నువ్వు ఒక వ్యక్తిని సజ్జనుణ్ణి చేయగోరితే ఆతడికి ఉపదేశాలు చేయ వద్దు, ఆతణ్ణి సంస్కరింప ప్రయత్నించకు. ఆతడితో సహజీవనంచేయి. నీలో మంచి అనే దివ్య అగ్నికణాలు ఉండే పక్షంలో అవి ఆతణ్ణి అంటుకొని సజ్జనుణ్ణి చేస్తాయి.
– స్వామి వివేకానంద
మీడ్ సోదరీమణులు — ప్లాజెట్ ఇంట్లో — పిల్లవానిలా… — స్వామీజీ గురించి నాటకం — వేదాంత పర్యవసానమైన నృత్యం — ఒక మరణ వదంతి — కొన్ని వ్యథలు — జ్యోతిర్మయ మానవుడు — ‘పొడిచి చూడు తెలుస్తుంది!’ — సందిగ్ధ పరిస్థితి — మిసెస్ లెగ్గట్ ప్రయత్నమూ, పరాజయమూ — తల్లి జ్ఞాపకాలలో
సుదీర్ఘ ప్రశాంతత కావాలి! — బలిదానం జరుగుతోంది — ఒక వ్యక్తిని సజ్జనునిగా మార్చగోరితే… — మీడ్ సోదరీమణుల ఇంట్లో — జీవన సరళి — మాంసాహారం ఎందుకు? — కొన్ని సంఘటనలు — పిల్లలతో భగవంతుని గురించి — ప్రసంగాలు — గందరగోళం సృష్టించే వ్యక్తులు — ‘ఇదేమీ క్రొత్త కాదు!’ — ‘నష్టం నాకు కాదు’
మీడ్ సోదరీమణులు
చికాగో నుంచి 1899 డిసెంబర్ 3 వ తేదీన స్వామీజీ క్యాలిఫోర్నియాలోని ఒక ప్రధాన నగరమైన లాస్ ఏంజెల్స్ వెళ్లారు. సోదరుణ్ణి కోల్పోయిన మెక్లౌడ్ అక్కడ ప్లాజెట్ ఇంట్లో నివసిస్తున్నది. వారితో కలసి బస చేయడానికి ముందు స్వామీజీ కొన్ని రోజులు తమ విద్యార్థియైన మిస్ స్పెన్సర్ ఇంట్లో బస చేశారు. స్పెన్సర్ దాదాపు పదేళ్లుగా కనుచూపులేని వృద్ధురాలైన తన తల్లిని సంరక్షిస్తూ వస్తోంది. స్వామీజీ రోజూ ఆ వృద్ధురాలి ప్రక్కన చాలాసేపు కూర్చుని మాట్లాడేవారు. ఈ రోజుల్లో పలువురు క్రొత్త మిత్రులను మెక్లౌడ్ ఆయనకు పరిచయం చేసింది. అక్కడ కూడా స్వామీజీ ప్రసంగాలు చేశారు.
స్వామీజీ మొదటి ప్రసంగ సందర్భంలో ఆయనను కలుసుకొన్నవారే మీడ్ సోదరీమణులు. “మీ ముగ్గురూ నాకు మునుపే తెలుసు” అని స్వామీజీ ఒకసారి వారితో చెప్పారు. “సోదరీమణులైన మీ ముగ్గురూ శాశ్వతంగా నా మనస్సులో నిలిచిపోయారు” అని ఆయన వచించే మేరకు ఆయన జీవితంలో వారు చోటుచేసుకొన్నారు.
మిసెస్ గేరీ మీడ్ వైకాఫ్, మిసెస్ ఆలిస్ మీడ్ హాన్స్బరో, మిస్ హెలెన్ మీడ్ – వీరే ఈ మీడ్ సోదరీమణులు.* వీరు ఇంతకు మునుపే స్వామీజీ రాజయోగం, కర్మయోగం పుస్తకాలు చదివారు. “ఎంతటి అద్భుతమైన భావనలు!వీటిని రచించిన వ్యక్తి ఎంత అద్భుతంగా ఉంటారో!” అని తమలో తాము మాట్లాడుకొని ఒక రూపాన్ని కూడా వారు ఊహించుకొన్నారట! అలా ఊహలో కనిపించిన వ్యక్తి ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడబోతున్న విషయం పత్రికల ద్వారా తెలుసుకొన్న వారు ఆ అవకాశాన్ని జారనివ్వలేదు; ఆయన ప్రసంగాలు విన్నారు, ఆయనతో సన్నిహితంగా మెలగారు, ఆయన ప్రసంగాలు ఏర్పాటు చేయడంలో దోహదం చేశారు.
ప్లాజెట్ ఇంట్లో
స్పెన్సర్ ఇంట్లో నుంచి స్వామీజీ ప్లాజెట్ ఇంటికి వెళ్లారు. ఈమె స్వామీజీ చరిత్రాత్మకమైన చికాగో ప్రసంగాలకు ప్రత్యక్ష శ్రోత అన్న విషయం ఇంతకుక్రితమే చూశాం. స్వామీజీ ప్రస్తుతం తన ఇంటిని పావనం చేసినప్పుడు ప్లాజెట్ పరమానందభరితురాలయింది. ప్లాజెట్ ఇంట్లో సామాన్యంగా స్వామీజీ విశ్రాంతిలోనే రోజులను గడిపారు. కాని ఆయనతో జీవించే ప్రతి క్షణమూ తక్కిన వారికి జీవితంలో చిరస్మరణీయ క్షణాలవడం అతిశయోక్తి కాదు. రుగ్మత, దుఃఖం, ఆవేదన, శోకం లాంటివి ఏవి ఉన్నప్పటికీ ఆయన వచ్చినప్పుడు అవి వైదొలగి అక్కడ ఉత్సాహతరంగం ఉప్పొంగుతుంది.
ప్లాజెట్ ఇంట్లో వంటగది, స్నానాలగది ప్రక్కప్రక్కనే ఉన్నాయి. స్వామీజీ స్నానం చేస్తున్నప్పుడు గంభీర స్వరంలో సంస్కృత శ్లోకాలు ఉచ్చరించేవారు. వాటి అర్థం తెలియనప్పటికీ వాటి సారం గ్రహించి ఆ దివ్యభావనలలో లీనమైపోయి ప్లాజెట్ వంట చేయడం కద్దు. తరువాత భోజనం. తదనంతరం స్వామీజీ, మెక్లౌడ్ పచార్లు చేసేవారు.
ఉదయం తరగతి ప్రసంగాలు నిర్వహించేవారు. ఆ తరువాత స్వామీజీ వచ్చి మధ్యాహ్న భోజనం వండేవారు. “ప్రసంగాలు ముగియగానే, పాఠశాల నుంచి తిరిగివచ్చే పిల్లవాడిలా ఉత్సాహంతో, ‘ఇక మనం వంట చేయవచ్చు’ అంటూ వంటగదిలోకి స్వామీజీ పరుగెత్తేవారు” అని ప్లాజెట్ వ్రాస్తున్నది. కాని ప్రసంగం చేస్తున్నప్పుడు ధరించే కోటు లాంటి దుస్తులను మార్చుకోకుండానే వంటగదిలోకి వెళ్లిపోయేవారు. మెక్లౌడ్ అది పరికించి ఆయన మామూలు దుస్తులు ధరించేటట్లు చేసేది. మధ్యాహ్న భోజనానంతరం ఏ పనీ లేకుంటే తోటలోని చిక్కపు ఉయ్యాలలో (hammock) పడుకొని ఏదో చదువుకొనేవారు. ఈ రోజుల్లో ఆయన ఫ్రెంచి భూగోళశాస్త్రజ్ఞుడూ, సామాజిక తాత్త్వికుడూ అయిన ఎలిసీ రెక్లూ (Elisee Reclus) రచించిన ‘భూమి – దాని జీవరాశులు’ (The Earth and Its Inhabitants) అనే గ్రంథం చదవసాగారు. ఇది అందమైన చిత్రాలతో అనేక సంపుటాలతో కూడుకొన్న పెద్ద గ్రంథం. తమకు అమితంగా నచ్చిన అంశమైన ‘మానవుని’ గురించిన పుస్తకం కావడంతో స్వామీజీ దానిని బాగా ఇష్టపడి చదివారు.
డిసెంబర్ 21 వ తేదీన సూర్య పంచాంగం ప్రకారం సంవత్సరాది. ఆ రోజు అందరూ సూర్యుని ఆరాధించారు. స్వామీజీ గాయత్రీ మంత్రం ఉచ్చరించారు.
పిల్లవానిలా…
ఒక రోజు స్వామీజీ ప్రసంగానికి బయలుదేరడంలో జాప్యం కావడంతో మెక్లౌడ్ తొందర చేయసాగింది. కాని స్వామీజీ తాపీగా తలపాగా చుట్టుకొంటూ, అదెలా చుట్టుకోవాలో నెమ్మదిగా ప్లాజెట్కు వివరిస్తున్నారు. మెక్లౌడ్ తొందరను చూసి ప్లాజెట్, “స్వామీజీ! మీరు తొందర పడకండి. ఒక కథ చెబుతాను. ఒక వ్యక్తిని ఉరి తీయడానికి తీసుకువెళ్లారు. అది చూడడానికి జనం త్రొక్కిసలాడుకొంటూ పరుగెత్తసాగారు. అది చూసి ఆ వ్యక్తి వారితో, ‘మీరు పరుగెత్తవద్దు, నెమ్మదిగా రండి. నేను వెళ్లే దాకా అక్కడ ఏమీ జరగదు’ అన్నాడట! అదే విధంగా స్వామీజీ! మీరు వెళ్లే వరకు అక్కడ ఏమీ జరగదు’ అంది. ఇది విని స్వామీజీ పిల్లవానిలా కడుపుబ్బ నవ్వారు. కాలాంత రంలో అనేక సమయాల్లో ఆయన దీనిని గురించి ప్రస్తావించి కడుపుబ్బ నవ్వేవారు.
మరో రోజు ఉదయం ప్లాజెట్ ఇంట్లో ఏర్పాటయిన తరగతి ప్రసంగానికి జనం బాగా వచ్చారు. స్వామీజీ వెళ్లి ప్రశాంతంగా తమ ఆసనంలో కూర్చుని ధ్యానంలో మగ్నులయ్యారు. ఆయన దృష్టి అధోముఖమై ఉంది. సమయం గడిచింది, అందరూ ఒక రకమైన సమ్మోహనానికి లోనైనట్లు ఆయననే చూస్తూ ఉండిపోయారు. కాసేపటి తరువాత స్వామీజీ కళ్లు తెరిచారు. ఆయన ముఖా రవిందాన పిల్లవాని నిష్కళంకత భాసిల్లింది. ఒక పిల్లవానిలా ఆయన మిసెస్ లెగ్గెట్తో, “నేను దేనిని గురించి ప్రసంగించాలి?” అని అడిగారు. ఎలాంటి శ్రోతలనైనా సమ్మోహనపరచి ప్రసంగించడంలో ఆరితేరిన, విద్యాధికులు అనేకులు ఆశ్చర్యచకితులై శ్లాఘించే బుద్ధిసూక్ష్మతగల ఆయన దేనిని గురించి ప్రసంగించా లని అడుగుతున్నారు! కొన్ని సమయాల్లో స్వామీజీ పిల్లవానిలా అయిపోతారు!
స్వామీజీ గురించి నాటకం
ఈ రోజుల్లో స్వామీజీ తక్కువగానే ప్రసంగించారనవచ్చు. ఈ మేరకు ఆయన మౌనంగా ఉండడం తాను ఇంత వరకు చూసింది లేదని మెక్లౌడ్ వ్రాస్తున్నది. కాని అనేకమంది ప్రముఖులు వచ్చి ఆయనను కలుసుకొన్నారు, స్వామీజీ కూడా వెళ్లి పలువురు మిత్రులను కలుసుకొన్నారు.
ఈ కాలఘట్టంలో అక్కడ, “భారతదేశం నుంచి వచ్చిన నా మిత్రుడు” అనే నాటకం ప్రదర్శించారు. ఇదొక హాస్యభరితమైన నాటకం; “ఈ శతాబ్దపు అతి గొప్ప హాస్యభరిత నాటకం” అని ప్రకటనలిచ్చారు. తమాషా ఏమిటంటే, ఈ నాటకం సూచించే ‘మిత్రుడు’ స్వామీజీయే! ఆయనను కేంద్రంగా చేసుకొని రూపొందించిన నాటకం అది. ఆయన మొదటిసారి అమెరికా వచ్చినప్పుడు పొందిన కీర్తిప్రతిష్ఠలకు ఇది ప్రతిధ్వని. ఈ పాత్ర ప్రత్యక్షంగా స్వామీజీని సూచించకపోయినా, ఆయన ఆర్జించిన కీర్తి ప్రభావం మూలంగానే ఆ పాత్ర రూపొందించబడింది.
అందరికీ ఇట్టే అర్థమవుతుంది. స్వామీజీ ఈ నాటకం తిలకించి కడుపుబ్బ నవ్వారు.
వేదాంత పర్యవసానమైన నృత్యం
మరొకసారి లాస్ ఏంజెల్స్‌లో నృత్యరూపకాన్ని తిలకింప స్వామీజీ వెళ్లారు. ఈ నృత్యరూపకానికి ప్రేరణనిచ్చినవి స్వామీజీ భావనలే. మూడేళ్ల క్రితం లండన్‌లో ఆయన ప్రసంగాలు ఒక యువతి విన్నది. అందరిలోనూ అపరిమితమైన శక్తి నిక్షిప్తమైవుందని స్వామీజీ వెలిబుచ్చిన భావన ఆమెను అమితంగా ఆకట్టుకొంది. “ఆ శక్తి నాలో కూడా ఉండి ఉంటే దానిని నా జీవితంలో అభివ్యక్తం చేయాలి” అని ఆమె నిశ్చయించుకొంది. ఆమె ఒక నర్తకి. తనలోని శక్తిని నృత్యం ద్వారా అభివ్యక్తం చేసి, కళ, మతం లాంటి వాటిలోని సూక్ష్మతలను లోకానికి ప్రదర్శించి చూపగోరిన ఆమె అందుకు తగినట్లు ఒక నృత్యరూపకాన్ని రూపొందించింది. ఆ నృత్య రూపకాన్ని తిలకించాల్సిందిగా ఆమె, ఆమె తల్లి వచ్చి స్వామీజీని ఆహ్వానించారు. స్వామీజీ, తక్కినవారు సంతోషంగా వెళ్లి ఆమె నృత్యరూపకాన్ని తిలకించి ఆనందించారు.
ఒక మరణ వదంతి
స్వామీజీ లాస్ ఏంజెల్స్ వచ్చినప్పటి నుండి ఆయన ఆరోగ్యం కొంతలో కొంత మెరుగయింది. బాగా నొప్పి కలిగించినప్పటికీ ఆయన అయస్కాంత చికిత్స కూడా చేయించుకొన్నారు. ఈ చికిత్స చేసిన వ్యక్తి మిసెస్ మెల్డన్. ఈమె నిరక్షరాస్యురాలు. కాని ఏదో ఒక రకమైన శక్తితో తాను చికిత్స చేస్తున్నట్లు ఆమె చెప్పడం కద్దు. ఉద్వేగం ఆవహించినట్లు ఆమె తన చేతులను రోగి ఒంటినంతా బుజ్జగిస్తూన్న ధోరణిలో స్పృశించేది; రోగి శరీరాన్ని గట్టిగా అదుముతూ మర్దించేది. అప్పుడు రోగి చర్మం పిగిలి, కొరివిని ఒంటి మీద పెట్టిన బాధ కలుగుతుంది. స్వామీజీ ఇలా వ్రాస్తున్నారు: “నాకు చికిత్స ఎవరు చేస్తున్నారో తెలుసా? ఒక వైద్యుడు కాదు, క్రైస్తవ విజ్ఞానశాస్త్ర చికిత్సకుడు కాదు, ఒక అయస్కాంత చికిత్సకురాలు. నాకు చికిత్స చేసినప్పుడల్లా నా చర్మం ఒలుస్తోంది… ఆశ్చర్యం – మర్దనం ద్వారా ఆమె శస్త్రచికిత్స – అంతర్గత శస్త్రచికిత్స కూడా చేస్తుందని ఆమె రోగులు నాతో చెబుతున్నారు.”* ప్రారంభంలో ఈ చికిత్స వలన ఆయనలో కాస్త గుణం కనిపించింది. పిదప పెద్దగా చెప్పుకోదగ్గ గుణం కనిపించలేదు.
తమ ఆరోగ్యం గురించి అప్పుడప్పుడు మిత్రులకూ, బేలూర్ మఠానికీ లేఖలు వ్రాశారు. అయినప్పటికీ ఆయన గురించిన అనేక వదంతులు భారత దేశంలో వ్యాపించసాగాయి – స్వామీజీ మరణించినట్లు కూడా! దీనిని గురించి తురీయానందకు స్వామీజీ ఇలా వ్రాశారు: “మన దేశంలో ప్లేగు వ్యాధి వ్యాపించిందట, ఎవరు బ్రతికి బట్టకట్టారో, ఎవరు మరణించారో! మంచిది. ‘అచ్యు’ నుండి ఈ రోజు ఉత్తరం వచ్చింది. ‘శికార్’ రాష్ట్రంలోని ‘రామఘర్’ లో అతడు దాగివున్నాడు. వివేకానంద చనిపోయాడని ఎవరో అతడికి చెప్పారట, కనుక నాకు ఉత్తరం వ్రాశాడు! అతడికి జవాబు వ్రాస్తున్నాను!”*
కొన్ని వ్యథలు
ఆరోగ్యమే కాకుండా స్వామీజీ వ్యథ చెందడానికి వేరే కారణాలూ ఈ రోజుల్లో లేకపోలేదు. మొదటిది బేలూర్ మఠం. అది వెలసివున్న బాలీ పురపాలక సంఘం, మఠానికి పన్నులు విధించింది. మఠాన్ని ఒక ఆరాధనా స్థలంగా పరిగణించి పన్ను మినహాయింపు మంజూరు చేయకుండా, విడిదిగా పరిగణించి ఇంటి పన్ను లాంటివి విధించింది. దానిని ప్రతిఘటిస్తూ వ్యాజ్యెం వేశారు. కాని రూ. 20, 000/– పైబడ్డ విలువగల బేలూర్ మఠ ఆస్తి విషయంగా తాము ఎలాంటి నిర్ణయమూ చేయలేమని బాలీ పురపాలక సంఘ న్యాయస్థానం తెలిపింది. స్వామీజీ న్యాయశాస్త్రం అధ్యయనం చేసినవారు, న్యాయశాస్త్ర సూక్ష్మతలు తెలిసినవారు. మఠాన్ని తమ పేరిట నమోదు చేయకుండా ఒక ధర్మకర్తల సంఘం పేరిట నమోదు చేసివుంటే ఈ సమస్య తలెత్తేది కాదు. అలా చేయకపోవడం తన తప్పు అని స్వామీజీ వ్యథచెందారు. ఈ సమస్య స్వామీజీ మనస్సును పీడించింది.*
తరువాతిది న్యూయార్క్ మఠం గురించిన వ్యథ. దీని అధ్యక్షుడు లెగ్గెట్. ఆయనకూ అభేదానందకూ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. చివరికి లెగ్గెట్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. ఇది న్యాయస్థాన వ్యాజ్యాల కన్నా స్వామీజీని మరింత ఆవేదనకు గురిచేసింది. ఇద్దరూ ముఖ్యమైనవారు. స్వామీజీ ఎవరికి మద్దతు నిస్తారు? ప్రారంభంలో ఆయన తటస్థంగా ఉన్నారు. సారా, మెక్లౌడ్లు లెగ్గెట్ వైపు మొగ్గు చూపారు. “అభేదానంద నుండి ఒక సుదీర్ఘమైన జాబు వచ్చింది. అతడు పూర్తిగా తలకిందైనట్లు అనిపిస్తున్నది. కాస్త దయ చూపితే అతడు మన వాడు కావడం తథ్యం”* అని మిసెస్ ఓల్బుల్కు స్వామీజీ వ్రాశారు. “సహనంతో వేచివుండ” మని అభేదానందకు వ్రాశారు. చివరికి డాక్టర్ పార్కర్ అనే వ్యక్తిని అధ్యక్షునిగా చేసి సమస్యను పరిష్కరించారు. అయినప్పటికీ ఇది ఆయనకు మానసిక క్షోభ కలిగించకపోలేదు.
మూడవదైన వ్యథ కూడా లేకపోలేదు. అమెరికాలో నిధులు సేకరింపవచ్చిన నివేదితకూ, మేరీ హేల్కూ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. స్వామీజీ భారతదేశ పార్శ్వం మేరీకి తెలియదు. వేదాంత ప్రసంగాలనూ, జ్ఞానయోగ భావన లనూ మాత్రమే ఆమె స్వామీజీ ముఖతః విన్నది. కనుక భారతీయ స్త్రీల కోసమైన విద్య, కర్మయోగం, కాళీ ఆరాధనలాంటి విషయాలు నివేదిత ప్రస్తావించడమూ, అందుకై నిధులు సేకరించడమూ మేరీకి నచ్చలేదు. ఇది ఆ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలను పెంచింది. నివేదిత కుమార్తె అయితే మేరీ సోదరి; ఇద్దరిలో ఎవరికి స్వామీజీ మద్దతు నిస్తారు? భారతదేశం గురించి, స్వామీజీ భారతీయ పార్శ్వాన్ని చక్కగా అవగతం చేసుకొన్న మెక్లౌడ్ లాంటి వారు నివేదిత వైపు మొగ్గుచూపారు. స్వామీజీ మేరీ మనస్సుకు సాంత్వన కలిగేలా లేఖ వ్రాశారు. కాని ఆయన నివేదిత వైపే మొగ్గు చూపినట్లు ఆయన లేఖల నుండి స్పష్ట మవుతుంది. ‘ప్రియ పుత్రీ, నివేదితా!’ అంటూ ప్రారంభించి, ‘నీ తండ్రి, వివేకానంద’ అంటూ ఒక లేఖ ఈ రోజుల్లో ఆయన వ్రాశారు. మరొక లేఖలో, “నీకు సమస్త దీవెనలు. ఏ మాత్రం నిరాశ చెందవద్దు. జయ శ్రీ గురూ! జయ శ్రీ గురూ! నువ్వు క్షత్రియ రక్తం నుండి పుట్టిన దానవు. మన ఈ పసుపు వస్త్రం, యుద్ధభూమిలో మృత్యువు దాల్చే ఉడుపు. ఆదర్శానికై మృతి చెందడం మన లక్ష్యం, జయం పొందడం కాదు, జయ శ్రీ గురూ! దుష్ట విధి కల్పించే ఆవరణ అంధకారబంధురం. కాని నేను అధీశుణ్ణి. చూడు నా చేయి ఎత్తగానే అది పటాపంచలవుతుంది! ఇదంతా అర్థరహితం. మరి భయమా? నేను భయానికి భయాన్ని; భీషణానికి భీషణాన్ని. నేను నిర్భయం, అద్వితీయం అయిన ఏకాన్ని! నేను విధి నియామకుణ్ణి. సర్వం తుడిచివేస్తాను. జయ శ్రీ గురూ! తల్లీ! స్థిరంగా ఉండు. బంగారానికి గాని, మరి దేనికి గాని అమ్ముడుపోవద్దు. మనం జయిస్తాం!”* అంటూ వ్రాసి నివేదితకు ఉత్సాహం కలిగించారు.
జ్యోతిర్మయ మానవుడు
దివ్యపురుషుని జీవితం లోతైనది. వారు కలత చెందినట్లు సామాన్యులు కలత చెందలేరు, వారు ఆనందంలో తేలిపోయినట్లు సామాన్యులు ఆనందాన్ని చవిచూడలేరు. విషయం ఏమిటంటే, వారు నిజానికి కలత చెందరు, ఆనందించరు కూడా. వారు రెంటికీ అతీతంగా సత్యస్థితిలో సుప్రతిష్ఠితులై ఉంటారు. అతి మామూలు విషయం వారిని అత్యున్నత స్థితికి ప్రేరేపిస్తుంది. అత్యున్నత స్థితి నుండి వారు అతి మామూలు స్థితికి చటుక్కున దిగి రాగలరు. ఒక రోజు స్వామీజీ, “సత్య సౌధం” అనే చోట ఏసుక్రీస్తు గురించి ప్రసంగించారు. మెక్లౌడ్ ఇలా వ్రాస్తున్నది: “ఈ చోట, తక్కిన చోట్లలో స్వామీజీ ఈసారి అనేక ప్రసంగాలు చేశారు. అవి ఒక దాన్ని ఒకటి మించినవి. కాని ఆయన నాడు ఏసుక్రీస్తు గురించి చేసిన ప్రసంగం చిరస్మరణీయమైనది. ప్రసంగం ప్రారంభించిన కాసేపట్లోనే ఆయన ఏసుక్రీస్తులో ద్రవించిపోయినట్లు అనిపించింది. ఆయన ఆపాదమస్తకమూ ధవళకాంతిలో దేదీప్యమానంగా ప్రకాశించింది. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను.”
ప్రసంగం ముగించి స్వామీజీ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఒక యువకుడు హఠాత్తుగా వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆయన పాదాలను స్పృశించాడు. కందిరీగ కుట్టినట్లు ఎగిరి స్వామీజీ వెనక్కు వెళ్లారు; “ఎన్నడూ ఇలా ప్రవర్తించకు” అన్నారు తీవ్రంగా.
దివ్యపురుషులలో కొన్ని సమయాలలో ఇలాంటి చేతలు చూడవచ్చు. భగవాన్ శ్రీరామకృష్ణుల, మాతృమూర్తి శ్రీ శారదాదేవి జీవితాలలో దీనిని తరచూ చూడవచ్చు. వారు ఇలా నివారించడానికి రెండు కారణాలున్నాయి: 1. ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితులను అధిరోహించే కొద్దీ వారి మనశ్శరీరాలు ఉన్నత అనుభూతులు పొందడానికి అనువుగా సూక్ష్మంగా, అతి సూక్ష్మంగా మారతాయి. లౌకిక వాంఛలూ, ఉద్వేగాలూ ఎక్కువగా గల సామాన్యులు తాకడం వారు భరించలేరు. 2. ఒకరు మరొకరిని తాకినప్పుడు ఇద్దరి మధ్య మార్పిడి సంభవిస్తుంది. సామాన్యులు పరస్పరం తాకినప్పుడు, ఇద్దరూ ఒకే స్థితిలో ఉండడం వలన అది ఇద్దరినీ బాధించదు. మహాత్ముడు ఆధ్యాత్మిక శక్తికి ఆల వాలంగా విరాజిల్లుతాడు. ఆయన శక్తి తాకే వ్యక్తిలో ప్రసరిస్తుంది. కాని ఆ శక్తిని స్వీకరించడానికి తాకిన వ్యక్తి అనర్హుడైతే మహాత్మునికి బాధ కలిగిస్తుంది. కాశీపూర్ రోజుల్లో స్వామీజీ అభేదానందను తమను తాకినట్లు చేసినప్పుడు గురుదేవులు ఖండించడం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక అలా ఎవరూ తాకడానికి వారు అనుమతించరు.
ఇంతటి అత్యున్నత స్థితిలో విరాజిల్లే స్వామీజీ చింతనాస్రవంతిని భగ్నం చేయకూడదని, తిరిగి వస్తున్న దారిలో, ఆయనతో ఏమీ మాట్లాడలేదు మెక్లౌడ్. హఠాత్తుగా స్వామీజీ ఆమె వైపు తిరిగి, “దానిని ఎలా చేస్తున్నారో నాకు తెలుసు” అన్నారు. “ఏది ఎలా చేస్తున్నారు స్వామీజీ?” అని మెక్లౌడ్ అడిగింది. “మిరియాల నీరు! వారు దాన్లో కరివేపాకును తరువాతే వేస్తున్నారు, ముందుగా కాదు” అన్నారు. తమిళనాడులో స్వామీజీ అమిత ఇష్టంగా తిన్న చారునే ఇక్కడ సూచిస్తున్నారు. “అహం కించిత్తు కూడా లేని, తమను ఒక ముఖ్య వ్యక్తిగా పరిగణించుకోని ఈ సుగుణం ఆయన అద్భుతమైన గుణగణాలలో ఒకటి” అని మెక్లౌడ్ వ్రాస్తున్నది.
‘పొడిచి చూడు తెలుస్తుంది!’
భారతీయ సంప్రదాయం, ఆధ్యాత్మికతల గురించి ఒకింత అవగాహన గల వారికే ఆత్మ గురించిన భావనలు సులభంగా అవగతం కావు. ఆ భావనలను, వాటి గురించి కించిత్తు కూడా తెలియని పాశ్చాత్యులకు స్వామీజీ వ్యక్తం చేశారు. ఇంతకు క్రితమే మనం చూసినట్లు తమ భావనలతో ఆధ్యాత్మిక శక్తిని జతచేర్చి ఆయన అందించడం వలన శ్రోతలు భావనలను అవగతం చేసుకోగలిగారు; ఒకింత అర్హులైన వారు కనీసం ఆ భావనలను తాత్కాలికంగానైనా అర్థం చేసుకోగలిగారు. సామాన్యులు అర్థం చేసుకొన్నారు. అర్థం చేసుకోలేనివారు అడిగినప్పుడు స్వామీజీ ఎంతో శ్రమపడి పదే పదే వాటిని విపులీకరించి వారికి అర్థమయ్యేట్లు చేశారు. కాని కేవలం వాదన కోసమో, కుతర్కంగానో మాట్లాడే వ్యక్తులకు వారి ధోరణిలోనే జవాబిచ్చారు.
“ఆధ్యాత్మిక సాధనకు కొన్ని సూచనలు”* అనే అంశం మీద ఒక రోజు స్వామీజీ ప్రసంగిస్తున్నారు. “విశ్వమంతా ఏ దృక్కోణం నుండి చూసినా, ఒకే పదార్థం” అనే భావనను విశదీకరిస్తున్నారు. హఠాత్తుగా శ్రోతలలో నుండి ఫ్రాన్స్కీ అనే వ్యక్తి నిలబడి, “అంతా ఒకే పదార్థం అయితే క్యాబేజీకి మనిషికి ఏం తేడా?” అని కుతర్కంగా ప్రశ్నించాడు. “కత్తితో పొడిచి చూడండి, తేడా తెలుస్తుంది” అన్నారు స్వామీజీ ఠక్కున!
స్వామీజీ ప్రసంగాల పట్ల అమిత అసంతృప్తి చెందిన వారిలో ఫ్రాన్స్కీ ఒకడు. క్రైస్తవ మత బోధకులు మాత్రమే కాక, అనేక తాత్త్విక బోధకులు సైతం స్వామీజీని ప్రతిఘటించారు. తమకన్నా ఆయన సర్వోత్తముడనే అసూయ కారణంగా కొందరు, ఆయన రాకతో తమ ‘జీవనం’ అతలాకుతలమైందని కొందరు – ఈ రకంగా అనేకులు స్వామీజీ పట్ల అసంతృప్తి చెందారు. వీరిలో అనేకులు ఆయన ప్రసంగాలకు హాజరై అసంబద్ధమైన ప్రశ్నలు వేసి ఇబ్బంది కలిగించడం కద్దు.
సందిగ్ధ పరిస్థితి
కొందరు దురాశ కారణంగా స్వామీజీని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇరికించడం కద్దు. స్వామీజీ బహిరంగ ప్రసంగాలకూ, తరగతి ప్రసంగాలకూ చక్కని ఆదరణ లభించింది. ప్రసంగాలు నిర్వహించిన మండ పాలు ఎప్పుడూ కిటకిటలాడేవి. ఒక రోజు ప్లాంజెట్ హాలులో స్వామీజీ ప్రసంగిస్తున్నప్పుడు ఆ హాలు యజమానియైన ప్లాంజెట్ కూడా అక్కడే ఉన్నాడు. త్రొక్కిసలాడుతూ వచ్చిన జనసందోహం ఆతడి మనస్సులో దురాశను రేకెత్తించింది; “ఈ వ్యక్తిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదిస్తే ఎలా ఉంటుంది!” అనే దురాలోచన తలెత్తింది. కనుక మిసెస్ హాన్స్బరోతో, “వచ్చే ఆదివారం ఈయన మళ్లీ ఇక్కడ ప్రసంగిస్తారని ప్రకటించనా?” అని అడిగాడు. తను అలాంటి అనుమతి ఇవ్వలేనని ఆమె నిరాకరించడంతో వెంటనే ఆతడు మెక్లౌడ్ను అడిగి అనుమతి పొందాడు. స్వామీజీకి ఇవేవీ తెలియవు. ఆయన వేదిక మీద ఉన్నప్పుడే ప్లాంజెట్, “వచ్చే ఆదివారం స్వామీజీ ఇక్కడ మళ్లీ ప్రసంగిస్తారు” అని ప్రకటించాడు. దాంతో స్వామీజీ విభ్రాంతికీ, ఆగ్రహానికీ లోనై, ఎవరు అనుమతిచ్చారని నాలుగు వైపులా దృష్టిని సారించారు. పరిస్థితిని అర్థం చేసుకొన్న మెక్లౌడ్ చల్లగా జారుకొంది. వేదిక మీద ఉన్న స్వామీజీ ఆ ప్రకటనను ఖండించడమో లేక అంగీకరించడమో చేయలేని నిస్సహాయ పరిస్థితిలో పడిపోయారు. ఇటువంటి వ్యక్తుల నుండి వైదొలగాలని ఆయన పడరాని పాట్లు పడుతూవుంటే, ఇలాంటి ఒక సంఘటన జరగడం ఆయన జీర్ణించుకోలేక పోయారు. కనుక ఆయనను ప్రసంగం చేయడానికి ఒప్పించలేకపోయారు.
స్వామీజీ లాస్ ఏంజిల్స్ నుంచి బయలుదేరుతున్నప్పుడు లాస్ ఏంజిల్స్ టైమ్స్ అనే పత్రిక ఈ క్రింది వార్తను ప్రచురించింది:
“స్వామి వివేకానంద త్వరలో శాన్ఫ్రాన్సిస్కో వెళ్లనున్నారు. పాశ్చాత్య దేశాలకు వచ్చిన ప్రాచ్య మేధావుల్లో ఈయన అద్వితీయుడనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నగరంలోని ఉన్నతశ్రేణి ప్రజలలో స్ఫూర్తిని రగిలించారు. ఈయన ప్రసంగాలు ఇంతవరకు వినని వారికి ఒక మాట – తాత్త్వికతను ఈ దేశంలో బోధించడం మాత్రమే కాదు ఆయన పని; మన ప్రాట్ సంస్థలా అనేక సాంకేతిక పాఠశాలలను భారతదేశంలో ప్రారంభించి తద్ద్వారా భారతదేశ పామర ప్రజలను ఉద్ధరించడమే ఆయన ఉద్దేశం.”
మిసెస్ లెగ్గట్ ప్రయత్నమూ, పరాజయమూ
కాని ఈ విధంగా సాంకేతిక పాఠశాలలు ప్రారంభించడానికి నిధులు సేకరించడానికి స్వామీజీ ప్రయత్నించినప్పుడు ఆయనకు అంతంత మాత్రమే ఆదరణ లభించింది. మిసెస్ లెగ్గట్ స్వామీజీ మిత్రులకు లేఖలు వ్రాసింది. సంవత్సరానికి నూరు డాలర్ల చొప్పున పదేళ్లకు చందాలివ్వమని ఆమె విజ్ఞప్తి చేసింది. మిసెస్ లెగ్గట్, ఆమె మిత్రులు ఇద్దరు తప్ప మరెవరూ డబ్బు ఇవ్వడానికి ముందుకు రాలేదు. మిసెస్ లెగ్గట్ ఈ ప్రయత్నం పూర్తిగా పరాజయం పొందింది.
ఈ కారణంగా స్వామీజీ సందిగ్ధావస్థలో పడ్డారు. స్వామీజీ మిత్రుల వద్ద డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించిన మిసెస్ లెగ్గట్ దాని గురించి ఆయనతో ఏమీ చెప్పలేదు. అడిగీ లేదనిపించుకొన్న పరిస్థితి స్వామీజీని మరింత సందిగ్ధంలో పడవేసింది. ఆయన ఇలా వ్రాస్తున్నారు:
“శ్రీమతి ముల్లర్‌కు మిసెస్ లెగ్గట్ వ్రాసినందుకు నేను కాస్త సిగ్గుపడ్డాను. కాని నాకు తెలియడానికి ముందే ఆమె ఆ విధంగా చేసింది. ఆ పథకంలో చేరడానికి ఇష్టం లేదని శ్రీమతి హేల్ మర్యాదగానే జవాబు వ్రాసింది. కాని ఆ ఉత్తరం మేరీ చేత వ్రాయించి శ్రీమతి హేల్ పంపింది. ఆ ఉత్తరంలో నా పట్ల తమ ప్రేమ తెలియపరచబడింది.”*
తమకూ, స్వామీజీకి మధ్య మూడో వ్యక్తి వచ్చి డబ్బు అడగడం అనేకులు జీర్ణించుకోలేకపోయారు. కనుక వారు మిసెస్ లెగ్గెట్ ప్రయత్నానికి సానుకూలంగా స్పందించలేదు. స్వామీజీ వారికే ప్రేమతో ఉత్తరాలు వ్రాశారు. అదేసమయంలో తమ పట్ల గల అభిమానం కారణంగా ఇంతటి ప్రయత్నం చేసి పరాజయం చవిచూసిన మిసెస్ లెగ్గట్ను సాంత్వన పరిచారు.
మిసెస్ లెగ్గట్ ప్రణాళిక విఫలమవడం స్వామీజీకి కొంత మానసిక వ్యథను కలిగించకపోలేదు. బేలూర్ మఠ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పాశ్చాత్య దేశాలలో నిధులు సేకరించలేకపోయిన స్థితిలో స్వామీజీ భారతదేశం తిరిగి వెళ్లిపోదామనుకొన్నారు. అక్కడే నిధులు సేకరించడానికి ప్రయత్నించగోరారు. కాని అలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. జగజ్జనని ఆయనకు మొండిచేయి చూపలేదు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన ప్రసంగాలకు ఏర్పాటుచేసి, మీడ్ సోదరీ మణులు ఆయనను ఆహ్వానించారు. ఆ తరువాత పరిస్థితి కాస్త మెరుగుపడ సాగింది. “చక్రం పైకి తిరుగుతోంది. జగజ్జనని ఆ విధంగా తిప్పుతోంది. ఆమె కార్యం ముగిసే వరకు నన్ను వదలిపెట్టదు – అదీ రహస్యం”* అంటూ స్వామీజీ వ్రాస్తున్నారు.
అక్కడ చేసిన ప్రసంగాల ద్వారా, చందాల మూలంగా స్వామీజీకి చాలినంత పైకం లభించింది. కాని ఇక్కడా మెక్లౌడ్ విశాలహృదయాన్ని చూడవచ్చు. ఆర్థిక స్థితి బాగాలేదని బేలూర్ మఠం నుంచి ఉత్తరం వచ్చినప్పుడు, స్వామీజీ దిగులు చెందినట్లు కనిపించారు. స్వామీజీ దిగులుకు కారణం తెలుసుకొన్న మెక్లౌడ్ వెంటనే 800 డాలర్లు ఇచ్చింది.
తల్లి జ్ఞాపకాలలో
బేలూర్ మఠ ఆర్థిక స్థితి సరిగా లేదని తెలిసినప్పుడు స్వామీజీ భారత దేశానికి తిరిగి వెళ్లిపోవాలనుకొన్నారు. ఇప్పుడు మీడ్ సోదరీమణుల ప్రయత్నం వలన ప్రసంగాలు ఏర్పాటై, తద్ద్వారా పైకం లభించింది. ఆర్థిక స్థితి మెరుగుపడిన పరిస్థితిలో మళ్లీ భారతదేశానికి తిరిగి వెళ్లగోరారు. ఇప్పుడు కారణం వేరు. తల్లిపట్ల నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని తను నెరవేర్చలేదనే ఆవేదన స్వామీజీ అంతరాంతరాళాల్లో మెదలుతూనే ఉంది. ఇప్పుడు ఆ ఆవేదనాభావన పైకి వచ్చింది. “ముఖ్యంగా నేను ఆరోగ్యం నిమిత్తం ఇక్కడికి వచ్చాను. నాకు ఆరోగ్యం చిక్కింది. వ్యాజ్యెం ఖర్చుల నిమిత్తం రూ. 2000/– సమకూరాయి. మంచిదే, నా ఉపన్యాసాల పని ముగిసిందని నాకు తోస్తున్నది. మళ్లీ ఆ పనికై నా ఆరోగ్యాన్ని పాడుచేసుకోనవసరం లేదు.
“మఠం పని పూర్తిగా విరమించి, కొంతకాలం మా తల్లి వద్దకు వెళ్లడం మంచిదని నాకు విస్పష్టమవుతోంది. నా కోసం ఆమె ఎంతో యాతన పడింది. అవసాన దశలో ఆమెకు శాంతి కూర్చడానికై నేను ప్రయత్నించాలి. సరిగా ఇదే విధంగా మహనీయుడైన శంకరాచార్యులూ చేయవలసి వచ్చింది. తన తల్లి అవసాన సమయపు చివరి కొద్ది రోజుల్లో ఆయన ఆమె వద్దకు పోవలసివచ్చింది! ఇది నీకు తెలుసా? నేను దానిని ఆమోదిస్తున్నాను. అన్నింటినీ మానుకున్నాను. ఇదివరకటి కన్నా ప్రశాంతంగా ఉన్నాను”* అంటూ ఆయన వ్రాస్తున్నారు.
సుదీర్ఘ ప్రశాంతత కావాలి!
తనను తాను అవగతం చేసుకొన్న మహాత్ముడు స్వామీజీ. ఆ మహోన్నత అనుభూతి స్థితిలో అనవరతం ఆయన విరాజిల్లుతారు. నిశ్చేష్టమైన, ఏదో కల గంటున్న స్థితిలో మెదలుతున్నటువంటి స్థితి కాదు ఇది. భగవంతుడెవరు, ప్రపంచం అంటే ఏమిటి, తనెవరు, మూడింటికీ మధ్యనున్న సంబంధం ఏమిటన్నది ఉన్నది ఉన్నట్లు స్పష్టంగా గ్రహించే స్థితి అది. మనస్సును ఏకాగ్రం చేసి, వివేకపూర్వ కంగా చింతన చేసినప్పుడే ఈ ప్రపంచ సత్యం కొట్టొచ్చినట్లు ఆ క్షణమాత్రానికైనా అవగతమవుతుంది – ఈ ప్రపంచం అశాశ్వతమైనది! ప్రపంచం అసత్యమని వ్యక్తం చేసే భావన కాదు ఇది. ప్రపంచం అశాశ్వతమైనదంటే శాశ్వతమైన ఆనందానిచ్చే శక్తిరహితమైనదని అర్థం. ఈ ప్రపంచంలోని ఆనందాలు ఆనందాలు కావు, దుఃఖాలు దుఃఖాలూ కావు. ఆనందంగా తోస్తున్నవి బహుశా దుఃఖాలుగా పరిణమించవచ్చు. దుఃఖాలుగా కానవచ్చేవి బహుశా ఆనందాలుగా పరిణమించ వచ్చు. సత్యాన్ని ఉన్నదున్నట్లు ఈ ప్రపంచం చూపించదు. అందుకే భగవద్గీత, “ఒక తలక్రిందులైన రావి చెట్టు”* అని అభివర్ణిస్తున్నది.
కాస్త గాఢంగా ఆలోచించి సుస్పష్టం చేసుకోగల మనస్సులే ఈ ప్రపంచం నుండి వైదొలగి శాశ్వతమైన ప్రశాంతతను, శాశ్వత ప్రశాంతతకు ఉనికి అయిన భగవంతుని పాదపద్మాలను అన్వేషించడానికి తహతహ చెందుతాయి. ఆ భగవంతుని పాదపద్మాలను స్పృశించిన, ప్రపంచ సత్యాన్ని అనుభూతిలో గ్రహించిన స్వామీజీ ఈ ప్రపంచం నుండి, ప్రపంచపు మాయ నుండి సుదీర్ఘ ప్రశాంతతను ఆశించడంలో వింతేముంది? స్వామీజీ మధుర స్వప్నాలు ఇలా వికసిస్తున్నాయి.
“హిమాలయాల్లో ఒక చిన్న స్థలం కొనుగోలు చేస్తాను. చిన్న స్థలం అంటే ఒక చిన్న గుట్ట – 6000 అడుగుల ఎత్తులో, ఎన్నడూ కరగని మంచుపర్వత శిఖరాలను చూస్తూ ఆనందించే స్థలమై ఉంటుంది. అక్కడ నీటి చలమలు, ఒక చిన్న చెరువు ఉంటుంది. సిడార్* (Cedar) వృక్షాలతో నిండిన అడవులు, ఎక్కడ చూసినా పుష్పాలు, పుష్పాలు, పుష్పాలు! వాటి మధ్య నాకంటూ ఒక చిన్న కుటీరం. ప్రక్కనే చిన్న కాయగూరల తోట. కాయగూరలను స్వయంగా పండిస్తాను. దానితోపాటు – దానితోపాటు – దానితోపాటు – నా పుస్తకాలూ ఉంటాయి. ఎప్పుడో ఒక్క రోజు మాత్రమే మనిషి ముఖాన్ని చూస్తాను. నా చుట్టూ ఉన్న ప్రపంచం శిథిలమైపోయినప్పటికీ నేను కలత చెందను. లౌకిక విషయాలైనప్పటికీ, ఆధ్యాత్మిక విషయాలైనప్పటికీ – నా పనులన్నీ పూర్తయి ఉంటాయి. అక్కడ విశ్రాంతి మాత్రమే. ఆహా, జీవితమంతా నేను ఎంత ఉత్తేజభరితంగా వ్యవహ రించాను! నేను జన్మతః ఒక దేశద్రిమ్మరిని. ఏం జరుగుతుందో నాకు తెలియదు; ఇది నా ప్రస్తుత దృశ్యం, భవిష్యత్తులో జరగబోయేది ఇకమీదటే తెలుస్తుంది.”*
కాని దీన్లో ఒక వింత – ఈ మధుర స్వప్నం ఏదీ ఫలించబోదని కూడా స్వామీజీకి స్పష్టంగా తెలుసు! “ఇందులోని ఒక వింత తెలుసా? నా స్వీయ ఆనందం గురించిన కలలూ, కల్పనలూ అన్నీ కలలుగానే పరిణమిస్తాయి; కాని ఇతరుల గురించి నేను మంచిగా అనుకోవడం అంతా మంచిగానే పరిణమిస్తుంది” అంటూ ఆ ఉత్తరాన్ని ఆయన కొనసాగిస్తున్నారు.
బలిదానం జరుగుతోంది
మరో లేఖలో, “నాకు మిగిలిన రోజులన్నీ, ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుందేమోనని భయపడుతున్నాను. నేను ఆశించిన విశ్రాంతి, ప్రశాంతి నా కెన్నడూ ప్రాప్తించవు. కాని ‘జగజ్జనని’ నా ద్వారా ఇతరులకు మేలు చేస్తోంది – నా దేశంలోని కొందరికైనా, త్యాగంగా భావించి కర్మతో సంతృప్తిపడడం సులభమే. మన మందరమూ బలి పశువులమే! ప్రతి ఒక్కరూ వారి వారి విధానంలో ఇష్టపడేవారు, ఎక్కువ బాధ నుంచి తప్పించుకొంటారు. ప్రతిఘటించేవారు లొంగదీయబడి మరింత బాధనొందుతారు. బలికి ఇష్టపడేవాణ్ణిగా ఉండడానికి నేను నిర్ణయించుకొన్నాను”* అంటూ వ్రాసి తమ స్థితితోబాటు జీవితపు మహోన్నత సత్యాన్ని స్వామీజీ వ్యక్తం చేస్తున్నారు.
ఒక వ్యక్తిని సజ్జనునిగా మార్చగోరితే…
“నే నెందుకు సజ్జనునిగా ఉండాలి?” అని స్వామీజీ ఒకసారి తమను తామే ప్రశ్నించుకొని, జవాబు కూడా తెలిపారు; “ఎందుకంటే అది భగవంతుని మహత్త్వాన్ని స్తుతించడానికి కనుక. కానవచ్చేదంతా ఆయన మహత్త్వమే. నేను సన్మార్గం నుండి వైదొలగినప్పుడు ఆయన మహత్త్వాన్ని తిరస్కరిస్తాను. నే నెందుకు అలా చేయాలి! నువ్వొక వ్యక్తిని సజ్జనుడిగా మార్చగోరితే ఆతడికి ఉపదేశాలు చేయకు, ఆతణ్ణి సంస్కరించడానికి ప్రయత్నించకు. ఆతడితో సహజీవనం చేయి. నీలో సజ్జనత్వమనే దివ్య అగ్నికణం ఉండే పక్షంలో అది ఆతణ్ణి రగిలించి సజ్జనుడిగా మారుస్తుంది.”
ఒకసారి ఒక విహారయాత్రలో స్వామీజీ పై వ్యాఖ్యానం చేశారు. ఈ రోజుల్లో ఆయన పలువురి ఇళ్లలో బస చేశారు. సమయం దొరికినప్పుడల్లా సమీపంలోని గుట్టలు, నదీతీరాలు లాంటి స్థలాలకు పలువురితో విహారయాత్ర చేసేవారు. తమతో వచ్చిన భాగ్యశాలురలో ఆధ్యాత్మికతను పెంపొందించారు. పైన చెప్పిన కారణమే ఆయనను అనేక ఇళ్లలో బస చేయనిచ్చిందని భావించవచ్చు. ఆయన ‘దివ్య అగ్నికణం’ రగిలించడంతో అదృష్టవంతమైన కుటుంబాలు ఎన్నో! వ్యక్తులు ఎందరో! స్వామీజీ తమ ఇళ్లలో బస చేసిన రోజులను జ్ఞాపకం చేసుకొన్న మీడ్ సోదరీమణులలో ఒకరు ఇలా అన్నారు:
“ఆహా, స్వామీజీ బస చేసిన స్థలంలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వ్యాపించి ఉంటుంది. ఒకసారి ఆయన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా ఎడతెగకుండా మాట్లాడారు. అక్కడ అప్పుడు నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం వర్ణనాతీతం. సాక్షాత్తూ ఏసుక్రీస్తు మా ఇంటికి విచ్చేసి మాతో ఉన్నట్లు అనిపించింది.”
మీడ్ సోదరీమణుల ఇంట్లో
స్వామీజీ తమ ఇంటికి విచ్చేసి వసించాలని మీడ్ సోదరీమణులు ఎంతగానో అభిలషించారు. స్వామీజీ అనేకుల ఇళ్లలో వసిస్తూ వచ్చారు. హఠాత్తుగా ఒక రోజు ఒక గుర్రపు బండిలో దక్షిణ పాసెడేనాలోని మీడ్ సోదరీమణుల నివాసం ముందు దిగారు. తమ మూటముల్లెలను ఇంటి వసారాలో దింపి, “మీతో నివసించడానికి వచ్చాను. నేను నివసించడం ఇంకా ఆ మహిళ భరించలేదు” అన్నారు. ‘ఆ మహిళ’ అని స్వామీజీ సూచించింది ఎవరినో తెలియడం లేదు. కాని అంతకు ముందు ఆయన బస చేసిన ఇంటి యజమాను రాలని అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత స్వామీజీ మీడ్ సోదరీమణుల ఇంట్లో చాలాకాలం బస చేశారు. ఆ ఇంట్లో మీడ్ సోదరీమణులైన ముగ్గురు, వారి తండ్రి మీడ్, మిసెస్ హాన్స్బరో నాలుగేళ్ల కుమార్తె డోరథీ, మిసెస్ వైకాఫ్ పదిహేనేళ్ల కుమారుడైన రాల్ఫ్, పనిమనిషి మిస్ ఫేర్ ఫెన్క్స్లు ఉంటున్నారు.
జీవన సరళి
స్వామీజీ అమెరికాలోనూ, ఇంగ్లండ్‌లోనూ అనేకుల ఇళ్లలో అతిథిగా నివ సించారు. అయినప్పటికీ ఆయన దైనందిన జీవితం, ఆహారం, దుస్తుల లాంటి విషయాల గురించి స్పష్టంగా సమాచారం అందించిన వ్యక్తి మీడ్ సోదరీమణులలో ఒకరైన మిసెస్ హాన్స్బరో మాత్రమే.
బయటకు వెళుతున్నప్పుడు, ఎవరైనా కలుసుకోవడానికి వచ్చినప్పుడు స్వామీజీ దుస్తుల విషయంలో శ్రద్ధ వహిస్తారు. కాని ఇంట్లో ఆయన దానిని గురించి అంతగా శ్రద్ధ తీసుకోరు; “ఇంట్లో ఎందుకు అట్టహాసంగా ఉండాలి? నేను వివాహం చేసుకోబోతున్నానా ఏమిటి?” అని అడిగేవారు. సామాన్యంగా ఇంట్లో ఉన్నప్పుడు ఒక అంగీ ధరించి, నడుముకు ఒక తాడుతో దానిని బిగించి ఉంచేవారు. ఆయనది అందమైన ఉంగరాల జుట్టు. కత్తిరిస్తే వాటి అందం తగ్గి పోతుందని కత్తిరించుకోవద్దని విన్నవించేవారు. స్వామీజీ కూడా ఒక బాలునిలా వారి మాటను తు.చ. తప్పక పాటించేవారు. “తమ ఆకృతి గురించి ఆయన ఎలాంటి శ్రద్ధా తీసుకోరు. తమను గురించిన ఆలోచన కించిత్తు కూడా లేని వారు ఆయన” అని హాన్స్బరో వ్యాఖ్యానించడం కద్దు.
పండ్లు, ఉడకబెట్టిన రెండు గుడ్లు, రెండు రొట్టె ముక్కలు, రెండు కప్పుల కాఫీ – ఇవీ స్వామీజీ ఉదయం పూట పుచ్చుకొనే ఉపాహారం. భోజనం, కాఫీ మొదలైన అన్నింట్లోనూ చాలా మితంగానే ఆయన ఉండేవారు. మధ్యాహ్న భోజనంలో కాయగూరలు, మాంసం చోటుచేసుకొనేవి. కాయధాన్యాలు, పచ్చి బఠాణీలు, దాక్షపండ్లు ఆయన ఇష్టంగా తినేవారు.
ఒక రోజు భోజనంలో జామపండు చేర్చారు. బల్ల మీద భోజనం అమరుస్తు న్నప్పుడు స్వామీజీ పచార్లు చేయసాగారు. ఈస్టర్ పండుగ ముందు నలభై రోజుల వ్రతం గురించి ప్రస్తావన వచ్చింది. తాము అమితంగా ఇష్టపడే ఒక వంటకం ఆ నలభై రోజులూ తినకుండా వ్రతం ఆచరించడం క్రైస్తవులకు పరిపాటి. స్వామీజీ ఇలా అన్నారు; “మా దేశంలోనూ ఇలాంటి వ్రతం ఆచరిస్తారు. నాలాంటి సోమరులు తప్ప తక్కిన అందరూ ఏదైనా ఒకటి పరిత్యజిస్తారు. పోనీలెండి, నేను జామపండు పరిత్యజిస్తాను.”
మాంసాహారం ఎందుకు?
సామాన్యంగా మధ్యాహ్న భోజనానికి ఎవరైనా అతిథులు రావడం కద్దు. స్వామీజీ ప్రసంగాలు వినడానికి లాస్ ఏంజెల్స్ నుంచి వచ్చే మెక్లౌడ్, మిసెస్ లెగ్గట్లు నిత్యం మధ్యాహ్న భోజనం అక్కడే చేసేవారు. ఆ సమయాల్లో స్వామీజీ ముచ్చటించేవారు; అనేక సమయాల్లో ఆయన భారతదేశం గురించే ముచ్చటించేవారు. తమ హృద యంలో సర్వవేళలా భారతదేశానికి ఒక ప్రత్యేకస్థానం ఆయన కేటాయించి ఉంచారు. ఆంగ్లేయుల బానిసలుగా భారతీయులు అనుభవించే యాతనలు కొన్ని సమయాల్లో ఆయన ముఖాన ద్యోతకమయ్యేవి. సహనంతో వాటిని ఆయన భరించేవారు. ఒక రోజు ఆయన ఇలా అన్నారు:
“ఆంగ్లేయులు భారతదేశానికి రావడం హిందువులను జయించడానికీ కాదు, వారికి నేర్పించడానికీ కాదు; నిజానికి వారి రక్తాన్ని జుర్రుకోవడానికి! కాని ఏం దురదృష్టం! వచ్చిన సైనికులైనా, అధికారులైనా సరే అతి నిమ్నకులానికి చెందిన వారిలా, అనాగరకులుగా ప్రవర్తించారు. ఒక రోజు నేను వీథి మూలన కూర్చుని ఉన్నప్పుడు, ఆ దారి గుండా ఇద్దరు ఆంగ్లేయులు వెళ్లారు. వారిలో ఒకడు నన్ను కాలితో తన్నాడు: విస్తుబోయి ఆతణ్ణి కారణమేమిటని అడిగాను. అందుకు అతడు, ‘మలినపు మూట అయిన భారతీయుడివి నువ్వు. నిన్ను చూస్తేనే ఇలా ఏదన్నా చెయ్యాలనిపిస్తుంది’ అన్నాడు. నేను వదల్లేదు; ‘ఆహా, నేను మిమ్మల్ని అంతకన్నా అధమంగా పరిగణిస్తున్నాను; మిమ్మల్ని మలిన మ్లేచ్ఛులని కదా పేర్కొంటున్నాం’ అన్నాను. ఈ ధూర్త సైనికులు ఎంతమంది నిమ్నకుల స్త్రీల జీవితాలను నాశనం చేశారో తెలుసా? ఆంగ్లేయుని ఇంట్లో ఏదైనా దొంగతనం చేస్తే ఆ దొంగను చంపేస్తారు. పాపం, హిందువులు గత్యంతరంలేని స్థితిలో కూలబడి ఏడుస్తారు, అంతే!
“మాకు మాత్రం కాస్తంత రణతత్పరత ఉంటే ఈ విధంగా వ్రేళ్ల మీద లెక్కించగల కొద్దిమంది ఆంగ్లేయులు మమ్మల్ని పాలించగలరా? అందుకే నేను భారతదేశం యావత్తూ పర్యటించి అందరూ మాంసాహారం తిని రణతత్పరతను పెంపొందించుకోవాలని బోధిస్తున్నాను.”
కొన్ని సంఘటనలు
ఉదయం పూట ప్రసంగ కార్యక్రమం లేకపోతే స్వామీజీ కొంతసేపు తోటలో పచార్లు చేసేవారు, లేదా గ్రంథాలయానికి వెళ్లి చదువుకొనేవారు. మధ్యాహ్న భోజనానంతరం కొంతసేపు నడుం వాల్చేవారు. లేకుంటే మిసెస్ వైకాఫ్ ఇంటి పనులు చేసుకొంటున్నప్పుడు ఆమెతో మాట్లాడేవారు. కొన్ని సమయాల్లో ఆమెతో కలిసి తోటలో పచార్లు చేసేవారు. పచార్లు చేస్తూ బెంగాలీ పాటలు పాడి వాటి అర్థాన్ని వివరించేవారు. “అజ్ఞానంలో మునిగిపోయిన అజ్ఞాని రాతిరప్పలకు ప్రణమిల్లుతున్నాడు” అనే క్రైస్తవ గీతం పాడి, “అంతటి అజ్ఞానిని నేను” అంటూ నవ్వేవారు.
కొన్ని సమయాల్లో మధ్యాహ్న వేళల్లో లేఖలు వ్రాసేవారు. ఈ రోజుల్లో నివేదిత కోసం అనేక పురాణ కథలు, ‘తల్లి లీల లెరుగ ఎవరి తరం!’ * అనే గీతాన్ని కూడా వ్రాసి పంపించారు.
కొన్ని సందర్భాల్లో స్వామీజీ భేటీ ఇచ్చేవారు. భేటీ పేరిట విచిత్రాలు జరగడం కూడా కద్దు. వచ్చేవారు మీడ్ సోదరీమణులతో ఎడతెగకుండా మాట్లాడు తూవుంటే, స్వామీజీ ఏం మాట్లాడకుండా పొగత్రాగుతూ ప్రశాంతంగా కూర్చుని ఉంటారు. ఆయనే ఏదన్నా మాట్లాడాలనుకొన్న ఒక స్త్రీ ఒక రోజు లేచి వెళ్లిపోతున్నప్పుడు, “ఈయన ఏమిటి ఇలా కూర్చుండిపోయారు? ఈ మనిషికి ఆంగ్లం తెలియదా?” అని అడగనే అడిగింది.
ఒక స్త్రీ కూర్చోబెట్టి ఆయన చిత్రం గీయాలనుకొంది. కాని స్వామీజీ ఎందుకో అందుకు సమ్మతించలేదు. ఎంత బ్రతిమాలినప్పటికీ ఒప్పుకోలేదు. ఆ స్త్రీ హాన్స్బరో ద్వారా విన్నవించినప్పుడు స్వామీజీ, “ఆ స్త్రీని బయటకు వెళ్లమని చెబుతావా లేక నేను ఇంటిలో నుంచి వెళ్లిపోనా?” అన్నారు కచ్చితంగా. ఆ స్త్రీ తిరుగుముఖం పట్టవలసివచ్చింది.
సాయంత్రాల్లో రాత్రి భోజనం వండడంలో స్వామీజీ సహాయపడేవారు. కొన్ని సమయాల్లో స్వయంగా ఆయనే వండేవారు కూడా. ఆయన తయారుచేసే చపాతీలు డోరథీకి, రాల్ఫ్‌కు ఎంతో ఇష్టం. ముందు మసాలా దినుసులను నూరే వారు. నిలబడి నూరడం ఆయనకు నచ్చదు. కనుక బాసికపట్టు వేసుకొని కూర్చొని నూరేవారు. పిదప వెన్నలో తాలింపు వేయడం మొదలుపెట్టేవారు. దాన్లో లేచే పొగ మీడ్ సోదరీమణులకు అసహనీయంగా ఉండేది, మంటలతో కళ్లలో నీళ్లు తిరిగేవి. కనుక తాలింపు వేయడానికి మునుపే, “ఇదిగో వస్తోంది పొగ! స్త్రీలు ఇక్కడ నుండి వెళ్లిపోవాలని కోరుకొంటున్నాం” అంటూ బిగ్గరగా ప్రకటించేవారు.
సామాన్యంగా సాయంత్రం ఆరున్నర గంటలకు రాత్రి భోజనం ముగించే వారు. రాత్రి భోజనంలో కాయగూరలు, పాయసం, చపాతీ, పులుసు, చేప లేదా మాంసం సూప్‌లు చోటుచేసుకొంటాయి. భోజనానంతరం చలి కాచుకోవడానికి పొయ్యి రగిలించేవారు. కొందరు కుర్చీలలో, కొందరు మంచం మీద సౌకర్యంగా కూర్చునేవారు. వాలుకుర్చీలో బాసికపట్టు వేసుకొని స్వామీజీ కూర్చునేవారు. కొన్ని సమయాల్లో శాస్త్రగ్రంథాలు చదివి అర్థం వివరించేవారు. లేదా ఏదైనా విషయం గురించి ముచ్చటించేవారు. కాని ఆయన ఏం చేసినా అదొక ఆధ్యాత్మిక అనుభవాన్ని వారి హృదయాలలో పాదుగొలిపేదిగా ఉండేది.
“వంట, భోజన సమయాలలో తప్ప తక్కిన సమయాల్లో స్వామీజీ ఎక్కువగా నవ్వడమో, పరిహసించడమో చేసేవారు కారు. కాని ఆయన సమక్షంలో ఉండే ప్రతి క్షణమూ మనం పెంపొందుతాం. పెద్దగా ఎలాంటి ఉపదేశాలూ మాకు చేయలేదు. కాని ఆయన మాకు కనువిప్పు కలిగించారు. తమ జీవితం ద్వారా ఆయన నేర్పిన పాఠం ఎన్నటికీ మరచిపోలేం” అంటూ హాన్స్బరో వ్రాస్తున్నది.
ఒక రోజు స్వామీజీ వైకాఫ్తో, “నేను వండిన ఆ మసాలా కూర ఎలా ఉంది?” అని అడిగారు. “ఆహా, బ్రహ్మాండంగా ఉంది” అందామె. కాని స్వామీజీని అంత సులభంగా మోసగించలేం. కాసేపు ప్రశాంతంగా ఉండి, “నిజంగా చెబు తున్నావా లేదా ముఖస్తుతి కోసం చెబుతున్నావా?” అని స్వామీజీ అడిగారు. “ఇందుకు జవాబు చెప్పడం కాస్త సంకోచంగానే ఉంది, అయినప్పటికీ చెబుతు న్నాను: ముఖస్తుతి కోసమే ప్రశంసించాను” అంది వైకాఫ్.
మరొక రోజు స్వామీజీ కోసం వైకాఫ్ వంట చేస్తున్నది. స్వామీజీ అక్కడ పచార్లు చేస్తున్నారు. హఠాత్తుగా నిలబడిపోయి ఆమెను చూస్తూ, “మీ వైవాహిక జీవితం మధురంగా ఉందా?” అని అడిగారు. “అవును స్వామీజీ!” అందామె. స్వామీజీ మౌనంగా బయటికి వెళ్లిపోయారు. కాసేపట్లోనే తిరిగి వచ్చి వైకాఫ్తో, “మేడమ్! ఈ ప్రపంచంలో ఒకరి వైవాహిక జీవితమన్నా ఆనందంగా సాగుతూండ డం నాకు సంతోషంగా ఉంది” అన్నారు. “బహుశా వైకాఫ్ దుఃఖాన్ని సాంత్వన పరచడానికే స్వామీజీ ఆ ప్రశ్న వేశారా?” అని వ్రాస్తున్నది మేరీ లూయీ బర్గ్. ఎందుకంటే వైకాఫ్ జీవితం నిజానికి ఆనందదాయకం కాదని కాలాంతరంలో తెలియవచ్చింది. బహుశా నాడు ఆమె నిజం చెప్పివుంటే స్వామీజీ ఆ దుఃఖాన్ని తొలగించి ఉండేవారు. కాని అది జరగలేదు. కాలాంతరంలో వైకాఫ్ చిన్న విషయాల్లో సైతం నిజాన్నే మాట్లాడాలని నిశ్చయించుకొని జీవించింది.
పిల్లలతో భగవంతుని గురించి
పిల్లలతో ప్రాంగణంలో ఆడుకోవడమంటే స్వామీజీకి మహా ఇష్టం. డోరథీ మిత్రులు పలువురు అక్కడకు వచ్చేవారు. వారి చేతులు పుచ్చుకొని వృత్తాకారంగా పరుగెత్తి ఆడడంలో స్వామీజీ ఎంతో ఉత్సుకత చూపించారు. తాను ఆటలో పాల్గొంటే పిల్లలు ఆనందిస్తారని ఆయన వారితో కలిసి ఆడారు. అదే సమయంలో వారి జీవన సరళిని ఆయన సూక్ష్మంగా గమనించారు. వారితో మాట్లాడేవారు. ఆటలు, చదువు లాంటి విషయాల గురించి వారిని ప్రశ్నించి తెలుసుకొనేవారు. పిల్లల పెంపకం గురించి అనేక సమయాల్లో తక్కిన వారితో ముచ్చటించే వారు కూడా! పిల్లలను ఏ కారణంగానైనా శిక్షించడం ఆయనకు సుతరామూ నచ్చదు. “పిల్లవాడు భయపడే విధంగా నేను ఏదీ చేయను” అనేవారు ఆయన.
రాల్ఫ్, డోరథీలను ఆయన ఎంతో ప్రేమించారు. వారి తలల మీద చేతులు ఉంచి ఆశీర్వదించారు కూడా! రాల్ఫ్ స్వామీజీని ఎంతగానో ప్రేమించడంతోపాటు, తన శక్తి మేరకు ఆయనకు సేవలు కూడా అందించాడు. ఆయన పాదరక్షలను పాలిష్ చేయడం, హుక్కా సిద్ధం చేయడం లాంటి పనులు అతడే స్వయంగా చేశాడు. ఒక రోజు స్వామీజీ అతడితో, “రాల్ఫ్! నువ్వు నీ కళ్లను చూడగలవా?” అని అడిగారు. “చూడలేను. కావాలంటే అద్దంలో చూడగలను” అన్నాడు రాల్ప్. వెంటనే స్వామీజీ, “భగవంతుడు కూడా అంతే. ఆయన నీ కళ్లలా, నీకు అంత సన్నిహితంగా ఉన్నాడు. నువ్వు ఆయనను చూడలేకపోయినప్పటికీ ఆయన నీకు అత్యంత సన్నిహితుడు, నీ సొంత మనిషి” అన్నారు.
“అద్భుత ప్రపంచంలో ఆలీస్”, “అద్దం గుండా ఆలీస్” అనే రెండు పుస్తకాలను ఆయన ఎంతో ఆస్వాదించారు.* “మనిషి మానసం వ్యవహరించే తీరుతెన్నులను చిత్రీకరించిన వైనం ముమ్మాటికీ నిజం. రచయితయైన లూయీస్ ఒక రకమైన ఆంతరిక జాగృతి పొందిన వ్యక్తియై ఉండాలి. ఈ పుస్తకాలు రచించిన ఆయన మనస్సు అసాధారణమైనది. ‘అద్భుత ప్రపంచంలో ఆలీస్’ ఈ శతాబ్దంలో (19 వ శతాబ్దం) రచించబడిన గొప్ప పిల్లల పుస్తకం” అని స్వామీజీ వ్యాఖ్యానించేవారు.
“జగత్తులో నియమం కానీ, లంకె కానీ లేదు. ఎంతో సంబంధమున్నట్లు మనం అనుకొంటున్నాం. మీరంతా ‘అద్భుత ప్రపంచంలో ఆలిస్’ చదివే ఉంటారు. బాలబాలికల కోసం ఈ శతాబ్దంలో రచింపబడిన పుస్తకాలలో అది చాలా అద్భుతమైనది. దానిని నేను చదివినప్పుడు చాలా ఆనందించాను. బాలబాలికల కోసం అలాంటి పుస్తకం వ్రాయాలన్న ఆలోచన నాకు ఉండేది. దేన్ని మీరు ఎంతో అసంబద్ధమనీ, ఒక దానితో ఒకటి అతకదనీ భావిస్తారో అదే నా కెక్కువ ప్రీతిని కలిగించింది. ఒక భావం కలుగుతుంది, అది మరొక భావంలోకి దూకుతుంది. ఈ రెంటికీ సంబంధ మేమీ ఉండదు. మీరు చిన్నతనంలో అదేమో పెద్ద సంబంధ మనుకొన్నారు. ఈ రచయిత చిన్నప్పటి ఆలోచనలన్నీ మళ్లీ మనస్సుకు తెచ్చు కొన్నాడు. శిశువుగా ఉన్నప్పుడు తన దృష్టిలో అవి పరస్పరం చక్కని సంబంధం గలవే. వాటితో ఇప్పుడు ఈ పుస్తకాన్ని పిల్లలకై రచించాడు.
“కల కంటున్నప్పుడు మనకు కనిపించే విషయాలన్నీ పరస్పర సంబంధం గలవిగానే అనిపిస్తుంది. స్వప్నావస్థలో అవి సంబంధం లేనివని మనం అనుకోం. జాగ్రదవస్థకు వచ్చిన తరువాత చూస్తే, వాటి అసంబద్ధత కనిపిస్తుంది. జగత్తు అనే ఈ స్వప్నం నుండి మేలుకొని, దీనిని పరమార్థంతో పోల్చినప్పుడు అదంతా సంబంధం లేనిదిగా, అర్థం లేనిదిగా, ఒక దానికీ మరొక దానికీ సంబంధం లేనిదేదో మన ముందు సాగిపోతున్నట్లుగా కనిపిస్తుంది.”*
ప్రసంగాలు
లాస్ ఏంజెల్స్లోను, దక్షిణ పాసడేనాలోను స్వామీజీ దాదాపు 38 బహిరంగ ప్రసంగాలు, తరగతి ప్రసంగాలు చేశారు. వాటిలో కొన్నింటికి రుసుము వసూలు చేయబడింది. అనేక ప్రసంగాలు షేక్స్పియర్ క్లబ్బులో జరిగాయి. మీడ్ సోదరీమణుల ఇంట్లో నుంచి నాలుగు అడుగులు వేస్తే విద్యుత్ రైలు సౌకర్యం ఉంది. దానిలో ఎక్కి పాసడేనా వెళ్లి అక్కణ్ణుంచి క్లబ్బుకు స్వామీజీ వెళ్లేవారు. సామాన్యంగా హాన్స్బరో ఆయనతో వెళ్లేది. నడిచి తీరాలనుకొని కొన్ని సమయాల్లో స్వామీజీ ఆ చోటు దాకా కాలినడకన వెళ్లడం కద్దు.
స్వామీజీ ప్రసంగాలలో అందరినీ ఆశ్చర్యచకితులను చేసిన ఒక అంశం ఉంది. అది – ఆయన తమ ప్రసంగాలకు ఎలాంటి టిప్పణులూ వ్రాసుకుని రాకపోవడమే! సమావేశానికి వచ్చిన తరువాతనే సామాన్యంగా ప్రసంగాంశాన్ని నిర్ణయించేవారు ఆయన. క్షణంలో ఆ ప్రసంగాంశం మీద ఉపన్యసించడానికి సిద్ధమయ్యేవారు. ఎలాంటి తడబాటూ లేకుండా తూము తెరచిన తరువాతి తరువాతి వెల్లువలా భావనలు బయటికి వస్తాయి. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితు లవడం తథ్యం.
మొదటి రోజు ప్రసంగానికి (అంశం: ప్రేమే మతం) ముందు ఒక స్త్రీ అక్కడున్న ప్రొఫెసర్ పాంకర్తో, “వక్త క్రైస్తవుడైన హైందవుడని అనుకొంటున్నాను, అంతే కదా?” అని అడిగింది. అందుకు ఆ ప్రొఫెసర్ గర్వంగా, “లేదు. ఆయన మతం మార్చుకోని హైందవుడు. నిజమైన ఒక హైందవుని నుండి మీరు హిందూమతం గురించి తెలుసుకోబోతున్నారు” అన్నాడు.
లాస్ ఏంజెల్స్‌లో ఒకసారి ‘పారసీక కళ’ అనే అంశం మీద కూడా స్వామీజీ ప్రసంగించారు.
గందరగోళం సృష్టించే వ్యక్తులు
యథాప్రకారం అన్ని ప్రసంగాలూ సాఫీగా జరగలేదు. కొన్ని సమయాల్లో కొందరు ఎలాగైనా స్వామీజీ ముఖతః అసంబద్ధమైన మాటలు రప్పించి ఆయనను ఇరికించాలనే ఉద్దేశంతో ప్రసంగాలకు వచ్చారు. జనవరి 18 వ తేదీన ‘భారతీయ మహిళ’ అనే అంశం మీద స్వామీజీ ప్రసంగించారు. భారతదేశానికి మిషనరీలను పంపే ఒక చర్చ్తో సంబంధమున్న స్త్రీ పురుషులు కొందరు అక్కడకు వచ్చివున్నారు. నాటి ప్రసంగ సమయంలో, శ్రోతలనే విషయాంశం పేర్కొనమని స్వామీజీ కోరు కొన్నారు. వెంటనే చర్చ్ నుంచి వచ్చిన వ్యక్తులు తమలోతాము ఏదో చర్చించు కొన్నారు. తరువాత వారిలో ఒక స్త్రీ లేచి నిలబడి, “మేం మీ తాత్త్వికత పర్యవ సానం గురించి తెలుసుకోగోరుతున్నాం. మీ తత్త్వమూ, మతమూ మీ స్త్రీలను మా స్త్రీల కన్నా ఉన్నతస్థితికి తీసుకువెళ్లాయా?” అని అడిగింది. “భారతీయ స్త్రీలను గురించి చెప్పండి” అంటూ ప్రత్యక్షంగా ప్రశ్నించకుండా ఇలా చుట్టుత్రిప్పి మాట్లాడడం స్వామీజీకి నచ్చలేదు. కనుక ఆయన, “ఇదిగో చూడండి, మీ ప్రశ్నే సబబుగా లేదు. ఎవరు పైన, ఎవరు క్రింద? నేను మా స్త్రీలను గౌరవిస్తాను, మీ స్త్రీలనూ గౌరవిస్తాను” అన్నారు.
ఈ విధంగా విభిన్న పరిస్థితిలో ఆనాటి ప్రసంగం ప్రారంభమైంది.* ప్రసంగానంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలయింది. 1894 లో ఒకసారి ఆయన కేంబ్రిడ్జ్‌లో ఇదే అంశం మీద ప్రసంగించినప్పుడు అడిగిన ప్రశ్నలనే ఇప్పుడూ అడిగారు. హైందవ స్త్రీలను హింసించడం, బాల్యవివాహం, చిన్న వయస్సులోనే తల్లి కావడం, శిశువులను మొసళ్లకు ఆహారంగా నదుల్లో పార వేయడం లాంటి ప్రశ్నలే ఉన్నాయి. స్వామీజీ అన్నింటికీ ఓపికగా జవాబిచ్చారు.
చివరగా వివాహం గురించి ప్రశ్నలు అడిగారు. వాటికీ జవాబులిచ్చి చివరగా, “భారతదేశంలో వైవాహిక బంధాన్నీ, భార్యా భర్తల సంబంధాన్నీ మీరు అర్థం చేసుకోగలరనుకోను. ఎందుకంటే భారతదేశంలో వివాహ లక్ష్యం విషయ సుఖం కాదు” అన్నారు. ప్రారంభంలో ప్రశ్నించిన ఆ స్త్రీ పదే పదే దీనిని గురించిన ప్రశ్నలనే అడిగి స్వామీజీని విసిగించింది. “ఈ ఒక్క కార్యక్రమంలో తప్ప స్వామీజీ వేదిక మీద కోపగించుకోవడమో, విసుగుచెందడమో నేను చూడలేదు. ఒక దశలో ఆయన తమ చేతులను పైకెత్తి బల్ల మీద గుద్దడంతో గాయమై ఉంటుందేమో ననిపించింది” అంటూ వ్రాస్తున్నది హాన్స్బరో. “లేదు, మీరు అర్థం చేసుకోలేరు. చీకటి ఏకాంతంలో, కామ ప్రకోపం కారణంగా ఒక జీవిని ఉత్పత్తి చేసే బాంధవ్యం భారతదేశంలో లేదు” అంటూ స్వామీజీ నొక్కివక్కాణించారు.
ఈ మాటలు వినగానే ఆ స్త్రీ లేచి నిలబడి, “ఈయన అబద్ధం చెబుతున్నారు. ఈయన అబద్ధాలకోరు” అంటూ అరిచింది. వెంటనే స్వామీజీ, “భారతదేశం గురించి నా కన్నా మీరు బాగా అర్థంచేసుకొన్నట్లు ఉంది. మీరే ప్రసంగించండి. నేను పోతాను” అంటూ వేదిక పైనుంచి దిగారు. ఆయన హాలులో సగం దాకా వెళ్లేవరకు ఆ స్త్రీ, ఆమె బృందంవారు వెనుకనే వెళ్లి ఏదేదో ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇంతలో జనంలో మర్మరధ్వనులు లేచాయి. చివరికి ఏదో విధంగా అంతా సద్దుమణగింది. ఆ స్త్రీ బయటికి వెళుతున్నప్పుడు హాన్స్బరోతో కోపంగా, “మూర్ఖురాలా! ఆ మనిషి నిన్ను కూడా ద్వేషిస్తున్నాడని నీకు అర్థం కాలేదా?” అని అడిగింది. అందుకు హాన్స్బరో, “లేదు, నా కింకా అది అర్థం కాలేదు” అన్నది ప్రశాంతంగా.
‘ఇదేమీ క్రొత్త కాదు!’
స్వామీజీ రెండవ పాశ్చాత్య పయనంలో ఇదొక్కటే ఇంతటి ప్రత్యక్ష ప్రతిఘటన జరిగిన సంఘటన. ఇది చిన్నదే. ఆయన పెద్ద పోరాటాలన్నీ మొదటి పయనంలోనే సమాప్తమయ్యాయి. లభించిన ప్రతి ఆయుధంతో వారు స్వామీజీని ఎదుర్కొన్నారు. కాని స్వీయ గాంభీర్యం తోనూ, స్వీయ మహత్త్వంతోనూ, నిష్కళంక జీవితంతోనూ ఆయన వారి ప్రతిఘటనలన్నింటినీ నిర్జించారు. దీని గురించి ఇంత క్రితమే విపులంగా చూశాం. ఈ ప్రతిఘటనలు స్వామీజీకి సంబంధించినంత వరకు అతి సామాన్య విషయం. ఆయన మళ్లీ కనీసం 12 సార్లన్నా ఆ క్లబ్బులో ప్రసంగించారు.
మరొక రోజు ‘నా జీవితమూ మహత్కార్యమూ’ అనే అంశం మీద ప్రసంగించినప్పుడు, తమ మాతృదేశాన్ని గురించి నీచంగా మాట్లాడిన మిషనరీలను తీవ్రంగా విమర్శించారు. “ఆయన ప్రాంతీయమైన తిట్లను ప్రసంగంలో ఉపయో గించడం ఈ ఒక్క చోట మాత్రమే నేను విన్నాను” అంటున్నది హాన్స్బరో. ఆ మేరకు తీవ్రంగా వారిని విమర్శించి, తిరిగి వస్తున్న దారిలో ఆయన హాన్స్బరోతో, “ప్రసంగం ఎలా ఉంది? నచ్చిందా?” అని అడిగారు. “చాలా బాగుంది. కాని శ్రోతల అసంతృప్తిని సముపార్జించుకొన్నారేమోనని భయపడుతున్నాను” అంది హాన్స్బరో. ఆమె భయాన్ని తమ ఉదాసీనమైన నవ్వుతో పోగొట్టిన స్వామీజీ, “మేడమ్! నా ప్రసంగంతో అసంతృప్తి చెంది, శ్రోతలు ఏకమొత్తంగా లేచి నిలబడి బయటకు వెళ్లిపోయిన సంఘటనలు కూడా న్యూయార్క్‌లో జరిగాయి. కనుక ఇదేమీ నాకు క్రొత్త కాదు” అన్నారు.
‘నష్టం నాకు కాదు’
స్వామీజీ గురించి పుకార్లు ప్రచారం చేయడం మిషనరీల ప్రతిఘటన విధానమన్న విషయం తెలిసిందే. దీనిని కూడా స్వామీజీ తమదైన ప్రశాంతతతో, పెద్దమనిషి తరహాలో ఎదుర్కొన్నారు. ఈసారి కూడా అలాంటి పుకార్లు తలెత్తాయి. ప్రొఫెసర్ పామ్కర్ దంపతులు ఆయనను చూడడానికి వచ్చినప్పుడు దీనిని గురించి ప్రస్తావన వచ్చింది. స్వామీజీ ప్రశాంతంగా, మౌనంగా ఆసాంతం వింటూ నడుస్తున్నారు. చివరగా ఇలా అన్నారు: “ఇదిగో చూడండి! నేను ఎవరిని, నేను ఏమిటన్నది నా నుదుట వ్రాసి ఉన్నది. మీరు దానిని చదివి అర్థం చేసుకోగలిగితే మీరు భాగ్యశాలురు. లేకపోతే నష్టం నాకు కాదు, మీకే!”