నేనొక భగవదనుభూతి పొందిన వ్యక్తిని. నా వాదోపవాదాలు, చర్చలు కేవలం బాహ్యమైనవి. నిజానికి సదా నేను కొన్ని దివ్య చిహ్నాలు, అలాంటి వాటిని అభిలషిస్తాను.
– స్వామి వివేకానంద
ప్యారిస్ ప్రపంచ ప్రదర్శన — తుపాకీని కనుగొన్న వ్యక్తితో — ప్రదర్శనలో — ఎమ్మా కాల్వే — మత చరిత్రల సదస్సు — చిత్రకళలోని సూక్ష్మతలు — సన్య్నాసం వలన ఏం లభిస్తుంది? — కొనసాగిన ప్రయాణాలు — వేశ్యలకు అనుగ్రహం — భారతం ఆహ్వానిస్తున్నది — ఓడలో
ప్యారిస్ ప్రపంచ ప్రదర్శన
“ఆధునిక నాగరకతకు రాజధానీ, ఆడంబరమూ వినోదమూ సుఖభోగాదులకూ స్వర్గమూ, కళ, విజ్ఞానాలకు కేంద్రమూ – ప్యారిస్.” అక్కడ అమెరికా మొదలైన అనేక దేశాలు పాల్గొనే ప్రపంచ ప్రదర్శన 549 ఎకరాల మైదానంలో జరిగింది. విజ్ఞానం, మతం ఇత్యాది విభాగాలు ఆ ప్రదర్శనలో ఉన్నాయి. భారతీయ విజ్ఞానవేత్త అయిన సర్ జగదీశ్ చంద్ర బోస్ ఆ ప్రదర్శనలో ఒక సిద్ధాంత వ్యాసం చదువనున్నారు. చికాగోలా అక్కడ కూడా ఒక సర్వమత మహాసభ ఏర్పాటు చేయాలని మొదట కార్యనిర్వాహకులు అభిలషించారు. కాని చికాగోలా ప్రాచ్యదేశ మత భావనలు చెలరేగి, క్రైస్తవ మతానికి వెనుకంజ ఏర్పడుతుందేమోనని భీతి చెందిన రోమన్ క్యాథలిక్కులు దానిని ప్రతిఘటించారు. కనుక మతాల చరిత్ర గురించిన సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.
1900 జూలై 26 వ తేదీన న్యూయార్క్ నుంచి ఓడలో బయలుదేరిన స్వామీజీ ఆగస్టు 3 వ తేదీ శుక్రవారం నాడు ప్యారిస్ చేరుకొన్నారు. స్వామీజీ ఫ్రాన్స్‌కు రావడం ఇది నాలుగవసారి. 1895 లో ఒకసారి, 1896 లో రెండుసార్లు ఆయన వచ్చి వెళ్లారు. కాని ఆ మూడుసార్లు చేర్చి మొత్తం మీద నాలుగు మాసాల కన్నా తక్కువ రోజులే ప్యారిస్‌లో గడిపి ఉంటారు. కాని ఈసారి ఏకమొత్తంగా 83 రోజులు అక్కడ నివసించారు.
ప్రారంభంలో లెగ్గట్ దంపతులతోనూ, తక్కిన చోట్లలోనూ బస చేసిన స్వామీజీ సెప్టెంబర్ నెలలో జూల్స్ బోయీ అనే ఫ్రెంచి వ్యక్తితో బస చేశారు. మధ్యలో రెండుసార్లు ఇంగ్లండ్ వెళ్లి అక్కడ బస చేసివున్న సారాను కలుసుకొన్నారు. జూల్స్‌కు ఆంగ్లం తెలియదు. స్వామీజీకి ఏదో కాస్త ఫ్రెంచి తెలుసు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం పోరుబందరులో ఆయన కాస్త ఫ్రెంచి నేర్చుకోవడమూ, ఫ్రెంచిలోనే తమ సోదర సన్న్యాసులకు లేఖలు వ్రాయడమూ పాఠకులకు జ్ఞాపకం ఉండేవుంటుంది. పిదప చికాగోలో ఉన్నప్పుడు మళ్లీ ఆయన ఫ్రెంచి నేర్చుకొన్నారు. 1900 సెప్టెంబరు 15 వ తేదీన ఆయన క్రిస్టైన్కు, “నెమ్మదిగా మాట్లాడితే నేను ఫ్రెంచి అర్థం చేసుకోగలుగుతున్నాను” అని వ్రాశారు. ఆగస్టు 24 వ తేదీన ఆయన ‘హిందూమతం–తాత్త్వికత’ అనే అంశంపై ప్రసంగించారు. కాని అది ఆంగ్లంలోనా, ఫ్రెంచిలోనా అన్నది తెలియరావడం లేదు.
సెప్టెంబర్ 29 వ తేదీన మధ్యయుగాలలో ఎంతో ప్రాబల్యం వహించిన ఒక క్రైస్తవ మఠాన్ని స్వామీజీ సందర్శించారు. ఆయనతో సారా, మెక్లౌడ్, జూల్స్ బోయీలు వెళ్లారు. సమీపంలో నేరస్థులను ఖైదులో ఉంచే చీకటి గుహలున్నాయి. వాటిని చూసి స్వామీజీ, “ఆహా, ధ్యానానికి ఎంత అనువైన స్థలం!” అని వ్యాఖ్యానించారట!
తుపాకీని కనుగొన్న వ్యక్తితో
యాంత్రిక తుపాకీని కనుగొన్న వ్యక్తి హిరాం మ్యాగ్జిమ్; అదే సమయంలో దాని వల్ల దుఃఖీంచిన వ్యక్తి కూడా. “నేను మరేదీ కనుగొనలేదా ఏమిటి? ఈ వినాశకర పరికరాన్ని మాత్రమే నాకు ఆపాదిస్తున్నారే!” అని అతడు విచారించడం కద్దు. నిజానికి అతడు అనేక ఇతరమై నవి కూడా కనుగొన్నాడు. ఎడిసన్ విద్యుత్ బల్బు కనుగొన్న అదే సమయంలోనే ఇతడు కూడా కనుగొన్నాడు. కాని దురదృష్టవశాత్తు ఎడిసన్ ముందంజవేసి, దానిని ప్రభుత్వపరంగా నమోదు చేశాడు. 1894 లో ఇతడు ఎగిరే యంత్రాన్ని సైతం కనుగొన్నాడు. స్వామీజీ చికాగో ప్రసంగం విన్న ఇతడు ఆయన పట్ల ఆకర్షితుడయ్యాడు. ప్యారిస్‌లో ఈతణ్ణి స్వామీజీ కలుసుకొన్నారు. ఈతడు నానారకాల తుపాకీలను వికెడ్స్ అనే వ్యక్తితో కలసి ప్రదర్శించాడు. ప్యారిస్‌లోని అగ్రగణ్యులైన చిత్రకారులు, శిల్పులు, ఒకరిద్దరు మిత్రులను స్వామీజీ కలుసుకొన్నారు.
ప్రదర్శనలో
ప్రపంచ ప్రదర్శనను పలుమార్లు స్వామీజీ సందర్శించారు. విద్యుచ్ఛక్తి అద్భుతాలు, అప్పుడే కనుగొన్న ‘ఎక్స్–రే’ లాంటి పరికరాలు ప్రజలను అమితంగా ఆకట్టుకొన్నాయి. భౌతికశాస్త్ర విభాగం స్వామీజీని ఎంతగానో ఆకట్టుకొంది. ఎందుకంటే ఆ విభాగంలో డాక్టర్ బోస్ తన వైజ్ఞానిక పత్రాలను చదివాడు. ఒక భారతీయుని విజయంతో స్వామీజీ పరమానందం చెందారు. “ఆ యువ వంగ విజ్ఞాని ఒక్కడే తమ అద్భుత ప్రతిభతో పాశ్చాత్య సభికులను ఆశ్చార్యచకితులను చేశాడు. సగం చచ్చిన తన మాతృభూమికి నూతన జీవం పోశాడు. భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తల్లో జగదీశ్ చంద్రబోస్ ఈనాడు అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఒక భారతీయుడు, వంగీయుడు! మహావీరుడు. ఇతడు, విద్యావతీ గుణవతీ అయిన ఇతని భార్య – వీరిద్దరూ ఏ దేశాలకు వెళ్లినా అక్కడ భారతదేశ ఔన్నత్వాన్ని దీపింపజేస్తారు”* అంటూ స్వామీజీ వ్రాస్తున్నారు.
ప్రదర్శన బాహ్య అందాల పట్ల స్వామీజీ పెద్దగా ఆకర్షితులు కాలేదు. ఆయనకు సంబంధించినంత వరకు ఈ రోజుల్లో ధ్యానం చక్కగా కుదిరినట్లు వ్రాస్తున్నారు: “ఇదంతా జగజ్జనని ఇచ్ఛ. తాను ఏం చేయించదలచుకొందో ఆమెకు అది బాగా తెలుసు. ఆమె బయటకు ఎప్పుడూ మాట్లాడదు. ‘కేవలం మౌనం వహించి ఉంటుంది’. ఒక నెల నుంచీ నేను తీవ్ర ధ్యానం, ప్రభు నామ జపం చేస్తున్నాను.”*
ఎమ్మా కాల్వే
సుప్రసిద్ధ గాయనియైన ఎమ్మా కాల్వే కూడా స్వామీజీతో పాటు ఈ ప్రయాణంలో పాల్గొన్నది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం కాల్వే, స్వామీజీని ఫాదర్ (father) అనే సంబోధించింది. ఒక రోజు కాల్వే గాన కచ్చేరీకి స్వామీజీ మిస్టర్ లెగ్గట్తో కలసి వెళ్లి వచ్చారు. ఆనాటి కచ్చేరీ కాల్వేని ప్రపంచ ప్రసిద్ధ గాయనిగా రాణింపజేసింది. కచ్చేరీ ముగిసిన తరువాత స్వామీజీ ఆమెను ఆహార్య (make-up) మందిరంలోకి వెళ్లి అభినందించారు. మరునాడు కాల్వే స్వామీజీ బస చేసి ఉన్న లెగ్గట్ దంపతుల ఇంటికి వచ్చినప్పుడు వారి కోసం ఫ్రెంచి జాతీయ గీతాన్ని గానం చేసింది.
మత చరిత్రల సదస్సు
ప్రపంచ ప్రదర్శనలో ఒక విభాగమైన మత చరిత్రల సదస్సు సెప్టెంబర్ 3 వ తేదీ నుంచి 8 వరకు జరిగింది. స్వామీజీ సెప్టెంబర్ 7 వ తేదీన ఆ సదస్సులో రెండుసార్లు ప్రసంగించారు. మొదటి ప్రసంగంలో శివలింగం, సాలగ్రామం లాంటివి కామాన్ని సూచించే చిహ్నాలు కావని నొక్కివక్కాణించారు. రెండవ ప్రసంగంలో భారతదేశంలో మత భావనల పరిణామాలను గురించి మాట్లాడారు. ఆయన ఫ్రెంచిలో ప్రసంగిస్తా రని ప్రకటించినప్పటికీ నిజానికి ఏ భాషలో ప్రసంగించారో తెలియరావడం లేదు.
చిత్రకళలోని సూక్ష్మతలు
ఆ కాలంలో సుప్రసిద్ధుడైన ఒక ఫ్రెంచి చిత్రకారుడు స్వామీజీ వేదాంత భావనల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆతడు తను రచించిన చిత్తరువులు చోటు చేసుకొన్న నాటకానికి స్వామీజీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు. ఫ్రెంచి తెలిసినందువలన స్వామీజీ నాటకాన్ని సునిశితంగా తిలకించారు. నాటకం మధ్యలో తెర మీద కనిపించిన ఒక చిత్తరువులో పొరపాటు దొర్లడం స్వామీజీ గమనించారు. అది సాంకేతికమైన పొరపాటు, ఆ పొరపాటు దిద్దబడివుంటే నాటక ప్రదర్శన ఇంకా బాగా రాణించేదని స్వామీజీ అభిప్రాయపడ్డారు.
నాటకం ముగిసింది. నాటకం గురించిన అభిప్రాయం తెలుసుకోవడానికి ముఖ్య అతిథియైన స్వామీజీ వద్దకు ఆ చిత్రకారుడూ, నాటక రంగ నిర్వాహకుడూ వచ్చారు.
అప్పుడు స్వామీజీ తనకు నాటకం బాగా నచ్చిందని వారితో చెప్పారు. దానితోపాటు తాము గమనించిన సాంకేతికమైన పొరపాటును కూడా వారికి ఎత్తి చూపారు. అది వినగానే ఆ సుప్రసిద్ధ ఫ్రెంచి చిత్రకారుడు విస్తుబోయాడు. ఎందుకంటే, చిత్రకళలో నిష్ణాతుడైన వ్యక్తి మాత్రమే ఆ పొరపాటును గమనించ గలడు కనుక. ఆ చిత్రకారుడు స్వామీజీ ఎత్తి చూపిన పొరపాటును, ఆయన తెలిపిన సబబైన దిద్దుబాట్లను ఆనందంతో స్వీకరించాడు.
సన్య్నాసం వలన ఏం లభిస్తుంది?
ఫ్రాన్సులో స్వామీజీ పట్ల అమితంగా ఆకర్షితులైన వ్యక్తులలో ఒకరు రిచ్లీ యువరాజు (Duke of Richelieu). అప్పుడతడు యువకుడు. స్వామీజీ అక్కణ్ణుంచి బయలుదేరడానికి తయారయినప్పుడు ఒక రోజు ఆ యువరాజుతో, “మీ రెందుకు సర్వసంగ పరిత్యాగం చేయకూడదు? నాతో కలసి మీ జీవితాన్ని కొనసాగించకూడదు?” అని అడిగారు. అందుకు ఆ యువరాజు, “స్వామీజీ! సర్వసంగ పరిత్యాగం వలన నాకు ఏం లభిస్తుంది?” అని అడిగాడు. “అందువలన మీరు మరణాన్ని నిస్సంకో చంగా అభిలషించగలుగుతారు” అన్నారు స్వామీజీ. స్వామీజీ కొనసాగించారు: “దీనికి అర్థం ఏమిటంటే, మరణం గురించి భీతి చెందని స్థితిని నేను మీకు ఇవ్వగలను. మరణం సమీపించినప్పుడు, దానిని చూసి మీరు నిరాక్షేపణీయంగా నవ్వుకోగలరు.” కాని ఎందుకో అప్పుడు ఆ యువరాజు స్వామీజీ సలహాను పాటించలేదు; అతడు లౌకిక జీవితాన్నే అభిలషించాడు.*
కొనసాగిన ప్రయాణాలు
అక్టోబర్ 24 వ తేదీన మిత్రులతో స్వామీజీ ప్యారిస్‌కు వీడ్కోలు చెప్పారు. ఆయనతో మెక్లౌడ్, కాల్వే, జూల్స్ బోయీ, లాయసన్ దంపతులు కూడా బయలుదేరారు. వియన్నా, కాన్స్టాంట్నోపెల్ గుండా వారు పయనించారు. కాన్స్టాంట్నోపెల్లో స్వామీజీ బహిరంగ ప్రసంగాలకు అనుమతి లభించలేదు. కాని రెండు చోట్ల తరగతి ప్రసంగాలు నిర్వహించారు.
తరువాత వారు గ్రీసు వెళ్లారు. అక్కడున్న అనేక దేవాలయాలకు వారిని తీసుకొని వెళ్లిన స్వామీజీ వాటి చారిత్రక ప్రాధాన్యాన్ని వారికి వివరించి చెప్పారు. “ఆ దేవాలయాల మహత్త్వాన్నీ, అంతరార్థాన్నీ విపులీకరించారు. అక్కడున్న బలి పీఠాల గుండా మమ్మల్ని తోడ్కొని వెళ్లి అక్కడ జరిగిన ఆచార కర్మల లాంటి వాటిని గురించి విశదీకరించారు” అంటూ వ్రాస్తున్నది కాల్వే.
తదుపరి వారు ఈజిప్టు చేరుకొన్నారు. ఈజిప్టు రాజధానియైన కైరోలో జరుగుతున్న ప్రదర్శనను స్వామీజీ సందర్శింప అభిలషించారు. దానితో పాటు పిరమిడ్లు, స్ఫింక్స్* లాంటి అద్భుతాలను తిలకించారు. కైరోలో జరిగిన ఒక సంఘటనను కాల్వే ఇలా తెలిపింది:
వేశ్యలకు అనుగ్రహం
ఒక రోజు కైరోలో ఆసక్తికరంగా మాట్లాడుకొంటూ వెళుతూ దారి తప్పారు. తిరిగి తిరిగి చివరికి వేశ్యలు నివసిస్తున్న ఒక వీథిలోకి వచ్చారు. శిథిలమైన ఒక ఇంట్లో కూర్చునివున్న కొందరు స్త్రీలు స్వామీజీని ఆహ్వానించారు. స్వామీజీతో వెళ్లినవారు ఆ చోటును చప్పున దాటి పోదామని వేగంగా నడవమని ఆయనతో చెప్పారు. కాని స్వామీజీ వారిని పట్టించుకోకుండా ఆ స్త్రీల వద్దకు వెళ్లారు. తరువాత కరుణాపూరిత స్వరంలో వారితో, “దయనీయ జీవులు! పాపం! తమ దివ్యత్వాన్ని అందంలో అభివ్యక్తం చేశారు. ఇప్పుడు వీరి స్థితిని చూడండి!” అని చెప్పారు. వారి స్థితిని చూసి స్వామీజీ హృదయం ద్రవించిపోయింది. కళ్లు చెమ్మగిల్లాయి. కాసేపటి కల్లా ఆయన విలపించసాగారు. క్షణంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ స్త్రీలు ఒక దివ్యపురుషుని ఎదుట తాము నిలబడి ఉన్నట్లు గ్రహించారు. వారిలో ఒకామె స్వామీజీ ముందు మోకరిల్లి, ఆయన అంగీ కొసను ముద్దిడి, స్పానిష్ భాషలో, “ఈయన దివ్యపురుషుడు, ఈయన దివ్యపురుషుడు” అంది కన్నీటి ధారతో. ఒక దివ్యపురుషుని ఎదుట నిలబడడానికి తాను అనర్హురాలిన భావించిన మరొక స్త్రీ చేతుల్లో ముఖాన్ని దాచుకొని విలపించసాగింది. వారి నందరినీ దీవించిన తరువాతనే స్వామీజీ అక్కణ్ణుంచి కదిలారు.
భారతం ఆహ్వానిస్తున్నది
ప్యారిస్ నుంచి బయలుదేరినప్పుడు, ఈజిప్టు మొదలైన ప్రదేశాలు సందర్శించి మళ్లీ ప్యారిస్‌కు తిరిగి వచ్చి కొన్ని ప్రసంగాలు చేయాలని స్వామీజీ అను కొన్నారు. కాని భగవంతుని సంకల్పమూ, దానిని మాత్రమే ఆధారం చేసుకొని జీవించే భగవంతుని బిడ్డల కార్యకలా పాలూ, వైఖరీ ఎవరి కెరుక? “మానసికంగా నేనొక భగవదను భూతి పొందిన (mystic) వ్యక్తిని. నా వాదోపవాదాలు, చర్చలు కేవలం బాహ్యమై నవి. నిజానికి సదా నేను కొన్ని దివ్య చిహ్నొల లాంటి వాటిని అభిలషిస్తాను” అంటూ స్వయంగా స్వామీజీ తమను గురించి చెప్పడం కద్దు. ఆయన భగవదా దేశం మేరకే ప్రతిదీ చేశారు.
కైరోలో ఉన్నప్పుడు హఠాత్తుగా భారతదేశం తిరిగి వెళ్లబోతున్నట్లు స్వామీజీ తెలిపారు. అక్కడ ఆయన అస్వస్థులయ్యారు, ఒకసారి గుండెపోటు కూడా వచ్చింది. ఆయన హఠాత్తుగా తిరిగి వెళ్లిపోవాలనుకోవడానికి ఇది కారణమయి ఉండవచ్చు. అంతేగాక, ఆయన జీవితంలో పెనవేసుకుపోయిన వ్యక్తీ, హిమాలయా లలోని మాయావతి వద్ద అద్వైతాశ్రమంలో జీవిస్తున్న వ్యక్తీ, అయిన సేవియర్ అక్టోబర్ 28 వ తేదీన మృతిచెందారు. ఈ వార్త స్వామీజీకి అందలేదు. సేవియర్ అస్వస్థులై ఉన్నట్లు స్వామీజీకి తెలుసు. ఏదో ఆంతరిక ప్రేరణ కారణంగా ఆయన హఠాత్తుగా సేవియర్‌ను చూడాలని తపించారు. అది కూడా స్వామీజీని సత్వర పరచి ఉండవచ్చు.
కాని స్వామీజీ హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం తక్కిన వారిని దిగ్భ్రమలో ముంచెత్తింది. వారి నుంచి విడిపోవడానికి స్వామీజీ ఎంతో బాధపడ్డారు. అయి నప్పటికీ వెళ్లడానికే నిశ్చయించుకొన్నారు. కాల్వే ఆయన వద్దకు వెళ్లింది.
కాల్వే : స్వామీజీ! ఎందుకు బాధపడుతున్నారు?
స్వామీజీ : నా సోదర సన్న్యాసులతో జీవించాలని అనిపిస్తోంది. కనుక నేను భారతదేశానికి తిరిగి వెళ్లాలి.
కాల్వే : ఇంతేనా! మీరు వెళ్లాలి, అంతే కదా! మీ ప్రయాణ ఖర్చులు నేనే ఇస్తాను. కాని, స్వామీజీ! మీ రెందుకు మమ్మల్ని వదలిపెట్టి వెళ్లాలను కొంటున్నారు?
స్వామీజీ కళ్లు ఆర్ద్రమయ్యాయి. లోక ప్రసిద్ధి గాంచిన గాయనిగా విరాజిల్లిన కాల్వే విశాల హృదయం స్వామీజీని ద్రవింపజేసింది. గద్గద స్వరంలో ఆయన ఇలా అన్నారు:
“నేను భారతదేశానికి వెళ్లాలి. అక్కడ మరణం నా కోసం కాచుకొని ఉంది. నేను నా సోదరులతో జీవించాలి.”
కాల్వే : కాని, స్వామీజీ! మీరు మరణించరు. మాకు మీరు కావాలి.*
స్వామీజీ : జూలై 4 వ తేదీ నా చరమ దినమై ఉంటుంది–.
ఆ తరువాత సమీపంలోని కొన్ని ప్రదేశాలు సందర్శించడానికి మెక్లౌడ్ ప్రభృతులు వెళ్లారు. కాని స్వామీజీ వెళ్లలేదు, దానిలో ఎలాంటి ఆసక్తీ ఆయన కనబరచలేదు. ఆయన నిర్ణయాన్ని మార్చలేమని కచ్చితంగా తెలిసినప్పుడు, ఆయనకు ప్రయాణ సన్నాహాలు చేశారు. “సగం దుఃఖంతోను, సగం భగవంతుని సంకల్పాన్ని ఆధారం చేసుకొన్న శరణాగతి స్థితిలోను ఓడ మీద నిలబడి మా వైపు చేతులు ఊపి, ఆశీస్సులు తెలుపుతూ మా నుండి ఆయన వీడ్కోలు తీసుకొన్నారు” అంటూ ఒకరు వ్రాస్తున్నారు. స్వామీజీ బయలుదేరిన రోజు 1900 నవంబర్ 26 వ తేదీ.
ఓడలో
ఓడలో స్వామీజీ వేషభాషాదుల పట్ల ఆకర్షితులైన పలువురు ఆయన వద్దకు వచ్చి ఆయనతో అనేక విషయాల గురించి ముచ్చటించారు. వారిలో ఒకరైన కాల్కిన్స్ స్వామీజీ చికాగో ప్రసంగాలు విన్న వ్యక్తి. ఆంగ్లేయు డైన డ్రేక్ బ్రాక్‌మెన్ అనే వ్యక్తి స్వామీజీతో పలుమార్లు వాదించాడు; ఆయన కుశాగ్ర బుద్ధిని ఎంతగానో శ్లాఘించాడు. అయినప్పటికీ భారతదేశానికి ఎవరూ ఆధ్యాత్మికతను నేర్పనక్కర్లేదు, అందుకోసం ఫాదరీలను పంపనక్కర్లేదని స్వామీజీ వచించడం డ్రేక్ జీర్ణించుకోలేకపోయాడు.
ఈ ప్రయాణం సాధారణమైనది కాదు; అంతర్జాతీయ రంగానికి ఆయన వీడ్కోలు పలికిన ప్రయాణం. అంతర్జాతీయ రంగంలో ఆయన కార్యకలాపాలను ఇప్పుడు చూద్దాం.