1. రామ్చంద్రుని గోదానం
శ్రీరామ, శ్రీకృష్ణాది అవతారపురుషులు జన్మించే ముందూ, ఆ తర్వాత కూడ వారి తల్లి తండ్రులు ఎన్నో దివ్యదర్శనాలు పొందారని శాస్త్రాలలో చెప్పబడి ఉంది. అయితే, వారి బిడ్డలను దైవం రక్షిస్తుందని తెలిసినప్పటికీ వారు పుత్రవ్యామోహం అనే మాయకు వశులైపోయి, తమ బిడ్డల దివ్య నిజస్వరూపాలను మరిచిపోయారు. సామాన్య తల్లిదండ్రులలాగే, ఆ బిడ్డల ఆలనాపాలనల కోసం తాపత్రయ పడ్డారు.
చంద్రాదేవి, క్షుదిరామ్ విషయంలో కూడా ఇలాగే జరిగిందనాలి. కుమారుణ్ణి చూసిన తర్వాత తమ దివ్యదర్శనాలను వీరు మరిచిపోయారు. తమ కుమారుని ఆలనాపాలన విషయంలో చింతాక్రాంతులయి ఎలాగా? అన్న ఆలోచనలో పడ్డారు.
మేదినీపూర్‌లో క్షుదిరామ్ మేనల్లుడు రామ్‌చంద్ర బాగా సంపాదించు కుంటున్నాడు. అతడికి గదాధర్ జననం గూర్చి తెలియచేశారు. మేనమామ పేదస్థితి అతడికి తెలుసు. ఆ పేదకుటుంబంలో పిల్లవాడికి తగినన్ని పాలు దొరకవన్న విషయం కూడా తెలుసు. అందుకని మేనమామకు ఒక మంచి పాడి ఆవును పంపాడు. అలా క్షుదిరామ్కు పిల్లవాని పాల సమస్య తీరిపోయింది.
అలాగే పిల్లవాడికి ఎప్పుడు ఏం కావాలో అవన్నీ ఊహకు అందని రీతిలో వారికి లభిస్తూ ఉండేవి. అయినా ఆ దంపతులు పిల్లవాడి విషయమై ఎప్పుడూ ఆందోళన చెందుతూనే ఉండేవారు. అలా కాలం సాగిపోతోంది.
2. గదాధర్ ఆకర్షణలు
శిశువు పెద్దవాడవుతున్నకొద్దీ, అతడి ఆకర్షక అంశాలు ఇనుమడించసాగాయి. వాటితో ఆ పిల్లవాడు తల్లిదండ్రులనూ కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు. గ్రామంలోని స్త్రీలనందరినీ ఆకర్షించసాగాడు. ఆ స్త్రీలు, ప్రతిరోజూ ఏదో ఒక వంకతో చంద్రాదేవి వద్దకు వచ్చి పిల్లవాడిని చూసి వెళుతుండేవారు. “నీ బిడ్డను చూడాలన్న తపన మమ్మల్ని ఇలా లాక్కొని వస్తోంది” అని చెప్పేవారు. ఇరుగుపొరుగు గ్రామాల్లోని ఆ దంపతుల బంధువులు కూడా, ఇప్పుడు వెనకటికన్నా తరచు వారి పేదకుటీరానికి రావడం మొదలుపెట్టారు. గదాధర్ అందరి ఆప్యాయతలకూ పాత్రుడయ్యాడు. అందరి ప్రేమలు పొందుతూ ఐదు నెలల ప్రాయానికి వచ్చాడు. ‘అన్నప్రాశన’ చేయవలసిన సమయం దగ్గరపడింది.
3. గదాధర్ అన్నప్రాశనకు ధర్మదాస్ లాహా సహాయం
కుమారుడి ‘అన్నప్రాశన’ తంతును తన శక్తికి తగినట్లు ఏ విధమైన ఆడంబరాలు లేకుండా ముగించివేయాలని క్షుదిరామ్ అనుకున్నాడు. శాస్త్రోక్తకర్మలు చేయడం, కుమారునికి శ్రీ రఘువీరుని నైవేద్యం తినిపించడం, ముగ్గురు నలుగురు ముఖ్య బంధువులను పిలవడం – ఇలా ఆ శుభకార్యాన్ని పూర్తి చేయాలనుకున్నాడు. కాని అతడు అనుకొన్నదొకటైతే, అయింది మరొకటి. ఆ ఊరి జమీందారు ధర్మదాస్ లాహా, క్షుదిరామ్ ఆప్తమిత్రుడు. అతడు క్షుదిరామ్కు తెలియకుండా, బ్రాహ్మణులను ప్రోత్సహించి పంపించాడు. ఆ బ్రాహ్మణులు, మరికొందరు ఊరి పెద్దలు వచ్చి, క్షుదిరామ్ను చుట్టుముట్టారు. అతడి కుమారుడి అన్నప్రాశన సందర్భంలో తమకు భోజనం పెట్టించాలని ఒత్తిడి చేశారు. దాంతో క్షుదిరామ్ పెద్ద సంకటంలో చిక్కుకు పోయాడు. ఏంచేయాలో అతడికి పాలుపోలేదు. ఊరివారందరికీ అతడంటే ఎంతో గౌరవం, పూజ్యభావం ఉన్నాయి. వారిలో ఎవరినీ అతడు కాదనలేడు. అందరినీ పిలవవలసి ఉంటుంది. కాని అందరికీ భోజనం పెట్టేంత ఆర్థికస్తోమత అతడికప్పుడు లేదుకదా! అలా అని ఇంటికి వచ్చి మరీ అడిగిన పెద్దలను నిరాకరించనూలేడు.
అతడికి ఏమీతోచక పూర్తిభారం శ్రీ రఘువీరునిపై మోపి తన ఆప్తమిత్రుడైన ధర్మదాసు వద్దకు సలహా కోసం వెళ్ళాడు. అప్పుడు ధర్మదాసు ఆ కార్యభారాన్ని తనకు వదిలేసి, నిశ్చింతగా పనులు చేసుకోమని చెప్పాడు. అట్లే మిత్రునికే అంతా వదిలేసి, క్షుదిరామ్ ఇంటికి తిరిగివచ్చాడు.
ధర్మదాస్ లాహా ఆనందంగా ఆ శుభకార్యానికి అయిన ఖర్చునంతా తానే భరించాడు. అన్ని ఏర్పాట్లూ తానే చేసి, ఆ శుభకార్యాన్ని చక్కగా జరిపించాడు.
ఇలా గదాధర్ ‘అన్నప్రాశన’ లో ఊళ్ళోని పెద్దలు – పిన్నలు, బ్రాహ్మణులు అంతా పాల్గొన్నారు. మహదానందంగా రఘువీరుని ప్రసాదాన్ని స్వీకరించారు. పేదలు, భిక్షకులు కూడా ఆ రోజు కడుపునిండా, తృప్తిగా భుజించి సంతోషించారు. అంతా గదాధర్‌ను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు.
ఇదంతా మేము విన్న వృత్తాంతం. దాన్నే మీకు తెలుపుతున్నాం.
4. చంద్రాదేవి దివ్యదర్శనాలు
రోజులు గడుస్తున్నాయి. గదాధర్ పెరుగుతున్నాడు. పెరుగుతున్నకొద్దీ అతడి చిలిపిచేష్టలు ఎక్కువయ్యాయి. వాటిని చూసి చంద్రాదేవి ఎంతో ఆనందించేది. కాని అదే సమయంలో ఏదో తెలియని భయం ఆమెను ఆవరిస్తుండేది. అతడు పుట్టడానికి ముందు ఆమె ఏ దేవతనూ ఏమీ కోరలేదు. కాని ఇప్పుడామెలోని మాతృప్రేమ కుమారుని శ్రేయస్సును కోరడం మొదలుపెట్టింది. మాతృప్రేమ కొద్దీ ఆమె కుమారుని శ్రేయస్సుకై దేవతలను వందల, వేలసార్లు ప్రార్థించసాగింది. తన కుమారుడికి ఎలాంటి చెడుగానీ, కీడుగానీ వాటిల్లకూడదని, ఎలాంటి ఆపదా రాకూడదని ఆమె ప్రార్థించేది. వినమ్రతతో వారికి ప్రణామాలు చేసేది.
అలా ప్రార్థనలతో ఆమె మనసు స్థిమిత పడేదికాదు. కుమారుని ఆలనా పాలనే ఆమెకు సర్వస్వం అయిపోయింది. ఆమె ధ్యాస సదా కొడుకు యోగ క్షేమాల గురించే! ఆ కారణంగా ఇదివరలో తరచూ ఆమెకు కలుగుతున్న దివ్యదర్శనాలు ఇప్పుడు అప్పుడప్పుడు మాత్రమే కలుగుతున్నాయి. అవి కలిగినప్పుడు ఆమెలో భయం, విస్మయం రెండూ జనించేవి. తన కుమారునికి ఎలాంటి చేటు వాటిల్లుతుందోనని గాబరాపడేది.
అలాటి ఒక సంఘటనను మేము అతినమ్మకస్తుల ద్వారా విన్నాం. దాన్ని పాఠకులకు తెలియచేస్తున్నాం.
5. గదాధర్, చంద్రాదేవికి ‘పెద్దవాడు’ గా కన్పించడం
అప్పటికి గదాధర్‌కు ఇంకా ఎనిమిది నెలలు కూడా నిండలేదు. ఒకరోజు ఉదయం ఆ పిల్లవాడికి పాలిస్తున్నప్పుడు పిల్లవాడు నిద్రలో జారుకున్నాడు. అది గమనించిన చంద్రాదేవి బాలుడిని పడుకోబెట్టి దోమతెర కప్పి, ఇంటి పనులు చేసుకోసాగింది. కొంతసేపటికి గదిలోకి వచ్చి పిల్లవాడివైపు చూసి విభ్రాంతురాలైంది. దోమతెరలో తన పిల్లవాడు కనిపించలేదు. పైగా అక్కడ పొడవైన ఒక అపరిచిత పురుషుడు కనిపించాడు! ఆ పురుషుడు మొత్తం మంచాన్నంతా ఆక్రమించేసి ఉన్నాడు! ఆ దృశ్యం చూసి చంద్రాదేవి భయంతో నిలువునా వణికిపోయింది. పెద్దగా కేకవేస్తూ బయటికి పరిగెత్తి, భర్తను పిలిచింది. అతడు కంగారుపడుతూ రాగానే, తాను చూసిన విషయమంతా చెప్పి “పిల్లవాడు లేడని” ఏడుపు ముఖం పెట్టింది.
క్షుదిరామ్, భార్యతో కూడ గదిలోకి వెళ్ళి చూడగా అక్కడ అలాంటి పురుషు డెవరూ కనిపించలేదు. పిల్లవాడు హాయిగా నిద్రపోతున్నాడు. చంద్రాదేవికి అంతా ఆశ్చర్యంగా, అగమ్యగోచరంగా ఉంది. ఇంతకు ముందు తనకు కనిపించిన వ్యక్తి ఏమైనట్లూ? ఆ ఆలోచన రాగానే, ఆమెలో భయం మళ్ళీ తలెత్తింది.
“నిజం. కళ్ళారా చూశాను. ఈ మంచం మీదే ఆ వ్యక్తి కనిపించాడు. నేనేమీ భ్రమపడలేదు. అలా జరిగే అవకాశమే లేదు. నాకేదో భయంగా ఉంది. ఏ దయ్యమో, క్షుద్రదేవతో నా బిడ్డణ్ణి ఆవహించిందేమో! త్వరగా ఓ మంచి భూతవైద్యుణ్ణో, మంత్రగాడినో తోడ్కొనివచ్చి బిడ్డను చూపించండి. మన బిడ్డకు ఏదైనా కీడు వాటిల్లుతుందేమో!” అంటూ భయం భయంగా భర్తను వేడుకుంది.
క్షుదిరామ్ అంతా విని, ఆమెను ఊరడించాడు.
“చూడు! మన ఈ అబ్బాయి పుట్టడానికి ముందు మనమెన్నో దివ్యదర్శనాలు చూశాం; ధన్యులమయ్యాం. అలాంటి దర్శనాలు ఇప్పుడు కూడా కలుగుతున్నాయి. ఇదీ అలాంటిదే. దీన్ని గూర్చి నువ్వు ఎలాంటి భయమూ చెందవలసిన అవసరం లేదు. ఏ క్షుద్రదేవత పనీ కాదిది. ఇంట్లో శ్రీ రఘువీరుడున్నప్పుడు ఇక క్షుద్రశక్తులు ఎలా వస్తాయి? అబ్బాయికి ఎలా కీడు చేస్తాయి? అలాంటి చింతలేవీ పెట్టుకోకు. అంతా రఘువీరుడు చూసుకొంటాడు. మరొక్క విషయం! ఈ సంఘటన గూర్చి ఎవరికీ ఏమీ చెప్పకు” అని చెప్పాడు.
భర్త ఊరడింపుతో ఆమెలోని భయం కాస్త తగ్గింది కాని తన ముద్దుల తనయునికి ఏం జరుగుతుందోనన్న సంకోచం మాత్రం ఆ తల్లి హృదయం నుండి పూర్తిగా తొలగిపోలేదు.
ఆ రోజు శ్రీ రఘువీరుని ముందు రెండు చేతులు జోడించి చాలాసేపు ప్రార్థించిన తరువాత ఆమె మనస్సు కొంచెం స్థిమితపడింది.
6. గదాధర్ చెల్లెలు ‘సర్వమంగళ’ జననం
కాలగమనంలో సంవత్సరాలు దొర్లిపోయాయి. ఆనందం, ఆందోళన, ఉల్లాసం, ఆవేదన ఇలాంటి అనేక రకాల ఆటుపోటులతో చంద్రాదేవి, క్షుదిరామ్ల జీవితం గడిచిపోసాగింది. గదాధర్ చిలిపి చేష్టలు, మధుర భాషణలు వారిని ‘సర్వమంగళ’ మరింత దృఢంగా ఆకట్టుకున్నాయి. ఆ అబ్బాయిపైన వారి ప్రేమ జననం మరింత ప్రగాఢం కాసాగింది. ఈ సమయంలో (1839 సం ॥ లో) చంద్రాదేవికి మరొక ఆడశిశువు జన్మించింది. ఆ శిశువే గదాధర్ చెల్లెలు ‘సర్వమంగళ’.
7. గదాధర్ విద్యారంభం
పెద్దవాడవుతున్నకొద్దీ గదాధర్లో గొప్ప తెలివితేటలు, ప్రజ్ఞ చూసి, క్షుదిరామ్ విస్మయానందాలు చెందేవాడు. తన చిలిపి కుమారుణ్ణి ఒడిలో కూర్చోపెట్టుకుని, అతడు తమ పూర్వీకుల పేర్లను చెప్పేవాడు. చిన్నచిన్న దేవతాస్తుతులను, ప్రార్థనా శ్లోకాలను వినిపించేవాడు. రామాయణ మహాభారతాల నుండి మంచి కథలు చెప్పేవాడు. గదాధర్లో విశేషగ్రహణశక్తి ఉండేది. ఒకమారు వింటే చాలు, ఏదైనా ఆ బాలుడికి అట్లే జ్ఞాపకం ఉండిపోయేది. బాలుడు ఏకసంతగ్రాహి. అలా తండ్రి చెప్పిన స్తోత్రాలు, కథలు ఆ బాలుడికి కంఠస్థం అయిపోయాయి. చాలాకాలం తర్వాత అడిగినా, వాటిని తు.చ. తప్పకుండా అప్పగించేవాడు.
క్షుదిరామ్ ఈ విశిష్టతను గమనించాడు. అతడికి గదాధర్లో మరో విశేషం కూడ కనిపించింది. ఆ అబ్బాయి కొన్ని విషయాలను ఎంతో ఆసక్తితో, శ్రద్ధగా విని అర్థం చేసుకునేవాడు. కాని మరికొన్నింటిని అసలు పట్టించుకునేవాడే కాదు. ఎంత ప్రయత్నం చేసినా, ఆ విషయాలు అతడి బుర్రకెక్కేవికావు. అసలు అటువైపు ధ్యాసే ఉండేది కాదతడికి. ‘లెక్కపెట్టడం’ ఎలాగో నేర్పడానికి ప్రయత్నిస్తే, అసలు అది అతనికి వచ్చేది కాదు. ‘ఇంకా పిల్లవాడేకదా, ఇంత చిన్నవయస్సులో వాటిని నేర్చుకోలేడు’ అని క్షుదిరామ్ సరిపెట్టుకునేవాడు.
అయితే గదాధర్ చిలిపిచేష్టలు ఎక్కువ అవడం చూసి, క్షుదిరామ్ అతడికి ఐదవఏట ‘అక్షరాభ్యాసం’ చేయించి, బడిలో వేశాడు. తన తోటివయసు పిల్లలను చూసి గదాధర్ ఎంతో సంతోషించాడు. తన వినయవిధేయతలతో ఉపాధ్యాయుల మనసు చూరగొన్నాడు. తన ప్రేమ వర్తనంతో సాటి విద్యార్థులకందరికీ ప్రేమపాత్రుడయ్యాడు.
8. లాహాబాబుల ప్రాథమిక పాఠశాల
లాహాబాబులు ఆ గ్రామానికి జమీందారులు. వారి ఇంటికి ఎదురుగా విశాలమైన నాట్యమండపం ఉండేది. అందులోనే పాఠశాల నడుస్తూ ఉండేది. వారే తమ ఖర్చుతో ఒక ఉపాధ్యాయుణ్ణి ఏర్పాటు చేశారు. అతడు లాహాల పిల్లలకు, ఊరి పిల్లలకు కూడ చదువు చెప్పేవాడు. అలా లాహాబాబులే తమ ఊరి పిల్లల చదువుసంధ్యల కోసం బడిని ఏర్పాటు చేశారని చెప్పవచ్చు.
క్షుదిరామ్ పూరింటికి ఈ బడి చాలా దగ్గరిలోనే ఉండేది. బడి రోజూ ఉదయం, మధ్యాహ్నం ఉండేది. విద్యార్థులు ఉదయమే వచ్చేవారు. రెండు మూడుగంటలు చదువుకుని, భోజనాదుల కోసం ఇళ్ళకు వెళ్ళేవారు. మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకొచ్చి, చీకటి పడేలోగా పాఠాలు చదువుకుని వెళ్ళిపోయేవారు.
శ్రీరామకృష్ణులు చదువుకున్న కామార్పుకూర్లోని లాహాల పాఠశాల
మధ్యలో : సుబాహు కథనాల పద్యకావ్యం నుండి శ్రీరామకృష్ణులు స్వహస్తంతో చూసి వ్రాసిన పుట నమూనా.
దిగువ: అయన సంతకం
గదాధర్లాంటి చిన్నపిల్లలు బడిలో అంతసేపు గడపవలసిన అవసరం ఉండేది కాదు. కాని ఆ పిల్లలు బడికి వెళ్ళి హాజరు చెప్పవలసి వచ్చేది. ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్నప్పుడు మాత్రం నేర్చుకునేవారు. మిగతా సమయాల్లో దగ్గరలోని మైదానంలో ఆడుకునేవారు.
బడిలోని పాతవిద్యార్థులు, కొత్తగా చేరిన విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. చెప్పిన పాఠాలను వారు నేర్చుకుంటున్నారో లేదోనని కూడా చూసేవారు.
ఇలా ఉపాధ్యాయుడు ఒక్కడే అయినా, బడి పని మాత్రం చక్కగా జరుగుతూ ఉండేది. గదాధర్ పాఠశాలలో చేరినప్పుడు, శ్రీ యదునాథ్ సర్కార్ అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. కొంతకాలం తర్వాత ఏ కారణంచేతనో అతడు ఆ ఉద్యోగం మానుకున్నాడు. అతడి స్థానంలో శ్రీ రాజేంద్రనాథ్ సర్కార్ అనే వ్యక్తి ఉపాధ్యాయునిగా నియమించబడ్డాడు.
9. గదాధర్ విచిత్ర ప్రవృత్తిపై క్షుదిరామ్ వైఖరి
గదాధర్ పుట్టడానికి పూర్వమే క్షుదిరామ్కు కొన్ని దివ్యస్వప్నాలు, దర్శనాలు కలిగాయి కదా! అవి ఆ అబ్బాయి అద్భుత భావిజీవితాన్ని సూచిస్తుండడం కూడ క్షుదిరామ్కు తెలుసు కదా! అందుచేత ఆ జ్ఞాపకాలు అతడి మనోఫలకంపైన స్థిరంగా ముద్రితమైపోయాయి. అందుకే గదాధర్ పట్ల అతడు మామూలుగా కఠినంగా ఉండేవాడు కాడు. ఎప్పుడైనా ఏవైనా తుంటరి పనులు చేసినా కుమారుణ్ణి మందలించేవాడే తప్ప, కఠినంగా శిక్షించేవాడు కాడు. అందరూ అతిగారాబం చేయడంచేత, అందరూ అతిగా ప్రేమించడంచేత కుర్రవాడిలో కాస్త మొండితనం అలవడి ఉంటుందని సరిపెట్టుకునేవాడు. కాని ఆ మొండితనం విషయంలో అందరు తండ్రుల్లా అతడు తన కుమారుణ్ణి కొట్టడం, శిక్షించడంలాంటివి చేసేవాడు కాదు. ఆ మొండిపట్టే కుర్రవాడి భావి ఉన్నతికి దారితీస్తుందని అనుకునేవాడు. ఇలా అతడనుకోవటానికి కారణాలు కూడ ఉన్నాయి.
క్షుదిరామ్ చాలాసార్లు గదాధర్ ప్రవర్తనను నిశితంగా పరిశీలించి ఉన్నాడు. అప్పుడప్పుడు గదాయ్ బడికి వెళ్ళకుండా స్నేహితులతోపాటు ఊరి బయటకు వెళ్ళి ఆటలాడు కునేవాడు. దగ్గరలో ఏవైనా నాటకాలు జరుగుతుంటే (వీథి నాటకాలు) ఎవరికీ చెప్పకుండా వెళ్ళి చూసేవాడు. అలా తాను అనుకొన్న పనిని పూర్తిగా నెరవేర్చే స్వభావాన్ని క్షుదిరామ్, గదాయ్లో గమనించాడు. మరొక విషయం ఏమిటంటే, గదాయ్ ఏ విషయంలోనూ ఎప్పుడూ ఎలాంటి అబద్ధాలూ చెప్పి ఎరుగడు. తాను చేసిన పనిని దాచడానికి ఎన్నడూ ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి కీడూ చేయాలన్న తలంపే ఉండేది కాదు.
కాని క్షుదిరామ్కు ఒక్క విషయంలో మాత్రం ఆందోళన కలిగింది. ఒక పనిని చేయమని లేదా చేయకూడదని గదాయ్కు చెబితే, అతడు దాన్ని వెంటనే అమలుపరిచేవాడు కాడు. ఆ పని అతడికి పూర్తిగా అర్థం అయ్యేటట్లు, అతడి హృదయాన్ని స్పృశించేటట్లు వివరించవలసి వచ్చేది. అలా చేయకపోతే, గదాయ్ చెప్పిన పనికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు. అంటే ప్రతివిషయాన్నీ కూలంకషంగా అవగాహన చేసుకోవాలి – అన్న అతడి స్వభావాన్ని ఇది సూచిస్తుంది.
‘అయితే పిల్లల్లో ఇలాంటి మొండి ప్రవర్తనను లోకం సాధారణంగా సహించదు. పిల్లలకు అన్ని విషయాలనూ వివరించి చెప్పేందుకు సిద్ధపడదు. వారి జిజ్ఞాసను సంతృప్తి పరచదు. అలాంటి స్థితిలో గదాయ్ మొండిగా సంఘంలోని కట్టుబాట్లను, ఆచారవ్యవహారాలను కాదని త్రోసిపుచ్చే ప్రమాదముంది’ అని క్షుదిరామ్ ఆందోళన చెందేవాడు.
అతనికి ఈ ఆందోళన కలగటానికి ఒక చిన్న సంఘటన కారణమైంది.
10. దానిని సూచించే ఒక సంఘటన
క్షుదిరామ్ ఇంటికి దగ్గరలో ‘హాల్దార్పుకూర్’ అనే పెద్ద చెరువొకటి ఉంది. గ్రామస్థులంతా త్రాగటానికి, స్నానాదులకు, వంటకు ఆ చెరువు నీటినే వాడుకునేవారు. ఆ చెరువులో స్నానం చేయటానికి ఆడవారికి, మగవారికి రెండు వేర్వేరు ప్రత్యేక స్నానఘట్టాలున్నాయి. గదాధర్లాంటి చిన్న పిల్లలు సాధారణంగా స్నానంకోసం ఆడవారి స్నానఘట్టానికే వెళ్ళేవారు. ఒకరోజు గదాయ్ కొంతమంది తన వయస్సు పిల్లలతో స్నానానికి ఆ ఘట్టానికి వెళ్ళాడు. చెరువులో దూకుతూ, ఈతలు కొడుతూ నానాగందరగోళం చేశాడు. స్నానం చేయడానికి వచ్చిన ఆడవారికి, వీరి ఈతలు చాలా ఇబ్బంది కలిగించాయి. చెరువు ఒడ్డున కూర్చుని నిత్యపూజాప్రార్థనాదులు చేస్తున్న ప్రౌఢ స్త్రీలపైన నీటిజల్లులు పడసాగాయి. అది చూసి ఆ స్త్రీలు ఈ పిల్లలను అలా చేయవద్దని ఎన్నోసార్లు వారించారు. అయినా పిల్లలు వినలేదు. ఒక స్త్రీకి వారి చేష్టలు చాలా కోపం తెప్పించాయి.
“ఆడవాళ్ళుండేచోట మగపిల్లల కేం పనిరా? మగవాళ్ళ స్నానఘట్టానికి వెళ్ళి ఈతలు కొట్టుకోండి. స్నానం చేసిన తర్వాత ఆడవాళ్ళు బట్టలు ఉతుక్కుంటారు కదా, ఆడవాళ్ళను బట్టలు మార్చుకొనేటప్పుడు చూడడం తప్పని తెలియదా?” అని గట్టిగా మందలించింది.
ఆ మాటలు విని గదాయ్, ఆవిడ వద్దకొచ్చి “ఎందుకు చూడకూడదూ? తప్పెలా అవుతుందీ?” అని అమాయకంగా ప్రశ్నించాడు.
ఎందుకో, ఏమిటో ఆ కారణాన్ని ఆవిడ చెప్పలేదు. పైగా ఆ ప్రశ్న విని మరింత మండిపోయి తిట్టిపోసింది. ఆ తిట్లు విని మిగతా పిల్లలంతా చల్లగా అక్కడ నుండి జారుకున్నారు. కాని గదాయ్ అంతటితో ఊరుకోలేదు. ఒక ఉపాయం పన్నాడు. రెండు మూడు రోజులు అతడు వరుసగా చెట్ల చాటు నుండి, స్నానంచేసే స్త్రీలను చూశాడు. చూసి, మరుసటి రోజు తనను మందలించిన స్త్రీవద్దకు వచ్చాడు.
“మొన్నటి రోజున నలుగురు ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చూశాను, నిన్న ఆరుమందిని చూశాను. ఇవ్వాళ ఎనిమిది మందిని చూశాను. కాని నా కేమీ కాలేదు కదా, మరి అది తప్పెలా అవుతుందీ?” అని అమాయకంగా, సూటిగా అడిగాడు.
ఆ మాటలు విని ఆ స్త్రీ క్షణకాలం నివ్వెరబోయింది.
ఆ తర్వాత చంద్రాదేవికి ఆమె ఇదంతా నవ్వుతూ చెప్పింది. చంద్రాదేవికి విషయం అర్థమైంది. ఒక రోజు గదాయ్ను దగ్గరకు తీసుకుని, ప్రేమతో ఇలా చెప్పింది:
“అలా చూసినందువల్ల నీకేమీ కాదు, నిజమే. కాని అది తప్పే. ఎందుకంటావా, ఆడవారికి అది చాలా సిగ్గుగా, బాధగా ఉంటుంది. ఆ ఆడవాళ్ళు కూడా నా లాంటివారే కదా! వారిని బాధపెట్టడం అంటే, నన్ను బాధపెట్టినట్లే అవుతుంది. అందుచేత ఆడవారికి సిగ్గూ, కష్టమూ కలిగించే పనులు ఇక నువ్వు చేయవద్దు. అలాచేస్తే నాకెంతో కష్టంగా ఉంటుంది. మరి నన్ను బాధ పెట్టడం నీకిష్టమా, చెప్పు?” అని వివరించి చెప్పింది.
ఆమె మాటలతో గదాయ్కు విషయం అర్థం అయింది. ఆ క్షణం నుండి అతడు మళ్ళీ అలా ఎన్నడూ ప్రవర్తించలేదు.
11. గదాధర్ విద్యాభ్యాస పురోగతి
గదాధర్ చదువు చక్కగానే సాగుతోంది. కాస్త చదవనూ, వ్రాయనూ అతడు నేర్చుకున్నాడు. లెక్కలంటే అతడికి మునుపటి ఏహ్యభావం అట్లే ఉంది. ఇతరులను అనుకరించడంలో అతడికి అతడే సాటి అని చెప్పాలి. అతడిలోని సహజప్రతిభ అనేక రకాలుగా వ్యక్తం కాసాగింది. గ్రామంలో కుమ్మరులు దేవీదేవతల బొమ్మలు తయారుచేసేవారు. గదాయ్ వారి వద్దకు తరచూ వెళుతూ, వారి పనితనాన్ని నిశితంగా పరిశీలిస్తూ, ఆ కళను నేర్చుకున్నాడు. ఇంటివద్ద తానుకూడ బొమ్మలు తయారు చేసేవాడు. అది అతడికి ఒక వినోదక్రీడ అయింది.
అలాగే అతడు చిత్రకళను కూడ నేర్చుకున్నాడు. చిత్రాలు వేసేవారిని చూసి, ఆ కళలో కూడ ప్రావీణ్యం పొందాడు. ఊళ్ళో ఎక్కడైనా పురాణ కథాకాలక్షేపాలు జరుగుతుంటే, వెళ్ళి వినేవాడు. ఎక్కడైనా వీధినాటకాలు జరుగుతుంటే, వెళ్ళి చూసేవాడు. వినడం, చూడడంతో ఊరుకునేవాడు కాదు, వాటిని ఎలా చెబితే శ్రోతలకు, ప్రేక్షకులకు మనోహరంగా ఉంటుందో, అలా తాను అనుకరించి చూపేవాడు. అతడి అద్భుత జ్ఞాపకశక్తి, నిశితదృష్టి ఈ విషయాల్లో అతడికి ఎంతో ఉపకరించాయి.
గదాయ్కు అద్భుత అనుకరణశక్తి ఉండేది. పైగా అతడు వినోదప్రియుడు. ఈ రెండు కారణాల వల్ల ఆ చిన్న వయసులోనే అతడు స్త్రీ, పురుషుల రకరకాల హావభావాలను అనుకరిస్తూ, అందరికీ వినోదాన్ని కలిగించేవాడు. అతడిలో సహజంగా భక్తిశ్రద్ధలుండేవి. అవి అతడి తల్లిదండ్రుల నిత్యానుష్ఠానాలతో మరింత ఇనుమడించాయి. పెద్దవాడైన తర్వాత కూడ అతడు తల్లిదండ్రుల దినచర్య మూలంగా తాను పొందిన స్ఫూర్తిని మరచిపోలేదు. వారికి తాను ఎప్పటికీ ఋణపడి ఉన్నాననే అనుకునేవాడు.
కాలాంతరంలో దక్షిణేశ్వరాలయంలో మేం ఆయన శుశ్రూషలో ఉన్నప్పుడు, మాకా విషయాలన్నీ చెప్పేవారు.
“మా అమ్మ వట్టి అమాయకురాలు. లౌకిక విషయాలు పాపం ఆమె కేమీ అర్థమయ్యేవి కావు. డబ్బు లెక్కించడం కూడ ఆమెకు చేతనయ్యేది కాదు. ఎవరితో ఏ విషయం చెప్పాలన్న వివేకం ఆమెకు మృగ్యం. అందుచేత తన కడుపులోని విషయాలనన్నింటినీ ఎవరికి పడితే వారికి చెప్పేసేది. అది చూసి లోకులు ఆమెను ‘వెర్రిబాగుల్ది’ అంటూ నవ్వుకునేవారు. ఇతరులకు భోజనం పెట్టడమంటే ఆమెకు మహాప్రీతి. మా నాన్న నిమ్నకులస్థుల నుండి ఎలాంటి దానాలూ పుచ్చుకునేవాడు కాడు. రోజంతా పూజ, జపం, ధ్యానాదులలో గడిపేవాడు. నిత్యం సంధ్యావందనం చేసేవాడు. అప్పుడాయన ఛాతీ ఉబికి ఎర్రగా అయ్యేది. కళ్ళ నుండి భాష్పధారలు స్రవించేవి. విశ్రాంతి సమయాల్లో ఆయన రఘువీరుని అలంకరణ కోసం పూలమాలలు కడుతూ కూర్చునేవాడు. ఆయన ఎంతో నిక్కచ్చి మనిషి. దొంగసాక్ష్యం ఇమ్మని ఒకరు ఒత్తిడి చేసినప్పుడు, తన తండ్రి తాతల ఆస్తిని సైతం వదలుకున్నాడు గానీ, అలాంటపాపిష్టిపని చేయలేదు. ఆయన జీవితాన్ని చూసి, గ్రామస్థులంతా ఆయనను ఒక ఋషిగా గౌరవించేవారు” అని గురుదేవులు మాకు చెప్పారు.
ఇలా గదాయ్ తల్లిదండ్రుల పట్ల జీవితాంతం ఎలా కృతజ్ఞుడై ఉన్నాడో దీని మూలంగా మనకు తెలుస్తున్నది.
12. గదాధర్ సాహసం
రోజులు గడిచిపోతున్నకొద్దీ, గదాధర్ వ్యక్తిత్వం క్రమక్రమంగా అభివ్యక్తం కాసాగింది. అలా అతడి ధైర్యసాహసాలు కూడ చాలాసార్లు వ్యక్తమయ్యాయి. పెద్దపెద్దవారే వెళ్ళటానికి భయపడే దయ్యాల ప్రాంతాలకు అతడు ధైర్యంగా వెళ్ళి వస్తుండేవాడు. అతని అత్త ‘రామశీల’ కు అప్పుడప్పుడు ‘శీతలాదేవి’ పూనేది. ఆ పూనకంలో ఆమె అదోతరహాగా ప్రవర్తించేది. ఒకసారి ఆమె క్షుదిరామ్ ఇంట్లో కొన్నాళ్ళుంది. అప్పుడు ఓ రోజు ఆమెకు పూనకం వచ్చింది. ఇంట్లోవారంతా ఎంతో భయపడిపోయారు. గదాధర్ మాత్రం అసలు భయపడలేదు. పైగా ఆమెను నఖశిఖపర్యంతం పరిశీలించి చూశాడు. అంతేకాదు, ఆమెకు దగ్గరగా వెళ్ళి, ఆమెలోని మార్పును పరీక్షించాడు. అలా పరీక్షించి, ఆ తర్వాత “అత్తను పూనిన శక్తి నన్ను కూడ పూనితే ఎంతో బాగుండేది” అన్నాడు.
కామార్పుకూర్కు ఉత్తరంగా అరక్రోసు దూరంలో భూర్సుబో అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మాణిక్రాజా అనే జమిందారున్నాడు. అతణ్ణి గూర్చి ఇదివరకే కొంత చెప్పాం. అతడు భక్తుడు, ఉదారుడు, దానశీలి. క్షుదిరామ్ భక్తినిష్ఠలు, ధార్మికజీవితం అతణ్ణెంతో ఆకర్షించాయి. అందుచేత క్షుదిరామ్తో స్నేహం చేశాడు. త్వరలోనే వారిద్దరు ప్రాణస్నేహితులయ్యారు.
13. అందరితో కలివిడిగా మెలగడం
ఒకరోజు క్షుదిరామ్, గదాయ్ను తీసుకుని మాణిక్రాజా ఇంటికి వెళ్ళాడు. అప్పటికి గదాధర్‌కు ఆరేళ్ళుంటాయి. గదాయ్, క్షణంలో కొత్తా పాతా అంటూ ఏమీ లేకుండా ఇంట్లోని వారందరితో కలసిపోయాడు. వారికి సైతం ఆ పిల్లవాడంటే ఎందుకో విపరీతమైన ఆకర్షణ ఏర్పడింది. శ్రీరామజయ వంద్యోపాధ్యాయ, మాణిక్రాజా తమ్ముడు. అతడు గదాయ్ను చూసి, “నీ కుమారుడు సామాన్యుడు కాడు సుమా! ఇతడిలో దైవాంశ కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. కాబట్టి నువ్వెప్పుడు ఈ వైపు వచ్చినా, గదాయ్ను వెంటతీసుకుని రావాలి. ఈ అబ్బాయిని చూస్తుంటే, నాకెంతో ఆనందం కలుగుతోంది” అన్నాడు క్షుదిరామ్తో. కాని అనివార్యకారణాలవల్ల క్షుదిరామ్ చాలాకాలందాకా మళ్ళీ మాణిక్రాజా ఇంటికి వెళ్ళలేకపోయాడు. అప్పుడు మాణిక్రాజా స్వయంగా ఒక ఆడమనిషిని ఇంటికి పంపించి, గదాయ్ క్షేమసమాచారాలు తెలుసుకుని రమ్మనీ, వీలయితే గదాయ్ను వెంటబెట్టుకుని రమ్మనీ చెప్పాడు. క్షుదిరామ్ అలాగే కుఱ్ఱవాడిని పంపించాడు. గదాయ్ కూడా ఎంతో ఆనందంతో మాణిక్రాజా ఇంట్లో రోజంతా గడిపాడు. సాయంకాలం ఆ పిల్లవాణ్ణి తిరిగి పంపుతూ, అతడికి మిఠాయిలు, ఆభరణాలు కానుకగా మాణిక్రాజా ఇంటివారు యిచ్చారు.
ఈ బ్రాహ్మణ కుటుంబానికి క్రమంగా గదాయ్ అతి సన్నిహితుడై పోయాడు. కొన్నిరోజుల వరకూ క్షుదిరామ్ ‘భూర్సుబో’ కు పోకుంటే, మనిషిని పంపి పిల్లవాడిని వారు పిలిపించుకునేవారు. గదాయ్ వారికి అంత ప్రేమపాత్రుడయ్యాడు.
14. గదాధర్ కల్పనాశక్తి వికాసం
కాలప్రవాహంలో మరో సంవత్సరం గడిచింది. గదాయ్కు ఏడవ సంవత్సరం వచ్చింది. రోజులు గడిచేకొద్దీ అతడి మధురస్వభావం మరింత మనోహర మయింది. అందరికీ అతడు మరింత ప్రియతముడయ్యాడు. ముఖ్యంగా ఊళ్ళోని స్త్రీలకు అతడంటే అమిత ఆకర్షణ ఏర్పడింది. తమ ఇంట్లో ఏవైనా పిండివంటలు, మిఠాయిలు చేసుకుంటే, ముందుగా గదాయ్కు వాటిని పెట్టాలని ఆతురతపడేవారు. ఇక సాటికుఱ్ఱవాళ్ళు, ఆడపిల్లలు తాము తెచ్చుకున్న తినుబండారాలను అతడితో పంచుకుని తిన్నప్పుడే ఎంతో సంతృప్తి చెందేవారు. చుట్టుప్రక్కలవాళ్ళు ఆ కుఱ్ఱవాడి చక్కని నడవడికను చూసి, వీనులవిందు చేసే పాటలు విని, తియ్యని పలుకులు ఆలకించి, ఎంతో ముగ్ధులయ్యేవారు. ఆ ఆనందంలో అతడి చిలిపిచేష్టలను వారు సంతోషంతో సహించేవారు.
ఈ దశలోనే ఒక సంఘటన జరిగింది. అది గదాయ్ తల్లితండ్రులను, బంధువులను ఎంతో ఆందోళనకు గురిచేసింది. దైవానుగ్రహంతో గదాయ్ ఆరోగ్యంగా బలిష్ఠంగానే ఉన్నాడు. అంతవరకూ అతడికి ఏ రుగ్మతా రాలేదు. అందుచేత అతడు సంతోషంగా, విహంగంలా స్వేచ్ఛగా తిరుగుతుండేవాడు. ‘దేహధ్యాస లేకుండా ఉండడమే పూర్ణ ఆరోగ్య లక్షణం’ అని వైద్యులు చెబుతారు. గదాయ్కు జన్మతః ఇలాంటి ఆరోగ్యమే ఉండేది. అతడి మనస్సు సహజంగానే ఏకాగ్రమై ఉండేది. అలాంటి ఏకాగ్రమైన మనస్సు ఏదైనా విషయం పట్ల ఆకర్షింప బడితే అప్పుడతనికి దేహస్పృహ పూర్తిగా లుప్తమైపోయేది. అతడి మనస్సు ఆ విషయంతో తాదాత్మ్యమైపోయేది. చల్లగా వీచే పిల్లగాలులకు నాట్యంచేసే విశాలమైన పచ్చికబయళ్ళు, గలగలా నిరంతరం ప్రవహించే నిర్మల నదీజలాలు, పక్షుల మధుర కూజితాలు, సువిశాల నీలాకాశం, ఆ గగనతలంలో క్షణక్షణానికి రూపాలు మార్చుకునే మబ్బుల సముదాయం, ఇలాంటి మనోహర రమణీయ దృశ్యాలు అతడి దృష్టిని ఆకర్షించేవి. తమలో దాగిన రహస్యాలను, మహిమలను ఆ బాలుని ఆంతరిక దృష్టికి గోచరింపచేసేవి. అతడిలోని భావుకతను జాగృతం చేసేవి. దానితో ఆ దృశ్యాలు చూడగానే అతడు సర్వమూ మరిచి ఆ సుదూర భావనా ప్రపంచంలో విహారం చేసేవాడు. మేం వివరించబోతున్న క్రింది అనుభవానికి మూలం ప్రకృతి సౌందర్యం పట్ల బాలుని ఆధ్యాత్మికపరమైన ప్రవృత్తి వైశిష్ట్యం.
ఒక రోజు గదాయ్ పొలాల మధ్య నడుస్తూ వెళుతున్నాడు. చుట్టూ పచ్చని పంట పొలాలున్నాయి. అతడు అలా వెళ్ళుతూ ఆకాశంవైపు చూశాడు. ఆకాశంలో నల్లని కారు మబ్బులున్నాయి. ఆ నల్లని కారుమబ్బుల కింద నుండి తెల్లని కొంగలు మెరుపుతీగెలా బారులుతీరి ఎగురుతూ వెళుతున్నాయి. ఆ దృశ్యం ఎంత మనోహరమైనదో చూసి ఆనందించాల్సిందే. ఆ రమణీయ దృశ్యాన్ని చూడగానే గదాయ్ పరవశుడై మైమరచిపోయాడు. దానితో స్పృహతప్పి పడిపోయాడు.* ఆ అబ్బాయిని ఆ స్థితిలో చూసి, స్నేహితులు కంగారు పడిపోయి, ఇంటికి తీసుకువెళ్ళి, విషయం తెలియచేశారు. కాసేపటికి గదాయ్కు స్పృహ వచ్చింది; అతడు మామూలు మనిషయ్యాడు.
గదాయ్కు జరిగిన ఈ సంఘటనను తెలుసుకుని చంద్రాదేవి, క్షుదిరాం ఎంతో ఆందోళన చెందారు. పుత్రప్రేమ కదా! ఇలాంటివి ఇకముందు జరుగకుండా ఉండేలా వారెన్నో జాగ్రత్తలు వహించారు. పిల్లవాడికి మూర్ఛరోగం లాంటివి ఏమైనా ఉన్నాయేమోనని అనుమానించారు. దానికోసం మందులూ మాకులు ఇప్పించాలా లేక శాంతిక్రియలు చేయించాలా అన్న సందిగ్ధంలో పడ్డారు. కాని గదాయ్ మాత్రం దీన్నంత తీవ్రంగా తీసుకోలేదు. ఆ స్థితిలో తన మనస్సు ఒక అపూర్వ వినూత్న భావనలో విలీనమైందని, ఆ కారణంగానే తన కలాంటి స్థితి కలిగిందని చెప్పాడు. పైగా తాను బాహ్యస్మృతి కోల్పోయినా, లోపల మాత్రం తానొకానొక దివ్యానందాన్ని అనుభవించానని అన్నాడు. ఇదే విషయాన్ని అతడు ఎన్నోసార్లు చెప్పాడు…. అయితే అలాంటి అవస్థ అతడికి మళ్ళీ కలుగకపోవడం వల్ల, అతడి ఆరోగ్యం కూడా మామూలుగానే ఉండటం వల్ల, ఎవరు కూడా అతడి మాటలను పట్టించుకోలేదు. అది తప్పకుండా ఏదో వాతదోషం అయి ఉంటుందని అనుకున్నాడు క్షుదిరామ్. అయితే చంద్రాదేవి మాత్రం ఏదో దయ్యంవల్లే అలా జరిగిందని అనుకుంది.
ఈ సంఘటన కారణంగా, ఆ దంపతులు కొంతకాలం వరకు గదాయ్ను బడికి పంపలేదు. దానితో గదాయ్కు మరింత స్వేచ్ఛ లభించింది. చుట్టు ప్రక్కల ఇళ్ళలోకి, ఊరంతా యథేచ్ఛగా తిరుగుతూ, మరింత చిలిపిగా ప్రవర్తిస్తూ ఉండిపోయాడు.
15. రామ్చంద్రుని ఇంట్లో దుర్గాపూజ
గదాయ్కు ఏడున్నర సం ॥ వయసుంటుంది. అప్పుడు శరన్నవరాత్రులు సమీపించాయి. ఈ (దేవీ) నవరాత్రుల్లో శ్రీ దుర్గాదేవిని పూజిస్తారు. క్షుదిరామ్ మేనల్లుడు, కాస్త శ్రీమంతుడు అయిన రాంచంద్ర వంద్యోపాధ్యాయ గురించి ఇదివరకే చెప్పుకున్నాం కదా! అతడి ఉద్యోగం మేదినీపూర్‌లో ఉండడంవల్ల, సంవత్సరంలో ఎక్కువ కాలం అతడు అక్కడే ఉండేవాడు. కాని అతడి స్వగ్రామం మాత్రం సేలాంపూర్. ఆ గ్రామంలో అతడికి పూర్వీకుల గృహం ఉంది. అతడి కుటుంబం ఆ గ్రామంలోనే ఉండేది. ఉద్యోగరీత్యా అతనొక్కడు మాత్రం మేదినీపూర్‌లో వసించేవాడు.
రామ్‌చంద్ర తన స్వగ్రామంలోని ఇంట్లో ప్రతి సంవత్సరం శ్రీశ్రీ దుర్గాపూజను ఘనంగానే చేసేవాడు. ఎంతో డబ్బు ఖర్చుపెట్టేవాడు. ఈ శరన్నవరాత్రుల్లో అతడి ఇంట్లో ఎనిమిది రోజుల వరకు భక్తిసంగీతం మారుమ్రోగుతూ ఉండేదని హృదయరామ్ (శ్రీరామకృష్ణుల మేనల్లుడు) చెప్పగా మేము విన్నాం. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడం, పండితులకు పారితోషికాలివ్వడం, పేదలకు అన్నవస్త్రాల నివ్వడంలాంటి ఎన్నో పుణ్యకార్యాలతో ఆ ఇల్లు ఆనందంతో నిండిపోయేది.
ఈ పూజాసందర్భంలో రామ్‌చంద్ర, పరమపూజ్యుడైన తన మామ క్షుదిరామ్ను ఇంటికి తోడ్కొని వచ్చేవాడు. కొంతకాలం ఆయనతో ఆనందంగా గడిపేవాడు. ఈ సంవత్సరం కూడ పూజాసమయం రాగానే, కుటుంబసమేతంగా రమ్మంటూ క్షుదిరామ్ను హార్దికంగా ఆహ్వానించాడు రామ్‌చంద్ర.
16. క్షుదిరామ్ శరన్నవరాత్రి ఉత్సవంలో పాల్గొనడం
అప్పుడు క్షుదిరాం వయస్సు అరవై ఎనిమిదేళ్ళు. గత కొన్ని ఏళ్ళుగా అతడు అజీర్తి, అతిసార వ్యాధులతో బాధపడుతూ ఉన్నాడు. ఆ కారణంగా అతడిలో బలం క్షీణించిపోయింది. శరీరంలో మునుపటి శక్తి లేదు. అత్యంత ప్రియమైన మేనల్లుని ఆహ్వానం అతడికి సంతోషాన్ని కలిగించింది. తప్పకుండా వెళ్ళాలనే అనుకున్నాడతడు. కాని, తన శారీరక పరిస్థితి చూసి కాస్త సంకోచించాడు. అంతేకాదు, ఈసారి ఎందుకో అతడికి ఎక్కడికీ వెళ్ళాలనిపించలేదు. తన చిన్ని ఇంటిని తన కుటుంబాన్ని, ముఖ్యంగా గదాయ్ను వదలి కొన్ని రోజులు మరోచోట గడపడానికి అతడికి మనస్కరించలేదు. ఆ బలీయమైన కారణం ఏమిటో అతడికే తెలియదు. కాని, రామ్‌చంద్ర కూడ తనకెంతో కావలసినవాడు. అతడి వద్దకు కూడ తప్పక వెళ్ళాల్సిందే!
అతడికి వెంటనే ఏంచేయాలో తోచలేదు.
‘రోజు రోజుకూ నాలో బలం తగ్గిపోతున్నది. ఈ సంవత్సరం వెళ్ళకపోతే, బహుశ ఇకముందు ఎప్పుడూ వెళ్ళటం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి వెళ్ళటమే మంచిది’ అని క్షుదిరామ్ అనుకున్నాడు.
చివరికి గదాయ్ను తనతోపాటు తీసుకువెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. కాని మరుక్షణం అతణ్ణి మరో ఆలోచన అడ్డుకుంది. ‘గదాయ్ లేకపోతే చంద్రా ఎలా ఉంటుందీ? దిగులుపడుతుందేమో! కాబట్టి పెద్దబ్బాయి రామ్‌కుమార్‌తో వెళ్ళతాను. పండుగ నాలుగు రోజులు గడిపి, రామ్‌చంద్రను సంతోషపెట్టి వస్తాను’ అనుకుని క్షుదిరామ్ తన నిశ్చయం మార్చుకున్నాడు.
అలాగే క్షుదిరామ్ శ్రీ రఘువీరునికి మొక్కి, అందరివద్ద సెలవు తీసుకున్నాడు. గదాయ్ను ప్రేమమీర ముద్దాడాడు. రామ్‌కుమార్‌తో పూజకు కొన్ని రోజులు ముందే సేలంపూర్ వెళ్ళాడు. పూజ్య మేనమామ, బావ రామ్‌కుమార్‌లను చూసి రామ్‌చంద్ర ఎంతో ఆనందించాడు.
17. క్షుదిరామ్ వ్యాధి – మరణం
క్షుదిరామ్ సేలాంపూర్కు వచ్చిన తర్వాత, అతడి వెనుకటి వ్యాధి అయిన అతిసారం తిరగబెట్టింది. వెంటనే అతడికి తగిన చికిత్స చేయించసాగారు. శ్రీశ్రీ దుర్గానవరాత్రుల్లో షష్ఠి – సప్తమి – అష్టములు ఎంతో ఆనందంతో గడిచాయి. నవమి రోజున రోగం తీవ్రతరమైంది. దానితో అందరి ఆనందం భగ్నమైంది. రామ్‌చంద్ర మంచి వైద్యులను రప్పించాడు. రాంకుమార్, హేమాంగినుల సహాయంతో మేనమామకు సపర్యలు చేయసాగాడు. కాని క్షుదిరామ్ పరిస్థితి ఏమాత్రం మెరుగు కాలేదు. నవమినాటి పగలూ, రాత్రీ ఎలాగో గడిచాయి. మరుసటి దినం దశమి – అంతా ఆనందంతో కలుసుకునే విజయదశమి. ఆ రోజు క్షుదిరామ్ పూర్తిగా బలహీనుడైపోయాడు. నోట మాట రావడం కూడా కష్టమైంది.
సాయంకాలం శ్రీశ్రీ దుర్గామాతను నిమజ్జనం చేసి, రామ్‌చంద్ర సత్వరం మేనమామ దగ్గరకు వచ్చాడు. అప్పటికే తన మామ పరిస్థితి విషమించిందని తెలుసుకున్నాడు. అతడికి అంతిమ క్షణాలు దగ్గరపడ్డాయని గ్రహించాడు. చాలాసేపటి నుండి మామ ఆ స్థితిలోనే ఉన్నాడన్న విషయం తెలిసి, రామ్‌చంద్ర దుఃఖంతో కుంగిపోయాడు. కళ్ళనుండి నీరు స్రవిస్తూండగా ఏడుస్తూనే మామ చెవి దగ్గరగా వచ్చి గట్టిగా మాట్లాడాడు.
“మామా! నువ్వెప్పుడూ శ్రీ రఘువీరుని నామాన్ని స్మరిస్తూ ఉంటావు కదా! మరిప్పుడెందుకు స్మరించమా?” అని బిగ్గరగా అన్నాడు.
శ్రీ రఘువీరుని నామం విన్న మరుక్షణమే క్షుదిరామ్లో కాస్త కదలిక కనిపించింది. అతడికి బాహ్యస్మృతి కూడ వచ్చింది. రామ్చంద్రవైపు చూశాడు.
“రామ్చంద్రా, నువ్వే కదా! అమ్మ నిమజ్జనం అయిపోయిందా? అయితే నన్ను కాస్త కూర్చోబెట్టు నాయనా!” అన్నాడు.
రాంకుమార్, హేమాంగినుల సహాయంతో రామ్‌చంద్ర మేనమామను మంచం మీద నెమ్మదిగా కూర్చోబెట్టాడు. కూర్చున్న వెంటనే క్షుదీరామ్ గంభీర స్వరంతో శ్రీ రఘువీరుని పవిత్రనామాన్ని మూడుసార్లు ఉచ్చరించాడు. ఆ మరుక్షణం అతడి దేహం నుండి జీవుడు ఎగిరిపోయాడు. బిందువు సింధువులో కలసిపోయింది. తన పరమభక్తుని జీవనబిందువును, శ్రీ రఘువీరుడు తన అనంత జీవన సింధువులో విలీనం చేసుకున్నాడు. అతడికి అమృతత్త్వాన్నిచ్చాడు, పరమశాంతిని అనుగ్రహించాడు.
నాటి అర్ధరాత్రి ఆ గ్రామం అంతా భగవంతుని సంకీర్తనలతో మారుమ్రోగిపోయింది.
క్షుదిరామ్ భౌతిక కాయాన్ని నదీతీరానికి తీసుకువెళ్ళారు. అక్కడే అంత్యక్రియలు, దహనసంస్కారం చేశారు.
మరునాడు ఈ విషాదవార్త కామార్పుకూర్ చేరింది. అక్కడి ఆనంద ధామాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది.
మైలకాలం గడిచిపోయాక రామ్‌కుమార్ తండ్రి పేరిట శాస్త్రోక్తంగా ఒక కోడెదూడను వదిలిపెట్టాడు. ఎంతోమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టించాడు. తండ్రి శ్రాద్ధకర్మలు ఆ రీతిలో చక్కగా నిర్వహించాడు.
ఈ శ్రాద్ధకర్మ నిమిత్తం రామ్‌చంద్ర ఐదువందల రూపాయలు ఖర్చుపెట్టాడని చెప్పుకొంటారు.