1. శ్రీరామకృష్ణుల పట్ల బ్రాహ్మణికి గల కచ్చితమైన అవగాహన
శ్రీరామకృష్ణులు అవతారమూర్తి అన్న నిర్ణయానికి భైరవీ బ్రాహ్మణి కేవల హేతువాదంతో రాలేదు. శ్రీరామకృష్ణులను ప్రప్రథమంగా కలుసుకున్నప్పుడు ఆయనతో సహా మరిద్దరిని కలుసుకొని వారి ఆధ్యాత్మిక జీవన పురోభి వృద్ధిలో తాను తోడ్పడవలసివుందని ఆమె చెప్పడం పాఠకులకు సువిదితమే. శ్రీరామకృష్ణులను కలుసుకోవటానికి చాలాకాలం క్రితమే ఆమె జగన్మాత నుండి ఆదేశాన్ని పొందింది. ఆమె ఆధ్యాత్మిక సాధనాజనిత దివ్యదృష్టే ఆమెను దక్షిణేశ్వరానికి రావించి, శ్రీరామకృష్ణులను అవగాహన చేసుకోవడంలో ఆమెకు సహాయపడింది. రోజులు గడిచేకొద్దీ, శ్రీరామకృష్ణులకు అతిసన్నిహితం అయ్యేకొద్దీ – శ్రీరామకృష్ణుల సాధనానుష్ఠానాలలో తన పాత్ర ఏమిటో, తాను అందించవలసిన సహాయం ఏ రీతిలో ఉండాలో బ్రాహ్మణికి స్పష్టం కాసాగింది. కాబట్టే సామాన్య జనంలో శ్రీరామకృష్ణులను గురించి ఉన్న అపోహను తొలగించడంతోనే తన సమయాన్నంతా గడపలేదామె. శాస్త్రబద్ధమైన వివిధ సాధనలను అనుష్ఠించడంలో శ్రీరామకృష్ణులను నిమగ్నులను చేసింది. శ్రీరామకృష్ణులు జగజ్జననిని విస్పష్టంగా చూడగలందులకై, ఆమె అనంత అవ్యాజ కరుణాకటాక్ష ప్రాప్తికై – ఆయనను దివ్యభావనలో సుప్రతిష్ఠితులను చేయడానికి, ఆయనతో వివిధ ఆధ్యాత్మిక సాధనలను చేయించడంలో బ్రాహ్మణి నిమగ్నురాలైంది.
2. బ్రాహ్మణి, శ్రీరామకృష్ణులను తాంత్రిక సాధనలు ఎందుకు చేయమన్నది?
గురుపరంగా వస్తూన్న శాస్త్రనిర్దిష్టమైన సాధనామార్గాలను అనుసరించక, కేవలం హృదయపూర్వకమైన భగవదనురాగంతో మాత్రమే జగన్మాత దర్శనం పొందగలిగారు శ్రీరామకృష్ణులు. కాబట్టే తమ ఉన్నతావస్థను గురించిన సంశయాల నుండి ఆయన విముక్తులు కాలేకపోతున్నారనే విషయాన్ని గ్రహించడానికి సాధనలో పురోగమించిన బ్రాహ్మణికి ఎంతో సమయం పట్టలేదు. తమకు కలిగిన అలౌకిక దివ్యానుభూతులన్నీ మతిభ్రమ కారణంగా కలిగినవేమోననీ, తమ శరీరంలో కలుగుతున్న భౌతిక మానసిక పరిణామాలన్నీ దాపురించబోయే ఏ ఘోరవ్యాధి తాలూకు చిహ్నాలో అనీ సందేహం అప్పుడప్పుడు ఆయనలో మెదలుతూండేది. ఆ సందేహ నివారణోపాయంగా ప్రస్తుతం బ్రాహ్మణి ఆయనను తాంత్రిక సాధనలను చేపట్టమని ప్రోత్సహించింది. ఎందుకంటే సాధకుడు ఎలాంటి సాధనను అనుష్ఠిస్తే ఏ ఫలితాన్ని పొందుతాడో తంత్రశాస్త్రాలలో స్పష్టంగా ఉల్లేఖీంచబడినది. శ్రీరామకృష్ణులూ అదే రీతిలో సాధనలు చేయగలిగితే, గతంలో ఎందరో సాధకులు నిర్దుష్టమైన ఆ సాధనలను గావించి ఎలాంటి అనుభూతులను పొందగలిగారో, ఆయన కూడ అలాంటి అనుభూతులను పొందినప్పుడు, తమ అవస్థ వ్యాధిజనితం కాదనే యథార్థాన్ని ఆయన గ్రహిస్తారని బ్రాహ్మణికి తెలుసు. అంతేగాక సాధన మూలంగా మనిషి ఉన్నత ఆధ్యాత్మిక భూములను అధిరోహించేకొద్దీ తన మనశ్శరీరాలలో మహాద్భుతమైన శారీరక మానసిక పరిణామావస్థలు కలుగుతాయనీ, కాబట్టే స్వయంగా తనలో జనించిన మార్పులన్నీ కలిగేవే అన్న దృఢవిశ్వాసం శ్రీరామకృష్ణులలో ఏర్పడగలదని బ్రాహ్మణి ఆలోచన చేసింది. తత్ఫలితంగా ప్రస్తుతం ఆయన చేగొన్న తాంత్రిక సాధనానుష్ఠాన ఫలంగా భవిష్యత్తులో వారికి కలిగే దివ్యదర్శనాలు, దివ్యానుభూతులు – అవన్నీ సత్యమనీ, సాధన చేసేవారందరికీ అవన్నీ కలుగుతాయని గ్రహించి, నిస్సంశయంతో ఆయన తన లక్ష్యంవైపు ఏ అడ్డంకీలేక సాగిపోగలరని నమ్మింది. కాబట్టే గురువాక్యాలతో, శాస్త్రోపదేశాలతో స్వీయ అనుభవాలు సరిపోతున్నవో లేదో సరిపోల్చుకోమని శాస్త్రాలు సదా సాధకుడికి హితవు చేయడానికి ఇదే కారణమనీ బ్రాహ్మణికి తెలుసు.
3. అవతారమూర్తియైన ఆయనకు సహాయపడాలని బ్రాహ్మణికి ఎలా తోచింది?
శ్రీరామకృష్ణులు అవతారపురుషులని ఎరిగీ వారి చేత సాధనలను చేయించడానికి బ్రాహ్మణి ఎందుకు పూనుకొన్నది అనే ప్రశ్న తలెత్తవచ్చు. భగవదవతారాల వైభవాన్వితాలను ఎరిగివున్నప్పుడు, వారు పరిపూర్ణులనీ, ఈ సాధనలన్నీ వారికి అనావశ్యకాలనీ అంగీకరించాలి గదా! అందుకు జవాబు: శ్రీరామకృష్ణుల సర్వశ్రేష్ఠ మహత్వం ఆమె మనస్సులో సదా చేతనలో ఉండివుంటే పైన చెప్పింది నిజం. కాని అలా జరగలేదు. మొట్టమొదట కలుసుకొన్నప్పటి నుంచి బ్రాహ్మణి శ్రీరామకృష్ణులను తన బిడ్డ మాదిరి ప్రేమించసాగింది. బిడ్డ జ్ఞాన సంపదను మరిపించి, తన ముద్దు బిడ్డ సంక్షేమానికై ఆత్మ సమర్పణం చేయించ గలిగే శక్తి ఒక్క మాతృప్రేమకు కాక ఈ లోకంలో దేనికి సాధ్యం? కాబట్టి యథార్థ ప్రేమ ప్రేరణాబలం చేతనే ఆమె శ్రీరామకృష్ణులను సాధనలలో నియుక్తుణ్ణి గావించినదనే విషయం స్పష్టమౌతున్నది. అవతారమూర్తులైన అందరి జీవితాలనూ పరికించినప్పుడు మనకు ఈ పరిస్థితి ద్యోతకమవుతుంది. వారికి అతి సన్నిహితులైన వ్యక్తులందరూ కూడ ఆ అవతారమూర్తుల అలౌకిక దివ్యశక్తులను గాంచి కొన్ని సమయాలలో విస్మయులవుతున్నప్పటికీ, మరుక్షణంలోనే అంతా మరచిపోయేవారు. అంతేగాక వారిపట్ల ఉండే ప్రేమతో ముగ్ధులై, ఇతరుల మాదిరి వారిని పరిమిత జ్ఞానులుగా ఎంచి, వారి సంక్షేమం కోసం పాటుపడుతూ ఉండడం మనం చూడవచ్చు. అదే విధంగా బ్రాహ్మణి కూడ శ్రీరామకృష్ణుల అసాధారణ భావపారవశ్యాన్ని, అలౌకిక శక్తి వ్యక్తీకరణను చూసి తరచూ దిగ్భ్రాంతురాలైనప్పటికీ మాతృప్రేమతో మరుక్షణమే అంతా మరచిపోయేది. ఆమె పట్ల శ్రీరామకృష్ణులు కనబరచిన శుద్ధప్రేమ, విశ్వాసం, పసిపిల్లవాడి మాదిరి పూర్తిగా ఆమె మీద ఆధారపడేవారు, ఇవి సున్నితమైనప్పటికీ, ఆ సన్న్యాసిని హృదయం నుంచి, తీవ్ర మాతృవాత్సల్య తరంగాలను రేపాయని ప్రత్యేకంగా చెప్ప పనిలేదు. కాబట్టే ఈ మాతృవాత్సల్యం ఆయన శక్తులను ఆమె తెలుసుకోకుండా అడ్డుపడింది. అంతేగాక సర్వవిధాలా ఆయనను సంతోషంగా ఉంచేటట్లూ, ఇతరుల నిర్బంధాల నుంచి ఆయనను రక్షించేటట్లూ, సాధనానుష్ఠానంలో ఆయనకు సహకరించేటట్లూ కూడ ఈ వాత్సల్యమే బ్రాహ్మణికి స్ఫూర్తినిచ్చింది.
4. అలా చేయడంలో బ్రాహ్మణి ఆతురత
పరమయోగ్యుడైన శిష్యుడికి బోధించే సదవకాశం కలిగినప్పుడు ఆచార్యుడి హృదయం తృప్తి – ఆత్మతృప్తిని పొందుతుంది. ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మిక రంగంలో శ్రీరామకృష్ణుల వంటి సర్వోత్కృష్ట వ్యక్తి జన్మించివుంటాడని బ్రాహ్మణి కలలో కూడ ఊహించలేదు. శ్రీరామకృష్ణులకు బోధించే అవకాశం లభించి నప్పుడు ఆమె హృదయం పరమానందం పొందివుంటుదనడం నిస్సంశయం. తన అధ్యయన, తీవ్ర తపోఫలితాలను స్వల్పకాలంలోనే ఆయనచేత కూడ అనుభవింపచేయడానికి ఆమె ఆతురత వహించినదనడంలో అబ్బురం లేదు.
5. జగజ్జనని అనుజ్ఞతోనే శ్రీరామకృష్ణులు తాంత్రిక సాధనలను అనుష్ఠించడం: వాటికోసం ఆయన వ్యాకులత
తాంత్రిక సాధనలను అనుష్ఠించడంలోని ఔచిత్య ఆవశ్యకతల గురించి వాటి ప్రారంభానికి మునుపే జగజ్జననిని అడిగి, ఆమె అనుజ్ఞను పొందే, ఆ సాధనలు ఆచరించినట్లు శ్రీరామకృష్ణులే స్వయంగా మా కొకప్పుడు తెలిపారు. కాబట్టి కేవలం బ్రాహ్మణి ఆతురత, ప్రేరణలతోనే ఆయన ఆ సాధనలను ప్రారంభించలేదు. అంతేగాక సాధనాజనిత యోగదృష్టి ద్వారా కూడ శాస్త్రోక్త విధానాలను అనుసరించి జగన్మాతను సాక్షాత్కరించుకొనే సమయం ఆసన్నమైనదని తమ హృదయాంతరాళంలో ఆయనకు తోచింది. ఈ విధంగా శ్రీరామకృష్ణుల ఏకాగ్రచిత్తం ఇప్పుడు బ్రాహ్మణి నిర్దేశించిన సాధనామార్గంలో ఆతురతతో పరుగులెత్తసాగింది. ఆయన అనుభవిస్తూన్న ఆ ఆతురత, తీవ్రతను మనబోటి అతి సామాన్యులు తెలుసుకోవడం అసాధ్యం. అందుకు కారణం: అంతులేని ప్రాపంచిక విషయాల వెంట నాలుగు దిక్కులా పరుగులెత్తే మన మనస్సులకు ఆ సంయమన శక్తి, ఏకాగ్రతా ఎక్కడవి? ఇంద్రజాల సదృశాలైన ఈ గాజుపెంకులతో క్రీడించడం విడనాడి, భావాంతరాళంలో మునిగి, వజ్రఖనులతో నిండిన సాగరగర్భానికి చేరే సాహసం మనకు ఎక్కడున్నది? ‘పూర్తిగా మునిగిపో’, ‘నీలో నువ్వు మునిగిపో’ అంటూ పదే పదే గురుదేవులు ఏ భావంతో మమ్మల్ని ప్రేరేపిస్తూండేవారో, ఆ భావాన్ని అనుసరించి, జగత్తులోని పదార్థాలన్నిటి మీద, చివరికి స్వకీయ దేహం మీది అనురక్తిని వీడి మాయామమతలను ఛేదించి, ఆధ్యాత్మిక లోతులలో మునిగిపోగలిగే శక్తి మనకెక్కడిది? దుర్భర పరితాపంతో, మహావ్యాకుల హృదయంతో, ‘అమ్మా! దర్శనం ఇవ్వు’ అని ప్రార్థిస్తూ పంచవటి క్రింద, గంగా సైకత తీరం మీద రక్తం స్రవించేవరకు గురుదేవులు ముఖాన్ని నేలకేసి రాచుకొనేవారని, ఎన్ని రోజులు గడచినా ఆ వ్యాకులతా భావం ఉపశమించేది కాదని మనం విన్నప్పుడు ఆ పలుకులు మన చెవులలో ప్రవేశించినా నిజానికి అవి మన హృదయ సీమను కించిత్తయినా ప్రతిస్పందింపజేయవే! ఎలా ప్రతిస్పందింపజేస్తాయి? జగజ్జనని వాస్తవంగానే ఉన్నది. అన్నిటినీ త్యజించి, వ్యాకులతా హృదయంతో ఆమెను పిలిస్తే తప్పక ఆమె సాక్షాత్కరిస్తుంది – అన్న విశ్వాసం శ్రీరామకృష్ణులకు ఉన్నట్టు మనకు ఉందా?
6. సాధనాకాలంలో గురుదేవుల తీవ్రవ్యాకులత
కాశీపూర్ ఉద్యానవాటికలో నివసిస్తున్నప్పుడు గురుదేవులు మా కొకరోజు సాధనాకాలంలో తాము అనుభవించిన తీవ్ర వ్యాకులతను గురించి ఒకింత సూచనప్రాయంగా తెలిపి మమ్మల్ని దిగ్భ్రాంతుల్ని చేశారు. అప్పటి మా అనుభవాన్ని పాఠకులకు యథాతథంగా వర్ణించలేం. కాని ఆ సంఘటనను ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. భగవత్సాక్షాత్కారం కోసం స్వామి వివేకానంద అనుభవించిన తీవ్ర వ్యాకులతను మేం అప్పుడు మా కళ్ళ ముందే ప్రత్యక్షంగా చూస్తున్నాం. న్యాయశాస్త్ర పరీక్షకు రుసుము చెల్లించడానికి వెళ్ళినప్పుడు ఆయనలో ఆధ్యాత్మిక జాగృతి ఎలా కలిగిందో, దాని ప్రేరణతో అస్థిమితుడై ఎలా ఆయన కట్టుబట్టతో, వట్టి కాళ్ళతో పిచ్చిపట్టిన వాడిలా నగర వీథుల గుండా పరుగెత్తుకొని వచ్చి, కాశీపూర్‌లో ఉంటున్న గురుదేవుల పాదాల మీద వాలిపోయారో, తన హృదయపరితాపాన్ని గురుదేవులకు వ్యక్తంచేసి ఆయన కృపాభిక్షను ఎలా పొందారో, నిద్రాహారాలను మాని అప్పటి నుంచి ఆయనలా రేయింబవళ్ళు జప, ధ్యాన, భజన, భగవత్ప్రసంగాలతో కాలం గడపసాగారో; అపరిమిత సాధనోత్సాహంతో ఆయన సున్నిత హృదయం కూడ ఎలా వజ్రసదృశంగా మారి తల్లీ, సోదరుల కష్టాలపట్ల ఎంత ఉదాసీన వైఖరి దాల్చినదో; గురుదేవులు చూపిన సాధనామార్గంలో ఏకాగ్ర చిత్తుడై, దివ్యదర్శనాలను ఒకదాని తరువాత మరొకటి గాంచుతూ, మూడు నాలుగు నెలల స్వల్పకాల వ్యవధిలోనే నిర్వికల్ప సమాధి ఆనందం యొక్క ప్రథమానుభూతిని ఎలా పొందారో – ఇవన్నీ మా కళ్ళ ముందే జరిగి మమ్మల్ని ఆశ్చర్యచకితులను చేశాయి. స్వామీజీ (స్వామి వివేకానంద) అనన్య భక్తిని, వ్యాకులతను, సాధనోత్సాహాన్ని చూసి పరమానందభరితులై గురుదేవులు ఆయనను అమితంగా శ్లాఘించేవారు. అప్పట్లో ఒకరోజు గురుదేవులు “సాధనపట్ల నరేన్ చూపే ప్రేమోత్సాహాలు నిజానికి అద్భుతమైనవే; కాని సాధన సమయంలో దీన్లో (తమను చూపిస్తూ) కలిగిన ఆ ప్రచండ వేగంతో పోలిస్తే అతడివి అతి సామాన్యమనే చెప్పాలి – పావు భాగం కూడ ఉండవు” అన్నారు. గురుదేవుల ఆ మాటలు మాలో ఏ భావతరంగాల్ని ఉవ్వెత్తున లేపినవో పాఠకులైన మీరే ఊహించండి.
ఈ విధంగా జగన్మాత సూచనానుసారం శ్రీరామకృష్ణులు సర్వాన్నీ విస్మరించి సాధనలో మునిగిపోయారు. మహా విదుషీమణి, సాధనానుష్ఠానంలో సిద్ధహస్తురాలైన బ్రాహ్మణి అతి శ్రమతో తాంత్రిక క్రియలకు ప్రత్యేకమైన వస్తు సామగ్రిని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి, సాధనా సమయంలో వాటినెలా ఉపయోగించాలో గురుదేవులకు బోధించసాగింది.
7. పంచముండి పీఠ నిర్మాణం, 64 తంత్రాలలోని ముఖ్యసాధనలను అనుష్ఠించడం
ఈ తాంత్రిక సాధనలకు ఆవశ్యకమైన పంచముండి* (మనిషి పుర్రెతోబాటు మరి నాలుగు జంతువుల పుర్రెల) గంగానదికి ఆవలి సుదూర ప్రాంతాలనుంచి తీసుకురాబడినవి. తాంత్రిక సాధనలకు అనువైన రెండు పీఠాలు* – ఒకటి కాళికాలయ ఉద్యాన ఉత్తర సరిహద్దు వద్దవున్న మారేడు చెట్టు కింద, రెండవది శ్రీరామకృష్ణులు స్వహస్తాలతో నాటి పెంచిన పంచవటి క్రింద నిర్మించబడినవి. అవసరం మేరకు ఈ రెండు పంచముండి పీఠాలలో ఏదో ఒక దాని మీద ఆసీనులై జపం, పురశ్చరణం, ధ్యానాదులతో గురుదేవులు కాలం గడపసాగారు. ఈ రీతిలో రేయింబవళ్ళు, రోజులు, నెలలు ఎలా గడచిపోయినవో గురుశిష్యులిద్దరికీ ఎరుకే లేదు.
శ్రీరామకృష్ణులు ఆ సాధనను గురించి ఇలా చెప్పేవారు:* “బ్రాహ్మణి పగటివేళ సుదూరంలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళి తంత్రశాస్త్రాలలో నిర్దిష్టమైన, దుర్లభమైన విభిన్న వస్తువులను సేకరించి ఆలయ ఉద్యానవనానికి తీసుకొని వచ్చేది. రాత్రివేళ మారేడు చెట్టు క్రిందనో లేక పంచవటి క్రిందనో ఆ వస్తువులను అమర్చి, నన్ను రావించి ఆయా వస్తువులతో యథావిధిగా నా చేత జగన్మాతను పూజింపచేసి, చివరకు జపధ్యానాలలో నన్ను నిమగ్నుడను చేసేది. ఇలా పూజ అయ్యాక సామాన్యంగా జపం చేయవలసిన అవసరమే ఉండేది కాదు. ఎందుకంటే పూజ ముగిసేటప్పటికి ఎంత తన్మయుడనయ్యేవాడినంటే జపమాలను ఒక్కసారి త్రిప్పీ త్రిప్పకుండానే సమాధి స్థితుడనయ్యేవాణ్ణి. అంతేగాక శాస్త్రాలలో వర్ణించిన ఆ క్రియల ఫలితాలను పూర్తిగా పొందేవాణ్ణి. పరమాశ్చర్యకరమైన దివ్యదర్శనాలు, దివ్యానుభవాలు ఒకదాని వెంట ఒకటి ఆ సమయంలో ఎన్ని కలిగాయో లెక్కించలేను. ఈ విధంగా ప్రధానమైన అరవై నాలుగు తంత్రాలు విధించిన సాధనలనన్నిటినీ ఒకటొకటిగా బ్రాహ్మణి నా చేత చేయించింది. ఈ సాధనలు ఎంత దుష్కరమైనవంటే – వీటిని ఆచరించడంలో సాధకులలో అత్యధికులు పదభ్రష్టులయ్యేవారు. కాని జగన్మాత అనుగ్రహంతో వీటన్నిటిలోనూ ఉత్తీర్ణుడను కాగలిగాను.
దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులు తాంత్రిక సాధనలు అనుష్ఠించిన పంచముండి (బిల్వ వృక్షం)
దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణులు వేదాంత సాధనలు ఆచరించిన సాధనా కుటీరం
8. స్త్రీమూర్తిలో జగన్మాతను దర్శించడం
“ఒకనాడు చూసేసరికి, బ్రాహ్మణి రాత్రివేళ ఎక్కడ నుంచో నిండు యౌవనంలోవున్న ఒక సుందరాంగిని తీసుకువచ్చి, ఆమెను దిగంబరిని చేసి, దేవీ ఆసనం మీద కూర్చోపెట్టి ‘నాయనా! ఈమెను జగన్మాతగా పూజించు’ అని నాతో చెప్పింది. పూజ పూర్తి కాగానే, ‘ఆమె అంక (ఒడి) భాగాన కూర్చుని ఏకాగ్రంగా జపం చేయి’ అని బ్రాహ్మణి నన్ను ఆదేశించింది. నేను భయకంపితుడనై, దీనంగా విలపిస్తూ, ‘అమ్మా, అమ్మా! నిన్ను సంపూర్ణంగా శరణుజొచ్చిన వాడికి ఇదేమి ఆదేశం ఇస్తున్నావు? దుర్బలుడైన నీ బిడ్డకు ఇలాంటి అగ్నిపరీక్షను తట్టుకోవడం సాధ్యమా తల్లీ?’ అంటూ ప్రార్థించసాగాను. ఇలా పలికీ పలకడంతోనే ఏదో తెలియని శక్తి నన్ను ఆవహించి, నా హృదయాన్ని అపూర్వ దివ్యశక్తితో నింపింది. మంత్రముగ్ధుడిలా ఏం చేస్తున్నానో ఎరుక లేకుండానే ఇష్టమంత్రాన్ని జపిస్తూ ఆ స్త్రీ అంక భాగాన కూర్చున్న మరుక్షణంలోనే సమాధిమగ్నుడనయ్యాను. బాహ్యస్మృతి వచ్చాక, నన్ను తిరిగి మామూలు స్థితికి తేవడానికి శ్రద్ధగా ప్రయత్నిస్తూ బ్రాహ్మణి నాకు కనపడింది. అప్పుడు నాతో ఆమె, ‘నాయనా! సాధన పూర్తయింది. ఎంత ఆశ్చర్యం! ఇతరులు ఇటువంటి పరిస్థితిలో అతికష్టం మీద తమను తాము సంబాళించుకొని, ఎలాగో ఒకింతసేపు జపం చేసి సరిపుచ్చుకొంటారు. మరి నువ్వో, పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయి సమాధిమగ్నుడవైనావు’ అని చెప్పగా ఆ పలుకులు ఆలకించి ఒక దీర్ఘ నిశ్వాసం విడిచాను. ఈ అగ్ని పరీక్షలో ఉత్తీర్ణుడను చేసినందుకు పదేపదే జగన్మాతకు ప్రణమిల్లసాగాను.
“మరొక రోజు చూశానుగదా! బ్రాహ్మణి మనిషి పుర్రెలో చేపను వండి, జగజ్జననికి తర్పణం అర్పించింది. నాతోనూ అలాగే చేయించి, ఆ చేపను నన్ను తినమన్నది. ఆమె ఆదేశాన్ని తు.చ. తప్పకుండా పాటించాను. మనస్సులో ఎలాంటి ఏహ్యభావమూ జనించలేదు.”
9. ఘృణాత్యాగం (ఏహ్యభావాన్ని విడిచి పెట్టడం)
“కాని ఏ రోజు బ్రాహ్మణి కుళ్ళిన నరమాంసాన్ని తీసుకొచ్చి, తర్పణం అయ్యాక నా నాలుకతో దాన్ని తాకమని చెప్పిందో, ఆ రోజు నా మనస్సంతా ఏవగింపుతో నిండిపోగా, ‘ఇలా చేయడం సాధ్యమేనా?’ అన్నాను. అప్పుడు ఆమె ‘ఇందులో ఏముంది నాయనా? చూడు, నేను చేస్తున్నాను’ అంటూ మాంసంలో ఒక చిన్న భాగం నోట్లో వేసుకొని, ‘దేన్నీ ఏవగించుకోరాదు’ అంటూ మళ్ళీ కొంత భాగం నా ముందు ఉంచింది. ఆమె అలా చేయడం చూడగానే జగన్మాత యొక్క ప్రచండ చండికామూర్తి ఉద్దీపనం నాలో కలిగింది. ‘అమ్మా’ అంటూ పదే పదే పలుకుతూ భావావిష్టుడనైనాను. అప్పుడు బ్రాహ్మణి మాంసపు తునకను నా నోట్లో ఉంచినా నాలో ఎలాటి ఏహ్యభావమూ జనించలేదు.”
10. తాంత్రిక సాధనా సమయాలలో శ్రీరామకృష్ణుల ప్రవర్తన
పూర్ణాభిషేకంతో అలా దీక్ష పుచ్చుకొన్ననాటి నుంచి బ్రాహ్మణి నిత్యం నా చేత చేయించిన తాంత్రిక సాధనలకు లెక్కేలేదు. ఆయా సందర్భాలలో జరిగిన సంగతులన్నీ నాకు ఇప్పుడు గుర్తులేవు. కాని ఏనాడు తల్లి కృపతో రతిక్రియారక్తులైన దంపతుల సంభోగ మహదానందాన్ని దర్శించి, దాన్లో కేవలం శివశక్తి లీలావిలాసాన్ని మాత్రమే చూసి ఆనందభరితుడనై సమాధి స్థితుడనయ్యానో ఆ సంగతి జ్ఞాపకం ఉన్నది. ఆ రోజు బాహ్యస్మృతి కలిగాక బ్రాహ్మణి నాతో ఇలా అన్నది: “నాయనా! అత్యంత క్లిష్టమైన తాంత్రిక సాధనలో సిద్ధిపొంది, దివ్యభావంలో ప్రతిష్ఠితుడవైనావు. వీరభావంలో ఇదే చివరిమెట్టు.”
ఇది జరిగిన కొద్దికాలం పిదప అందరి ముందు, పగటివేళ, నట మండపంలో మరొక భైరవి సహాయంతో తంత్రశాస్త్ర నిర్దేశానుసారం స్త్రీని పూజించాను. పూజ ముగించి ఒక రూపాయి నాలుగు అణాలు దక్షిణగా ఆమెకు సమర్పించి, ప్రణామం చేశాను. ఆ కర్మతో నా వీరభావ సాధన పూర్తి అయింది. దీర్ఘకాల పర్యంతం సాగిన ఆ తాంత్రికసాధనా సమయంలో స్త్రీల నందరినీ నేను ఎలా జగన్మాతగా దర్శించగలిగానో, అలాగే ఒక చుక్క అయినా ‘కారణాన్ని’* (మధువు) పుచ్చుకోలేకపోయాను. కారణమనే పేరు విన్నంత మాత్రానే, లేదా దాని వాసన రావడంతోనే ‘జగత్కారణం’ నా మనస్సులో స్ఫురించేది, శరీరస్పృహ రహితుడనయ్యేవాణ్ణి. అలాగే ‘యోని’ అనే శబ్దాన్ని విన్న తక్షణం ‘జగద్యోని’ ఉద్దీపనం కలిగి, సమాధి స్థితుడనయ్యేవాణ్ణి.
11. శ్రీరామకృష్ణులు చెప్పిన వినాయకుడి కథ
దక్షిణేశ్వరంలో నివసిస్తూన్నప్పుడు గురుదేవులు ఒకరోజు స్త్రీల అందరి పట్లా తమకుండే మాతృభావాన్ని గురించి ప్రస్తావిస్తూ ఒక పౌరాణిక కథను చెప్పారు. గణపతి అయిన వినాయకుడి హృదయంలో కూడా ఈ మాతృభావం దృఢంగా ఎలా నెలకొన్నదో ఈ కథలో వివరించబడింది. ఈ కథ వినడానికి మునుపు ఏనుగు ముఖంతో, బానపొట్టతో ఉండే ఈ దేవుడిమీద మాకు అంతగా భక్తిప్రపత్తులు ఉండేవి కావు. కాని గురుదేవుల ముఖతా ఈ కథ విన్న తరువాత మా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. దేవతలందరిలో ప్రప్రథమంగా అతడొక్కడే పూజార్హుడని దృఢవిశ్వాసం కుదిరింది. ఆ కథ ఇది:
బాలగణపతి ఒకనాడు ఆడుకొంటున్నప్పుడు ఒక పిల్లిని చూసి దాన్ని దొరకపుచ్చుకొని పిల్లచేష్టగా చక్కగా బడితపూజ చేసి దాన్ని గాయపరిచాడు. పిల్లి ఎలాగో తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతడు శాంతుడై తల్లి పార్వతీదేవిని చూడడానికి వెళ్ళాడు. తల్లి దేహమంతా గాయాలతో రక్తసిక్తమై ఉండడం చూసి బాలగణపతి ఆశ్చర్యపోయాడు. తల్లిని అలాంటి స్థితిలో చూసి ఎంతో బాధపడి, “కారణం ఏమిటి?” అని తల్లిని అడిగాడు. “నాయనా! దీని కంతటికీ కారణం నువ్వే” అని విచారంతో పలికింది దేవి. తల్లిపట్ల అపార భక్తి ప్రేమలున్న గణపతికి తల్లి మాటలు ఆశ్చర్యాన్ని, అంతకంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించాయి. కంట నీరుపెట్టుకొని “అమ్మా! నేను నిన్నెప్పుడు కొట్టాను? లేదా తెలియక నేను చేసిన ఏదైనా దుశ్చర్య ఫలితంగా ఇతరులు నిన్నిలా అవమానించారేమో అంటే అలాంటసంఘటన ఏదీ నాకు జ్ఞాపకం రావడం లేదే?” అన్నాడు.
కుమారుడి పలుకులు విని జగన్మాత ఇలా అన్నది: “నాయనా! ఈ రోజు నువ్వు ఏ ప్రాణినైనా హింసించావేమో కాస్త జ్ఞాపకం తెచ్చుకో.” “అవునమ్మా, ఇంతకు మునుపే ఒక పిల్లిని చావబాది వచ్చాను” అన్నాడు గణపతి. పిల్లి సొంతదారుడు తన తల్లిని అలా గాయపరిచాడేమో అని తలచుకొని బాలగణపతి ఖీన్నుడయ్యాడు. బాలుడలా పశ్చాత్తప్తుడవడం చూసి, ప్రేమపూర్వకంగా అతణ్ణి హృదయానికి హత్తుకొని, అతణ్ణి ఊరడిస్తూ దేవి ఇలా అన్నది: “అలా జరగలేదు, నా ఈ దేహాన్ని ఎవరూ గాయపరచలేదు. కాని పిల్లి ఆదిగాగల ఈ విశ్వంలోని సమస్త ప్రాణికోటిలో నెలకొన్నది నేను కదా! కాబట్టే నువ్వు పిల్లిని గాయపరచిన చిహ్నాలు నా శరీరం మీద కానవస్తున్నాయి. తెలియక నువ్వలా చేశావు కనుక విచారించవద్దు. కాని నేటి నుంచి ఈ సంగతిని ఎప్పుడూ మరిచిపోవద్దు. లోకంలోని స్త్రీలందరూ నా అంశలే, జీవులలోని పురుషులందరూ నీ పితృదేవుల అంశలే. శివశక్తులు తప్ప ఈ జగత్తులో వేరొకటి ఏదీ లేదు.” తల్లి మాటలు బాలగణపతి హృదయంలో ప్రగాఢంగా నాటుకున్నాయి. కనుకనే యుక్తవయస్సులో ఉన్నప్పుడు ‘ఏ స్త్రీని వివాహమాడినా తల్లినే వివాహం చేసు కొన్నట్లు అవుతుంది’ అని భావించి బ్రహ్మచారిగానే ఉండిపోవడం జరిగింది. అంతేగాక ఈ జగత్తు యావత్తూ శివశక్త్యాత్మకమనే దృఢవిశ్వాసం పూని, జ్ఞానులందరిలో అగ్రగణ్యుడైనాడు.
12. గణేశ కార్తికేయుల విశ్వ పరిభ్రమణ వృత్తాంతం
పై కథను చెప్పిన తరువాత గణేశుడి జ్ఞాన మహత్త్వ సూచకమైన మరొక కథను గురుదేవులు మాకు చెప్పడం జరిగింది. ఒకానొక సమయంలో పార్వతీ దేవి తను ధరించిన అమూల్యమైన రత్నహారాన్ని చూపిస్తూ కుమారులైన గణేశ కార్తికేయులతో “పధ్నాలుగు లోకాలతో కూడిన ఈ బ్రహ్మాండం చుట్టూ తిరిగి మీరిద్దరిలో ఎవరు ప్రథములుగా వస్తారో వారికి ఈ రత్నహారాన్ని బహూకరిస్తాను” అన్నది. ఇంకేం, అన్నగారి బానపొట్టను, నెమ్మదిగా కదిలే ఎలుక వాహనాన్ని తలచుకొని ఒకింత పరిహాసపూర్వకంగా నవ్వుకుంటూ ‘రత్నహారం నాకే దక్కుతుంది’ అని నిశ్చయించుకొని, తన నెమలి వాహనం అధిరోహించి తక్షణమే కార్తికేయుడు బయలుదేరాడు. అతడు వెళ్ళిపోయిన చాలాసేపటికి నెమ్మదిగా లేచాడు గణేశుడు. లేచి తన జ్ఞాననేత్రంతో శివశక్త్యాత్మకమైన ఈ జగత్తు యావత్తూ తల్లితండ్రులైన శివపార్వతుల శరీరాలలో దర్శిస్తూ, వారికి ప్రణామాలు చేస్తూ వినమ్ర గమన భంగిమలో వారికి ప్రదక్షిణం చేసి, నిశ్చితమనస్కుడై తన ఆసనంలో కూర్చున్నాడు. ఇది జరిగిన చాలాసేపటికి కార్తికేయుడు తిరిగి వచ్చినప్పుడు, రత్నహారం గణేశుడికే చెందుతుందని నిర్దేశించి, వాత్సల్యపూరితురాలై ముద్దు బిడ్డడి మెడలో అలంకరించింది తల్లి పార్వతీదేవి.
ఈ విధంగా స్త్రీలందరిపట్లా గణపతికున్న మాతృభావాన్ని ఉద్దేశించి గురుదేవులు ఇలా అన్నారు: “స్త్రీ లందరిపట్లా నా భావం కూడా అదే సుమా! కనుకనే వివాహం చేసుకొన్న నా భార్యలో కూడా సాక్షాత్తూ జగజ్జననిని దర్శించగలిగి అర్చించి ఆమె పాదాలకు ప్రణమిల్లాను.”
13. తాంత్రిక సాధన: శ్రీరామకృష్ణుల అనుపమానత
స్త్రీలందరిపట్లా అచంచలమైన మాతృభావపూర్ణ హృదయంలో వీరభావానికి చెందిన క్రియానుష్ఠానాలన్నిటినీ తాంత్రికశాస్త్ర నిర్దేశానుసారంగా తు.చ. తప్పకుండా ఏ కాలంలోనైనా ఏ సాధకుడైనా ఆచరించినట్లు మేం వినలేదు. ఈ వీరోచిత పద్ధతిని అనుసరించి సాధకులందరూ ఈనాటి వరకూ తమ సాధనలకు ఒక ‘శక్తి’ ఉన్నదని గ్రహిస్తూనే ఉన్నారు. ఈ కారణంగానే శక్తిని గ్రహించకపోతే సాధనలో సిద్ధి కలుగదనో లేక జగజ్జనని కృపను పొందడం అసంభవం అనో ప్రగాఢ విశ్వాసం ఈ ‘వీరాచార’ సాధకులలో కలిగింది. ఇటువంటి తప్పుడు అభిప్రాయం ఉండడం చేతా, తమ తమ పాశవిక కుసంస్కారాలకు వశులై ఉండడం చేతా ఈ మార్గానికి చెందిన సాధకులు తరచూ పరకీయశక్తిని గైకొనడానికి కూడ వెనుకాడకున్నారు. లోకులు తంత్రశాస్త్రాల పట్ల అంత నిరసన చూపడానికి ఇదే కారణం.
14. ఆ అనుపమానత వెనుక ఉన్నది జగన్మాత సంకల్పమే!
జీవితంలో తాను ఏనాడూ కలలో సైతం స్త్రీని గురించి చింతించలేదని యుగావతారులైన శ్రీరామకృష్ణులు ఎన్నోసార్లు మాకు చెప్పి ఉన్నారు. కనుకనే జీవితాంతం మాతృ భావపూర్ణులైన శ్రీరామకృష్ణుల ద్వారా తాంత్రిక వీరాచార సాధనలనన్నిటినీ అనుష్ఠింపజేయడం జగన్మాత విశేష సంకల్పం మూలంగానే జరిగిందని సుస్పష్టంగా తెలుస్తోంది.
15. శక్తి (స్త్రీ) సాహచర్యం లేకనే శ్రీరామకృష్ణుల విజయంలోని అంతస్సూచన
ఏ సాధనలోనైనా సిద్ధిని గడించడానికి తమకు మూడు రోజుల కంటే ఎక్కువ సమయం పట్టలేదని గురుదేవులు చెబుతూండేవారు. “ఏ సాధననైనా చేపట్టినప్పుడు, తత్ఫలితాన్ని తనకు ఇవ్వమని పరమ వ్యాకులతతో తల్లిని ప్రార్థించడంతో మూడు రోజుల్లోనే సిద్ధి కలిగేది” అని చెప్పేవారు. శక్తి (స్త్రీ) లేకున్నప్పటికీ వీరాచార సాధన లన్నిట్లోనూ అతి స్వల్పకాలంలో ఆ విధంగా శ్రీరామకృష్ణులు సాఫల్యం పొందడం ద్వారా స్పష్టంగా ఋజువయ్యే అంశం ఏమిటంటే, “పంచ ‘మ’ కారాలు మధువు, మాంసం, చేపలు, పప్పు మరియు స్త్రీ” ఆయా సాధకులకు ఆవశ్యక అంశాలు కావు అనేది. ఇంద్రియనిగ్రహంలేని సాధకుడు తన నీచప్రవృత్తులకు వశవర్తుడై అలా చేస్తుంటాడు. ఒకవేళ సాధకుడు అలా చేయడానికి (అంటే స్త్రీ గ్రహణం) పూనుకొని పునరావృత్తిగా చేసే సాధన ద్వారా క్రమక్రమంగా అతడు తన పశుప్రవృత్తులను అతిక్రమించి దివ్యభావంలో సుప్రతిష్ఠితుడు కాగలడని తాంత్రిక శాస్త్రాలు అతడికి అభయ ప్రదానమిచ్చి, ఉపదేశించడం ఆ శాస్త్రాల పరమ కరుణను సూచిస్తున్నదేగాని, ఆ నిమ్న పద్ధతుల ఆవశ్యకతను వ్యక్తం చేయడం లేదు.
16. తాంత్రిక పూజల ఉద్దేశం
కాబట్టి రూపరసాది ఏ లౌకిక భోగ్యవస్తువులూ సాధారణ వ్యక్తులను ప్రలోభితులను గావించి చక్ర భ్రమణ చందాన జన్మజరామృత్యువుతో కూడిన ఈ సంసార సాగరంలో త్రోసి వేస్తుంటాయో, ఏ భోగ్యవస్తువులు మనిషిని ఆత్మజ్ఞానం, భగవత్సాక్షాత్కారం పొందనివ్వక ఆటంకాలుగా నిలుస్తాయో, మనస్సంయమ సహాయంతో, ధైర్యంతో పదేపదే అనుష్ఠింపబడుతూన్న సాధన ప్రయత్నంతో సాధకుడికి ఆ భోగ్యవస్తువులన్నీ నిజానికి భగవత్ప్రీతికారకాలే అని గ్రహింపచేయడమే తాంత్రిక పూజల ఉద్దేశంగా చెప్పవచ్చు. అంతేగాక సాధకుల మనోసంయమశక్తినీ, అర్హతనూ అనుసరించే తంత్రశాస్త్రాలు ‘పశుభావం, వీరభావం, ‘దివ్యభావం’* అని సాధనలను మూడు తరగతులుగా విభజించి తమ తమ అధికారం యోగ్యతానుసారం ఈ మూడింటిలో తమకు అనువైన సాధనామార్గాన్ని చేపట్టి, భగవంతుడి వైపు అగ్రేసరులు అవ్వాలని ఉపదేశిస్తున్నాయి. కాని కఠోరమైన మనోసంయమమే ఈ సాధనల కన్నిటికీ పునాది. ఆత్మ సంయమం ఉన్నప్పుడు మాత్రమే ఈ సాధనలకు ఉచిత ఫలితాన్ని పొందడం సాధ్యమనీ లేకుంటే ఏ ప్రయోజనమూ సిద్ధించదనే విషయాన్ని కాలక్రమంలో లోకులు మరచిపోయారు. తాంత్రిక సాధకులు గావించే నీచ క్రియలకు తంత్రశాస్త్రమే కారణం అనే తప్పుడు అభిప్రాయానికి వచ్చి, ఆ తంత్రశాస్త్రాలను నిందించసాగారు. ఈ నేపధ్యంలో ప్రతి స్త్రీనీ తమ కన్నతల్లితో సమానంగా భావించి, తంత్రశాస్త్రోక్త సాధనలన్నిట్లో శ్రీరామకృష్ణులు పరిపూర్ణ సిద్ధిని పొందడం ద్వారా రెండు ప్రయోజనాలు నెరవేరాయి. ఒకటి – యథార్థమైన సాధకులు తమ జీవిత లక్ష్యానికి చేరే సరైన మార్గాన్ని పొందడం. రెండవది – తంత్రశాస్త్రాల ప్రామాణ్యం మరొక్కసారి ఋజువై సుప్రతిష్ఠితం కావడం; అంతేగాక అవి బోధించే సాధనలు మహోపకారకాలుగా ప్రసిద్ధమై మహిమాన్వితం కావడం.
17. స్త్రీ సాహచర్యం లేకనే శ్రీరామకృష్ణులు విజయవంతుల వడంలోని మరొక కారణం
ఈ కాలంలో శ్రీరామకృష్ణులు మూడు నాలుగు సంవత్సరాల పాటు ఇలా తంత్రోక్త రహస్య సాధనాలను చేయడం జరిగింది. కాని మొదటి నుంచి చివరి వరకు క్రమానుసారంగావాటిని గురించి మాలో ఎవరికైనా, ఎప్పుడైనా వివరించారని మేం అనుకోం. అయినా ఆధ్యాత్మిక మార్గంలో మమ్ముల్ని ప్రోత్సహించే నిమిత్తమై అనేక సందర్భాలలో కొన్ని కొన్ని విషయాలను గురించి ఆయన చెబుతూండేవారు. మాలో ఒకరిద్దరిచేత వారి వారి అవసరాలకు తగ్గట్లుగా ఆ సాధనల్లో కొన్నిటిని అనుష్ఠింప చేశారు. తాంత్రిక క్రియాకలాపాలనన్నిటినీ అనుష్ఠించి, ప్రత్యక్షంగా ఎన్నో అసాధారణమైన అనుభూతులను శ్రీరామకృష్ణులు పొంది ఉండకపోతే, తదనంతర కాలంలో తమ వద్దకు రానున్న విభిన్న మానసిక ప్రవృత్తులతో కూడిన భక్తుల మానసిక స్థితిగతులను అవగతం చేసుకొని, సాధనాపథంలో సులువుగా వారిని అగ్రగాములను చేయలేకపోయే వారనీ, కాబట్టే జగజ్జనని ఈ కాలంలో శ్రీరామకృష్ణులకు ఈ మార్గంతో పూర్తిగా పరిచయం చేయించిందనీ మనం స్పష్టంగా గ్రహించవచ్చు. శరణార్థులైన భక్తులను వాళ్ళ మనోభావాలకు తగ్గట్టు ఏ విధంగా, ఎన్ని రీతుల ఆయన సాధనలో సుప్రతిష్ఠితులను చేయించేవారో దాన్ని గురించి మేం మరో చోట సూచనప్రాయంగా తెలియజేశాం.* దాన్ని చదివినప్పుడు పాఠకులు పైన చెప్పిన దాన్లోని యుక్తియుక్తతను సులువుగా అవగాహన చేసుకోగలరు. కాబట్టి దాన్ని ఇక్కడ ప్రస్తావించ నవసరం లేదు.
18. తాంత్రిక సాధనా కాలంలో శ్రీరామకృష్ణుల అనుభవాలు– దర్శనాలు
పైన చెప్పబడిన రీతిలో తాంత్రిక సాధన క్రియాకలాప అనుష్ఠానాలను గురించేకాక ఆ కాలంలో తమకు కలిగిన అసంఖ్యాక దర్శనాలు, అనుభవాల గురించి కొన్ని సందర్భాలలో శ్రీరామకృష్ణులు మాతో ప్రస్తావించేవారు. వాటలో కొన్నిటిని ఇక్కడ పాఠకుల కోసం తెలుపుతున్నాం.
19. నక్కల, కుక్కల ఉచ్చిష్టాన్ని తినడం
తాంత్రిక సాధనలను అనుష్ఠిస్తూన్న కాలంలో తమ ప్రవృత్తిలో ఆసాంతం పరివర్తన కలిగిందని ఆయన చెప్పారు. జగన్మాత ఒక్కోసారి నక్కల రూపం ధరిస్తూంటుందని విని, అలాగే శునకం భైరవుడి వాహనమనీ తెలుసుకొని ఈ కాలంలో వాటి (నక్కల, కుక్కల) ఉచ్ఛిష్టాన్ని పవిత్రంగా భావించి స్వీకరించాననీ, మనస్సులో ఎలాంటి సంకోచభావమూ కలిగేది కాదనీ శ్రీరామకృష్ణులు చెప్పేవారు.
20. జ్ఞానాగ్నిచే ఆవృతుడై ఉన్నట్లు దర్శించడం
తమ దేహాన్ని, మనస్సును, జీవితాన్ని – సర్వస్వాన్ని జగన్మాత పాదపద్మాల వద్ద ఆహుతిగా అర్పించి, తాను లోపలా, బయటా జ్ఞానాగ్ని చేత ఆవృతుడై ఉండడాన్ని ఆయన దర్శించడం జరిగింది.
21. కుండలినీ జాగృతం
కుండలినీశక్తి జాగృతమై, శిరస్సులోవున్న సహస్రారం వైపు పైకి పోవడం శ్రీరామకృష్ణులు ఈ కాలంలో గాంచారు. కుండలినీశక్తి పైకి పోతున్నప్పుడు మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న పద్మాలన్నీ ఊర్ధ్వముఖాలై పూర్తిగా వికసించ సాగాయి. ఒకదాని తరువాత మరొకటిగా అవి అలా వికసించగానే విచిత్రమూ, అపూర్వమూ అయిన దివ్యానుభూతులు* వారికి కలుగసాగాయి. ఉదాహరణకు జ్యోతిర్మయుడైన దివ్యపురుషుడొకడు సుషుమ్నా మార్గం ద్వారా పైకి వెళుతూ తన నాలుకతో తాకి ఆ పద్మాలను వికసింపజేయడం ఆయన దర్శించారు.
22. బ్రహ్మయోనిని దర్శించడం
వివేకానందస్వామికి ఒకానొక సమయంలో ఒక విచిత్ర అనుభవం కలిగింది. ఆయన ధ్యానానికి కూర్చోగానే జ్యోతిర్మయమైన పెద్ద త్రికోణం ఒకటి ఆయన ముందు అగపడింది. అది సజీవంగా ఉన్నట్లు ఆయన భావించారు. ఒకనాడు ఆయన దక్షిణేశ్వరానికి వచ్చి ఈ సంఘటన గురించి శ్రీరామకృష్ణులకు చెప్పారు. అది విని శ్రీరామకృష్ణులు, “భేష్, మంచిది. నీకు బ్రహ్మయోని దర్శనం అయింది. బిల్వవృక్షం కింద సాధన చేస్తూన్నప్పుడు నేనూ అలాగే దాన్ని చూసేవాణ్ణి. అంతేకాక ప్రతిక్షణమూ అది అసంఖ్యాక బ్రహ్మాండాలను ప్రసవించడం కూడ అవలోకించేవాణ్ణి” అని చెప్పారు.
23. అనాహత ధ్వనిని ఆలకించడం
ఈ బ్రహ్మాండంలో వినవచ్చే శబ్దాలన్నిటి సమష్టి స్వరూపానికే ప్రణవం (ఓంకారం) అని పేరు. ప్రతిక్షణం అవిరామంగా లోకం అంతటా తనంతట తానే స్పందిస్తూంటుంది. కాబట్టి దాన్ని అనాహత ధ్వని అంటారు. శ్రీరామకృష్ణులు ఈ తాంత్రిక సాధనా కాలంలో అవిరామంగా ప్రతిధ్వనిస్తూండే ఈ అనాహత ధ్వనిని విన్నారు. ఆ సమయంలో పశుపక్ష్యాదుల అరుపులను తాను అవగతం చేసుకోగలిగే వాడనని శ్రీరామకృష్ణులు చెప్పగా విన్నామని కొందరు చెబుతారు.
24. అష్టసిద్ధులు: వాటి నిరర్థకత్వం
ఈ కాలంలోనే శ్రీరామకృష్ణులకు కలిగిన మరో దివ్యానుభూతి: స్త్రీ యోనిలో జగజ్జనని సాక్షాత్తూ అధిష్ఠితురాలై ఉండడం. ఈ కాలం చివరి భాగంలో అణిమాది అష్టసిద్ధులు తమలో ప్రకటితం కావడం ఆయన అనుభూతికి వచ్చింది. మేనల్లుడైన హృదయ్ వాటిని ఉపయోగించమని ప్రేరేపించడంతో శ్రీరామకృష్ణులు ఒకరోజు జగన్మాత దరిచేరి ఈ విషయ ఔచిత్యం గురించి తెలుసుకోవాలను కొన్నారు. ఆ సమయంలో ఆయనకు ఒక విచిత్ర దర్శనం కలిగింది – అణిమాది యోగసిద్ధులు వేశ్యల మలం మాదిరి హేయాతిహేయం. సర్వదా విసర్జనీయాలని తద్వారా ఆయన గ్రహించారు. ఆ దర్శనం అయినప్పటి నుంచి ‘సిద్ధి’ అనే మాట వినపడగానే తనలో ‘రోత’ జనించేదని వారనేవారు.
25. అష్టసిద్ధుల గురించి వివేకానందులతో శ్రీరామకృష్ణుల సంభాషణ
శ్రీరామకృష్ణులు అష్టసిద్ధులను పొందారని చెప్పుకొనే ఈ సందర్భంలో మరొక సంఘటన మాకు జ్ఞాపకం వస్తోంది. ఆయన ఒక రోజు స్వామీజీని ఒంటరిగా పంచవటికి పిలుచుకొని వెళ్ళి ఇలా అన్నారు: “చూడు, సుప్రసిద్ధమైన అణిమాది అష్టసిద్ధులూ నా కైవసంలో ఉన్నాయి. కాని వాటిని వినియోగపరచకూడదని చాలాకాలం క్రితమే నేను నిశ్చయించుకున్నాను. వాటి వినియోగ ఆవశ్యకత నా కేమీ కనిపించడం లేదు. కాని మత ప్రచారం మొదలైన కార్యాలనెన్నిటినో నువ్వు చెయ్యవలసి ఉంది. కాబట్టి వాటినన్నిటినీ నీకు ఇవ్వాలని సంకల్పించాను. ఇవిగో తీసుకో” అన్నారు. అందుకు జవాబుగా స్వామీజీ, “మహాశయా! భగవత్సాక్షాత్కారానికి వీటి తోడ్పాటు ఏమైనా ఉంటుందా?” అని అడిగారు. తదుపరి గురుదేవుల జవాబు నుంచి – మతప్రచారాది కార్యాల్లో ఏదో కొంతమేరకు అవి తోడ్పాటును ఇవ్వగలిగినా, భగవత్సాక్షాత్కార విషయంలో మాత్రం ఎలాంటి సహాయమూ అందించలేవని ఎరిగి, నిష్కర్షగా వాటిని స్వీకరించ నిరాకరించారు స్వామీజీ. తద్ద్వారా గురుదేవులు, తన పట్ల ఎంతో ప్రసన్నులయ్యారని స్వామీజీ మాతో చెప్పారు.
26. మహామాయ దర్శనం
జగజ్జనని మోహినీశక్తిని దర్శించాలనే ఆకాంక్ష జనించడంతో శ్రీరామకృష్ణులకు ఆ సమయంలోనే ఒక అద్భుత దర్శనం కలిగింది. అపూర్వ సౌందర్యరాశి అయిన ఒక స్త్రీమూర్తి గంగానది జలాల నుంచి బయటకువచ్చి అభిజాత గమన భంగిమతో పంచవటికి రాసాగింది. ఆ స్త్రీమూర్తి నిండు గర్భవతి. కొన్ని క్షణాలలో, తన సమక్షంలోనే అందాల పాపను ప్రసవించి, మహాప్రేమతో ఆ పాపకు పాలిస్తూండడం ఆయన గాంచారు. మరుక్షణంలోనే ఆ స్త్రీమూర్తి మహాభయంకర క్రూరరూపాన్ని దాల్చి, ఆ పసికూనను ‘కస కస’ నమిలి మ్రింగి, తదనంతరం మళ్ళీ గంగాజలాల్లో ప్రవేశించి, కనుమరుగవడం ఆయన చూశారు.
27. షోడశీ సౌందర్యం
పైన వర్ణించిన దర్శనాలేకాక ఈ కాలంలో శ్రీరామకృష్ణులు రెండు చేతుల నుంచి పది చేతులు కలిగిన ఎన్నెన్ని రకాల దేవీమూర్తులను దర్శించారో లెక్కలేదు. పైగా ఈ మూర్తులలో కొన్ని వారికి ఎన్నో సాధనలను గురించి ఆదేశం కూడా ఇచ్చాయి. ఇలా ఈ దేవీమూర్తులన్నీ కూడ మహాసౌందర్యవతులై ఉన్నప్పటికీ వాటిలో ఏవీ శ్రీ రాజరాజేశ్వరి లేదా షోడశీదేవి సౌందర్యానికి సాటిరాలేవనే సంగతి గురుదేవులు చెప్పడం విన్నాం. “షోడశీ లేదా త్రిపురసుందరీదేవి అంగాంగాల నుంచి రూపసౌందర్యం కరిగి ప్రవహించి నలుదిక్కులనూ కాంతివంతం చేయడం దర్శించాను” అని ఆయన చెప్పేవారు. అంతేగాక భైరవాది దేవతామూర్తుల నెన్నిటినో ఈ సమయంలో వారు దర్శించడం జరిగింది.
ఈ రకంగా తాంత్రిక సాధనలను ఆచరిస్తున్నప్పుడు ప్రతిరోజూ శ్రీరామకృష్ణులకు ఎన్ని అపూర్వ దివ్యదర్శనాలు, దివ్యానుభవాలు కలిగినవంటే, వాటినన్నిటినీ యథాతథంగా వర్ణించడం మానవశక్తికి అతీతం. కాబట్టి ఆ ప్రయత్నంలో కాలాన్ని వెచ్చించడం వృథా ప్రయాస.
28. తాంత్రిక సాధనల ఫలితంగా శ్రీరామకృష్ణులలో దేహాత్మాభిమాన రాహిత్యం
తాంత్రిక సాధనలను అనుష్ఠించినప్పటి నుంచి శ్రీరామకృష్ణుల సుషుమ్నా ద్వారం పూర్తిగా తెరుచుకోవడమేకాక, వారి నైజం శాశ్వతంగా బాలుడి మాదిరి మారిపోయిందని మేం ప్రత్యక్షంగా ఆయన ముఖతా విన్నాం. ఈ తాంత్రిక సాధనాకాలపు చివరిఘట్టం నుంచి ఎంత ప్రయత్నించినా ఒంటి మీద కట్టుబట్టనూ, యజ్ఞోపవీతాన్ని ఉంచుకోలేక పోయేవారు. ఎప్పుడు ఎక్కడ అవి జారి కింద పడిపోయేవో ఆయనకు ఎరుకే ఉండేదికాదు. ఆయన మానసం, జగన్మాత పాదపద్మాల మీద సర్వదా లగ్నమై ఉండడమే వారి దేహస్మృతి లేమికి కారణం అని వేరేగా చెప్పనక్కర్లేదు. ఇతర పరమహంసల (నాగా సన్న్యాసి వర్గం) మాదిరి దిగంబరావస్థ అభ్యాస పూర్వకంగా తమకు కలగలేదనీ, అతి స్వాభావికంగా క్రమంగా దేహస్మృతిని కోల్పోవడంతో కలిగిందనీ వారి ముఖతా మేం ఎన్నోసార్లు విన్నాం.
అంతేగాక ఆ తాంత్రిక సాధనలనన్నిటినీ అలా పూర్తిచేశాక అన్ని పదార్థాలూ ఆత్మ స్వరూపం యొక్క అభివ్యక్తాలే అనే జ్ఞానం ఎంత సుస్థిరమైనదంటే బాల్యం నుంచి తాము ఏ వస్తువులను తుచ్ఛమని, హేయాతిహేయాలని పరిగణించేవారో వాటినే ఇప్పుడు అతి పవిత్ర వస్తువులతో సమంగా ఎంచసాగారు. “తులసీదళమూ, మునగ ఆకూ – రెండూ సమానంగా, పవిత్రంగానే కనబడేవి” అంటూ చెప్పేవారు.
29. తాంత్రోక్త సాధన కాలంలో శ్రీరామకృష్ణుల మేనిఛాయ
అప్పటి నుంచి కొన్ని ఏళ్ళవరకు శ్రీరామకృష్ణుల మేనిఛాయ సదా సర్వత్రా సర్వుల దృష్టినీ ఆకర్షించేటంత సముజ్జ్వలంగా ప్రకాశించసాగింది. దేహాభిమాన రహితులైన ఆయన మనస్సుకు ఇది ఎంత చీకాకు కలిగించేదంటే ఆ దివ్యకాంతిని తొలగించుకోవటం కోసం జగన్మాతను వేడుకొంటూ “అమ్మా, ఈ బాహ్యసౌందర్యం నాకు ఏమాత్రమూ అవసరం లేదు. దీన్ని వెనక్కు తీసుకొని ఆధ్యాత్మిక అంతః సౌందర్యాన్ని ప్రసాదించు” అని ప్రార్థించేవారు. వారి ఈ ప్రార్థన తదనంతర కాలంలో ఎలా ఈడేరిందనే ఉదంతం మేం మరోచోట* తెలిపాం.
30. భైరవీ బ్రాహ్మణి యోగమాయ అంశ
భైరవీ బ్రాహ్మణి తాంత్రిక సాధనలను అనుష్ఠించడంలో శ్రీరామకృష్ణులకు ఏ విధంగా సహాయం చేసిందో, అలాగే శ్రీరామకృష్ణులు తదనంతరకాలంలో ఆమె ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణురాలు కావడానికి విశేషంగా సహాయం చేశారు. ఆయన అలా తోడ్పడకుంటే బ్రాహ్మణి దివ్యభావంలో ప్రతిష్ఠితురాలు కాలేకపోయేది. దీన్ని గురించి మరోచోట* ఒకింత వివరించాం. భైరవీ బ్రాహ్మణి పేరు యోగేశ్వరి. ఆమె యోగమాయ అంశ అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు.
తాంత్రిక సాధనల ద్వారా దివ్యశక్తులను పొందిన శ్రీరామకృష్ణులు, భవిష్యత్తులో అనేక సాధకులు ఆధ్యాత్మిక సహాయం నిమిత్తం తమ వద్దకు వస్తారనే విషయాన్ని జగన్మాత కృపతో తెలుసుకోగలిగారు. తన భక్తుడైన మథుర్ బాబుకూ, మేనల్లుడైన హృదయ్కూ ఆయన ఆ సంగతి తెలిపారు. అది విన్న మథుర్, “భేష్, బాబా* మేమంతా కలిసి మీతో పాటు ఆనందించగలం” అన్నాడు.