1. భారతదేశ జీవిత కేంద్రంగా ఆధ్యాత్మికత
భారతదేశ, ఇతర దేశాల ఆధ్యాత్మిక ఆదర్శాలను, సంప్రదాయాలను తులనాత్మకంగా అధ్యయనం చేసినప్పుడు వాటి మధ్య విస్తారమైన వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. భారతదేశం అతిప్రాచీన కాలం నుంచే భగవంతుడు, ఆత్మ, పారలౌకికత మొదలైన ఇంద్రియాతీత, ఆధ్యాత్మిక విషయాలనే పరమసత్యాలుగా స్వీకరించింది. వాటి ప్రత్యక్ష అనుభూతికై సకల ప్రయత్నాలు చేసింది; తత్ఫలితంగా సంతరించుకొన్న అనుభూతి లేక ప్రత్యక్ష జ్ఞానాన్ని జాతీయ, వ్యక్తిగత జీవనం యొక్క పరమ పురుషార్థంగా చేసుకొన్నది. కాబట్టే దాని కార్యకలాపాలన్నీ తదనుగుణంగా యుగాల పర్యంతం అపూర్వ ఆధ్యాత్మికతతో విరాజిల్లాయి.
2. భారతదేశంలో తరచు మహాపురుషుల ఆవిర్భావమే అందుకు కారణం
ఇంద్రియాతీత విషయాలపట్ల ఉత్కంఠజనిత ఆసక్తి కలగడానికి మూలం ఏమిటని ఆలోచిస్తే దివ్యగుణాన్వితులై, భగవత్సాక్షాత్కారం పొందిన మహాపురుషులు తరచు భారతావనిలో జన్మించడమేనని నిశ్చయంగా తెలియవస్తుంది. వీరి అసాధారణ దివ్యదర్శనాలు, అనుపమాన శక్తి, అభివ్యక్తీకరణలు సదా తిలకిస్తూ వాటి గురించి చర్చిస్తూ ఉండటం వల్లనే ఆ విషయాలపట్ల ప్రగాఢ విశ్వాసం, ఆకర్షణ జనించాయి. ఈ విధంగా ప్రాచీన కాలం నుంచే ఆధ్యాత్మికత అనే అతిగట్టి పునాదిపై స్థిరంగా జాతీయ జీవనం నెలకొల్పబడింది; తన దృక్కులను గమ్యంపై స్థిరంగా నిలిపి, అనుపమాన సంప్రదాయ రివాజులతో కూడిన ఒక సమాజాన్ని రూపొందించింది; ఈ సమాజం తన సభ్యుల, సహజ అభిరుచులకు, గుణాలకు తదనుగుణంగా దైనందిన కర్మాచరణం మూలంగా చరమ లక్ష్యమైన భగవత్ సాక్షాత్కారం పొందడానికి దోహదం చేసింది. ఈ నియమ నిబంధనలు తరతరాలుగా పాటింపబడుతూ రావటం వలన ఈనాటికీ భారతదేశంలో ఆధ్యాత్మిక భావాలు సజీవంగా నిలిచివున్నాయి. పర్యవసానంగా తపస్సు, సంయమం, తీవ్ర వ్యాకులతల ద్వారా జగత్కారకుడైన ఆ భగవంతుని దర్శనం పొంది, శాశ్వతంగా ఆయనలో ఐక్యం చెందగలమని నేటికీ స్త్రీ, పురుషులు యావన్మంది ప్రగాఢ విశ్వాసం కలిగి ఉన్నారు.
3. భారతదేశంలో మతం భగవదనుభూతిపై స్థాపితమైంది : అందుకు ప్రమాణం
ఋషి, ఆప్తుడు, అధికారి, ప్రకృతి లీనపురుషుడు ఇత్యాది పేర్ల, పదాల ప్రాధాన్యాన్ని పరికిస్తే భారతదేశంలో మతం, భగవత్సాక్షాత్కార ప్రాతిపదికపై ప్రతిష్ఠితమై ఉన్నట్లు స్పష్టమౌతుంది. మతాన్ని తిరిగి స్థాపింప అరుదెంచిన ఆచార్య వర్యులను వర్ణించడానికి ఈ పేర్లు వేదకాలం నుండి ఉపయోగిస్తూ వచ్చారు. ఇంద్రియాతీతమైన ప్రత్యక్ష జ్ఞానం మూలంగా సంతరించుకొన్న తమ అనుపమాన శక్తులను నిరూపించినందున వారిని ఈ పేర్లతో పేర్కొన్నారనడం నిస్సందేహం. వేదకాలం నాటి ఋషుల నుండి, పురాణకాలంనాటి అవతారపురుషుల వరకు ప్రతి ఒక్కరి పట్ల ఇది అక్షర సత్యం.
4. దివ్యావతార భావన వికాసం
వేదకాలంలోని ఋషియే కాలక్రమేణ పురాణ కాలంనాటి భగవదవతారంగా పరిగణింపబడ్డాడనే విషయం అవగాహన చేసుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. కొందరు మహాపురుషులకు అతీంద్రియ సత్యాలను దర్శించగల శక్తి ఉన్నదని వేదకాలంనాటి మనిషి అర్థం చేసుకొన్నాడు; కాని ఆ శక్తులలో తారతమ్యం ఉందనే విషయం అతడు తెలుసుకోలేక పోయాడు. పర్యవసానంగా వారినందరినీ ‘ఋషు’ లని పేర్కొని సంతృప్తి చెందాడు. కాలక్రమాన అతడి బుద్ధి, వివేచనాశక్తి కుశాగ్రమయ్యేకొద్దీ, ఋషులందరూ సమానమైన శక్తి కలిగినవారు కారనీ, ఆధ్యాత్మిక జగత్తులో వారిలో కొందరు సూర్యునిలా, ఇంకా కొందరు చంద్రునిలా, కొందరు నక్షత్రాలలా, మరి కొందరు సాధారణమైన మిణుగురు పురుగుల్లా ప్రకాశించేవారని అర్థం చేసుకొన్నాడు. అప్పుడతడు ఆ ఋషులను వర్గీకరించసాగాడు; అలా వర్గీకరిస్తూ ఉన్నప్పుడు ఆ ఋషులలో కొందరు ఆధ్యాత్మిక సత్యాలను అభివ్యక్తం చేసే విశిష్ట శక్తిని సంతరించుకొని ఉన్నారని కనుగొన్నాడు. భగవంతుని అస్తిత్వాన్ని విశ్వసించని సాంఖ్యదర్శన స్థాపకుడైన కపిలాచార్యుడు కూడ ఈ అధికారిక పురుషుల ఉనికిని గురించి సంశయించలేదు; ఎందుకంటే ప్రత్యక్షంగా కానవస్తున్న దాన్ని ఎవరు మాత్రం సంశయించగలరు? తదనుసారం కపిలాచార్యుడు, ఆయన అనుయాయులు తమ రచనలలో ఈ ‘ఆధికారిక పురుషులను’, ‘ప్రకృతి లీన పురుషుల’ క్రింద జమకట్టారు. అసాధారణ శక్తిమంతులైన ఈ పురుషుల ఆగమన కారణం తెలుసుకోబోయి సాంఖ్యులు యీ నిర్ణయానికి వచ్చారు: పవిత్రత, సంయమం ఇత్యాది సద్గుణాలతో శోభిల్లిన వీరు అనంత జ్ఞానప్రాప్తికి అర్హులైనప్పటికీ లోకానికి హితం చేయాలనే తీవ్ర ఆకాంక్ష వారిని అనంత మహిమాన్వితమైన తమ స్వస్వరూపంలో తక్షణం లీనం కాకుండా చేసింది. ఆ బలీయమైన కోర్కె వలన వారు ప్రకృతితో ఒకటై, ప్రకృతి శక్తులను తమవిగా తెలుసుకొన్నారు.
ఈ రీతిలో అనంతజ్ఞానం మొదలైన షడైశ్వర్యాలను సంతరించుకొని ఒక కల్పం వరకు నానారీతుల లోకకల్యాణ కార్యాలు ఒనరిస్తూ, చివరకు తమ స్వస్వరూపంలో తాదాత్మ్యం చెందుతారు.
5. భక్తి యుగంలో సాకార దైవం
సాంఖ్యాచార్యులు మళ్ళీ ప్రకృతి లీన పురుషులను, వారి శక్తి తారతమ్యానుగుణంగా రెండు తరగతులుగా వర్గీకరించారు: 1. కల్పనియామక ఈశ్వరుడు (ఒక కల్పం యొక్క పాలకుడు). 2.ఈశ్వరకోటి. దార్శనిక యుగం తదుపరి భగవంతుని పట్ల విశేష భక్తి వికాసం చెందిన భక్తియుగం ప్రారంభమైంది. ఈ సమయంలో ముంచెత్తివేసే వేదాంత ఉపదేశాల ప్రభావ ఫలితంగా యావన్మంది యొక్క సమష్టి స్వరూపుడు, మహద్వ్యక్తిత్వం గల ఈశ్వరుని పట్ల జనులు ప్రగాఢ విశ్వాసం కలిగిన వారయ్యారు. అనన్య భక్తి సహకారంతో భగవంతుని ఉపాసించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానం, యోగం కూడ పొందగలమనే శ్రద్ధ వారిలో జనించింది. కనుక సాంఖ్యదర్శనంలో వర్ణింపబడ్డ ‘ఈశ్వరుని’ అప్పుడు నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడైన ఈశ్వరుని అంశంగా లేదా ఆయన పూర్ణావతారంగా పరిగణించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఈ విధంగా పౌరాణిక యుగంలో అవతారపురుషుల పట్ల విశ్వాసం జనించింది. అంతేకాక వైదిక యుగంలోని అనుపమాన, అసాధారణ లక్షణాలు గల ఋషులు ఇప్పుడు ‘అవతారాలుగా’ గుర్తింప బడసాగారు. కనుక అతిలోక సామాన్యమైన ఆధ్యాత్మిక శక్తితో అరుదెంచిన ఈ మహాపురుషుల దర్శన ఫలితంగా జనులు క్రమంగా ఈశ్వరావతారాలలో విశ్వాసం పొందసాగారు. ఈ మహాపురుషుల అతీంద్రియ దివ్యదర్శనాలు, దివ్యానుభూతులు అనే పునాది మీదనే భారతీయ ధర్మమనే మహాభవనం సుప్రతిష్ఠితమై మంచుకప్పిన హిమగిరిలా ఎదిగి గగనసీమను చేరింది. ఈ మహాపురుషులు మానవజీవిత పరమగమ్యం చేరడం చూసి భారతీయులు వారిని ‘ఆప్తు’ లని పిలవసాగారు. ఉత్కృష్ట ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వ్యక్తీకరించే వీరి వచనాలే వేదాలుగా పేర్కొనబడ్డాయి.
6. అవతారాల పట్ల విశ్వాసం కలగడానికి గురుపూజ మరో కారణం
కొంతమంది ఋషులను అవతార పురుషులుగా అంగీకరించడానికి మరో కారణం గురుపూజ. వేద, ఉపనిషత్తుల కాలం నుండి భారతీయులు జ్ఞానప్రదాయకుడైన గురువును విశేష భక్తిశ్రద్ధలతో పూజిస్తూ వచ్చారు. ధ్యానంతో మిళితమైన ఈ గురుపూజా ఫలితంగా కాలక్రమేణా జనులు భగవంతుని అతీంద్రియ దివ్యశక్తిలో అభివ్యక్తం కానంత వరకూ ఏ మానవమాత్రుడూ గురువు కాజాలడని గ్రహించారు. మొట్టమొదట జనులు గురువును విశిష్ట గుణాన్వితుడైన ఒక విభిన్న మానవునిగా భావించి, పూజిస్తూ వచ్చారు. కాని స్వార్థపరుడైన ఒక సామాన్యునితో పోల్చి చూసినప్పుడు నిజమైన గురువు స్వార్థరహితంగా, పరమకృపాపూర్ణుడై లోకానికి హితం చేకూర్చడం గమనించారు. తదనంతరం వారి శ్రద్ధ, గౌరవం, భక్తి పెంపొందే కొద్దీ గురువులో వారు భగవత్ శక్తి అభివ్యక్తమై పనిచేయడం ప్రత్యక్షంగా గ్రహించారు. గురువులో భగవదావిర్భవాన్ని విశ్వసించారు. “రుద్ర యత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం” (భగవాన్! నీ కృపాదృష్టి మాపై సర్వదా ఉండి రక్షించును గాక!) అని దీర్ఘకాలం తాము చేసిన ప్రార్థన ఇప్పుడు ఫలించిందనీ, భగవత్కృప గురుశక్తి రూపంలో మూర్తిమంతమై ఇప్పుడు తమ ఎదుట ప్రత్యక్షమైనదని వారు గ్రహించసాగారు.
7. వేదజ్ఞానం, సమాధి అనుభూతి ఆధారంపై అవతార వాదం నెలకొల్పబడింది
గురువును ఈ విధంగా పూజించడంలో పురోగమించిన మనిషి, ఎవరిని ఆశ్రయించి భగవచ్ఛక్తి యొక్క విశేష లీల వ్యక్తమౌతుందో ఆ గురువును జ్ఞాన దాయకుడైన దక్షిణామూర్తిగా గుర్తించడంలో ఇక జాప్యం చేయలేదు. ఈ విధమైన ఆచార్యో పాసన కాలక్రమాన అవతారవాదాన్ని పటిష్ఠం చేసింది. ఇదివరకే చెప్పినట్లు అవతారవాదం నిజానికి పురాణ కాలం నాటిదే అయినప్పటికీ ఆ భావన వేదకాలంలోనే ఆవిర్భవించింది. వైదిక, ఉపనిషదిక, దార్శనిక యుగాలలో మానవుడు ఈశ్వరుని యొక్క గుణాలను, కర్మలను, స్వరూపాన్ని గురించి పొందిన అనుభవజ్ఞానమే పౌరాణిక యుగంలో క్రమంగా మరింత స్పష్టమైన ఆకృతిని సంతరించుకొని అవతారవాదం పట్ల విశ్వాసరూపంగా అభివ్యక్తమైంది. మనిషి ఉపనిషత్తుల కాలంలో సంయమం, తపస్సు ఇత్యాదుల సహాయంతో ‘నేతి, నేతి’ (ఇది కాదు, ఇది కాదు) మార్గంలో సఫలుడై నిర్వికల్ప సమాధి అనుభవాన్ని పొంది, మళ్ళీ విలోమ మార్గాన్ని అనుసరించి క్రిందికి దిగివచ్చిన పిదప అతడు యావత్తు జగత్తును ఆ నిర్గుణబ్రహ్మం యొక్క ప్రత్యక్ష అభివ్యక్తీకరణగా గాంచసాగాడు. తదనంతరమే అతడు సగుణ బ్రహ్మను లేదా ఈశ్వరుని అపార భక్తితో ఉపాసించసాగాడు. ఆ ఈశ్వరుని గుణ కర్మ స్వభావాలను గురించి ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చాడు; ఆయన విశేష రూపంలో అవతరించే సంభావ్యత ఉన్నదని విశ్వసించాడు.
8. భగవదనుగ్రహ అనుభూతి – అవతారవాద పరివ్యాప్తి
భగవంతుడు అవతరిస్తాడనే విశ్వాసం పౌరాణిక యుగంలో విశేషంగా అభివృద్ధి చెందింది. ఆ యుగంలో ఆధ్యాత్మిక వికాసంలో అనేక లోపాలు చోటుచేసుకున్నప్పటికీ, అవతారం యొక్క మహిమ పట్ల కనబరచిన విశ్వాసమే ఆ యుగానికి ఘనతను చేకూర్చింది. భగవదవతార ఉనికి పట్ల కలిగిన ఈ విశ్వాసమే మనిషికి సగుణబ్రహ్మం యొక్క లీలావిలాసాలను గ్రహించే సమర్థతను కల్పించింది. పర్యవసానంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో తనకు ఏకైక మార్గదర్శి జగత్కారణుడైన ఆ భగవంతుడే అని అతడు తెలుసుకున్నాడు; తానెంత పతితుడైనప్పటికీ భగవంతుని అపార కరుణ ఎన్నటికీ తాను నాశనం కావడానికి అనుమతించదని అతడికి విశ్వాసం కలిగింది. మరోవైపు ఆ భగవంతుడు ప్రతి యుగంలోను అవతరించి మనిషి స్వభావానికి అనుగుణంగా నూతన ఆధ్యాత్మిక మార్గాలను ఆవిష్కరించి అతడికి ఆత్మసాక్షాత్కారం సుగమం చేస్తాడని నమ్మకం ఏర్పడింది.
9. అవతారపురుషుల దివ్య స్వభావం గురించి శాస్త్రాల సారం
కళ్యాణ గుణసంపన్నులైన అవతారపురుషుల జననం, కర్మల గురించి స్మృతులలో, పురాణాలలో నమోదైన మూల భావాల సంక్షిప్త సారాంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాబోదు. అవతార పురుషుడు ఈశ్వరునిలా నిత్యశుద్ధ బుద్ధ ముక్తస్వభావుడని శాస్త్రాలు తెలుపుతున్నాయి. సామాన్య జీవునిలా అతడెప్పుడూ కర్మబంధనంలో చిక్కువడడు. జన్మాదిగా ఆత్మా రాముడు కావడం, ప్రాపంచిక సుఖభోగాల కోసం జీవునిలా స్వార్థభావనలు అతడిలో ఎన్నడూ తలెత్తకపోవడమే ఇందుకు కారణం. అతడి యావజ్జీవితం పరుల శ్రేయస్సు కోసమే అంకితమైంది. మాయాపాశం నుండి ముక్తుడై ఉండడం చేత అతడిలో గతజన్మల స్మృతులు అట్లే నిలిచి ఉంటాయి.
10. అవతారపురుషుల అవిచ్ఛిన్న స్మృతి
బాల్యం నుంచీ అతడిలో ఈ అవిచ్ఛిన్న స్మృతి ఉండి ఉంటుందా? అని అడగవచ్చు. అందుకు పురాణాలు ఇలా జవాబిస్తాయి: ఆ స్మృతి అతడిలో అంతర్గతంగా ఉన్నప్పటికీ బాల్యంలో అది సదా అభివ్యక్తం కాదు. కాని అతడి మనశ్శరీరాలు పరిపక్వతను సంతరించుకోగానే అప్రయత్నంగానో లేక స్వల్ప ప్రయత్నంతోనో ఆ స్మృతి ఎరుక కలుగుతుంది. అతడొనరించే ప్రతి కార్యానికీ ఇది అనువర్తిస్తుంది. (అంటే తానెందుకు జన్మించాడో, ఏం చేయాలో అంతా అతడికి ముందుగానే తెలియవస్తుంది.) అయినా మానవదేహం ధరించినందున అన్నివిధాలా అతడు మానవునిలాగే ప్రవర్తిస్తాడు.
11. అవతారపురుషులు మతానికి క్రొత్త ఆకృతిని కల్పిస్తారు
మనశ్శరీరాలు పరిపూర్ణంగా పరిపక్వత చెందగానే అవతారపురుషునికి అతడి జీవితోద్దేశం వెల్లడవుతుంది. ధర్మాన్ని పునఃస్థాపించడమే తన రాక యొక్క ఏకైక లక్ష్యంగా అతడు గుర్తిస్తాడు. ఆ లక్ష్య సాధనకు అవసరమైన తోడ్పాటులన్నీ ఊహాతీతమైన రీతిలో వాటంతట అవే సమకూరుతాయి. ఇతరులు అంధకారంలో తడుముకొంటూ ఉన్నప్పుడు అతడు వెలుగుబాటలో నడుస్తాడు; నిర్భయుడై అతడు తన గమ్యాన్ని చేరుకుంటాడు. తన అడుగుజాడలను అనుసరించమని సైగ చేసి సూచిస్తాడు. మాయాతీతుడైన పరబ్రహ్మాన్ని, జగత్కారకుడైన ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి దారితీసే మార్గాలను అతడు ప్రతి యుగంలోను ఆవిష్కరిస్తాడు.
12. అవతారపురుషులు ఎప్పుడు అరుదెంచుతారు?
అవతారపురుషుల కర్మలు, విశేషగుణాలను విశ్లేషించడంతోనే పురాణ కర్తలు ఆగిపోలేదు. అవతారపురుషులు ఏ సందర్భంలో ఈ ఇలపై అడుగు పెడతారో అన్న విషయం గురించి వారొక కచ్చితమైన నిర్ణయానికి రాగలిగారు. కాల ప్రభావం చేత విశ్వజనీన సనాతన ధర్మానికి గ్లాని ఏర్పడి నప్పుడు, మాయాశక్తిచే మోహితుడైనప్పుడు మానవుడు భోగవిలాసాలే పరమార్థాలని భావిస్తూ జీవితం సాగిస్తాడు. భగవంతుడు, ఆత్మ, ముక్తి ఇత్యాది అతీంద్రియ నిత్య సత్యాలు ఏదో ఒక అజ్ఞానయుగానికి చెందిన స్వాప్నికరాజ్య కవి అభూతకల్పనలుగా పరిగణిస్తాడు. న్యాయంగానో లేక మోసం చేసో ఏదో విధంగా ఆర్జించిన అపార సంపదలు, ఇంద్రియసుఖాలు తన హృదయంలోని శూన్యాన్ని పూరింపలేవని మనిషి చివరకు కనుగొన్నప్పుడు; తీరమే కానరాని నిరాశాపూరిత నల్లసముద్రపు తరంగాలు తనను ముంచెత్తివేసినప్పుడు వ్యథతో అతడు విమోచనార్థం బిగ్గరగా కేక పెడతాడు. అప్పుడు దుర్బల మానవులపై కరుణించి భగవంతుడు మానవుడిగా అవతరిస్తాడు. యుగాల పర్యంతం సనాతన ధర్మానికి పేరుకుపోయిన మకిలిని తొలగించి రాహువు నుండి వెలువడ్డ గ్రహణకాల చంద్రునిలా ధర్మాన్ని ప్రకాశింప చేస్తాడు. తరువాత మనిషి చేయి పుచ్చుకొని ధర్మమార్గంలో అతణ్ణి నడిపిస్తాడు. కారణం లేని కార్యం ఏదీ ఉండదు. అట్లే ఇలలో ఆవశ్యకత తల ఎత్తనిదే ఈశ్వరుడు కూడా ఏనాడూ లీలావిలాసంగా శరీరాన్ని దాల్చడు. అలాంటి ఆవశ్యకత యావత్తు సమాజంలో అనివార్యమైనప్పుడు భగవంతుని అనంత కరుణ ఘనీభూతమై, జగద్గురు రూపంలో ఆయన సాక్షాత్కరిస్తాడు. పదే పదే అవతారపురుషులు సాక్షాత్కరించడం చూసిన పురాణ కర్తలు అవసరం ఏర్పడ్డప్పుడు భగవంతుడు ఇలా అవతరిస్తాడనే నిర్ణయానికి వచ్చారు.
13. ఆధునిక యుగంలో అవతార పురుషుని ఆగమనం
యుగావశ్యకత కారణంగానే సర్వజ్ఞులైన జగద్గురువులు, అవతారపురుషులు ధర్మం మీద నూతన వెలుగును ప్రసరించడానికి అరుదెంచుతారు. ధర్మానికి, ఆధ్యాత్మికతకు ఆలవాలమైన భారతదేశం, యుగయుగాలలో ఆవిర్భ వించిన అవతారపురుషుల పాదచిహ్నాలను తన హృదయంలో సంతరించుకొని పావనమైంది. యుగావశ్యకత ఏర్పడిన సందర్భాలలో శక్తిమంతమైన అవతారపురుషులు ప్రస్తుత కాలం వరకు ఆవిర్భవిస్తూనే వచ్చారు. దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం భగవంతుడు శ్రీ చైతన్యుడుగా అవతరించాడు. జనులను హరినామ సంకీర్తనలో అతడు ఉన్మత్తులను చేయడం సువిదితమే. అటువంటి తరుణం మళ్ళీ వచ్చిందా? వైభవాన్ని కోల్పోయి, విదేశీయుల ధిక్కరణకు గురైన భారతదేశంలో మళ్ళీ ఆ యుగావశ్యకత కలిగిందా? అది భగవంతుని కరుణను ప్రేరేపించి మరోసారి ఆయనను అవతరించడానికి పురిగొల్పిందా? అశేష కళ్యాణ గుణసంపన్నుడైన ఏ మహాపురుషుని జీవితచరిత్రను తెలుపడానికి మేం ఉపక్రమించామో, ఆయన జీవిత చరిత్రను ధ్యానపూర్వకంగా అధ్యయనం చేస్తే అటువంటి ఘటనే జరిగిందని గ్రహించగలము. గడచిపోయిన యుగాలలో శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా అవతరించి ఎవరు సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారో, నేటి యుగావశ్యకతను పురస్కరించుకొని అతడే మళ్ళీ అవతరించడం మూలంగా భారతదేశం మరోసారి ధన్యమైంది.