1. భైరవీ బ్రాహ్మణి, హృదయ్లతో శ్రీరామకృష్ణులు కామార్పుకూర్ సందర్శించడం
ఆరు నెలలపాటు దేహ బాధలు అనుభవించాక శ్రీరామకృష్ణులు ఆరోగ్యవంతులయ్యారు. అప్పటికి ఆయన మనస్సు ద్వైత – అద్వైత భూముల సంగమమైన భావముఖంలో వసించడం చాలావరకు అలవరచుకొంది. కానీ ఆయన శరీరం మునుపటిలా బలాన్ని, ఆరోగ్యాన్ని పుంజుకోలేదు. పైగా వర్షా కాలంలో గంగాజలం ఉప్పుతో నిండి ఉండడంతో, త్రాగటానికి అనువైన మంచినీరు లభించక ఆయన గ్రహణిరోగం తిరగబెట్టే అవకాశం కూడ ఉంది. కాబట్టి ఆయన తమ జన్మస్థలమైన కామార్పుకూర్కు పోయి కొన్ని నెలలు అక్కడ గడపడం సబబని నిర్ణయించారు. అది 1867 వ సంవత్సరం జ్యేష్ఠమాసం. శ్రద్ధాళువైన మథుర్ భార్య జగదంబా దాసి శ్రీరామకృష్ణుల కుటుంబం, శివుని కుటుంబంలా పేదకుటుంబమని బాగా ఎరుగును. కనుక ‘బాబా’ కు ఎటువంటి అసౌకర్యమూ కలుగరాదనే తలంపుతో ఆమె అవసరమైన వస్తుసామగ్రిని సేకరించి ఆయనతోపాటు వాటిని పంపే ఏర్పాట్లు* చేయసాగింది. పిదప శ్రీరామకృష్ణులు ఒక మంచి ముహూర్తంలో కామార్పుకూర్కు పయనమయ్యారు. భైరవీ బ్రాహ్మణి, హృదయ్ ఆయన వెంట వెళ్ళారు. వృద్ధురాలైన ఆయన తల్లి గంగాతీరంలోనే నివసించాలనే తన సంకల్పం మేరకు దక్షిణేశ్వరంలోనే మథుర్ సంరక్షణలో ఉండిపోయింది.
2. శ్రీరామకృష్ణుల పట్ల బంధుమిత్రుల ఆలోచనాసరళి
గత ఎనిమిది సంవత్సరాలుగా శ్రీరామకృష్ణులు కామార్పుకూర్కు రాలేదు. కాబట్టి బంధువులు ఆయనను చూడటానికి ఎంతో ఆతురత చెంది ఉన్నారని చెప్పడం అనవసరం. వారి ఆతురతకు కొన్ని ప్రత్యేక కారణాలున్నవని తెల్పటం కూడ అసంగతమే. అందుకు హేతువు – ఆయన, అక్కడ (దక్షిణేశ్వరంలో) స్త్రీ దుస్తులు ధరించి ‘హరి, హరి’ అంటూ కేకలు పెడుతున్నారని, సన్న్యాసి అయిపోయారని, ఒక్కొక్కప్పుడు ఎడతెగకుండా ‘అల్లా, అల్లా’ అంటూ జపిస్తూంటారని మొదలైన విచిత్ర వదంతులు వారి చెవుల బడడమే. కాని శ్రీరామకృష్ణులు ఆ పూర్వపు వ్యక్తిగానే వారికి అగపడడంతో ఆ వదంతులు ఎంత నిరాధారమైనవో వారు తెలుసుకొన్నారు. అదే అమాయకత్వం, ప్రేమతో కూడిన అదే ఉల్లాసం, కఠోరమైన అదే సత్యనిష్ఠ, అదే భక్తి ప్రగాఢత, హరి నామం వినడంతోనే ఉర్రూతలు వేసే పారవశ్యం – గతంలోని ఈ గుణాలన్నీ చెక్కుచెదరక పరిపూర్ణంగా ఆయనలో అట్లే ఉన్నాయి. కాని ఇప్పుడు వారికి కనబడే ఆయనలోని ఏకైక మార్పు – ఆయన మనశ్శరీరాలు వర్ణనాతీతమైన దేదీప్యమానమైన దివ్యప్రకాశంతో వెలుగొంది ఉండడమే. ఇందుచేత హఠాత్తుగా ఆయన ముందుకు రావడానికి లేక ఆయన ప్రస్తావించక మునుపే ఎటువంటి లౌకిక విషయాలనైనా కదపడానికి వారు ఎంతో సంకోచించారు. అంతేగాక శ్రీరామకృష్ణుల సమక్షంలో తాము ఉన్నప్పుడు తమ సాంసారిక చీకుచింతలన్నీ గాల్లో కలిసి మాయమైపోయినట్లుగా భావించారు. అందుకు మారుగా వారి హృదయాలలో నిర్మల, శాంత దివ్యానందం ప్రవహించడం వారు అనుభూతం చేసుకొన్నారు. ఆయన నుంచి దూరంగా ఉన్నప్పుడు, మళ్ళీ ఆయన వద్దకు వెళ్ళాలనే అవ్యక్తమైన ఒక ప్రగాఢ ఆకాంక్ష వారిలో జనించేది. ఆ విధంగా సుదీర్ఘ కాలానంతరం ఆయన తమ నడుమ ఉండడంతో ఆ పేద కుటుంబంలో ఎడతెగని ఆనందం వెల్లివిరిసింది. ఆ ఆనందాన్ని పరిపూర్ణం చేసే నిమిత్తం ఆ కుటుంబ స్త్రీల నిర్దేశం మేరకు ఒక వార్తాహరుడు శ్రీరామకృష్ణుల మామగారి గ్రామమైన జయరాంబాటికి, క్రొత్త కోడలిని తోడ్కొనిరావాల్సిందిగా పంపబడ్డాడు. శ్రీరామకృష్ణులకు ఈ విషయం తెలిసినప్పటికీ ఆయన తన సమ్మతినిగాని, అసమ్మతినిగాని వ్యక్తం చేయలేదు. అప్పటి వరకు ఆయన భార్య, వివాహానంతరం ఒక్కసారే ఆయనను కలుసుకొన్నది. కుటుంబ సంప్రదాయం ప్రకారం శ్రీరామకృష్ణులు జయరాంబాటికి వెళ్ళినప్పుడు ఆమెకు ఏడేళ్ళ ప్రాయంలో కలుసుకోవడం తటస్థించింది. అప్పటికి ఆమెకు వివాహం అంటే అవగాహన కాని అతి పిన్నవయస్సు. కనుక అప్పుడు జరిగిన సంఘటనల్లో ఒక్కటి మాత్రమే ఆమెకు జ్ఞాపకం ఉంది. శ్రీరామకృష్ణులతోపాటు హృదయ్కూడా వచ్చాడు. ఆమె ఇంట్లో మారుమూల ఎక్కడో నక్కి ఉన్నా కూడా హృదయ్ ఎక్కడ నుంచో సేకరించుకొని తెచ్చిన తామర పువ్వులతో, సిగ్గుతో ముడుచుకుపోయి ఉన్న ఆమె పాదపద్మాలను పూజించాడు. ఇది జరిగిన ఆరేళ్ళ తరువాత, అంటే ఆమె పదమూడవ ఏట మళ్ళీ ఆమెను కామార్పుకూర్కు తోడ్కొని వచ్చారు. ఈసారి ఆమె అక్కడ నెల రోజులు గడిపింది. కాని ఆ సమయంలో శ్రీరామకృష్ణులు, చంద్రమణీదేవి దక్షిణేశ్వరంలో ఉండడం వలన వారిని చూసే భాగ్యం ఆమెకు కలుగలేదు. ఇది జరిగిన దాదాపు ఆరు నెలల పిదప మళ్ళీ ఆమె కామార్పుకూర్కు వచ్చి ఒకటిన్నర నెలలు అక్కడ గడిపింది. కాని పై కారణంగానే ఆ ఇద్దరిలో ఎవరినీ ఆమె చూడలేకపోయింది.
3. కామార్పుకూర్కు మాతృదేవి ఆగమనం
అప్పటికి అక్కడ నుంచి ఆమె పుట్టింటికి తిరిగి వెళ్ళిన మూడు లేక నాలుగు నెలల తరువాత శ్రీరామకృష్ణులు కామార్పుకూర్కు వచ్చారనే వార్త, తనను అక్కడకు రమ్మన్న కబురు ఆమెకు అందాయి. అప్పటికి ఆమె పధ్నాలుగవ ఏట అడుగుపెట్టి ఆరు, ఏడు నెలలు గడిచి ఉంటాయి. కనుక నిజానికి వివాహా నంతరం తన భర్తను సందర్శించడం ఆమెకు ఇదే మొదటిసారి అని చెప్పవలసి ఉంటుంది.
4. చిన్ననాటి స్నేహితుల, బంధువుల పట్ల శ్రీరామకృష్ణులు ప్రవర్తించిన తీరుతెన్నులు
ఈ సందర్భంలో శ్రీరామకృష్ణులు కామార్పుకూర్లో ఆరు లేక ఏడు నెలల కాలం ఉన్నట్లు తెలియవస్తోంది. చిన్ననాటి నేస్తాలు, ఆయనను ఎరిగివున్న ఆ గ్రామస్థులైన స్త్రీ పురుషులందరూ గతంలోలా ఆయనతో కలసిమెలసిపోయి ఆయనను సంతోషపెట్ట ప్రయత్నించారు. సుదీర్ఘ కాలానంతరం వారిని చూడడం శ్రీరామకృష్ణులకు కూడా ఆనందమయమైంది. గొప్ప పండితులు, చింతనాపరులు తమ కఠోర పరిశ్రమా నంతరం తీరిక సమయంలో చిన్నపిల్లల అర్థంపర్థంలేని వినోదాలలో తామూ పాల్గొని ఆనందించడం కద్దు. గిరి గీసుకొన్న తమ సాంసారిక వ్యవహారాలలో తలమునకలవుతున్న కామార్పుకూర్లోని స్త్రీ పురుషులతో కలసి పోయిన శ్రీరామకృష్ణులు కూడ పై ఉదహరించిన వారిలా ఆనందించసాగారు. కాని ఐహిక జీవితం మూడునాళ్ళ ముచ్చట అని తెలుసుకొని, సంసార జీవితం గడుపుతూ కూడా క్రమంగా సంయమం అలవరచుకొని అన్ని విషయాలలోనూ భగవంతునిపై ఆధార పడడం వారు నేర్వాలని ఆయన భావించారు. ఆటపాటలు, వినోదాల ద్వారా మాకు సర్వదా నేర్పిన అదే విషయాలను బట్టి కామార్పుకూర్లో ఆయన అలా చేసి ఉంటారని మేం ఊహిస్తున్నాం.
5. కొందరు గ్రామస్థుల ఆధ్యాత్మిక పురోభివృద్ధి గురించి
ఈ చిన్న పల్లెలో జీవనం గడుపుతూ కొందరు ఊహించని రీతిలో ఆధ్యాత్మిక పురోగతి పొందడం చూసి శ్రీరామకృష్ణులు, భగవంతుని దుర్గ్రాహ్యమైన దివ్యమహిమకు అచ్చెరువొందారు. దీన్ని తేటపరచే ఒక సంఘటనను మాకు పలుమార్లు చెప్పారు: ఆ కాలఘట్టంలో ఒకరోజు ఆయన మధ్యాహ్న భోజనానంతరం తన గదిలో విశ్రమించి ఉన్నారు. ఆ సమయంలో ఇరుగుపొరుగు స్త్రీలు కొందరు ఆయనను చూడటానికి వచ్చారు. ఆయన ప్రక్కన కూర్చుని ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడసాగారు. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు భావపరవశులైనారు. చేప సముద్రంలో ఎలా క్రీడిస్తుందో అలా తాను సచ్చిదానంద సాగరంలో ఒక చేపలా తేలుతూ, మునుగుతూ అనేక రీతుల్లో క్రీడిస్తూ ఉన్నట్లుగా అనుభూతి పొందారు. ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన భావపారవశ్యులవడం కద్దు. కాబట్టి ఆ స్త్రీలు ఆ సంఘటనను పట్టించుకోక తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చడంతో అక్కడ పరిస్థితి గోలగోలగా తయారయింది. అప్పుడు వారిలో ఒకామె ఆయన భావపారవశ్యం తగ్గేవరకు గోల చేయవద్దని హెచ్చరించింది. ఆమె ఇలా అంది: “ఆయన ఇప్పుడు ఒక చేపలా సచ్చిదానంద సాగరంలో క్రీడిస్తున్నారు. మీరు కనుక గోల చేస్తే ఆయన ఆనందానికి అవరోధం ఏర్పడుతుంది.” ఆమె మాటలను వారిలో చాలామంది నమ్మకపోయినా, అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. సమాధి స్థితి నుంచి దిగివచ్చిన పిదప ఆయన అనుభవాన్ని గురించి ప్రశ్నించినప్పుడు శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “అవును. ఆమె చెప్పింది నిజమే. ఏం ఆశ్చర్యం! ఆమె కిది ఎలా తెలిసింది?” అని అన్నారు.
6. కామార్పుకూర్లో శ్రీరామకృష్ణుల భావనలు
శ్రీరామకృష్ణులకు కామార్పుకూర్ గ్రామంలోని స్త్రీ పురుషుల దైనందిన జీవితాలు ప్రస్తుతం చాలామేరకు క్రొత్తగా కనిపించాయని మనకు తెలియవస్తోంది. సుదీర్ఘ కాలానంతరం చాలా దూరప్రాంతం నుంచి స్వస్థలానికి తిరిగి వచ్చిన వ్యక్తికి తన గ్రామంలోని ప్రతివ్యక్తీ, ప్రతి వస్తుమా ఎలా క్రొత్తగా కనబడుతుందో, అలాగే ఆయనా భావించసాగారు. శ్రీరామకృష్ణులు తమ స్వస్థలం నుంచి కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే దూరంగా ఉన్నారు. కాని ఈ స్వల్పకాల వ్యవధిలోనే ఆయన హృదయంలో ఆధ్యాత్మిక సాధనలనే తుఫాను చెలరేగింది. ఆయనలో తీవ్ర పరిణామాన్ని కొనితెచ్చింది. ఆ సమయంలో ఆయన తమను మరచిపోయారు, జగత్తును విస్మరించారు, దేశకాల పరిధులను అధిగమించారు. కాని అక్కడ నుంచి దిగివస్తూ ఉన్నప్పుడు సకల జీవులలో భగవంతుడు వెలసి ఉన్నట్లూ, ప్రతివ్యక్తీ, ప్రతివస్తుమా తేజోకాంతి కాంచగలిగే జ్ఞానంతో రూపాంతరం పొందినట్టు భావించి, తిరిగివచ్చారు. మనస్సులో జనించే ఆలోచనా వృత్తుల పారంపర్యభేదం ద్వారానే మనం కాలాన్ని గురించిన, దాని వ్యవధి పరిమితి గురించిన ఎరుకను పొందుతామనే విషయం దర్శన ప్రసిద్ధం. కాబట్టే స్వల్పకాలంలో అనేక ఆలోచనాతరంగాలు ఉవ్వెత్తున లేచి లయం అయినప్పుడు మనకు ఆ స్వల్పకాలమే అతి దీర్ఘ కాలంగా కనబడుతుంది. ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో శ్రీరామకృష్ణుల అంతరంగంలో ఎటువంటి ఉత్తుంగ చింతనాతరంగాలు, భావాలు ఎగసినవో ఆలోచిస్తే ఆశ్చర్యపరవశులం కాక తప్పదు. కాబట్టి ఈ స్వల్పకాలం ఆయనకు ఒకయుగంగా కనపడడంలో వింత ఏమీలేదు.
7. స్వగ్రామం పట్ల శ్రీరామకృష్ణుల అభిమానం
కామార్పుకూర్ గ్రామస్థులందరితోనూ శ్రీరామకృష్ణులు ఎటువంటి అద్భుత అనురాగ బంధాన్ని ఏర్పరచుకొన్నారో యోచించినప్పుడు ఆశ్చర్యపోకతప్పదు. గ్రామ జమీందారులైన లాహాల నుంచి, బ్రాహ్మణులు, కమ్మరులు, వడ్రంగులు, స్వర్ణకారులు తదితరుల కుటుంబాలలోని స్త్రీ పురుషులందరూ ఆయన పట్ల శ్రద్ధాపూర్వకమైన ప్రేమబంధంతో ఉండేవారు. స్త్రీ పురుషులనేకులు ఆయన పట్ల కనబరచిన భక్త్యనురాగాలను గురించి శ్రీరామకృష్ణులు అనేక సందర్భాలలో సంతోషాతి శయంతో ప్రస్తావించినప్పుడు మేం ముగ్ధులమే అయ్యాం. వారిలో ముఖ్యులు: సరళ హృదయురాలు, భక్తురాలు, ధర్మదాస్లాహా వితంతు కుమార్తె అయిన ప్రసన్నమయి; శ్రీరామకృష్ణుల నేస్తమైన ధర్మదాస్ లాహా కుమారుడు గయావిష్ణు లాహా; యథార్థ విశ్వాసంగల శ్రీనివాస్ శంఖారి (అంటే గాజుల వాడు); పాయిన్ కుటుంబంలోని భక్తురాండ్రైన స్త్రీలు; శ్రీరామకృష్ణుల భిక్షామాత అయిన ధని. శ్రీరామకృష్ణులు కామార్పుకూర్లో బసచేసినన్ని రోజులూ దాదాపు వీరందరూ ఆయన వద్దే ఉండిపోయారు. ఇంటి పనుల మూలంగానో లేక దైనందిన కార్య కలాపాల కారణంగానో అలా ఆయన వద్దనే ఉండలేనివారు ఉదయాన్నో, మధ్యాహ్నమో, సాయంత్రమో తమకు తీరిక చిక్కినప్పుడల్లా ఆయన వద్దకు వచ్చేవారు. అలా వచ్చేటప్పుడు స్త్రీలు వివిధ రకాల మిఠాయిలు, పిండివంటలు తమతో తీసుకువచ్చేవారు. వాటిని శ్రీరామకృష్ణులు తింటూ ఉన్నప్పుడు వారు పరమానందం చెందేవారు. సరళ హృదయులైన ఆ గ్రామీణులు తనను పరివేష్టించి ఉండగా శ్రీరామకృష్ణులు తమ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతూ ఉన్నప్పటికీ సర్వదా ఆయన దివ్యపారవశ్య స్థితిలో ఎలా నెలకొనిఉన్నారనే విషయాన్ని సూచనప్రాయంగా మరోచోట* తెలిపి ఉన్నాం. అందుచేత ఇక్కడ మళ్ళీ చెప్పనవసరం లేదు.
8. భార్యపట్ల శ్రీరామకృష్ణుల కర్తవ్య నిర్వహణ
ఈసారి కామార్పుకూర్కు వచ్చిన సందర్భంలో శ్రీరామకృష్ణులు మరొక గొప్ప కర్తవ్య నిర్వహణలో నిమగ్నులయ్యారు. మొదట్లో తన భార్య కామార్పుకూర్కు రావటం పట్ల ఉదాసీనంగా ఉండిపోయారు. కాని ప్రస్తుతం ఆమె శ్రేయస్సుకై ఆమెకు విద్యాబుద్ధులు గరప సంకల్పించారు. శ్రీరామకృష్ణులు వివాహితులని ఎరిగి, ఆయనకు సన్న్యాసదీక్ష ఒసగిన గురువు తోతాపురి ఒకప్పుడు ఆయనతో ఇలా అనడం జరిగింది: “(వివాహం) అయితే ఏమిటి? భార్య తనతో ఉన్నప్పుడు కూడా ఏ వ్యక్తి త్యాగం, వైరాగ్యం, వివేకం, విజ్ఞానం ఏ రీతిలోనూ చెక్కుచెదరక ఉంటాయో ఆ వ్యక్తే నిజంగా బ్రహ్మంలో ప్రతిష్ఠితుడైనవాడు. స్త్రీ పురుషులనిద్దరినీ సదా భేదబుద్ధి లేకుండా ఆత్మదృష్టితో గాంచుతూ, తదనురూపంగా వ్యవహరిస్తాడో అతడే బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి. స్త్రీ పురుషుల భేదభావం ఉన్న వ్యక్తులు సాధకులు కావచ్చునేమో కాని వారు బ్రహ్మజ్ఞానానికి ఇంకా సుదూరంలో ఉన్నవారి కిందే లెక్క.” తోతాపురి పై వ్యాఖ్యానం శ్రీరామకృష్ణులకు గుర్తుకువచ్చింది. దీర్ఘకాలిక కఠోర సాధనా ప్రాప్తమైన ఆత్మజ్ఞానాన్ని పరీక్షించడంలోను, తన భార్య ఆధ్యాత్మిక పురోభివృద్ధికై ఆయన ఉన్ముఖులైనారు.
9. ఈ విషయంలో శ్రీరామకృష్ణులు ఎంతవరకు సాఫల్యత సాధించారు
కర్తవ్యం కింద నిశ్చయించుకొన్న దేనినీ ఉపేక్షించడంగాని అర్ధాంతరంగా విడిచి పెట్టడంగాని చేసేవారుకారు శ్రీరామకృష్ణులు. ప్రస్తుత విషయంలోనూ అట్లే జరిగింది. ఇహపర విషయాలన్నిటిలోనూ పూర్తిగా తనపైనే ఆధారపడి ఉన్న పిన్న వయస్సు భార్యకు శిక్షణ గరపడంలో అర్ధాంతరంగా ఆయన ఆగిపోలేదు. దేవతలను, గురుజనులను, అతిథి అభ్యాగతులను సేవించడం, గృహ కృత్యాలు చక్కదిద్దుకోవడం, ధనాన్ని సద్వినియోగపరచడం, వీటి అన్నిటికంటె ప్రధానంగా సర్వస్వాన్ని భగవంతునికి సమర్పించడం, దేశకాల పరిస్థితులనను సరించి వ్యవహరించడంలో ఎలా సమర్థురాలు కావాలో నేర్పాలన్న తలంపుతోనే ఉన్నారాయన. అఖండ బ్రహ్మచర్య సంపన్నమైన స్వీయ జీవితాదర్శాన్ని ఆమె కళ్ళ ఎదుట ఉంచి పైన చెప్పినట్లు ఆమెకు ఇచ్చిన శిక్షణ ఎలా ఫలించిందో – ఆ విషయాన్ని మేము మరొకచోట* సూచించాం. కనుక ఇక్కడ క్లుప్తంగా చెప్పవలసినది ఏమంటే: కామగంధ రహితమైన శ్రీరామకృష్ణుల వినిర్మల ప్రేమనుపొంది పరమానందభరితురాలై సాక్షాత్తు ఇష్టదైవంగా యావజ్జీవితం ఆయనను పూజిస్తూ, ప్రతీ విషయంలోనూ ఆయన అడుగు జాడలను అనుసరించి స్వీయజీవితాన్ని ఆయన ఉపదేశానుసారం శారదాదేవి మలచుకోగలిగారు.
10. భైరవీ బ్రాహ్మణి వెరపు
శ్రీరామకృష్ణులు, భార్యపట్ల తమ కర్తవ్యాన్ని నిర్వర్తించ ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆయనను అనేక సందర్భాలలో భైరవీ బ్రాహ్మణి అవగతం చేసుకోలేకపోయింది. తోతాపురితో పరిచయం కలిగాక సన్న్యాసం స్వీకరించాలన్న శ్రీరామకృష్ణుల సంకల్పాన్ని వమ్ము చేయ ఆమె ప్రయత్నించింది.* సన్న్యాసం స్వీకరించి అద్వైత తత్త్వసాధనలో సర్వోత్కృష్టులైతే ఆయన భగవద్భక్తి కూకటివ్రేళ్ళతో సహా పెకలించుకుపోతుందని ఆమె భయపడింది. ప్రస్తుతం కూడా అటువంటి భయంతో కూడిన అభిప్రాయానికే ఆమె వచ్చింది. భార్యతో సన్నిహితంగా మెలిగితే ఆయన బ్రహ్మచర్యానికి హాని వాటిల్లవచ్చునని ఆమె తలచిందని భావించవచ్చు. కాని తోతాపురి వ్యవహారంలో మాదిరిగానే ఇప్పుడు కూడా శ్రీరామకృష్ణులు ఆమె ఉద్దేశాలకు అనుగుణంగా వర్తించలేదు. శ్రీరామకృష్ణుల ఈ నడవడిక ఆమె మనస్సును గాయపరచి ఉండవచ్చు. ఇది ఆత్మాభిమానం క్రింద ఎదిగి గర్వం, అహంకారాల తీవ్రరూపు దాల్చి శ్రీరామకృష్ణుల పట్ల విశ్వాసం కోల్పోయే టట్లు పరిణమించింది. తన భావనలను బాహాటంగా ఆమె వెల్లడించిన వైనం మేం హృదయ్ నుండి విన్నాం. ఉదాహరణకు: ఆమె ముందు ఎవరైనా ఆధ్యాత్మికతకు సంబంధించిన ఏదైనా ప్రశ్నను లేవనెత్తి, దాన్ని శ్రీరామకృష్ణులను అడిగి ఆయన అభిప్రాయం తెలుసు కొంటానని అనడమే తరువాయి, ఆమె భగ్గున మండిపడి, “అతడేం చెప్పగలడు? అతడి కళ్ళు తెరిపించింది నేనే కదా!” అనేదట. లేదా అల్పమైన కారణంగానో లేక ఏ కారణం లేకుండానే ఆయన కుటుంబంలోని స్త్రీలను చీవాట్లు పెట్టేది. కాని శ్రీరామకృష్ణులు మాత్రం ఆమె దుర్భాషణలను, కోపోద్రిక్త ధోరణిని ప్రశాంతచిత్తులై చూస్తూ ఉండడమే కాక ఆమె పట్ల మునుపు ఉన్న భక్తిగౌరవాలను కించిత్తయినా సడలించుకోలేదు. ఆయన ఆదేశానుసారం మాతృదేవి కూడా తన సొంత అత్తగారికి చూపే గౌరవాన్ని భైరవీ బ్రాహ్మణి పట్ల కనబరుస్తూ సదా భక్తిప్రపత్తులతో ఆమె సేవలో నిమగ్నురాలైంది. బ్రాహ్మణి పలుకులకు, చర్యలకు అమాయక బాలికలా ఆమె ఎలాంటి అసమ్మతినీ వ్యక్తం చేయలేదు.
11. గర్వాహంకారాల కారణాన బ్రాహ్మణి వివేచనాశక్తిని కోల్పోవడం
గర్వాహంకారాలు పెచ్చుపెరిగినప్పుడు యోచనాపరుడైన వివేకిని కూడా మబ్బు క్రమ్ముకొంటుంది. ఆ విపరీత ప్రవర్తన కారణంగా అచిరకాలంలోనే ప్రతీ మలుపు వద్దా తాకిడులు, దెబ్బలు తప్పవు. అలాంటి అనుభవాల ఫలితంగా పదేపదే ఏర్పడ్డ నిస్పృహ, అతడిలో ఇంకా వివేకం మిగిలి ఉంటే, స్వకీయ దోషాన్ని చక్కదిద్ది మళ్ళీ అతణ్ణి సరైన మార్గంలోకి మళ్ళిస్తుంది. విజ్ఞురాలైన బ్రాహ్మణి విషయంలోనూ అలాగే జరిగింది. మితిమించిన అహంకార ప్రాబల్యంతో దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించక ఒకనాడు ఆమె అమిత ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించింది. ఆ సంఘటన ఇలా జరిగింది.
12. ఆ పరిస్థితిని కల్పించిన సంఘటన
శ్రీనివాస్ శంఖారిని గురించి ఇదివరకే ప్రస్తావించాం. అగ్రకులంలో జన్మించనప్పటికీ అతడు భగవద్భక్తి విషయంలో మాత్రం ఎందరో బ్రాహ్మణుల కంటే ఉన్నతుడు. ఈ కాలఘట్టంలో ఒక రోజు అతడు శ్రీ రఘువీరుని ప్రసాదం స్వీకరించే ఉద్దేశంతో శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాడు. తమ మధ్యన శ్రీనివాస్ ఉండడం శ్రీరామకృష్ణులకు, ఆయన కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషదాయకమే అని చెప్ప పనిలేదు. శ్రీనివాస్ భక్తివిశ్వాసాలను గాంచి నిష్ఠాచార బ్రాహ్మణి కూడా సంతసించింది. మధ్యాహ్నం వరకు వారంతా భక్తిపరమైన వివిధ విషయాలను గురించి ముచ్చటించారు. ఈలోపు రఘువీరుని పూజానైవేద్యాది సేవలన్నీ పూర్తయ్యాయి. శ్రీనివాస్ కూడా ప్రసాదం స్వీకరింప కూర్చున్నాడు. ప్రసాదం ఆరగించి పిదప, అక్కడి ఆచారరీత్యా అతడు, తాను భుజించిన స్థలాన్ని శుభ్రపరచబోతూ ఉండగా, “మేమే శుభ్రం చేసుకొంటాం” అంటూ బ్రాహ్మణి, అతణ్ణి ఆ పని చేయకూడదని కట్టడి చేసింది. గత్యంతరంలేక శ్రీనివాస్ ఇంటికి తిరిగి వెళ్ళిపోవలసి వచ్చింది.
13. బ్రాహ్మణితో హృదయ్ తగవులాట
కులాచారాలు, నియమాలు ప్రాబల్యం వహించిన ఆనాటి గ్రామాలలో వాటిని ఉల్లంఘించడం తరచూ పెద్ద కలహాలకు, వైషమ్యాలకు దారితీసేది. అలాంటి సంఘటనే ఇప్పుడూ జరిగింది. శ్రీరామకృష్ణులను చూడడానికి వచ్చిన బ్రాహ్మణ స్త్రీలు, బ్రాహ్మణ కులస్థురాలైన బ్రాహ్మణి, శ్రీనివాస్ ఉచ్ఛిష్టాన్ని శుభ్రం చేయబోవడం చూసి పెద్దగా ఆక్షేపించారు. కాని వారి ఆక్షేపణను ఆమె పట్టించు కోలేదు. క్రమంగా అది తగవులాటలోకి దిగింది. శ్రీరామకృష్ణుల మేనల్లుడైన హృదయ్ ఈ గందరగోళం విన్నాడు. ఈ చిన్న సంఘటన పెద్ద పోట్లాటలోకి దారితీయవచ్చునని ఎంచి, బ్రాహ్మణిని ఆచార నియమాలను ఉల్లంఘించ వద్దన్నాడు. కాని ఆమె, అతడి మాటలను లక్ష్యపెట్టలేదు. దానితో హృదయ్ కోపోద్రిక్తుడవడంతో వారిద్దరి మధ్య వాగ్యుద్ధం చెలరేగింది. బ్రాహ్మణితో, “నువ్వు అట్లే చేస్తే ఈ ఇంట్లో నిన్ను ఉండనివ్వం” అన్నాడు హృదయ్. బ్రాహ్మణి అంత తేలికగా లొంగే ఘటం కాదు. “ఉండనివ్వకపోతే నష్టం లేదు. శీతలాదేవి గదిలో* మానసాదేవి* పడుకొంటుందిలే” అంటూ బదులు చెప్పింది. ఇంట్లోని వారంతా వేడుకొని బ్రాహ్మణిని ఆ పని నుండి విరమింప జేసి తగవులాటను అంతటితో ఆపించారు.
14. బ్రాహ్మణి తన తప్పిదాన్ని గుర్తించడం – క్షమాపణకోరి సెలవు పుచ్చుకోవడం
పై విషయంలో ఆమె తల ఒగ్గినప్పటికీ, నాడు ఆమె అహం తీవ్రంగా దెబ్బతిన్నదనే చెప్పాలి. కోపం చల్లారిన పిదప ప్రశాంతంగా ఆలోచించి తన తప్పిదాన్ని గుర్తించింది. ఇలాంటి తప్పిదాలు పదే పదే చేస్తూ ఉంటే తానిక అక్కడ కొనసాగలేనని ఆమె భావించింది. సదసద్విచార సంపన్నుడూ, వివేకవంతుడూ అయిన సాధకుడు తన అంతర్దృష్టిని తన మనస్సుపై సారించినప్పుడు దాన్లో దాగివున్న అపవిత్ర భావాలు కనబడక పోవు. బ్రాహ్మణి విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది. శ్రీరామకృష్ణుల పట్ల తన వైఖరిలో ఏర్పడిన విపరీత ధోరణి గురించిన ఎరుక ఆమెకు అంతరవలోకనం మూలంగా కలిగింది. ఆమె పశ్చాత్తప్తురాలైంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు బ్రాహ్మణి స్వహస్తాలతో రకరకాల పువ్వులతో మాలలు కట్టి, గంధచందనాదులు అలది, శ్రీరామకృష్ణులను సాక్షాత్తు శ్రీ గౌరాంగుని (చైతన్యుని)గా భావిస్తూ, ఆయనను ఆ మాలలతో మనోహరంగా అలంకరించింది. పిదప హృదయపూర్వకంగా ఆయనను క్షమాపణ వేడుకొన్నది. తరువాత తనను తాను అదుపులో ఉంచుకొని, తన మనఃప్రాణాలు భగవదాయత్తం చేసి, కామార్పుకూర్ను వీడి కాశీక్షేత్రానికి బయలుదేరింది. ఆరు సుదీర్ఘ సంవత్సరాల కాలం నిరంతరాయంగా శ్రీరామకృష్ణులతో కలిసి వసించిన తరువాత భైరవీ బ్రాహ్మణి ఆఖరికి ఆయన నుండి సెలపు పుచ్చుకొని వెళ్ళిపోయింది.
15. దక్షిణేశ్వరానికి శ్రీరామకృష్ణులు తిరిగి రావడం
శ్రీరామకృష్ణులు దాదాపు ఏడు నెలల కాలం వివిధ ఆధ్యాత్మిక భావనలలో కామార్పుకూర్లో గడిపిన తరువాత బహుశా 1867 వ సంవత్సరాంతాన దక్షిణేశ్వరానికి తిరిగివచ్చారు. అప్పటికి ఆయన చాలావరకు మునుపటి ఆరోగ్యాన్ని, బలాన్ని పుంజుకొన్నారు. దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చిన స్వల్పకాలం తరువాత ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. దాన్ని పాఠకులకు ఇప్పుడు వివరించబోతున్నాం.