నా అంతిమ దినాలను తక్కిన పనులన్నీ వదలిపెట్టి ఈ సరోవర తీరంలో గడపుతాను. పుస్తకాలు వ్రాసుకొంటూ, ఇష్టమైన పాటలు పాడుకొంటూ ఒక బాలునిలా స్వేచ్ఛగా తిరుగుతాను.
– స్వామి వివేకానంద
బొంబాయిలో — బేలూర్ మఠంలో — సేవియర్ మరణం గురించి — మాయావతి వైపుగా — మాయావతి పయనం — అద్వైత ఆశ్రమంలో — శివ చైతన్యంలో — ఆరాధన సమస్య — గురువు సేవ — గుర్రపు స్వారీ — స్వదేశీయునితో ప్రయాణమా? — ఖేత్రీ మహారాజు ఆకస్మిక మరణం
బొంబాయిలో
స్వామీజీ పాశ్చాత్య పయనం ప్యారిస్, ఈజిప్టులతో ముగిసింది. కైరో నుంచి 1900 నవంబర్ 26 వ తేదీన మాతృదేశానికి బయలుదేరిన స్వామీజీ పయనించిన ఓడ డిసెంబర్ 6 లేదా 7 వ తేదీన బొంబాయి చేరుకొంది. తమ రాక గురించి భారతదేశంలో ఎవరికీ స్వామీజీ కబురు పంపలేదు. కనుక స్వామీజీకి స్వాగతం పలుకడానికి ఎవరూ వెళ్లలేదు. బొంబాయి నౌకాశ్రయం నుంచి తమ ఐరోపా దుస్తులలోనే రైలు నిలయానికి వెళ్లి బొంబాయి –హౌరా ఎక్స్‌ప్రెస్ కోసం ఆయన వేచివున్నారు. చెన్నెకి చెందిన ప్రొఫెసర్ ఒకరు స్వామీజీని అక్కడ గుర్తుపట్టాడు. ఆతడు స్వామీజీ ప్రసంగాలను చెన్నైలో విన్న వ్యక్తి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, రైలు వచ్చే దాకా స్వామీజీతో ఆతడు మాట్లాడుతున్నాడు.
బేలూర్ మఠంలో
డిసెంబర్ 9 వ తేదీ రాత్రి స్వామీజీ రాక బేలూర్ మఠంలో కూడా ఎవరికీ తెలియదు. స్వామీజీ మఠం చేరుకొన్నప్పుడు రాత్రి భోజన వేళను సూచించే గంట మ్రోగింది. సన్న్యాసులు రాత్రి భోజనానికి వెళుతున్నారు. భోజనం చేస్తూన్న వారితో పనిమనిషి ఒకడు పరుగున వెళ్లి, “ఐరోపా వ్యక్తి ఒకరు వస్తున్నారు. ఆయన ముఖద్వారం పక్కన ఉన్న గోడ ఎక్కి దూకి, మైదానం దాటి మఠం వైపుగా వస్తున్నారు”* అన్నాడు. ఒకరిద్దరు సన్న్యాసులు బయటకు వచ్చి చూశారు. వారికి నమ్మశక్యం కాలేదు. “ఆహా, స్వామీజీ వచ్చేశారు, స్వామీజీ వచ్చేశారు” అంటూ వారు అరిచారు. ఆ అరుపు విని లోపల ఉన్న సన్న్యాసులు బయటకు పరుగెత్తుకొని వచ్చారు. సర్వత్రా ఆనంద కోలాహలమూ, ‘స్వామీజీ, స్వామీజీ’ అనే నినాదాలూ మిన్నుముట్టాయి. స్వామీజీ వారితో, “ఆలస్యంగా వస్తే తినడానికి ఏమీ ఉండదని గోడ ఎక్కి దూకి పరుగున వచ్చాను” అన్నారు తమదైన హాస్య ధోరణిలో! తరువాత సన్న్యాసులు ఆయనను తోడ్కొని వెళ్లి, ఆయనకు ఇష్టమైన కిచుడీ వడ్డించారు.
స్వామీజీ కలకత్తాకు వచ్చీరాగానే ఉబ్బసం నేనున్నానంటూ ఆయనను కావలించుకొన్నది. దానితో ఆయన ఎంతో యాతనపడ్డారు. రాత్రుళ్ళు సన్నిపాతం (delirium) వాటిల్లే మేరకు ఉబ్బసం ప్రకోపించేది. స్వామీజీ దానిని గురించి ఆందోళన చెందలేదు – బహుశా ఆందోళన చెందే వ్యవధి కూడా లేదు! తరచూ కలకత్తాకు వెళ్లారు, కొన్ని రాత్రుళ్లు బలరాం బోస్ ఇంట్లోనే బస చేశారు. తల్లి, బంధువులు, మిత్రులను వెళ్లి చూసివచ్చారు. తక్కిన సమయాలను సామాన్యంగా మఠంలోనే గడిపారు. డిసెంబర్ 19 వ తేదీన ఆయన క్రిస్టైన్కు ఇలా వ్రాశారు:
“ఆనందంతోనూ, క్రియాశీలతతోనూ ఉన్న ప్యారిస్, తీవ్రంగా ఉండే కాన్స్టాంట్నోపెల్, తళతళలాడే చిన్న ఏథెన్స్, పిరమిడ్ల కైరో వెనక్కుపోయాయి. మఠంలో గంగాతీరాన ఉన్న నా గది నుండి వ్రాస్తున్నాను. ఇక్కడ చాలా ప్రశాంతం గానూ, నిశ్చలంగానూ ఉంది. ప్రశాంతమైన సూర్యరశ్మిలో ఈ విశాలమైన నది నృత్యం చేస్తోంది. అప్పుడప్పుడు సరకులతో వస్తున్న పడవల తెడ్ల సవ్వడి నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తోంది. ఇప్పుడు ఇక్కడ శీతకాలం. కాని మధ్యాహ్నం వెచ్చగానూ, ప్రకాశంగానూ ఉంటుంది. ఇది దక్షిణ క్యాలిఫోర్నియా శీతకాలం. ప్రతిదీ వెచ్చ గానూ, బంగారు వన్నెను సంతరించుకొనీ ఉంది. అయినా గాలి చల్లగాను, ఉత్సాహంగాను, ఉల్లాసంగాను ఉంది.”*
సోదర సన్న్యాసులతో పాత జ్ఞాపకాలలో మునిగిపోవడంతో, సన్న్యాసులకూ క్రొత్త బ్రహ్మచారులకూ తరగతులు నిర్వహించడంతో స్వామీజీ రోజులు దొర్లసాగాయి. ఆధ్యాత్మిక సాధనలతో పాటు యువకులు వ్యాయామంలో కూడా పాల్గొనాలని స్వామీజీ అభిలషించారు; అందుకోసం కూడా తరగతులు ఏర్పాటు చేశారు. బహుశా గంగాతీరంలో పచార్లు చేస్తూ ఆవలి తీరంలోని దక్షిణేశ్వర ఆలయ గోపురాలను తిలకిస్తూ గురుదేవులతో సహజీవనం చేసిన మధురమైన రోజులను నెమరువేసుకొని ఉంటారేమోనని ఊహించవచ్చు!
సేవియర్ మరణం గురించి
సేవియర్ మృతి గురించి విన్న స్వామీజీ దుఃఖంలో మునిగిపోయారు. “అయ్యో, నేను త్వరపడి రావడం నిరుపయోగమైంది. పాపం, కెప్టెన్ సేవియర్ కొద్ది రోజుల క్రితమే మరణించారు. ఈ విధంగా ఇద్దరు ఆంగ్లేయులు మన కోసం, హిందువుల కోసం తమ జీవితాలను అర్పించారు”* అంటూ గుడ్విన్నూ జ్ఞాపకం చేసుకొని స్వామీజీ వ్రాశారు. సేవియర్ గడపిన ఔన్నత్య జీవితం కారణంగా ఆయనకు హైందవ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరిపారు. “ఆశ్రమం ప్రక్కగా ప్రవహిస్తున్న ఏటి తీరంలో, పుష్పమాలాలంకృతుని చేసి, బ్రాహ్మణులచే మోసుకొనిపోబడి, బాలురు వేదపారాయణ చేస్తూండగా ఆతడు దహనం చేయ బడ్డాడు.”* సేవియర్ సతీమణిని ఓదార్చడానికి వెంటనే మాయావతికి స్వామీజీ వెళ్లగోరారు. అంతేగాక సేవియర్ మృతి కారణంగా, ‘హిమాలయాల్లో భవిష్యత్తు పనులు ఏమౌతాయో’ అనే ఆందోళన కూడా ఆయనకు లేకపోలేదు. కనుక తక్షణమే మాయావతి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు.
మాయావతి వైపుగా
నేటికీ ఏకాంతమైన తపస్సులో మునిగి ఉన్న ప్రదేశం మాయావతి. దాదాపు 6500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో నేటికీ దాదాపు 3 కి.మీ. పరిధిలో ఇళ్లుగానీ, మానవ సంచారంగానీ లేవు. పర్వతపాదం వద్ద ఉన్న కాత్‌గోడమ్ అనే చోటు దాకా వెళ్లి అక్కణ్ణుంచి 65 మైళ్లు కాలినడకనో లేదా దండీ అనబడే పల్లకీలోనో వెళ్లాల్సి ఉంటుంది. సామాన్లు మోసుకుపోవడానికి మనుషులు కావాలి. మిసెస్ సేవియర్‌ను కలుసుకోవడానికి వస్తున్నట్లు బేలూర్ మఠానికి రాగానే స్వామీజీ మాయావతికి తంతి పంపించారు. ఆయన వచ్చి చేరడానికి కనీసం ఎనిమిది రోజుల ముందుగా కబురు పంపితేనే ఏర్పాట్లు చేయగలమని మిసెస్ సేవియర్ జవాబు పంపింది. కాని తాను 27 వ తేదీన కలకత్తా నుంచి బయలుదేరి 29 వ తేదీన కాత్‌గోడమ్ చేరుకొనేట్లు పంపించిన తంతివార్త 25 వ తేదీన మాత్రమే మాయావతి చేరింది. కనుక స్వామీజీ కోసం ఏర్పాట్లు చేయడం ఎంతో కష్టమయింది.
బహుశా మాయావతికి కబురు అందకపోతే అల్మోరాకు పోవాలని స్వామీజీ అనుకొన్నారు. కనుక అల్మోరాలో ఉన్న మిత్రుడు లాలా బద్రీషాకు కూడా తమ రాక గురించి తంతి పంపించారు. బద్రీషా తన సోదరుడైన లాలా గోవిందషాను కాత్గోడమ్కు పంపించాడు.
తంతి అందగానే మాయావతిలోని విరజానంద వెంటనే చేతల్లోకి దిగారు. గ్రామాలు తిరిగి కూలీ మనుషులు, పల్లకీ ఏర్పాటు చేసి 28 వ తేదీ అర్ధరాత్రి కాత్గోదమ్ చేరుకొన్నారు!
శివానంద, సదానందలతో 29 వ తేదీ ఉదయం ఐదు గంటలకు స్వామీజీ రైలులో వచ్చి కాత్‌గోడమ్ చేరుకొన్నారు. అల్మోరా బృందంవారు, మాయావతి బృందంవారు ఇద్దరూ స్వామీజీకి స్వాగతం పలికి తమ బసకు ఆహ్వానించారు. అది శీతకాలం. హిమాలయాల చలి అమిత తీవ్రమైనది. అందునా 1900–1901 నాటి చలి మామూలు కన్నా ఎంతో ఎక్కువగా ఉంది. స్వామీజీకి ఉబ్బసం ఒకవైపు ఉండగా దానికి జ్వరం జతచేరింది. కనుక అల్మోరాలో కాస్త విశ్రాంతి తీసుకొని తరువాత మాయావతి వెళ్లవచ్చునని గోవిందషా అభిప్రాయపడ్డాడు. కాని స్వామీజీ అల్మోరా వెళితే తరువాత ఎప్పుడు మాయావతికి వస్తారు, బహుశా రాకుండా పోవచ్చునేమోనని భయపడ్డారు విరజానంద. కనుక ఆయన స్వామీజీని మాయావతికి రమ్మని గట్టిగా కోరారు. క్షణం మాత్రమే, స్వామీజీ విరజానంద ప్రయాసలనూ, ఇంత తక్కువ వ్యవధిలో ఏర్పాట్లు చేసిన ప్రతిభనూ ప్రశంసించి, “ఇతడే నా శిష్యుడు” అంటూ శ్లాఘిస్తూ మాయావతికే వెళ్లాలని నిశ్చయించారు. గోవిందషా కూడా స్వామీజీతో మాయావతి వెళ్లాలని తీర్మానించాడు. బహుశా తిరిగి వస్తున్నప్పుడైనా స్వామీజీని అల్మోరాకు తోడ్కొని వెళ్లవచ్చునని అతడు ఆశించాడు.
కాత్‌గోడమ్ నుంచి స్వామీజీ వెంటనే బయలుదేరాలనుకొన్నప్పటికీ ఒక రోజు కచ్చితంగా ఆయన విశ్రాంతి తీసుకోవాలని అందరూ పట్టుబట్టడంతో ఆయన ఆ రోజు అక్కడ బసచేశారు.
మాయావతి పయనం
కాత్‌గోడమ్ నుంచి మాయావతి వెళ్లడానికి ఐదు రోజులు పడుతుంది; ఈ ప్రయాణం చాలా శ్రమతో కూడుకొన్నది. ఈ యాత్ర పూర్తి బాధ్యత విరజానంద స్వీకరించారు. మాతృమూర్తి శ్రీశారదాదేవి వద్ద మంత్రదీక్ష, స్వామీజీ నుంచి సన్న్యాసదీక్ష పుచ్చుకొన్న వ్యక్తి ఈయన. మొదటిసారి పాశ్చాత్యదేశాలు సందర్శించి తిరిగి వచ్చి బేలూర్ మఠంలో బస చేసిన రోజుల్లో తమకు విరజానంద సేవలందించడం పట్ల స్వామీజీ ఎంతో సంతోషించారు. ఇప్పుడు మళ్లీ గురువుకు సేవలందించే భాగ్యం కలిగి నందుకు విరజానంద పరమానందభరితులయ్యారు. యాత్ర ఏర్పాట్లు, వంట, స్వామీజీ భోజనం లాంటివి స్వయంగా ఆయనే చూసుకొన్నారు. స్వామీజీ తక్కిన అవసరాలను సదానంద చూసుకొన్నారు.
30వ తేదీన అందరూ బయలుదేరారు. విరజానంద అవిశ్రాంతంగా శ్రమించడం చూసి స్వామీజీ ఆందోళన చెందారు. కనుక పట్టుబట్టి స్వామీజీ తమ శిష్యుణ్ణి గుర్రం మీద పయనింపజేశారు. మొదటి రోజు ప్రయాణం సాఫీగా సాగింది. దారిలో భీమ్తాళ్ అనే సరోవర తీరాన వంట చేసుకొని భుజించారు. వంట పనులను స్వామీజీ పర్యవేక్షించారు. భోజనానంతరం బయలుదేరి 17 మైళ్ల దూరంలోని ధారీ అనే ప్రదేశాన్ని చేరుకొని అక్కడున్న పర్యాటక విడిదిలో రాత్రి గడిపారు.
మర్నాడు వేకువ నుంచే వాన ప్రారంభం కావడంతో నాటి ప్రయాణం ఎంతో శ్రమతో సాగింది. అందుకు తోడు మంచు కురిసే ప్రమాదమూ పొంచి ఉంది. రెండు మైళ్ల దూరం వెళ్లగానే వాన ఉద్ధృతమైంది. పొగమంచుతో చీకట్లు క్రమ్ముకోసాగాయి. కాసేపటికల్లా మంచుతో నేల కనిపించకుండాపోయింది. స్వామీజీ ప్రకృతి వాతావరణాన్ని చూసి తనివితీరా ఆనందించారు. స్వామీజీని ఎలా జాగ్రత్తగా తోడ్కొని వెళ్లాలో పాలుబోక విరజానంద ఆందోళనతో సతమత మయ్యారు. స్వామీజీ పల్లకీని మోసే బోయీలకు అనేకమార్లు కాలుజారింది; కాని స్వామీజీ ఏమాత్రం కంగారు చెందకుండా తమాషాగా మాట్లాడుతూ వారిని ఉత్సాహపరిచారు.
పల్లకీ మోసే బోయీలలో ఒకడు దేవీమాహాత్మ్య శ్లోకాలను దోషభూయి ష్ఠంగా ఉచ్చరిస్తూ వచ్చాడు. స్వామీజీ అతణ్ణి ‘పండిట్జీ’ అని సంబోధించారు. అతడు పలుమార్లు వివాహం చేసుకొన్నప్పటికీ ప్రస్తుతం ఏ భార్యా సజీవంగా లేదు. స్వామీజీ అతణ్ణి తమాషాగా, “పండిట్జీ! మళ్లీ మరొకసారి వివాహం చేసుకొంటారా?” అని అడిగారు. “ఆహా, నిరభ్యంతరంగా, కాని అందుకు డబ్బు లేదు!”* అన్నాడు విచారంగా. వెంటనే స్వామీజీ, “ఆ డబ్బు నేను చెల్లిస్తే…” అన్నారు. పండిట్జీ ఆనందం పట్టలేకపోయాడు; “పరమ కృతజ్ఞునిగా ఉంటాను” అంటూ తలవంచి పదే పదే స్వామీజీకి నమస్కరించాడు. స్వామీజీ ఆ వృద్ధుని ఆనందంలో పాలుపంచుకొన్నారు.
మంచునూ, చలిగాలులనూ ప్రతిఘటిస్తూ ఏడున్నర మైళ్లు దాటి మధ్యాహ్నం 3 గంటలకు పౌర్హపానీ అనే ప్రదేశంలోని ఒక చిన్న దుకాణం వద్దకు వచ్చారు. స్వామీజీ పల్లకీలో రావడం వలన ముందుగా చేరుకొన్నారు. తక్కినవారు ఎంతో యాతనపడి ఆలస్యంగా వచ్చారు. దుకాణాన్ని చూడగానే పల్లకీ బోయీలలో ఒకడు స్వామీజీతో, “బాబాజీ! ఇక్కడ కాస్త టీ త్రాగడానికి మాకు అనుమతినివ్వండి. టీ త్రాగగానే సమధికోత్సాహంతో తక్కిన ఏడున్నర మైళ్లనూ గమించి రాత్రి లోపు మౌర్నల్లా చేరుకోవచ్చు” అన్నాడు. స్వామీజీ బాలునిలా అందుకు సమ్మతించి, పైకం ఇస్తానని కూడా చెప్పారు. వారూ మెల్లగా టీ, బీడీలు త్రాగారు. ఆ తరువాత ఒకరిద్దరు విశ్రమించారు, ఒకరిద్దరు మంట రగిల్చి చలి కాచుకోసాగారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన విరజానంద ఇదంతా చూసి విస్తుబోయారు. ఇంతలో సాయంత్రం 5 అయింది. అప్పటికే చీకట్లు ఆవరించసాగాయి. ఇంకా ఏడున్నర మైళ్లు పయనించాలి! సాధ్యమేనా? ఆయన మనస్సు యోచించసాగింది. ఆ రాత్రి అక్కడే బస చేయడం గురించి ఆయన ఊహించలేకపోయారు.
పరిస్థితిని స్వామీజీ అర్థం చేసుకొన్నారు. బోయీలకు ఆగడానికి సమ్మతించి ఉండకూడదు, తప్పు తనదేనని ఆయన గ్రహించారు. కాని బాలునిలా ఇతరుల మీద నిందను మోప నారంభించారు. ఆ సమయంలో అక్కడకు శివానంద వచ్చి చేరుకొన్నారు. వెంటనే కోపంగా అతణ్ణి, “మీ రందరూ మూర్ఖులు. మంచు కురుస్తుందని ముందే తెలిసివుంటే నాచేత ఎందుకు ప్రయాణం చేయించారు? కాళీకృష్ణను నిందించడం నిష్ప్రయోజనం. అతడు బాలుడు. నువ్వు పెద్దవాడివి. ఈ పరిస్థితుల్లో అల్మోరా వెళ్లకుండా నన్ను ఆపి మాయావతికి తీసుకువస్తూ నన్నెందుకు అవస్థపాలు చేస్తున్నావు?” అని అడిగారు. విరజానందను కూడా విడవకుండా, “మాయావతి వెళ్లాలని నువ్వు హఠం చేయబట్టే ఈ అవస్థ” అంటూ చీవాట్లు పెట్టారు. ఆయన మాట్లాడడం పూర్తయ్యేదాకా మౌనంగా ఉండిపోయారు విరజానంద. తరువాత, “స్వామీజీ! సమస్య లన్నింటికీ మీరే కారణం! బోయీల గురించి ముందే మిమ్మల్ని హెచ్చరించాను. వారిని నిలవడానికి మీరు అనుమతిం చడం వల్లనే ఇంత తంటా. లేకపోతే ఈపాటికే మనం మౌర్నల్లా చేరుకొని ఉండేవారం” అన్నారు. నిజాన్ని నిర్భయంగా చాటి చెప్పడంతో స్వామీజీ మౌనం వహించారు. “పోనీలే, జరిగిందేదో జరిగిపోయింది. నిన్ను తిట్టాను, మనస్సులో ఉంచుకోవద్దు. తండ్రి కుమారుణ్ణి తిట్టడా? ఇదీ అంతే! ఇక ఈ రాత్రి ఇక్కడ ఎలా గడపాలో ఆలోచిద్దాం. కాళీకృష్ణా! వెన్ను నొప్పిగా ఉంది. కాస్త ఒత్తు” అన్నారు. విరజానంద సుతిమెత్తగా స్వామీజీ వెన్నును ఒత్తారు.
ఇంతలో సదానంద, గోవిందషాలు తప్ప తక్కిన అందరూ చేరుకొన్నారు. వాకబు చేయగా వారిద్దరూ స్వామీజీ కన్నా ముందే ఆ చోటు దాటిపోయినట్లు దుకాణదారు తెలిపాడు. వారు మంచు తుపానులో చిక్కుకుపోతారేమోనని స్వామీజీ ఆందోళనపడ్డారు. అందరికీ కించిత్తు భయం కలుగకపోలేదు. రెండు రూపాయలు ఇస్తే తన అల్లుణ్ణి పంపించి వారి గురించిన సమాచారం తెలుసుకొని రావచ్చునని దుకాణదారు చెప్పాడు. అట్లే పైకం ఇచ్చి, ఆ ఇద్దరూ మౌర్నల్లా విడిదికి క్షేమంగా చేరినట్లు తెలుసుకొన్నారు.
ఉన్న సమస్యలు చాలవన్నట్లు మరో సమస్య తలెత్తింది. శివానంద ఎక్కి వచ్చిన గుర్రం, అశ్వశిక్షకుని పట్టు సడలగానే అతి త్వరితంగా వెనక్కు తిరిగి కాత్‌గోడమ్ వైపుగా పరుగెత్తిపోయింది; తిరిగి రాలేదు. దాని వెనుక పరుగెత్తిన అశ్వశిక్షకుడు కూడా తిరిగి రాలేదు. మర్నాటి ప్రయాణానికి బృందంలో చిన్నవాడైన విరజానంద తన గుర్రాన్ని శివానందకు ఇవ్వవలసి వచ్చింది.
అది భయంకరమైన, మరచిపోలేని రాత్రి. నాడు 19వ శతాబ్దపు చరమ రాత్రి (31 డిసెంబర్ 1900). విరజానంద దానిని జ్ఞాపకం చేసినప్పుడు స్వామీజీ మౌనంగా నవ్వారు. తరువాత ఆ దుకాణదారునితో చిరపరిచయస్థునిలా మాట్లాడ సాగారు. చక్కని భోజనం పెడితే అందుకు తగ్గట్లు పైకం ఇస్తామని కూడా చెప్పారు. అయినప్పటికీ అతడు పెట్టిన చపాతీలు ఒక అంగుళం మందంతో, గుర్రం కొరికితే దాని పళ్లు కూడా విరిగే మేరకు ఎంతో గట్టిగా ఉన్నాయి! సరిగా కాలలేదు కూడా. బంగాళాదుంప కూర గురించి చెప్పనక్కర్లేదు! నిద్ర గురించిన ప్రశ్నే లేదు! ఎందుకంటే చలి కోసం దుకాణంలో రగిలించిన మంట నుంచి వచ్చిన పొగ వీరు పడుకొన్న గదినంతా ఆవరించింది. ఇకపైన వీరితో విసిగి వేసారాలని ఆ దుకాణదారు స్వామీజీని, ఆయన బృందాన్ని తన పర్వత ప్రాంత భాషలో తిట్టాడు. తన భాష వారికి అర్థం కాదనుకొన్నాడు అతడు. కాని దురదృష్టవశాత్తూ స్వామీజీకి ఆ భాష కొంతవరకు తెలుసు. స్వామీజీకీ, ఆయన శిష్యులకూ, తక్కినవారికీ 19వ శతాబ్దపు చరమ దినం ఈ విధంగా గడిచింది!
మర్నాడు ఉదయం దుకాణదారుని తిట్లను పెద్దగా పట్టించుకోకుండా స్వామీజీ ముందే చెప్పినట్లు అతడికి ఎక్కువ డబ్బు ఇచ్చారు. తరువాత అందరూ బయలుదేరారు. 12 అంగుళాల మంచు కురిసినప్పటికీ బోయీలు వేగంగానే వెళ్లారు. స్వామీజీ ఒక బాలునిలా మంచు పర్వతాలనూ, కురుస్తున్న మంచు అందాన్నీ చూసి ముగ్ధులవుతూ వచ్చారు. విరజానంద పల్లకీ ప్రక్కనే పరుగు లాంటి నడకతో వస్తున్నారు. మౌర్నల్లా విడిది చేరుకొన్నప్పుడు అక్కడ వారి కోసం అన్ని ఏర్పాట్లూ సదానంద చక్కగా చేసివుంచాడు. స్వామీజీ వారితో విరజానందను ప్రశంసిస్తూ మాట్లాడారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోకుండా అంతటినీ సంబాళించుకోగల ఆతడి నైజాన్ని శ్లాఘించారు.
మర్నాటి పయనం సాఫీగానే సాగింది. మంచు కొంత కరిగిపోయింది. నాడు వారు 21 మైళ్లు గమించాలి. స్వామీజీ కాస్త దూరం నడవాలని అభిలషించారు. కాని నడచిన కాసేపట్లోనే అలసిపోయారు. అయినప్పటికీ ఒక చేతిలో కర్ర, మరోచేతిని విరజానంద భుజం మీద వేసుకొని “ఒక తండ్రి కుమారుని భుజం మీద వాలి వెళ్లే రీతిలో” వెళ్లారు. “ఎంత బలహీనుణ్ణి, వృద్ధుణ్ణి అయిపోయాను! ఈ కాస్త దూరం నడవడానికి ఇన్ని పాట్లుపడుతున్నాను. ఆ రోజుల్లో 20/25 మైళ్లు సునాయాసంగా నడిచేవాణ్ణి. ఇక ఎక్కువ రోజులు జీవించననిపిస్తోంది” అన్నారు స్వామీజీ.
అద్వైత ఆశ్రమంలో
మర్నాడు, జనవరి 3 వ తేదీ ఉదయం. కాస్త దూరంలోనే ఆశ్రమ భవనం కానవచ్చింది. దానిని చూసి స్వామీజీ చాలా ఆనందించారు. కాస్త దూరంలో ఉండగానే ఆశ్రమంలో 12 గంటలు కొడుతున్న శబ్దం విని పించింది. స్వామీజీ హఠాత్తుగా ప్రక్కనే ఉన్న గుర్రమెక్కి దానిని అదలించారు. గుర్రం దౌడు తీసి సత్వరమే ఆశ్రమం చేరు కొంది. స్వామీజీని ఆహ్వానించడానికి ఆశ్రమాన్ని అందంగా అలంకరించారు. అక్కడ మిసెస్ సేవియర్, స్వరూపానంద, సచ్చిదానంద, విమలానందలు నిలబడి ఉన్నారు. అమెరికన్ అయిన ఛార్లెస్ జాన్స్టన్ కూడా ఉన్నాడు. అతడు బ్రహ్మచర్య దీక్ష పుచ్చుకొని బ్రహ్మచారి అమృతానంద పేరిట అక్కడ జీవిస్తున్నాడు.
స్వామీజీ చేరుకొన్న కాసేపటికి గోవిందషా వచ్చాడు. పిదప విరజానంద, చాలాసేపటి తరువాత శివానంద, సదానందలు వచ్చారు. వారందరూ మంచు లోనూ, మంచుపొగలోనూ ఎంతో యాతనపడి వచ్చారు.
స్వామీజీ దాదాపు రెండు వారాలు మాయావతిలో గడిపారు. కాని మంచు కారణంగా ఆయన అంతగా బయటకు వెళ్లలేకపోయారు. అస్వస్థతతో బాధపడ్డారు. ఉబ్బసం ఆయనను మరీ ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ మిసెస్ సేవియర్‌ను ఓదార్చి, ఆశ్రమ భవిష్యత్తు గురించి ఆశ్రమవాసులతో చర్చించారు.
ఒక రోజు హఠాత్తుగా ఆయన అంతఃప్రేరణ వలననో లేక మిసెస్ సేవియర్ ఆయన ప్రసంగం వినగోరాలనే అభిలాషను వ్యక్తం చేయడం వలననో స్వామీజీ, “ప్రసంగ” శైలిలో మాట్లాడారు. అక్కడ ఎనిమిదిమంది మాత్రమే ఉన్నారు. స్వామీజీ పచార్లు చేస్తూ బిగ్గరగా దాదాపు అరగంటసేపు మాట్లాడారు.
సంభాషణలు, చర్చలు, లేఖలు వ్రాయడంలో స్వామీజీ రోజులు గడపసాగారు. ఈ రోజుల్లోనే స్వామీజీ “ఆర్యులు–తమిళులు”* అనే వ్యాసం రచించి ప్రబుద్ధ భారత పత్రికకు పంపించారు. మరో ఒకటి రెండు వ్యాసాలు కూడా వ్రాశారు.
ఒక రోజు స్వామీజీ, సచ్చిదానంద, శివానంద, మిసెస్ సేవియర్, స్వరూపా నందలు పర్వతం మీద ఉన్న ధరమ్‌ఘర్ అనే కాస్త ఎత్తులోని ప్రాంతం దాకా వెళ్లారు. అక్కడ ఒక గది కట్టాలని స్వామీజీ అభిలషించారు. అక్కడ నుంచి చుట్టూ ఉన్న పర్వత ప్రాంతాలూ, మంచుపర్వత శిఖరాలూ చక్కగా కనిపిస్తాయి.* మాయావతిలోని ఒక చిన్న సరోవరాన్ని చూసి స్వామీజీ ఎంతో ఆనందించారు. దాని అందంతో ముగ్ధులై, “నా అంతిమ దినాలను తక్కిన పనులన్నీ వదలిపెట్టి ఈ సరోవర తీరంలో గడపుతాను. పుస్తకాలు వ్రాసుకొంటూ, ఇష్టమైన పాటలు పాడుకొంటూ ఒక బాలునిలా స్వేచ్ఛగా తిరుగుతాను” అన్నారాయన.*
శివ చైతన్యంలో
మంచు పర్వతాలను తిలకించి వాటిలో మనస్సు ద్రవించిపోవడమంటే స్వామీజీకి ఎంతో ఇష్టం. ఆయన గది కిటికీ గుండా బయటకు చూస్తే బారులు తీరిన ధవళ హిమశిఖరాలను చూడవచ్చు. ఏకాంతంలో కూర్చుని వాటిని చూస్తూ మౌనంలో లయించిపోయి ఉంటారాయన. ఒక రోజు బ్రహ్మచారి జ్ఞాన్‌ను పిలిచి, “చూడు, చూడు! ఎంత అందం! నీకు శివస్తోత్రం తెలుసా?” అని అడిగి, మృదుమధుర స్వరంలో స్తోత్ర పఠనం చేయ సాగారు. ఆయన కళ్లు ఆనందబాష్పాలను స్రవించాయి.
గాత్రమ్ భస్మసితమ్ సితఞ్చ
హసితమ్ హస్తే కపాలమ్ సితమ్
ఖట్వాంగమ్ చ సిదశ్చ వృషభః
కర్ణే సితే కుండలే ।
గంగా ఫేన సితా పశుపతేశ్
చన్ద్రః సితో మూర్ధనీ
సోఽయం సర్వ సితో దధాతు
విభవం పాపక్షయం సర్వదా ॥*
స్తుతిని పఠిస్తూనే స్వామీజీ బాహ్యస్మృతిని కోల్పోయారు.
ఆరాధన సమస్య
మాయావతి ఆశ్రమం అత్యున్నత ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించడానికి అనువుగా ఉండాలని స్వామీజీ అభిలాష. అద్వైత వేదాంతం ప్రకారం ఆరాధన మొదలైనవి ప్రాథమిక సోపానాలు మాత్రమే. తనలోని ఆత్మను గ్రహించి దానిలో ప్రతిష్ఠితమైన ఆ అత్యున్నత స్థితిలో కొందరైనా అక్కడ జీవించాలని అభిలషించారు స్వామీజీ. కాని ఆయన ఇక్కడకు వచ్చినప్పుడు ఇక్కడ కూడా పూజామందిరం, శ్రీరామకృష్ణుల ఆరాధన లాంటివి జరుగుతూండడం చూశారు. ఆయనకు అవి అసంతృప్తిని కలిగించాయి. అయినప్పటికీ అక్కడ జీవించే వారి మనస్సులను గాయపరచ కూడదని దానిని వెంటనే తొలగించమని ఆయన ఆదేశించలేదు.*
గురువు సేవ
మాయావతిలో సేవాకార్యాలు ప్రారంభించాలని ఒక రోజు స్వామీజీ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆశ్రమవాసులు మూడేళ్లయినా స్థిరంగా ఉండి పనులలో పాల్గొనాలని చెప్పారు. విరజానంద తప్ప తక్కిన అందరూ సమ్మతించారు. ఆయన మాత్రం తనకు ఏకాంతంలో ఉంటూ తపోమయ జీవితం గడపాలనే ఆసక్తి ఉందని తెలిపారు. స్వామీజీ అనేక విధాలుగా నచ్చజెప్పి ఆయనను అంగీకరింపజేశారు. చివరికి విరజానంద, “గురువు ఆదేశాన్ని శిరసావహిస్తున్నాను” అంటూ స్వామీజీ భావనను స్వీకరించారు.
ఒకరోజు భోజనం తయారుచేయడంలో ఆలస్యమయింది. స్వామీజీలో ఓర్పు నశించి అందరినీ చీవాట్లు పెట్టారు. చివరికి పూర్తిగా సహనం కోల్పోయి వంట గదిలోకి వెళ్లారు. అక్కడ తడిసిన వంట చెరకుతో పొగతో విరజానంద పాట్లు పడడం చూసి ఏమీ మాట్లాడకుండా తిరిగి వచ్చేశారు. ఏదో విధంగా వంట పూర్తయి ఆయనకు భోజనం వడ్డించారు. “నాకు ఏదీ అక్కర్లేదు. అంతా తీసుకు వెళ్లిపో” అన్నారు కోపంగా. విరజానందకు స్వామీజీ మనఃస్థితి మార్పులు బాగా తెలుసు. కనుక మౌనంగా నిలబడిపోయారు. కాసేపటికల్లా స్వామీజీ భుజించ నారంభించారు. వంటను బాగా ప్రశంసించి, “నా కెందుకు కోపం వచ్చిందో ఇప్పుడే అర్థమవుతోంది. మనిషిని చంపే ఆకలి కడుపును గిల్లినప్పుడు కోపం రాకుండా ఏం చేస్తుంది?” అన్నారు.
తరువాత అక్కడున్న అమెరికన్ బ్రహ్మచారికి ఇలా వివరించారు: “వీరెలా నాకు సేవ చేస్తున్నారో చూశావా? ఇవి నీకు బహుశా ఆశ్చర్యం కలిగిస్తాయేమో! ఇది భారతీయుల దృక్పథం. గురువు సేవ ఆధ్యాత్మిక పురోగతిలో ఒక మార్గం.”
గుర్రపు స్వారీ
శారీరక అస్వస్థత ఒక వంక, మంచు కారణంగా బయటకు వెళ్లలేకపోవడం మరో వంక! కనుక స్వామీజీ మాయావతి నుంచి బయలుదేరాలనుకొన్నారు. జనవరి 18వ తేదీన ఆయన ప్రయాణం నిశ్చయమైంది. వచ్చినప్పటిలానే కూలీలు, పల్లకీ, గుర్రాలు ఏర్పాటు చేయ వలసి వచ్చింది. బయలుదేరడానికి ముందు రోజు దాకా కూలీల విషయంలో ఎలాంటి నిర్ధారణకూ రాలేకపోవడంతో స్వామీజీ కాస్త కలత చెందారు. అది చూసి విరజానంద, “స్వామీజీ! ఆందోళన చెందకండి. మరే మార్గమూ లేకపోతే మేమే మీ పల్లకీని మోసుకుపోతాం” అన్నారు. స్వామీజీ బిగ్గరగా నవ్వుతూ, “అలా అయితే నన్ను ఆ లోయలోకి విసిరివేయడానికి నిశ్చయించావన్నమాట?” అని అడిగారు.
18వ తేదీ మధ్యాహ్నం స్వామీజీ మాయావతి నుంచి బయలుదేరారు. ఇప్పుడు మరో దారి ఎంపిక చేసుకొన్నారు. ఒక రోజు దారిలో వంట ఆలస్య మయింది. యథాప్రకారం విరజానంద వంట పనిలో సతమతమయ్యారు. చిన్న కుండలో ఎక్కువ బియ్యం వేయడంతో పూర్తిగా ఉడకక ముందే బియ్యం పొంగి బయటకు రాసాగింది. స్వామీజీ ఒకరి వెనుక ఒకరినిగా పంపించి, “వంట అయిందా?” అంటూ పదే పదే అడగసాగారు. ఎంతసేపటికీ జవాబు రాకపోయే సరికి ఆయనే స్వయంగా వెళ్లారు. పరిస్థితిని చూసి మృదువుగా విరజానందతో, “బియ్యంలో కాస్త నెయ్యి పోసి మూతపెట్టు బాగా ఉడుకుతుంది, అన్నం కూడా రుచిగా ఉంటుంది” అన్నారు. అట్లే చేసి విరజానంద వంట ముగించి అందరికీ వడ్డించారు.
ఫిలిబిత్ అనే చోటు నుంచి వారు కలకత్తాకు రైలు అందుకోవాలి. శీఘ్రంగా చేరుకోవాలనే ఆతురతతో 15 మైళ్లు ముందున్న తనక్‌పూర్ వద్ద పల్లకీ వదలిపెట్టి గుర్రాలు ఏర్పాటు చేసుకొన్నారు. సదానంద ఒక మంచి గుర్రాన్ని ఎంపిక చేసుకొని దానిని అధిరోహించి అదలించాడు. అంతే గుర్రం దౌడు తీసింది. స్వామీజీ, తక్కిన వారు ఒక మైలు ప్రయాణం చేసిన తరువాత కూడా సదానంద కనుచూపు మేరలో కనిపించలేదు. అప్పుడు స్వామీజీ ఎంతో కలత చెంది దారిలో వస్తున్న వారితో అతణ్ణి గురించి వాకబు చేశారు. కాస్త దూరం వెళ్లిన తరువాత ఒక గుర్రం దారి తప్పి ప్రక్కనే ఉన్న పొలాల గుండా దౌడు తీసినట్లు చూశామని కొందరు చెప్పారు. అందరూ గుర్రాలు దిగి ఆ దిశలో నడవడం మొదలుపెట్టారు. కాస్త దూరం వెళ్లగా ఎదురు వైపు నుంచి సదానంద గుర్రాన్ని నడిపించుకొంటూ రావడం కనిపించింది. ఏమాత్రం లొంగకుండా దౌడు తీసిన గుర్రం సదానందను బురదలో త్రోసివేసి, అప్పుడు అణగింది!
విరజానంద గుర్రపు స్వారీ చేయడానికి కాస్త జంకడం నాలుగవ రోజు పయనంలో స్వామీజీ గమనించారు. కనుక ఆయన ప్రక్కకు వెళ్లి స్వారీ చేయడం, వేగం పెంచడం, లొంగదీయడం ఎలాగో నేర్పించారు. తరువాత ఆయన ఒక గుర్రం ఎక్కి అదిలించారు. తక్కినవారు అదిలించగా అన్ని గుర్రాలూ దౌడు తీశాయి. విరజానంద తన గుర్రాన్ని అదిలించక మునుపే, తక్కిన గుర్రాలు దౌడు తీయడంతో దానంతట అదే దౌడు తీసింది. విరజానంద అసలే భయస్థుడు, అందునా ఆయన తయారు కాకముందే గుర్రం దౌడు తీయడంతో భయభ్రాంతు డయ్యాడు. గట్టిగా కళ్లాన్ని పట్టుకోకపోతే క్రింద పడిపోవడం తథ్యమన్న స్థితిలో కళ్లాన్ని గట్టిగా పట్టుకొని ఎలాగో పయనాన్ని ముగించాడు. ఈ పయనానంతరం గుర్రపు స్వారీలో నిష్ణాతుడయ్యాడు కూడా.
స్వదేశీయునితో ప్రయాణమా?
స్వామీజీ, సదానందలు మాత్రమే నాడు కలకత్తా బయలుదేరారు. వారు రెండవ తరగతి టికెట్టు కొనుగొలు చేశారు. వారితో ఒక ఆంగ్లేయ సేనానాయ కుడు కూడా పయనించాడు. అతడికి ఈ ‘స్వదేశీ’ యులతో పయనించడం పరువు తక్కువ అనిపించింది. అయినప్పటికీ అనేకులు వచ్చి స్వామీజీకి వీడ్కోలు చెప్పడమూ, ఫిలిబిత్ సహాయ కలెక్టరైన పండిట్ భవానీదత్ జోషీ స్వయంగా వచ్చి ప్రణమిల్లడమూ చూసి ఆతడు వారితో తిన్నగా ఏదీ చెప్పడానికి సాహసించలేదు. కనుక బయటకు వెళ్లి స్టేషన్ మాస్టర్‌ను చూసి, వారిని ఆ పెట్టె నుంచి మరో పెట్టెలోకి మార్చమని చెప్పాడు. ఆ స్టేషన్ మాస్టర్ కూడా ఒక ‘స్వదేశీ’ యే. ఆతడు వచ్చి స్వామీజీతో ఆ ఆంగ్లేయుని కోర్కెను వినమ్రంగా తెలిపాడు. అంతే, ఆతడి మాటలు పూర్తి కాకుండానే స్వామీజీ, “నాతో ఇలా చెప్పడానికి మీ కెంత ధైర్యం? సిగ్గుగా లేదా!” అన్నారు ఆగ్రహోదగ్రులై. భయపడి స్టేషన్ మాస్టర్ వెనుకంజ వేశాడు.
“స్వదేశీ” యులు పెట్టెను ఖాళీ చేసివుంటారని ధీమాగా వచ్చాడు ఆ ఆంగ్లేయుడు. స్వామీజీ, సదానందలు యథాప్రకారం అక్కడే ఉండడం చూసి అతడు కోపంగా, “స్టేషన్ మాస్టర్, స్టేషన్ మాస్టర్” అంటూ అరుస్తూ అటూ ఇటూ పరుగెత్తాడు. స్టేషన్ మాస్టర్ అక్కడ ఉంటే కదా! కనుచూపు మేరలో ఆతడు ఎక్కడా కనిపించలేదు! రైలు బయలుదేరే సమయం ఆసన్నమయింది. మరే దారీలేక ఆ ఆంగ్లేయుడు తన సామాన్లు తీసుకొని మరో పెట్టెలోకి తరలి పోయాడు.
ఖేత్రీ మహారాజు ఆకస్మిక మరణం
కలకత్తా వస్తున్న దారిలో వార్తాపత్రికలో ఒక దిగ్భ్రాంతికర వార్త స్వామీజీ చదివారు. ఆ వార్త, ఆయన అనుంగు శిష్యుడైన ఖేత్రీ మహారాజు ఆకాల మరణ వార్త! ఆగ్రా సమీపంలోని అక్బర్ స్మారక చిహ్నమైన సికందరా స్తూపంలో మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నప్పుడు, కాలు జారి క్రిందపడి ఆయన మరణం సంభవించింది. “దారిలో ఖేత్రీ మహారాజు ఆకస్మిక మరణ వార్తను విన్నాను. ఆగ్రాలోని ఒక పురాతన కట్ట డాన్ని తన సొంత ఖర్చులతో బాగుచేయిస్తున్నాడు. పర్యవేక్షిస్తూ ఒక అంతస్తు ఎక్కి నట్లున్నాడు. ఆ అంతస్తు కొంత భాగం కూలి ఆయన అక్కడికక్కడే మరణించాడు”* అని స్వామీజీ సారాకు వ్రాశారు.
అనుంగు శిష్యుని మరణం అనడం కన్నా, మొగలాయీ చక్రవర్తియైన అక్బర్ స్మారక చిహ్నాన్ని మరమ్మతు చేస్తున్నప్పుడు ఆయన మరణించాడనే వార్త స్వామీజీని అమిత దుఃఖానికి లోను చేసివుంటుంది. స్వామీజీకి అక్బర్ పట్ల అపార గౌరవం. ఇంగ్లండు వెళ్లే దారిలో కంట తడిపెట్టుకొని నివేదితతో ఆయన అక్బర్ గురించి చెప్పడం కద్దు. అక్బర్ సమాధికి గుమ్మటం (dome) లేకపోవడం ఆయనకు బాధ కలిగించింది. తన సమాధి ఎలా ఉండాలో స్వయంగా అక్బరే కొంతమేరకు నిర్ణయించుకొన్నాడు. ఆయన కుమారుడైన జహంగీర్ దానిని నిర్మించాడు. కాని 1688 లో జాట్ సముదాయస్థులు ఔరంగజేబుపై తిరుగుబాటు చేసినప్పుడు ఆ సమాధిని పగులగొట్టి, అక్కడ పదిలపరచబడివున్న ఆభరణాలను దోచుకొని అక్బర్ సమాధిని తెరిచి ఆయన ఎముకలను బయటకు లాగి, దగ్ధం చేసి ఆ భస్మాన్ని చెల్లాచెదురుగా విరజిమ్మారు. వీటి గురించి అనేకసార్లు స్వామీజీ నివేదితకు చెప్పడం కద్దు. బహుశా స్వామీజీ ఉద్వేగ వెల్లువ ఖేత్రీ మహారాజును ఆ మరమ్మతు పనులకు ప్రేరేపించి ఉండవచ్చునేమో!
మహారాజు మరణం స్వామీజీని మరో రకంగానూ బాధించింది. ఆయన మఠానికి మాత్రమే కాదు, స్వామీజీ తల్లికి, సోదరునికే కాక, అనేకులకు ధన సహాయం అందిస్తూవచ్చారు. కొంతకాలం క్రితమే మహారాజు తన కుమారుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి నమ్మకస్థులైన కొందరి బాధ్యతలో అప్పగించి ఉన్నత జీవితంలో కాలం వెళ్లబుచ్చాలనుకొంటున్నట్లు స్వామీజీతో చెప్పారు. “మానవకోటి సంక్షేమం కోసమూ, స్వకీయ ముక్తి కోసమూ” ఆయన ఇలాంటి నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. స్వామీజీ కూడా ఈ నిర్ణయం పట్ల హర్షం వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. కాని మహారాజు మరణం అన్నింటినీ ముగింపునకు తెచ్చింది. “కొన్ని నెలల క్రితం ఖేత్రీ మహారాజు పైనుండి క్రింద పడి మరణించారు. కాబట్టి పరిస్థితులు నా చుట్టూ అంధకారంగా ఉన్నాయి”* అంటూ స్వామీజీ వ్రాశారు.
చాలాకాలం నుంచీ ఖేత్రీ మహారాజుకూ, జైపూర్ మహారాజుకూ మధ్య అభిప్రాయభేదాలూ, సమస్యలూ ఉంటూవచ్చాయి. అప్పుడు స్వామీజీ తమ ఆశీస్సులు అందించడంతోబాటు ఒక కవితనూ రచించి పంపించారు:
సూర్యుడొకింత మబ్బుతో కప్పబడి ఉన్నా
ఆకాశం ఒకింత చీకటిగా ఉన్నా
ధీరహృదయమా!
ఒకింత ఓర్పుతో వేచి ఉండుమా
జయం కలుగడం తథ్యం.
గ్రీష్మం తర్వాత రాని
శీతకాలం ఉండదు
ప్రతి పల్లం
మరొక ఉత్తుంగానికి దారితీస్తుంది
అవి రెండూ చీకటి కాంతుల్లో
బండి చక్రాల్లా తిరుగుతుంటాయి
కనుక ధైర్యం పూని స్థిరంగా ఉండు.*