ప్రభో! పరమేశ్వరా! చిన్నతనం నుండి నీ శరణాగతుణ్ణి. ధ్రువ ప్రాంతాలో, పర్వత శిఖారాలో, అగాధ సముద్రమో ఎక్కడ నేను జీవించినా అక్కడ నువ్వు నాకు తోడుగా ఉన్నావు! నువ్వు ఎన్నడూ నన్ను వదలిపెట్టవు!
– స్వామి వివేకానంద
అమరనాథ్ యాత్ర — అమరనాథ్ దర్శనం — అమరనాథుడు ఒసగిన అమరత్వం — నివేదిత వ్యాకులత — శ్రీనగర్‌లో మఠ స్థాపనకై ప్రయత్నం — కాళీమాత శిశువుగా — కాళీ దర్శనం — క్షీరభవాని — జగజ్జనని మాట్లాడింది — ఆమె మయంగా — ఫకీర్ శాపం — ‘నీ పిలక ఆయన చేతిలో’ — అనారోగ్యం — అత్యున్నత స్థితులలో — మఠంలో — స్త్రీ విద్యకు శ్రీకారం — బాలికల పాఠశాల ప్రారంభం — ‘వారు ఎక్కడికి పోతారు?’ — ముఖ్యమైన కార్యం
అమరనాథ్ యాత్ర
దాదాపు 12000 అడుగుల ఎత్తులోని గుహలో మంచులింగంగా కొలువుదీరివున్న అమరనాథ్ శివుని దర్శనం శివభక్తులకు పరమానందదాయకం అనడంలో అతిశయోక్తి లేదు. హిమాలయ శ్రేణిలో, మంచుపర్వతాల మధ్య సాధారణంగా మంచుతో ఘనీభవించిన గుహాలయం అది. ఆషాఢమాస పౌర్ణమి (గురుపూర్ణిమ) నుండి శ్రావణ పౌర్ణమి వరకు భక్తులు అక్కడకు వెళ్లి ఆరాధించడానికి వీలుంటుంది. ఆ రోజుల్లో స్వతస్సిద్ధంగా మంచుతో అక్కడొక శివలింగం రూపొందుతుంది. ఆ రోజుల్లో మాత్రమే అక్కడకు పోయి అమరనాథ్ శివుణ్ణి ఆరాధించడానికి ఆస్కారం ఉంటుంది.
స్వామీజీ అమరనాథ్ వెళ్లగోరినట్లు మళ్లీ చెప్పారు. దారిలోనున్న పెహల్గామ్ వరకు మెక్లౌడ్, మిసెస్ సారా వెళ్లడానికీ, నివేదిత మాత్రం స్వామీజీతో అమరనాథ్ దాకా వెళ్ళడానికీ నిశ్చయించుకొన్నారు. అమరనాథ్ పోతున్న దాదాపు 3000 మంది యాత్రికులతో కలసిపోవాలనుకొన్నారు స్వామీజీ. 1898 జూలై 26వ తేదీన స్వామీజీ బయలుదేరారు.
అమరనాథ్ మార్గంలో పెహల్గామ్ మొదటి మజిలీ. ఇక్కణ్ణుంచి అందరూ గుడారాలలో బసచేయవలసి ఉంటుంది; మరో సౌకర్యం లేదు. హఠాత్తుగా గుడారాలు ప్రత్యక్షమవడంతో, అనేక చోట్ల వంట కోసం పొయ్యిలు రగిలించడంతో వేలమంది జీవించే ఒక క్రొత్త నగరం అకస్మాత్తుగా రూపొందడం ఒక మధురానుభూతి. యాత్రికులలో వందలమంది సన్న్యాసులూ ఉన్నారు. విభిన్న సంప్ర దాయాలు, విభిన్న ఆచారవ్యవహారాలు, విభిన్న ఆరాధనాపద్ధతులు, విభిన్న సాధన లంటూ ఆ సన్న్యాసులతో మెలగడం స్వామీజీకి ఒక అద్భుత అనుభవంగా పరిణమించింది.
ఈ యాత్రలో స్వామీజీ ఒక నిరాడంబరమైన భక్తునిగానే జీవించారు. ఏకాదశీవ్రతం, ఒంటిపూట భోజనం – అందునా సనాతన పద్ధతిలో వండినది, జపమాలతో జపం చేయడం అంటూ ఒక మామూలు సన్న్యాసిగా ఆయన జీవించారు.
ఈ జనసందోహంలో పాశ్చాత్య స్త్రీలు ఉండడం పలువురు సన్న్యాసులకు సుతరామూ నచ్చలేదు. అందుకు వారు ప్రతిఘటించి, పాశ్చాత్యులు బస చేసిన గుడారాలు తమ గుడారాల ప్రక్కన ఉండరాదని ఆంక్షపెట్టారు. వారి మనోవైఖరి స్వామీజీకి కోపం తెప్పించింది. ఆయన మానసిక స్థితిని అవగతం చేసుకొన్న నాగా సంప్రదాయ సన్న్యాసి ఒకరు స్వామీజీ వద్దకొచ్చి, “స్వామీజీ, మీరు అపార శక్తిమంతులు. కాని దయచేసి మీ శక్తిని ప్రయోగించకండి” అని విన్నవించాడు. పరిస్థితిని స్వామీజీ అర్థం చేసుకొన్నారు; తమ గూడారాలను కాస్త దూరంలోకి మార్చుకొన్నారు. ఆ రోజు సాయంత్రం స్వామీజీ నివేదితను సన్న్యాసుల గుడారాల వద్దకు తోడ్కొని పోయి, వారి ఆశీస్సులు ఆమెకు ఇప్పించారు. ఆ సన్న్యాసులకు కానుకలు కూడా స్వామీజీ చెల్లించాలనుకొన్నారు.
క్రమంగా స్వామీజీ ఘనతను అందరూ అర్థం చేసుకొన్నారు. ఆయన గుడారంలో సదా సన్న్యాసులు కలుసుకోవడమూ, ఆయన ఉపదేశాలు శ్రద్ధగా ఆలకించడమూ పరిపాటి అయిపోయింది. నివేదిత కూడా తన నిరాడంబర నైజంతో యాత్రికుల నుండి మర్యాదామన్ననలను పొందింది. పలువురు నివేదితకు అవసరమైన సహాయం అందించి అభిమానంతో ఆమెతో మెలగారు.
ముందుగానే నిర్ణయించుకొన్నట్లు పెహల్గామ్లో సారా, మెక్లౌడ్ ఆగిపో యారు; స్వామీజీతో నివేదిత మాత్రమే వెళ్లింది. అక్కడ నుంచి అమరనాథ్ దాదాపు 30 మైళ్ళ దూరంలో ఉంది. దారిపొడవునా మంచుపర్వతాలూ, అందమైన ప్రకృతిదృశ్యాలూ కన్నుల పండువ చేశాయి; అదే సమయంలో ఎంతో శ్రమకోర్చి పయనించవలసి వచ్చింది. తొమ్మిది మైళ్ల దూరంలోని చందన్వారీలో ఒక హిమానీనదాన్ని దాటవలసి వచ్చింది. విపరీతంగా జారుతున్న ఈ బాట ఎంతో ప్రమాదభరితమయినది. నివేదితకు ఇది మొదటి అనుభవం. ఇక్కడ నుండి పర్వత ఆరోహణ ప్రారంభమవుతుంది. హిమాలయాల్లో పర్వతారోహణ ఒక భ్రాంతిమయ అనుభవంగా పరిణమిస్తుంది. ఒక పర్వతం కనిపిస్తున్నట్లుగా ఉంటుంది, దానిని ఎక్కితే అంతా పూర్తియైనట్లుగా అనిపిస్తుంది. కాని పర్వత శిఖరాన్ని చేరుకొన్నప్పుడు, ప్రక్కన మరో పర్వతం కానవస్తుంది. దానిని దాటితే మరొకటి. ఈ విధంగా పర్వతశ్రేణి కొనసాగుతుంది. ఇలా ఎన్ని పర్వతాలను దాటామో తెలియరాదు. స్వామీజీ, నివేదిత ఇలా కొనసాగించి అనేక పర్వతాలను దాటినప్పుడు చివరగా ఎదురయింది ఒక ఏటవాలు ప్రాంతం. దానిని దాటి వారు 14000 అడుగుల ఎత్తు ప్రదేశంలో బస చేశారు. ఆ ప్రాంతపు పరమ ప్రశాంతతను కవితగా నివేదిత రూపొందించింది:
“ప్రశాంతత అంటే ఏమిటో ఆ రోజే ప్రప్రథమంగా చవిచూశాను – అంతటి ప్రశాంతత! దేవదారు వృక్షాలు చేస్తున్న మర్మర ధ్వనులను గమించి, స్వచ్ఛమైన వాగుల లహరి కూడా అక్కడ శూన్యం. వాగు మాత్రమే ప్రవహిస్తూంది, కాని అది కూడా ఏమిటో మంచులో ఘనీభవించినట్లు మౌనంగా ప్రవహిస్తూన్నది. చెట్టు చేమలు లేవు, ఆకాశంలో చంద్రోదయం అయింది – దాదాపు పౌర్ణమి! దాని వెలుగులో ఆ పావన మంచుపర్వతాలన్ని ధవళవర్ణంలో మెరసిపోతున్నాయి. అర్ధరాత్రి ఆకాశం ఇంత నీలంగా ఉండడం మరెక్కడా చూడలేం. రాత్రి వచ్చి పర్వత శిఖరాలతో ఏదో మాట్లాడగా, ఆ మాటలు నక్షత్రాలకు వెళ్లి, ప్రగాఢ ప్రశాంతతగా మారి, ఆ హిమానీనదాలతో ముచ్చటిస్తున్నట్లుగా భాసించింది.”
అప్పుడప్పుడు స్వామీజీ ఎక్కడకు పోతున్నారో తెలియకుండా మాయమయ్యే వారు. నివేదిత ఆ సమయాలను తక్కిన యాత్రికులతో గడిపింది.
పంచతరణిగా పేర్కొనబడే ఐదు నదుల ప్రాంతం వచ్చింది. అక్కడ ఒకటి వెనుక ఒకటిగా ఐదు నదులలోను తడిగుడ్డలతోనే నడచి వెళ్లి స్నానమాచరించడం సంప్రదాయం. స్వామీజీ అట్లే చేశారు. పంచతరణి నుంచి అమరనాథ్ శివుణ్ణి దర్శించుకోవచ్చుననే ఆలోచనే వారిని అమిత పారవశ్యంలో ముంచివేసింది. పయనం కొనసాగింది. పల్లకీలో వెళ్లేవారు కూడా కాస్త దూరం తరువాత పల్లకీలు దిగి నడిచే తీరాలి. ఎముకలు కొరికే చలి, ఏటవాలు ప్రాతం. స్త్రీలూ పురుషులూ, సన్న్యాసులూ, సన్న్యాసినులూ బృందాలు బృందాలుగా పయనం సాగించారు.
చివరి ఒకటి రెండు గంటల ప్రయాణం మరీ ప్రమాదభరితంగా పరిణ చింది. ఒక అడుగు పొరపాటున వేస్తే మరణం తథ్యమనే స్థితిలో అతి సన్నని బాట గుండా వెళ్లాలి. పైగా ఏటవాలు ప్రాంతాలు! స్వామీజీ మరీ అలసిపోయి వెనుకబడ్డారు. స్వామీజీ ఏకాంతాన్ని అభిలషించిన కారణంగా ఆయనను వదలి ముందుగా పోతున్న నివేదిత స్వామీజీ రాకపోవడం చూసి నిరీక్షించింది. చివరగా స్వామీజీ ఎంతో అలసిపోయి వచ్చి చేరుకొన్నారు. అప్పుడు కూడా నివేదితతో ఏమీ మాట్లాడకుండా ఆమెను ముందుకు వెళ్లమని చెప్పి, తాము అక్కడే ఆ భయంకరమైన చలిలో స్నానం చేయబోతున్నట్లు చెప్పారు.
అమరనాథ్ దర్శనం
చిట్టచివరికి అమరనాథ్ గుహను చేరుకొన్నారు. స్వామీజీ స్నానం చేసి, కౌపీనం మాత్రం ధరించి, దేహమంతా విభూతి అలదుకొని, మైమరచిన స్థితిలో గుహలోకి వెళ్లారు. ఆయన ముఖాన చిరునవ్వు వికసించింది. విశ్వాన్ని సృష్టించి, రక్షించి, భక్తితో సేవించేవారికి మరణంలేని అమరత్వం ఒసగడానికి పరమేశ్వరుడు అమరనాథునిగా, మంచులింగంగా కొలువుదీరివున్న అద్భుత దృశ్యాన్ని స్వామీజీ తిలకించారు. వెనుక వచ్చిన భక్తులు నినదించిన ‘ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ!’ మంత్రం మిన్నుముట్టింది. స్వామీజీ అమరనాథునికి సాష్టాంగ ప్రణామం చేశారు. ఆయన ప్రణామం చేసినప్పుడు అక్కడున్న పావన పావురాలు సవ్వడి చేస్తూ పైకి ఎగిరి పోయాయి. ఆయన దేహం భక్తిపారవశ్యంతో కంపించింది. ఆయన మనస్సులో ఏ ఏ భావనలు ఉవ్వెత్తున లేచినాయో ఎవరి కెరుక! చిన్నతనం నుంచి తమ మనస్సులో శాశ్వతమైన అమరునిగా కొలువుదీరివున్న ఆ అమరనాథ శివుణ్ణి ప్రత్యక్షంగా తిలకించినప్పుడు ఆయన భావోద్వేగాలు ఎలా అలల్లా ఎగసిపడ్డాయో, ఎవరు చెప్పగలరు! ఆయన పెదవి విప్పలేదు. నాడు అక్కడ ఆయన అమర నాథుణ్ణి దర్శించారు! మరణాన్ని నిర్జించిన ఆ పరమేశ్వరుణ్ణి, నిజానికి మరణాన్ని నిర్జించి స్వామీజీ దర్శించి ఉండాలి! ఎందుకంటే “ఆయన మరణాన్నే నిర్జించి వచ్చారు. ఆయన హృదయ స్పందన ఆగిపోయి ఉండాలి. కాని ఆయన హృదయం వాచి, ఉబ్బింది” అని తరువాత ఆయనను పరిశోధించిన వైద్యుడు వ్యాఖ్యా నించాడు.
మూర్తీభవించిన ప్రశాంతతను సంతరించుకొని స్వామీజీ గుహ నుంచి బయటికి వచ్చారు. కాసేపు విశ్రాంతి తీసుకొన్న తరువాత, భుజించి అందరూ గుడారాల్లో విశ్రమించారు. దాదాపు అరగంట తరువాత స్వామీజీ ఇలా అన్నారు: “ఆ మంచులింగం సాక్షాత్తూ పరమేశ్వరుడే! అక్కడంతా ఆరాధనమయమే! ఇంత అందమయిన, ఇంతగా ఆత్మోద్వేగాన్ని మేలుకొలిపిన చోటికి నేనింత దాకా వెళ్లింది లేదు.”
అమరనాథుడు ఒసగిన అమరత్వం
అమరనాథ్‌లో స్వామీజీ అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతి పొందారనడం రూఢి. కాని అదేమిటో పూర్తిగా ఆయన ఎవరితోనూ చెప్ప లేదు. అయినప్పటికీ దాన్లోని కొన్ని అంశాలను అప్పుడప్పుడు వ్యక్తం చేయకపోలేదు. స్వామీజీ శిష్యుడైన శరశ్చంద్ర వ్రాసిన “సంభాషణలు” విభాగంలో ఈ క్రింది విధంగా చూడవచ్చు:
స్వామీజీ కాశ్మీర్ నుండి తిరిగి వచ్చి రెండు మూడు రోజులయింది. ఆయన ఆరోగ్యం అంతగా బాగాలేదు. శిష్యుడు మఠానికి రాగానే బ్రహ్మనందస్వామి ఇలా అన్నారు: “స్వామీజీ కాశ్మీర్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఎవరితోనూ మాట్లాడడం లేదు. గాఢమైన ఆలోచనలలో మునిగి ఒకేచోట కూర్చుని ఉన్నారు. నువ్వు వెళ్లి మాటల్లోకి దింపి, ఆయన మనస్సును కాస్త బయటి వ్యవహారాల్లోకి మళ్లించు.”
శిష్యుడు పై అంతస్తులోని స్వామీజీ గదిలోకి వచ్చి చూసేసరికి స్వామీజీ గాఢ సమాధిమగ్నులైనట్లు కనిపించారు. ఆయన ముఖం మీద చిరునవ్వు లేదు. ప్రకాశవంతమైన కళ్లలో బాహ్యదృష్టి లేదు. ఆంతరికంగా ఏదో దర్శిస్తున్నట్లు ఉంది. శిష్యుణ్ణి చూడగానే, “నాయనా, వచ్చావా! కూర్చో” అని మళ్లీ మౌనం వహించారు. స్వామీజీ ఎడమ కన్ను లోపలిభాగం ఎర్రబడి ఉండడం గమనించి శిష్యుడు, “మీ కన్ను ఎర్రబారింది. ఎందుకు?” అని అడిగాడు. “ఏమీ లేదు” అంటూ మళ్లీ ఆయన మౌనం దాల్చారు. ఎంతసేపటికీ స్వామీజీ మాట్లాడక పోవడం చూసి, శిష్యుడు కలత చెంది స్వామీజీ పాదాలు తాకి, “మీరు అమరనాథ్‌లో దర్శించిన విషయాలు కొంచెం నాకు చెప్పరా?” అని అడిగాడు. శిష్యుడు తమ పాదాలు స్పృశించడంతో స్వామీజీ గంభీర వైఖరి కొంచెం మారింది. దృష్టి ఒకింత బాహ్యంలోకి మళ్లి నట్లుంది. ఆయన ఇలా చెప్పారు: “అమరనాథ్ దర్శించినప్పటి నుండి శివుడు, ఇరవై నాలుగు గంటలూ నా శిరస్సు మీదనే ఆసీనుడైనట్లుగా, క్రిందికి దిగనట్లుగా నాకు అనిపిస్తోంది.” స్వామీజీ మాటలతో శిష్యుడు అవాక్కయ్యాడు.
స్వామీజీ : అమరనాథ్లోనూ, క్షీరభవాని ఆలయంలోనూ గొప్ప నియమ నిష్ఠలు పాటించాను. ఇప్పుడు వెళ్లి పొగ త్రాగడానికి పొగాకు సిద్ధం చెయ్యి. అన్ని విషయాలూ చెబుతాను.
శిష్యుడు ఆనందభరితుడై ఆయన ఆజ్ఞను శిరసావహించాడు. స్వామీజీ నెమ్మదిగా పొగ పీలుస్తూ చెప్పనారంభించారు: “అమరనాథ్ పోయే దారిలో, కొండపై నిటారుగా ఎక్కాను. యాత్రికులు సాధారణంగా ఆ మార్గంలో పయనించరు. కాని ఆ దారిలోనే పోవాలనే పట్టుదల కలిగి అలా చేశాను. అలా ఎక్కడం వల్ల వాటిల్లిన శ్రమ నా దేహంపై కనిపించింది. అక్కడ ఎముకలు కొరికే చలి. సూదులతో గుచ్చినట్లు అనిపించింది.”
శిష్యుడు : అమరనాథ లింగాన్ని దర్శించేటప్పుడు దిగంబరంగా పోవడం ఆచారమని విన్నాను. నిజమేనా?
స్వామీజీ : అవును, నేను కౌపీనం మాత్రం ధరించి, ఒంటి నిండా విభూతి అలదుకొని గుహలో ప్రవేశించాను. నా కప్పుడు చలిగాని వేడిగాని అనిపించలేదు. కాని బయటికి రాగానే చలితో శరీరం గడ్డకట్టుకుపోయింది.
శిష్యుడు : మీరు పవిత్ర పావురాలను చూశారా? ఆ చలిలో ఏ ప్రాణికోటి కనిపించదనీ, కాని అప్పుడప్పుడు అక్కడికి ఎక్కణ్ణుంచో పావురాల గుంపు వస్తుందనీ విన్నాను.
స్వామీజీ : అవును. నేను మూడు నాలుగు తెల్లని పావురాలను చూశాను. అవి ఆ గుహలో నివసిస్తాయో లేక ఆ ప్రాంతంలోని కొండలలో ఉంటాయో నాకు తెలియలేదు.
మరొకసారి దీనిని గురించి స్వామీజీ ప్రస్తావించినప్పుడు, సాక్షాత్తూ పరమేశ్వరుడే తన ముందు ప్రత్యక్షమైనట్లూ, ఆయన తనకు ‘ఇచ్ఛామృతి’ వరం అనుగ్రహించినట్లూ తెలిపారు.
ఒక రోజు తురీయానందతో స్వామీజీ తమ అమరనాథ్ అనుభవాన్ని ఇలా వివరించారు: “సాకార దేవుని ఉనికి గురించి నేను జవాబు చెప్పలేను. కాని నిర్గుణుడైన పరమాత్మ ఒకరు ఉన్నారు, దేవీ దేవతలున్నారని అక్కడ నాకు నిస్సంశయంగా తెలిసింది.”
మరొక భక్తునితో ఒక సందర్భంలో స్వామీజీ ఇలా చెప్పారు: “అమరనాథ్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుండి నా మనస్సు ప్రశాంతత కోసం తపిస్తోంది. ఏం చేయడానికీ పాలుబోవడం లేదు. శాశ్వతంగా మౌనం వహించాలనీ, ఏదైనా గుహలో శాశ్వతంగా ఉండిపోవాలనీ అనిపిస్తున్నది. అమరనాథుడైన పరమేశ్వరుడు నా శిరస్సు మీద ఎనిమిది పగళ్లూ, ఎనిమిది రాత్రుళ్లూ ఆసీనుడై ఉన్నాడు. శిరస్సు మీద కూర్చుని పడిపడి నవ్వాడు. ‘ప్రభో! నా దేహం రుగ్మతతో వాడి పోతున్నది. నీకు నవ్వులాటగా ఉంది!’ అని ఆయనతో చెప్పాను. గురుదేవులు ఏ స్వరూపంలో సాక్షాత్కరించి నన్ను అమెరికా వెళ్లమని ఆదేశించారో, మళ్లీ ఆ రూపమే సాక్షాత్కరించి నన్ను అమరనాథ్ వెళ్లమని ఆదేశించింది. అందుకే వెళ్లాను.”
ఇవి తప్ప తమ అనుభవాల గురించి స్వామీజీ మరే వివరణలూ చెప్పలేదు.
స్వామీజీ ప్రయాణాన్ని కొనసాగిద్దాం.
నివేదిత వ్యాకులత
స్వామీజీకి అనుభూతి కలిగింది, ఆయన శివదర్శనం పొందారు. కాని నివేదిత? మంచులింగాన్ని దర్శించింది, ఆమెకు అదొక అద్భుతమైన అనుభవం. స్వామీజీ గుహ నుంచి బయటికి వచ్చినప్పుడు ఆయన నుండి అభివ్యక్తమైన అనుభూతిమయమైన మహోన్నతజ్యోతిని ఆమె గాంచింది. ఇవి తప్ప ఆంతరిక అనుభూతులు ఏవీ ఆమె పొందలేదు. ఇది ఆమె మనస్సుకు బాధగా పరిణమించింది. స్వామీజీతోనే తన వ్యాకులతను వ్యక్తం చేసింది. స్వామీజీ ఆమెను సాంత్వనపరచి, “ఇప్పుడు ఏదీ నీకు అర్థం కాదు. కాని నువ్వు ఈ పుణ్యతీర్థాన్ని దర్శించుకొన్నావు; ఈ అనుభవం నీలో స్ఫూర్తిని కలిగిస్తుంది, తగిన సమయంలో సాఫల్యత నిచ్చే తీరుతుంది. కాలక్రమంలో దానిని నువ్వు అవగతం చేసుకోగలవు. ఈ తీర్థయాత్ర సత్ఫలాన్ని ఏదో ఒక రోజు నువ్వు పొందుతావు” అన్నారు.
శ్రీనగర్‌లో మఠ స్థాపనకై ప్రయత్నం
అమరనాథ్ నుంచి తిరిగి వచ్చిన స్వామీజీ సెప్టెంబర్ చివరి దాకా శ్రీనగర్‌లో బస చేశారు. కాశ్మీర్ మహారాజు చేసిన ఏర్పాటు ప్రకారం ఆయనకు సకలోపచారాలు జరిగాయి. మునుపు ఒకసారి కాశ్మీర్ మహారాజు ఆయనతో విద్యా కార్యానికై తాను స్థలం ఇస్తాననీ, అవసరమైన స్థలాన్ని స్వయంగా స్వామీజీ ఎంపిక చేసు కోవచ్చుననీ చెప్పివున్నాడు. ఆ మాట ప్రకారం స్వామీజీ ఒక నదీ తీరంలోని మనోజ్ఞమైన స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడ స్త్రీల కోసం ఒక మఠం, సంస్కృత కళాశాల మొదలైనవి నిర్వహించాలని ఆయన ఆశించారు.
అమరనాథ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత స్వామీజీ సదా ధ్యాన స్థితిలోనే ఉన్నారు. ఈ స్థితిని చూసి ఆయనతో ఉన్న స్త్రీలు కూడా ప్రగాఢ ధ్యాన జీవితం గడపనెంచారు. ఇది విని స్వామీజీ ఆనందించి “మఠం కోసం ఎంపిక చేసుకొన్న స్థలంలో గుడారాలు వేసుకొని, మీరు అక్కడ ఏకాంత జీవితం గడపండి. ఒక క్రొత్త స్థలంలో ప్రప్రథమంగా స్త్రీలు అడుగిడడం సౌభాగ్యాన్ని పెంపొందిస్తుందంటారు. కనుక మీరు అక్కడకు వెళ్లి స్త్రీల మఠానికి శ్రీకారం చుట్టండి” అన్నారు.
కాని భగవంతుని సంకల్పం తద్విరుద్ధంగా ఉంది. కాశ్మీర్‌లోని ఆంగ్లేయ ప్రతినిధి (Resident) అందుకు ఆమోదించలేదు. రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ ఆతడు ససేమిరా అంగీకరించలేదు. స్వామీజీ నిరాశ చెందారు. కాని దీనిని భగవంతుని సంకల్పంగా పరిగణించి విద్యా కార్యకలాపాలకు తగిన స్థలం కలకత్తాయేనని స్పష్టంగా గ్రహించారు.
అదే విధంగా హిమాలయ ప్రాంతంలో ధ్యాన జీవితం కోసం ఒక మఠం నెలకొల్పాలనే స్వామీజీ అభీష్టమూ అంత వరకు నెరవేరలేదు. కాని కుమామాన్ ప్రాంతాలలో అందుకైన స్థలాన్ని వెతకి కనుగొంటామని సేవియర్ దంపతులు తెలిపారు; అది ఆయనకు కొంత ఊరటను కలిగించిందనవచ్చు.
కాళీమాత శిశువుగా
అమరనాథ్ యాత్ర తరువాత స్వామీజీ మనస్సు కాళీమాత పాదపద్మాలను అభిలషించసాగింది. గురుదేవుల వాత్సల్యంలో, తల్లి ఒడిలో శిశువుగా ఆమె పాదపద్మాల వద్ద శరణాగతి పొందిన దక్షిణేశ్వర రోజులు బహుశా ఆయన మనస్సులో మెదలి ఉంటాయేమో! ఆయన సదా ఆమె పావన నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు; రామప్రసాద్ ద్రవించిపోయి కాళీమాత మీద పాడిన పాటలను ఆయన పాడసాగారు. పడవ నడిపే వ్యక్తి నాలుగేళ్ల ఆడపిల్లను ఒక రోజు సాక్షాత్తూ ఉమాదేవిలా ఆరాధించారు కూడా. “నేను ఎటు వైపు తిరిగినా ఆ దిశల్లో ఆమే నిలబడివుంది. ఈ గదిలో మాతో ఆమె కూడా మెలగుతున్నట్లు అనిపించింది” అన్నారాయన.
కాళీ దర్శనం
“కాళీ ఆరాధన నా ప్రత్యేకమైన పిచ్చి” అనేవారు స్వామీజీ. రామప్రసాద్, కమలాకాంతుడు,* శ్రీరామకృష్ణులు వెలసిన వంగభూమిలో జన్మించిన స్వామీజీకి కాళీ ఆరాధన స్వతస్సిద్ధంగా కరతలామలకం అవడంలో ఆశ్చర్యం లేదు. తమ పడవలోనే అమిత ఏకాంత ప్రాంతంలో ఉండసాగారు; ఎవరిని కలుసుకోవడానికీ ఇష్టపడలేదు. ఆయన పట్ల అమిత భక్తిప్రపత్తులు గల ఒక డాక్టర్‌ను మాత్రమే తమ వద్దకు రావడానికి అనుమతించారు. ఆ డాక్టర్ ఆయన అవసరాలను చూసుకొన్నాడు. కొన్ని రోజులు మాటలు మృగ్యం. డాక్టర్ వెళ్లినప్పుడల్లా స్వామీజీ ప్రగాఢ చింతనామగ్నులై ఉండేవారు. డాక్టర్ పెదవి విప్పకుండా మౌనంగా తిరిగి వచ్చేవాడు.
నిజానికి ఈ లోకం అంటే ఏమిటి అన్న ప్రగాఢ చింతనలో ఒక రోజు సాయంత్రం స్వామీజీ మనస్సు లయించింది. సుఖం, ఉత్సాహం, వెలుగు మొద లయినవన్నీ జగజ్జనని గుణాలయితే మరణం, చీకటి, శోకం, దుఃఖం మొదలయిన వన్నీ ఏమిటి? ఇవన్నీ మరొకరిదై ఉండవు. ఎందుకంటే ఆమె తప్ప “మరేదీ లేదు”* అని కదా వేదాలు వచిస్తున్నాయి! కనుక ఇవి కూడా ఆ జగజ్జనని గుణాలుగా, ఆమె మరో ప్రక్కగానే ఉండివుండాలి! స్వామీజీ మనస్సులో ఆలోచనలు గిర్రున తిరిగాయి.
ఒక రోజు చీకటి క్రమ్ముకోసాగింది. సర్వత్రా సహజంగా ప్రశాంతత అలముకొనే వేళ అది. హిమాలయాల ఆ ఏకాంత నేపథ్యంలో పరమ ప్రశాంతత నెలకొంది. స్వామీజీ మనస్సు మాత్రం అగ్నిపర్వతంలా తీవ్రమైన వేడిమితో మండిపోతున్నది. అప్పుడు – ఆయన సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తున్నట్లు, జీవితపు మరో పార్శ్వాన్ని గ్రహింపజేస్తునట్లు కాళీమాత ఆయన ముందు ప్రత్యక్షమయింది. తన ఎదుట హఠాత్తుగా కాలభయంకరియైన ఆమె దర్శనం కలగడంతో ఆ అనుభూతి ఉద్వేగంలో తమ దర్శనాన్ని ఒక కవితగా తర్జుమా చేశారు.
నక్షత్రాలు సమసిపోయాయి
మేఘాలు మేఘాలను క్రమ్ముతున్నాయి
అది స్పందమాన, శబ్దమాన గాఢాంధకారం….
అంధకారబంధుర ఆకాశాన్నంటే ఉవ్వెత్తు తరంగాలతో
దోహదం చేస్తూ సముద్రం దానితో చేరింది
భయంకరమైన ఆ విద్యుత్కాంతి
నలుదిక్కులా కర్కశ కరాళ మృత్యువును ప్రదర్శిస్తూంది.
దుఃఖాలను మహామారులను వెదజల్లుతూ
ఆనందోన్మాదంతో నాట్యం చేస్తూ
రా, తల్లీ రా
నీ పేరు మహాకాళి
నీ శ్వాస మృత్యువు
కంపిస్తూన్న నీ ప్రతి పదం
ఒక ప్రపంచాన్ని శాశ్వతంగా తుడిచివేస్తుంది.
ఓ కాళీ! సర్వనారీ
రా, తల్లీ! రా…..*
వ్రాయడం పూర్తిచేసి భావోద్వేగపు వెల్లువలో సమతౌల్యం కోల్పోయారు. చేతుల్లో నుంచి కలం జారి నేల మీద పడిపోయింది, ఆయన కూడా స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయారు.
తదనంతర కాలంలో స్వామీజీ కాళీమయంగానే జీవించారు. ఆమెను గురించి మాత్రమే మాట్లాడారు. ఆమె తత్త్వాన్ని విశదీకరించారు; “సుఖం కోరడమే సర్వుల లక్ష్యమని అనుకోవడం తప్పు. సుఖాన్ని అభిలషించే అదే మేరకు దుఃఖాన్ని కాంక్షించేవారు కూడా జన్మిస్తారు. శోకంలోనూ సుఖం ఉంటుంది. భయంకరాన్ని భయంకరం కోసమే ఆరాధిస్తాం.
“సుఖసంతోషాలలో, ఆనందంలో జగజ్జననిని చూస్తున్నాం. అదే విధంగా దుష్టత్వంలోను, భయంకరంలోను, బాధలోను, మరణంలోను ఆమెను దర్శించడం నేర్చుకోవాలి.
“అమ్మా! ఏం చోద్యం! నీకు కపాల మాలను ధరింపజేస్తున్నారు, కాని భయంతో గడగడలాడిపోతున్నారు; అదేసమయంలో నిన్ను, ‘కారుణ్యమూర్తీ’ అని సంబోధిస్తున్నారు కూడా.
“భయంకరాన్ని ఆరాధించడం వలన మాత్రమే భయాన్ని జయించవచ్చు; మరణరహిత స్థితిని చేరుకోవచ్చు. మరణం గురించి ఆలోచించండి, మరణాన్ని ధ్యానించండి! భయంకరాన్ని, భయంకరాన్ని భయంకరాన్ని ఆరాధించండి! సమస్తమూ ఆమే! ఆమె శాపమూ దీవెనే! మీ హృదయం శ్మశానమవాలి. అహంకారం, స్వార్థం, వాంఛలు యావత్తూ మండి బూడిద అవనీ! అప్పుడు, అప్పుడు మాత్రమే అక్కడికి కాళీమాత విచ్చేస్తుంది. ఆమే కాలం, ఆమే పరిణామం, ఆమే అనంతశక్తి!”
సదా స్వామీజీ కాళీ నామాన్నే ఉచ్చరించసాగారు: “ఆమే దేహం, ఆమే వ్యాధి, వ్యథల నిచ్చేదీ ఆమే. కాళి, కాళి, కాళి!” అంటూ ఉచ్చరిస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో ఆయన కాళీపరమైన ఉపదేశాలే చేశారు; “భయం వద్దు. భిక్షమెత్త కూడదు, హక్కుతో కోరండి – హక్కుతో అత్యున్నతమైనది కోరండి! కాళీమాత నిజమైన భక్తులు నాపరాయిలా పటిష్ఠంగానూ, సింహంలా నిర్భీతితోనూ ఉండాలి. ప్రపంచమే హఠాత్తుగా నుగ్గునుగ్గయిపోయి, ధూళిగా కాళ్ల క్రింద పడివున్నా వారు కలత చెందరు. మీరు చెబుతున్నది ఆమె ఆలకించేట్లు చేయండి. ఆమె ముందు లజ్జతో నిలబడకండి. ఆమె సర్వశక్తిమంతురాలు. రాళ్ల నుంచి కూడా వీరులను ఉద్భవింప చేయగలదు.”
క్షీరభవాని
కాళీమాత చింతనలు మనస్సులో ఘనీభవించేకొద్ది స్వామీజీ ఇంకా ఏకాంతంలో లయించి పోవాలనుకొన్నారు. కనుక హఠాత్తుగా ఒక రోజు క్షీరభవానీ ఆలయానికి వెళ్లారు; ఎవరూ తనను అనుసరించ కూడదని ఆంక్ష విధించారు. దాదాపు ఒక వారం అక్కడ గడిపారు. నిత్యమూ ఆమెను ఆరాధించారు, హోమాలు నిర్వర్తించారు; ఆ భవానీదేవికి ప్రీతికరమైన క్షీరం (పాలు) నైవేద్యంగా అర్పించారు. ఒక సాధారణ యాత్రికునిలా జపమాల పుచ్చుకొని జపం చేశారు. అక్కడున్న ఒక పండితుని బాలికను నిత్యమూ ఆరాధించారు.
జగజ్జనని మాట్లాడింది
క్షీరభవానీ ఆలయం మొగలాయీల దండయాత్రతో దాదాపు శిథిల మయింది. ఆలయం దుర్భర స్థితి స్వామీజీకి మనశ్శాంతి లేకుండా చేసింది; ఆయనలో ఇలాంటి ఆలోచనలు మెదలాయి: “ఈ విధంగా ఒక దేవాలయాన్ని కొల్లగొట్టడానికి ఎలా మనస్కరించిందో? నేను మాత్రం ఉండివుంటే ఈ దుష్కార్యాన్ని నిరోధించే వాణ్ణి. జగజ్జననిని పరిరక్షించడానికి నా ప్రాణాలను అర్పించి ఉండేవాణ్ణి”. అప్పుడు “నాయనా!” అనే కంఠస్వరం వినవచ్చింది. అవును, జగజ్జనని మాట్లాడింది: “నాయనా, నా ఆలయల్లో నాస్తికులు ప్రవేశిస్తే మటుకు ఏమిటి? నా విగ్రహాలను ధ్వంసం చేస్తే మటుకు ఏమిటి? దాని వలన నీ కేమిటి? నువ్వు నన్ను పరి రక్షిస్తావా? లేదా నేను నిన్ను రక్షిస్తున్నానా?” అని ఆమె ప్రశ్నించింది. స్వామీజీకి చుర్రుమంది. నిజమే కదా! స్వామీజీ దిగ్భ్రాంతి చెందారు! “అమ్మా! అమ్మా!” అంటూ ఆయన హృదయం దుర్బలమయింది; “నేను తప్పు చేశాను! ఒక శిశువుగా నీ పాదపద్మాల వద్ద ఉండడానికి అనుగ్రహించు!” అంటూ ఆక్రోశించారు!
జగజ్జనని సంకల్పాన్ని తెలుసుకొన్న తరువాత కూడా స్వామీజీ మనస్సు ఎందుకో ప్రశాంతతను పొందలేదు. ఒక రోజు ఆ ఆలయ సన్నిధిలో మౌనంగా కూర్చుని ఉన్నప్పుడు మళ్లీ ఆయన మనస్సులో, “ఈ దేవాలయం ఇలా శిథిలావస్థలో ఉన్నదే! నా వల్ల ఇక్కడ నూతన దేవాలయం నిర్మితమైతే….” అనే ఆలోచనలు మెదలాయి. అప్పుడు కూడా జగజ్జనని మాట్లాడింది: “నాయనా! ఆలయాలనూ, మఠాలనూ నేను నిర్మించలేనా? ఇదే చోట ఏడంతస్తుల బంగారు దేవాలయాన్ని క్షణంలో నిర్మించగలను” – జగజ్జనని కంఠస్వరం స్పష్టంగా వినిపించింది. “కారుణ్యం ఉట్టిపడే ఆమె కంఠస్వరం విన్న తరువాత ప్రణాళికలు రూపొందించడమే ఆపివేశాను. అంతా ఆమె సంకల్పం ప్రకారం జరుగనీ” అని కాలాంతరంలో ఆయన చెప్పారు.
ఆమె మయంగా
ఒక వారం తరువాత క్షీరభవాని నుండి స్వామీజీ శ్రీనగర్‌కు తిరిగివచ్చారు. తిన్నగా నివేదిత, తక్కినవారు బస చేసిన గూటి పడవకు వెళ్లారు. చేతులు పైకెత్తి వారిని ఆశీర్వదిస్తూ, జగజ్జననికి అర్పించిన కొన్ని చామంతి పువ్వులను ప్రసాదంగా వారికి ఇచ్చారు. జగజ్జననికి వేసిన మాలను ఒకరికి ఇచ్చారు. తరువాత తాపీగా కూర్చుని, “ఇక ‘హరి ఓమ్’ లేదు. ఇక అంతా ‘దేవీ’ మయమే! నా దేశభక్తి అంతా తొలగి పోయింది. ఇక అంతా ‘అమ్మ, అమ్మ మాత్రమే’” అన్నారు.
క్షీరభవానిలో గడపిన రోజుల గురించి నివేదిత ఇలా వ్రాస్తున్నది: “స్వామీజీ స్థితి గురించి నేను వివరించలేను. ఎందుకంటే అది వర్ణనాతీతం. ఒక పిల్లవాడిలా ఆయన ‘అమ్మా’ అనే అనసాగారు. కాని ఆయన స్వరం దైవస్వరంలా ధ్వనించింది; ఆయన ఆత్మ పరమాత్మయైన భగవంతునిదిలా తోస్తున్నది…. భగవద్దర్శనం పొందిన వ్యక్తిలా ఆయన భాసిల్లారు. ఆయన కళ్లు ఇంకా ఆ దృశ్యం చూస్తూన్నట్లే ఉన్నాయి.”
శిష్యులతోనూ, మిత్రులతోనూ స్వామీజీ కలసి ఉన్నప్పటికీ ఆయన గురించి వారు తెలుసుకొన్నది స్వల్పమే. ప్రగాఢ ప్రశాంతతను సంతరించుకొన్న ఆయన గాంభీర్యం కొన్ని సమయాల్లో ఎవరినీ ఆయన దరి చేరనివ్వదు. కొన్ని సమయాల్లో ఆయన ప్రపంచాన్ని మరచిపోయినట్లు నదీతీరంలో పచార్లు చేసేవారు. తమ చుట్టూ ఒక ప్రపంచం ఉందన్న విషయమే ఆయన స్ఫురణకు రానట్లుగా ఉండేది. అవాఙ్మానస గోచరమైన ఏదో లోకాల్లో ఆయన సంచరిస్తున్నారు. దేహం మాత్రమే ఇక్కడ పచార్లు చేస్తున్నదని సులభంగా గ్రహించవచ్చు. ఒక రోజు ఆయన కాళీమాత గురించి తాను రచించిన గీతంలో కొన్ని చరణాలు పాడుకొంటూ హఠాత్తుగా వారి ముందుకొచ్చి, “అంతా నిజంగానే జరిగింది. ఈ గీతంలో ప్రతి చరణమూ నా కళ్ల ముందు జరిగింది. అవును, నేను మరణపు మహోన్నత ఆకారాన్ని ఆలింగనం చేసుకొన్నాను” అన్నారు.
కాశ్మీరమూ, క్షీరభవాని దేవాలయమూ స్వామీజీ జీవితంలో ఈ రకంగా ఆయన దివ్యత్వ అభివ్యక్తీకరణకు నిదర్శనంగా భాసిల్లుతున్నాయి. కాశ్మీరంలోనూ, అమరనాథ్లోనూ, క్షీరభవానిలోనూ ఆయన ఏ ఏ అనుభవాలు పొందారు, ఆయన చింతనలు ఏ నూతన ప్రకాశాన్ని పొందాయి, ఆయన తిలకించిన దృశ్యాలెన్ని అనే విషయాలు ఆయనకే ఎరుక. ఆయన బయటికి వ్యక్తం చేసినవి అతితక్కువ మాత్రమే అన్న విషయం రూఢి. వీటిని సైతం కాలాంతరంలో శిష్యులకు చెప్పి ఆయన, “ఇంతకు పైన నేను చెప్పలేను, చెప్పడమూ సబబు కాదు” అన్నారు. కాని ఇంకా ఒకటి రెండు ముఖ్యమైన దృశ్యాలను తమ సోదర శిష్యులతో చెప్పివున్నారు. అవి బయటకు రాలేదు.
ఫకీర్ శాపం
మంచీ చెడూ కలసిందే ప్రపంచమన్న విషయం అన్ని పరిమాణాలలోనూ నిజం. ఇంతటి ఆధ్యాత్మిక అనుభూతుల మధ్య స్వామీజీ ఒక శాపాన్ని స్వీకరించ వలసి వచ్చింది. ఒక మహమ్మదీయ ఫకీర్ శిష్యుడు స్వామీజీ వద్దకు అప్పుడప్పుడు వచ్చేవాడు, ఆయన పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు. ఒక రోజు ఆతడు జ్వరంతో, తలనొప్పితో చాలా బాధపడ్డాడు. స్వామీజీ అతడి వద్దకు వచ్చి చూసి, అతడి తలను తమ చేతులతో సుతిమెత్తగా ఒత్తారు. ఆతడి నొప్పి మటుమాయమయింది. ఈ సంఘటనానంతరం స్వామీజీ పట్ల ఆతడి భక్తిప్రపత్తులు ఇనుమడించాయి. ఆయన వద్దకు ఆతడి రాకపోకలు అధికరించాయి. ఇది విన్న ఫకీర్, స్వామీజీ పట్ల ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఎక్కడ శిష్యుణ్ణి కోల్పోతానోనన్న భయంతో స్వామీజీ గురించి ఉన్నదీ లేనిదీ కట్టుకథలుగా అల్లి ఆతడికి చెప్పి చూశాడు. కాని ఆతడి వద్ద ఈ యుక్తి ఫలించలేదు. స్వామీజీ కన్నా తను అధిక శక్తిమంతుణ్ణని నిరూపించడం కోసం, “నా శక్తితో నీ స్వామీజీని ఏం చేస్తానో చూడు. కాశ్మీర్ నుండి వెళ్లిపోయే ముందు ఆయన వాంతులతోనూ, తల తిరగడంతోనూ బాధపడ బోతున్నాడు” అన్నాడు.
అట్లే జరిగింది. వాంతులతో, తల తిరగడంతో స్వామీజీ చాలా బాధపడ్డారు. ఆయనకు ఎంతో కోపం వచ్చింది – ఫకీర్ మీద కాదు, గురుదేవుల మీద! “గురుదేవులు ఉండీ ఏం ప్రయోజనం? నా అనుభూతులూ, ‘సర్వశక్తిమంతమైన ఆత్మ మనలో ఉంది’ అన్న నా వేదాంత బోధనా ఏం సాధించాయి? అవన్నీ కేవలం ఒక మాంత్రికుని మంత్ర ఆవాహన నుంచి నన్ను కాపాడలేదే!” అని ఆయన వాపోయారు.
‘నీ పిలక ఆయన చేతిలో’
1898 అక్టోబర్ 18వ తేదీన స్వామీజీ కలకత్తాకు తిరిగి వచ్చారు. ఆయన వ్యాకులత కలకత్తాకు వచ్చాక కూడా తీరలేదు. ఒక రోజు మాతృదేవి దర్శనార్థం వెళ్లారు. ఆమెను చూడగానే ఫకీర్ శాపం గురించి చెప్పి, ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో, “అమ్మా! మీ గురుదేవుల శక్తి గొప్పదే! మీ గురుదేవులు నన్ను కాపాడలేకపోయారు” అన్నారు. అందుకు మాతృదేవి, “నాయనా! ఆ సాధువు సముపార్జించిన సిద్ధుల పర్యవసానమే అది. వాటి శక్తిని స్వీకరించే తీరాలి. గురుదేవులకు వాటి పట్ల నమ్మకం ఉంది. ఆయన దేనినీ నశింప ఏతెంచ లేదు. అన్ని మార్గాలనూ ఆయన ఆమోదించారు” అన్నారు. స్వామీజీ వదలిపెట్టకుండా ఇకపై తాను గురుదేవులను అంగీకరించనన్నారు. అందుకు మాతృదేవి పరిహాసపూర్వకంగా, “నాయనా! అది నీకు సాధ్యమా? నీ పిలక ఆయన చేతిలో కదా ఉన్నది” అన్నారు.
అనారోగ్యం
స్వామీజీ మఠానికి తిరిగి రావడంతో సన్న్యాసులూ, బ్రహ్మచారులూ పరమా నందభరితులయ్యారు. కాని ఆయన ఆరోగ్య స్థితి వారికి ఆవేదన కలిగించింది. చూడడానికి ఆయన రోగిలా కనిపించారు. డాక్టర్ ఆర్.ఎల్. దత్తా, పలువురు ప్రఖ్యాత డాక్టర్లు స్వామీజీకి చికిత్స చేశారు. మధుమేహమూ, నిత్యనిద్రారాహిత్యమూ (insomnia) అప్పుడు ఆయనను పీడిస్తు న్నాయి. దానితోపాటు అమరనాథ్ యాత్ర కారణంగా దేహమూ, హృదయమూ బలహీనమైనాయి. గుండెజబ్బు ఆయనకు కుటుంబ వారసత్వం. స్వామీజీ లండన్‌లో ఉన్నప్పుడు తీవ్రమైన ఛాతీనొప్పితో అప్పటికే ఒకసారి చాలా బాధపడ్డారు. దీనిని గురించి ఇంతకు క్రితమే చూశాం.
నిద్రారాహిత్యం వలన స్వామీజీ ఏ మేరకు యాతనపడి ఉంటారో క్రింది సంఘటన తెలుపుతుంది. ఆ సంవత్సరం జనవరిలో ఆయన బలరాం బోస్ ఇంట్లో బస చేశారు. 22వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం. ఒక పిల్లవానిలా స్వామీజీ ఇలా అన్నారు: “గ్రహణ సమయంలో ఏం ప్రార్థిస్తామో అది నూరు రెట్లు లభిస్తుందని హిందువుల నమ్మకం. నేను నిద్రపోతాను. అలాగైనా భవిష్యత్తులో నూరురెట్లు నిద్ర లభిస్తుందని ఆశిస్తున్నాను.” కాని ఆయన 15 నిమిషాలు మాత్రమే నిద్రపోగలిగారు. మేల్కొనగానే ఆయన ఇలా అన్నారు: “జగజ్జనని ఈ దేహానికి గాఢనిద్ర విధించలేదు.”
ఆ రోజుల గురించి స్వామీజీ శిష్యుడయిన కేదార్‌బాబా ఇలా చెప్పారు: “కాస్త కూడా నిద్రపట్టక బాధపడ్డ ఆ రోజుల్లో ఒకసారి స్వామీజీ నాతో, ‘నాయనా! ఏదైనా చేసి నాకు కాస్త నిద్రపట్టేట్లు చూడు?! నువ్వు ఏం అడిగినా ఇస్తాను” అన్నారు. ఆయనకు నిద్రనిచ్చే శక్తి నా వద్ద ఉందా? దేహపరంగా ఆయన పడ్డ యాతనలు కాస్తా కూస్తా కాదు. ‘జ్ఞాన సముపార్జనానంతరం ఒకసారి కూడా నేను నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు నిద్రించింది లేదు’ అని ఆయన నాతో చెప్పారు.”
ఇన్ని రుగ్మతలు చాలదన్నట్లు ఉబ్బసం ఆయనను మరీ విసిగించింది. కొన్ని సమయాల్లో ఆయన ఊపిరాడక బాధపడడం కద్దు. కొంత మేరకు దాని నుంచి తెరపిన పడ్డప్పుడు దేహ పరిస్థితి మరీ క్షీణించి ఉండేది. ఊపిరాడని సమస్య ఆయనను తరచూ పీడించసాగింది.
వైద్యుల పరిశోధనలు హెచ్చరిక గంటలా మ్రోగాయి. హృదయం చికిత్సకు అతీతమైన స్థితిలో దెబ్బతిన్నదనీ, ఎంతో అప్రమత్తంగా ఉండకపోతే పర్యవసానం విపరీతంగా ఉంటుందనీ వారు వ్యాఖ్యానించారు. కచ్చితంగా బహిరంగ ఉపన్యాసాలు చేయకూడదు, ఉదయమూ సాయంత్రమూ గంగలో పడవ ప్రయాణం చేయాలని కొన్ని ఆంక్షలు విధించారు. నారాయికి చెందిన జమీందార్లు తమ పడవలను స్వామీజీ పయనం కోసం ఇచ్చారు కూడా. స్వామీజీ కూడా తమ శక్తి మేరకు వైద్యుల ఆంక్షలను పాటించారు; సక్రమంగా మందులు పుచ్చుకొన్నారు; ఉపన్యా సాలు మానుకొన్నారు.
అత్యున్నత స్థితులలో
శారీరకస్థితి ఈ దశలో ఉండగా, ఆయన సదా ప్రగాఢ భగవద్ధ్యాసలో మునిగివున్నట్లు చూపుతున్నది మానసికస్థితి. ఎవరూ ప్రక్కన లేకపోతే కాసేపట్లోనే ఆయన ధ్యానమగ్నులయ్యేవారు. ఆయనకూ, భగవద్ధ్యాస పరాకాష్ఠకీ మధ్య ఒక సన్నని తెర మాత్రమే వ్రేలాడు తున్నట్లుగా, ఏ సమయంలోనైనా అది చిరిగి ఆయన సమ గ్రంగా భగవద్ధ్యాసలో లయించిపోవచ్చుననీ తక్కినవారికి స్పష్టంగా తెలిసింది. “తాను ఎవరని నరేన్ ఎప్పుడైతే గ్రహిస్తాడో అప్పుడతడు దేహత్యాగం చేస్తాడు” అన్న గురుదేవుల వచనాలు అందరి జ్ఞాపకాల్లో మెదలుతూనే ఉన్నాయి. అలా ఏదీ జరగకుండా ఉండడానికి వారు ఎంతో ప్రయత్నించారు. ఆయనతో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడడం మానుకొని, సదా మామూలు విషయాలే మాట్లాడుతూ, ఆయనను వినోదభరితంగా ఉండేటట్లు చూసుకోవడంలో నిమగ్నులయ్యారు.
ఒక రోజు స్వామీజీ తమ శిష్యుడైన శుద్ధానందతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఏదో ప్రశ్న అడిగారు, శుద్ధానంద జవాబిచ్చాడు. స్వామీజీ మళ్లీ అదే ప్రశ్న అడిగారు. శుద్ధానంద అదే జవాబిచ్చాడు. ఈ విధంగా పది పన్నెండుసార్లు అదే ప్రశ్నా, అదే జవాబూ కొనసాగాయి. స్వామీజీ మనస్సు అక్కడ లేదని గ్రహించి ఆయనను బాహ్య చైతన్యంలోకి తీసుకురావడానికి శుద్ధానంద ప్రయత్నించాడు.
మఠంలో
ఈ రోజుల్లోనూ యువ సన్న్యాసులకూ, బ్రహ్మచారులకూ శిక్షణ నివ్వడం స్వామీజీ ఎంతో ప్రధానమని పరిగణించారు. వరాహనగర రోజుల నుండి మఠంలో పలువురు యువకులు చేరడం చూశాం. వారిలో కొందరు: వరాహనగర మఠంలో ప్రప్రథమంగా చేరిన వ్యక్తి కాళీకృష్ణ (స్వామి విరజానంద). ఆతడి తరువాత సుధీర్ (శుద్ధానంద), సుశీల్ (ప్రకాశానంద) చేరారు. ఖగేన్ (విమలానంద), గోవింద (ఆత్మానంద), హరిపాదుడు (బోధానంద)లు మఠం ఆలంబజార్లో ఉన్నప్పుడు చేరారు. పిదప కృష్ణమూర్తి (సోమానంద), దక్షిణరంజన్ (కల్యాణానంద)లు నీలాంబర మఠ రోజుల్లో చేరారు. ఈ యువసన్న్యాసులతో, బ్రహ్మచారులతో చర్చలు, ప్రశ్నోత్తరాలు, శాస్త్రాధ్యయనం, వివరణ లంటూ స్వామీజీ అనేక గంటలు గడిపేవారు. వారికంటూ కాలపట్టికను తయారుచేసి ఇచ్చారు; నియమాలు రూపొందించారు. ఈ నియమాలను యువ సన్న్యాసులు మాత్రమే కాక, తమ సోదర సన్న్యాసులూ పాటించాలని స్వామీజీ అభిలషించారు.
తాము కాశ్మీర్లో రచించిన మూడు కవితలను, మఠానికి వచ్చిన రోజునే స్వామీజీ అందరికీ చదివి వినిపించారు. తరువాత రెండు రోజులు మఠంలో హోమం అనుష్ఠించారు. ఆ తరువాత మూడు రోజులూ దుర్గాపూజ రోజులు. వంగదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ పూజను స్వామీజీ కొన్ని సంవత్సరాలుగా తిలకించలేదు. కనుక ఎంతో ఉత్సుకతతో, ఆసక్తితో అందు కోసం నిరీక్షించారు. అష్టమి రోజున బాగ్బజార్‌కు వెళ్లి మాతృమూర్తి శ్రీశారదాదేవిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొందారు.
స్త్రీ విద్యకు శ్రీకారం
భారతదేశంలో స్త్రీ విద్యకు బీజం నాటిన అగ్రగాముల్లో ఒకరుగా స్వామీజీ విరాజిల్లారు. ఈ రోజుల్లోనే అందుకయిన ప్రాథమిక పనులను ఆయన ప్రారంభించారు. బాగ్బజార్‌కు వెళ్లి మాతృదేవిని దర్శించడాన్ని దానికి శ్రీకారంగా భావించవచ్చు. ఎందుకంటే స్త్రీ అభ్యుదయా నికైన శక్తిని ప్రసాందింప వచ్చిన మహాశక్తిగా మాతృదేవిని ఆయన పరిగణించారు.
“మీలో ఎవరూ మాతృదేవి జీవితంలోని అద్భుతమైన ప్రాధాన్యాన్ని ఇంత దాకా అర్థం చేసుకోలేదు. కాని క్రమ క్రమంగా మీకు బోధపడుతుంది. శక్తి లేకుండా లోకానికి పునరుజ్జీవనం కలుగదు. అన్ని దేశాల కన్నా మన దేశం ఏ కారణాన బలహీనమై వెనుకబడిపోయింది? ఎందుకంటే అక్కడ శక్తి (స్త్రీ) అగౌరవింపబడడం వల్లే! ఆ అద్భుతశక్తిని పునరుజ్జీవింపచేయడానికే మాతృదేవి అవతరించారు. ఆమెను కేంద్రంగా చేసుకొని తిరిగి గార్గులూ, మైత్రేయులూ ఈ లోకంలో ఉద్భవించనున్నారు. ప్రియ సోదరా! ఇప్పుడు నీకు ఇది అర్థం కాదు. కాని క్రమక్రమంగా నీకు ఇది బోధపడుతుంది”* అని స్వామీజీ వ్రాశారు.
స్త్రీల పని కోసమే ఇంగ్లండ్ నుండి ఆయనతో వచ్చిన నివేదితను మాతృ దేవితో బస చేయడానికి స్వామీజీ ఏర్పాటు చేశారు. ఒక వారం మాతృదేవితో గడపిన పిదప నివేదిత, మాతృదేవి ఇంటికి సమీపంలో స్వామీజీ ఏర్పాటు చేసిన అద్దె ఇంట్లో నివసించింది. నివేదిత మాతృదేవి ఇంట్లో బస చేయడమూ, ప్రక్కనున్న హైందవ కుటుంబాల మధ్య ఒక అద్దె ఇంటిని ఆమె కోసం ఏర్పాటు చేయడమూ అంత సులభంగా జరగలేదు. సమాజంలో వితంతువుగా పరిగణింపబడ్డ మాతృదేవి, ఒక పాశ్చాత్య స్త్రీని తన ఇంట్లోకి అనుమతించడం అనేకులకు రుచించ లేదు. మాతృదేవి అభ్యుదయ భావనలూ, స్వామీజీ కార్యం పట్ల ఆమెకు గల నమ్మకమూ, స్వామీజీ ఉద్వేగమూ వీటిని సాధ్యం చేశాయి.
1898 నవంబర్ 12వ తేదీన మాతృదేవి బేలూర్‌లో మఠం కోసం కొనుగోలు చేసిన స్థలానికి పలువురు భక్తురాండ్రతో వచ్చి ఆ ప్రదేశాన్ని పావనం చేశారు. ఆ రోజు సాయంత్రం ఆమె, భక్తురాండ్రు బలరాంబోస్ ఇంటికి వెళ్లారు. స్వామీజీ, బ్రహ్మానంద, శారదానంద, ‘మ’, సురేంద్రనాథ్ దత్తా, హరమోహన్ ప్రభృతులు అక్కడికి వచ్చారు. స్త్రీ విద్య కోసం ఒక పాఠశాల ప్రారంభించడాన్ని గురించి చర్చింప నాడు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. నివేదిత ఆ సమావేశా నికి అధ్యక్షత వహించి, క్లుప్తంగా ప్రసంగించింది; ఆ కార్యానికి మద్దతు ఇవ్వమని అందరినీ కోరింది. కాని ఆశించినంతగా మద్దతు లభించలేదు.
అప్పుడు ఒక విచిత్రం జరిగింది. నివేదిత ప్రసంగిస్తున్నప్పుడు స్వామీజీ లోపలికి వచ్చారు. ఎవరూ గమనించని రీతిలో మెల్లగా చివరి వరుసలో కూర్చున్నారు. నివేదిత మద్దతు కోరినప్పటికీ ఎవరూ అందుకు స్పందించనప్పుడు స్వామీజీ వెనుక నుంచి భక్తులను తమ చేతులతో ముందుకు త్రోసి వారిని లేచి నిలబడి ఏదన్నా చెప్పమన్నారు. అప్పటికీ ఎవరూ స్పందించలేదు. కనుక స్వయంగా ఆయనే లేచి హరమోహన్ను చూపుతూ, “మిస్ నోబెల్! ఇదిగో ఈయన తన కుమార్తెను పంపడానికి సిద్ధంగా ఉన్నాడు” అన్నారు, స్వామీజీని చూసిన నివేదిత అమితానందంతో చప్పట్లుకొట్టి చిన్నపిల్లలా గంతులు వేసింది.
బాలికల పాఠశాల ప్రారంభం
నవంబర్ 13వ తేదీన బాలికల పాఠశాల లాంఛనప్రాయంగా ప్రారంభ మయింది. నాడు కాళీపూజ పర్వదినం. పాఠశాల ప్రారంభించడానికి మాతృదేవి శ్రీశారదాదేవి స్వయంగా వచ్చారు. నివేదిత నివాసంలోనే పాఠశాల ప్రారంభించబడింది. స్వామీజీ, బ్రహ్మానంద, శారదానంద, యోగీన్ మా, గోలాప్ మా మొదలైన వారు విచ్చేశారు. మాతృదేవి అలవాటు ప్రకారం మెల్లని స్వరంలో ఈ కార్యానికి తమ ఆశీస్సులు అనుగ్రహించారు. దానిని గోలాప్ మా బిగ్గరగా అందరికీ తెలియ జేసింది. జగజ్జనని ఆశీస్సులు సదా ఈ పాఠశాలపై వర్షించాలనీ, ఈ పాఠశాలలో శిక్షణ పొందుతున్న బాలికలు ఆదర్శవంతమైన స్త్రీలుగా విరాజిల్లాలని తాను ప్రార్థించినట్లు మాతృదేవి చెప్పారు. “భవిష్యత్తులో స్త్రీలు విద్యావంతులుగా విరాజిల్ల నున్నారనడానికి మాతృదేవి ఆశీస్సుల కన్నా ఉత్కృష్టమయిన శుభశకునాన్ని నేను ఊహించను కూడా ఊహించలేను” అని వ్రాసింది నివేదిత. స్వామీజీ పట్లా, ఆయన కార్యాచరణ పట్లా అమిత గౌరవమూ, అచంచల విశ్వాసమూ గల గృహస్థ భక్తుల ఇళ్ల నుండి బాలికలు ఆ పాఠశాలకు రాసాగారు. బాలికలను తోడ్కొని రావడానికి ఒక పరిచారికను ఏర్పాటుచేశారు. చరిత్రాత్మకమైన ఒక కార్యం నాడు స్వామీజీ ఈ విధంగా ప్రారంభించారు. స్వామీజీ నివేదితకు సలహాలిచ్చి, తమ సోదర సన్న్యాసులను ఆమెకు మార్గదర్శకత్వం వహించడంలో పాలుపంచుకోమని చెప్పి, స్త్రీ విద్య పురోభివృద్ధి గాంచడానికి దోహదం చేశారు.
‘వారు ఎక్కడికి పోతారు?’
ఈ రోజుల్లో స్వామీజీ నుండి పొంగిన ప్రేమ వెల్లువ నిరాటంకంగా అందరి మీద ప్రవహించింది. స్త్రీ–పురుషుడు, ధనికుడు – పేదవాడు, యువకుడు – వృద్ధుడు, ఉన్నత కులస్థుడు – నిమ్నకులస్థుడు, సజ్జనుడు – దుర్జనుడు లాంటి ఎలాంటి వివక్షనూ ఆయన చూపలేదు. వచ్చినవారి కల్లా మంత్రదీక్ష ఒసగారు. దుర్జనులనీ భ్రష్టులనీ ఆయన ఎవరినీ త్రోసిపుచ్చలేదు. ఆయన ఈ కారుణ్య వెల్లువ కొన్ని సమయాల్లో అపార్థం చేసుకోబడింది. బహుశా స్వామీజీకి మనుషులను వర్గీకరించడం తెలియలేదేమో నని కొందరు సందేహించారు కూడా. ఈ విధంగా అనేకులు మాట్లాడుకోవడం విని స్వామీజీ శిష్యుడొకరు స్వయంగా స్వామీజీతోనే దీనిని గురించి ప్రశ్నించాడు. ఉట్టిపడే ప్రేమ ధ్వనించే స్వరంలో స్వామీజీ ఇలా జవాబిచ్చారు:
“నాయనా! నాకు మనుషులను గురించి తెలియదంటున్నావా! ఒక వ్యక్తిని నేను చూసినప్పుడు, ఆతడి అంతరంగంలోని కార్యాచరణను మాత్రమే కాదు, ఆతడి గత జన్మను కూడా అవగతం చేసుకోగలను. నేను అర్థం చేసుకొన్నట్లు అతడు గ్రహించలేడు; ఆతడి అంతరంగంలో ఏం జరుగుతున్నదో నాకు తెలిసి పోతుంది. అవన్నీ తెలిసీ నేనెందుకు అలాంటి వ్యక్తికి మంత్రదీక్ష ఇస్తున్నాను? పాపం, మానసిక ప్రశాంతతకై వాళ్లు అన్ని తలుపులనూ తట్టారు. కాని అన్ని చోట్లా వారు తిరస్కరింపబడ్డారు. చివరగా నా వద్దకొచ్చారు. నేనూ తిరస్కరిస్తే వారు ఎక్కడికి పోతారు? అందుకే వారిని స్వీకరిస్తున్నాను. ఆహా! ఎంత దుః ఖీస్తున్నారో! ఈ లోకమే దుఃఖమయం, నాయనా!”
ముఖ్యమైన కార్యం
అనేక కార్యాలను ప్రారంభించడం జరిగిపోయింది. ఇవ్వవలసిన సందేశం ఇచ్చివేయడమయింది. శ్రీ గురుదేవులు ప్రారంభించిన సన్న్యాస సంప్రదాయానికి ఒక రూపం ఏర్పడింది. ఇక? గురుదేవుల నిష్క్రమణానంతరం ఆ రోజుల్లోనే ప్రమదదాస మిత్రాకు వ్రాశారే – “భగవాన్ శ్రీరామకృష్ణుల పవిత్ర అస్థికలను ప్రతిష్ఠించడానికి గంగా తీరంలో ఒక స్థలం లభించలేదే అనే తలంపుతో నా హృదయం బ్రద్దలవుతోంది,”* ఆ కార్యానికి కాలం ఆసన్నమవడం స్వామీజీ గ్రహించారు. తమ జీవితంలో అతి ముఖ్యమైన ఆ మహత్కార్యాన్ని నిర్వర్తించడానికి ఆయన తయారయ్యారు.