మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోగలరు? అంతర్నేత్రం తెరచుకోకుండా మిమ్మల్ని ఎవరూ అవగతం చేసుకోలేరు. శ్రీరామకృష్ణులు ఒక్కరే మిమ్మల్ని అర్థం చేసుకొన్నారు. తక్కినవారు ఆయన చెప్పింది నమ్మారు, అంతే!
– నాగమహాశయ్
(స్వామీజీతో)
మార్గదర్శిగా — వినమ్రత-పారవశ్యం — ‘షూ లేసు విప్పను’ — మరణం అంచున — స్వామీజీ మార్గదర్శకత్వం — సన్న్యాసం — సంసారం — నాగమహాశయ్ — నూతన ప్రపంచాన్ని రూపొందిస్తాం! — ‘శక్తిని ప్రసరింపజేస్తున్నాను!’ — తమిళంలో మొదటి ప్రయత్నం — వంగ భాషా పత్రిక — పరిణామవాదం — వినమ్రతలో వినమ్రత — మిస్ ముల్లర్ కల్పించిన ఆవేదన — స్వామీజీ మార్గం — అద్వైత ఆశ్రమం — యోగానంద స్వామి నిష్క్రమణ — మళ్లీ ప్లేగు — కాళీమాత సమక్షంలో
మార్గదర్శిగా
స్వామీజీ జీవితంలో మహత్కార్యాలు ఒక్కొక్కటిగా నెరవేరాయి. కర్తవ్యాలను చక్కగా నిర్వహించిన గృహ యజమాని తన కుమారులూ, సంతతీ తన మార్గం లోనే అడుగిడడం చూసి ఆనందించే రీతిలో, శ్రీరామకృష్ణుల పని తమ సంతతి ద్వారా చక్కగా నిర్వహింపబడడం చూసి స్వామీజీ ఉప్పొంగిపోయారు.
బేలూర్ మఠ స్థాపనానంతరం దాదాపు ఆరు నెలలు స్వామీజీ కలకత్తాలోనే ఉండిపోయారు. ఈ రోజులను ఆయన మఠంలోనూ, కొన్ని సమయాల్లో బలరాం బోస్ ఇంట్లోనూ గడిపారు. ఎక్కడ ఉన్నప్పటికీ నూతన తరాన్ని రూపొందిం చడం, సన్న్యాసానికి ఉన్నత ఆదర్శనీయులుగా విరాజిల్లే కొందరు సన్న్యాసులను వదలి వెళ్లడం, తద్ద్వారా శ్రీరామకృష్ణుల మహత్కార్యం కొనసాగేటట్లు చేయడ మన్నది ఆయన ఉద్దేశం. అందుకు తగినట్లు తమ మార్గదర్శకత్వం ద్వారా, అంతే కాక తమ జీవితం ద్వారా యువ సన్న్యాసులకు సదా సహాయపడుతూనే వచ్చారు ఆయన.
స్వామీజీ కొన్ని సమయాలలో బలరాం బోస్ ఇంట్లో బస చేయడం మరోవిధంగా కూడా మంచిదయింది. బేలూర్ మఠం కలకత్తా నుంచి కాస్త దూరంలో ఉండడం వలన అనేకులు అక్కడకు వెళ్లి ఆయనను దర్శించుకోలేక పోయారు. కలకత్తాలో ఆయన బలరాం బోస్ ఇంటికి వచ్చిన సందర్భాలలో అనేకులు ఆయనను దర్శించుకోగలిగారు. తద్ద్వారా అనేకులు, ప్రత్యేకించి యువకులు, ఆయనతో సన్నిహితంగా మెలగగలిగారు. స్వామీజీ భావనలచే తమ జీవితాలను అర్థవంతంగా మార్చుకోగలిగారు.
వినమ్రత-పారవశ్యం
ఈ విధంగా ఒకసారి స్వామీజీ బలరాం బోస్ ఇంట్లో బస చేసివున్నారు. అప్పుడు ఆయనను చూడడానికి విజయకృష్ణ గోస్వామి వచ్చారు. స్వామీజీ ఆయనను సాదరపూర్వకంగా ఆహ్వానించారు. విజయకృష్ణ గోస్వామి శ్రీరామకృష్ణుల సన్నిహిత శిష్యుడు. అంతేకాక బ్రహ్మసమాజ రోజుల్లో స్వామీజీకి ఆచార్యునిగా ఉన్న వ్యక్తి కూడా. ఆ మర్యాద నిమిత్తం స్వామీజీ ఆయనకు పాదాభివందనం చేయబో యారు. తమ ముందు ఒక విద్యార్థిగా ఉన్న నరేన్ నేడు జగద్గురువుగా తిరిగి రావడం చూసి, ఆ మర్యాదతో స్వామీజీకి విజయకృష్ణ గోస్వామి పాదాభివందనం చేయబోయారు. కాని ఇద్దరూ ఒకరి పాదాలను మరొకరు స్పృశించడానికి ససేమిరా సమ్మతించలేదు. మళ్లీ ఒకసారి వారు ప్రయత్నించారు. కాని ఫలితం శూన్యం. చివరికి స్వామీజీ నవ్వుతూ విజయకృష్ణ గోస్వామి చేయి పుచ్చుకొని, నేల మీద పరచివున్న తివాచీపై కూర్చుని ఆయనను తమ ప్రక్కన ఆసీనులను చేశారు.
విజయకృష్ణ గోస్వామి భావోద్వేగం పొంగిపొరలగా ప్రగాఢ పారవశ్యంలో లయించిపోయారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన మాట్లాడలేకపోయారు. “శ్రీగురుదేవులు అనుగ్రహించి నన్ను ఆశీర్వదించారు” అంటూ పొడిపొడిగా కొన్ని మాటలు మాత్రమే ఆయన నోటి నుండి వెలువడ్డాయి. స్వామీజీ సాన్నిధ్యం ఆయనలో ఆ మేరకు దివ్యతరంగాలను సృజించింది. ఆయన నిశ్చలంగా కూర్చుండిపోయారు. ఆయన కళ్లు ధారకట్టాయి. వారిని ఆ స్థితిలో చూసిన భక్తులు ఇద్దరినీ పరివేష్టించి కనుల పండువ చేసే రీతిలో సంకీర్తనం చేస్తూ నృత్యం చేశారు.
‘షూ లేసు విప్పను’
ఈ రోజుల్లో స్వామీజీకి ఉబ్బసం ప్రకోపించింది. ఆరోగ్యం మెరుగుపరచు కోవడానికి ఆయన దేవ్‌ఘర్ వెళ్లడానికి నిశ్చయించారు. బ్రహ్మచారి హరేంద్రనాథ్ స్వామీజీకి తోడుగా వెళ్లాడు. ఆరోగ్య సమస్య కారణంగా స్వామీజీ దేవఘర్ వచ్చిన వార్త క్షణాల్లో అక్కడ వ్యాపించింది. అక్కడ మెట్రిక్యులేషన్ చదువుతున్న వ్యక్తి కె.ఎస్.ఘోష్.* ఆతడు, ఆతడి మిత్రుడూ స్వామీజీ దర్శనార్థం బయలుదేరారు. ఆశ్చర్యం! వాళ్లు గది నుండి బయటకు వచ్చిన సమయంలో స్వామీజీ అదే దారిలో నడిచి వెళుతున్నారు. పరుగెత్తి వెళ్లి వారిద్దరూ స్వామీజీ పాదాలను తాకి ప్రణమిల్లబోయారు. స్వామీజీ తక్షణమే తమ పాదాలను వెనక్కు తీసుకొన్నారు; వారు తమ పాదాలను తాకడానికి ఆయన ఎందుకో ఇష్టపడలేదు. వారు ఏదో మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు వారిని తమతో పాటు నడవమని చెప్పి ఆయన నడచిపోసాగారు.
దారిలో వారి యోగక్షేమాలు స్వామీజీ విచారించారు; వారికి ఉపదేశాలు కూడా చేశారు. ఆహారం గురించి అడిగినప్పుడు, “రోజూ కాస్త నెయ్యి ఆహారంలో చేర్చుకోవడం మంచిది. వెన్న దానికన్నా మంచిది” అన్నారు. దూరంలో కనిపిస్తున్న అందమైన పర్వత శ్రేణిని చూపిస్తూ, అక్కడకు వినోదార్థం ఎప్పుడైనా వెళ్లారా అని అడిగారు. వారు వెళ్ళలేదనగానే, “త్వరలో ఒకసారి అక్కడకు వెళ్లిరండి. అలా వినోదార్థ పర్యటన మనశ్శరీరాలకు ఉత్సాహం కలిగిస్తుంది” అన్నారు.
మాట్లాడుకొంటూ పోతున్నప్పుడు ఘోష్ షూ లేసు వదులవడం స్వామీజీ గమనించారు. దానిని సరిగా కట్టుకోమని అతడికి చెప్పారు. హఠాత్తుగా షూ లేసు గురించి చెప్పగానే ఘోష్ గందరగోళంలో పడ్డాడు. అతడు విస్తుబోయి నిలబడిపోవడం చూసి స్వామీజీ వంగి, “సరి, నేను కడతాను” అంటూ కట్టసాగారు. ఘోష్ నిర్ఘాంతబోయాడు. అతడు తేరుకొనే లోపు స్వామీజీ ముచ్చటగా లేసు కట్టి పూర్తిచేశారు. స్వామీజీ తన పాదాలను తాకడానికి అనుమతించడంతో ఏదో పాపం చేసినట్లు భావించిన ఘోష్, పరిహారంలా మళ్లీ స్వామీజీ పాదాలను తాకి ప్రణమిల్లబోయాడు. ఇంతకు క్రితంలా స్వామీజీ అందుకు ఆతణ్ణి అనుమతించలేదు.
మిత్రులిద్దరూ తమ విడిదికి బయలుదేరారు. ఇంతలో, “లోక ప్రసిద్ధులైన వివేకానంద” ఘోష్ షూ లేసు కట్టడం గురించిన వార్త విడిది అంతటా వ్యాపించింది. మిత్రులు అనేకులు వచ్చి దానిని చూసి, తాకడంలో సమయం గడచింది. షూ విప్పడానికి ఎవరూ ఆతణ్ణి అనుమతించలేదు. చివరికి అందరూ నిద్రించాక అర్ధరాత్రి హృదయభారంతో ఘోష్ లేసు విప్పాడు.
మరణం అంచున
దేవ్‌ఘర్‌లో స్వామీజీ ఆరోగ్యం కొంత మెరుగయింది. స్వామీజీకి కూడా కొంత నమ్మకం కుదిరింది. అమెరికా తిరిగి వెళ్లబోతున్న సారా, మెక్లౌడ్ స్వామీజీని తమతోబాటు రమ్మని కోరారు. స్వామీజీ తమ పరిస్థితి విశదపరచి, “మీతో నేను రాలేనని మీకు తెలుసు. అందుకు కావలసిన బలం ఇంకా చేకూరలేదు. ఇంకా రొంప ఉంది. కనుక పయనించడానికి వీలుపడదు. ఇక్కడ నా ఆరోగ్యం కుదుటపడు తుందని విశ్వసిస్తున్నాను” అని వారికి లేఖ వ్రాశారు.
కాని అనుకోకుండా హఠాత్తుగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఉబ్బసం ప్రకోపించింది. ఆయన మరణం అంచునకు వెళ్లి తిరిగివచ్చారనే చెప్పుకోవాలి. శారదానందను, సదానందను వెంటనే దేవ్‌ఘర్‌కు పంపమని బేలూర్ మఠానికి తంతివార్త పంపించారు. ఒకరోజు ఊపిరిపీల్చడంలో బాగా ఇబ్బంది పడడంతో ఆయన ముఖం పాలిపోయింది; సన్నిపాతం వాటిల్లినట్లు దేహం గజగజ వణకనారంభించింది. చూస్తూ ఆరాటపడడమే తప్ప ఎవరూ ఏ సహాయమూ అందించలేకపోయారు. ఎత్తైన తలగడపై తలను వాల్చి స్వామీజీ మృత్యువు కోసం నిరీక్షించడానికి తయారయ్యారు. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, ఎనిమిది రోజులు ఈ విధంగా మరణం అంచున స్వామీజీ ఊగిసలాడారు. ఆ తరువాత పరిస్థితి మెరుగుపడింది, “ఒక జీవచ్ఛవంలా నన్ను కలకత్తాకు తీసుకువచ్చారు” అని ఆయన వ్రాశారు. తమ నిశ్వాసం ‘సోఽహం, సోఽహం’ అని తమకు వినిపించినట్లు పిదప స్వామీజీ తెలిపారు.
1899 జనవరి 22 వ తేదీన స్వామీజీ దేవ్‌ఘర్ నుంచి కలకత్తాకు తిరిగి వచ్చారు. మర్నాడు ఆయన నివేదితను రమ్మని ఆహ్వానించారు. ఆయనను చూడడానికి వచ్చిన నివేదిత ఇలా వ్రాస్తున్నది: “రాజు* నిన్న రాత్రి తిరిగివచ్చారు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు నన్ను రమ్మన్నారు. ఆయనను చూసి గంట క్రితమే తిరిగివచ్చాను. ఆయన దివ్యతేజస్సుతోనే భాసిస్తున్నారు. ఆయన రూపం అద్భుతంగా ఉంది. మూడు రాత్రుళ్లు శ్వాసించడానికి బాగా ఇబ్బంది పడినట్లు నాతో చెప్పారు. కాని ఆయనలో భవిష్యత్ ప్రణాళికలకు కొరత లేదు. ఇటువంటి పరిస్థితిలో ఆయనను నేను చూసింది లేదు.”
స్వామీజీ మార్గదర్శకత్వం
మఠ నిర్వహణను శారదానంద చక్కగా నిర్వర్తిస్తున్నారు; అందుకోసమే స్వామీజీ ఆయనను అమెరికా నుండి రప్పించారు. అమెరికాలో శారదానంద చక్కగా పని చేయగలరని తెలిసినప్పటికీ బేలూర్ మఠానికి ఆయన అవసరం ఎక్కువగా ఉందని స్వామీజీ గ్రహించకపోలేదు. అంతేకాక అమెరికాలో అభేదానంద విజయవంతంగా కార్యాలు నిర్వర్తిస్తున్నందున, పనులు చక్కగా కొనసాగుతాయని స్వామీజీకి బాగా తెలుసు. శారదానంద తిరిగి వచ్చినప్పటి నుండి కార్యనిర్వహణను ఉత్సాహంతో స్వీకరించారు. ప్రశ్నోత్తరాలు, సంస్కృతం, ప్రాచ్య–పాశ్చాత్య తత్త్వశాస్త్రం లాంటి తరగతులను తురీయానంద సమర్థంగా నిర్వహించారు. నిత్యమూ ధ్యాన తరగతులు నిర్వహించారు. ఏకాంతంలో ఒక వ్యక్తి ధ్యానం చేస్తూండగా చూడడం కన్నా స్వామీజీకి మరేదీ ఆనందాన్ని కలిగించదనడం అతిశయోక్తి కాదు.
మఠ దైనందిన చర్యలు యువ సన్న్యాసుల బాధ్యతల్లో అప్పగించబడ్డాయి. బాధ్యతను వారు కూడా గ్రహించాలని స్వామీజీ అభిలాష. యువ సన్న్యాసులూ, బ్రహ్మచారులూ ఒక బృందంగా రూపొంది పనులను గురించి చర్చించారు; తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకొని పనులు నిర్వర్తించసాగారు. వేళ పాటించడం, పవిత్రత లాంటివి కచ్చితంగా అనుసరించారు. అందరూ పాలుపంచుకోవడమూ, బాధ్యతాయుతంగా స్పందించడమూ స్వామీజీకి అమితానందాన్ని కలిగించాయి.
సన్న్యాసం
సన్న్యాసం, బ్రహ్మచర్యం, సేవ, ముక్తి లాంటి ఆదర్శాలను అవకాశం చిక్కి నప్పుడల్లా యువకుల మనస్సులో పాదుగొలిపారు. అంతకన్నా ఆయన ప్రత్యక్ష జీవితం జాజ్జ్వల్యమానమైన సన్న్యాసాగ్నిలా యువకుల ముందు ప్రదర్శితమయింది. “నాడులన్నీ కణకణ మండడమే బ్రహ్మ చర్యం”, “స్వీయముక్తీ, ఇతరులకు సేవా అన్నదే మన ఆదర్శమని ఎన్నడూ విస్మరించకండి” అంటూ పదేపదే యువకులతో నొక్కివక్కాణించారు.
నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని ప్రాతిపదికగా తీసుకొన్న సన్న్యాసం – భగవదను భూతికి ఇదొక్కటే తాళం చెవి అన్న నిజాన్ని స్వామీజీ పదేపదే నొక్కివక్కాణించారు. ఒక సన్న్యాసి జీవితం అవిచ్ఛిన్నంగా మనస్సుతో చేసే పోరాటమే తప్ప మరేదీ కాదు. ఆ పోరాటంలో ఆతడు విజయం సాధించాలంటే అతడు కఠోర తపోమయ జీవితం, జితేంద్రియత్వం, మానసిక ఏకాగ్రత పాటించే తీరాలి. ఒకసారి ఒక వ్యక్తి అనవసరమైన ప్రశ్న అడిగినప్పుడు స్వామీజీ కోపంగా, “పో, వెళ్లు, వెళ్లి తపస్సు చేయి. కొంతకాలం తపస్సు అనుష్ఠిస్తే మనస్సు పావనమవుతుంది. అప్పుడు ఇటువంటి అర్థంపర్థం లేని ప్రశ్నలు అడగవు” అన్నారు.
ప్రారంభంలో అన్ని విషయాల్లో కఠోర నియమం, నిఘా అవసరం అనేవారు స్వామీజీ. “ఆహార నియంత్రణ అతి ముఖ్యంగా పాటించాలి. ఆహార నియంత్రణ లేకుండా మనస్సును నియంత్రించడం సాధ్యం కాదు. అవసరం కన్నా ఎక్కువ తినడం అనేక హానులకు దారి తీస్తుంది. మితిమీరి తినడం వలన మనశ్శరీ రాలు చెడిపోతాయి” అనేవారు ఆయన.
సన్న్యాసులు గృహస్థుల నుండి వైదొలగి ఉండడంలోని ఆవశ్యకతను ఆయన ఎత్తి చూపేవారు. “సంసార జీవితంలో మునిగివున్న ప్రజల దేహం నుండి, దుస్తుల నుండి ఒక రకమైన కామ దుర్వాసన రావడం నాకు ఎరుక. నేను దానిని భరించలేకపోయాను. దీనిని గురించి నేను శాస్త్రాలలో చదివి ఉన్నాను. పరిత్యా గమూ, పావనతా నిండిన పునీతులు ఎందుకు లౌకిక జనుల స్పర్శను భరించ లేకపోతున్నారో నా కిప్పుడు అవగతమవుతున్నది” అనేవారు ఆయన.
అదే విధంగా యువసన్న్యాసులూ, బ్రహ్మచారులూ స్త్రీలతో సన్నిహితంగా మెలగడం స్వామీజీ ససేమిరా అంగీకరించరు. మాతృమూర్తి శ్రీశారదాదేవి కలకత్తాకు వచ్చినప్పుడు, ఆమె సేవకు కూడా యువ సన్న్యాసులు అక్కడకు పోవడం స్వామీజీకి సుతరామూ నచ్చదు. ఎందుకంటే అక్కడ స్త్రీలు అధికంగా ఉంటారు కనుక.
సంసారం
పై స్వామీజీ అభిప్రాయాలను బట్టి ఆయన సంసారులనూ, స్త్రీలనూ ద్వేషించారని అర్థం చేసుకోరాదు. కొందరు స్త్రీ, పురుష గృహస్థులు ఆయనకు అతి సన్నిహిత మిత్రులు. వారి జీవితాలను తమ శిష్యులకు కూడా ఉదాహరణగా ఆయన చూపించడం కద్దు. సంసార ఆదర్శం గురించి స్వామీజీ ఇలా చెప్పేవారు:
“సంసార ఆదర్శం గొప్పతనం నాకు అర్థమవుతోంది. సన్మార్గంలో ఆర్జించడం, మంచి కార్యాలకై దానిని ఖర్చు చేయడం, కుటుంబాన్ని పరిరక్షించడం, పెద్దలకు సేవ చేయడం, ఒక ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎన్నుకొని జీవితాన్ని తరింపజేసు కోవడమంటూ సంసార జీవితం ఒక ఉన్నత ఆదర్శమనడంలో ఎలాంటి సందేహమూ లేదు. వివాహమూ ఒక మార్గమే; ఎందుకు? కొందరికి అదే మార్గం. కాని సన్న్యాస జీవితాన్ని స్వీకరించిన వ్యక్తి, ప్రపంచంలోని సమస్తమూ భయంతో పెనవేసుకుపోయిందని గ్రహించాలి. సన్న్యాసం మాత్రమే నిర్భయంగా జీవింప జేస్తుంది. సంసార ఆదర్శ ఘనతను మీరు గ్రహించి జీవించాలి.”
నాగమహాశయ్
ఒకసారి నాగమహాశయ్ మఠానికి వచ్చినప్పుడు స్వామీజీ వ్యవహరించిన తీరు నుంచి సంసారులను ఆయన ఎంతగా శ్లాఘించారో తెలుసుకోగలం. స్వామీజీని సాక్షాత్తూ ఆ పరమేశ్వరునిగానే నాగమహాశయ్ గాంచాడు. స్వామీజీ సమక్షంలో ఆయన కూర్చోడు; చేతులు కట్టుకొని నిలబడే ఉంటాడు. నాగమహాశయ్ శరశ్చంద్రతో మఠానికి వచ్చాడు.
స్వామీజీ (నాగమహాశయ్కు నమస్కరించి) : క్షేమమేనా?
నాగమహాశయ్ : మీ దర్శనార్థం వచ్చాను. జై శంకరా! జై శంకరా! నేడు శివదర్శనమయింది.
ఇలా అంటూ నాగమహాశయ్ స్వామీజీ ముందు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ వినమ్రంగా నిలబడే ఉన్నాడు.
స్వామీజీ : మీ ఆరోగ్యం ఎలా ఉంది?
నాగమహాశయ్ : రక్తమాంసాలతో కలసిన ఎముకల గూడైన, ఎందుకూ పనికిరాని ఈ దేహం గురించి ఎందుకు విచారిస్తున్నారు! మీ దర్శనంతో నేను తరించాను.
ఈ విధంగా చెబుతూ ఆయన స్వామీజీకి సాష్టాంగ నమస్కారం చేశాడు.
స్వామీజీ (ఆయనను పైకెత్తుతూ) : ఏం పని చేస్తున్నారు?
నాగమహాశయ్ : నేడు నాకు శివదర్శనమయింది. బాహ్య నేత్రాలతో నేను ఇది చూస్తున్నాను. జై శ్రీరామకృష్ణ!
స్వామీజీ (శరత్‌ను చూస్తూ) : నిజమైన భక్తి మనిషిని ఎలా మార్చివేస్తుందో చూశావా? నాగమహాశయ్ దివ్యత్వంలో మునిగి మైమరచిపోయారు. దేహధ్యాస ఆయనకు లేనేలేదు. ఇలాంటి మరో వ్యక్తిని చూడలేం. (ప్రేమానందతో) నాగమహాశయ్కు కాస్త ప్రసాదం పట్రా.
నాగమహాశయ్ : ప్రసాదమా! ప్రసాదమా! (చేతులు జోడించుకొని స్వామీజీకి నమస్కరిస్తూ) మిమ్మల్ని చూడగానే ఈ రోజు నా మానవజన్మ ఆకలే తీరిపోయింది.
అప్పుడు సన్న్యాసులకూ, బ్రహ్మచారులకూ ఉపనిషత్తుల తరగతి జరుగు తున్నది. స్వామీజీ వారితో, “నేడు గురుదేవుల విశిష్ట భక్తులొకరు వచ్చారు. కనుక మీకు నేడు తరగతి లేదు” అన్నారు. వెంటనే అందరూ పుస్తకాలు మూసివేసి, నాగమహాశయ్ను పరివేష్టించి కూర్చున్నారు. స్వామీజీ కూడా ఆయన ముందు కూర్చున్నారు.
స్వామీజీ (అందరిని కలయజూస్తూ) : చూడండి! నాగమహాశయ్ను చూడండి. ఈయన సంసారి. కాని ఈయనకు లౌకిక ధ్యాసే లేదు. సదా భగవ ద్ధ్యాసలోనే లయించి ఉంటారు. (నాగమహాశయ్తో) మాకూ, బ్రహ్మచారులకూ గురుదేవుల గురించి కాస్త ఏదైనా చెప్పండి.
నాగమహాశయ్ : ఏం చెబుతున్నారు! మీరేమంటున్నారు! ఆయన గురించి నేనేం చెప్పగలను? ఆయన అవతార కార్యంలో తోడ్పడే మహావీరులైన మిమ్మల్ని దర్శించుకోవాలని వచ్చాను. ఇప్పుడు ఆయన ఉపదేశాలను జనం అర్థం చేసు కొంటారు. జై రామకృష్ణ! జై రామకృష్ణ!
స్వామీజీ : శ్రీరామకృష్ణులను యథార్థంగా అర్థం చేసుకొన్నది మీరే. మేం ఇక్కడా అక్కడా తిరుగాడుతున్నాం, అంతే.
నాగమహాశయ్ : ఆహా, మీరేమంటున్నారు? మీరు గురుదేవుల ఛాయ. మీరిద్దరూ ఒకే నాణెపు రెండు పార్శ్వాలు. కళ్లు ఉన్నవారు దీనిని చూస్తారు!
స్వామీజీ : ఈ మఠాలనన్నీ ప్రారంభించడం సరైన మార్గమేనా?
నాగమహాశయ్ : నేను అల్పుణ్ణి. నాకేం తెలుసు? మీరు ఏం చేసినా అది లోకానికి శ్రేయోదాయకమే, అవును, శ్రేయోదాయకమే!
పలువురు బ్రహ్మచారులూ, సాధువులూ నాగమహాశయ్ పాదాలను తాకి నమస్కరించడానికి ప్రయత్నించారు. ఈ చర్య నాగమహాశయ్లో ఉద్రిక్తతను కలిగించింది. వెంటనే స్వామీజీ, “ఆయనను ఇబ్బంది పెట్టకండి. ఆయన సంకట పడుతున్నారు” అన్నారు. ఇది విని అందరూ తమ స్థానాలకు వెళ్లి కూర్చున్నారు.
స్వామీజీ : మీరెందుకు మఠంలో నివసించకూడదు? మీ జీవితం ఇక్కడి బ్రహ్మచారులకు ఒక ఉదాహరణగా ఉంటుంది.
నాగమహాశయ్ : శ్రీరామకృష్ణులను ఒకసారి దీనిని గురించి అడిగాను. అందుకు ఆయన, ‘సంసారంలోనే ఉండు’ అన్నారు. కనుక గృహస్థాశ్రమంలోనే ఉంటున్నాను. మీ అందరినీ అప్పుడప్పుడు దర్శించుకోగల భాగ్యశాలినైనాను.
స్వామీజీ : మీ ఊరికి ఒకసారి వద్దామనుకొన్నాను.
ఈ మాట వినగానే నాగమహాశయ్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. “ఆ రోజు ఎప్పుడు వస్తుంది? ఆ స్థలమే కాశీగా మారిపోతుంది. ఆ భాగ్యం నాకు లభిస్తుందా?” అంటూ ఉద్వేగంతో అడిగాడు.
స్వామీజీ : అక్కడకు రావాలనే ఉంది. జగజ్జనని తోడ్కొనివస్తే వస్తాను.
నాగమహాశయ్ : మిమ్మల్ని ఎవరు అవగతం చేసుకోగలరు? ఎవరు అవగతం చేసుకోగలరు? అంతర్నేత్రం తెరచుకోకుండా మిమ్మల్ని ఎవరూ అవగతం చేసుకోలేరు. శ్రీరామకృష్ణులు ఒక్కరే మిమ్మల్ని అర్థం చేసుకొన్నారు. తక్కిన వారు ఆయన చెప్పింది నమ్మారు, అంతే. లేకుంటే మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకొన్నారు కనుక!
స్వామీజీ : ఇప్పుడు నా ఏకైక ఆకాంక్ష ఈ దేశాన్ని జాగృతం చేయడమే. తమ శక్తిలో నమ్మకం కోల్పోయి, ఏ విధమైన స్పందనా లేకుండా జనులు నిద్రాణ స్థితిలో ఉన్నట్లుంది. వారిని ఎలాగైనా మేలుకొలిపి, వారిలో సనాతనధర్మ చైతన్యాన్ని పాదుగొలిపితే, మన జన్మ సార్థకమయినట్లు గ్రహించవచ్చు. ఈ ఆకాంక్ష మాత్రమే ఉంది. ముక్తి వగైరాలన్నీ నాకు తుచ్ఛంగా కనిపిస్తున్నాయి. నా ఆకాంక్ష నెరవేరడానికి మీరు ఆశీర్వదించండి.
నాగమహాశయ్ : శ్రీరామకృష్ణులు ఆశీర్వదిస్తారు. మీ ఆకాంక్షకు ఎవరు ఆటంకం కల్పించగలరు? మీరు ఏం అనుకొంటున్నారో అది జరిగే తీరుతుంది.
స్వామీజీ : ఆయన అభీష్టం లేకుంటే ఏదీ జరగదు.
నాగమహాశయ్ : ఆయన అభీష్టమూ మీ అభీష్టమూ ఒక్కటే. మీ అభీష్టమే ఆయన అభీష్టం. జై రామకృష్ణ! జై రామకృష్ణ!
స్వామీజీ : పని చేయడానికి బలిష్ఠమైన దేహం ఉండాలి. పాశ్చాత్యం నుంచి తిరిగి వచ్చినప్పటి నుండి నా ఆరోగ్యం బాగాలేదు. అక్కడ ఉన్నప్పుడు బాగా ఆరోగ్యంతో ఉన్నాను.
నాగమహాశయ్ : దేహం ధరిస్తే అద్దె ఇచ్చే తీరాలని గురుదేవులు చెప్పడం కద్దు. వ్యాధి, దుఃఖమే అద్దె. మీ దేహం బంగారు పేటిక. దానిని ఎంతో జాగ్రత్తగా కాపాడాలి. దానిని ఎవరు చేస్తారు? ఎవరు దీనిని అర్థం చేసుకొంటారు. శ్రీరామకృష్ణులు మాత్రమే అర్థం చేసుకొన్నారు. జై శ్రీరామకృష్ణ! జై శ్రీరామకృష్ణ!
స్వామీజీ : మఠవాసులు నన్ను బాగా సంరక్షిస్తున్నారు.
నాగమహాశయ్ : ఎవరు సంరక్షిస్తున్నారో వారికే మేలు జరుగుతుంది. వారికి ఈ విషయం తెలిసినాసరే తెలియకపోయినా సరే, ఇది ముమ్మాటికీ నిజం. సరిగా అక్కర తీసుకోకపోతే అది నిలవకుండా పోయే ప్రమాదం ఉంది.
స్వామీజీ : నాగమహాశయ్ గారూ! నేను ఏం చేస్తున్నానో, ఏం చెయ్యలేదో అర్థం కావడం లేదు. ఒక ప్రత్యేక పనిలో, ఒక ప్రత్యేక దిశలో పనిచేయాలనే ఉత్సుకత ఉంది, దాని ప్రకారమే పనులు చేస్తున్నాను. అది మంచికా, చెడుకా నాకు అర్థం కావడం లేదు.
నాగమహాశయ్ : పేటిక ఇప్పుడు తాళం వేయబడి ఉందని శ్రీరామకృష్ణులు వచించారు. కనుక పూర్తిగా అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతించరు, మీరు దానిని అవగతం చేసుకొంటే మీ ఇహ జీవితం ముగిసిపోతుంది.
ఇది వినగానే స్వామీజీ ఆరుబయలును చూస్తూ కొంతసేపు దీర్ఘాలోచనలో మునిగిపోయారు. ఆ సమయంలో ప్రేమానంద ప్రసాదం తెచ్చి నాగమహాశయ్కీ, ఇతరులకీ ఇచ్చాడు. నాగమహాశయ్ దానిని దోసిళ్లలో పుచ్చుకొని పరమానందంతో ఆరగించారు.
కాసేపయ్యాక స్వామీజీ కొలను ప్రక్కన పారతో ఏదో త్రవ్వుతూండడం నాగమహాశయ్ కళ్లబడింది. వెంటనే అక్కడకు వెళ్లి ఆయన చేతులు పుచ్చుకొని, “మేం ఇక్కడ ఉన్నప్పుడు మీ రెందుకు ఈ పనులు చేస్తున్నారు?” అని అడిగాడు. స్వామీజీ పారను ప్రక్కన పడేసి తోటలో పచార్లు చేస్తూ నాగమహాశయ్తో కొన్ని సంఘటనలు ప్రస్తావించారు.
నూతన ప్రపంచాన్ని రూపొందిస్తాం!
“ఇక్కడ ఒక నూతన మానవ సంస్థను ఏర్పరచాలి. వారు నిష్కపటంగా భగవద్విశ్వాసపరులై, లౌకికతను దేన్నీ లక్ష్యపెట్టకూడదు”* అని స్వామీజీ ఒకసారి వ్రాశారు. అందుకైన ప్రయత్నాలూ ఆయన పట్టుదలతో చేశారు. ఒక రోజు సాయంత్రం స్వామీజీ కాస్త ఉత్తేజభరితులై పచార్లు చేస్తున్నారు. ఆయన ఆలోచనలు ఎక్కడో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. హఠాత్తుగా నడక ఆపి ప్రక్కనే ఉన్న సన్న్యాస శిష్యుడితో ఇలా అన్నారు. “ఇలా చూడు నాయనా! శ్రీరామకృష్ణులు లోక శ్రేయస్సుకై ఏతెంచారు, లోక శ్రేయస్సు కోసమే జీవితాన్ని అంకితం చేశారు. నేనూ నా జీవితాన్ని అట్లే అంకితం చేస్తాను. మీరు, మీలో ప్రతి ఒక్కరూ అలాగే చేయాలి. ఈ పనులన్నీ ఆరంభం మాత్రమే. మనం రక్తం చిందించి పనిచేశాం, దాన్లో నుంచి మహా వీరులు, భగవంతుని యుద్ధవీరులు ఉద్భవిస్తారు. వారు ఈ ప్రపంచాన్నే నూతనంగా రూపొందిస్తారు!”
“ఇది నెమ్మదిగా, ఎంతో నెమ్మదిగా జరగాల్సిన పని”* అని కూడా ఆయనకు తెలియకపోలేదు. “అయినప్పటికీ నా శక్తి మేరకు చేస్తాను. ఆ తరువాత నా ఉత్సుకతను, ఉద్వేగాన్ని తక్కినవారిలో పాదుగొలిపి నా పనిని కొనసాగిస్తాను, నాకు విశ్రాంతి లేదు. నా మరణం రణరంగంలోనే! నేను పనిచేయడాన్ని అభిలషి స్తాను! సైనిక పరిభాషలో చెప్పాలంటే, జీవితం ఒక పోరాటం, సదా సిద్ధపడి ఉండాలి. నేను పనిచేస్తూనే జీవించాలి, పనిచేస్తూనే మరణించాలి” అనేవారు ఆయన.
ఈ ఉద్వేగంతో ఆయన తమ సన్న్యాస శిష్యులను దేశమంతటా పంపించాలను కొన్నారు. “మానవ సేవ, భగవదనుభూతి – ఇదే సన్న్యాసి ఆదర్శమని ఎన్నటికీ విస్మరించకండి. సదా వాటిని పట్టుకొని ఉండండి. సన్న్యాస మార్గమే తిన్నని మార్గం. సన్న్యాసికీ భగవంతునికీ మధ్య ఏ శిలలూ, ప్రతీకలూ లేవు. ‘వేదాల తల మీద సన్న్యాసి నిలబడి ఉన్నాడు’ అని వేదాలే వచిస్తున్నాయి. ఎందుకంటే దేవాలయం, మతశాఖ, మహాత్ముడు, శాస్త్రాల లాంటి అన్నింటి నుండి వైదొలగి ఉన్నాడు అతడు. ఇలలో సంచార దేవుడతడు. దీనిని సదా జ్ఞాపకం ఉంచుకోండి. సన్న్యాస పతాకాన్ని పుచ్చుకొని, ప్రశాంతత, స్వేచ్ఛ, పావనతలను కూడదీసుకొన్న, ధీరసన్న్యాసులారా! మీ మార్గంలో వేగంగా ముందుకు సాగండి” అని ఆయన యువ సన్న్యాసులను ప్రోత్సహించారు. వారిని దేశంలో అనేక ప్రాంతాలకు పంపి అక్కడ మఠాలను నెలకొల్పడానికి ఏర్పాట్లు చేశారు. అందుకోసం మఠ సన్న్యాసు లను సమావేశపరచి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
‘శక్తిని ప్రసరింపజేస్తున్నాను!’
మొదటి ఘట్టంగా విరజానందను, ప్రకాశానందను ఢాకా పంపించారు. “స్వామీజీ! నాకేం తెలుసు? ఏమీ తెలియదు. నేను వెళ్లి ఏం బోధించగలను?” అంటూ విరజానంద నిరాకరించారు. అందుకు స్వామీజీ, “అదే బోధించు. నీకు ఏమీ తెలియదని జనులకు తెలియ జెయ్యి. అదే గొప్పవార్త అవుతుంది” అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెప్పారు. శిష్యుడు ఇంకా సంకోచించడం చూసి స్వామీజీ ఉరుములా గర్జించారు:
“నీ ముక్తిని మాత్రం అన్వేషించే పక్షంలో నువ్వు నరకానికే పోతావు. నీకు భగవంతుడు కావాలంటే ఇతరుల ముక్తి కోసం పాటుపడు! స్వీయముక్తి అభిలాషను వదలిపెట్టు!” తరువాత మృదువుగా ఇలా అన్నారు: “నా బిడ్డలారా! పనిచేయండి! హృదయపూర్వకంగా పనిచేయండి! ఫలితం గురించి కలత చెంద కండి! ఇతరుల కోసం పనిచేయండి. అందువలన మీరు నరకానికి పోవలసివచ్చినా ఇతరుల కోసం పాటుపడడం నుంచి వైదొలగకండి.”
పిదప విరజానందను, ప్రకాశానందను పూజామందిరానికి తీసుకుపోయి, అక్కడ కూర్చుని ధ్యానం చెయ్యమన్నారు స్వామీజీ. వారు కూర్చోగానే, “నా బిడ్డలారా! ఇదుగో, నా శక్తిని మీలో ప్రసరింపజేస్తున్నాను” అన్నారు.
శారదానందను, తురీయానందను గుజరాత్ పంపించారు. పంపిన ఒక నెలలో ప్రకాశానందను బేలూర్ మఠానికి స్వామీజీ తిరిగి రప్పించుకొన్నారు. తరువాత ఒక నెల గడిచాక తమ అమెరికన్ శిష్యురాలైన అభయానందను ఢాకా పంపించారు. అక్కడ కొన్ని నెలలు పనిచేసి అభయానంద కలకత్తాకు తిరిగి వచ్చారు.*
తమిళంలో మొదటి ప్రయత్నం
తరువాత మరొక పనికి స్వామీజీ సిద్ధమయ్యారు. శ్రీరామకృష్ణుల సందేశమూ, తమ భావనలూ జనసామాన్యానికి చేరాలని స్వామీజీ అభిలషించారు. ఆయన ఈ ఉద్దేశాన్ని ప్రప్రథమంగా కార్యాచరణలో చూపింది తమిళనాడులో! ఆ రోజుల్లో ‘లోకోపకారి’ అనే తమిళ వారపత్రిక చెన్నై నుంచి వెలువడుతున్నది. ఆ పత్రిక సంపాదకుడైన వి. నటరాజ అయ్యర్ ధార్మిక జీవితంలోనూ, సామాజిక ప్రగతి లోనూ ఎంతో ఆసక్తిగల వ్యక్తి. ఈయన స్వామీజీ కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం, చికాగో మహోపన్యాసాలు, ప్రేమమతం, అనుష్ఠాన వేదాంతం నుంచి కొన్ని భాగాలు అనువదించి పత్రికలో ప్రచురిస్తూ వచ్చారు.
తరువాత వీటిని సంకలనం చేసి ‘జ్ఞాన సంగ్రహం’ పేరిట 1898 ఏప్రెల్ 1 వ తేదీన విడుదల చేశారు. దీని రెండవ, మూడవ సంపుటాలు త్వరలో విడుదలవుతాయని అందులో ప్రస్తావించారు. ఈ పుస్తకంతో స్వామీజీ ఛాయచిత్రం ఉచితంగా ఇవ్వబడింది.
ఈ పుస్తకం ప్రతి ఒకదాన్ని స్వామీజీకి, ఒక ప్రతిని చెన్నైలోని రామకృష్ణా నందకు నటరాజ అయ్యర్ పంపించారు. అప్పుడు స్వామీజీ డార్జిలింగ్‌లో ఉన్నారు. ఈ పుస్తకం అందుకొని స్వామీజీ ఎంతో ఆనందించారు. నటరాజ అయ్యర్‌కు జవాబు కూడా వ్రాశారు.
డార్జిలింగ్,
15, ఏప్రెల్ 1898
ప్రియమైన,
మీరు 7 వ తేదీన వ్రాసిన లేఖా, నా ఉపన్యాసాలలో కొన్నింటి తమిళ అనువాద సంకలన పుస్తకమూ అందాయి. చాలా సంతోషం. తమిళనాడు ప్రజలకు, ప్రత్యేకించి మీ పత్రిక చందాదారులకూ నిజంగా మీరు గొప్ప సేవ చేస్తున్నారు. నా అభిప్రాయాలను అన్ని చోట్ల ప్రచారమయ్యేట్లు చేయాలనడంలో సందేహం లేదు; అందుకు తగిన మార్గం వాటిని ప్రాంతీయ భాషలలో అనువదించడమే. దీన్లో మీరు అగ్రగాములవడంలో చాలా ఆనందిస్తున్నాను.
మీ ప్రయత్నంలో సర్వతోముఖ విజయం చేకూరాలని ఆశిస్తున్నాను. ఆశీస్సులు స్వీకరించండి.
మీ
వివేకానంద.
వంగ భాషా పత్రిక
వంగభాషలో ఒక మాసపత్రికను ప్రారంభించడంలో నిమగ్నులయ్యారు స్వామీజీ. భారతదేశానికి వచ్చివున్న సారా, మెక్లౌడ్ అమెరికా తిరిగి వెళ్లే ముందు స్వామీజీని కలుసుకొన్నారు. క్రొత్త మఠ నిర్మాణానికై సారా పెద్ద మొత్తంలో అప్పటికే నిధులు సమకూర్చి ఇచ్చింది. మిస్ మెక్లౌడ్ కూడా తను అనేక సంవత్సరాలుగా పొదుపు చేసిన 800 డాలర్లు స్వామీజీకి సమర్పించింది. అప్పుడు ప్రక్కన నిలబడివున్న త్రిగుణాతీతానందను చూసి స్వామీజీ, “ఇదుగో ముద్రణశాల ప్రారంభించడానికి పైకం వచ్చేసింది. వెంటనే వంగభాషా పత్రికను ప్రారంభించు” అన్నారు. ఈ విధంగా ‘ఉద్బోధన్’ పత్రిక ప్రారంభించబడింది. త్రిగుణాతీతానంద దాని సంపాదకత్వ బాధ్యత స్వీకరించారు.
పరిణామవాదం
ఒక రోజు నివేదిత, యోగానంద, శరశ్చంద్రులతో కలకత్తాలోని అలీపూర్ జంతు ప్రదర్శనశాలకు స్వామీజీ వెళ్లారు. జంతు ప్రదర్శనశాల పర్యవేక్షకుడు వారిని ఎంతో ఆనందంగా ఆహ్వానించి, చుట్టూ త్రిప్పి చూపించాడు. అక్కడున్న నానారకాల జంతువులను చూస్తూ, డార్విన్ పరిణామవాదం గురించి పైపైన మాట్లాడసాగారు స్వామీజీ. పాములు ఉన్న చోటికి వచ్చారు. అక్కడ ఒళ్లంతా వృత్తాకార వలయాలున్న కొండచిలువను చూసి, “ఈ కొండచిలువ నుండే క్రమంగా తాబేలు ఉద్భవించింది. ఇలాంటి పాము దీర్ఘకాలం ఒకే చోట ఉన్నందున దాని వీపు కఠినమైన పెంకులా మారింది” అన్నారు.
తరువాత శరశ్చంద్రతో తమాషాగా, “తూర్పు వంగదేశస్థులైన మీరు తాబేళ్లను తింటారు కదా? ‘పాము క్రమేణా తాబేలుగా రూపాంతరం చెందింది’ అంటున్నాడు డార్విన్. కనుక ఒక విధంగా చూస్తే మీరు పాములను భక్షించేవారు” అన్నారు. ఇది విన్న శరశ్చంద్ర, “పరిణామ విధి ప్రకారం ఒక జంతువు మరొకటిగా రూపాంతరం చెందుతున్నప్పుడు దానికి మునుపటి రూపమూ, లక్షణాలూ ఉండవు. కనుక తాబేళ్లను తినడం పాములను తినడంతో సమానం కాదు” అంటూ నిరాకరించాడు. అందరూ నవ్వారు.
ఇంకా కొన్ని జంతువులను చూసిన తరువాత స్వామీజీ అక్కడున్న రాంబ్రహ్మ బాబు ఇంటికి వెళ్లారు. అక్కడ తేనీరు సేవించారు. నివేదిత ప్రక్కన కూర్చోవడమూ, ఆమె తాకిన మధురభక్ష్యం, తేనీరు వగైరాలను తాకే విషయంలో శరశ్చంద్ర సంకోచించడం చూసి స్వామీజీ, శరశ్చంద్రతో నివేదిత ప్రక్కన కుర్చీలో కూర్చో మనీ, మధురభక్ష్యాన్నీ, తేనీటినీ స్వీకరించమనీ చెప్పారు. శరశ్చంద్ర ఆయన ఆదేశాన్ని శిరసావహించాడు. స్వామీజీ నీరు త్రాగి మిగిలింది శరశ్చంద్రకు ఇచ్చారు. శరశ్చంద్ర ఆ మిగిలిన నీరు త్రాగాడు. ఆ తరువాత డార్విన్ పరిణామ వాదం గురించిన చర్చ సాగింది.
రాంబాబు : డార్విన్ పరిణామవాదం గురించీ, ఆ వాదాన్ని ఋజువు పరచడానికి ఆయన తెలిపే కారణాలను గురించీ మీ అభిప్రాయం ఏమిటి?
స్వామీజీ : మాటవరుసకు ఆయన వాదం సరియైనదని అనుకొందాం, ప్రాణుల పరిణామానికి అదే నిశ్చయమైన కారణమని నేను అంగీకరించలేను.
రాంబాబు : మన ప్రాచీన జ్ఞానులు దీనిని గురించి ప్రస్తావించారా?
స్వామీజీ : సాంఖ్య తత్త్వంలో చక్కగా ప్రస్తావించబడింది. పరిణామం గురించిన అభిప్రాయంలో ప్రాచీన భారతీయ జ్ఞానుల అభిప్రాయమే నిశ్చితా భిప్రాయమని నేననుకొంటున్నాను.
రాంబాబు : దానిని గురించి క్లుప్తంగా చెప్పగలరా?
స్వామీజీ : జీవన సంఘర్షణ (Struggle for Existence), బలమైనదే మిగలడం (Survival of the Fittest), స్వతస్సిద్ధ ఎంపిక (Natural Selection) మొదలైన నియమాల గురించి మీకు తెలిసే ఉంటుంది. అతి చిన్నప్రాణి అతి పెద్ద ప్రాణిగా పరిణమించడానికైన కారణాలుగా వీటిని పాశ్చాత్య మేధావులు పేర్కొంటున్నారు.
“కాని పతంజలి యోగశాస్త్రంలో ఇవి కారణాలుగా ప్రస్తావింపబడలేదు. ఒక జాతి మరొక జాతిగా పరిణమించడం ప్రకృతి పరిణామ సమాప్తి వల్ల (ప్రకృత్యాపూరాత్) అంటున్నారు పతంజలి.* ఆటంకాలకు వ్యతిరేకంగా రేయిం బవళ్లు పోరాడడం కారణం కాదు. నా ప్రకారం పోరాటాలూ, పోటీలూ, కొన్ని సమయాలలో, ప్రాణి పరిపూర్ణత చెందడానికి అడ్డంకులుగా ఉన్నాయి. పాశ్చాత్యుల అభిప్రాయంలా వేలాది ప్రాణులు నశించడం వలననే ఒక ప్రాణి పరిణ మిస్తుందంటే, అటువంటి పరిణామం వలన లోకానికి ఎలాంటి శ్రేయస్సూ ఉండదు. పోరాటాల వలన బహుశా భౌతిక వృద్ధి ఉంటుందనుకొన్నా ఆధ్యాత్మిక పెరుగుదలకు ఇదొక పెద్ద అడ్డంకని అంగీకరించే తీరాలి.
“మన దేశ తత్త్వజ్ఞుల అభిప్రాయం ప్రకారం, ప్రాణమన్నది పరిపూర్ణ ఆత్మ. మార్పులన్నీ ఆత్మ అభివ్యక్తీకరణలోని తారతమ్యమే అవుతాయి. పరిణామ వృద్ధికీ, ప్రకృతి అభివ్యక్తీకరణకూ అడ్డంకులుగా ఉన్నవి తొలగింపబడ్డాక ఆత్మ పరిపూర్ణంగా అభివ్యక్తమవుతుంది. ప్రకృతి అభివ్యక్తీకరణ చిన్న ప్రాణులలో ఎలా ఉన్నప్పటికీ ఉన్నత ప్రాణులలో, సదా అడ్డంకులను ప్రతిఘటించి జరిపే పోరాటాల వల్లనే అవి పరిణమించగలుగుతాయనడం సబబు కాదు. పోరాటం కన్నా విద్య, సంస్కృతి, మనఃసమైక్యత, ధ్యానం, ముఖ్యంగా త్యాగం వలననే అడ్డంకులు తొలగిపో తున్నాయి. అందుకు తగ్గట్లు ఆత్మ కూడా అభివ్యక్తమవుతుంది… హాని కలిగించే వేయి మందిని చంపడం వలన హానిని లోకం నుండి తొలగించ ప్రయత్నించడం వల్ల లోకంలో హాని అధికరిస్తుంది. కాని ఉపదేశాల ద్వారా హాని కలిగించకుండా ఆ జనులను ఆపగలిగితే లోకంలో హాని ఉండదు. పాశ్చాత్యుల ఈ పోరాట సిద్ధాంతం ఎంతటి భయంకరమైనదో చూడండి!”
స్వామీజీ మాటలు విని రాంబాబు ఆశ్చర్యపోతూ, “భారత దేశానికి మీ లాంటి ప్రాచ్య, పాశ్చాత్య తత్త్వాలలో ఆరితేరినవారే తక్షణ అవసరం. దీన్లోని ఏకపక్షాన్నే స్వీకరించే నేటి విద్యావంతుల తప్పులను అటువంటి వ్యక్తులే సరిదిద్దగలరు. పరిణామవాదం గురించిన మీ విశదీకరణ విని నేను పరమానంద భరితుణ్ణయ్యాను” అన్నారు.
కాసేపట్లో స్వామీజీ, తక్కినవారూ అక్కణుంచి బయలుదేరి బాగ్‌బజార్‌లోని బలరాం బోస్ ఇంటికి చేరుకొన్నారు. అప్పుడు రాత్రి 8 గంటలయింది. కాసేపు విశ్రమించి స్వామీజీ ఆహ్వానితుల గదిలోకి వచ్చారు. అక్కడ, ఆయన జంతు ప్రదర్శనశాలలో క్లుప్తంగా పరిణామవాదం గురించి వ్యక్తం చేసిన అభిప్రాయం విశదంగా వినడానికి ఒక చిన్న గుంపు ఉత్సుకతతో నిరీక్షిస్తున్నది. స్వామీజీ గదిలోకి రాగానే, శరశ్చంద్ర దానిని గురించి ప్రస్తావించాడు.
శరశ్చంద్ర : స్వామీజీ! మీరు జంతుప్రదర్శనశాలలో పరిణామ వృద్ధి గురించి వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. దానిని సులభంగా అర్థమయ్యేలా చెప్పండి.
స్వామీజీ : అర్థం కాలేదా! ఏ భాగం అర్థం కాలేదు?
శరశ్చంద్ర : మీరు తరచూ మాతో, బాహ్యశక్తులను ప్రతిఘటించి పోరాడే శక్తే ప్రాణం ఉన్నదనడానికి గుర్తుగా, ప్రగతికి మొదటి మెట్టుగా ఉందని వచించారు. ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా చెబుతున్నారే!
స్వామీజీ : నే నెందుకు వ్యతిరేకంగా చెబుతాను? నువ్వే సరిగా అర్థం చేసుకోలేదు. వారు చెప్పే జీవన పోరాటం, బలమైనదే మిగలడం మొదలైన నియమాలు జంతుప్రపంచంలో స్పష్టంగా చూస్తున్నాం. అందుకే డార్విన్ సిద్ధాంతం దాదాపు సరియైనదని తోస్తున్నది. కాని హేతువాదుల ఈ నియమాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఉదాహరణకు మనం ఎవరిని మహాత్ములుగా, ఆదర్శనీయు లుగా స్వీకరిస్తామో, వారిలో ఈ బాహ్యపోరాటం ఏదీ కానరాదు. జంతువులలో అంతఃప్రేరణ (instinct) ఎక్కువ. కాని మనిషిలో పెరిగే స్థాయికి అతడిలో హేతువాదం (rationality) ఎక్కువగా కానవస్తుంది. కనుక జంతు ప్రపంచంలో ఒకటి తక్కిన వాటిని నశింపజేయడంలో పెంపు ఏర్పడే విధంగా హేతువాదంతో నిండిన మానవాళిలో ఏర్పడదు.
“మనిషి అత్యంత ఉన్నత పరిణామం త్యాగం ద్వారా మాత్రమే కలుగు తుంది. ఒక వ్యక్తి తక్కినవారి కోసం ఏ మేరకు త్యాగం చేస్తాడో ఆ మేరకు అతడు ఉన్నతుడు. జంతుజాలంలో, ఏ జంతువు తక్కిన జంతువులను ఎక్కువగా వధిస్తుందో, అదే జంతువుల్లో అమిత బలం గలదిగా పరిగణింపబడుతున్నది. కనుక ఈ పోరాట సిద్ధాంతం రెండు వైపులకూ సమన్వయించడం కుదరదు. మనిషి పోరాటం మనస్సులో జరుగుతుంది. మనస్సును నియంత్రించే మేరకు మనిషి ఉన్నతుడవుతాడు. మనిషి కార్యాచరణ పూర్తిగా నియంత్రించబడినప్పుడు మాత్రమే ఆత్మ అభివ్యక్తమవుతుంది. శరీర సంరక్షణకై జంతువులలో జరిగే పోరాటం, మనిషిలో మనస్సును నియంత్రించడం లేదా మనస్సును సత్త్వస్థితిలో నెలకొల్పడం కోసం జరిగే పోరాటంగా పరిణమిస్తుంది. యథార్థమైన చెట్టు, నీటిలో ప్రతిబింబించే దాని నీడలా జంతువుల జీవితంలోను మనిషి జీవితంలోను పోరాటాలు విభిన్నంగా ఉన్నాయి.”
శరశ్చంద్ర : అలా అయితే మీ రెందుకు దేహదార్యాన్ని అంతగా నొక్కివక్కాణిస్తున్నారు!
స్వామీజీ : మిమ్మల్ని మనుషులనా భావించుకొంటున్నారు? మీలో ఏదో కొంత హేతువాదం ఉంది, అంతే. దేహదార్యం లేకుంటే మనస్సుతో ఎలా పోరాడతారు? పరిణామంలోని అత్యున్నత సోపానమైన ‘మనిషి’ స్థితిలోనా మీరు ఉంటున్నారు? తినడం, నిద్రించడం, పిల్లల్ని కనడం మాత్రమే తప్ప మీలో మరేదన్నా విశిష్టత ఉందా ఏమిటి? మీరు ఇంకా నాలుగు కాళ్ల జంతువులుగా కాకుండా ఉండడం మీ అదృష్టం. “ఆత్మచేతన, (మాన్; self-conscious) ఆత్మగౌరవం (హూష్; self dignity) ఉన్నవాడే మనిషి (మానుష్; man)” అని శ్రీరామకృష్ణులు వచించేవారు. మీరో వృథాగా జన్మించి మరణించే ప్రాణులు. స్వదేశస్థుల అసూయకూ, ఇతర దేశస్థుల ద్వేషానికీ గురియై శోచనీయ స్థితిలో ఉన్నారు. మీరు కేవలం మృగప్రాయులు. అందుకే మిమ్మల్ని పోరాడమంటున్నాను. తత్త్వాలనూ వీటినీ వాటినీ ప్రక్కన పెట్టండి. దైనందిన జీవితమూ కార్యాచరణనూ కాస్త ప్రశాంతంగా గమనించండి. మనుషులకూ, జంతువులకూ మధ్య స్థితిలో మీరు ఉన్నట్లు అప్పుడు గ్రహిస్తారు. ముందు దేహదార్యాన్ని పెంపొందించుకోండి. ఆ తరువాతే మనస్సును నియంత్రించ గలుగుతారు. “నాయమాత్మా బలహీనేన లభ్యో… ఈ ఆత్మ దుర్బలులకు లభ్యం కాదు.” * అర్థమయిందా?
శరశ్చంద్ర : స్వామీజీ! ఈ దుర్బల మనే పదానికి బ్రహ్మచర్యం నుంచి దిగజారడమని కదా రచయిత (శంకరాచార్యులు) అర్థం చెబుతున్నారు.
స్వామీజీ : చెప్పనీ! దేహం బలహీనమైన వ్యక్తి ఆత్మను పొందడానికి అనర్హుడని నేను చెబుతున్నాను.
శరశ్చంద్ర : కాని మూఢులు అనేకులు దేహదార్యం కలిగి ఉన్నారే!
స్వామీజీ : కాస్త ప్రయాసతో ఒకసారి వారికి సద్భావనలను అందిస్తే దుర్బలుల కన్నా వారు సత్వరమే దానిని ఆచరణలో పాటిస్తారు. బలహీన దేహులు కామాన్నో, కోపాన్నో నియంత్రించడం దాదాపు అసాధ్యమని నీకు తెలియదా? సన్నని వారు అతి సులభంగా కోపవశవర్తులవుతారు, కామాతురులవుతారు.
శరశ్చంద్ర : కాని నియమానికి అతీతులయిన వారు కూడా ఉన్నారు.
స్వామీజీ : లేరని ఎవరన్నారు? ఒకసారి మనస్సు నియంత్రించబడిందంటే తరువాత ఆతడు దేహదార్యంతో ఉన్నాడో లేదా బలహీనుడై ఉన్నాడో పరిగణనలోకి రాదు. నిజమేమిటంటే, బలిష్ఠమైన దేహం లేనివాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాడు.
స్వామీజీ ఉద్వేగభరితులై మాట్లాడడం చూసి శిష్యుడు ఆ పైన ఆ మాటలు కొనసాగించదలచుకోలేదు. ప్రశాంతంగా ఉండిపోయాడు. కాసేపు గడిచింది. స్వామీజీ అక్కడ సమావేశమైన వారిని చూస్తూ, “ఈ పురోహితుడు నేడు నివేదిత తాకిన ఆహారం తిన్నాడు తెలుసా? ఆమె తాకిన మధురభక్ష్యం కూడా తిన్నాడు. అదైనా ఫరవాలేదు, (శిష్యుణ్ణి చూస్తూ) ఆమె తాకిన నీటిని నువ్వెలా త్రాగావు?” అన్నారు.
శరశ్చంద్ర : అలా చేయమని ఆదేశించింది మీరు. గురువు ఆదేశాన్ని నేను శిరసావహిస్తాను. ఆ నీటిని త్రాగడం నాకు ఇష్టం లేకపోయిన్పటీ, మీరు త్రాగి నా కిచ్చారు కనుక దానిని నేను ప్రసాదంగా స్వీకరించాను.
స్వామీజీ : అలాగా! ఇప్పుడు నీ కులం మంటగలిసింది, ఇకపై నిన్నెవరూ బ్రాహ్మణునిగా గౌరవించరు.
శరశ్చంద్ర : గౌరవించకపోతే పోనివ్వండి, మీరు ఆదేశిస్తే నిమ్నకులస్థుని ఇంట్లో సైతం తింటాను.
శరత్ మాటలు స్వామీజీని, అక్కడున్న వారిని ఘొల్లున నవ్వేలా చేశాయి.
వినమ్రతలో వినమ్రత
ఈ రోజుల్లో స్వామీజీ మరొక ముఖ్యమైన పని కూడా చేశారు. శ్రీరామ కృష్ణులు నిష్క్రమించిన తరువాత ఆయన పావన అస్థికలను ఎక్కడ ప్రతిష్ఠించాలన్న విషయంలో ఆయన గృహస్థ శిష్యులకూ సన్న్యాస శిష్యులకూ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం ఇంతకు మునుపే చూశాం. రోజులు గడిచేకొద్దీ ఇంకా కొన్ని అభిప్రాయభేదాలు చోటుచేసుకొన్నాయి. స్వామీజీ శ్రీరామకృష్ణుల వద్దకు రావడానికి ఒక రకంగా కారణమైన రామచంద్ర దత్తా, మరికొందరు సన్న్యాస శిష్యుల నుండి కాస్త వైదొలగసాగాడు. ఈ తాత్కాలిక ఎడబాటుకు శాశ్వతమైన పరిష్కారం కనుగొనాలనుకొన్నారు స్వామీజీ. వ్యాధిగ్రస్థుడై పడకబెట్టిన రామచంద్రను వెళ్లి కలుసుకొన్నారు.
అదొక అద్భుతమైన సమావేశం. కాసేపు ముచ్చటించుకొన్న తరువాత రామచంద్ర మరుగుదొడ్డికి వెళ్లడానికి పడక మీద నుంచి లేచాడు. స్వామీజీ వెంటనే లేచి, కాస్త దూరంలో ఉన్న ఆయన చెప్పులు ప్రక్కన పెట్టి, ఆయన వాటిని ధరించడంలో సహాయం చేశారు. రామచంద్ర ద్రవించిపోయాడు. “అమెరికా వెళ్లిన తరువాత నువ్వు సుప్రసిద్ధుడివయ్యావు, మమ్మల్నందరినీ మరచిపోయావను కొన్నాను. అనేకులు నాతో అట్లే చెప్పారు కూడా. కాని నువ్వు అదే పాత ‘బిలే’ గానే ఉన్నావు. నీలో ఎలాంటి మార్పూ లేదు, నేను తప్పుగా అర్థం చేసుకొన్నాను. శ్రీరామకృష్ణులు నిన్ను ఎందుకు ‘చూడామణి’ అని పేర్కొన్నారో ఇప్పుడే అవగతం చేసుకొన్నాను. నన్ను క్షమించు. నువ్వు క్షమిస్తేనే గురుదేవుల వద్ద ఏదో కాస్త చోటు లభిస్తుంది” అన్నాడు ఉద్వేగం పొంగిపొర్లగా. అనవసరమైన అభిప్రాయ భేదాలను వదలివేయమని స్వామీజీ కూడా వినమ్ర ధోరణిలో చెప్పారు. రామచంద్ర విలపిస్తూ, “క్షమించానని నువ్వు ఒక్కసారి చెప్పకపోతే శ్రీరామకృష్ణులు నన్ను స్వీకరించరు” అన్నాడు. అందుకు స్వామీజీ, “ఆ భయం మీ కొద్దు. గురుదేవుల ప్రక్కన నాకు చోటు లభిస్తే మీకూ లభించే తీరుతుంది” అన్నారు దృఢంగా. దాంతో రామచంద్ర దత్తా సాంత్వన చెందాడు.
మిస్ ముల్లర్ కల్పించిన ఆవేదన
దేహ బాధలు ఒక వైపు ఉండగా మరో వైపు స్వామీజీ మానసిక బాధలను భరించవలసి వచ్చింది. ఆయన పట్ల ఎంతో భక్తిప్రపత్తులతో మెలగిన మిస్ ముల్లర్ హఠాత్తుగా స్వామీజీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. మొండి పట్టుదల, దూరాలోచన లేకుండా వ్యవహరించడం ఆమె నైజం. స్వామీజీ వద్దకు రాక పూర్వం ఇలాగే ఒక రోజు హఠాత్తుగా దివ్యజ్ఞాన సమాజం నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. 1895 జూలై 16 వ తేదీన, ‘మెడ్రాస్ మెయిల్’ పత్రికలో ఆమె ప్రకటన వెలువడింది. ఆమె హఠాత్ నిర్ణయాన్ని ‘మెడ్రాస్ మెయిల్’, ‘మహాబోధి జర్నల్’ లాంటి పత్రికలు తీవ్రంగా విమర్శించాయి. “భారతదేశం స్వయంగా వీరాంగనలను రూపొందించ లేకపోవచ్చు. అందుకోసం ఇలాంటి మతిచెడిన, తరచు రంగుమార్చే స్త్రీలను స్వీకరించడం వలన పెద్దగా మంచి ఏదీ జరగబోదు. మిస్ ముల్లర్ చర్య ఎంతో నిరాశను కలిగిస్తున్నది” అనే వార్త ‘మెడ్రాస్ మెయిల్’ లో సెప్టెంబర్ 30 వ తేదీన వెలువడింది. “ఇంకా వేయి జన్మలు ఎత్తిన తరువాతే మిస్ ముల్లర్ యథార్థమైన హైందవ స్త్రీ గుణగణాలతో జన్మించడం సాధ్యం” అని ‘మహోబోధి జర్నల్’ వ్రాసింది.
ఈ సంఘటనానంతరమే ముల్లర్ స్వామీజీ వద్దకు వచ్చింది. అనేక సత్కా ర్యాలలో స్వామీజీకి మద్దతు నిచ్చింది, అంతెందుకు బేలూర్ మఠ స్థలమే ఆమె చలువ. కాని ఆమె నైజ గుణం హఠాత్తుగా తలెత్తింది; ఆమె స్వామీజీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. నివేదిత ఇలా వ్రాస్తున్నది: “శ్రీరామకృష్ణులు, స్వామీజీ, ధ్యానం, మత సామరస్యం లాంటి అన్నింటినీ బయటికి విసరివేయ బోతున్నట్లు మిస్ ముల్లర్ నాతో చెప్పింది. ‘హిందూమతం సురతాభిలాష (eroticism) గలది’, ‘నామజపం నిష్ప్రయోజనమైనది’, ‘ధ్యానం అసహ్యమైనది’ అంటూ వ్యాఖ్యానిస్తున్నది. తను ఒక ఉద్వేగభరితురాలైన క్రైస్తవ మహిళగా, స్వర్ణయుగం దిశగా పోతున్నట్లు ఆమె చెప్పింది. నేను స్వామీజీని గురించి ప్రస్తావించగా ఆమె, ‘ఆహా, నువ్వు ఎక్కువ రోజులు ఆయనను అభిమానించవు’ అని చెప్పింది.”
మిస్ ముల్లర్ వైదొలగినందుకు గల కారణాలను శారదానంద మెక్లౌడ్కు ఇలా తెలుపుతూ వ్రాశారు: “పాపం, మిస్ ముల్లర్ బుధవారం నాడు (1899 జనవరి 18 వ తేదీన) ఇంగ్లండ్‌కు బయలుదేరింది. అక్కడకు వెళ్లి మరో దారిలో ప్రయత్నిస్తుందో ఏమో!… బయలుదేరడానికి ముందు నివేదిత వ్రాసిన లేఖ, గులాబీమాలలు, పండ్లు మొదలైనవి కాళీకృష్ణతో ఆమెకు పంపించాం. ముల్లర్ వైదొలగడానికిగల కొన్ని కారణాలు ఇవి –
“1. స్వామీజీ గారడీ విద్య ప్రదర్శించడానికీ, దానికి సంబంధించి ఒక సంఘాన్ని ప్రారంభించడానికీ ప్రయత్నించారు. కాని విఫలులయ్యారు. ఆయన వైఫల్యం గురించి భారతదేశంలోని గారడీవిద్యలోని నిష్ణాతులైన కొందరు గురువర్యులు కూడా చెప్పివున్నారు. అందువలన ముల్లర్‌కి స్వామీజీ పట్ల గల అభిమానం వాడిపోయి ఒక పువ్వులా రాలిపోయింది.
“2. భారతదేశం మంత్రవేత్తల దేశం. ఆహారం లాంటివి కూడా మనం గారడీ మూలంగానే పొందుతున్నాం. మన ప్రియమైన బామ్మ (మిసెస్ సారా బుల్), మిమ్మల్ని, తక్కిన పలువురిని మేం వశవర్తులను చేసి ఉంచుకొన్నాం. అందుకే మీరు మా పట్ల భక్తి చూపుతున్నారు.
“3. తమకు లభించిన ఈ అద్భుత అనుభవాలను ఇంగ్లండ్ అంతటా తెలుపడం ముల్లర్ పావన కర్తవ్యం. కనుక ఆమె ఇంగ్లండ్‌కు వెళ్లవలసి వచ్చింది.
“4. మేం క్రైస్తవులుగా మారనంత దాకా స్వామీజీకో, మాకో గతి లేదు. ‘కాని ముల్లర్‌కు జ్ఞానస్నానం కాలేదన్నది వేరే సంగతి’ అంటున్నారు స్వామీజీ.”
కారణాలు ఏవైనప్పటికీ మిస్ ముల్లర్ వైదొలగడం క్రైస్తవులకు ఆనందా న్నిచ్చింది. ‘ఇండియన్ సోషియల్ రిఫార్మర్’ డిసెంబర్ 25 వ తేదీన ఇలా వ్రాసింది:’ “క్రైస్తవ సోదరులకు ఇది ఒక క్రిస్మస్ కానుక! ఇదొక వార్త. హిందూమతాన్ని ప్రచారం చేయడానికి స్వామి వివేకానంద ప్రారంభించిన సంస్థతో తనకున్న సంబంధాన్ని మిస్ ముల్లర్ తెగతెంపులు చేసుకొంది. విశ్వసనీయమైన వార్త ఇప్పుడే అందింది.”
అంతటినీ స్వామీజీ మౌనంగా స్వీకరించారు. “ఆధ్యాత్మికవాదికి జబ్బు చేయ దని మిసెస్ జాన్సన్ అభిప్రాయం. నేను పొగత్రాగడం పాపకృత్యమని ఆమెకిప్పుడు అనిపిస్తున్నది. మిస్ ముల్లర్ నన్ను వదలిపెట్టడానికి కూడా నా జబ్బే కారణం. నాకు తెలిసినంత వరకు వారి అభిప్రాయం యథార్థమే. నీ అభిప్రాయం యథార్థమే కాని నేను ఎప్పుడూ ఒకలాగే ఉన్నాను”* అంటూ ఆయన స్టర్డీకి వ్రాశారు.
లియాన్ లాన్స్బర్గ్ (కృపానంద) తమ నుంచి వైదొలగినప్పటికీ స్థిరమైన ప్రేమతో ఆతణ్ణి అభిమానించినట్లే ముల్లర్‌ను కూడా స్వామీజీ అభిమానించారు. అయినప్పటికీ అభిమానించిన వ్యక్తి వైదొలగడం మానసికంగా బాధే కదా! తమ బాధను క్రిస్టైన్కు స్వామీజీ ఇలా వ్రాశారు: “ఆమె నా నుండి విడిపోవడం నాకు పెద్ద దెబ్బ. కారణం ఆమెను అంతగా ప్రేమించాను. అంతేగాక ఆమె గొప్ప సహాయకురాలు, కార్యకర్త. భౌతిక సంపదలు, తెలివితేటలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. కాని అప్పుడప్పుడు నా మాదిరే తీవ్రమైన ఉద్రేకాలకు గురవుతుంది. ఇప్పుడు ఆమె వయస్సు మన్నించడానికి మంచి అవకాశంగా ఉంది.”*
స్వామీజీ మార్గం
అది స్వామీజీ మార్గం. ఎవరి అపరాధాలనూ ఆయన పెద్దవి చేయరు, ఎవరి సద్గుణాలను చిన్నవిగా చూడరు. ఇతరుల అణువంత మంచిని పర్వతంలా గాంచారు; పర్వతమంత అపరాధాలను అణువుగా చూశారు! ఇంతటి సంబంధం కారణంగానే ఆయన మాట్లాడిన, చింతన చేసిన, ప్రయత్నించిన, సాధించిన ప్రతి ఒక్కటీ అర్థం చేసుకోబడ్డాయి. అర్థం కాకపోయినా ఆయన ఉద్వేగమూ, శక్తీ ప్రతి ఒక్కరికీ ప్రేరణగానే పరిణమించాయి. సోదర సన్న్యాసులు అయినప్పటికీ, శిష్యులు అయినప్పటికీ వారి సాధనలను పరిగణించి స్వామీజీ వారిని బేరీజు వేసేవారు కారు. ఏ మేరకు నిమగ్నులై వారు పనిచేశారో మాత్రమే ఆయన చూశారు. తమ శక్తి మేరకు పనిచేసివుంటే చాలు, ఫలితం ఏదైనప్పటికీ ఆయన సంతృప్తి చెందేవారు.
మనిషి ఆత్మలో, దాని అనంత శక్తిలో ఆయనకు అనంత నమ్మకం. ఆ శక్తినే ఆయన ఇతరులలో రగిలించారు, అదే స్వామీజీ విధానం.
అద్వైత ఆశ్రమం
1899 జనవరిలో స్వామీజీ అభిలాషలు రెండు నెరవేరాయి. దక్షిణేశ్వర దేవాలయంలోకి ఆయన ప్రవేశించకూడదని నిషేధించిన తరువాత శ్రీరామకృష్ణుల జయంతి మహోత్సవాన్ని శాశ్వతమైన చోట జరుపుకోవాలని ఆయన ఎంతో ఆతురత చెందారు. క్రిందటి సంవత్సరం అది నెరవేరలేదు. బేలూర్‌లో స్థలం కొనుగోలు చేసినప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఈసారి బేలూర్ మఠంలో ప్రప్రథమంగా శ్రీరామకృష్ణ జయంతి వేడుకలు జరుపుకొన్నారు. ఆ రోజు జరిగిన బహిరంగ సమావేశంలో స్వామీజీ పాల్గొన్నారు; నివేదిత ఉపన్యసించింది.
రెండవ అభిలాష – హిమాలయాల్లో ఆశ్రమం నెలకొల్పడం. ఇంతదాకా తగిన స్థలం లభించలేదు, ఇప్పుడు అది లభించింది. అల్మోరా జిల్లాలో పర్వతం మీద 6800 అడుగుల ఎత్తులో ఉన్న మాయావతి అనే అందమైన స్థలాన్ని ఎంపిక చేశారు. దట్టమైన అరణ్యం, చుట్టూ అందమైన పర్వతాలు, త్రిశూల్, నందాదేవి లాంటి మంచుపర్వత శిఖరాల దృశ్యాలతో ఆ స్థలం ఆధ్యాత్మిక జీవితానికి అద్భుత వాతావరణాన్ని అందించేలా భాసించింది.
ఆ స్థలంలో అద్వైతాశ్రమాన్ని నెలకొల్పాలని స్వామీజీ ఆకాంక్ష. అద్వైత మన్నది వేదాంతంలో ఒక శాఖ, ఆదిశంకరులు దీనికి ప్రాచుర్యం కల్పించారు. ఈ మార్గంలో ఆకారాలో, ఆలయాలో, ఆరాధనలో ఉండవు. అత్యున్నత స్థితిలోని సాధకులకే ఈ మార్గం సాధ్యమవుతుంది. రామకృష్ణ సన్న్యాసులలో కొందరైనా ఆ అత్యున్నత స్థితి సాధనను అనుష్ఠించాలని స్వామీజీ ఆశించారు. అందుకోసమే మాయావతిలో అద్వైతాశ్రమం స్థాపించగోరారు. 1899 మార్చ్‌లో ఆ ఆశ్రమ నిమిత్తం వ్రాసిన ప్రకటనలో దాని లక్ష్యాన్ని క్రింది విధంగా అభివర్ణించారు:
“ఎవనిలో ఈ విశ్వం ఉందో, ఎవడు ఈ విశ్వంలో ఉన్నాడో, ఈ విశ్వమే తానై ఎవడున్నాడో, ఎవడు ఆత్మలో ఉన్నాడో, ఎవనిలో ఆత్మ ఉందో, ఎవడు జీవునికి ఆత్మభూతుడో, అలాంటి పరమాత్మ జ్ఞానం వలన, అంటే విశ్వాత్మత్వం సాధించడం వలన భయం సమస్తం తొలగిపోతుంది. దుఃఖం మాయమవుతుంది. శాశ్వత ముక్తి లభిస్తుంది… ఈ సిద్ధాంతం వ్యక్తుల, జనసమూహ జీవితాలను ఉన్నత స్థితికి కొనిపోవడానికి తగిన ధారాళమైన, పరిపూర్ణమైన అవకాశాన్ని కల్పించడానికి ఈ హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ఈ సిద్ధాంతానికి తొలి జన్మభూమిలో మేం ఈ మఠాన్ని ప్రారంభిస్తున్నాం….”*
ఆంగ్ల మాసపత్రిక అయిన ప్రబుద్ధ భారత కార్యాలయాన్నీ, ముద్రణశాలనూ మాయావతికి మార్చారు. స్వామీజీ శిష్యుడైన స్వరూపానంద ఆ పత్రికకు సంపాదకుడయినాడు. అద్వైతాశ్రమం రూపొందడానికి ముఖ్య కారకుడైన సేవియర్ దానికి ప్రచురణకర్తయైనాడు.
యోగానంద స్వామి నిష్క్రమణ
1899 మార్చ్. గిరీశ్ ఇంటికి సమీపంలోని అద్దె ఇంట్లో మాతృదేవి నివసిస్తున్నారు. ఆమెను సేవిస్తూ యోగానంద కూడా అక్కడే ఉన్నారు. కాని ఆయనకే ఆరోగ్యం దెబ్బతిని పడకబెట్టారు. కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లోనే యోగానంద మహాసమాధి చెందారు. అవి ఆయన ఆఖరి క్షణాలని గ్రహించే కాబోలు స్వామీజీ నాడు అక్కడకు వెళ్లారు! తుదిశ్వాస విడిచేదాకా ఆయన ప్రక్కనే ఉండిపోయారు స్వామీజీ. నామ జపాదులు ఏవీ చేయలేదు. తమ అనుంగు సోదరుని ప్రశాంతంగా విడిచిపోయేలా వదలిపెట్టారు. సాయంత్రం 3 గంటలప్పుడు స్వామీజీ యోగానంద భౌతిక కాయానికి ఆరతిచ్చి, నైవేద్యం సమర్పించారు. శ్మశానానికి వెళ్లకుండా మౌనంగా కూర్చుండిపోయారు. “ఒక ఇటుకరాయి పడిపోయింది. ఇక ఒక్కొక్కటిగా పెంకులు, పైకప్పు అన్నీ పడిపోతాయి” అని ప్రశాంతంగా వ్యాఖ్యానించారు.
మళ్లీ ప్లేగు
1899 మార్చ్‌లో కలకత్తాలో ప్లేగువ్యాధి మళ్లీ తలెత్తింది. నిత్యం అనేక ప్రాణాలను బలిగొన్న ఆ వ్యాధి ప్రజలలో భయాందోళనలను కలిగించింది. 1897 లో ఈ వ్యాధి తాండవించినప్పుడు వ్యాధి వ్యాపించడాన్ని నిరోధించడానికి, రోగులను రక్షించడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. అనేక కారణాల వలన ఈసారి ప్రభుత్వం చూసీ చూడనట్లు ఉండిపోయింది. ప్రజలు అజ్ఞానంలో పడివుంటే ప్రభుత్వం ఏం చేయగలదు, ఈ ‘స్వదేశీ’ యులను ‘పరిశుద్ధం’ చేయలేమనుకొని ప్రభుత్వం చేతులు ముడుచుకొంది.
స్వామీజీ అలా ఉండలేకపోయారు. ప్లేగు మళ్లీ తలెత్తుతుందని ఆయన ఎదురుచూశారు. కనుక వెంటనే నివారణ కార్యం చేపట్టారు. మార్చ్ 31 తేదీన నివారణ కార్యం ప్రారంభమయింది. నివేదిత ఆ కార్యక్రమానికి అధ్యక్షురాలిగానూ, కార్యదర్శిగాను వ్యవహరించింది. సదానంద కార్యాలయ నిర్వాహకునిగాను, శివా నంద, నిత్యానంద, ఆత్మానందలు సహాయ నిర్వాహకులుగాను వ్యవహరించారు.
స్వామీజీ ఆరోగ్యం ఆ సమయంలో బాగా దిగజారింది. అంతేగాక, ఆయన సోదర సన్న్యాసియైన యోగానంద మహాసమాధి చెంది ఒక వారమే గడిచింది. ఆ శోకం నుంచి కూడా ఆయన బయటపడలేదు. కాని స్వామీజీ తమ మనశ్శరీరాల బాధలను వేటినీ ఖాతరు చేయకుండా ప్లేగు తీవ్రంగా వ్యాపించిన మురికివాడలకు వెళ్లి, అక్కడే బస చేశారు. అలా చేయడం వల్ల మురికి వాడల ప్రజలలో ధైర్యం కలుగుతుందని ఆయన భావించారు.
ప్లేగును నియంత్రించడానికి ఆ మురికి వాడల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరమని నివేదిత ఎంతగా నచ్చజెప్పినప్పటికీ ప్రజలు దానిని పట్టించుకొన్నట్లే లేదు. కనుక నివేదిత స్వయంగా తనే కార్యాచరణలో దిగింది. ఒక రోజు ఉదయం చేత చీపురు పుచ్చుకొని వీథులను శుభ్రపరచ నారంభించింది. ఇది ప్రజల కళ్లు తెరపించింది, అనేకులు ఆమెతో కలిసి పరిశుభ్రం చేయనారంభించారు. సదానంద అనేకుల వద్ద చందాలు వసూలుచేసి, మనుషులను నియమించి, తను కూడా వారితో కలసి వీథులను శుభ్రపరిచాడు, వ్యాధిగ్రస్థులకు సహాయం చేశాడు. ఆయన నిస్వార్థ సేవను చూసి అనేకమంది యువకులు ఆయనతో చేతులు కలిపారు. ఆయన సేవాకార్యంతో అమితంగా ఆకట్టుకోబడిన ఆ యువకులు తమను ‘సదానందుని కుక్కలు’ గా పేర్కొనే మేరకు ఆయనకు సహకరించారు. ఈ విధంగా అందరూ కలసికట్టుగా ఆ భయంకరమైన వ్యాధిని అరికట్టడంలో ముమ్మరంగా నిమగ్నులయ్యారు.
కాళీమాత సమక్షంలో
“స్వేచ్ఛగా ఉండడానికి నా మాదిరి ఇంతమేరకు ప్రయత్నించిన వారు ఎవరూ లేరు, చుట్టూ ఇన్ని కర్మబంధాలు నాలా ఎవరికీ లేవు. నాకు ఎక్కువగా మార్గదర్శకత్వం వహించింది ఏదని భావిస్తున్నావు – తెలివా, హృదయమా? మన మార్గదర్శి జగజ్జనని! జరిగినదీ, జరుగ నున్నదీ అంతా ఆమె ఆదేశం ప్రకారమే!” అని స్వామీజీ వ్రాస్తున్నారు.
1899 మే నెలలో ఒక రోజు హఠాత్తుగా స్వామీజీకి కాళీఘాట్‌లోని కాళికాలయాన్ని దర్శించాలనే ఉత్సుకత కలిగింది. ఒకరిద్దరు సన్న్యాసులను వెంటబెట్టుకొని ఆయన ఆలయానికి వెళ్లారు. ఆలయాధికారులు ఆయనను ఆదరాభిమానాలతో ఆహ్వానించారు. తిన్నగా వెళ్లి స్వామీజీ జగజ్జనని విగ్రహం ముందు కూర్చున్నారు, ఆయన విశాలనేత్రాల నుండి నీరు ధారకట్టింది. మందార పువ్వులను సమర్పించారు. పిదప తక్కిన వారినీ అట్లే చేయమన్నారు. అనేక స్తోత్రాలతో దేవిని స్తుతించారు.
రాబోయే నెలలో మళ్లీ పాశ్చాత్యానికి ప్రయాణం చేయబోయే స్థితిలో, జగజ్జనని అనుగ్రహ ఆశీర్వాదాలు అభిలషించి ఆయన బహుశా కాళికాలయాన్ని దర్శించి ఆమెను ఆరాధించి ఉంటారేమో!