1. మథురనాథ్ అనుభవం–నడవడిక
దేవీభక్తురాలైన రాణీ రాస్మణి 1861 వ సం ॥ లో కాలధర్మం చెందింది. తదనంతరం ఆ సంవత్సరాంతంలో శ్రీ యోగేశ్వరి భైరవీబ్రాహ్మణి దక్షిణేశ్వర కాళికాలయానికి అరుదెంచింది. అప్పటి నుంచి 1863 వ సంవత్సరం చివరి దాకా శ్రీరామకృష్ణుల తాంత్రిక సాధనలు కొనసాగాయి. రాణి మరణించినప్పటి నుంచి శ్రీరామకృష్ణులను సేవించే మహద్భాగ్యం పొంది మథుర్ కృతార్థుడైనాడు. ఇంతకు క్రితం ఎన్నోసార్లు శ్రీరామకృష్ణుల అపూర్వ భగవదనురాగం, మనోసంయమం, త్యాగ వైరాగ్యాలను పరీక్షించి దృఢ నిశ్చితుడయ్యాడు. అయినా ఈ ఆధ్యాత్మికతతో పాటు ఆయనలో అప్పుడప్పుడు కించిత్తు చిత్తచాంచల్యం కూడా కలసివున్నదో లేదో అనే విషయమై మథుర్ ఒక స్థిరనిశ్చయానికి రాలేకపోయాడు. కాని శ్రీరామకృష్ణులు తాంత్రిక సాధనలు చేయడం ప్రారంభించిన నాటి నుండి ఆతడి సంశయం పూర్తిగా నివృత్తి అయింది. పైగా అలౌకిక దివ్యశక్తులు ఆయనలో ప్రకటితమవడం ప్రత్యక్షంగా అనుభవానికి రావడంతో తన ఇష్టదైవం జగన్మాత తనపట్ల ప్రసన్నురాలై శ్రీరామకృష్ణ రూపాన్ని దాల్చి తన సేవలను స్వీకరిస్తూన్నదనీ, సర్వదా తన వెన్నంటే తిరుగుతూ అన్ని విషయాల్లోనూ తనను రక్షించడమేగాక జమీపైన తన అజమాయిషీ చెక్కుచెదరనీయలేదనీ, రోజురోజుకూ తన మర్యాదమన్ననలు పెంపొందిస్తూన్నదనీ అచంచల విశ్వాసం మథురనాథ్కు ఈ కాలంలో ఏర్పడింది. ఎందుకంటే ఈ రోజుల్లోనే అతడు తలపెట్టిన కార్యాలన్నీ సఫలం కావడంతో శ్రీరామకృష్ణుల కృపతో భగవత్ సహాయం తనకు లభిస్తూన్నదని అతడు తలచసాగాడు. కాబట్టే ఆయన సాధనలకు ఆవశ్యకమైన సరంజామాను సమకూర్చడం మొదలుగా వారి అభిప్రాయానుసారం భగవత్సేవలకు, తదితర పుణ్యకార్యాల నిమిత్తం మథుర్ ఈ కాలఘట్టంలో ఎంతో ధనాన్ని ఖర్చు చేయడంలో వింత ఏమీ లేదు.
తాంత్రిక సాధనల ద్వారా శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక శక్తి రోజు రోజుకూ ఎంత అధికంగా అభివ్యక్తం కాసాగిందో ఆయన పవిత్ర పాదాలను శరణుజొచ్చిన మథుర్బాబుకు అన్ని విషయాల్లోను ఉత్సాహం, సాహసం, బలం అంతే అధికరించసాగాయి. భగవంతుడి పాద పద్మాలను శరణుజొచ్చి, ఆయనలో పరిపూర్ణ విశ్వాసాన్ని నిలిపి, భగవత్కృపను పొందిన భక్తుడు తన హృదయంలో ఎలాంటి అపూర్వ ఉత్సుకతను, శక్తిని అనుభవిస్తాడో మథుర్కీ అలాంటి అనుభూతే జనించింది. అయినా మథురనాథ్ రాజసిక భక్తి కేవలం శ్రీరామకృష్ణులను సేవించడంతోను, పలు పుణ్యకార్యాలు చేయడంతోనే సంతృప్తి పొంది ఆగిపోయింది. కాని ఆధ్యాత్మిక మార్గంలో ముందంజ వేసి నిగూఢ భావరహస్యాలను ప్రత్యక్షం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. భగవద్దర్శనార్థం మథుర్ ప్రయత్నించక పోయినప్పటికీ శ్రీరామకృష్ణులే తన బలం, బుద్ధి, ఆశ్రయం, తన ఇహం, పరం, తన ప్రాపంచికోన్నతి, తన అధికార గౌరవాలకి మూలకారణం – ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీరామకృష్ణులే తన సర్వస్వం అన్న ప్రగాఢ విశ్వాసం మథుర్ హృదయంలో హత్తుకుపోయింది.
2. మథుర్ ‘అన్నమేరు” వ్రతానుష్ఠానం
మథురనాథ్ ఈ కాలంలో చేపట్టిన కార్యాలను పరికిస్తే శ్రీరామకృష్ణుల కృపాకటాక్ష లాభాన్ని గడించి స్వకీయ ప్రాపంచిక వ్యవహారాలలో తాను సురక్షితుడననే దృఢ నమ్మకం అతడిలో కలగటం ఋజువవుతుంది. ఈ కాలఘట్టంలో అతడు ఎంతో ధనాన్ని వెచ్చించి ‘అన్నమేరు’ అనే వ్రతాన్ని అనుష్ఠించాడనే సంగతి ‘రాణీ రాస్మణి జీవిత చరిత్ర’ అనే పుస్తకం ద్వారా మనకు తెలుస్తోంది. ఈ వ్రతం 1864 వ సం ॥ లో దక్షిణేశ్వరంలో జరిగింది. ఈ వ్రతకాలంలో సమృద్ధిగా బంగారం, వెండితో సహా వేయి మణుగుల బియ్యం, వేయి మణుగుల నువ్వులు బ్రాహ్మణులకు, పండితులకు దానంగా ఇవ్వబడినట్లు హృదయ్ తెలిపాడు. వ్రతోత్సవాలలో సంకీర్తన చేయడానికి ‘సహచారి’ అనే సుప్రసిద్ధురాలైన గాయని, చండీ కీర్తనలను ఆలపించడానికి ‘రాజనారాయణ్’ అనే గాయకుడు నియుక్తులైనారు. వీటితోపాటు యాత్రాభినయాలు ఏర్పాటు చేయబడి దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణం కొంతకాలం వరకు ‘ఆనందసాగరం’ గా మారిపోయింది. ఆ గాయకుల భజన కీర్తనలను ఆలకిస్తూ పదే పదే భావసమాధిమగ్నులవుతూన్న శ్రీరామకృష్ణులను చూసి, వారు అనుభవిస్తూన్న ఆనందంలోని తారతమ్యాన్నిబట్టి ఆయా గాయకుల గానప్రతిభను బేరీజు వేసుకొని తదనుగుణంగా వారికి అతివిలువైన శాలువలు, పట్టువస్త్రాలు, వందలాది రూపాయలు మథుర్ బహూకరించాడని హృదయ్ చెప్పగా విన్నాం.
3. వేదాంత పండితుడు పద్మలోచన్ను శ్రీరామకృష్ణులు కలుసుకోవడం
వేదాంతంలో నిష్ణాతుడైన పద్మలోచన్ ఆ రోజుల్లో బర్ద్వాన్ మహారాజు ఆస్థాన ప్రధాన పండితుడిగా ఉండేవాడు. అతడి పాండిత్య పటిమ, నమ్రత, తదితర సుగుణాల గురించి విని, మథుర్ ‘అన్నమేరు’ వ్రతం చేయడానికి కాస్త ముందుగా, శ్రీరామకృష్ణులను తోడ్కొని పద్మలోచన్ను చూడడానికి స్వయంగా వెళ్ళడం జరిగింది. వ్రతానుష్ఠాన కాలంలో ఏర్పాటు చేయబడిన పండిత సభకు పద్మలోచన్ను ఆహ్వానించి ఆయనకు కానుకలు సమర్పించాలనే గొప్ప ఆకాంక్ష మథుర్లో కలిగిందని శ్రీరామకృష్ణులే మాతో చెప్పారు. శ్రీరామకృష్ణుల పట్ల ఆ పండితుడికి అపార భక్తిశ్రద్ధలుండడం ఎరిగి హృదయరామ్ ద్వారా ఆయనకు మథుర్ ఆహ్వానం పంపించాడు. కాని కారణాంతరాలవల్ల అప్పుడు పద్మలోచన్ రాలేకపోయాడు. పద్మలోచన్ పండితుడి వృత్తాంతం మేం మరొకచోట* వివరంగా తెలియజేశాం.
4. శ్రీరామకృష్ణుల వైష్ణవీయ సాధనలకు కారణాలు
తాంత్రిక సాధనలు పూర్తిచేసిన పిమ్మట శ్రీరామకృష్ణులు వైష్ణవ మతానికి చెందిన సాధనల పట్ల ఆకర్షితులైనారు. విచారించి పరికిస్తే అలా జరగడానికి స్వాభావికమైన కొన్ని కారణాలు మనకు కనిపిస్తాయి. మొదటి కారణం: శ్రద్ధాళువైన భైరవీ బ్రాహ్మణి వైష్ణవ శాస్త్రాలలో నిర్దేశించబడిన పంచభావాలతో కూడిన సాధనానుష్ఠానాలలో నిష్ణాతురాలు. అంతేగాక ఆ భావాల నన్నిటినీ ఒక్కొక్కటిగా గ్రహించి, తదేకచిత్తంతో వాటి సాధనల్లో చాలాకాలం గడిపింది. నందరాణి అయిన యశోదాదేవి వాత్సల్యభావంతో తన్మయురాలై బాలగోపాల జ్ఞానంతో శ్రీరామకృష్ణుల చేత వివిధ ఆహార పదార్థాలను తినిపిస్తూండేదనే సంగతి ఇంత క్రితమే ప్రస్తావించాం. కాబట్టి వైష్ణవీయ సాధనల పట్ల శ్రీరామకృష్ణులను ఆమె ప్రోత్సహించడంలో కారణం లేకపోలేదు. రెండవ కారణం: వైష్ణవ కుటుంబంలో జన్మించిన శ్రీరామకృష్ణులకు వైష్ణవీయ సాధనలపట్ల సహజంగానే ప్రీతి ఉంటుంది. పైగా కామార్పుకూర్ ప్రాంతాల్లో వైష్ణవీయ సాధనలు బహుళ ప్రచారంలో ఉండడం వల్ల, వాటిపట్ల చిన్ననాటి నుంచే ఆయనకు పూజ్యభావం కలిగివుండే గొప్ప అవకాశం ఉన్నది. మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది: జీవితాంతం శ్రీరామకృష్ణులలో స్త్రీ–పురుషుల ఇద్దరి నైజాలూ అపూర్వంగా మిళితమై ఉండటం కనబడుతుంది. వీటిలోని ఒకదాని ప్రభావంతో సింహవిక్రముడై, నిర్భీతితో ప్రతి విషయంలో ఆనుపానులూ అంతుబట్టే వరకూ పట్టువీడనివాడై, మూర్తీభవించిన పురుషత్వంతో వెలుగొందేవారు. ఇక స్త్రీ స్వభావంతో ప్రభావితులైనప్పుడు రమణీమణులకు సహజమైన కోమలత్వమూ, అయినప్పటికీ తీక్షణమైన నైజం కలిగి, ప్రపంచంలో ప్రతివస్తువును, వ్యక్తిని తమ హృదయం ద్వారా గాంచుతూ, బేరీజువేస్తూ ఉండడం కానవచ్చేది. అలాగే ఈ స్త్రీ నైజ ప్రభావంతో కొన్ని విషయాల పట్ల ప్రగాఢ మమకారం, మరికొన్నిటిపట్ల తద్విపరీతభావం సహజంగానే వారిలో కనపడేది. కనుకనే తమ హృదయంతో ప్రతిస్పందించినప్పుడు అంతులేని కష్టాలను కూడా అలవోకగా సహించగలిగి దివ్యభావా హృదయం నిర్లిప్తమై, సామాన్య మానవుడిలా శ్రీరామకృష్ణులు తల్లడిల్లేవారు కాదు.
5. వాత్సల్య, మధురభావ సాధనలప్పుడు శ్రీరామకృష్ణులలో స్త్రీ స్వభావాలు ఉదయించడం
ఆధ్యాత్మిక సాధనలను ప్రారంభించిన నాటి నుండి మొదటి నాలుగేళ్ళ కాలంలో శ్రీరామకృష్ణులు వైష్ణవ మార్గానికి చెందిన శాంత, దాస్యభావ సాధనలను అనుష్ఠించడం జరిగింది. అంతేగాక ఒక్కొక్కప్పుడు శ్రీకృష్ణుడి సఖులైన సుదాముడు మొదలైన గోపబాలకుల మాదిరి సఖ్య భావాన్నీ సాధన చేశారు. ఈ అన్నిట్లోనూ ఆయన సిద్ధిని గాంచారు. శ్రీరామచంద్రుణ్ణి తనకు ప్రాణసముడిగా ఎంచి, సేవించిన ఆంజనేయస్వామిని తన ఆదర్శంగా తీసుకుని, కొంతకాలం ఆయన ఈ దాస్యభక్తి మార్గాన్ని సాధించడం, పంచవటిలో ఆయనకు సీతాదేవి దర్శనం కావడం – ఈ విషయాలు ఇంతకు మునుపే చెప్పుకున్నాం. కనుక ప్రస్తుతం శ్రీరామకృష్ణులు వైష్ణవశాస్త్రాల్లో ప్రధాన సాధనలుగా పరిగణింపబడే వాత్సల్యభావం, మధురభావం – ఈ రెండు సాధనలను చేయడానికి ఉపక్రమించారు. స్త్రీ నైజం అధికంగా ప్రకటితమవుతున్న ఈ కాలంలో ఆయన తనను జగన్మాత చెలికత్తెగా భావించుకొని చామరంతో దేవికి వీస్తూండేవారు. దుర్గాపూజ సందర్భంలో మథురుని కలకత్తా భవంతికి వెళ్ళి, స్త్రీ వేషభూషణాదులను ధరించి, ఇంట్లోని స్త్రీ జనంతో కలిసిమెలిసే దుర్గాదేవికి ప్రణామాదులు చేసేవారు. ఒక్కోసారి వారిలో ఈ స్త్రీ నైజం ఎంత అధికరించేదంటే తమకొక పురుష దేహం ఉన్నదనే సంగతే మరిచిపోతూండేవారు.* మేం దక్షిణేశ్వరానికి రాకపోకలు చేస్తూన్న ఆ కాలంలోనూ ఆయనలో అప్పుడప్పుడు ఈ స్త్రీ స్వభావం అభివ్యక్తం కావడం చూశాం. కాని అప్పుడది గతంలో మాదిరి దీర్ఘకాలికం కాదు. అలా ఉండాల్సిన ఆవశ్యకత కూడా లేదప్పుడు. కారణం స్త్రీ, పురుషుల స్వభావాలకు చెందిన భావాలు ఎన్ని ఉన్నాయో అన్నింటినీ ఆయన సాధించడమే! జగజ్జనని కృపాకటాక్షం వల్ల ఇచ్ఛామాత్రంతోనే ఆయా భావాలన్నిటిలోను, వాటికి అతీతమైన అద్వైతభావంలోను నెలకొని ఉండడం ఆయనకప్పుడు అతి సహజమైపోయింది. అంతేగాక తన వద్దకు వచ్చిన ప్రతీ సాధకుడి ఆధ్యాత్మిక పురోభివృద్ధి నిమిత్తం ఆ భావాలలో ఏ ఒక్కదాన్లోనైనా ఇష్టా మాత్రంగా ఇష్టం వచ్చినంతకాలం నెలకొని ఉండే స్థితికి చేరారు.
6. శ్రీరామకృష్ణుల మనోనిర్మాణం
శ్రీరామకృష్ణుల సాధనా మహిమాతిశయాన్ని కచ్చితంగా అవగతం చేసుకోవాలంటే జన్మతః ఆయన మనస్సు ఏ అసాధారణ పదార్థంతో రూపొందినదో, దైనందిన అనుభవాలపట్ల ఆయన ఎలా ప్రతిస్పందించేవారో, ఆయనలో చెలరేగిన ఆధ్యాత్మిక ఝంఝామారుతం గత ఎనిమిదేళ్ళ కాలంలో కొనితెచ్చిన పరిణామాల నైజమేమిటో, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఆయన 1855 లో దక్షిణేశ్వర కాళికాలయానికి వచ్చేదాకా, ఆ తదుపరి కొంతకాలం కూడా తన తండ్రి తాతల మాదిరి తానూ సద్గృహస్థుడిగానే జీవిస్తాననే నమ్ముతూండే వాడినని స్వయంగా వారినోటే మేం విన్నాం. పుట్టిన నాటి నుంచి అహంభావరహితుడవడంతో, ఏ రీతిలోనూ తాను ప్రపంచంలో ఇతరుల కంటే అధికుడననీ లేదా ఇతరులలో కంటే తనలో విశిష్ట గుణాలు ఉన్నవనే భావన ఆయనలో ఏనాడూ పొడసూపలేదు. కాని కార్యక్షేత్రంలో కాలిడిన నాటి నుంచి అడుగడుగునా ఆయన అసాధారణ వైశిష్ట్యం ప్రకటితం కాసాగింది. ఏదో ఒక దైవీశక్తి అనుక్షణం వారిని అనుగమిస్తూ లోకంలోని రూప రసాది ప్రతీ వస్తువు యొక్క అనిత్యత్వాన్ని, నిరర్థకత్వాన్ని ఉజ్జ్వల కాంతితో కళ్ళకు కట్టినట్లు వారికి కనబరుస్తూ, సర్వదా ఆయనను తద్వ్యతిరేక మార్గంలో – అంటే భగవన్మార్గంలో నడపసాగింది. నిస్స్వార్థులై కేవలం సత్యాన్ని మాత్రమే అన్వేషిస్తూన్న శ్రీరామకృష్ణులు కూడా ఆ దైవనిర్దేశానుసారం నడవడాన్ని అతిత్వరలోనే అలవరచుకొన్నారు. ప్రాపంచిక భోగ్య వస్తువులను పొందాలనే ఆకాంక్ష కించిత్తు అయినా ఆయనలో కలిగివుంటే ఆయన అలా ప్రవర్తించడం అసంభవం.
7. శ్రీరామకృష్ణులలో గత సంస్కారాలు అసలు లేకపోవడం
జీవితాంతం ప్రతీ విషయం పట్లా ఆయన ప్రవర్తించిన తీరును జ్ఞాపకం చేసుకొంటే పై అంశం సాధకుడికి స్పష్టంగా తెలియవస్తుంది. ఈ లోకంలో సాధారణ చదువుల ఉద్దేశం, ‘బియ్యం, అరటికాయలను మూట కట్టుకోవడం’, అంటే ధన సంపాదనకు మాత్రమే అని గ్రహించి ఆయన ఆ విద్యను విరమించుకోవడం జరిగింది. కుటుంబ పోషణార్థం పూజారి పదవిని స్వీకరించారు.భగవదర్చనకు మరో ఉన్నతోద్దేశం ఉన్నదని గుర్తించి భగవత్సాక్షాత్కారం నిమిత్తం ఉన్మత్తులైపోయారు. పరిపూర్ణ ఇంద్రియ నిగ్రహం మూలంగానే భగవత్సాక్షాత్కారం సాధ్యం అని గ్రహించి వివాహం చేసుకొన్నప్పటికీ, మనోవాక్కాయాలతో భార్యతో ఏలాటి సంపర్కమూ పెట్టుకోలేదు. సంచయం చేసే వ్యక్తి, భగవంతుడి మీద ఏనాడూ పూర్తిగా నమ్మకం కలిగివుండలేడని గ్రహించి, ధన కనకాల మాట అటుంచి, అతి సామాన్య వస్తువులను సైతం కూడగట్టుకోవాలనే భావనను మనస్సు నుంచి పూర్తిగా తీసివేశారు. శ్రీరామకృష్ణుల జీవితంలో ఇలాంటి ఎన్నో దృష్టాంతాలను చూడవచ్చు. ఈ దృష్టాంతాలనన్నిటిని పర్యాలోచించి చూస్తే సామాన్యులను మోహగ్రస్తులను గావించే సంస్కార బంధనాలు చిన్ననాటి నుంచి వీరిమీద ఎంత మాత్రమూ ప్రభావం చూపలేదని తేటతెల్లమవుతుంది. ఆలోచనలను అవగాహన చేసుకొని వాటిని ఆచరణలో పెట్టగల ఆయన శక్తి ఎంత సుస్థిరమంటే మనస్సులోని పూర్వసంస్కారాలు తలెత్తి వారిని లక్ష్యభ్రష్టులను చేయలేకపోయేవి.
8. శ్రీరామకృష్ణుల సద్గుణసంపత్తి
అంతేగాక శ్రీరామకృష్ణులు చిన్ననాటి నుంచి శ్రుతిధర సంపన్నులు; ఏకసంథాగ్రాహి; విన్నదాన్ని జీవితాంతం జ్ఞప్తిలో ఉంచుకోగలిగిన అద్భుత ప్రజ్ఞాశాలి. బాల్యంలో రామాయణ, మహాభారత కథలూ, భక్తిగీతాలు, యాత్రలలోని పాటలు, సంభాషణలు ఒకే ఒక్కసారి ఆలకించగానే, స్నేహితులతో కూడి కామార్పుకూర్ పొలాలలో, పచ్చికబయళ్ళలో వాటి నన్నిటిని ఆయన మళ్ళీ అభినయించేవారన్నది పాఠకులకు విదితమే. కాబట్టి మనకు స్పష్టమవుతున్న విషయం: యావజ్జీవితం గొప్ప ప్రయత్నం మీదట కూడ ఏ సద్గుణాలను సముపార్జించడం సామాన్య సాధకులకు దాదాపు అసాధ్యమో అటువంటి అత్యద్భుత జ్ఞాపకశక్తి, అనన్య సత్యనిష్ఠ, తాము అవగతం చేసుకొన్న భావాలను తక్షణమే ఆచరణ రూపంలో పెట్టడం – ఇటువంటి దైవీసంపత్తిని చేజిక్కించుకొని దాని ఆధారంగా సాధనారాజ్యంలో అగ్రగణ్యులయ్యారు శ్రీరామకృష్ణులు. సామాన్య సాధకుడు తన జీవితాంతం కృషి చేసినా ఈ లక్షణాలను సాధించలేడు. కాబట్టి అతిస్వల్ప వ్యవధిలోనే సాధనల పూర్ణఫలితాన్ని శ్రీరామకృష్ణులు పొందడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. సాధన కాలంలో కఠోర సాధనలలో కూడా కేవలం మూడు రోజుల్లోనే సిద్ధిని పొందానని ఆయన ముఖతా ఎన్నోసార్లు మేం విని దిగ్భ్రాంతులైనాం. అసాధారణమైన వారి మానసిక నిర్మాణమే ఇందుకు కారణం అనే యథార్థాన్ని మేం ఆ కాలంలో అణుమాత్రంగానైనా అవగాహన చేసుకోలేకపోయాం.
9. శ్రీరామకృష్ణుల అసాధారణ మనో నిర్మాణానికి కొన్ని దృష్టాంతాలు
శ్రీరామకృష్ణుల జీవితంలోని కొన్ని సంఘటనలను ప్రస్తావించినప్పుడు పాఠకుడు పైన చెప్పిన మా కథనాన్ని అవగాహన చేసుకోగలడు. సాధన ఆరంభ కాలంలో నిత్యానిత్య వస్తువిచారం చేస్తూ, ‘రూపాయి – మట్టి, మట్టి – రూపాయి’ అంటూ మట్టిముద్దలతో సహా కొన్ని రూపాయలను గంగానదిలో పారవేశారు. వాటితోపాటు ఏ ధనాసక్తి మానవ హృదయంలో తన ప్రభావాన్ని పరివ్యాప్తం చేస్తూంటుందో ఆ ఆసక్తిని వారి మనస్సులో నుంచి కూకటివేళ్ళతో సహా తీసివేశారు. సామాన్యజనం ఏ మురికి ప్రదేశాలకు వెళ్ళివచ్చాక స్నానాదులను చేయకుండా తమను శుచిమంతులుగా భావించుకోరో, అటువంట ప్రదేశాలను శ్రీరామకృష్ణులు స్వహస్తాలతో శుభ్రపరిచారు. తక్షణమే ఆయన మనస్సు జన్మాదిగా విజృంభించే జాత్యహంకారాన్ని పరిత్యజించింది; సమాజంలో అస్పృశ్యులుగా పరిగణించబడే వ్యక్తులకంటే తాను ఏ రీతిలోనూ అధికుణ్ణి కాదనే భావం శాశ్వతంగా వారి మనస్సులో దృఢమైంది. తాను జగన్మాత బిడ్డను. ‘స్త్రియః సమస్తాః సకలా జగత్సు’ – ప్రపంచంలోని స్త్రీలందరూ జగజ్జనని అంశలే అని విశ్వసించిన నాటి నుంచి ఇక స్త్రీని భోగ్యవస్తువుగా భావించి దాంపత్య సుఖాన్ని అనుభవించాలనే ఊహ వారి మనస్సులో నుండి మటుమాయమైంది. ఇటువంటి దృష్టాంతాలను పర్యాలోచించినప్పుడు అనన్య సాధారణమైన ధారణాశక్తి ఆచరణాత్మకత లేకుంటే వారికి ఆ విధంగా సాధనాఫలాలు లభించడం ఏనాటికీ అసాధ్యం అనే సంగతి స్పష్టమౌతోంది. శ్రీరామకృష్ణుల జీవితంలోని ఈ సంఘటనలను విని మనం విస్మయులమవుతాం. లేదా వాటిని నమ్మలేకపోతాం. అందుకు కారణం: మనం అంతర్దృష్టితో అప్పుడు విమర్శించుకుంటే మనకు కానవచ్చేది ఏమంటే – ఆయన మాదిరి, మనమూ మట్టితో సహా రూపాయలను వెయ్యిమార్లు అలా నీళ్ళలో పారవేసినా మనలోని ధనవ్యామోహం కించిత్తయినా నశించదు. వెయ్యిసార్లు మురికి ప్రదేశాలను మనం కడిగి పరిశుభ్రం చేసినా, ‘మేం శ్రేష్ఠుల’ మనే జాత్యహంకారం మన నుంచి వైదొలగదు. అంతేగాక జగన్మాత స్త్రీలందరి రూపంలో అభివ్యక్తమౌతోందని యావజ్జీవితం వింటూవున్నా కూడా, ఆచరణలో స్త్రీని తల్లిగా భావించలేం! ఈ పారమార్థిక సత్యాల ధారణాశక్తి మన పూర్వజన్మకృత కర్మసంస్కారాలలో ఎంత గట్టిగా చిక్కువడిందంటే శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఆ సంస్కారాల వల నుంచి బయటపడలేం. కనుకనే శ్రీరామకృష్ణులలా ఆ విషయాలన్నిటిలోను ఫలితాలను పొందలేం. ఆత్మసంయమమో శూన్యం. ధారణ శక్తో సున్న. పూర్వజన్మ సంస్కారాలో మహాబలీయాలు. ఇటువంటి మనస్సుతో భగవత్సాక్షాత్కారం కోసం సాధనా రాజ్యంలో మనం అగ్రగణ్యులమవగోరడం అసంభవం. కాబట్టే వారిలా ఫలితాన్ని పొందలేక పోవడం సహజమే కదా!
శ్రీరామకృష్ణుల వంటి అపూర్వ శక్తిసంపన్నమైన మనస్సుగల వ్యక్తులు ఈ లోకంలో నాలుగైదు వందల ఏళ్ళలో ఏ ఒకరిద్దరైనా జన్మిస్తారా అన్నది సందేహాస్పదమే. శ్రీరామకృష్ణుల అనుపమానమైన మనస్సు – సహజసిద్ధంగానే పూర్తి సంయమశక్తి, పరిపూర్ణ ధారణశీలత ఇమిడిన ఆ మనస్సు, భగవద్దర్శనం కోసం అనన్య అనురాగ అఖండ పరితాపంతో ఎనిమిది ఏళ్ళకాలం పాటు నిద్రాహారాలను పూర్తిగా త్యజించి జగజ్జనని పావన దర్శన భాగ్యం కోసం అహోరాత్రాలు కఠోరసాధనల్లో నిమగ్నమై ఎంత మహాశక్తి సంపన్నమైనదో, సూక్ష్మదృష్టినొంది ఎటువంటి అద్భుత దివ్యానుభూతులను పొందినదో, అటువంటి మానసాన్ని గురించి మనలాంటి సామాన్య మనస్కులకు ఊహించుకోవడం కూడా అసాధ్యమే!
10. సాధుసత్తములకు మథుర్ సేవానిరతులు
రాణీ రాస్మణి మరణానంతరం కూడా దక్షిణేశ్వర కాళికాలయంలో జగన్మాత పూజాది సేవాకార్యాలు ఎలాంటి లోటుపాట్లూ లేకుండా సాగుతూనే వచ్చాయనే సంగతిని ఇదివరకే చెప్పుకొన్నాం. శ్రీరామకృష్ణులను ప్రాణసమానంగా భావించే మథుర్బాబు దేవీ సేవల నిమిత్తం యథావిధి ఖర్చులకు వెనుకాడకపోవడమేగాక, శ్రీరామకృష్ణుల అభిలాష మేరకు ఉదారంగా హెచ్చుమొత్తాలనే ఖర్చుపెట్టేవాడు. దేవీదేవతలను సేవించడమేకాక సాధుసత్తములను సేవించడమంటే అతడికి పరమప్రీతి. శ్రీరామకృష్ణుల పాదాశ్రయుడైన మథుర్ ఆయన బోధనల ద్వారా సాధువులు, సన్న్యాసులు, భక్తులు సాక్షాత్తూ భగవత్ప్రతీకలని విశ్వసించడమే ఇందుకు కారణం. కనుకనే శ్రీరామకృష్ణుల ఆకాంక్ష మేరకు అతడు ఈ కాలంలో సాధువులకు నిత్యం అన్నదానం చేయడమేగాక, వస్త్రాలు, దుప్పట్లు, కమండలాలు తదితర నిత్యావశ్యకాలైన వస్తువులనన్నింటిని వారికి అందే ఏర్పాట్లు చేశాడు. ఈ ఏర్పాట్లు చక్కగా జరగడం కోసం ఆ వస్తువులనన్నిటిని కొనుగోలుచేసి ఒక పెద్ద గదిలో నిల్వవుంచి, శ్రీరామకృష్ణుల అనుజ్ఞానుసారం వాటిని పంపిణీ చేయాల్సిందిగా ఆలయ అధికారులను ఆదేశించాడు. ఇది జరిగిన కొద్దికాలానికే అన్ని సంప్రదాయాలకు చెందిన సాధుసత్తములకూ వారి వారి సాధనలకు అనుకూలమైన సామగ్రిని అందివ్వాలనే ఆకాంక్ష శ్రీరామకృష్ణులలో జనించినదని ఎరిగి అందుకు సముచిత ఏర్పాట్లన్నీ మథుర్ చేయించాడు.* ఇది బహుశా 1862–63 సం ॥ లో జరిగివుంటుంది. ఈ విధంగా రాణీ రాస్మణి కాళికాలయపు అద్భుతమైన అతిథి పరాయణత్వ సమాచారం, సాధుసన్న్యాసుల నడుమ విస్తృతంగా వ్యాప్తిగాంచింది. రాణీ రాస్మణి జీవితకాలంలోనే తీర్థయాత్రాదులకు పోయివచ్చే సాధువులకు కాళికాలయం చక్కని విశ్రామ స్థలంగా పరిగణింప బడుతూన్నప్పటికీ ఇప్పుడు దాని యశస్సు సుదూర ప్రాంతాలకు కూడా ప్రాకింది. ఫలితంగా అన్ని సంప్రదాయాలకు చెందిన సాధకాగ్రగణ్యులూ విరివిగా దక్షిణేశ్వరానికి రాసాగారు. అంతేగాక అక్కడ ఒసగబడుతూన్న అతిథి సేవలతో సంతుష్టి పొంది, పని మనుషులను, అధికారులను, యజమానులను మనఃస్ఫూర్తిగా ఆశీర్వదించి తమ త్రోవన పోసాగారు. ఇలా అక్కడకు ఏతెంచిన ప్రఖ్యాతులైన సాధుపుంగవులెందరిని గురించో శ్రీరామకృష్ణుల ముఖతా మేము విన్న సంగతులను మరొకచోట వివరించాం.* ఈ విషయం ఇక్కడ చెప్పడానికి కారణం: ‘జటాధారి’ అనే పేరు కలిగిన రామాయత్ సంప్రదాయానికి చెందిన సాధువు ఈ కాలంలోనే దక్షిణేశ్వరానికి ఏతెంచాడని పాఠకులకు తెలియజేయడం కోసమే. శ్రీరామకృష్ణులు ఆయనవద్ద రామమంత్రదీక్ష పుచ్చుకొన్నారు. అంతేగాక ‘రామ్‌లాలా’ అనబడే బాలరామచంద్రుడి ప్రతిమను కూడా ఆయన నుంచే అందుకొన్నారు. ఈ సంఘటన బహుశా 1864 లో జరిగి ఉండవచ్చు.
11. జటాధారి ఆగమనం
శ్రీరామచంద్రుడి పట్ల జటాధారికి ఉన్న అసామాన్య భక్తిప్రపత్తుల గురించి ఎన్నోసార్లు మేము శ్రీరామకృష్ణుల ముఖతా వినివున్నాం. జటాధారి పరమప్రేమను చూరగొన్నది బాలరామచంద్రుడి దివ్యమూర్తి. దక్షిణేశ్వరానికి రావడానికి పూర్వమే ఆ మూర్తిని దీర్ఘకాలం సేవించిన ఫలితంగా అతడి మనస్సు భావరాజ్యాన్ని అధిరోహించి ఎంతవరకు అంతర్ముఖం, తన్మయత్వం పొందినదంటే బాలరామచంద్రుడి జ్యోతిర్మయరూపం ఎదుట ప్రత్యక్షమై, సభక్తికమైన అతడి పావన సేవలను స్వీకరించడం జటాధారి చూడడం జరిగేది. మొదట్లో అటువంటి దర్శనం ఒక్క ముహూర్తకాలం మాత్రమే అప్పుడప్పుడు కలిగి అతడు పరమానందంతో విహ్వలుడయ్యేవాడు. క్రమంగా అతడు సాధనలో మరింత పురోగమించేకొద్దీ ఆ దర్శనం కూడా స్పష్టంగా దీర్ఘకాలం కొనసాగి, చివరికి నిత్యం చూసే వస్తువు మాదిరి సుస్పష్టమూ, నిరంతరము అయింది. ఇలా రాగాత్మికరాజ్యంలో సుప్రతిష్ఠితుడైన జటాధారి బాలరామచంద్రుణ్ణి దాదాపు నిత్యసహచరుడిగా పొందగలిగాడు. తదనంతరం ఏ ఆలంబనంతో తన జీవితంలో ఆ దివ్యదర్శన సౌభాగ్యం పొందాడో, ఆ ‘రామ్‌లాలా’ విగ్రహాన్ని ప్రేమాతిశయంతో నిత్యం సేవిస్తూ, ఇచ్ఛానుసారంగా భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకొంటూ దక్షిణేశ్వర కాళికాలయానికి జటాధారి ఏతెంచాడు.
12. శ్రీరామకృష్ణ జటాధారుల మధ్య నెలకొన్న సాన్నిహిత్యం
‘రామ్‌లాలా’ విగ్రహాన్ని పరిపూర్ణ హృదయంతో ఆరాధిస్తూన్న జటాధారి, అపర ప్రేమమూర్తి అయిన ఆ బాలరాముడి దివ్యదర్శనం తాను నిత్యం పొందుతున్నాననే రహస్యాన్ని ఎవరికీ వెల్లడించలేదు. కాని అతడొక లోహ ప్రతిమను అపూర్వ నిష్ఠతో సేవిస్తూండడం మాత్రమే జనం చూసేవారు. అంతవరకే వారికి తెలుసు. కాని ఆధ్యాత్మిక రాజ్యంలో ఏకచ్ఛత్రాధిపత్యం నెరపుతూన్న శ్రీరామకృష్ణుల దివ్యదృష్టి, జటాధారిని ప్రథమంగా కలుసుకొన్నప్పుడే ఆ బాహ్యా వరణాన్ని ఛేదించి, నిగూఢమైన అతడి రహస్యాన్ని కనుగొనగలిగింది. కాబట్టే ప్రథమ దర్శనంతోనే శ్రీరామకృష్ణులు ఆ సన్న్యాసి పట్ల అంత శ్రద్ధాసక్తులై, ఆయనకు అవసరమైన వస్తుసామగ్రిని ఆనందంతో సమకూర్చేవారు. అంతేకాక ప్రతిరోజూ గంటల పర్యంతం జటాధారితో గడుపుతూ రామ్‌లాలాను అతడు సేవిస్తూన్న తీరుతెన్నులను ప్రత్యక్షంగా చూసేవారు. జటాధారి ఏ ఆధ్యాత్మిక ప్రేమమూర్తి దివ్యదర్శనాన్ని సతతం పొందేవాడో, ఆ ప్రేమమూర్తిని శ్రీరామకృష్ణులు కూడ దర్శించడం జరిగిందనే ఉదంతాన్ని మేం మరొకచోట వివరించాం.* ఆ విధంగా శ్రీరామకృష్ణులకు జటాధారితో సంబంధం క్రమంగా అత్యంత సన్నిహితమూ, గౌరవప్రదంగా పరిణమించింది.
13. సఖీభావ మనోదశ
ఇంతకు ముందు వివరించినట్లుగా, సాధనలలోని భాగంగా శ్రీరామకృష్ణులు ఈ కాలంలో స్త్రీ భావంతో తన్మయులై ఉండేవారు. అంతఃప్రేరణ ప్రాబల్యంతో తనను తాను జగన్మాత నిత్య సఖీగా భావిస్తూ స్వహస్తాలతో పూల మాలలను కట్టి తల్లిని అలంకరించడం, వేసవికాలంలో చాలాసేపు దేవికి చామరంతో వీవడం, మథుర్‌తో చెప్పి కొంగ్రొత్త బంగారు ఆభరణాలను చేయించి, వాటితో జగజ్జననిని అలంకరించడం, అంతేగాక జగజ్జననిని సంతోషపరచే నిమిత్తం స్త్రీ వేషం ధరించి పాటలు పాడుతూ నృత్యం చేయడం – ఇత్యాది కార్యాలతో చాలాకాలం గడపసాగారు.
14. స్త్రీ భావ మనోదశలో వాత్సల్యభావ సాధన
జటాధారి సాంగత్యంలో శ్రీరామకృష్ణులలో నిబిడీకృతమైవున్న శ్రీరామభక్తి పునరుజ్జీవనం పొందింది. ఆయన ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రేమావతారుడు అయిన ‘బాల రామచంద్రుడి’ మూర్తిని గాంచసాగారు. స్త్రీభావ ప్రాబల్యంతో ఆయన హృదయం ప్రస్తుతం వాత్సల్య రసంతో నిండిపోయింది. తన పసిపిల్లను చూసినప్పుడు తల్లి ఏ అపూర్వ అనురాగాన్ని, ప్రేమాకర్షణను అనుభవిస్తూంటుందో, ఆ రామ్‌లాలాను చూస్తూన్నప్పుడు ఆయన అలాంటి అనుబంధానికి లోనయ్యారు. ఆ ప్రేమాకర్షణే నిస్సందేహంగా, ఆయనను ఇప్పుడు రామ్‌లాలా పక్కన కూర్చుండచేసి కాలం ఎలా గడిచిపోయేదో ఆయనకు తెలియనిచ్చేది కాదు. ఆ అపూర్వ దివ్యశిశువు తన తీయటి పసిచేష్టలతో తమను సర్వదా తనవద్దే ఉంచుకోవడానికి ప్రయత్నించేదనీ, తనను చూడలేకపోతే తల్లడిల్లుతూ తను వచ్చే మార్గాన్నే నిరీక్షిస్తూ ఉండేదనీ, ఎంత వద్దన్నా కూడ వినక సర్వదా తన వెన్నంటే తిరగడానికి ప్రయత్నించేదనీ శ్రీరామకృష్ణులు చెప్పగా మేం విన్నాం.
15. శ్రీరామకృష్ణుల సాధన ఉత్కృష్టతలు
శ్రీరామకృష్ణుల క్రియాశీల మానసం, చేపట్టిన ఏ కార్యాన్నీ అర్ధాంతరంగా వదిలేదికాదు. బాహ్యక్షేత్రంలో ఈ విధంగా వ్యక్తమయ్యే ఆయన ప్రవృత్తి సూక్ష్మ భావరాజ్యంలోనూ కచ్చితంగా ఇలాగే ఉండేది. స్వాభావికంగా ఏ భావమైనా దానంతట అదే ఆయన హృదయంలో స్ఫురించినప్పుడు ఆ భావ చరమసీమను చేరేదాకా, దాన్ని ప్రత్యక్షం చేసుకొనే దాకా ఆయన విశ్రమించేవారు కారు. శ్రీరామకృష్ణుల ఈ స్వభావాన్ని అవలోకించినప్పుడు పాఠకుడు ఇలా యోచించవచ్చు: ‘అలా చేయడం మంచిదా? మనస్సులో ఎప్పుడు ఏ ఆలోచన జనిస్తే పూర్వాపరాలు చూసుకోకుండా, దాని చేతిలో కీలుబొమ్మగా మారి దాని వెనుక పరుగులెత్తడం – మనిషికి మంచిని చేకూరుస్తుందా?’ దీనిలో కాస్త నిజం కూడ లేకపోలేదు. తమ మనస్సులో స్ఫురించే భావాలను అనుసరించే శ్రీరామకృష్ణుల నైజం వారిని ఏనాడూ పదభ్రష్టులను చేయలేదనడం తథ్యం. కాని సామాన్యులకు మాత్రం అదెప్పుడూ అనుకరణీయం కాదు. కారణం దుర్బలురైన సామాన్య వ్యక్తుల మనస్సుల్లో మిక్కుటంగా మంచి, చెడు సంస్కారాలు అనవరతం లేస్తూనే ఉంటాయి. తమలో సర్వదా కేవలం మంచిభావాలు మాత్రమే ఉదయిస్తాయనే అమిత విశ్వాసం ఉండడం సామాన్యులకు మంచిది కాదు. కాబట్టే కోరికలనే గుఱ్ఱాలను సతతం సంయమనమనే పగ్గంతో అదుపులో ఉంచుకోవడమే విద్యుక్తం.
16. సాధక శ్రేష్ఠులు: సంయమం
మనస్సంయమనం అత్యావశ్యకం అని పైన చెప్పిన అంశం ఎంతో యుక్తియుక్తమని ఒప్పుకోక తప్పదు. అయినా దీనికి మా సమాధానం కేవలం కామకాంచనాలపై లగ్నమైన దృష్టి కలదీ, విపరీత భోగాసక్తితో కూడినదీ అయిన మానవ మానసం తనను తాను అంతగా విశ్వసించడం ఎప్పటికీ భావ్యం కాదు అనే విషయం ఒప్పుకొని తీరాలి. కాబట్టి సామాన్యులు తమ కోరికలను అదుపులో ఉంచుకోవడం అత్యావశ్యకం. ఈ విషయంలో ఎవరికైనా సంశయం ఉంటే వారు దూరదృష్టిలేని మందమతులే. కాని భగవంతుడి కృప కారణంగా అరుదుగా కొందరు సాధకులకు, ఈ సంయమనం ఉచ్ఛ్వాస – నిశ్వాసాల మాదిరి అతి సహజమూ, స్వాభావికమూ అవుతుందనే సంగతి వేదాది శాస్త్రాలలో పేర్కొనబడింది. వారి మనస్సు అప్పుడు కామ కాంచనాసక్తి నుంచి పూర్తిగా విడివడి, కేవలం సద్భావాలకు నిలయం అవుతుంది. శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: “జగన్మాతను పూర్తిగా శరణు జొచ్చిన వ్యక్తి మనస్సులో ఆమె కృప కారణంగా ఏ చెడు భావనా తలయెత్తి తన ఆధిపత్యాన్ని సాగించలేదు. అమ్మ (జగజ్జనని) అతడినెప్పుడూ తప్పుటడుగు వెయ్యనివ్వదు.” ఇలాంటి మహోన్నతావస్థకు చేరుకొన్న వ్యక్తి తన మనస్సులో జనించే తలంపుల నన్నిటినీ పూర్తిగా విశ్వసించవచ్చు. అతడు అలా చేయడం ద్వారా కీడు వాటిల్లదు సరికదా, తద్భిన్నంగా ఇతరులకు ఎంతో శ్రేయస్సు చేకూరుతుంది. కారణం, దేహాభిమానమగ్నులమై, ‘నేను, నేను’ అనే ఏ నిమ్న అహంభావ ప్రేరణతో, స్వార్థపరులమై లోకంలోని సమస్త సుఖభోగాలనూ పొందాక కూడ మనం సంతృప్తులం కాజాలమో, అలాటి నిమ్న ‘అహంకారాన్ని’ ఈశ్వరుడి విరాట్ అహంకారంతో విలీనం చేస్తారు ఆ మహానుభావులు. అలా చేసిన వారికి ఇక స్వార్థసుఖం నిమిత్తం పాటుపడడం అసంభవకార్యం. కాబట్టి అశేష కల్యాణ గుణసంపన్నుడైన ఈశ్వరుడి శుభసంకల్పం, లోకకల్యాణం నిమిత్తం అటువంటి మహనీయుల అంతరంగాల్లో వివిధ మనోభావాల రూపంలో వ్యక్తం అవుతూంటుంది. లేదా అటువంటి అవస్థకు చేరుకొన్న సాధకుడు అప్పుడు, ‘నేను యంత్రాన్ని, నువ్వు చాలకుడవు’ అనే అంశాన్ని ప్రతీక్షణం అంతరాంతరాళాల్లో అనుభవం చేసుకొని, తన మనస్సులో తలయెత్తే సంకల్పాలను నిశ్చయంగా నమ్మి, వాటి ప్రేరేపణతో వాటిని ఆచరించడానికి కించిత్తయినా సంశయించడు. ఫలితం కూడ తదనుగుణంగానే కనిపిస్తుంది. అటువంటి వారి ఆచరణ ద్వారా అశేష లోకకల్యాణం ఒనగూరుతుంది. పైన వర్ణించబడ్డ మహోన్నతావస్థ శ్రీరామకృష్ణుల వంటి అసాధారణ మహాపురుషుల జీవితాలలో తొలిదశలోనే ఆరంభమవుతుంది. కనుకనే అలాంటి మహనీయుల జీవిత చరిత్రలను చదువుతూన్నప్పుడు వారంతా ఏ మాత్రం యుక్తి విచారం చేయకనే తమ మనస్సులో ఉదయించే భావాలన్నిటిలో పూర్తి విశ్వాసం ఉంచి, అనేకమార్లు వాటిని కార్యరూపంలో పెట్టడం మనకు కనిపిస్తుంది. తమ నిమ్న సంకల్పాలను విరాట్పురుషుడి సంకల్పంతో సదా ఐక్యం చేసి, సామాన్యుల మనోబుద్ధులకు గోచరంకాని సూక్ష్మాంశాలనన్నిటినీ గ్రహించి, అవగతం చేసుకోగలుగుతారు ఈ మహాత్ములు. విరాట్పురుషుడి మనస్సులో ఈ సూక్ష్మ భావాలన్ని చిరకాలంగా నిలిచి ఉండడమే ఇందుకు కారణం.
17. అటువంటి సాధకులు వారికి సంభవించనున్న మృత్యువు విషయంలోను కలత చెందరు
మళ్ళీ సదా సంపూర్ణంగా విరాట్పురుషుడి సంకల్పాన్నే అనుసరిస్తూ ఉండడంవల్ల వారెంత మేరకు స్వార్థశూన్యులు, భావశూన్యులై ఉంటారంటే, ఎలా ఎవరి ద్వారా లేదా ఏ పరిస్థితుల్లో తమ క్షుద్ర మనఃశరీరాలు మృత్యుగ్రస్తాలవుతాయో ఆ విషయం గురించి ముందుగానే చక్కగా తెలుసుకొన్న తర్వాత కూడ ఆ వస్తువులపైగాని, ఆ వ్యక్తుల మీదగాని కించిత్తు అయినా కోపం వహించరు సరికదా, ఆ కార్యసాధనలో (అంటే తమ మృత్యువుకు) సాధ్యమైనంత వరకు వారికి సహాయం చేస్తూంటారు. కొన్ని ఉదాహరణల ద్వారా పాఠకుడికి మా అభిమతం అవగతం కాగలదు. సీతాదేవి నిష్కళంకిత అని కచ్చితంగా ఎరిగి ఉన్నప్పటికీ ఆమె బహిష్కరణ అనివార్యం కాబట్టి, ఆమెను అడవులకు పంపటం జరిగింది. మళ్ళీ ప్రాణసముడైన తమ్ముడు లక్ష్మణుణ్ణి విడనాడితే, తన మానవలీల సమాప్తం అవుతుందని ఎరిగే, శ్రీరామచంద్రుడు అతణ్ణి పంపేశాడు. తన యదువంశం నశించిపోతుందని ముందుగానే తెలిసినప్పటికీ, తన్నివారణార్థం ఏ స్వల్ప ప్రయత్నమూ చేయకపోగా, ఆ ఘటన కచ్చితమైన సమయంలో జరిగేందుకు శ్రీకృష్ణుడు దోహదం చేశాడు. మళ్ళీ ఒక వేటగాడి చేతుల్లో తన ప్రాణం పోతుందని తెలిసీ, సరైన అదనులో అక్కడకు వెళ్ళి, లేత పద్మపత్రాల వంటి పాదాలు మాత్రం వేటగాడికి కనబడేట్లు గుబురైన పొదల నడుమ తన యావద్దేహాన్ని మరుగుపరచి కూర్చోగా వేటగాడు ఆ పాదాలు చూసి, మృగమని భ్రమించి తన నిశితశరాన్ని ప్రయోగించాడు. తన పొరపాటుకు పశ్చాత్తాపం చెందిన ఆ వ్యాధుణ్ణి ఊరడించి, ఆశీర్వదించి, అనంతరమే యోగబలంతో దేహాన్ని పరిత్యజించాడు శ్రీకృష్ణుడు.
అలాగే కరుణాసముద్రుడైన బుద్ధుడు, చండాలుడి ఆతిథ్యాన్ని స్వీకరించాక తాను పరినిర్వాణంలో ప్రవేశిస్తానని ముందే ఎరిగీ, ఆ ఆతిథ్యాన్ని గ్రహించి, అతణ్ణి ఆశీర్వదించి, ఊరడించి, ఇతరుల నిందాద్వేషాల నుంచి అతణ్ణి రక్షించి, ఆ మీదటే మహాసమాధి పొందాడు. మళ్ళీ స్త్రీలకు సన్న్యాస స్వీకారం అనుమతిస్తే తాను ప్రచారం చేసిన ధర్మం త్వరలోనే కలుషితమౌతుందని తెలిసీ తన మేనత్త అయిన గౌతమీదేవి సన్న్యసించటానికి అనుమతి నిచ్చాడు.
ఏసుక్రీస్తు తన శిష్యుడైన జూడాస్ ధనలోభంతో ద్రోహం చేసి; తనను శత్రువులకు పట్టిస్తాడనీ, తద్ద్వారా తనకు మరణం సంభవిస్తుందనీ ఎరిగీ, అతడి పట్ల సమానంగా ప్రేమను ప్రదర్శించడం జరిగింది.
18. అలాంటి సాధకులు నిస్వార్థపరులు
పరిశోధించి చూస్తే కేవలం అవతారమూర్తుల విషయంలోనేకాక, జీవన్ముక్తుల జీవితాల్లోనూ అటువంటి ఘటనలు ఎన్నో మనకు కానవస్తాయి. అవతారమూర్తులందరి జీవితాల్లోనూ ఒక వంక అసాధారణమైన వ్యక్తిగత ప్రయత్నమూ, మరోవంక ఈశ్వరేచ్ఛమీద పూర్తిగా ఆధారపడడమూ – ఈ రెండూ ఒకే సమయంలో కనిపిస్తాయి. పరస్పర విరుద్ధంగా కానవచ్చే ఈ రెండిటికీ యుక్తియుక్త పోలిక చేయాలంటే ఈశ్వరేచ్ఛయే వారిలో స్వప్రయత్నంగా వ్యక్తమౌతోందనే నిర్ణయానికి మనం రాక తప్పదు. కాబట్టి భగవదేచ్ఛను పూర్తిగా అనుసరించే పురుషుల్లోని స్వార్థసంస్కారాలన్నీ సంపూర్ణంగా నాశనమై, వారి మనస్సు ఎలాంటి పవిత్ర సీమను అధిరోహిస్తుందంటే కించిత్తయినా స్వార్థగంధంలేని అతిశుద్ధ భావాలు మాత్రమే అప్పుడు ఆ సీమలో ఉదయిస్తాయి. అలాటి శుద్ధావస్థను చేరుకొన్న సాధకులు ఇక నిశ్చింతులై, తమ మనస్సులో ఉదయించే ఆశయాలన్నిట్లో సుస్థిర విశ్వాసాన్ని నిలిపి, అవి ప్రేరేపించినట్లు ప్రవర్తించవచ్చు. తద్ద్వారా వారిని ఏ దోషమూ అంటదు. కాని సామాన్యులు శ్రీరామకృష్ణుల చర్యలను అనుకరించకూడదు. అయినా పైన పేర్కొన్న అసాధారణ అవస్థకు చేరుకొన్న సాధకులకు అవి జ్ఞానోదయం కలిగించి, వారి జీవితాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి.
అటువంటి ఉన్నత ఆధ్యాత్మిక భూమిని చేరుకొన్న సాధకుల ఆహార విహారాది జీవిత వ్యాపారాలను శాస్త్రాలు దగ్ధబీజాలతో పోలుస్తున్నాయి. వృక్షలతాదుల విత్తనాలు వేయించినప్పుడు అవి మళ్ళీ ఎలా మొలకెత్తజాలవో, అలాగే ఆ సాధకుల లౌకిక వాసనలన్నీ సంయమనమనే జ్ఞానాగ్నిలో దగ్ధమై, మళ్ళీ వారిని ఎన్నటికీ భోగవాసనల వైపు ఆకర్షించి, మార్గభ్రష్టులను చేయజాలవు. “ఉక్కు కత్తి పరసువేదిని స్పృశించినప్పుడు బంగారు కత్తిగా మారుతుంది. భయానకమైన దాని ఆకారం మారనప్పటికీ, ఇక దానితో ఎవరినీ గాయపరచలేం” అంటూ శ్రీరామకృష్ణులు ఈ అంశం మీద వ్యాఖ్యానించేవారు.
19. అలాంటి సాధకులు సత్యసంకల్పులవుతారు: ఇందుకు శ్రీరామకృష్ణుల జీవితంలో దృష్టాంతాలు
పైన పేర్కొన్న అవస్థకు చేరుకొన్న సాధకులు సత్యసంకల్పులవుతారని ఉపనిషద్రష్టలైన ఋషులు చెబుతున్నారు. అంటే వారి మనస్సులలో ఉదయించే సంకల్పాలన్నీ కూడ సత్యమే అయితీరుతాయి, ఏనాటికీ వమ్ముకావు. భావముఖంలో నెలకొన్న శ్రీరామకృష్ణుల మానసంలో ఉదయించే భావాల నన్నిటినీ పదేపదే పరీక్షించి, అవి యథార్థం కావడం చూడలేక పోతే మేమూ ఆ ఋషుల మాటలను ఏనాటికీ విశ్వసించేవారం కాం. కాని ప్రత్యక్షంగా మేం చూశాం – ఫలానా ఆహారాన్ని స్వీకరించడానికి గురుదేవులు సంకోచిస్తే, కారణం ఆరాతీయగా, అంతకు మునుపే అది అపవిత్రం అయివుండడం జరిగేది. ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక విషయాలపై సలహాలను ఇవ్వ పూనుకొన్నప్పుడు, హఠాత్తుగా ఆయన నోరు మూతపడేది. విచారించి చూస్తే, ఆ వ్యక్తి ఇందుకు పూర్తిగా అనర్హుడని తేలేది. ఫలానా వ్యక్తికి అతడి జీవితకాలంలో ఆధ్యాత్మిక అనుభూతి కలుగదనీ లేదా ఏ కొంచెం మాత్రమో కలుగవచ్చని ఆయన తలిస్తే, నిజానికి అది అలాగే జరిగేది. ఫలానా వ్యక్తిని ఆయన చూసినప్పుడు ఆయనలో ప్రత్యేకమైన ఒక భావం గాని లేదా ఒకానొక దేవతారూపం గాని మెదలితే, ఆ వ్యక్తి ఆ భావం యొక్క సాధకుడని లేదా ఆ దేవతామూర్తిని ఆరాధించే సాధకుడని తేటతెల్లమయ్యేది. శ్రీరామకృష్ణులు అకస్మాత్తుగా ఒక వ్యక్తితో తన అంతఃకరణ ప్రేరణతో ఏదైనా చెబితే, ఆయన పలుకుల మూలంగా అశేష కాంతిని కాంచి, అతడి జీవితం ఆమూలాగ్రం మార్పుచెందేది. ఇటువంటి సంఘటనలు శ్రీరామకృష్ణుల జీవితంలో కోకొల్లలు.
20. శ్రీరామకృష్ణులు, జటాధారి నుండి మంత్రోపదేశం పొందడం – వాత్సల్యభావ సాధన
జటాధారి దక్షిణేశ్వరానికి ఏతెంచిన సమయంలో శ్రీరామకృష్ణులు అంతఃప్రేరణ ద్వారా బాహ్యాభ్యంతరంగా తమను పూర్తిగా ఒక స్త్రీగా భావించుకొంటూ, తదనుసారంగా ప్రవర్తించసాగారు. బాల రామచంద్రుడి అపూర్వ దర్శనం పొంది, అతడి పట్ల వాత్సల్యభావపూరితులైనారని మునుపే చెప్పుకొన్నాం. కులదైవం అయిన శ్రీ రఘువీరుడి పూజా సేవాదులను సముచిత రీతిలో ఆచరించడంకోసం బాల్యంలోనే ఆయన శ్రీరామ మంత్రదీక్షను పొందినప్పటికీ, శ్రీరాముణ్ణి ప్రభువుగా ఎంచడం తప్ప ఇతర భావాలవైపు ఆకర్షితులు కాలేదు ఆయన. కాని ఆయన హృదయం ఈ సమయంలో వాత్సల్యభావ పూరితం కావడంతో, గురువుల నుంచి యథావిధిగా ఆ భావాన్ని సాధించడానికి ఉపయుక్తమైన మంత్రాన్ని పొంది, దాని చరమానుభూతిని పొందడానికి ఆరాటపడసాగారు శ్రీరామకృష్ణులు. బాల రామచంద్రుడి మంత్రంలో సిద్ధిపొందిన జటాధారి, శ్రీరామకృష్ణుల అభిలాషను ఎరిగి, మహా సంతోషంతో తన ఇష్టమంత్రంలో దీక్షితులను చేశాడు. శ్రీరామకృష్ణులూ ఆ మంత్ర సహాయంతో గురు నిర్దేశిత మార్గాన్ని అనుసరించి, సాధనలో నిమగ్నులై కొన్ని రోజులలోనే బాలరామచంద్రుడి నిరంతర దివ్యదర్శన భాగ్యాన్ని పొందగలిగారు. వాత్సల్య భావంలో ఆ దివ్యమూర్తి ధ్యానంలో తన్మయులై ఆయనను అచిరకాలంలోనే సాక్షాత్కరించు కొన్నారు.
జో రాం దశరథకీ బేటా, వహీరాం ఘటఘటమే లేటా ।
వహీరాం జగత్పశేరా, వహీరాం సబ్సే నేయారా ॥
‘దశరథ పుత్రుడైన శ్రీరాముడే ప్రతి దేహంలో జీవుడుగా వ్యక్తమౌతున్నాడు, అతడే జగత్తు లోపలా, బయటా అద్వితీయుడై ఉన్నాడు.’
అంటే శ్రీరామచంద్రుడు కేవలం దశరథ నందనుడనే కాదు, ఈ లోకంలోని ప్రతీ మనిషి దేహాన్ని ఆశ్రయించి జీవరూపుడిగా ప్రకాశిస్తూన్నాడు. మళ్ళీ అతడలా లౌకిక రూపంతో నిత్యం వ్యక్తమౌతూన్నా కూడా, అతడు ప్రపంచం కంటే సంపూర్ణంగా భిన్నుడు, మాయారహితుడు, నిర్గుణుడు, నిత్యసత్యుడు.
పైన ఉదహరించిన హిందీ పంక్తులను శ్రీరామకృష్ణులు ఎన్నోసార్లు వల్లించడం మేం వినివున్నాం.
21. జటాధారి ‘రామ్‌లాల్’ విగ్రహాన్ని శ్రీరామకృష్ణులకు కానుకగా ఇవ్వడం
శ్రీరామకృష్ణులకు ఇలా మంత్రదీక్షను ఇవ్వడమే కాక, తాను ఇంతకాలం అనన్యభక్తి ప్రపత్తులతో సేవిస్తూ వచ్చిన ‘రామ్‌లాలా’ (బాలరామచంద్రుడి) విగ్రహాన్ని ఆయనకు కానుకగా ఇచ్చి దక్షిణేశ్వరం నుంచి జటాధారి నిష్క్రమించాడు. ఆ చైతన్య విగ్రహం తానిక శ్రీరామకృష్ణుల వద్దనే ఉండిపోతాననే ఆకాంక్షను జటాధారికి వ్యక్తం చేయడమే ఇందుకు కారణం కావచ్చు. ఆ విగ్రహ అపూర్వ లీలావిలాసాన్ని గురించి మరోచోట మేం విపులంగా వర్ణించాం.* కాబట్టి దీన్ని గురించి ఇక్కడ ప్రస్తావించడం అవసరంలేదు.
22. వాత్సల్యభావ సాధనలో భైరవీ బ్రాహ్మణి సహాయం
వాత్సల్యభావపు పరిపూర్ణత్వాన్ని, దాని చరమానుభూతిని పొందగలందులకై శ్రీరామకృష్ణులు పైన వర్ణింపబడినట్లు ఆ సాధనానుష్ఠానంలో నిమగ్నులైన కాలఘట్టంలో భైరవీ బ్రాహ్మణి దక్షిణేశ్వరంలో నివసించిందనే సంగతిని గతంలోనే తెలిపాం. తంత్రశాస్త్రాలతోనే గాక పంచభావాలతో కూడిన వైష్ణవ మతసాధనలోనూ ఆమె నిష్ణాతురాలనే సంగతిని మేం శ్రీరామకృష్ణుల ముఖతా విన్నాం. కాబట్టి వాత్సల్య, మధురభావ సాధనలను ఆచరిస్తూన్నప్పుడు ఆయన ఆమె ద్వారా ప్రత్యేకంగా ఏ సహాయాన్నైనా పొందారా? మేం ఈ విషయంగా ఆయన నుంచి స్పష్టంగా ఏమీ వినలేదు. కాని వాత్సల్య భావంలో సుప్రతిష్ఠితురాలై, ‘బ్రాహ్మణి’ చాలాకాలం శ్రీరామకృష్ణులను బాలగోపాలుడిగా ఎంచి, ఆయనను సేవించేదన్న విషయం శ్రీరామకృష్ణుల నుండి, హృదయ్ నుండి మేం వినడం జరిగింది. కాబట్టి శ్రీరామచంద్రుని బాలగోపాలమూర్తిని తన బిడ్డడిగా ఎంచి వాత్సల్యభావ సాధనను అనుష్ఠించి దాన్లో చరమసాక్షాత్కారాన్ని పొంది నప్పుడూ, తన నొక స్త్రీగా భావించి శ్రీకృష్ణుణ్ణి తన ప్రియుడిగా భావించి మధుర భావ సాధనలో ఉన్నప్పుడూ, శ్రీరామకృష్ణులు, బ్రాహ్మణి నుంచి ఏదో కొంత సహాయాన్ని పొంది వుండవచ్చునని మనం ఊహించుకోవచ్చు. ఏ రకమైన ప్రత్యేక సహాయమూ ప్రత్యక్షంగా పొందకపోయినప్పటికీ బ్రాహ్మణి స్వయంగా ఆ సాధనల్లో నిష్ణాతురాలై ఉండడం చూసీ, వాటి ప్రాశస్త్యాన్ని ఆమె ముఖతా వినీ, వాటిని సాధించాలనే తీవ్ర ఆకాంక్ష శ్రీరామకృష్ణుల మనస్సులో కలిగివుంటుందనే నిజాన్ని మనం అంగీకరించక తప్పదు.