నా వస్తువులను మూటగట్టుకొని, మహా విముక్తి కలిగించే వారి కోసం వేచివున్నాను. పరమేశ్వరా, ఓ పరమేశ్వరా!, నా పడవను ఆవలి తీరానికి తీసుకువెళ్లు!
– స్వామి వివేకానంద
దుందుడుకు బాలునిలా — గాలిమర (windmill) మరమ్మతు — దేహ ధ్యాసా? — ‘సమస్తం నాలోనే’ — అద్భుతమైన ప్రశాంత స్థితి — హృదయాన్ని ఎదుర్కొని లాగ… — ‘సింహ హృదయాన్ని ధ్యానిద్దాం’ — తుపాకీ కాల్చడం — క్యాంప్ ఇర్వింగ్ జీవన సరళి — స్వామీజీ భయపడ్డారు! — ప్రపంచం : అది ఏమిటి? — శాన్ఫ్రాన్సిస్కోలో — మానవ సంబంధాల ఎడబాటు….. — న్యూయార్క్‌లో — ప్రసంగాలు — ‘స్వామీజీ సంకల్పం!’ — దేహ కారాగారంలో — రామకృష్ణ మిషన్ చిహ్నం — పరమేశ్వరుని భూతగణాలు — అమెరికాకు వీడ్కోలు
దుందుడుకు బాలునిలా
శాన్ఫ్రాన్సిస్కో నుంచి 1900 ఏప్రెల్ 11 వ తేదీన స్వామీజీ అలమెడా వెళ్లారు. ఓక్లాండ్కు సమీపంలో నెలకొనివున్న అందమైన పట్టణం ఇది. అక్కడ ‘సత్య గృహం’ అనే సంస్థ భవంతిలో స్వామీజీ బస చేశారు. దాని వ్యవస్థాపకులైన జార్జ్ రూర్బాగ్ దంపతులు, మిస్ లూసీలు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఆ ఇల్లు పువ్వుల చెట్లతో, అందమైన తోటతో ఆవరింపబడి ఉంది.
సత్యగృహంలో ఎవరూ పొగ త్రాగకూడదనే నియమం ఉంది. ఒక రోజు స్వామీజీని అక్కడ విందుకు ఆహ్వానించారు, ఆహ్వానించిన వ్యక్తి సత్య గృహ సభ్యుడు. ఆతడు విందు మధ్యలో ఏదో కారణంగా లోపలికి వెళ్లాడు. నియమం తెలియని స్వామీజీ ఆ సమయంలో హుక్కా తీసుకొని పొగ త్రాగనారంభించారు. అందరూ విస్మయంతో చూడసాగారు. స్వామీజీని ఆహ్వానించిన సభ్యుడు అప్పుడు లోపల నుంచి వచ్చాడు. స్వామీజీ పొగ త్రాగుతూండడం చూసి కాస్త కోపంతో, “స్వామీజీ! మనిషి పొగత్రాగాలని భగవంతుడు అనుకొని ఉంటే, పొగ వెలుపలికి పంపడానికి ఆయన మనిషి తలలో పొగ గొట్టం అమర్చి సృష్టించి ఉండేవాడు కదా!” అన్నాడు. స్వామీజీ కించిత్తు కూడా చలించకుండా, “కాని పొగత్రాగే గొట్టాన్ని కనుగొనే తెలివి మనకు ఇచ్చి ఉన్నాడే!” అన్నారు నవ్వుతూ; అందరూ నవ్వారు. స్వామీజీ పొగ త్రాగడానికి వారు అనుమతి ఇచ్చారని ప్రత్యేకంగా చెప్ప నక్కరలేదు. సత్యగృహ నియమావళి తెలిసివుంటే స్వామీజీ పొగ త్రాగేవారు కారు. లేదా పొగత్రాగడానికి ముందే అనుమతి తీసుకొనేవారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఒక రోజు ఉదయపు ఉపాహారానికి ఉంచిన జున్ను కనిపించలేదు. ఉపాహారానికి కూర్చున్న తరువాతే అది తెలియవచ్చింది. అందరూ వెదకారు. ఎక్కడా కనిపించలేదు. పాల మనిషి దానిని తెచ్చి ఇవ్వగా చూసినట్లు ఒకరిద్దరు చెప్పారు. ఈ ఉద్రిక్తతనంతా చూస్తూ స్వామీజీ ప్రశాంతంగా కూర్చుండిపోయారు. ఎంత వెదకినా కనిపించకపోవడంతో అందరూ అలసిపోయి కూర్చున్నప్పుడు, “ఓ అదా! నేనే దానిని తిన్నట్టుంది” అన్నారు ప్రశాంతంగా స్వామీజీ. పలువురు స్వామీజీ దుందుడుకుతనాన్ని చూసి ఆనందించినప్పటికీ, కొందరు ముఖం చిట్లించారు.
గాలిమర (windmill) మరమ్మతు
సత్యగృహం అనేది అమెరికాలోని క్రైస్తవ మత శాఖలలో ఒకటి. ఏసుక్రీస్తు రోగుల వ్యాధులను నయం చేశారు. కనుక మనమూ మనఃశక్తిని ఉపయోగించి వ్యాధులను నయం చేయవచ్చునన్నది వారి భావన. తమ సిద్ధాంత నమ్మకంతో వారు తమ మనఃశక్తితో వ్యక్తుల వ్యాధులనే కాకుండా, పాడైన యంత్రాలనూ మరమ్మతు చేయవచ్చునని నమ్మసాగారు. క్రింది సంఘటనను స్వయంగా స్వామీజీ తెలిపారు:
ఒకసారి వర్షభావం కారణంగా సత్యగృహం తోటలోని మొక్కలు వాడిపోసా గాయి. ఆ సమయంలో గాలిమర పాడయింది. అందువలన బావి నుండి నీరు తోడడం సాధ్యం కాలేదు. సరళ మనస్కుడైన తోటమాలి సభ్యులను పిలిచి, “ఈ గాలిమరను మరమ్మతు చేద్దాం. ‘అంతా దివ్యమానసంలో ఉంది. దివ్యమానసంలో ఎలాంటి లోటుపాట్లూ లేవు. ఈ గాలిమర నిజానికి బాగానే ఉంది. నీరు తోడడానికి అది సిద్ధంగానే ఉంది’ అని హృదయపూర్వకంగా అందరమూ మనస్సులో అనుకొందాం” అన్నాడు. అందరూ మౌనంగా లేచి నిలబడి యథా తథంగా ఆతడు చెప్పినట్లు చేశారు. వారూ నిలబడ్డారు, గాలిమర కూడా అట్లే నిలబడింది. చివరికి తోటమాలి వెళ్లి ఒక మెకానిక్‌ను తీసుకువచ్చి మరమ్మతు చేయించవలసి వచ్చింది.
దేహ ధ్యాసా?
వ్యాధి నివారణను సత్యగృహం వారు గొప్ప విషయంగా పరిగణించడం స్వామీజీ ఆమోదించలేదు. శ్రీరామకృష్ణుల అవసాన సమయంలో ఆయనతో ఒకరు, మనఃశక్తితో వ్యాధిని నయంచేసుకోమని విన్నవించారు. అందుకు ఆయన, “ఏం అల్పబుద్ధి! జగజ్జననికి అర్పించిన మనస్సును రక్తమాంసాదులతో కూడివున్న ఈ గూటిపై నిలపడమా?” అని అడిగారు. ఒకరోజు ఈ ఉదంతం తెలిపిన స్వామీజీ, “ఏసుక్రీస్తు కూడా తన శక్తితో వ్యాధులను నయం చేయకపోయి ఉంటే ఆయన ఇంకా మహోన్నతుడై విరాజిల్లి ఉండేవాడు” అని చెప్పారు. ఇది కూడా సత్యగృహ సభ్యులలో గొణుగుడు కలిగించింది. కొందరు పులిసిపోయిన చింతనా ధోరణి నుండి స్వామీజీ తమను విడివడజేశారని ఆనందించారు.
సత్యగృహ నాయకులలో ఒకరైన మిసెస్ రూర్బాగ్ ఒకరోజు స్వామీజీతో ప్రత్యక్షంగా ఇలా చెప్పింది: “వ్యాధులు నయం చేయమని కోరుతూ జనం మా వద్దకు వస్తున్నారు. నేను కూడా అనేకుల రుగ్మతలను నయం చేశాను. కాని స్వామీజీ! అదెలా జరుగుతున్నదో నాకు తెలియడం లేదు. నాకు అర్థంకాని ఒక శక్తిని ఉపయోగిస్తున్నానని అనిపిస్తోంది. ఈ ఆలోచన నాలో భయాన్ని కలిగిస్తోంది. ఈ రకంగా రుగ్మతలను నయం చేయడం వదలిపెట్టాలనుకొంటున్నాను.” ఇది విని స్వామీజీ ప్రశాంతంగా నవ్వారు. తరువాత, “మంచిది, మంచిది” అన్నారు.
ఆ రోజుల్లో సత్యగృహం అనేకులు అనుసరించే ఒక మతశాఖగా ఉండేది. స్వామీజీ రాకతో దాని భావనలలో అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి. వారి సిద్ధాంతాలను అతిక్రమించి ఆయన అక్కడ పొగ త్రాగారు, మాంసాహారం భుజించారు. వీటిని ఆయన ఉద్దేశపూర్వకంగానే చేశారనిపిస్తున్నది. ఎందుకంటే కారణం లేకుండా ఏదీ ఆయన చేయరు కనుక. ఈ నియమాలను ఉల్లంఘించడం ద్వారా వారికి ఆయన బోధించారు. అంతెందుకు ఆయన తినడం, నడవడం, జీవన విధానం సత్యాన్వేషులకు ఒక పాఠంగా అమరాయి. ఈ నియమాలను ఉల్లంఘించడం ద్వారా నిజమైన ఆధ్యాత్మికత ఏదో వారికి చూపించారు. ఆకు కూర మాత్రం తింటే అది ఆధ్యాత్మికత కాబోదని స్వామీజీ వారికి అవగతం చేశారు.
‘సమస్తం నాలోనే’
ఇంత క్రితమే చూసినట్లు స్వామీజీ మనస్సు అత్యున్నత ఆధ్యాత్మిక స్థితుల్లో విరాజిల్లిన రోజులు ఇవి. సదా ఆయన ఒక రకమైన పారవశ్య స్థితిలో ఉంటూ వచ్చారు. ఆయన మాటలు, ఏదో అత్యున్నత స్థితి నుంచి మాట్లాడినట్లు తోచాయి. ఈ రోజుల్లో వ్రాసిన లేఖలు ఆయన అద్భుత ఉద్వేగ స్థితులకు అద్దంపడతాయి. మామూలు సంభాషణ కూడా ఆయన నెలకొనివున్న అత్యున్నత స్థితులను మనకు ఎరుకపరుస్తాయి.
ఒక రోజు ఆలెన్ స్వామీజీని చూడడానికి వచ్చాడు. ఆయనను చూడగానే, “ఆహా, స్వామీజీ! మీరు అలమెడాలో ఉన్నారు” అన్నాడతడు. వెంటనే స్వామీజీ, “లేదు, ఆలెన్! నేను అలమెడాలో లేను, అలమెడా నాలో ఉంది” అన్నారు.
అద్భుతమైన ప్రశాంత స్థితి
ఇక్కణ్ణుంచే స్వామీజీ ఆ అద్భుతమైన, పాఠకులు కాసేపయినా ఆయన ఉద్వేగాలలో లయించిపోయే లేఖను మెక్లౌడ్కు వ్రాశారు. ఆ లేఖలోని కొన్ని విభాగాలు:
“కర్మ చేయడం ఎల్లప్పుడూ కష్టమే; నా విధ్యుక్త కర్మలు శాశ్వతంగా ఆగిపోవాలనీ, నా మనస్సు పూర్తిగా జగజ్జననిలో లీనం కావాలనీ, ‘జో’ నా కోసం ప్రార్థించు. ఆమె పనులు, ఆమెకే ఎరుక….
“నాకు అఖండమైన మనశ్శాంతి లభించింది. శారీరక విశ్రాంతి కన్నా ఆత్మ శాంతిని ఎక్కువగా చవిచూస్తున్నాను. జీవిత పోరాటాల్లో జయం కలిగింది, అపజయమూ వాటిల్లింది. నా వస్తువులన్నీ మూటగట్టుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను. శివా! ఓ శివా! నన్ను ఆవలి తీరం చేర్చు. ‘జో’, నేను దక్షిణేశ్వరంలో వటవృక్షం క్రింద కూర్చుని, అద్భుతమైన రామకృష్ణ వచనామృతాన్ని సమ్మోహితు డనై ఆస్వాదించే బాలుణ్ణి మాత్రమే. ఇది నా సహజ నైజం. కర్మలు, కార్య కలాపాలు, జగద్ధితం ఇత్యాదులన్నీ నా మీద ఆవరింపబడినవే. మళ్లీ నేను ఇప్పుడు ఆయన కంఠస్వరాన్ని వింటున్నాను. నా ఆత్మను పులకింపజేసే ఆ మధురవాణినే ఆలకిస్తున్నాను. బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ప్రేమ అంతరిస్తోంది. కర్మ రసహీనమవుతోంది. జీవిత వ్యామోహం తొలగిపోయింది. గురుదేవుల కంఠధ్వని మాత్రమే పిలుస్తోంది. ‘ఓ ప్రభూ! నేను వస్తున్నాను, ఇదిగో వస్తున్నాను.’ ‘మృతులు, మృతులను పూడుస్తారు గాక! నన్ను అనుగమించు’. ‘వస్తున్నాను. నా ప్రియతమ ప్రభూ! ఇదిగో వస్తున్నాను.’
“అవును వస్తున్నాను. నిర్వాణం నా ఎదుట దీపిస్తోంది. అనంతం, విస్తరం అనే ఆ అనంత శాంతి సాగరమే నన్ను అనేకసార్లు ఆవరించినట్లు అనుభూతి చెందుతున్నాను. నేను జన్మించినందుకు ఆనందిస్తున్నాను. కష్టాలు అనుభవించి నందుకు ఆనందిస్తున్నాను. శాంతిలో (సాగరంలో) ప్రవేశించినందుకు ఆనంది స్తున్నాను. ఒక్క ప్రాణిని సైతం బద్ధునిగా వదలివేయను. బంధాలను నా మీద వేసుకోను. నాకు విదేహముక్తి కలిగినా, జీవన్ముక్తి లభించినా సరే. ఈ శరీరంలోని పాత మనిషి శాశ్వతంగా వెళ్లిపోయాడు. మళ్లీ రాడు. మార్గదర్శకుడు, గురువు, నాయకుడు, ఆచార్యుడు వెళ్లిపోయాడు. ఆ బాలుడు, ఆ విద్యార్థి, సేవకుడు మాత్రమే నిలిచివున్నాడు….
“కాలప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న నిమిషాలే నా జీవితంలో ఆనందమయ సమయాలు. నేను మళ్లీ కొట్టుకుపోతున్నాను – ప్రకాశిస్తున్న వెచ్చని సూర్యుడు ముందున్నాడు. చుట్టూ పచ్చని వృక్షకోట్లు ఉన్నాయి. ఆ వెచ్చదనంలో సమస్తం నిశ్చలంగాను, శాంతిమయంగాను ఉంది. వెచ్చని నదీజలాల్లో నిశ్చింతగా కొట్టుకుపోతున్నాను. నా చేతులతోను, వ్రేళ్లతోను నీటిని చిందించి, ఈ మహాద్భుత ప్రశాంతతను, ఇదంతా మహామాయ అని తోపింపజేసే ఈ అఖండ ప్రశాంతతను ఛేదించడానికి నేను సాహసించను.
“నా పని వెనుక ఆశ ఉంది, నా ప్రేమ వెనుక వ్యక్తిత్వం ఉంది. నా పవిత్రత వెనుక భయం ఉంది. నా నేతృత్వం వెనుక అధికార దాహముంది! ఇప్పుడు అవన్నీ అదృశ్యమవుతున్నాయి. నేను కొట్టుకుపోతున్నాను, వస్తున్నాను జననీ! నేను వస్తున్నాను! నీ వెచ్చని ఒడిలో లోకాతీతమైన లోకంలో నీ ఇచ్ఛ వచ్చిన ఏ చోటికి నువ్వు నన్ను గొనిపోయినా అక్కడికి వస్తాను. నేను ఇక కర్తనుగాను, సాక్షిని మాత్రమే!
“ఆహా! ఇది ఎంత శాంతంగా ఉంది. నా భావాలు ఎంతో దూరం నుండి, నా హృదయాంతరాళంలో నుండి వస్తూనట్లున్నాయి. అవి అస్పష్టమైన దూరం నుండి వచ్చే గుసగుసలుగా ఉన్నాయి. మధురాతిమధురమైన ప్రశాంతత అన్నింటి మీదా విస్తృతించినట్లుంది. నిద్రలోకి జారడానికి ముందు కొన్ని నిమిషాలు, భయం, ప్రేమ, రాగద్వేషాలు లేక విషయాలు నీడలా తోచినప్పుడు అనుభూత మయ్యే ప్రశాంతత అది. ప్రతిమలు, చిత్తరువులు, చుట్టూ పరివేష్టించి ఉండగా, ఏకాంతంలో మనిషికి అనుభవమయ్యే ప్రశాంతత అది. వస్తున్నాను, ఓ ప్రభూ, వస్తున్నాను.
“జగత్తు ఉంది. అది అందంగానూ లేదు, అందవికారంగానూ లేదు. ఏ విధమైన రాగద్వేషాలనూ కల్పించనట్టి బాహ్యస్పర్శగా ఉంది. ఓ, ‘జో’ ! ఏమి ఆ ఆనందం! సమస్తం యోగ్యంగాను, మనోజ్ఞంగాను ఉంది. నేను విషయాలూ, సుఖదుఃఖాది ద్వంద్వాలూ కోల్పోతున్నాను. నాకు శరీర స్పృహే తొలగిపోతోంది. ఓం తత్సత్!”*
హృదయాన్ని ఎదుర్కొని లాగ…
అలమెడా నుంచి చికాగో వెళ్లాలనుకొన్నారు స్వామీజీ. అయినప్పటికీ ఆస్పినాల్ దంపతుల ఆహ్వానం మన్నించి సమీపంలోని క్యాప్ ఇర్వింగ్ అనే చోటికి వెళ్లాలనుకొన్నారు. హాన్స్బరో, దారిలో శాసలిత్తో అనే చోటు దాకా వెళ్లి అక్కడ స్వామీజీకి వీడ్కోలు చెప్పి, లాస్ ఏంజెల్స్ వెళ్లి తన కుమార్తెను చూడగోరింది. కాని తమతో రావాలని స్వామీజీ పట్టుబట్టడంతో ఆమె ఆయనతో వెళ్లింది.
అలమెడా నుంచి ముందుగా ఒక రైలులో వెళ్లి తరువాత ఒక నావలో శాన్ఫ్రాన్సిస్కో సరస్సును దాటి, మళ్లీ నావలో శాసలిత్తో దాకా వెళ్లి, అక్కణ్ణుంచి మళ్లీ రైలులో పయనించి క్యాంప్ చేరుకోవాలి.
హాన్స్బరో మరో ఒకరిద్దరితో కలసి సత్యగృహం నుంచి స్వామీజీ బయలు దేరారు. బయలుదేరడంలో జాప్యం కారణంగా మొదటి రైలును అందుకోలేక పోయారు. కాస్త దూరం వెళితే మరో రైలు అందుతుందని విని అందరూ అక్కడకు వెళ్లారు. వారు వెళుతున్నప్పుడు ఆ రైలు అప్పుడే బయలుదేరింది. కాస్త నిలుపమని రైలు నడిపే వ్యక్తితో అరిచి చెప్పింది హాన్స్బరో. “మీరు పరుగెత్తివస్తే రైలును అందుకోవచ్చు” అంటూ ఆతడు అరిచి జవాబిచ్చాడు. వారికీ రైలుకూ మధ్య కొన్ని అడుగుల దూరమే ఉంది, పరుగెత్తితే అందుకోవచ్చు. హాన్స్బరో, స్వామీజీ వంక చూసింది. నడుస్తున్న స్వామీజీ కదలకుండా నిలబడిపోయి, “నేను పరుగెత్తను” అన్నారు తెగేసి. తరువాతి రైలు సాయంత్రమే. కనుక అందరూ సత్యగృహానికి వెనుదిరిగారు.
తనకు క్యాంప్ ఇర్వింగ్ వెళ్లడానికి ఇష్టం లేదని స్వామీజీతో వాదన చేయడమే జాప్యానికి కారణమని హాన్స్బరోకు తెలుసు. అదే సమయంలో స్వామీజీ పరుగెత్తి ఉంటే రైలు అందివుండేదనేదీ నిజమే. రెండింటినీ ప్రస్తావించడానికి ఇష్టపడని హాన్స్బరో, “మనం వెళ్లిన కారు ఇంజన్ బాగాలేదు. ఆ జాప్యం వల్లనే రైలు అందుకోలేకపోయాం” అంది. వెంటనే స్వామీజీ, హాన్స్బరో వైపు తిరిగి, “ఇది అదీ ఏదీ కారణం కాదు. నీ హృదయం లాస్ ఏంజెల్స్‌లో ఉన్నందుననే మనం వెళ్లలేకపోయాం. హృదయాన్ని ఎదుర్కొని లాగడానికి ఈ ప్రపంచంలో ఏ ఇంజనూ లేదు. ఒక పని చేస్తున్నప్పుడు హృదయపూర్వకంగా చేయి, నీకు ఏదీ ఆటంకం కలిగించలేదు” అన్నారు. “నా జీవితంలో మరచిపోలేని ఉపదేశం అది. నేటికీ అది నా మనస్సులో తాజాగా ఉంది” అంటూ కాలాంతరంలో హాన్స్బరో చెప్పడం కద్దు.
ఈ గందరగోళం సమసిపోయేలోగా హాన్స్బరో పెట్టె కనిపించకపోవడం తెలియవచ్చింది. అంతకు మునుపే వెళ్లిన ఆస్పినాల్ దంపతులు దానిని తీసుకు వెళ్లారు. రైలు అందుకోలేకపోయిన ఆ వ్యవధిలో హాన్స్బరో మనస్సులో, ‘ఇదీ మంచికే. నేనిక లాస్ ఏంజెల్స్‌కు వెళ్లవచ్చు’ అనే ఆలోచన తలెత్తింది. కాని ఇప్పుడు పెట్టె క్యాంప్ ఇర్వింగ్‌లో ఉందని తెలిసినప్పుడు స్వామీజీ, “ఆశ్చర్యం! క్యాంప్‌కు వెళ్లకూడదని ఎంతగానో ప్రయత్నిస్తున్నావు. కాని జగజ్జనని నిన్ను అక్కడికి లాగుతోంది” అన్నారు. ఎలాగో సత్యగృహానికి తిరిగి వచ్చిన వారు ఒక వారం తరువాత క్యాంప్ ఇర్వింగ్ వెళ్లారు.
వారు రెండు పెద్ద బైనాక్యులర్స్ తీసుకువెళ్లారు. రూర్బాగ్ వాటిని మోసుకు వచ్చాడు. అందుకు ఆతడు ఎంతో శ్రమపడడం స్వామీజీ చూసి, “కేవలం బంగాళా దుంపలు, ఆకుకూరలు తింటే ఇలాగే తంటాలుపడాలి” అన్నారు.* శాసలిత్తో నుంచి అందమైన ప్రకృతి దృశ్యాలు నిండిన ప్రాంతం గుండా రైలు వెళ్లింది. దృశ్యాలను చూసి ఆనందించడం కోసమే స్వామీజీ కిటికీ ప్రక్కన కూర్చున్నారు. విశ్రాంతిగా కూర్చుని, “నేను నేనై ఉండడాన్ని గ్రహించ నారంభించాను” అన్నారు.
‘సింహ హృదయాన్ని ధ్యానిద్దాం’
క్యాప్ ఇర్వింగ్ ఒక అందమైన ప్రదేశం. పొట్టి చెట్లు, పొదలమయమైన ప్రాంతాలు, అందమైన నీటి వాగులతో ఆ ప్రదేశం వన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూన్నది. అక్కడ వారు గుడారాలలో నివసించారు. మొదటి రోజు రాత్రి అక్కడ ఒక వృక్షం క్రింద స్వామీజీ మంట వేశారు. అందరూ దాని చుట్టూ కూర్చున్నారు. అతి ప్రశాంత మైన రాత్రి అది. స్వామీజీ పాడారు, శుక మహర్షి, వ్యాసుని గురించిన కథలు చెప్పారు. ఆ తరువాత ప్రగాఢమైన ప్రశాంత స్థితిలో మాట్లాడారు:
“భారతదేశ అరణ్యాలలో జీవించే యోగులుగా మమ్మల్ని భావించుకోండి. మీ నగరాలను, తక్కిన సమస్తాన్నీ మరచిపోండి, భగవంతుణ్ణి మాత్రమే తలచు కోండి, ఆయనను మాత్రమే చూడండి. ఇదిగో ప్రవహిస్తున్న ఈ వాగు, ఇది గంగ. ఇదిగో ఈ మంట, ఇదే పావనమైన అగ్ని.”
ఆ తరువాత, జపధ్యానాలు ఎలా చేయాలో స్వామీజీ నేర్పించారు. పిదప మృదుస్వరంలో, “హర, హర, వ్యోం, వ్యోం, హర, హర, వ్యోం, వ్యోం” అని ఉచ్చరించారు. “ఆ నాదం మా మనస్సులను మేలుకొల్పింది. మా ఆలోచనల నుండి జగత్తు అదృశ్యమయింది. ఇంత దాకా ఎరుగని బాహ్యసీమల్లో ఆత్మ రెక్కలు విప్పి ఎగిరింది.” అని వ్రాస్తున్నారు అక్కడ స్వామీజీతో సహజీవనం చేసిన ఒక వ్యక్తి.
ఆ తరువాత అందరినీ ధ్యానం చేయమన్న స్వామీజీ, “మీరు ఇష్టపడే దేని మీదనైనా ధ్యానించవచ్చు. నేను సింహ హృదయం మీద ధ్యానించబోతున్నాను. అది శక్తినిస్తుంది” అన్నారు.
కొన్ని సమయాలలో ‘దృఢత్వం’, ‘నిర్భీతి’ లాంటి భావనలను వ్యక్తం చేసి, వాటి మీద ధ్యానం చేయమని చెప్పేవారు.
“అదొక చిరస్మరణీయమైన రేయి. అరణ్యంలో నెలకొన్న ప్రగాఢ ప్రశాంతత, ప్రజ్జ్వరిల్లే అగ్ని ప్రకాశం, అన్నింటికీ మించి ఆ పరిస్థితికి సజీవ చైతన్యం కల్పిస్తూ గంభీరంగా ఆసీనులై ఉన్న స్వామీజీ తేజస్సు వర్ణనాతీతం!” అంటూ మరొకరు వ్రాస్తున్నారు.
తుపాకీ కాల్చడం
ఒక రోజు స్వామీజీ అందమైన నీటివాగు తీరం గుండా నడచి వెళు తున్నారు. దారిలో ఒక వంతెన వచ్చింది. అక్కడ కొందరు యువకులు తుపాకీతో గురి చూసి కాల్చడం అభ్యసిస్తున్నారు. వాగులో తేలుతున్న గ్రుడ్ల పెంకులు వారి లక్ష్యం. వాటిని ఒక దారంతో కూర్చి ఒక రాయితో కట్టి ఉంచారు. నీటి ప్రవాహానికి అనుగుణంగా అటూ ఇటూ కదలుతున్న గ్రుడ్ల పెంకులను గురి చూసి పేల్చాలి. కాని ఎవరూ అలా పేల్చలేకపోయారు. స్వామీజీ కాసేపు వారి ప్రయత్నాలను పరికించారు, వారి పరాజయం చూసి నవ్వారు. ఇది చూసి ఆ యువకులలో ఒకరు ఆయన వద్దకు వచ్చి, “మీరు అనుకొన్నట్లు ఇది అంత సాధారణమైన కార్యం కాదు. ప్రయత్నించి చూడండి, మీకే అర్థమవుతుంది” అన్నాడు. స్వామీజీ తుపాకీ చేతబుచ్చుకొని వరుసగా దాదాపు డజను పెంకులను పేల్చివేశారు. యువకులు తమ విస్మయాన్ని అదుపులో ఉంచుకోలేకపోయారు. “మీరు తుపాకీ కాల్చడంలో నిష్ణాతులై ఉండాలి, అంతే కదా!” అని ఆ యువకులు అడిగారు. అందుకు స్వామీజీ చిన్నగా నవ్వి, “మిత్రులారా! నా జీవితంలో మొట్ట మొదటిసారిగా ఈ రోజే తుపాకీ పట్టుకొన్నాను!” అన్నారు. ఆ యువకులకు నమ్మ శక్యం కాలేదు. అప్పుడు స్వామీజీ ఇలా వివరించారు: “అంతా మానసిక ఏకాగ్రతలోనే ఉంది. మనం ఏకాగ్రతతో చేసే ప్రతి పనీ విజయవంతమవుతుంది.”*
క్యాంప్ ఇర్వింగ్ జీవన సరళి
క్యాంప్ ఇర్వింగ్‌లో జీవన సరళి దాదాపు క్యాంప్ పెర్సీ, సహస్రవన ద్వీపం జీవన రీతిలోనే సాగింది. సూర్యోదయమయ్యే ఐదు గంటలకు స్వామీజీ నిద్ర మేల్కొనేవారు. మృదు స్వరంలో, “ఏకం సత్ విప్రా బహుధా వదన్తి”* లాంటి శ్లోకాలను ఉచ్చరించేవారు. గుడారం ప్రక్కన నిలబడేవారికి ఆ వేదనాదం మృదుమధురంగా వినిపిస్తుంది. సమీపంలో ప్రవహించే అందమైన నీటివాగులో తక్కిన వారు స్నానం చేస్తారు. చలి ఎక్కువ కావడం వలన స్వామీజీ వాగులో స్నానం చేయరు. ఉదయం 8 గంటలకు ఉపాహారం తినేవారు. పది గంటలకు సామూహికంగా ధ్యానం చేసేవారు. ఆరుబయట చెట్టు క్రింద వారు ధ్యానం చేసేవారు.
కొన్ని సమయాలలో స్వయంగా స్వామీజీ వండేవారు. మసాలా ఆయనే నూరేవారు. ఆయన సున్నితంగా నూరేవారు. వంటకాలలో యథాప్రకారం కారం మోతాదు మించి ఉంటుంది. ఆ కారం తినడానికి తక్కిన వారు అవస్థ పడేవారు. స్వామీజీ ప్రక్కన విడిగా మిరియాలు ఉంచుకొనేవారు. ఒక మిరియం చేతిలో తీసుకొని పైకి విసిరి ఉల్లాసభరితుడైన యువకునిలా దానిని నోట్లో పడేలా చేసి తినేవారు. ఒకసారి ఆన్స్ల్కి ఒక మిరియం ఇచ్చి, “దీనిని తిను, నీకు మంచి చేస్తుంది” అన్నారు. “స్వామీజీ ఇచ్చే పక్షంలో విషం మ్రింగడానికి సైతం మేం సంసిద్ధులం. కనుక ఆయన ఇచ్చింది అట్లే తిన్నాను. అంతే. కారం భరించలేక నేను పడ్డ అవస్థ చూసి ఆయన బిగ్గరగా నవ్వారు. అంతేకాదు, తరువాత నన్ను చూసినప్పుడల్లా, ‘ఏమిటి, ఇంకా పొయ్యి మండుతున్నదా?’ ప్రశ్నిస్తూ నవ్వేవారు” అంటూ ఆన్స్ల్ వ్యాఖ్యానించేవాడు.
ఒక రోజు ఆన్సెల్, మిస్ బెల్ కోసం పటికబెల్లం పానకం తయారు చేస్తున్నాడు. పటికబెల్లం ముక్కలను కరిగించి దానిని బాగా కదుపుతున్నాడు. స్వామీజీ ప్రక్కనే నిలబడి చూస్తూ, “బాగా కాగబెట్టు. చక్కెరను కాగబెట్టే మేరకు తెల్లనవుతుంది. ఆ మేరకు దానిలోని మలినం తొలగిపోతుంది” అన్నారు.
స్వామీజీ ఆవాలు చేర్చి ఒక పానకం తయారుచేసేవారు. సాయంత్ర సమయాలలో చపాతీ చేసేవారు. ఇందుకోసం నీటివాగు తీరాన ఆయన ఒక బొగ్గు పొయ్యిని రగిలించేవారు. ఆ నీటిని తీసుకొని పిండిని మర్దించి, తట్టి, పొయ్యిలో కాల్చి ఇచ్చేవారు. నీరు అవసరమైతే ఒక గరిటెతో తిన్నగా వాగులో నుంచి తీసుకొనేవారు.
స్వామీజీ బొగ్గు పొయ్యిని రూపొందించడంలో ఒక నైపుణ్యం ప్రదర్శించే వారు. ఒక రోజు రూర్బాగ్ పొయ్యి తయారుచేశాడు, ఎక్కువగా బొగ్గులు వేయడంతో అది మరీ పెద్దదయిపోయింది. స్వామీజీ వచ్చి చూసి, “బాబోయ్! ఇది చపాతీలు కాల్చుకొనే పొయ్యిలా లేదు. దీనిలోని వంట చెరకు, బొగ్గులతో ఒక చితిని తయారుచేయవచ్చు” అంటూ, దానిని ఆర్పి, స్వయంగా ఆయనే ఒక చిన్న పొయ్యిని సిద్ధం చేశారు.
స్త్రీలే దాదాపుగా వంట చేశారు. కొన్ని సమయాలలో స్వామీజీ వారి వంటను నేర్చుకొనేవారు. “మాకు సంబంధించినంత వరకు ఆయన ఒక బాలునిలా ప్రవర్తించారు. ఆయన ఆరోగ్యాన్ని మే మందరమూ శ్రద్ధగా చూసు కొన్నాం” అంటున్నది మిసెస్ రూర్బాగ్.
ఒకసారి స్వామీజీ అస్వస్థులైనారు. ఆయన ఒక బాలునిలా, “నేను ఒక ఈగను మ్రింగి ఉంటానని అనిపిస్తోంది. అందుకే అస్వస్థుడనైనాను” అన్నారు. అందరూ కడుపుబ్బ నవ్వారు.
సాయంత్రాలలో అందరూ పచార్లు చేయడం కద్దు. సామాన్యంగా స్వామీజీ ప్రశాంతంగా గుడారంలోనే ఉండిపోయేవారు. మిసెస్ రూర్బాగ్ ఇలా వ్రాస్తున్నది: “మేం వెళ్లే దారిలో పనిచేసుకొంటున్న కట్టెలుకొట్టేవారు పలువురు తారసపడే వారు. వారు అంత మంచివారు కారు. ఆ దారి గుండా నేను నడిచి వెళ్లేదాన్ని. దుకాణానికి వెళ్లే దారిలో పాములు కోకొల్లలు. కాని ఏదీ నన్ను భయానికి గురి చేయలేదు. దివ్యపురుషుని సాన్నిధ్యంలో నేను ఉన్నాననే యోచన సదా నాలో ఉంటూవచ్చింది. అది నాకు శక్తినిచ్చింది.”
స్వామీజీ భయపడ్డారు!
ఈ గుడారాలలో ఏం జరుగుతోంది, వాటిలో ఎవరు నివసిస్తున్నారనే కుతూహలం ఆ ప్రాంతంలోని వారికి జనించడం సహజమే. కొన్ని సమయాలలో వారిలో కొందరు లోపలికి తొంగిచూడడం కద్దు. ఒక రోజు ఒక స్త్రీ ఇలాగే లోపలికి వచ్చింది. స్వామీజీ ఆమెను తేరిపార జూశారు. ఆమెలో ఏం చూశారో! ఒక దయ్యాన్ని చూసి వణకిపోతున్నట్లు దిగ్భ్రాంతి చెందారు.* ఒక రోజు ధ్యానం కోసం చెట్ల వైపు అందరూ వెళుతున్నారు. దారిలో ఒక దువ్వెన క్రింద పడివుండడం చూసి స్వామీజీ దానిని చేతుల్లోకి తీసుకొని, “ఇది మీలో ఎవరిదైనానా?” అని అడిగారు. వారు “కాదు” అనగానే ఏదో నిప్పును తాకినట్లు దానిని విసిరివేశారు.
ఒక రోజు ధ్యానానంతరం మిస్ బెల్ స్వామీజీతో ఇలా అంది:
బెల్ : స్వామీజీ! ఈ ప్రపంచం ఒక ప్రాచీన పాఠశాల అని నాకు అనిపిస్తోంది. ఇక్కడ మన మందరం పాఠాలు చదువుకోవడానికి వచ్చాం.
స్వామీజీ : అలా అని ఎవరు చెప్పారు? నాకు అలా తోచడం లేదు. నాకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచం ఒక సర్కస్ గుడారం. మన మందరమూ విదూషకులం; నృత్యం చేస్తున్నాం, పడుతున్నాం.
బెల్ : ఎందుకు పడుతున్నాం?
స్వామీజీ : ఎందుకంటే పడడానికి ఇష్టపడుతున్నాం కనుక. పడడంలో అలసట కలిగినప్పుడు నిష్క్రమిస్తాం.
ప్రపంచం : అది ఏమిటి?
స్వామీజీ శాన్ఫ్రాన్సిస్కో ప్రసంగాలలో ఇంతటి మనఃస్థితిని చూడగలం. “ఈ ప్రపంచమే ఒక మహా క్రీడ”, “క్రీడ! సర్వశక్తిమంతుడైన భగవంతుడు క్రీడిస్తున్నాడు”, “అంతా క్రీడే, మీరు క్రీడిస్తున్నారు, లోకాలతో ఆడుకొంటున్నారు.. అంతా వినోదమే. మరే ఉద్దేశమూ లేదు. ఉరి తీయబడేవాడిని నేనే. దుష్టులందరూ నేనే, నరకాలలో శిక్షలు పొందుతున్నదీ నేనే, అదీ వినోదమే” అంటూ ఆయన ‘గమ్యం’* అనే తమ ప్రసంగంలో వచించారు.
శాన్ఫ్రాన్సిస్కోలో
క్యాంప్ ఇర్వింగ్‌లో రెండు వారాలు గడిపి అక్కణ్ణుంచి స్వామీజీ మళ్లీ శాన్ఫ్రాన్సిస్కో వచ్చారు. ఇక్కడ హాన్స్బరో సెలవు పుచ్చుకొంది. స్వామీజీ, డాక్టర్ లోగన్ అనే వ్యక్తి ఇంట్లో బస చేశారు. స్వామీజీ పట్ల అమిత భక్తిశ్రద్ధలు గల వాడూ, సజ్జనుడూ అయిన లోగన్ ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కాని ఆతడి భార్య, సోదరి, ఇతర కుటుంబ సభ్యులు స్వామీజీ పట్ల, ఆయన ప్రసంగాలు వినడం పట్ల ఆసక్తి చూపలేదు. ఆయన అక్కడ బస చేయడమే వారికి సుతరామూ నచ్చలేదు. అలాంటపరిస్థితిలోనూ స్వామీజీ అక్కడ బస చేయడం లోగన్ భక్తిప్రపత్తులను దృష్టిలో ఉంచుకొనే! “స్వామీజీ మా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తరువాత ఇల్లు బోసి పోయింది. ఏదో దేవతలందరూ మమ్మల్ని వదలిపెట్టినట్లు అనిపించింది… నాకు ఆయన ఏసుక్రీస్తు” అంటూ కాలాంతరంలో లోగన్ వ్రాస్తున్నాడు.
స్వామీజీ అక్కడ ఉన్నప్పుడు శాన్ఫ్రాన్సిస్కో వేదాంత సొసైటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆయన భగవద్గీత గురించి ప్రసంగించారు. ఇంకా ఒకటి రెండు ప్రసంగాలు చేశారు. అవి కూడా భగవద్గీత, శ్రీకృష్ణుని గురించినవే. మే 30 వ తేదీన స్వామీజీ అక్కణ్ణుంచి సెలవు పుచ్చుకొన్నారు. దాంతో స్వామీజీ క్యాలిఫోర్నియా యాత్ర సమాప్తమయింది.
మానవ సంబంధాల ఎడబాటు…..
జూన్ 2 వ తేదీన చికాగో వచ్చిన స్వామీజీ నాలుగైదు రోజులు అక్కడ బస చేశారు. తమ జీవితంలో శాశ్వత స్థానం పొందిన హేల్ కుటుంబాన్ని వెళ్లి చూశారు. చికాగో నుంచి బయలుదేరే రోజు ఉదయం స్వామీజీ గదిలోకి వచ్చింది మేరీ హేల్. స్వామీజీ మూర్తీ భవించిన కలతగా కూర్చుని ఉన్నారు. ఆయన పడక వేసింది వేసినట్లుంది. కారణం అడిగినప్పుడు, “రాత్రంతా నిద్రించలేదు” అన్నారు. తరువాత మృదుస్వరంలో, “ఆహా, మానవ సంబంధాల ఎడబాటు ఎంత యాతనగా ఉంటుంది!” అన్నారు. హేల్ కుటుంబాన్ని విడిచి వెళ్లడానికి ఆయనకు ఎంతో కష్టం వేసింది. “నా హృదయపూర్వకమైన ప్రేమను అమ్మకు అందించు… మేరీ! కర్ణకఠోరమైన నా దుర్భర జీవితంలో నువ్వు మధుర మంజుల స్వరంగా మిగిలావు”* అంటూ ఒకసారి మేరీకి ఆయన లేఖ వ్రాశారు.
న్యూయార్క్‌లో
చికాగో నుంచి జూన్ 7 వ తేదీన న్యూయార్క్ చేరుకొన్నారు. వేదాంత సొసైటీలో బస చేశారు. అక్కడ అప్పటికే ఉన్న తురీయానంద, అభేదానందలు స్వామీజీని చూసి ఆనందభరితులయ్యారు. నివేదిత కూడా అక్కడే ఉంది. పనులు అంత తృప్తికరంగా సాగడం లేదు. “ఇక్కడికి వచ్చాక సంఘం దాదాపు ముక్కలై పోయింది. వారందరూ పోట్లాడుకొన్నారు. దానిని తీర్చవలసి వచ్చింది”* అంటూ స్వామీజీ వ్రాస్తున్నారు. ఆయన మిత్రులలో పలువురు సంఘంతో సంబంధం ఉంచుకొన్నారు, మరికొందరు పూర్తిగా తెగతెంపులు చేసుకొన్నారు. పాత మిత్రులను చూడడం స్వామీజీకి ఎంతో ఆనందాన్నిచ్చింది. స్వామీజీ రాక పత్రికలలో వెలువడింది. స్వామీజీ కొన్ని ప్రసంగాలు చేశారు.
ప్రసంగాలు
“నేను ఊరకనే మాట్లాడుతున్నానని భావిస్తున్నారా? శ్రోతలకు, వారు గ్రహించగల విషయాలు చెబుతున్నాను. అలా చేస్తున్నానని వారూ గ్రహిస్తున్నారు” అంటూ తమ ప్రసంగం గురించి స్వామీజీ ఒకసారి వ్యాఖ్యానించారు. “ధ్యాన సమయంలో ఎలా ఆధ్యాత్మిక శక్తి జాగృతి చెందుతుందో అట్లే ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు కూడా ఆధ్యాత్మిక శక్తి జాగృతి చెందడం నేను గ్రహించాను” అంటూ ఒకసారి అభేదానంద చెప్పారు.
ఒకసారి స్వామీజీ ప్రసంగానంతరం అభేదానంద ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించగోరారు. “దీని తరువాత ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమమా? నా ప్రసంగం కల్పించిన ప్రభావం చెడగొట్ట దలచావా?” అని ప్రశ్నించారు స్వామీజీ. దీనిని ప్రస్తావించి అభేదానంద, “ఆహా, ఈ లోకం కోసం స్వామీజీలో శ్రీరామ కృష్ణులు ఎంతటి మహోన్నత శక్తిని వదలి వెళ్లారు! లోక చింతనా ధోరణినే ఆయన మార్చివేశారు!” అన్నారు.
స్వామీజీ ప్రశ్నోత్తరాల కార్యక్రమాలలో కొందరు చక్కని ప్రశ్నలు అడిగేవారు. కొందరి ప్రశ్నలు అర్థంలేని దీర్ఘ ప్రసంగంలా ఉండేవి. స్వామీజీ నుంచి వినడం కన్నా, శ్రోతలు ప్రశ్నలు అడగడంలోనే ఎక్కువ శ్రద్ధగా ఉంటారు. కాని అలాంటి వారు ప్రశ్నలు అడిగే దాకా సహనం వహించిన స్వామీజీ ఆ తరువాత ఒకటి రెండు మాటల్లోనే వారిని కుక్కినపేనులా చేసేవారు.
‘స్వామీజీ సంకల్పం!’
ఈ రోజుల్లో క్యాలిఫోర్నియాలో దాదాపు 160 ఎకరాల తమ సొంత స్థలాన్ని మిస్ మిన్నీ బుక్ అనే వ్యక్తి వేదాంత సొసైటీకి సమర్పించింది. ఆ స్థలంలో ఒక ఆశ్రమం స్థాపించి దాని బాధ్యతను తురీయానంద వహించాలని స్వామీజీ అభిలషించారు. “నువ్వు దాని బాధ్యత వహించాలన్నది జగజ్జనని సంకల్పం” అన్నారు స్వామీజీ. తురీయానంద చిన్నగా నవ్వి, “జగజ్జనని సంకల్పం? ఎందుకు, మీ సంకల్పమని చెబితేనే చాలు! ఈ విషయంలో జగజ్జనని తన సంకల్పాన్ని మీకు వ్యక్తం చేసిందా? మీరు అడిగారా?” అని అడిగారు. అందుకు స్వామీజీ, “అవును, ఆమె చెప్పింది, నేను విన్నాను. నీ నరాలు అమిత సూక్ష్మమయితే నుమ్వా జగజ్జనని వచనాలు ప్రత్యక్షంగా ఆలకించవచ్చు” అన్నారు. దాదాపు ఒక ఏడాది క్రితం తురీయానంద పాశ్చాత్య దేశాలకు వెళ్లడానికి నిరాకరించినప్పుడు, కేవలం తమ ప్రేమతో ఆయనను వశపరచుకొన్నట్లుగా ఈసారి కూడా ఆయనను సమ్మతింప జేశారు స్వామీజీ.
బయలుదేరే ముందు స్వామీజీతో, తురీయానంద “నాకు ఏదైనా ఉపదేశం చేయండి” అని అడిగారు. స్వామీజీ ఇలా అన్నారు: “పో, క్యాలిఫోర్నియాకు వెళ్లి ఒక ఆశ్రమం స్థాపించు. ఆధ్యాత్మిక పతాకాన్ని అక్కడ ఎగురవేయి. ఈ క్షణం నుంచి భారతదేశం గురించిన జ్ఞాపకాలను సైతం నీ ఆలోచనల నుండి తుడిపి వేయి! అన్నింటికన్నా ముఖ్యంగా, జీవితాన్ని గడుపు, తక్కినది జగజ్జనని చూసు కొంటుంది.” ఇదే ‘శాంతి ఆశ్రమం’ గా కాలాంతరంలో రూపొందింది.
దేహ కారాగారంలో
జూలై 3 వ తేదీన న్యూయార్క్ నుంచి స్వామీజీ డెట్రాయిట్ వెళ్లారు. క్రిస్టైన్ను, ఆమె తల్లిని కలుసుకోవడమే ఆయన ప్రధానోద్దేశం. అక్కడ క్రిస్టైన్ ఇంట్లో బస చేశారు. పేదవారైనప్పటికీ వారు తమ శక్తికి మించి స్వామీజీని చక్కగా చూసుకొన్నారు. అక్కడ దాదాపుగా స్వామీజీ విశ్రాంతిలోనే రోజులు గడిపారు. సన్నిహిత మిత్రుల కోసం ఒకటి రెండు సమావేశాల్లో పాల్గొన్నారు. స్వామీజీకి అక్కడ పరిచయమైన మరో వ్యక్తి మేరీ ఫంకే. స్వామీజీ బాగా చిక్కిపోయినట్లు, అలౌకిక మృదుత్వం ఆయనలో విరాజిల్లు తూన్నట్లు ఆమె వ్యాఖ్యానించింది; “ఆ మహా ఆత్మ ఇంకా దేహ కారాగారంలో ఎక్కువ రోజులు ఉండబోదని అనిపించింది. అదే నిజమని బాగా తెలిసినప్పటికీ ఏదో అవివేకమైన నమ్మకాలతో మమ్మల్ని మభ్యపెట్టుకొని కళ్లుమూసుకొన్నాం” అని వ్రాస్తున్నదామె. ఇక్కడ స్వామీజీ మూడు రోజులు బస చేశారు. ఇక్కడ కూడా క్రిస్టైన్ ప్రభృతులపై తమ ప్రేమవృష్టిని కురిపించారు. వారి కోసం వంట చేశారు, వడ్డించారు. తరువాత మళ్లీ న్యూయార్క్ తిరిగి వెళ్లారు.
రామకృష్ణ మిషన్ చిహ్నం
న్యూయార్క్‌లో స్వామీజీ వేదాంత సంఘం భవనంలోనే బస చేశారు. సంఘం కోసం ఒక విన్నపం తయారుచేసి స్వామీజీ దాన్లో ఒక చిహ్నం ఉండాలని అభిలషించారు. అప్పుడే వచ్చిన ఉత్తరం కవరు చింపి దాని లోపలి భాగంలో ఆయన ఒక చిహ్నం గీశారు. తరువాత దానిని అక్కడున్న హెన్రీ వాన్ హాగన్ అనే వ్యక్తికి ఇచ్చి, దానిని తగిన కొలతలలో చిత్రించమన్నారు. హాగన్ రేఖాచిత్రాలు గీయడంలోనూ, ముద్రణ కళలోనూ నిష్ణాతుడు; అతడు స్వామీజీ బ్రహ్మచారి శిష్యులలో ఒకడు. ఆతడే ఆ చిహ్నాన్ని గీసి, పూర్తిచేశాడు. అదే నేటి రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ల చిహ్నంగా విరాజిల్లుతోంది.
“తరంగ జలం కర్మనూ, పద్మం భక్తినీ, ఉదయిస్తున్న సూర్యుడు జ్ఞానాన్నీ, చుట్టుకొని ఉండే పాము యోగాన్నీ జాగృతి చెందిన కుండలినీ శక్తినీ, హంస పరమాత్మనూ సూచిస్తున్నాయి. కాబట్టి ఈ చిత్రంలోని భావన ఏమిటంటే కర్మ, జ్ఞాన, భక్తి, యోగం – వీటి కలయిక వల్ల పరమాత్మ దర్శనం లభిస్తుంది అనేదే”* అంటూ స్వామీజీ ఆ చిహ్నాన్ని విపులీకరించారు.
పరమేశ్వరుని భూతగణాలు
ఒక రోజు స్వామీజీ పచార్లు చేసే నిమిత్తం బయటకు వెళ్లారు. వీథిలో మలిన దేహుడై నిలబడి ఉన్న ఒక పేద బాలుడు ఎలాగో స్వామీజీతో అతుక్కు పోయాడు. స్వామీజీ కూడా అమిత అనురాగంతో అతణ్ణి కూడా తోడ్కొని వేదాంత సంఘానికి వెళ్లారు. వస్తూన్న దారిలో అతని లాంటి ఒకరిద్దరు బాలురు జత చేరడంతో, ఒక పేద బాలుర బృందంతో స్వామీజీ సంఘంలోకి వెళ్లారు. అక్కడ నిలబడి ఉన్న క్రిస్టైన్, ‘ఇలాంటి వారిని ఈయన ఎందుకు ఆకర్షిస్తున్నారు?’ అని అనుకొంది. ఆమె అనుకోవడమే ఆలస్యం, ఠక్కున వచ్చింది స్వామీజీ జవాబు: “ఇదిగో చూడు, వీరు పరమేశ్వరుని భూతగణాలు.”
మరొకసారి వీథి వెంట వెళుతున్న ఇద్దరు పేదవారిని చూసి, “ఆహా, వీరు ఓడిపోయారు; జీవితం వీరిని గెలిచింది” అన్నారు గద్గద స్వరంతో.
అమెరికాకు వీడ్కోలు
క్యాలిఫోర్నియాలో పనులు పూర్తికాగానే అక్కణ్ణుంచి తిన్నగా భారతదేశానికి తిరిగి వెళ్లిపోదామనుకొన్నారు స్వామీజీ. కాని లెగ్గట్ దంపతులు, మెక్లౌడ్, సారా, నివేదిత ప్రభృతులు అప్పటికే ప్యారిస్ వెళ్లి ఉన్నారు. అనారోగ్యంగా ఉన్న మిసెస్ లెగ్గట్కు అక్కడే చికిత్స జరిగింది. వారు మరీ బలవంతం చేయగా స్వామీజీ ప్యారిస్ వెళ్లడానికి సమ్మ తించారు.
ఈ విధంగా స్వామీజీ అమెరికా రోజులు పరిసమాప్తమయ్యాయి. 1900 జూలై 26 వ తేదీన నూయార్క్ నుంచి స్వామీజీ బయలుదేరారు!