1. ఈ సమయంలో శ్రీరామకృష్ణుల ప్రవర్తన..
బాల్యంలోనే శ్రీరామకృష్ణులు తండ్రిని కోల్పోయారు. ఆ క్షణం నుండి తల్లి చంద్రమణీ దేవి, పెద్దన్న రాంకుమార్ ప్రేమవాత్సల్యాల మధ్య పెరిగి పెద్దవారయ్యారు. రాంకుమార్ రామకృష్ణులకన్నా ముఫ్పైఒక్క సంవత్సరాలు పెద్దవాడు. అందువల్ల గురుదేవులు తన అన్నగారిని తండ్రితో సమంగా గౌరవిస్తూ ఉండేవారు. అలాంటి తండ్రి సమానుడైన అన్న హఠాత్తుగా పరమపదించడంతో శ్రీరామకృష్ణులు ఎంతో దుఃఖీంచారని వేరుగా చెప్పాలా! ఈ సంఘటన ‘సంసారం అనిత్యం’ అన్న భావాన్ని ఆయన మనస్సులో మరింత దృఢం చేసింది. ఇది వారిలో వైరాగ్యాన్ని ఎంతవరకు ప్రజ్వలితం చేసిందో చెప్పలేం. ఏది ఏమైనా, ఆ క్షణంనుండి ఆయన జగన్మాత పూజలోనే అధికంగా నిమగ్నులు కాసాగారు. భగవద్దర్శనాన్ని పొందాలను కొనేవారు, నిజంగా ఆ దర్శనాన్ని పొందగలరా, కృతార్థులు కాగలరా? అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆయన వ్యాకులపడసాగారు. నిత్యపూజానంతరం జగన్మాత చెంతన కూర్చుని ఆమె ధ్యానంలో లీనమై రోజులు గడపసాగారు. ఆ సమయంలో రామ్‌ప్రసాద్, కమలాకాంత్* మొదలైన దేవీభక్తులు రచించిన భక్తిగీతాలు పాడుతూ అమ్మకు వినిపిస్తూ అమ్మ ప్రేమలో లీనమై, మైమరచిపోతూ ఉండేవారు. మధ్యాహ్నం, రాత్రి ఆలయాన్ని మూసివేసిన తర్వాత, అందరినీ వదిలి బయట పంచవటి చుట్టూ ఉన్న చిట్టడవిలోకి వెళ్ళి, జగన్మాతను ధ్యానిస్తూ ఉండిపోయేవారు.
2. హృదయ్ ఆందోళన
శ్రీరామకృష్ణులు ఇలా జగన్మాత ధ్యానంలోనే నిరంతరం ఉండిపోవడం, హృదయ్‌కు ఎంతమాత్రమూ నచ్చేది కాదు. కాని అతడేం చేస్తాడు? తన మామ సంగతి, పట్టుదల అతడికి తెలియనివేమీకావు. తన మామ తానేమి చేయాలనుకొంటాడో, అది చేసి తీరడం చిన్ననాటి నుండి ఆయన స్వభావమని అతడికి బాగా తెలుసు. ఆయనను నివారించడం ఎవరి తరమూ కాదు. అందుచేత అలా చేయవద్దని చెప్పడం, ఆపే ప్రయత్నం చేయడం వ్యర్థం. కాని శ్రీరామకృష్ణుల ఆ ధోరణి రోజురోజుకీ మితిమీరడం చూసి, అప్పుడప్పుడు హృదయ్ ఆయనకు చూచాయగా చెప్పే ప్రయత్నం చేస్తుండేవాడు. శ్రీరామకృష్ణులు రాత్రివేళ నిద్రించేవారు కారు. గది వదలి పంచవటి వైపు వెళుతున్నారన్న విషయం తెలిసి, హృదయ్ ఎంతో ఆందోళన చెందాడు. ఎందుకంటే, గుడిలో దేవీపూజ ఎంతో శ్రమతో కూడిన పని. పైగా శ్రీరామకృష్ణులు ఆహారం కూడ ఈ మధ్య తగ్గించారు. ఈ స్థితిలో రాత్రిపూటకూడ నిద్రపోకపోతే ఇక ఆయన ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం. కాబట్టే బాగా ఆలోచించి, సాధ్యమైనంతవరకూ పరిస్థితులను చక్కబెట్టాలనుకున్నాడు హృదయ్.
3. ఆ సమయంలో పంచవటి, పరిసరాలు
పంచవటి చుట్టుపక్కల ఉన్న స్థలం, ఇప్పటిలా సమతలంగా ఉండేది కాదు. గోతులతో, మిట్టలతో, దిబ్బలతో, పొదలు – చెట్లతో ఒక చిన్న అడవి మాదిరి ఉండేది. ఆ అడవి చెట్ల మధ్య ఒక ఉసిరి చెట్టుండేది. అది అడవే కాక, శ్మశాన భూమి కూడ కాబట్టి పగలు కూడ ఎవరూ ఆ ఛాయలకు వెళ్ళేవారు కారు. రాత్రయితే, దయ్యాల భయం కారణంగా జనం, ఆ వైపు చూడడానికైనా భయపడేవారు. ఆ ఉసిరిచెట్టు ఎంతో పల్లంలో ఉండేదని హృదయ్ తెలిపాడు. అందువల్ల ఎవరైనా ఆ చెట్టు కింద కూర్చుంటే, అడవి బయటి ఎత్తైన ప్రదేశం నుండి వారిని చూడడం సాధ్యమయ్యేది కాదు. శ్రీరామకృష్ణులు రాత్రివేళ ఈ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తుండేవారు.
4. రాత్రివేళ ఆ అడవిలోకి ఎందుకు వెళుతున్నారో హృదయ్ వాకబు చేయడం
ఒక రాత్రివేళ శ్రీరామకృష్ణులు పంచవటి వైపు పోతుండగా, హృదయ్ ఆయనను అనుసరించాడు. ఆ విషయం ఆయనకు తెలియదు. ఆయన అడవిలో ప్రవేశించడం చూశాడు. ఇంకా ముందుకు వెళితే ఆయనకు కోపం వస్తుందేమోనని భయపడి, హృదయ్ అక్కడే ఆగిపోయాడు. కాని అక్కడే నిలబడి చిన్నచిన్న రాళ్ళు విసురుతూ ఆయనను భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయినా ఆయన వెనుదిరగకపోవడం చూసి, మరేమీ చేయలేక, అతడు తన గదికి తిరిగి వచ్చేశాడు. మరుసటి రోజు వీలుచూసుకొని, “రాత్రివేళ అడవికి వెళ్ళి నువ్వక్కడ ఏం చేస్తుంటావు?” అనడిగాడు. “అక్కడొక ఉసిరి చెట్టు ఉంది. దాని కింద కూర్చుని ధ్యానం చేస్తూంటాను” అని శ్రీరామకృష్ణులు జవాబు చెప్పారు. “మనస్సులో ఏదైనా కోరికతో ఆ చెట్టు కింద ధ్యానం చేస్తే, అది ఈడేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి” అని వివరించారు.
5. శ్రీరామకృష్ణులను భయపెట్టడానికి హృదయ్ ప్రయత్నించడం
ఆ తర్వాత శ్రీరామకృష్ణులు యథాప్రకారం అడవిలోకి వెళ్ళడం, ధ్యానం చేయడం కొనసాగాయి. హృదయ్‌కు మాత్రం ఏం చేయడానికీ పాలుబోలేదు. శ్రీరామకృష్ణులను భయపెట్టేందుకు ఆయన చుట్టూ రాళ్ళు విసరుతుండేవాడు. అది హృదయ్ పనేనని తెలిసి కూడ శ్రీరామకృష్ణులు అతణ్ణి ఏమీ అనేవారు కాదు. భయపెట్టి లాభం లేదని తెలిసి, హృదయ్ ఒక రోజు శ్రీరామకృష్ణులతోపాటు ఆయనకు సమీపంగా అడవిలోకి పోయాడు. శ్రీరామకృష్ణులు ఉసిరి చెట్టు కిందకు వెళ్ళి వస్త్రాలు విప్పడం, మెడలోని జందెం తీసివేయడం, సుఖాసీనుడై ధ్యానం చేయడం చూశాడు. అది చూసి తెల్లబోయాడు. “మా మామకు పిచ్చిగాని పట్టలేదు కదా! పిచ్చివారుకాక ఇలా ఎవరు చేస్తారు? ధ్యానం చేయడం మంచిదే! కాని ఇలా ఒంటి మీద నూలుపోగు కూడ లేకుండా ధ్యానం చేయడం ఏమిటి?” అని అతడు విస్మయం చెందాడు.
6. “పాశముక్తుడై ధ్యానం చేయాలి” – శ్రీరామకృష్ణుల ఉవాచ
అలా విస్తుపోయి చూస్తున్న హృదయ్ ఇక ఆగలేకపోయాడు. వెంటనే శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళి, “నువ్వు చేస్తున్న దేమిటి? జందెం – బట్టలు అన్నీ తీసేసి, నగ్నంగా ఇలా కూర్చున్నావేం?” అని గట్టిగా అడిగాడు. శ్రీరామకృష్ణులను పదేపదే పిలిచాక ఆయనలో బాహ్యస్మృతి కలిగింది. హృదయ్ ప్రశ్న కూడ వినిపించింది. “నీకు తెలియదులే. ధ్యానం ఇలాగే చేయాలి. సర్వ పాశాల నుండి ముక్తులై ధ్యానం చేయాలి. పుట్టినప్పటి నుండి మనిషి – లజ్జ, ఘృణ, కులం, శీలం, భయం, మానం, జాతి, అభిమానం – అనే ఎనిమిది పాశాల్లో చిక్కుకుని ఉంటాడు. జందెం కూడా ఒక బంధమే. ఎందుకంటే, ‘నేను బ్రాహ్మణుడను. అందరి కన్నా శ్రేష్ఠుణ్ణి’ అనే అహంభావాన్ని అది కలిగిస్తుంది. అమ్మను పిలిచేటప్పుడు ఈ పాశాలనన్నింటినీ పారేసి, ఏకాగ్రచిత్తంతో ఆమెను పిలవాలి. అందుకే నేను వీటన్నింటినీ తీసివేశాను. ధ్యానం పూర్తయ్యాక వచ్చేటప్పుడు మళ్ళీ ధరిస్తాను” అని శ్రీరామకృష్ణులు వివరించారు.
హృదయ్ ఇలాంటి విషయాలను ఎన్నడూ విన్నది లేదు. అందువల్ల తెల్లబోయి వింటూ ఉండిపోయాడు. అదంతా విని వెనుదిరిగిపోయాడు. కాని అడవిలోకి వెళ్ళే ముందు మాత్రం ‘ఈ రోజు మామకు మంచి హితబోధ చేస్తాను. గట్టిగా మందలిస్తాను’ అనుకున్నాడు. కాని అందుకు పూర్తి విరుద్ధంగా అంతా జరిగింది. తానే హితోపదేశం పొందవలసివచ్చింది!
శ్రీరామకృష్ణుల సాధనలకు నెలవై అలరారిన పంచవటి. 1900 సం ॥ లో తీసిన ఛాయాచిత్రం
7. భావనలను కార్యాచరణలో పెట్టడంలోని ఆవశ్యకత
పైన చెప్పుకున్న సంఘటనకు సంబంధించిన మరో విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం మంచిది. అది మనకు స్పష్టమైతే, శ్రీరామకృష్ణుల జీవితంలో తదనంతరం జరిగిన అనేక ఇతర సంఘటనలు మనకు సులభంగా అర్థమౌతాయి. పైన చెప్పిన అష్టబంధాల నుండి ముక్తులు కావడానికి, వాటన్నింటినీ శ్రీరామకృష్ణులు కేవలం మానసికంగానే పరిత్యజించడంతో తృప్తిచెందక, బాహ్యంగా కూడ వాటిని సాధ్యమైనంత వరకు పరిత్యజించారు. తదనంతర జీవితంలో కూడ అన్ని విషయాల్లోనూ వారు ఇలాగే చేయడం మనం చూడవచ్చు.
ఉదాహరణకు, ఉన్నతకులంలో పుట్టానన్న అభిమానాన్ని నాశనంచేసి, యథార్థ ‘వినమ్రతను’ పొందడం కోసం, ఇతరులు అశుద్ధంగా భావించి దూరంగా ఉండేచోట్లను ఎంతో శ్రద్ధతో, స్వయంగా శుభ్రం చేశారు.
“సమలోష్టాశ్మ కాంచనుడు” కాకపోతే, అంటే లోకులు అమూల్య వస్తువులుగా పరిగణించే, రత్నాలు, మణులు, బంగారం మొదలైన వాటిని మట్టితో సమానంగా తుచ్ఛమైనవాటిగా భావించకుండా ఉంటే, మనిషి మనస్సు – శారీరక, ప్రాపంచిక భోగసుఖాలను వదిలిపెట్టజాలడన్న విషయాన్ని శ్రీరామకృష్ణులు విన్నవెంటనే, కొన్ని రూపాయి నాణాలను, మట్టిముద్దలను చేతిలోకి తీసుకొని ‘రూపాయి – మట్టి, మట్టి – రూపాయి’ అంటూ పలుకుతూ, ఆ రెంటినీ గంగానదిలో పారవేశారు.
8. సమగ్రమైన శ్రీరామకృష్ణుల పరిత్యాగం
జీవులంతా శివుడి స్వరూపాలే అన్న జ్ఞానాన్ని దృఢం చేసుకోవడానికై కాళికాలయంలో బిచ్చగాళ్ళందరి భోజనం అయ్యాక, వారి ఎంగిలి మెతుకులను భగవత్ ప్రసాదంగా గ్రహించి, తలపైన పెట్టుకున్నారు. వారి ఎంగిలి విస్తరాకులను తమ తలపై మోసి గంగానదిలో పారవేశారు. తిరిగి వచ్చి ఆ స్థలాన్ని చీపురుతో శుభ్రంచేసి, తన నశ్వర శరీరం ద్వారా కొంతలో కొంతైనా కృతార్థుడనయ్యానని భావించి, తృప్తి చెందారు. ఇలాంటి సంఘటనలను ఎన్నింటినైనా పేర్కొనవచ్చు. వీటన్నింటి మూలంగా మనకో విషయం స్పష్టమౌతున్నది. శ్రీరామకృష్ణులు భగవత్సాక్షాత్కార మార్గంలోని ఆటంకాలనన్నింటినీ, కేవలం మానసికంగా మాత్రమే పరిత్యజించడంతో తృప్తి పడలేదు. కాని మొట్టమొదట వాటన్నింటినీ స్థూలంగా విసర్జించి, సాధ్యమైనంతవరకు తమ శరీరాన్ని, ఇంద్రియాలను వాటి నుండి దూరంగా ఉంచుతూ, తద్విపరీత అనుష్ఠానాలను (అంటే సాక్షాత్కారానికి సహకరించే వాటిని) ఆచరిస్తూ, శరీర ఇంద్రియాలను బలవంతంగా తమ అదుపులో ఉంచుకునేవారు. ఇలాంటి ఆచరణ ద్వారా ఆయన మనస్సులోని పూర్వ సంస్కారాలన్నీ నిశ్శేషంగా నశించిపోయేవి. తద్విపరీత ఆధ్యాత్మిక సంస్కారాలు ఎంతో దృఢమయ్యేవి; ఆయన మనస్సు మరెప్పుడూ కూడ దారితప్పి చరించేది కాదు. అలా కొత్త సంస్కారాలను మనస్సు ముందుగా గ్రహించి, తర్వాత శరీర – ఇంద్రియాల ద్వారా కొంతలో కొంతైనా వాటిని ఆచరణలో పెడితేతప్ప, పాత సంస్కారాలు నశించి, కొత్త సంస్కారాలు స్థిరపడవు అని శ్రీరామకృష్ణుల అభిప్రాయం.
9. శ్రీరామకృష్ణుల సాధన విధానం పట్ల ఆక్షేపణకు ఖండనం
పూర్వసంస్కారాలన్నింటినీ పూర్తిగా త్యాగం చేయడానికి ఇష్టపడని మనం, శ్రీరామకృష్ణులు అవలంబించిన పై సాధన విధానం అనవసరం అని భావించవచ్చు. విచిత్రమైన ఆయన సాధన విధానాన్ని విశ్లేషిస్తూ, కొంతమంది అపవిత్రం, అసహ్యకరమైన ప్రదేశాలను శుభ్రం చేయడం, రూపాయి – మట్టిని ఒకటిగా తలచి, గంగలో పారవేయడం – ఈ విచిత్ర సాధన అంతా ఆయన ఊహాజనితమే తప్ప శాస్త్రీయం కాదని అనడానికి కూడ సాహసిస్తూంటారు. అయినా ఇంతకు ముందు ఎవరూ చేయని, ఎవరికీ తెలియని ఇలాంటి ఉపాయాల ద్వారా ఆయన సాధించిన మానసికోన్నతిని, వాటికన్నా సులభమైన ఇతర ఉపాయాల ద్వారా సత్వరమే పొందవచ్చు కదా”* అని ఆక్షేపిస్తుంటారు.
అందుకు మా సమాధానం:
“నిజమే. మీరు చెప్పేది బాగానే ఉంది. కాని ఇలా బాహ్యంగా అనుష్ఠానం చేయకుండా, కేవలం మానసికంగా మాత్రమే విషయాదులను త్యాగంచేసే, మీరు చెప్పేలా ‘సులభోపాయాల’ ను అవలంబించి, రూపరసాది విషయాల్లో సంపూర్ణ విరక్తి పొంది, మనస్సును పూర్తిగా భగవంతుడికి అర్పించగలిగిన వ్యక్తులు ఇప్పటివరకు ఎంతమంది జన్మించారో మీరు చూపగలరా? అదెప్పటికీ జరగదు.
మనస్సు ఒక వైపు సాగుతూ ఉంటే, శరీరం మరోవైపు వెళుతూ ఉంటుంది కదా! (అంటే మనస్సులోనేమో ఆధ్యాత్మిక భావం, శరీరంతో ప్రాపంచిక భోగం). ఇలాంటి మనశ్శరీరాల ద్వారా భగవత్సాక్షాత్కారం కలగడం సుదూర విషయం సుమా! ఇహలోకంలో కూడ ఇలాంటి మనశ్శరీరాల ద్వారా ఎలాంటి మహత్కార్యాన్నీ సాధించలేం. కాని రూపరసాది విషయ భోగలాలసులైన ఈ లౌకికులు ఈ సత్యాన్ని గ్రహించలేరు కదా! ఒక భోగవిషయాన్ని త్యాగం చేయడం శ్రేయస్కరం అని అర్థమైనా కూడ, పూర్వసంస్కార ప్రాబల్యం చేత తన శరీరేంద్రియాల ద్వారా, మనిషి దానిని వదలిపెట్టే ప్రయత్నం ససేమిరా చేయడు. పైగా, ‘శరీరం ఏమైనా చేయనీ, మనస్సులో మాత్రం నేను భగవంతుణ్ణి చింతనచేస్తూ ఉంటాను’ అని అనుకుంటాడు. ఒకేకాలంలో యోగం, భోగం రెంటినీ తాను పొందగలడనే అని అలా ఆత్మవంచన చేసుకొంటాడు. తన గొంతును తానే కోసుకుంటాడు. అయితే వెలుగు చీకట్ల మాదిరి – యోగం, భోగం రెండూ ఎప్పుడూ కలసి ఉండలేవు. కామ కాంచనయుత సాంసారిక సుఖాలను అనుభవిస్తూ, భగవత్సాక్షాత్కారాన్ని కూడ అదేకాలంలో, అదే స్థితిలో పొందగల సులభమార్గాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇంతవరకూ ఎవరూ కనిపెట్టలేక పోయారు.* కాబట్టే శాస్త్రాలు, ‘దేన్ని త్యాగం చెయ్యాలో దాన్ని మనోవాక్కాయాల ద్వారా త్యాగం చెయ్యాలి. దేన్ని అనుష్ఠించాలో దాన్ని మనోక్కాయాల ద్వారా అనుష్ఠించాలి. అప్పుడే సాధకుడు ఈశ్వరదర్శనానికి యోగ్యుడౌతాడు’ అని పదేపదే ఘోషిస్తున్నాయి. అందుకే ఋషులు, ‘మానసిక భావాలను ఉద్దీప్తం చేసే శారీరక చిహ్నాలు, బాహ్య అనుష్ఠానాలు లేని తపస్సు ద్వారా (తపసోవాప్య లింగాత్)* మనిషి ఎప్పటికీ భగవత్సాక్షాత్కారాన్ని పొందలేడు’ అని చెబుతుంటారు. యుక్తి కూడ ఇదే విషయాన్ని – ‘మనస్సు ఆ స్థూలంనుండి సూక్ష్మానికి – సూక్ష్మం నుండి కారణానికి – ఇలా క్రమక్రమంగా ముందుకు వెళుతుంది’ అని స్పష్టం చేస్తున్నది. ‘నాన్యః పంథా విద్యతే-య నాయ’* త్యాగం చేయడం తప్ప భగవత్ ప్రాప్తికి మరో మార్గం లేదు.
10. ఈ స్థితిలో శ్రీరామకృష్ణుల దేవీ పూజా కార్యకలాపాలు
పెద్దన్న పరమపదించినప్పటి నుండి శ్రీరామకృష్ణులు జగన్మాత పూజలోనే తమ మనస్సును ఏకాగ్రం చేశారని తెలియజేశాం. జగజ్జనని దర్శనాన్ని పొందడానికి ఏవి దోహదం చేస్తాయని గ్రహించారో, వాటి నన్నింటినీ ప్రగాఢ విశ్వాసంతో గట్టి పట్టుదలతో, చిత్తశుద్ధితో ఆయన అనుష్ఠించడం మొదలు పెట్టారు. ఈ సమయంలో యథావిధిగా పూజను ముగించి, ప్రతి నిత్యం రామ్‌ప్రసాద్ మొదలైన భగవత్సాక్షాత్కారం పొందిన భక్తులు రచించిన భక్తిగీతాలను మాతకు వినిపించడం పూజలో ఒక విశేషభాగంగా భావించారన్న విషయాన్ని గురుదేవుల ముఖతా మేము విన్నాం. గంభీర ఆధ్యాత్మిక భావంతో నిండిన భక్తి పాటలను పాడుతుంటే, ఆయన హృదయం ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో నిండిపోయేది. ‘రామ్‌ప్రసాద్ లాంటభక్తులు తల్లి దర్శనాన్ని పొందారు. కాబట్టి ఎవరైనా సరే జగన్మాత దర్శనాన్ని నిశ్చయంగా పొందవచ్చు. మరి ఆ తల్లి దర్శనం నా కెందుకు కలగటం లేదో!” అనుకొని ఆయన చింతించేవారు. వ్యాకుల హృదయంతో, “అమ్మా! నువ్వు రామ్‌ప్రసాద్‌కు దర్శనమిచ్చావు. మరి నా కెందుకు దర్శన మివ్వవు? తల్లీ! నేను ధనం – భోగం – సుఖం – బంధుమిత్రులు – ఇవేమీ కోరను. నాకు నీ దర్శనం మాత్రమే చాలు” అని ప్రార్థించేవారు. అలా ప్రార్థిస్తూ కన్నీరుమున్నీరుగా విలపించేవారు. ఆ కన్నీటితో ఆయన వక్షస్థలం తడిసిపోయేది. ఇలా హృదయభారం కాస్త తేలిక పడుతుంటే, తల్లిపట్ల విశ్వాసంతో కాస్త ఉపశమనం చెందిన తదుపరి మళ్ళీ ఆయన పాటలు పాడేవారు. తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించేవారు. ఇలా పూజ, ధ్యానం, భజనలతో ఆయన రోజులు గడిపేవారు. ఆయన హృదయంలో భగవదనురాగం, వ్యాకులత దినదినం ఉద్ధృతంగా పెంపొందసాగాయి.
క్రమంగా ఆయన పూజచేసే సమయం, నిష్ఠ కూడ పెరగసాగాయి. ఒక్కోమారు పూజకు కూర్చుని, విధి ప్రకారం ఒక పువ్వును తల మీద పెట్టుకోగానే ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయి దాదాపు రెండు గంటలసేపు అలా శిలాప్రతిమలా ఉండిపోయేవారు. లేదా తల్లికి ఆహారపదార్థాలను నివేదించి, ఆమె భోంచేస్తున్నదని భావిస్తూ అలా చాలాసేపు నిరీక్షిస్తూ ఉండిపోయేవారు. ఒక్కోమారు తెల్లవారుజామున లేచి, స్వయంగా పువ్వులు సేకరించి మాల కట్టి, వాటితో దేవిని అలంకరించడంలో ఎంతోసేపు గడిపేవారు. అలాగే ఎంతో భక్తిభావంతో సంధ్యా కాలం ఆరతిని చాలాసేపు నిర్వహించేవారు. మధ్యాహ్నం జగన్మాతకు పాటలు పాడి వినిపించి, తన్మయులైపోయేవారు. అప్పుడు సమయం గూర్చి అసలు పట్టించుకొనేవారు కాదు. సమయం మించిపోతున్నదని చెబుతున్నా సంధ్యా ఆరాత్రికం మొదలైన ఉపచారాలను సరైన సమయంలో ఆయన నిర్వర్తించలేక పోయేవారు. శ్రీరామకృష్ణులు ఇలా తమ పూజను కొంతకాలం నిర్వర్తిస్తూ వచ్చారు.
11. శ్రీరామకృష్ణుల పూజాదుల గూర్చి మథుర్బాబు ప్రశంస
ఇలాంటి నిష్ఠ, భగవత్భక్తి, వ్యాకులత చూస్తున్న సాధారణ భక్తజనులు వారి వైపు ఆకర్షితులయ్యారన్న విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా గ్రహించవచ్చు. సాధారణంగా లోకులు ఏ మార్గంలో వెళుతుంటారో ఆ మార్గాన్ని వదలి ఎవరైనా మరో కొత్త మార్గంలో వెళితే, లేదా భిన్నరీతిలో మరేదైనా చేస్తే – జనసామాన్యం అతణ్ణి మొదట్లో వెర్రివాడి కింద జమకడుతుంది, ఎగతాళి చేస్తుంది. అయితే ఆ వ్యక్తి దృఢసంకల్పంతో దీక్షగా తన గమ్యంవైపు ప్రగతి సాధిస్తూపోతే, లోకుల అభిప్రాయం కూడ తదనుగుణంగా మారుతూ వస్తుంది. వారిలో ఆ వ్యక్తిపట్ల భక్తిగౌరవాలు పెంపొందుతాయి. శ్రీరామకృష్ణుల విషయంలో కూడ ఇలాగే జరిగింది. పై రీతిన శ్రీరామకృష్ణులు పూజలు చేస్తూంటే, మొదట్లో చాలామంది అవన్నీ అతడి పిచ్చి పనుల కింద జమకట్టి, హేళన చేశారు. కాని కొంత కాలం తర్వాత మాత్రం కొంతమందికి ఆయనపట్ల భక్తి, శ్రద్ధలు కలిగాయి. ఈ సమయంలో ఒకమారు మథుర్బాబు శ్రీరామకృష్ణుల పూజను చూసి, పరమ సంతుష్టుడై, “మేము అద్భుతమైన పూజారిని పొందాం. దేవి సత్వరమే జాగృతమౌతుంది” అని రాణీ రాస్మణికి చెప్పాడని మేము విన్నాం. కాని జనుల అభిప్రాయాలు ఏవైనాసరే శ్రీరామకృష్ణులను మాత్రం తన మార్గం నుండి ఇసుమంత కూడ తప్పించలేకపోయాయి. సముద్రం వైపుకు తిన్నగా పరుగులు పెట్టే నదిలా ఆయన మనస్సు నిర్విరామంగా ఒకే ఒక్క భావంతో జగన్మాత చరణారవిందాలవైపు ఉరుకులు పరుగులు పెట్టసాగింది.
12. భగవదనురాగం పెంపొందేకొద్దీ, శ్రీరామకృష్ణుల శారీరక మార్పులు
రోజులు గడిచిపోతున్నకొద్దీ, శ్రీరామకృష్ణుల మనస్సు భక్తి కారణంగా మరింత వ్యాకులత చెందసాగింది. నిర్విరామంగా ఒకే దిశన వెళుతున్న ఆయన మనస్సు ఆయన శరీరంలో రకరకాల మార్పుల ద్వారా వ్యక్తం కాసాగింది. ఆయన నిద్ర – ఆహారాదులు చాలావరకు తగ్గిపోయాయి. శరీరంలోని రక్తం చాలా వేగంగా వక్షస్థలం – శిరస్సుల వైపు ప్రవహించడం మూలంగా, ఆయన వక్షస్థలం ఎప్పుడూ ఎర్రబారి ఉండేది. కళ్ళు హఠాత్తుగా జలపూరితమయ్యేవి. భగవద్దర్శనం కోసం పరమ వ్యాకులతతో, ‘ఏం చేయాలి, అమ్మ దర్శనం ఎలా పొందాలి?’ అన్న చింతనతో అనుక్షణం వ్యథ చెందుతూ ఉండేవారు. కాబట్టి పూజా సమయాల్లో తప్ప, మిగతా వేళల్లో వారి మనశ్శరీరాలు పరమ అశాంతితో ఆందోళనతో ఉండేవి.
ఆయనే స్వయంగా చెప్పగా ఈ విషయం మేం విన్నాం:
ఆ సమయంలో ఒక రోజు ఆయన పాటలు పాడుతూ జగన్మాతకు వినిపిస్తూ ఉన్నారు. అదే సమయంలో పరమ వ్యాకులతతో, “అమ్మా! ఇంతగా పిలుస్తున్నానే, నీ కింకా వినిపించటంలేదా? రామ్‌ప్రసాద్‌కు దర్శనమిచ్చావు కదా, మరి నాకు కనిపించవా?” అని విలపించేవారట.
13. తీవ్రవ్యాకులతా అనంతరం జగజ్జనని దర్శనం
శ్రీరామకృష్ణులు ఇలా చెబుతుండేవారు: “అమ్మ దర్శనం పొందలేకున్నానే అన్న వ్యథతో నా హృదయం దుర్భరవేదనకు గురయ్యేది. తడిబట్టను పిండినట్లుగా, నా హృదయాన్ని ఎవరో మెలిపెట్టి పిండుతున్నట్లు అనిపించేది. ఈ జన్మకు ఇక అమ్మ దర్శనభాగ్యం లభించదన్న బాధతో నేనెంతగానో పరితపించేవాడిని. ఆ పరితాపం దుర్భరమైపోయింది. నాకు బతకాలనే ఆశ సన్న గిల్లింది. అమ్మను చూడని ఈ బ్రతుకెందుకు అనిపించింది. ఆ స్థితిలో అమ్మ గుడిలో ఉన్న ఖడ్గం మీద నా చూపు పడింది. దాంతో ఆ క్షణంలో నా జీవితాన్ని అంతం చేసుకోవాలని పించింది. వెంటనే పిచ్చిగా వెళ్ళి ఆ ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాను. అంతే, ఒక్కమారుగా ‘అమ్మ అద్భుత దివ్యదర్శనం’ కలిగింది. నేను దేహస్మృతిని కోల్పోయి, నేల మీద పడిపోయాను. బాహ్యప్రపంచంలో ఏం జరిగిందో, ఆ రోజు, మరుసటి రోజు కూడ ఎలా గడిచాయో నాకు తెలియదు. కాని అంతరంగంలో మాత్రం అంతకు ముందు ఎన్నడూ అనుభవించని దివ్యానంద ప్రవాహంలో జగన్మాత సాక్షాత్కారాన్ని అనుభవిస్తూ ఉండిపోయాను.”
ఈ అద్భుత దర్శనం గూర్చి, శ్రీరామకృష్ణులు మరొకసారి మాకిలా చెప్పారు:
“నాకప్పుడు ఇళ్ళూ, వాకిళ్ళూ, ఆలయం, అన్నీ క్షణంలో అదృశ్యమైపోయాయి. ఎక్కడా ఏమీ లేదని అనిపించింది. తీరాలులేని అనంత చైతన్య జ్యోతిస్సముద్రం ఒకటి నాకు కనిపించింది. ఎటువైపు ఎంత దూరం చూసినా, అన్ని దిక్కుల నుండి ఆ ఉజ్జ్వలసాగర తరంగాలు భయంకర ఘోషతో నన్ను మింగివేయడానికి మహావేగంతో నా వైపు రాసాగాయి. కన్నుమూసి తెరిచేంతలోగా అవి నన్ను ముంచేసి, ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. నేను స్మృతి తప్పి క్రింద పడిపోయాను.” ప్రథమ దర్శన కాలంలో తాము ఇలా చైతన్య సముద్రాన్ని దర్శించామని ఆయన మాకు చెప్పారు. కాని చైతన్య స్వరూపిణి అయిన జగన్మాత వరాభయ మూర్తిని దర్శించారా వారు? ఈ జ్యోతిస్సముద్రంలో మరి ఆ దివ్యమూర్తి దర్శనం కూడ వారికి లభించిందా? లభించిందనే అనుకోవాలి. ఎందుకంటే ఆ ప్రథమదర్శన సమయంలో ఒకింత బాహ్యస్మృతి వచ్చిన తర్వాత ఎంతో ఆతురతతో “అమ్మా, అమ్మా” అని పిలిచారని మేము విన్నాం.
పైన చెప్పుకున్న ‘దర్శనం’ ఘటన ముగిసిన తర్వాత, జగజ్జనని చిన్మయ దర్శనాన్ని అవిచ్ఛిన్నంగా, సదా సర్వదా పొందాలనే ఆకాంక్ష శ్రీరామకృష్ణులకు ఏర్పడింది. ఆ ఆకాంక్షను నెరవేర్చుకోవడం కోసం ఆయన ఎంతగానో పరితపించసాగారు. ఎప్పుడూ విలపిస్తూ ఉండడం లాంటి బాహ్యలక్షణాల ద్వారా ఈ పరితాపం, వ్యక్తమయ్యేది కాదు. కాని అది ఆయన అంతరంగంలో సర్వదా జాజ్వల్యమానంగా ఉండేది. ఒక్కోమారు ఈ పరితాపం అపరిమితంగా ఉండేది. దాంతో ఆయన నేలమీద పడి బాధతో సతమతమయ్యేవారు. “అమ్మా! నన్ను అనుగ్రహించు తల్లీ, నీ దర్శన మివ్వు తల్లీ!” అంటూ ప్రార్థించేవారు. విలపించేవారు. వారి విలాపం విని జనం చుట్టూ మూగేవారు. ఆ సమయంలో అలాంటి అస్థిరత్వాన్ని చూసి జనం ఏమనుకుంటారోనన్న భావన ఆయనకు ఏమాత్రమూ ఉండేది కాదు. “జనం నా చుట్టూ మూగినా, వారంతా కేవలం నీడల మాదిరి, తెర మీద గీచిన బొమ్మల మాదిరి కనిపించేవారు. అందుకే వారెదుట సిగ్గూ, సంకోచాలేవీ కలిగేవి కావు. కాని అమ్మ ఎడబాటు వలన కలిగిన దుర్భరవేదన కారణంగా స్పృహ కోల్పోయినప్పుడల్లా తక్షణమే, నిరుపమాన తేజోరూపంతో, వరాభయహస్తాలతో తల్లి చిన్మయ స్వరూపం ప్రత్యక్షమయ్యేది. ఆ స్వరూపం నవ్వేది, మాట్లాడేది, ఎన్నో రకాలుగా నన్ను బుజ్జగిస్తూ, నాకు తగిన శిక్షణ గరపుతూ ఉండేది. ఇదంతా నాకు గోచరిస్తూనే ఉండేది” అంటూ ఆయన చెప్పేవారు.