స్వామీజీ! రాబోయే రోజుల్లో, మిమ్మల్ని అవతారపురుషునిగా జనం
పరిగణించినప్పుడు మీరు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి –
అలా పరిగణించిన ప్రథముడు మహమ్మదీయుడనైన నేనే!
– సర్ఫ్రాజ్ హుస్సేన్
మళ్లీ ఉత్తర భారతంలో — మహమ్మదానంద — నీతిబాహ్యులకు అనుగ్రహం — అల్మోరాలో — పోలీసుల సందేహం — ‘తాకితే జ్ఞానం’ — గుహలలో తపస్సు — పవహారీ బాబా నిష్క్రమణ — గుడ్విన్ మృతి — రాజమ్ అయ్యర్ మృతి — గంధర్వ దర్శనం — ప్రేమనే అర్పిస్తున్నాను — గూటిపడవల్లో వాసం — మహమ్మదీయ స్త్రీ ఆభిజాత్యం — ఛెంఘిజ్‌ఖాన్ — అర్ధనారీశ్వరుడు — ఒక వినోదభరిత చిత్రం — క్షీరభవాని — జూలై 4 — ‘పాద పద్మాలను స్పృశించాను’
మళ్లీ ఉత్తర భారతంలో
ప్లేగు వ్యాధి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత స్వామీజీ మళ్లీ ఉత్తర భారతానికీ, కాశ్మీర్‌కూ వెళ్లగోరారు. అల్మోరాలో నివసిస్తూన్న సేవియర్ దంపతులు స్వామీజీని అనేకసార్లు ఆహ్వానించారు. 1898 మే 6వ తేదీన స్వామీజీ బయలుదేరారు. ఈసారి ఆయనతోపాటు ఒక పెద్ద బృందంగా సోదర సన్న్యాసులు, శిష్యులు, పాశ్చాత్య శిష్యులు వెళ్లారు. కలకత్తా నుండి ముందుగా నైనిటాల్ వెళ్లాలని నిశ్చయించారు. ఈ యాత్రలో స్వామీజీ మరో పరిమాణం స్పష్టంగా అభివ్యక్తమయింది. భారతదేశ చరిత్రలో ఆయనకున్న కూలంకష పరిజ్ఞానమూ, దేశభక్తే అది. ఒకసారి మెక్లౌడ్, “స్వామీజీ, మీకు ఉత్కృష్ట సేవ లందించడానికి నేను ఏం చేయాలి?” అని స్వామీజీని అడిగింది. “భారతదేశాన్ని అభిమానించు” అని స్వామీజీ జవాబిచ్చారు. స్వామీజీ భారతదేశాన్ని ఎంత గాఢంగా ప్రేమించారో ఈ రోజుల్లో తెలియవచ్చింది.
రైలు ముందుగా ఆగిన స్టేషన్ పాట్నా. చరిత్రలో పాటలీపుత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ నగరం, భారతదేశ చరిత్రలో అనేక ముఖ్య సంఘటనలను చవిచూసింది. స్వామీజీ ఆ నగర చరిత్ర వివరిస్తున్నప్పుడు, శ్రోతలు ఆ ప్రాచీన కాలానికే తరలిపోయినట్లు అనుభూతి చెందారు. ముక్తి నగరమయిన కాశీ, నవాబ్‌ల సిరిసంపదలకు సాక్షీభూతమై నిలిచిన లక్నో, బుద్ధుని బాల్యాన్నీ సన్న్యాస జీవితాన్నీ కళ్లారా తిలకించిన స్థలాల గుండా రైలు పోతున్నప్పుడు ఒక్కొక్క స్థలం గురించీ స్వామీజీ వర్ణిస్తూ వచ్చారు. ఆయనకు తెలియ దంటూ ఒక నగరమో, చరిత్రో లేదనిపించింది శ్రోతలకు. దారిలో అందమైన నెమళ్లు అప్పుడప్పుడు ఎగురుతూ కన్నులపండువ చేశాయి. ఏనుగులు తారసపడినప్పుడు ప్రాచీన యుద్ధాల గురించి ఆయన వివరించారు. ఒంటెలు బారులుతీరి పోతున్నప్పుడు ప్రాచీన బిడారుల (వర్తకుల సమూహం) కథలు చెప్పేవారు. కేవలం చరిత్రతో ఆయన మాటలు ఆగిపోలేదు. మన సంస్కృతి, మత భావనలు కూడా వాటిలో చోటుచేసుకొనేవి. గంగలో స్నానం చేస్తూ ప్రార్థించే హైందవ వితంతువు, కాశీనగర శ్మశానపు మెట్లు, వర్ణాశ్రమధర్మంలాంటి అనేక విభిన్న భావనలను గురించికూడా ఆయన ముచ్చటించారు.
మహమ్మదానంద
మే 13వ తేదీన వారు నైనిటాల్ చేరుకొన్నారు అక్కడ బసచేసివున్న ఖేత్రీ మహారాజును స్వామీజీ కలుసుకొన్నారు. తమ శిష్యులను ఆయనకు పరిచయం చేశారు. స్వామీజీ పాశ్చాత్య శిష్యులను చూసి మహారాజు ఎంతో సంతోషించారు. నైనిటాల్ వాస్తవ్యుడు సర్ఫ్రాజ్ హాస్సేన్. జన్మతః మహమ్మదీయుడైనప్పటికీ ఈతడు అద్వైత వేదాంతాభిమాని. ఆతడు స్వామీజీ పట్ల అమితంగా ఆకర్షితుడయినాడు. ఒక రోజు అతడు, “స్వామీజీ! రాబోయే రోజుల్లో మిమ్మల్ని అవతారపురుషునిగా జనం పరిగణించి నప్పుడు మీరు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి – అలా పరిగణించిన ప్రథముడు మహమ్మదీయుడనైన నేనే” అన్నాడు. స్వామీజీని కలుసుకొన్న నాటి నుండి ఆతడు తనను స్వామీజీ శిష్యునిగానే పరిగణించుకొన్నాడు; తన పేరును మహమ్మదానందగా మార్చుకొన్నాడు. ఇతడికి వ్రాసిన లేఖలో స్వామీజీ వేదాంతం, ఇస్లామ్‌ల సమ్మేళనం గురించి ప్రస్తావించారు.
“అనుష్ఠానపూర్వకమైన ఇస్లాం సహాయం లేనిదే వేదాంత సిద్ధాంతాలు ఎంత సూక్ష్మమైనవీ, అద్భుతమైనవీ అయినప్పటికీ అది జనబాహుళ్యానికి కేవలం నిరుపయోగాలని నా నిశ్చితాభిప్రాయం…. హిందూమతం, ఇస్లాం అనే రెండు మహోన్నత సిద్ధాంతాల సమ్మేళనమే – వేదాంతం బుద్ధి (బలం), ఇస్లాం శరీరం (బలం) – అనేదే మన మాతృదేశానికి ఆశాజనకమైన ఉపాయం.”*
నీతిబాహ్యులకు అనుగ్రహం
ఒక రోజు నివేదిత, తక్కిన పాశ్చాత్య స్త్రీలు సమీపంలోని ఒక జగజ్జనని ఆలయానికి వెళ్లారు. దారిలో ఇద్దరు స్త్రీలు స్వామీజీని గురించి వారిని వాకబు చేశారు. వారు స్వామీజీ బస చేసిన స్థలం గురించి వచ్చీరాని హిందీలో తెలిపారు. ఆ స్త్రీలు వేశ్యలు. వారు స్వామీజీ దర్శనార్థం వచ్చినప్పుడు అక్కడ బోలెడంతమంది జనం గుమిగూడి ఉన్నారు. ఆ జనం వీరిని చూడగానే ముఖం చిట్లించారు; వారిని లోపలికి రానివ్వకూడదని ప్రతిఘటిం చారు. కాని వారి ప్రతిఘటనను స్వామీజీ పట్టించుకోలేదు. వారిని దగ్గరకు పిలిచి ఆశీర్వదించి, కారుణ్యం ఉట్టిపడగా చాలాసేపు మాట్లాడారు. ఆ స్త్రీలు మాత్రమే కాదు, విన్నవారందరి హృదయాలు ద్రవించిపోయాయనడం అతిశయోక్తి కాదు.
అల్మోరాలో
మే 17వ తేదీన స్వామీజీ బృందం అల్మోరా చేరుకొంది. స్వామీజీ, తక్కిన సన్న్యాసులు సేవియర్ దంపతులు నివసిస్తున్న థామ్సన్ హౌస్‌లో అతిథులుగా బస చేశారు. పాశ్చాత్య శిష్యులు సమీపంలోని ఓక్లే హౌస్‌లో బస చేశారు. అల్మోరాలో వారంతా దాదాపు నెల రోజులు గడిపారు. స్వామీజీతో సహజీవనం చేస్తున్నప్పుడు ఒక వంక ఆధ్యాత్మిక ఉన్నత స్థితులలో లయించిపోవడమూ, మరో వంక జ్ఞానాంబుధిలో మునిగిపోవడమూ సంభవించడం కద్దు. ఆయన పాలుపంచుకొన్న అంశాలు అనేకం. రోమన్ సామ్రాజ్యం, నేటి ఇంగ్లండ్, అమెరికా, మొగలాయీ సామ్రాజ్యం, చైనా, శివాజీ, బుద్ధుడు, పురాణాలు, హిమాలయాలు – ఇలా ఆయన ముచ్చటించని విషయాలు లేవనే చెప్పుకోవాలి.*
పరివ్రాజక రోజుల్లో అల్మోరాలో తన ప్రాణం రక్షించిన ముస్లిమ్ ఫకీర్‌ను స్వామీజీ మళ్లీ ఇక్కడ కలుసుకొన్నారు. స్వాగతోత్సవ సందర్భంలో ఆ ఫకీర్ ఒక మూల నిలబడి ఉన్నాడు. ఆతడు స్వామీజీని గుర్తించలేదు. కాని స్వామీజీ ఆతణ్ణి గుర్తించి జనాన్నీ, వారి ఉత్తేజాన్నీ పట్టించుకోకుండా తిన్నగా వెళ్లి ఆతణ్ణి కౌగిలించుకొన్నారు. ప్రక్కన నిలబడ్డవారికి ఆతణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా పరిచయం చేసి, ఆతడికి కొంత పైకం కూడా ఇచ్చారు.*
పోలీసుల సందేహం
అల్మోరాలోనూ ప్రజలు, ప్రముఖులు అనేకులు వచ్చి స్వామీజీని కలుసుకొ న్నారు. శ్రీమతి ఆనిబెసెంట్ అల్మోరాలో రెండుసార్లు స్వామీజీని కలుసుకొన్నారు. పాశ్చాత్యులుృ ఉన్నందువలననో ఏమో స్వామీజీ చేతలలో పోలీసులకు సందేహం కలిగింది. నివేదిత ఆయనతో ఉండడం కూడా ఒక ముఖ్యకారణమై ఉండవచ్చు. ఎందుకంటే ఇంగ్లండ్‌లో పెరిగినప్పటికీ ఆమె ఐర్లాండు వాస్తవ్యురాలు; ఐర్లాండు విప్లవాలతో సంబంధం ఉన్న వ్యక్తి ఆమె. నివేదిత ఇలా వ్రాస్తున్నారు: “స్వామీజీపై పోలీసులు నిఘా ఉంచిన వైనం నేడు తెలిసింది. స్వామీజీ అంతా విని నవ్వుతున్నారు. నాకేమో పోలీసుల చేష్టల్లో ఏదో దురుద్దేశం ఉందనిపిస్తోంది. కాని ఒక విషయం; ఈ ప్రభుత్వానికి పిచ్చిపట్టి ఉండాలి లేదా ఆ స్థితిని సమీపిస్తూండాలి. ఆయనను తాకడం, దేశవ్యాప్తంగా విప్లవాగ్ని వ్యాపించడానికి కారణమవుతుంది. ఆ విప్లవాగ్నిని ప్రప్రథమంగా వ్యాప్తి గావించే వ్యక్తిని నేనే – ఒక ఆంగ్లేయ స్త్రీనైన నేనే – అవుతాను.”
‘తాకితే జ్ఞానం’
భారతదేశ కార్యాచరణలో నివేదిత వంతు ఎంతో ప్రధాన్యం సంతరించు కోనున్నదని స్వామీజీకి స్పష్టంగా తెలుసు. కనుక ఆమెకు శిక్షణ నివ్వడంలో విశిష్ట శ్రద్ధ వహించారు. నివేదిత అంత సులభంగా భావనలను అంగీకరించే వ్యక్తి కాదు. నివేదిత ప్రశ్నలూ, వైఖరీ స్వామీజీకి తమ దక్షిణేశ్వర రోజులు జ్ఞాపకానికి తెచ్చాయి. శ్రీరామకృష్ణుల అభిప్రాయాలను తను యథాతథంగా స్వీకరించకపోవడం స్వామీజీ మనస్సులో మెదలింది. తమ భావనలను ఎవరి మీదా బలవంతంగా రుద్దడం ఆయనకు సుతరామూ ఇష్టం లేదు. కనుక నివేదిత ప్రతిఘటనలకు సముచిత వివరణలిచ్చి ఆమెను ఆమె ధోరణిలో వదలిపెట్టేవారు. కాని ఆమెకు ఇస్తూన్న ఆధ్యాత్మిక శిక్షణకు స్వస్తి చెప్పలేదు; అంటే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నదని ఆమెను త్రోసిరాజనలేదు. “పాఠశాలకు వెళ్లేలాంటి రోజులు అవి” అని కాలాంతరంలో నివేదిత వ్రాసింది.
కొన్ని సమయాలలో స్వామీజీకీ, నివేదితకూ మధ్య పెద్ద ఎత్తున అభిప్రాయ భేదాలు తలెత్తడం కద్దు. ఈ కారణంగా ఇద్దరూ ప్రశాంతత లేకుండా గడపిన రోజులూ లేకపోలేదు. ఒకసారి ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు స్వామీజీ దట్టమైన అరణ్యంలోకి వెళ్లిపోయారు. ఉదయం అనగా వెళ్లిన ఆయన సాయంత్రమే తిరిగివచ్చారు. మళ్లీ ఏకాంత జీవితం గడపాలని ఆయన హృదయం ఉవ్విళ్లూరింది. కనుక నివేదితతో, “నేను ఏకాంతంలోకి పోతున్నాను, వచ్చేటప్పుడు ప్రశాంతత సంతరించుకొని వస్తాను” అన్నారు.
అది ప్రశాంతమయిన సాయంత్రం వేళ. చీకటి క్రమ్ముకోనారంభించింది. ఆకాశంలో నెలవంకను చూసిన స్వామీజీ, “అదిగో చూడు! మహమ్మదీయులు నెలవంకను ఆరాధిస్తారు. మన జీవితంలోనూ ఈ నెలవంక ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది గాక!” అన్నారు. స్వామీజీ మాటలూ, ఆకృతీ నివేదిత మనస్సులో ప్రశాంతతను నింపాయి. స్వామీజీ ముందు ఆమె మోకరిల్లింది. తమ అనుంగు పుత్రిక తలను స్పృశించి, చేతులు పైకెత్తి ఆశీర్వదించారు.
ఒకసారి శ్రీరామకృష్ణులు, “కాలక్రమంలో, నరేన్ కేవలం స్పృశించినంత మాత్రాన జ్ఞానం ప్రసాదించగల శక్తిసంపన్నుడవుతాడు” అన్నారు. నాడు గురుదేవుల మాటలలోని నిజాన్ని నివేదిత గ్రహించింది. ప్రశాంతమయిన ఆ సాయంత్రం వేళ స్వామీజీ ఆశీస్సులు తన హృదయాన్ని నింపివేసి, అంతరం గంలో ఏవేవో మార్పులను కల్పించడం నివేదితకు స్పష్టంగా తెలియవచ్చింది ఆ రోజు ఆమె ధ్యానానికి కూర్చునప్పుడు, ఎన్నడూలేని మేరకు ఆమె ప్రగాఢంగా ధ్యానం చేయగలిగింది. ధ్యాన పరకాష్ఠ స్థితిలో నాడు పరమగమ్యపు అద్భుత దృశ్యాలు తిలకించింది!
గుహలలో తపస్సు
నివేదితను ఆశీర్వదించి, తను చెప్పినట్లే ఎదుటి కొండలలో వెలసిన సియాదేవి ఆలయానికి స్వామీజీ వెళ్లారు. దట్టమైన అడవుల్లో ఆ దేవాలయం ఉంది. ఆ ఆలయం ప్రక్కన బసచేసి, ప్రతి రోజూ 10 గంటల సేపు అక్కడ నుండి మరింత దట్టమయిన అడవిలోకి వెళ్లి ఏకాంతమైన తపస్సులో మునిగిపోయారు. కాని జనసమూహం ఆయనను అక్కడా విడిచిపెట్టేట్లు లేదు. ఆయన తిరిగి వస్తున్నప్పుడు, ఆయనకు మ్రొక్కి ఆశీస్సులు పొందడానికి అక్కడొక గుంపు సిద్ధంగా ఉంది. అల్మోరాలో బస చేయడానికీ, ఇక్కడ ఉండడానికి పెద్దగా తేడా లేదని గ్రహించిన స్వామీజీ మూడవ రోజే తిరిగి వచ్చేశారు.
కాని తాము చెప్పినట్లే, తిరిగి వస్తున్నప్పుడు స్వామీజీ ముఖారవిందం దివ్యత్వంతో తేజరిల్లింది; దాన్లో నుంచి కాంతి ప్రసరిస్తున్నట్లుగా కనిపించింది. నిజానికి ఆయన చిట్టచివరి ప్రశాంతతను మళ్లీ ఒకసారి చవిచూశారు, దాన్ని తీసుకొని వచ్చారు.
పవహారీ బాబా నిష్క్రమణ
ఏకాంత జీవితం నుంచి తిరిగి వచ్చిన స్వామీజీ వరుసగా మూడు వియోగాలను భరించవలసి వచ్చింది. మొదటిది పవహారీ బాబా మహాసమాధి. “శ్రీరామకృష్ణుల తరువాత నేను ఆరాధించే మహనీయుడు” అని స్వామీజీ ఈయనను గురించి వ్యాఖ్యానించడం కద్దు. హోమాలు అనుష్ఠించడం బాబాగారి సాధన విధానాల్లో ఒకటి. అటువంటి హోమాగ్నికి చివరి ఆహుతిగా తమ దేహాన్ని అర్పించారు ఆ మహాయోగి.
“అలా తమనే ఆహుతి చేసుకోవడం తప్పు కదా స్వామీజీ?” అని ఒకరు అడిగారు.
“నేనెలా చెప్పగలను? ఆయన చేతలను విచారణ చేసే అర్హత నాకు లేదు, ఆయన అంతటి ఉన్నతోన్నతుడు. తాను చేస్తున్నదేదో బాగా ఎరిగిన వ్యక్తి ఆయన” అన్నారు స్వామీజీ. కాలాంతరంలో పవహారీ బాబా చరిత్రను ఆయన రచించారు కూడా.
“మరణానంతరం సైతం ఆయన ఎవరికీ ఇబ్బంది కలిగించదలచుకోలేదు. కనుక ఆర్యుడనే పద్ధతిలో చేయవలసిన ఆఖరి త్యాగాన్ని ఆయన తమ దేహంతోనూ, స్పృహతోనూ ఉన్నప్పుడే చేసివేశారు. ఆయనను నేను బాగా అవగతం చేసుకొన్నందు వలననే ఈ విధంగా సాహసించి చెబుతున్నాను. నిష్క్రమించిన ఆ మహనీయునికి అంజలి ఘటించే కర్తవ్యం ఈ రచయితకు (నాకు) ఉంది. ఇది రచించడానికి అనర్హుడనైనప్పటికీ, నేను అభిమానించి సేవ చేసిన మహోన్నత ఆచార్యులలో ఒకరైన పవహారీ బాబా జ్ఞాపకార్థం ఇది అంకితం చేస్తున్నాను”* అని స్వామీజీ వ్రాశారు.
గుడ్విన్ మృతి
తదుపరి ఎవరూ అనుకోని ఒక వియోగం – అది గుడ్విన్ మృతి. స్వామీజీ ఇచ్ఛ మేరకు, అలసింగ సహాయంతో ఆంగ్లంలో ఒక దినపత్రిక ప్రారంభించడానికీ, అలసింగ బ్రహ్మవాదిన్ పత్రిక పనిలో సహకరించేందుకూ 1897 జూలైలో స్వామీజీ గుడ్విన్ను చెన్నైకు పంపించారు. ఆతడు తన విధ్యుక్త కార్యానికి శ్రీకారం చుట్టాడు. కాని విధి వక్రించింది. ఊటీకి వెళ్లిన గుడ్విన్ హఠాత్తుగా టైఫాయిడ్‌కు గురియైనాడు. చివరి క్షణంలోనూ స్వామీజీ గురించే మాట్లాడాడు, ఆయన తన ప్రక్కన ఉండాలని ఎంతో అభిలషించాడు. స్వామీజీ జ్ఞాపకాలలోనే లయించి గుడ్విన్ తుదిశ్వాస విడిచాడు. అప్పుడు ఆతడి వయస్సు కేవలం 30 ఏళ్లు. స్వామీజీకి తనను అంకితం చేసుకొని, ఆయన కోసమే గడపిన జీవితం అది! ఆతడు మిస్ మెక్లౌడ్కి వ్రాసిన లేఖలో ఒక విభాగం చూద్దాం:
“భారతదేశానికి వచ్చినప్పుడు స్వామీజీ గురించి నేను ఏమనుకొన్నానో మీకు చెప్పనవసరంలేదు. కాని ఇక్కడ 16 నెలలు గడపిన తరువాత పూర్తిగా మీ భావనతో ఏకీభవిస్తున్నాను. మరి దేని గురించీ నేను కలత చెందడం లేదు. ఆయన కార్యాన్ని నేను చేయడం కూడా ఆయన సంకల్పానుసారం వలననే. ప్రస్తుతం నాకు అంతగా పని లేదు. ఇందువలన నేను ఆయనకు ఒక భారంగా ఉండకూడదని ‘మెయిల్’ పత్రికలో పనిచేస్తున్నాను….”
స్వామీజీ కార్యాచరణకై భారతదేశానికి వచ్చిన గుడ్విన్, ఆయనకు భారంగా ఉండకూడదని మరో పని చూసుకొన్నాడు! ఇటువంటి సహృదయుణ్ణి కోల్పోవడం స్వామీజీని కలత చెందించడం సహజమే కదా! “నా కుడిచేయి విరిగిపోయింది, ఈ నష్టం భర్తీ చేయలేనిది” అని ఆయన తీవ్రబాధకు గురియైనారు. ఎక్కడ ఆయనకు గుడ్విన్ మరణవార్త తెలియజేయబడిందో అక్కడ బస చేయడానికి ఆయన ఇష్టపడలేదు. పదేపదే గుడ్విన్ జ్ఞాపకాలను ఆ చోటు గుర్తుకు తెస్తుందని ఆయన చెప్పారు. వియోగ బాధతో ఆయన తల్లడిల్లడం కానవచ్చింది. ఆత్మజ్ఞాని అయినప్పటికీ ఒక సాధారణ వ్యక్తిలా, “గుడ్విన్ ప్రాణం తీసిన ఆ భగవంతుణ్ణి తన్ని, చంపితే మటుకు తప్పేమిటి!” అంటూ ప్రేలాపించేటంత ఆవేదన చెందారు ఆయన. తమ ఉద్వేగాలను కవితారూపంలోకి తర్జుమా చేసి, దానిని కుమారుని ఎడబాటుతో వాడిపోతున్న వితంతువు తల్లికి స్వామీజీ పంపించారు:
అమర ఆత్మ!
తారాఖచితమైన నీ మార్గంలో
అగ్రపరుడవు కమ్ము
ఎక్కడ భావము చిరముక్తమో
ఏ దృశ్యాన్ని దేశకాలాలు
కనుమరుగు చేయజాలవో
ఓ ధన్యాత్ముడా!
అక్కడకు శీఘ్రగతిని చేరుకొనుమా!
చిరశాంతి, చిర ఆశీస్సులు
నీకు తోడు నీడై ఉండుగాక…
స్పర్థతో కూడిన ఈ ప్రపంచాన్ని
నీ ప్రేమ సుధాధారలతో
సదా నింపెత్తు.*
దీనితో పాటు ఒక ఉత్తరం కూడా పంపించారు:
“ఈ ఇహలోకం నుండి గుడ్విన్ సెలవు పుచ్చుకొన్న దుఃఖవార్త విని నేను అనుభవిస్తున్న దుఃఖం వర్ణనాతీతం. ఎక్కడ నుంచో వచ్చినట్లు అది హఠాత్తుగా జరిగిపోయింది, కనుక మరణ సమయంలో ఆతడి ప్రక్కన ఉండలేకపోయాను. ఆతడి ఋణాన్ని నేనెన్నటికీ తీర్చలేను. నా భావనలతో ప్రయోజనం పొందామని ఎవరైనా భావిస్తే, అందుకు కారణం గుడ్విన్ అకుంఠిత, నిస్వార్థ పరిశ్రమే. దాదాపు ప్రతి మాట ఆతడి శ్రమ ఫలితంగానే వెలుగుచూసింది. ఆతణ్ణి కోల్పోవడంలో, ఉక్కు లాంటి పటిష్ఠమైన మిత్రుణ్ణీ, అంచంచల భక్తిగల శిష్యుణ్ణీ, విసుగూ విరామమూ ఎరుగని కార్యశూరుణ్ణీ నేను కోల్పోయాను. ఆతణ్ణి కోల్పోవడంలో కేవలం పరుల కోసమే జీవించడానికి జన్మించేవారిలో ఒకరిని లోకం కోల్పోయింది.”
రాజమ్ అయ్యర్ మృతి
మూడవ వియోగ వార్త చెన్నై నుంచి వచ్చింది – ‘ప్రబుద్ధ భారతం’ పత్రికను నడపిస్తూ వచ్చిన రాజమ్ అయ్యర్ తన 26 వ ఏట మృతి చెందారు. వేదాంతంలో చక్కని ఉత్సుకత, స్వామీజీ పట్ల భక్తిప్రపత్తులు గల వ్యక్తి ఆయన. ఆయన మరణంతో ఆ పత్రిక ఆగిపోయింది. తమ శిష్యుడయిన స్వరూపానంద, సేవియర్ల సహాయంతో ఆ పత్రికను పునరుద్ధరించగోరారు స్వామీజీ. ఆ విధంగానే కాలాంతరంలో ఆ పత్రిక అల్మోరా నుంచి వెలువడ నారంభించింది.*
గంధర్వ దర్శనం
జూన్ 16వ తేదీన నివేదిత, మరికొందరితో కలసి అల్మోరా నుంచి కాశ్మీర్‌కు బయలుదేరారు స్వామీజీ. దారిపొడవునా అద్భుతమయిన ప్రకృతి దృశ్యాలు! వాటితోపాటు స్వామీజీ సమక్షం ఆ బృందంలోని వారికి ఆ ప్రయాణం చిరస్మరణీయంగా ఒప్పారింది. దారిలో ఒక గుట్ట తారసపడినప్పుడు స్వామీజీ ఇలా వ్యాఖ్యానించారు: “ఈ గుట్ట మీద గంధర్వులు* జీవిస్తున్నారు. స్వయంగా నేను ఒకరిని చూడడం తటస్థించింది. వారి గురించి అక్కడి ప్రజలు చెప్పుకోవడం కద్దు. కానీ ఆ సంగతి నాకు తరువాతే తెలిసింది.”
వేదకాలం నాటి ఋషులు జీవించిన ప్రదేశం హిమాలయాలు. అక్కడ వేదమంత్రాలు సహజంగానే హృదయంలో మెదలుతాయి. స్వామీజీ కూడా అనేక మంత్రాలు ఉచ్చరించారు. వాటి తాత్పర్యం విశదీకరించారు. ప్రత్యేకించి అభ్యారోహ మంత్రం, శాంతి మంత్రాలు కొన్నింటిని వారి కోసం అనువదించారు కూడా.*
గుర్రబ్బండిలో వెళ్లవలసిన చోట్లకు ఆయన పాశ్చాత్య శిష్యులు ఒక్కొక్కరుగా మారుతూ ఆయనతో పయనించారు. స్వామీజీ తమ జీవితంలో జరిగిన అనేక సంఘటనలను పేర్కొన్నారు. చెడును గెలువగలిగిన ఏకైక ఆయుధం ప్రేమ అని చెప్పి ఒక సంఘటన తెలిపి దానిని వివరించారు కూడా.
ప్రేమనే అర్పిస్తున్నాను
స్వామీజీ బడి సహాధ్యాయి ఒకరు కాలాంతరంలో గొప్ప సంపన్నుడయ్యాడు. ఆతడికి హఠాత్తుగా జబ్బు చేసింది. ఆ జబ్బు ఏమిటో, దానికి చికిత్స ఏమిటో డాక్టర్లు నిర్ధరించలేకపోయారు. అంతా పెదవి విరిచి తరువాత అతడికి జీవితం మీద విరక్తి కలిగింది, అతడు మతాన్ని అభిలషించాడు. తనతో చదువుకొన్న నరేంద్రుడు సన్న్యాసం స్వీకరించినట్లూ, ఆతడు యోగంలో అగ్రగణ్యుడనీ విని స్వామీజీకి కబురు పంపి, ఎలాగైనా తనను ఒకసారి కలుసుకోమని విజ్ఞప్తి చేశాడు. ఆతడి విన్నపాన్ని మన్నించి స్వామీజీ ఆతణ్ణి చూడడానికి వెళ్లారు.
రోగి పడక ప్రక్కన కూర్చునప్పుడు ఒక ఉపనిషత్తు మంత్రం స్వామీజీ మనస్సులో మెదలింది. “బ్రహ్మ తం పరాదా ద్యోఽన్యత్రాత్మనో బ్రహ్మ వేద క్షత్త్రం తం పరాదా ద్యోఽన్యత్రాత్మనః క్షత్త్రం వేదలోకా స్తం పరాదు ద్యోఽన్యత్రాత్మనః లోకాన్వేద….”*
పై మంత్రాన్ని స్వామీజీ ఉచ్చరించారు. పర్యవసానం ఆశ్చర్యజనకం! స్వామీజీ ఈ మంత్రాన్ని ఉచ్చరించగానే మిత్రుడు మంత్రార్థాన్ని అవగతం చేసుకోగలిగాడు. ఆతడు తన దేహంలో ఒక నూతన శక్తి జనించినట్లు గ్రహించాడు; వైద్యులు నయం చేయలేని రుగ్మత నుండి అతడు త్వరలోనే కోలుకొన్నాడు. ఇది చెప్పి స్వామీజీ కొనసాగించారు: “నేను కొన్ని సమయాల్లో మీకు అర్థం కానిది చెబుతాను, కొన్ని సమయాల్లో కోపంతో ఏదో మాట్లాడతాను. కానీ నా మనస్సులో ప్రేమ తప్ప మరేదీ లేదు, మరి దేనినీ నేను బోధించలేదని గుర్తుంచుకోండి. మనం ఒకరిని అభిమానిస్తున్నామని అర్థం చేసుకొంటే మాత్రం చాలు, అంతా సవ్యంగా ఉంటుంది.”
గూటిపడవల్లో వాసం
జూన్ 20వ తేదీన వారు బారాముల్లా చేరుకొన్నారు. అక్కడ స్వామీజీ, ఆయన బృందమూ దాదాపు నాలుగు నెలలు ‘డుంగా’ అని పేర్కొనబడే గూటి పడవల్లో బస చేశారు. ఇవి దాదాపు 70 అడుగుల పొడవు, రెండు మంచాలు పట్టే వెడల్పూ గలవి. చుట్టూ అందమైన చాపలు వ్రేలాడదీయబడి ఒక ఆహ్లాదకరమైన గది వాతావర ణాన్ని కల్పించాయి. ఏ చోట కావలసినా చాపలు చుట్టి, వెలుతురో, గాలో రావడానికి వీలున్నది. స్వామీజీ, మరొక సన్న్యాసి కలసి ఒక గూటిపడవలో బస చేశారు. మిసెస్ సారా, మిస్ మెక్లౌడ్ ఒకదాన్లో, నివేదిత, మిసెస్ పేటర్సన్ మరొక దాన్లో బస చేశారు. భోజనశాల కోసం ఒక పడవను కేటాయించుకొన్నారు. ఈ విధంగా నాలుగు గూటిపడవల్లో వారు బస చేశారు.
పడవ నడిపేవారు తమ కుటుంబంతో ఆ పడవలో ఒక మూలగా నివసిస్తారు. కొన్ని సమయాల్లో పడవను తెడ్లతో తడవులాడుతూ నడిపారు; కొన్ని సమయాల్లో పడవకు తాడుకట్టి తీరం వెంబడి నడుచుకొంటూ ఈడ్చుకు వెళ్లారు. పడవ కదలుతూన్నట్లు తెలియకుండా అది తేలుతూ పోయేలా వారు ప్రతిభా వంతంగా పడవ నడిపారు. జీలం నదిలోనో, సరోవరాలలోనో లోపలికి వెళ్లదలచు కొంటే వారికి ఒక రోజు ముందే తెలుపాలి. అందుకు ఎన్ని రోజులు పడుతుందో లెక్కగట్టి, అవసరమైనంత ఆహారపదార్థాలు, కాయగూరలు, గ్రుడ్లు, కోళ్లు, బాతులు, వెన్న, పండ్లు, పాలు మొదలైనవి నిల్వ చేసుకొంటారు. వీటిని పడవ క్రింద గదులలో పదిలపరుస్తారు.
స్వామీజీని కలుసుకోవడానికి, ఆయనతో చర్చించడానికి అనేక సమయాల్లో కాశ్మీరీ పండితులు రావడం కద్దు. స్వామీజీ విశాల భావనలనో, ‘మ్లేచ్ఛులు’ అని పరిగణింపబడ్డ పాశ్చాత్యులతో కలసి ఆయన జీవించడాన్నో వారు అంగీకరించ లేకపోయారు. “స్వామీజీ, ఈ స్త్రీలను మీతో కలసి బసచేయడానికి ఎందుకు అను మతించారు? అందునా వీరు మ్లేచ్ఛులు, అస్పృశ్యులు” అనేవారు. ఆ సందర్భంలో క్రింది గదుల నుండి కోడిపిల్లలు, బాతులు చేసే కూతలు వినవచ్చేవి. పండితులు చుట్టూ కలయచూసేవారు. స్వామీజీ – తమ శిష్యులను చూసి కళ్లు మిణకరించే వారు. ఆ పండితులకు ఏమీ అర్థం కాదు. వీరు మాంసాహారులని తెలిస్తే ఆ పండితులు మూర్ఛపోయేవారు!
స్వామీజీని సనాతనులు అంగీకరించలేదు. అదే విధంగా ఆయన పాశ్చాత్య శిష్యులను తక్కిన పాశ్చాత్యులు అంగీకరించలేదు. “స్వామీజీ మిమ్మల్ని స్వీకరించి నప్పటికీ ఆయన మీతో మర్యాదగా వ్యవహరించలేదు; తలపాగా ధరించకుండా మీ వద్దకొచ్చి మాట్లాడడం నుంచి! ఈ సంగతి మీకు అర్థం కాలేదా?” అని వారు ప్రశ్నించారు. “రెండు దేశస్థులలోని మూర్ఖత్వాన్ని చూసి మాలో మేం నవ్వుకొన్నాం” అని మిస్ మెక్లౌడ్ వ్రాస్తున్నది.
మహమ్మదీయ స్త్రీ ఆభిజాత్యం
బారాముల్లా నుంచి జీలం నది మీదుగా గూటిపడవల్లో వారు శ్రీనగర్‌కు బయలుదేరారు. కన్నులపండువ చేసే ప్రకృతి దృశ్యాల సమాహారంగా ఆ పయనం అలరారింది. రెండవ రోజు ప్రయాణంలో ఒక గ్రామాన్ని వారు దాటి వెళ్లవలసి వచ్చింది. స్వామీజీ వారిని ఆ గ్రామంలోకి తోడ్కొని వెళ్లారు. అక్కడ ఒక మహమ్మదీయ స్త్రీని వారికి పరి చయం చేశారు. ఆ స్త్రీ కంబళి నేస్తూ ఉంది. కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లు వారికి సహాయం చేస్తున్నారు. నిరుడు స్వామీజీ కాశ్మీర్‌కు వచ్చినప్పుడు ఆమెను కలుసుకోవడం తటస్థించింది. అప్పుడు జరిగిన సంఘటనను ఆయన జ్ఞాపకం చేసుకొన్నారు. నాడు దప్పిక తీర్చుకోవడానికి ఆమెను నీళ్లు అడిగారు. ఆమె నీరిచ్చింది. దాహం తీరగానే స్వామీజీ ఆమెతో, “అమ్మా! నువ్వు ఏ మతానికి చెందిన దానివి?” అని అడిగారు. ఆమెలో ఆభిజాత్యం కానవచ్చింది. గంభీరంగా, “అల్లా కారుణ్యం వలన నేను ఒక మహమ్మదీయురాలిని” అని జవాబిచ్చింది. ఒక మహమ్మదీయురాలిగా ఉండడంలో ఆమెకున్న ఆభిజాత్యం స్వామీజీని అమితంగా ఆకర్షించింది. ప్రతి భారతీయుని వద్ద ఈ ఆభిజాత్యం, తన మతం పట్ల ఆభిజాత్యం, తన వంశావళి పట్ల ఆభిజాత్యం, తన సంస్కృతి పట్ల ఆభిజాత్యం, తన పూర్వీకులపట్ల ఆభిజాత్యం ఉన్నట్లయితే భారతదేశపు నుదుటివ్రాత మరో విధంగా ఉండేదని బహుశా ఆయన హృదయం భావించివుంటుంది! ఎడతెగ కుండా దాదాపు 22 రోజులు స్వామీజీ, ఆయన బృందమూ గూటిపడవల్లో వాసం చేశారు. శ్రీనగర్ చుట్టూ వారి పయనం సాగింది. వారి ఎదుట కాశ్మీర్ చరిత్రను అనేక కోణాల్లో చూపించారు స్వామీజీ. వారు భోజనం కూడా మరచి స్వామీజీ వాక్ వృష్టిలో తడసిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కాశ్మీర్‌ను దాటివచ్చిన అనేక కాలఘట్టాలు, ప్రత్యేకించి కనిష్కుని కాలం, బౌద్ధం చూపిన సజ్జన ప్రవర్తన, అశోకుని మతసిద్ధాంతం, శివారాధన చరిత్ర లాంటి ఆయన పరపించిన దృశ్యాలు కోకొల్లలు.
ఛెంఘిజ్‌ఖాన్
ఛెంఘిజ్‌ఖాన్ గురించి ఆయన తెలిపిన అభిప్రాయం చింతనాయోగ్య మయినది. ఆయన ఇలా అన్నారు: “సామాన్యంగా అనుకొన్నట్లు ఛెంఘిజ్‌ఖాన్ ఒక బందిపోటు లేదా హంతకుడు కాడు. నెపోలియన్లా, అలెగ్జాండర్‌లా ఆతడు ఒక గొప్ప వీరుడు. ఆతడు కూడా సమైక్యతా భావనతో అమితంగా ఆకట్టుకోబడ్డాడు; ప్రపంచాన్ని అతడు సమైక్య పరచగోరాడు. ఎలా ఒక భగవంతుడు కృష్ణునిగా, బుద్ధునిగా, ఏసుక్రీస్తుగా అభివ్యక్తమవుతున్నాడో అదే విధంగా ఒకే ప్రాణమే ఛెంఘిజ్‌ఖాన్, అలెగ్జాండర్, నెపోలియన్ – ఈ ముగ్గురి ద్వారా అభివ్యక్తమయింది, మూడు రకాలయిన విజయాల్ని సంతరించుకొందని తోస్తున్నది.”
అర్ధనారీశ్వరుడు
శివుడు ఆవాసం చేసే హిమాలయ భూముల్లో స్వామీజీకి శివుని గురించిన చింతనలు అధికరించాయి. తన దేహంలో పార్వతీదేవికి సగమిచ్చిన అర్ధనారీశ్వర రూపం గురించి ఒక రోజు ఆయన వివరించారు. స్త్రీ–పురుష తత్త్వాల సంగమం మాత్రమే కాదు; రెండు మహోన్నత చింతనల సంగమంగానూ ఆ రూపం భాసిల్ల డాన్ని స్వామీజీ నొక్కివక్కాణించారు. పరమేశ్వరుడు త్యాగానికి అధిష్ఠాన దైవం; పార్వతీదేవి మాతృమూర్తి. ఇద్దరూ కలసివున్న రూపం త్యాగ, మాతృత్వ ఆరాధనా సంగమాన్ని తెలుపుతున్నది. శివుడు జ్ఞాన మూర్తి, జగజ్జనని ప్రేమమయమూర్తి. యథార్థ స్థితిలో జ్ఞానమూ, భక్తీ ఏకమవడం ఈ రూపం సూచిస్తూందని చెప్పుకోవచ్చునని ఆయన విశదీకరించారు.
స్వర్గం నుండి భూమిపై అవతరించిన గంగానది మొదట శివుని జటా జూటంలో పడి, ఆ తరువాత భూమ్మీద నదిగా ప్రవహించిందని ఒక పురాణగాథ ఉంది. అందుకు స్వామీజీ ఒక క్రొత్త భాష్యం చెప్పారు. గంగ జాలువారడానికి ఎందుకు శివుని జటాజూటాన్ని ఎంచుకొంది? ఎందుకంటే గంగ మాత్రమే కాదు; అన్ని నదులూ, జలపాతాలూ శివభక్తురాండ్రు, శివుణ్ణి ఆరాధించేవారు. ఉప్పొంగి ప్రవహించే నదులూ, పర్వత శిఖరాల నుంచి క్రిందపడే జలపాతాలూ ఏం గానం చేస్తున్నాయి, ఏం మాట్లాడుతున్నాయో నిశితంగా ఆలకిస్తే, అది ‘వ్యోం వ్యోం, హరహర’* అంటున్నట్లు ఉంటుంది. శివభక్తురాలైనందువల్లే గంగ శివుని జటాజూటాన్ని మొదటి ఆవాసంగా ఎంచుకొంది.
ఒక వినోదభరిత చిత్రం
ఈ పయనం గురించి తాను వ్రాసికొన్న అంశాల సంగ్రహ పుస్తకంలో (Notes on Some Wanderings with the Swami Vivekananda) స్వామీజీ గురించి ఒక వినోదభరిత చిత్రాన్ని సోదరి నివేదిత సమర్పిస్తున్నది. అది ఆయన చింతనా స్రవంతిని గురించినది. ఆయన ఒక భావాన్ని ఎంచుకొని మాట్లాడనారంభించినప్పుడు, అదే ముమ్మాటికీ నిజమని శ్రోతలు దృఢంగా నమ్మే విధంగా మాట్లాడేవారు. సమయ సందర్భాలను పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు. ఒక రోజు ఇలాగే ఉదయం భక్తి గురించి మాట్లాడనారంభించారు. శివుడు, పార్వతి, రాధ–కృష్ణుల మధ్య నెలకొన్న భక్తి గురించి మాట్లాడనారంభించిన ఆయన ఉదయకాల అల్పాహార సమయం దాటిపోవడం కూడా తెలియకుండా మాట్లాడసాగారు. ఆయనకు ఆకలి లేనట్లే అనిపించింది. చివరికి ఏదో విధంగా అల్పాహారం స్వీకరించడానికి కూర్చునప్పుడు ఆయన, “వారి మధ్య నెలకొన్న భక్తి ఉన్నట్లయితే ఆ వ్యక్తికి తిండి ఎందుకు?” అని అడిగారు.
కొన్ని సమయాల్లో ఆయన భావోద్దేశం ఏమిటో అవగతం చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఒకటి చెబుతారు. అదే పరమ సత్యంలా మాట్లాడతారు. మరుక్షణమే దానికి వ్యతిరేకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఒక రోజు కొందరు సన్న్యాసులు పాదరక్షలు లేకుండా నడచిపోవడం చూసి, “ఇది అనాగర కత” అంటూ దేహమాత్రమైన ఇటువంటి తపస్సును గర్హించారు. కాసేపయ్యాక, “కానీ ఇటువంటి ‘అనాగరకత’ లేకుండా సుఖభోగ జీవితంలో మనిషి మునిగి పోయి మగటిమినే కోల్పోయి ఉంటాడు” అన్నారు.
ఇటువంటి కోకొల్ల సంఘటనలు స్వామీజీ జీవితంలో చూడవచ్చు. తమకంటూ ఒక అభిప్రాయం లేకపోవడం వలన ఇలా మాట్లాడారా? లేక తమ మాటకారితనం చూపడానికి ఇలా మాట్లాడారా? ఇలాంటి ప్రశ్నలకు జవాబు లేదనే చెప్పుకోవాలి. స్వామీజీ మాత్రమే కాదు; ఆయన గురువయిన శ్రీరామ కృష్ణులు మాత్రమే కాదు; మన ప్రాచీన ఋషులు, మునులు ఈ రీతిలోనే మాట్లాడారు; శాస్త్రాలు కూడా ఈ మార్గాన్నే అనుసరించాయి.
ఆ మార్గం ఏమిటి?
ప్రతి నాణేనికి రెండు ప్రక్కలు ఉంటాయని అంగీకరించే మార్గం. పూర్తిగా మంచితనమూ లేక పూర్తిగా దుష్టత్వమూ అంటూ లోకంలో ఏదీ లేదు. నిప్పు లేనిదే పొగ రాదు; మంచితనం ఉంటే, దుష్టత్వమూ ఉండే తీరుతుంది. అందు వలన ఆచార్యులూ, శాస్త్రాలూ రెండు వైపులా చూసి, ఎంచుకొనే బాధ్యతను మనకే వదలివేస్తున్నారు. “నా మనస్సుకు తోచింది మీకు చెప్పాను. దాని ‘తలా తోకా’ తీసివేసి మీరు స్వీకరించవచ్చు”* అని శ్రీరామకృష్ణులు తమదైన గ్రామ్యభాషలో వచించేవారు. భగవద్గీతలోను, “గోప్యమైన వాటిలో గోప్యతరమైన జ్ఞానాన్ని నీకు బోధించాను. దానిని నువ్వు సంపూర్ణంగా విచారణచేసి, నీ ఇష్టానుసారం చేయి”* అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పడం చూడవచ్చు.
స్వామి వివేకానంద సాహిత్యం చదువుతున్నప్పుడు ఈ భావనను జ్ఞప్తిలో ఉంచుకోవడం అవసరం.
క్షీరభవాని
ఒక రోజు స్వామీజీ హఠాత్తుగా ఏకాంతంలో ఉండగోరి బయలుదేరారు. ఆయనతోపాటే బృందం కూడా బయలుదేరింది. అందరూ కలిసి క్షీరభవానీ దేవి ఆలయానికి వెళ్లారు. హైందవేతరులెవరూ ఆ ప్రాంతానికి వెళ్లింది లేదని చెప్పుకొంటారు. స్వామీజీ బృందంలోని క్రైస్తవు లయిన ఆ పాశ్చాత్యులే ప్రప్రథమంగా వెళ్లిన వారని చెప్పుకోవచ్చు. తోడ్కొని వెళ్లిన పడవవాడు మహమ్మదీయుడైనప్పటికీ, “పాదరక్షలు ధరించి ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకూడదు” అని ఆపివేశాడు; ఆతడు కూడా పాదరక్షలు విడిచే ఆలయంలోకి వెళ్లాడు. అప్పుడు స్వామీజీ ఇలా అన్నారు: “కాశ్మీర్లో వెల్లివిరిసిన మహమ్మదీయ మతం పూర్తిగా హైందవమయమయిపోయింది. వారు 40 మంది ఋషులనే ఆరాధిస్తున్నారు, వ్రతాలు అనుష్ఠించి హైందవ దేవాలయాలను సందర్శిస్తున్నారు.”
ఏకాంత జీవితం పట్ల ఉత్సుకత జనించినప్పుడల్లా స్వామీజీ ఆ బృందం నుండి విడిగా వెళ్లిపోయేవారు. తిరిగి వచ్చినప్పుడు ఆయనలో నూతనోత్సాహం ప్రస్ఫుటంగా కనిపించేది; పరబ్రహ్మ స్వరూపుడైన ఆ భగవంతుని పాదపద్మాలను స్పృశించినందున జనించిన నూతనోత్సాహమని తక్కినవారు అవగతం చేసుకో గలుగుతారు. అలా తిరిగి వచ్చినప్పుడు కొన్ని ఉద్వేగభరిత భావనలు వ్యక్తం చేసేవారు; “దేహం గురించి ఆలోచించడం కూడా పాపమే,” “అతీంద్రియ శక్తులను అభివ్యక్తం చేయడం తప్పు”, “వస్తువులు పెరగడంలేదు. అవి ఎలా ఉన్నాయో యథాతథంగా అట్లే ఉన్నాయి. వాటిలో మార్పులు కలిగించడం ద్వారా మనం అభివృద్ధి చెందుతున్నాం” అంటూ వచించేవారు.
ఒకసారి ఇట్లే చెప్పాపెట్టకుండా ఏకాంతంలోకి వెళ్లగోరిన స్వామీజీ, అమర్నాథ్ వెళ్లాలనుకొని బయలుదేరారు. కాని ఆయన అనుకొన్న మార్గం గుండా వెళ్లలేకపోయారు. ఉష్ణోగ్రత కారణంగా హిమానీనదాలు కరగి ఆ మార్గాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఐదు రోజుల తరువాత ఆయన తిరుగుముఖం పట్టారు.
జూలై 4
అమెరికా స్వాతంత్యదినోత్సవమయిన జూలై 4 వ తేదీ సమీపించింది. ఆ బృందంలో ఇద్దరు అమెరికన్లు. “ఆహా, అమెరికా జాతీయ పతాకం ఉంటే వారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని వేడుకగా జరుపుకొనేవారం గదా!” అన్నది నివేదిత. స్వామీజీ ఒక దర్జీని రప్పించి అమెరికా పతాకాన్ని కుట్టమన్నారు. దాన్లో ఎన్ని నక్షత్రాలు, ఎన్ని రేఖలు లాంటి వివరాలన్నీ ఆతడికి చెప్పారు. ఆతడు తన శక్తి మేరకు పతాకాన్ని కుట్టి తెచ్చాడు. చూడడానికి అది అంత గొప్పగా లేకపోయినప్పటికీ జూలై 4 వ తేదీ ఉదయాన దానిని చూసిన అమెరికన్లు ఎంతో ఆనందభరితులయ్యారు. భోజనశాలగా కేటాయించిన పడవలో ఆ పతాకాన్ని ఆవిష్కరించారు; తరువాత అందరూ ఉపాహారం స్వీకరించారు. ఆ రోజు అక్కడున్న అమెరికన్లకు ఒక చిరస్మరణీయ దినంగా భాసించింది. ఎందుకంటే ఆ రోజు గురించి స్వామీజీ ఒక కవిత రచించి వారికి సమర్పించారు.*
‘పాద పద్మాలను స్పృశించాను’
ఒక రోజు సాయంత్రం స్వామీజీ ఏకాంతంగా ఒక ఆపిల్ తోటలో కూర్చుని ఉన్నారు. అదొక అపూర్వమైన దినం. ఎందుకంటే తమను గురించి ఎంతో అరుదుగా మాట్లాడే ఆయన నాడు మాట్లాడారు. కూర్చుని ఉన్న స్వామీజీ చేతుల్లోకి గులకరాళ్లను తీసుకొని, వాటిని దొర్లిస్తూ ఇలా అన్నారు: “మరణం నన్ను సమీపిస్తున్నప్పుడు నా బలహీనతలు తొలగిపోతాయి. భయమో, సంశయమో ఏదీ నాలో ఉండవు. బాహ్య ప్రపంచం నా చింతనలో నుండి మాయమైపోతుంది. మరణాన్ని ఎదుర్కోవ డానికి నన్ను సిద్ధం చేసుకోవడంలో నేను లీనమైపోతాను” ; స్వామీజీ తమ చేతుల్లోని గులకరాళ్లను ఒకదానితో ఒకటి తట్టారు. “ఈ రాళ్లలా నేను కఠోరమైన వాణ్ణి. ఎందుకంటే నేను భగవంతుని పాదపద్మాలను స్పృశించాను.”
దీనికి కొనసాగింపుగా స్వామీజీ తమ పరివ్రాజక జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు వివరించి చెప్పారు. అప్పుడు హఠాత్తుగా అక్కడున్న గ్రామస్థులు కొందరు చేతికి లోతుగా గాయమైన ఒక పిల్లవాణ్ణి స్వామీజీ వద్దకు తీసుకువచ్చి ఎలాగైనా నయం చేయమని అర్థించారు. స్వామీజీ ఓపిగ్గా ఆ గాయాన్ని కడిగి, వస్త్రం తగులబెట్టగా వచ్చిన బూడిదను గాయంలో వేసి కట్టి, రక్తస్రావాన్ని ఆపి, పంపించారు.