నా ఆత్మ విస్తరించిపోతున్నది; కేవలం రక్తమాంసాలతో కూడుకొన్న ఈ గూటిలో నేను ఇంకా ఎక్కువ రోజులు వసించలేను.
– స్వామి వివేకానంద
పనుల పట్ల సంతృప్తి — శక్తి సొరంగం — ‘పాపాన్ని ఎదుర్కోండి!’ — లాన్స్బర్గ్ కల్పించిన ఆవేదన — ఉద్వేగాలు: శారీరక రుగ్మత — ‘నా ఆత్మ విస్తృతిస్తోంది!’
పనుల పట్ల సంతృప్తి
అమెరికాలో స్వామీజీ వదలి వెళ్ళిన పనులను కొనసాగించిన వారు ముఖ్యంగా నలుగురు. వారు: శారదానంద, అభేదానంద, అభయానంద, మిస్ వాల్డో. శారదానంద గ్రీనేకర్, న్యూయార్క్, బోస్టన్ మొదలైన ప్రాంతాలలో వేదాంత తరగతులు నిర్వహించారు. ఆయన ప్రసంగాలకు చక్కని స్పందన లభించింది; పని కూడా నిర్విఘ్నంగా సాగింది. శారదానంద వెళ్లలేని సమయాల్లో మిస్ వాల్డో వేదాంత తరగతులను నిర్వహించింది. 1898 జనవరిలో స్వామిజీ విన్నపం మేరకు శారదానంద భారతదేశానికి తిరిగి వచ్చారు. పిదప అభేదానంద పనులను కొనసాగించడంతో పాటు వాటిని విస్తృత పరిచి న్యూయార్క్‌లో మఠం కోసం స్థలం కూడా కొనుగోలు చేశారు. ఈ కార్యకలాపాలలో అభయానంద కూడా కీలకపాత్ర పోషించారు. ఈ విధంగా దాదాపు ఆరేళ్ల క్రితం స్వామీజీ వెదజల్లిన బీజం నేడు ఒక వృక్షంగా పెరిగి పెద్దదై అమెరికాలోని అనేక ప్రాంతాలలో శాఖోప శాఖలుగా విస్తరించింది.
1899 నవంబర్ 7వ తేదీన న్యూయార్క్ వెళ్లిన స్వామీజీ ముందు వేదాంత కేంద్రాన్ని సందర్శించారు. నవంబర్ 10వ తేదీన స్వామీజీకి మఠంలో ఘనంగా స్వాగతం ఇచ్చారు. ఆయన అక్కడ కొన్ని రోజులు బస చేశారు. ఆ రోజుల్లో ఎలాంటి బహిరంగ ప్రసంగాలూ ఆయన చేయలేదు. ఒకటి రెండు తరగతి ప్రసంగాలు చేసి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సమయంలో మాంట్క్లేర్ వెళ్లిన తురీయానంద పనులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం పంపించడం స్వామీజీకి ఎంతో ఆనందాన్నిచ్చింది. అమెరికా పనుల ఈ పురోగతి పట్ల స్వామీజీ ఎంతో సంతృప్తి చెందారు.
శక్తి సొరంగం
స్వామీజీ తరగతులు ఎలా నిర్వహించబడ్డాయి? ఆయన కేవలం పదాలతో మాత్రం మాట్లాడలేదు, కేవలం భావనలను మాత్రమే వ్యక్తం చేయలేదు; వాటితో ఆ భావనలను గ్రహించే శక్తిని కూడా అందించారు. అసంఖ్యాక ప్రసంగాలు, ఎన్నో తరగతులు, వ్యక్తిగత చర్చలు – వీటి అన్నింట్లో రాసుల కొద్దీ అందించేటందుకు ఆయన ఆధ్యాత్మిక శక్తి సొరంగంగా విరాజిల్లారు.
ఈ రోజుల్లో ఒకసారి ఆయన తరగతి నిర్వహిస్తున్నప్పుడు హఠాత్తుగా ప్రసంగించడం ఆపి, గది వదలి బయటకు వెళ్లిపోయారు. వచ్చినవారు నిరాశ చెంది వెళ్లిపోయారు. స్వామీజీ తమ గదికి వెళుతున్నప్పుడు మిత్రుడొకడు, “స్వామీజీ! ప్రసంగం ఇప్పుడే రక్తి కడుతోంది. చెప్పవలసిన భావనలను మరచి పోయారా? లేదా నిస్సత్తువ ఆవహించిందా?” అని అడిగాడు. “లేదు నాయనా! ఇవేవీ కారణం కాదు” అంటూ స్వామీజీ కొనసాగించారు: “అపరిమితమైన శక్తి నాలో నిండి ఉండడం ఆ ప్రసంగ సమయంలో గ్రహించాను. శ్రోతలు ఆ శక్తి కారణంగా నేను వ్యక్తం చేసిన భావనలలో లోతుగా మునిగిపోయి కరిగిపోవడం చూశాను. కొందరు తమ వ్యక్తిత్వాన్నే కోల్పోసాగారు. ‘ఇదిగో, వీరందరూ బంకమన్నులా మెత్తబడిపోయారు. నేను కోరుకొన్నట్లు వీరి జీవితాన్ని రూపొందించ గలను’ అని నాకు తోచింది. కాని అది నా ఉద్దేశం కాదు. ప్రతి స్త్రీ, పురుషుడూ తమ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా దాని వైఖరిలో ఎదగాలి. అదే నా అభిలాష. వారి ఎదుగదలలో జోక్యం వేసుకోవడం ఇష్టం లేనందుననే నేను అర్ధంతరంగా ఆపివేశాను.” “బహుశా చెప్పవలసింది మరచిపోవడం వల్లనే సగంలో ఆపివేశారని శ్రోతలు భావించవచ్చు” అన్నాడు ఆ మిత్రుడు. “వారు ఏం అనుకొంటే నా కేమిటి?” అంటూ తమదైన వైఖరిలో స్వామీజీ జవాబిచ్చారు.
‘పాపాన్ని ఎదుర్కోండి!’
క్రైస్తవ మతంలో ‘పాపం’ అనేది ఒక ప్రధానమైన భావన; మనిషి పాపంతో జన్మించాడు, అతడు పాపి అనే భావన దానిని బలపరుస్తుంది. స్వామీజీ, “మనిషి దివ్యుడు” అంటూ భారతీయ ఆధ్యాత్మికతను ప్రతిధ్వనింపజేశారు. దీనిని ఆ క్రైస్తవ దేశంలో అనేకులు అవగతం చేసుకోలేకపోయారు. ఒక రోజు ప్రశ్నోత్తరాల సందర్భంలో చర్చ్‌లో పనిచేస్తున్న ఒక స్త్రీ, “స్వామీజీ! మీరెందుకు పాపం గురించి అసలు ప్రస్తావించడంలేదు?” అని అడిగింది. స్వామీజీ ముఖాన ఆశ్చర్యం ద్యోతకమైంది. ఆయన ఇలా అన్నారు:
“సోదరీ! నేను నా పాపాలను అభినందిస్తున్నాను. పాపం ద్వారానే నేను పుణ్యాన్ని అవగతం చేసుకొన్నాను. నేడు నేను ఈ స్థితిలో ఉండడానికి నా పుణ్యాలలా పాపాలూ కారణమే. నేడు నేను పుణ్యాన్ని బోధిస్తున్నాను. నేనెందుకు మనిషి దుర్బలతను బోధించాలి? కొన్ని సమయాల్లో మహాత్ములలో లేని కొన్ని సద్గుణాలు దుష్టులలో ఉండడం మీరు చూడలేదా? ఉన్నది ఒకే శక్తి. అదే మంచి గానూ, చెడుగానూ అభివ్యక్తమవుతుంది. దేవుడు, సైతాను ఒకే నది; నీరు మాత్రం వ్యతిరేక దిశలలో ప్రవహిస్తోంది, అంతే!”
క్రైస్తవ మతంలో ఊరిపోయిన ఆ స్త్రీ దిగ్భ్రాంతి చెందింది. ఆ తరువాత స్వామీజీ మనిషి దివ్యత్వం గురించి మాట్లాడనారంభించారు. “ఆత్మ పరిపూర్ణ మైంది, శాశ్వతమైంది, నాశనం లేనిది. ఆ ఆత్మ ప్రతి ఒక్కరిలోనూ ఉంది…” అంటూ ఆయన మాటలు కొనసాగాయి.
ఆ మాటలు విన్న గురుదాస్* కాలాంతరంలో ఇలా వ్రాశారు: “తన స్వీయ దివ్యత్వాన్ని గ్రహించడం ద్వారా ప్రతి వ్యక్తీ సాక్షాత్తూ దైవం కావచ్చు – ఇది మనకు నమ్మకం కలిగిస్తుంది, బలాన్ని చేకూరుస్తుంది ఎక్కడెక్కడో తిరుగాడి అన్వేషించీ లభించనివారికి, ఎన్నో తలుపులు తట్టి కూడా తెరచుకోని వారికి స్వామీజీ ఉపదేశం ఎంత గొప్ప సాంత్వనను కలిగిస్తుంది! వారందరికీ స్వామీజీ రక్షకునిగా ఏతెంచారు. వారి హృదయ ద్వారం వద్దకే వచ్చి తట్టారు. ఆయన తట్టడం విని తలుపులు తెరచిన వారు అదృష్టవంతులు. ఎందుకంటే ఆయన రాకలో ఆశీస్సులు కూడా జతకలిశాయి కదా!”
లాన్స్బర్గ్ కల్పించిన ఆవేదన
న్యూయార్క్‌లో స్వామీజీ ఒక ఆవేదనను చవిచూడవలసి వచ్చింది. అది ఆయన అమెరికన్ శిష్యుడైన లాన్స్బర్గ్ను మళ్లీ కలుసుకోవడం. 1895–96 లో స్వామీజీ నుండి వైదొలగ నారంభించిన ఆతడు, 1898 ఆగస్టులో నూయార్క్ హెరాల్డ్ అనే పత్రికలో స్వామీజీని, ఆయన బోధించిన యోగపద్ధతులను, ఆయన అమెరికన్ శిష్యులను తీవ్రంగా విమర్శించి ఒక వ్యాసం వ్రాశాడు. ఆ తరువాత స్వామీజీతో దాదాపు ఎలాంటి సంబంధమూ పెట్టుకోలేదు.
ఇప్పుడు హఠాత్తుగా ఎక్కణ్ణుంచో ఎదురయ్యాడు లాన్స్బర్గ్. స్వామీజీ ఒక రోజు తమ ఆరోగ్య పరీక్షార్థం డాక్టర్ కర్న్సీ వద్దకు వెళ్లారు. ఈ డాక్టర్ స్వామీజీ స్నేహితుడు కూడా. ఆయన లాన్స్బర్గ్ గురించి విని అంతకు మునుపే ఆతణ్ణి తన ఇంటికి రాకూడదని నిషేధించాడు. కాని హఠాత్తుగా నాడు లాన్స్బర్గ్ అక్కడ ప్రత్యక్షమైనాడు.
ఆ సమయంలో స్వామీజీ నాడీస్పందనను డాక్టరు పరీక్షిస్తున్నాడు. అది సక్రమంగా ఉంది. హఠాత్తుగా నాడీ స్పందన పూర్తిగా ఆగిపోయింది. చూస్తే, ద్వారం వద్ద లాన్స్బర్గ్! ఆతణ్ణి చూడగానే స్వామీజీ నాడీ స్పందన ఆగిపోయింది! ఆనందంగా డాక్టర్ నవ్వాడు; “వచ్చిన వ్యక్తికి ధన్యవాదాలు చెప్పాలి. అంతెందుకు ఆతడికి డబ్బు కూడా ఇవ్వవచ్చు. ఎందుకంటే ఆతడి రాకతో స్వామీజీ నాడీ స్పందన ఆగిపోయింది. ఇది ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించడంలో గొప్ప సహాయం చేసింది” అన్నారు. స్వామీజీ లాన్స్బర్గ్తో మృదుమధురంగా కాసేపు ముచ్చటిం చారు. కాని అది ఏదీ ఆతడి మనస్సును మార్చినట్లుగా కనిపించలేదు. తరువాత స్వామీజీ అక్కణ్ణుంచి కదిలారు. లాన్స్బర్గ్ కూడా వెళ్లిపోయాడు. ఆతడి ఎడబాటు స్వామీజీ మనస్సును అమితంగా బాధించింది.
ఉద్వేగాలు: శారీరక రుగ్మత
దీనితోపాటు స్టర్డీ నుంచి వచ్చిన లేఖలు స్వామీజీ మానసిక ఆవేదనను ప్రకోపింపచేశాయి. ఆయన మనఃక్షోభ సోదర శిష్యులపై కోపంగా అభివ్యక్తమయింది. వారికన్నా ఆయన ప్రేమను అవగతం చేసుకొన్న వారెవరు? వారి పని, పురోగతి, తృప్తి నిచ్చేవిగా లేవని వారిని చీవాట్లు పెడుతూ వ్రాశారు:
“ ‘నేను లేనని’ మానసికంగా వ్యవహరించు. ‘ధనానికి, విద్యకు, సర్వానికి మీ అన్నపై ఆధారపడి ఉన్నాం’ అనే భావన పతనానికి దారితీస్తుంది. పత్రికకు కావలసిన ధనమంతా నేను వసూలు చేసి వ్యాసాలన్నీ నేను వ్రాస్తే మీరందరూ ఇక ఏం చేస్తారు? మన బాబు లందరూ అప్పుడు ఏం చేస్తారు? నా వంతు పని నేను ముగించాను. మిగతా చేయవలసిన దానిని మీరు నిర్వర్తించండి. ఒక్క పైసా అయినా వసూలు చేసేవారెవరూ లేరు. ఏ మాత్రమైనా బోధన చేసేవారెవరూ లేరు. తన విషయాలను జాగ్రత్తగా చూసుకోవడానికి కావలసిన బుద్ధిగలవారు లేరు. ఒక్క అక్షరమైనా వ్రాయడానికి సమర్థులైనవారు లేరు. కాని ఎందుకూ కొరగాని వీరందరూ సాధుసత్తములు! మీ స్థితి ఈ విధంగా ఉంటే ఆరు నెలలు పత్రికను, ధనాన్ని, ప్రచార కార్యక్రమం తదితరాల్ని బాలుర చేతిలో ఉంచు. వారూ ఏమీ చేయలేక (అసమర్థులై) పోతే అన్నింటినీ తెగనమ్మి ఆ వచ్చిన ధనాన్ని దాతలకు ఇచ్చి సన్న్యాసులుగా తిరుగుతూవుండండి.”*
అదే సమయంలో కోపం సమసిపోయాక వారిని సాంత్వనపరిచారు కూడా: “ఇదివరలో నేను కటువుగా వ్రాసిన లేఖలను గురించి పట్టించుకోవద్దు. అవి మీకు మంచి చేస్తాయి… నేను కొంతకాలం కనిపించకుండా ఉండడం అవసరం. ఆ సమయంలో ఎవరూ నాకు వ్రాయకుందురు గాక! నా ఉనికిని గూర్చి అన్వేషింప కుందురు గాక! అలా చేయడం నా ఆరోగ్యానికి అత్యావశ్యకం”* అని వారికి వ్రాశారు.
మానసిక దిగ్భ్రాంతులు శారీరక రుగ్మతలను వాటిల్లజేస్తాయనడం నిజమే. హెల్మర్, కర్న్సీ లాంటి ఉత్తమ వైద్యులు ఆయన శారీరక స్థితిని పరీక్షించినప్పటికీ ఆయన జలుబు, జ్వరం పాలబడ్డారు. కాని ఈ మేరకు తక్షణ ప్రతి పరిణామాలు అతి సాత్త్వికమైన దేహాలకే వాటిల్లుతాయి. ఎందరికో ఆధ్యాత్మిక శక్తిని అపరి మితంగా అందిస్తూన్న ఆయన దేహం ఎంత సూక్ష్మతను సాత్త్వికతను సంతరించు కొని ఉంటుంది! ఆయన దేహం గురించి ఆయనకే ఎరుక. “మొత్తం మీద నా శరీర విషయంలో బాధపడవలసింది ఏమీ లేదు. ఇలాంటి రుగ్మతలతో కూడిన ఈ శరీరం అప్పుడప్పుడు మృదుమధుర సంగీతం అందించే, కొన్నిసార్లు అంధకారంలో మూలిగే పరికరం అవుతుంది. అలాంటి పద్ధతిలో ప్రత్యేకత ఏమిటంటే, అది అవయవాల మీద ఎప్పుడూ పనిచేయదు”* అంటూ ఆయన వ్రాస్తున్నారు.
‘నా ఆత్మ విస్తృతిస్తోంది!’
స్వామీజీ ఉత్తేజభరిత జీవితమూ, అందుకు తోడు శారీరక రుగ్మతలూ ఒక వైపు కొనసాగాయి. మరో వైపు, ఆయన ఆధ్యాత్మిక శక్తి అభివ్యక్తీకరణ పరాకాష్ఠను చేరుకొని విస్తృతిస్తూన్నది. ఒక రోజు ఆయన అభేదానందతో, “సోదరా! నా రోజులు ఇక లెక్కించవలసిందే. ఇక మూడు నాలుగేళ్లు మాత్రమే జీవిస్తాను” అన్నారు. అందుకు అభ్యంతరం చెబుతూ అభేదానంద, “మీరు అలా చెప్పకూడదు, స్వామీజీ! మీ ఆరోగ్యం బాగా మెరుగుపడుతోంది. ఇంకా కొంతకాలం ఇక్కడే ఉంటే మీకు మునుపటి బలమూ, శక్తీ వచ్చేస్తాయి. అంతేకాక మనం ఇప్పుడే కార్యకలాపాలు ప్రారంభించాం. ఇంకా చేయవలసింది ఎంతో ఉంది” అన్నారు. అయితే స్వామీజీ శాంతంగానే అయినప్పటికీ ఇలా నొక్కివక్కాణించారు:
“నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు. అమితంగా పెరిగిపోతున్నట్లు నాకు అనిపిస్తోంది. నా ఆత్మ విస్తృతిస్తోంది; ఇకపై ఈ శరీరం నన్ను భరించలేదని కొన్ని సమయాలలో గ్రహిస్తున్నాను. ఇప్పుడు పగిలిపోతాను. నిజంగానే చెబు తున్నాను, కేవలం రక్తమాంసాలతో కూడుకొన్న ఈ గూటిలో నేను ఇంకా ఎక్కువ రోజులు వసించలేను.”
న్యూయార్క్ నుంచి నవంబర్ 22 వ తేదీన స్వామీజీ చికాగో వెళ్లారు. అక్కడ హేల్ కుటుంబం వారు, ఎమ్మా కాల్వే ప్రభృతులను కలుసుకొని క్యాలిఫోర్నియా బయలుదేరారు.