1. ఈ సమయంలో శ్రీరామకృష్ణుల మనఃస్థితి
మధురభావ సాధనలో పరిపూర్ణతను సంతరించుకొన్న శ్రీరామకృష్ణులు ప్రస్తుతం భక్తిభావ సాధనలలో పరాకాష్ఠను చేరుకొన్నారు. కాని ఆయన ఒనరించిన తక్కిన అపూర్వ ఆధ్యాత్మిక సాధనలను వర్ణించడానికి మునుపు ఈ కాలఘట్టంలో ఆయన మనఃస్థితిని గురించి అధ్యయనం చేయడం ఎంతో అవసరం.
(i) కామినీ కాంచనాల త్యాగంలో దృఢప్రతిష్ఠత
ఏ ఒక్క భావ సాధనలోనైనా సాఫల్యం పొందగోరితే సాధకుడు రూపరసాది లౌకిక భోగ్య విషయాలన్నింటినీ విషతుల్యంగా విడనాడాలని మనం గమనించాం. ‘జహా రామ్ తహా కామ్ నహీ* – రాముడు ఉండేచోట కాముడు ఉండజాలడు’ త్యాగంలో దృఢప్రతిష్ఠత అనే తులసీదాసు సూక్తి అక్షర సత్యం. శ్రీరామకృష్ణుల అనుపమాన సాధన చరిత్ర పై సూక్తికి తార్కాణం. కామ కాంచన త్యాగం అనే పునాదిపై దృఢంగా ప్రతిష్ఠితులైన తదనంతరమే ఆయన భక్తిసాధనలు అభ్యసించ మొదలుపెట్టారు. ఆ ఆధారం నుండి అణుమాత్రమైనా చలించకపోవడం చేతనే ఏ సమయంలో ఏ సాధనను అభ్యసించినా దానిలో స్వల్ప వ్యవధిలోనే పరిపూర్ణతను సంతరించుకోగలిగారు. కాబట్టి కామకాంచనాల ప్రలోభమనే హద్దులకు సుదూరతీరంలో ఆయన మనస్సు ప్రస్తుతం నిరంతరం ఊర్ధ్వస్థితిలో వసించసాగినదనే విషయం సుస్పష్టం.
(ii) నిత్యానిత్య వస్తు వివేకాలని పూర్తిగా అవగతం చేసుకోవడం
విషయ భోగాలను త్యజించి తొమ్మిది సంవత్సరాల కాలం పాటు భగవద్దర్శనార్థం ఒనరించిన ఎడతెగని అభ్యాస ఫలితంగా ఆయన మనస్సుకు ప్రస్తుతం కేవలం భగవంతుని గురించి తప్ప మరి ఏ విషయాన్ని గురించిన ఆలోచ నయినా విషతుల్యంగా అనిపించే స్థితికి చేరింది. త్రికరణశుద్ధిగా భగవంతుడు ఒక్కడే పరాత్పరుడనీ, సమస్త సారాల సారస్వరూపుడనీ అవగతం అయ్యేకొద్దీ, ఇహంలో కాని, పరంలో కాని ఒక్క భగవంతుణ్ణి తప్ప ఇతరత్రా పూర్తి ఉదాసీనం, వాసనారహితం అయింది ఆయన మనస్సు.
(iii) శమదమాది షట్ సంపత్తి ముముక్షత్వం
రూప రసాది బాహ్యవిషయాలను, శరీరపు సుఖదుఃఖాలను విస్మరించి తమ ఇష్టదైవం మీద ఆయన మనస్సు ఎంతవరకు ఏకాగ్రమైనదంటే, క్షణకాలంలో అనాయాసంగా ఆయన మనస్సు బాహ్య విషయాలన్నిటి నుండి విడివడి ధ్యేయవస్తువులో సంపూర్ణంగా తన్మయమైపోయి దివ్యానందాన్ని అనుభవించగలిగేది. ఆ విధంగా రోజులు, నెలలు, సంవత్సరాలు క్రమంగా దొర్లిపోయినా ఆ దివ్యానంద ప్రవాహంలో క్షణంపాటు కూడ విఘ్నం కలిగేది కాదు. అంతేకాదు, భగవంతుడు తప్ప జీవితంలో ఆకాంక్షించ తగిన వస్తువు మరేదన్నా ఈ లోకంలో ఉన్నదనిగాని లేదా ఉండవచ్చుననే నమ్మకానికి గాని ఏనాడూ ఆయన లోను కాలేదు.
(iv) జగత్కారణుడిపై పూర్తిగా ఆధారపడడం – నిర్భయత్వం
జగత్కారణుడైన భగవంతుడు ఒక్కడే ‘గతిః భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్’* – పరమగమ్యుడు, పోషకుడు, ప్రభువు, సర్వసాక్షి, జగత్తు కంతటికీ ఆవాస స్థానం, శరణ్యుడు, పరమహితుడు – అని గ్రహించడం మూలంగా జగన్మాతపై శ్రీరామకృష్ణులకు జనించిన ఏకాంత భక్తికి, విశ్వాసానికి, పరాధీనతకు హద్దు లేకపోయింది. వాటి సహాయంతో శ్రీరామకృష్ణులు ప్రస్తుతం జగజ్జననితో తమను నిత్యప్రేమసంబంధంతో ముడి పెట్టుకొన్నారు. అంతేకాక తన జీవితంలో ప్రతి చిన్న, పెద్ద పనిని జగన్మాత ఆదేశ, సూచనల మేరకే నిర్వర్తించడానికి పూర్తిగా అభ్యాసపడింది ఆయన మనస్సు. అందుకు హేతువు: పసిబిడ్డ తల్లి మీద పూర్తిగా ఎలా ఆధారపడి ఉంటాడో అలాగే సాధకుడు సర్వదా భగవంతుడు తన సమక్షంలోనే ఉండడం చూస్తూ, ఆయన మధురాతి మధురమైన పలుకులు విని పులకాంకితుడౌతూ, ఆయన శక్తిమంతమైన బాహువుల ఆలంబనతో సంక్లిష్ట సంసార మార్గంలో నిర్భీతితో సంచరిస్తూ ఉంటాడనే వాస్తవానికి అనేక నిదర్శనలు ఆయనకు అనుభూతమైనాయి.
వాత్సల్యపూరితురాలైన తల్లిలా జగత్కారణ రూపిణియైన జగన్మాత సర్వదా తన సమక్షంలోనే ఉంటున్నప్పుడు శ్రీరామకృష్ణులు సాధనలో నియుక్తులు కావడం ఎందుకు?
2. భగవత్సాక్షాత్కారా నంతరం ఆయన సాధన – దాని అంతరార్థం
అని ప్రశ్నించవచ్చు. ఎవరిని పొందడానికై సాధకులు యోగాన్ని అభ్యసిస్తారో, కఠోర తపస్యాదులు అనుష్ఠిస్తూ ఉంటారో అతణ్ణి తన సొంతం చేసుకొన్నాక కూడ మళ్ళీ సాధన చేయడంలోని ఔచిత్యం ఏమిటి? ఈ ప్రశ్నను ఇంతకు మునుపు ఒక దృక్పథంలో చర్చించడం జరిగింది. ఇప్పుడు మరో దృక్కోణం నుంచి నాలుగు ముక్కలు చెప్పవలసి ఉంది. గురుదేవుల పాద పద్మాల వద్ద కూర్చుని వారి సాధనానుష్టానాలను గురించి వింటున్నప్పుడు మా మనస్సులలో కూడ ఆ సందేహం కలిగింది. దాని గురించి ఆయనను అడగడానికి మేం వెనుకాడలేదు. సమాధానంగా ఆయన మాకు ఏం చెప్పారో మేం ఇక్కడ వివరిస్తున్నాం: “చూడండి. సర్వదా సముద్ర తీరంలో వసించే వ్యక్తి మనస్సులో కొన్ని సమయాల్లో, రత్నగర్భగా పేర్కొనబడే సముద్రపు అట్టడుగున నిల్వ ఉన్న అమూల్య రత్నరాశులను చూడాలనే అభిలాష జనిస్తుంది. అదే విధంగా జగన్మాత సాన్నిధ్యం సర్వదా నాకు లభించినప్పటికీ, అనంత భావమయి, అనంత రూపిణియైన ఆమె నానాభావాలను అనుభూతం చేసుకోవాలనే, ఆమె నానారూపాలను దర్శించాలనే బలీయమైన కోర్కె నాలో ఉదయించింది. ప్రత్యేకమైన ఏదో ఒక రూపంలో ఆమెను దర్శించాలనే ఆకాంక్ష కలిగినప్పుడు ఆమెను అదే రూపంలో నాకు దర్శనం ఇవ్వమని మంకుపట్టుతో ప్రార్థించే వాడిని. కరుణామయియైన అమ్మ కూడ అప్పుడు తన ఆ భావాన్ని లేదా రూపాన్ని దర్శించడానికి అనువైన ఆధ్యాత్మిక సాధనకు ఆవశ్యకమైన వాటి నన్నిటిని సమకూర్చి, నాచే నిర్వర్తింపజేసి నాకు ఆ రూపంలో దర్శనం ఇచ్చేది. ఆ రీతిలో విభిన్న ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించబడినవి” అని మాకు వివరించి చెప్పారు.
శ్రీరామకృష్ణులు మధురభావ సాధనలో పరిపూర్ణ సిద్ధిని పొంది భక్తిసాధనలచరమ భూమికను చేరుకొన్నారు. ఆ పిదప సర్వభావాతీతమైన సుప్రసిద్ధ అద్వైతవేదాంత సాధనను అనుష్ఠించాలనే తీవ్రప్రేరణ ఆయనలో జనించింది. జగన్మాత ప్రోత్సాహంతోనే ఆ ప్రేరణ ఆయనలో ఏవిధంగా కలిగిందో, ఏ విధంగా ఆయన జగన్మాత నిర్గుణ నిరాకార నిర్వికల్ప తురీయరూపాన్ని అనుభూతం చేసుకొన్నారో– ఆ ఉదంతం పాఠకులకు ఇప్పుడు చెప్పబోతున్నాం.
3. దక్షిణేశ్వరానికి శ్రీరామకృష్ణుల తల్లి రాక
శ్రీరామకృష్ణులు అద్వైత సాధనను ప్రారంభించిన సమయంలో వృద్ధురాలైన ఆయన తల్లి దక్షిణేశ్వరంలో నివసిస్తూ ఉండేది. పెద్ద కుమారుడైన రాంకుమార్ మరణించిన తరువాత ఆ తల్లి మిగిలిన ఇద్దరు కుమారులను అతి ప్రియంగా చూసుకొంటూ కాలం గడపసాగింది. కాని అనతికాలంలోనే ప్రియాతిప్రియమైన తన చిన్నకుమారుడు గదాధర్ పిచ్చివాడైనాడనే లోకుల వదంతి విని ఆమె అంతులేని దుఃఖం అనుభవించింది. కుమారుణ్ణి స్వగృహానికి రప్పించి నానారకాల చికిత్సలు, శాంతి స్వస్త్యయనాదులు జరిపించిన పిదప ఏదో విధంగా అతడు కొంత కోలుకోవడంతో ఆమె హృదయంలో మళ్ళీ ఆశ చిగురించింది. పిదప అతడికి వివాహం చేయించింది. కాని వివాహానంతరం దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చాక గదాధర్ మళ్ళీ వెనుకటి స్థితిలో పడిపోయాడని ఎరిగి ఆ వృద్ధురాలు తనను అదుపులో ఉంచుకోలేకపోయింది. తన కుమారుడు కోలుకోవడానికై ఆమె స్వగ్రామంలోని శివాలయానికి మొదట వెళ్ళింది. ఆ పిదప ముకుందపురంలోని ప్రాచీన శివాలయానికి వెళ్ళి ఆమరణ ఉపవాస వ్రతం చేపట్టింది. మహాదేవుడు స్వప్నంలో ఆమెకు దర్శనమిచ్చి ఆమె కుమారుడు దివ్యోన్మాదంలో ఉన్నాడనీ, పిచ్చివాడు కాడనీ తెలిపిన పిదప ఆమె కొంత ఊరడిల్లింది. ఐనప్పటికీ సంసారం పట్ల పూర్తిగా నిరాసక్తత ఆమెలో కలిగింది. ఇది జరిగిన కొద్దికాలానికే తన శేషజీవితాన్ని పావన గంగాతీరంలో గడపాలని నిశ్చయించుకొని ఆమె తన చిన్న కుమారుని వద్దకు దక్షిణేశ్వరానికి వచ్చేసింది. సంసారంలో ఎవరి కోసం, ఎవరితో తాను కలిసి జీవించిందో వారు ఒకరి వెనుక ఒకరు తననూ, సంసారాన్నీ వదలి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఈ వృద్ధాప్యంలో సంసారాన్ని అంటిపెట్టుకొని తాను ఉండడంలో ప్రయోజనం ఏముందని ఆమె యోచించడమే ఆమె దక్షిణేశ్వర ఆగమనానికి కారణం. మథురనాథ్ జరిపిన ‘అన్నమేరు’ ఉత్సవాన్ని గురించి మేం మునుపే చెప్పడం జరిగింది. తన శేషజీవితాన్ని గంగాతీరంలోని దక్షిణేశ్వరంలో గడపాలని తీర్మానించుకొన్న శ్రీరామకృష్ణుల తల్లి, 1864 వ సం ॥ లో పై ఉత్సవం జరుగుతూ ఉన్న సందర్భంలో కాళికాలయానికి అరుదెంచి ఉంటారని మేం ఊహిస్తున్నాం. ఆమె ఈ సంకల్పం నెరవేరింది. ఆమె కామార్పుకూర్కు మళ్ళీ ఎన్నడూ తిరిగి వెళ్ళలేదు. తన శేష జీవితంలోని పన్నెండు సంవత్సరాల కాలం ఆమె కాళీ ఆలయంలోనే గడిపి, 1876 వ సం ॥ లో పరమపదించింది. కాబట్టి శ్రీరామకృష్ణులు జటాధారి నుండి ‘రామ’ మంత్రదీక్షను పుచ్చుకోవడం, ఆయన నుండి రామ్‌లాలా ప్రతిమను గ్రహించడం, వాత్సల్య మధుర అద్వైతాది భావ సాధనలను అనుష్ఠించడం మొదలైనవన్నీ ఆయన తల్లి దక్షిణేశ్వరంలో వసిస్తూ ఉన్న కాలంలోనే జరిగాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
4. చంద్రాదేవిలోని లోభరాహిత్యం
శ్రీరామకృష్ణుల తల్లిలో లోభ మనేది అణుమాత్రమైనా లేదనడానికి నిదర్శనంగా మేం ఇక్కడ ఒక సంఘటన గురించి పాఠకులకు తెలియజేస్తున్నాం. ఆ సంఘటన ఆమె దక్షిణేశ్వరానికి వచ్చిన కొద్ది కాలంలోనే జరిగింది. ఈ కాలంలో దేవాలయపు నిర్వహణాధికారమంతా మథురనాథ్ చేతుల్లో ఉన్నదనీ, ‘అన్నమేరు’ ఉత్సవం మొదలైన పుణ్యకార్యాలను చేస్తూ ఉన్నాడనీ ఇంతకు మునుపే చెప్పడం జరిగింది. శ్రీరామకృష్ణుల పట్ల అతడికి అపరిమిత భక్తిప్రపత్తులు ఉండడం చేత ఆయన సేవాకార్యం, తన తదనంతరం కూడా ఏ విధమైన లోటుపాట్లూలేక సమర్థనీయంగా జరిగేటట్లుగా సర్వదా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాని శ్రీరామకృష్ణులలో జ్వలించే వైరాగ్యం కారణంగా ఆ విషయాన్ని మథుర్ ఆయనతో ప్రస్తావించడానికి సాహసించలేకపోయాడు. ఇలా ఉండగా ఒకరోజు మథుర్, శ్రీరామకృష్ణుల ఆంతర్యం తెలుసుకోగోరి, ఆయనకు వినవచ్చేట్లు ఒక జమీని ఆయన పేరిట వ్రాసిపెట్టే విషయం హృదయ్‌తో ప్రస్తావించాడు. ఈ ఘటన అతణ్ణి గొప్ప కష్టానికి గురిచేసింది. శ్రీరామకృష్ణులు వారి సంభాషణ కొంచెం వినీవినగానే పిచ్చివాడిలా పరుగెత్తుకొంటూ వచ్చి, “శాలా (ధూర్తుడా)! నన్ను లౌకిక వ్యక్తిని చేయాలనుకొంటున్నావా!” అంటూ దాదాపు అతణ్ణి కొట్టబోయినంత పనిచేశారు. కాని ఆ యోచన మథుర్ను ఎన్నడూ వదలలేదు. సదా అతడి మనస్సులో రగులుతూనే ఉండిపోయింది. కాని దాన్ని కార్యాచరణలో పెట్టే సదవకాశం అతడికి లభించలేదు. శ్రీరామకృష్ణుల తల్లి (చంద్రాదేవి) దక్షిణేశ్వర ఆగమనంతో తన దీర్ఘకాలిక సంకల్పం నెరవేరడానికి చక్కని అవకాశం ఏర్పడిందని అతడు భావించాడు. వెంటనే మథుర్ ఆ వృద్ధురాలిని ప్రతిరోజూ కలుసుకొని ఆమెను ‘అవ్వా’ అని సంబోధిస్తూ, పిచ్చాపాటీ మాట్లాడుతూ క్రమంగా ఆమెకు అమిత ప్రీతిపాత్రుడైపోయాడు. తరువాత ఒకరోజు చక్కని సదవకాశం చూసి ఆమెకు మనఃస్ఫూర్తిగా ఇలా విన్నవించాడు: “అవ్వగారూ! మీకు సేవ చేసే అవకాశం నా కింత వరకూ ఇవ్వలేదు. నన్ను మీ సొంత మనిషిగా భావించే పక్షంలో మీకు కావలసింది ఏదైనా నా నుండి పుచ్చుకోండి” అని వినమ్రంగా అడిగాడు. సరళ చిత్తురాలైన ఆ వృద్ధురాలు గొప్ప ఇరకాటంలో పడింది. ఎందుకంటే, కొంతసేపు దీర్ఘంగా ఆలోచించాక కూడా తనకు ఏం కావాలో ఆమెకు స్ఫురించ లేదు. ఈ సంకట స్థితిలో ఆమె ఇలా అంది: “నాయనా! భగవంతుడు నిన్ను చల్లగా చూడు గాక! ప్రస్తుతం నీ ప్రేమాస్పద పోషణలో నాకు ఏ లోటూ లేదు. నాకు ఏదైనా అవసరమైనప్పుడు నిన్ను తప్పక అడుగుతాను.” ఇలా అంటూ ఆమె తన పెట్టెను తెరిచి మథుర్‌తో ఇలా అంది: “ఇదుగో చూడు, నాకు ఎన్ని చీరలు ఉన్నాయో! నీ పోషణలో తినడానికి, తాగడానికి కొదవ లేదు. కావలసినవన్నీ నువ్వు అమర్చావు, అమరుస్తున్నావు కూడా. అలాంటప్పుడు నీ నుండి ఏం కోరమంటావు?” కాని మథుర్ అంత తేలికగా విడిచిపెట్టే వ్యక్తి కాడు. అతడు పదే పదే ఆమెను “ఏదన్నా అడగండి” అంటూ ప్రాథేయపడ్డాడు. కాసేపు తీవ్రంగా ఆలోచించాక శ్రీరామకృష్ణుల తల్లికి తనకు అవసరమైనది ఏమిటో గుర్తుకొచ్చి, ఇలా అంది: “నువ్వు నాకు ఏదైనా ఇవ్వాలనుకొంటే, పంటినొప్పికి మందుగా వేసుకోవడానికి ఒక అణా పొగాకు కొని తెచ్చి ఇవ్వు” అంది. ఆమె మాటలకు లౌకికుడైన మథుర్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమెకు ప్రణామం చేస్తూ “అటువంటి త్యాగశీలుడైన కుమారుడు ఇటువంటతల్లికి కాక, మరెవరికి జన్మిస్తాడు?” అన్నాడు. ఆ తరువాత ఆమెకు పొగాకు తెప్పించి ఇచ్చాడు.
5. హలధారి, పూజారి బాధ్యతలనుంచి వైదొలగడం – అక్షయ్ ఆగమనం
శ్రీరామకృష్ణులు వేదాంత సాధనను అనుష్ఠిస్తున్న సమయంలో ఆయన దాయాది అయిన హలధారి కాళికాలయంలోని శ్రీరాధాగోవిందుల పూజారిగా నియుక్తుడై ఉన్నాడు. శ్రీరామకృష్ణులకంటే అతడు వయస్సులో పెద్దవాడు, భాగవతాది శాస్త్రగ్రంథాలలో ఒకింత అభినివేశం ఉన్నవాడు. ఈ కారణాల వల్ల అతడికి గర్వం ఉండేది. శ్రీరామకృష్ణులను అతడు ఎలా పరిహసిస్తూ ఉండేవాడో, ఆయనకు కలిగిన దివ్యదర్శనాలు, ఆధ్యాత్మిక అనుభవాలు సమస్తం ఆయన చిత్తచాంచల్యం వల్ల ఏర్పడిన వికారాలని విమర్శిస్తూ ఉండేవాడో, అతడి అభిప్రాయాన్ని విని శ్రీరామకృష్ణులు ఎంతో బాధపడి జగన్మాత వద్దకెళ్ళి ఆ సంగతి నివేదించి, తల్లి నుండి పదే పదే అనునయింపబడేవారో – ఈ విషయాలన్నిటినీ పాఠకులకు మునుపే తెలియచేశాం. కఠినమైన హలధారి పరిహాసపూరిత పలుకులు ఒకమారు శ్రీరామకృష్ణులకు మిక్కిలి బాధ కలిగించాయి. ఆ సమయంలో వారు భావావస్థలోకి ప్రవేశించి దానిలో ఒక సౌమ్యమూర్తిని దర్శించి, ‘భావముఖంలో’ నెలకొని ఉండమనే ఆదేశాన్ని పొందారు. ఈ సంఘటనలు ఆయన వేదాంత సాధనను చేపట్టడానికి ఒకింత కాలానికి మునుపు జరిగినట్లుగా తోస్తున్నది. మధురభావ సాధనను అనుష్ఠిస్తూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు స్త్రీల దుస్తులు, ఆభరణాలు ధరించి అచ్చం స్త్రీ మాదిరి ప్రవర్తించడం చూసి హలధారి ఆయనను ఆత్మజ్ఞానశూన్యుడని నిర్ణయించాడు.
పరమహంస పరివ్రాజకాచార్యుడైన శ్రీ తోతాపురి దక్షిణేశ్వరానికి విచ్చేసి అక్కడ వసిస్తున్నప్పుడు హలధారి కాళికాలయంలో ఉండేవాడనీ, అప్పుడప్పుడు తోతాపురితో శాస్త్రగ్రంథాలపై చర్చిస్తూ ఉండేవాడనీ మేం శ్రీరామకృష్ణుల ముఖతా విన్నాం. ఒకరోజు తోతాపురి, హలధారి అధ్యాత్మ రామాయణం గురించి చర్చిస్తూ ఉన్నప్పుడు, సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముని దివ్యదర్శనాన్ని శ్రీరామకృష్ణులు పొందారు. తోతాపురి బహుశా క్రీ.శ. 1864 వ సంవత్సరాంతంలో దక్షిణేశ్వరానికి విచ్చేసి ఉండవచ్చు. ఆ తరువాత కొన్ని నెలలకు అనారోగ్య కారణంగానూ, తదితర కారణాలచేతా హలధారి కాళికాలయపు పూజారిగా ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. శ్రీరామకృష్ణుల అన్నగారైన రాంకుమార్ కుమారుడు అక్షయ్, హలధారి స్థానంలో కాళికాలయ పూజారిగా నియుక్తుడయ్యాడు.
6. భావసమాధిలో పరిపూర్ణత నొందాక అద్వైత సాధనానుష్ఠానం – తత్కారణం
భగవంతుని సాయుజ్యాన్ని లేక తాదాత్మ్యాన్ని పొందాలని గాని లేక నిర్వాణముక్తిని పొందాలని గాని ఎన్నడూ ప్రయత్నించకపోవడమే భక్తుడి స్వాభావికత. శాంత్యాది భక్తిమార్గాలను అవలంబించి భగవంతుని నానారూప వైభవాన్ని, ఉదాత్త గుణాలను చవిచూడాలనే భక్తుడి నిరంతర యత్నం. ‘చక్కెర కాగోరను, చక్కెరను రుచిచూడగోరతాను’ అనే దేవీ భక్తుడైన రామ్ప్రసాదుని సూక్తి భక్తుల హృదయపూర్వక స్వాభావిక ప్రార్థనగా ప్రసిద్ధిగాంచింది. అలాంటప్పుడు భావసాధనల పరాకాష్ఠకు చేరుకొని సకల భావాలకూ అతీతమైన అద్వైతావస్థకు చేరడం కోసం శ్రీరామకృష్ణులు చేసిన ప్రయత్నం అనేకులకు విపరీతంగా తోచవచ్చు. కాని ఇలాంటి నిర్ణయానికి రావడానికి మునుపు, ప్రస్తుతం శ్రీరామకృష్ణులు ఏ పని చేయడంలోనూ చొరవ తీసుకొనే సామర్థ్యం లేనివారైనారని మనం గుర్తుంచుకోవాలి. జగజ్జనని బిడ్డగా శ్రీరామకృష్ణులు సర్వదా, సంపూర్ణంగా ఆమె మీదనే ఆధారపడి, ఆమెపై పూర్తి విశ్వాసం ఉంచి, సదా అన్ని రీతుల్లోనూ ఆమె మార్గదర్శకత్వంలో మెలగడంలో సంతృప్తి చెందేవారు. జగన్మాత తన వంతుగా ఆయన బాధ్యతలన్నీ తానే వహించి తన ఒక ప్రత్యేక ప్రయోజనార్థం, ఆయన ఎరుకలేకయే ఒక క్రొత్త మూసలో ఆయన్ను పోత పోయ నెంచింది. అన్ని సాధనలు ముగిసిన పిమ్మట జగజ్జనని అభిలాష మేరకు ఒక దివ్య సంఘటన మూలంగా శ్రీరామకృష్ణులు ఆ ప్రత్యేక ప్రయోజనం ఏమిటో తెలుసుకోగలిగారు. వ్యక్తిమాత్రుడిగా తాను ఒకింత విడివడి ఉంటూ జగజ్జనని ప్రేమలో పూర్తిగా ముడివడి లోకశ్రేయస్సు అనే ఆమె మోపిన మహాబాధ్యతను తనదిగా గ్రహించి పరమానందంతో నిర్వర్తించసాగారు.
7. అద్వైత భావం– భక్తి భావం
మధురభావ సాధనలో పరిపూర్ణతను సాధించిన పిదప శ్రీరామకృష్ణులు అద్వైత సాధనను చేపట్టడంలోని యుక్తియుక్తత మరొక దృక్పథం నుంచి స్పష్టం అవుతుంది. భావస్థితి, భావాతీత స్థితుల రెంటికీ నడుమ సర్వదా కార్యకారణ సంబంధం ఒకటి ఉంది. ఎందుకంటే: భావస్థితులన్నిటికీ అతీతమైన అద్వైత రాజ్యపు భూమానందమే పరిమితమై, భావ (భక్తి) రాజ్యానికి చెందిన శ్రవణ, దర్శన, స్పర్శనాది భగవదానంద రూపంగా వ్యక్తం అవుతోంది. కాబట్టి మధురభావపు పరాకాష్ఠకు చేరి, ద్వైతభూమి యొక్క చరమస్థితిని చేరుకొన్నాక భావాతీతమైన అద్వైతభూమికి తప్ప మరెచ్చటికి పోగలుగుతుంది శ్రీరామకృష్ణుల మానసం?
పై వాదన సకారణయుతమే అయినప్పటికీ, శ్రీరామకృష్ణులు జగజ్జనని సూచన మేరకే అద్వైత సాధనను అనుష్ఠించారని ఈ క్రింది సంఘటన సుస్పష్టం చేస్తున్నది.
8. శ్రీ తోతాపురి దక్షిణేశ్వర ఆగమనం
గంగాసాగరంలో స్నానం ఆచరించాలనే ఆకాంక్షతోను, పూరీ క్షేత్రంలో జగన్నాథుని దర్శించాలనే అభిలాషతోను పరివ్రాజకాచార్యుడైన శ్రీ తోతాపురి మధ్యభారతదేశం నుండి ఇచ్ఛానుసారం తీర్థయాత్రలు సలుపుతూ వంగదేశానికి అరుదెంచాడు. పావన నర్మదానదీ తీరంలో సుదీర్ఘకాలం ఏకాకిగా వసించి, నిర్వికల్ప సమాధి స్థితిని చేర్చగల ఆధ్యాత్మిక సాధనానుష్ఠానాలలో నిమగ్నుడై బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందిన మహనీయుడు అతడు. ఇప్పటికీ అక్కడి వృద్ధ సాధువులు ఇందుకు ప్రత్యక్ష సాక్షులై ఉన్నారు. బ్రహ్మజ్ఞానం సిద్ధించాక యథేచ్ఛగా కొంతకాలం పర్యటించాలనే ఆకాంక్ష అతడిలో జనించింది. ఆ అభిలాషతోనే అతడు భారతదేశపు తూర్పు ప్రాంతాలకు వచ్చి పుణ్యక్షేత్రాలను ఒక్కొక్కటీ సందర్శించసాగాడు. సమాధి స్థితిలో ఉండని సమయాలలో ఆత్మారాములైన మహాపురుషులకు బాహ్యప్రపంచం గోచరిస్తూ ఉన్నా, అది వారికి బ్రహ్మంగానే అనుభూతమవుతూ ఉంటుంది. మాయా ఆచ్ఛాదితమైన ఈ జగత్తులోని వ్యక్తులను, వస్తువులను, దేశకాలాదులను – హెచ్చు తగ్గులుగా ఆ బ్రహ్మపదార్థపు అభివ్యక్తాలుగానే అనుభూతం చేసుకొంటూ వారు ఆకాలంలో దేవాలయాలు, పుణ్యతీర్థాలు, సాధుసందర్శనాలను చేస్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మజ్ఞుడైన తోతాపురి కూడ తీర్థయాత్రలకు బయలుదేరడంలో వింత ఏమీ లేదు. పైన పేర్కొన్న రెండు (గంగాసాగరం, పూరీ) పుణ్యతీర్థాల సేవానంతరం భారతదేశ వాయవ్య ప్రాంతాలకు వెళుతూ ఆయన దక్షిణేశ్వరం చేరుకొన్నాడు. ఏ ప్రదేశంలోనైనా మూడు రోజుల కంటే ఎక్కువ కాలం గడపటం ఆయన నియమం కాదు. అందుచేతనే దక్షిణేశ్వర కాళీ ఆలయంలో కూడా మూడు రోజులు మాత్రమే గడపాలని ఆయన వచ్చాడు. అనూహ్య లీలావిలాసిని అయిన జగజ్జనని, అతడి జ్ఞానానికి పరిపూర్ణతను సంతరింప చేయడానికి, తన సొంత బిడ్డ (శ్రీరామకృష్ణులు)తో అద్వైత సాధనను అనుష్ఠింప చేయడానికి అక్కడకు తీసుకొని వచ్చిందని తోతాపురి మొదట్లో గ్రహించలేకపోయాడు.
9. శ్రీరామకృష్ణులకు జగజ్జనని ఆదేశం
కాళికాలయానికి రావడంతోనే తోతాపురి మొదట స్నానఘట్టం మీది విశాల ద్వార మండపానికి వచ్చాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు ఏకవస్త్రం ధరించి, అన్యమనస్కులై అతిసామాన్యునిలా కూర్చుని ఉన్నారు. తపోదీప్తితో, భక్తిభావంతో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూన్న శ్రీరామకృష్ణుల ముఖారవిందాన్ని తిల కించిన క్షణంలోనే తోతాపురి ఆయనపట్ల ఆకర్షితుడయ్యాడు. ఆయన సామాన్య వ్యక్తి కాడనీ, అద్వైత వేదాంత సాధనకు ఉపయుక్తుడైనటువంటి ఉత్తమాధికారి కనిపించడం చాలాఅరుదు అనీ తోతాపురి హృదయాంతరాళంలో తలచాడు. ఆశ్చర్య, ఆరాటాలు పెనగొనగా తోతాపురి అడుగులు ముందుకువేసి, శ్రీరామకృష్ణులను సమీపించి ఇలా అనుకొన్నాడు: ‘హా! తాంత్రిక సాధనలు ప్రబలంగా ఉన్న వంగదేశంలో వేదాంత సాధనకు ఉపయుక్తమైన వ్యక్తి మరొక డుంటాడా?’ అని సునిశితంగా పరిశీలించి తనంతట తానుగా శ్రీరామకృష్ణులను ఇలాఅడిగాడు: “నువ్వు పరమయోగ్యుడైన సాధకునిలా కనిపిస్తున్నావు. వేదాంతసాధనను ఆచరిస్తావా?”
జటాజూటధారి, ఆజానుబాహువు అయిన ఆ నగ్న సన్న్యాసికి శ్రీరామకృష్ణులు ఇలా బదులు చెప్పారు: “ఏం చేయాలో, ఏం చేయరాదో నాకేమీ తెలియదు. సమస్తం మా అమ్మకే తెలుసు. ఆమె ఆదేశం మేరకు చేస్తాను” అని అన్నారు.
అందుకు తోతాపురి, “అయితే వెళ్ళు, నీ తల్లిని అడిగి, వెంటనే తిరిగి రా. ఇక్కడ నేను ఎక్కువ కాలం ఉండబోవడం లేదు” అన్నాడు.
శ్రీరామకృష్ణులు బదులుగా ఏమీ పలుకకుండా నెమ్మదిగా జగన్మాత ఆలయానికి వెళ్ళారు. ఆలయంలో భావావిష్టులై ఉండగా “వెళ్ళి, నేర్చుకో. నీకు బోధించే నిమిత్తమే ఆ సన్న్యాసి ఇక్కడకు వచ్చాడు” అన్న జగజ్జనని ఆదేశవాణిని విన్నారు.
10. జగన్మాతను గురించి తోతాపురి భావన
అర్ధబాహ్యచైతన్య స్థితిలో శ్రీరామకృష్ణులు అప్పుడు దివ్యానంద తేజోవదనులై తోతాపురి వద్దకు తిరిగి వచ్చి తల్లి ఆదేశాన్ని అతడికి తెలిపారు. శ్రీరామకృష్ణులు ‘తల్లి’ అంటూ ప్రేమాతిశయంతో సంబోధిస్తున్నది మానవ మాత్రు రాలైన తల్లిని కాదని, ఆలయంలో ప్రతిష్ఠితమైన దేవీ విగ్రహాన్నే అని గ్రహించాడు తోతాపురి. పసిబాలుని వంటి అతడి నిష్కాపట్యాన్ని చూసి ముగ్ధుడైనాడు. కాని శ్రీరామకృష్ణులు ఇలా ప్రవర్తించడానికి కారణం అమాయకత్వం, మూఢ నమ్మకమే అని అతడు భావించాడు. ఇలా భావించుకోవడంతోనే జాలిగొలిపే దరహాసంతో తోతాపురి పెదవి కొనలు ఎలా వంపులు తిరిగాయో మనం ఊహించుకోవచ్చు. తోతాపురి కుశాగ్రబుద్ధి వేదాంతంలో వర్ణింపబడిన కర్మఫలదాయకుడైన ఈశ్వరుణ్ణి తప్ప ఇతర దేవతల నెవరినీ గుర్తించడానికి ఒప్పుకోకపోవడమే ఇందుకు కారణం. ఇంద్రియ నిగ్రహపరుడైన తోతాపురి పరబ్రహ్మాన్ని ధ్యానించడం, ఈశ్వరుడి అస్తిత్వాన్ని విశ్వసించడమే తప్ప, అతణ్ణి ప్రార్థించి, కృపాసిద్ధికై భక్తి ద్వారా అతణ్ణి ఆరాధించవలసిన ఆవశ్యకత ఏమీలేదని అతడి అభిప్రాయం. ఈశ్వరుణ్ణి గురించే అతడి భావన ఇలా ఉండగా ఇక త్రిగుణమయి, బ్రహ్మశక్తి యైన మాయను గురించి అతడి భావాన్ని మనం ఊహించుకోవచ్చు. అందుచేతనే తోతాపురి ఆమెను కేవలం భ్రమగానే తలచి, ఆమెకు ఒక వ్యక్తిగత అస్తిత్వం ఉన్నదనికూడా (భ్రమకు అస్తిత్వం ఆపాదిస్తే అది భ్రమ ఎలా అవుతుంది?) అంగీకరించడు. ఇక ఆమెను ప్రసన్నురాలిని చేసుకోవడం, ఆమెను ఆరాధించడం ఎలా ఒప్పుకొంటాడు? ఫలితంగా అజ్ఞాన బంధనం నుండి ముక్తిని పొందడానికి సాధకుడికి పురుషకారం, స్వప్రయత్నం ఒక్కటే ఉపాయమని అతడి నిశ్చితాభిప్రాయం. ఆత్మజ్ఞానానికి ఈశ్వరుడి లేదా శక్తితో కూడిన బ్రహ్మ కృప, తోడ్పాటు ఆవశ్యకమనే భావన తోతాపురి మనస్సులో అసలు జనించేదే కాదు. అంతేగాక ఎవరు అలా (సాకార ఉపాసన) చేస్తారో వారు మూడనమ్మకస్థులై అలా చేస్తూ ఉంటారనే నిర్ణయానికి వచ్చాడతడు.
11. గోప్యంగా సన్న్యాసం స్వీకరించాలన్న శ్రీరామకృష్ణుల నిశ్చయం: తత్కారణం
ఏది ఏమైనప్పటికీ తన వద్ద దీక్ష పుచ్చుకొని జ్ఞానమార్గంలో సాధన చేయసాగినప్పుడు శ్రీరామకృష్ణుల ఆ గత సంస్కారాలన్నీ అతిత్వరితంగా తొలగిపోగలవని భావించి, తోతాపురి తన యోచనలను ఆయనతో ప్రస్తావించక, ఇతర అంశాలతో పరిచయం కలిగించాడు. వేదాంత సాధనకు మునుపు శిఖను, యజ్ఞోపవీతాన్ని పరిత్యజించి విధివిహితంగా సన్న్యాసం పరి గ్రహించాలని తోతాపురి చెప్పాడు. అందుకు శ్రీరామకృష్ణులు ముందు ఒకింత తటపటాయించి పిదప గోప్యంగా సన్న్యాసం పుచ్చుకోవడంలో తనకు ఎలాంటి ఆక్షేపణా లేదని అన్నారు. కాని దాన్ని బహిరంగంగా నిర్వర్తిస్తే, అప్పటికే శోక సంతప్తయై, వృద్ధురాలైన తన తల్లి హృదయం మరింత క్షోభిస్తుందని, అలా చేయలేనని చెప్పారు. గోప్యంగా సన్న్యాసం శ్రీరామకృష్ణులు ఎందుకు తీసుకోగోరారో అర్థం చేసుకొన్న తోతాపురి, “మంచిది. శుభముహూర్తం చూసి గోప్యంగానే నీకు సన్న్యాసం ఇస్తాను” అన్నాడు. ఆ తరువాత కొన్ని రోజులు ఒక అనువైన స్థలంలో గడపాలనే ఉద్దేశంతో, ఆలయ ఉపవనానికి ఉత్తరాన ఉన్న సుందర పంచవటికి వచ్చి, అక్కడ తన ఆసనాన్ని పరిచాడు.
12. శ్రాద్ధాది కర్మల ఆచరణ
తదనంతరం ఒక శుభ ముహూర్తంలో పితృదేవతల ఆత్మతృప్త్యర్థం శ్రాద్ధాది కర్మలు చేయమని తోతాపురి, శ్రీరామకృష్ణులను ఆదేశించారు. ఆ కర్మకాండ ముగిశాక శిష్యుడి ఆత్మతృప్తికైకూడ యథావిధిగా పిండప్రదానం చేయించాడు. అందుకు కారణం: సన్న్యాసం పుచ్చుకొన్నప్పటి నుండి సాధకుడు ఇహలోకం, భూ, భువః ఆది సమస్త లోకాలను పొందే ఆశను, హక్కును పూర్తిగా పరిత్యజిస్తాడు. అందుచేతనే సన్న్యసించే ముందు తన శ్రాద్ధకర్మను తానే స్వయంగా చేసుకోవాలని శాస్త్రాలు ఆదేశిస్తున్నాయి.
శ్రీరామకృష్ణులు, తన ఆధ్యాత్మిక గురువుగా ఎవరిని ఎప్పుడైతే స్వీకరించారో అప్పుడు నిస్సంకోచంగా తనను తాను వారికి అర్పించుకొని, వారి ఆదేశాలను సంపూర్ణ విశ్వాసంతో పాటించేవారు. అందుచేత ఆయన ఇప్పుడు తోతాపురి ఆదేశానుసారం తు.చ. తప్పక వర్తించారని వేరే చెప్పనవసరం లేదు. శ్రాద్ధాది పూర్వ క్రియలనన్నిటినీ ఆచరించి, స్థిరచిత్తులై పంచవటి దరినున్న సాధన కుటీరంలో గురువు తెల్పినట్లు సన్న్యాస దీక్షకు కావాల్సిన సామగ్రిని సేకరించుకొని ఆ శుభముహూర్తం కోసం నిరీక్షించసాగారు.
వేకువకు రెండు గంటలు ఉందనగా శుభ బ్రహ్మముహూర్త సమయం ఏతెంచినప్పుడు, గురుశిష్యు లిద్దరూ సాధన కుటీరంలో కలుసుకున్నారు. అన్ని పూర్వక్రియలూ ముగిశాక హోమాగ్ని ప్రజ్జ్వలింపబడింది. ఇక భగవదన్వేషణార్థం సర్వస్వ త్యాగమనే ఏ వ్రతం సనాతన కాలం నుండి అవిచ్ఛిన్న గురు పరంపరానుగతంగా భారతదేశాన్ని బ్రహ్మజ్ఞ పదవిలో సుప్రతిష్ఠితం చేస్తూవస్తున్నదో ఆ సన్న్యాస దీక్షను స్వీకరించడానికి ముందు ఉచ్చరించబడవలసిన మంత్రాల పవిత్ర గంభీర ధ్వనితో పంచవటీ ప్రాంతం మారుమ్రోగసాగింది. పావన సలిల భాగీరథీ స్నేహపూర్ణ వక్షాన్ని స్పృశించిన ఆ ధ్వని యొక్క స్పర్శ వలన ఆమె సజీవంగా ప్రవహిస్తున్నట్లు అనిపించింది. యుగాలు గతించాక అలౌకిక భారతీయ సాధకుడొకడు భారతదేశం, సమస్త ప్రపంచంలోని బహుజన హితార్థం మళ్ళీ సంపూర్ణ పరిత్యాగ వ్రతాన్ని, సన్న్యాసాన్ని స్వీకరించనున్నాడనే శుభవార్తను నలుదిశలా చాటించటానికే అన్నట్లు మర్మరధ్వనితో ఆనందంగా నృత్యం చేస్తూ ఆ జాహ్నవి ప్రవహించసాగింది.
13. సన్న్యాస దీక్షకు ముందు పఠించే ప్రార్థనా మంత్రాలు
గురువు విరజాహోమ మంత్రాలను పఠింప ప్రారంభించాడు. శిష్యుడు ఏకాగ్రచిత్తంతో గురువును అనుసరించి ఆ మంత్రాలను ఉచ్చరిస్తూ ప్రజ్జ్వలిత పవిత్ర హోమాగ్నిలో ఆహుతులను సమర్పించసాగాడు. మొదట ప్రార్థనా మంత్రాలు ఉచ్చరింప ముందు పఠించే బడ్డాయి. “పరబ్రహ్మతత్వం నన్ను పొందునుగాక! పరమానంద ప్రార్థనా మంత్రాలు లక్షణం కలిగిన పదార్థం నన్ను పొందును గాక! అఖండం, ఏకరసం, మధుమయమూ అయిన పరబ్రహ్మ నాలో ప్రకటితమౌ గాక! నిన్ను ప్రకటించే బ్రహ్మవిద్యతో సహా నిత్యం వర్తమానుడవై ఉండే హే పరమాత్మ! దేవ మర్త్యాది నీ బిడ్డలందరిలో నీ విశిష్ట కరుణకు పాత్రుడనైన నేను నీ బిడ్డను, నీ సేవకుడను. సంసారం అనే ఈ పీడకలను నాశనం గావించు. ఓ పరమేశ్వరా, ద్వైతరూపంలో ప్రతిభాసిస్తూ ఉన్న నా పీడకలల నన్నిటినీ అంతం చేయి. హే పరమాత్మా! నా ప్రాణవృత్తుల నన్నిటిని నీకు ఆహుతించి, ఇంద్రియాల నన్నిటిని నిరోధించి, నీపై ఏకాగ్రచిత్తుడనౌదును గాక! సర్వ ప్రేరకుడవైన ఓ దేవా, జ్ఞాన ప్రతి బంధకాలైన మలినాలన్నిటిని నా నుంచి తొలగించి, నిరర్థక, విరుద్ధ భావనాదులు లేని యథార్థ తత్త్వజ్ఞానం నాలో ఉదయింప చేసి, సుస్థిరతను నాకు అనుగ్రహించు. సూర్యుడు, వాయువు, నదీ నదాల స్నిగ్ధ పవిత్ర జలాలు, వరి, గోధుమలు మొదలైన ఆహార పదార్థాలు, మొక్కలు, వనస్పతులు – ఇత్యాది, లోకంలోని వస్తువులన్నీ నీ ద్వారా నిర్దేశింపబడి, నా మార్గానికి సుకరములై, నా తత్త్వజ్ఞాన సముపార్జనలో సహాయకారులవుగాక! హే బ్రహ్మన్! నువ్వే ఈ ప్రపంచంలోని విశిష్ట శక్తిమంతమైన అనేక రూపాలలో వ్యక్తమవుతున్నావు. శరీర మానసాలను పవిత్రీకరించుకొని, తత్త్వజ్ఞాన ధారణకు వలసిన సమర్థతను గడించాలనే ఆకాంక్షతో నేను అగ్నిస్వరూపుడవైన నీకు ఆహుతులు వ్రేలుస్తున్నాను. నా పట్ల ప్రసన్నుడవుకమ్ము.!”*
ప్రార్థనా మంత్రాలు ఉచ్చరింపబడ్డ పిదప విరజాహోమం ప్రారంభమైంది. “భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే నాలోని పంచభూతాలు పవిత్రమగు గాక! ఈ ఆహుతి ప్రభావంతో రజోగుణ జనితమైన కళంకాల నుంచి ముక్తుడనై నేను జ్యోతిస్వరూపుడనౌతాను గాక – స్వాహా!
14. సన్న్యాస దీక్షకు ముందు అనుష్ఠించే విరజాహోమ భావార్థం
“ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం – నాలోని ఈ పంచ వాయువులు పవిత్రమగు గాక! ఈ ఆహుతి ప్రభావంతో రజోగుణ జనితమైన కళంకాల నుండి ముక్తుడనై నేను జ్యోతిస్వరూపుడనౌతానుగాక – స్వాహా!”. “అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ మరియు ఆనందమయ – ఈ పంచకోశాలు పవిత్రమగు గాక! ఈ ఆహుతి ప్రభావంతో అపవిత్రభావాలు, అజ్ఞానం నుండి ముక్తుడనై నేను జ్యోతిస్వరూపుడనౌతానుగాక – స్వాహా!”
“శబ్ద స్పర్శ రూప రస గంధాలనే ఇంద్రియాల ద్వారా నాలో ఉత్పన్నమైన సంస్కార సమూహాలు అన్నీ పవిత్రమగు గాక! ఈ ఆహుతి ప్రభావంతో రజోగుణ జనితమైన కళంకాల నుండి ముక్తుడనై నేను జ్యోతిస్వరూపుడనౌతాను గాక – స్వాహా!”
“నా మనోవాక్కాయ, కర్మాదులన్నీ పవిత్రమగు గాక! ఈ ఆహుతి ప్రభావంతో రజోగుణ జనితమైన కళంకం నుండి ముక్తుడనై నేను జ్యోతిస్వరూపుడనౌతాను గాక – స్వాహా!”
“ఎర్రని కళ్ళతో, అగ్ని శరీరంలో వసించేవాడా! జ్ఞాన ప్రాప్తితో ప్రతిబంధకాలనన్నింటినీ నాశనం చేసే పరమాత్మా! మేలుకో! హే ఇష్టార్థసిద్ధి ప్రదాయకా! తత్త్వజ్ఞాన మార్గంలో నాకు అడ్డంకులుగా ఉన్న విఘ్నాలనన్నిటినీ తొలగించు. అంతేగాక నాలోని పూర్వ జన్మకృత సంస్కార రాశి పరిశుద్ధమై, గురుముఖతా ఆలకించిన తత్త్వజ్ఞానం నాలో ఉదయింప చెయ్యి. ఈ ఆహుతి ప్రభావంతో రజోగుణ సంజనిత కళంకం నుండి ముక్తుడనై నేను జ్యోతిస్వరూపుడనౌతాను గాక – స్వాహా!”
“చిదాభాస బ్రహ్మస్వరూపుడనైన నేను, భార్య, బిడ్డలు, సంపద, గౌరవం, అందం, తదితరాలను ఆకాంక్షించే సమస్త వాసనలను ఈ అగ్నికి ఆహుతి చేయడం ద్వారా నిశ్శేషంగా త్యజిస్తాను గాక – స్వాహా!”
15. శిఖను, యజ్ఞోపవీతాన్ని త్యజించడం
ఆ రీతిలో ఆహుతులన్నీ సమర్పించబడిన పిదప “భూలోకం, స్వర్గ లోకం, తదితర లోకాలనన్నిటినీ పొందాలనే ఆకాంక్షను నేను ఈ క్షణం నుండి త్యజిస్తున్నాను, జగత్తులోని ప్రాణికోటులన్నిటికీ నా నుండి ఎలాంటి భీతీ కలుగకుండు గాక!” – అనే శపథంతో హోమకార్యం పరిసమాప్తమయింది. ఆ తరువాత శిఖాసూత్రాలను యథావిధిగా హోమాగ్నిలో ఆహుతించాక, అతిప్రాచీన కాలం నుండి పరంపరానుగతంగా వస్తూ ఉన్న సాధకుల సంప్రదాయం మేరకు గురువు ఇచ్చిన కౌపీనాన్ని, కాషాయ వస్త్రాలను ధరించి సన్న్యాసనామాన్ని* గ్రహించిన తరువాత (అంటే సన్న్యాసదీక్ష పరిసమాప్తమయ్యాక) తోతాపురి నుండి బ్రహ్మజ్ఞానోపదేశాన్ని ఆలకింప ఉద్యుక్తులయ్యారు శ్రీరామకృష్ణులు.
16. తోతాపురి ఉద్బోధ
సన్న్యాస దీక్ష ముగిశాక బ్రహ్మజ్ఞుడైన తోతాపురి అద్వైత వేదాంత ప్రసిద్ధమైన ‘నేతి, నేతి’ మార్గాన్ని అనుసరించి, బ్రహ్మస్వరూపంలో తాదాత్మ్యం చెంద శ్రీరామకృష్ణులను ప్రేరేపిస్తూ ఇలా ఉద్బోధ గావించాడు: “నిత్య – శుద్ధ – బుద్ధ – ముక్త స్వభావం కలిగినదీ, దేశకాల నిమిత్తాల ద్వారా సర్వదా అవిచ్ఛిన్నమైనదీ అయిన పరబ్రహ్మ మొక్కటే నిత్యసత్యం. అసాధ్యాన్ని సాధ్యంచేసే శక్తిగల మాయ తన ప్రభావంతో ఆ పరబ్రహ్మని నామరూపాల ద్వారా ఖండితమైన దానిగా, పరిచ్ఛిన్నమైన దానిగా కనబరుస్తూన్నప్పటికీ అది ఏనాడూ అలా కానేరదు. కారణం: నిర్వికల్పసమాధిలో, మాయా జనితమైన ఈ దేశకాలాదులు, నామరూపాలు బిందుమాత్రంగానైనా అనుభూతానికి రావు. కాబట్టి నామ రూపాల పరిధిలోని ఏ వస్తుమా ఎన్నటికీ నిత్యవస్తువు కాజాలదు. కనుక నామరూపాత్మకాలైన ఈ అనిత్య వస్తువులను పరిత్యజించు. నామరూపమనే పంజరాన్ని సింహసదృశ పరాక్రమంతో బ్రద్దలుకొట్టి దాని నుండి బయటకు రా. నీలోనే నెలకొని ఉన్న ఆత్మతత్త్వాన్వేషణలో మునిగిపో. సమాధి సహాయంతో స్వాత్మలో వసించు. అప్పుడు నామరూపాత్మకమైన జగత్తు శూన్యంలో అదృశ్యం కావడం నువ్వు గాంచుతావు. ఈ క్షుద్రమైను ‘నేను’ అనే జ్ఞానం విరాట్టులో లీనం కాగా, అఖండ సచ్చిదానందాన్ని స్వస్వరూపంగా ప్రత్యక్ష సాక్షాత్కారం చేసుకోగలవు. ‘ఏ జ్ఞానంతో ఒక వ్యక్తి మరోవ్యక్తిని చూస్తాడో, తెలుసుకొంటాడో, వింటాడో – ఆ జ్ఞానం అల్పం, క్షుద్రం, ఏది అల్పమో అది తుచ్ఛం. దానిలో పరమానందం లేదు. కాని ఏ జ్ఞానాన్ని సముపార్జించి ఒక వ్యక్తి ఇతరులను చూడడో, తెలుసుకొనడో, వినడో – అది భూమజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. అదే పరమానందదాయకం. ఎవడు సర్వులలోను సర్వదా విజ్ఞాతుడిగా ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ పరమాత్మను ఏ పరిమిత మనోబుద్ధులు తెలుసుకోజాలవు.”*
17. శ్రీరామకృష్ణులకు నిర్వికల్ప సమాధి సిద్ధించడం
శ్రీ తోతాపురి వివిధ ఉపదేశాల ద్వారా, యుక్తి తర్కాల ద్వారా, శాస్త్ర బోధనల ద్వారా ఆనాడు శ్రీరామకృష్ణులను సమాధిస్థితి పొందింప ప్రయత్నించాడు. తోతాపురి ఆ రోజు తాను యావజ్జీవితం కఠోర సాధనలు చేసి సిద్ధించుకొన్న అద్వైత చైతన్య స్థితిలో శ్రీరామకృష్ణులను వెంటనే అవస్థితులను చేయ బద్ధకంకణుడైనట్లు ప్రయత్నించాడు. ఆ విషయం మేము గురుదేవుల నుండి తెలుసుకొన్నాం. ఆయన ఇలా అన్నారు: “దీక్షానంతరం దిగంబరుడు నానాసిద్ధాంత వాక్యాలను ఉపదేశించసాగాడు. మనస్సును సమస్త విషయాల నుండి సంకల్పరహితం చేసుకొని ఆత్మధ్యానంలో నిమగ్నం చేయమని చెప్పాడు. కాని ధ్యానానికి కూర్చున్న నేను ఎంత ప్రయత్నించినా మనస్సును నిర్వికల్పం చేయడంలోనూ, నామరూపాల ఆవరణను దాటిపోవడంలోనూ కృతకృత్యుణ్ణి కాలేకపోయాను. ఇతర విషయాలన్నిటి నుండి సులభంగానే మనస్సు ఉపసంహరణ చెందింది. కాని అలా ఉపసంహరణ చెందిన తక్షణమే చిరపరిచితమైన జగజ్జనని చిద్ఘన సజీవమూర్తి దాని ఎదుట దేదీప్యమానంగా ప్రకాశిస్తూ గోచరించగా, నా మనస్సు నామరూపాలను అతిక్రమించి పోజాలకపోయింది. అద్వైత బోధనలను ఆలకించి ధ్యానానికి ఆసీనుడనై ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రతిసారీ అట్లే జరగడంతో ఇక నిర్వికల్ప సమాధిని ఎన్నటికీ పొందలేననే నిస్పృహ నాలో జనించింది. పిదప నేను కళ్ళు తెరిచి దిగంబరుడితో, ‘లేదు, అది సాధ్యం కాదు. మనస్సును పూర్తిగా వికల్పరహితం చేసి ఆత్మధ్యానంలో మగ్నం కావడం నాకు అసాధ్యం’ అని అన్నాను. ఆ మాటలకు దిగంబరుడు నన్ను చీవాట్లుపెడుతూ ఆవేశంతో, ‘ఏమిటీ? సాధ్యం కాదా?’ అంటూ కుటీరంలో అటూ ఇటూ పరికించి పగిలిన ఒక గాజు పెంకును చూశాడు. దాన్ని తీసుకొని సూది వంటి దాని మొనతో బలవంతంగా కనుబొమల మధ్య గ్రుచ్చి, ‘నీ మనస్సును ఈ బిందువుపై కేంద్రీకరించు’ అన్నాడు. నేనప్పుడు దృఢసంకల్పంతో ధ్యానానికి కూర్చున్నాను. మళ్ళీ వెనుకటిలా మనస్సులో జగన్మాత రూపం ప్రత్యక్షమైన మరుక్షణమే జ్ఞానాన్ని కత్తిగా ఎంచుకొని మానసికంగా ఆ మూర్తిని రెండుగా ఖండించి వేశాను. అప్పుడు మనస్సులో ఇక ఏ సంకల్పములు మిగిలి ఉండకపోవడంతో అది సమస్త నామరూపాత్మకమైన జగత్తును దాటి రివ్వున పైకి ఎగసిపోగా, నేను సమాధిమగ్నుడనైనాను” అని గురుదేవులు సమాధి స్థితిని చిత్రీకరించినట్లు మాకు తెలియజేశారు.
18. తోతాపురి, శ్రీరామకృష్ణులకు కలిగిన నిర్వికల్ప సమాధిని నిర్ధారించడం – విస్మయం చెందడం
శ్రీరామకృష్ణులు పైన వర్ణించిన రీతిలో సమాధిమగ్నులై ఉన్నప్పుడు తోతాపురి చాలాసేపు ఆయన ప్రక్కనే కూర్చుండిపోయాడు. పిదప కుటీరం వెలుపలకు వచ్చాడు. తనకు తెలియ కుండా ఎవరైనా కుటీరంలో ప్రవేశించి శ్రీరామకృష్ణులకు విఘ్నం కలిగిస్తారేమోనని తలుపుకు తాళం బిగించాడు. ఆ తరువాత సమీపంలోని పంచవటి క్రింద ఉన్న తన ఆసనంపై కూర్చుని తలుపు తెరిచే నిమిత్తం శ్రీరామకృష్ణుల పిలుపుకై నిరీక్షించసాగాడు.
పగలు గడిచిపోయి, రాత్రి అయింది. మెల్లగా ప్రశాంతంగా రోజులు దొర్లాయి. మూడు రోజులు గడిచిపోయాక కూడా తలుపు తెరవమనే పిలుపు రానందున తోతాపురి విస్మయ ఆరాటాలతో కుటీరం తలుపు తెరవడానికై తన ఆసనం నుండి లేచాడు. తన శిష్యుని స్థితిని తెలుసుకోగోరి తోతాపురి కుటీరంలోకి వెళ్ళాడు. తను ఏ భంగిమలో కూర్చోబెట్టి వెళ్ళాడో అదే భంగిమలో శ్రీరామకృష్ణులు కూర్చొని ఉండడం చూశాడు. దేహంలో ప్రాణం నిలిచివున్న జాడ ఏమీ అగపడడంలేదు. కాని ఆయన ముఖమండలం ప్రశాంత గంభీరమై, తేజోరాశిలా ప్రకాశిస్తూ ఉన్నది. బాహ్యజగత్తు పరంగా శిష్యుడు పూర్తిగా మృతప్రాయుడు. గాలిలేని చోట చలించని దీపంలా అతడి మనస్సు బ్రహ్మంలో లీనమై ఉన్నదని గురువు గ్రహించాడు.
సమాధి మర్మాల నెరిగిన తోతాపురి స్తంభీభూతుడై ఇలా భావించాడు: ‘నా ముందు జరిగింది వాస్తవమేనా? నలభై సుదీర్ఘ సంవత్సరాల కఠోర సాధనతో నేను సముపార్జించినది ఈ మహాపురుషుడు ఒక్క రోజులోనే సాధించగలిగాడా?’ సందేహాస్పదుడైన తోతాపురి, శ్రీరామకృష్ణుల పరిస్థితిని పరీక్షించి, ఆయన దేహంలో వ్యక్తమవుతున్న లక్షణాలను సునిశితంగా పరిశీలించనెంచాడు. గుండె కొట్టుకొంటూ ఉన్నదో లేదో, లేశమాత్రమైనా ఊపిరి నాసికా రంధ్రాల నుండి వస్తూ ఉన్నదో లేదో అతడు పరీక్షించాడు. కొయ్యదుంగలా స్థిరంగా అవస్థితమై ఉన్న శిష్యుడి దేహాన్ని మళ్ళీ మళ్ళీ స్పృశించి చూశాడు. కాని దానిలో ఎలాంటి వికారంగాని, విలక్షణం గాని, బాహ్యచైతన్యంగాని కనిపించలేదు. విస్మయానంద పరవశుడైన తోతాపురి ఇలా కేకపెట్టాడు: “ఇది దైవమాయయా? నిజంగానే ఇది సమాధియా? వేదాంతంలో పేర్కొనబడిన జ్ఞానమార్గంలో తుట్టతుది ఫలమైన నిర్వికల్ప సమాధియా ఇది? హా! దైవమాయ ఎంత విచిత్రమైనది!”
19. శ్రీరామకృష్ణులను సమాధిస్థితి నుండి బాహ్య స్పృహలోకి తేవడానికి తోతాపురి చేసిన ప్రయత్నం
పిదప తోతాపురి, సమాధిస్థితిలో ఉన్న శిష్యుణ్ణి బాహ్యచేతనలోకి తీసుకువచ్చే కార్యం చేపట్టాడు. ‘హరిః ఓం, హరిః ఓం’ అనే అతడి మేఘగంభీర కంఠస్వరంతో పంచవటి ప్రాంతం మార్మ్రోగసాగింది. శిష్యుడి పట్ల ప్రేమాకర్షితుడై నిర్వికల్పసమాధిలో అతణ్ణి సుప్రతిష్ఠుణ్ణి చేయడానికై తోతాపురి రోజులు, నెలల తరబడి దక్షిణేశ్వరంలోనే ఎలా గడిపాడో, శ్రీరామకృష్ణుల సహాయంతో స్వకీయ ఆధ్యాత్మిక జీవనం ఎలా మరింత పరిపూర్ణమైనదో – ఆ వృత్తాంతం మరొక చోట* మేం వివరించడం జరిగింది.
అవిచ్ఛిన్నంగా పదకొండు నెలల కాలం దక్షిణేశ్వరంలో గడిపిన పిదప తోతాపురి భారతదేశ పశ్చిమ ప్రాంతాలకు బయలుదేరాడు. ఈ సంఘటన జరిగిన అనతికాలంలోనే నిరంతరం నిర్వికల్ప అద్వైత భూమిలో నెలకొని ఉండాలనే దృఢసంకల్పం శ్రీరామకృష్ణుల మనస్సులో జనించింది. ఆయన ఆ సంకల్ప అభీష్టం ఎలా నెరవేరిందో, సామాన్య సాధకుల మాట అలా ఉంచి, అవతారపురుషుల కంటే కాస్త తక్కువ స్థాయిలోని, ‘అధికారిక పురుషులు’ కూడ ఏ అత్యున్నత అద్వైత భూమిలో ఎక్కువ కాలం నెలకొని ఉండలేరో, ఆ అద్వైత భూమిలో ఆయన ఎలా నిరవచ్ఛిన్నంగా ఆరు నెలల కాలంపాటు వసించారో, ఆ సమయంలో ఒక సాధువు కాళికాలయానికి ఏతెంచి శ్రీరామకృష్ణులను చూసి వారి ద్వారా భవిష్యత్తులో మహోత్కృష్ట లోక శ్రేయస్సు కలుగనున్నదని గ్రహించి ఆరు నెలల కాలం అక్కడే ఉండి వివిధోపాయాల ద్వారా ఆయన శరీరాన్ని పరిరక్షించి, అక్కడి నుండి వెళ్ళిపోయాడో – ఈ వివరాలన్నింటినీ మరొకచోట* తెలిపాం.
కాబట్టి శ్రీరామకృష్ణుల కృపాతిశయంతో మథురనాథ్ జీవితంలో జరిగిన ఒకానొక విశేష సంఘటనను ఇక్కడ ప్రస్తావించి ఈ అధ్యాయాన్ని పూర్తిచేస్తాం.
20. ప్రాణాంతకమైన రోగం నుండి జగదంబా దాసిని శ్రీరామకృష్ణులు రక్షించడం
శ్రీరామకృష్ణులలో వ్యక్తమయ్యే అద్భుత దైవీశక్తులను చూసి ఆయన పట్ల మథురనాథ్ భక్తివిశ్వాసాలు అప్పటికే మరింతగా ఇనుమడించాయి. ఈ సమయంలో జరిగిన ఒక సంఘటన అతడి భక్తిని సుదృఢమూ, అచంచలమూ గావించి శ్రీరామకృష్ణులకు అతణ్ణి సంపూర్ణ శరణాగతుణ్ణిగా చేసి వేసింది. మథురనాథ్ రెండవ భార్యయైన శ్రీమతి జగదంబా దాసి రక్తగ్రహణి వ్యాధి గ్రస్తురాలైంది. వ్యాధి క్రమంగా విషమించింది. కలకత్తాలోని సుప్రసిద్ధ వైద్యులు, (ఆయుర్వేద) కవిరాజులు మొదట్లో ఆమె ప్రాణానికే ముప్పు అని భయపడ్డారు, పిదప పెదవులు విరిచారు.
మథురనాథ్ పుట్టుకతో పేదవాడైనప్పటికీ ఎంతో అందగాడైనందున రాణీ రాస్మణి తన మూడవ కుమార్తె కరుణామయి నిచ్చి వివాహం చేసిందని శ్రీరామకృష్ణుల ముఖతా మేం వినివున్నాం. కరుణామయి మరణించడంతో రాణీ రాస్మణి తన ఆఖరికుమార్తె జగదంబా దాసిని మథుర్నాథ్ కిచ్చి వివాహం చేసింది. వివాహానంతరం మథుర్ పరిస్థితిలో గొప్ప మార్పువచ్చింది. అనతికాలంలోనే అతడు తన వివేక కౌశలాదులతో రాణికి కుడిభుజం అయ్యాడు. రాణీ రాస్మణి మరణానంతరం ఆమె జమీపై యావత్తు ఆజమాయిషీ అతడి పరం ఎలా అయిందో ఆ వృత్తాంతం లోగడే చెప్పుకొన్నాం.
ప్రస్తుతం తన ప్రియాతిప్రియమైన భార్య జగదంబా దాసిని కోల్పోవడమేగాక, జమీపై తను చలాయించే ఆజమాయిషీనీ వదలుకోవాల్సిన పరిస్థితి మథుర్కి ఎదురైంది. వైద్యులు పెదవి విరిచినప్పటి అతడి మనఃస్థితిని గురించి ఎక్కువగా చెప్పనవసరం లేదు. మథుర్ అపరిమిత ఆందోళనకు గురై దక్షిణేశ్వరానికి వచ్చి జగన్మాతకు ప్రణమిల్లి శ్రీరామకృష్ణులను వెతుక్కుంటూ పంచవటి కేసి వచ్చాడు. అతడి గాబరా స్థితిని చూసి శ్రీరామకృష్ణులు అతణ్ణి ఆప్యాయంగా తన ప్రక్కన కూర్చోపెట్టుకొని, కారణం ఏమిటని అడిగారు. మథుర్ ఆయన పాదాలపై వ్రాలిపోయి, కంట నీరు పెట్టుకొని దుఃఖంతో విషయం అంతా ఆయనకు తెల్పి దీనాతిదీనంగా ఇలా అన్నాడు: “దుర్ఘటన సంభవించబోతోంది. కాని దాని గురించే కాక, బాబా! ఇక మీదట నిన్ను సేవించుకొనే భాగ్యాన్ని కోల్పోతున్నందుకు ఎంతో బాధ పడుతున్నాను.”
మథుర్ దైన్యావస్థను చూసి శ్రీరామకృష్ణుల హృదయం కరుణతో నిండిపోయింది. ఆయన భావసమాధిలోకి వెళ్ళి, మథుర్‌తో, “భయపడకు! నీ భార్యకు నయం అవుతుంది” అన్నారు. శ్రీరామకృష్ణులను సాక్షాత్తూ భగవంతుడని విశ్వసించిన మథుర్, శ్రీరామకృష్ణుల అభయ ప్రదానంతో సజీవుడైనట్లుగా భావించి, నాటికి ఆయన నుండి సెలవు పుచ్చుకొన్నాడు. జాన్బజార్లోని తన గృహాన్ని చేరుకోగానే జగదంబా దాసి ఆరోగ్యం ఆకస్మికంగా మెరుగవడం మథుర్ గమనించాడు. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు: “నాటి నుండి జగదంబా దాసి నెమ్మదిగా కోలుకోసాగింది. ఆ వ్యాధివల్ల ఆమె అనుభవించవలసిన బాధనంతా ఈ దేహం (తమ శరీరాన్ని చూపిస్తూ) భరించింది. జగదంబా దాసికి నయం అయిన కారణంగా రక్తగ్రహణి ఇత్యాది వ్యాధులతో నేను ఆరు నెలలపాటు బాధలను అనుభవించాను.”
మథుర్ ఒనరించిన అద్భుత సేవలను గురించి ముచ్చటిస్తూ శ్రీరామకృష్ణులు ఒక రోజు పై సంఘటనను ప్రస్తావించి, “ఊరకే పధ్నాలుగు సంవత్సరాలు మథుర్ నాకు సేవలు ఒనరించాడా? దీని (తన దేహాన్ని చూపుతూ) ద్వారా జగజ్జనని అతడికి ఎన్నో అద్భుతశక్తులను దర్శింపచేసింది. అందుకే అతడు అంత భక్తిప్రపత్తులతో నన్ను సేవించాడు” అని అన్నారు.