నా బిడ్డలు ప్రతి ఒక్కరూ నా కన్నా నూరురెట్లు ఉత్కృష్టులు కావాలి; అనంత శక్తిమంతులవ్వాలి, అయ్యే తీరాలి – ఇది నా వాక్కు.
– స్వామి వివేకానంద
ఛాతీ మీద భరిస్తూ — తల్లిగా — ప్రేమ ఆధారం — దీక్ష — ఎలా మార్గదర్శకత్వం వహించారు? — సన్న్యాస శిష్యులు — నూరుసార్లు జారినప్పటికీ — కన్నుల నుంచి కాంతి — ‘నా పురుషోచితమైన కుమారుడివి నువ్వు’ — ‘మిమ్మల్ని వదలివేస్తాను!’ — ‘ఆయన క్షమిస్తారు!’ — ‘నువ్వొక పరమహంసవు అవుతావు!’ — ఆరాధనా, సేవా? — ‘మట్టి కుండలో నీరు ఇవ్వు’ — కాలి నడకన సేవ — కుమారా! — ‘నన్ను ఆరాధించు’ — అవతార పురుషులా? — ఉపనిషత్తుల ఋషా? — కన్నుల ఆకర్షణ — దీక్షా విధానం — క్రొత్త మతమా? — ఆశీర్వదిస్తున్నాను! — వినమ్రత — సన్న్యాస జీవితపు కఠోరాలు — ఆశీస్సుల అర్థం — సామూహిక త్యాగం — స్వామీజీ పూజ — అనుకరించకు! — గురువు పట్ల విశ్వాసం — సన్న్యాసికి యాజమాన్యం కూడదు — ‘వస్తారని నిరీక్షిస్తున్నాను!’ — ‘బాధ్యత తీసుకొంటాను!’ — వసంతం – సన్న్యాసి — ఇతరులు జీవింప తాము అభిలషించారు — ముక్తి తథ్యం — నైజానికి తగ్గ మార్గం — మానసిక దుఃఖాన్ని తొలగించారు — దీక్ష — తల్లి కన్నా….
ఛాతీ మీద భరిస్తూ
ఒక రోజు రాత్రి స్వామీజీ పడుకొని ఉన్నప్పుడు ఆయన శిష్యుడైన నిర్భయానంద కాళ్లు ఒత్తుతున్నాడు. అప్పుడు విపరీతమైన అలసట వల్లనో ఏమో స్వామీజీ ఛాతీ మీద తల ఉంచుకొని నిద్రపోయాడు. ఆతడికి నిద్రాభంగం కలిగించకూడదనుకొని స్వామీజీ కదలకుండా అట్లే పడుకొన్నారు. సమయం గడిచింది. రాత్రి బాగా ప్రొద్దుపోయినప్ప టికీ స్వామీజీ గదిలో దీపం వెలుగుతూ ఉండడం చూసి ఒకరు అక్కడకు వచ్చి ఆయనతో ఏదో మాట్లాడబోయారు. వెంటనే తమ వేలును పెదవుల మీద ఉంచి, సైగ చేస్తూ నిశ్శబ్దంగా ఉండమనీ, నిద్రించే వ్యక్తికి నిద్రాభంగం కలిగించవద్దనీ తెలిపి వెళ్లిపొమ్మన్నారు. ఈ విధంగా శిష్యుణ్ణి ఛాతీ మీద భరిస్తూ ఆతడికి నిద్రాభంగం కలిగించకుండా రాత్రంతా అట్లే స్వామీజీ పడుకొన్నారు!
– ఇది అనేకులు ఎరుగని స్వామీజీ నైజంలోని ఒక పార్శ్వం!
తల్లిగా
వేదాంత ఆచార్యునిగా, అమెరికాలో మారుమ్రోగిన సన్న్యాసిగా, తపోధనుడిగా, లోక చింతనా ధోరణులను మలుపు త్రిప్పిన యుగనాయకునిగా పరిగణింప బడుతున్న స్వామి వివేకానంద మాతృత్వ పరిమాణం ఇది. చెప్పాలంటే ఈ మాతృత్వ నైజమే, ప్రేమ వెల్లువే ఆయన జీవితంలోని నిరంతరమైన ఊటగా భాసించింది. సోదర సన్న్యాసులూ, శిష్యులూ, గురుదేవుల గృహస్థ శిష్యులూ, భక్తులూ ఆయనను గౌరవించి స్తుతించారు, నేతగా కొనియాడారంటే – అది ఆయన మహత్త్వాన్ని, వాక్శుద్ధిని, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చూసి మాత్రమే కాదు; ఈ ప్రేమకు కట్టుబడే!
స్వామీజీ తమ శిష్యులను అంతగా చీవాట్లు పెట్టేవారు కారు. వారితో సదా కారుణ్యం వహించే మాట్లాడేవారు. “ఆయన మమ్మల్ని ‘నాయనా’, ‘కుమారా’ అంటూ సంబోధిస్తున్నప్పుడు, మేం పొందే పరమానందం వర్ణనాతీతం” అని ఆయన శిష్యుడైన అచలానంద చెప్పేవారు. సన్న్యాసులు, గృహస్థులు – రెండు వైపుల వారూ స్వామీజీ శిష్యులుగా ఉన్నారు. ఈ అధ్యాయంలో స్వామీజీ తమ సన్న్యాస శిష్యులను అభిమానించిన, వారికి మార్గదర్శకత్వం వహించిన వైనాన్ని పరికిద్దాం.
ప్రేమ ఆధారం
ఇల్లూ వాకిలీ త్యజించి మఠంలో చేరుతున్న యువకుల పట్ల స్వామీజీ ప్రేమమయులై వ్యవహరించారు. పాశ్చాత్య శిష్యుడొకరు స్వామీజీకి ఒక అందమైన గ్లాసు కానుకగా ఇచ్చాడు. స్వామీజీకి అది బాగా నచ్చింది. ఒకరోజు మఠంలో క్రొత్తగా చేరిన ఒకరితో స్వామీజీ దాన్లో కమలాపండ్ల రసం పిండి తీసుకురమ్మన్నారు. రసం పిండు తున్నప్పుడు చేయి జారి క్రిందపడి గ్లాసు విరిగింది. ప్రక్కనే నిలబడ్డ ఒక వరిష్ఠ సన్న్యాసి ఆ యువకుణ్ణి చడామడా తిట్టసాగారు. అది విన్న స్వామీజీ ఆయనతో, “గురుదేవుల వద్దకు మనం వెళ్లాం. ఆయన మనలను ప్రేమించి, ఆ ప్రేమ ద్వారానే మనలనందరినీ ఆయన సొంత మనుషులుగా చేసుకొన్నారు! వీరు ఇల్లూ వాకిలీ త్యజించి మనలను అపేక్షించి వచ్చారు. ఇలా భయపెడితే వారెలా ఇక్కడ ఉండగలరు? మఠం ఎలా సాగుతుంది? గ్లాసు ఆయుస్సు ఇలాగే ముగుస్తుంది. గ్లాసుకు కలరా, మలేరియా వాటిల్లదు కదా!” అన్నారు.
ఈ ప్రేమ ద్వారానే స్వామీజీ తమ శిష్యులకు మార్గదర్శకత్వం వహించారు, ఆ ప్రేమను ఆధారం చేసుకొనే రామకృష్ణ సంఘం వృద్ధి గాంచింది. అందుకే శిష్యులు ఏం చేసినప్పటికీ స్వామీజీ స్వీకరించారు; వారిని అసలు చీవాట్లు పెట్ట లేదని అర్థం చేసుకోకూడదు. ఒక నిజమైన, బాధ్యత గల తండ్రిగా ప్రేమతోనూ, ఖండితంగానూ వారికి మార్గదర్శకత్వం వహించారు.
దీక్ష
“నేను ఇస్తున్న దీక్షల పట్ల ఆందోళన చెందను. సన్న్యాసం పుచ్చుకొని తీరాలని ఒక వ్యక్తి దృఢనిశ్చయుడై ఆ మార్గంలో వెళ్లాలను కొంటే, వారికి ఆ మార్గం చూపిస్తాను. ఆ తరువాత ఏం జరుగుతుందోనని యోచిస్తూ ఉండడం నా పని కాదు” అనేవారు ఆయన.
శిష్యులలో కొందరు అనర్హులని ఎరిగి ఉండీ కారుణ్యం కారణంగానే వచ్చిన వారందరికీ ఆయన దీక్ష ప్రసాదించారు. ఇలా అర్హత చూడకుండా దీక్ష ఇవ్వడం ఆయనకు బాధాకరమే. అందుకోసం ఆయన కష్టపడవలసి వచ్చింది కూడా! దానిని గురించి స్వామీజీ, “ఇందుకు హానికరమైన మరో పార్శ్వం కూడా ఉంది. నా తప్పులకన్నీ నేను అసలు, వడ్డీతో సహా అనుభవించాలి” అనేవారు.
దీని నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకొన్నారు; “కాని దానిలో ఒక మంచి కూడా ఉంది. ఈ కష్టాల అనుభవాలే నన్ను ఈ అన్నింటిగుండా ఒక సన్న్యాసిగా నిలిపి ఉంచింది. నిజానికి అదే నా అభిలాష – నేనొక నిజమైన సన్న్యాసిగా మరణించాలి. రామకృష్ణ పరమహంస ఉన్నారే, అలాంటి సన్న్యాసిగా జీవించాలి. కామ కాంచనాల నుంచి, కీర్తి కాంక్ష లాంటి వాటి నుంచి ఆయన పూర్తిగా విడివడ్డ వ్యక్తి. నిష్ప్రయోజనమైన ఈ అన్నింట్లో అతి హానికరమైన ఆ కీర్తి కాంక్ష కించిత్తయినా స్పృశించని వ్యక్తిగా నేను జీవించాలి.”
స్వామీజీ దీక్ష గురించీ, ఆయన గురువుగా వ్యవహరించిన తీరు గురించీ సోదరి క్రిస్టైన్ ఒక అందమైన చిత్రాన్ని చూపుతుంది.
ఎలా మార్గదర్శకత్వం వహించారు?
“మా సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఆయన నిరాకరించారు. మౌలిక తత్త్వాలను ఎత్తి చెప్పారు, కాని వాటిని జీవితంలో మేమే ఆచరణలో చూపాల్సి ఉంది. జీవితాన్ని ఎదుర్కొనే సాహసం లేకుండా తమ మీద ఎవరూ ఆధారపడడం ఆయన ఇష్టపడలేదు. ఈ విషయంలో ఆయన కనికరం చూపలేదు. ‘మీ సొంత కాళ్ల మీద నిల బడండి. దానికి అవసరమైన శక్తి మీలో ఉంది’ అంటూ గర్జించారు ఆయన. ప్రతిదాన్నీ సరళపరచి మాకు అందించడం కాదు ఆయన ఉద్దేశం; మాలో మరుగునపడి ఉన్న శక్తిని అభివ్యక్తం చేయడానికి దారి చూపించ డమే ఆయన ఉద్దేశం. ‘బలం! బలం! బలం తప్ప నేను దేనినీ బోధించలేదు. అందుకే నేను ఉపనిషత్తులు బోధిస్తున్నాను’ అన్నారాయన. పురుషులలో ఆయన పురుషత్వాన్ని ఆశించారు; స్త్రీలలోనూ అలాంటి గుణాన్నే ఆశించారు. ఆ గుణాన్ని సూచించడానికి మాటలు చాలవు. ఆ గుణం ఏదైనా ఉండనీ; కాని అది స్వీయ కనికరమనే గుణానికి వ్యతిరేకమైనది; బలహీనతకు విరోధి; మితిమీరిన భోగాలలో లయించిపోవడానికి విరోధి. ఆయన ఈ వైఖరి పుష్టికరమైనదిగా పనిచేసింది. మాలో కాలాల పర్యంతం నిద్రాణంలో ఉన్నది జాగృతి చెందింది. దానితో మాలోని బలమూ, స్వేచ్ఛా భావమూ జతకట్టాయి.”
సన్న్యాస శిష్యులు
స్వామీజీ ఎందరికి, ఎలా దీక్ష ఒసగారన్నది ఆయనకే ఎరుక. ఆయన సన్న్యాస శిష్యులుగా దాదాపు 15 మంది ఉన్నారు.* వీరిలో కొందరు మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకొన్నారు, కొందరు సోదర సన్న్యాసుల నుంచి సన్న్యాసదీక్ష పుచ్చుకొన్నారు. వీరి జీవిత సంఘటనలు కొన్ని స్వామీజీ విభిన్న పరిమాణాలను చూపేవిగా ఉన్నాయి. విరజానంద, సదానందల జీవితాలతో సంబంధమున్న కొన్ని సంఘటనలు ఇంతకు మునుపు చూశాం. అలాంటి కొన్ని సంఘటనలను ఈ అధ్యాయంలో చూద్దాం.
నూరుసార్లు జారినప్పటికీ
స్వామి సదానంద (శరశ్చంద్ర గుప్త)
“స్వామీజీని ఊరకే నా గురువుగా స్వీకరించానా! నా పాదరక్షలను నిస్సంకోచంగా తమ తల మీద ఆయన మోశారు! నన్ను చూడండి, నేనంత మూర్ఖుడిగా ఉన్నాను. నా పాదరక్షలను తల మీద ఉంచుకొన్న వ్యక్తి నా గురువని కూడా గ్రహించలేని మూర్ఖుణ్ణి నేను. స్వామీజీ ప్రేమ అంతటిది! అంతెందుకు స్వామీజీకి సేవ లందించడానికి జన్మించినవాణ్ణి నేను. జీవితంలో నాకు మరే కోరికా లేదు” అనేవారు సదానంద. స్వామీజీ ప్రప్రథమ సన్న్యాస శిష్యుడు ఈయన.
స్వామీజీ సదానందకు హృషీకేశ్‌లో సన్న్యాస దీక్ష ఒసగారు. అప్పుడు సదా నంద ఆయనతో, “స్వామీజీ! బహుశా నేను సన్న్యాస ధర్మం నుంచి జారితే?…” అని ప్రశ్నించారు. “నూరుసార్లు జారినప్పటికీ ఫరవాలేదు! బాధ్యత నాది! నేను నిన్ను ఎంపిక చేశాను, నువ్వు నన్ను ఎంపిక చేయలేదు” అన్నారు. దీనిని కాలాంతరంలో ప్రస్తావించినప్పుడు సదానంద కళ్లు ఆర్ద్రమయ్యేవి; “స్వామీజీ ప్రేమ అంతటిది” అనేవారు ఆయన.
కన్నుల నుంచి కాంతి
స్వామీజీ పరివ్రాజక రోజుల గురించి సదానంద ఇలా చెప్పారు: “మేం ఒక నిమ్మతోటలో బసచేసి ఉన్నాం; భిక్షాన్నంతో జీవించాం. అక్కడ స్వామీజీ అనుష్ఠిం చిన ఆధ్యాత్మిక సాధనలు వర్ణనాతీతం! ఆయన జీవించిన ఆధ్యాత్మిక స్థితుల గురించి చెప్పనలవి కాదు! ఆయన ఏదో లోకంలో జీవిస్తున్నట్లు కనిపించారు. ఆయన మనస్సు దేహాన్ని వదలి మరెక్కడో కానరాని లోకంలో విహరిస్తున్నట్లు అనిపించేది. ఆయన ముఖారవిందాన మహాప్రశాంతత విరాజిల్లి ఉండేది. ఆయన కన్నుల నుంచి కాంతి కిరణాలు ప్రసరిస్తున్నట్లుండేది; వాటిని ఇతరులు ప్రత్యక్షంగా చూడలేరు; ఆయనను సమీపించడానికి సైతం భయంగా ఉండేది.
‘నా పురుషోచితమైన కుమారుడివి నువ్వు’
ఒకసారి స్వామీజీ, సదానందలు ఖేత్రీ మహారాజు అతిథులుగా బసచేసి ఉన్నారు. లొంగని ఒక మొరటు గుర్రాన్ని ఒకరోజు సదానంద లొంగదీస్తున్నారు. గుర్రం ఆయనను క్రిందికి త్రోసివేయడానికి ప్రయత్నించింది. ఈ దృశ్యాన్ని స్వామీజీ, మహారాజు మేడ మీద నుండి చూస్తున్నారు. చివరికి సదానంద జయించారు, గుర్రాన్ని దారి లోకి తెచ్చారు. తిరిగి రాగానే స్వామీజీ ఆయన వీపు మీద తట్టి, “సదానందా! పురుషోచితమైన నా కుమారుడివి నువ్వు” అని ప్రశంసించారు.
‘మిమ్మల్ని వదలివేస్తాను!’
సదానందకు స్వామీజీ పట్ల గల నమ్మకం వర్ణనాతీతం. ఒకరోజు స్వామీజీ తమ శిష్యులతో, “నా కన్నా ఉన్నతుడైన వ్యక్తి తారసపడితే నన్ను వదలివేస్తారా?” అని అడిగారు. అనేకులు విభిన్నమైన జవాబులిచ్చారు. అవన్నీ, “వదలం”, “ఎన్నటికీ వదలం”, “అది నాకు సాధ్యం కాదు” రీతిలో ఉన్నాయి. చివరగా స్వామీజీ, సదానందను “ఏం నాయనా! నువ్వేమంటావు?” అని ప్రశ్నించారు. అందుకు సదానంద, “అవును, వదలివేస్తాను” అన్నారు. అందరూ విస్తుపోయారు. ఆయన క్షణంసేపు మౌనంగా ఉండిపోయి ఇలా కొనసాగించారు: “మీకన్నా ఉన్నతుడైన ఒక వ్యక్తి తారసపడితే కచ్చితంగా నేను మిమ్మల్ని వదలిపెట్టే తీరాలి. ఎందుకంటే మీ కన్నా ఉన్నతుడైన వ్యక్తి ఒకరు ఉన్నారనుకోవడమే మిమ్మల్ని వదలివేయడానికి సమానం కదా!”
సదానంద చివరి రోజుల్లో జరిగిన ఒక సంఘటన పదే పదే ధ్యానార్హమైనది. సదానందకు స్వామీజీ పట్ల గల నమ్మకానికీ, అంతటి నమ్మకాన్నీ భక్తినీ ఒక శిష్యునిలో ఏర్పరచగల స్వామీజీ అవధుల్లేని కారుణ్యానికీ అద్దంపట్టే సంఘటన అది.
‘ఆయన క్షమిస్తారు!’
1911లో సదానంద మరణశయ్యపై ఉన్న సమయం అది. అప్పుడు స్వామీజీ సాహిత్య సంపుటాలు మాయావతిలో అచ్చయి వచ్చాయి. అచ్చు చిత్తు ప్రతులు అక్కణ్ణుంచి సదానందకు పంపించారు. భక్తిశ్రద్ధలతో వాటిని ఆయన చదివేవారు. ఈ రోజుల్లో ఆయన పడక మీద నుంచి లేవనుకూడా లేవలేకపోయే వారు. కాలకృత్యాలను పడక మీదే తీర్చుకొనేవారు. అందుకోసం మంచం మీద కాగితాలు పరచి ఉంచేవారు. ఒక రోజు సదానంద తమ సేవకునితో, “అదేం కాగితం?” అని అడిగారు. “పాత వార్తాపత్రిక” అని జవాబిచ్చాడు సేవకుడు. వెంటనే సదానంద తొట్రుపాటుతో, “వద్దు, వద్దు. దయచేసి వార్తాపత్రికలను వినియోగించవద్దు. సాక్షాత్తూ సరస్వతీదేవి వాటిలో కొలువుదీరి ఉంది. దేవీదేవతల గురించి వాటిలో వ్రాసి ఉండవచ్చు. ఆ వార్తాపత్రికను వినియోగించడం వలన నన్ను నేరస్థునిగా చేస్తున్నారు” అన్నారు. అందుకు సేవకుడు, “మహరాజ్! వ్రాయబడిన అన్ని కాగితాల్లోనూ సరస్వతీదేవి ఉంది. కనుక ఏ కాగితాన్ని వినియోగించాలి?” అని అడిగారు.
సదానంద కాసేపు మౌనం వహించారు. ఆయన కళ్లు ఆర్ద్రమైనాయి. పిదప గద్గద స్వరంలో ఇలా అన్నారు: “స్వామీజీ మాటలు అచ్చయిన ప్రతులను వినియోగించు. నేను ఆయన కుమారుణ్ణి. నేను ఏం చేసినా దానిని ఆయన అపరాధంగా పరిగణించరు. నా అన్ని తప్పులనూ ఆయన క్షమిస్తారు. నా తల్లి, తండ్రి, గురువు అన్నీ ఆయనే; నా సర్వస్వమూ ఆయనే!”
స్వామి కల్యాణానంద (దక్షిణ రంజన్)
1898లో మఠం నీలాంబర ముఖర్జీ ఇంట్లో నిర్వహింపబడిన రోజుల్లో మఠంలో చేరాడు దక్షిణ రంజన్. అప్పుడు స్వామీజీ మఠంలోనే ఉన్నారు. అతడు గ్రామీణ ప్రాంతానికి చెందిన వాడు; కించిత్తు కూడా కల్లాకపటం లేని వ్యక్తి. ఒక రోజు స్వామీజీ ఆతడితో, “రంజన్! బహుశా నాకు కొంత డబ్బు అవసరమై, అందుకోసం నిన్ను ఒక తేయాకు తోటలో కూలీగా విక్రయించాలని తీర్మానిస్తే నువ్వు అందుకు అంగీకరిస్తావా?” అని ప్రశ్నించారు. “ఓ! సమ్మతిస్తాను” అని క్షణం కూడా సంకోచించకుండా అతడు జవాబిచ్చాడు.
పుణ్యతీర్థాలలో తపోమయ జీవితం గడుపుతున్న కల్యాణానంద 1901 లో మఠానికి తిరిగి వచ్చాడు. ఒక రోజు స్వామీజీ ఆయనను పిలిచి, “చూడవయ్యా కల్యాణ్! హృషీకేశ్, హరిద్వార్ ప్రాంతాలలో వ్యాధిగ్రస్థులై బాధపడుతున్న సన్న్యా సులను చూసుకోవడానికి ఎవరూ లేరు. వారి కోసం నువ్వు ఏదైనా చేయగలవా? వెళ్లు, వెళ్లి వారి సేవ కోసం నీ జీవితాన్ని అంకితం చేయి” అన్నారు. మారు మాట్లాడకుండా కల్యాణానంద బయలుదేరారు.*
హృషీకేశ్, కంఖల్లలో సేవాకార్యాలకు కల్యాణానంద శ్రీకారం చుట్టారు. ఆ రోజుల్లో సంప్రదాయ సన్న్యాసులు ఇంతటి సేవాకార్యాలలో పాల్గొనేవారు కారు. కనుక రోగులకు సేవ చేయడం, వారికి స్నానపానాదులు ఆచరింప జేయడం, అవసరమైనప్పుడు మోసుకొని వెళ్లడం లాంటి కల్యాణానంద పనులు విమర్శకు గురియైనాయి. ఆయననూ, రామకృష్ణ మఠంలోని తక్కిన సన్న్యాసులనూ ‘పాకీ సన్న్యాసులు’ అని ఎగతాళి చేశారు. కాని కల్యాణానంద వీటిని పట్టించుకో కుండా, తమ గురువు ఆజ్ఞను శిరసావహించారు.
‘నువ్వొక పరమహంసవు అవుతావు!’
కల్యాణానంద సేవాకార్యాలు స్వామీజీకి పరమానందాన్ని కలిగించాయి. 1902 మే నెలలో కల్యాణానంద స్వామీజీ దర్శనార్థం బేలూర్ మఠానికి వచ్చారు. అప్పుడు స్వామీజీ ఆరోగ్యం బాగా దిగజారి ఉంది. ఒకరోజు స్వామీజీకి మంచుగడ్డ (ice) అవసరమయింది. కల్యాణానందతో ఆ విషయం చెప్పగానే ఆయన 8 కి.మీ. కాలినడకన కలకత్తా వెళ్లి 20 కిలోల మంచుగడ్డ కొనుగోలు చేసి తల మీద ఉంచుకొని బేలూర్ మఠానికి వచ్చారు. తమ శిష్యుని అద్వితీయమైన భక్తిని చూసి స్వామీజీ, “కల్యాణ్! నువ్వు పరమహంస స్థితిని పొందే రోజు వస్తుంది” అంటూ దీవించారు. స్వామీజీ దీవెనలు ఫలించడం కల్యాణానంద కాలాంతర జీవితం చూపించింది.
ఆరాధనా, సేవా?
ఒక రోజు స్వామీజీ కల్యాణానందను పిలిచి, “ఇదిగో చూడవయ్యా కళ్యాణ్! నేను దేనిని అభిలషిస్తున్నానో తెలుసా? ఒకవైపు శ్రీరామకృష్ణుల ఆలయం ఉండాలి. అక్కడ సన్న్యాసులూ, బ్రహ్మచారులూ ధ్యానం మొదలైన ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించాలి. సాధనల ద్వారా పొందిన లబ్ధిని సేవాకార్యరంగంలో అమలు చేయాలి” అన్నారు. అప్పుడు ప్రక్కనే ఉన్న అచలానంద కాలాంతరంలో దీనిని వివరించాడు: “ఆధ్యాత్మిక సాధనలు లేని సేవ ఉండకూడదు, సేవలు లేని ఆధ్యాత్మిక సాధనలు ఉండకూడదు. ఈ రెండూ పెనగొని సాగే అనుష్ఠాన వేదాంతమే సేవ అని కల్యాణానందకు స్పష్టం చేశారు స్వామీజీ.”
‘మట్టి కుండలో నీరు ఇవ్వు’
స్వామి నిశ్చయానంద (సూరజ్ రావు)
ఈయనను గురించి స్వామీజీ చెన్నై రోజుల్లో చూశాం.* ఒక రోజు ఆయనతో స్వామీజీ ఇలా అన్నారు: “ఇదిగో చూడు నిశ్చయా! ఒక సన్న్యాసి ఎన్నటికీ ఇతరులకు భారంగా ఉండకూడదు. నువ్వు ఒకరి నుంచి ఆహారం స్వీకరిస్తే, ఏదో రకంగా అది త్రిప్పి ఇవ్వాలి. ప్రక్క వ్యక్తి నుంచి తీసుకొని తిని తిని సన్న్యాసుల వర్గమే సోమరుల బృందమైపోయింది. ప్రక్క వ్యక్తి మీద ఆధారపడి జీవించడం వలన వారు ఆధ్యాత్మికతలో పురోగతి చెందడానికి మారుగా తిరోగమిస్తున్నారు. నువ్వు ఎన్నటికీ అలా వ్యవహరించకూడదు. పెద్దగా నువ్వు ఏమీ చేయలేకపోయినా చిన్నది ఏదైనా చేయి. యాచించి కొంత ధనం పొందు. ఒక మట్టికుండ కొనుగోలు చేయి. దాన్లో నీరు పోసి కాలిబాట ప్రక్కన కూర్చో. బాటసారులకు ఆ నీరు అందించు. దాహంతో దహించుకుపోయే వ్యక్తికి నీరు ఇవ్వడం పుణ్య కార్యం. సోమరిగా కూర్చుని ఇతరులు ఇచ్చే ఆహారం తినడం ఖండింప దగిన పని.”
కాలి నడకన సేవ
స్వామీజీ నిష్క్రమణానంతరం కొంతకాలం విభిన్న తీర్థస్థలాల్లో తపోమయ జీవితం గడపిన నిశ్చయానంద పై ఉపదేశాలను జ్ఞాపకం చేసుకొని, సేవామయ జీవితం గడిపారు. కంఖల్‌లో సేవాకార్యాలలో పాల్గొన్న కల్యాణానందతో కలిసి పేదసాదలకు సేవలందించారు. వేకువనే లేచి ఒక సంచీలో మందుల పెట్టె లాంటి అత్య వసరమైనవి తీసుకొని 28 కి.మీ. కొండదారిలో కాలినడకన హృషీకేశ్ వెళ్లేవారు. సన్న్యాసులు జీవించే చోట్లకు వెళ్లి వారి యోగక్షేమాలు విచారించి, అవసరమైన మందులు ఇచ్చేవారు. తరువాత భిక్షాన్నం తినేవారు. మళ్లీ సాయంత్రం దాకా ఈ రకంగా ఒక్కో చోటికి కాలినడకన వెళ్లి సన్న్యాసులను సేవించేవారు. మళ్లీ 28 కి.మీ. కాలినడకన కంఖల్ చేరుకొనేవారు. ఎండా వాన, శీతోష్ణాలనూ పట్టించుకో కుండా ఆయన ఈ సేవను ఎడతెగక కొనసాగించారు. రోజూ 56 కి.మీ. కాలినడకన వెళ్లి తమ సేవాకార్యాన్ని నిర్విఘ్నంగా చేశారు. గురువు వచనాలు ఆయనను ఈ మేరకు కార్యాచరణలో నిమగ్నం చేశాయి!
కుమారా!
స్వామి అచలానంద (కేదార్ బాబా)
కేదార్ మొదలైన కొందరు యువకులు కలిసి, నిరంజనానంద మార్గదర్శ కత్వంలో వారాణసిలో వైద్యశాల లాంటి సేవాకార్యాలలో పాల్గొనసాగారు. 1901 అక్టోబర్‌లో స్వామీజీ దర్శనార్థం బేలూర్ మఠానికి కేదార్ వచ్చాడు. అప్పుడు స్వామీజీ తమ గదిలో కూర్చుని ఉన్నారు. ప్రప్రథమంగా చూసిన స్వామీజీ దివ్యమంగళరూపం కేదార్ హృదయంలో అట్లే నిలిచిపోయింది – ముండన శిరస్సు, దివ్యప్రకాశంతో వెలుగొందుతున్న ముఖారవిందం, ఉత్సాహమూ కారుణ్యమూ పొంగిపొరలే రూపురేఖలు! కౌపీనం మాత్రమే ఆయన ధరించి ఉన్నారు!
‘నాయనా’ అనే పదం తండ్రిని సంబోధించడానికీ, అదేవిధంగా కుమారుణ్ణి ప్రేమగా సంబోధించడానికీ ఉపయోగిస్తున్నట్లు ‘బాబా’ అనే పదం ఉత్తర భారతంలో ఉపయోగిస్తారు. స్వామీజీ కేదార్‌ను ‘కుమారా’ అనే అర్థంలో ‘కేదార్ బాబా’ అని సంబోధించసాగారు. కాలాంతరంలో ఆ పేరు అట్లే నిలిచిపోయింది. తమ బేలూర్ మఠ రోజుల గురించి అచలానంద ఇలా చెప్పారు:
“నేను స్వామీజీ ప్రక్కనే ఎప్పుడూ ఉన్నప్పటికీ ఆయనను ఏ ప్రశ్నలూ అడిగేవాణ్ణి కాను. నివేదిత, సారా, ఒకాకుర లాంటి వారు వచ్చి ఆయనతో అనేక విషయాల గురించి సుదీర్ఘంగా చర్చించేవారు. నేను నిరక్షర కుక్షినైన మూర్ఖుణ్ణి. వారి మాటల్లో అత్యధిక భాగం నాకు అర్థమయ్యేవి కావు. కొన్ని సమయాలలో స్వామీజీ నాతో, “కేదార్ బాబా! హుక్కా సిద్ధం చేయి” అనేవారు. ఆయన నోరు తెరచి అడగక ముందే ఆయనకు అవసరమైనది చేయాలన్నదే నా ధ్యేయం. మధ్యాహ్నం కూడా నేను విశ్రాంతి తీసుకొనేవాణ్ణి కాను. ఉదయం నుంచి రాత్రి 10 గంటల దాకా ఆయనతోనే ఉండేవాణ్ణి.
“ఆహా! నేను మాతృదేవినీ, స్వామీజీనీ దర్శించాను. తక్కినవారు ద్వేషించే, నీచంగా చూసే వారిని వారు ఎక్కువగా ప్రేమించారు.”
‘నన్ను ఆరాధించు’
ఒక రోజు స్వామీజీ ఆలయం క్రింద ఉన్న వసారాలో కూర్చుని ఉన్నారు. ప్రక్కన బ్రహ్మానంద నిలబడి ఉన్నారు. అచలానంద ప్రాంగణం గుండా వెళుతు న్నారు. అప్పుడు స్వామీజీ ఆయనను పిలిచి, “కొన్ని పువ్వులు పట్రా” అన్నారు. అచలానంద తీసుకు రాగానే, “వాటిని నా పాదాల మ్రోల అర్పించి రోజూ ఆరాధించు” అన్నారు. అచలా నంద తు.చ. తప్పక అట్లే చేశారు. స్వామీజీ మళ్లీ, “వెళ్లి ఇంకా కొన్ని పువ్వులు పట్రా” అన్నారు. అచలానంద పువ్వులు తీసుకు రాగానే, “ఇక మఠాధిపతిని ఆరాధించు. గురుమా, మఠాధిపతీ అభిన్నులని సదా జ్ఞాపకం ఉంచుకో. అన్ని విషయాలలోనూ నువ్వు మఠాధిపతికి విధేయుడవై మసలుకో” అన్నారు.
అవతార పురుషులా?
స్వామి శుద్ధానంద (సుధీర్)
స్వామీజీ మొదటి పాశ్చాత్య ప్రయాణాన్ని ముగించుకొని మాతృదేశానికి తిరిగి వచ్చాక కలకత్తాలో ప్రియనాథ్ ముఖర్జీ అనే వ్యక్తి ఇంట్లో కొన్ని రోజులు బస చేశారు. అనేకమంది యువకులు ఆయన దర్శనార్థం అక్కడకు వెళ్లారు. అప్పటికే మఠానికి పరిచయస్థులైన సుధీర్, ఖగేన్ అనే ఇద్దరు యువకులను ఒకరోజు స్వామీజీకి శివానంద పరిచయం చేశారు. వీరు కాలాంతరంలో శుద్ధానంద, విమలానంద నామధేయాలతో సన్న్యాసం పుచ్చుకొన్నారు.
ఒకరోజు శరశ్చంద్ర ద్వారా స్వామీజీని సుధీర్ ఒక ప్రశ్న అడిగారు.
ప్రశ్న : అవతార పురుషునికీ, స్వయంకృషితో ముక్తి పొందిన వ్యక్తికీ వ్యత్యాస మేమిటి?
స్వామీజీ : మరణానంతరం లభించే ముక్తే అన్ని స్థితులలోనూ అత్యున్నత మైనదని నా దృఢనమ్మకంగా ఉండేది. నా సాధన రోజుల్లో నేను యావద్భారత దేశం పర్యటించాను. ఎన్నో రోజులు గుహావాసం చేశాను! ముక్తి లభించకపోతే దేహత్యాగం చేద్దామని కూడా అనేకసార్లు అనుకొన్నాను. ఓ! ఎంత కఠోర సాధనలు నేను అనుష్ఠించాను! కాని ఇప్పుడు నాకు ముక్తి పట్ల అంతగా అభిలాష లేదు. కేవలం ఒక్క వ్యక్తికి ముక్తి లభించకుండా మిగిలిపోయే పక్షంలో నాకు ముక్తి అవసరం లేదన్నదే ప్రస్తుత నా మనఃస్థితి.
దీనిని గురించి కాలాంతరంలో శుద్ధానంద ఇలా చెప్పారు:
“స్వామీజీ దీనిని ఎంతో ఉద్వేగవెల్లువతో వ్యక్తం చేశారు. ‘ఒక మానవ హృదయంలో ఇంతటి కారుణ్యం ఉండడం సాధ్యమా? ఇంత కనికరం ఉండడం సాధ్యమా? తన మనఃస్థితిని వ్యక్తం చేయడం ద్వారా స్వామీజీ అవతార పురుషుని గుణగణాలను వివరిస్తున్నారా?’ అని నాకు అనిపించింది.”
ఒక రోజు సుధీర్, ఖగేన్లు వెళ్లినప్పుడు స్వామీజీ వారితో “మీరు ఉపనిషత్తులు అధ్యయనం చేశారా?” అని అడిగారు. “అవును. కాస్త అధ్యయనం చేశాను” అన్నాడు సుధీర్.
“ఏ ఉపనిషత్తు?”
“కఠోపనిషత్తు.”
కఠోపనిషత్తు అనగానే స్వామీజీ ముఖం వికసించింది. “ఏదీ ఒకటి రెండు మంత్రాలను వల్లించండి చూద్దాం. కఠోపనిషత్తు చాలా గొప్పది; కవిత్వ శైలితో నిండింది” అన్నారు.
సుధీర్ భగవద్గీతను ఆసాంతం కంఠోపాఠం చేశాడు. కాని కఠోపనిషత్తు కంఠోపాఠం చేయలేదు. ఆ విషయం చెప్పగానే స్వామీజీ, “సరే, భగవద్గీత నుంచి ఒకటి రెండు శ్లోకాలు వల్లించు” అన్నారు. 11వ అధ్యాయం నుంచి కొన్ని శ్లోకాలు నిర్దుష్టమైన ఉచ్చారణతో అతడు వల్లించాడు. స్వామీజీ పరమానందభరితులై, “చాలా బాగుంది” అన్నారు.
ఉపనిషత్తుల ఋషా?
ఉపనిషత్తులంటే స్వామీజీకి ప్రాణం! ఉపనిషత్ మంత్రాలను ఆయన పారాయణం చేయడం ఒక్కసారి వింటే అది ఎన్నటికీ మనస్సులో నుంచి తొలగి పోదు. ఒకరోజు వాన మబ్బులు ఆకాశాన్ని చిమ్మచీకటి చేస్తూ గుంపులు గుంపులుగా కదలిపోతున్నాయి. ఆ చీకటి నేపథ్యంలో హఠాత్తుగా మెరుపు మెరసి వెండి రేఖలుగా ప్రకాశించింది. స్వామీజీ దానిని చూపిస్తూ తమకు అమితంగా నచ్చిన ఉపనిషత్తుల మంత్రాలలో ఒకటి చెప్పారు:
“అక్కడ సూర్యుడు ఉదయించడు. చంద్ర తారకలు అసలే ప్రకాశించవు. మెరుపులు కూడా మెరవవు. ఇక ఈ అగ్ని మాట ఎందుకు! ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే అన్నీ దానిని అనుసరించి ప్రకాశిస్తాయి. దాని వెలుగుతోనే ఇదంతా వెలిగింపబడుతున్నది.”*
“ఆ పరిస్థితీ, స్వామీజీ కంచు కంఠమూ ఆయన ముఖారవిందాన ప్రకా శించిన పరమానందమూ నేటికీ నా జ్ఞాపకాలలో నిలిచిపోయాయి. ఓ! ఆధ్యాత్మిక జ్ఞానం నా నుంచి సుదూరంలో ఉంది; దానిని నేను పొందడం అంత సులభం కాదనే మానసిక దౌర్బల్యం నన్ను ఆక్రమించుకొన్నప్పుడల్లా ఇవే పదేపదే ప్రతిధ్వనిస్తున్నాయి:
“అమృత పుత్రులందరూ స్వర్గలోకాలలోని వారు కూడా చెవియొగ్గి వింటారు గాక! సకలమైన అంధకారానికీ అతీతమై సూర్యదీప్తితో వెలిగే ఆ మహాపురుషుణ్ణి నేను సాక్షాత్కరించుకొన్నాను. ఆయనను ప్రత్యక్షం చేసుకోవడం వలన మాత్రమే మనిషి మృత్యువుకు అతీతుడవుతాడు. ఈ జనన మరణ చక్రం నుంచి తప్పించుకోవడానికి మరొక దారి లేదు.”*
కన్నుల ఆకర్షణ
ఒకరోజు స్వామీజీతో శాస్త్ర చర్చ చేయడానికి కొందరు పండితులు మఠానికి వచ్చారు. వాదం సాగింది; పండితులు కాసేపటికల్లా పరాజయం చవిచూశారు. కాని పరాజయాన్ని అంగీకరించడానికి మనస్కరించని ఆ పండితులు, “ఈ స్వామి గొప్ప పండితుడేమీ కాదు. కాని ఆయన కన్నులలో ఆకర్షణ శక్తి ఉంది. ఆ శక్తి వల్లనే ఆయన వాదనల్లో జయిస్తున్నాడు” అంటూ వ్యాఖ్యానించి వెళ్లిపోయారు. అది విన్న సుధీర్ తనలో తాను, ‘నిజమే, నా గురువు కన్నులలో ఆకర్షణశక్తి ఉంది. కాని ఆ శక్తి ఏమిటన్నది గ్రహించగోరితే మీరు ఆయనతో దివ్యసంబంధం నెరపాలి; ఆయన అనుష్ఠించిన అసాధారణ ఆధ్యాత్మిక సాధనలను వినమ్రతతో నేర్చుకోవాలి’ అని అనుకొన్నాడు.
దీక్షా విధానం
శ్రీరామకృష్ణుల పూజా మందిరంలోనే తమ శిష్యులను కూర్చోబెట్టి వారికి యోగాసనం, ప్రాణాయామం, ధ్యానం మొదలైనవి స్వామీజీ నేర్పించేవారు. ఆయన వినతి మేరకు తురీయానంద చాలా సేపు ధ్యాన తరగతులు నిర్వహించేవారు.
స్వామీజీ ఒక రోజు సుధీర్‌ను పిలిచి, “నీకు సాకార దైవం, నిరాకార దైవం – వీటిలో ఏదంటే ఇష్టం?” అని అడిగారు. “కొన్ని సమయాలలో సాకార భగవంతుణ్ణీ, మరికొన్ని సమయాలలో నిరాకార భగవంతుణ్ణీ తలచుకొంటాను” అని జవాబు చెప్పాడు సుధీర్. “అది మంచి పద్ధతి కాదు. శిష్యునికి సముచిత మార్గం ఏదో గురువుకు మాత్రమే తెలుసు. నీ చేయి అందించు చూద్దాం” అంటూ సుధీర్ కుడిచేతిని కాసేపు పుచ్చుకొని స్వామీజీ ధ్యానం చేశారు. తరువాత అతడితో, “ఈ మంత్రం నీకు సముచితంగా ఉంటుంది” అంటూ ఒక మంత్రం ఉపదేశించారు.
క్రొత్త మతమా?
ఒకరోజు యువకుడొకడు వచ్చి, “స్వామీజీ! మీరు భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ ఒక క్రొత్త మతాన్ని ప్రచారం చేస్తున్నారా?” అని ప్రశ్నించాడు.
స్వామీజీ : క్రొత్త మతమని నువ్వు దేనిని ప్రస్తావిస్తున్నావు?
యువకుడు : గంగాస్నానం వలన ముక్తి కలుగుతుంది లాంటి నమ్మకాలను మీరు అంగీకరించరు కదా? దానినే ప్రస్తావించాను.
స్వామీజీ : అవేం మాటలు నాయనా! నేను రోజూ గంగాస్నానం చేస్తు న్నాను. స్నానం చేయలేని పక్షంలో కనీసం గంగాజలం తల మీద చల్లుకొంటాను. తల మీద చల్లుకొని, కొన్ని నీటి చుక్కలు గ్రోలుతున్నాను కూడా.
కాసేపటి తరువాత ఒక వృద్ధ బ్రాహ్మణుడు అక్కడకు వచ్చాడు.
వృద్ధుడు : స్వామీజీ! మీరు మన సనాతన హైందవ ధర్మాన్ని లోకమంతా ప్రచారం చేసి వచ్చారు. మీరు సుప్రసిద్ధులు!
స్వామీజీ : సనాతన హైందవ ధర్మమని మీరు దేనిని పేర్కొంటున్నారు?
వృద్ధుడు : అదేమిటి! కాశీలో మరణిస్తే ముక్తి తథ్యమని నమ్ముతున్నారు. అలాంటి వాటి గురించే చెప్పాను.
స్వామీజీ : లేదు. జ్ఞానం లభించకుండా ముక్తి లేదు. జ్ఞాని ఎక్కడ ఉన్నప్పటికీ ఆతడికి ముక్తి తథ్యం. జ్ఞానం గురించి విచారణ చేయండి. నేను రోజూ చేస్తున్నాను.
ఈ విధంగా ఇద్దరితోనూ స్వామీజీ రెండు రకాలుగా మాట్లాడడం చూసి శుద్ధానంద విస్తుపోయారు. స్వామీజీ ఎదుట మోకరిల్లి, “స్వామీజీ! వచ్చినవాళ్ళు వచ్చినట్లే వెళ్లిపోయారు. ఇప్పుడు నేను గందరగోళంలో పడ్డాను” అన్నారు. అప్పుడు స్వామీజీ ఆతడితో, “నువ్వు నన్ను అడుగు. నీకు అవసరమైన జవాబు నేనిస్తాను” అన్నారు. వెంటనే శుద్ధానంద, “సరి, చెప్పండి. ముక్తి దేని వలన లభిస్తుంది?” అని అడిగాడు. స్వామీజీ గంభీర ముద్ర వహించి శుద్ధానందను పరికిస్తూ, “గురువు సేవ వలన” అన్నారు.
ఆశీర్వదిస్తున్నాను!
ఒకసారి శుద్ధానంద, కొందరు యువసన్న్యాసులతో స్వామీజీ వద్దకు వచ్చి తమను ఆశీర్వదించమని వేడుకొన్నారు. “శ్రీరామకృష్ణులు ఎలా తమ శిష్యుల విధివ్రాతను సైతం మార్చి వ్రాయగలిగేవారిలా (కపాల మోచనులు) విరాజిల్లారో, అలా మీరు మమ్మల్ని అనుగ్రహించాలి” అని ప్రార్థించారు. స్వామీజీ కాసేపు మౌనం పాటించి తరువాత గంభీర స్వరంలో ఇలా అన్నారు: “మిమ్మల్ని ఆశీర్వ దిస్తున్నాను. శ్రీగురుదేవులు తమ అనుగ్రహాన్ని మీ మీద వర్షిస్తారు గాక! ఇంతకన్నా ఉన్నతమైన ఆశీస్సును మీకు నేను అందించగలనని భావించడం లేదు.”
వినమ్రత
స్వామి విమలానంద (ఖగేన్)
పాశ్చాత్యం నుంచి స్వామీజీ కలకత్తాకు తిరిగి వచ్చిన సందర్భంలో ఇచ్చిన స్వాగతోత్సవంలో యువకులు పాల్గొని ఆయన రథానికి పూన్చిన గుర్రాలను విప్పివేసి, తామే రథం లాగారు. ఆ యువకులలో ఒకడు ఖగేన్.
ఒకరోజు ఒక వ్యక్తి “స్వామీజీ! మీరు శ్రీరామకృష్ణుల గురించి చేసిన ప్రసంగాన్ని ఎందుకు పుస్తక రూపంలో విడుదల చేయలేదు?” అని స్వామీజీని ప్రశ్నించాడు.
స్వామీజీ : గురువుకు తగిన శిష్యునిగా నేను ప్రవర్తించలేదు, అందుకే. గురుదేవులు దేనినీ, ఎవరినీ ఖండించలేదు. కాని ఆయనను గురించి చేసిన ఆ ప్రసంగంలోనే నేను అమెరికన్లను విమర్శించాను; డబ్బే దైవంగా భావించే వారి పోకడను ఖండించాను. గురుదేవుల గురించి ప్రసంగించడానికి నాకు అర్హత లేదని ఆ రోజే నేను అర్థం చేసుకొన్నాను.
స్వామీజీ ఈ వినమ్రత ఖగేన్ను అమితంగా ఆకట్టుకొంది. “ఈ మాటలు అనేక కారణాల వలన నన్ను ఆకర్షించాయి. ‘ఇదిగో ఈ మనిషిని ప్రజలు శ్లాఘి స్తున్నారు, స్తుతిస్తున్నారు, అంతెందుకు ఆరాధిస్తున్నారు. ఆ ప్రజల ముందే తాము తమ గురువుకు అనర్హుడైన శిష్యుడనని ఆయన చెబుతున్నారు. ఎంతటి వినమ్రత! ఇంతటి మహాత్ముడైన వ్యక్తి హృదయంలో ఇంత పెద్ద చోటును ఆక్రమించిన ఆ గురుదేవులు ఎంతటి అద్భుతమూర్తియై ఉండి ఉండాలి!’ అనే ఆలోచనలు నా మనస్సులో తలెత్తాయి” అన్నాడతడు.
సన్న్యాస జీవితపు కఠోరాలు
స్వామి స్వరూపానంద (అజయ్ హరి)
అజయ్ సర్వసంగ పరిత్యాగం చేయాలనుకోవడంలోని నిజానిజాలు పరీ క్షించాలనుకొన్న స్వామీజీ ఇలా అడిగారు: “అజయ్! సన్న్యాస జీవితపు కఠోర నియమాలు నువ్వు పాటించగలవా? గురువు ఆదేశిస్తే నువ్వు నిస్సంకోచంగా విషనాగం ముందు నిలబడగలవా? ఫిరంగులను ప్రతిఘటించగలవా? వీటి పర్యవసానం మరణమే అని తెలిసీ నువ్వు వీటిని శిరసా వహించగలవా? సుఖ జీవితానికి నువ్వు బానిసవు కాకూడదు. గురువు మాటను మారుమాట్లాడకుండా శిరసావహించాలి. కామం, లోభం లాంటి చింతనలు తలెత్త కూడదు. నీ మృదులమైన ఉద్వేగాల నన్నిటినీ నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసుకోవాలి. ‘సన్న్యాసికి ఆత్మస్తుతి ఒక మత్తు. పేరు ప్రఖ్యాతుల పట్ల అభిలాష ఒక నరకం. ఆత్మగౌరవం మలంతో సమానం’ అన్న విషయం సదా నువ్వు విస్మరించకూడదు. ‘స్వీయముక్తి కోసమూ, లోక హితం కోసమూ’ నువ్వు నీ జీవితాన్ని అంకితం చేయాలి. చెప్పు నాయనా! నువ్వు ఇవన్నీ పాటించగలవా? బాగా యోచించి నిర్ణయించుకో. లేకపోతే ఇంటికి తిరిగి వెళ్లి అక్కడ సన్మార్గంలో జీవితం గడుపు.”
వీటినన్నింటినీ స్వీకరించి అజయ్ సన్న్యాసానికి సిద్ధమైననప్పుడు స్వామీజీ పరమానందభరితులయ్యారు.
ఆశీస్సుల అర్థం
ఒకరోజు స్వామీజీ స్వరూపానంద తల మీద చేతిని ఉంచి ఆశీర్వదించి ఇలా అన్నారు: “ఇదిగో చూడు నాయనా స్వరూప్! ఇలా నేను ప్రతి ఒక్కరి తల మీద చేతులు ఉంచితే ఆ తరువాత ఆతడు ఏ కారణం వలనా కలత చెందనక్కర్లేదు. దాన్లో కించిత్తు కూడా సంశ యించ వద్దు!”
సామూహిక త్యాగం
స్వామి ప్రకాశానంద (సుశీల్)
స్వామీజీ ఒకసారి ప్రకాశానందను ఆలింగనం చేసుకొని ఇలా అన్నారు: “నాయనా! గురుదేవుల పావన కార్యార్థం నేను నా జీవితాన్ని అంకితం చేశాను. ఆయన కార్యం కోసం మీరందరూ మీ జీవితాలను త్యాగం చేయాలి. ఆయన పావన పీఠానికి ఇంకా అనేకుల జీవితాలు అర్పితమవుతాయి. మన ఈ సామూహిక త్యాగం వల్లనే ఆయన మహత్కార్యం ఈడేరుతుంది.”
స్వామీజీ పూజ
స్వామి బోధానంద (హరిపాదుడు)
ఆలంబజార్ మఠ రోజుల్లో హరిపాదుడు మఠంలో చేరాడు. స్వామీజీ పాశ్చాత్య దేశాల నుంచి తిరిగి వచ్చాక అనేక క్రొత్త నియమాలను ప్రవేశపెట్టారు. వాటిలో ఒకటి అఖండ ధ్యానం; అంటే ఎడతెగని ధ్యానం. పూజామందిరంలో సన్న్యాసులూ, బ్రహ్మచారులూ ఒకరి తరువాత ఒకరుగా రాత్రంతా ధ్యానం చేయాలి. అందరూ సమధికోత్సాహంతో దానిలో పాల్గొన్నారు. అప్పుడు ఒకరోజు స్వామీజీ నిర్వర్తించిన పూజ గురించి హరిపాదుడు ఇలా చెప్పాడు.
“ఒకరోజు ఉదయం అందరూ పూజామందిరంలో ధ్యానమగ్నులై ఉన్నారు. ఆ రోజు శ్రీరామకృష్ణ పూజ చేయమని స్వామీజీని అడగాలని పూజారియైన బాబూరాం మహరాజ్‌కు అనిపించింది. ఆయన అడగగానే స్వామీజీ వెంటనే లేచి ప్రశాంతంగా నడచి వెళ్లి పూజారి ఆసనంలో కూర్చున్నారు. కూర్చోవడమే ఆలస్యం! మరేదో లోకానికి వెళ్లిపోయిన వ్యక్తిలా ధ్యానంలో లయించిపోయారు. చాలాసేపు ఆ స్థితిలోనే కూర్చుండిపోయారు. క్రమక్రమంగా సాధారణ స్థితిలోకి వచ్చారు. తరువాత అరగదీసిన చందనాన్ని చేతిలోకి తీసుకొని పూజార్థం ఉంచిన పువ్వుల మీద చిలకరించారు. దోసిలిలో పువ్వులు ఉంచుకొని పీఠం మీద, శ్రీరామకృష్ణుల పాదుకల మీద, ఆయన అస్థి కలశం మీద సమర్పించారు. మళ్లీ పువ్వులు తీసు కొని అక్కడ ఉన్న సోదర సన్న్యాసులు, తక్కిన సన్న్యాసు లందరి మీదా వెదజల్లారు. ఇదే స్వామీజీ చేసిన పూజ!
“ఘంటానాదాలు లేవు, క్రియాకలాపాలు లేవు, పూజాపాత్రలు ఏవీ లేవు! ఇలాంటి పూజను తిలకించిన భాగ్యశాలిని నేను. అందరిలోనూ గురుదేవుల సాన్నిధ్యాన్ని అనుభూతం చేసుకొన్న వ్యక్తి స్వామీజీ. అందుకే అందరినీ ఆరా ధించారు. సోదర సన్న్యాసులు మాత్రమే కాదు, తమ శిష్యులను కూడా ఆరా ధించారు! స్వామీజీ పూజ ముగియగానే అక్కడున్న అందరూ స్వామీజీకి సాష్టాంగ ప్రణామం చేశారు. ఆహా! ఎంతటి అద్భుత దృశ్యం అది!”
అనుకరించకు!
స్వామీజీ కాశీలో ఉన్న రోజుల్లో బోధానంద హృషీకేశ్‌లో తపోమయ జీవితం గడిపారు. స్వామీజీ రాకను విని ఆయన దర్శనార్థం కాశీ వచ్చారు. బోధానంద రావడం తెలుసుకొన్న స్వామీజీ, “ఆతణ్ణి తిన్నగా నా వద్దకు రమ్మను. తపోరూపంలో ఆతణ్ణి నేను చూడాలి” అన్నారు. బోధానందను చూసి ఆనందించారు. ఆతడి ఆధ్యాత్మిక సాధనల గురించి వాకబు చేశారు. తరువాత అతణ్ణి “నువ్వు రావడం నాకు సంతోషంగా ఉంది. కాశీలో ఒక మఠం స్థాపిస్తే దానికయ్యే ప్రారంభ ఖర్చులు మొత్తం తాను భరిస్తానని ఒక రాజు వాగ్దానం చేశాడు. నువ్వు ఆ బాధ్యత స్వీకరిస్తావా?” అని అడిగారు. అందుకు బోధానంద, “నా కన్నా ఎక్కువ అర్హతలున్న, నా కన్నా శాస్త్రాలను చక్కగా బోధించ గల వారు అనేకులు ఉన్నారు. కనుక నన్ను వదలిపెట్టండి” అని చెప్పి, వినమ్రంగా తిరస్కరించారు. వెంటనే స్వామీజీ, “తక్కిన వారి గురించి నువ్వెందుకు కలత చెందుతావు? ఇతరులను అనుకరించకుండా జీవించడానికి ప్రయత్నించు. నీ ఆదర్శాన్ని విస్మరించకుండా, నీకు సహజమైన మార్గంలో పరిపూర్ణంగా పనిలో నిమగ్నమవు. ఇలా మనఃస్ఫూర్తిగా నిమగ్నమై పని సాగిస్తే నీకు విజయం తథ్యం” అన్నారు.
గురువు పట్ల విశ్వాసం
స్వామి ఆత్మానంద (సుకుల్)
స్వామీజీ 1897లో పాశ్చాత్యం నుంచి తిరిగి వచ్చినప్పుడు ఆయనను సుకుల్ కలుసుకొన్నాడు. అతడు దుర్బల దేహుడు. ఒకరోజు స్వామీజీ ఆతడితో, “సుకుల్! నువ్వు సన్న్యాసం పుచ్చుకోవడానికా ఇక్కడకు వచ్చావు?” అని అడిగారు. అందుకు సుకుల్, “స్వామీజీ, ఒక సన్న్యాసి అవడానికైన దృఢశరీరమో, మనస్సో నాకు లేవు. ఈ జన్మలో నాకు లభించిన ఈ దేహాన్ని మీకు సేవలందించడంలో అంకితం చేస్తే మరుజన్మలో దృఢమైన మనస్సూ, దేహమూ లభిస్తాయనే నమ్మకంతోనే ఇక్కడకు వచ్చాను” అన్నాడు. ఈ జవాబు విని స్వామీజీ చాలా సంతోషించారు. “మంచిది, మంచిది” అన్నారాయన.
ఆత్మానందకు స్వామీజీ పట్ల గల విశ్వాసం సాటిలేనిది. ఆయన చిన్నతనం నుంచే శాకాహారి. ఒక రోజు స్వామీజీ ఆయనకు చేపకూర ఇచ్చి తినమన్నారు గురువు పట్ల గల భక్తివిశ్వాసాల కారణంగా ఆత్మానంద మారుమాట్లాడకుండా దానిని తినడానికి సిద్ధపడ్డారు. కాని ఆయన తినబోతున్నప్పుడు స్వామీజీ ఆపేశారు; గురువు పట్ల గల విశ్వాసాన్ని శ్లాఘించారు.
మరో రోజు స్వామీజీ ఆత్మానందను పిలిచి తమ మీద కొన్ని కల్పిత దోషాలను ఆపాదించుకొని, “ఇదిగో చూడు, ఈ రకమైన దోషాలు నాలో ఉన్నాయి. ఇలా ఉన్నప్పటికీ నన్ను నీ గురువుగా గౌరవిస్తావా?” అని అడిగారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా, “మీరేం కావాలన్నా చెప్పుకోండి. నా మటుకు నాకు మీరే సర్వస్వం” అన్నారు ఆత్మానంద.
కాలాంతరంలో ఆత్మానంద ఇలా అనేవారు: “గురువు మాటలోనూ, శాస్త్రాల లోనూ నమ్మకం ఉంచడం సన్న్యాసి జీవితంలో పెన్నిధి అవుతుంది. ఈ రెండింటి లోనూ గురువు మీద నమ్మకం అతి ముఖ్యం.”
సన్న్యాసికి యాజమాన్యం కూడదు
సన్న్యాసికి యాజమాన్యం కూడదన్నది స్వామీజీ ఏర్పరచిన నియమాలలో ఒకటి. సన్న్యాసులు తమకు లభించేదంతా మఠానికి ఇచ్చివేయాలి. ఒకసారి ఆత్మానంద హృషీకేశ్‌లో తపోమయ జీవితంలో మగ్నుడైనారు. అక్కణ్ణుంచి తిరిగి వచ్చినప్పుడు ఆయన వద్ద ఒక దుప్పటి, ఒక కమండలం ఉన్నాయి. నియమానుసారం వాటిని ఆయన మఠంలో ఇచ్చేశారు. కొన్ని రోజుల తరువాత ఆయన అస్వస్థుడైనారు. కప్పుకోవ డానికి ఆయనకు దుప్పటి లేదు. దీనిని ఎవరూ గమనించలేదు. కాని స్వామీజీ మాత్రం చూశారు. ఆయన దుప్పటి లేకుండా పడుకోవడం చూసిన స్వామీజీ వ్యథ చెందారు. “నేను నియమాలు రూపొందించాను. అందుకే వీరు తమ వద్ద ఉన్నదంతా మఠంలో ఇచ్చేశారు. ఇప్పుడేమిటంటే వీరికి అవసరమైనది మఠంలో గమనించ కుండా వదలివేశారు. ఏం వింత!” అన్నారు. తరువాత ఆయనే వెళ్లి దుప్పటి, తలగడ తెచ్చి ఆత్మానంద పడక మీద పరచి ఆయనను పడుకోబెట్టారు. అత్యవసర మైన వాటిని మఠంలో తిరిగి ఇవ్వవద్దని ఆయనతో స్పష్టంగా చెప్పారు.
‘వస్తారని నిరీక్షిస్తున్నాను!’
స్వామీజీ నిష్క్రమణానంతరం చాలా కాలం తరువాత ఒక రోజు ఒక సన్న్యాసి ఆత్మానంద గదిలోకి వెళ్లాడు. ఆయన పడక ఎప్పటిలా మడతలు నలగ కుండా శుభ్రంగా ఉంది. కాని ఆత్మానంద నేల మీద పడుకొని ఉన్నారు. వచ్చిన సన్న్యాసి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. కనుక ఆత్మానందను కారణం అడిగాడు. కళ్ల నుంచి నీరు స్రవిస్తూండగా ఉద్వేగ వెల్లువతో గద్గద స్వరంలో ఆత్మానంద ఇలా చెప్పారు: “స్వామీజీకి ఈ పడక అంటే మహా ఇష్టం. ఈ గది దారి గుండా వస్తే దీని మీద కాసేపు పడుకొని వెళ్లేవారు. ఆయన మళ్లీ రావచ్చు కదా! ఆయన ఎప్పుడు వేంచేసినా పడుకోవడానికి పడకను సిద్ధంగా ఉంచి నేను నిరీక్షిస్తున్నాను!”
‘బాధ్యత తీసుకొంటాను!’
స్వామి పరమానంద (సురేశ్)
1901లో తన 16వ ఏట శ్రీరామకృష్ణ జయంతికి కొన్ని రోజుల ముందు బేలూర్ మఠానికి మొట్టమొదటిసారి సురేశ్ వచ్చాడు. సన్న్యాసులూ, తక్కినవారూ జయంత్యుత్సవ ఏర్పాట్లలో మునిగివున్నారు. స్వామీజీ తాము అలవాటు ప్రకారం కూర్చునే మామిడి చెట్టు క్రింద మంచం మీద విశ్రాంతి తీసుకొంటున్నారు. కాలాంతరంలో సురేశ్ ఇలా చెప్పాడు: “ఇంతవరకు నా జీవితంలో కనీవినీ ఎరుగని, అంతదాకా చూసినవారి నుంచి పూర్తిగా విభిన్నమైన ఒక వ్యక్తిని అక్కడ నేను చూశాను. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని ఆయన విశాలమైన కాంతిమంత మైన కళ్లు నాతో ఎన్నో మాటలు మాట్లాడాయి.”
పదిహేడవ ఏట మఠంలో చేరడానికి సురేశ్ వచ్చాడు. శాసనరీత్యా యుక్త వయస్సుకు రాని వ్యక్తిని మఠంలో చేర్చుకోవడానికి సంకోచించారు. అందరూ స్వామీజీ వద్దకు వెళ్లారు. అందరి అభిప్రాయాలూ విని స్వామీజీ సురేశ్‌ను చూశారు. బ్రతిమలాడే ధోరణిలో అతడు నిలబడి ఉన్నాడు. స్వామీజీ కారుణ్యం ఉట్టిపడే స్వరంలో అతణ్ణి, “ఏం నాయనా! నీకు పాడడం తెలుసా?” అని అడిగారు. వణికే స్వరంలో సురేశ్ జగజ్జనని మీద ఒక పాట పాడాడు.
సురేశ్ పాట పూర్తికాగానే అక్కడ మౌనం రాజ్యం చేసింది. స్వామీజీ తదేకంగా సురేశ్ కళ్లను చూశారు. తరువాత తమ సోదర శిష్యులను చూసి, “ఈ కుర్రాణ్ణి మఠంలో ఉండనివ్వండి. ఈతడి పూర్తి బాధ్యతను నేను పుచ్చుకొంటాను” అన్నారు.
వసంతం – సన్న్యాసి
“వసంత కాలం తను వెళ్లే ప్రాంతాలలో పక్షుల కిలకిలారావాలనూ, పువ్వుల సౌరభాన్నీ మోసుకొని పోతుంది. అలాంటి వాడు సన్న్యాసి” అనే అర్థం వచ్చే ఆదిశంకరుల శ్లోకం ఒకటి ఉంది. బ్రహ్మానంద దానిని ప్రస్తావించి సురేశ్‌ను ‘వసంత్’ అని సంబోధించే వారు. కాలాంతరంలో ఆతడికి ఇదే పేరు స్థిరపడిపోయింది.
ఒక రోజు స్వామీజీ వసంత్‌ను పిలిచి, “నాయనా! నా కోసం నువ్వు భిక్షమెత్తుతావా?” అని అడిగారు. సంతోషంగా వసంత్ సమ్మతించాడు. లోపలికి వెళ్లి అందుకు తగిన దుస్తులు ధరించి వసంత్ బయటికి వచ్చాడు. స్వామీజీ అది చూడగానే, “ఆహా! దీనిని చూస్తున్నప్పుడు నాకు ఎంత ఆనందం కలుగుతున్నదో నీకు అర్థం కాదు. ఈ దుస్తులు నీకు బాగా నప్పాయి” అన్నారు. వసంత్ బయటికి వెళ్లడానికి బయలుదేరాడు. వెంటనే స్వామీజీ, “ఆగు, ఆగు. నీకు ప్రథమ భిక్ష నేనే వేస్తాను” అన్నారు. తరువాత వంటగదిలోకి వెళ్లి కొంచెం బియ్యం, కాయ గూరలు మొదలైనవి తెచ్చి ఇచ్చారు. పిదప ఆతణ్ణి హృదయపూర్వకంగా ఆశీర్వదించి పంపించారు.
వసంత్ తిరిగి వచ్చేటప్పటికి మధ్యాహ్నమయింది. ఆతడు తిరిగి వచ్చేదాకా ఆతురతతో స్వామీజీ వేచివున్నారు. ఆతణ్ణి చూడగానే పరమానందభరితులయ్యారు. వెంటనే ప్రేమానందను పిలిచి, “భిక్షాన్నం అతి పవిత్రమయింది. శ్రీరామకృష్ణులకు అది అంటే చాలా ఇష్టం. వసంత్ తెచ్చింది మాత్రమే నేడు నేను తింటాను” అన్నారు. తరువాత వసంత్‌ను చూసి, “నీకు వంట తెలుసా?” అని అడిగారు. “అవును” అంటూ వసంత్ వంటచేయ నారంభించాడు. వంట ముగిసేటప్పటికి రెండు గంటలయింది. అప్పటి దాకా వేచివుండి ఆ ఆహారాన్ని ఆనందంగా స్వామీజీ భుజించారు.
ఇతరులు జీవింప తాము అభిలషించారు
స్వామి నిర్భయానంద (కనాయ్)
ఒకరోజు స్వామీజీ రైలులో వెళుతున్నారు. ఆయన వెంట బ్రహ్మచారి కనాయ్ ఉన్నాడు. ఒక స్టేషన్లో రైలు ఆగింది. అక్కడ ఒక వ్యక్తి వివిధ రకాల తినుబండారాలను ఒక పెట్టెలో ఉంచుకొని నడుస్తూ అమ్ము కొంటున్నాడు. వాటిలో మొక్కజొన్న కండెలు కూడా ఉన్నాయి. స్వామీజీ కూర్చున్న పెట్టె ప్రక్కన అతడు పదేపదే నడిచాడు. స్వామీజీ కనాయ్ను పిలిచి, “ఉడకబెట్టిన మొక్కజొన్న ఆరోగ్యానికి మంచిది. తినాలనిపిస్తోంది” అన్నారు. స్వామీజీ మానసిక స్థితిని అర్థం చేసుకొన్న కనాయ్ ఆతణ్ణి పిలిచి మొక్కజొన్న కండెను కొన్నాడు. ఒక కండె ధర ఒక పైసా. అతడికి సహాయం చేయడానికి స్వామీజీ మొక్కజొన్న కండెను కొనమన్నారని గ్రహించిన కనాయ్ అతడికి నాలుగు అణాలు (25 పైసలు) ఇచ్చాడు. పెట్టెలోకి రాగానే స్వామీజీ కనాయ్తో, “ఏం నాయనా! ఆతడికి ఎంత ఇచ్చావు?” అని అడిగారు. “నాలుగు అణాలు” అన్నాడు కనాయ్. వెంటనే స్వామీజీ, “ఏం నాయనా! ఆ నాలుగణాలతో అతడికి ఏం వస్తుంది? వెళ్లు. వెళ్లి ఒక రూపాయి ఇచ్చి రా. ఇంట్లో భార్య ఉంటుంది, పిల్లాజల్లా ఉంటారు” అన్నారు. కాసేపు మౌనంగా ఉండిపోయి, “ఆహా! ఈ రోజు అతడికి పెద్దగా ఏమీ అమ్ముడుపోలేదనిపిస్తోంది. పాపం, అందుకే మొదటి, రెండవ తరగతి పెట్టెల ముందు నడుస్తున్నాడు” అన్నారు. కావాలనే మొక్కజొన్న కండె స్వామీజీ కొన్నారు అంతే. ఆయన దాన్ని నోట పెడితే ఒట్టు!
అదే విధంగా మరో రోజు స్టీమ్ బోటులో వెళుతున్నారు. అక్కడ దుంగలతో చేర్చి కట్టిన తెప్ప (catamaran) లలో బెస్తవారు చేపలు పడుతున్నారు. ఒక తెప్పలో రుచికరమైన ఇలీస్ చేపలు ఉన్నాయి. స్వామీజీ వాటిని చూడగానే, “ఆహా! ఇలీస్ చేప కూర తినాలనిపిస్తోంది” అన్నారు. ఒక రూపాయి ఇచ్చి చేపలు కొన్నారు – 16 పెద్ద చేపలు, నాలుగైదు ఉచితంగా ఇచ్చారు. స్టీమ్ బోటు కాస్త దూరం వెళ్లి ఆగింది. అప్పుడు “ఇలీస్ చేపతో ఆకుకూర చేర్చి వండితే చాలా బాగుంటుంది, దానితో పాటు వేడి వేడి అన్నం కూడా ఉండాలి” అన్నారు.
ప్రక్కనే ఒక గ్రామం ఉంది. ఆకుకూర కొనడానికి కనాయ్ అక్కడకు వెళ్లాడు. దుకాణంలో ఆకుకూర లభించలేదు. అప్పుడు శ్రేయోభిలాషి ఒకరు అక్కడకు వచ్చి, “రండి, నా ఇంటి తోటలో ఆకుకూర బోలెడంత ఉంది. నేను ఇస్తాను. కాని ఒక షరతు: నేనొకసారి స్వామీజీని దర్శించడానికి మీరు ఏర్పాటు చేయాలి” అన్నాడు. ఆ తరువాత అతడు ఒక గంపెడు ఆకుకూరను తల మీద ఉంచుకొని వచ్చాడు. తరువాత ఇద్దరూ స్వామీజీ ఉన్న చోటుకు తిరిగి వచ్చారు. ఆ శ్రేయోభిలాషి భక్తినీ, నమ్మకాన్నీ చూసి స్వామీజీ మఠానికి తిరిగి వస్తున్న దారిలోనే ఆతడికి దీక్ష ఒసగారు. “నన్ను అనుగ్రహించడానికే స్వామీజీ చేప, ఆకుకూర తినాలని అభిలషించారు. ఆయనలో ఆ అభిలాష తలెత్తకపోతే నాకు ఈ భాగ్యం దక్కేది కాదు!” అన్నాడా శ్రేయోభిలాషి.
నిర్భయానంద నిత్యమూ ఏ ఏ సమయాలలో ఏమేమి చేయాలో స్వామీజీ స్వహస్తాలతో వ్రాసి ఇచ్చారు. అంతేకాక స్వామీజీ ఒకరోజు ఆయనతో, “ఎక్కడ ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతున్నా, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, వెళ్లి విను. దాని వలన నీకు మేలు జరుగుతుంది” అన్నారు. నిర్భయానంద దానిని తు.చ. తప్పక పాటించారు. కలకత్తాలో మాతృదేవి గృహంలో వారానికి ఒకసారి బేలూర్ మఠం నుంచి ఒక సన్న్యాసి వెళ్లి ప్రసంగం చేయడం కద్దు. ఆ ఒక్క గంటసేపు తప్పకుండా నిర్భయానంద అక్కడ కూర్చుని ప్రసంగం వినేవారు.
ముక్తి తథ్యం
ఒకరోజు అర్ధరాత్రి బేలూరు మఠంలో అందరూ నిద్రిస్తున్నారు. హఠాత్తుగా గంగలో నుంచి దీనాలాపం ఒకటి వినవచ్చింది; మునిగిపోతున్న ఎవరో, “కృష్ణా! కృష్ణా! ఓ కృష్ణా! గంగా నదీమతల్లీ, రక్షించు” అంటూ ఆర్తనాదం చేస్తున్నట్లుంది. స్వామీజీ మేడ మీద తమ గదిలో ఉన్నారు. ఆ ఆర్తనాదం విన్న ఆయన, “చూడు నాయనా! ఎవరో మునిగిపోతునట్లుంది!” అన్నారు బిగ్గరగా. ఆ చీకట్లో వేగంగా పరుగెత్తి గంగలో దూకారు నిర్భయానంద. కాని ఎంతో లోపలికి వెళ్లినప్పటికీ ఎవరూ అక్కడ కనిపించలేదు. స్వామీజీ ఇలా అన్నారు: “ఇదిగో చూడు, ఎవరో మునిగి పోయినట్లుగా అనిపిస్తోంది. ఆతణ్ణి రక్షించడానికి ఎవరైతే ప్రాణం తెగిస్తాడో ఆతడికి మరే ఆధ్యాత్మిక సాధనలూ అవసరం లేదు, ఆతడికి ముక్తి తథ్యం.”
నైజానికి తగ్గ మార్గం
బ్రహ్మచారి కృష్ణలాల్
ఒకరోజు కృష్ణలాల్, “స్వామీజీతో! నా చదువు అంతంత మాత్రమే. నేను ఎక్కువ చదువుకోలేకపోయాను” అంటూ తన అసమర్థతను స్వామీజీతో వ్యక్తం చేశాడు. ఆతడి పరిస్థితిని అర్థం చేసుకొన్న స్వామీజీ, “ఫరవాలేదు. నువ్వు చదువుకోనక్కర్లేదు. చక్కగా జపం చేయి. తద్ద్వారా నీకు అంతా లభిస్తుంది” అన్నారు. ఆ ఉపదేశాన్ని తు.చ. తప్పక పాటించాడు కృష్ణలాల్. కాలాంతరంలో స్వయంగా స్వామీజీయే, “కృష్ణలాల్ జపం ద్వారా సిద్ధు డయ్యాడు” అన్నారు.
స్వామి సదాశివానంద
1901లో స్వామీజీ కాశీ వెళ్లినప్పుడు అక్కడ ఆయనను కలుసుకొన్న యువకులలో ఒకరే సదాశివానంద. రైలు నిలయంలో దిగగానే స్వామీజీని పుష్ప మాలాలంకృతుణ్ణి చేసి స్వాగతం పలికిన భాగ్యశాలి ఇతడు. అప్పటి నుంచి పరి పూర్ణంగా స్వామీజీ పట్ల ఇతడు ఆకర్షితుడయ్యాడు. స్వామీజీ ప్రతి వచనమూ, దృక్కూ ఆతడికి అతిమృదులమయంగా కానవచ్చాయి. సదాశివానంద ఇలా అన్నారు: “ఒక రోజు అందరూ రాత్రి భోజనానికి కూర్చుని ఉన్నారు. ఒక ఫలానా పదార్థాన్ని మా అందరికీ స్వామీజీ వడ్డించమన్నారు మేం తిన్నప్పుడు మాతో, ‘బాగుందా? ఆస్వాదించి తినండి. నాకు బాగున్నందు వల్లనే మీ అందరికీ వడ్డించమన్నాను’ అన్నారు.” ఆయన స్మృతుల నుంచి కొన్ని భాగాలు:
మానసిక దుఃఖాన్ని తొలగించారు
“స్వామీజీతో సహజీవనం చేసే ప్రతి క్షణమూ ఒక అనుభవమే. ఏ దుఃఖమైనా సరే ఆయన పావన సాన్నిధ్యంలో మటుమాయమవుతుంది. నా అన్నగారొకరు హఠాత్తుగా మరణించారు. ఆ దిగ్భ్రమలో నేను కుప్పకూలిపోయాను. కొన్ని రోజుల తరువాత స్వామీజీని కలుసుకొన్నాను. నన్ను చూడగానే స్వామీజీ మృదుస్వరంలో, “ఏం నాయనా! మీ సోదరుడు మృతి చెందాడని విన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నీ తల్లిని సాంత్వన పరచడానికి ఆమెతో నువ్వు ఏం మాట్లాడావు?” అని అడిగారు. నేను జవాబు చెప్పాను. అంతా సానుభూతితో విన్నారు. తరువాత, “నా సోదరుడు మరణించి ఉంటే నేనూ ఇట్లే తల్లడిల్లిపోయి ఉండేవాణ్ణి” అన్నారు. ఆ మాటలలోని ప్రగాఢ ఉద్వేగాలు నా హృదయాన్ని తాకాయి. వింత ఏమిటంటే, అంతదాకా నా మనస్సులో నిండివున్న శోకమంతా స్వామీజీ మాటలతో కరిగిపోయింది. నా సోదరుని కన్నా మేలైన నిజమైన స్నేహితు డొకరు ఇదిగో నా ముందు ఉన్నారు, ఈయన సదా నన్ను రక్షిస్తారనే భావన నాలో పాదుకుపోయింది.
దీక్ష
“మహాపురుష్జీ మహారాజ్ చెప్పిన ప్రకారం నేను స్వామీజీ వద్దకు వెళ్లి మంత్రదీక్ష అనుగ్రహించమని అడిగాను. చిరునవ్వుతో స్వామీజీ నన్ను చూసి, “ఎందుకు? నువ్వు ఇంతకు మునుపే రామానుజ వైష్ణవ మార్గంలో దీక్ష పుచ్చుకొన్నావు కదా! మహావిష్ణువు ఆరాధన ఉత్కృష్టమైనది. ఇంకా మరో దీక్ష నీకు అవసరమని నాకు అనిపించడం లేదు” అన్నారు. “కాని మీ లాంటి యోగిపుంగవుని నుంచి దీక్ష పుచ్చుకోవాలని అభిలషిస్తున్నాను” అన్నాను. మళ్లీ చిరునవ్వుతో తమ సమ్మతాన్ని స్వామీజీ తెలిపారు.
“దీక్ష రోజు రానే వచ్చింది. స్వామీజీ ఒక గదిలో ఆసనంలో కూర్చుని ఉన్నారు. నేను ఎదుట ఉన్న ఆసనంలో కూర్చున్నాను. కాసేపటికల్లా స్వామీజీ సమాధిమగ్నులైనారు. ఆయన పావన దేహం నిశ్చలమై దుంగలా అయింది. ముఖారవిందాన పరమానందపు వెల్లువ పొంగిపొరలింది. బుడగలో, అలలో లేని నిశ్చలమైన సముద్రపు ప్రశాంతత అక్కడ నెలకొంది. నేను లోపలికి వెళ్లినప్పుడు ఆప్యాయంగా నన్ను ఆహ్వానించిన స్వామీజీ ఇప్పుడు అక్కడ లేరు; ఉద్వేగా లన్నింటికీ అతీతమైన ఏదో పరమానంద విస్తారతలో సంచరిస్తున్న ఒక వ్యక్తి నా ముందు కూర్చున్నట్లు అనిపించింది.
“కాసేపటికల్లా స్వామీజీ బాహ్యచైతన్యంలోకి వచ్చినట్లు అనిపించింది. ఆ తరువాత ఆయన నా చేతులు పుచ్చుకొని కాసేపు కూర్చుని నా గతకాల సంఘటనలను కొన్నింటిని చెప్పనారంభించారు: ‘ఛాప్రా అనే చోటికి స్టీమ్బోటులో వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి నీతో ఏదో చెప్పాడే! జ్ఞాపకం ఉందా?’ అని అడిగారు. ‘జ్ఞాపకం లేదు’ అనగానే, ‘బాగా యోచించి చూడు’ అన్నారాయన. క్రమక్రమంగా నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ వ్యక్తి నాకు వైష్ణవ మంత్రదీక్ష ఇచ్చిన రామ్ స్వరూప్ ఆచార్య. రామానుజ సంప్రదాయానికి చెందినవారు ఆయన. ఆయన జ్ఞాపకం రాగానే, స్వామీజీ నాతో ఆయనను ప్రగాఢంగా జ్ఞప్తి చేసుకోమన్నారు. తరువాత, ‘ఇక శ్రీరామకృష్ణులను జ్ఞప్తి చేసుకో. తరువాత నేను ఆయనలో విలీనం అవు తున్నట్లు భావించుకో. తదనంతరం శ్రీరామకృష్ణులను వినాయకునిలో కరగించి వేయి. వినాయకుడు సన్న్యాసికి ఆదర్శమూర్తి’ అన్నారు.
తల్లి కన్నా….
“కాశీ సేవాశ్రమ పనివారిలో ఒక యువకుడు మరీ సన్నగా, బలహీనంగా ఉన్నాడు. వంగదేశం నుంచి కాశీకి పని వెతుక్కొంటూ వచ్చిన అతడు ఏ పనీ లభించక దుర్భర కష్టాలు అనుభవించాక చివరికి సేవా శ్రమంలో పని దొరికింది. స్వామీజీ ప్రారంభంలోనే ఆతణ్ణి గమనించారు. తరువాత ఒకరోజు అతడు ఆయనకు ప్రణమిల్లడానికి వెళ్లినప్పుడు ఆతడితో, ‘తమ్ముడూ! నీ ఒంట్లో బలం లేదు. కాని పనిచేయవలసిన అగత్యం ఉంది. దానికి ఒంట్లో శక్తి ఉండాలి. శక్తి కావాలంటే బాగా తినాలి. రోజూ ఇక్కడికి వచ్చి నాతో పాటు తిను. కనీసం మధ్యాహ్న భోజనమైనా నాతో తిను’ అన్నారు.
“అలా చెప్పడంతోనే ఆగిపోకుండా రోజూ ఆతడికి భోజనం పెట్టడం ఒక కర్తవ్యంగా చేశారు. పని కారణంగా అతడు సరైన వేళకు రాలేనప్పుడు తపించి పోయేవారు. అతడు రాకపోతే ఆయన కూడా తినరు. ఆయన వేళ తప్పి భుజిస్తే అది ఆయన మధుమేహాన్ని ప్రకోపింపజేస్తుంది. దానిని గురించిన డాక్టర్ల హెచ్చరికను కూడా ఉల్లంఘించి ఆయన ఆ యువకుని కోసం వేచివుండేవారు. రాత్రి భోజనానికి అతడు రాకపోతే అప్పుడప్పుడు ద్వారం వద్దకు పోయి తొంగి చూసేవారు, పచార్లు చేసేవారు, వీథిలోకి వెళ్లి చూసేవారు. అక్కడకు ఎవరు వచ్చినా, ‘ఆ కుర్రాడు వచ్చాడా? పాపం అమాయకుడు! ఎందుకు ఇంత ఆలస్య మవుతుంది? ఆతడి ఒంట్లో బలం మృగ్యం. ఇంతవరకూ ఏమి తినలేదు కూడా. బలహీనమైన దేహం, పనేమో బోలెడంత’ అంటూ వాకబు చేసేవారు.
“చివరికి ఆ కుర్రాడు రాగానే స్వామీజీ ముఖం వికసించేది. ఆప్యాయంగా అతడితో, ‘ఎందుకు నాయనా ఇంత ఆలస్యం? నీకు పని ఎంతో ఎక్కువని నాకు తెలుసు. పోనీలే, ఉదయమన్నా ఏదైనా తిన్నావా? నీ కోసం వేచి ఉండడంతో నేనూ ఏమీ తినలేదు. రా! నాయనా, చేతులు కాళ్లు కడుగుకో. భోజనానికి పోదాం. ఇప్పటికే బాగా ఆలస్యమయింది. చూడు నాయనా! నా ఆరోగ్యం బాగాలేదని నీకు తెలుసు. వేళకు నేను తినకపోతే నా వ్యాధి ప్రకోపిస్తుంది. కనుక త్వరగా రా. కాని, నాయనా! నువ్వు ఏం చేయగలవు? పని భారం జాప్యం చేయిస్తున్నది. అదీ నాకు తెలుసు, నాకు తెలుసు” అంటూ ఒక తల్లిలా చెప్పేవారు. ఆ అనురాగవృష్టిలో ఆ యువకుడు తల్లడిల్లిపోవడమే కాక, అక్కడున్న అందరూ స్వామీజీ ఈ మాతృత్వ వైఖరి చూసి ద్రవించిపోయేవారు.
“అంతటితో స్వామీజీ ఆగేవారు కారు. భోజనం చేస్తున్నప్పుడు, తాము తినడం ఆపి, ఆతడు సవ్యంగా తింటున్నాడో లేదో గమనిస్తూ ఉండేవారు. తరు వాత ఎవరైనా వచ్చి, ‘స్వామీజీ! మీరు తినండి. ఇంతదాకా మీరు ఒక్క ముద్ద కూడా నోట పెట్టలేదు’ అనేవారు. ఆ తరువాతనే ఆయన భోజనం చేయడం ప్రారంభించేవారు. ఈ విధంగా అందరి పట్లా మాతృత్వ అనురాగాన్ని వర్షించారు స్వామీజీ.”