నీ ద్వారా గురుదేవులే ఈ కార్యాలన్నీ నిర్వర్తిస్తున్నారు. నువ్వు చేస్తున్నవీ, చేయబోతున్నవీ శాశ్వతంగా నిలిచిపోతాయి. వీటిని చేయడానికే నువ్వు జన్మించావు.
– మాతృమూర్తి శ్రీశారదాదేవి(స్వామీజీతో)
సేవ ఆవశ్యకమా? — సేవాదర్శం కోసం ఒక సంస్థ — మాతృదేవి ఆశీస్సులు — రామకృష్ణ మిషన్ — ‘శ్రీరామకృష్ణులు చెప్పారా?’ — ‘దాసానుదాసుణ్ణి నేను’ — కొనసాగిన సందేహాలు — సంఘ జనని — అల్మోరా — డాక్టర్ బారోస్ ప్రతిఘటన — సత్యనిష్ఠతో లోక విజేత అయ్యారు — కాశ్మీర్లో — ‘ఇదేనా నీ చదువు?’ — మఠ స్థాపనకై ప్రయత్నం — పంజాబ్‌లో — తీర్థరామ్ — ‘అటువంటి వ్యక్తి నా గురుదేవులు’ — ‘నన్ను గౌరవించాలా?’ — కొన్ని కలతలు — డెహ్రాడూన్‌లో — ‘మాతృభాషలో స్తుతించండి’ — ఆళ్వార్‌లో — గుడిసెలో విందు భోజనం — రాజప్రాసాదంలో
సేవ ఆవశ్యకమా?
స్వామీజీ భారతదేశంలో చేసిన ప్రసంగాలలోనే కాదు, అన్ని ప్రసంగాలలోనూ, అంతెందుకు, ఆయన జీవిత పర్యంతమూ విస్తరించిన ఒక భావన ‘మనిషి’. మతమూ, ఆధ్యాత్మికతా, విజ్ఞానమూ, రాజకీయమూ ఇవన్నీ మనిషికి ప్రయోజనకారులుగా మాత్రమే విలసిల్లాలి. మనిషి పురోభివృద్ధికి సహకరించని దేనినీ ఆయన ఆమోదించలేదు. కనుక ‘సేవ’ ను తారకమంత్రంగా ప్రయోగించారు ఆయన.
కాని సేవ – ధర్మం అనే భావనను అనేకులు అంగీకరించలేకపోయారు. శ్రీరామకృష్ణులను పైపైన చదివేవారు, ఆయన ఈ భావనను బోధించలేదని మొండిగా వాదించడం కద్దు. శ్రీరామకృష్ణుల శిష్యులలో పలువురు కూడా సేవాభావనను మొదట్లో ససేమిరా అంగీకరించలేదు. దీనిని గురించి ఇంతకు మునుపే చూసివున్నాం.
ఈ విధంగానే ‘మ’ ఒక రోజు స్వామీజీతో ఇలా అన్నారు: “సేవ, లోకానికి మేలు ఒనగూర్చడమే నా ధర్మమంటూ నువ్వు మాట్లాడుతున్నావు. ఈ లోకమే మాయ అయినప్పుడు, ఇవీ ఆ మాయ అధీనాలే కదా! ‘మాయ’ శిరస్సులను ఖండించివేసి ముక్తి పొందాలన్నదే మానవ జీవిత పరమగమ్యంగా వేదాంతం నొక్కివక్కాణిస్తున్నది కదా! నువ్వు బోధిస్తూన్న సేవ, తదితరాలు మనిషిని మరింతగా ఈ మాయా లోకానికి బద్ధుణ్ణి చేస్తాయి కదా?” తక్షణమే స్వామీజీ ఇలా జవా బిచ్చారు: “మీరు చెబుతున్న ముక్తి భావన మాత్రం మాయకు అతీతమయినదా? మనస్సులో తలెత్తే ఆలోచనో, భావనో ఏది అయినప్పటికీ అది మాయకు అధీన మైనదే కదా? ఆత్మ ఎన్నటికీ బద్ధమయినది కాదు, అది సదా సర్వస్వతంత్రమైనదని గదా వేదాంత ఉవాచ! దీన్లో ఎవరి శిరస్సులను ఎవరు ఖండించడం, ఎవరికి ముక్తి?” ‘మ’ మౌనం వహించాడు.
సేవాదర్శం కోసం ఒక సంస్థ
“పలు దేశాలలో నేను పర్యటించడంలో సంస్థాగతంగా కార్యనిర్వహణ చేయకుండా శ్రేష్ఠమైన, శాశ్వతమైన ఏ కార్యాన్నీ నిర్వర్తించలేమనే నిర్ణయానికి వచ్చాను.” – ఈ భావనే స్వామీజీ రామకృష్ణ మిషన్ ప్రారంభించడానికి ఆధారభూతమయింది. మానవాళి సేవలో సన్న్యాసులతో గృహస్థులనూ చేర్చి కార్యాచరణ ఒనరించడం స్వామీజీ ఉద్దేశం. కాని సన్న్యాసులు స్వాభావికంగా కార్యనిర్వహణలో పాల్గొనడం సంప్రదాయ సన్న్యాస మార్గం అంగీకరించదు. శ్రీరామకృష్ణుల అనుగ్రహం వలన అటువంటి ఒక ప్రయత్నం చేపట్టారు స్వామీజీ. ఇక్కడా అక్కడా వ్యతిరేకతలూ, హేళనలూ, విమర్శలూ తలెత్తినప్పటికీ, వాటిని అతిక్రమించి ఆయన విజయం సాధించారు. ఇప్పుడు సేవ–ధర్మంలో గృహస్థులను కలుపుకోగోరారు. శ్రీరామ కృష్ణులు దీనిని గురించి బహిరంగంగా ఎలాంటి భావననూ వ్యక్తం చేయలేదు. కనుకనే ఆయన సన్న్యాస శిష్యులు పలువురు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడం తటస్థించింది. ఇది గ్రహించిన స్వామీజీ మాతృదేవి ఆశీస్సులను పొందగోరారు. దానితోబాటు మాతృదేవి తమ మనోభావాన్ని వ్యక్తం చేస్తే అంతా సరిపోతుందని ఆయన భావించారు.
మాతృదేవి ఆశీస్సులు
కనుక డార్జిలింగ్ నుండి తిరిగి వచ్చిన కొద్ది రోజుల్లోనే మాతృదేవి దర్శనార్థం స్వామీజీ వెళ్లారు. మాతృదేవి అప్పుడు కలకత్తాలో బసచేసి ఉన్నారు. స్వామీజీ ఒంటరిగానే వెళ్లారు. మాతృదేవి ఇంట్లో బసచేసివున్న యోగానందతో ఆయన, “డాక్టర్లు నన్ను విదేశాలకు వెళ్లవద్దన్నారు, అల్మోరాకు వెళ్లమంటున్నారు. వెళ్లే ముందు మాతృ దేవిని దర్శించుకొందామని వచ్చాను” అని చెప్పారు.
మాతృదేవి గదిలోకి వెళ్లగానే ముందుగా స్వామీజీ ఆమెకు సాష్టాంగ నమ స్కారం చేశారు. కాని మాతృదేవి పాదపద్మాలను స్పృశించలేదు. అక్కడ నిలబడ్డ ఒక వ్యక్తితో ఆమె పాదాలను తాకవద్దని ఆపి, స్వామీజీ ఇలా అన్నారు: “ఎవరైనా తమ పాదాలను తాకితే మాతృదేవి అపరిమిత కారుణ్యంతో వారి పాపాలను స్వీకరించి, అందు నిమిత్తం తాము బాధననుభవిస్తారు. మాటలు కూడా వద్దు. మీ హృదయకవాటాలను తెరచి ఉంచండి, మీ ప్రార్థనలను మౌనంగా ఆమెకు అర్పించండి, ఆమె ఆశీస్సులు అర్థించండి. అది చాలు. ఎందుకంటే మీ మనస్సుల లోతులను ఆమె అవగతం చేసుకొంటారు.”
తనకు పుత్రసమానుడయిన స్వామీజీని కలుసుకొంటున్నప్పుడు సైతం మాతృదేవి సిగ్గు తెర నుండి బయటకు రాలేదు. శరీరాన్ని పూర్తిగా కప్పుకొని ఆమె నిలబడ్డారు; ఆమెతో తిన్నగా మాట్లాడకుండా గోలాప్–మా ద్వారా స్వామీజీ మాట్లాడారు. ఇక మాతృదేవి అతి మెల్లగా చెబుతారు. దానిని బిగ్గరగా గోలాప్–మా స్వామీజీతో తెలుపుతుంది.
గోలాప్–మా ద్వారా మాతృదేవి మాట్లాడసాగారు:
మాతృదేవి: డార్జిలింగ్‌లో నీ ఆరోగ్యం ఎలా ఉంది? మెరుగుపడిందా?
స్వామీజీ: అవును, అమ్మా.
మాతృదేవి: గురుదేవులు సదా నీతోనే ఉంటున్నారు. లోక శ్రేయస్సుకై నువ్వు ఇంకా అనేక కార్యాలు చేయవలసివుంది.
స్వామీజీ: గురుదేవుల చేతుల్లో నేను కేవలం ఒక పరికరాన్ని అనే సంగతి గ్రహించాను. పాశ్చాత్య దేశాలలో కొన్ని మహోన్నతమైన సంఘటనలు జరిగాయి. వందలాది స్త్రీ పురుషులు గురుదేవుల ఉపదేశాలను అంగీకరించి నా కార్యకలా పాలలో సహాయం చేశారు. ఇదంతా చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోకుండా ఉండలేక పోతున్నాను. మీ ఆశీస్సులతోనే నేను అమెరికా వెళ్లాను. అసాధ్యాలను సాధ్యం చేయగలది మీ అనుగ్రహమేనని నా విజయమూ, నేను పొందిన గౌరవమూ చెప్పకచెప్పాయి. గురుదేవులు ‘అమ్మా’ అని ఎవరిని ప్రార్థించారో ఆ దివ్యశక్తే నేను అమెరికాలో ఒంటరితనంలో నిరుత్సాహంగా ఉన్నప్పుడు నాకు మార్గదర్శ కత్వం వహించింది.
మాతృదేవి: ఆ దివ్యశక్తీ గురుదేవులూ అభిన్నులు. నీ ద్వారా గురుదేవులే ఈ పనులన్నీ చేస్తున్నారు. నువ్వు ఆయనకు ప్రియాతిప్రియమైన శిష్యుడివీ, పుత్ర సమానుడివీ కదా! నిన్ను ఎంతగా ఆయన ప్రేమించారో కదా! నువ్వు లోకానికి బోధిస్తావన్నది కూడా ఆయన చెప్పేవున్నారు కదా!
స్వామీజీ: గురుదేవుల సందేశాన్ని ప్రచారం చేయడమే నా పని. అందు కోసం శాశ్వతమైన ఒక సంఘాన్ని ప్రారంభించాలని అనుకొంటున్నాను. కానీ నేను అనుకొన్నంత వేగంగా అది జరగనప్పుడు మనస్సు కలత చెందుతున్నది.
స్వామీజీ ఇలా చెప్పగానే మాతృదేవి తిన్నగానే ఆయనతో ఇలా చెప్పారు: “కలత చెందకు. నువ్వు చేస్తున్నవీ, చెయ్యబోతున్నవీ శాశ్వతంగా నిలిచివుంటాయి. ఇది నిర్వర్తించడానికే నువ్వు జన్మించావు. దివ్యజ్ఞానం ప్రసాదించే గురువుగా నిన్ను వేలమంది శ్లాఘిస్తారు. నీ ఆకాంక్షను త్వరలోనే గురుదేవులు నెరవేరుస్తారు. ఇది తథ్యం. నువ్వు చేయగోరిన పని సత్వరమే జరగబోవడం నువ్వు చూస్తావు.”
పిదప స్వామీజీకి మాతృదేవి ప్రసాదం ఇచ్చారు. “జై మా, జై మా” అంటూ మళ్లీ మాతృదేవికి సాష్టాంగ నమస్కారం చేశారు స్వామీజీ.
రామకృష్ణ మిషన్
ఇక స్వామీజీ సంశయించలేదు. 1897 మే 1 వ తేదీన బలరాం బోస్ ఇంట్లో సంస్థకు సంబంధించిన అంశాలను చర్చించడం కోసం స్వామీజీ ఒక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో శ్రీరామకృష్ణుల సన్న్యాస శిష్యులూ, గృహస్థ శిష్యులూ పలువురు పాల్గొన్నారు. పామర జనుల ఉద్ధరణకై పాటుపడే సంస్థ నొకదాన్ని ఆ నాడు స్వామీజీ ప్రారంభించారు. సమావేశంలో స్వామీజీ ఇలా మాట్లాడారు:
“ఎవరి పేరిట మేం సన్న్యాసం పుచ్చుకొన్నామో, ఎవరిని ఆదర్శంగా చేసుకొని మీరు గృహస్థులుగా సంసార జీవితం గడపుతున్నారో, ఎవరి దివ్యనామమూ, జీవితమూ, సందేశమూ ఆయన నిష్క్రమించిన 12 సంవత్సరాల లోపు ఊహించనంత మేరకు ప్రాచ్యదేశాలలోనూ పాశ్చాత్య దేశాలలోనూ వ్యాపించిందో ఆయన పేరిట ఈ సంస్థ పేర్కొనబడుతుంది. కనుక ఈ సంస్థ ‘రామకృష్ణ మిషన్’ పేరును సంతరించుకొంటుంది. మేం శ్రీరామకృష్ణుల స్వచ్ఛంద సేవకులం మాత్రమే. మీరూ ఈ కార్యంలో సహాయం చేయండి.”
ఈ ప్రతిపాదనను అక్కడున్న గృహస్థ శిష్యులు హృదయపూర్వకంగా ఆమోదించారు. పిదప రామకృష్ణ మిషన్ ఉద్దేశం, కార్యక్రమం మొదలైన వాటి గురించి స్వామీజీ విపులీకరించారు. ఈ సందర్భంగా స్వామీజీ వ్యక్తం చేసిన ఒక భావనను గూర్చి ప్రగాఢంగా పర్యాలోచించాలి. ఆయన ఇలా అన్నారు: “ప్రజా స్వామ్య ప్రతిపాదనలపై నిర్వహింపబడుతున్న ఒక సంస్థను నేటి పరిస్థితుల్లో భారతదేశంలో నడిపించలేం. కనుక ఇందుకు మనం ఒక నేతను ఎంపిక చేసుకోవాలి. ఆయన ఆదేశాలను ప్రతి సభ్యుడూ అంగీకరించే తీరాలి.”
ఈ ప్రకారం స్వామి బ్రహ్మానంద, స్వామి యోగానందలు కలకత్తా శాఖ అధ్యక్షునిగా, ఉపాధ్యక్షునిగా బాధ్యత తీసుకొన్నారు. నరేంద్రనాథ్ మిత్రా (చిన్న నరేంద్రుడు) కార్యదర్శి అయ్యాడు. తక్కిన బాధ్యతలకు సభ్యులు ఎంపికచేయ బడ్డారు. స్వామీజీ సర్వాధ్యక్షులుగా బాధ్యత స్వీకరించారు.
గృహస్థ శిష్యులలో పలువురు సెలవు పుచ్చుకొని వెళ్లిపోయాక యోగా నందతో స్వామీజీ, “ఈ విధంగా పని ప్రారంభమయింది. శ్రీరామకృష్ణుల సంకల్పంతో ఇది ఎలా విజయవంతమవుతుందో చూద్దాం” అన్నారు.
యోగానంద: వీటిని నువ్వు పాశ్చాత్య పద్ధతులలో ఆచరిస్తున్నావు. ఇన్ని విషయాలు శ్రీరామకృష్ణులు చెప్పారా?
‘శ్రీరామకృష్ణులు చెప్పారా?’
స్వామీజీ: ఇది శ్రీరామకృష్ణుల భావనకు విరుద్ధమయినదని నీకు ఎలా తెలుసు? అసంఖ్యాక భావనలకు ఆయన ఆలవాలం. నీ పరిధిలోకి ఆయనను ఇమడ్చాలని చూస్తున్నావా? ఆ పరిధిని ఛేదించి, ఆయన భావనలను నేను లోకమంతటా ప్రచారం చేస్తాను. తమకు ఆలయం నిర్మించమనీ, తమను ఆరాధించమనీ ఆయన ఎన్నడూ నాతో చెప్పలేదు. ఆయన బోధించిన ఆధ్యాత్మిక సాధనలు, మనోఏకాగ్రత, ధ్యానం లాంటి ఉన్నతోన్నత ఆదర్శాలను మనం పాటించాలి, ఇతరులకూ చూపించాలి. భావనలు కోకొల్లలు, లక్ష్య సాధనకు గల మార్గాలూ కోకొల్లలు. ఇప్పటికే మత శాఖలతో నిండివున్న ఈ ప్రపంచంలో ఇంకొక శాఖను జతకలప డానికి నేను జన్మించలేదు. శ్రీరామకృష్ణుల పాదపద్మాల వద్ద శరణుజొచ్చిన మనం అదృష్టవంతులం. ఆయన సందేశాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేయడం మన కర్తవ్యం.”
యోగానంద జవాబుగా ఒక్క మాట కూడా పలుకలేదు. స్వామీజీ కొనసాగించారు:
“నా జీవితంలో ఆయన అనుగ్రహాన్ని ఎన్నోసార్లు చవిచూసి ఉన్నాను. ఆయనే నా వెనుక నిలబడి ఈ పనుల నన్నింటినీ నిర్వర్తిస్తున్నారు. ఆకలితో అలమటించి, అలసిసొలసిపోయి, చెట్టు క్రింద కూలబడినప్పుడూ, కౌపీనానికి కూడా గుడ్డ లేకుండా నిరుత్సాహం ఆవహించినప్పుడూ, చేత చిల్లిగవ్వ లేకుండా ప్రపంచాన్ని పర్యటించి రావడానికి తెగించినప్పుడూ ఆయన అనుగ్రహమే నన్ను ప్రతి క్షణమూ పరిరక్షించింది. ఈ వివేకానందుణ్ణి చూడాలని చికాగో వీథుల్లో జనం త్రొక్కిసలాడుతూ వచ్చినప్పుడూ, ఏ ప్రశంసలో ఒక శాతం పొందినప్పటికీ ఒక వ్యక్తి తలా తోకా అర్థం కాక ఎగిరి గంతులు వేస్తాడో ఆ ప్రశంసను పొందినప్పుడూ నిశ్చలంగా ఉండగలగడానికి ఆయన అనుగ్రహమే కారణం. ఆయన అనుగ్రహం వలననే ప్రతి చోటా నాకు విజయం లభించింది. ఇప్పుడు నేను ఈ దేశం కోసం ఏదైనా చేయగోరుతున్నాను. మీ సందేహాల నన్నింటినీ మూటకట్టి నా పనిలో సహాయపడండి; ఆయన అనుగ్రహంతో మనం అరుదైన పనులను సాధించడం మీరు చూడకపోరు.”
యోగానంద: నువ్వు అనుకొన్నది జరిగి తీరుతుంది. శ్రీరామకృష్ణులు నీ ద్వారా కార్యనిర్వహణ చేయడం నేను స్పష్టంగా చూస్తున్నాను. అయినప్పటికీ కొన్ని సమయాల్లో సంశయాలు తలెత్తుతున్నాయి.
స్వామీజీ: విషయం ఇదే – శిష్యులు అర్థం చేసుకొన్నదానికన్నా శ్రీరామ కృష్ణులు ఎంతో మహోన్నతులయినవారు. అసంఖ్యాక మార్గాలలో విస్తరించే అసంఖ్యాక ఆధ్యాత్మిక భావనల ఆలవాలం ఆయన. బ్రహ్మజ్ఞానాన్ని బహుశా కొలవవచ్చునేమో!. కాని మన గురుదేవుల అంతరంగ లోతులను కొలవడం అసాధ్యం. ఆయన అనుగ్రహ వీక్షణం ఒక్కటి చాలు, లక్షలాది వివేకానందులు తక్షణమే తయారవుతారు. కాని ఈసారి ఆయన నన్ను పరికరంగా గైకొని, నా ద్వారా కార్యాచరణ చేయగోరారంటే ఆయన సంకల్పాన్ని శిరసావహించడం తప్ప మరేం చేయగలను?
ఆ తరువాత ఆ చర్చను ఎవరూ కొనసాగించలేదు. స్వామీజీ అక్కణ్ణుంచి వెళ్లిపోయిన తదనంతరం యోగానంద, స్వామీజీ శిష్యుడు శరశ్చంద్రతో ఇలా అన్నాడు: “నరేన్ గురుదేవుల పట్ల చెల్లించే భక్తిప్రపత్తులలో ఒక్క శాతం ఉన్నా నేను అదృష్టవంతుణ్ణి. ఆయనలో ఋషులకుండే వేదజ్ఞానమూ, శంకరా చార్యుల పరిత్యాగమూ, బుద్ధుని హృదయ వైశాల్యమూ, శుకదేవుని బ్రహ్మజ్ఞానమూ సమైక్యమై అలరారుతున్నాయి.”
‘దాసానుదాసుణ్ణి నేను’
సేవ–ధర్మం విషయంలో అద్భుతానందకూ సందేహం లేకపోలేదు. అద్భుతా నంద దాదాపు నిరక్షరాస్యుడు. కాని ఆధ్యాత్మికతలో అత్యున్నత స్థితులను చవిచూసిన వ్యక్తి. “గురుదేవుల అనుగ్రహ ఫలంగా ఉత్పన్న మైన అద్భుత వ్యక్తి ఈయన” కాబట్టి స్వామీజీ ఆయనకు ‘అద్భుతానంద’ నామధేయం ఒసగారు. ఒక రోజు యోగా నంద, అద్భుతానందలు శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యులతో స్వామీజీ బలరాం బోసు ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు సేవ–ధర్మం గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు స్వామీజీతో అద్భుతానంద ఇలా అన్నారు:
“శ్రీరామకృష్ణులు భక్తిని నొక్కివక్కాణించారు. ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించి భగవదనుభూతి పొందమని అందరినీ ప్రేరేపించారు. కాని నువ్వో అందరికీ, బయటికి వెళ్లి బోధించమనీ, పేదలకూ, రోగులకూ సేవలందించమనీ చెబుతున్నావు. ఇది మనస్సును బహిర్ముఖం చేసే కార్యం కాదా? మనస్సు బాహ్యముఖం కావడం ఆధ్యాత్మిక సాధనా జీవితానికి ఆటంకం కాదా? అంతేకాక మఠాలు, ఆశ్రమాలు, సేవాశ్రమాలు, దేశభక్తి లాంటివి పాశ్చాత్య విధానాలు. ఒక నూతన సన్న్యాస సంప్రదాయాన్ని రూపొందించాలన్న నీ ఉద్దేశమూ అటువంటిదే. ఇవేవీ శ్రీరామ కృష్ణులు వచించినట్లు నేను అనుకోవడం లేదు.”
మొదట్లో స్వామీజీ దీనిని అంతగా పట్టించుకోలేదు. “నీకేం తెలుసు? నువ్వు నిరక్షరాస్యుడవు, శ్రీరామకృష్ణులకు తగిన శిష్యుడవు. గురువును మించిన శిష్యుడవు! ప్రహ్లాదుని విద్యాభ్యాసం ఆగిపోయినట్లు ‘క’ అనే అక్షరంతో నీ చదువు ఆగిపోయింది. ‘క’ అని వినగానే ప్రహ్లాదుడికి కృష్ణుని తలంపు వచ్చేసింది; చదువు ఆపైన సాగలేదు” అని సుతిమెత్తగా జవాబు ఇవ్వనారంభించారు. కాని సమయం గడిచేకొద్దీ ఆయన స్థితి మారి, ఆయన గొంతు గాంభీర్యాన్ని సంతరించుకొంది. భావోద్వేగంతో ఆయన మాట్లాడసాగారు:
“మీరు భక్తులు, అంటే ఉద్వేగభరితులైన మూర్ఖులు! మతం గురించి మీకేం తెలుసు? కేవలం పిల్లలు మీరు. చేతులు జోడించుకొని, ‘ఆహా, ప్రభో! మీ నాసిక ఎంత అందంగా ఉంది, మీ కళ్లు ఎంతటి మాధుర్యాన్ని ప్రసరిస్తునాయి’ అంటూ అర్థంపర్థం లేకుండా వాగడమే మీకు తెలుసు. ఇలా వాగితే మీ ముక్తి తథ్యం, చివరి క్షణంలో శ్రీరామకృష్ణులు వస్తారు, మీ చేతులు పుచ్చుకొని స్వర్గానికి తోడ్కొని వెళతారని భావిస్తున్నారు. చదువు, బోధన, మానవసంక్షేమ కార్యాలవంటివన్నీ మీకు సంబంధించినంత వరకు మాయ. ఎందుకంటే శ్రీరామకృష్ణులు ఇవన్నీ చేయలేదు కనుక లేదా ఆయన ఎవరో ఒకరితో, ‘ముందు భగవంతుణ్ణి అన్వేషించు, తరువాత కావాలనుకొంటే మానవ సంక్షేమ కార్యాలు చేసుకో’ అని చెప్పారు కాబట్టి! భగవదనుభూతి అంత సులభమా ఏమిటి! మూర్ఖుల చేతుల్లో తనను ఒక ఆటవస్తువుగా చేసుకోవడానికి భగవంతుడు తెలివితక్కువవాడు కాదు.”
ఉరుములా స్వామీజీ గర్జించారు. కాలాంతరంలో అద్భుతానంద ఇలా అన్నారు: “బాబోయ్! నరేన్ గర్జించడం విని నేను అదిరిపోయాను. మా సోదర సన్న్యాసి ఒకరు ఇదే భావనను కొనసాగించ ప్రయత్నించాడు. నరేన్ మరింత తీవ్రరూపం దాల్చాడు.”
స్వామీజీ గర్జన కొనసాగింది :
“శ్రీరామకృష్ణులను నా కన్నా పరిపూర్ణంగా అవగతం చేసుకొన్నామని మీరు భావిస్తున్నారు. హృదయంలో ఉత్పన్నమయ్యే స్నిగ్ధ ఉద్వేగాలనన్నిటినీ నిర్మూలించి, కఠోర మార్గం గుండా పయనించి సిద్ధించుకొన్నదే జ్ఞానమని మీరు పరిగణిస్తు న్నారు. మీరు భక్తి అంటున్నది కేవలం ఒక ఉద్వేగ వెల్లువ. అది మనిషిని పురుషత్వరహితునిగా రూపొందిస్తుంది. మీరు ఆవగింజంత అవగతం చేసుకొన్న శ్రీరామకృష్ణులను లోకానికి బోధించగోరుతున్నారు. వైదొలగండి! మీ శ్రీరామకృష్ణు లను గురించి ఎవరు చింతించారు గనుక? మీ భక్తీ, ముక్తీ ఎవరికి కావాలి? మీ శాస్త్రాలు ఏం వచిస్తున్నాయోనన్న దాన్ని గురించి ఎవరు కలత చెందుతున్నారు? సోమరితనంతో నిద్రమత్తులో మునిగివున్న నా దేశస్థులను జాగృతం గావించి, వారిని వారి కాళ్ల మీదే నిలబడేలా చేసి, వారిని నిజమైన మనుషులనుగా రూపొందించి, కర్మయోగాగ్నిని వారిలో రగిలించడానికి సంతోషంగా వేయిసార్లు నరకానికి వెళ్లడానికీ నేను సంసిద్ధుణ్ణి. శ్రీరామకృష్ణులనో మరెవరినో అనుసరించే వ్యక్తిని కాను నేను; నా ప్రణాళికలను ఎవరు అమలుపరుస్తారో వారిని అనుసరించే వ్యక్తిని నేను. శ్రీరామకృష్ణులకో లేదా మరెవరికో నేను సేవకుణ్ణి కాను; స్వకీయ ముక్తి గురించి ఖాతరు చేయకుండా పరులకు ఎవడు సహాయం చేస్తాడో, సేవలందిస్తాడో ఆతడి సేవకుణ్ణి నేను.”
స్వామీజీ స్వరం గద్గదమయింది, శరీరం తీవ్ర ఉద్వేగ వెల్లువతో ఊగిపోయింది. ఉద్వేగాన్ని అణచుకోలేకపోయారు, కళ్లు ధారకట్టాయి. హఠాత్తుగా లేచి ఒక పరుగులో తమ గదిలోకి వెళ్లిపోయారు. సోదర సన్న్యాసులు ఏం చేయాలో పాలుబోక నిర్ఘాంతపోయారు. స్వామీజీతో ఈ రీతిలో మాట్లాడి ఉండకూడదేమోనని బాధపడ్డారు. కాసేపయ్యాక ఒకరిద్దరు ఆయన గదిలోకి వెళ్లి చూసినప్పుడు స్వామీజీ ప్రగాఢ ధ్యానమగ్నులై కనిపించారు. ఆయన దేహం దుంగలా బిర్రబిగిసిపోయింది. అర్ధనిమీలిత నేత్రాల నుండి నీరు స్రవిస్తూవుంది. ఆయనకు రోమాంచితమయింది. సోదర సన్న్యాసులు తేలికగా ఊపిరిపీల్చుకొని నిశ్శబ్దంగా బయటికి వెళ్లిపోయారు.
దాదాపు ఒక గంటసేపు స్వామీజీ ఆ ప్రగాఢ ధ్యానావస్థలో ఉండిపోయారు. ఆ తరువాత లేచి ముఖం కడుగుకొని బయటికి వచ్చినప్పుడు అక్కడ నిశ్శబ్దం రాజ్యం చేసింది. మృదుమధుర స్వరంతో ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ ఇలా మాట్లాడారు:
“భక్తిని సంతరించుకొన్నప్పుడు ఆ వ్యక్తి హృదయమూ, నరాలూ అత్యంత మృదుత్వాన్ని పొందుతాయి. ఒక పువ్వు స్పర్శను కూడా భరించలేనంత మృదువుగా అవి మారిపోతాయి. ఇప్పుడు ఒక నవల కూడా నేను చదవలేకపోతున్నాను; ఎక్కువసేపు శ్రీరామకృష్ణుల ధ్యాసలో ఉండలేకపోతున్నాను, ఆయనను గురించి మాట్లాడలేకపోతున్నాను. కాసేపట్లో అదుపు తప్పి ఉద్వేగ వెల్లువలో మునిగిపో తున్నాను. కనుక నాలో భక్త్యావేశం తలెత్తడాన్ని సదా అణచుకోవడానికే ప్రయత్నిస్తు న్నాను. నా మాతృదేశానికి నేను చేయవలసిన సేవ ఇంకా పూర్తికాలేదు, లోకానికి అందించవలసిన సందేశం ఇంకా పూర్తిగా వ్యాపించలేదు. కనుక నన్ను జ్ఞానమనే ఇనుప సంకెలతో బంధించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. భక్తి ఉద్వేగాలు నాలో తలెత్తున్నట్లు అనిపిస్తే వెంటనే కఠోరమైన జ్ఞానాన్ని నాలో జనింపజేసుకొని, నన్ను దృఢపరచుకొని ఆ భక్తి ఉద్వేగాలను తన్ని తరిమివేస్తాను. ఆహా, నా కార్యం ఇంకా పూర్తికాలేదు! శ్రీరామకృష్ణుల పాదాక్రాంతుణ్ణి నేను. నేను నిర్వర్తించడం కోసం ఆయన తమ కార్యాన్ని వదలిపెట్టి వెళ్లారు. అది నెరవేర్చేదాకా ఆయన నాకు విశ్రాంతినివ్వరు! ఆహా, ఆయన గురించి నేనేం మాట్లాడగలను! ఆహా, ఆయనకు నా పట్లగల ప్రేమాభిమానాలు ఎంతటివి!”
మళ్లీ స్వామీజీ భక్తి ఉద్వేగాలలో మగ్నులవుతూన్నట్లు కానవచ్చింది. వెంటనే యోగానందాదులు ఆయనతో, “స్వామీజీ, ఈ గది బాగా వేడిగా ఉంది కదా! కాస్త బయట పచార్లు చేసివద్దామా?” అని అడిగి ఆయన మనస్సును మరో దిశ వైపు త్రిప్పారు. స్వామీజీ వారితో కలసి బయటకు వెళ్లారు. ఆయన మామూలు స్థితికి రావడానికి చాలాసేపు పట్టింది.
మరోసారి కూడా స్వామీజీ శ్రీరామకృష్ణుల గురించి భావోద్వేగంతో ఇలా అన్నారు: “ఆలోచనలతోగాని, మాటలతోగాని, చేతలతోగాని నేను ఏమైనా సాధించి ఉంటే, ప్రపంచానికి ఉపయోగకరమైన ఒక్క మాటైనా నా పెదవుల నుండి వెలువడి ఉంటే, అదంతా వారిదే; నాదనలేను. కానీ నా పెదవుల నుండి శాపాలు వెలు వడితే, నా హృదయం నుండి ద్వేషం పొర్లితే అదంతా నాదే, శ్రీవారిది కాదు. దుర్బలమైన సమస్తమూ నాదే. ఉజ్జీవకరం, బలవర్ధకం, నిర్మలం, పావనం అయిన సర్వమూ శ్రీవారి ప్రేరణమే, శ్రీవారి భాషణమే!”*
నాడు స్వామీజీ ప్రగాఢ భక్తి ఉద్వేగాలు అందరికీ విదితమయ్యాయి. ఇలాంటి ఉద్వేగాలకు ఆయనను లోను చేయకూడదని వారు నిశ్చయించుకొన్నారు. ఎందుకంటే ఇలాంటి అత్యున్నత ఆధ్యాత్మిక స్థితుల కారణంగా ఆయన తమ యథార్థ స్థితికి వెళ్లడం తటస్థించవచ్చు, తానెవరని పూర్తిగా అవగతం చేసుకో వచ్చు. “నరేన్ తాను ఎవరని ఎప్పుడైతే అవగతం చేసుకొంటాడో అప్పుడు దేహత్యాగం చేస్తాడు” అనే గురుదేవుల వచనాలు వారి మనస్సులో మెదలాయి. వారిలో వరిష్ఠ సాధువు ఒకరు ఇలా అన్నారు:
“మనలను శ్రీరామకృష్ణులు ఈ భువిపైకి ఎందుకు తోడ్కొని వచ్చారో తెలుసా? స్వామీజీ మనస్సును మామూలు విషయాల్లో నిలిపి ఆయనను దీర్ఘకాలం జీవింపజేయాలి; తద్ద్వారా గురుదేవుల సంకల్పం నెరవేరాలి, అందుకే. లేకుంటే ఆయన ఎప్పుడు కావాలనుకొంటే అప్పుడు నిర్వికల్ప సమాధి స్థితిలోకి జారి పోతారు.”
ఈ సంఘటనానంతరం స్వామీజీ ప్రణాళికల గురించో, కార్యాచరణ గురించో ఎవరూ ఎలాంటి ఆక్షేపమూ తెలుపలేదు. అనేక విషయాలలో చోటుచేసు కొన్న సందేహాలూ, గందరగోళాలూ సమసిపోయినట్లుగా కనిపించింది. నిజానికి స్వామీజీ వెనుక గురుదేవులే ఉండి పనిచేస్తున్నారని అందరూ గ్రహించారు.
ఇక్కడొక విషయం మనం మరచిపోకూడదు. ఒక సంస్థ రూపొందించడం గురించో, తద్ద్వారా తమ సందేశం మానవాళి అందుకోగలదనో శ్రీరామకృష్ణులు తక్కిన వారితో చెప్పకుండా నిష్క్రమించి ఉండవచ్చు. కానీ అనేకసార్లు, ప్రత్యేకించి కాశీపూర్ రోజుల్లో తక్కిన అందరినీ బయటికి పంపివేసి, స్వామీజీతో ఒంటరిగా అనేక విషయాలు ఆయన ముచ్చటించడం గురించి ఇంతకు క్రితమే చూశాం. తాము మాట్లాడిన విషయాలు ఏమిటని ఇద్దరూ బహిరంగపరచలేదు. ఆ సందర్భాలలో దీనిని గురించి చర్చించి ఉండవచ్చునేమో!
అంతేగాక, శ్రీరామకృష్ణుల మహాసమాధి తరువాత ఆయన శిష్యులలో ప్రతి ఒక్కరూ ఆయన దర్శనమూ మార్గదర్శకత్వమూ పొందారు. స్వామీజీ ఏదో ఒకటి రెండు మాత్రమే బహిరంగపరిచారు. బహిరంగపరచనివి ఎన్నో! పైన చెప్పినది వాటిలో ఒకటి అయివుండవచ్చు.
కొనసాగిన సందేహాలు
విషయం అక్కడితో ఆగలేదు. సంస్థాగతంగా కార్యాచరణకు ఉపక్రమించా లన్న భావనను అందరూ కొంతమేరకు అంగీకరించారనే చెప్పాలి. కానీ కార్యాచరణ పద్ధతులలో స్వామీజీ అనుసరించే పద్ధతికీ తక్కిన వారి పద్ధతులకూ వ్యత్యాసం ఉంది. స్వామీజీ పాశ్చాత్యం నుండి లేఖలు వ్రాసి, సేవ–లక్ష్యం అనే అంశాన్ని పరిచయం చేసినప్పుడు, దానిని తక్షణమే స్వీకరించి ముషీరాబాద్‌లో క్షామనివారణ కార్యాలలో అఖండానంద ముమ్మరంగా లీనమైపోవడం గురించి ఇంతకు క్రితమే చూశాం. ఆ కార్యక్రమ వివరాలు, జమాఖర్చుల పద్దు మొదలైనవి సక్రమంగా వ్రాసివుంచాలనీ, పత్రికలకు పంపాలనీ స్వామీజీ అభిలషించారు. జమాఖర్చులు వ్రాయడం ఒక వైపు ఉండగా, వాటిని పత్రికల ద్వారా బహిరంగపరచడం మూలంగా తనకు ప్రచారం లభించడం అఖండానందకు సుతరమూ ఇష్టం లేదు. స్వామీజీ మార్గంలోనే బ్రహ్మానంద కూడా జమాఖర్చుల విషయంలో కచ్చితంగా ఉన్నారు. అఖండానందకు మరో మార్గం లేకపోవడంతో జమాఖర్చులు వ్రాయడం ప్రారంభించాడు. ఆయన మానసిక పోరాటం ఒక విస్తృత దృశ్యంగా ఆయన మనోనేత్రానికి గోచరించింది – శ్రీరామకృష్ణులు ప్రత్యక్షమై, “నీకు నేను కావాలా లేక ప్రజాజీవనం కావాలా?” అని అడిగినట్లు ఆతడికి తోచింది. కళ్లు ధారకట్టగా ఆతడు నివేదికలు వ్రాసి పూర్తిచేశాడు.
సానుకూల ప్రతికూల భావనలు ఈ విధంగా ఒక వైపు సాగుతూండగా చరిత్రాత్మక సంస్థకు బీజం నాటబడింది. రామకృష్ణ మిషన్ ప్రథమ సమావేశం 1897 మే 1వ తేదీ ఆదివారం నాడు బలరాం బోస్ ఇంట్లో స్వామి బ్రహ్మానంద నేత్పత్యంలో జరిగింది. ఆ మహద్బీజమే రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అనే రెండు మహాసంస్థలుగా నేటికీ సమధికోత్సాహంతో విరాజిల్లుతోంది.
సంఘ జనని
ఈ మహాసంస్థల అంకురార్పణ గావించిన మహనీయమూర్తిగా మాతృదేవి శారదామాత స్తుతులందుకొంటున్నారు. రామకృష్ణ మిషన్ నెలకొల్పడానికై బలరాం బోస్ ఇంట్లో జరిగిన ప్రథమ సమావేశంలోనే స్వామీజీ దీనిని ఎత్తిచూపారు. తమ ప్రయత్నాల మూలంగా స్థాపితమై నప్పటికీ, ఈ కవల సంస్థలు మాతృదేవి అనుగ్రహం వలననే రూపొందాయనే స్వామీజీ పరిగణించారు.
మాతృదేవి 1890లో తీర్థయాత్ర చేసినప్పుడు, బుద్ధగయలో ప్రసిద్ధిగాంచిన ఒక మఠం చూడడం తటస్థించింది. చక్కని సౌకర్యాలతో నిర్మించబడిన ఆ మఠంలో భోజనానికీ తక్కిన అవసరాలకూ చక్కని ఏర్పాట్లు చేసివున్నారు. ఇది చూసి మాతృదేవి మనోనేత్రంలో ఆవేదనామయమైన దృశ్యం ద్యోతకమయింది – గురుదేవుల పట్ల అచంచల విశ్వాసం ఉంచుకొని ఆయనే భగవంతుడని తమ చదువు సంధ్యలనూ, సుఖసంతోషాలనూ, బంధుమిత్రులనూ త్యజించి వచ్చిన ఆయన శిష్యులయిన తమ బిడ్డలు నిలువ నీడ కూడా లేకుండా తిరుగాడుతున్నారు. ఈ దృశ్యం మాతృదేవి కళ్లను నీటితో నింపివేసింది. తమ బిడ్డలకు కూడా ఈ విధంగా మఠాలు రూపొందాలని మాతృ హృదయోద్వేగం పొంగిపొరలగా, హృదయపూర్వకంగా ఆమె ప్రార్థించారు. మాతృదేవి ఆ ప్రార్థనే రామకృష్ణ మఠాలన్నిటికీ బీజంగా ఒప్పారింది.
దీనిని గురించి కాలాంతరంలో మాతృదేవి ఇలా చెప్పారు: “ఆహా! ఇందు కోసం నేను కన్నీరుమున్నీరై గురుదేవులను ఎంతగా ప్రార్థించానో తెలుసా? ఆ తరువాతే ఆయన అనుగ్రహం వలన ఈ మఠం స్థాపింపబడింది. గురుదేవుల నిష్క్రమణానంతరం ఆయన సన్న్యాస శిష్యులు తమ ఇళ్లూవాకిళ్లతో సహా సమస్తమూ త్యజించి ఒక అద్దె ఇంట్లో నివసించారు. పిదప తపోమయ జీవితం కొనసాగిస్తూ, విడివిడిగా ఇక్కడా అక్కడా తిరుగాడారు. ఇది నన్ను అమిత ఆవేదనకు గురిచేసింది. నేను గురుదేవులతో, ‘ఓ భగవాన్! మీరు అరుదెంచారు. వీరిలో కొందరితో క్రీడించారు. ఆ తరువాత నిష్క్రమించారు. దాంతో అంతా ముగిసిపోవలసిందేనా? అదే ముగింపు అంటే మీరు ఈ ఇలలో అవతరించి ఎందుకు ఇన్ని యాతనలు అనుభవించాలి! వీథుల్లో భిక్షమెత్తి తిని, చెట్ల క్రింద పడివుండే సన్న్యాసులను ఎందరినో బృందావనంలోనూ, కాశీలోనూ చూసివున్నాను! అటువంటి సాధువులకు ఈ దేశం గొడ్డుపోలేదు! మీ పేరిట సర్వసంగ పరిత్యాగం చేసిన నా బిడ్డలు తిండి కోసం భిక్షమెత్తడం నేను సహించలేను. మిమ్మల్ని ఇలా ప్రార్థిస్తున్నాను: మీ పేరు చెప్పుకొని సంసారం త్యజించే వారికి సామాన్యమైన తిండిబట్ట లభించాలి. వారు మీ ఉపదేశాలనూ, ఆశయాలనూ కేంద్రంగా చేసుకొని ఒక చోట అంతా కలసి నివసించాలి. లౌకిక జీవితంలో యాతనలు అనుభవిస్తున్న జనం, వారి వద్దకొచ్చి మీ అమృత వచనాలు ఆలకించి సాంత్వన పొందాలి. అందునిమిత్తమే కదా మీ రాక! వారు తిరుగాడుతూండడం నేను భరించలేను’ అని ప్రార్థించాను. ఆ తరువాతే నరేన్ క్రమక్రమంగా ఇదంతా రూపొందించాడు.”
ఎంత అర్థవంతమైన ప్రార్థన! మాతృత్వపు సహజ ఉద్వేగ వెల్లువతో నిండిన ప్రార్థన! కానీ రామకృష్ణ సంస్థ ఉన్నత ఆశయాల బీజం ఎంత ఔచిత్యంగా ఈ ప్రార్థనలో ఇమిడివుంది! గురుదేవులు తమ యువ శిష్యులను సన్న్యాసులుగా తీర్చిదిద్ది, భిక్ష తీసుకురమ్మని ఆదేశించినప్పుడు ప్రథమ భిక్ష ఒసగి, సంఘానికి శ్రీకారం చుట్టినవారు మాతృదేవి; ఇప్పుడు తమ ప్రార్థన ద్వారా సంఘానికి రూపం కల్పిస్తూన్నది మాతృదేవియే. ఇవి మాత్రమే కాదు; సంస్థ పురోగమనంలో ప్రతి దశలో మాతృదేవియే మార్గదర్శకత్వం వహించారు. ఈ కారణాల వల్లనే మాతృదేవిని ‘సంఘ జనని’ అని స్తుతించారు స్వామీజీ.
అల్మోరా
హిమాలయాల్లో ఒక మఠం నెలకొల్పాలని స్వామీజీ అభిలాష. ఇందుకోసం 1897 మే 6వ తేదీన ఆయన అల్మోరాకు బయలుదేరారు. అల్మోరాలో ఆయనను అలంకరించబడిన ఒక గుర్రం మీద ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. దారివెంబడి స్త్రీలు పువ్వులు జల్లి ఆహ్వానించారు; ఇళ్లలో మేడ మీద నుంచి, కిటికీల గుండా స్త్రీలు పుష్పవృష్టి కురిపించి స్వామీజీకి ఘన స్వాగతమిచ్చారు. ఇళ్ల ముంగిట జ్యోతులు వెలిగించి ఉంచారు. పట్టణంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. పట్టణం మధ్యలో అలంకరింపబడిన పందిరిలో స్వామీజీకి వైభవోపేతంగా స్వాగతం పలికారు. స్వామీజీ క్లుప్తంగా ప్రసంగించారు. లాలా బద్రీషా అనే వ్యక్తి ఇంట్లో ఆయన బస చేశారు. “అల్మోరాకు కాస్త ఉత్తరాన ఉన్న ఒక వ్యాపారస్థుని తోటలో నేను ప్రస్తుతం నివసిస్తున్నాను. హిమాలయ హిమశిఖరాలు నా ముందు ఉన్నాయి. సూర్యరశ్మిలో అవి వెండిముద్దలా భాసిస్తూ, హృదయానందకరంగా ఉన్నాయి. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, నియమిత ఆహారం తీసుకొంటూ, ఎక్కువగా వ్యాయామం చేస్తూ నేను శారీరకంగా బలిష్ఠంగాను, ఆరోగ్యంగాను ఉన్నాను”* అని స్వామీజీ వ్రాస్తున్నారు.
స్వామీజీ సోదర సన్న్యాసులు, శిష్యులు, పాశ్చాత్య శిష్యులు కూడా వెళ్లారు. పనులను సత్వరపరచడానికి స్వామీజీ శ్రీలంకకు పంపించిన శివానంద తిరిగివచ్చి, అప్పటికే అక్కడ తపోమయ జీవితం గడుపుతున్నాడు. ఆయన స్వామీజీని కలుసుకొన్నారు. సంభాషణలతో, చర్చలతో రోజులు గడవసాగాయి.
డాక్టర్ బారోస్ ప్రతిఘటన
అదే సమయంలో సమస్యలూ కొనసాగాయి. స్వామీజీని చికాగోలో కలుసు కొని ఆయనకు మిత్రుడయిన వ్యక్తి బారోస్. చికాగో సర్వమత మహాసభ పాలకవర్గ అధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తి ఈయన. ఆ తరువాత ఆయన భారతదేశానికి వచ్చి క్రైస్తవమత ప్రచారంలో నిమగ్నుడయ్యాడు. అప్పుడు కూడా స్వామీజీ ఆయనను సాదరంగా ఆహ్వానించారు; కొందరు వ్యక్తులనూ, స్థలాలనూ ఆయనకు స్వామీజీ పరిచయం చేశారు కూడా! కానీ బారోస్, “క్రైస్తవ మతమే ప్రపంచ వ్యాప్తమైన మతమని”, “కేవలం 300 ఏళ్లలో క్రైస్తవ మతం రోమ్, గ్రీసు ఆధిక్యాలను త్రోసిరాజన్నది” అంటూ సత్యదూరమైన, చరిత్రాత్మకం కాని భావనలను ఏకరవు పెట్టినప్పుడు స్వామీజీ సహించలేకపోయారు. స్వామీజీ దానిని ప్రతిఘటించారు. వెంటనే డాక్టర్ తన రెండవ ముఖాన్ని చూపసాగాడు. పత్రికలలోనూ ప్రసంగాల లోనూ స్వామీజీని దుర్భాషలాడడమూ, ఆయన గురించి కట్టుకథలు ప్రచారం చేయడమూ ఆరంభించాడు. ఫిబ్రవరి నెలలో ప్రారంభమయిన ఈ సమస్య కొనసాగింది. స్వామీజీ యథాప్రకారం వీటిని పెద్దగా పట్టించుకోలేదు.
రోజులు దొర్లసాగాయి. కానీ అల్మోరాలో మఠ నిర్మాణానికి స్థలం లభించ లేదు. రెండున్నర నెలలు అక్కడ గడిపిన తరువాత స్వామీజీ బయలుదేరాలను కున్నారు. అక్కణ్ణుంచి బయలుదేరే ముందు ప్రజల విన్నపాన్ని మన్నించి స్వామీజీ మళ్లీ కొన్ని ప్రసంగాలు చేశారు.
సత్యనిష్ఠతో లోక విజేత అయ్యారు
స్వామీజీ అల్మోరాలో ఉన్నప్పుడు అశ్వినీకుమార్ స్వామీజీని చూడడానికి ఒక రోజు వచ్చాడు. ఈయన 19వ శతాబ్దపు అగ్రగణ్యులైన విద్యావేత్తలలోఒకరు. ఒకసారి 1883లో శ్రీరామకృష్ణుల విన్నపం మేరకు అశ్వినీ కుమార్ స్వామీజీని కలుసుకోవడానికి వెళ్లాడు. అప్పుడు స్వామీజీ తలనొప్పితో యాతన పడుతూన్నందు వలన చాలా సేపు వారిద్దరూ మాట్లాడుకోలేకపోయారు. కనుక అశ్వినీ కుమార్ మరొక రోజు వస్తానని చెప్పి సెలవు పుచ్చుకొని వెళ్లిపోయాడు. ఆ ‘మరో రోజు’ ఇప్పుడు దాదాపు 14 సంవత్సరాల తరువాత వచ్చింది.
ఆంగ్లం మాట్లాడే, గుర్రపు స్వారీ చేస్తున్న ఒక సాధువు అల్మోరాలో బసచేసి ఉన్నారని విని అశ్వినీకుమార్, ఆయన తప్పక స్వామీజీయే అయివుంటారని ఊహించాడు. ఒక రోజు స్వామీజీ బస చేసివున్న ఇంటికి వచ్చి ప్రవేశద్వారం వద్ద నిలబడివున్న యువ సన్న్యాసితో “నరేన్దత్తా ఉన్నారా?” అని అడిగాడు. అందుకు ఆ సన్న్యాసి, “లేరు. ఆయన చాలాకాలం క్రితమే మరణించారు.* స్వామి వివేకానంద మాత్రమే ఉన్నారు” అని జవాబిచ్చాడు. అశ్వినీకుమార్ నిర్ఘాంతపోయాడు. తరువాత ఆ సన్న్యాసి ఇంట్లోకి వెళ్లి స్వామీజీతో, “పరమహంసదేవుల నరేంద్రుని గురించి ఒక వ్యక్తి వాకబు చేశాడు. ఆయన మరణించాడనీ, వివేకానందను కలుసుకోవచ్చుననీ ఆయనతో చెప్పాను” అన్నాడు. “ఆహా! ఏం చేశావు నువ్వు! ఆయనను తక్షణమే రమ్మను” అని ఉత్తేజభరితంగా చెప్పారు. చివరికి స్వామీజీ అశ్వినీకుమార్ కలుసుకొన్నారు. వారు అనేక విషయాలు ముచ్చటించుకొన్నారు. తమను ‘స్వామీజీ’ అని అశ్వినీకుమార్ సంబోధించబోయినప్పుడు, “నన్ను మీరు ‘నరేంద్రా’ అనే సంబోధించవచ్చు” అని వినమ్రంగా స్వామీజీ చెప్పారు. వారి సంభాషణ స్ఫూర్తిదాయకమయినది.
అశ్వినీకుమార్: మీరు ప్రపంచ యాత్ర చేసి వచ్చారు. లక్షలాది ప్రజల హృదయాలలో ఆధ్యాత్మికతను ప్రజ్జ్వలింపజేశారు. భారతదేశ విముక్తికి మార్గం ఏమిటి?
స్వామీజీ: గురుదేవులు చెప్పింది తప్ప నేను చెప్పడానికిక మరేమీ లేదు. మీరూ ఆయన వద్ద విన్న మాటలే కదా అవి. మతమే మన దేశపు మౌలిక సారాంశం. ఏ సంస్కరణనయినా ప్రజలు స్వీకరించాలంటే, అది మతం గుండా రావాలి. దీనికి వ్యతిరేకంగా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అది, భగీరథ ప్రయత్నమవుతుంది కనుక.
అశ్వినీకుమార్: (భారత జాతీయ) కాంగ్రెస్ కార్యాచరణలలో మీకు నమ్మకం లేదా?
స్వామీజీ : లేదు, నాకు నమ్మకం లేదు. కానీ చేతులు ముడుచుకొని ఊరకే ఉండడం కన్నా ఏదో ఒకటి చేయటం మంచిదే కదా! నిద్రాణంలోవున్న మన దేశాన్ని జాగృత పరచడానికి అన్ని వైపుల నుండి ముందుకు త్రోయడం అవసరమే! ప్రజల కోసం ఈ కాంగ్రెస్ ఏం చేసిందో నాకు వివరించండి చూద్దాం. కొన్ని తీర్మానాలను నెరవేర్చివేస్తే స్వాతంత్ర్యం దానంతట అదే వస్తుందనుకొంటున్నారా? దాన్లో నాకు నమ్మకం లేదు. ముందు ప్రజలు జాగృతం కావాలి. వారికి కడుపు నిండా తిండి లభించాలి, ఆ తరువాత వారు తమ స్వాతంత్ర్యాన్ని తామే వెతుక్కొంటారు. ప్రజల కోసం కాంగ్రెస్ ఏదైనా చేసివుంటే నాకు సంతోషమే. మరొకటి, ఆంగ్లేయుల మంచి లక్షణాలను మనం అంగీకరించాలి కూడా.
అశ్వినీకుమార్: మీరు ‘మతం’ అని దేనిని పేర్కొంటున్నారు? ఏదన్నా ప్రత్యేక శాఖనా?
స్వామీజీ: గురుదేవులు ఏవన్నా శాఖలను బోధించారా? కాని వేదాంతం సమస్తాన్నీ స్పృశించిన మతమని ఆయన వచించారు. అందువలన నేను కూడా దానినే బోధిస్తున్నాను. కానీ నేను బోధిస్తూన్న మతసారం ‘బలం’. హృదయంలో బలాన్ని నింపని మతం నా దృష్టిలో మతమే కాదు – అవి ఉపనిషత్తులు కాని, గీత కాని, భాగవతం కాని! బలమే మతం, బలం కన్నా ఉత్కృష్ట్టమైనది ఏదీ లేదు.
అశ్వినీకుమార్: నేనేం చేయాలి?
స్వామీజీ: మీరు విద్యారంగ కార్యాలలో నిమగ్నమయినట్లు విన్నాను. అది నిజమైన పని. మీలో గొప్పశక్తి పనిచేస్తున్నది. మీకున్న తెలివి ఒక గొప్ప వరం! కానీ మనుషులను రూపొందించే విద్య ప్రజలలో వ్యాప్తిగాంచేటట్లు చూడండి. తదుపరి వారిలో సహజసిద్ధంగా సంస్కృతిని ఇనుమడింపజేయండి. మీ విద్యార్థులలో పిడుగులాంటి దృఢమైన సంస్కృతిని రూపొందించండి. యువకుల దృఢచిత్తం భారతదేశపు బానిసత్వాన్ని నుగ్గునుగ్గు చేయు గాక! అర్హులైన కొందరు యువకులను మీరు నాకు ఇవ్వగలరా? అలా అయితే ఈ లోకాన్నే నేను ఊపివేస్తాను….
“అంటరానివారు, చెప్పులు కుట్టేవారు, మరుగుదొడ్లు శుభ్రంచేసే వారంటూ మనం బహిష్కరించిన దళితుల వద్దకు వెళ్లండి. వెళ్లి వారితో, ‘మీరే ఈ దేశపు జీవనాడి. మీలో అపరిమిత శక్తి ఉంది. ఆ శక్తితో లోకాన్నే ఊపివేయవచ్చు. లేవండి, మీ సంకెళ్ళను త్రెంచివేయండి. లోకమే మిమ్మల్ని చూసి విస్తుబోతుంది’ అని చెప్పండి. వారి కోసం పాఠశాలలు నెలకొల్పండి. వారందరితో ఉపవీతాన్ని ధరింపజేయండి.”
అది స్వామీజీ ఉదయంపూట ఉపాహారం తినే సమయం. కనుక అశ్వినీ కుమార్ సెలవు పుచ్చుకోవడానికి సిద్ధమయ్యాడు. బయలుదేరే ముందు ఆయన స్వామీజీతో, “చెన్నై సంఘటన గురించి మిమ్మల్ని అడగాలనుకొంటున్నాను. అక్కడ ఒక బ్రాహ్మణుడు మిమ్మల్ని ‘అస్పృశ్యు’ లని సంబోధించినట్లూ, అందుకు మీరు, ‘నన్ను అలా సంబోధించిన వ్యక్తి అస్పృశ్యులలో అస్పృశ్యుడు’ అని జవాబిచ్చినట్లూ విన్నాను. ఇది నిజమా?” అని అడిగారు.
స్వామీజీ: అవును.
అశ్వినీకుమార్: ఆచార్యులూ, జితేంద్రియులూ, శ్రీరామకృష్ణుల శిష్యులూ అయిన మీకిది న్యాయమా?
స్వామీజీ: న్యాయమని నేను చెప్పలేదే! నేను చెప్పింది సముచితమని ఎన్నడూ అనలేదు. అలా వారిని దూషించాలనుకోలేదు. కాని కోపంలో అలా చెప్పాను. నేను చెప్పిన దానిని సమర్థించ ప్రయత్నించలేదు. నేను చేసింది తప్పే.
స్వామీజీ ఈ మాటలు వినగానే అశ్వినీకుమార్ ఆయనను కౌగిలించు కొన్నాడు. తరువాత ఆయనతో, “లోకాన్నే మీరెలా జయించారో నా కిప్పుడు అర్థమయింది. శ్రీరామకృష్ణులు మిమ్మల్ని ఎందుకు అంతగా ప్రేమించారో కూడా నా కిప్పుడు తెలిసింది” అన్నాడు. స్వామీజీ నిజాన్ని అంగీకరించడం అశ్వినీ కుమార్‌కు ఎంతో ఆశ్చర్యం కలిగించడంలో ఎలాంటి సందేహమూ లేదు. చేసిన తప్పులను, దుర్బలతలను సమర్థించుకోకుండా ఒప్పుకోవడం సాధారణమైన విషయమా ఏమిటి!
కాశ్మీర్లో
ఆగస్టు 2వ తేదీన అల్మోరా నుండి స్వామీజీ బయలుదేరారు. దారిలో అనేక ప్రదేశాలను చూసుకొంటూ సెప్టెంబర్ ప్రారంభంలో కాశ్మీర్ చేరుకొన్నారు. అక్కడ దాదాపు ఒక నెల రోజులు గడిపారు. కాశ్మీర్ మహారాజయిన రాజా రాంసింగ్‌ను కలుసుకొన్నారు. స్వామీజీ కార్యాచరణకు అమితంగా ఆకర్షితుడయిన మహారాజు ఆయన కార్యాలకు అవసరమైన సహాయం అందజేస్తానన్నాడు. స్వామీజీ కాశ్మీర్‌కు రావడం కాశ్మీర్ ప్రజలకు సమధికోత్సాహం కలిగించింది. రోజూ తండోపడండాలుగా వచ్చి వారు ఆయనను కలుసుకొన్నారు. అనేక రోజులు గూటిపడవల్లో స్వామీజీ పయనించారు.
కాశ్మీర్ ప్రకృతి సౌందర్యాన్ని చూసి స్వామీజీ ఎంతగానో ముగ్ధులయ్యారు. “ఈ కాశ్మీర్ భూతల స్వర్గమే. ఇలాంటి ప్రదేశం లోకంలో మరెక్కడా లేదు. కొండలు, నదులు, చెట్లు, లతలు, మృగాలు, పక్షులు, స్త్రీలు, పురుషులు – సర్వం రమణీయతలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఇంతవరకు ఈ ప్రదేశాన్ని చూడనందుకు హృదయ పరితాపం కలిగింది…. కాశ్మీర్‌ను గూర్చి నీకు వర్ణించడానికి ప్రయత్నించను. ఈ భూతల స్వర్గాన్ని తప్ప ఏ ఇతర దేశాన్నైనా వదలిపెట్టడానికి ఇంత విచారపడలేదని చెబితే చాలు”* అని స్వామీజీ వ్రాస్తున్నారు.
‘ఇదేనా నీ చదువు?’
శ్రీనగర్ సమీపంలో ఒక ఆలయం ఉంది. అది పాండవుల కాలం నాటి దేవాలయమని ప్రతీతి. స్వామీజీ ఆ ఆలయ వాస్తుకళను చూసి ముగ్ధులయ్యారు. ఆ శిల్ప సౌందర్యాన్ని తనివితీరా తిలకించి, “ఈ ఆలయం కనీసం రెండు వేల సంవత్సరాల క్రితందై ఉండాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రక్కనే నిలబడి వున్న అద్భుతానంద, స్వామీజీని చూసి, “దేని ఆధారంగా ఇంతకాలం క్రితందై ఉంటుందని చెబుతున్నావు?” అని అడిగారు. అందుకు స్వామీజీ, “నీలాంటి చదుమా సంధ్యాలేని వ్యక్తితో అదంతా వివరించడానికి నాకు తీరిక లేదు” అన్నారు. కాస్త కూడా విస్తుపోలేదు అద్భుతానంద; స్వామీజీ జవాబిచ్చిన అదే వేగంతో ఇలా అడిగారు: “అలా అయితే నీ చదువు ఏం గొప్ప చదువు? నాలాంటి మూర్ఖునికి నీ భావనను అవగతం చేయలేకపోతున్న నువ్వు ఏం పండితుడివి?” అవాక్కయ్యారు స్వామీజీ.
మఠ స్థాపనకై ప్రయత్నం
కాశ్మీర్ ప్రకృతి సౌందర్యమూ, హిమాలయాల నేపథ్యమూ స్వామీజీని అమితంగా ఆకట్టుకొన్నాయి. అక్కడ ఒక మఠం స్థాపించగోరారు. అందుకోసం బ్రహ్మచారి హరిప్రసన్నను కాశ్మీర్‌కు రప్పించారు. ఆయన ఒక ఇంజనీర్. ఆయన వస్తే మఠం కోసం స్థలం ఎంపిక చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని స్వామీజీ ఉద్దేశం.*
స్వామీజీ కాశ్మీర్ సౌందర్యానికి అమిత ముగ్ధులయినప్పటికీ అనేక కారణాల వలన ఆయన అక్కడ ఎక్కువ రోజులు గడపలేకపోయారు. పంజాబ్ సందర్శించా లనే ఆసక్తి ఆయనకు ఉన్నప్పటికీ నిధుల కొరత కారణంగా ఆయన అక్కణ్ణుంచి బయలుదేరవలసిన అగత్యం ఏర్పడింది. అక్కడ మహారాజు ద్వారా ఉపన్యాసాలను ఏర్పాటు చేయాలనుకొన్నారు స్వామీజీ. అదీ జరగలేదు. సేవియర్ ఇచ్చిన డబ్బు సత్వరమే కరగిపోయింది. కనుక ఆయన కాశ్మీర్ నుండి బయలుదేరారు.
అక్టోబర్ 21వ తేదీన జమ్మూ చేరుకొన్నారు. అక్కడ ఒకటి రెండు ప్రసంగాలు చేశారు, చర్చలలో పాల్గొన్నారు. అక్కణ్ణుంచి విద్యుత్ ఉత్పాదక కేంద్రానికి వెళ్లారు. జలవిద్యుత్తును ఎలా ఉత్పత్తి చేస్తారో అక్కడ చూశారు. సాంకేతికాభివృద్ధిలో అమిత ఆసక్తిగల ఆయనను జలవిద్యుదుత్పాదన ఎంతగానో ఆకట్టుకొంది. మహారాజు గ్రంథాలయాన్ని కూడా సందర్శించారు.
పంజాబ్‌లో
తదుపరి స్వామీజీ పంజాబ్‌ను సందర్శించారు. నవంబర్ 5 వ తేదీన లాహోర్ చేరుకొన్నారు. సాంప్రదాయిక స్వాగతోత్సవం తరువాత నాగేంద్రనాథ్ గుప్తా అనే వ్యక్తి ఇంట్లో బస చేశారు. లాహోర్‌లో మూడు ముఖ్యమైన ప్రసంగాలు చేశారు. వాటిలో ‘వేదాంత’ మనే ప్రసంగం సుప్రసిద్ధమైనది. ఈ ప్రసంగం విన్న తీర్థరామ్ ఇలా వ్రాస్తున్నాడు: “ఆంగ్లేయులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, బ్రహ్మసమాజస్థులు, ఆర్యసమాజస్థు లంటూ ఎవరు ఈ ప్రసంగం విన్నారో వారికి కనువిప్పు అయిందనే చెప్పాలి. ఇటువంటి మహావిజయాన్ని చూడడం అపూర్వం.”
ఉత్తర భారతదేశంలో స్వామీజీ ప్రసంగాలలో ఆర్యసమాజస్థులు తండోప తండాలుగా వచ్చి పాల్గొన్నారు. నిజానికి స్వామీజీ పంజాబ్‌కు వెళ్లడంలో ఒక ముఖ్యోద్దేశం కూడా ఉంది. పంజాబ్‌లో ఆర్యసమాజస్థులకూ, హిందువులకూ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. వాటిని ఆయన పరిష్కరించగోరారు. కాని ఆయన విశాల భావనలను రెండు పక్షాలవారూ అంగీకరించలేదు. రెండు పక్షాలవారూ ఆయనను కలుసుకొని మాట్లాడారు. దీనిని గురించి తీర్థరామ్ ఇలా వ్రాస్తున్నాడు:
“స్వామీజీ బహిరంగ ప్రసంగాలు చేశారు. కాని చర్చాకార్యక్రమాలలోలా ఆయన మేధాశక్తి ప్రసంగాలలో అభివ్యక్తం కాలేదనే చెప్పుకోవాలి. ఆర్యసమాజ, బ్రహ్మసమాజ నాయకులతో ఆయన మాట్లాడడం విన్నాను. వారి ప్రశ్నలకు స్వామీజీ బదులు చెప్పిన తీరుతెన్నులు అనుపమానమైనవి. వారి తత్త్వాలనూ, భావనలనూ ముక్కలుముక్కలుగా చీల్చిచెండాడి వారిని ఉక్కిరిబిక్కిరి చేశారు. వారు బదులు చెప్పడానికి ఏమీ మిగల్లేదు. కాని ఒక విషయం, దాన్లోనే ఆయన వాదనాపటిమ ప్రస్ఫుటమయింది – వారి ఉద్వేగాలను గాయపరిచే రీతిలో ఆయన ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారి భావనలనే చెప్పి, స్వల్ప వ్యవధిలో, వారి భావనలకు పటిష్ఠమైన ప్రాతిపదిక కొరవడిందని స్వయంగా వారే అంగీకరించేటట్లు చేశారు.”
హిందువుల శ్రాద్ధకర్మల గురించిన వాదన తలెత్తింది. ఆర్యసమాజస్థులు ఈ శ్రాద్ధకర్మలను అంగీకరించరు. హిందువులకు ఇది అత్యంత ప్రధానం. కనుక ఈ శ్రాద్ధకర్మల ప్రాధాన్యాన్ని ఎత్తిచూపి, ఆర్యసమాజస్థులను అణచివేయాలని హిందువులు కోరారు. కాని స్వామీజీ ఇలాంటి క్రొత్త సమస్యలను సృష్టించ దలచుకోలేదు. అయినప్పటికీ బహిరంగ ప్రసంగంలో శ్రాద్ధకర్మల గురించి ప్రస్తావించారు. దాని ఆవశ్యకతను అద్భుతంగా విపులీకరించారు. నాటి ప్రసంగంలో ఆర్యసమాజస్థులు అనేకులు పాల్గొన్నారు. వారు స్వామీజీ అభిప్రాయా లను అంగీకరించలేకపోయారు. కనుక ఆయనతో వివాదానికి సిద్ధపడ్డారు. దానిని కూడా స్వామీజీ స్వీకరించారు. వారికి శ్రాద్ధకర్మల చారిత్రక ముఖ్యత్వాన్ని విశదీకరించారు.
తాత్కాలికంగానైనా రెండు పక్షాల మధ్య మైత్రీపూర్వకమైన ఒక సత్సంబం ధాన్ని స్వామీజీ కల్పించారు. ఎందుకంటే కొనసాగిన ఆయన ప్రసంగంలో రెండు పక్షాలవారూ విరివిగా పాల్గొనడం దీనిని సూచిస్తున్నది.
తీర్థరామ్
స్వామీజీని లాహోర్‌లో కలుసుకొన్న యువకులలో ఒకరే మనం పైన చూసిన తీర్థరామ్ గోస్వామి. లాహోర్‌లోని ఒక కళాశాలలో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశాడాయన. స్వామీజీ ప్రసంగాలను ఎడతెగక వింటూ వచ్చిన ఆయన ఒక రోజు తమ ఇంటికి స్వామీజీతోపాటు గుడ్విన్ తదితరులను కూడా ఆహ్వానించి విందు ఇచ్చాడు. ఆ రోజు భోజనా నంతరం స్వామీజీ, “రాముడుండే చోట కాముడు ఉండడు, ఎక్కడ కాముడు ఉంటాడో అక్కడ రాముడు ఉండడు”* అని ప్రారంభమయ్యే హిందీ గీతాన్ని పాడారు. “ఆయన గాంభీర్య కంఠస్వరం అక్కడున్న అందరి హృదయాలనూ సుతిమెత్తగా తాకి, ఆ గీతార్థాన్ని మనస్సులను నింపివేసింది” అని తీర్థరామ్ వ్రాస్తున్నారు.
స్వామీజీ ఎక్కడకు వెళ్లినా క్రొత్తగా ఏదో ఒకటి నేర్చుకొనే అవకాశాన్ని మాత్రం జారవిడుచుకొనేవారు కాదు. తీర్థరామ్ తన గ్రంథాలయాన్ని స్వామీజీకి చూపించాడు. స్వామీజీని అమితంగా ఆకట్టుకొన్న ఆంగ్ల రచయితలలో ఒకరైన వాల్ట్ విట్మెన్ ‘పచ్చిక మొలకలు’ (Leaves of grass) అనే పుస్తకాన్ని చూసి దానిని చదవనారంభించారు.
‘అటువంటి వ్యక్తి నా గురుదేవులు’
ఒక రోజు తీర్థరామ్, మిత్రులు స్వామీజీతో పచార్లు చేస్తున్నారు. దారిలో వారు కొన్ని బృందాలుగా విడివడి మాట్లాడుకొంటూ నడవసాగారు. తీర్థరామ్ బృందంవారు ఆతడితో, “మహాత్ముడంటే ఎవరు?” అని అడిగారు. అందుకు తీర్థరామ్ ఇలా జవాబిచ్చాడు: “ఒక మహాత్ముడు తనను ఒక వ్యక్తిగా పరిగణించడు. తానే అందరిలోనూ ఉన్నట్లు భావిస్తాడు. ఒక ప్రాంతంలోని గాలి వేడెక్కినప్పుడు అది తేలికై పైకి పోతుంది. అక్కడ ఏర్పడ్డ శూన్యాన్ని నింపడానికి ప్రక్కనున్న ప్రాంతాల గాలి అక్కడకు వ్యాపిస్తుంది. ఈ విధంగా అక్కడ ఒక ఉద్యమం, సుతిమెత్తని డోలనం రూపొందుతుంది. అదే విధంగా ఒక మహాత్ముడు తన జీవితం ద్వారా దేశంలో ఒకే హృదయ స్పందనను కల్పిస్తాడు.” ఇది చెబుతున్నప్పుడు స్వామీజీ బృందం వారిని దాటి వెళ్లింది. స్వామీజీ కాస్త ఆగి ఈ విభాగాన్ని నిశితంగా విన్నారు. తీర్థరామ్ చెప్పి ముగించగానే స్వామీజీ గంభీరంగా ఇలా నొక్కివక్కాణించారు: “అటువంటి వ్యక్తిగా ఉండేవారు నా గురుదేవులయిన పరమహంస రామకృష్ణ దేవులు.”
స్వామీజీ లాహోర్ నుండి బయలుదేరుతున్నప్పుడు తీర్థరామ్ ఒక బంగారు చేతిగడియారం ఆయనకు బహుకరించాడు. దానిని స్వీకరించి స్వామీజీ ఆతణ్ణి చూసి చిరునవ్వు నవ్వారు. పిదప దానిని తీర్థరామ్ జేబులో ఉంచి, “మంచిది, మిత్రమా! ఈ గడియారాన్ని నేను ఇక్కడ ఈ జేబులోనే ధరిస్తాను” అన్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు, “ఒక మహాత్ముడు అందరిలోనూ తానే ఉన్నట్లుగా దర్శిస్తాడు” అని తన వ్యాఖ్యానాన్ని ఇప్పుడు స్వామీజీ నిరూపించడం బహుశా తీర్థరామ్ మనస్సులో తోచివుండవచ్చు! ఈ తీర్థరామే కాలాంతరంలో సంసారం త్యజించి స్వామి రామతీర్థ పేరిట ప్రపంచ ఖ్యాతిగాంచాడు.
‘నన్ను గౌరవించాలా?’
ఒక రోజు స్వామీజీ ఒక ఫలానా వ్యక్తిని ఎంతగానో శ్లాఘించారు. అది విని ఒక వ్యక్తి, “కాని స్వామీజీ, ఆతడు మిమ్మల్ని గౌరవించడం లేదే!” అన్నాడు. “ఎందుకు? ఒకరు సజ్జనుడవ్వాలంటే పక్షంలో నన్ను గౌరవించాలా ఏమిటి?” అని తక్షణమే స్వామీజీ జవాబిచ్చారు. అడిగిన వ్యక్తి అవాక్కయ్యాడు.
కొన్ని కలతలు
లాహోర్ రోజుల ఉత్తేజం స్వామీజీ ఆరోగ్యాన్ని కాస్త క్రుంగదీసింది. ఉబ్బసం, మధుమేహాలకు మూత్రపిండాల రుగ్మత కూడా జతకట్టింది. తమ ఆయుస్సు తక్కువని స్వామీజీకి తెలియకపోలేదు. ఆ విషయం అప్పుడప్పుడు ఆయన ప్రస్తావించడం కద్దు. ప్రస్తుత రుగ్మతలు ఆయనను దీర్ఘాలోచనలకు గురిచేశాయి. దక్షిణేశ్వర కాళికాలయ ప్రవేశాన్ని ఆయనకు నిరాకరించారు. ఈ స్థితిలో గురుదేవుల జయంతి మహోత్సవాన్ని ఎక్కడ జరిపించాలనే ప్రగాఢ చింతన ఒక వైపు ఆయనను సతమతపరుస్తున్నది. ఆయన విదేశాల నుండి అపరిమితంగా ధనం తెచ్చివుంటారని భావించిన స్వదే శస్థులు, ఆయన కార్యాచరణకు చందాలివ్వడానికి సంకోచించడం కూడా ఆయన కలతలకు కారణమైందనే చెప్పుకోవాలి. తాను ఈ లోకం నుండి నిష్క్రమించే లోపు గురుదేవులకంటూ ఒక శాశ్వత స్థలాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఆయన మనస్సును ఆక్రమించసాగింది. ఇటువంటి అనేక కారణాల వలన తమ యాత్రలను కొనసాగించకుండా తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకొన్నారు.
డెహ్రాడూన్‌లో
కనుక ఇంతకు మునుపు అనుకొన్న అనేక ప్రయాణాలను రద్దు చేసుకొని లాహోర్ నుండి స్వామీజీ డెహ్రాడూన్ వెళ్లారు. అక్కడ ప్రసంగాలు ఏవీ చేయ దలచుకోలేదు. అదే సమయంలో తమతో ఉన్న మిత్రులకూ, శిష్యులకూ శ్రీరామానుజుల బ్రహ్మసూత్ర భాష్యాన్నీ, సాంఖ్య తత్త్వం గురించీ తరగతులు జరిపారు. ఇక్కడ మాత్రమే కాదు యాత్ర పూర్తయ్యే దాకా ఈ తరగతులు కొనసాగాయి. ఈ యాత్రలో ఆయనతో కలసి వెళ్లిన అచ్యుతానందతో సాంఖ్య తరగతులు నిర్వహించమని స్వామీజీ చెప్పారు. అచ్యుతానంద తరగతులు నిర్వహిస్తున్నప్పుడు స్వామీజీ ప్రక్కనే కూర్చుని, అచ్యుతానంద తొట్రుపడినప్పుడు తామే విపులీకరించేవారు. “స్వామీజీ గొప్ప పండితుడు. శాస్త్రాలు ఆయనకు కరతలామలకం. బ్రహ్మసూత్రాలకు శంకరుల భాష్యం, రామానుజుల శ్రీభాష్యం, మధ్వాచార్యుల భాష్యం సాంగోపాంగంగా అధ్యయనం చేసిన వ్యక్తి ఆయన. శ్రీవల్లభాచార్యుల అనుభాష్యాన్ని అధ్యయనం చేయబోతున్నట్లు చెప్పారు, సాంఖ్య యోగాదుల్లో ఆయనకు చక్కని అభినివేశం ఉంది. గీతకు సంబంధించినంత వరకు ఆయనే ఒక భాష్యకర్త అనడం అతిశయోక్తి కాదు” అని వ్రాస్తున్నాడు తీర్థరామ్.
‘మాతృభాషలో స్తుతించండి’
విక్టోరియా మహారాణి వజ్రోత్సవంలో పాల్గొని లండన్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చాడు ఖేత్రీ మహారాజు. ఆయనను కలుసుకోవడానికి స్వామీజీ ఆతురత చెందారు. కనుక డెహ్రాడూన్ నుండి ఆయన, ఆయన బృందమూ నవంబర్ 26 వ తేదీన బయలుదేరారు. దారిలో ఢిల్లీలో నటకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో ముందు బస చేశారు. ఈ నటకృష్ణ స్వామీజీ పరివ్రాజక జీవితంలో హత్రాస్ రైలు నిలయంలో ఇంతకు క్రితమే ఆయనకు పరిచయస్థుడయ్యాడు. స్వామీజీ ప్రథమ శిష్యుడైన శరశ్చంద్ర గుప్తాతో ఈతడు పరిచయ భాగ్యం పొందాడు.
నటకృష్ణ ఒక రోజు స్వామీజీతో, “నేను నిరంతరం సాధనలు అనుష్ఠిస్తు న్నాను. గత ఆరు నెలలుగా అనేక క్రియలూ, గాయత్రీ జపమూ, సంధ్యావంద నమూ చేస్తున్నాను. కాని ఇంతదాకా ఎలాంటి జ్యోతిదర్శనమూ లభించలేదు” అన్నాడు వాపోతూ! అందుకు స్వామీజీ, “నీకు తెలియని భాషలో మంత్రోచ్చారణ చేయడం కన్నా నీ మాతృభాషలో భగవంతుణ్ణి ప్రార్థించు. ఆయన ఆలకిస్తాడు” అన్నారు. ఆతడికి గాయత్రీ మంత్ర అంతరార్థాన్ని స్వామీజీ విపులీకరించారు.
ఆళ్వార్‌లో
స్వామీజీ ఆళ్వార్‌కు వెళ్లగానే అక్కడ ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఖేత్రీ మహారాజు ఆ కార్యక్రమాలలో పాల్గొనలేకపోయాడు. రైలు నిలయంలో స్వాగతోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఆ రోజు ఇదే స్థలాలలో, చేత చిల్లిగవ్వ లేకుండా సన్న్యాసిగా రావడం స్వామీజీ మనస్సులో మెదలింది. ఆయన ఏదీ మరచిపోలేదు, క్రొత్త మార్పులతో ఆయన ఉప్పొంగిపోలేదు. ఆయనా, ఆయనలోని సన్న్యాసీ చెక్కుచెదరకుండా అట్లే ఉన్నారు. తమకు ఆనాడు సహాయం చేసిన, తమతో మెలగిన అనేకులను ఆ జన సమూహంలో స్వామీజీ చూడకపోలేదు. స్వాగతపు తీరుతెన్నులు వేటినీ పట్టించుకోకుండా, “రామస్నేహి, రామస్నేహి ఇక్కడకు రా” అని పాత మిత్రుడ యిన సన్న్యాసినీ, తమ పరిచయస్థులయిన వారినీ ఎలుగెత్తి పిలిచారు.
గుడిసెలో విందు భోజనం
ఆళ్వార్‌లో అనేకులు స్వామీజీని తమ తమ ఇళ్లకు ఆహ్వానించారు; విందు ఏర్పాట్లు చేయగోరారు. కాని స్వామీజీ తామే వస్తామని, అక్కడికి వచ్చి చపాతీ తినగోరినట్లు ఒక వ్యక్తికి కబురు పంపించారు. ఆకలితో అలమటించినప్పుడు, తన శక్తి మేరకు చపాతీలు పెట్టి పుణ్యం సముపార్జించుకొన్న వ్యక్తి ఆ వృద్ధురాలు. స్వామీజీ పంపించిన కబురు అందగా ఆ వృద్ధురాలు నమ్మలేకపోయింది. స్వామీజీ, ఆయన బృందంవారు వెళ్లినప్పుడు ఆయన ఎడబాటుకు ఆమె హృదయం ద్రవించి పోయింది. గద్గద స్వరంలో, “రా నాయనా! ఎంతో చేయాలనే ఉత్సాహం ఉంది. కానీ నేనో పేదరాలిని. విందుకు ఎక్కడికి పోగలను?” అంటూ తను స్వయంగా చేసిన మామూలు చపాతీలను స్వామీజీకి, బృందంవారికి పెట్టింది. ఆ మామూలు ఆహారాన్ని స్వామీజీ ఎంతో ఇష్టంగా తిన్నారు. తమతో వచ్చిన వారితో, “చూడండి, ఎంతటి భక్తి! ఏం మాతృహృదయం! స్వహస్తాలతో ఈ వృద్ధురాలు చేసి మన కిచ్చిన ఈ చపాతీలు సాత్వికమైనవి!” అన్నారు. పిదప ఆ ఇంట్లో ఉన్నవారి దగ్గర, వృద్ధురాలికి తెలియకుండా, కొంత పైకమిచ్చి స్వామీజీ వెళ్ళిపోయారు.
రాజప్రాసాదంలో
ఆళ్వార్‌లో ఒకటి రెండు రోజులు గడిపి, జైపూర్ వెళ్లిన స్వామీజీ అక్కడ ఖేత్రీ మహారాజు భవంతి నొకదాన్లో బస చేశారు. అక్కడున్న చోట్లు ప్రతి ఒక్కటీ స్వామీజీకి పాతరోజులను జ్ఞాపకం చేశాయి. పరివ్రాజకునిగా వచ్చినప్పుడు ఇదే రాజప్రాసాదంలో వంటవాడు అనిష్టంగా నాలుగు చపాతీలు వడ్డించాడు. నేడు, “మహారాజు హంసతూలికాతల్పంలో పడుకొంటున్నాను. నాకు సేవలందించడానికి చేతులు జోడించుకొని పనివాళ్లు కాచుకొని నిలబడి ఉన్నారు. ఏం తేడా! నిజమే – ‘మనిషి అంతస్తునే ప్రజలు ఆరాధిస్తున్నారు, ఆతడి శరీరాన్నో, ఆత్మనో కాదు’* ” అన్నారు స్వామీజీ.
జైపూర్ నుండి దాదాపు 90 మైళ్లు ఎడారిలో పయనించి ఖేత్రీ చేరుకోవాలి. కొందరు గుర్రాల మీద, కొందరు ఒంటెల మీద, మరికొందరు పల్లకీలలోను పయనించారు. జనసంచారమో, చెట్టుచేమలో ఏవీ తారసపడని, కనుచూపుమేర దాకా ఇసుక మాత్రమే కానవచ్చే ప్రయాణం అది. స్వామీజీ రావడం వలన దారి పొడవునా కథలు, సంఘటనలు చెబుతూ అందరినీ ఉల్లాసపరిచారు. దారిలో ఉన్న సత్రాలలో స్వామీజీ, బృందంవారు బసచేసి, విశ్రాంతి తీసుకోవడానికి మహారాజు ఏర్పాట్లు చేయించాడు. అక్కడ స్వామీజీ వేదాంత తరగతులు నిర్వహించారు. ఈ ప్రయాణంలో దారిలో ఒక చోట ఒక ప్రేతాత్మను చూసినట్లు స్వామీజీ ఆ తరువాత తెలిపారు.
ఖేత్రీకి 12 మైళ్లు ముందే మహారాజూ, మున్షీ జగ్మోహన్లాల్ స్వామీజీకి ఘనంగా స్వాగతమిచ్చి తోడ్కొని వెళ్లారు. కొండ మీద నిర్మితమయిన అందమైన భవంతిలో స్వామీజీకి బస ఏర్పాటు చేశారు. ఖేత్రీలోనూ స్వామీజీ ఒకటి రెండు ప్రసంగాలు చేశారు. ఎడారి పయనం స్వామీజీ ఆరోగ్యాన్ని కొంత క్రుంగదీసింది. జలుబు, జ్వరంతో ఆయన బాధపడ్డారు.
ఖేత్రీలో కొన్ని రోజులు మహారాజుతో గడపి 1898 జనవరి ఆఖరున స్వామీజీ కలకత్తా చేరుకొన్నారు. ఆయన భారతదేశ యాత్రలూ, జాగృతం గావించే ప్రసంగాలు సమాప్తమయినాయి.