కన్నులకు కనబడక, చెవులకు వినబడక, మెలమెల్లగా రాలుతూ, అత్యంత సుందరమైన లేత గులాబీలను వికసింపజేసే కోమల నీహార వర్షంలా, ప్రపంచ విజ్ఞానానికి భారతదేశం చేసే దానం నిరాడంబరంగా పనిచేస్తుంది, నిశ్మబ్దంగా ఎవరికీ తెలియకుండా!
– స్వామి వివేకానంద
పాశ్చాత్య కార్యకలాపాలు — అమెరికా కార్యకలాపాల ప్రభావం — ఇంగ్లండు కార్యకలాపాల ప్రభావం — కార్యకలాపాలు: ఐదు అంశాలు — ప్రసంగాలు — తరగతి ప్రసంగాలు — అంతర్యోగాలు — చర్చలు — ఏం చేశారు? — భారతీయ ఆధ్యాత్మికత — శ్రీరామకృష్ణులు — నిజమైన మతం — అంతంలేని కార్యకలాపాలు
పాశ్చాత్య కార్యకలాపాలు
“పాశ్చాత్యంలో నా కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. దాని ప్రతిధ్వని భారతదేశంలో వినిపిస్తుంది” అని ఒకసారి తురీయానందతో స్వామీజీ వచించారు. స్వామీజీ రెండుసార్లు పాశ్చాత్య దేశాలకు వెళ్లారు. మొదట 1893 జూలై చివరి నుంచి 1896 డిసెంబర్ దాకా దాదాపు మూడున్నర సంవత్సరాలు; రెండవసారి 1899 జూన్ నుంచి 1900 నవంబర్ వరకు, దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు; మొత్తంగా దాదాపు ఐదేళ్లు ఆయన పాశ్చాత్య దేశాలలో గడిపారు. ఒక మూల నుంచి మరో మూల కంటూ వేల మైళ్లు ఆయన అక్కడ పరుగెత్తి శ్రమించారు. ఆ కాలంలో ధ్వని వర్ధక సాధనం (mike) లాంటి సౌకర్యాలు లేవనడం గమనార్థం. ఎంత పెద్ద జన సమూహమైనప్పటికీ అందరికీ వినబడేటట్లు బిగ్గరగా ప్రసంగించాలి. ఈ విధంగా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు; ఐదేళ్లు శ్రమించి పని చేశారు.
రెండుసార్లు పాశ్చాత్య దేశాలలో ఆయన పయనించిన మొత్తం దూరం దాదాపు 1, 07, 396 కి.మీ. చేసిన ప్రసంగాలు దాదాపు 317; తరగతి ప్రసంగాలు దాదాపు 431; పాల్గొన్న చర్చావేదికలు దాదాపు 26. దిగ్భ్రాంతిగా ఉందా! ఈ వివరాలు కూడా ఇంతవరకు జరిపిన పరిశోధనల సమాచారాన్ని బట్టి మాత్రమే.* పాశ్చాత్య దేశాలలో స్వామీజీ కార్యకలాపాల గురించిన పరిశోధన ఇంకా కొనసాగుతున్నది!
ఈ అలుపులేని శ్రమ పర్యవసానం ఏమిటి?
అమెరికా కార్యకలాపాల ప్రభావం
హెలన్ హంటిగ్డన్ అనే వ్యక్తి బ్రహ్మవాదిన్ పత్రికకు ఒక లేఖ వ్రాసింది: “స్వామి వివేకానంద ప్రభావం అమెరికాలో ప్రగాఢ, శక్తిమంతమైన ఆధ్యాత్మిక జాగృతికి బీజం వేసింది. ఈ జాగృతి బయట కూడా ప్రజలలో బాగా వ్యక్తం కాసాగింది. వేదాంత గ్రంథాలు బాగా అమ్ముడు పోతున్నాయి. ఆత్మ లాంటి మాటలు పత్రికలలో కూడా విస్తారంగా వాడబడుతున్నాయి. హాక్స్లీ, స్పెన్సర్ లాంటి పేర్లలా శంకరుడు, రామానుజుడు లాంటి పేర్లు ప్రాచుర్యం సంతరించుకొన్నాయి. భారతదేశం గురించిన పుస్తకాలే కాదు, భారతదేశం గురించిన సూచనలున్న పుస్తకాలను కూడా గ్రంథాలయాలు పోటీపడి కొనుగోలు చేస్తున్నాయి. షోపనేర్ గ్రంథాలు ఎంతో వట్టిపోయినట్లు, విసుగు కలిగించేవిగా ఉంటాయో అందరికీ విదితమే. కాని వేదాంత నేపథ్యం ఉన్న ఏకైక కారణంగా ఆయన పుస్తకాలు కూడా ఇప్పుడు ప్రజలు ఇష్టపడి చదువనారంభించారు.”
ఇలా ప్రారంభమైన లేఖను ఆమె ఒకింత హాస్యం జోడించి ఈ విధంగా పూర్తి చేసింది: “ ‘స్వామీజీ మాకు సొంతం’ అంటూ భారతదేశం ఇప్పుడే చెప్పివేయడం మంచిది. హోమర్* ఒక కాలఘట్టంలో వీథుల్లో భిక్షమెత్తుకొని తిరుగాడాడు. కాని అదే హోమర్ తమ దేశంలో జన్మించినట్లు కాలాంతరంలో ఏడు దేశాలు పోటీపడ్డాయి. అదే విధంగా మా గురుదేవులను (స్వామీజీ) అందరూ సొంతం చేసుకొనే రోజు ఒకటి వస్తుంది; భారతదేశం అసదృశమైన కుమారుని మీద తన హక్కును కోల్పోవచ్చునేమో!”
ఇంగ్లండు కార్యకలాపాల ప్రభావం
ఇక ఇంగ్లండులో స్వామీజీ ప్రభావం గురించి పరికిద్దాం. సుప్రసిద్ధ జాతీయ నాయకుడూ, బ్రహ్మ సమాజ నాయకులలోని అతి ముఖ్యులలో ఒకరూ అయిన బి.సి. పాల్ 1898 లో ఇలా వచించారు : “ ‘స్వామి వివేకానంద ఇంగ్లండులో చేసిన ప్రసంగాల వలన పెద్దగా పర్యవసానాలేవీ సంభవించలేదు. ‘ఆయన ఆప్తులూ, మిత్రులూ మామూలు విషయాలను గోరంతలు కొండంతలు చేస్తున్నారు’ అంటూ కొందరు భారతదేశంలో చెప్పుకొంటున్నారు. కాని నేను ఇక్కడ ఇంగ్లండుకు వచ్చిన తరువాత ఆయన కార్యకలాపాల ప్రభావాన్ని సర్వత్రా చూస్తు న్నాను. వివేకానందను అమితంగా గౌరవించే, శ్లాఘించే అనేకులను నేను ఇంగ్లండులోని అనేక ప్రాంతాలలో కలుసుకొన్నాను. నేను వివేకానంద మత శాఖకు చెందిన వాణ్ణి కాను; నాకూ ఆయనకూ మధ్య అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అయినప్పటికీ వివేకానంద ఇక్కడ అనేకులకు కనువిప్పు కలిగించారు, హృదయాలను విశాలం గావించారని నేను చెప్పే తీరాలి. ఆయన బోధనతో ఇక్కడ అనేకులు ప్రాచీన హైందవ శాస్త్రాలలోని అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలను నమ్ముతున్నారు. అంతేగాక, ఆయన ఇంగ్లండుకూ, భారతదేశానికీ మధ్య ఒక ఉన్నతమైన సంబంధాన్ని రూపొందించడంలో కృతకృత్యులయ్యారు…
“ఒకసారి దక్షిణ లండన్ వెళ్లాను. అక్కడ ఒక వీథిలో ఒక మామూలు స్త్రీ తన కుమారునికి నన్ను చూపుతూ, ‘అదిగో చూడు స్వామి వివేకానంద’ అని చెప్పింది. నేను ధరించిన కాషాయ తలపాగా కారణంగానే ఆమె ఇలా చెప్పిందని నాకు అర్థమయింది. ఈ విధంగా జనసామాన్యం కూడా వివేకానందను ఎరిగి ఉండడం చూశాను.”
కార్యకలాపాలు: ఐదు అంశాలు
ఇంతటి ప్రభావాన్ని స్వామీజీ ఎలా చూపారు? తమ ఐదు అంశాల కార్యకలాపాల ద్వారా! స్వామీజీ కార్యకలాపాలు ముఖ్యంగా ఐదు అంశాలతో కూడుకొన్నవి. అవి ప్రసంగాలు, తరగతి ప్రసంగాలు, చర్చలు, అంతర్యోగాలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం.
ప్రసంగాలు
భారతదేశంలోని పేదల, పామరుల ఉద్ధరణకు నిధులు సేకరించడమే స్వామీజీ పాశ్చాత్యదేశాలకు వెళ్లడంలోని ముఖ్యోద్దేశం. అందుకోసం పాశ్చాత్యులను యాచించడం స్వామీజీ మార్గం కానేకాదు. మన వద్ద ఉన్నది వారికి ఇచ్చి, వారి వద్ద ఉన్నది మనం పొందడమే ఆయన మార్గం. ఇందుకు రంగంగా చేసుకొన్నవి ప్రసంగాలు. వందల సంఖ్యలలో ప్రసంగాలు ఆయన చేసినప్పటికీ మనకు లభించినవి బహు కొద్ది.
వేలాది అమెరికన్లు స్వామీజీ ప్రసంగాలు విన్నారు, కరతాళ ధ్వనులు చేశారు, తలవంచి అంగీకరించారు. ప్రసంగాలలో ఆయన అందించిన ఆధ్యాత్మిక భావనలకు, బోధించిన ఆధ్యాత్మికతకు ఒక ఉదాహరణగా విరాజిల్లిన ఆయన జీవితమూ, ఆయన అనంతమైన ఆధ్యాత్మిక శక్తి ఒక వైపు ప్రతిఘటించిన వ్యక్తుల నోళ్లు మూసివేశాయి; మరో వైపు ఉన్నత జీవితం పట్ల నిజమైన అభిలాష ఉన్నవారికి ఒక దీపస్తంభంగా భాసించాయి. “వివేకానంద, ఆయన సందేశమూ నిజమైన క్రైస్తవు లందరి హృదయాలలో చోటు చేసుకొన్నాయి” అంటూ అయోవా స్టేట్ రిజిష్టర్ అనే పత్రిక వ్యాఖానించింది.
తరగతి ప్రసంగాలు
కాని ప్రసంగాలు స్వామీజీ మానసిక అమరికకు సముచితంగా లేవు. 1894 మార్చ్ 15 వ తేదీన ఆయన హేల్ సోదరీమణులకు ఇలా వ్రాశారు: “ఈ ఉపన్యా సాలతో విసుగు చెందాను. విభిన్న స్వభావాలున్న అనేక వందల మంది మానవ మృగాలను కలసినందు వలన నాకు విసుగు జనిస్తోంది. నాకు ఏది ఇష్టమో మీకు చెబుతున్నాను. నేను వ్రాయలేను; మాట్లాడలేను; కాని ప్రగాఢంగా ఆలోచించగలను. ఆవేశం కలిగితే నిప్పుకణాలు కురిపిస్తూ మాట్లాడగలను. అదీ కొద్దిమందితోనే; ఏరికోరిన ఏ కొద్ది మందితోనే సుమా! ఇష్టమైతే నా ఆశయాలను వారు నలుదిక్కులా వెదజల్లుతారు.”*
ఇందుకోసమే స్వామీజీ తరగతి ప్రసంగాలను ప్రారంభించారు. ఇవి సామాన్యంగా ఆయన గదిలోనో, సన్నిహితులైన కొందరి ఇళ్లలోనే జరిగేవి. ప్రాచీన విధానం ప్రకారం స్వామీజీ నేల మీద కూర్చుని బోధించారు. సామాన్యంగా ఈ తరగతి ప్రసంగాలు ఉదయమూ సాయంత్రమూ జరిగేవి. తక్కువ సంఖ్యలోనే జనం వీటిలో పాల్గొన్నారు. నాలుగు యోగాలు, అనుష్ఠాన వేదాంతం లాంటి ముఖ్యమైన విషయాలు ఆయన తరగతుల్లో ప్రసంగించారు. ఆయన కార్యకలా పాలు కొనసాగించడానికి ఈ తరగతులలో నుండే కొందరు రూపొందారు. కృపానంద, అభయానంద, వాల్డో లాంటి వారు వారిలో కొందరు.
అంతర్యోగాలు
ఇంకా లోతుగా వెళ్లాలనుకొన్నారు స్వామీజీ. కేవలం పాఠాలు జీవితానికి చాలవు, కొందరి జీవితాలనైనా రూపొందించాలని ఆయన అభిలషించారు. అందుకోసం ఎంపిక చేసిన కొందరితో మకాముల్లో నివసించారు. ప్రసంగాలతో, కట్టుబాట్లతో కూడుకొన్న జీవిత విధానాన్నీ అక్కడ బోధించారు. నేటి అంతర్యోగాలకు మార్గగామిగా ఈ మకాములు విరాజిల్లాయి.
స్వామీజీ పాశ్చాత్య జీవితంలో మూడు ముఖ్యమైన అంతర్యోగాలను చూడ వచ్చు : 1. 1894 జూలై 16 నుంచి రెండు వారాలు గ్రీన్కర్లో; 2. 1895 జూన్ నుంచి ఆగస్టు దాకా సహస్రవన ద్వీపంలో; 3. 1900 మే నెలలో క్యాంప్ ఇర్వింగ్‌లో. ప్రత్యేకించిన కొద్దిమందితో అప్పుడప్పుడు ఆయన వన విహారాలు చేయడం కూడా ఈ విభాగానికి చెందుతుంది.
చర్చలు
ఇవి కాక భేటీలు, చర్చలు లాంటి వాటి ద్వారా స్వామీజీ బుద్ధిజీవులపై ప్రభావం కలిగించారు. ఆయనను అనేకులు కలుసుకొన్నారు; గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడిగారు; వాదించారు; పత్రికలలో ప్రకటించారు. స్వామీజీ కూడా వెళ్లి అనేకులను కలుసుకొన్నారు. మాక్స్ ముల్లర్, పాల్ డ్యూసన్ లాంటి మేధావులు; నికోలా టెస్లా లాంటి విజ్ఞానవేత్తలు; సారా బెర్న్‌హార్ట్ లాంటి సంగీతవేత్తలు, ఇంగర్సాల్ లాంటి అజ్ఞేయవాదులు, రాక్ఫెల్లర్ లాంటి పారిశ్రామికవేత్త లనేకులలో ఆయన ఆధ్యాత్మిక బీజాలు నాటారు.
స్వామీజీ ప్రసంగాల సంకలనాలు ఆయన కాలంలోనే పుస్తక రూపంలో వెలువడనారంభించాయి; కర్మయోగం, రాజయోగం లాంటి పుస్తకాలు బహుళ ప్రాచుర్యం గడించాయి. పుస్తక ప్రచురణా ఆయన కార్యకలాపాలలో ఒక ముఖ్యమైన అంశమే.
స్వామీజీ పాశ్చాత్య కార్యకలాపాలలో ఐదవ అంశమైన ‘వ్యక్తిగత మార్గదర్శ కత్వం’ ను తదుపరి అధ్యాయంలో విపులంగా చూద్దాం.
ఇన్ని విధాలైన కార్యకలాపాల ద్వారా స్వామీజీ పాశ్చాత్యానికి అందించింది ఏమిటి?
ఏం చేశారు?
భారతీయ చింతనాశీలుర కార్యాచరణ గురించి ఒకసారి స్వామీజీ ఇలా వ్యాఖ్యానించారు: “మన ప్రత్యేక లక్షణం శాంతం, మౌనం. వీటి వెనుక మహాద్భుత శక్తి ఉంది. కాని అది దౌర్జన్య రూపం ధరించదు. అది ఎప్పుడూ భారతీయ సంకల్పం యొక్క వశీకరణశక్తి రూపంలో నిశ్శబ్దంగా వ్యాపిస్తుంది…. కన్నులకు కనబడక, చెవులకు వినబడక, మెలమెల్లగా రాలుతూ, అత్యంత సుందరమైన లేత గులాబీలను వికసింపజేసే కోమల నీహారవర్షంలా, ప్రపంచ విజ్ఞానానికి భారతదేశ దానం నిరాడంబరంగా పని చేస్తుంది; నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా, కాని సర్వసమర్థంగా లోక విజ్ఞానాన్నంతా మార్చేసింది, అది ఎప్పుడలా చేసిందో ఎవరికీ తెలియదు.
“ ‘భారతదేశంలో గ్రంథకర్తల పేర్లను తెలుసుకోవడం చాలా కష్టం’ అని ఒకరు నాతో అన్నారు. ‘అదే భారతీయుని ఉద్దేశం’ అని నేనన్నాను. ప్రాచీన భారతీయ గ్రంథకర్తలు ఆధునికులలా తాము ప్రకటించే విషయాలలో నూటికి తొంబయి వంతున ఇతర గ్రంథాల నుంచి చౌర్యం చేస్తూ, పైగా సిగ్గులేక, ‘ఈ భావనలన్నీ నావే’ అని ఉపోద్ఘాతాలు వ్రాసుకొనేవారు కారు. ఆ మహామేధా సంపన్నులు మానవాళి హృదయాలలో అద్భుత పరివర్తనం కల్పించే గ్రంథాలు వ్రాసి, తమ పేరునైనా అందులో ఉదాహరించక తమ గ్రంథాలను మాత్రం భవిష్యత్సంతానానికి సంక్రమింపజేసి నిరాడంబరంగా మరణించడంతో తృప్తి చెందారు.
“మన తత్త్వశాస్త్రాలను రచించిన గ్రంథకర్త లెవరో ఎవరికి తెలుసు? మన పురాణాలను రచించిన వారెవరో ఎవరి కెరుక! వారందరూ వ్యాసుడని కాని, కపిలుడని కాని, ఏదో ఒక సామాన్య నామంతో వ్యవహరించారు. నిజంగా వీరు శ్రీకృష్ణుని బిడ్డలు! వారు నిజంగా గీతానుష్ఠానపరులు! ‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన!’ (కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది కాని, దాని ఫలానికి నీకు అధికారం లేదు!) అనే సూత్రాన్ని అనుసరించి వారు వర్తించారు.”*
స్వామీజీ కార్యకలాపాలు నూటికి నూరు పాళ్లు ఇదే మహోన్నత చింతనా శీలుర రీతిలో సాగింది. నేటి విద్యాధికులు అంగీకరించినా, లేకపోయినా వసుధైక సంస్కృతి (Global Culture) అంటూ చెప్పుకొనే నేటి చింతనలకు బీజం నాటిన వారు స్వామీజీ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
స్వామీజీ తమ కార్యకలాపాల ద్వారా పాశ్చాత్యానికి మూడు ముఖ్య కానుకలు అందించారు. అవి : 1. భారతీయ ఆధ్యాత్మికత. 2. శ్రీరామకృష్ణులు. 3. నిజమైన మతం.
భారతీయ ఆధ్యాత్మికత
1. భారతీయ ఆధ్యాత్మికతను స్వామీజీ పాశ్చాత్యానికి అందించారని చెబుతున్నప్పుడు, అంతకు ముందున్న చింతనాశీలుర పనిని తక్కువ చేశామను కోరాదు. ప్రత్యేకించి హెన్రీ డేవిడ్ థోరో, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, వాల్ట్ విట్మెన్ లాంటి వారి పనిని మనం ప్రస్తావించే తీరాలి. వీరందరి మీదా భారతీయ చింతనల ప్రభావం ఉంది. వారి జీవితాలలోనూ, రచనలలోనూ దానిని స్పష్టంగా చూడవచ్చు. కాని స్వామీజీ చికాగో సర్వమత మహాసభలో ప్రసంగించి, అమెరికా సమాజం మీద చూపిన ప్రభావమూ, కొనసాగిన ప్రసంగాలే అమెరికా సమాజంలో భారతీయ ఆధ్యాత్మికతను ఒక ముఖ్యాంశంగా చేశాయనడం అక్షర సత్యం.
ఆధ్యాత్మికత అన్నప్పుడు–, ఆచార కర్మలకు, సంప్రదాయాలకు అతీతమైన, దేవాలయాలు, చర్చ్‌లు, మసీదులు జోక్యం చేసుకోని నిర్మలమైన ఆధ్యాత్మికతను స్వామీజీ అందించారు. “ఆధ్యాత్మిక జీవితమనేది మీకూ మీ దేవుడికీ మధ్య ఉండే విషయం. మీ ఇద్దరి మధ్యా మూడో వ్యక్తి ఎవరూ రాకూడదు”* అంటూ 1900 లో తమ శాన్ఫ్రాన్సిస్కో ప్రసంగంలో వచించారు. అటువంటి నిర్మలమైన ఆధ్యాత్మికతే ఆయన అందించిన ఆత్మ భావన.
మనిషిలో దేహం, మనస్సు కాక ‘ఆత్మ’ అనే మూడోది ఉంది. అది దివ్యమైనది; అన్ని శక్తులనూ లోపల ఇముడ్చుకొంది. అదే యథార్థమైన మనిషి. ఈ సత్యాన్ని అనుభూతం చేసుకోవడమే నిజమైన మతం. ఈ సత్యాన్ని గ్రహించి నప్పుడు మనిషి సర్వశక్తిమంతుడవుతాడు. ఎందుకంటే యావత్తు శక్తీ ఆత్మలో ఇమిడి ఉంది కనుక.
దీనినే స్వామీజీ, “ప్రతి జీవిలోనూ దివ్యత్వం గర్భితమై ఉంది. బాహ్యాంతర ప్రకృతినంతా నిరోధించి, అంతర్గతమైన ఈ దివ్యత్వాన్ని అభివ్యక్తం చేయడమే జీవిత పరమావధి. దీని కోసం కర్మ, ఉపాసన, యోగ జ్ఞాన మార్గాల్లో ఒక్కటిగాని, కొన్నింటినిగాని, లేదా అన్నింటినీగాని అవలంబించి ముక్తులు కండి. మతానికంతా ఇదే సారాంశం. వేదాలూ, సిద్ధాంతాలు, కర్మకలాపాలూ, గ్రంథాలూ, దేవా లయాలూ, విధులూ అన్నీ అప్రధానాంశాలు”* అంటూ తమ పాతంజల యోగ సూత్ర వ్యాఖ్యాన ప్రసంగంలో చెబుతున్నారు.
ఈ భావనలు పాశ్చాత్యదేశాలకు పూర్తిగా క్రొత్త కావు. ఇంతకు క్రితమే మనం పేర్కొన్న కొందరు చింతనాశీలురు, భారతీయ భావనల ప్రభావంతో, ఇలాంటి భావనలను ఇంతకు మునుపే తమ రచనల ద్వారా పరిచయం చేశారు. కాని అది కొందరు బుద్ధిజీవుల వరకే పరిమితమైంది. కాని స్వామీజీ లాంటి దైవానుభూతి పొందిన వ్యక్తి రచించినప్పుడు అది శ్రోతల మనస్సులపై ప్రభావం చూపించి తీరుతుంది. అంతేకాక, అనేక చోట్లకు వెళ్లి ఆయన చేసిన వందల ప్రసంగాల ద్వారా జనసామాన్యమూ ఇంతటి అద్భుత భావనను వినే అవకాశం పొందింది.
అదే విధంగా బుద్ధిజీవుల మీదా స్వామీజీ గొప్ప ప్రభావం కలిగించారనడం నిర్వివాదాంశం. స్వామీజీ వైజ్ఞానిక అభిలాష వారికి యోగాభ్యాసాలలో సత్యం గురించిన ప్రగాఢమైన అవగాహనను కలిగించింది. ఆయన సమస్తాన్నీ బుద్ధి పరంగా చింతన చేశారు. నాడీమండలం, దానికి మెదడుతో ఉన్న సంబంధమూ, నాడీ చర్యలకూ మనస్సుకూ మధ్య గల సంబంధమూ లాంటి భావనలు అమెరికా లోని సుప్రసిద్ధ వైద్యులనూ, దేహధర్మశాస్త్రజ్ఞులనూ ఆకట్టుకొన్నాయి. వారు ఈ భావనలను ఆహ్వానించారు; వాటిని లోతుగా పరిశోధించాలనీ ఆశించారు. ధ్యానం ఒక అద్భుత ప్రక్రియ, వర్ణింపజాలనిదని అంతవరకు పరిగణింపబడుతూ వచ్చింది. కాని ధ్యానం మానవ ఉద్వేగాలలో మార్పులనూ, ప్రగతినీ తీసుకురాగలదని ఆయన వచించడం అనేకమంది నిపుణుల ఆమోదం పొందిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ ఉత్సుకత కారణంగానే ప్రొఫెసర్ విలియం జేమ్స్ ఆధ్యాత్మిక అనుభూతుల గురించి పరిశోధించ నారంభించాడు.
అదేవిధంగా స్వామీజీ వివరించిన సాంఖ్యతత్త్వం విద్యుత్ నిపుణుడైన నికోలా టెస్లాను అమితంగా ఆకట్టుకొంది. విశ్వసృష్టి గురించిన సాంఖ్య సిద్ధాంతం ఉత్కృష్టమైనదని అతడు అంగీకరించాడు. అంతేకాక సాంఖ్యంలో చోటుచేసుకొన్న కల్పాలు, ప్రాణం, ఆకాశం లాంటి సిద్ధాంతాలను గణితశాస్త్రపరంగా ఋజువు చేయవచ్చునని ఆతడు తెలిపాడు.
శ్రీరామకృష్ణులు
2. ఆత్మ భావన మాదిరే శ్రీరామకృష్ణులను పాశ్చాత్యానికి స్వామీజీయే పరిచయం చేశారు. మాక్స్ ముల్లర్, ‘ఒక నిజమైన మహాత్ముడు’ (A Real Mahatman) పేరిట శ్రీరామకృష్ణులను గురించి అంతకు క్రితమే రచించినప్పటికీ, స్వామీజీ ద్వారానే అనేకులు ఆయనను గురించి తెలుసుకొన్నారు. భారతదేశంలోనూ, పాశ్చాత్యంలోనూ శ్రీరామ కృష్ణుల సందేశాన్నే స్వామీజీ తీసుకువెళ్లారు; కాని విడిగా శ్రీరామకృష్ణులనే వ్యక్తిని గురించి ప్రసంగించడానికీ, వ్రాయడానికీ ఆయన సంకోచించారు. స్వామీజీ వినమ్రతే ఇందుకు కారణం; అందుకు తాము అర్హులం కామని ఆయన భావించారు.
ఒకసారి స్వామీజీ సోదర శిష్యులలో ఒకరు ఆయనను, “శ్రీరామకృష్ణులు అవతార పురుషులని మీరు పాశ్చాత్య దేశాల్లో ఎందుకు బోధించలేదు?” అని అడిగారు. అందుకు స్వామీజీ ఇలా జవాబిచ్చారు: “పాశ్చాత్యాలు తమ విజ్ఞాన శాస్త్రాన్ని గూర్చి, తత్త్వశాస్త్రాన్ని గూర్చి ఎన్నో ప్రగల్భాలు పలుకుతారు. కనుక యుక్తి ద్వారా, వైజ్ఞానిక వాదం ద్వారా, తత్త్వశాస్త్రం ద్వారా వారి వైజ్ఞానిక అహాన్ని మొదట విచ్ఛిన్నం చేయనిదే అక్కడ నువ్వు ఏ నూతన భావ నిర్మాణాన్నీ గావించ లేవు. వైజ్ఞానిక తత్త్వ విచార మార్గం ద్వారా విశ్వప్రయత్నం చేసి దిక్కుతోచని పరిస్థితిలో సత్యాన్వేషకులై నా వద్దకు వచ్చిన వారికే నేను శ్రీరామకృష్ణుల గురించి చెబుతాను. అలా కాక, అవతారవాదాన్ని వారి ముందు ప్రతిపాదిస్తే, ‘నువ్వేమీ నూతన విషయం చెప్పలేదు. దానికి మాకంతా ఏసుక్రీస్తు ఉన్నాడు’ అని చెప్పేవాళ్లే.”*
మరొకసారి తమ శిష్యుడైన శరశ్చంద్రతో స్వామీజీ ఇలా చెప్పారు: “ఆయన ఎవరు, ఎంత అత్యున్నతులో ఇప్పటికీ నేను ఆవగతం చేసుకోలేకపోతున్నాను. అందుకే ఆయనను గురించి అన్ని చోట్లా నేను ప్రసంగించలేకపోయాను. ఆయన ఎవరో ఆయనకే ఎరుక. ఆయన దేహం మాత్రమే మానవ దేహంలా ఉండేది, ఆయన చేతలు, ప్రవర్తన అంతా మానవాతీతమై విరాజిల్లాయి.”
కారణం ఏదైనప్పటికీ శ్రీరామకృష్ణుల గురించి ప్రసంగించడానికి స్వామీజీ ఇష్టపడలేదు. అతి కొద్దిమంది వద్ద మాత్రమే ఆయన శ్రీరామకృష్ణుల గురించి మాట్లాడారు, వారిలోనూ కొద్దిమంది మాత్రమే ఆయనను స్వీకరించారు. ఒకసారి మిసెస్ సారాకు వ్రాసిన లేఖలో, “శ్రీరామకృష్ణులను స్వీకరించిన అతి కొద్దిమందిలో మీరొకరు” అని ఆయన వ్రాశారు.
మొత్తానికి తమ అనర్హత కారణంగానే శ్రీరామకృష్ణులను గురించి ప్రసం గించలేదని స్వామీజీ తెలిపారు. కాని శ్రీరామకృష్ణుల సందేశం ప్రచారం చేస్తే ఆయన పేరు దానంతట అదే ప్రచారంలోకి వస్తుందని స్వామీజీ నమ్మకం. నేడు ప్రపంచమంతా ఆయన పేరు, ఆరాధన అనూహ్యరీతిలో పెంపొందడం మనం చూస్తున్నాం. ఆ విధంగానే శ్రీరామకృష్ణుల ‘మత సామరస్యం’ లాంటి భావనల గురించి ప్రసంగించారు. ఆ రీతిలో స్వామీజీ నాడు అందించిన సందేశం ద్వారా సత్యయుగమైన నూతన సమాజం రూపొందుతూండడం విస్మరించలేని సత్యం.
నిజమైన మతం
3. రూపొందుతూన్న ఆ నూతన సమాజం కోసం ఆచరణాత్మకమైన ఒక మతం గురించీ ఆయన ప్రచారం చేశారు. సంకుచిత, సైద్ధాంతిక మౌఢ్యం గల మతాలు భవిషత్తులో స్వీకరింపబడవని స్వామీజీ స్పష్టంగా గ్రహించారు. కనుక ప్రపంచం అమలు చేసుకోగల మత భావనను ఆయన పాశ్చాత్యంలో బోధించారు. “కాని ఎన్నటికైనా విశ్వజనీన మతం అనేదొకటి వెలస్తే, అది తాను ప్రకటించే భగవంతుని మాదిరే దేశకాలాతీతమై, అనంతమై విరాజిల్లాలి; కృష్ణుణ్ణి అనుసరించే వారిలో అయితేనేం, క్రీస్తును అనుసరించేవారిలో అయితేనేం, పావనాత్ముల్లో అయితేనేం, పాపాత్ముల్లో అయితే నేం, సర్వులలోను సమానంగా తదీయ భానుదీప్తి ప్రసరించాలి; అది బ్రాహ్మణ మతంగా గాని, మహమ్మదీయ మతంగా గాని ఉండక, వీటిని అన్నింటినీ తనలో ఇముడ్చుకొంటూ, ఇంకా వికాసం పొందడానికి అనంతమైన అవకాశం కలిగి ఉండాలి; అంతేకాక సంసార పంకంలో పొర్లాడే పశుప్రాయుడు మొదలుకొని అఖండ ఔదార్య ధీవైభవాలతో, తన మానవత్వాన్ని గురించి సంశయం ఉదయింప చేస్తూ, సామాజిక భయగౌరవాస్పదుడై, దాదాపుగా మానవకోటికంతకూ అతీతుడై ఉండే మహనీయుని వరకు అందరికీ తావొసగి వారలను తన అనంత ప్రేమ హస్తాలతో ఆలింగనం చేసుకోగలిగినట్టిదై ఉండాలి. అలాంటి విశ్వజనీన మతం హింసాద్వేషాలకు తన వ్యవస్థలో కించిత్తయినా చోటివ్వక, సమస్త స్త్రీ పురుషులూ భగవత్స్వరూపులే అని గుర్తిస్తూ, తన యథార్థ దివ్యనైజాన్ని గ్రహించి మానవకోటికి తోడ్పడడమే తన ప్రధాన ఆశయంగా గణిస్తుంది”* అంటూ ఆయన దానిని విపులీకరించారు కూడా.
ఇలాంటి ఒక మతం వైపుగా వసుధైక సంస్కృతి నేడు సాగిపోతూ ఉండడం మనం గ్రహించవచ్చు. దీనికి పునాది వేసిన ఘనత స్వామీజీకే చెందుతుంది.
అంతంలేని కార్యకలాపాలు
వేదకాల ఋషులు, బుద్ధుడు, గురునానక్, ఆదిశంకరుడు, రామానుజుడు, మధ్వాచార్యుడు లాంటి వారి కార్యకలాపాలకు అంతం ఉంటుందా? వారి పని నేటికీ మనుషుల మానసాల మీద ఆధిక్యం చలాయిస్తున్నది కదా! వారి గురించీ, వారి సందేశం గురించీ నేటికీ అధ్యయనం చేస్తున్నారు, పరిశోధిస్తున్నారు, నూతన భాష్యాలు ఇస్తున్నారు. ఇంకా అధ్యయనం చేస్తారు, పరిశోధిస్తారు, క్రొంగ్రొత్త వివరణలు అందిస్తారు. అవి అంతం లేనివి. స్వామీజీ కార్యకలాపాలూ అట్టివే!