కాషాయాంబరాలు ధరించి, పద్మాసనస్థులై, ఒకదాని మీద మరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచుకొని, అర్ధనిమీలితనేత్రులై స్వామీజీ ధ్యానంలో మగ్నులై ఉండడం, కాంస్య విగ్రహంలా కానవస్తుంది. ఆహా! ఆయన ఒక యోగిపుంగవులు.
– ఫ్రాంక్ రొడిమెల్
ప్రకృతి నియమం — ఛాయాచిత్రాలు — ఆధ్యాత్మిక రంగంలో నెపోలియన్ — కళ్లు — అంగాలు — కంఠస్వరం — ఆంగ్లం — రూపాంతరం — ఐరోపా గురువా? — భారత మాత
ప్రకృతి నియమం
ఆది అంటూ ఒకటి ఉంటే అంతం ఉండే తీరాలి. అది ప్రకృతి నియమం. ప్రకృతిలోని సమస్తమూ ఈ నియమానికి లోబడే తీరాలి. ఆచారాన్ని, ప్రాచీన కథ లను, మూఢనమ్మకాలను ముచ్చటించుకొంటున్న భారతీయులకు స్వదేశ సంస్కృతిని, ఆధునిక ఆవశ్యకతను, మానవాళి సేవను నొక్కివక్కాణించి వేదాంత తత్త్వానికి ఒక అనుష్ఠాన రూపం కల్పించిన, లోకచింతనా ధోరణులలో ఒక మార్పునకు బీజం వేసిన స్వామి వివేకానంద అనే మహాత్ముడు జన్మించింది, జీవించింది, మహత్కార్యాలు నిర్వర్తించి నది అంతా శరీరాన్ని ఆధారంగా చేసుకొనే! ఆ శరీరం ప్రకృతి నియమానికి అధీనంలోనిది. అది పుట్టింది, గిట్టే తీరాలి. అది ప్రకృతి నియమం, దానిని ఎవరూ ఆపలేరు. అయినప్పటికీ దానిని గురించి చింతన చేయడానికి ప్రయత్నించి నప్పుడు మనస్సు వణుకుతుంది, తడబడుతుంది. ఆ చోటికి పోవడానికి ముందు స్వామి వివేకానంద అనే దైవాంశ సంభూతుణ్ణి ఒకింత చింతన చేద్దాం, ధ్యానిద్దాం.
ఛాయాచిత్రాలు
ఏ ధ్యానానికైనా ఆధారభూతమైనది రూపం. స్వామీజీ పావన రూపాన్ని మనం ధ్యానించడానికి ఆధారమైనవి ఆయన ఛాయాచిత్రాలు. 19వ శతాబ్దం అనేక నూతనావిష్కరణలకు నోచుకొన్నది. వాటిలో ఒకటి ఛాయాచిత్ర కళ. పూర్వకాలపు మేధావులను, మహాత్ములను చిత్రకారులు తమ అంతఃప్రేరణతో లేదా కల్పనతో ఊహించి గీసిన చిత్తరువుల ద్వారానే చూడగలం. కాని ఛాయాచిత్ర కళ ఉద్భవించిన తదుపరి ఏతెంచిన వారి రూపాన్ని యథాతథంగా చూడగలుగుతున్నాం. ఈ రీతిలో స్వామీజీని కూడా ఛాయాచిత్రాల ద్వారా మనం చూడగలగడం మహద్భాగ్యం.
స్వామీజీ ఛాయాచిత్రాలలో దాదాపు 94 లభించాయి.* ఇవన్నీ 1886 తరువాత తీసినవి. అంటే ఆయన బాల్యం నాటి ఛాయాచిత్రాలు ఏవీ లభించలేదు. ప్రఖ్యాత న్యాయవాదీ, అష్టైశ్వర్యాలలో తులతూగిన వ్యక్తీ అయిన విశ్వనాథ దత్తా తమ పిల్లలకు అనేక ఛాయాచిత్రాలు తీయించి ఉంటారనడం నిస్సందేహం. కాని అవేవీ లభించలేదు, అది మన దురదృష్టం. అయినప్పటికీ అవి ఎందుకు లభించలేదు?
స్వామీజీ చిన్న తమ్ముడైన భూపేంద్ర దత్తా ఇలా వ్రాస్తున్నారు:* “మా ఇంటిని సి.ఐ.డి. పోలీసులు ఎన్నిసార్లు శోధించి, ఇంటిని కకావికలం చేశారో, తెలుసా? కాగితపు ముక్కలు, గోడలకు వ్రేలాడుతున్న చిత్రాలు, తక్కిన వస్తువు లన్నీ, అంతెందుకు, నన్నో అన్నగారినో (స్వామీజీ) నేరస్థులుగా నిరూపించడానికి తోడ్పడతాయని భావించిన యావత్తూ వారు తీసుకువెళ్లిపోయారు. నేనో, ఆయనో తీవ్రవాదులతో సంబంధం ఉన్నవారమని ఎలాగో ఒకలా నిరూపించాలని వారు తీవ్రకృషి చేశారు.”
లభించిన ఛాయాచిత్రాల నుంచి స్వామీజీని రెండు విభిన్న కోణాలలో చూడవచ్చు. భారతీయ ఛాయాచిత్రాలు సామాన్యంగా శిరోముండనం, చేతికర్ర, కమండలాలతో ఆయనను ఒక మామూలు సన్న్యాసిగా చూపుతున్నాయి. పాశ్చాత్య దేశాలలో తీసినవి సామాన్యంగా పాపట తీసి దువ్విన జుట్టు లేదా తలపాగా, కోటుతో పాశ్చాత్య వైఖరిలో చూపుతున్నాయి. కాని ఛాయాచిత్రం ఏది అయి నప్పటికీ అన్నింట్లోనూ ప్రస్ఫుటంగా కానవచ్చేది గాంభీర్యం, దాని నేపథ్యంలో నిశ్చల సముద్రమంతటి ప్రశాంతత, ఎక్కడో సుదూరంలోని లోకానికి అతీతమైన దేనితోనో సంబంధం ఉంచుకొన్నట్లు విరాజిల్లే దృక్కులు, ఆ దృక్కుల్లో కానవచ్చే దృఢసంకల్పం, ఆ సంకల్పంలో జాలువారే కారుణ్యం!
ఆధ్యాత్మిక రంగంలో నెపోలియన్
స్వామీజీ వేషభాషల గురించి ఆయన శిష్యుడైన విరజానంద ఇలా వ్రాస్తున్నారు: “అమెరికన్ వార్తాపత్రికలు పేర్కొన్నట్లు ఆయన కళ్లు చూసేవారిని ముగ్ధులను చేసేవి. ఆయన పావన దేహం యావత్తూ తేజో విరాజమానంగా ఉండేది. అందం, శక్తి, ప్రశాంతత అన్నీ సమైక్యమైన రూపం ఆయనది. ఆయన కళ్లను తిన్నగా చూడ డానికి భయం కలుగుతుంది – నా కళ్లు మండిపోతాయేమోననిపిస్తుంది. చింతనలో మునిగిపోయి ఆయన అటూ ఇటూ పచార్లు చేయడం సింహం నడకను గుర్తుచేస్తుంది. ఆధ్యాత్మిక రంగంలో ఆయన నెపోలియన్లా విరాజిల్లారు. కొన్ని సమయాలలో ఆయన కౌపీనమాత్ర ధారియై ఉండేవారు. మహాశక్తి సదా ఆయనలో పనిచేస్తూ ఉన్నట్లు కానవస్తుంది. ఆ శక్తి పర్యవసానంగా ఆయన ఒక్కో అడుగు వేస్తున్నప్పుడు ఆయన పాదపద్మాల క్రింద భూమి చలించి చీలుతున్నట్లు ఉండేది.”
కళ్లు
స్వామీజీ ఎత్తు 5 అడుగుల 8½ అంగుళాలు. ఆయన చామనచాయలో ఉండేవారు. స్వామీజీలో ఎవరినన్నా ఇట్టే ముగ్ధులను చేసేవి ఆయన విశాల నేత్రాలు. “ఆ నేత్రాల వల్లే ఆయనకు నేను బానిసనయ్యాను” అని ఆయన ప్రథమ శిష్యుడైన సదానంద వచించడం కద్దు. స్వామీజీ స్మృతులను వ్రాసిన అనేకులు కూడా ఆయన కళ్లను ప్రస్తావించకుండా ఉండలేదు. వాటిని “యోగి నేత్రాలు” అని దేవేంద్రనాథ్ టాగూర్ వ్యాఖ్యానించారు. శ్రీరామకృష్ణులు వాటిని పద్మాలతో పోల్చి, ‘కమలాక్షు’ డని పేర్కొన్నారు. “ఆతడి కళ్లు శుష్కజ్ఞాని కళ్లలా కాకుండా భక్తుని కారుణ్యపూరిత నయనాలుగా ఉన్నాయి” అంటూ శ్రీరామకృష్ణులు వచించడం కద్దు. “ఓ, ఆ కళ్లు! ఉల్కలా మిరుమిట్లు గొలిపేవి. అంతేగాక తళుక్కు తళుక్కుమని మెరుపు తరంగాలను ప్రసారం చేస్తూ విరాజిల్లాయి” అంటూ వ్రాస్తున్నది క్రిస్టియానా ఆల్బర్స్.
అంగాలు
ఒకసారి శ్రీరామకృష్ణులు, “ఆతడి శరీరావయవ నిర్మాణం అద్భుతం. ఒక్క విషయం: అతడు నిద్రిస్తున్నప్పుడు బుస్సు బుస్సు అంటూ శ్వాసిస్తున్నాడు. ఇలా శ్వాసించే వారి ఆయుస్సు తక్కువ అని చెబుతారు” అన్నారు. బాల్యంలో స్వామీజీ పాదాలను పరిశీలించిన ఒక జ్యోతిషుడు వాటిలో దివ్య చిహ్నాలైన శంఖచక్రాలు, గద, పద్మం ఉన్నట్లూ, ఆయనకు గొప్ప భవిష్యత్తు ఉన్నట్లూ తెలిపాడు. ఒకసారి స్వామీజీ దీనిని ప్రస్తావించి, “నా కాళ్లలో చక్రాలు ఉండబట్టే నేను ఊరూరా తిరుగాడుతున్నాను” అన్నారు.
స్వామీజీ పాదాలు, అరచేతులు, గోళ్లు లాంటివి మామూలు కన్నా కాస్త భిన్నంగా ఉండేవి. ఆయన నడుస్తున్నప్పుడు పాదాల వ్రేళ్ల వైపు మడమ మాత్రమే నేల మీద ఆనేది. మధ్యభాగం కాస్త లోపలగా అణగి ఉంటుంది. చేతి వ్రేళ్లు చంపక పువ్వుల మొగ్గల్లా ఉండేవి. గోళ్లు కాస్త ఎరుపురంగులో ముత్యాల్లా ప్రకాశించేవి. “ఆరితేరిన శరీర ధర్మశాస్త్రజ్ఞులు స్వామీజీ అంగ నిర్మాణాన్ని చూసి, ‘తెలుసుకోలేని రహస్యాలను తెగింపుతో తెలుసుకొనే ప్రయత్నంలో తయారుగా ఉన్న వ్యక్తి’ అని వ్యాఖ్యానించేవారు” అని స్వామీజీ సోదరుడైన మహేంద్రనాథ్ దత్తా వ్రాస్తున్నారు.*
కంఠస్వరం
“స్వామీజీ కంఠస్వరం గంభీరంగా, జీర లేనిదిగా కంచు ఘంటానాదంలా ఉండేది” అని తిరువనంతపురంలో ఆయనను కలుసుకొన్న రామస్వామి శాస్త్రి చెప్పారు. చికాగో ప్రసంగాలు విన్న మిస్ లూసీ మన్రో, “ఆయన స్వరం కంచు ఘంటలా మ్రోగింది” అని వ్యాఖ్యా నించింది. ఆమె వర్ణన చూద్దాం: “ద్విగుణీకృతమైన అందం గల ఆ సన్న్యాసి కాషాయాంబరాలు ధరించారు. ఆయన ఆంగ్ల ఉచ్చారణ ఆయనకున్న ఆంగ్లభాషా పాటవానికి అద్దం పట్టింది. అందరినీ అయస్కాంతంలా ఆకర్షించే, అందరినీ దాసోహం చేసే ఆకృతి ఆయనకే చెల్లింది. ఆయన స్వరం కంచు ఘంటానాదంలా ఉంది. భావనలు ఉద్వేగపు వెల్లువతో బయల్వెడలినప్పటికీ సంయమనంతోనే ఉన్నాయి. ఆయన పాశ్చాత్య దేశాలకు అందించిన క్రొత్త సందేశం విన్న వారి మనస్సులో ఒక నూతన, అత్యున్నతమైన అపూర్వమైన పరిపూర్ణ అనుభూతిని కల్పించింది. ఆయన వాక్పటిమ పరాకాష్ఠను చేరింది.”
లోకప్రసిద్ధ గాయకియైన ఎమ్మా కాల్వే వర్ణన దీన్లో అతి ముఖ్యమైనది; “స్వామీజీ కంఠస్వరం ఆనందభరితంగా ఉండేది. అది పురుషోచిత కంఠస్వరం; తారస్థాయి కంఠస్వరానికి మామూలు కంఠస్వరానికి మధ్యమస్వరంగా (baritone) ఉండేది. చైనా జేగంటలా (Chinese gong) కంపనతో కూడినదై ఉండేది” అందామె.
ఆంగ్లం
సుదీర్ఘ వాక్యాలూ, కఠిన పదాలూ ఉపయోగించడం నాటి ఆంగ్లభాషలో పరిపాటి. నివేదిత, అరవింద ప్రభృతుల పుస్తకాలనూ, ఆ కాలఘట్టంలోని తక్కిన రచనలనూ చదివితే ఇది తేటతెల్లమవుతుంది. కాని సరళమైన పదాలూ, శక్తి మేరకు చిన్న వాక్యాలతో క్రొంగ్రొత్త రీతిలో స్వామీజీ ఆంగ్లం భాసిల్లింది. ఆధ్యాత్మిక శక్తి, వ్యక్తిత్వం, వాక్పటిమలతో ఆంగ్ల పాండిత్యం చేరి, ఆయన విజయానికి కారణభూతమైనాయి. “ఒక వక్తగా భగవంతుడే ముద్ర వేసి పంపించాడు. వేదికల మీద ఆయన తక్కిన అందరినీ మించిపోయి నిలబడ్డారు. ఎలాంటి నోట్సూ లేకుండా ప్రసంగించారు. ఆయన ఆంగ్లం కించిత్తు కూడా తప్పు దొర్లకుండా సాగింది. ఆయన మాటలూ, భావనలూ అర్థం కాకపోయినా ఆయన ప్రసంగమే సంగీతమయంగా విరాజిల్లింది” అని డెట్రాయిట్ ప్రెస్ వ్రాసింది. “ఆయన కంఠస్వరం మృదువుగా, అవసరమైన ఆరోహణ అవరోహణలతో కూడుకొన్నదై ఉంది. ఆయన ఆంగ్లం సాటిలేనిది” అని బే సిటీ టైమ్స్ వ్రాసింది.
ఆంగ్లం మాతృభాష అయిన అనేకులు సైతం ఆయనను శ్లాఘించే మేరకు స్వామీజీ ఆంగ్లం విరాజిల్లడం ఆశ్చర్యం. కాని విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో ఆయన పొందిన మార్కులు తక్కువే. ప్రవేశ పరీక్షలు 47/100, ఫస్ట్ ఆర్ట్స్‌లో 46/100, బి.ఏ.లో 56/100– ఇవే ఆయన సాధించిన మార్కులు. 1883 లో ఆయన చదువు దాదాపు పూర్తయింది. 1893 లో ఆయన చికాగోలో ప్రసంగించారు. ఈ పదేళ్లూ గురుదేవుల సేవ, పర్యటనలు, ఆధ్యాత్మిక సాధనలలో గడిచాయి. ఆయన ఎప్పుడు ఆంగ్లంలో అంతటి ప్రతిభను సముపార్జించారో అర్థం కావడం లేదు.
రూపాంతరం
సామాన్యంగా స్వామీజీ అత్యున్నత భావభూముల నుంచే ప్రసంగించేవారు. సోదరి క్రిస్టైన్ ఒకసారి చెన్నైకి వచ్చినప్పుడు ఒక విద్యార్థి ఆమెను, “జ్ఞానయోగం భారతీయ పారంపర్యంలోని వారికే చాలా కఠినమైన మార్గం. దానిని గురించి అనేక ప్రసంగాలు ఆయన పాశ్చాత్యంలో చేశారు. వాటిని మీరు ఎలా అర్థం చేసుకోగలిగారు?” అని అడిగాడు. అందుకు క్రిస్టైన్, “స్వామీజీ ముందు శ్రోతల అవగాహన స్థాయిని తమ ఆధ్యాత్మిక శక్తితో పెంచేవారు. ఆ తరువాతనే ప్రసంగించేవారు. ఇందువలన ఆయన భావనలు శ్రోతలకు సులభంగా అర్థమయ్యాయి” అన్నారు. కొన్ని ప్రసంగాల సమయంలో ఆయన ఆకృతి రూపాంతరం చెందుతుందని పలువురు వ్రాసి ఉండడం దీని కన్నా మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే విషయం. అంటే ఆయన రూపం నిజంగానే మార్పు చెందుతుంది! ఈ విధంగా తాము చూసినట్లు భారతీయులూ, అదే విధంగా పాశ్చాత్యులూ వ్రాసి ఉన్నారు. ఒకటి రెండు సంఘటనలు చూద్దాం:
1900 మార్చ్ 11వ తేదీన శాన్ఫ్రాన్సిస్కోలో ఆయన ఏసుక్రీస్తు గురించి ప్రసంగించినప్పుడు ఇలాంటి సంఘటనను తాను చూసినట్లు క్రిస్టియానా ఆల్బర్స్ వ్రాస్తున్నది:
“ఆ రోజు స్వామీజీకి ఒంట్లో బాగాలేదు. పైగా జలుబు చేసింది. వేదిక మీదకు ఎక్కడానికే ప్రయాసపడ్డారు. కాళ్లు ఎత్తి పెట్టడానికి కష్టపడ్డారు. కంటి రెప్పలు వాచి ఉన్నాయి. ఎంతో బాధపడుతున్నట్లుగా ఆయన కనిపించారు. వేదిక మీద కాసేపు నిలబడి శ్రోతల వైపు దృష్టి సారించారు. తరువాత క్రమక్రమంగా ఆయన రూపం మారసాగింది. కాంతిరహితమైన ఆయన ముఖంలో త్రాణ వచ్చింది, వాచిన కళ్లు మామూలు స్థితికి వచ్చి నిశితదృష్టిని సంతరించుకొన్నాయి. శరీరం ఒక మార్పునకు లోనైనట్లు కనిపించింది. కాసేపటి క్రింద ఉన్న మనిషీ, ఇప్పుడు ప్రసంగిస్తున్న వ్యక్తీ వేర్వేరని నాకు తోచింది. ఆ మహాత్ముని ఆత్మ బయటకు వచ్చి నిలబడి ప్రసంగిస్తున్నట్లుగా ఉంది.”
మరొక ప్రసంగ సమయంలో జరిగిన దానిని గురించి స్వామీజీ సోదరుడైన మహేంద్రనాథ్ ఇలా వ్రాస్తున్నారు:
“ఆయన కంఠ స్వరం మారింది. ఆయనలో నుంచి మరొక మనిషి బయటకు వచ్చి నిలబడినట్లుగా ఉంది…. ఆయన తమ దేహం నుంచి బయటకు వచ్చి మరొక సూక్ష్మశరీరంలో నిలబడి, ఆకాశంలో దేనినో తదేకంగా చూస్తున్నట్లుంది.”
స్వామీజీ శిష్యుడైన సదాశివానంద రెండు సంఘటనలు తెలుపుతున్నారు. 1902లో స్వామీజీ కాశీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఇవి:
ఐరోపా గురువా?
“ఒక డాక్టర్ అక్కడ స్వామీజీని తరచూ వచ్చి కలుసుకొనేవాడు. క్రొత్తగా ప్రారంభమైన ఒక మతశాఖకు చెందిన వ్యక్తి అతడు. దాని వ్యవస్థాపకుడు ఒక విదేశీయుడు. ఆ డాక్టర్ తమ మతశాఖను ప్రశంసించి మాట్లాడేవాడు. స్వామీజీ మౌనంగా వినేవారు. ఒకరోజు డాక్టర్ ప్రశంస తారస్థాయి చేరింది. భారతదేశంలో ఆ శాఖ మాత్రమే ప్రజలకు నిజమైన సేవ చేస్తున్నది. నిజానికి భారతదేశంలో ఉండదగిన మఠం అదొక్కటేనని మాట్లాడ సాగాడు ఆ డాక్టర్.
“అప్పుడు ఆ మార్పు జరిగింది. స్వామీజీ ముఖమూ, దేహమూ హఠాత్తుగా బిర్రబిగుసుకొన్నాయి. ఆదేశించే పాలకునిలా ఆయన కంఠస్వరం మ్రోగింది. ఆయనలో నుంచి మరెవరో మాట్లాడుతున్నట్లు మాటలు వెలువడ్డాయి: ‘ఈ దేశంలో సమస్తానికీ విదేశీయుడే మార్గదర్శిగా ఉన్నాడు. మతం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు దానినీ మీరు అతడికి ఆపాదించారు. ఐరోపాను మీ గురువుగా గ్రహించి మీరు సమ్మోహనానికి లోనైన బానిసలుగా అయిపోయారు. మతాన్ని బోధించడానికి కూడా విదేశం నుంచి ఒకణ్ణి దిగుమతి చేసుకొనే మేరకు భారతదేశం పతనం చెందిందని భావిస్తున్నారు. ఇది గొప్ప విషయమా లేక మీ పనికి మీరే సిగ్గుపడ వలసిన విషయమా? ప్రసంగం చేయడానికి, వక్తృత్వం చూపడానికి నేను ఇక్కడకు రాలేదు. నా ఒంట్లో బాగోలేదు. విశ్రాంతీ, ప్రశాంతతనూ అభిలషించే నేనిక్కడకు వచ్చాను.”
“స్వామీజీ ముఖం ఎర్రబారింది. ఆయన తమ దృష్టిని డాక్టర్ వైపు సారించారు. తరువాత కొనసాగించారు: ‘నేను అనుకొంటే, ఇదిగో ఈ రాత్రే మీ ఆ అల్పమతశాఖ నేతనూ, ఈ వారాణసి నగరాన్నీ నా పాదాక్రాంతం చేసుకో గలను. కాని ఉన్నతమైన దివ్యశక్తి ఇలాంటి నిరర్థక కార్యాలకు వెచ్చించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఊరకున్నాను.’
“పరిస్థితి కాస్త విపరీతం కానున్నట్లు గ్రహించిన డాక్టర్ మాటలను మరో వైపునకు మార్చాడు. అంతే. స్వామీజీ మామూలు స్థితికి వచ్చేశారు. అంతదాకా ఆయనలో పొంగిన ఆవేశమూ, కోపమూ క్షణంలో చల్లారిపోయాయి. పూర్వంలా ప్రశాంతతను పరపే సన్న్యాసిలా ఆయన కూర్చున్నారు. ఆయనలో జరిగిన మార్పు జాడ కూడా కనిపించలేదు.”
భారత మాత
సదాశివానంద స్మృతులు కొనసాగాయి: “ప్రఖ్యాత దేశభక్తుడైన కేల్కర్ కాశీలో స్వామీజీని కలుసుకోవడానికి వచ్చారు. స్వామీజీ అస్వస్థతతో పడుకొని ఉన్నారు. కేల్కర్ వినమ్రంగా వచ్చి అక్కడ నేల మీద పరచి ఉన్న తివాచీ మీద కూర్చున్నారు. ఇద్దరూ ఆంగ్లంలో సంభా షించసాగారు. మేం కాస్త దూరంలో కూర్చుని ఉన్నాం. వారు ఏం మాట్లాడు కొంటున్నారో మేం వినలేకపోయాం. మాటలు కొనసాగాయి. హఠాత్తుగా స్వామీజీ ఉద్వేగభరితులై మంచం మీద లేచి కూర్చున్నారు. బాగా ఆరోగ్యవంతునిలా మాట్లాడ సాగారు. సమయం గడిచేకొద్దీ ఆయనలో ఉద్వేగపు వెల్లువ పొంగిపొరలింది. ఆయన మృదుస్వరం గంభీరంగా వినవచ్చింది. కళ్లు విశాలమైనాయి. దవడలు ముడుచుకొని, మడతపడి, మందమై ఉద్వేగాలను వ్యక్తం చేశాయి. కనుబొమలు పైకీ క్రిందికీ పోతూ, భ్రుకుటి ముడి కనిపించీ కనపడకుండా ఉంటూ ఆయన ముఖం ఎర్రబారింది. కంఠస్వరం గాంభీర్యం సంతరించుకొంది. ఇప్పుడు స్పష్టంగా మేం ఆయన మాటలు వినగలుగుతున్నాం. స్వామీజీ లోపల అణగి ఉన్న శక్తులన్నీ మహావేగంతో బయటకు వస్తున్నట్లు అనిపించింది. ఇంతటి రూపాంతరాన్ని విస్తుపోయి కేల్కర్ చూస్తూవున్నారు; సమ్మోహనానికి లోనైనట్లు స్వామీజీ మాటలు వినసాగారు.
“స్వామీజీ మాటలు కొనసాగించారు. భారతమాత, ఆమె ఆవేదన, రాజకీ యాలు, సంఘ సంస్కరణల లాంటి అనేక విషయాల గురించి స్వామీజీ మాట్లాడు తూనే ఉన్నారు. ఉరుములా వినిపించింది ఆయన స్వరం:
“పేదరికమూ, వ్యాధీ పీడించి ఇంతగా పతనావస్థకు దిగజారిన ఈ భారతదేశంలో ఇకపై జీవించడంలో ఏం లాభం? ప్రతి క్షణమూ మన భారతమాత నరక యాతనను అనుభవిస్తున్నది. ఆమెకు తినడానికి తిండి లేదు, ధరించడానికి వస్త్రం లేదు. అవమానమూ, దుఃఖమూ ఆమె నుదుట శాశ్వతంగా వ్రాసిపెట్టి ఉన్నాయి. ఆమె శ్వాసిస్తున్నది – జీవిస్తున్నది అనడానికి అదొక్కటే గుర్తు. ఆమె నరకాగ్నిలో వాడిపోతున్నది – అది ముమ్మాటికీ నిజం! ఇలా బాధపడడం కన్నా ఆమె ఈ లోకం నుంచి నిష్క్రమించడం మంచిది కాదా?’
“భారతదేశపు యావన్మంది పేదల దుఃఖాన్నీ స్వీకరించి స్వామీజీ తల్లడిల్లి పోతున్నట్లుంది. ఆయన శరీరం కంపించింది. శ్వాసక్రియ అధికరించింది. ఆయన నిజమైన దేశభక్తుడు, నిజమైన మహాత్ముడు. ‘ఎవరి హృదయం పేదల కోసం రక్తం చిందిస్తున్నదో ఆతడే నిజమైన మహాత్ముడంటాను నేను’ అని వచించిన వ్యక్తి కదా ఆయన! ఆయన జీవితంలోనే ఆ నిజాన్ని మేం చూడగలిగాం.
“క్రమక్రమంగా స్వామీజీ మామూలు స్థితిలోకి వచ్చారు. తరువాత ఏ మార్గంలో భారతమాత దుఃఖాన్ని బాపవచ్చో ఆయన కేల్కర్‌కు చెప్పారు. ప్రత్యేకించి ఒక భావనను నొక్కి వక్కాణించారు: ‘భారతదేశం పురోగతి చెందాలంటే దాని అభివృద్ధి మన ప్రాచీన సంప్రదాయాలను పాటించి అంతరంగం నుంచి వచ్చే సహజమైన ప్రగతిపథంలో ఉండాలి.’ ఈ భావనను ఆయన పదే పదే నొక్కి వక్కాణించారు. అన్ని సంస్కరణలూ మతపరంగా ఉండాలనీ నొక్కి చెప్పారు. ఆ రోజు మేం భిన్నమైన స్వామీజీని చూశాం.”
ఇలాంటి సంఘటనలు మనకు ఎత్తి చూపేవి ఒక్క విషయాన్నే! తురీయా నంద వచించినట్లు “గగన చంద్రుడు” రూపాంతరం చెంది ఈ ఇలలో పచార్లు చేసినట్లు స్వామీజీ జీవించారు. ఆయననూ, ఆయన భావనలనూ చింతన చేయడం ఒక ఆధ్యాత్మిక సాధనగా పరిగణించి, ఆయన జీవిత చరిత్రను కొనసాగిద్దాం.