పదిహేను వందల సంవత్సరాలకు సరిపడేటంత నేను ఇచ్చివేశాను!
– స్వామి వివేకానంద
విద్యార్థులకు ఏం అవసరం? — కొన్ని ప్రణాళికలు — బేలూర్ మఠ పాలక వర్గం — తీర్థయాత్ర — భారతదేశ జాగృతి — ‘నా ఉబ్బసం నయమవుతుందా?’ — మూడు తీర్థ స్థలాలు — అవతారమా? — చంద్రనాథ్, కామాఖ్య
విద్యార్థులకు ఏం అవసరం?
హిమాలయాల మధుర స్మృతులతోనూ, ఖేత్రీ మహారాజు మృతి కలిగించిన దుఃఖంతోనూ 1901 జనవరి 24వ తేదీన స్వామీజీ బేలూర్ మఠానికి తిరిగి వచ్చారు. ఆ తరువాత మార్చ్ 18 వ తేదీ దాకా ఆయన దాదాపు మఠంలోనే ఉండిపోయారు. బహిరంగ కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. బేలూర్‌లోని ఒక పాఠశాల బహు మతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మాత్రం పాల్గొని ప్రసంగించారు. నాటి ఆయన ప్రసంగం విద్యార్థులకు మాత్రమే కాక, ఉపాధ్యాయులకు, విద్యావేత్తలకు కనువిప్పు కలిగించే రీతిలో విరాజిల్లింది.
“నేటి విద్యార్థిలో ఆచరణాత్మకమైన తెలివితేటలు మృగ్యం. ఇందుకు అతణ్ణి నిందించి ప్రయోజనం లేదు. దీనిలో అతడి వంతు ఏమీ లేదు. శారీరక బలం కన్నా అతడికి అవసరమైనది మానసిక స్థైర్యమే. కళ్లను, చేతులను ఎలా ఉపయో గించుకోవాలో అతడికి తెలియదు. చేతిపనులేవీ అతడికి నేర్పించడం లేదు. నేటి విద్యాభ్యాసం కేవలం సమాచారమయమైనదిగా ఉంది. విద్యార్థికి చింతన చేయడం నేర్పాలి. అతడు సొంతంగా ఆలోచించి, తనకు అవసరమైనది చేసుకోవాలి… రెండవది విద్యార్థుల ఆకలి తీర్చే మార్గం కనుగొనాలి. కించిత్తు కూడా పుష్టిలేని ఆహారం తింటూ అనేకమంది విద్యార్థులు జీవిస్తున్నారు… చిన్నతనంలో పౌష్టిక ఆహారం తింటేనే వ్యక్తి ఆరోగ్యకరమైన మనిషిగా ఎదగగలుగుతాడు. మూడవది శీలం. అది మన నుండి సెలవు పుచ్చుకుపోయింది. మన పిల్లలలో సభ్యతా సంస్కారాలు లేకుండా పోయాయి. సరళంగా మాట్లాడడం అగౌరవం, పెద్దల పట్ల మర్యాద వహించడం అగౌరవం; పెద్దల పట్ల అమర్యాదగా వ్యవహరించడమే స్వేచ్ఛకు చిహ్నంగా మారిపోయింది. అయినప్పటికీ నేను భారత జాతిని చూసి గర్విస్తున్నాను. నాలో నమ్మకం పోలేదు. ఒక మహోన్నతమైన, ఒక అద్భుతమైన భవిష్యత్తును నిత్యం నా మానసిక దృశ్యంలో చూస్తున్నాను.”
కొన్ని ప్రణాళికలు
ఈ రోజుల్లో స్వామీజీ క్రొత్త వ్యక్తులను ఎవరినీ కలుసుకోలేదు. కాని లేఖలు వ్రాశారు. మఠంలోని బ్రహ్మచారులకూ, సన్న్యాసులకూ శిక్షణ నివ్వడంలో నిమగ్నులయ్యారు. జపాన్ వెళుతున్న దారిలో బేలూర్ మఠానికి వచ్చిన మెక్లౌడ్తో దీర్ఘసమయం వెచ్చించారు. ఫిబ్రవరిలో జూల్ బోయీస్ మఠానికి వచ్చాడు. ఫ్రాన్సులోనూ, తదుపరి పయ నాలలోనూ స్వామీజీతో సన్నిహితంగా మెలగిన వ్యక్తి ఇతడు. అతణ్ణి సాదరంగా ఆహ్వానించి, అన్ని చోట్లూ త్రిప్పి చూపించారు.
స్వామీజీ మనస్సులో కొన్ని ప్రణాళికలూ, అనేక ఆలోచనలూ తలెత్తుతు న్నాయి. దానికితోడు తమ ఆయుఃకాలం తగ్గిపోయిందని కూడా ఆయనకు తెలియకపోలేదు. చెన్నై, హైదరాబాద్, బొంబాయి లాంటి అనేక ప్రదేశాలకు వెళ్లాలి, మిసెస్ సేవియర్తో ఇంగ్లండ్‌కు వెళ్లాలనే కొన్ని ప్రణాళికలు ఆయన లేఖల్లో కానవస్తాయి. ఈ తక్కువ వ్యవధిలో ఏది చేయాలి, ఏది వదలిపెట్టాలి? తాము ఏది ఇవ్వాలని గురుదేవులు ఆదేశించి, జగజ్జనని అనుగ్రహాన్ని తనలో నింపారో ఆ మహత్కార్యం ముగిసింది, ఆ సందేశం అందించడం జరిగిందనే పరిపూర్ణత స్వామీజీలో నెలకొంది. అయినప్పటికీ కొన్ని చివరి దశలోని పనులు మిగిలి ఉండడం ఆయన మనస్సును సంకటపరిచింది. వాటిలో ముఖ్యమైనది బేలూర్ మఠానికి ఒక సంస్థాగతమైన ఆకృతిని కల్పించడం.
బేలూర్ మఠ పాలక వర్గం
ఇందుకోసం అనేక విధాలుగా ఆలోచించిన స్వామీజీ చివరికి మఠానికంటూ ఒక పాలక వర్గాన్ని ఎంపికచేసి, దాని బాధ్యతలో అంతా విడిచిపెట్టాలని నిశ్చ యించారు. దాని ప్రకారం 1901 జనవరి 30 వ తేదీన ఒక పాలక వర్గం రూపొంది, ఫిబ్రవరి 6వ తేదీన నమోదు చేయ బడింది. నమోదు చేసే కార్యాలయానికి స్వామీజీ వెళ్లారు. బ్రహ్మానంద, ప్రేమానంద, శివానంద, శారదానంద, అఖండానంద, త్రిగుణాతీతా నంద, రామకృష్ణానంద, అద్వైతానంద, సుబోధానంద, అభేదానంద, తురీయా నందలు పాలక వర్గ సభ్యులైనారు. స్వామీజీ దీనిలో శ్రీరామకృష్ణుల శిష్యులను మాత్రమే చేర్చారు; తమ శిష్యులను సభ్యులుగా చేయలేదు. ఈ పాలక వర్గ సభ్యులకు పూర్తి బాధ్యతను అప్పగించారు. తాము అన్ని బాధ్యతల నుంచీ వైదొలగారు.
శ్రీరామకృష్ణుల శిష్యులలో అద్భుతానంద మాత్రం ఈ పాలక వర్గంలో చేరనని కచ్చితంగా చెప్పాడు. స్వామీజీ అడిగినప్పుడు, “నాకు వ్యవహారాలేవీ వద్దు. దయచేసి నన్ను ఇందులోకి లాగవద్దు” అన్నాడు. అయినప్పటికీ స్వామీజీ, “నువ్వు ఏదీ చేయనక్కర్లేదు. నీ పేరు అందులో ఉంటుంది. కనుక అందుకు ప్రతిఘటించ వద్దు” అని చెప్పి చూశారు. కాని అద్భుతానంద అందుకు ససేమిరా సమ్మతించ లేదు. తరువాత బ్రహ్మానంద ప్రయత్నించి చూశారు. కాని ఆయన, “నాకు వాటిపట్ల ఎలాంటి అభిలాషా లేదు” అన్నారు దృఢంగా. ఫిబ్రవరి 10వ తేదీన జరిగిన సమావేశంలో అధ్యక్షుడు మొదలైన వారిని ఎంపిక చేశారు. బ్రహ్మానంద స్వామి అధ్యక్షులైనారు, శారదానంద కార్యదర్శియైనారు.
ఈ సమయంలో మఠానికి ఒక శుభవార్త అందింది. “బేలూర్ మఠం ఒక మత సంస్థ కాదు, అదొక ఉద్యానగృహం; స్వామి వివేకానంద అనే వ్యక్తికి చెందిన ఆస్తి” అనే రీతిలో బాలి పురపాలక సంఘం మఠానికి పన్ను విధించింది. దీనిని ప్రతిఘటిస్తూ 1900 సెప్టెంబర్‌లో వ్యాజ్యెం వేశారు. ఆ వ్యాజ్యెం కలకత్తా ఉన్నత న్యాయస్థానం దాకా వెళ్లింది. 1901 ఫిబ్రవరి 23 వ తేదీన ఉన్నత న్యాయస్థానం మఠానికి అనుకూలంగా తీర్పు ఇచ్చి, మఠానికి పన్ను మినహా యించింది.
తీర్థయాత్ర
మఠ బాధ్యతల నుంచి తమను వైదొలగించుకొన్న స్వామీజీ ముఖ్యమైన ఒకటి రెండు విషయాలను మాత్రం పూర్తిచేయాలని తీర్మానించుకొన్నారు. వాటిలో ఒకటి తూర్పు వంగదేశం, అస్సాం సందర్శించడం. అక్కణ్ణుంచి ఆహ్వానాలు వచ్చాయి; పైగా ఆయన తల్లి అక్కడకు వెళ్లగో రడం కూడా ఒక ముఖ్యకారణం. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉన్న ఈ స్థితిలో యాత్రను వాయిదా వేయడం సబబు కాదనుకొన్న స్వామీజీ మార్చ్ 18వ తేదీన తమ సోదర సన్న్యాసులు కొందరితో ఢాకాకు బయలుదేరారు. అక్కడ స్వామీజీకి ఘనంగా స్వాగతం పలికారు. తండోపతండాలుగా జనం ఆయన దర్శ నార్థం వచ్చారు. ఆయన తల్లి, అత్త, సోదరి, మరికొందరు కలకత్తా నుంచి మార్చ్ 24వ తేదీన బయలుదేరి మర్నాడు నారాయణ్‌గంజ్‌లో ఆయనను కలుసుకొన్నారు.
భారతదేశ జాగృతి
ఢాకాలోని ముఖ్యమైన పుణ్యస్థలాలను స్వామీజీ దర్శించుకొన్నారు. ఢాకాలో పలువురు ప్రముఖులు ఆయనను కలుసుకొన్నారు. కాలాంతరంలో స్వాతంత్ర్య పోరాటంలో విప్లవకారులుగా వికసించనున్న కొందరు యువకులు కూడా ఆయనను కలుసుకొని మాట్లాడారు. వంగదేశంలోని విప్లవ సంస్థలకు స్వామీజీ చెలమ (spring) బెజ్జంగా విరాజిల్లారనవచ్చునని ఆయన సోదరుడు భూపేంద్రనాథ్ వ్రాస్తున్నారు. భారతదేశంలోని మహారాజులను సమైక్యం చేసి ఆంగ్లేయ పాలనను తొలగించాలనే భావన స్వామీజీకి ఉన్నదని ఆయన ప్రస్తావించారు. తాము స్వామీజీని కలుసుకొన్నప్పుడు ఆయన అలాంటి విప్లవ భావనలను వ్యక్తం చేసినట్లు ఆ యువకులలో ఒకరైన హేమచంద్ర ఘోష్ వ్రాశాడు. తాను పలుమార్లు కలుసుకొని ఆయన నుంచి మార్గదర్శకత్వం పొందినట్లు ఆతడు చెబుతున్నాడు. సెలవు పుచ్చుకొనే రోజు కూడా స్వామీజీ కారుణ్యంతో తమను దీవించినట్లూ ఆతడు తెలుపుతున్నాడు. స్వామీజీ చెప్పారని ఆతడు తెలిపే ముఖ్య భావనలను ఇక్కడ చూద్దాం:
“మనిషిని రూపొందించడమే నా జీవిత కర్తవ్యం. నువ్వు నీ మిత్రులతో నీ మార్గంలోనే దానిని చేసి చూపించు. బంకించంద్ర* పుస్తకాలు చదువు. ఆయన వ్యక్తం చేసే దేశభక్తిని ఆదర్శంగా తీసుకో. సనాతన ధర్మం గురించి ఆయన అభిప్రాయాలను స్వీకరించు. మాతృదేశ సేవనే నీ ప్రథమ బాధ్యతగా ఎంచుకో. భారతదేశం రాజకీయపరంగా స్వేచ్ఛ పొందే తీరాలి.”
భారతదేశ జాగృతి గురించి స్వామీజీ ఇలా ప్రస్తావించారు: “శ్రామికవర్గం వారు భవిష్యత్తులో జాగృతి చెందుతారు. వారి జాగృతి మొదట రష్యాలో జరుగుతుంది. తరువాత చైనాలో జరుగుతుంది. ఆ తరువాతనే భారతదేశం జాగృతి చెందుతుంది. జాగృతి చెందిన భారతదేశం ప్రపంచ పురోగతిలో ఒక కీలక పాత్ర వహిస్తుంది.”
‘నా ఉబ్బసం నయమవుతుందా?’
ఒక రోజు స్వామీజీ ఢాకాలో ఉన్నప్పుడు ఒక వెలయాలు సర్వాభరణశోభి తయై తన తల్లితో ఆయనను చూడడానికి వచ్చింది. స్వామీజీ బస చేసివున్న ఇంటివారు ముందు నిరాకరించినప్పటికీ స్వామీజీ వినతి మేరకు వారిని ఆయన వద్దకు తోడ్కొని వెళ్లారు. వారు స్వామీజీకి ప్రణమిల్లి ఆయన పాదాల మ్రోల కూర్చున్నారు. తరువాత ఆ స్త్రీ, తనకు ఉబ్బసం ఉందనీ, అందుకు ఏదైనా ఔషధం ఇవ్వమనీ స్వామీజీని ప్రార్థించింది. ఆ స్త్రీ కోసం స్వామీజీ ఎంతో బాధపడ్డారు. ఒక బాలునిలా, “ఇదిగో చూడమ్మా! నేనే ఉబ్బస వ్యాధితో అవస్థపడుతున్నాను. నన్నే నేను నయం చేసుకోలేకపోతున్నాను. ఇలా ఉన్నప్పుడు నీకు ఎలా ఔషధం ఇవ్వగలను? నాకు సాధ్యమైతే తప్పక ఔషధం ఇచ్చేవాణ్ణి” అన్నారు. ఆయన నిరాడంబరత్వమూ, ప్రేమా వారిని చలింపజేశాయి. మౌనంగా ఆయనకు ప్రణమిల్లి వారు వెళ్లిపోయారు.
ఢాకా నుంచి దేవ్‌భోగ్ వెళ్లిన స్వామీజీ అక్కడ శ్రీరామకృష్ణుల శిష్యుడైన నాగమహాశయ్ ఇంటిని పావనం చేశారు. అప్పటికే ఆయన కాలధర్మం చెందారు. ఆయన భార్య స్వామీజీని ఆహ్వానించి సేవలందించింది.
మూడు తీర్థ స్థలాలు
తూర్పు వంగదేశంలో లంకల్ బంథ్, చంద్రనాథ్, ఆస్సాంలో కామాఖ్య అనే మూడు స్థలాలు స్వామీజీ దర్శించుకొన్న ముఖ్య పుణ్యతీర్థాలు. మొదట లంకల్ బంథ్ దర్శించారు. ఇది ఢాకా నుంచి దాదాపు 10 మైళ్ల దూరంలో బ్రహ్మపుత్రానది పశ్చిమ తీరంలో వెలసి ఉంది. ఢాకా నుంచి పడవల మీద అక్కడకు వెళ్లాలి. ఈ స్థలానికి పరశురాముని కథతో సంబంధం ఉంది. ఇక్కడ అందరూ పుణ్యస్నానం ఆచరించారు. స్వామీజీ అనారోగ్య కారణంగా స్నానం ఆచరించలేదు. తరువాత అందరూ ఢాకా తిరిగి వచ్చారు.
ఢాకాలో స్వామీజీ ఒకటి రెండు బహిరంగ ప్రసంగాలు చేశారు. ఆయన ప్రసంగ భావనలలో కొన్నింటిని వ్యతిరేకించి ఒక పండితుడు ఒక రోజు రాత్రి తొమ్మిది గంటలకు తమ శిష్యులతో వచ్చి తనతో వాదించమన్నాడు. స్వామీజీ మర్నాడు ఉదయం చంద్రనాథ్ వెళ్లనున్నారు. కనుక ఆ వాదన ఆహ్వానాన్ని తిరస్కరించారు. దీనిని ఆయన పరాజయంగా ఎంచి ఆ పండితుడు ప్రచారం చేసుకొన్నాడు. స్వామీజీ శిష్యుడైన శరశ్చంద్ర దానిని ప్రతిఘటిస్తూ పత్రికలో వ్రాశాడు.
అవతారమా?
ఒక రోజు ఒక యువకుడు స్వామీజీకి తన గురువు ఛాయాచిత్రాన్ని చూపించి, “ఈయన అవతార పురుషుడా?” అని అడిగాడు. దానిని గురించి తనకు ఏమీ తెలియదన్నారు స్వామీజీ. కాని ఆ యువకుడు అంతటితో వదలిపెట్టకుండా స్వామీజీని విసిగించసాగాడు. చివరికి స్వామీజీ అతడితో, “తమ్ముడూ! ముందు పౌష్టిక ఆహారం తిను. అప్పుడే నీ మెదడు వికసిస్తుంది. పుష్టి లేనందున నీ మెదడు ఎండిపోయి ఉండడం చూస్తున్నాను” అన్నారు. కాలాంతరంలో దీనిని ప్రస్తావించి స్వామీజీ తమ శిష్యుడైన శరశ్చంద్రతో, “ఎవరైనాసరే తమ గురువును అవతార పురుషునిగా పరిగణించు కోవచ్చు. ఆయనను గురించి తమ ఇచ్ఛ మేరకు భావించుకోవచ్చు కూడా; ఢాకాలోనే ముగ్గురు నలుగురు అవతార పురుషులు ఉన్నట్లు నేను విన్నాను. కాని నిజానికి భగవంతుడు దిగి రావడమన్నది సర్వత్రా సర్వకాలాల్లోనూ జరుగుతున్న సంఘటన కాదు” అన్నారు.
చంద్రనాథ్, కామాఖ్య
దాదాపు 1200 అడుగుల ఎత్తుగల ఒక గుట్ట మీద చంద్రనాథ్ పుణ్యతీర్థం వెలసివుంది. ఢాకా నుంచి పడవలోనూ, రైలులోనూ దాదాపు 80 మైళ్లు ప్రయాణం చేయాలి. అదొక శివాలయం. దాదాపు 700 మెట్లు ఎక్కి ఆ ఆలయాన్ని చేరుకోవాలి. చంద్రనాథ్ నుంచి అస్సాంలోని కామాఖ్య ఆలయానికి స్వామీజీ వెళ్లారు. గౌహాతి నుంచి దాదాపు 12 మైళ్ల దూరంలో వెలసివున్న జగజ్జనని ఆలయం ఇది. తంత్ర సాధనలు, మాయలకూ మంత్రాలకూ ప్రధాన స్థలంగా పరిగణింపబడే ఇది శక్తి పీఠాలలో ఒకటి. స్వామీజీ, తక్కినవారు అక్కడ జగజ్జననిని దర్శించుకొని వేసవి విడిదియైన షిల్లాంగ్ వెళ్లారు. అక్కడ స్వామీజీ ఉబ్బసం ప్రకోపించింది. అయినప్పటికీ అస్సాం ప్రభుత్వ కమిషనర్ అయిన సర్ హెన్రీ కాటన్ వినతి మేరకు స్వామీజీ ఆంగ్లేయ అధికారులు, పౌరులు పాల్గొన్న ఒక సమావేశంలో ప్రసంగించారు.
స్వామీజీ ఆరోగ్యం బాగా దెబ్బతింది. మూత్రపిండాల ఉపద్రవం, మధు మేహం, గుండెజబ్బు, శారీరక వాపు, ఉబ్బసం వ్యాధులతో ఆయన పోరాడవలసి వచ్చింది. ఒకరోజు శ్వాసించడానికి ఎంతో కష్టపడి, కొన్ని దిండ్లు అమర్చి వాటిపై వాలినట్లుగా కూర్చున్నారు. తమ అలసటను, చరమ దినాన్ని బహుశా ఆయన తలచుకొని మెల్లగా ఇలా అన్నారు: “అయితే ఏమిటి! పదిహేను వందల సంవత్సరాలకు సరిపడేటంత నేను ఇచ్చివేశాను!”
తూర్పు వంగదేశాన్నీ, అస్సామ్నీ సందర్శించడమే స్వామీజీ చివరి యాత్ర. 1901 మే 12 వ తేదీన అందరూ కలకత్తాకు తిరిగి వచ్చేశారు.