వివాహం జరిగిపోయింది. శ్రీరామకృష్ణులు 1861 లో కామార్పుకూర్ నుండి దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు. ఈ సమయంలో ఆయన జీవితంలో రెండు ముఖ్య సంఘటనలు జరిగాయి. అవి ఆయన భావి జీవితంపై చూపిన ప్రగాఢ ప్రభావం కారణం చేత వాటిని విశదంగా పరికిద్దాం.
1. రాణి రాస్మణికి తీవ్రవ్యాధి
మొదటి సంఘటన. 1861 ప్రారంభంలో రాణీ రాస్మణి వ్యాధిగ్రస్తురాలయింది. ఒకరోజు ఆమె హఠాత్తుగా క్రింద పడిపోయింది. దానితో ఆమెకు జ్వరం, అజీర్ణం, రక్తవిరేచనాలు పట్టుకున్నాయి. ఆ వ్యాధి ప్రాణాంతకంగా తీవ్రవ్యాధి పరిణమించింది.
2. దాన పత్రం అమలుపరచడం – రాణి మరణం
1855 లో రాస్మణి, కాళికాలయ ప్రతిష్ఠ చేసిందని చెప్పాం కదా! ఆలయ నిర్వహణ కోసం, నిత్యపూజల కోసం ఆమె మూడు జమీలు కొనుగోలు చేసింది. అవి (ఇప్పుడు బంగ్లాదేశ్‌లోని) దినాజ్‌పూర్ జిల్లాలో ఉన్నాయి. అందు నిమిత్తం రెండు లక్షల ఇరవై ఆరువేల రూపాయలు ఖర్చుపెట్టింది. ఆ జమీలను ఆలయానికి దానం చేయాలనుకుంది.* ఆ జమీలను దేవాలయానికే దానం చేయాలని నిశ్చయించుకున్నా కూడ, ఎందుకోమరి ఇంతకాలం ఆ పని చేయలేక పోయింది. తనకు అంత్యకాలం సమీపించడం చూసి, ఆ దానపత్రాన్ని రిజిస్టర్ చేయాలని తొందరపడింది. ఆమెకు నలుగురు కుమార్తెలు. వీరిలో రెండవ కుమార్తె కుమారి, మూడవ కుమార్తె కరుణమయి, ఆలయ ప్రతిష్ఠకు మునుపే మరణించారు. రాణి అంతిమ కాలంలో మొదటి కుమార్తె పద్మమణి, ఆఖరి కుమార్తె జగదంబదాసీ ఇద్దరే జీవించి ఉన్నారు.
భవిష్యత్తులో ఆ దేవాలయ ఆస్తికి వీరిద్దరి మూలంగా ఏ విధమైన తగాదాలూ రాకూడదని ఎంచి, రాస్మణి ఆ దానపత్రం మీద తన ఇద్దరి కుమార్తెల సంతకాలు పెట్టించాలనుకుంది. జగదంబ ఒప్పుకుంది. కాని పద్మమణి అంగీకరించలేదు. దానితో మృత్యుశయ్య మీద ఉన్న రాణి మనస్సు అశాంతితో నిండి పోయింది. చివరికి 1861 సం ॥, ఫిబ్రవరి, 18 నాడు ఆ దానపత్రంపైన తానే స్వయంగా సంతకం చేసింది. ఆ మరునాడే ఆమె దేవీలోకానికి వెళ్ళిపోయింది.
3. మృత్యుకాలంలో రాణికి దేవీదర్శనం
చనిపోవడానికి కొన్నిరోజుల ముందే, రాస్మణి (కలకత్తా వద్ద) ఆదిగంగా తీరంలో కాళీఘాట్‌కు సమీపంలో ఉన్న ఇంట్లో వసించసాగింది. చనిపోవడానికి కొద్దిసమయం ముందు ఆమెను గంగాతీరానికి తీసుకుని వెళ్ళారు. ఆమె ముందు అనేక దీపాలు వెలిగించారు. ఆమె వాటినన్నింటిని తీసివేయమని చెప్పింది. “ఈ వెలుగులు వద్దు. అమ్మ వచ్చింది. అమ్మ తేజంతో సర్వం కాంతివంతమైంది” అంది. కొన్ని క్షణాల తర్వాత, “అమ్మా! వచ్చావా, చూడమ్మా* పద్మ సంతకం చేయలేదు. ఏమౌతుందో ఏమో?” అన్నది. ఆమె ప్రశ్నకు సమాధానమేమో అన్నట్లు, నలువైపులనుండి నక్కలు ఊళలు వేయడం* మొదలుపెట్టాయి. ఆ మాటలు అని, వెంటనే ఆమె జగన్మాత ఒడిలో శాశ్వతంగా కన్నుమూసింది. అప్పుడు సరిగ్గా అర్ధరాత్రి!!
4. రాణి అనుమానం నిజమైంది
ఆలయానికి దానం ఇచ్చిన ఆ జమీ మున్ముందు రాణి అనుమానించి నట్లుగానే తగాదాలకు కారణమైంది. రాస్మణి మనుమళ్ళు పరస్పరం జమీ పెత్తనంకోసం కలహించు కుంటూ, న్యాయస్థానాల కెక్కారు. రాణికి భగవత్సేవ కన్నా మించిన కోరిక ఉండేది కాదు. పైగా ఆమె అఖండమైన తెలివితేటలున్న స్త్రీ. కాని, దానపత్రం విషయంలో ఆమె అనుమానపడిందంటే, కారణం ఆస్తి కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారన్న వాస్తవం ఆమెకు తెలిసి ఉండడమే. అందుకే ఆమెను రోగం కన్నా, ఈ జమీ చింతే ఎక్కువగా బాధించింది. మృత్యుసమయంలో కూడా ఆమెకు అదే దిగులు! న్యాయస్థాన పత్రాల ద్వారా మనకొక విషయం వెల్లడౌతుంది. రాణి కొన్న జమీని తనఖా పెట్టి ఈ వ్యాజ్యెం ఖర్చులకోసం దాదాపు లక్ష రూపాయల* అప్పు తెచ్చారు. రాణీ రాస్మణి ఎంతో భక్తిప్రపత్తులతో దేవికి సమర్పించిన పవిత్రదానం, చివరకు ఇలా తగాదాలమయం అయిపోయింది. మున్ముందు దేవాలయ ఆస్తి యావత్తూ ఇలాగే లుప్తమైపోతుందేమో! చూద్దాం!!
5. మథుర్బాబు అభ్యున్నతి – అతడి భగవత్సేవ
రాస్మణి ఆఖరి అల్లుడు మథురమోహన్ విశ్వాస్. జమీందారీ వ్యవహారాలు చక్కగా తెలిసినవాడు. రాణికి కుడిభుజంగా మెలగేవాడు. దేవాలయ ప్రతిష్ఠ జరిగిన నాటి నుండి, కాళికాలయానికి దానంగా వచ్చిన ఆస్తుల ఆదాయ వ్యయ విషయాలను అన్నింటినీ అతడే జాగ్రత్తగా పరిశీలిస్తూ, రాస్మణి ఆశయం మేరకు అన్ని ఏర్పాట్లూ చేయసాగాడు. రాణి చనిపోయిన తర్వాత కూడ దేవాలయ నిర్వహణను యథాప్రకారం చేయించసాగాడు. శ్రీరామకృష్ణుల సాంగత్య ప్రభావం చేత అతడి మనస్సు పవిత్రమై, భక్తిపూరితమైపోయింది. అందుకే రాణి మరణం తర్వాత కూడ అతడు దైవసేవలను నిర్లక్ష్యం చేయలేదు.
6. మథుర్బాబు ఉన్నతి ఆధిపత్యం శ్రీరామకృష్ణుల తోడ్పాటుకే
శ్రీరామకృష్ణులకు – మథుర్బాబుకు మధ్య అపూర్వసంబంధం ఏర్పడిందని ఇంతకు ముందే తెలిపాం. మరొక్క విషయం. శ్రీరామకృష్ణులు అనుష్ఠించిన తాంత్రిక సాధనలు ఉన్నతి, చాలాకాలం వరకు కొనసాగాయి. అయితే ఈ సాధనలను ప్రారంభించడానికి పూర్వమే రాణి మరణించింది. ఆలయ విషయాలపై మథుర్కు పెత్తనం లభించింది. అందుకే ఆ సాధనల విషయంలో శ్రీరామకృష్ణులకు సేవచేసే భాగ్యం మథుర్కు దక్కింది. బహుశా, అతనికి ఆ ఆధిపత్యం గురుదేవులకు తోడ్పడటానికే లభించిందేమో! కారణం: ఆ క్షణం నుండే మథుర్, శ్రీరామకృష్ణులను ప్రత్యక్షదైవస్వరూపంగా భావించి, ఆయన సేవయే ప్రధాన ధ్యేయంగా ఎంచుకోవడం. ఇదంతా జగన్మాత సంకల్పం! లేకపోతే 11 సంవత్సరాలు ఏకధాటిగా, ప్రగాఢవిశ్వాసంతో, భక్తితో ఒకే వ్యక్తిని సేవించడం మామూలు విషయం కాదు. దానికి దైవప్రేరణ ఉండవలసిందే. ఆ కారణంగానే, మథుర్కు అపార ధనసంపదలపైన ఆధిపత్యం లభించినా, అహంకరించి పతనం చెందలేదు. పైగా శ్రీరామకృష్ణుల పట్ల క్రమేణా అతడికి భక్తివిశ్వాసాలు పెంపొందాయి. అతడు శ్రీరామకృష్ణులను సేవించడమే తన భాగ్యం అనుకున్నాడు. నిజానికి మథుర్ ఎంత అదృష్టవంతుడో కదా!
7. శ్రీరామకృష్ణుల పట్ల మథుర్, ఇతరుల భావనలు
శ్రీరామకృష్ణుల అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయిని అందరూ అర్థం చేసుకోలేదు. కేవలం ఆధ్యాత్మిక సాధకులు కొందరు మాత్రం గ్రహించారు. సాధారణ జనమంతా ఆయనను పిచ్చివాడనే అన్నారు. ఎందుకంటే ఆయన ప్రవర్తన వారికి బొత్తిగా అర్థం కాలేదు. ఆయన ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉన్నారు. మామూలు మనిషి బుద్ధికి అందని అతీత తత్త్వంలో లీనమై ‘హరి – హరి’, ‘రామ – రామ’, ‘కాళీ – కాళీ’ అంటూ కాలం గడిపేవారు. అది సామాన్యులకు పిచ్చిచేష్టలా కనిపించేది. వారికి రాస్మణి, మథుర్ ఎంతటి ఐశ్వర్యవంతులో తెలుసు. వారి సహాయం పొంది ఎంతోమంది ధనవంతులయ్యారు! పైగా వారిద్దరు కూడ శ్రీరామకృష్ణుల పరమభక్తులు! అలాంటప్పుడు శ్రీరామకృష్ణులు ఎంతటి ధనవంతులయ్యే అవకాశముందో! కాని ఆయన పేదగానే ఉండిపోయారు. ఇది పిచ్చిగాక మరేమిటీ? – అని మామూలు జనం అనుకునేవారు. కాని వారు శ్రీరామకృష్ణుల ఒక ఘనతను మాత్రం చూశారు. ప్రాపంచికంగా పనికిమాలిన వాడైనా, ఆయన కళ్ళల్లోని తేజస్సు, ఆయన ప్రవర్తన, ఆయన కంఠ మాధుర్యం, ఆయన మాటలతీరు జనులను విపరీతంగా ఆకర్షించేవి. మామూలు జనం, ధనికులు – పండితులు – పూజనీయులు మొదలైన గొప్పవారి ముందుకు వెళ్ళడానికి సంకోచిస్తారు. శ్రీరామకృష్ణులకు అలాంటి సంకోచాలు ఏమీ ఉండేవి కావు. ఆయన అందరి వద్దకూ నిర్భయంగా, స్వేచ్ఛగా వెళ్ళేవారు. మాట్లాడేవారు. అంతేకాదు. వారికి ఎంతో సన్నిహితుడు, ప్రియతముడు, ఆత్మీయుడయ్యేవారు. మామూలు జనానికి ఇది అంతుపట్టని ఆశ్చర్యం!
మామూలు జనం, ప్రత్యేకించి ఆలయ ఉద్యోగులు శ్రీరామకృష్ణులను గూర్చి పై విధంగా అనుకొనేవారు. మరోవైపు మథుర్ మరోవిధంగా, ‘జగన్మాత అనుగ్రహం కారణంగా, శ్రీరామకృష్ణులకు ఇలాంటి ఉన్మత్తావస్థ కలిగిం’ దని అనుకొనేవాడని హృదయ్ మాకు తెలిపాడు.
8. భైరవీ బ్రాహ్మణి ఆగమనం
రాస్మణి చనిపోయిన తర్వాత కొద్దికాలానికే శ్రీరామకృష్ణుల జీవితంలో మరో విశేషం జరిగింది. దక్షిణేశ్వరాలయానికి పడమట, గంగాతీరాన అప్పుడు ఒక పెద్దతోట ఉండేది. ఆ తోటలో రకరకాల పూలచెట్లు, లతలు ఉండేవి. ఆ తోటను ఎంతో శ్రద్ధగా పెంచేవారు కాబట్టి, అది చాలా రమణీయంగా, మనోహరంగా ఉండేది. అప్పుడు శ్రీరామకృష్ణులు, జగన్మాత పూజ చేసేవారు కాదు. అయినా ఆ తోట నుండి పువ్వులు సేకరించి, చక్కని మాలలు కట్టి, వాటిని స్వయంగా అమ్మకు అలంకరించేవారు. ఆ పూదోటకు మధ్యన ఒక మెట్లదారి ఉండేది. అది గంగానది నుండి పైకి వచ్చేటందుకు ఉపయోగపడేది. ఆ దారి పైన ఉన్న విశాలమైన కాలిబాట ద్వారమండపానికి తీసుకుపోయేది. ఆలయానికి ఉత్తరాన స్త్రీల స్నానఘట్టం, నాదమండపం (నహబత్) ఉండేవి. స్త్రీల స్నానఘట్టానికి ప్రక్కన ఒక పెద్ద వకుళ వృక్షం (పొగడ చెట్టు) ఉండేది. అందుకే ఆ ఘట్టాన్ని ‘బకుల్ ఘాట్’ అనేవారు.
ఒకరోజు ఉదయం శ్రీరామకృష్ణులు ఆ తోటలో పువ్వులు సేకరిస్తున్నారు. అప్పుడు బకుల్ఘాట్లో ఒక పడవ వచ్చి ఆగింది. ఆ పడవ నుండి కాషాయ వస్త్రధారిణి అయిన ఓ సన్న్యాసిని దిగింది. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె చేతిలో పుస్తకాల కట్ట ఉంది. ఆమె పడవ దిగి సరాసరి దక్షిణ ద్వార మండపం వైపుకు రాసాగింది. వయస్సులో ఆమె ప్రౌఢయైనా ఆమె శరీరం కోమలంగా, అందంగా ఉంది. ఆమెను చూస్తే అంత వయస్సున్న దానిలా కనిపించదు. జవ్వనురాలిగా తోస్తుంది. ఆమెకప్పుడు దాదాపు నలభై ఏళ్ళుంటాయి. ఈ విషయం గురుదేవులే మాకు చెప్పారు.
ఆమెను మొదటిసారి చూడగానే, భవిష్యత్తులో ఆమెకు, తనకు ఆత్మీయ సంబంధం ఏర్పడబోతోందని శ్రీరామకృష్ణులు గ్రహించారో లేదో చెప్పలేం. మామూలు మనుషులకు కొత్తవారిని చూడగానే, వారితో రాబోయే కాలంలో ఆత్మీయత ఏర్పడేటట్లయితే, వారికి కూడ ఆ కొత్తవారి పట్ల తెలియని ఆకర్షణ కలుగుతుంది. శ్రీరామకృష్ణుల విషయంలో కూడ అలాగే జరిగింది. దూరం నుండి ఆమెను అలా చూడగానే శ్రీరామకృష్ణులు తన గదికి వెళ్ళిపోయారు. హృదయ్‌ను పిలిచి, ఆ సన్న్యాసినిని తోడ్కొని రమ్మన్నారు. హృదయ్ సంకోచించాడు. “ఆమె ఎవరో మనకు తెలియదు. మనం పిలిస్తే ఆమె ఎందుకు వస్తుందీ?” అని సందేహించాడు. “నా పేరు చెప్పి పిలువు, తప్పక వస్తుంది” అన్నారు శ్రీరామకృష్ణులు. ముక్కూముఖం ఎరుగని ఒక స్త్రీతో మాట్లాడతానని ఆయన అనేసరికి తాను విస్తుపోయానని హృదయ్ తర్వాత మాకు చెప్పాడు. అంతకు ముందెన్నడూ శ్రీరామకృష్ణులు అలా అపరిచిత స్త్రీలతో మాట్లాడి ఎరుగరు.
కాని శ్రీరామకృష్ణుల ఆదేశాన్ని హృదయ్ పాటించక తప్పలేదు. భైరవిని* చూసి, “మా చిన్నాన్న దైవభక్తుడు. ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, వస్తారా?” అని అడిగాడు. అతడి మాటలు వినగానే, మారుమాట్లాడకుండానే ఆమె హృదయ్ వెంట బయలుదేరింది. అది చూసి హృదయ్ మరింత విస్తుపోయాడు.
9. శ్రీరామకృష్ణులతో ఆమె తొలి సమావేశం
భైరవి, హృదయ్తోపాటు శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చింది. శ్రీరామకృష్ణులను చూడగానే, విస్మయానందాలతో ఉప్పొంగిపోయింది. కళ్ళ నుండి బాష్పాలు స్రవించాయి. శ్రీరామకృష్ణులతో “నాయనా! నువ్వు ఇక్కడున్నావా? గంగాతీరంలో ఉన్నావని మాత్రం ఆమె తొలి సమావేశం తెలుసు. కాని ఎక్కడో తెలియదు. నీ కోసం గంగాతీరమంతా వెతుకుతున్నాను. ఇంతకాలానికి నువ్వు కనిపించావు” అని చెప్పింది. శ్రీరామకృష్ణులు అదంతా విని, “అమ్మా! నా విషయం నీ కెలా తెలుసు?” అనడిగారు. “జగన్మాత నాకు ముగ్గురు వ్యక్తులను చూపించి, వారిని నేను కలుసుకోవాలని ఆదేశించింది. ఆ ముగ్గురిలో నువ్వు ఒకడవు. మిగతా ఇద్దరిని తూర్పు బెంగాల్లో కలుసుకొన్నాను. ఈ రోజు నిన్ను చూశాను” అని భైరవి వివరించింది.
10. ఇద్దరి మధ్య సంభాషణ
శ్రీరామకృష్ణులు, భైరవీమాతకు దగ్గరగా జరిగి కూర్చున్నారు. పసివాడు తల్లికి అన్ని విషయాలు ఏవిధమైన అరమరికలు లేకుండా తెలుపుతాడు. శ్రీరామకృష్ణులు కూడ ఇద్దరి మధ్య పసివాని మాదిరిగానే తన దివ్యదర్శనాల గూర్చి, అనుభూతుల గూర్చి సంభాషణ భైరవీ మాతకు వివరించి చెప్పారు. తాను భగవశ్చింతనలో బాహ్యస్పృహ కోల్పోవడం, శరీరంలో మంటలెత్తడం, నిద్రలేమి, ఇతర శారీరక వికారాలు మొదలైనవన్నీ వివరంగా తెలియచేశారు. అలా చెప్పి ఆమెతో, “అమ్మా! నా కివన్నీ ఎందుకు కలుగుతున్నాయి? నాకేమైనా పిచ్చిపట్టిందా? జగన్మాతను స్మరించడంవల్ల నా కిలాంటి వ్యాధి దాపురించిందా?” అంటూ ఎంతో ఆవేదనను వ్యక్తం చేశారు.
భైరవీ బ్రాహ్మణి ఆయన అనుభవాలను వింటూ ఆనందోత్సాహాలకు లోనయింది. మనస్సులో కరుణ, ప్రేమ, వాత్సల్యాలు పెల్లుబికాయి. ఆయనను ఆమె ఊరడించింది. “నాయనా! నువ్వు పిచ్చివాడవు కావు. ఇది పిచ్చికాదు. ఆత్మానుభూతి! ఈ అవస్థలన్నీ ఆ అనుభూతి లక్షణాలే. నీ దివ్యభావస్థితిని ఎవరు అర్థం చేసుకోగలరు? మామూలు జనానికి అర్థం అవుతుందా? శ్రీరాధకు కూడా ఇలాంటి అవస్థే కలిగింది. శ్రీచైతన్యులకూ కలిగింది. భక్తిశాస్త్రాలు ఈ అనుభవాల గూర్చి పేర్కొంటాయి. భగవంతుణ్ణి అనన్యచిత్తంతో స్మరించే వారందరికీ ఈ అనుభూతులు కలిగాయి. నా వద్ద ప్రామాణిక శాస్త్రాలున్నాయి. వాటి ద్వారా నీ అనుభూతులు భ్రమలు కావనీ, సత్యమేననీ నిరూపిస్తాను” అని ఆయనకు ధైర్యం చెప్పింది.
శ్రీరామకృష్ణులు, భైరవి అంత ఆత్మీయంగా మాట్లాడుకోవడం చూసి, హృదయ్ ఆశ్చర్యచకితుడయ్యాడు.
అలా మాటల్లోపడ్డ వారికి కాలం తెలియలేదు. అప్పటికే చాలా పొద్దు పోయింది. జగన్మాతకు నివేదించిన పండ్లు, పటికబెల్లం మొదలైనవి భైరవీమాతకు ఫలహారంగా శ్రీరామకృష్ణులు పెట్టారు. భైరవిలో శ్రీరామకృష్ణుల పట్ల పుత్రవాత్సల్యం జనించింది. అది గ్రహించి, బిడ్డ తినకుండా తల్లి తినదని ఎంచి, శ్రీరామకృష్ణులు ఆ ప్రసాదంలో కొంత తిన్నారు. ఆలయ దేవతలను దర్శించి వచ్చి, ఆ ఫలహారం భైరవి స్వీకరించింది.
ఆమె తన మెడలో రఘువీరుని ప్రతిమ ధరించి ఉంది. రఘువీరునికి నైవేద్యం అర్పించడం కోసం ఆలయభాండారంలో బియ్యం, పప్పులు వగైరా పుచ్చుకొంది. పంచవటక్రింద కూర్చుని వంటకు ఉపక్రమించింది.
11. పంచవటిలో భైరవికి దివ్యదర్శనం
వంట పూర్తిచేసి, రఘువీరుని ముందు నైవేద్యంగా అర్పించింది. తన ఇష్ట దేవతా ధ్యానంలో మునిగిపోయింది. ఆ స్థితిలో ఆమెకు ఒక దివ్యదర్శనం కలిగింది. ఆమెకు శరీర స్పృహలేదు. ఆమె కళ్ళు ప్రేమతో వర్షిస్తున్నాయి. ఆ సమయంలో శ్రీరామకృష్ణులకు పంచవటికి వెళ్ళాలన్న అంతఃప్రేరణ కలిగింది. ఆయనకప్పుడు పూర్తి స్పృహలేదు. ఆ భావావేశంలో ఆయన పంచవటికి వెళ్ళారు. ఆయనకు తాను ఏం చేస్తున్నారో అసలు తెలియదు. భైరవి అర్పించిన రఘువీరుని నైవేద్యాన్ని శ్రీరామకృష్ణులు ఆరగింప మొదలుపెట్టారు.
భైరవికి బాహ్యస్పృహ కలిగింది. కళ్ళు తెరిచి చూస్తే ఏముందీ! శ్రీరామకృష్ణులు బాహ్యస్పృహారహితులై నైవేద్యాన్ని ఆరగిస్తున్నారు! భైరవి ఆ దృశ్యం, తన దివ్యదర్శనం ఒకటి కావడం చూసి, ఎంతో ఆనందపరవశురాలైంది.
కొంతసేపు అలా గడిచింది. శ్రీరామకృష్ణులు బాహ్యస్పృహలోకి వచ్చారు. తాను చేసిన పని తెలుసుకొని, ఎంతో వ్యథ చెందారు. భైరవితో, “నా కేమిటో ఈ జబ్బు! మైమరచిపోయి, ఇలా ఏదేదో చేస్తుంటాను. ఎందుకమ్మా, ఇలా జరుగుతున్నది?” అని ఏడ్చారు. భైరవి, తల్లిలా ఆయనను ఓదార్చింది. “నాయనా! నువ్వేం తప్పు చేయలేదు. మంచిపనే చేశావు. నిజానికి ఇది నీ పని కాదు. నీలో ఉన్న వాడి పని. ధ్యానంలో ఒక దివ్యదర్శనం కలిగింది. అందులో ఈ పని చేస్తున్నవారు ఎవరో నాకు తెలిసిపోయింది. ఇంత కాలానికి నా పూజ సఫలమైంది. ఈ క్షణం నుండి నేను బాహ్యపూజ చేయవలసిన అవసరం లేదు” అని వివరించింది.
అలా చెప్పి, భైరవీబ్రాహ్మణి, శ్రీరామకృష్ణుల ఉచ్ఛిష్టాన్ని భగవత్ప్రసాదంగా స్వీకరించింది. అలా చేయడంలో ఆమె ఎలాంటి సంకోచానికీ లోనుకాలేదు. తన ఇష్టదైవం శ్రీ రఘువీరుడు శ్రీరామకృష్ణుల రూపంలో ప్రత్యక్షం కావడం చూసి పరమానంద భరితురాలైంది. ఆనందబాష్పాలు ఆమె కళ్ళ వెంట ధారలు కట్టాయి. ఎంతోకాలం నుండి, ఎంతో భక్తితో పూజిస్తున్న ఆ రఘువీరశిలను గంగార్పణం చేసింది.
12. పంచవటిలో శాస్త్రచర్చ
భైరవీ శ్రీరామకృష్ణుల ఆత్మీయత, సాన్నిహిత్యం, ప్రేమవాత్సల్యాలు నానాటికీ పెంపొందసాగాయి. శ్రీరామకృష్ణుల పట్ల పుత్రప్రేమతో, భైరవి దక్షిణేశ్వరంలోనే ఉండిపోయింది. వారిద్దరూ నిత్యం పంచవటి క్రింద కూర్చుని కాల గమనం కూడ తెలియని రీతిలో భగవత్ప్రసంగాలలో మునిగి పోసాగారు. భైరవి, భక్తి – తంత్రశాస్త్రాలను ఉదాపారిస్తూ, ఆయన అనిభవాలు శాస్త్రీయాలేనని నిరూపించేది. అవతారపురుషుల లక్షణాలు, అనుభూతులు వివరించి, ఆయన సందేహాలను నివృత్తి చేసేది. ఆ విధంగా పంచవటిలో కొన్ని రోజులపాటు దివ్యానందం పరవళ్ళు త్రొక్కి ప్రవహించసాగింది.
13. దేవమండల్ ఘాట్‌కు భైరవి బసను మార్చుకోవడానికి కారణం
అలా ఆరు లేక ఏడు రోజులు గడిచాయి. వారి మధ్య దోషం ఇసుమంత కూడా లేదు. కాని భైరవి అలా తన చెంత ఉండడం సబబు కాదని శ్రీరామకృష్ణులకు తోచింది. తమ మధ్య నెలకొన్న నిజమైన సంబంధ విషయం లోకులకు తెలియదు, అర్థం కాదు. లోకులు కామినీ కాంచనాసక్తులై ఉంటారు. వారి బుద్ధి ఎప్పుడూ సంసారపరంగానే ఆలోచిస్తుంది. ఈ లోకుల మూలంగా భైరవికి ఎక్కడ అపనింద వస్తుందోనని శ్రీరామకృష్ణులు భయపడ్డారు. ఆ విషయం భైరవికి చెప్పారు. ఆమె కూడా వెంటనే విషయం అర్థం చేసుకుంది. ఆలయానికి దగ్గరలో మరోచోటికి తన బస మార్చుకుంది. ప్రతిరోజూ శ్రీరామకృష్ణులను చూసి వెళ్ళాలని నిశ్చయించుకుంది. అలా ఆమె ఆలయాన్ని వదిలింది.
ఆలయాన్ని వదలి ‘దేవమండల్ ఘాట్’ అనే స్నానఘట్టంవద్ద బసచేయ సాగింది.* అది కూడా దక్షిణేశ్వర గ్రామంలోనిదే. ఆలయానికి ఉత్తరంగా గంగాతీరంలో అది ఉంది. భైరవి ఆ గ్రామంలో స్వేచ్ఛగా తిరిగేది. ఆమె సద్గుణాలు, సదాచారాలు గ్రామస్థులను ఆకట్టుకున్నాయి. గ్రామీణ స్త్రీలంతా ఆమె పట్ల శ్రద్ధ, గౌరవాలు పెంపొందించుకున్నారు. దానితో ఆమె కనీస అవసరాలు తీరిపోయేవి. అంతేకాక, ఆమెపై లోకాపవాదు రాకుండా కూడా తొలగిపోయింది.
దానితో ఆమె మళ్ళీ ప్రతిరోజూ కాళికాలయానికి వెళ్ళేది. శ్రీరామకృష్ణులతో కొంతసేపు భగవత్ప్రసంగాలలో గడిపేది. గ్రామస్త్రీల వద్ద భిక్ష గ్రహించేది. భిక్షలో లభించిన మధుర పదార్థాలను అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులకు కూడా తెచ్చి ఇస్తూవుండేది.
14. శ్రీరామకృష్ణులు అవతారపురుషులన్న భైరవి విశ్వాసానికి హేతువులు
శ్రీరామకృష్ణులకు కలిగిన అనుభవాలు – దర్శనాలు – అవస్థలు అన్నీ భగవంతుని అనుగ్రహమేనని భైరవీ బ్రాహ్మణి భావించింది. కాని శ్రీరామకృష్ణులు భగవత్ప్రసంగాలు వింటూ, మాట్లాడుతూ భావసమాధిలోకి వెళ్ళిపోయేవారు. బాహ్యస్మృతి కోల్పోయేవారు. కీర్తనలో పరవశులయ్యేవారు. ఇవన్నీ భైరవి ప్రత్యక్షంగా చూసింది. చూసిన తర్వాత ఆయన సామాన్య సాధకుడు కాదని తెలుసుకొంది. చైతన్య చరితామృతం, చైతన్య భాగవతం మొదలైన గ్రంథాల్లో శ్రీ శ్రీ చైతన్యులు మరల అవతరిస్తాడని ఉంది. శ్రీరామకృష్ణులను గమనిస్తుంటే, భైరవికి ఆ అవతారం ఇదేనేమోనన్న స్ఫురణ కలిగేది. ఆమె శ్రీచైతన్య నిత్యానందుల చరిత్రలతో, శ్రీరామకృష్ణులను పోల్చి చూసుకుంది. శ్రీరామకృష్ణుల అనుభవాలకు, వారి అనుభవాలకు మధ్య చాలా దగ్గరి పోలికలుండడం గమనించింది. శ్రీ చైతన్యులలా పరవశత్వం పొందడం, ఆయనలా స్పర్శతో ఇతరులలో ఆధ్యాత్మికతను జాగృతం చేయడం చూసింది. భగవద్విరహం కారణంగా శ్రీచైతన్యులలో దుర్భరమైన మంటలు శరీరంలో పుట్టేవి. అప్పుడు పుష్పమాలతో, గంధంతో ఆయన శరీరాన్ని అలంకరిస్తే, ఆ మంటలు తగ్గేవి. శ్రీరామకృష్ణులలో కూడా భైరవికి అవే లక్షణాలు, అట్లే కనిపించాయి. ఆయన కూడా భగవంతుని విరహంతో వ్యథ చెందుతూ, శరీరంలో మంటలను అనుభవించేవారు. భైరవి అందుకు చికిత్సగా పూలమాలలు ధరించి, గంధం అలదుకోమని సూచించింది. అలా చేసిన వెంటనే ఆ మంటల వేడి చల్లబడింది. వీటి ఆధారంగా భైరవి ఒక నిర్ణయానికి వచ్చింది. శ్రీచైతన్యుడు, నిత్యానందుడు – ఇద్దరూ శ్రీరామకృష్ణుల శరీరంలో అవతరించారని ఆమెకు నిశ్చయమైంది. సిహోర్ గ్రామానికి వెళుతున్నప్పుడు, శ్రీరామకృష్ణుల శరీరం నుండి ఇద్దరు కౌమారప్రాయ వ్యక్తులు బయటకు రావడం మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఆ విషయాన్ని శ్రీరామకృష్ణుల ముఖతా స్వయంగా విన్న తర్వాత, శ్రీరామకృష్ణులు అవతారపురుషుడేనని ఆమె మరింతగట్టిగా నిశ్చయించుకుంది. ‘నిత్యానందుని తొడుగులో చైతన్యుని ఆవిర్భావం జరిగింది’ అని అనుకుంది.
భైరవీ బ్రాహ్మణి ఎవరి నుంచీ ఏమీ ఆశించేది కాదు. కాబట్టి లోకుల మాటలను అసలు పట్టించుకునేది కాదు. తాను సత్యమనుకొన్నదాన్ని నిర్భయంగా వెల్లడించేది.
అలాగే శ్రీరామకృష్ణులను గూర్చి తనకు తెలిసిన సత్యాన్ని అందరికీ చెప్పసాగింది. ఒకరోజు మథుర్‌తో శ్రీరామకృష్ణులు పంచవటి క్రింద కూర్చుని ఉన్నారు. హృదయ్ కూడా అక్కడే ఉన్నాడు. మాటల సందర్భంలో శ్రీరామకృష్ణులు తన విషయంలో భైరవికి కలిగిన అభిప్రాయాన్ని మథుర్కు చెప్పారు. “అవతారపురుష లక్షణాలు నాలో కనిపిస్తున్నాయట ఆమెకు! ఆమె అనేక శాస్త్రాలు అధ్యయనం చేసింది. ఆమె వద్ద అనేక పుస్తకాలున్నాయి” అని తెలిపారు.
మథుర్ అదంతా విని నవ్వాడు. “బాబా! ఆమె ఏమైనా అనుకోనీ. అవతారాలు పది కన్నా ఎక్కువ లేవు కదా! అలాంటప్పుడు ఆమె చెప్పేది సత్యమెలా అవుతుందీ? కాని ఒకటి మాత్రం సత్యం. జగన్మాత అనుగ్రహం నీకు లభించింది” అన్నాడు.
అప్పుడు భైరవి వారివైపుగా రాసాగింది. శ్రీరామకృష్ణులు, మథుర్కు ‘ఆమే భైరవీ బ్రాహ్మణి’ అని తెలిపారు. చేతిలో మిఠాయిల పళ్ళెంతో, మాతృప్రేమతో పరవశురాలై ఆమె శ్రీరామకృష్ణుల వైపు రాసాగింది. తన ప్రియతమ తనయుడైన బాలకృష్ణునికి, యశోదామాత వెన్నముద్దలు పెట్టడానికి ఎలా ప్రేమ, వాత్సల్యాలతో వచ్చేదో, అలా వచ్చింది.
దగ్గరకు రాగానే ఆమెకు మథుర్బాబు కనిపించాడు. వెంటనే తనను తాను సంబాళించుకుంది. మిఠాయి పళ్ళాన్ని హృదయ్‌కు ఇచ్చింది. శ్రీరామకృష్ణులు మథుర్బాబును ఆమెకు పరిచయం చేశారు. “అమ్మా! నా గురించి నువ్వు నాకు చెప్పిన విషయాలు ఇతనికి చెప్పాను. ఇతడేమో అవతారాలు పది కన్నా ఎక్కువ ఉండడానికి వీలులేదంటున్నాడు. మరిప్పుడెలా?” అని అమాయకంగా అడిగారు. మథుర్, భైరవీమాతకు నమస్కరించాడు. ఆమె అతణ్ణి ఆశీర్వదించింది.
“నాయనా! భాగవతం అవతారాలు ఇరవైనాల్గని పేర్కొంటున్నది. అంతే కాదు, విష్ణువు అనేకానేకసార్లు అవతరిస్తూంటాడని వ్యాసభగవానుడే తెలిపి ఉన్నాడు. వైష్ణవగ్రంథాల్లో కూడ శ్రీచైతన్యుడు మరల అవతరిస్తాడని ఉంది. పైగా శ్రీరామకృష్ణులకు కలుగుతున్న దివ్యానుభూతులు, దర్శనాలు, అవస్థలు దాదాపు శ్రీచైతన్యునితో సరిపోలుతున్నాయి” అని మథుర్కు వివరించింది.
“భాగవతాన్ని, వైష్ణవ గ్రంథాలను అధ్యయనం చేసిన పండితులతో ఈ విషయంగా వాదించి, సప్రామాణికంగా నిరూపిస్తా” నని చెప్పింది. ఆమె మాటలన్నీ విన్న మథుర్ ఏం చెప్పడానికీ పాలుబోక మౌనంగా ఉండిపోయాడు.
15. వైష్ణవచరణ్ రాక
శ్రీరామకృష్ణులు అవతారమన్న భైరవి మాటలు దాదాపు కాళికాలయంలో అందరికీ తెలిసింది. దాంతో పెద్ద అలజడి రేగింది. అది ఎలా పరిణమించిందో, గురుభావం (IV. 1) లో మేము వివరంగా చెప్పాం. శ్రీరామకృష్ణులను అవతారమని భైరవి ప్రకటించినప్పటికీ ఆయనలో కొత్తగా ఏ మార్పూ రాలేదు. మామూలు గానే కాళీమాత తనయునిగానే ఉండిపోయారు. కాని భైరవి మాటలకు, పండితులు – విద్వాంసులు అయిన వారు ఎలా ప్రతిస్పందిస్తారోనన్న కుతూహలం మాత్రం ఆయనకు కలిగింది. అందుకై పండితుల సభ ఏర్పాటు చేయమని మథుర్ను కోరారు. మథుర్ విద్వాంసులైన వారందరినీ ఆహ్వానించాడు. వైష్ణవచరణ్ కూడ అలా ఆహ్వానితుడై దక్షిణేశ్వరం వచ్చాడు.
ఆ పండితులందరి ముందు భైరవి తనవాదాన్ని ఎలా నిరూపించుకుందో, గురుభావం, ఉత్తరార్ధంలో (IV. 1) మేము తెలియచేశాం.