వివేకానంద, భయం ఉన్నచోట ధీరత ఉంచారు. ఆయన ఆరాధించిన భగవంతుణ్ణి మన కార్యకలాపాలన్నింట్లో ప్రవేశపెడదాం! అప్పుడు సహజసిద్ధంగా సకల హానులూ తొలగిపోతాయి.
– రాజాజీ
భారతదేశాన్ని ప్రేమించారు — ఏం చేశారు? — భారతీయ ప్రసంగాలు — హిందూమతం — ఏది మతం? — మతమే ప్రాతిపదిక — సేవ – ధర్మం: తక్షణ కర్తవ్యం — జాగృతి అనే మహామంత్రం — స్వాతంత్ర్య పోరాటానికి బీజం — స్వాతంత్ర్యం గురించిన భావన — పామరులను ఎందుకు ఉద్ధరించాలి? — శ్రామికులు పాలించే కాలం — మతంలో ఆర్థికాంశం — మనం చేయవలసింది
భారతదేశాన్ని ప్రేమించారు
తూర్పు వంగదేశ యాత్రతో స్వామీజీ భారతీయ పర్యటనలు ముగింపునకు వచ్చాయి. భారతదేశానికి అందించ వలసిన సందేశం అందించిన పరిపూర్ణత ఆయనలో నెలకొంది. భారతదేశాన్ని ప్రేమించిన వారిలో, భారతదేశం మళ్లీ తన ప్రాచీన వైభవాన్ని పొందాలని తపించిపోయిన వారిలో స్వామీజీ అద్వితీయులై విరాజిల్లారు. “భారతదేశం పట్ల స్వామీజీకి ఎంత ప్రేమ! దాన్లో ఒక్క శాతమైనా మాలో ఉందా?” అని ప్రశ్నిస్తున్నారు అఖండానంద. పాశ్చాత్యంలో పట్టుదూది పరుపులను వదలి, “అయ్యో! నా దేశస్థులు ఆకలితో, పస్తుతో అలమటించిపోతున్నప్పుడు నాకీ సుఖాలెందుకు?” అంటూ ప్రశ్నించుకొని ఎన్నోసార్లు కటిక నేల మీద పడుకొన్న మహనీయుడు కదా ఆయన!
అందుకే స్వామీజీ దేశభక్తిని అఖండానంద ఇలా అభివర్ణిస్తున్నారు: “స్వామీజీకి భారతదేశం పట్ల గల ప్రేమ సామాన్యమైనది కాదు. అది దేశభక్తి కాదు, అది ‘దేశాత్మబోధం’. సామాన్యులకు ఉండేది ‘దేహా త్మబోధం’, అంటే దేహాన్ని తానుగా భావించుకోవడం. స్వామీజీకి ఉన్నది ‘దేశాత్మబోధం’, అంటే దేశాన్ని తానుగా భావించుకోవడం. దేశ ప్రజల సుఖం–దుఃఖం, వారి గతం, భవిష్యత్తు, ప్రస్తుత కాలం గురించి మాత్రమే ఆయన ఆలోచించారు.”
భారతదేశానికి ఆయన ఏం చేశారు?
ఏం చేశారు?
భారతదేశంలోని గొప్ప చింతనాశీలురలో ఒకరైన రాజాజీ చెప్పే జవాబు చూద్దాం: “స్వామి వివేకానంద హిందూమతాన్ని పరిరక్షించారు, భారతదేశాన్ని పరిరక్షించారు. ఆయన లేకపోయి ఉంటే మనం మన మతాన్ని కోల్పోయి ఉండేవారం; మనకు స్వాతంత్ర్యమూ లభించేది కాదు. కనుక నేడు మనం పొందిన భాగ్యం యావత్తూ స్వామి వివేకానంద మూలంగానే లభించింది.”
భారతదేశపు నేటి భాగ్యానికి స్వామీజీ కారణభూతులన్నది జవాబులోని ఒక భాగం మాత్రమే. “భవిషత్తు భాగ్యానికీ ఆయన మార్గం చూపించి నిష్కమించారు!” అన్నది జవాబులోని తక్కిన భాగం.
భారతీయ ప్రసంగాలు
పాశ్చాత్యంలో ఉన్నప్పుడే తమ భారతీయ కార్యకలాపాలకు స్వామీజీ లేఖల ద్వారా శ్రీకారం చుట్టడం ఇంతకు క్రితమే మనం చూశాం. ఆ విధంగా తమ పని కోసం క్షేత్రం సిద్ధంచేసి ఆయన మాతృదేశానికి తిరిగి వచ్చారు. సిద్ధం చేసిన క్షేత్రానికి ఆయన భారతీయ ప్రసంగాలు ఎరువుగా ఉపయోగపడ్డాయి. ఈ ప్రసంగాలు భారతదేశానికి స్వామీజీ ప్రసాదించిన కానుకలలో ఒకటి. పాశ్చాత్యం నుంచి 1897 జనవరిలో శ్రీలంకకు వచ్చినది లగాయతూ తూర్పు వంగదేశం నుంచి 1901 మే నెలలో కలకత్తాకు తిరిగి వచ్చే దాకా ఆయన చేసిన ప్రసంగాలు కోకొల్లలు. వాటిలో ఆయన ఆంగ్లేయ శిష్యుడైన గుడ్విన్ సంక్షిప్త లేఖనం చేసిన 26 ప్రసంగాలు మాత్రమే లభించాయి. ఇవి “కొలంబో నుంచి అల్మోరా వరకు” అనే పేరిట బహుళ ప్రాచుర్యం పొందిన పుస్తకంగా రూపొందాయి. ప్రతి భారతీయుడూ తప్పక చదువవలసిన పుస్తకం ఇది. భారతదేశం, దాని ఘనత, హిందూమతం, దాని గొప్పదనం, నేటి పతనం, అందుకు కారణం, మళ్లీ కీర్తి గాంచడానికి మార్గం – ఇత్యాదులన్నీ ఈ ప్రసంగాలలో చోటుచేసుకొన్నాయి. కాని ఒక్క భారతీయుడు కూడా స్వామీజీ వచనాలను పొందుపరచడానికి ప్రయత్నించింది లేదు.
స్వామీజీ భారతీయ కార్యకలాపాల ప్రణాళిక గురించి మనం తెలుసుకోవ డానికి ఆయన సంభాషణలు కూడా తోడ్పడుతున్నాయి. ఆయన శిష్యుడైన శరశ్చంద్ర చక్రవర్తి స్వామీజీతో తాను చేసిన సంభాషణలు పదిలపరచడం ద్వారా చింతనా ప్రపంచానికి గొప్ప మేలు చేశాడు. ఇదే విధంగా మరికొందరు కూడా స్వామీజీతో తాము చేసిన సంభాషణలను పదిలపరచి ఉంచారు. ఇవి ‘స్వామి– శిష్య సంభాషణలు’ పేరిట బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి కాక ఆయన భారతదేశం గురించి వ్రాసిన అద్భుతమైన కొన్ని వ్యాసాలు కూడా ఉన్నాయి.
లేఖలు, భారతీయ ప్రసంగాలు, సంభాషణలు, వ్యాసాల ప్రాతిపదిక మీద స్వామీజీ కార్యకలాపాల గురించి యోచిద్దాం. ముందుగా హిందూమతం గురించి చూద్దాం.
హిందూమతం
వేదాలు, ఉపనిషత్తులు చూపిన ఆధ్యాత్మిక తత్త్వాల ప్రాతిపదిక మీద హిందూమతం వెలసింది. “శాశ్వతమైనది” అనే అర్థంతో “సనాతన ధర్మం” గా పేరుపొందిన మతం అది. కనుక దానికి వినాశం లేదు. వినాశం లేనిదాన్ని స్వామీజీ పతనం నుంచి ఎలా పరిరక్షించారు?
హిందూమత ప్రాతిపదిక సత్యాలు ఎన్నటికీ నశించవు. కాని కాలాలు గడచిపోతున్నప్పుడు ఆ సత్యాలను మలినం ఆవరించుకోవడం అనివార్యం. బంగారం అయినప్పటికీ అది కాలాల పర్యంతం మన్నులో పాతిపెట్టబడి ఉంటే, అది చూడడానికి బంకమట్టి గడ్డగానే కనిపిస్తుంది. ఆ పరిస్థితే హిందూమతానికి వాటిల్లింది. అనేక మూఢనమ్మకాలు, స్థానిక ఆచారాలు నిజమైన హిందూమతాన్ని క్రమేణా కప్పివేశాయి. కాలప్రవాహంలో ఆ ఆచారాలూ, మూఢనమ్మకాలే హిందూ మతంగా అయిపోయాయి. ఎలా బంకమన్నును తొలగిస్తే పాతిపెట్టబడి ఉన్న బంగారం ప్రకాశిస్తుందో అదేవిధంగా మూఢనమ్మకాల ఆచారాల నుంచి విడిపిస్తే హిందూ మతమూ దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అదే స్వామీజీ చేశారు.
ఎలా?
ఏది మతం?
దేనిని సామాన్యంగా మతమని పరిగణిస్తాం? ఆలయం, చర్చ్, మసీదులు సందర్శించాలి, కొన్ని సంప్రదాయాలను పాటించాలి, కొన్ని మత చిహ్నాలను ధరించాలి, కొన్ని సంస్థలకు చెందివుండాలి. కాని మనిషిని సమైక్యపరచవలసిన బాహ్య చేతలు చెప్పుకోదగ్గ మేరకు సైద్ధాంతిక మౌఢ్యానికీ, మత కలహాలకూ, హింసకూ, రక్తప్రవాహాలకూ దారి తీయడం చరిత్ర చెప్పకచెబుతోంది. కాని స్వామీజీ ఈ బాహ్య అరిష్టాల నుంచి నిజమైన మతాన్ని విడదీశారు. “మతమంటే చర్చ్‌కి పోవడం కాదు, ముఖం మీద బొట్లు పెట్టుకోవడం కాదు. వేషాలు వేసుకోవడమూ కాదు. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులున్నాయో అన్నింటితో కూడా మీ శరీరాలకు రంగులు పూసుకొంటారు గాక! మీ హృదయం వికసించకపోతే, మీకు ఆత్మసాక్షాత్కారం కాకపోతే, అంతా వ్యర్థమే!”* అన్నారాయన.
స్వామీజీ ‘మతం’ అనే పదాన్ని ఈ అర్థంలోనే ప్రస్తావించారని గమనించడం అనివార్యం. మతం అంటే ఆధ్యాత్మికత. “ఆత్మ” అనే పదం నుంచి ఆధ్యాత్మికత వచ్చింది. ఆత్మ గురించిన భావన, లోకచింతనా ధోరణులకు భారతదేశం సమర్పించిన కానుకలలో ఒకటై విరాజిల్లుతోంది. ఆత్మ స్వయం వివరణాత్మకమై నది, చైతన్య రూపమైనది, సమస్త జ్ఞానానికీ, ఆనందానికీ నిజమైన కారణమైనది. అన్ని ఆత్మలూ పరమాత్మలో మమేకమై ఉన్నాయి. పరమాత్మ అయిన భగవంతు నితో, తాను సమైక్యమైనానని అనుభవపూర్వకంగా గ్రహించడమే జీవిత పరమావధి అంటారు స్వామీజీ.
మతమే ప్రాతిపదిక
మనలో నెలకొన్న ఈ ఆత్మ శక్తి నిలయం. అది జాగృతి చెందినప్పుడు శక్తి జనిస్తుంది, ఆనందం పొంగిపొరలుతుంది. ఈ విధంగా ఆత్మను జాగృతి చెందింప జేయడానికి, అభివ్యక్తం చేయడానికి దోహదం చేసేదే మతం. దీనినే, “మానవునిలో నిక్షిప్తమై ఉన్న దివ్యత్వాన్ని అభివ్యక్త పరచడమే, మతం”* అని స్వామీజీ వచించారు. ఈ రీతిలో అంతరంగంలోని ఆత్మను జాగృతి చెందించి, కార్యాచరణలో పాల్గొనే వ్యక్తి దేనినైనా శ్రేష్ఠంగా నిర్వహించగలడు. వ్యక్తి శ్రేష్ఠంగా కార్యాచరణలో నిమగ్నుడైనప్పుడు దేశం సహజంగానే పురోగమిస్తుందనేది స్వామీజీ మౌలిక సిద్ధాంతం. “మన మాతృభూమికి ‘మతమే’ మూలాధారం; మతమే వెన్నెముక. మతమనే పెద్ద శిలపై మన జాతీయసౌధం నిర్మించబడి ఉంది.”* మతం ద్వారా అన్ని పనులూ జరగాలని స్వామీజీ వచించినప్పుడు ఆయన ఈ ‘మతాన్నే’ ప్రస్తావించారు.
సేవ – ధర్మం: తక్షణ కర్తవ్యం
భారతదేశానికంటూ స్వామీజీ ప్రత్యేకమైన కార్యకలాపాల ప్రణాళికను రూపొందించారు. ఇది ఆయన పాశ్చాత్య కార్యకలాపాల ప్రణాళిక కన్నా భిన్నమైనది. ఇంద్రియసుఖాల అనుభూతిలో పరాకాష్ఠను చవిచూసిన పాశ్చాత్యులు, దాని తరువాతిది ఏమిటి అనే ప్రశ్నతో ఉన్నారు. వారికి ఇంద్రియాతీతమైన ఆత్మానుభూతిని తక్షణ కర్తవ్యంగానూ, చరమ కర్తవ్యంగానూ నిర్ణయించారు. జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం, అనుష్ఠాన వేదాంతపరమైన ప్రసంగాలు ఆయన పాశ్చాత్యంలోనే చేశారు. కాని భారతీయులకు ఆయన ‘సేవ–ధర్మం’ మాత్రమే నొక్కివక్కాణించారు. పేదలను, పీడితులను ఉద్ధరించడానికి పాటుపడమనీ, వారిని సాక్షాత్తూ భగ వంతునిగా పరిగణించి సేవ చేయమనీ చెప్పారు.
అలాంటి సేవ అత్యున్నత ఆరాధనగా స్వామీజీ పేర్కొన్నారు. “మీరు పరమ పవిత్రులుగా ఉండి, సహాయం కోరివచ్చే ఎవరికైనా మీ శక్తి మేరకు ఉపకారం చేస్తూండాలని మళ్లీ మీకు చెబుతున్నాను. ఇదే సత్కర్మ. దీని మహిమ వలన చిత్తశుద్ధి లభిస్తుంది. అప్పుడు ప్రతి వ్యక్తిలో కొలువై ఉన్న పరమేశ్వరుడు ప్రత్యక్ష మవుతాడు”* అని స్వామీజీ వచించారు.
ఈ విధంగా సేవ చేయడం ద్వారా రెండు రకాల ఫలం కలుగుతుంది. సేవ చేసే వ్యక్తి పవిత్రుడై ఆత్మానుభూతిని సమీపిస్తాడు; అదే సమయంలో పేదలకూ, సమాజానికీ మేలు ఒనగూరుతుంది. “స్వీయముక్తి లోక సంక్షేమం” (ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయ చ) అనే ఈ రెండు రకాల ఫలాన్నిచ్చే లక్ష్యాన్ని తాము రూపొందించిన రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్ల ఆదర్శంగా స్వామీజీ తీర్చిదిద్దారు.
జాగృతి అనే మహామంత్రం
కాని ఇవన్నీ ఎవరి కోసం? సేవ, విద్య, పురోగతి అన్నీ జాగృతి చెందిన వ్యక్తికి కాదా? కాని నిద్రించే వ్యక్తి సేవ చేయలేడు! కనుక స్వామీజీ మొదటి పని భారతీయులను తట్టి మేల్కొల్పడం. ఒక వ్యక్తి వీథి ప్రక్కన స్పృహతప్పి పడివున్నాడు. ఆతడి సంభారాలు, కళ్లజోడు అన్నీ చిందరవందరగా పడివున్నాయి. ఆతడు ధరించిన వస్త్రం చెదరి ఉంది. ఇప్పుడు ఆతడికి చేయవలసిన ప్రథమ కర్తవ్యం ఏమిటి? వస్త్రాన్ని సరిచేయడమా? కళ్లజోడును సరిచేయడమా? సంభారాలను పదిలపరచడమా? ఇవి ఏవీ కావు. మొదట చేయవలసింది ఆతడికి స్పృహ తెప్పించడం. అది చేస్తే తక్కినవన్నీ ఆతడే మన కన్నా బాగా చేసుకొంటాడు.
అలా భారతీయులను మేల్కొల్పడానికి స్వామీజీ అందించిన మహామంత్రమే “లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే దాకా ఆగకండి.” భారతీయులు తమను మరచిపోయి, తమ పారంపర్యతను మరచిపోయి, తమ ఘనతను మరచిపోయి, తాము బానిసలం, ఎవరైనా అన్యులు తమను పరిపాలిస్తేనే జీవించగలమనే అజ్ఞాన జాడ్యంలో మునిగి ఉన్నారు. వారిని మేల్కొల్పడం స్వామీజీ ప్రథమ కర్తవ్యం. దానినే ఆయన భారతదేశంలో అనేక ప్రాంతాలకు వెళ్లి ఉద్వేగభరితమైన ప్రసంగా లతో సాధించడానికి ప్రయత్నించారు. కాని కేవలం భావనలు భారతీయులకు చాలవని ఆయన గ్రహించారు.
“భారతదేశంలో ముందుగా క్షేత్రాన్ని సిద్ధం చేయవలసి ఉంది. ఆ తరువాత బీజాలు నాటితేనే మొక్కలు చక్కగా మొలుస్తాయి. ఐరోపా, అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలలో క్షేత్రం అప్పటికే సిద్ధంగా, సారవంతంగా, నాటడానికి సాను కూలంగా ఉంది. వారు సుఖభోగాల పరాకాష్ఠను చవిచూశారు. భారతీయులైన మీలో భోగమూ లేదు, యోగమూ లేదు. భోగ అనుభవాలు నేరవేరిన తరువాతనే యోగ లక్ష్యాల పట్ల ఆసక్తి వస్తుంది, వాటిని అవగతం చేసుకోవచ్చు కూడా! భయంకర వ్యాధులు, కష్టాలు, దుఃఖాలు అన్నింటికీ సేద్యభూమిగా మారిపోయిన ఈ దేశంలో, మనుషులు ఆకలితో మలమలమాడిపోతున్న ఈ దేశంలో ప్రసంగాలు ఏం చేయగలవు? ముందుగా క్షేత్రాన్ని సిద్ధం చేయాలి” అంటూ తమ శిష్యుడైన శరశ్చంద్రతో స్వామీజీ చెప్పారు.
తమ మిత్రుడైన ప్రియనాథ్ సిన్హాతో ఈ భావననే కొనసాగించారు: “భారత దేశంలో ప్రసంగాలేమీ పనిచేయవు. మన విద్యావంతులు ప్రసంగాలు విని, మహా అయితే చప్పట్లు చరచి, ‘భేషుగ్గా ఉంది,’ అంటారు. అంతే! పిదప ఇంటికి వెళ్లి విన్నదంతా తమ భోజనంతోపాటు జీర్ణం చేసుకొంటారు. ప్రజల ముందు జాజ్జ్వల్యమానమైన ఒక సజీవ ఆదర్శాన్ని ఉంచితేగాని, మన దేశంలో ఏదీ జరగదు. తమ సర్వస్వాన్ని త్యాగం చేసి, దేశం కోసం తమ జీవితాలను ఆహుతి చేసే యువకులు కొందరు మనకు కావలసి ఉన్నారు. మొదట మనం వారి జీవితాలను రూపుదిద్దాలి. తరువాత కొంత యథార్థమైన పని ఆశించవచ్చు.”
అందుకోసం స్వామీజీ రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ పనులలో శ్రద్ధ వహించారు. తమ భావనలను కార్యాచరణలో అమలు పరచే రీతిలో దేశమంతటా మఠాలు ప్రారంభించాలని అభిలషించారు. “కలకత్తాలో ఉన్న మన మఠం వంటిది ప్రతి జిల్లాలోనూ వెలసినప్పుడు నా హృదయాభీష్టం నెరవేరినట్లవుతుంది. ప్రచార కార్యక్రమం ఆగిపోకుండా చూడు. ప్రచారాని కన్నా విద్యాబోధ ముఖ్యం”* అన్నారాయన. ఇందు కోసం యువకులు అనేకమంది ముందుకు రావాలని తమ ప్రసంగాలలో వచించారు కూడా!
స్వాతంత్ర్య పోరాటానికి బీజం
ప్రజలలో జాగృతి కలిగించడానికి స్వామీజీ అందించిన మహామంత్రమూ, యథార్థ వివరణలూ స్వాతంత్ర్య పోరాటానికి బీజమయ్యాయి. మన స్వాతంత్ర్య పోరాటంలో అనేక రకాల వైఖరులున్న మహామనుషులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ లాంటి మితవాదులు; బాలగంగాధర తిలక్, సుభాష్ చంద్ర బోస్ లాంటి అతివాదులు; బిపిన్‌చంద్ర పాల్, అరవిందుడు, ‘దేశబంధు’ చిత్తరంజన్ దాస్ ప్రభృతులకు ప్రేరణ నిచ్చినవారు స్వామీజీ అన్న విషయం వారే స్వయంగా అంగీకరించిన నిజం. అంతేగాక తీవ్రవాదులు సైతం స్వామీజీ భావనలను ముద్రించి పంపిణీ చేశారు! ఇందుకే బ్రిటిష్ ప్రభుత్వం రామకృష్ణ మిషన్‌ను సంశయనేత్రంతో పరికించడం మరో విషయం. ఈ విధంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అందరిలో మాతృదేశ భక్తిని పాదుగొలిపి వారిని మాతృదేశ విముక్తికై పాటుపడడానికి ప్రేరేపించిన వ్యక్తి స్వామీజీ అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే మహాత్మా గాంధీ, “వివేకానంద రచనలు నేను క్షుణ్ణంగా చదివాను. ఆయన రచనలు చదివిన తరువాత నా మాతృదేశ భక్తి వేయిరెట్లు పెరిగింది” అన్నారు. జవహర్లాల్ నెహ్రూ, “వివేకానంద, మామూలుగా మనం అర్థం చెప్పుకొనే రీతిలో ఒక రాజకీయవేత్త కారు. కాని నూతన భారతదేశ జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించిన ఆద్యులలో ఆయన ఒకరు అనడంలో సందేహం లేదు” అని వ్యాఖ్యానించారు.
సుభాష్ చంద్ర బోస్ స్వామీజీని గురించి మాట్లాడుతున్నప్పుడు పారవశ్య స్థితులకే వెళ్లారు. “వివేకానంద గురించి వ్రాస్తున్నప్పుడు నేను ఆనందపారవశ్యంలో మునిగిపోతాను. దానిని అణచుకోలేను…. ఆయన వ్యక్తిత్వం జాజ్జ్వల్యమానమైనది, ప్రగాఢమైనది…. ఫలితం గురించి యోచించని త్యాగం, అవిశ్రాంత కార్యాచరణ, అనంత ప్రేమ, ప్రగాఢమైన విస్తృతమైన జ్ఞానం, పొంగిపొరలే భావోద్వేగాలు, కఠోరమైన విమర్శలు, శిశువు లాంటి నిష్కాపట్యం – ఈ లోకంలో ఆయన అపూర్వమైన వ్యక్తి. నరనరాల్లో రుధిరం ఉడికి ప్రవహించే పురుషోచితుడైన వ్యక్తి ఆయన. దేనికీ చలించక పోరాటం చేసే యోధుడు ఆయన. ఆయన శక్తిని ఆరాధించారు. స్వదేశస్థుల ఉద్ధరణ కోసం వేదాంతానికి ఆచరణాత్మక రూపం ఇచ్చారు…. ఈ విధంగా నేను గంటలకొద్దీ ఆయన గురించి చెప్పుకొంటూ పోవచ్చు. అయినప్పటికీ తద్ద్వారా ఆయన గురించి ఏదైనా వివరించి ఉన్నానా అంటే, ‘లేదు’ అన్నదే జవాబు. దాన్లో నేను పరాజయం పొందివుంటాను. ఆయన అంతటి మహత్త్వం గల వ్యక్తి, అంతటి లోతైన వ్యక్తి. స్వామి వివేకానంద ఒక మహాయోగి; సత్య పదార్థమైన భగవంతునితో సదా ప్రత్యక్ష సంబంధం కలిగివున్న భగవదనుభూతి పొందిన వ్యక్తి. అంతటి అత్యున్నత స్థితిలో నెలకొనివున్న ఆయన భారతీయులను, మానవాళిని ఆధ్యాత్మికతలో పురోగమింపజేయడానికి తమ జీవితాన్ని ధారపోశారు.”
స్వాతంత్ర్యం గురించిన భావన
దేశ ప్రజలకు, నాయకులకు ఇంతటి ఉద్వేగాన్ని అందించిన స్వామీజీ తాము ఎందుకు స్వాతంత్ర్య పోరాటానికి ప్రజలను ప్రత్యక్షంగా ప్రేరేపించలేదు, తాము ప్రత్యక్షంగా ఎందుకు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదనే ప్రశ్న తలెత్తవచ్చు. ఎందుకంటే ఆ కాలఘట్టంలో స్వామీజీ భారతదేశ స్వాతంత్ర్యాన్ని ప్రధానంగా పరిగణించ లేదు కనుక. స్వాతంత్ర్యం పొందడం ముఖ్యమైతే, పొందిన స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకోవడం అంతకన్నా ముఖ్యమని ఆయన భావించారు. ఆ సమయంలో అందుకు అర్హత గల వ్యక్తులు లేరని ఆయన గ్రహించారు. “స్వాతంత్ర్యం కావా లంటే దానిని ఇంకా రెండు రోజుల్లో నేను తీసుకురాగలను. కాని పొందిన స్వాతంత్ర్యాన్ని పరిరక్షించగల వ్యక్తులు ఏరి?” అని ఆయన ప్రశ్నించారు. కనుక ఆయన తమ పూర్తి ప్రయత్నాలను అంతటి వ్యక్తులను రూపొందించే దారిలో వెచ్చించారు. అంతటి వ్యక్తులను రూపొందించే విద్య అవసరమని భారతదేశం అంతటా సింహనాదం చేశారు.
“మనుగడకు అవసరమైనవేవో గ్రహించకుండా కాంగ్రెసు గొంతులు చించుకొని అరిచినంత మాత్రాన ప్రయోజనమేముంది?… కొన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులై, కొన్ని మంచి ఉపన్యాసాలు ఇవ్వగలిగినంత మాత్రాన వారిని నువ్వు విద్యావంతులుగా పరిగణిస్తున్నావు! జనసామాన్యానికి జీవిత పోరాటాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇవ్వలేని దానిని, సచ్ఛీలాన్ని, లోకోపకారం చేసే బుద్ధిని, సింహంతో సమానమైన బలాన్ని ఇవ్వలేనటువంటి దానిని విద్య అనవచ్చునా? తన కాళ్ల మీద తాను నిలబడ గలిగేటట్లుగా చేసేదే విద్య. ఇప్పుడు మీరు పాఠశాలల్లో, కళాశాలల్లో నేర్చుకొనే చదువు మిమ్మల్ని కేవలం నిర్వీర్యులైన జాతిగా రూపొందిస్తున్నది. మీరంతా యంత్రప్రాయంగా పనిచేస్తూ, యాంత్రికమైన బ్రతుకు గడుపుతున్నారు… కాబట్టి పామరజనంలో విద్యావ్యాప్తి చేయడమే మీ కర్తవ్యంగా పెట్టుకోమని చెబుతున్నాను”* అన్నారాయన.
స్వాతంత్ర్యం అవసరం, అంతకన్నా పొందిన స్వాతంత్ర్యాన్ని పరిరక్షించే వ్యక్తులు అవసరం. అందుకు మార్గం విద్య, కాని అది ప్రస్తుత విశ్వవిద్యాలయాల విద్య కాదు, మనిషిని రూపొందించే విద్య – ఇది స్వామీజీ చింతనా వైఖరి.
స్వామీజీ ఎలా మతాన్ని ఒక నూతన పరిమాణంలో అందించారో, ఎలా భారతదేశ స్వాతంత్ర్యానికి కారణభూతులై భాసిల్లారో చూశాం. ఇదే రాజాజీ, “ఇంతవరకు భారతదేశం పొందిన భాగ్యాలకు స్వామీజీయే కారణం” అన్నారు. అదే సమయంలో, స్వామీజీ స్వాతంత్ర్య పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు, అందుకు మారుగా విద్యను, సేవ–ధర్మాన్ని, పామరుల ఉద్ధరణను నొక్కివక్కాణిం చారు. విద్య అన్నది ఆధ్యాత్మిక మార్గం నుంచి వైదొలగని విద్యగా, అదే సమయంలో పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానం మొదలైనవి స్వీకరించేదిలా ఉండాలని ఆయన చెప్పారు. దీన్లో ఆయన దూరదృష్టి కానవస్తున్నది.
పామరులను ఎందుకు ఉద్ధరించాలి?
సేవ చేయాలి, పేదల పామరుల స్థితిని అభివృద్ధిపరచాలి, అందరికీ విద్య గరపాలి, అందుకు మతం దోహదం చేయాలనే స్వామీజీ వచనాలలో ప్రగాఢ అర్థం ఇమిడి ఉంది. ఆకలి వేసిన వారికి ఆహారం అందించాలన్న మానవత మాత్రమే ఇందుకు కారణం కాదు; చరిత్ర, సామాజిక ఆర్థికశాస్త్రాలలో ఆయనకున్న అపారమైన జ్ఞానం, చింతనా ప్రతిభ, దూరదృష్టి దీని నేపథ్యంలో ఉన్నాయి. పేదలు, పీడితులు, పామరులు ఉద్ధరింపబడాలన్నది కాలపు అనివార్యత అని స్వామీజీ గ్రహించారు. ఇక రాబోయే కాలంలో వీరి శక్తి పైకి లేచి పరిపాలించబోతున్నదని కూడా స్వామీజీ గ్రహించకపోలేదు. కనుక వారి పురోగతికి ప్రేరణ కల్పించడమూ, దోహదం చేయడమూ దేశ పురోభివృద్ధికి ఎంతో అవసరమని ఆయనకు తెలియక పోలేదు. ఆయన ఆ అద్భుత చింతనను పరికిద్దాం.
శ్రామికులు పాలించే కాలం
“పురోహితులు, సైనికులు, వర్తకులు, శ్రామికులు అనే నాలుగు కులాల చేత మానవ సమాజం పాలింపబడుతోంది.”* వేద కాలంలో శక్తి యావత్తూ పురోహితుల చేతుల్లో ఉండేది. బౌద్ధమత వ్యాప్తితో పురోహితుల ఆధిక్యం అంతరించి, రాజులు లేదా క్షత్రియుల ఆధిక్యం ప్రబలింది. వ్యాపారార్థం వచ్చిన ఆంగ్లేయుల ప్రాబల్యం వైశ్య ఆధిక్యంగా చెప్పుకోవచ్చు. దీని ముందు క్షత్రియశక్తి తలదించుకొంది. ఈ చక్రభ్రమణం ప్రకారం ఇక రాబోయేది శ్రామికుల, పామరుల, జనసామాన్య ఆధిక్యం. “మొదటి మూడింటి యుగమూ గడిచిపోయింది. ప్రస్తుతం నాలుగవ దాని తరుణం. వారికి అది సంక్రమించాలి. దాని నెవరూ ఆపలేరు” అంటూ దీనిని ఎత్తి చూపిస్తున్నారు స్వామీజీ.
శ్రామికుల ఈ జాగృతి భారతదేశంలో తప్ప తక్కిన దేశాలలో ఉదయిం చింది. కనుక ఆ దేశాలు వేగంగా అభివృద్ధి పొందుతున్నాయి. భారతదేశంలో కూడా ఆ అభివృద్ధి రావాలంటే ఈ పేదలూ, శ్రామికవర్గమూ పురోగతి పొందే తీరాలన్న విషయం స్వామీజీ గ్రహించారు. “భారతదేశంలో కన్నా తక్కిన దేశాల్లో శూద్రులు నిద్ర నుంచి కొంచెం మేల్కొన్నట్లుగా కనిపిస్తున్నది… అయినా శూద్ర త్వంతోనే శూద్రులు ప్రాముఖ్యం పొందే ఒకానొక సమయం రాగలదు”* అంటు న్నారు స్వామీజీ.
మతంలో ఆర్థికాంశం
భారతదేశం కూడా తక్కిన దేశాలతోపాటు అభివృద్ధి పొందగోరితే పేదలు, పామరులు పురోగమనం చెందాలి. అందుకే పేదలకు కూడా విద్య గరపమని ఆయన నొక్కివక్కాణించారు. మతం దీనికి ఏర్పాటు కల్పించి నప్పుడు తానూ జీవిస్తుంది. ఇక రాబోయే కాలంలో ఆర్థికాంశం గల మతం మాత్రమే నిలబడుతుందని స్వామీజీ దృఢనమ్మకం. “ఏ మతం ఎప్పుడు విజయాన్ని సాధించినా అందులో ఆర్థిక ప్రయోజనం ఇమిడి ఉండక తప్పదు. ప్రజలలో తమకే చెల్లుబాటు ఉండాలని అలాంటి మతశాఖలు వేలకొద్దీ పాటుబడుతుంటాయి. కాని నిజమైన ఆర్థిక సమస్యను పరిష్కరించగల మతాలకే విజయం చేకూరుతుంది”* అంటున్నారు స్వామీజీ. ఈ విధంగా ఆర్థిక ప్రగతిని హిందూమతంలో ఒక అంగంగా చేశారు ఆయన. ఇది ఆయన కానుకలలో ఒకటి.
మతం అంటే, ఆధ్యాత్మికత అంటే ఈ ఇహ జీవితాన్ని తిరస్కరించి, పర జీవి తాన్ని చెప్పడమనే స్థితిని తమ దూరదృష్టితో మార్చారు స్వామీజీ. మనిషి ఆర్థిక స్థితిని, జీవన ప్రమాణాన్ని మతం పెంపొందించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మనం చేయవలసింది
స్వామీజీ ఉద్వేగంతో ప్రేరణపొంది స్వాతంత్ర్యం గడించాం. కాని ఆయన అందించిన ఉద్వేగంతో మేల్కొన్న భారతీయులు సముచిత విద్య, మార్గదర్శకత్వం కొరవడడంతో పూర్తిగా జాగృతి చెందడానికి ఆస్కారం లేక పోయింది. కనుక స్వామీజీ భావన ప్రకారం భారతదేశం మళ్లీ తన గత వైభవాన్ని పొందాలి, అందుకు యావన్మందికీ స్వామి వివేకానంద సూచించిన ‘విద్య’ గరపాలి. అప్పుడు ఆయన ఆశించిన ఆదర్శ భారతదేశం రూపొందుతుంది:
“ఈ అల్లకల్లోలాల నుండి, ఈ వివాదాల నుండి పరిపూర్ణమైన భావి భారత దేశం… పరిపూర్ణ ప్రభాకలితమై, అప్రతిహతమై పైకి లేస్తున్నట్లు నా మనోవీథిలో దర్శిస్తున్నాను.”*
“ఇక తెల్లవారదనుకొన్న రాత్రి మెల్లమెల్లగా గడచిపోతున్నట్లుంది. భరించ రాని తీవ్రవేదన ఎలాగో ఉపశమిస్తున్నట్లు అనిపిస్తోంది…. నిద్రమత్తు తేలిపోతోంది. అమ్మ మేల్కొంటున్నది; మన దేశమాత దీర్ఘనిద్ర నుంచి మేల్కొంటున్నది. గ్రుడ్డి వాళ్లు మాత్రం చూడజాలరు; కుత్సితబుద్ధులు చూడలేరు. ఇంక ఆమె నెవరూ ఆపజాలరు! ఇంక ఆమె నిద్రపోదు. ఇంక ఆమెను ఎవరూ అడ్డుకోజాలరు. అదిగో ఆ అఖండ శక్తిస్వరూపిణి దిగ్గున లేచి నిలబడుతోంది.”*
శక్తిమంతమైన ఈ భారతదేశం ప్రపంచాన్ని జయిస్తుంది. అందుకే, “ఓ భారతమా! నీ ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని జయించు!” అంటూ స్వామీజీ సింహ గర్జన చేశారు.