1. ఆధ్యాత్మిక భావాలలో నెలకొని ఉండడమే శ్రీరామకృష్ణుల స్వాభావికత
పవిత్ర, ఏకాగ్రచిత్తంలో ఎప్పుడు ఏ భావం ఉదయిస్తుందో, దాన్లో పరిపూర్ణంగా శ్రీరామకృష్ణులు నెలకొని ఉండేవారు. అప్పుడు ఆ భావం ఆయన మనస్సును ఆసాంతం ఆవరించుకొని ఇతర భావాలనన్నిటినీ లుప్తం చేసేది. అంతే గాక ఆయన శరీరాన్ని ఆ భావ పూర్ణప్రకటనకు అనువైన సమగ్ర పరికరంగా మార్చివేసేది. మనం ఆయన జీవితాన్ని పరికించినప్పుడు, ఈ మానసిక విలక్షణత బాల్యంనుండీ ఆయనలో ఉండడాన్ని కనుగొనవచ్చు. మేం దక్షిణేశ్వరానికి రాకపోకలు చేసే కాలంలో ఆయన ఈ ప్రవృత్తిని అనునిత్యం గమనించే వాళ్ళం. భక్తి సంగీతాన్ని వింటున్నప్పుడో లేదా మరో కారణంగానో ఆయన మనస్సు ఏదో ఒక ప్రత్యేక భావంలో నిమగ్నమై ఉన్నప్పుడు, ఇతర భావాలకు అనుగుణమైన సంగీతాన్ని గాని, ప్రసంగాన్ని గాని ఎవరైనా ప్రారంభిస్తే ఆయన తీవ్రమైన బాధకు లోనవడం మేం చూశాం. ఒకే దిశగా ప్రవహిస్తూవున్న చిత్తవృత్తుల గతి హఠాత్తుగా మరో భావానికి అనుగుణమైన సంగీతం లేక ప్రసంగ ప్రవేశంతో నిరోధింపబడడమే ఆయన అలా బాధపడడానికి హేతువు. ఏదేని ఒకే ఒక్క భావం మీద చిత్తవృత్తులన్నీ ఏకాగ్రం అయ్యేస్థితిని సవికల్ప సమాధిగా పతంజలి ఋషి అభివర్ణించారు. భక్తి గ్రంథాలన్నీ దీన్నే భావసమాధిగా పేర్కొంటున్నాయి. శ్రీరామకృష్ణుల మనస్సు చిన్ననాటి నుంచీ అలాంటి పారవశ్య స్థితిలో నెలకొని ఉండేదని ఇందుమూలంగా స్పష్టంగా తెలియవస్తోంది.
2. శ్రీరామకృష్ణులపై సాధనల పరిణామాలు
ఆధ్యాత్మిక సాధనలు ప్రారంభించినప్పటి నుంచీ పైన తెలిపిన ఆయన మానసిక విలక్షణత మరొక కొత్త అపూర్వ మార్గాన్ని అనుసరించింది. ఎందుకంటే తొలిరోజుల్లోలాగా ఆయన మనస్సు ఇప్పుడు ఏదైనా ఒక భావంలో ఒకింత కాలమే నెలకొని, ఆ పిదప మరొక భావంలోకి ప్రవేశించడం లేదు. ఒక భావంలోనే నెలకొని పురోగతి గాంచి ఆ భావపు పరాకాష్ఠను చేరి, భావాతీతమైన అద్వయ స్థితిని అస్పష్టంగానైనా అనుభవించేటంత వరకు ఆ భావంలోనే స్థిరంగా ఆయన మనస్సు నిమగ్నమై ఉండసాగింది. పై విషయానికి ఉదాహరణలుగా కొన్ని సంఘటనలు పేర్కొనవచ్చు. దాస్యభావ సాధనను అనుష్ఠిస్తున్నప్పుడు దాని పరాకాష్ఠను చేరనంతకాలం శ్రీరామకృష్ణులు అపత్య (తాను జగన్మాత కుమారునిగా) భావసాధనను చేపట్టలేదు. అదే విధంగా అపత్య భావసాధనలో సిద్ధిని పొందనంత వరకు ఆయన వాత్సల్య, మధుర భావ సాధనానుష్ఠానాలను ప్రారంభించలేదు. శ్రీరామకృష్ణుల సాధన చరిత్రను అధ్యయనం చేసినప్పుడు సర్వత్రా ఇలాగే జరిగినదనడానికి అనేక దృష్టాంతాలు మనకు అగుపడతాయి.
3. మధురభావ సాధనకు పూర్వం ఆయన వైఖరి
భైరవీ బ్రాహ్మణి అరుదెంచిన సమయంలో శ్రీరామకృష్ణుల మనస్సు భగవంతుణ్ణి తల్లిగా చూసే మాతృభావంతో నిండిపోయి ఉంది. ప్రపంచంలోని ప్రతి ప్రాణిలోను, ప్రతి పదార్థంలోను, విశేషంగా ప్రతి స్త్రీలోను ఆయన సాక్షాత్తూ జగన్మాతృ స్వరూప వ్యక్తీకరణను గాంచేవారు. అందుచేతనే భైరవీ బ్రాహ్మణిని చూసిన క్షణంలో ఆమెను ‘అమ్మా’ అని సంబోధించారు. తాను, ఆమె కుమారుడినని పూర్తిగా విశ్వసించారు. కొన్ని సమయాల్లో ఆమె అంకంలో కూర్చుని ఆమె చేతితో ఆహారం స్వీకరించేవారు. ఈ కాలంలో బ్రాహ్మణి కొన్ని సమయాల్లో వ్రజ గోపికల భావంలో తన్మయురాలై మధురభావాన్ని వ్యక్తీకరించే పాటలను పాడేదనీ, శ్రీరామకృష్ణులకు అది నచ్చక ఆ పాటలను ఆపి మాతృభావాన్ని ప్రకటించే గీతాలను పాడమని ఆమెను కోరే వారనీ హృదయ్ ద్వారా మేం వినడం జరిగింది. బ్రాహ్మణి కూడ శ్రీరామకృష్ణుల మానసిక స్థితిని చక్కగా అవగతం చేసుకొని తక్షణం జగన్మాత సఖీభావాన్నో లేదా దాసీభావాన్నో వ్యక్తం చేసే గీతాలాపన ప్రారంభించేది. లేదా బాలగోపాలుని పట్ల యశోద హృదయంలో పొంగిపొరలే వాత్సల్యం వ్యక్తీకరించే పాటలను పాడసాగేది. ఈ సంఘటనలు శ్రీరామకృష్ణులు మధురభావ సాధనను ప్రారంభించడానికి ఎంతోకాలం మునుపు జరిగినవి. ఈ సంఘటనల ద్వారా ఆయన తరచూ అన్నట్లుగా ‘నా మానసిక ఆవాసంలో ఎన్నడూ కపటం చోటుచేసుకోలేదు’ అన్న ఆయన పారదర్శక నిష్కాపట్యం తేటతెల్లమవుతోంది.
4. శ్రీరామకృష్ణుల సాధనలు శాస్త్ర సమ్మతాలే!
శ్రీరామకృష్ణులు దాస్యభావ సాధనను, వాత్సల్యభావ సాధనను చేపట్టిన ఉదంతాలను మనం ఇదివరకే చూసివున్నాం. ప్రస్తుతం ఆయన మధురభావ సాధనమార్గంలో అడుగిడి ఏ అనుష్ఠానాలలో నిమగ్నమయ్యారో వాటిని వివరిస్తున్నాం. మనం చదువురాని వాళ్ళను నిరక్షరకుక్షి* అంటాము. శ్రీరామకృష్ణులు దాదాపు అలాంటి వారే! అయినా జీవితాంతం ఆయన శాస్త్రపరిజ్ఞానంతో ఉన్నారు అన్న సంగతి ఆయన జీవితాన్ని అధ్యయనం చేసినప్పుడు మనకు స్పష్టమౌతుంది. గురువును స్వీకరించడానికి మునుపు కేవలం తమ పవిత్ర అంతఃప్రేరణ ద్వారా మాత్రమే అనుష్ఠించిన సాధనలు ఏనాడూ శాస్త్రవిరుద్ధాలై ఉండలేదు. పైపెచ్చు శాస్త్రానుసారాలే అయినాయి. మానసికావాసంలో ఎన్నడూ కపటం చోటుచేసుకోక, పవిత్ర హృదయంతో భగవద్దర్శనం కోసం తీవ్ర పరితాపం పొందే సాధకుల చర్యలన్నీ అలాగే ఉంటాయని ఇందుమూలంగా సుస్పష్టమౌతూన్నది. అలా జరగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే శాస్త్రాలన్నీ ఈ విధంగానే సంకలనం కాబడినవనే సంగతి కాస్త యోచిస్తే మనకు తేటతెల్లమవుతుంది. సత్యసాక్షాత్కారార్థం మహాపురుషులు ఒనర్చిన సాధనలు, తద్ద్వారా వారికి కలిగిన దివ్యానుభూతులు – ఇవే తదనంతరం క్రోడీకరింపబడి ‘శాస్త్రాలు’ గా పేర్కొనబడుతున్నవి. ఏది ఏమైనా ప్రాపంచిక విద్యావిహీనులైన శ్రీరామకృష్ణులు శాస్త్రాలలో వర్ణింపబడిన అనుభూతులన్నీ యథాతథంగా సాక్షాత్కరించుకోవడం ద్వారా సకల శాస్త్రాల సత్యత్వం విశేష రూపంలో ప్రమాణీకరించబడింది. ఈ విషయాన్ని నిర్దేశించే వివేకానంద స్వామి “సకల శాస్త్ర సత్యత్వ నిరూపణార్థమే శ్రీరామకృష్ణులు ఈ సారి నిరక్షరాస్యులై అవతరించడానికి కారణం” అని నిర్దేశించి చెప్పారు.
5. శాస్త్రాల ధర్మాదేశాలను శ్రీరామకృష్ణులు పాటించడం
స్వాభావిక ప్రవృత్తితోనే ఆయన శాస్త్రమర్యాదలను పాటించారనే విషయానికి దృష్టాంతంగా విభిన్న భావప్రేరణలతో విభిన్న వేషభూషణాదులను ఒకదాని పిమ్మట ఒకటిగా గురుదేవులు ధరించడం మనం పేర్కొనవచ్చు. ఉపనిషత్తుల మూలంగా మన ఋషులు ఇలా ఉపదేశిస్తున్నారు: “తపసో వాప్యలింగాత్”* – కేవలం తపస్సు ద్వారా మాత్రమే ఆత్మసాక్షాత్కారం కలుగదు. కాషాయ వస్త్రధారణం వంటి బాహ్యచిహ్నాలు అవసరమే! శ్రీరామకృష్ణుల జీవితంలో కూడ మనకు కనబడుతున్నది ఏమిటంటే ఆయన ఎప్పుడు ఏ విధమైన భావసాధనలో నియుక్తులై ఉంటే, అప్పుడు అంతఃప్రేరణ ద్వారా మొదట్లోనే ఆ భావసాధనకు ఉపయుక్తమైన వేషభూషణాదులను, బాహ్యచిహ్నాలను ధరించేవారు. ఉదాహరణకు తాంత్రిక మాతృభావ సాధన అనుష్ఠిస్తున్నప్పుడు దాన్లో సిద్ధిని పొందడానికై ఎరుపు వస్త్రాలు, విభూతి, సిందూరం, రుద్రాక్షమాలలు ధరించారు. వైష్ణవ మార్గానికి చెందిన భక్తిసాధనలు చేస్తూన్నప్పుడు ప్రసిద్ధమైన సాంప్రదాయిక తెల్లని వస్త్రం, తెలుపు చందనం, తులసీమాలను ధరించేవారు. అద్వైత వేదాంత సాధనను చేపట్టినప్పుడు సిద్ధికాములై శిఖను, యజ్ఞోపవీతాన్ని త్యజించి, కాషాయాంబరాలు ధరించేవారు. పురుష భావంతో సాధనలు చేస్తూన్నప్పుడు ఆయన ఎలా పురుషోపయుక్తమైన వివిధ దుస్తులు ధరించారో, అలాగే స్త్రీలకు ఉచితమైన సఖీభావాది సాధనలను చేయబూనినప్పుడు స్త్రీలకు ఉపయుక్తమైన చీరలు, ఆభరణాలు ఇత్యాదులు ధరించడానికి ఆయన ఏమాత్రం సంకోచించేవారు కాదు. సిగ్గు, ద్వేషం, భయం, జన్మ పరంపరాగతంగా వస్తూన్న జాతి, కుల, శీల, మానాది అష్టపాశాలను త్యజించకుంటే ఎవ్వరూ ఎన్నడూ భగవత్సాక్షాత్కారాన్ని పొందలేరని శ్రీరామకృష్ణులు మాకు పదే పదే ఉపదేశించేవారు. స్వయంగా ఆయన ఆ ఉపదేశాన్ని జీవితాంతం మనోవాక్కాయ కర్మల ద్వారా ఆచరించారనే సంగతి, సాధన కాలంలో వివిధ వేషభూషణాదులు ధరించడం నుండి ఆయన ప్రతి చర్యనూ శ్రద్ధగా గమనించినప్పుడు మనకు సుస్పష్టమవుతుంది.
6. మధురభావ సాధన కాలంలో శ్రీరామకృష్ణుల స్త్రీ వేషధారణ
మధురభావ సాధనలో నిమగ్నులై ఉన్నప్పుడు, శ్రీరామకృష్ణులు స్త్రీలకు ఉచితమైన వేషభూషణాదులు ధరింప ఉద్యుక్తులయ్యారు. పరమ భక్తుడైన మథుర్ ఆయన అభిలాష నెరిగి ఒక్కోసారి అతి విలువైన వారణాసి చీరలను, రవికె, గజ్జెలు, ఉంగరాలు, ఇత్యాదులు తెప్పించి వాటితో ఆయనను అలంకరింపచేసి మహదానందాన్ని పొందాడు. తన బాబా స్త్రీ వేషం సమగ్రంగా, సర్వాంగ సుందరంగా అమరడానికై దీర్ఘమైన కృత్రిమ జడను, తదనుగుణమైన సువర్ణ ఆభరణాలను ఆయనకు అలంకరింప చేసేవాడు. మథుర్ ఈ బహూకరణల ఏర్పాటు దురాత్ములు కొందరికి శ్రీరామకృష్ణుల త్యాగశీలతపై కళంకాన్ని ఆపాదించే అవకాశాన్ని కలుగచేసిందని విశ్వసనీయంగా మాకు తెలియవచ్చింది. కాని శ్రీరామకృష్ణులు, మథుర్ ఆ మాటలను ఏమాత్రం లక్షించలేదు. తన బహూకరణలు బాబాకు సంతృప్తి నివ్వడం మథుర్ను ఎంతగానో ఆనంద పరచింది. అతడి దృష్టిలో ఆ బహూకరణల ఔచిత్యం సార్థకమైంది. ఇక శ్రీరామకృష్ణులు కూడ అలా స్త్రీల వేషభూషణాదులతో అలంకృతులై శ్రీకృష్ణ ప్రేమ విహ్వలురైన వ్రజ గోపికల భావంలో ఎంత తాదాత్మ్యులైపోయారంటే తమ ‘పురుష దేహ’ ధ్యాసను పూర్తిగా మరచిపోయారు. ఆయన ప్రతి ఆలోచనా, మాటా, నడకా మొదలైన చేష్టలన్నీ స్త్రీలని పోలి ఉండేవి. మధుర భావ సాధనను అనుష్ఠిస్తున్నప్పుడు ఆరు నెలల కాలం ఆయన అలాగే స్త్రీ వేషధారణలో ఉండిపోయారని ఆయన ముఖతా మేం విన్నాం.
7. స్త్రీల లక్షణాలు ఆయనలో అభివ్యక్తమవడం
శ్రీరామకృష్ణులలో పురుష – స్త్రీ ప్రవృత్తులు అద్భుత రీతిలో సమ్మేళనమై ఉండడాన్ని మరోచోట పేర్కొన్నాం. కాబట్టి స్త్రీ వేషధారణ ద్వారా ఆయన మానసంలో ప్రస్తుతం స్త్రీ స్వభావం ఉద్దీపించడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. కాని ఆ స్త్రీభావ ప్రేరణ ద్వారా ఆయన ప్రవర్తన, మాట, నవ్వు, కడగంటి చూపు, భావసూచనలు తదితర మనశ్శరీరాల అన్ని చేష్టలూ అచ్చం స్త్రీల మాదిరిగా మారిపోతాయని ఎవరూ, ఎన్నడూ ఊహించటం కూడ కష్టం. ఐనా వాస్తవానికి అదలా జరిగిందనే సంగతిని స్వయంగా మేము శ్రీరామకృష్ణుల నుండి, హృదయ్ నుండి కూడ పలుమార్లు విన్నాం. మేం దక్షిణేశ్వరానికి రాకపోకలు చేస్తున్న కాలంలో ఎన్నో సార్లు ఆయన స్త్రీ హావభావాలను అభినయించడం చూడటం జరిగింది. ఈ అనుకరణలుఎంత స్వభావ సిద్ధంగా, సమగ్రంగా ఉండేవంటే స్త్రీలు కూడ వాటిని చూసి విస్మయం చెందేవారు.
8. మథుర్ కుటుంబంలో మిత్రురాలిగా శ్రీరామకృష్ణులు
ఆ కాలఘట్టంలో శ్రీరామకృష్ణులు ఒక్కోసారి జాన్బజారులోని రాణీ రాస్మణి గృహానికి వెళ్ళి మథుర్ కుటుంబ స్త్రీలతో కలిసి అంతఃపురంలో నివసించే వారు. కామగంధం లేశమైనాలేని ఆయన పావన చరితం ప్రత్యక్షంగా ఎరిగిన ఆ స్త్రీలు ఆయనను సాక్షాత్తు దైవంగా భావించేవారు. అంతేగాక శ్రీరామకృష్ణులు ఇప్పుడు ఆ స్త్రీజనం శ్రీరామకృష్ణుల స్త్రీజనోచిత నడవడి, వర్తన తమతో ఏకాత్మికమవడం గాంచి మంత్రముగ్ధులైనారు. అందుచేత వారు ఆయనను ఒక స్త్రీగా భావించసాగారు. ఆయన సమక్షంలో వారు ఎలాంటి స్త్రీ సహజమైన సంకోచాన్నీ ప్రదర్శించేవారు కారు.* మథుర్ కుమార్తెలలో ఒకరి భర్త ఈ సమయంలో జాన్ బజార్ ఇంటికి రావడం తటస్థించినప్పుడు శ్రీరామకృష్ణులు స్వయంగా మథుర్ కుమార్తె తల దువ్వి, వేషభూషణాదులతో అలంకరించి, భర్తను ఎలా వినోదింపచేయాలో వివిధ రీతుల ఆమెకు ఉపదేశించి, ఆమె చేయి పుచ్చుకొని మిత్రురాలి మాదిరి పడక గదిలోకి తీసుకువెళ్ళి ఆమె భర్త ప్రక్కన కూర్చోబెట్టి వచ్చేవారు. ఈ ఉదంతం మేం ఆయన ముఖతా వినడం జరిగింది. “ఆ స్త్రీజనం నన్ను తమ మిత్రురాలిగా చూడడంతో, వారెలాంటి సంకోచానికీ లోనుకాలేదు” అని గురుదేవులు చెప్పేవారు.
9. స్త్రీ వేషధారణలో శ్రీరామకృష్ణులను గుర్తించలేకపోవడం
“ఆ వేషధారణలో ఉన్న ఆయనను స్త్రీ జనం పరివేష్టించి ఉన్నప్పుడు ఆయన సన్నిహిత బంధువులు కూడ ఆయనను చప్పున గుర్తించలేకపోయేవారు” అని హృదయ్ చెప్పాడు. ఇంకా “ఆ సమయంలో ఒకరోజు మథుర్ నన్ను అంతఃపురంలోకి తీసుకువెళ్ళి ‘ఈ స్త్రీలలో నీ మామ ఎవరో గుర్తించగలవా?’ అని అడిగాడు. ఆయనతో చాలాకాలం కలిసి నివసించినప్పటికీ, అనునిత్యం ఆయనను సేవిస్తూన్నప్పటికీ వెంటనే ఆయనను గుర్తుపట్టలేకపోయాను. దక్షిణేశ్వరంలో ఆయన వసిస్తున్న ఆ కాలంలో మామ ప్రతిరోజూ తెల్లవారుజామున పువ్వుల బుట్ట పుచ్చుకొని తోటలో పువ్వులు కోస్తూవుండేవారు. అప్పుడు మేము జాగ్రత్తగా పరిశీలించి చూడగా, నడకసాగిన ప్రతిసారి ఆయన ఎడమ పాదం, స్త్రీవలె ముందుగా కదలడం గమనించాం. ‘శ్రీరామకృష్ణులు ఆ విధంగా పువ్వులు కోస్తూవున్నప్పుడు తరచు నేను అతణ్ణి రాధారాణిగా పొరబడేదాన్ని’ అని భైరవీ బ్రాహ్మణి చెబుతూవుండేది. పువ్వులను కోసి తీసుకొనివచ్చి, వాటితో చిత్రవిచిత్రమైన పూమాలలను కట్టి రాధా గోవిందులకు అలంకరించే వారు. అదేమాదిరి ఒక్కోసారి జగన్మాతను కూడా పూమాలలతో అలంకరించి వ్రజగోపికలు కాత్యాయనీదేవిని ప్రార్థించినట్లు శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక పతిగా పొందగోరి ఆర్తితో ప్రార్థించేవారు” అని హృదయ్ తెలిపాడు.
10. మధురభావ సాధనానుష్ఠాన కాలంలో భౌతిక మార్పులు
ప్రస్తుతం శ్రీరామకృష్ణులు ఒకవైపు జగజ్జననిని సేవిస్తూ, పూజిస్తూ మరో వైపు శ్రీకృష్ణ పరమాత్ముని దర్శనం అభిలషిస్తూ అతణ్ణి తన ఆధ్యాత్మిక పతిగా పొందగోరారు. తదుపరి అవిభాజ్య మానసంతో శ్రీకృష్ణ పాదారవిందాలను సేవిస్తూ, వ్యాకులతతో ప్రార్థిస్తూ, ప్రతీక్షతో కాలం గడపసాగారు. పగలు, రాత్రి ఒక్క క్షణకాలమైనా ఆ భావయుక్త ప్రార్థనలో అంతరాయం కలిగేది కాదు. రోజులు, పక్షాలు, నెలలు ప్రియతముని దర్శన ప్రతీక్షలో గడచిపోతున్నా నిరాశ, అవిశ్వాసం ఆయన హృదయాన్ని కించిత్తు కూడ విచలితం చేయలేక పోయాయి. ఆ ప్రార్థన క్రమంగా నిర్విరామ విలాపంగా మారింది. ఆ పరమ ప్రతీక్ష కాస్తా ఉన్మత్తతవంటి ఉత్కంఠగా, వ్యాకులతగా మారడంతో ఆయనకు నిద్రాహారాలు లుప్తమైనాయి. ఆ విరహ వేదనను వర్ణింప ఎవరి తరం? ప్రాణప్రియుడితో సర్వదా సంపూర్ణంగా కలిసి ఉండాలనే తపనలో అధిగమించలేని ఆటంకాలు ఎదురైనప్పుడు ఏ స్థితి మానవ హృదయాన్ని మథించి వేస్తుందో, శరీరేంద్రియాలను శుష్కింపచేస్తుందో ఆ విరహ వేదన భరింపజాలని మానసిక వ్యధగా వ్యక్తం కాసాగింది.అది శమింపక సాధన ప్రారంభంలో దుర్భరమైన శారీరక మంటగా, గతంలో కలిగిన అదే మంట మళ్ళీ శ్రీరామకృష్ణుల శరీరంలో ప్రారంభమైంది. వారి ముఖతా మేం ఇలా విన్నాం: శ్రీకృష్ణ విరహపు తీవ్రప్రభావ ఫలితంగా ఆయన శరీరపు ప్రతి రోమకూపం నుండి రక్తబిందువులు అప్పుడప్పుడు స్రవించసాగాయి. దేహంలోని కీళ్ళన్నీ పూర్తిగా సడలిపోయాయి. అపరిమిత హృదయ పరితాప కారణంగా ఇంద్రియాలు క్రియారహితాలై పోగా ఒక్కోసారి మృతప్రాయంగా చేష్టలుడిగి, స్పృహ కోల్పోయి చలనరహితమై పడివుండేవట.
11. శ్రీరామకృష్ణుల సర్వోత్కృష్ట ప్రేమ
దేహంతోటి తాదాత్మ్యం చెందే మనబోటి సామాన్యులం రెండు శరీరాల పరస్పర ఆకర్షణనే ప్రేమగా అర్థం చేసుకొంటాం. లేదా ఎంతో శ్రమించి ఈ స్థూలదేహాత్మ బుద్ధి నుండి ఒకింత పైకిపోయి, కొద్దిమంది సజ్జనుల దేహం ద్వారా ప్రకటితమయ్యే సద్గుణ సంపత్తి పట్ల ఆకర్షితులమైనప్పుడు దానిని అతీంద్రియ ప్రేమగా పేర్కొంటూ, దానినెంతో శ్లాఘిస్తూ ఉంటాం. కాని తరతరాల నుండి కవులు గానం చేసే ఆ అతీంద్రియ ప్రేమ నిజానికి స్థూలదేహబుద్ధి, సూక్ష్మభోగవాసనా రహితమైనది కాదని అవగాహన చేసుకోవడానికి ఎక్కువకాలం పట్టదు. శ్రీరామకృష్ణుల జీవితంలో వ్యక్తమైన ఆ దివ్యప్రేమతో పోల్చినప్పుడు అది ఎంతో నిరర్థకంగా, వ్యర్థంగా, ప్రయోజనశూన్యంగా కనబడుతుంది.
12. రాధా ప్రేమ గురించి భక్తి శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి?
శ్రీమతి రాధారాణి మాత్రమే ఈ సర్వాతిశయ ప్రేమను పరిపూర్ణంగా అనుభవంలోకి తెచ్చుకోగలిగిందని భక్తి గ్రంథాలు చాటుతున్నాయి. యావద్భక్తి సాహిత్యంలోను ఆమెకు సమానుడైన వ్యక్తి కానరాడు. కారణం: తన దైహిక, మానసిక సంతృప్తిని పూర్తిగా విస్మరించి సాంఘిక మర్యాదలను, ప్రజాభి ప్రాయాన్ని లక్షించక లజ్జ, ద్వేషం, భయాదులను ఆమె వదలి వేసేది. శ్రీకృష్ణుని ఆనందంలో మాత్రమే తాను ఆనందం అనుభవించడానికై జన్మ, కుల, సత్ప్రవర్తన, గౌరవ పదవులను ఆమె లెక్కించలేదు. వైష్ణవ శాస్త్రాల మేరకు ఏ జీవుడూ ఈ కోవకు చెందిన ప్రేమను పరిపూర్ణంగా తెచ్చుకోలేడు. ఈ దివ్యప్రేమను ఒకింత మాత్రమే శుకదేవుడు అనుభవంలోకి తెచ్చుకోగలిగాడు, అదీ రాధాదేవి అనుగ్రహం వల్ల మాత్రమే. అణుమాత్రమైనా కామగంధంలేని రాధాదేవి ప్రేమకు సాక్షాత్తుగా సచ్చిదానంద బ్రహ్మ స్వరూపుడైన ఆ కృష్ణుడు వశుడైనాడు. భక్తులకు తన దర్శనభాగ్యాన్ని ఆమె మనవి మేరకు కలిగించేవాడు. ఈ బోధనల అంతరార్థం: శ్రీమతి (రాధారాణి) అనుభవంలోకి తెచ్చుకొన్న సర్వాతిశయ ప్రేమను అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా ఎవ్వరూ భగవంతుని పతిగా భావించి పరిపూర్ణ ప్రేమ మాధుర్యాన్ని–మధురభావాన్ని పొందలేరు.
13. శ్రీ గౌరాంగుని సర్వోత్కృష్ట ప్రేమ
వ్రజరాణి శ్రీమతి రాధారాణి, శ్రీకృష్ణుని పట్ల ప్రదర్శించిన అసాధారణ ప్రేమ వైభవాన్ని మాయారహితుడైన పరమహంస చక్రవర్తి శుకదేవుడు, ఆత్మారాములైన ఇతర మునులు ఎంతగానో శ్లాఘించినప్పటికీ, భారతీయ జనసామాన్యం తమ జీవితాలలో ఆ ప్రేమను ఎలా పొందాలో చాలాకాలం వరకు తెలుసుకోలేకపోయారు. ఆ ప్రేమను అవగాహన చేసే నిమిత్తమే భగవంతుడు తాను, శ్రీమతీ ఒక దేహంలో – అంతరాన కృష్ణుడుగా, బాహ్యంలో రాధగా – గౌరాంగుడు లేక శ్రీ చైతన్యుడిగా అవతరించాడని గౌడీయ వైష్ణవాచార్యులు చెబుతున్నారు. ఆ విధంగా గౌరాంగుడు మధురభావం యొక్క ప్రేమాదర్శాన్ని బోధిస్తూ మానవాళికి మంచి చేయడానికై అవతరించడం జరిగింది. శ్రీకృష్ణ ప్రేమ విహ్వలురాలైన రాధారాణి మనశ్శరీరాలలో ఏ లక్షణాలు వ్యక్తమైనవో, పురుష దేహుడైన శ్రీ గౌరాంగ మహాప్రభువులో కూడ భగవత్ప్రేమ శక్తి ఫలితంగా అవే లక్షణాలు వ్యక్తం కావడంతో వైష్ణవ గోస్వాములు ఆయనను శ్రీమతిగా నిశ్చయించడం జరిగింది. గతంలో శ్రీమతిలో మాత్రమే వ్యక్తం అయిన మధురభావపు భౌతిక, మానసిక చిహ్నాలు గౌరాంగునిలోనూ కనిపించాయి. కనుక సర్వశ్రేష్ఠ ప్రేమకు రెండవ దృష్టాంతం శ్రీ చైతన్యుడే అని మనకు తెలియవస్తోంది.
14. శ్రీరామకృష్ణుల రాధాదేవి దర్శనం
శ్రీమతి రాధాదేవి కృపతో తప్ప శ్రీకృష్ణ దర్శనం అసంభవమని గ్రహించి శ్రీరామకృష్ణులు ఇప్పుడు ఏకాగ్రచిత్తంతో ఆమెను ఉపాసించసాగారు. ఆమె ప్రేమ ఘనమూర్తి శ్రీకృష్ణుని యొక్క స్మరణ, మనన, ధ్యానంలో సతతం నిమగ్నులై ఆమె పాదపద్మాల వద్ద తన మానసిక ఉద్వేగాన్ని నివేదించసాగారు. తత్ఫలితంగా సత్వరమే రాధాదేవి దివ్యదర్శనాన్ని పొంది కృతార్థులైనారు. ఇతర దేవతామూర్తులను దర్శించినప్పుడు సంభవించినట్లే ఇప్పుడు కూడ ఆమె దివ్యమూర్తి తన దేహంలో లీనమైపోయినట్లు ఆయన గాంచారు. ఆ దర్శనాన్ని ఆయన ఇలా వర్ణించేవారు: “కృష్ణప్రేమతో సర్వస్వాన్ని అర్పించిన ఆ నిరుపమాన దివ్యప్రేమమూర్తి వైభవమూ, మాధుర్యమూ వర్ణనాతీతం. రాధాదేవి మేనిఛాయ నాగకేసర పుష్పాల పచ్చని పుప్పొడిలా ప్రకాశిస్తూవుండటం దర్శించాను” అని తెలియ చెప్పారు.
15. శ్రీరామకృష్ణులు, తనను రాధగా భావించుకోవడం
పైన పేర్కొన్న దర్శనానంతరం శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో తానే రాధాదేవిగా గుర్తుంచుకోసాగారు. రాధాదేవి పవిత్ర రూప, గుణాలను ప్రగాఢంగా ధ్యానించడంతోనూ, నిరంతరం ఆమెలో తాదాత్మ్యం చెందుతున్నాననే భావన ఉండడం చేతా శ్రీరామకృష్ణులు తమ ప్రత్యేక అస్తిత్వాన్ని పూర్తిగా మరచిపోయారు. కాబట్టి మధురభావ జనితమైన ఆయన భగవత్ప్రేమ ఇప్పుడు పురోగమించి రాధారాణి ప్రేమకు అనురూపంగా మహోన్నత స్థితిని చేరుకొన్నదని నిస్సందేహంగా చెప్పవచ్చును. దాని ఫలితం కూడ అలాగే కనబడింది. ఆ దర్శనం కలిగిన నాటి నుండి శ్రీమతి రాధారాణి, శ్రీ చైతన్యదేవులలా మధురభావ పరాకాష్ఠకు చేరుకొని మహాభావంగా రూపొందినప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తాయో అవన్నీ ఇప్పుడు శ్రీరామకృష్ణులలోను అభివ్యక్తం కావడమే అందుకు కారణం. ఈ మహాభావ ఫలితంగా కలిగే భౌతిక లక్షణాలన్నీ వైష్ణవాచార్యుల రచనలలో నమోదు అయినవి. వైష్ణవశాస్త్రాలలో నిష్ణాతురాలైన భైరవీ బ్రాహ్మణి, తదుపరి వైష్ణవచరణ్ ప్రభృత సాధకులు శ్రీరామకృష్ణుల పావన దేహంలో మహాభావ ప్రేరణ ద్వారా వ్యక్తమయ్యే ఆ లక్షణాలన్నీ కానరావడం చూసి స్తంభీభూతులై తమ హృదయపూర్వక శ్రద్ధాభక్తులను ఆయనకు అర్పించారు. మహాభావాన్ని గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు మాతో ఎన్నోసార్లు ఇలా చెప్పారు: “పంథొమ్మిది రకాల భావాలు ఒకే ఆధారంలో అభివ్యక్తమైనప్పుడు దాన్ని మహాభావంగా భక్తిశాస్త్రాలు పేర్కొంటాయి. సాధన చేసి ఒక్కోభావంలో సిద్ధిని గడించడంలో మనిషి యావత్తు జీవితం గడచిపోతుంది. (తమ దేహాన్ని చూపుతూ) ఇక్కడ ఈ ఒకే ఆధారంలో ఒకేచోట ఆ విధంగా పంథొమ్మిది భావాలు పూర్తిగా స్వయంవ్యక్తమౌతున్నాయి.”*
16. మధుర భావంలో నెలకొన్న కాలంలో శ్రీరామకృష్ణులలో కలిగిన అసాధారణ భౌతికమార్పులు
శ్రీకృష్ణ విరహ జనిత అసహనీయ బాధతో శ్రీరామకృష్ణుల దేహంలో ప్రతి రోమకూపం నుండి రక్తం స్రవించడం ఇదివరలోనే మేం పేర్కొన్నాం. మహాభావం పరాకాష్ఠకు చేరిన ఈ కాలంలో అది సంభవించింది. తానొక స్త్రీననే నిరంతర భావన ఆయనలో ఎంత ప్రగాఢంగా నెలకొన్న దంటే కలలో సైతం తానొక పురుషుడననే భావన ఆయనలో జనించేది కాదు. ఆయన దేహేంద్రియాలు అచ్చం స్త్రీలవలె పనిచేయసాగాయి. స్వయంగా ఆయన ముఖతా మేం ఇలా విన్నాం: స్వాధిష్ఠాన చక్రం ఉండే స్థానపు రోమకూపాల నుండి బహిష్ఠు స్త్రీలవలె ఈ కాలంలో ప్రతి నెల ఋతుస్రావం బిందురూపంలో తరచూ బహిర్గతమయ్యేదట! స్త్రీ దేహంవలె ప్రతి నెల మూడు రోజులు క్రమంగా అలా జరిగేదట. శ్రీరామకృష్ణుల మేనల్లుడైన హృదయరాం “అలా జరగడం కళ్ళారా నేను చూశాను. కట్టుకొన్న ధోవతి మలినమౌతుందనే భయంతో ఆయన ఆ సమయంలో కౌపీనం ధరించడం చూశాను” అని మాతో చెప్పాడు.
17. మానసమే దేహాన్ని కల్పిస్తుంది
వేదాంత శాస్త్రాలు మనకు ఇలా బోధిస్తున్నాయి: మనస్సే శరీరాన్ని తయారుచేస్తుంది. మనిషి యొక్క మనస్సే ప్రస్తుత రూపంలోని దేహాన్ని కల్పిస్తోంది. తీవ్రమైన కోరికలు లేదా వాసనల ద్వారా ప్రతిక్షణం మనస్సు ఈ దేహాన్ని విచ్ఛిత్తి గావిస్తూ, పునర్నిర్మిస్తూ మార్పులు కలిగిస్తూ ఉంటుంది. దేహం మీద మనస్సు కున్న సార్వభౌమాధికారం గురించి విన్నప్పటికీ మనం ఆ అంశం పూర్తిగా అర్థం చేసు కోలేకున్నాం. ఇందుకు కారణం: అత్యంత తీవ్రమైన వాసనలు మనస్సులో ఉదయించి నప్పుడు అది ఇతర విషయాల నుండి వెనుదిరిగి ఒకే ఒక్క విషయం మీద కేంద్రీకృతమవుతుంది. తత్ఫలితంగా అపూర్వశక్తి ప్రకటితమౌతుంది. కాని మనం దేని నిమిత్తమైనా ఏనాడైనా అలాటి తీవ్ర పరితాపం పొందినవారం కాము కదా! (కాబట్టే మన దేహంలో గణనీయమైన మార్పులు కలగడం మనం అనుభవించలేదు) కనుక ఒక ప్రత్యేకమైన విషయాన్ని పొందాలనే తీవ్రమైన కోరిక ఫలితంగా శ్రీరామకృష్ణుల దేహంలో అతిస్వల్ప కాలంలోనే అటువంటి మార్పులు కలగడం వలన పైన పేర్కొన్న వేదాంత బోధన నిస్సంశయంగా ఋజవైనదని చెప్పనవసరం లేదు. కాబట్టే శ్రీ పద్మలోచన ప్రభృత సుప్రసిద్ధ పండితులు శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మికానుభూతుల నన్నిటినీ ఆలకించి, వేదపురాణాది శాస్త్రాలలో పొందుపరచబడివున్న పూర్వ యుగాల ఋషుల, సిద్ధపురుషుల అనుభూతులతో వాటిని పోలుస్తూ “మీ ఆధ్యాత్మికానుభూతులు వేదపురాణాది ప్రమాణాలను అతిక్రమించిపోయాయి” అంటూ ఆయనను శ్లాఘించారు. మానసిక భావాల ప్రాబల్యం ద్వారా శ్రీరామకృష్ణులలో కలిగిన శారీరక వికారాలను పరిశీలించి, స్తంభీభూతులై ఆ వికారాలు ప్రస్తుత శారీరక విజ్ఞాన సీమను అతిక్రమించాయని, తద్వారా అపూర్వ నూతన యుగం అవతరించనున్నదని మనం వ్యాఖ్యానించవచ్చు.
18. శ్రీకృష్ణ దర్శనం
మధురభావ మార్గంలో పరిపూర్ణతను సంతరించుకొంటున్న శ్రీరామకృష్ణుల భగవత్ప్రేమ ప్రస్తుతం పవిత్రమై ఘనీభూతమవడంతో ఇంతకు మునుపు వర్ణించినట్లు ఆయనకు వ్రజరాణి రాధాదేవి దర్శనం అయింది. అంతేగాక ఆ ప్రేమ ప్రభావంతో స్వల్పకాలంలోనే సచ్చిదానంద ఘన విగ్రహమూర్తి ఐన శ్రీకృష్ణ పరమాత్ముని పావన దర్శనం కూడ లభించింది. మునుపటి దివ్యమూర్తులలా శ్రీకృష్ణుని మూర్తి కూడ ఆయన పావన దేహంలో ఐక్యం చెందింది. శ్రీరామకృష్ణులకు ఈ దర్శనం కలిగిన రెండు మూడు నెలల పిదప పరమహంస పరివ్రాజకుడైన తోతాపురి విచ్చేసి వేదాంత ప్రసిద్ధమైన అద్వైతభావ సాధనలో ఆయనను నియుక్తులను చేశారు. కాబట్టి మధురభావ సాధనలో సిద్ధిని పొంది శ్రీరామకృష్ణులు తద్భావం ద్వారా దివ్యానందాన్ని అనుభవిస్తూ కొంతకాలం గడిపారని స్పష్టమవుతోంది. ఈ కాలంలో ఆయనకు కలిగిన అనుభవాన్ని గూర్చి వారి ముఖతా మేం వినడం జరిగింది. శ్రీకృష్ణుని భావనలోవున్న కాలంలో ఆయన ఎంత తన్మయులై పోయారంటే, స్వకీయ ఉనికినే పూర్తిగా మరచిపోయి ఒక్కోసారి తనను తానే శ్రీకృష్ణునిగా భావించుకొనేవారు. మళ్ళీ మరొకప్పుడు ఆబ్రహ్మస్తంభపర్యంతం సమస్తాన్నీ శ్రీకృష్ణునిగా దర్శిస్తూ ఉండేవారు. దక్షిణేశ్వరానికి మేం వచ్చిపోతూ వారి సహచర్యంలో గడిపే కాలంలో ఆయన ఒక రోజు తోట నుండి ఒక నీలిరంగు గడ్డిపువ్వును కోసుకువచ్చి, మాకు దానిని చూపిస్తూ ఆనందంతో, “ఆ (మధురభావ సాధన) కాలంలో నాకు దర్శనమిచ్చే శ్రీకృష్ణుని మేనిఛాయ ఇలా ఉండేది” అన్నారు.
19. యౌవనంలో శ్రీరామకృష్ణుల ఆకాంక్ష
కామార్పుకూరు నుండి కలకత్తాకు రాక పూర్వం స్త్రీస్వభావ జనిత ప్రేరణ ద్వారా యౌవన ప్రాదుర్భావంలో శ్రీరామకృష్ణులకు ఒక విచిత్ర అభిలాష కలిగేది. వ్రజ గోపికలు స్త్రీ దేహులై జన్మించడం చేతనే సచ్చిదానంద ఘనుడైన శ్రీకృష్ణుని ప్రేమించి తమ ఆధ్యాత్మిక పతిగా పొందగలిగారని గ్రహించి, శ్రీరామకృష్ణులు “నేనూ ఒక స్త్రీగా జన్మించివుంటే గోపికలలా శ్రీకృష్ణుని ఆరాధించి పొందగలిగేవాణ్ణి గదా!” అని భావించేవారు. ఆయన అలా తమ పురుష దేహాన్ని శ్రీకృష్ణ దర్శనానికి ఒక అంతరాయంగా భావించి, తనకు పునర్జన్మ ఉండేపక్షంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పొడవైన కురులుగల బాలవితంతువుగా జన్మించి ఒక్క శ్రీకృష్ణుని తప్ప మరెవ్వరినీ పతిగా పరిగ్రహించనని ఊహించుకొంటూ ఉండేవారు. ‘బ్రతకడానికి సామాన్య అన్నవస్త్రాలు ఉంటాయి. నివాసానికి ఒక చిన్న పూరిల్లు, దాని ప్రక్కనే కాస్త ఖాళీ స్థలం. తనకు అవసరమైన కూరనారలను తానక్కడే పండించుకొంటుంది. తనకు తోడుగా ఒక ముసలమ్మ ఉంటుంది. పాల కోసం ఒక ఆవు. స్వయంగా తానే పాలు పితుకుతుంది. వీటితోబాటు ఒక చిన్న నూలు వడికే రాట్నం.’ గదాధర్ ఊహాలోక విహారం అంతటితో ఆగలేదు. ‘పగటి వేళ పనిపాటలు ముగించుకొని, నూలు వడుకుతూ శ్రీకృష్ణ భజనలు గానం చేస్తూ ఉంటుంది. అంతేగాక చీకటిపడ్డాక ఆవుపాలతో తీపిపదార్థాలు తయారుచేసి, స్వహస్తాలతో శ్రీకృష్ణునికి తినిపించడానికై వ్యాకులతతో రహస్యంగా విలపిస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రసన్నుడై గోపబాలుని వేషంలో హఠాత్తుగా తన వద్దకు వచ్చి ఆ తీపిపదార్థాలు తింటాడు. ఇలా ఎవరికీ తెలియకుండా అనునిత్యం అతడు తన వద్దకు వస్తూపోతూ ఉంటాడు.’ ఇటువంటి ఊహాగానంగా వ్యక్తమైన శ్రీరామకృష్ణుల అభిలాష అలా ఈడేరకపోయినా మధురభావ సాధనానుష్ఠాన కాలంలో పైన వర్ణించిన రీతిలో నెరవేరింది.
20. భాగవతం, భక్తుడు, భగవంతుడు – మూడూ ఒకటే – ఒకటే మూడూ!
మధురభావ సాధనలో సిద్ధిని గడించాక దివ్యానందాన్ని అనుభవిస్తూన్న కాలంలో శ్రీరామకృష్ణులకు కలిగిన మరో దివ్యదర్శనం గురించి ముచ్చటించి ప్రస్తుత అంశాన్ని ముగిద్దాం. ఆ సమయంలో ఆయన ఒకరోజు విష్ణ్వాలయపు ముందు వసారాలో కూర్చుని భాగవత పఠనాన్ని ఆలకిస్తున్నారు. అలా వింటూ వింటూ భావ పరవశులై భగవాన్ శ్రీకృష్ణుని జ్యోతిర్మయమూర్తిని దర్శించారు. తదుపరి శ్రీకృష్ణుని పాదపద్మాల నుండి ఒక కాంతిపుంజం బయల్వెడలి మొదట భాగవత గ్రంథాన్ని తాకి, తర్వాత ఆయన వక్షస్థలాన్ని స్పృశించి, కొంత సమయం వరకు ఆ మూడింటినీ ఏకకాలంలో స్పృశిస్తూ ఉండడాన్ని ఆయన కాంచారు.
అలాంటి దర్శనాన్ని పొందడం ద్వారా భాగవతం, భక్తుడు, భగవంతుడు అనే మూడూ వేరుగా కనిపించినప్పటికీ ఆ మూడూ ఒకే పదార్థం లేదా ఒకే పదార్థపు మూడు వ్యక్తీకరణలనే ప్రగాఢ విశ్వాసం తమకు కలిగిందని అందుకే “భాగవతం (శాస్త్రం), భక్తుడు, భగవంతుడు – మూడూ ఒకటే, ఒకటే మూడు” అంటూ ఉండేవారు శ్రీరామకృష్ణులు.