూచించే అనేక విషయాలను శ్రీరామకృష్ణుల నుంచి, హృదయ్ నుంచి మేం విని ఉన్నాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇహపరాలలో గతి, ఆశ్రయం ఆయనే అనే దృఢ విశ్వాసం మథుర్కు కలిగింది. అలాగే మథుర్ పట్ల శ్రీరామకృష్ణుల అనుగ్రహం కూడా ఎల్లలెరుగనిదే. స్వతంత్ర చిత్తులైన శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు మథుర్ చర్యలు కొన్నిటిపట్ల విసుగు చెందినా వెంటనే వాటిని మరచిపోయి, అతడి ప్రార్థనలన్నిటినీ మన్నించేవారు. అతడి ఇహపర శ్రేయస్సు కోసం ప్రయత్నించేవారు. శ్రీరామకృష్ణులు, మథుర్ల నడుమ పెనగొనివున్న ప్రగాఢ అనురాగబంధాన్ని ఈ క్రింది వృత్తాంతం స్పష్టం చేస్తుంది.
16. ఒక వృత్తాంతం
భావపారవశ్యంలో ఒకసారి శ్రీరామకృష్ణులు, “ఓ మథుర్! నువ్వు జీవించి ఉన్నంత వరకు నేను ఇక్కడ (దక్షిణేశ్వరంలో)ఉంటాను” అన్నారు. ఆ మాటలు విని మథుర్ ఉలికిపడ్డాడు. ఎందుకంటే సాక్షాత్తూ జగజ్జనని శ్రీరామకృష్ణుల రూపంలో తననూ, తన కుటుంబాన్నీ సంరక్షిస్తోందని అతడికి బాగా తెలుసు. కాబట్టి ఆయన మాటలను బట్టి తన మరణానంతరం శ్రీరామకృష్ణులు తన కుటుంబాన్ని వదలివేసి పోతారని మథుర్ భావించాడు. పిదప అతి వినమ్రంగా శ్రీరామకృష్ణులతో, “అదేమిటి బాబా! నా భార్య, నా కుమారుడు ద్వారకానాథ్ కూడా నీ ఎడ అత్యంత భక్తిప్రపత్తులు ఉన్నవారే కదా!” అన్నాడు. మథుర్ చింతించడం చూసి శ్రీరామకృష్ణులు, “మంచిది. నీ భార్య, ద్వారి (ద్వారకానాథ్) జీవించి ఉన్నంతవరకు నేను ఇక్కడే ఉంటాను” అన్నారు. వాస్తవానికి అలాగే జరిగింది. జగదంబాదాసి, ద్వారకానాథ్‌లు మరణించిన అనతికాలంలోనే శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరాన్ని విడిచిపెట్టారు. జగదంబాదాసి 1881 వ సం ॥ లో మరణించింది.* ఆమె మరణానంతరం మూడేళ్ళ కన్నా ఒకింత ఎక్కువ కాలం మాత్రమే శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో ఉండడం తటస్థించింది.
17. మరో వృత్తాంతం
మరో సందర్భంలో మథుర్ శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు: “బాబా! నీ భక్తులు పలువురు వస్తారని చెప్పావే! కాని వాళ్ళు ఎక్కడ? ఎవరూ రాలేదే?” అని ప్రశ్నించాడు అందుకు శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “జగజ్జనని వారిని ఎప్పటికి తోడ్కొని వస్తుందో నాకు తెలియదు. కాని భక్తులు వస్తారని అమ్మే స్వయంగా వెల్లడించింది. నాకు ఆమె తెలియచేసినవన్నీ ఒక్కటొక్కటిగా నిజమయ్యాయి. ఇది ఎందుకు నిజం కాలేదో ఎవరికి ఎరుక?” ఇలా అంటూ శ్రీరామకృష్ణులు ఖీన్నులై తనకు కలిగిన ఆ దర్శనం భ్రాంతి ఏమో అని భావించారు. ఆయన అలా ఖీన్నులవడం చూసి మథుర్ బాధపడి ఆ ప్రస్తావన లేవనెత్తడం తన అవివేకంగా భావించాడు. బాలక స్వభావులైన శ్రీరామకృష్ణులను ఊరడించే ఉద్దేశ్యంతో మథుర్ ఇలా అన్నాడు: “బాబా! వాళ్ళు వస్తే వస్తారు, లేకుంటే లేదు. సర్వదా విధేయతతో మిమ్మల్ని సేవిస్తున్న మీ భక్తుణ్ణి నేను ఇక్కడున్నాను. అలాంటప్పుడు భక్తుల గురించిన నీ దర్శనం ఎలా అసత్యం అవుతుంది? మరి నే నొక్కడినే వందమంది భక్తుల పెట్టు. అందుకే జగజ్జనని అనేకమంది భక్తులు వస్తారని చెప్పింది” అని సర్దిచెప్పాడు. అందుకు శ్రీరామకృష్ణులు, “నువ్వు చెబుతున్నదే నిజం కావచ్చు; ఎవరికి తెలుసు?” అన్నారు. మథుర్ ఈ ప్రస్తావనను ఇక పొడిగించలేదు. మరో విషయం ప్రస్తావించి శ్రీరామకృష్ణుల మనస్సును మళ్ళించాడు.
18. నిస్వార్థ భక్తిపై శాస్త్రవాక్యం
సతతం శ్రీరామకృష్ణుల సాంగత్య లబ్ధిని పొందిన మథుర్బాబు మనోభావాలలో ఎంత గొప్ప మార్పులు ఉత్పన్నమైనవో ‘గురుభావం’ అనే విభాగంలో పాఠకులకు తెలియజేశాం. జీవన్ముక్తులను సేవించే భాగ్యం పొందిన వ్యక్తికి ఆ మహాపురుషులు ఒనరించిన పుణ్యకర్మల సత్ఫలాలన్నీ లభిస్తాయని శాస్త్రాలు చెబు తున్నాయి. అలాంటప్పుడు అవతార పురుషుల సేవకులకు నానా దైవీసంపత్తులు, సద్గుణాలు అబ్బడం విచిత్రమా!
19. మథుర్బాబు కాలధర్మం
కలిమిలేములు, సుఖదుఃఖాలు, సంయోగ వియోగాలు, జీవన మరణాలనే అవిరామ ద్వంద్వ తరంగయుత కాలప్రవాహం ఈ ప్రపంచాన్ని క్రమంగా 1871 వ సంవత్సరానికి తీసుకువచ్చింది. సంవత్సరాలు దొర్లేకొద్దీ గాఢతరమవుతున్న శ్రీరామకృష్ణ – మథుర్ల దివ్యసంబంధం పదిహేనవ సంవత్సరంలోకి అడుగిడింది. వైశాఖ మాసం గడిచింది, జ్యేష్ఠమూ వెళ్ళిపోయింది; ఆషాఢంలో సగం రోజులు దొర్లిపోయాయి. ఆ సమయంలో జ్వరంతో మథుర్ మంచంపట్టాడు. ఆ జ్వరం సత్వరం ఉద్ధృతమై, జటిలమై, ఎడతెగనిదిగా మారింది. వారం రోజుల్లో మథుర్ మాట పడిపోయింది. మథుర్బాబు భక్తివ్రతం పరిసమాప్తికి వచ్చిందనీ, జగజ్జనని తన భక్తుణ్ణి తన ఒడిలోకి తీసుకోనున్నదనీ శ్రీరామకృష్ణులకు ముందుగానే తెలుసు. అందుచేతనే మథుర్ను పలుకరించడానికి నిత్యం హృదయ్‌ను పంపుతున్నప్పటికీ ఆయన స్వయంగా మథుర్ను చూడటానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అంతిమ దినం రానేవచ్చింది. మథుర్ను కాళీఘాట్‌కు తరలించారు. ఆ రోజు శ్రీరామకృష్ణులు, హృదయ్‌ను కూడా పంపించలేదు. కాని మధ్యాహ్నం రెండు మూడు గంటలసేపు ప్రగాఢ భావపారవశ్య స్థితిలో మగ్నులైపోయారు. శరీరం దక్షిణేశ్వరంలో ఉండగా, శ్రీరామకృష్ణులు దివ్యదేహంతో జ్యోతిర్మయ మార్గంలో తన భక్తుడైన మథుర్ వద్దకు వెళ్ళి అతణ్ణి కృతార్థుణ్ణి చేసి, స్వయంగా మహాపుణ్యలోకాలు అతడికి ప్రాప్తింపజేశారు.
20. భావసమాధిలో శ్రీరామకృష్ణులు ఆ సంఘటన తిలకించడం
సాయంత్రం ఐదు గంటల తరువాత శ్రీరామకృష్ణులు భావపారవశ్య స్థితి నుండి దిగివచ్చారు. వెంటనే హృదయ్‌ను పిలిచి, “జగజ్జనని చెలికత్తెలు మథుర్ను ఆప్యాయంగా దివ్యరథంలో ఆసీనుని చేసి తీసుకువెళ్ళారు. అతడి ఆత్మ దేవీ లోకానికి వెళ్ళింది” అని చెప్పారు. ఈ మాటలు విని హృదయ్ మౌనంగా ఉండిపోయాడు. రాత్రి బాగా పొద్దుపోయాక దక్షిణేశ్వర ఆలయ అధికారులు తిరిగి వచ్చి మథుర్ సాయంత్రం ఐదు గంటలకు మరణించాడనే* సమాచారం హృదయ్‌కు చెప్పారు. ఈ రీతిలో దేవలోకాలకు వెళ్ళినా, ప్రాపంచిక భోగ వాసనలు ఇంకా సమసిపోనందున పరమభక్తుడైన మథురామోహన్* ఈ మర్త్యలోకానికి మళ్ళీ తిరిగి రావలసి ఉంటుందన్న సంగతిని మరో సందర్భంలో శ్రీరామకృష్ణులు చెప్పగా మేం విన్నాం. ఈ విషయం పాఠకులకు మరోచోట* విశదపరిచాం.