అనంతుడైన పరమాత్ముని ద్వారం స్వామీజీకి సదా తెరచే ఉంది. జీవితపు సుఖ దుఃఖాలు ఏవీ ఆ ద్వారాన్ని మూసి ఉంచలేదు, దాచి ఉంచలేదు.
– మేరీ లూయీ బర్గ్
రిడ్జ్లీ మేనర్ — తురీయానంద భక్తి — తురీయానందకు శిక్షణ — రిడ్జ్లీ మేనర్ రోజులు — ప్రశాంతత — మళ్లీ వినదలచుకోలేదు — చిత్రకారిణి — దివ్యమానవుడు — ‘యాతనలు నాకూ ఉన్నాయి!’ — ‘మరణాన్ని అభిలషించు!’ — వివాహమనే తపస్సు — శక్తి ప్రసాదించడం
రిడ్జ్లీ మేనర్
స్వామీజీ 1899 ఆగస్టు 28వ తేదీన న్యూయార్క్ చేరుకొన్నారు. అనుకొన్న వేళకన్నా కొన్ని గంటల ముందే ఓడ నౌకాశ్రయాన్ని చేరుకోవడంతో ఆయనను ఆహ్వానించడానికి ఒకరిద్దరు మాత్రమే వచ్చారు. అభేదానంద ఊళ్లో లేకపోవడం వలన ఆయన కూడా రాలేదు. భారతదేశం నుండి మెక్లౌడ్ కోసం ఒక సీసాలో నిల్వ పచ్చడి ఆయన తీసుకువచ్చారు. ఓడ నుంచి ఆ సీసా చేత పుచ్చుకొనే ఆయన దిగారు.
న్యూయార్క్ నుంచి దాదాపు 90 మైళ్ల దూరంలోని అందమైన గృహం రిడ్జ్లీ మేనర్. అక్కడ స్వామీజీకి, తురీయానందకు బస ఏర్పాటు చేశారు.* స్వామీజీకి ఇంతకు మునుపే పరిచయమైన లెగ్గట్కు చెందినది ఆ పెద్ద గృహ సముదాయం. ఇంటి ప్రధాన భాగం నుంచి కాస్త దూరంలోని ఒక ఇంటిని స్వాములిద్దరికీ కేటాయించారు. స్వామీజీ బస చేసిన కారణంగా ఆ ఇంటిని ‘స్వామీజీ గృహ’ మని పేర్కొన్నారు. ఆ మేడ ఇంట్లో ఐదు గదులున్నాయి.
తురీయానంద భక్తి
నిజానికి తురీయానంద స్వామీజీ సోదర సన్న్యాసి అయినప్పటికీ ఆయనకు స్వామీజీ పట్ల గల భక్తి అచంచలం. ఆయన స్వామీజీ సమక్షంలో ప్రవర్తించే తీరుతెన్నులు చూస్తే ఆయన స్వామీజీ శిష్యుడని ఇతరులు పొరబడడంలో వింతేమీలేదు. రిడ్జ్లీ మేనర్లో అందరూ తమ తమ గదులలో సర్దుకొన్న తరువాత, ఏర్పాట్లు సవ్యంగా ఉన్నాయో లేవో చూడడానికి మిసెస్ లెగ్గెట్ ప్రతి గదిలోకి వెళ్లింది. తురీయానంద గదిలోకి వెళ్లి చూడగా ఆయన తన పరుపును నేల మీద పరుచుకొని ఉండడం కనిపించింది. “ఏం స్వామీ, మంచం బాగా లేదా?” అని అడిగింది. అందుకు తురీయానంద, “మంచం బాగానే ఉంది. కాని స్వామీజీ పడుకొన్న అదే ఎత్తులో నేను పడుకోవచ్చా? అందుకే పరుపును నేల మీద పరుచుకొన్నాను” అని జవాబిచ్చారు! ఆ జవాబు విని మిసెస్ లెగ్గెట్ విస్తుబోయింది. ఆమె తురీయా నందను స్వామీజీ శిష్యునిగా భావించింది. సారాకు ఆమె వ్రాసిన ఉత్తరంలో, “స్వామీజీకి ఈ విశ్రాంతి చక్కని ప్రశాంతతను చేకూర్చేలా ఉంది. ఆయన తమ శిష్యునితో (తురీయానంద) ఏకాంతంగా ఉండగోరుతున్నారు. ఆ శిష్యుడు కూడా స్వామీజీ ప్రతి కదలికనూ, అవసరాన్నీ గమనించి, అవగతం చేసుకొని చూపే భక్తి శ్రద్ధలు ఆశ్చర్యజనకంగా ఉన్నాయి” అని వ్రాసింది.
తురీయానందకు శిక్షణ
ప్రేమ, విశ్వాసమూ ఒక వంక ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ తమ కాళ్ల మీద తాము నిలబడాలి, తమ శక్తివంచన లేకుండా కార్యాచరణకు దిగాలన్నది స్వామీజీ ఆశయం. ఎవరూ తమను ఆధారం చేసుకోవడం ఆయనకు నచ్చదు. తురీయానందను కూడా అదే విధంగా చూడగోరారు. అందుకోసం తురీయానందకు కూడా ఒక దిగ్భ్రమ చికిత్స చేశారు. తురీయానంద ఇలా అంటున్నారు:
“అమెరికా వెళ్లినప్పుడు రిడ్జ్లీ మేనర్లో విడిది చేశాం. హఠాత్తుగా స్వామీజీ ఒక రోజు నన్ను పిలిచి, ‘నా వద్ద పైకం ఎక్కువ లేదు. శాన్ఫ్రాన్సిస్కో వెళ్లి మిత్రులతో బస చేయబోతున్నాను. ఇక నువ్వు నీ దారి చూసుకో’ అన్నారు. నా కాళ్ల మీద నేను నిలబడడానికై ఆయన ఒక అవకాశం ఇస్తున్నారన్న విషయం అర్థం చేసుకోకుండా నేను ఆయన పట్ల కోపగించుకొన్నాను. కాని ఏదీ వ్యక్తం చేయకుండా, ‘మంచి పని’ అని మాత్రం చెప్పాను. ‘ఎక్కడకు పోతావు?’ అని అడిగారు. దానిని గురించి నేను ఏదీ యోచించలేదు. మాంట్ క్లేయర్ వాస్తవ్యురా లైన మిసెస్ హూలర్ నన్ను ఆహ్వానించిన సంగతి హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది. వెంటనే, ‘మిసెస్ హూలర్ వద్దకు పోతాను’ అన్నాను. ‘మంచిది. అక్కడ ఒక మఠమో గిఠమో ప్రారంభించు’ అన్నారు స్వామీజీ. నాలో కోపం పొంగి పొరలుతున్నది. ఆయన మఠం ప్రారంభించమని చెప్పగానే ఠక్కున, ‘మఠం – గిఠం ఏదీ నేను ప్రారంభించలేను. వెళ్లి ఊరకే ఉండిపోతాను’ అన్నాను కోపంగా. స్వామీజీ చిన్నగా నవ్వుతూ, ‘దాన్నే మఠ ప్రారంభమంటారు. మీరు ఎక్కడ బస చేస్తారో అక్కడ మఠం స్వయంభువుగా వెలుస్తుంది’ అన్నారు. సోదర సన్న్యాసుల పట్ల ఆయనకు అంతటి నమ్మకమూ, ప్రేమా ఉన్నాయి.”
రిడ్జ్లీ మేనర్ రోజులు
రిడ్జ్లీ మేనర్లో స్వామీజీ దాదాపు రెండు నెలలు గడిపారు. ఆ రోజులు ఆయనకు చక్కని విశ్రాంతినిచ్చాయి. మిత్రులు, పరిచయస్థులు అనేకులు వచ్చి స్వామీజీని కలుసుకొన్నారు. ఆయన కూడా వారితో చాలాసేపు సంతోషంగా ముచ్చటించారు. అభేదానంద వచ్చి స్వామీజీతో దాదాపు పది రోజులు గడిపారు. న్యూయార్క్‌లో మఠానికి సొంతంగా ఒక భవనమూ, స్ఠలమూ ఏర్పడినట్లు ఆయన స్వామీజీతో చెప్పారు. అది విని స్వామీజీ మహదానందం పొందారు. ఇంగ్లండ్‌లో ఆగిపోయిన నివేదిత తన చెల్లెలి వివాహానంతరం స్వామీజీ వద్దకు వచ్చింది. తమ భారతీయ కార్య కలాపాల కోసం ఇంగ్లండ్‌లో నిధులు సేకరించాలని ప్రణాళిక వేసుకొంది. కాని ఆమె ప్రణాళికకు పెద్దగా ఆదరణ లభించలేదు. హేల్ సోదరీమణులు, సారా ప్రభృతులు స్వామీజీని కలుసుకొన్నారు. లెగ్గెట్ దంపతులు స్వామీజీ పట్ల ఎంతో అభిమానంగా ఉన్నారు. మెక్లౌడ్ స్వామీజీ పట్ల ఎంతో అక్కరగా మసలుకొన్నది.
స్వామీజీ రిడ్జ్లీ మేనర్ రోజులు చక్కగా గడిచాయి. నిపుణుడైన ఒక డాక్టర్ వచ్చి ఆయనకు చికిత్స చేశారు. అందువలన ఆరోగ్యం బాగా తేరుకొంది. “ ‘లెగ్గట్ల’ కుటుంబ వైద్యుడు వచ్చి నన్ను చూసిపోతున్నాడు. నా గుండెలో స్వల్ప నరాల కంపం తప్ప ఏ దోషం లేదనీ, ఆహార నియమంతో అది తగ్గిపోతుందనీ అతడు కూడా అభిప్రాయపడుతున్నాడు”* అంటూ స్వామీజీ వ్రాశారు.
ప్రశాంతత
రిడ్జ్లీ మేనర్లో సదా ఒక పావనత్వం సంతరించుకొన్న ప్రశాంతత విలసిల్లింది. దానితోపాటు అధ్యయనం, చర్చ, హాస్యోక్తులతో రోజులు దొర్లాయి. రోజూ వేకువన స్వామీజీ ఇంటిని ఆవరించివున్న పెద్ద తోటలో పచార్లు చేశారు. అక్కడ ఒక మూల నున్న దేవదారు వృక్షం క్రింద కూర్చుని ధ్యానమగ్నులయ్యేవారు. తరువాత లేచి మళ్లీ పచార్లు కొన సాగించేవారు. దారిలో రెండు నుంచి ఆరేళ్ల లోపు ముగ్గురు పిల్లలతో కాసేపు ఆడుకొనేవారు, వారికి డబ్బు ఇచ్చేవారు. కొన్ని సమయాలలో టెన్నిస్ లాంటి ఆటలు ఆడడం కద్దు. కొన్ని సాయంత్రాలలో ప్రక్కనే ఉన్న కొండ వద్దకు వెళ్లేవారు. లేదా పచ్చిక బయళ్ల మీద పచార్లు చేస్తూ ఆనందించేవారు. భోజన వేళ, కొన్ని సమయాల్లో హాస్యోక్తులమయంగా ఉండేది, కొన్ని సమయాలలో స్వామీజీ అత్యు న్నత విషయాల గురించి చెప్పి తక్కిన వారిని పారవశ్యంలో లయించేలా చేసేవారు. చాక్లెట్ ఐస్‌క్రీమ్ ఆయనకు మహా ఇష్టం. సాయంత్రాలలో అందరూ స్వామీజీ సమక్షంలో సమావేశమయ్యేవారు. చలికి ఉపశమనంగా అగ్ని ప్రజ్జ్వరిల్లుతూ ఉండేది. వాయు దీపాల నుండి ఆహ్లాదకరమైన కాంతి ప్రసరిస్తూ ఉండేది. స్వామీజీ ప్రసంగించేవారు. అంతే, ఆ పరిస్థితే మారిపోయేది. సమస్తమూ పావనతలో, ప్రశాంతతలో తేలుతూ ఉన్నట్లు భాసించేది.
ఈ రోజుల్లోనే స్వామీజీ నివేదిత కోసం ‘శాంతి’ అనే కవితను రచించారు. ఇంగ్లండ్‌లో తమ భారతీయ కార్యక్రమాలకు అంతగా ఆదరణ లభించని స్థితిలో అమెరికాలో కొంత పైకం సేకరించడానికి ప్రయత్నించింది. అందుకు మునుపు కొన్ని రోజులు ఏకాంతంలో ధ్యానమయ జీవితం గడపదలుచుకొన్నది. ఒక సన్న్యాసినికి సముచితమైన వస్త్రధారణ చేయగోరినట్లు తెలిపింది. అందుకు సంతోషంగా అనుమతించిన స్వామీజీ ఆ సాయంత్రం ఈ కవితను నివేదితకు అర్పించారు.
అది
సుఖం కాదు దుఃఖం కాదు
కాని ఈ రెంటి నడుమ నివసించేది
అది
రాత్రి కాదు పగలూ కాదు
కాని ఈ రెంటిని సంధించేది.
అది
సంగీతంలోని మధుర విశ్రాంతి
పవిత్రమైన కళలోని శూన్యత….
అది
చిరునవ్వును చిందించేందుకు
కన్నీరు పోయేదచటకే;
అదే జీవన గమ్యస్థానం
శాంతే దాని చిరతర స్థానం.*
మళ్లీ వినదలచుకోలేదు
మరీ చలిగా ఉన్న సాయంత్ర వేళల్లో మంట ప్రక్కన చలి కాచుకొంటూ స్వామీజీ మాటలు వినడం ఒక మధురానుభవం. అనేక విషయాల గురించి ఆయన మాట్లాడేవారు. మధ్యలో ఎవరైనా, “స్వామీజీ! మీరు వెలిబుచ్చే అభిప్రాయాన్ని నేను ఆమోదించలేను” అనేవారు. “అలా అయితే మీకు అది వర్తించదు” అనేవారు ఆయన. అదే సమయంలో మరొకరు, “ఆహా! స్వామీజీ, బ్రహ్మాండం! ఈ అభిప్రాయమే మీ నిజమైన అభిప్రాయంగా నాకు తోస్తోంది” అనేవారు. “ఆహా! అలా అయితే ఆ అభిప్రాయం మీకు వర్తిస్తుంది!” అనేవారు స్వామీజీ. ఏదీ ఎవరి మీదా బలవంతంగా స్వామీజీ రుద్దరు.
ఒక రోజు సాయంత్రం స్వామీజీ ప్రసంగిస్తుండగా పది పన్నెండు మంది వింటున్నారు. అవరోధం లేకుండా గంభీరంగా మాట్లాడుతున్న ఆయన కంఠస్వరం హఠాత్తుగా కోమలమయింది. క్రమక్రమంగా అస్పష్టమై ఎక్కడో సుదూరంలో ధ్వనిస్తున్నట్లు వినవచ్చింది. అక్కడున్న అందరికీ మరేదో లోకానికి తోడ్కొని పోబడినట్లు అనిపించింది. స్వామీజీ ప్రసంగించడం ఆపారు. ఎవరూ ఆ లోకం నుంచి తిరిగి రావడానికి ఇష్టపడినట్లుగా కనిపించలేదు, కాసేపటికి అందరూ లేచారు. కాని ఆ ప్రశాంత లోక ప్రభావం నుంచి విడివడని స్థితిలో ఉన్న వారు పరస్పరం అభివాదం కూడా చేసుకోకుండా వెళ్లిపోయారు. కాసేపయ్యాక మిసెస్ లెగ్గట్ ఆ నాటి ప్రసంగంలో పాల్గొన్న ఒకరి గదిలోకి వెళ్లడం తటస్థించింది. ఆ వ్యక్తి అంతగా దైవనమ్మకం లేనివాడు. కాని మిసెస్ లెగ్గట్ వెళ్లినప్పుడు ఆతడు కళ్ల వెంట నీరు ధారకట్టిన స్థితిలో కూర్చుని ఉన్నాడు. అందుకు కారణం ఏమిటని ఆమె అడిగినప్పుడు ఆతడు ఇలా అన్నాడు: “ఆయన నాకు అమృతప్రాయ మైన జీవితాన్ని ప్రసాదించారు. ఆయన ప్రసంగం మళ్లీ వినదలచుకోలేదు.”
స్వామీజీ చికాగో సర్వమత మహాసభలో ప్రసంగించినప్పుడు విన్న ఒక శ్రోత అనుభవమూ ఈ విధంగానే ఉంది. ఆమె హారియెట్ మన్రో, ఒక కవయిత్రి. స్వామీజీ ప్రసంగం విన్న తరువాత ఆమె ఇలా వ్రాసింది: “పూర్తిగా నెరవేరిన, పరిపూర్ణమైన కొన్ని క్షణాలు జీవితంలో కొన్ని సమయాల్లో కలుగుతాయి. ఒకసారి మాత్రమే వచ్చే ఆ క్షణాలను మళ్లీ చవిచూడలేం. అందుకు ప్రయత్నించడమూ వృథా. అందుకే వివేకానంద ప్రసంగం ఒకసారి విన్న తరువాత, ఆయన నగరమంతా అనేక చోట్ల ప్రసంగించి అనేకులను ఆకట్టుకొన్నప్పటికీ, నేను మాత్రం వెళ్లలేదు.”
చిత్రకారిణి
రిడ్జ్లీ మేనర్లో బస చేసిన వారిలో చిత్రకారిణియైన మిస్ స్టమ్ ఒకరు. ఒక రోజు స్వామీజీ ఆమెతో, “ఊరక కూర్చుని ఏదేదో యోచిస్తుండడం కన్నా ఏదో ఒక పనిలో నిమగ్నమవగోరుతున్నాను. మీరెందుకు బొమ్మలు గీయడం నాకు నేర్పరాదు?” అని అడిగారు. స్టమ్ అందుకు సమ్మతించింది; చిత్రలేఖనానికి అవసరమైన సామగ్రి కొనుగోలు చేశారు. ఆపిల్ పండు పుచ్చుకొని శిక్షణ నారంభించే ముహూర్త సమయానికి స్వామీజీ వెళ్లారు. వినమ్రతతో తలవంచుకొని ఆ పండును స్టమ్కు గురుదక్షిణగా సమర్పించారు. స్టమ్కు ఇదేదీ అర్థం కాక కారణం అడిగినప్పుడు స్వామీజీ, “నేను మీ విద్యార్థిని. శిక్షణ ఫలవంతమవడానికి దీనిని దక్షిణగా మీకు సమర్పిస్తున్నాను” అన్నారు. సత్వరమే ఆయన చక్కగా చిత్రాలు గీయనారంభించారు. స్టమ్ దానిని గురించి ఇలా వ్రాస్తున్నారు:
“ఎలాంటి విద్యార్థి ఆయన! ఏ విషయమైనా ఒక్కసారి చెబితే చాలు, ఇట్టే గ్రహిస్తారు. ఆయన మానసిక ఏకాగ్రతా, జ్ఞాపకశక్తీ అద్భుతం. ఆయన గీసిన చిత్రాలు ప్రాథమిక దశలోని ఒక విద్యార్థి గీసినవని చెప్పలేనంత చక్కగా ఉన్నాయి. నాలుగవ పాఠం ఆరంభించినప్పుడే ఒక వ్యక్తిని చూస్తూ చిత్రం గీయగలిగే మేరకు స్వామీజీ ఆరితేరారు. తురీయానంద శిలలా కూర్చుని ఉండగా ఆయనను చూస్తూ చిత్రం గీశారు. నివేదిత చిత్రం కూడా గీశారు. తాను కూడా చిత్రాలు గీయగలనని స్వామీజీలో ఆభిజాత్యం తొంగిచూసింది.”*
దివ్యమానవుడు
అక్టోబర్ ప్రారంభంలో మెక్లౌడ్ సోదరుడు లాస్ ఏంజిల్స్‌లో వ్యాధిగ్రస్థుడై నట్లు వార్త అందింది. సోదరుణ్ణి చూడడానికి మెక్లౌడ్ బయలుదేరింది. ఆమె బండిలో ఎక్కుతున్నప్పుడు స్వామీజీ ఆమె వద్దకు వెళ్లి కొన్ని సంస్కృత మంత్రాలు ఉచ్చరించి ఆమెను ఆశీర్వదించారు. తరువాత, “ఏవైనా తరగతులకు ఏర్పాటు చేయి, అప్పుడు నేను వస్తాను” అన్నారు. మెక్లౌడ్ వెళ్లి తన సోదరుణ్ణి చూసింది. ఆతడి పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉంది. ఆతడు మిసెస్ ప్లాజెట్ అనే ఆమె ఇంట్లో నివసిస్తున్నాడు. మెక్లౌడ్ తన సోదరుని ప్రక్కన కూర్చుని ఆతడితో సానుకూల ధోరణిలో మాట్లాడుతున్నప్పుడు కాకతాళీయంగా గోడను చూసింది. అక్కడ స్వామీజీ ఛాయాచిత్రం పెద్దది వ్రేలాడుతున్నది. మెక్లౌడ్కు అది ఒక ఆనందకరమైన దిగ్భ్రాంతిని కలిగించింది. ప్లాజెట్ను అడిగినప్పుడు ఆమె, “స్వామీజీ మొదటి చికాగో ఉపన్యాసం విని మైమరచిన వారిలో నేను కూడా ఒకరిని. ఆహా, ఎంతటి మహాత్ముడాయన! భగవంతుడే భూమ్మీదకు వచ్చి ఆయనలా సంచరించారనే చెప్పుకోవాలి. ఆయన దివ్యమానవుడు!” అన్నది. వెంటనే మెక్లౌడ్ ఆయన తనకు బాగా తెలుసుననీ, ప్రస్తుతం ఆయన తన ఇంట్లోనే ఉన్నారని చెప్పినప్పుడు ప్లాజెట్ అమితానందం పొందింది. త్వరలోనే స్వామీజీ అక్కడకు వస్తారు, బహుశా ప్లాజెట్ నివాసంలోనే ఆయన బస చేయడానికి ఆస్కారం ఉందని మెక్లౌడ్ చెప్పినప్పుడు ఆమె పొందిన ఆనందం వర్ణనాతీతం.
మూడు వారాల లోపునే మెక్లౌడ్ సోదరుడు మృతి చెందాడు.
‘యాతనలు నాకూ ఉన్నాయి!’
రిడ్జ్లీ మేనర్ నుండి మెక్లౌడ్ వెళ్లిన తరువాత, తక్కిన ఒకరిద్దరు కూడా వెళ్లి పోయారు. కాని స్వామీజీ ఎప్పటిలా హాస్యోక్తులతో, సంతృప్తితో రోజులు గడిపారు. కాని ఆయనకూ మరో పార్శ్వం లేకపోలేదు. దిగ్భ్రాంతులను ఆయన ఎదుర్కొన వలసివుంది. యాతనలు ఆయనకూ ఉన్నాయి. ఆధ్యాత్మిక మహోద్వేగ అనుభూతులు ఒక వ్యక్తి మనస్సునూ, దేహాన్నీ పరివర్తింపజేస్తాయి. ఆయన మనశ్శరీరాలు అమిత కోమలమవసాగాయి; విషయానందాల కన్నా ఉత్కృష్టమైన దివ్యానందాలను చవిచూడడానికి అనువుగా మార్పు చెందుతాయి. కాని ఉన్నతోన్నత ఆనందాలను చవిచూసే అదే మనస్సు యాతనలనూ అనుభవిస్తుంది. వారు అనుభవిస్తున్న ఆ ఆనందాల పరిమాణాలను మనం అవగతం చేసుకోలేని రీతిలోనే వారు అనుభవించిన యాతనలనూ మనం గ్రహించలేం. స్వామీజీ కూడా యాతనలతో తల్లడిల్లడం కద్దు. కాని ఇతరులు గ్రహించలేని రీతిలో వాటిని దాచివేస్తారు. అయినప్పటికీ అతి సన్నిహితులతో మాత్రం ఆయన తమ మానసిక శోకం వ్యక్తం చేయకపోలేదు. నివేదిత ఇలా వ్రాస్తున్నది:
“భారతదేశ కార్యకలాపాలు సృష్టించిన సమస్యలు, స్టర్డీ మూలంగా తలెత్తిన మానసిక క్షోభ, లండన్ పనుల తిరోగతి లాంటి అనేక విషయాలు ఆయన ముందు తలెత్తాయి. కాని ఏదీ ఆయనను ఆటంకపరచలేదు; ఆయన సన్న్యాసిగా పూర్తిగా వాటికి అతీతంగా నిలిచారు. కాని ఆయన వ్యక్తిగతంగా ఏర్పరచుకొన్న సంబంధాలలో సంఘర్షణ ఏర్పడ్డప్పుడు తల్లడిల్లారు, సన్నిహితులు విడిపోయి నప్పుడు నలిగిపోయారు. వారు మోసగించినప్పుడు చింతించారు. ‘నా పనులకు సంబంధించినంత వరకు భగవంతుడు నాతోనే ఉండి మార్గదర్శకత్వం వహిస్తున్నాడు; నన్ను పరిరక్షిస్తున్నాడు. కాని నా స్వీయ జీవితంలో అంతా తారుమారయిపోయింది’ అన్నారాయన. గురువారం సాయంత్రం నేనూ, సారా మాట్లాడుకొంటున్నప్పుడు ఆయన మా వద్దకొచ్చి తమ యాతనలన్నింటినీ వ్యక్తం చేశారు. ఆ తరువాత నా గదికి వచ్చినప్పుడు సారా కళ్లు ఆర్ద్రమై ఉన్నాయి. ఒక గంటసేపు నేనూ సారా మాట్లాడుకొన్నాం. పిదప ‘ఆయనకు మనశ్శాంతి కలగాలని మనమూ ప్రార్థిద్దాం’ అంది సారా.
“మర్నాడు స్వామీజీలో జాడ మాత్రంగా కూడా క్లేశం కనిపించలేదు. ఆ మర్నాడు మళ్లీ తమ క్లేశాలను గురించి నాతో చెప్పారు. నేను భరించలేకపోయాను; నా గదిలోకి పరుగెత్తుకొని వెళ్లి ఏడ్వసాగాను. నా వెనుకనే వచ్చిన స్వామీజీ ద్వారం వద్ద నిలబడి మళ్లీ ఇలా అన్నారు: ‘లోకాన్ని ద్వేషించి ఎందుకు పరుగులెత్తారో ఇప్పుడు అర్థం చేసుకొంటున్నాను. డబ్బు, ప్రతిష్ఠలను ద్వేషించాలనే అర్థం తెలిపే శ్లోకాలను యావజ్జీవితమూ పారాయణ చేస్తూ వచ్చాను. కాని దాని అర్థం ఏమిటో ఇప్పుడే అర్థం చేసుకొన్నాను. ఇక నేను భరించలేను. ఆహా, నేనిప్పుడు ఎక్కడకు వచ్చి చేరాను?’ తరువాత హఠాత్తుగా నా వైపు తిరిగారు. ఆయన ముఖాన శోకమూ, ఆవేదనా, అవిశ్వాసమూ ద్యోతకమయ్యాయి. పిదప, ‘కనుక శ్రీరామకృష్ణా! మిమ్మల్నే శరణుజొస్తున్నాను. ఎందుకంటే నిరాడంబర వ్యక్తులకు ఆశ్రయం మీ పాదపద్మాలే కదా!’ అన్నారు.
“కాసేపు మౌనం వహించి మళ్లీ కొనసాగించారు: ‘ఈ దేహం శిథిల మవుతున్నది, కఠోర తపోమయ జీవితంలో రాలిపోనీ. ఇక రోజూ ప్రణవమంత్రం పదివేలసార్లు జపిస్తాను, ఉపవాసాలుంటాను. ‘హర హర, వ్యోం వ్యోం’ అంటూ హిమాలయాలలో, గంగాతీరంలో ఏకాకిగా జీవిస్తారు. మళ్లీ నా పేరు మార్చుకొంటాను, సన్న్యాస దీక్ష పుచ్చుకొంటాను, కాని దీని ఉద్దేశం వేరు. మళ్లీ, కచ్చితంగా మళ్లీ మీ ముందుకు రాకూడదనే ఉద్దేశంతోనే సన్న్యాసం పుచ్చు కొంటాను.’”
నివేదిత పై వ్రాతలు స్వామీజీ మరో వైపును ప్రతిఫలిస్తున్నాయి; ఆయన క్లేశాలూ, కలతలూ మనకు చెప్పక చెబుతున్నాయి. కలతల అంచు నుంచి ఆయన విలపిస్తున్నట్లుంది. కాని నమ్మకం కోల్పోయిన విరక్తిజనిత విలాపం కాదిది; ఏకాంత జీవితం పట్ల గల విపరీత ఉత్సుకత వలనా, అది తన నుంచి లాక్కో బడిందనే కలత వలనా లేచిన ఆర్తనాదం అది. గంగాతీరంలో ఏకాంతంలో గడిపే తపోమయ జీవితాన్నే ఇప్పుడూ అభిలషించారు. తమ శక్తినీ, ప్రేమను ఏ మేరకు లోక శ్రేయస్సు కోసం ప్రసరింపజేశారో, ఏ మేరకు మనుషుల్లో కలసిపోయి పని చేశారో ఆ మేరకు ఆయన దుఃఖీంచారు.
అలా అయితే అమృతత్వ స్థితిని పొందిన ఆయన, సంసార సాగరపు మరో తీరాన్ని చేరుకొన్న ఆయన, భగవంతుని పాదపద్మాలను స్పృశించిన ఆయన దుఃఖీంచారా?
“అవును”, అదే సమయంలో “లేదు”.
ఆయన నిజంగానే దుఃఖీంచారు, ‘అపనమ్మకపు జాడ’ ఆయనలో కానరావ డమూ నిజమే. కాని మన భావనలో ఆయన దుఃఖీంచలేదు. ఎందుకంటే ఆయన సదా ఆనందసాగరంలో తేలుతూనే కనిపించారు. ఒక్క క్షణం ఆయన దుఃఖీంచి నట్లు కనిపించినప్పటికీ మరుక్షణమే ఆయన దివ్యానందంలో ముగిపోయేవారు. “ఆయన ఏం మాట్లాడినా, ఏ మనఃస్థితిలో నెలకొని ఉన్నప్పటికీ ఆయన దివ్యత్వం ప్రతి క్షణమూ అభివ్యక్తమవుతూనే ఉంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనను తదేకంగా చూస్తే తెరచుకొన్న ద్వారాల గుండా అనంతుడైన పరమాత్మను ప్రత్యక్షంగా తిలకిస్తున్నారని గ్రహిస్తాం. ఇది ఎలా సాధ్యం? ‘నేను’ అనే చైతన్యాన్నే కోల్పోయినందునా?” అని నివేదిత వ్రాస్తున్నది. “అనంతుడైన పరమాత్ముని ద్వారం ఆయనకు సదా తెరచే ఉంది. ఎందుకంటే జీవితపు సుఖదుఃఖాలు ఏవీ ఆ ద్వారాన్ని మూయడమో, దాచడమో చేయలేకపోయాయి” అని మేరీ లూయీ బర్గ్ వ్రాస్తున్నది.
జీవితంలో మారి మారి వచ్చే ఈ సుఖదుఃఖాల గురించి స్వామీజీ అద్భుత మైన ఒక వివరణను ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాబోదు. మిసెస్ హేల్‌కు ఈ రోజుల్లో వ్రాసిన లేఖలో దీని గురించి ఆయన వ్యాఖ్యానించారు:
“కుక్క మొరిగితే, దాని యజమాని, దొంగ వస్తున్నట్లు అప్రమత్తమవుతాడు, లేక మిత్రుడు వస్తున్నట్లు ఎంచి ఆహ్వానించడానికి సిద్ధపడతాడు. దీని అర్థం కుక్కా, దాని యజమానీ ఒకే నైజం గలవారనో లేక వారి మధ్య బంధుత్వం (kinship) ఉందనో కాదు. సుఖదుఃఖాల వంటి ఉద్వేగాలు ఆ విధంగా ప్రవర్తింపజేయడానికి మనస్సును ప్రేరేపిస్తాయి. కాని మనస్సుకూ ఆ ఉద్వేగాలకూ ఎలాంటి సంబంధమూ లేదు. సుఖదుఃఖాలకు ఆత్మ అతీతమైనది, అది స్వీయ నైజంలో తృప్తి చెందుతుంది. ఏ నరకమూ దానిని శిక్షించలేదు, ఏ స్వర్గమూ దానికి సుఖీంపజేయలేదు.”
‘మరణాన్ని అభిలషించు!’
కాని దైనందిన జీవితంలో ఎవరైనా, ఏ కారణంగానైనా శోకంతోనో, వేదనతోనో ఉంటే స్వామీజీ మొదటి పని దానిని తీర్చడమే. ఒక మాట, ఒక కథ, మనఃస్ఫూర్తి ఆశీస్సులంటూ ఏదో ఒక మార్గంలో దానిని తాత్కాలికంగానైనా తీరుస్తారు.
రిడ్జ్లీ మేనర్లో ఉన్నవారిలో యువతి ఓలియా. ఈమె సారా కుమార్తె. అనారోగ్యంతో బాధపడ్డ ఆమె మానసికంగానూ ఎంతో బాధననుభవించింది. ఆమె వివాహం విడాకులతో ముగిసింది. ఉన్న ఒకే బిడ్డ మరణించింది. రాత్రుళ్లు ఏవేవో భయంకరమైన కలలు కనడం, భయంతో వణికిపోయి లేవడంతో మనశ్శాంతి లేకుండా ఆమె క్షోభించిపోయింది. స్వామీజీ ఆమె పట్ల ఎంతో సానుభూతి చూపారు. తరచూ ఆమె వద్దకు వెళ్లి ప్రేమగా మాట్లాడి ఆమె మనస్సును శాంతింప జేశారు. “ఆదివారం మధ్యాహ్న భోజన సమయంలో స్వామీజీ మూడు గంటలసేపు ఓలియాతో ఏకాంతంగా మాట్లాడారు. స్వామీజీ ఈ ఆశీస్సులు ఆమెను పూర్తిగా మార్చివేశాయి” అని నివేదిత వ్రాస్తున్నది.
మరొక రోజు స్వామీజీ భయంకరమైన కలలు గురించి ఓలియాతో ఇలా చెప్పారు: “ఈ భయంకర కలలన్నీ మంచి, మధురమైన కలలుగానే ఆరంభమవు తాయి. క్రమేణా భయంకరంగా పరిణమిస్తాయి. మనం భయపు పరాకాష్ఠను చేరుకొన్నప్పుడు కల చెదరిపోతుంది. అదే విధంగా జీవిత కల కూడా. మరణం ఆసన్నమవడంతో ఆ కల చెదరిపోతుంది. కనుక మరణాన్ని అభిలషించు.”
వివాహమనే తపస్సు
మిసెస్ లెగ్గెట్ 22 ఏళ్ల కుమార్తె ఆల్బెర్టా. ఓలియా వైవాహిక జీవితమూ, దాని దుఃఖాంతమూ ఆమె మనస్సును కలచివేశాయి. ఒక రోజు ఆమె స్వామీజీని, “జీవితంలో సుఖమే లేదా?” అని అడిగింది. “ఉందమ్మా. అందుకు వివాహాన్ని ఒక గొప్ప తపస్సుగా పరిగణించాలి; ఆ నేపథ్యంలో జీవితాన్ని అమర్చుకోవాలి. ఒక తపస్సు అనుష్ఠిస్తు న్నామనే భావన తప్ప తక్కినదంతా వదలివేయాలి” అన్నారు స్వామీజీ.
ఆల్బెర్టా తమ్ముడైన హాలిస్టర్ ఒక రోజు, “నాకు ఈ సన్న్యాస జీవితం వద్దు బాబోయ్! నేను వివాహం చేసుకొని పిల్లాజెల్లలను కనదలచుకొన్నాను” అన్నాడు. అందుకు స్వామీజీ, “అలాగే చేయి నాయనా! కాని ఒక విషయం. నువ్వు కఠోరమైన మార్గాన్ని ఎంచుకొంటున్నావని మాత్రం మరిచిపోవద్దు” అన్నారు.
పిల్ల అయిన ఫ్రాన్సిస్ కూడా ఆయన కారుణ్యాన్ని చవిచూసింది. ఒక రోజు ఆమె తోట నుంచి కొన్ని పువ్వులు సేకరించి స్వామీజీకి ఇచ్చింది. ఆ పువ్వులు స్వీకరించి, ప్రశాంతంగా, “భారతదేశంలో మేం గురువులకే పువ్వులు అర్పిస్తాం” అని కొన్ని సంస్కృత మంత్రాలు ఉచ్చరించి ఆమెను దీవించారు.
శక్తి ప్రసాదించడం
ఇంతకు మునుపే ప్లాజెట్, మెక్లౌడ్ స్వామీజీని లాస్ ఏంజిల్స్‌కు ఆహ్వా నించారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి రిడ్జ్లీ మేనర్ నుంచి బయలుదేరడానికి స్వామీజీ సిద్ధమయ్యారు. అంతకు మునుపు ఒక అసాధారణ సంఘటన జరిగింది. ఎలా శ్రీరామకృష్ణులు తమ శక్తిని స్వామీజీకి ప్రసాదించారో అట్లే స్వామీజీ తమ శక్తిని ఇద్దరికీ అనుగ్రహించారు. తమ పనులలో నివేదిత వహించే ఒక ముఖ్యమైన స్థానాన్ని మిసెస్ సారాకు కూడా స్వామీజీ ఇచ్చారు. దానిని గురించి ఇంతకు క్రితమే సారాకు కూడా వ్రాశారు. “ఇంతకు ముందు నీ పట్ల నాకు ప్రేమ మాత్రమే ఉండేది. కాని ఇటీవలి పరిణామాలతో, నా జీవితాన్ని కనిపెట్టి ఉండడానికి జగజ్జనని నిన్ను నియమించినట్లుంది. ఇక నుంచి ప్రేమకు విశ్వాసం జోడింప బడింది! ఇక నా విషయం, నా ఉద్యమమా? ఈ విషయంలో నా అభిప్రాయం ఇది. నువ్వు దైవప్రేరితురాలవైనావు. కనుక నా బాధ్యతల నన్నింటినీ, నా భుజస్కంధాల నుండి దులిపేసి, నీ ద్వారా అమ్మ ఏ ఆదేశం ఇస్తుందో, దానికి నేను బద్ధుణ్ణవుతాను.”*
నాడు నవంబర్ 5 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం. స్వామీజీ నివేదితను తోడ్కొని సారా గదిలోకి వెళ్ళారు. గది తలుపులు మూసివేసి, తాము తీసుకువచ్చిన కాషాయ వస్త్రాలను ఇద్దరికీ ఇచ్చారు. తరువాత ఇద్దరి తలల మీద తమ చేతులుంచి ఇలా అన్నారు :
“శ్రీరామకృష్ణ పరమహంస నాకు ఏది ప్రసాదించారో అదంతా నేను మీకు ఇస్తున్నాను. ఒక స్త్రీ నుండి (కాళీమాత) మాకు లభించింది. నేను ఇద్దరు స్త్రీలకు ఇస్తున్నాను. దానితో మీ శక్తి మేరకు నిర్వహించండి. నన్ను నేను నమ్మలేకున్నాను. రేపు ఏం చేస్తావో, అది పనిని ఎలా బాధిస్తుందో తెలియదు. కాళీమాత అయిన స్త్రీ నుండి లభించింది స్త్రీలే పరిరక్షించడం మంచిది. ఆమె ఎవరో నాకు తెలియదు. నేను ఆమెను ఎన్నడూ చూడలేదు. కాని శ్రీరామకృష్ణులు ఆమెను దర్శించారు, (నివేదిత వస్త్రాన్ని తాకి) ఇలా ఆమెను స్పృశించారు. నాకు తెలిసినంత వరకు ఆమె నిరాకారి. ఎలాగో భారాన్ని మీ మీద పెడుతున్నాను. ప్రశాంతతలో లయించి జీవించడానికి నేను పోతున్నాను. ఉదయం నా మనస్సు ఏమీ బాగోలేదు. మధ్యాహ్న భోజనానికి ముందు నేను నా గదిలోకి వెళ్లినప్పుడు దీనిని గురించి దీర్ఘంగా యోచించాను. ఆ తరువాతే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇది నాకు మహదానందాన్నిచ్చింది. విడుదల పొందినట్లుగా ఉంది. ఇంతవరకు నేను మోస్తున్నాను, ఇప్పుడు వదలిపెట్టాను.”
ఈ సంఘటన అర్థం ఏమిటి, పర్యవసానం ఏమిటి, వారిద్దరి జీవితాల్లో ఈ సంఘటన వలన ఏం జరిగింది – దీనికి ఎవరు జవాబు చెబుతారు? కాలాంత రంలో నివేదిత భారతదేశంలో స్త్రీ విద్యారంగంలోను, స్వాతంత్ర్య పోరాటంలోను కీలకపాత్ర వహించి భారతదేశ చరిత్రలో స్థానం పొందింది. సారాకు సంబంధించి నంత వరకు అంత గొప్ప పనులలో ఆమె పాలుపంచుకొన్నట్లు తెలియడం లేదు.
రెండు రోజుల తరువాత స్వామీజీ న్యూయార్క్ బయలుదేరారు.