1. కామార్పుకూర్లో క్షుదిరామ్ వానప్రస్థ జీవనం
పదేళ్ళ రాంకుమార్‌ను, నాలుగేళ్ళ కాత్యాయనిని వెంటపెట్టుకొని భార్యతో సహా క్షుదిరామ్ కామార్పుకూర్ వచ్చి, పూరింట నివసించటానికి సిద్ధపడినప్పుడు ఆ దంపతుల హృదయాలలో చెలరేగిన భావాలు వర్ణనాతీతం. అసూయా ద్వేషాలతో నిండిపోయిన లోకం ఆనాడు వారికి చిమ్మచీకటితో కూడిన భయానక శ్మశానంగా కనిపించటం సహజమే. ప్రేమ, సానుభూతి, దయ, ధర్మం వంటి సద్గుణాలు కాంతిహీనంగా మెరుస్తూ బహుశా ఆనందం కలుగవచ్చుననే ఆశను రేకెత్తించినా, మరుక్షణంలో అవి అదృశ్యమై, ఎప్పటిలా అంధకారమే కనిపించేది. తమ వెనుకటి స్థితితో ప్రస్తుత స్థితిని పోల్చుకున్నప్పుడు వారి మనస్సులలో ఇలాంటి భావాలు కలగటం సహజమే. కష్టమూ, విపత్తూ వాటిల్లినప్పుడే మనిషి ఈ లోకం యొక్క అనిత్యత్వాన్ని, నిరర్థకతనూ చక్కగా గ్రహిస్తాడు. కాబట్టి క్షుదిరామ్ హృదయం వైరాగ్యంతో నిండిపోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అనుకోకుండానే, అడగకుండానే తనకు నిలువ నీడ లభించటం జ్ఞాపకం వచ్చినప్పుడు అతడి హృదయం భగవంతుడి పట్ల అపారమైన భక్తితో పొంగిపొరలిందని చెప్పేపనిలేదు. కనుక శ్రీరఘువీరుడికి పరిపూర్ణంగా ఆత్మసమర్పణం చేసుకొని, ప్రాపంచిక సుఖసంపదల పట్ల ఉదాసీనుడై, అతడిప్పుడు భగవంతుని పూజా సేవాదులలో నిరతుడై కాలాన్ని గడప సాగాడంటే దాన్లో ఆశ్చర్యం లేదు. అప్పటినుంచి అతడు సంసారంలో ఉంటున్నప్పటికీ, ప్రాచీనకాలం నాటి వానప్రస్థుడిలా అనాసక్తతతో జీవించసాగాడు.
2. అనూహ్య రీతిలో రఘువీరుని సాలగ్రామ ప్రాప్తి
ఈ కాలంలో జరిగిన ఒక సంఘటన క్షుదిరామ్ భగవద్భక్తిని మరింత ఇనుమడింపచేసింది. అతడొక రోజు కార్యార్థం మరొక గ్రామానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు అలసిపోయి ఒక చెట్టు నీడన విశ్రమించసాగాడు. విస్తృతమైన ఆ నిర్జన మైదాన ప్రాంతంలోని చల్లని పిల్లగాలులు చింతాక్రాంత మైన అతడి మనస్సును శాంతితో నింపి, శారీరక అలసటను తొలగించసాగాయి. నిద్రించాలనే కోరిక బలీయమై, నడుం వాల్చిన మరుక్షణంలోనే అతడు నిద్రలోకి జారుకున్నాడు. కాసేపట్లోనే అతడొక అద్భుతమైన కలకన్నాడు. కలలో అతడు లేత గరికవంటి పచ్చని మేనిఛాయతో ఒప్పుతున్న బాల శ్రీరామచంద్రుడు తన ఎట్టఎదుట నిలబడి, ఒక ప్రత్యేక స్థానాన్ని చూపిస్తూ, “చాలాకాలం నుంచి నిరాహారినై, నిర్లక్షితుడనై నేనిక్కడ పడివున్నాను. నన్ను నీ ఇంటికి తీసుకొనివెళ్ళు. నీ సేవలను అందుకోవాలనే అభిలాష నాకు కలిగింది” అని పలుకుతూ కనిపించాడు. ఆ మాటలు వినగానే క్షుదిరాం ఉద్విగ్నుడై పదేపదే ఆ దివ్యబాలమూర్తికి ప్రణామాలు చేస్తూ ఇలా అన్నాడు: “ప్రభూ! నేను భక్తిహీనుణ్ణి. పైగా కటిక దరిద్రుణ్ణి. మా ఇంట్లో నీకు తగిన రీతిలో సేవలు లభించటం అసాధ్యమే కాక, సేవాపరాధుడనై నేను నరకానికి పోవలసివస్తుంది. ఎందుకు ఇలాంటి దుస్సాధ్యమైన కోరిక కోరుతున్నావు?” అందుమీదట ఆ బాల రామచంద్రుడు అతడిపట్ల మరింత ప్రసన్నుడై, అతణ్ణి అనునయిస్తూ, “వెరవకు! నీసేవలో లోటుపాట్లను పట్టించుకోను. నన్ను నీతో తీసుకొనివెళ్ళు” అన్నాడు. అయాచితంగా తనకిలా లభించిన భగవదనుగ్రహాన్ని సంబాళించుకోలేక, భావ పారవశ్యుడై క్షుదిరామ్ అశ్రుపూరితుడైనాడు. అంతటితో కల చెదరిపోయి, అతడు మేల్కొన్నాడు.
నిద్రనుంచి మేల్కొని క్షుదిరాం తనలో తను ఇలా భావించుకోసాగాడు: “ఎంత అద్భుతమైన కల. ఏనాటికైనా నేనంత భాగ్యవంతుణ్ణి అవగలనా?” ఇలా భావిస్తూన్న అతడి దృష్టి అకస్మాత్తుగా సమీపంలోని వరి చేను మీద పడింది. కలలో తను చూసిన స్థలం అదే అని తక్షణం గుర్తించాడు. కుతూహలంతో అతడా స్థలాన్ని సమీపించగానే అక్కడొక అందమైన సాలగ్రామ శిల, శిలను పరిరక్షిస్తూ ఒక త్రాచుపాము పడగవిప్పి ఉండటమూ కంటపడ్డాయి. సాలగ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఉత్కంఠతో అటుకేసి అడుగులు పడ్డాయి. అతడు దగ్గరకెళ్ళి చూడగా, పాము అదృశ్యమైంది. సాలగ్రామశిల పాము కలుగువద్ద పడి ఉన్నది. కల నిజం కావటంతో అతడి హృదయం మహదానందంతో నిండిపోయింది. తనకు భగవదాజ్ఞ అయినదనే నమ్మకంతో పాము భయం తొలగిపోయి, ‘జై రఘువీర్’ అంటూ జయ జయధ్వానాలు చేస్తూ శిలను తన చేతుల్లోకి తీసుకొన్నాడు. తనకు తెలిసిన శాస్త్రజ్ఞానంతో ఆ సాలగ్రామశిల మీది గుర్తులను జాగ్రత్తగా పరీక్షించి అది నిజానికి శ్రీరఘువీరుని సాలగ్రామశిల అని తేల్చుకొన్నాడు. ఆనందాశ్చర్యాలతో క్షుదిరామ్ ఇంటికి తిరిగివచ్చాడు. తరువాత శాస్త్రానుసారం ఆ సాలగ్రామానికి సంస్కారాలను నిర్వర్తించి, దాన్ని విధిపూర్వకంగా తన కులదేవతగా ప్రతిష్ఠించి, నిత్యం పూజించసాగాడు. శ్రీ రఘువీరుణ్ణి ఇలా అనూహ్యరీతిలో పొందటానికి మునుపుకూడ క్షుదిరామ్ శ్రీరామచంద్రుని తన ఇష్టదేవతగా పూజిస్తూండేవాడు. అలాగే ఒక ఘటంలో శీతలాదేవినీ ప్రతిష్ఠించి నిత్యపూజలు చేస్తూండేవాడు.
3. క్షుదిరామ్ భగవత్ పరాధీనత
అతడి కష్టాలు కొనసాగుతున్నాయి. కాని క్షుదిరాం మాత్రం కష్టాలనన్నిటిని నిర్లిప్తంగా భరిస్తూ, ఒక్క ధర్మమార్గాన్నే దృఢంగా అవలంబించి, సంతుష్టహృదయంతో కాలం వెళ్ళబుచ్చసాగాడు. ఆ కుటుంబానికి తినడానికి కూడ కొన్ని రోజులు ఏమీ ఉండేదికాదు. అలాంటి సమయంలో పతినే ప్రత్యక్షదైవంగా భావించే చంద్రాదేవి ఆందోళనపడి ఆ సంగతి భర్తకు తెలిపేది. క్షుదిరామ్ అలాంటి సందిగ్ధ స్థితిలోనూ వ్యాకులపడక, “పరవాలేదు, రఘువీరుడు ఉపవాసం చేయటానికి ఇష్టపడినప్పుడు మనమూ అట్లే గడుపుదాంలే” అంటూ ఆమెను అనునయించేవాడు. అంతటితో సరళ హృదయురాలైన చంద్రాదేవికూడ భర్త మాదిరే భారం యావత్తూ శ్రీరఘువీరుని మీద వేసి, నిర్వికారచిత్తంతో గృహకృత్యాలలో నిమగ్నురాలయ్యేది. మరి ఆ రోజుకు సరిపడే ఆహారం ఎలాగో సమకూరేది.
4. లక్ష్మీజలలోని వరిచేను
కాని ఆహారం గురించిన ఈ అనిశ్చిత పరిస్థితి మూలంగా దీర్ఘకాలం క్షుదిరామ్ బాధపడలేదు. మిత్రుడు సుఖలాల్ గోస్వామి లక్ష్మీజల అనే ప్రదేశంలో కానుకగా ఇచ్చిన ఒక బీఘా పది ఛట్కాల పొలం శ్రీ రఘువీరుడి కృపతో సమృద్ధిగా పండసాగింది. దానితో ఏడాది పొడవునా ఆ చిన్ని కుటుంబం అక్కరలు తీరటమేగాక, అతిథి అభ్యాగతులకు సరిపడేటంత మిగిలేది. పొలం దున్నటానికి క్షుదిరాం, కూలీలను పెట్టుకొనేవాడు. వరి మొలకలెత్తినప్పుడు క్షుదిరామ్ రఘువీరుణ్ణి స్మరిస్తూ స్వయంగా తన చేతులతో కొన్ని మొలకలను నాటి, తరువాత మిగిలిన నాటు పనిని కూలీల ద్వారా పూర్తిచేయించేవాడు.
5. క్షుదిరామ్ భగవద్భక్తి పురోగతి – ఇరుగు పొరుగువారు చూపే గౌరవ ప్రపత్తులు
ఈ రీతిలో రెండు మూడు ఏళ్ళు గడచిపోయాయి. క్షుదిరాం పూర్తిగా రఘువీరుడి మీద ఆధారపడి, అయాచితంగా లభించిన దానితో సంసారాన్ని గడపసాగాడు. అయినా అన్నవస్త్రాదులకు లోటు లేదు. ఈ రెండు మూడేళ్ళ కాలంలో అతడు అనుభవించిన బాధలు, కష్టాలు అతడికి మేలునే చేకూర్చాయి. ఫలితంగా అతడి హృదయం అనవరతం శాంతి సంతోషాలతో, సంతృప్తితో భగవంతుడి మీద నిర్భయత్వంతో పొంగి ప్రవహించసాగింది. ఏ కొద్దిమందికో ఇలాంటి సౌభాగ్యం అబ్బుతుంది. ఇప్పుడు అతడి మనస్సు సర్వదా అంతర్ముఖావస్థలో నెలకొనివుంటోంది. తత్ఫలితంగా అప్పుడప్పుడు అతడికి కొన్ని అద్భుతమైన దివ్యదర్శనాలు కలుగసాగాయి. నిత్యం ఉదయం, సాయంత్రం సంధ్యావందనం చేయటానికి కూర్చుని, గాయత్రీదేవి ధ్యానమంత్రాన్ని ఉచ్చరిస్తూ క్షుదిరాం భావమగ్నుడయ్యే వాడు. అప్పుడతడి వక్షస్థలం ఎర్రబారి, నిమీలితనేత్రాల నుంచి ప్రేమానందాశ్రువులు కాలువలు కట్టేవి. తెల్లవారుజామునే, బుట్టను పుచ్చుకొని పువ్వులను సేకరించటానికి వెళ్ళినప్పుడు – తన ఆరాధ్యదేవత అయిన శీతలాదేవి ఎనిమిదేళ్ళ బాలికారూపంలో ఎర్రని దుస్తులు ధరించి, వివిధాభరణభూషితయై, చిరునవ్వు లొలకబోస్తూ, తనతోపాటు తిరుగుతూ, పువ్వులచెట్ల కొమ్మలను కిందికి వంచుతూ, పువ్వులు కోయటంలో అతడికి తోడ్పడేది! ఇలాంటి దివ్యదర్శనాలు అతడి హృదయాన్ని సతతం మహదానందంతో నింపివేసేవి. అతడి భక్తి, ఆంతరిక విశ్వాసం అతడి ముఖమండలంలో ద్యోతకమవుతూంటే, సర్వదా అతడొక దివ్యభావావేశంలో మగ్నుడైవుండటం జరిగేది. అతడి సౌమ్య, ప్రశాంత వదనాన్ని గాంచి, తమ హృదయాంతరాళాలలో ఆయన్నొక మహర్షిగా గుర్తించిన గ్రామస్థులు ఆయనపట్ల అపార గౌరవ భక్తి ప్రపత్తులు చూపసాగారు. ఆయన రాకను పసిగట్టగానే వ్యర్థప్రసంగాలను కట్టిపెట్టి, గౌరవ భావంతో లేచి నిలబడి అభివాదం చేసేవారు. ఆయన స్నానం ఆచరిస్తున్నప్పుడు చెరువులోకి దిగటానికి సంకోచించి, ఆయన స్నానం అయ్యేదాకా గౌరవభావంతో వేచివుండేవారు. ఆయన పట్ల పూర్తి విశ్వాసం వహించి, తమ సుఖదుఃఖ సమయాల్లో ఆశీస్సులకై ఆయన వద్దకు రావటం వారికి పరిపాటి అయింది.
6. ఇరుగుపొరుగులు చంద్రాదేవిని గౌరవించే తీరుతెన్నులు
చంద్రాదేవిలో ప్రేమ, నిష్కాపట్యాలు మూర్తీభవించాయి. తన కరుణ, అభిమానాలతో ఎల్లరిని తనవారిగా చేసుకొని వారందరి మాతృభక్తిని పొందగలిగింది. కారణం ఏమంటే తమ విపత్కర సమయాలలో ఆమె చూపించే హృదయపూర్వక సానుభూతి మరెక్కడా వారికి లభించకపోవటమే! ఇక పేదల విషయంలో – చంద్రాదేవి వద్దకు తాము ఎప్పుడు పోయినాసరే తినటానికి ఒక పిడికెడు మెతుకులే గాక, మనఃస్ఫూర్తిగా ప్రేమాదరణలు లభించి వారి హృదయాలు చెప్పనలవిగాని ఆనందంతో నిండిపోయేవి. ఆ ఇంటి ద్వారాలు తమకోసం ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయని భిక్షకు వచ్చే సాధువులందరికీ ఎరుకే. ఇక ఇరుగు పొరుగు బాలబాలికలు – తమకు ఏం కావలసి వచ్చినా ఎలాగైనా ఆమె నుంచి పొందవచ్చని గ్రహించారు. ఈ విధంగా ఇరుగుపొరుగువారు, ఆబాలగోపాలం క్షుదిరామ్ పూరింటికి వేళాపాళా లేకుండా వస్తూ పోతూండేవారు. దుఃఖదారిద్ర్యాలు తాండవిస్తున్నా అతడి గృహం సర్వదా అపూర్వ శాంత్యానందాలతో వెలుగొందేది.
7. క్షుదిరామ్ చెల్లెలు రామశీల ఉదంతం
క్షుదిరామ్కు రామశీల అనే ఒక చెల్లెలు, నిధిరాం, కానాయిరాం లేదా రాంకానాయి అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారని చెప్పుకొన్నాం. దేరేపూర్ జమీందారుతో ఏర్పడ్డ వివాదంలో క్షుదిరామ్ తన యావదాస్తినీ కోల్పోయిన నాటికి రామశీలకు ముప్ఫై ఐదేళ్ళు, తమ్ముళ్ళకు ముప్ఫై, ఇరవై ఐదేళ్ల వయస్సు ఉండవచ్చు. అప్పటికే వారందరికీ వివాహాలై సంసారాలు చేసుకొంటున్నారు. కామార్పుకూర్కు పశ్చిమంగా పన్నెండు మైళ్ళ దూరంలోని చిలింపూర్ గ్రామవాస్తవ్యుడు భగవత్ వందోపాధ్యాయ్తో రామశీలకు వివాహం జరిగింది. ఆమెకు రాంచంద్ర అనే కుమారుడు, హేమాంగిని అనే కుమార్తె కలిగారు. క్షుదిరాముని ఈ దురదృష్ట కాలఘట్ట సమయంలో రాంచంద్ ఇరవైఒక్క ఏళ్ళవాడు, హేమాంగిని పదహారేళ్ళది. రాంచంద్ర ఆ సమయంలో మేదినీపూర్‌లో ప్లీడర్ వృత్తిలో ఉండేవాడు. దేరేపూర్లో మేనమామల ఇంట్లోనే పుట్టి పెరిగిన హేమాంగిని, అన్నకంటే వారిపట్ల మరింత ప్రీతిపాత్రంగా ఉండేది. క్షుదిరామ్ ఆమెను తన సొంతకుమార్తెగా పెంచి పెద్దచేశాడు. యుక్తవయస్కురాలవగానే కామార్పుకూర్కు వాయవ్యంగా ఐదుమైళ్ళ దూరంలో వున్న సిహోర్ గ్రామవాస్తవ్యుడు కృష్ణచంద్ర ముఖోపాధ్యాయకిచ్చి స్వయంగా ఆమె వివాహం జరిపించాడు. కాలక్రమంలో ఆమెకు రాఘవ్, రాంరతన్, హృదయరాం, రాజారాం అనే నలుగురు కుమారులు కలిగారు.
8. క్షుదిరామ్ ఇద్దరి తమ్ముళ్ళ ఉదంతం
నిధిరాంకు పిల్లలు కలిగారో లేదో అనే సంగతి మేం కనుగొనలేక పోయాం. కాని అందరిలోకీ చిన్నవాడైన కానాయిరాంకు రాంతారక్ (హలధారిగా పేరుగాంచాడు), కాళిదాస్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. కానాయిరాం భక్తితత్పరుడు, ధ్యానశీలుడు. ఒకప్పుడితడు ‘శ్రీరామచంద్రుడి వనవాసం’ అనే నాటకాన్ని చూడటానికి వెళ్ళాడు. నాటకాన్ని చూస్తూ అతడు తన్మయుడైపోయి శ్రీరాముణ్ణి వనవాసానికి పంపాలనే కైకేయి పన్నాగం యథార్థంగా తన కళ్ళముందే జరుగుతున్నదనుకొని, ఆ పాత్రధారిని కొట్టబోయాడట. పిత్రార్జితాన్నంతా కోల్పోయిన తదనంతరం నిధిరాం, కానాయిరాంలు దేరేపూర్ గ్రామాన్ని వీడి, బహుశా తమ తమ మామగారి ఊళ్ళలోనే స్థిరపడిపోయినట్లుగా తోస్తోంది.
9. క్షుదిరామ్ మేనల్లుడు రాంచంద్ర
రామశీల కుమారుడైన రాంచంద్ర వందోపాధ్యాయ్ మేదినీపూర్‌లో ప్లీడర్ వృత్తిలో ఉంటున్నట్లు ఇంత క్రితమే చెప్పుకొన్నాం. ఆ వృత్తిలో అతడు పుష్కలంగానే గడించేవాడు. మేనమామల దుఃస్థితిని బాగా ఎరిగిన రాంచంద్ర ఇప్పుడు క్షుదిరాంకు నెలకు పదిహేను రూపాయలు, నిధిరాం, కానాయిరాంలకు పది రూపాయల చొప్పునా పంపిస్తూ వారికి తోడ్పడసాగాడు. మేనల్లుడి క్షేమసమాచారం అందడంలో ఆలస్యం జరిగితే క్షుదిరాం వ్యాకులపడి, అతణ్ణి చూడటానికి స్వయంగా మేదినీపూర్ వెళ్ళటం జరిగేది. ఒకసారి ఇలా క్షుదిరాం మేదినీపూర్ పోతున్నప్పుడు సంభవించిన ఒక విచిత్ర సంఘటన గురించి మేం వినివున్నాం. క్షుదిరాం ప్రగాఢ దైవభక్తికి ఆ ఉదంతం ఒక నిదర్శనం కావటం వల్ల దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాం.
10. క్షుదిరామ్ ప్రగాఢ భక్తిని చాటే సంఘటన
మేదినీపూర్ కామార్పుకూర్కు పశ్చిమాన సుమారు నలభై మైళ్ళ దూరంలో నెలకొని ఉంది. చాలాకాలం నుంచి రాంచంద్ర, అతడి కుటుంబీకుల క్షేమ సమాచారాలు తెలియక పోవటంతో క్షుదిరాం ఒకరోజు మేదినీపూర్‌కు బయలుదేరాడు. బహుశా అది మాఘం లేక ఫాల్గుణ మాసం అయివుంటుంది. ఆ కాలంలో మారేడు చెట్లు ఆకులన్నీ రాల్చి మోడుబారి ఉంటాయి. మళ్ళీ క్రొత్త ఆకులు చిగురించేదాకా శివుణ్ణి పూజించటం* దుర్లభమౌతుంది. కొంతకాలంగా క్షుదిరామ్ ఈ ఇబ్బందికి గురి అవుతూనేఉన్నాడు.
క్షుదిరామ్ చాలాప్రొద్దుటే బయలుదేరాడు. అతడలా నడుచుకొంటూ దాదాపు పది గంటల ప్రాంతాన ఒక గ్రామం చేరుకొన్నాడు. అక్కడున్న మారేడు చెట్లు క్రొత్త చిగుళ్ళతో నిండివుండటం చూడగానే అతడి హృదయం సంతోషంతో ఉప్పొంగింది. ఇక మేదినీపూర్ ప్రయాణం సంగతే మర్చిపోయాడు. ఒక కొత్తబుట్టను, వస్త్రాన్ని కొని సమీపంలోని ఒక నీటిగుంటలో వాటిని చక్కగా శుభ్రంచేశాడు. తరువాత ఆ బుట్టను క్రొత్త మారేడు ఆకులతో నింపి, బుట్టను తడిగుడ్డతో కప్పి వెనక్కు తిరిగి, దాదాపు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతాన ఇల్లు చేరాడు. వెంటనే స్నానం చేసి, పూజాగృహంలో ప్రవేశించి మహదానందంతో చాలాసేపటి వరకు శివుణ్ణి, శీతలాదేవిని పూజించాడు. పూజ పూర్తికాగానే భోజనానికి కూర్చున్నాడు. మేదినీపూర్‌కు భర్త ఎందుకు వెళ్ళలేదో అడగటానికి ఇదే అనువైన సమయం అనుకొంది చంద్రాదేవి. జరిగిన వృత్తాంతం అతడి నుంచి విన్న చంద్రాదేవి ఆశ్చర్యానికి అంతే లేకపోయింది. అతడు అంతదూరం కాలినడకన వెళ్ళి తిరిగిరావటం కేవలం క్రొత్త మారేడు ఆకులతో శివుణ్ణి పూజించటంకోసం మాత్రమే! మరునాడు తెల్లవారుజామునే లేచి క్షుదిరాం మేదినీపూర్‌కు మళ్ళీ బయలుదేరాడు.
11. రాంకుమార్, కాత్యాయనుల వివాహాలు
క్షుదిరామ్ ఇలా ఆరేళ్ళు కామార్పుకూర్లో గడిపాడు. అతడి కుమారుడు రాంకుమార్‌కు అప్పుడు పదహారేళ్ళు, కూతురు కాత్యాయనికి పదకొండేళ్ళు. యుక్తవయస్కురాలైన కుమార్తెను అతడు కామార్పుకూర్కు వాయవ్యంలో రెండు మైళ్ళ దూరంలోని అనూర్ గ్రామానికి చెందిన కేనారాం వందోపాధ్యాయ్ కిచ్చి వివాహం చేశాడు. కేనారాం చెల్లెల్ని రాంకుమార్ వివాహమాడాడు. రాంకుమార్ అప్పటికే చతుష్పాఠిలో (సంస్కృత పాఠశాల) చేరి వ్యాకరణం, కావ్యం ముగించి స్మృతి* అధ్యయనం చేయటం ప్రారంభించాడు.
12. సుఖలాల్ గోస్వామి మరణం, తదితర సంఘటనలు
కాలక్రమంలో మరి మూడు నాలుగేళ్ళు దొర్లిపోయాయి. శ్రీ రఘువీరుడి అనుగ్రహంతో క్షుదిరామ్ కుటుంబ పరిస్థితులు వెనుకటి కంటే మెరుగుపడ్డాయి. అతడిప్పుడు నిశ్చింతగా అధిక సమయం భగవత్సేవలో గడపసాగాడు. ఇదే సమయంలో రాంకుమార్ కూడ తన స్మృతి అధ్యయనం ముగించి, కుటుంబ ఆర్థిక స్థితిగతుల పెంపుదలకు తన శక్తిమేరకు తోడ్పడసాగాడు. ఈ కాలఘట్టంలో క్షుదిరామ్ అనుంగు మిత్రుడు సుఖలాల్ గోస్వామి మరణించటం జరిగింది. మిత్రుడి మరణం క్షుదిరాంను దుఃఖసాగరంలో ముంచివేసింది.
13. క్షుదిరామ్ రామేశ్వర తీర్థయాత్ర; రామేశ్వర్ జననం
రాంకుమార్ అప్పటికి పెద్దవాడై కుటుంబ పోషణ బాధ్యతలను చేపట్టటంతో క్షుదిరాం ఇక నిశ్చింతతో తన మనస్సును పూర్తిగా భగవంతుడి వైపు మరల్చాడు. అతడి మనస్సులో తీర్థయాత్రలు చేయాలనే గట్టి ఆకాంక్ష కలిగింది. త్వరలోనే అతడు, బహుశా 1824 వ సం ॥ లో సేతుబంధ రామేశ్వరానికి కాలినడకన బయలుదేరాడు. ఒక ఏడాది కాలంపాటు దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించి ఇంటికి మరలి వచ్చాడు. రామేశ్వరం నుంచి ఒక బాణలింగాన్ని (శివలింగం) తీసుకొనివచ్చి దానిని నిత్యం అర్చించ సాగాడు. రఘువీరుని సాల గ్రామ శిల, శీతలాదేవి ఘటానికి ప్రక్కన ఉంచబడిన ‘రామేశ్వర్’ అని పిలువబడే ఈ శివలింగాన్ని నేటికీ కామార్పుకూర్లో చూడవచ్చు. చాలాకాలం తరువాత చంద్రాదేవి మళ్ళీ గర్భం దాల్చి, 1826 వ సం ॥ లో ఒక కుమారుణ్ణి ప్రసవించింది. రామేశ్వర తీర్థయాత్ర ముగించుకొని వచ్చాక పుట్టటం వల్ల క్షుదిరాం ఈ పిల్లవాడికి ‘రామేశ్వర్’ అని నామకరణం చేశాడు.
14. రాంకుమార్ అలౌకిక శక్తి
ఈ సంఘటన తరువాత ఎనిమిదేళ్ళు కామార్పుకూర్లోని ఈ పేద కుటుంబ జీవన ప్రవాహం ఏ ఒడుదొడుకులూ లేకుండా సాఫీగానే సాగిపోయింది. రాంకుమార్ స్మృతి శాస్త్రాలలో చెప్పబడిన శాంతి, స్వస్త్యయనాది కర్మలను చేస్తూ కొంత ఆర్జనాపరుడయ్యాడు. ఫలితంగా కుటుంబానికి గతంలో మాదిరి ప్రతిదానికీ తడుముకొనే అగత్యం లేకుండాపోయింది. రాంకుమార్ శాంతి, స్వస్త్యయనాది కర్మలలో నిష్ణాతుడై కొన్ని అలౌకిక శక్తులను సంపాదించాడు. ఇంతకు మునుపు శాస్త్రాధ్యయనం ద్వారా ఆద్యాశక్తి (జగన్మాత) ఉపాసనలో అతడికి ఎంతో శ్రద్ధ జనించింది. అందు నిమిత్తం అతడు ఉపయుక్తుడైన గురువు నుంచి దేవీమంత్రోపదేశాన్ని పొందాడు. అంతేగాక అమిత శ్రద్ధాభక్తులతో నిత్యం తన ఇష్టదేవతను అర్చించసాగాడు. ఇలా పూజిస్తున్నప్పుడు ఒకరోజు అతడికి అపూర్వమైన దేవీదర్శనం కలిగింది. జ్యోతిషశాస్త్రంలో సిద్ధిని పొందే నిమిత్తం దేవి తన చేతి వ్రేలితో తన నాలుక మీద మంత్రాక్షరాలను వ్రాసినట్లు అతడికి అనుభూతి కలిగింది. అప్పటినుంచి రోగిని చూడగానే అతడికి నయం అవుతుందో లేదో తెలుసుకొనే శక్తి రాంకుమార్‌కు లభించింది. తద్ద్వారా అతడు రోగిని గురించి చెప్పేదంతా ఫలించసాగింది. ఈ విధంగా భవిష్యత్తు చెప్పగలడనే కొంత ఖ్యాతిని ఆ చుట్టుపట్ల ప్రాంతాలలో అతడు గడించాడు. ఈ కాలఘట్టంలో రాంకుమార్ తీవ్రవ్యాధిగ్రస్తులైన రోగులను నయం చేయటం కోసం శాంతి, స్వస్త్యయనం చేసేవాడు. పైగా ఇలా ఉద్ఘాటించేవాడు: “ఈ స్వస్త్యయన వేదికమీద నేను చల్లుతూన్న ఈ ధాన్యం మొలకలెత్తటంతోనే ఈ వ్యక్తి ఆరోగ్యవంతుడవుతాడు.” నిజానికి అతడు పలికినట్టే జరిగేది. అతడికి ఇలాంటి శక్తి ఉన్నదనటానికి ఉదాహరణగా అతడి తమ్ముడి కుమారుడు శివరాం చట్టోపాధ్యాయ్ మాతో చెప్పిన ఉదంతం ఇది:
15. రాంకుమార్ అలౌకికశక్తిని చాటే ఒక సంఘటన
రాంకుమార్ ఒకానొక సమయంలో పనిమీద కలకత్తాకు వెళ్ళి ఒకరోజు గంగాస్నానం చేస్తున్నాడు. అప్పుడే స్నానార్థం ఎవరో ఒక సంపన్నుడు సకుటుంబంగా అక్కడికే రావటం తటస్థించింది. పల్లకీలో కూర్చునివున్న అతడి భార్య అందులో కూర్చునే స్నానం చేసే ఉద్దేశంతో పల్లకీని తిన్నగా నదిలోనికి తీసుకువెళ్ళారు. గ్రామం నుంచి వచ్చిన రాంకుమార్‌కు ఇలా ఒక స్త్రీ జనం కంట పడకుండా ఈ తీరులో స్నానం చేయటం విచిత్రంగా తోచింది. ఆ పల్లకీ వంక ఆశ్చర్యపోతూ చూస్తున్న రాంకుమార్‌కు ఆ స్త్రీ ముఖం ఓ క్షణకాలం కనబడింది. తక్షణమే తనకున్న అలౌకిక శక్తి ద్వారా ఆమె మరునాడే మరణిస్తుందని తెలుసుకోగలిగిన రాంకుమార్ నోట, ‘అయ్యో! ఇంత గౌరవమర్యాదలతో స్నానం చేయించబడుతున్న ఈ దేహం రేపు శవమై అందరి సమక్షంలో నదిలో వేయబడుతుందే’ అనే మాటలు యాంత్రికంగా వెలువడ్డాయి. ఆ సంపన్నుడు ఈ మాటలు విని, అతడి మాటల్లోని యథార్థాన్ని పరీక్షించే నిమిత్తం రాంకుమార్‌ను తన ఇంటికి రావలసిందని కాస్త బలవంతపెట్టాడు. రాంకుమార్ జోస్యం నిజం కాకపోతే అతడికి గట్టిగా బుద్ధిచెప్పి పంపటమే ఆ సంపన్నుడి అసలు ఉద్దేశం. ఆ యువతి కూడ పూర్ణ ఆరోగ్యంతో ఉండటం వల్ల దుర్ఘటన జరిగే లక్షణాలేవీ సూచనప్రాయంగా కూడ కనిపించటం లేదు. కాని చివరికి రాంకుమార్ చెప్పినట్లే జరిగింది. గత్యంతరంలేక ఆ సంపన్నుడు రాంకుమార్‌కు మర్యాదతో వీడ్కోలిచ్చాడు.
16. రాంకుమార్ భార్యను గురించిన ఒక సంఘటన
ఒకప్పుడు రాంకుమార్ తన భార్య భవిష్యత్తు చూసి, విచారకరంగా జోస్యం చెప్పాడు. తదనంతరం ఆ జోస్యం నిజమైంది. అతడి భార్య శుభలక్షణ సంపన్నురాలని విన్నాం. రాంకుమార్ వివాహం బహుశా 1820 వ సం ॥ లో జరిగి ఉంటుంది. అతడి ఏడేళ్ళ బాలికాపత్ని ఏ ముహూర్తంలో ఆ ఇంట్లో అడుగిడిందో ఆనాటి నుంచీ అతడి భాగ్యచక్రం పైకి తిరుగసాగింది. కారణం: మేదినీపూర్‌లో వుంటున్ని క్షుదిరాం మేనల్లుడు రాంచంద్ర వందోపాధ్యాయ్ ఆ సమయం నుంచే ప్రతి నెలా ఆ కుటుంబానికి సహాయం చేయసాగాడు. స్త్రీ గాని, పురుషుడుగాని అడుగిడిన నాటి నుంచి ఏ కుటుంబంలో ఆ విధంగా అదృష్టం కలుగుతుందో అలాంటి వ్యక్తిని ఆ హిందూకుటుంబాలలో అపార ప్రేమ గౌరవాలతో చూస్తారనే విషయం అందరూ ఎరిగినదే. పైగా రాంకుమార్ బాలికాపత్ని అప్పటికి ఆ కుటుంబంలోని ఒక్కగానొక్క కోడలు కనుక ఆమె ఇంటిల్లిపాది ప్రేమ ఆదరణలకు పాత్రురాలు కావటంలో ఆశ్చర్యం లేదు. ఎన్నో సుగుణాలు ఆమెలో ఉన్నప్పటికీ తనపట్ల చూపుతున్న ఈ అతి ఆదరాభిమానాల ఫలితంగా ఆమెలో గర్వం, మంకుతనం పుట్టాయని మేం విన్నాం. ఈ లోపాలు ఆమెలో గమనించినా వాటి గురించి ఆమెతో ప్రస్తావించటం గాని, వాటిని సరిదిద్దటానికి ప్రయత్నంగాని చేయటానికి ఎవ్వరూ సాహసించలేదట. ఎందుకంటే ఈ స్వల్ప లోపాలు ఆమెలో కనిపిస్తున్నా, ఆమె వచ్చిన నాటినుంచే గదా తమ కుటుంబంలో ఈ అభివృద్ధి కలగటం – అని అందరూ సరిపెట్టుకున్నారు.
కాని ఆమె పెరిగి యౌవనంలో అడుగుపెట్టాక రాంకుమార్ ఒకరోజు ఆమెను చూసి, “శుభలక్షణవతి అయినప్పటికీ మొదటి కాన్పుతోనే ఆమె మరణిస్తుంది” అంటూ భవిష్యద్వాణి పలికాడు. ఆ తరువాత అనేక సంవత్సరాలు గడిచినా ఆమె గర్భం ధరించక పోవటంతో బహుశా ఆమె వంధ్యురాలు అనుకొని, రాంకుమార్ నిశ్చింత మనస్కుడయ్యాడు. కాని తన ముప్ఫై ఐదవ ఏట, బహుశా 1848 వ సం ॥ లో ఆమె గర్భం ధరించి, మరుసటి సంవత్సరం 1849 లో ఒక పండంటి పుత్రుణ్ణి కని మరణించింది. ఆ పిల్లవాడికి అక్షయ్ అని నామకరణం చేశారు. ఈ సంఘటన కాలక్రమాన సుదీర్ఘకాలం తర్వాత జరిగినప్పటికీ పాఠకుల అనుకూలత కోసం ఇక్కడ చెప్పటం జరిగింది.
17. క్షుదిరామ్ కుటుంబంలోని విలక్షణ అంశం
క్షుదిరాముడి సదాచార కుటుంబంలోని ప్రతి ఒక్కరిలోనూ ఒక అసాధారణ విలక్షణత కనిపిస్తుంది. సూక్ష్మమైన ఆధ్యాత్మిక శక్తే అది. బహుశా ఈ శక్తి క్షుదిరామ్, చంద్రాదేవిలలో అధికంగా అభివ్యక్తం కావటంవల్ల కాబోలు వారసత్వంగా వారి పిల్లలందరి లోను చోటుచేసుకొన్నది. క్షుదిరాముడి ఆధ్యాత్మిక శక్తికి తార్కాణాలుగా కొన్ని సంఘటనల గురించి ప్రస్తావించటం జరిగింది. ఇప్పుడు చంద్రాదేవిని గురించి అలాంటి ఒకానొక సంఘటన తెలుపుతున్నాం. భర్తలా చంద్రాదేవిలోనూ అప్పుడప్పుడు దివ్యదర్శనాలను అవలోకించే శక్తి ఉన్నదని ఇందు మూలంగా స్పష్టమవుతుంది. ఈ సంఘటన రాంకుమార్ వివాహానికి కాస్తముందు జరిగింది. పదిహేనేళ్ళ రాంకుమార్ అప్పుడు సంస్కృత పాఠశాలలో చదువుకొంటూ, అదే సమయంలో కొందరి ఇళ్ళలో పూజాది కర్మలను చేస్తూ, కుటుంబ పోషణలో చేదోడువాదోడుగా ఉండేవాడు.
18. చంద్రాదేవి దివ్య దర్శనం
ఒకసారి ఆశ్వయుజ మాసంలో ‘కొజాగౌరి లక్ష్మీ’ పూజ చేయటానికి భూర్సుబో గ్రామానికి రాంకుమార్ వెళ్ళాడు. అర్ధరాత్రి అయినా అతడు తిరిగి రాకపోవటంతో చంద్రాదేవి ఎంతో ఆందోళన చెంది ఇంటి బయటకు వచ్చి అతడి కోసం ఆతురతతో నిరీక్షించసాగింది. అతడు రావలసిన దిశ కేసే చూస్తూన్న చంద్రాదేవి కాసేపయ్యాక భూర్సుబో నుంచి కామార్పుకూర్ దారినే పొలం పక్కనుంచి ఎవరో ఒక వ్యక్తి తన వైపు రావటం గమనించింది. ఆ వ్యక్తిని రాంకుమార్ గానే భావించి అతణ్ణి కలుసుకోవటం కోసం ఆనందంతో కాస్తదూరం ముందుకు వెళ్ళింది. కాని ఆ వ్యక్తి దగ్గరికి రాగానే రాంకుమార్ కాదని గ్రహించింది. పరమ సౌందర్యవతి అయిన ఒక యువతి వివిధరకాల ఆభరణాలను ధరించి, ఒంటరిగా తనవైపు రావటం చూసింది. గౌరవనీయురాలైన ఒక అందమైన యువతి, అర్ధరాత్రి వేళ ఇలా ఒంటరిగా నడిచి రావటం – తన కుమారుడికి ఏదైనా కీడు వాటిల్లిందేమో అనే భయం ఆవరించిన చంద్రాదేవి మనస్సులో – విచిత్రంగా కూడా తోచలేదు. ఆమె వద్దకెళ్ళి, “అమ్మా! నువ్వు ఎక్కడ నుంచి వస్తున్నావు?” అని అడిగింది. ఆ యువతి “భూర్సుబో నుంచి” అని జవాబు చెప్పింది. ఆతురతతో మళ్ళీ చంద్రాదేవి, “నా కుమారుడు రాంకుమార్‌ని నువ్వు చూశావా? అతడు తిరిగివస్తున్నాడా?” అంటూ అడిగింది. అపరిచితురాలైన ఒక యువతి తన కుమారుణ్ణి ఎలా ఎరిగి ఉంటుందనే ఆలోచన ఆమె మనస్సులో క్షణమైనా కలగలేదు. కాని ఆమెను అనునయిస్తూ ఆ యువతి ఇలా అంది: “అవునమ్మా! నీ కుమారుడు పూజ చేయటానికి ఏ ఇంటికి వెళ్ళాడో ఆ ఇంటి నుంచే నేను వస్తున్నాను. భయం లేదు. అతడు త్వరలోనే తిరిగి వస్తాడు.” ఆ మాటలు విన్నాక చంద్రాదేవి మనస్సు ఊరట చెందింది. ఇతర విషయాలను యోచించ గలిగింది. నూతన వస్త్రాలనూ అమూల్యమైన ఆభరణాలను అలంకరించుకొని సుమధుర కంఠంతో మాట్లాడుతున్న ఆ అసమాన రూపవతిని అప్పుడు గమనించి ఇలా అడిగింది చంద్రాదేవి: “అమ్మా! యౌవనంలో ఉన్నదానివి, అమూల్యమైన ఆభరణాదులను ధరించి ఇంత రాత్రి సమయంలో ఎక్కడికి పోతున్నావు? నీ చెవులకున్న ఆ వింత ఆభరణం ఏమిటమ్మా?” చిరునవ్వుతో ఆ యువతి, “వాటి పేరు కుండలాలు” అంటూ, మళ్ళీ, “నే నింకా చాలాదూరం పోవాలి” అంది. పాపం ఆ యువతి ఏదో పెద్ద కష్టంలో ఉందేమో అనుకొని చంద్రాదేవి “పదమ్మా ఈ రాత్రికి మా ఇంట్లో విశ్రమించి, రేపు తీరికగా బయలుదేరుదువు గాని” అని ఉట్టిపడే అనురాగంతో అంది. కాని ఆ యువతి, “లేదమ్మా! నే నిప్పుడే వెళ్ళాలి. ఇంకెప్పుడైనా మీ ఇంటికి వస్తాను” అంటూ, చంద్రాదేవి నుంచి సెలవు పుచ్చుకొని, సమీపంలోని లాహాబాబుల ధాన్యపు కుప్పల వైపుగా వెళ్ళిపోయింది. దారి వీడి లాహాల ఇంటివైపు ఆమె వెళ్ళటం చూసి చంద్రాదేవి ఆశ్చర్యపోయింది. పాపం దారితప్పిందేమో అనుకొని గబగబ అటుకేసి వెళ్ళి నాలుగు వైపులా ఆమె కోసం వెతికింది, కాని ఆ యువతి కనిపించలేదు. తదనంతరం ఆ యువతి మాటలన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకొంటున్నప్పుడు హఠాత్తుగా చంద్రాదేవికి స్ఫురించింది, ‘తనకు సాక్షాత్తు లక్ష్మీదేవి దర్శనమే అయిందా!’ అని. వెంటనే కంపిత హృదయంతో భర్త వద్ద కెళ్ళి జరిగింది యావత్తూ పూసగుచ్చినట్లు వివరించింది. క్షుదిరామ్ ఆ ఉదంతం విని “అనుగ్రహంతో లక్ష్మీదేవి నీకు దర్శనం ఇచ్చింది” అంటూ ఆమె నమ్మకాన్ని బలపరచాడు. ఇది జరిగిన కాసేపటికి రాంకుమార్ ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగినదంతా విని అతడూ నిశ్చేష్టుడయ్యాడు.
19. క్షుదిరామ్ గయా తీర్థయాత్ర ఆకాంక్ష
కాలం క్రమంగా గడుస్తూ 1835 వ సంవత్సరం వచ్చింది. క్షుదిరామ్ జీవితంలో ఈ సమయంలో ఒక విశేష సంఘటన జరిగింది. మళ్ళీ అతడి మనస్సులో తీర్థయాత్రలు చేసి రావాలనే ప్రగాఢ ఆకాంక్ష కలిగింది. పితృపురుషుల శ్రేయస్సుకై అతడు ఈమారు గయా తీర్థానికి వెళ్ళి, పిండాది కర్మలను ఆచరించి రావాలని నిశ్చయించుకొన్నాడు. అరవై ఏళ్ళ వయస్సు పైబడ్డా కాలినడకనే పోవటానికి అతడు వెనుకాడలేదు. గయాక్షేత్రానికి వెళ్ళిరావాలనే అతడి ఈ నిశ్చయానికి వెనుక ఒక అద్భుత ఉదంతం ఉన్నదని హేమాంగినీదేవి కుమారుడైన హృదయరాం ముఖోపాధ్యాయ మాతో చెప్పాడు.
1835 వ సం ॥ మార్చిలో క్షుదిరామ్ దర్శించుకున్న గయలోని విష్ణ్వాలయం
గర్భగుడిలో వెలసిన విష్ణు పాదపద్మములు
20 దీని గురించి హృదయరాం కథనం
తన కుమార్తె కాత్యాయని తీవ్రరోగగ్రస్థురాలై ఉన్నదన్న వార్త వినగానే క్షుదిరాం ఆమెను చూసిరావటానికి అనూర్ వెళ్ళాడు. అప్పుడామె వయస్సు సుమారు పాతికేళ్ళు. ఆమె ప్రవర్తన, మాటతీరు పరికించగానే ఆమెను ఏదో దయ్యం ఆవహించిందని రూఢిచేసుకొన్నాడు క్షుదిరాం. అతడు భగవంతుడి మీద మనస్సును లగ్నం చేసి తన కుమార్తెను ఆవహించిన దయ్యాన్ని ఉద్దేశించి, “నువ్వు దేవతవో, దయ్యానివో ఎవరివైనా కావచ్చు. నా కుమార్తెను ఎందుకు కష్టపెడుతున్నావు? తక్షణం ఆమెను విడిచి వెళ్ళిపో” అంటూ పలికాడు. ఆ పలుకులకు ఆ భూతం భీతిల్లి, ప్రాధేయ పూర్వకంగా కాత్యాయని ముఖతా, “గయాతీర్థంలో నా కోసం పిండదానం చేసి నన్నీ దుర్భర స్థితి నుంచి ఉద్ధరిస్తానని మీరు వాగ్దానం చేస్తే తక్షణమే మీ కుమార్తెను విడిచిపోతాను. ఆ కార్యం నిమిత్తం మీరు ఇంటి నుంచి బయలుదేరిన మరుక్షణమే అన్ని ఇక్కట్ల నుంచీ ఆమె విముక్తురాలు కాగలదని నేను దృఢప్రతిజ్ఞ చేస్తున్నాను” అంది.
ఆ జీవుడి (దయ్యం) దుఃస్థితి క్షుదిరాం మనస్సును కదిలించివేయగా అతడిలా అన్నాడు: “నేను సాధ్యమైనంత త్వరలోనే గయా క్షేత్రానికి వెళ్ళి నీ కోరికను నెరవేరుస్తాను. అయినా పిండదానం చేశాక రూఢిగా నువ్వు ఉద్ధరించ బడ్డావని నాకు తెలిస్తే ఎంతో సంతోషిస్తాను.” అందుకు ఆ దయ్యం “అందుకు పూచీ నాది. నేను ఉద్ధరించబడ్డానని నిదర్శనంగా ఎదుటవున్న వేపచెట్టు కొమ్మల్లో అతిపెద్దదాన్ని విరగగొట్టిపోతాను” అన్నది. ఈ ఉదంతమే హృదయరాం కథనం ప్రకారం క్షుదిరాం గయకు వెళ్ళటానికి కారణం. ఇది జరిగిన కొద్దికాలానికే నిజంగానే ఆ వేపచెట్టు కొమ్మ హఠాత్తుగా విరిగిపోవటంతో ఆ దయ్యం ఉద్ధరించబడిందని అంతా విశ్వసించారు. కాత్యాయనికి కూడ ఆ పీడ తొలగిపోయింది. హృదయరాం కథనంలోని సత్యాన్ని రూఢిపరచలేం. కాని ఈ సమయంలో క్షుదిరాం గయాతీర్థాన్ని సందర్శించి రావటం మాత్రం ముమ్మాటికీ నిజం.
21. గయలో క్షుదిరామ్ గాంచిన దివ్యస్వప్నం
1835 వ సం ॥ శీతకాలంలో క్షుదిరామ్ కాశీ* , గయా క్షేత్రాల్ని సందర్శించటానికి వెళ్ళాడు. మొదట కాశీ విశ్వనాథుణ్ణి సేవించుకొని అతడు గయా క్షేత్రాన్ని చేరుకొనేటప్పటికి చైత్ర (మార్చి) మాసం ఆరంభమైంది. ఈ పుణ్యక్షేత్రంలో వసంతఋతువులో చేయబడిన పిండప్రదానం పితృదేవత లందరికీ అక్షయమైన పరితృప్తిని కలిగిస్తుందనే శాస్త్రోక్తి అతడికి తెలుసు. అందుకే కాబోలు ఈ నెలలో అతడు రావటం! దాదాపు ఒక నెల రోజులు క్షుదిరాం అక్కడ బసచేసి, ఆ క్షేత్రంలో చేయవలసిన కర్మకాండలన్నిటినీ చక్కగా ఆచరించి, చివరకు క్షేత్రాధిపతి అయిన గదాధరుడి (విష్ణువు) శ్రీ పాదపద్మాల వద్ద పిండ ప్రదానం చేశాడు. ఇలా శాస్త్రోక్తంగా పితృ కార్యాలనన్నిటిని యథావిధిగా నిర్వర్తించిన క్షుదిరామ్ శ్రద్ధాభరిత హృదయం ఆనాడు ఎంత తృప్తితో, శాంతితో పొంగిపోయిందో వర్ణనాతీతం. తన శక్తి మేరకు పితృఋణాన్నిలా తీర్చుకొని అతడు నిశ్చల మనస్కుడైనాడు. అంతేగాక భగవంతుడు తనవంటి అల్పుడికి ఇటువంటి ఘనకార్యం నిర్వర్తించగలిగే సదవకాశం కలిగించాడనే భావనతో కృతజ్ఞతతో క్షుదిరాం హృదయం మునుపు ఎన్నడూ పొందని వినమ్రత, ప్రేమతో పొంగి పొర్లింది. పగటివేళే కాక రాత్రి నిదురించే సమయంలోకూడ అతడి మనస్సు శాంత్యానందాలతో నిండి ఉంది.
నాటి రాత్రి నిద్రించిన కొన్ని క్షణాల్లో అతడొక దివ్యస్వప్నం గాంచాడు. స్వప్నంలో అతడు పవిత్ర దేవాలయంలో గదాధరుడి శ్రీపాదపద్మాల వద్ద పితృపురుషులందరికీ పిండ ప్రదానం చేస్తూండగా, వారందరూ దివ్యజ్యోతిర్మయ దేహాలను దాల్చి ఆ పిండాలను మహా సంతోషంతో స్వీకరిస్తూ, మనసారా ఆతణ్ణి ఆశీర్వదిస్తూ ఉన్నారు. సుదీర్ఘకాలం పిమ్మట మళ్ళీ వారి దర్శనాన్ని పొందిన క్షుదిరాం ఉద్విగ్నుడైనాడు. సజల నేత్రాలతో, భక్తి పొంగిపొరలే హృదయంతో వారి పాదాలను తాకి ప్రణామం చేయసాగాడు. మరుక్షణం మళ్ళీ చూసేసరికి ఆలయం యావత్తు తానెన్నడూ చూడని ఒక దివ్యమయ కాంతితో నిండిపోయింది. అతడి పితృదేవత లందరూ గౌరవప్రపత్తులతో లేచి ముకుళిత హస్తాలతో రెండు వైపులా నిలబడి ఆలయం మధ్యలో అద్భుతమైన ఒక సింహాసనం మీద సుఖాసీనుడై ఉన్న ఒక దివ్యపురుషుణ్ణి ఆరాధించసాగారు. నవ దూర్వాదళ శ్యాముడూ, జ్యోతిర్మయదేహం కలవాడూ అయిన ఆ పురుషుడు స్నిగ్ధమధుర ప్రసన్న దృష్టితో తన వైపే చూస్తూ, చిరునవ్వుతో తనను దగ్గరగా రావలసిందిగా సూచిస్తూన్నట్లు క్షుదిరాం చూశాడు. మంత్రముగ్ధుడిలా ఆ దివ్యపురుషుణ్ణి సమీపించి, భక్తివిహ్వల హృదయుడై సాష్టాంగ ప్రణామం చేసి, హృదయోద్వేగంతో ఆ మూర్తిని స్తుతించసాగాడు. ఆ దివ్యమూర్తి అతడి భక్తికి పరవశించి వీణ మీటినట్లున్న కంఠస్వరంతో అతడితో ఇలా పలికాడు: “క్షుదిరామ్! నీ అపూర్వ భక్తికి నేను ప్రసన్నుడనయ్యాను. నీ కుమారుడిగా అవతరించి, నీ సేవానురాగాలను అందుకోగలను.” కలలోనైనా ఊహించలేనట్టి ఆ మాటలను ఆలకించి క్షుదిరామ్ హృదయం పట్టరాని ఆనందంతో పొంగిపోయింది. కాని మరుక్షణంలోనే తన పేదరికాన్ని గుర్తు తెచ్చుకొని, తాను ఆయన ఆలనాపాలనా ఎలా చూడగలడు? అనే ఆలోచన అతణ్ణి విషాదంలో ముంచగా, సజల నేత్రాలతో, బాధతో ఇలా అన్నాడు: “వద్దు ప్రభూ! వద్దు! అటువంటి మహద్భాగ్యానికి నేను తగను. కృపాకటాక్షంతో నువ్వు సాక్షాత్కరించటమే కాక నా పుత్రుడిగా అవతరిస్తానన్న కోరికను వ్యక్తపరచటమే నాకు పదివేలు. నిజంగా నువ్వు నా కుమారుడివై జన్మిస్తే నిరుపేదనైన నేను నిన్నెలా సేవించు కోగలను?” అప్పుడు ఆ దివ్యమూర్తి కరుణరసం తొణికిసలాడే క్షుదిరామ్ పలుకులు ఆలకించి, ఇనుమడించిన ప్రసన్నతతో ఇలా పలికాడు: “భయపడకు క్షుదిరామ్! నువ్వు ఏమిస్తావో దానినే ప్రీతితో స్వీకరిస్తాను. నా ఆకాంక్ష మాత్రం నెరవేర్చు.” క్షుదిరాం హృదయం ‘వద్దు’ అనలేకపోయింది. ఆనందం, దుఃఖం – పరస్పర విరుద్ధమైన ఈ భావోద్వేగాలు ఏకకాలంలో ఉవ్వెత్తున చెలరేగగా, అతడు వాటి ధాటికి తట్టుకోలేక, స్పృహకోల్పోయాడు. ఆ సమయంలో అతడి కల చెదిరిపోయింది.
22. క్షుదిరామ్ కామార్పుకూర్కు తిరిగి రావటం
మేలుకొన్న పిదప చాలాసేపటి వరకు తానెక్కడున్నాడో క్షుదిరామ్ తెలుసు కోలేకపోయాడు. తన స్వప్నం యొక్క వాస్తవికత అతణ్ణి పూర్తిగా వివశుణ్ణి చేసింది. క్రమంగా జాగ్రదావస్థకు వచ్చాక, లేచి కూర్చుని, ఆ వింత స్వప్నాన్ని జ్ఞాపకానికి తెచ్చుకొంటూ, దాన్ని గురించి విభిన్న కోణాలలో వితర్కించుకోసాగాడు. చివరికి అతడి విశ్వాసపూరిత హృదయం – ఆ దివ్యస్వప్నం నిజమై తీరుతుందనీ, తప్పకుండా ఎవరో ఒక మహాపురుషుడు తన ఇంట త్వరలో జన్మించనున్నాడనీ, వృద్ధాప్యంలో మళ్ళీ తనకు నూతన పుత్రుడి ముఖారవిందాన్ని చూసే అదృష్టం పట్టిందనీ – ఒక దృఢనిశ్చయానికి వచ్చింది. ఈ అద్భుత స్వప్నం నిజమయ్యేదాకా దీన్ని గురించి ఎవరికీ చెప్పకూడదని అతడు నిర్ణయించుకొన్నాడు. మరికొన్ని రోజుల తరువాత గయా క్షేత్రానికి వీడ్కోలు చెప్పి, కామార్పుకూర్కు 1835 వ సం ॥ ఏప్రిల్ నెలలో క్షుదిరామ్ తిరిగి వచ్చాడు.