నా కుమారా! ముందు నీ గది తలుపు తెరువు. బయటకు రా. నీ దృష్టిని చుట్టూ ప్రసరించు. నీ ఇంటి చుట్టూ వందలాది నిరుపేదలు, నిరాశ్రయులు ఆకలితో మలమల మాడిపోతున్నారు. నీ శక్తి మేరకు వారికి సేవలందించు.
– స్వామి వివేకానంద
ఆహ్వాన సంఘం — ఉపేంద్రుని ప్రయత్నం — స్వాగతం — పాత పరిచయస్థులు — గురుదేవుల లీలా విలాసం — విద్యే ఆవశ్యకం — విజయకృష్ణ గోస్వామితో — కరవూ, స్వాగతోత్సవ ఖర్చులూ — ఆలంబజార్ మఠం — కొందరు సోదర శిష్యుల భేదాభిప్రాయాలు — ఆలంబజార్ మఠంలో స్వాగతం — తల్లి ఒడిలో
అవిచ్ఛిన్న అవిశ్రాంతత — మనిషిని ప్రేమించిన మహామనీషి — వైష్ణవానికి వ్యతిరేకంగా — జ్ఞానమా? కర్మమా? — దక్షిణేశ్వరంలో — స్త్రీ విద్య — “వేయి జన్మలు ఎత్తుతాను” — ‘నాయనా, తలుపు తెరు!’ — రాజయోగి — గతజన్మ — ప్రేతాత్మ పట్ల సైతం కారుణ్యం — రామకృష్ణానందను పంపించడం — డార్జిలింగ్‌లో — ‘సర్వత్రా నేనే’ — కేవల భావోద్వేగాలు ఆధ్యాత్మికం కాదు — మళ్లీ దక్షిణేశ్వరంలో — ఆలంబజార్ మఠంలో — దక్షిణేశ్వర ప్రవేశ నిషేధం — గుడ్డిలో మెల్ల
ఆహ్వాన సంఘం
స్వామీజీని ఆహ్వానించడానికి జనవరి నెలాఖరులోనే కలకత్తాలో ఆహ్వాన సంఘం ఒకటి ఏర్పాటయింది. దర్భంగా రాజు ఆ సంఘ అధ్యక్షునిగాను, రాజా వినయ్ కృష్ణ దేవ్ బహదూర్ కార్యదర్శి– కోశాధికారిగా నియుక్తులయ్యారు. కాని ఒకటి రెండు రోజుల్లో రాజు తమ అశక్తతను వ్యక్తం చేసి ఆహ్వాన సంఘం నుంచి వైదొలగారు. స్వామీజీని ఆహ్వానించడంలో పూర్వాచారపరాయణులైన హిందువులు చూపిన నిరసనే ఇందుకు కారణం. “స్వామీజీ బ్రాహ్మణేతరుడు. కనుక సన్న్యాసం పుచ్చుకోవడానికి ఆయనకు అర్హత లేదు”, “సముద్రం దాటి వెళ్లిన వ్యక్తిని హైందవునిగా పరిగణించకూడదు”, “పూర్వాచార పరాయణులైన హిందువులకు నిషేధితమైన ఆహారాన్ని తింటున్నారు” వంటి నిరసనలు తలెత్తాయి. ‘వంగ వాసి’ పత్రిక కూడా స్వామీజీకి నిరసనగా వ్రాస్తూ వచ్చింది. కలకత్తా ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తీ, “వివేకానంద అనే నామ ధేయం ఆయన గురువు ఇచ్చింది కాదు. అదేకాక సన్న్యాసి కావడానికి ఒక బ్రాహ్మ ణేతరునికి అర్హత లేదు” అంటూ ఆహ్వాన సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరిం చడం కుదరదని నిరాకరించాడు. తరువాత, ‘ది ఇండియన్ మిర్రర్’ పత్రికా సంపాదకుడైన నరేంద్రనాథ్ సేన్ ఆహ్వాన సంఘానికి అధ్యక్షత వహించాడు.
ఉపేంద్రుని ప్రయత్నం
శ్రీరామకృష్ణుల శిష్యుడూ, ‘వసుమతి’ దినపత్రిక వ్యవస్థాపకుడూ అయిన ఉపేంద్రనాథ్,* స్వామీజీ రాకను కలకత్తావాసులకు తెలుపడంలో ఎంతో శ్రమ పడ్డాడు. వేలాది కరపత్రాలను ముద్రించి నగరం యావత్తూ పంచిపెట్టాడు. స్వామీజీ రాక సమయం, చోటు మొదలైన సమాచారాలు పొందుపరచబడిన ప్రకటన అట్టలను నగరంలోని ముఖ్య ప్రాంతాలలో అమర్చాడు. తమ దినపత్రికలో స్వామీజీ ఛాయాచిత్రంతో వార్తను ప్రచురించాడు. అయినప్పటికీ జనం వస్తారా అనే సందేహం తలెత్తకపోలేదు. ఎందుకంటే అది అతి శీతకాలం, రైలు రాక కూడా వేకువనే! అయినప్పటికీ ఉపేంద్ర “ప్రకటన అట్టలు అనేకం అమర్చిపెట్టాం; యాభై వేల కరపత్రాలు, పదివేల ‘వసుమతి’ దిన పత్రికలు జనానికి ఉచితంగా పంచిపెట్టబడ్డాయి. కనుక గురుదేవుల అనుగ్రహం వల్ల రేపు సియాల్ధా రైలు నిలయం జనసందోహంతో నిండిపోతుంది అని దృఢంగా నమ్ముతున్నాను” అని నొక్కి వక్కాణించాడు. అక్షరాలా అట్లే జరిగింది.
స్వాగతం
వారం రోజుల నౌకా ప్రయాణం అలసిపోయిన స్వామీజీ శరీరానికి ఒకింత విశ్రాంతి కల్పించింది. ఆంగ్లేయ శిష్యులూ, తమ ప్రేమాస్పద చెన్నై శిష్యులైన అలసింగ, నరసింహాచార్య, కిడి తమతో ఉండడం ఆయన సంతోషానికి ముఖ్యకారణమయిందని చెప్పాలి. నౌక కెప్టెన్‌తో, తోటి ప్రయాణికులతో స్వామీజీ స్నేహాన్ని పెంపొందించుకొన్నారు. తమకోసం పేర్చిపెట్టిన కొబ్బరిబోండాలను వారితో పాలుపంచుకొన్నారు.
నౌక కలకత్తాలో గంగానదిలో ప్రవేశించగానే స్వామీజీ గంగాతీరంలోని ప్రాంతాలను తమ శిష్యులకు వివరించి చెప్పారు. ఫిబ్రవరి 18 వ తేదీన నౌక బడ్జ్ బడ్జ్ నౌకాశ్రయంలో ప్రవేశించినప్పుడు కలకత్తా ఆహ్వాన సంఘానికి చెందిన ఇద్దరు సభ్యులు ముందుకొచ్చి ఆహ్వాన కార్యక్రమాలను స్వామీజీకి తెలియజేశారు.
కిడ్డర్పూర్ నౌకాశ్రయంలో నౌక లంగరు దింపగానే స్వామీజీ దిగి, తమ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో ఉదయం దాదాపు ఏడున్నరకు సియాల్ధా చేరుకొన్నారు. అప్పటికే దాదాపు ఇరవై వేల మంది అక్కడకు తరలివచ్చి ఉన్నారు. అక్కణ్ణుండి స్వామీజీని ఊరేగింపుగా గుర్రపుబండిలో తోడ్కొని వెళ్లారు. పతాకాలు, తోరణాలు, పూలదండలు, అలంకారయుతమైన కమానులతో కలకత్తా ఉత్సవ సౌందర్యాన్ని సంతరించుకొన్నది. ఇక్కడ సైతం బండికి పూన్చిన గుర్రా లను విప్పివేసి, యువకులే స్వయంగా బండిని లాగుకొని వెళ్లారు. స్వామీజీ బండిలో లేచి నిలబడి చేతులు జోడించి, రెండు వైపులా గుమిగూడి ఉన్న ప్రజలకు నమస్కరిస్తూ వెళ్లారు. అనేక బళ్లు స్వామీజీ బండిని అనుసరించాయి.
ఊరేగింపు ముందుగా హ్యారిసన్ వీథి గుండా వెళ్లింది. అక్కడ ఒక ఇంటి మేడ మీద జటధారియైన ఒక సన్న్యాసి నిలబడి రెండు చేతులూ పైకెత్తి స్వామీజీని ఆశీర్వదించాడు. స్వామీజీ కూడా తలవంచి ఆ ఆశీస్సులను స్వీకరించారు. ఆ జటధారి శ్రీరామకృష్ణుల శిష్యుడూ, బ్రహ్మసమాజ నాయకులలో ఒకరూ అయిన విజయకృష్ణ గోస్వామి. స్వామీజీ శ్రీరామకృష్ణుల వద్దకు రాకమునుపే విజయకృష్ణ గోస్వామిని బాగా ఎరుగటమే కాక ఆయన పట్ల ఎంతో గౌరవం వ్యక్తం చేసేవారు.
ఊరేగింపు హ్యారిసన్ వీథిలోని రిప్పన్ కళాశాల (ప్రస్తుతం సురేంద్రనాథ్ కళాశాల)ను చేరుకొంది. కొందరి అశ్రద్ధ కారణంగా కళాశాల ప్రవేశద్వారం వద్ద గందరగోళమూ, తొక్కిసలాటా చోటుచేసుకొన్నాయి. ఊరేగింపు కళాశాల ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోగానే, ఎవరో చెప్పడాన్ని బట్టి హఠాత్తుగా ద్వారం తెరువ బడింది. ఊరేగింపు ముందు భాగంలో నిలబడ్డ యువకులు ఇలా జరుగుతుందని ఊహించలేదు. అందువలన నిలద్రొక్కుకోలేక వారు ఒకరి మీద ఒకరుగా పడి పోయారు. పలువురికి బాగా గాయాలయ్యాయి. ఒకరిద్దరు తమ వద్దనున్న చేతి కర్రలను అడ్డంగా చాచి ఇంకా యువకులు పడిపోకుండా ఆపి, కాపాడారు. తండోపతండాలుగా ఈ మేరకు జనం తరలివస్తారని ఊహించనందువలన ఆహ్వాన సంఘం వారు బందోబస్తుకు పోలీసుల సహాయం కోరలేదు. పోలీసులు ఉండివుంటే బహుశా ఈ దుర్ఘటనను నివారించి ఉండవచ్చునేమోనని పత్రికలు వ్యాఖ్యానించాయి. అక్కడ కాసేపు ఆగి, బాగ్‌బజార్‌లోని రాయ్ పశుపతినాథ్ బోస్ బహదూర్ భవంతికి స్వామీజీని తోడ్కొని వెళ్లారు.
పాత పరిచయస్థులు
దారిలో కారన్‌వాలీస్ వీథి గుండా బండి వెళ్లింది. ఆ వీథిలోనే శ్రీరామ కృష్ణుల శిష్యుడూ, ఈశ్వరకోటిగా ఆయనచే పరిగణించబడిన వ్యక్తీ అయిన పూర్ణ చంద్రఘోష్ ఇల్లు ఉంది. అక్కడకు పోగానే స్వామీజీ బండిని ఆపమని, త్రిగుణాతీతానందతో, “పూర్ణుడికి సమాచారం తెలుపు” అన్నారు. అప్పుడు పూర్ణుడు స్నానం చేస్తున్నాడు. తడిబట్టలతోనే వచ్చి స్వామీజీకి సాష్టాంగ నమస్కారం చేశాడు. లేచి నిలబడి, “నేను రైలు నిలయానికి వచ్చాను. దూరం నుండే మిమ్మల్ని దర్శించుకొన్నాను. కార్యాలయానికి వెళ్లాలి కనుక తొందరగా తిరిగి వచ్చేశాను” అని అన్నాడు. “ఫరవాలేదు, సాయంత్రం రండి” అన్నారు స్వామీజీ.
ఈ రీతిలో ఊరేగింపు సాగింది. జయ జయ ధ్వానాలు సర్వత్రా మారుమ్రోగాయి. చివరికి పశుపతి బోస్ భవంతి వచ్చింది. ఆ భవంతి అందమైన తోరణాలతో అలంకరింపబడి ఉంది. పశుపతి ప్రభృతులు ద్వారం వద్దకు వచ్చి స్వామీజీని సవినయంగా లోపలికి తోడ్కొని వెళ్లారు. అక్కడ బ్రహ్మానంద, యోగానంద స్వాములు చేతుల్లో పూలమాలలతో వికసిత వదనాలతో నిలబడి ఉన్నారు. స్వామీజీని మాలాలంకృతులను చేయగానే స్వామీజీ, “గురుపుత్రులు గురువుకు సమానం”* అంటూ ఇద్దరికీ నమస్కరించారు. బ్రహ్మానంద స్వామి వెంటనే, “అన్నగారు తండ్రితో సమానం”* అని చెబుతూ ప్రణమిల్లారు. అప్పుడు ‘మ’ వచ్చి నమస్కరించారు. వెంటనే స్వామీజీ, “మిత్రమా!” అన్నారు. ఆ తరువాత ఒకరి వెంట ఒకరుగా వచ్చి నమస్కరించారు. ఆ సమూహంలో ఒక మూలగా ఒక బెంచీ మీద శ్రీరామకృష్ణుల యువ శిష్యులలో ఒకరైన హూట్కా గోపాల్ కూర్చుని ఉన్నాడు. అతణ్ణి చూడగానే స్వామీజీ, “ఏ హూట్కా, నేను అదే నరేన్గానే ఉన్నాను నాయనా! అక్కడ ఎందుకు దాగుకొన్నావు? ఇక్కడకు రా. వంగ భాషను నేనింకా మరచిపోలేదు” అన్నారు.
గురుదేవుల లీలా విలాసం
ఈ విధంగా పది నిమిషాలు గడచిపోయాయి. పశుపతి స్వామీజీని మేడ మీదకు తోడ్కొని వెళ్లాడు. అక్కడ గిరీష్, స్వామీజీకి పూలమాల వేసి వంగి నమస్క రించబోయాడు. స్వామీజీ వెంటనే ఆతడి చేతులు పుచ్చుకొని ఆపి, “ఏం చేస్తున్నారు జి.సి.!* మీరు నాకు నమస్కరిస్తే నాకే దోషం వాటిల్లుతుంది. మీ రామకృష్ణులకు ప్రణమిల్లి (హనుమంతునిలా) ‘జై రామ్’ అంటూ సముద్రాన్ని దాటి వెళ్లివచ్చాను” అన్నారు. ఆ మాటలు విని గిరీష్ ఎంతో సంతోషించాడు.
ఆ తరువాత స్వామీజీ ‘మ’ తో మాట్లాడనారంభించారు: “మాస్టర్! ఈ విజయాలకంతటికీ నేను పరికరమాత్రుణ్ణి. ఆయనే నన్ను పంపించారు. గురు దేవులు నాకు గుర్తింపు నిచ్చారు. అది తెలియజేసి మాతృదేవిని అనుమతి, అనుజ్ఞ వేడుకొన్నాను. మాతృదేవి ఆశీస్సులు పొందగానే ఆటంకాలన్నింటినీ సులభంగా దాటి వెళ్లగలిగాను; పాశ్చాత్య దేశాలలోని మేధావులు, విజ్ఞానవేత్తల లాంటి వేల మందిలో నేను అత్యధికంగా శ్లాఘింపబడ్డాను. అంతా గురుదేవుల లీలా విలాసమని అనుభవపూర్వకంగా గ్రహించాను. మాట్లాడవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి, మరో సందర్భంలో చెబుతాను.
విద్యే ఆవశ్యకం
“అయితే ఇప్పుడు నా అభిప్రాయం ఏమిటో తెలుసా? మన దేశంలో మత ప్రచారం కావలసినంత జరిగింది. తక్షణ ఆవశ్యకత విద్య. మనిషికి ముఖ్యంగా కట్టుకోవడానికి బట్టలు కావాలి, తినడానికి ఆహారం కావాలి, చదువనూ వ్రాయనూ నేర్చుకొని జీవితం గడపడానికి కాస్త సంపాదించుకోవాలి; దానికి మార్గం చూపాలి, అదే భారతదేశానికి నేడు ముఖ్యావసరం. మాస్టర్! పాశ్చాత్య దేశాల సిరిసంపదలు నా కళ్ల బడినప్పుడల్లా మాతృదేశ దారిద్ర్య స్థితి అశ్రువులను రప్పించింది. వారి ఐశ్వర్య విభవం నాకు మేఘదూత్య గీతాలనే* జ్ఞాపకానికి తెచ్చింది – నాలుగు వైపులా మెరుపుల్లాంటి సౌందర్యరాశుల సమూహం, ఆకాశహర్మ్యాల వరుసలు, ఇళ్లలో ఉల్లాస ఉత్సాహాలు! నృత్యాలూ పాటలూ! విశాలమైన వీథులు! అంతా స్వచ్ఛతే! మన దేశంలోనే సర్వత్రా చెత్తాచెదారం, దుర్వాసన, జీర్ణవస్త్రధారులైన మనుషులు – ఐశ్వర్యరహిత, దుర్బల, నిరక్షరాస్యులైన స్త్రీలూ పురుషులూ! వీరికి సేవలు ఒనరించేదే భారతదేశానికి ఆవశ్యకమైన మతం అని నా అభిప్రాయం. ‘పస్తున్న కడుపులో మతం ప్రవేశించదు’ అని గురుదేవులు చెప్పేవారు కాదా! ఈ మతాన్ని ప్రచారం చేయడమే నా లక్ష్యం.
“పాశ్చాత్య దేశాల దురాకర్షణ లన్నింటి నుండి గురుదేవులు నన్ను రక్షిం చారు. ఆశ్చర్యం ఏమిటంటే, కొందరు అప్పటికే గురుదేవుల భావనలను తెలుసు కొని ఉన్నారు; కొందరు కలలో ఆయన అనుగ్రహం పొంది ఉన్నారు. నేను అక్కడ స్త్రీలను తల్లిగా, సోదరీమణులుగానే గాంచాను. వారూ అదే తీరులో నన్ను ఎంచి సేవలందించారు. అది భోగభూమి. అక్కడ ఆధ్యాత్మిక ప్రచారం ఎంతో అవసరం. ఇక్కడ మన దేశంలోనో అక్కడి విజ్ఞాన విద్య, ఉదాత్త చింతనలు, సామాజిక స్వాతంత్ర్యం అవసరమై ఉన్నాయి. వీటిని ఆధ్యాత్మిక ప్రాతిపదిక మీద ప్రచారం చేయాలి.”
అప్పుడు స్వామి బ్రహ్మానంద వచ్చి, “నరేన్, టీ కోసం ఏర్పాట్లు చేశారు” అని స్వామీజీతో చెప్పారు. అందుకు స్వామీజీ, “రాజా! వచ్చే దారిలో విజయ కృష్ణులను చూశాను. మఠంలో ఆయనకు బస ఏర్పాటు చేసివుండవచ్చు కదా!” అన్నారు. అందుకు బ్రహ్మానంద, “ఆయనకు ప్రస్తుతం శిష్యులూ, శిష్యురాండ్రూ బోలెడుమంది ఉన్నారు. మఠంలో ఉన్నవారికే పడుకోవడానికి జాగా లభించడం కష్టం. ఆయన ఒంటరిగా బస చేస్తే సంగతి వేరు” అన్నారు. “త్వరలో ఒక రోజు ఆయనను కలుసుకోవాలి” అన్నారు స్వామీజీ.
సాయంత్రం 4 గంటలకు స్వామీజీ, ఆంగ్లేయ శిష్యులు కాశీపూర్‌లోని బాబా గోపాల్‌లాల్ సీల్ అనే వ్యక్తి అందమైన గృహోద్యానానికి తోడ్కొనిపోబడ్డారు. చెన్నై శిష్యులకు ఆలంబజార్ మఠంలో బస ఏర్పాటు చేశారు.
విజయకృష్ణ గోస్వామితో
బ్రహ్మానంద స్వామితో ప్రస్తావించినట్లే స్వామీజీ ఒక రోజు విజయకృష్ణ గోస్వామి ఇంటికి వెళ్లారు. స్వామీజీ వెళ్లగానే వారిద్దరూ పరస్పరం చాలాసేపు సాష్టాంగ నమస్కారాలు చేసుకొన్నారు. ఆ తరువాత విజయ కృష్ణ గోస్వామి, “జై రామకృష్ణ! మీ లోపల నుండే గురుదేవులు సమస్తం చేస్తున్నారు. నేను ఢాకాలో పూజ చేసు కొంటున్నాను. నా ముందు ఆయనను సజీవమూర్తిగా గాంచాను. నేను ఆయ నను స్పృశించాను కూడా. దక్షిణేశ్వరానికి వెళ్లినప్పుడు పంచవటిలోను, ఆయన గదిలోను దర్శనం పొందాను” అన్నారు. అందుకు స్వామీజీ, “అవును. నేనూ పాశ్చాత్య దేశాల్లో ఈ విధంగా పలు దర్శనాలు పొందాను. నాలో ఉండి ఆయనే కార్యాలు నిర్వర్తిస్తున్నారు, నేను కేవలం పరికరమాత్రుణ్ణని గ్రహించాను” అన్నారు.
ఈ విధంగా సంభాషణ కొనసాగింది. స్వామీజీ తమ కార్యోద్యమ పథకాల నన్నీ ఆయనతో చెప్పి, “మీరు పెద్దవారు, గురువుకు సమానంగా స్తుతించదగిన వారు. నా పథకాలన్నీ సత్వరమే సఫలీకృతం కావాలని ఆశీర్వదించండి” అన్నారు. అందుకు విజయకృష్ణ గోస్వామి, “అనుకొన్నది సాధించగల సమర్థులు మీరు. మీరు అనుకొన్నదంతా జరుగుతుంది. ఈ మీ పథకాలు మీ భావనలు కాదు; నిజానికి వీటిని మీలో జొప్పించిన వారు గురుదేవులే” అన్నారు.
ఈ రీతిలో వారిద్దరూ చాలాసేపు గురుదేవుల, పాత రోజుల జ్ఞాపకాలలో మునిగిపోయారు.
ఫిబ్రవరి 28వ తేదీ స్వామీజీకి రాజా సర్ రాధాకాంత్ దేవ్ బహద్దూర్ రాజభవనంలో బహిరంగ స్వాగతోత్సవం నిర్వహించారు. భవనంలో ప్రవేశించ డానికి ఉచిత అనుమతి పత్రాలు ముందుగానే పొందవలసి ఉంది. వేలమంది ప్రజలు అక్కడ సమావేశమయ్యారు. స్వాగత పత్రాలు చదివి, రజత పేటికలో అమర్చి సమర్పించారు. స్వామీజీ ప్రత్యుత్తరంగా ప్రసంగించారు. ఈ ఉత్సవా నంతరం ఆయన కలకత్తాలో కొన్ని ప్రసంగాలు చేశారు.
కరవూ, స్వాగతోత్సవ ఖర్చులూ
ఈ స్వాగతోత్సవాలూ, పటాటోపాలూ ఏవీ స్వామీజీకి నచ్చలేదు. అయినప్ప టికీ జనులలో జాగృతి కలిగించడానికి ఇవి అవసరమని ఆయనకు తెలియక పోలేదు. ఆ కారణంగానే ఆయన ఈ బ్రహ్మాండమైన స్వాగతోత్సవాలకు అంగీకరించారు. కానీ ఈ ఉత్సవాలను కొందరు మరో దృక్కోణంలో చూడనే చూశారు. ఆ సమయంలో వంగ దేశంలో తీవ్రమైన కరవుకాటకాలు తాండవిస్తున్నాయి. “ఈ సమయంలో ఈ మహోత్సవాలూ, వైభోగాలూ అవసరమా?” అని అక్కడక్కడా కొన్ని విమర్శలు తలెత్తాయి. ఒక రోజు స్వామీజీ బాల్యస్నేహితుడైన ప్రియనాథ్ సిన్హా దీనిని గురించి “స్వామీజీ! మీ రొక సాధువు, మీ స్వాగతోత్సవాలకై డబ్బు వసూలు చేశాం. మీరు కలకత్తా రాక మునుపు అక్కడ నుండి తంతి పంపి, ‘మన దేశంలో ప్రస్తుతం కరవు తాండవిస్తున్నది. కనుక నన్ను ఆహ్వానించడానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయవద్దు. మొత్తం ధనాన్ని కరవు నివారణ నిధికి ఇచ్చి వేయండి’ అని అంటారని భావించాను. కానీ మీరు ఆ విధంగా ఏమీ చేయలేదు. ఎందుకు?” అని స్వామీజీనే అడిగాడు.
స్వామీజీ : కావాలని నేను అలా చేయలేదు. జనంలో జాగృతి కలగాలని ఆశించాను. ఎందుకు తెలుసా? జాగృతి చెందకుండా జనం భగవాన్ శ్రీరామ కృష్ణులను ఎలా తెలుసుకొంటారు? ఇది నా కోసమా జరిగింది? ఆయన కదా వీటి వలన సుప్రసిద్ధులవుతున్నారు! ఆయనను గురించి తెలుసుకోవడానికి ప్రజల మనస్సులో ఎంత ఆసక్తి జనించింది! ఇప్పుడు క్రమక్రమంగా ఆయనను గురించి తెలుసుకొంటారు. దాని వలన దేశానికి శ్రేయస్సు కలుగదా? లోకశ్రేయస్సుకై అవతరించిన ఆయనను తెలుసుకోకుండా జనులకు ఏ విధంగా సంక్షేమం కలుగు తుంది? ఆయనను సరిగా అవగతం చేసుకొంటే మనుషులు రూపొందుతారు. అటువంటి మనుషులు నివసించే దేశంలో కరవునూ, పస్తులనూ పారద్రోలడానికి ఎంతకాలం పడుతుంది? అందుకే కలకత్తాలో జాగృతి కలగాలని అభిలషించాను. తద్ద్వారా ప్రజలు ముందుగా శ్రీరామకృష్ణుల సందేశాన్ని అర్థం చేసుకొంటారు. లేకపోతే ఇన్ని ఆడంబరాలు నా కెందుకు? ఒక కాలఘట్టంలో నీ ఇంటికి వచ్చి అందరమూ కలిసి ఆడుకొన్నామే, అంతకన్నా నేను పెద్దవాణ్ణి అయిపోయానా ఏమిటి? ఆనాడు ఉన్నట్లే కదా నేడూ ఉన్నాను. ఎందుకు? నాలో ఏదైనా తేడా ఉందా? చెప్పు.”
“తేడా లేదు” అని ఆ మిత్రుడు బయటకు చెప్పినా లోలోపల, ‘మీరిప్పుడు దివ్యత్వం సంతరించుకొన్నారు’ అనుకొన్నాడు.
స్వామీజీ కొనసాగించారు: “మన దేశానికి సంబంధించినంతవరకు కరవు అన్నది ఒక నయం కాని వ్యాధిగా పరిణమించింది. పాశ్చాత్య దేశాలలో ఎక్కడైనా ఈ విధంగా ఉందా? లేదు. ఎందుకు? ఎందుకంటే అక్కడ మనుషులు జీవిస్తు న్నారు; ఇక్కడో జీవచ్ఛవాలే జీవిస్తున్నాయి. శ్రీరామకృష్ణులను గురించి చదివి, ఆయనను అర్థం చేసుకొని, స్వార్థాన్ని త్యజించడం వారు ముందుగా నేర్చుకో వాలి. ఆ తరువాతే కరవు నివారణకైన సముచిత ప్రయత్నాలు చేయబడతాయి. నేను క్రమక్రమంగా ఆ ప్రయత్నంలో పాల్గొనాలనుకొన్నాను. దానిని మీరే చూడబోతారు.”
స్వాగతాలనూ, వైభవాలనూ స్వామీజీ ఈ దృక్పథంతోనే చూశారు. కానీ కలకత్తా ఆహ్వానానంతరం స్వామీజీ మనస్సు గాయపడే రీతిలో, ఆహ్వాన సంఘంలోని కొందరు, స్వాగత మహోత్సవాలకైన ఖర్చుల ఖాతాను ఆయనకు పంపించి, దానిని స్వీకరించమని ఆయనను అడిగారు. స్వామీజీ దీనిని నాగేంద్ర నాథ్ అనే భక్తునితో చెప్పి, “ఈ స్వాగతాలు నా కెందుకు? నేను అమెరికా నుండి బళ్ల కొద్దీ ధనం తీసుకొని వచ్చాను, నా పేరుప్రతిష్ఠలు ప్రచారం చేయడానికి ఈ స్వాగతాలను ఎదురుచూశాను. కనుక ఈ ఖర్చునూ నేనే భరించాలని వారు భావిస్తున్నారు. నేను ఏమన్నా ఒక ప్రదర్శనీయ వస్తువునా? లేక ఐంద్రజాలి కుణ్ణా? వాళ్లు ఏమనుకొంటున్నారు!” అని విచారం వ్యక్తం చేశారు. కానీ ఇదంతా తలపోసి మనస్సులో గందరగోళం చోటు చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు, అందుకు ఆయనకు సమయమూ లేదు. సమస్తాన్నీ భగవదాయత్తం చేసి ఆయన తమ కార్యాలను కొనసాగించారు.
ఆలంబజార్ మఠం
స్వామీజీ భారతదేశం నుండి బయలుదేరినప్పుడు వరాహనగరంలో నిర్వ హింపబడుతూన్న రామకృష్ణ మఠం ప్రస్తుతం ఆలంబజార్కి మార్చబడింది. వరాహనగరంలో నివసించిన యువ శిష్యుల జీవన సరళితో ఆకర్షితులైన పలువురు యువకులు అక్కడ చేరారు; ప్రారం భంలో 11 మందిగా ఉన్న సన్న్యాసుల సంఖ్య 23 గా పెరిగింది. వరాహనగర మఠంలో అంతమంది బసచేయడానికి చోటు చాలనందున 1892 ఫిబ్రవరిలో వారు ఆలంబజార్కు మఠాన్ని మార్చారు.
ఆలంబజార్ మఠం కూడా ఏ విధంగానూ వరాహనగర మఠానికి తీసిపో లేదు. దక్షిణేశ్వరం నుండి దాదాపు అరమైలు దూరంలో ఉన్న ఇది కూడా ‘దయ్యాల కొంప’ గానే పేరు పొందింది. ఈ కట్టడంలో దయ్యాలు వసించడం గురించిన కథలు కొన్ని ప్రచారంలో ఉన్నాయి. అయినప్పటికీ ఈ సన్న్యాసులు ఇవ్వగలిగిన అద్దెకు, పెద్ద కట్టడంగా ఇదే లభించింది. కనుక దయ్యాలు వసిస్తూన్నా, ఒక వంక తాము కూడా నివసించవచ్చునని నిశ్చయించుకొని ఆ యువ సన్న్యాసులు మఠాన్ని ఇక్కడికి మార్చారు.
1892 ఫిబ్రవరి నుండి 1898 ఫిబ్రవరి వరకు మఠం ఆలంబజార్లో నిర్వహింపబడుతూ వచ్చింది. ఈ ఆరేళ్లలో మఠం తన పరిణామంలో ఒక ముఖ్యమైన అంగ వేసింది. ఉన్నచోటే తెలియని ‘నరేన్’ స్వామి వివేకానందగా అమెరికాలో జాగృతి కలిగిస్తూ ఉండడం ఈ రోజుల్లో సోదర శిష్యులకు తెలియ వచ్చింది. “చికాగోలో మహా తరంగాలను లేవదీశాడు వివేకానంద” అంటూ వార్తాపత్రికలలో వచ్చిన వార్తలను ఆసక్తితో చదివి పరమానందభరితులయ్యారు ఆ సన్న్యాసులు. గురుదేవుల మహాసమాధి తదనంతరం దాదాపు ఆరేళ్లుగా తపస్సు, తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక సాధనలు, అధ్యయనాలతో గడిపిన వారి జీవితం ఇప్పుడు క్రమంగా సమాజ దృష్టిని ఆకర్షింపసాగింది.
కొందరు సోదర శిష్యుల భేదాభిప్రాయాలు
ఈ సమయంలోనే స్వామీజీ 1894 లో మార్చ్ 19 వ తేదీన సోదర శిష్యులకు వ్రాసిన మొదటి లేఖ, ఏప్రెల్‌లో వారికి అందింది. దాని తరువాత మరికొన్ని లేఖలు వచ్చాయి. ఈ లేఖల్లో ఒక నూతన నరేన్‌ను వాళ్లు చూశారనే చెప్పాలి. ఆయన తెలిపిన సేవ, ధర్మం లాంటి కొన్ని అభిప్రాయాలు వారికి క్రొత్తగా అనిపిం చాయి. స్వామీజీ ఈ అభిప్రాయాలను సోదర సన్న్యాసులలో కొందరు అచ్చం అట్లే స్వీకరించారు, కొందరు ప్రతిఘటించారు, మరికొందరు ఆయన గురుదేవుల మార్గం నుండి వైదొలగుతూన్నట్లుగా భావించారు. స్వామీజీ లేఖలలోను, ప్రసంగాలలోను మూడు ముఖ్యమైన మార్పులను వారు గమనించారు.
- స్వామీజీ పాశ్చాత్య దేశాలలో సామాన్యంగా అద్వైత వేదాంతాన్ని బోధిం చారు. అద్వైతం జనసామాన్యానికి సముచితమైనది కాదు; విశిష్ట అర్హతలు గల అతికొద్దిమందికే సముచితమైనదని శ్రీరామకృష్ణుల భావన. కనుక దీన్లో స్వామీజీ గురుదేవుల నుండి వైదొలగుతున్నారేమోనని సోదర శిష్యులకు సంశయం కలి గింది.*
- లేఖలలో శ్రీరామకృష్ణుల గురించీ, మాతృదేవి గురించీ పుటలు పుట లుగా వ్రాస్తూన్న స్వామీజీ, ప్రసంగాలలో వారిని గురించి ప్రస్తావించలేదు.
- వారసత్వ సన్న్యాస మార్గాదర్శం నుండి వైదొలగి, ‘సేవ–ధర్మం’, అంటే మానవాళి సేవలో సన్న్యాసులు పాలుపంచుకోవాలనే భావనలు వారిని గందర గోళంలో ముంచెత్తాయి.
ఈ సందేహాలతో వారు శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తుడైన గిరీష్‌చంద్ర ఘోష్‌ను కలుసుకొన్నారు. ఆయన దీనిని గురించి స్వామీజీకి వ్రాశారు. స్వామీజీ ఇందుకు జవాబుగా వ్రాసిన లేఖ వారి సందేహాలను కొంతమేరకు నివృత్తి చేసింది.
అయినప్పటికీ సోదర సన్న్యాసులచే ఈ క్రొత్త ఆదర్శాలను స్వీకరింప జేయడం అంత సులభతరం కాలేదు. కొన్ని సమయాల్లో వారిలో కొందరికీ, స్వామీజీకీ మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఈ రోజుల్లో ఒకసారి స్వామీజీ, దేవేంద్ర నాథ్ టాగూర్‌ను కలుసుకొన్నారు. ప్రారంభకాలంలో స్వామీజీ మార్గదర్శకులలో ఆయన ఒకరుగా విరాజిల్లడం ఇంతకు క్రితమే చూశాం. ఆ తరువాత దేవేంద్ర నాథ్ టాగూరు వద్ద నుండి ప్రియనాథ్శాస్త్రి అనే వ్యక్తి మఠానికి వచ్చి స్వామీజీతో అనేక విషయాల గురించి చర్చించాడు. చివరగా ఆతడు స్వామీజీతో, “మీ అభి ప్రాయాలన్నింటిని మేం అంగీకరిస్తున్నాం. కాని మీరు పేర్కొనే అవతార భావనను మాత్రం మేం అంగీకరించలేం” అని చెప్పాడు. అందుకు స్వామీజీ, “కానీ శ్రీరామ కృష్ణులు అవతార పురుషులని నేను బోధించలేదే!” అన్నారు.
కానీ స్వామీజీ వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం సోదర సన్న్యాసులలో భేదాభిప్రాయాలను కల్పించింది. స్వామీజీ చెప్పినప్పుడే అక్కడ ఉన్న స్వామి యోగానంద కళ్లు ఎర్రబారగా, కోపంతో ప్రక్కనున్న వ్యక్తితో, “ఏమిటి, నరేన్ ఏం చెబుతున్నాడు!” అన్నాడు. ప్రియనాథ్ వెళ్లిపోయిన తరువాత అతడు స్వామీజీతో, ఆయన మాటకు తీవ్రంగా నిరసన వ్యక్తంచేసి, “ఆయన అనుగ్రహంతోనే నువ్వింత గొప్పవాడివయినావు” అన్నాడు. స్వామీజీకి ఇదంతా ఒక వేడుకగానే తోచింది. ఆయన శ్రీరామకృష్ణులను అర్థం చేసుకొన్నంత మరెవరు అర్థం చేసుకొ న్నారు! అందుకే కదా ఆయన శ్రీరామకృష్ణులను, “అవతారాలలో వరిష్ఠులు” అని వ్రాశారు!* దానిని అర్థం చేసుకోకుండా ప్రతిఘటించే యోగానందతో ఆయనకు తమాషా చేయాలనిపించింది. కనుక నవ్వుతూ ఆతడితో, “ఆయన కారణంగా నాకు గొప్పతనమా? నా వల్లనే ఆయనకు ఘనత. నేను లేకపోతే ఆయనను ఎవరు లోకప్రసిద్ధులు గావించి ఉండేవారు?” అన్నారు. ఇది యోగానంద కోపమనే అగ్నికి ఆజ్యం పోసింది. అతడు కోపంగా, “శ్రీరామకృష్ణులు లేకుండా నువ్వు లేవు. ఆయన లేకుండా మహా అయితే నీ బెనర్జీలా ఒక పెద్ద న్యాయవాదివి అయివుండే వాడివి, అంతే” అన్నాడు. ఈ విధంగా వాదోపవాదాలు కొనసాగాయి.
శ్రీరామకృష్ణుల గురించి స్వామీజీ ఒకసారి తమ సోదర సన్న్యాసులతో, “మీరు అర్థం చేసుకొన్న దానికన్నా ఆయన ఎంతో లోతైనవారు” అన్నారు. స్వామీజీ కూడా అంతే! తక్కినవారు అర్థం చేసుకొన్న దానికన్నా ఆయన బాగా లోతైనవారు. ఈ రెండు లోతులను ఉన్నది ఉన్నట్లు అర్థం చేసుకోవడం సాధ్యం కానందుననే వివాదాలూ, సమస్యలూ తలెత్తాయి. కానీ స్వామీజీ విస్తృతంగా శ్రీరామకృష్ణుల గురించి ప్రచారం చేసివుంటే, ‘శ్రీరామకృష్ణ మతం’ అన్నది ఆవిర్భ వించి ఉండడం తథ్యం. అలాంటి స్థితిని స్వామీజీ సైతం ఇష్టపడలేదు, శ్రీరామ కృష్ణులూ ఆమోదించలేదు. ఆ కారణంగానే స్వామీజీ ఇలాంటి ఏర్పాటును స్వీక రించారు. కాని నాడు ఆయన సోదర సన్న్యాసులలో కొందరు దానిని అంగీకరించ లేదు. కాలక్రమంలో మెల్లగా వారు స్వామీజీ భావనలను అంగీకరించారు.
ఆలంబజార్ మఠంలో స్వాగతం
ఈ పరిస్థితిలో స్వామీజీ ఇప్పుడు మఠానికి తిరిగి వస్తున్నారు. అఖండా నంద, రామకృష్ణానంద మఠం వాకిలికి మామిడాకు తోరణాలు, అరటిచెట్లు కట్టారు; వాకిలి వద్ద ఒక కుండలో నీరు పోసి దాన్లో కొన్ని మామిడాకులు వేసివుంచారు. ఈ విధంగా నిరాడంబరంగా స్వామీజీని వారు ఆహ్వానించారు.
మామూలుగా స్వామీజీ పగటి పూట గోపాల్‌లాల్ ఇంట్లో బస చేశారు. సాయంకాలం కాగానే అక్కడ నుండి శిష్యులతో నడిచి మఠానికి వచ్చేశారు. రాగానే తమ దుస్తులన్నీ విడిచివేసి, కౌపీనధారిగా ఉండేవారు. ఆయన చెన్నై శిష్యులతో గుడ్విన్ కూడా మఠంలోనే బస చేశాడు. చెన్నై శిష్యులలో ఇద్దరు విడిగా వండుకొని భోజనం చేసేవారు. గుడ్విన్, కిడీ అందరితోనూ కలసి భోజనం చేసేవారు. “శంకర శివ వ్యోం వ్యోం భోలానాథ్” అంటూ పాడుతూ ఒక పిల్లవాని మాదిరి గుడ్విన్ నాట్యం చేయడం కనులపండువగా ఉండేది.
స్వామీజీ ప్రప్రథమంగా మఠంలో పారిశుద్ధ్యం గురించి ప్రసంగించారు. తెర్లేలా వేడిచేసి, వడగట్టిన నీటిని ఉపయోగిస్తున్నారా అని ప్రశ్నించారు. మఠంలో ఉపయోగించే వడపోత పరికరాన్ని చూశారు. ఈ ప్రసంగమే కాకుండా కథలు, తమ జీవిత సంఘటనలు గురించి మాట్లాడారు. నిత్యం ఉదయం 8 నుండి 9 గంటల దాకా గీత లేదా ఉపనిషత్తు తరగతులు నిర్వహించేవారు. అందరు బ్రహ్మచారులూ, సన్న్యాసులూ ఆ తరగతులలో పాల్గొనేవారు.
తల్లి ఒడిలో
త్వరలోనే ఒక రోజు తమ తల్లిని చూడడానికి స్వామీజీ వెళ్లారు. ఉప్పొంగే ఉద్వేగాన్ని బలవంతంగా అణచుకొని తల్లి ఒడిలో కాసేపు ఒదిగిపోయారు. పాశ్చాత్యంలో ఘనవిజయాన్ని సాధించిన స్వామి వివేకానంద కొన్ని క్షణాలపాటు నిష్క్రమించారు. ఆ ఉదాత్త మాతృమూర్తి ఒడిలో కొన్ని క్షణాలు వ్రాలిపోయింది నరేన్ మాత్రమే! ఎక్కణ్ణుంచి ఆ అశ్రువులు వచ్చాయో తెలియరాలేదు – “అమ్మా, నీ చేత్తో కాస్త తినిపిస్తావా?” అంటూ కన్నీరు మున్నీరయ్యారు స్వామీజీ.
కొన్ని నిమిషాలు మన మనోనేత్రంతో ఆ దృశ్యాన్ని చూడగలిగితే, ఉద్వేగం అక్కడ పొంగిపొర్లడం దర్శనమిస్తుంది. ఎన్ని యాతనల మధ్య, ఎట్టి పరిస్థితులలో తమ నమ్మకానికి పెట్టని గోడ లాంటి కుమారుణ్ణి ఒక అత్యున్నత ఆదర్శం కోసం అంకితం చేసింది ఆ మహనీయ మాతృమూర్తి! మరు పూట తిండికి ఏం చేయాలో పాలుపోని దుర్భర స్థితిలో, సంపాదించి కాపాడుతాడని నమ్ముకొన్న కుమారునితో, “నా గురించి, కుటుంబం గురించి నువ్వు కలత చెందవద్దు. చేగొన్న ఆదర్శాన్ని కచ్చితంగా ఆచరించి చూపు!” అని చెప్పి దృఢ సంకల్పంతో ఆ కుమారుణ్ణి లోకం కోసం అంకితం చేసిన ఆ మాతృమూర్తి త్యాగం సాటిలేనిది. ఆమె ఒనరించిన ఈ త్యాగాన్ని స్వామీజీ ఎన్నడూ మరచిపోలేదు. తమ హృద యోద్వేగాలనన్నీ వచనాలలోకి తర్జుమా చేసి ఖేత్రీ మహారాజుకు లేఖ రూపంలో వ్రాశారు:
“మీరు ఇప్పటికే ప్రతి నెలా నా తల్లికి ఇస్తూ వస్తున్న రూ. 100/ – ఆమె ఖర్చులకు సరిపోతుంది. దీనితో పాటు నా కోసం ఒక రూ. 100/ – కూడా కలిసి పంపించండి. నా రుగ్మత కారణంగా ఖర్చులు బాగా పెరిగిపోయాయి. నా విష యంలో, అంటే నా నిమిత్తం అయ్యే ఖర్చుకు సంబంధించినంత వరకు, నేను ఎక్కువ కాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మహా అయితే ఇంకా కొన్ని సంవత్స రాలు మాత్రమే బ్రతుకుతాను. ఇంతమాత్రం చేస్తేనే నేను దానిని ఆనందంతో స్వీకరిస్తాను. మరొకటి కూడా మిమ్మల్ని కోరుకొంటున్నాను. నా తల్లికి ఇస్తూ వస్తున్న పైకం నిరంతరంగా అందేటట్లు ఏర్పాట్లు చేయగోరతాను. నా మరణా నంతరమూ ఆమెకు అది అందాలి. కారణాంతరాల వలన నా పట్ల గల మీ కరుణ అడుగంటినప్పటికీ, ఎప్పుడో పేద సాధువు ఒకరి పట్ల మీరు చూపిన ప్రేమను ఉద్దేశించి, నా తల్లికి అందిస్తూవున్న పైకాన్ని మాత్రం ఆపివేయవద్దని విన్నవించుకొంటున్నాను.”*
అవిచ్ఛిన్న అవిశ్రాంతత
స్వామీజీకి విశ్రాంతి లభిస్తుందనే ఉద్దేశంతోనే ఆయనకు గోపాల్‌లాల్ ఇంట్లో బస ఏర్పాటు చేశారు. కానీ విశ్రాంతి మాత్రం మృగ్యం. రోజూ ఒకసారైనా ఆయన ఆలంబజార్ మఠానికి వెళ్లవలసి వచ్చింది. రెంటికీ మధ్య దాదాపు మూడు మైళ్ల దూరం ఉంది; సామాన్యంగా ఆయన కాలినడకనే వెళ్లివచ్చేవారు. కొన్ని సమయాలలో గుర్రపు బండిలో వెళ్లినా అది సౌలభ్యంగా ఉండేది కాదు.దీనితోపాటు ఆయన శ్రీరామకృష్ణ భక్తుల ఆహ్వానాన్ని మన్నించి వారి ఇళ్లకూ వెళ్లవలసి వచ్చేది. ఈ ప్రయాణాలతో బాటు, తమను దర్శింపవచ్చే వారితో అవిరామంగామాట్లాడవలసివచ్చేది.
మనిషిని ప్రేమించిన మహామనీషి
ఈ రోజుల్లో జరిగిన ఒక సంఘటన స్వామీజీ మానవత్వానికి అద్దంపడుతుంది. ఒక రోజు గోరక్షణ సంఘ ప్రచారకుడు ఒకరు స్వామీజీనిచూడడానికి లోపలికి వచ్చాడు. అతడు కాషాయం తలపాగా ధరించి, దాదాపు ఒక సన్న్యాసి వేషధారణలో ఉన్నాడు. అతడు ఉత్తర భారతదేశస్థుడని తెలియవచ్చింది. అతడి రాకను తెలియజేయగానే స్వామీజీ అతణ్ణి చూసే నిమిత్తం చావడిలోకి వచ్చారు.ప్రచారకుడు స్వామీజీకి నమస్కరించి, తన చేతిలోనున్న గోమాత చిత్రాన్ని ఇచ్చాడు. స్వామీజీ దానిని అందుకొని కాసేపు చూసి, పక్కనున్న వ్యక్తికి ఇచ్చేశారు. తరువాత ఇద్దరి మధ్య క్రింది విధంగా సంభాషణ జరిగింది.
స్వామీజీ : మీ సంఘ లక్ష్యం ఏమిటి?
ప్రచారకుడు : కసాయివాని కబంధహస్తాల నుండి మేం గోమాతలనురక్షిస్తాం. వాటి కోసం కొన్ని వైద్యశాలలను కూడా స్థాపించాం. వ్యాధిపీడితమైన, వట్టిపోయిన, బలహీనమైన గోవులను, కసాయివాళ్ల వద్ద నుండి కొనితేబడినగోవులను ఇక్కడ ఉంచి పోషిస్తాం.
స్వామీజీ : అది నిజంగా మంచి పనే. ఖర్చులకు మీకు డబ్బు ఎక్కణ్ణుండి వస్తుంది?
ప్రచారకుడు : మీబోటి గొప్పవారు ఇచ్చే విరాళాల వలన సంఘ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
స్వామీజీ : ఇంతవరకు ఎంత డబ్బు ఖర్చుచేసి ఉంటారు?
ప్రచారకుడు : మార్వాడీలు ఇందుకు ఎంతో సహాయం చేశారు. ఈ మంచి పనికి వారు పెద్ద మొత్తం ఇచ్చారు.
స్వామీజీ : ఇప్పుడు మధ్య భారతదేశంలో భయంకరమైన క్షామం విలయతాండవం చేస్తున్నది. ఆ క్షామంలో పస్తులతో మలమలమాడి తొమ్మిది లక్షలమంది దుర్మరణం చెందారని ప్రభుత్వం ప్రకటించింది! ఈ క్షామంలో ప్రజలను రక్షించడానికి మీ సంఘం ఏదైనా సహాయం అందించిందా?
ప్రచారకుడు : మేం కరవు కాటకాల పీడితులకు ఎలాంటి సహాయం చేయడం లేదు. గోమాతల సంరక్షణకే మా సంఘం స్థాపించబడింది.
స్వామీజీ : కరువుతో వేలమంది సోదర సోదరీమణులు మృత్యువు కోరల్లో చిక్కుకొనిపోయి ఉండగా, మీ వద్ద తగినంత ధనం ఉండీ వారికి ఈ దుర్భర పరిస్థితిలో పిడికెడు అన్నం పెట్టడం తక్షణ కర్తవ్యమని మీకు తోచలేదా?
ప్రచారకుడు : అది మేం చేయనవసరం లేదు. వారి పాపకర్మ ఫలితంగా ఈ కరవు దాపురించింది. కర్మకు తగ్గ ఫలం వచ్చింది, అంతే!
ప్రచారకుని మాటలు వినడమే ఆలస్యం, స్వామీజీ విశాల నేత్రాలు నిప్పులు కురిపిస్తున్నట్లు కనిపించాయి. ఆయన ముఖం ఎర్రబారింది. కానీ ఉద్వేగాన్ని బల వంతంగా అణచుకొని స్వామీజీ ఇలా అన్నారు: “తోటి మానవుల పట్ల సానుభూతి లేని ఇటువంటి సంఘాలు పశుపక్ష్యాదులకు అన్నరాశులు పెట్టి పోషిస్తూ, తమ సోదరులు ఆకలి మంటలతో అలమటించి చస్తూండగా గుడ్లప్పగించి చూస్తున్నాయి. వారి ప్రాణాలు కాపాడడానికి పట్టెడన్నం పెట్టని ఇలాంటి జీవకారుణ్య సంఘాలపట్ల నాకు కించిత్తు కూడా నమ్మకం లేదు. సానుభూతి అంతకన్నా లేదు. కేవలం గోవులను మాత్రమే సంరక్షించడం వలన సమాజానికి శ్రేయస్సు ఒనగూరుతుందనడం పిచ్చివాడి ప్రేలాపన. మానవులు వారు చేసుకొన్న కర్మ వలన చస్తున్నారని భావిస్తున్నారా మీరు? అటువంటప్పుడు ఈ లోకంలో పెనగు లాటంతా దేని కోసం? అదంతా నిరుపయోగమని రూఢి అవుతోంది కదా! మీ పశుసంరక్షణ కార్యక్రమమూ అంతే! మీ సిద్ధాంతం ప్రకారమే చూద్దాం – గోమా తలు అవి చేసుకొన్న కర్మను బట్టి కసాయివాళ్ల చేతుల్లో చిక్కి మరణిస్తున్నాయని చెప్పవచ్చు కదా! కనుక ఆ విషయంలోనూ మేము ఏమీ చేయనవసరం లేదు.”
ఈ మాటలు విన్న ప్రచారకుడు సిగ్గుపడి, తడబడ్డాడు. పిదప సంబాళించు కొని, “మీరు చెప్పింది నిజమే. కానీ శాస్త్రాలు ఆవు మన కన్నతల్లి అని వచిస్తు న్నాయి కదా!” అన్నాడు.
స్వామీజీ చిన్నగా నవ్వుతూ “అవును. ఆవు మన కన్నతల్లి అని నాకు తెలుసు. ఇంత తెలివిగల సంతానాన్ని మరే తల్లి కనగలదు?” అన్నారు.
స్వామీజీ పరిహాసాన్ని అతడు అర్థం చేసుకోనట్లుంది. తమ సంఘానికి కొంత ధన సహాయం చేయమని మళ్లీ స్వామీజీని వేడుకొన్నాడు.
స్వామీజీ : నేను సన్న్యాసిని, ఒక ఫకీరును. మీకు సహాయం చేయడానికి నా వద్ద డబ్బెక్కడ ఉంది? నా చేతికి డబ్బు వస్తే మొదట దాన్ని మానవసేవకే విని యోగిస్తాను. మొట్టమొదటగా సంరక్షింపబడవలసిన వాడు మానవుడు. అతడికి అన్నం పెట్టాలి, విద్య నేర్పాలి, ఆధ్యాత్మికతను ప్రసాదించాలి. ఈ పనులన్నీ చేసిన తరువాత డబ్బేమయినా మిగిలితే అప్పుడు మీ సంఘానికి ఇవ్వవచ్చు.
ఇది వినగానే ప్రచారకుడు స్వామీజీకి నమస్కరించి సెలవు పుచ్చుకొన్నాడు. స్వామీజీ అక్కడ ఉన్న వారిని ఉద్దేశిస్తూ మాట్లాడసాగారు: “ఏం మాటలు! ఎంత హేయం. వారి వారి కర్మను బట్టి మనుషులు చస్తున్నారని, వారికి మంచిచేసి ప్రయోజనమేమిటి? అంటున్నాడు. దేశం వినాశమై, శిథిలావస్థకు వచ్చిందన డానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? మన కర్మ సిద్ధాంతం మనల్ని ఎంతగా అర్థంగాని, దయనీయమైన దుఃస్థితికి తీసుకొచ్చిందో చూస్తున్నారా? మనుష్యు లుగా జన్మించిన వారికి సాటి మనుష్యుల పట్ల సానుభూతిలేదు. అటువంటి వారిని మానవులనవచ్చా?” ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు స్వామీజీ శరీరం బాధతోను, దుఃఖంతోను కంపిస్తూన్నట్లు కనిపించింది.
వైష్ణవానికి వ్యతిరేకంగా
అద్వైతం గురించి స్వామీజీ ఎక్కువగా మాట్లాడడం వలన ఆయన భక్తికి వ్యతిరేకి, వైష్ణవానికి వ్యతిరేకి అని కొందరు భావించారు. ఆయన జ్ఞానం గురించే మాట్లాడుతున్నారు, భక్తి అందుకు దిగువ స్థాయిలోనిదని పరిగణిస్తున్నారని కొందరు అనుకొన్నారు. ‘అమృత బజార్ పత్రిక’ లో (1897 ఫిబ్రవరి 8 వ తేదీ) ఆ పత్రిక సంపాదకు డైన శిశిర్‌కుమార్ ఘోష్ ఇలా వ్రాశారు: ‘దివ్యజ్ఞాన సమాజానికి చెందిన అనిబెసెంట్ పనులను స్వామి వివేకానంద పట్టించుకోకపోవడం విచారకరం. ఆమె గీతాధర్మాన్ని బోధిస్తున్నారు. ఆమె పనీ, స్వామి వివేకానంద పనీ ఒకే విధమైనవే. నిజానికి అనిబెసెంట్ పని, స్వామి వివేకానంద పని కన్నా ఒక మెట్టు మేలైనది. ఎందుకంటే ఆమె ప్రజలకు శ్రీకృష్ణుణ్ణి గురించి బోధిస్తున్నది. శ్రీకృష్ణుణ్ణి గురించి బోధించడానికి మార్గం ఇంతవరకు స్వామి వివేకానందకు లభించ లేదు.”
తన సమక్షంలో ప్రత్యక్షంగా సమస్యలను లేవదీసేదాకా సామాన్యంగా స్వామీజీ ఇటువంటి విమర్శలను ఖాతరు చేసేవారు కారు. ఒక రోజు ఆయన సమక్షంలో నాడు వచ్చిన ఒక వైష్ణవ సాధువు దీనిని గురించి అడిగారు. అందుకు స్వామీజీ, “బాబాజీ! అమెరికాలో కృష్ణుణ్ణి గురించి కొన్ని ప్రసంగాలు చేసి వున్నాను. నా ప్రసంగాల ప్రభావంతో ఒక యువతి సర్వసంగపరిత్యాగం చేసి ఒక ఏకాంత దీవిలో శ్రీకృష్ణ ధ్యానంలో జీవితం గడపసాగింది” అన్నారు.
నిజానికి వైష్ణవానికో, భక్తికో స్వామీజీ, అంతెందుకు ఏ మత భావనలకో వ్యతిరేకి కారు. మతసామరస్యాన్ని బోధింప అవతరించిన శ్రీరామకృష్ణుల మరో పార్మ్వంగా ఆయనను పరిగణించడం కద్దు. చెన్నైలో ఆయన చేసిన ‘హైందవ ఋషులు’, ‘శ్రీకృష్ణుడు’, ‘గీత’ లాంటి ప్రసంగాలను వింటే శ్రీకృష్ణుని పట్ల ఎంతటి భక్తిని స్వామీజీ కలిగివున్నారో అర్థమవుతుంది. శ్రీకృష్ణ భక్తి పేరిట ఆధ్యాత్మిక సాధనలు ప్రారంభించి, ‘కృష్ణుని ప్రేమిస్తున్నాం’ అని అర్హతలేనివారు అటువంటి ప్రేమ సాధనలు అనుష్ఠించడం వలన సమస్తం వినాశానికి దారితీసింది. దానినే స్వామీజీ ఖండించారు. దీనిని గురించిన ఒక సంభాషణ విభాగాన్ని ఇక్కడ చూద్దాం:
ప్రశ్న : ప్రేమ సాధనను జనసామాన్యం ఎందుకు అనుష్ఠించకూడదు?
స్వామీజీ : ప్రస్తుతం మన జాతి స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే అటువంటి ప్రయత్నం వలన కలిగిన ఫలితమేమిటో చూడు. ఆ ప్రేమ భావాన్ని నలు దిక్కులా బోధించడం వలన జాతి పూర్తిగా ఆడంగితనాన్ని సంతరించు కొంది. జాతిలో అందరూ స్త్రీలైపోయారు. ఒరిస్సా పూర్తిగా పిరికిపందల భూమిగా మారిపోయింది. గత నాలుగు వందల ఏళ్ళుగా వంగదేశం రాధాప్రేమ వెంటబడి, పురుషకారాన్నే పూర్తిగా కోల్పోయింది. ప్రజలు కేకలు పెట్టడానికీ, ఏడవడానికీ మాత్రమే పనికివస్తారు. అది వారి జాతి లక్షణమైపోయింది. జాతి భావాలకూ, ఆలోచనలకూ సూచికయైన వారి వాఙ్మయం వైపు చూడండి. ఈ నాలుగు వందల ఏళ్ళుగా ఏర్పడిన వంగ వాఙ్మయమంతా ఈ ఏడ్పులతోనే, మూల్గులతోనే నిండిపోయింది. వీరరసాన్ని పొంగించే ఒక్క కావ్యాన్ని కూడా మచ్చుకి సృష్టించలేకపోయింది.
ప్రశ్న : దివ్యప్రేమకు అధికారు లెవరు?
స్వామీజీ : హృదయంలో లవలేశమైనా కామవాసన ఉన్నంతవరకు ప్రేమకు తావులేదు. మహాత్యాగధనులైన పురుషశ్రేష్ఠులే ఆ దివ్యప్రేమకు అధికారులు. ఆ మహోత్తమమైన ప్రేమాదర్శాన్ని జనసామాన్యానికి బోధిస్తే అది వారి హృదయా లలో ఆధిపత్యం చేస్తూన్న కాముకత్వాన్నే తెలియకుండా రేకెత్తిస్తుంది. తాను భగవంతుని భార్యనని లేక ప్రేయసినని భావిస్తూ చేసే ధ్యానంలో మనిషి ఎక్కువసేపు తన భార్యను గురించే చింతన చేయడం సహజం. దాని వలన వాటిల్లే ఫలితాన్ని గురించి వేరుగా చెప్పనక్కర్లేదు.
ప్రశ్న : అయితే గృహస్థుడు ఆ మార్గం ద్వారా–భగవంతుణ్ణి తన భర్త లేక ప్రియుడు అనీ, తాను భగవంతుని భార్యననీ, ప్రియురాలిననీ భావిస్తూ ఆయనను ఆరాధించడం వలన – భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడం అసంభవమా?
స్వామీజీ : ఎవరో కొద్దిమంది తప్ప, సామాన్య గృహస్థులకు నిజంగా అది అసాధ్యం. అన్ని మార్గాలనూ వదలిపెట్టి సున్నితమైన ప్రమాదకరమైన ఈ మార్గం మీదే అంత పట్టుదల ఎందుకు? మధురభావం తప్పితే భగవంతుణ్ణి ఆరాధించ డానికి ఇతర (శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య) భావాలు లేవా? ఈ నాలుగు మార్గా లనూ అనుసరించి హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించ కూడదు? మొదట హృదయాన్ని తెరుచుకోనీ, తక్కినదంతా దానంతట అదే వస్తుంది. కానీ ఈ విషయం గట్టిగా తెలుసుకో, కామం ఉన్నంత వరకు ప్రేమ జనించదు. ఈ కామవాంఛల నుండి విముక్తుడు కావడానికి మొదట ఎందుకు ప్రయత్నించవు? ‘అదెలా సాధ్యమవుతుంది? నేను గృహస్థును’ అని నువ్వు అనవచ్చు. అది అర్థరహిత ప్రసంగం. గృహస్థు అయినంత మాత్రాన ఇంద్రియ లోలుడవై ఉండాలా? లేకపోతే జీవితమంతా భార్యను కామదృష్టితోనే చూస్తూ బ్రతకాలా? మధురభావాన్ని సాధన చేయడానికి మనిషి తనను స్త్రీగా భావిం చాలా?
ప్రశ్న : నిజమేనండి. సామూహికంగా నామసంకీర్తన చేస్తే చాలా ఉప యోగం కలుగుతుంది; ఆనందాన్ని కలిగిస్తుంది. శాస్త్రాలూ అట్లే వచిస్తున్నాయి. చైతన్యులు కూడా జనసామాన్యానికి అదే విధంగా బోధించారు. ఖోల్ (మృదంగం) వాద్యం వాయిస్తున్నప్పుడు హృదయం ఆనందంతో ఉప్పొంగి నాట్యం చేయాలని పిస్తుంది.
స్వామీజీ : అది సరే, కానీ ‘సంకీర్తన’ అంటే నాట్యం చేయడం మాత్రమే అనుకోవద్దు. నీకు అనుగుణంగా భగవద్గుణగానం చేయడమే దాని భావం. వైష్ణ వులలో కానవచ్చే తీవ్రమైన భావోద్రేకం, నృత్యం మంచిదే. చాలా ఆకర్షణ కలి గించేవే. కానీ వాటిని అనుసరించడంలో గొప్ప ప్రమాదం కూడా ఉంది. దాని నుండి నిన్ను నువ్వు రక్షించుకోవాలి. ప్రమాదమెక్కడ ఉన్నదంటే ప్రతిక్రియలోనే. ఒక వైపు భావాలు ఉన్నత స్థాయికి పోతాయి. కన్నుల వెంట బాష్పాలు స్రవి స్తాయి. మత్తు వచ్చినట్లు తల తిరుగుతుంది. మరోవైపు సంకీర్తన ఆగిపోయిన మరుక్షణం ఆ భావావేశం ఎంత త్వరగా పైకి ఎగసిందో అంత త్వరగా క్రిందికిజారిపోతుంది. అల ఎంత పైకి లేస్తే, సమానమైన శక్తితో అది అంత క్రిందికిపడుతుంది. ఆ స్థితిలో కలిగే ప్రతిక్రియవల్ల కలిగే ఆఘాతాన్ని తట్టుకోవడంచాలాకష్టం. సరైన వివేకం లేనివాడు అధఃప్రవృత్తులైన కామం మొదలైన వాటికిలొంగిపోవడం సహజం. ఇటువంటిదే నేను అమెరికాలో కూడా చూశాను.అనేకులు చర్చ్‌కి పోతారు. ఎంతో భక్తితో ప్రార్థిస్తారు. భావపరవశులై పాడతారు. మత బోధనలు వింటూ కన్నీరు కారుస్తారు. కానీ చర్చ్ నుండి తిరిగి రాగానేగొప్ప ప్రతిక్రియ కలిగి కామ ప్రవృత్తులకు లోనైపోతారు.
ప్రశ్న : అలా అయితే పొరపాట్లు పడకుండా, ఆధ్యాత్మికంగా పురోగతినిసాధించాలంటే చైతన్యులు బోధించిన ఏ భావాలను మేం అనుసరించాలో తెలుపండి.
స్వామీజీ : జ్ఞానంతో కూడిన భక్తితో భగవంతుణ్ణి ఆరాధించండి. భక్తితోపాటు వివేక భావాన్ని కూడా చేపట్టండి. అంతేగాక శ్రీచైతన్యుల నుండి ఆయనహృదయాన్ని, ఆయన సకలభూత ప్రేమను, భగవంతునికై ఆయన పడే తీవ్రవ్యాకులతను గ్రహించి ఆయన త్యాగాన్ని మీ జీవిత ఆశయంగా చేసుకోండి.*
జ్ఞానమా? కర్మమా?
ఒక రోజు స్వామీజీని దర్శించడానికి గుజరాతీ పండితులు కొందరువచ్చారు. వారు స్వామీజీతో తర్కింపగోరారు. అందుకు స్వామీజీ అంగీకరించారు.వాద ప్రతివాదాలు సంస్కృతంలో సాగాయి. అనేక అభిప్రాయాల గురించి వాదన జరిగినప్పటికీ, పూర్వమీమాంస (కర్మకాండం), ఉత్తర మీమాంస (జ్ఞానకాండం) అన్నవే ప్రధాన చర్చనీయాంశాలయినవి. స్వామీజీ జ్ఞాన విభాగాన్నీ, పండితులు కర్మ విభాగాన్నీ ఆదరించిచర్చించారు. స్వామీజీ అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడారు. కానీ ఒక చోట ఒక వ్యాకరణ దోషం దొర్లింది. అది వినగానే పండితులు నవ్వారు. వాదం కొనసాగింది. పాశ్చాత్య దేశాలలో ఇలాంటి ఎన్నో వాదనలను చవిచూసిన స్వామీజీకి ఇదొక పెద్ద విషయంగా కనిపించలేదు. చివరికి పండితులు స్వామీజీ అభిప్రాయాన్ని అంగీకరించవలసి వచ్చింది. పండితులు సెలవు పుచ్చుకొని వెళ్లిపోయాక అక్కడున్న వారితో, “పాశ్చాత్య దేశాలలో చర్చనీయాంశానికే ప్రాధాన్యం ఇస్తారు. వ్యాకరణ దోషం దొర్లినా దానిని పెద్దగా పట్టించుకోరు – నవ్వకుండా నైనా ఉంటారు!” అన్నారు.
ఆశ్చర్యం ఏమిటంటే, వాద ప్రారంభం నుండి రామకృష్ణానంద ప్రక్కగదిలో కూర్చుని స్వామీజీ విజయానికై ధ్యాన స్థితిలో జపమాల చేతపుచ్చుకొని ప్రార్థిస్తూ ఉండిపోయారు.
దక్షిణేశ్వరంలో
మార్చ్ 7వ తేదీ శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవాన్ని యథాప్రకారం దక్షిణేశ్వర కాళికాలయంలో ఘనంగా జరిపారు. స్వామీజీ ఆ ఉత్సవంలో పాల్గొనాలను కొన్నారు. ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఆయన అక్కడకు వచ్చినప్పుడు అప్పటికే జనం గుమిగూడి ఉన్నారు. స్వామీజీ కాషాయాంబరాలు, తలపాగా ధరించి ఉన్నారు. పాదరక్షలు ధరించలేదు. ఆయన పోయిన చోటల్లా జనం ఆయనను వెంబడించారు; ఆయనకు పాదాభివందనం చేయడానికి ఉప్పెనలా మున్ముందుకు రాసాగారు. స్వామీజీ కాళికాలయంలో ప్రార్థించారు, రాధాకాంతాలయంలో ప్రణమిల్లారు. పిదప ఏ గదిలో గురుదేవుల సాన్నిధ్యంలో చిన్నపిల్లవాడిగా పూర్వం కూర్చున్నారో అదే గదికి వెళ్లారు.
ఆ తరువాత పాశ్చాత్య శిష్యులతో కలసి పంచవటికి వెళ్లారు. ఎక్కడ చూసినా ‘జై రామకృష్ణ!’, ‘జై వివేకానంద!’ నినాదాలే వినవచ్చాయి. విభిన్న బృందాలవారు అక్కడక్కడ భజన చేస్తూ కానవచ్చారు. పంచవటిలో శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తు లైన గిరీష్ ప్రభృతులు ఉన్నారు. అక్కడ స్వామీజీ ప్రసంగించాలని అందరూ అభిలషించారు. స్వామీజీ ఉపక్రమించారు. కానీ చెన్నై బహిరంగ స్వాగతోత్స వంలో జరిగినట్లే ఇక్కడా జరిగింది. ఆయన ఎంత బిగ్గరగా ప్రసంగించినప్పటికీ దాదాపు 60, 000 మంది గుమిగూడిన జనసమూహంలో చెలరేగిన కోలాహలం కారణంగా ఆయన కంఠస్వరం వినబడలేదు. చివరికి స్వామీజీ ప్రయతాన్ని విర మించుకొన్నారు. నాడు గుడ్విన్ను ప్రసంగించమన్నారాయన. కోలాహలం కారణంగా అదీ సాగలేదు.
స్త్రీ విద్య
స్త్రీలకు విద్య అవసరమని భారతదేశంలో ప్రప్రథమంగా ఎలుగెత్తి చాటిన కంఠస్వరాలలో ఒకటి స్వామీజీది. ఒక రోజు ఆయన తమ శిష్యుడైన శరశ్చంద్రతో మాట్లాడుతూ ఇలా అన్నారు: “మన దేశంలోని స్త్రీలను విద్యావంతుల్ని చేయడానికి యథార్థమైన ప్రయత్నమేమీ చేస్తూన్నట్లు కనబడడం లేదు. పురుషులు తమ పురుషాహంకారాన్ని మరింత అభివృద్ధిపరచుకోవడానికి విద్యావంతులవుతున్నారు. ఇళ్లల్లో వారికి చాకిరీ చేయ డానికి తమ జీవిత సర్వస్వం ధారపోస్తూ, తమ సుఖదుఃఖాల్లో సమంగా పాలుపంచుకొంటూన్న స్త్రీలను విద్యావంతుల్ని చేసి, వృద్ధిలోకి తీసుకురావడానికి మనవారేం చేస్తున్నారు?”
శిష్యుడు : ఎందుకు చేయడం లేదు మహాశయా! స్త్రీల కోసం ఎన్ని పాఠ శాలలు, ఎన్ని కళాశాలలు స్థాపించబడ్డాయో చూడండి! ఎంతమంది స్త్రీలు బి.ఏ., ఎం.ఏ. పట్టాలు పుచ్చుకొన్నారో కదా!
స్వామీజీ : కానీ అదంతా పాశ్చాత్య పద్ధతిలోనే ఉంది. మన జాతీయ విధానంలోను, మన ధార్మిక పద్ధతిలోను ఎన్ని పాఠశాలలు ప్రారంభింపబడ్డాయి? అయ్యో, అలాంటి విధానం పురుషులకే లేనప్పుడు ఇక స్త్రీల విషయం చెప్పాలా?*
కానీ ఇలాంటి విద్య గరపడానికి ఒక ప్రయత్నం ప్రారంభించారు, అదీ కలకత్తాలోనే అని విన్నప్పుడు స్వామీజీ ఎంతో సంతోషించారు. తపస్వినీ మాతాజీ* అనే సన్న్యాసిని ఒకరు “మహాకాళీ పాఠశాల” పేరిట ఒక పాఠశాలను నిర్వహించసాగింది. స్వామీజీ శరశ్చంద్రతో కలిసి ఆ పాఠశాలకు వెళ్లారు. స్వామీజీ వెళ్లగానే ముగ్గురు నలుగురు ఆయనను సాదరంగా ఆహ్వానించి, మేడ మీదికి తోడ్కొని వెళ్లారు. అక్కడ తపస్వినీ మాతాజీ నిలబడి ఉన్నారు. స్వామీజీని ఆదరంగా ఆహ్వానించి ఒక గదిలోకి ఆమె తీసుకొని వెళ్లింది. ఆ గదిలో సమావేశమై ఉన్న స్త్రీలందరూ లేచి నిలబడి, ఆయనకు నమస్కరించారు. మాతాజీ చెప్పగానే అందరూ పరమేశ్వరుని గురించిన ఒక సంస్కృత శ్లోకాన్ని శ్రావ్యంగా గానం చేశారు. ఆ తరువాత తమకు నేర్పిన ఆరాధన విధానాలను చేసి చూపారు. వీటిని ఉత్సాహంతోను, ఆనందంతోను తిలకించిన తరువాత స్వామీజీ తక్కిన తరగతులను చూడడానికి బయలుదేరారు. ఆ తరువాత మాతాజీ ఒక ఫలానా స్త్రీతో కాళిదాస విరచిత రఘువంశ కావ్యంలోని తృతీయ సర్గను సూచించి దానిని వివరించమని చెప్పారు. ఆ వివరణను విన్న స్వామీజీ, తపస్వినీ మాతాజీ స్త్రీ విద్యను ప్రచారం చేయడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాలనూ, చక్కని పద్ధతులనూ వేనోళ్ల శ్లాఘించారు. అప్పుడు మాతాజీ ఎంతో వినమ్రంగా, “సాక్షాత్తూ జగజ్జననిగా భావించి నా విద్యార్థినులను సేవిస్తున్నాను. కీర్తిప్రతిష్ఠలను ఆశించి నేను ఈ పాఠశాలను స్థాపించలేదు” అన్నారు. అక్కణ్ణుండి పరమానంద భరితులై స్వామీజీ మఠానికి తిరిగి వచ్చారు.
“వేయి జన్మలు ఎత్తుతాను”
మాక్స్‌ముల్లర్ వ్యాఖ్యానంతో ఋగ్వేద మొదటి విభాగం విడుదలయింది. దానిని ఒక ధనవంతుని ఇంటి నుండి తీసుకువచ్చారు. ఆ గ్రంథాన్ని శరశ్చంద్రని చదవమని స్వామీజీ చెప్పారు. అప్పుడు గిరీష్ కూడా అక్కడ ఉన్నాడు. స్వామీజీ హఠాత్తుగా అతడితో, “మంచిది జి.సి. మీరు ఇలాంటి వాటిని చదవడానికి ఎలాంటి ప్రయత్నమూ చేసింది లేదు. ‘కృష్ణా, గోవిందా’ అంటూనే మీ కాలాన్ని గడిపివేశారు” అన్నారు. భక్తశ్రేష్ఠుడైన గిరీష్ అందుకు, “వేదాలు చదవడానికి తీరికో, తెలివితేటలో నాకు లేవు. శ్రీరామకృష్ణులు నిన్ను చదవమన్నారు. ఎందుకంటే నువ్వు లోకానికి బోధించవలసిన అగత్యం ఉంది కనుక. నాకు సంబంధించినంత వరకు, వేదాలకు దూరం నుండే ఒక నమస్కారం, అంతే. నేను ఆయన అనుగ్రహాన్ని అభిలషిస్తున్నాను. ఆయన అనుగ్రహం వల్లనే ఈ సంసార సాగరాన్ని దాటుతాను” అన్నాడు. పిదప, “వేదమూర్తులైన శ్రీరామకృష్ణులకు నమస్కారం” అంటూ ఆ ఋగ్వేద గ్రంథానికి పలుమార్లు నమస్కరించాడు.
స్వామీజీ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. హఠాత్తుగా స్వామీజీని ఉద్దేశించి గిరీష్ “నరేన్! నిన్ను ఒకటి అడుగుతున్నాను. నువ్వు వేదవేదాంతాలను అవ సరమైనంత మేరకు అధ్యయనం చేసివున్నావు. అష్టకష్టాలు పడేవారి విలాపా లకూ, పస్తులతో మాడిపోయేవారి ఆవేదనాభరిత ఆక్రందనలకూ, అవినీతికరమైన పాపాలకూ ఏదైనా పరిహారం ఆ వేదాలలో పేర్కొనబడి ఉందా? నిన్నటి దాకా యాభైమందికి అన్నంపెట్టిన ఆమె నేడు తనకూ, తన పిల్లలకూ మరుపూట తిండికి ముఖం వాచివున్నది! అదుగో ఆ ఇంటి స్త్రీపై కొందరు దుష్టులు అత్యా చారం చేసి, చంపివేశారు. ఈ ఇంట్లోని వితంతువు గర్భం దాల్చింది, లోకాప నిందకు వెరచి ఆత్మహత్య చేసుకొన్నది…. నరేన్, నిన్ను అడుగుతున్నాను. ఈ అరిష్టాలకు నీ వేదాలు ఏదైనా సానుకూల జవాబు ఇస్తున్నాయా?” అంటూ ఉద్వేగభరితంగా అడిగాడు.
గిరీశ్ మాట్లాడేకొద్దీ స్వామీజీ ఉద్వేగంలో లయించిపోసాగారు. ఆయన కళ్ల నుండి నీరు ధారకట్టింది. తాను విలపిస్తూన్నది ఎవరూ చూడరాదనే ఉద్దేశంతో లేచి గబగబా గదిలోకి వెళ్లిపోయారు. వెంటనే గిరీశ్, శరశ్చంద్రుణ్ణి ఉద్దేశించి, “చూశావా శరత్! ఎలాంటి హృదయం! ప్రేమతో ఎలా ద్రవించి పోయిందో చూడు! వేదవేదాంగపారంగతుడని నేను మీ స్వామీజీని గౌరవించడం లేదు. ఇతరుల కష్టాలు చూసి తల్లడిల్లిపోయి తన గదిలోకి విలపిస్తూ వెళ్లి పోయారే, ఆ మహోన్నత హృదయం కోసమే ఆయనను అంతగా గౌరవిస్తున్నాను” అన్నాడు.
శరత్, గిరీష్‌లు కాసేపు మాట్లాడుకొంటున్నప్పుడు మళ్లీ స్వామీజీ వచ్చి వారి మాటల్లో మాటకలిపారు. ఆ సమయంలో సదానంద లోపలికి వచ్చాడు. వెంటనే స్వామీజీ అతడితో గిరీశ్ చెప్పినదంతా చెప్పి, “నాయనా సదానందా! మన దేశానికి నువ్వు ఏమన్నా చేయగలవా?” అని గద్గద స్వరంలో అడిగారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా, “బానిసను వేచివున్నాను, ఆదేశించండి” అన్నాడు సదానంద. వెంటనే ఒక పునరావాస కేంద్రాన్ని ప్రారంభించమని అతడితో స్వామీజీ చెప్పారు.
తరువాత గిరీష్‌ను చూసి, “గిరీష్ బాబూ! ఒక సంగతి మీకు తెలుసా? లోకంలోని కష్టాలను బాపడానికి, ఒకే ఒక వ్యక్తి చిన్న కష్టాన్ని అయినా తొల గించడానికి నేను వేయి జన్మలు ఎత్తవలసి వచ్చినాసరే అందుకు సిద్ధంగా ఉన్నాను” అన్నారు.
‘నాయనా, తలుపు తెరు!’
ఒక రోజు యువకుడొకడు స్వామీజీ వద్దకొచ్చి ధ్యానం గురించి తనకు కలిగిన సందేహం వ్యక్తం చేశాడు: “నేను చాలాసేపు పూజ చేస్తున్నాను. జపం చేస్తున్నాను; గురువు ఒకరి ఉపదేశం మేరకు ధ్యాన సమయంలో మనస్సును శూన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఇంత చేసినప్పటికీ మనస్సు ప్రశాంతతను సంతరించు కోవడం లేదు, అదుపులో ఉండడం లేదు. అయినప్పటికీ గది తలుపులన్నీ మూసుకొని ధ్యానంలో కూర్చుంటున్నాను. కళ్లు మూసుకొని చాలాసేపు ధ్యానం చేస్తున్నాను. మనశ్శాంతి లభించడం లేదు. స్వామీజీ! నాకు మార్గాంతరం చూపండి.”
స్వామీజీ ఉట్టిపడే కరుణతో ఇలా అన్నారు: “నాయనా, నా మాటలకు నువ్వు చెవి ఒగ్గితే, ముందు నీ గది తలుపులు తెరచి బయటకు రా. నీ దృష్టిని చుట్టుప్రక్కల సారించు. నీ ఇంటి చుట్టుప్రక్కల వందలాది పేదవారు, ఆదరణకు నోచుకోనివారు వాడిపోతున్నారు. నీ శక్తి మేరకు వారికి సేవలందించు. ఒకడు రోగగ్రస్థుడై పడివున్నాడు. వాడి సంరక్షణకు ఎవరూ లేరు; అతడి చికిత్సకు ఏర్పాటు చేసి, అతడికి శుశ్రూష లందించు. ఆకలితో అలమటిస్తున్నాడు, అతడికి ఆహారం ఇవ్వు. అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాడు, ఆ అజ్ఞానాన్ని తొలగించు; నీ మాదిరి విద్యావంతుణ్ణి గావించు. నాయనా! నీకు నేనిచ్చే ఉపదేశం ఇదే – నువ్వు మనశ్శాంతి పొందగోరితే శక్తివంచన లేకుండా తక్కిన వారికి సేవలందించు.”
“కానీ స్వామీజీ, సేవలో అనివార్యంగా కష్టాలు ఉండనే ఉంటాయి. నిద్ర చెడిపోతుంది, అకాల భోజనం, దేనినీ సరిగా అనుసరించలేము. ఈ కారణాల వలన నేనే రోగగ్రస్థుణ్ణి కావచ్చు!” అన్నాడా యువకుడు.
ఆ యువకుని మనఃస్థితి స్వామీజీకి బాగా అర్థమయింది. దీని తరువాత అతడితో మాటలు కొనసాగించడానికి ఆయన ఇష్టపడలేదు. కనుక, “నాయనా! నీ మాటల నుండి నాకు మాత్రమే కాదు, ఇక్కడున్న అందరికీ ఒక విషయం అర్థమవు తున్నది – నీలాంటి వారు స్వకీయ సుఖాన్ని అభిలషించేవారు, దాన్లోనే మగ్నులై ఉంటారు. తమ ప్రాణాలను తుచ్ఛంగా ఎంచి, ఇతరులకు సేవలందించడం మీ వల్ల కాదు” అని సూటిగా చెప్పి, విషయాన్ని అంతటితో ఆపివేశారు.
రాజయోగి
ఒకసారి ప్రాణాయామం గురించి అడగాలని కొందరు స్వామీజీ వద్దకు వచ్చారు. తక్కినవారు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పి, ప్రాణాయామం గురించి అడగక మునుపే స్వామీజీ తమంతట తామే దానిని గురించి మాట్లాడసాగారు. అప్పుడు మధ్యాహ్నం మూడు గంటలై ఉంటుంది. రాత్రి ఏడు గంటల దాకా ఎడతెగకుండా మాట్లాడారు. విన్నవారు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. తాము అడగకుండానే ఎలా తమ సంశయాలను తెలుసుకొని వాటిని నివృత్తి చేయగలిగారని ఆయనను ఒక శిష్యుడు అడిగినప్పుడు, “ఇలాంటి సంఘటనలు పాశ్చాత్యంలో పలుమార్లు జరిగాయి. జనం సంభ్రమాశ్చర్యాలతో దానిని గురించి నన్ను అడిగారు” అన్నారు స్వామీజీ. ఆ రోజు స్వామీజీ మాటల నుండి, తమ ‘రాజయోగం’ అనే పుస్తకంలో పొందుపరచినది ఆయన గ్రహించిన దానిలో ఒక అంశం మాత్రమే అన్న విషయం అందరికీ అవగతమయింది. అదే కాదు; ఆయన జ్ఞానం, పుస్తక జ్ఞానం కాదు, అనుభవపూర్వకమైన జ్ఞానం అని అందరికీ స్పష్టమయింది. “నరేన్ పుట్టుక తోనే ధ్యానసిద్ధుడు” అని కదా గురుదేవులు వ్యాఖ్యానించి ఉన్నారు!
గతజన్మ
ఇతరుల మనస్సులోని భావాలను గ్రహించడం, గతజన్మ, సిద్ధుల గురించి ప్రస్తావన కొనసాగింది. అక్కడ సమావేశమైన వారిలో ఒకరు స్వామీజీతో, “మీ గత జన్మల గురించి మీకు తెలుసా?” అని అడిగారు. “అవును, తెలుసు” అన్నారు స్వామీజీ. అక్కడ మౌనం రాజ్యం చేయ సాగింది. “వాటి గురించి చెప్పండి” అని అడిగారు. అప్పుడాయన, “నా గతజన్మలను నేను తెలుసుకోగలను, తెలుసుకొంటున్నాను కూడా! కానీ వాటి గురించి చెప్పడానికి ఇష్టం లేదు” అని తేల్చి చెప్పారు.
ప్రేతాత్మ పట్ల సైతం కారుణ్యం
చెన్నైలో స్వామీజీ బసచేసి ఉన్నప్పుడు, కొన్ని దయ్యాలు ఆయన వద్దకు వచ్చి తమకు సద్గతి కలిగించమని విన్నవించుకోవడం గురించి ఇంతకు క్రితమే చూశాం. గోపాలాల్ ఉద్యాన గృహంలో బస చేసివున్నప్పుడు కూడా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. అప్పుడు ఆయన స్వామి ప్రేమానందతో కూర్చుని మాట్లాడుతున్నారు. హఠాత్తుగా ప్రేమానందతో, “బాబూరాం! ఇప్పుడు నువ్వు ఏదైనా చూశావా?” అని అడిగారు. “లేదు” అని ప్రేమానంద చెప్పగానే, “నే నొక ప్రేతానిన్ని చూశాను. దాని మెడ నరకబడి ఉంది. ప్రాథేయపూర్వక దృష్టితో, తనకు సద్గతి కలిగించమని అది నన్ను అడిగింది” అన్నారు స్వామీజీ. ఇలా అంటూ, చేతులు పైకెత్తి ఆ ప్రేతం కోసం ప్రార్థన చేసి దానిని ఆశీర్వదించారు. వాకబు చేసినప్పుడు అసలు నిజం తెలియవచ్చింది. అక్కడ అనేక సంవత్సరాల క్రితం ఒక బ్రాహ్మణుడు నివసిస్తూండే వాడు. అతడు డబ్బు అప్పుగా ఇచ్చి బోలెడంత వడ్డీ వసూలు చేసేవాడు. ఈ వడ్డీ కారణంగా కష్టాలపాలైన ఒకడు మెడ తెగనరికి ఆ బ్రాహ్మణుణ్ణి చంపేశాడు. అలా గమ్యం లేక పరిభ్రమిస్తూవున్న ఆ బ్రాహ్మణుడి ప్రేతాన్నే స్వామీజీ చూసింది.
అమెరికా, చెన్నైలో మాదిరి కలకత్తాలోనూ స్వామీజీ అవిశ్రాంత జీవితం కొనసాగింది.
రామకృష్ణానందను పంపించడం
చెన్నైకి ఒకరిని పంపుతానని తాము చెన్నై మిత్రులకూ, భక్తులకూ వాగ్దానం చేసింది స్వామీజీ మరచిపోలేదు. అమెరికాలో ఆయన ఉన్నప్పుడు కూడా తమ పనులను కొనసాగించడానికి ఒకరు అవసరమని తోచి నప్పుడు ఆయన మనస్సులో మెదలిన మొదటి వ్యక్తి రామ కృష్ణానంద. అనారోగ్య కారణంగా ఆయన అప్పుడు వెళ్లలేక పోయారు. నేటికీ స్వామీజీ మనస్సులో ఉన్న వ్యక్తి రామకృష్ణానందే!
రామకృష్ణానంద వినిర్మల, పావన సన్న్యాస మూర్తిగా విరాజిల్లుతూన్న మహ నీయుడు. దానికి తోడు విశిష్ట చింతనాశీలునిగా పేరెన్నికగన్నవాడు. సంస్కృతం లోనూ, ఆంగ్లంలోనూ అభినివేశం ఉన్న వ్యక్తి. కానీ ఆయన బయటకు ఎక్కడికీ వెళ్లేవారు కారు. ఆయన జీవితం మఠంలో గురుదేవుల పూజతో పెనవేసుకు పోయింది. దాని నుండి ఆయన తనను వేరుచేసి చూసింది లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన చెన్నైకి వెళ్లడానికి సమ్మతిస్తాడా? కానీ తమ పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలకు ఎల్లలు లేవు అనే విషయం స్వామీజీకి తెలియకపోలేదు. స్వామీజీని గురువుగానే రామకృష్ణానంద పరిగణించారు. అదీ స్వామీజీకి తెలియనిది కాదు.
కనుక ఒక రోజు స్వామీజీ, రామకృష్ణానందను దగ్గరకు పిలిచి, “శశీ! నీకు నా పట్ల ఎనలేని అభిమానం ఉంది. అంతేకదా?” అని అడిగారు. “అవును” అని ఆయన జవాబివ్వగానే స్వామీజీ, “అలా అయితే ఒక పని చెయ్యి. తిన్నగా చిత్పూర్ కూడలి వద్దకు వెళ్లి అక్కడవున్న ఫౌజ్దారీ బాలఖానా దుకాణం నుండి నా కోసం మంచి రొట్టెను తీసుకొనిరా” అన్నారు. అదొక మహమ్మదీయ దుకాణం. సనాతన హిందువులు ఆ దుకాణానికి వెళ్లడమో, వెళ్లాలనుకోవడమో ఆ రోజుల్లో ఊహించను కూడా ఊహించలేం. రామకృష్ణానంద పుట్టుకతో బ్రాహ్మణుడు. కానీ ఆయన క్షణమాత్రం కూడా సంశయించలేదు. ఐదారుమైళ్లు కాలినడకనే వెళ్లి, ఆ దుకాణం నుండి రొట్టె తీసుకొనివచ్చి స్వామీజీకి ఇచ్చారు. నేటి సామాజిక పరిస్థితిలో ఇదొక గొప్ప విషయంగా మనకు అనిపించదు. కానీ కులమతాలు సమాజాన్ని పట్టి పీడించే ఆ రోజుల్లో ఇది సామాన్య విషయం కాదు. స్వామీజీ పట్ల రామ కృష్ణానందకు గల అవ్యాజ ప్రేమ కారణంగానే ఆయన ఈ పని చేశాడు.
రొట్టెను చేతిలో ఉంచుకొని స్వామీజీ రామకృష్ణానందతో, “సోదరా! నువ్వు నా కోసం మరొకటి కూడా చేయాలి. నువ్వు చెన్నైకి వెళ్లాలి” అన్నారు. మళ్లీ అదే స్థితి! మారు మాట్లాడకుండా చెన్నైకి వెళ్లడానికి రామకృష్ణానంద సమ్మతించారు. ఈ విధంగా దక్షిణ భారతదేశానికి శ్రీరామకృష్ణుల ప్రతినిధిగా 1897 మార్చ్ ఆఖరున రామకృష్ణానంద చెన్నైలో అడుగిడారు. ఆయనతోపాటు సదానంద కూడా వచ్చాడు. రామకృష్ణ సంఘ సేవాకార్యాలకు దక్షిణదేశంలో శ్రీకారం చుట్టబడింది.*
డార్జిలింగ్‌లో
కలకత్తాలో అనేక ఉపన్యాసాలు ఇవ్వమని అనేక విన్నపాలు వస్తూవున్నప్ప టికీ, స్వామీజీకి విశ్రాంతి తప్పనిసరి కావడంతో ఆయనను వెంటనే డార్జిలింగ్‌కు పంపాలని ఏర్పాట్లు చేశారు. మార్చ్ 8 వ తేదీన స్వామీజీ డార్జిలింగ్‌కు వెళ్లారు. సేవియర్ దంపతులు అప్పటికే వెళ్లి అక్కడ బసచేసివున్నారు. స్వామీజీతోపాటు బ్రహ్మానంద, త్రిగుణాతీతానంద, తురీయానంద, జ్ఞానానంద, గిరీష్, గుడ్విన్, డాక్టర్ టర్న్‌బుల్, అలసింగ పెరు మాళ్, నరసింహాచార్యులు, కిడీ కూడా వెళ్లారు. స్వామీజీ పట్ల అమిత గౌరవాద రాలు గల బర్ద్వాన్ మహారాజు తమ రాజభవనంలో ఒక విభాగాన్ని స్వామీజీ బస నిమిత్తం కేటాయించాడు. అక్కడ ఎమ్.ఎన్. బెనర్జీ దంపతుల అతిథిగా స్వామీజీ బస చేశారు.
స్వామీజీకి ఉబ్బసంతోపాటు మధుమేహం ఉన్నట్లు ఈ రోజుల్లో కనుగొన బడింది. అందువలన డార్జిలింగ్‌లో ఆహార నియమం కచ్చితంగా పాటించబడింది. చపాతీ, అన్నం, బంగాళాదుంపలు నిషేధింపబడ్డాయి. కాఫీలో సైతం చక్కెర ఆపివేశారు. మాంసాహారం తినకపోవడం, నీరు త్రాగకుండడం, దేహానికీ మెదడుకూ పూర్తి విశ్రాంతి – ఇవి కచ్చితంగా అవసరమని డాక్టర్లు నొక్కివక్కాణిం చారు. స్వామీజీ అన్నింటికీ అంగీకరించారు. నిత్యం నడక, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం, సంభాషణలు, విశ్రాంతితో స్వామీజీ రోజులు గడపసాగారు. “నా జుట్టు నెరసి పోతున్నది. నా ముఖం ముడతలు పడసాగింది; నా కండలు కరిగి నా వయస్సును 20 ఏళ్లు అధికంగా చూపుతున్నవి. నేను పొడవైన గడ్డాన్ని పెంచగోరుతున్నాను. ఇప్పుడు అది నెరసిపోతున్నది. పొడవైన గడ్డం గౌరవ సూచకం” అని వ్రాస్తున్నారు స్వామీజీ.*
పేరుకు విశ్రాంతే అయినప్పటికీ పలువురికి స్వామీజీ లేఖలు వ్రాస్తూనే ఉన్నారు; రామకృష్ణ సంఘానికి సరైన ఆకృతి కల్పించడం గురించీ దీర్ఘంగా ఆలోచించారు. బ్రహ్మానందతో చర్చించి ఒక ప్రారంభ ప్రణాళిక రూపొందిం చారు.
‘సర్వత్రా నేనే’
ఒక రోజు స్వామీజీ ఉదయం టీ సేవించి నడవసాగారు. ఇద్దరు యువకులు ఆయనతోపాటు వెళ్లారు. వారు ఆయనకు కాస్త వెనుకగా నడుస్తున్నారు. ప్రకృతి సంతరించుకొన్న అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ స్వామీజీ ఆ కొండదారిలో వెళ్లసాగారు. హఠాత్తుగా, “ఆహా! భరించ లేకపోతున్నాను, చాలా నొప్పిగా ఉంది” అని కేకపెట్టారు. ఆ యువకు లిద్దరూ ఒక్క పరుగున అక్కడకు వెళ్లి, “ఏమైంది స్వామీజీ? నొప్పి ఎక్కడ?” అని అడి గారు. “అదిగో, అక్కడ పనిచేస్తూవున్న ఆ స్త్రీ శిలకు ఢీకొని క్రిందపడిపోయింది. ఆమెకు నడుం దగ్గర బాగా దెబ్బ తగిలింది” అని స్వామీజీ ఆమె నొప్పిని తానే అనుభవించినట్లు తమ నడుము పట్టుకొని చెప్పారు.
యువకులకు ఏమీ అర్థం కాలేదు. వారికి అర్థమవడానికి ఆస్కారమూ లేదు. మహాత్ముల చేతలు అంత సులభంగా అర్థమయ్యేవి కావు. తనను అవగతం చేసుకొన్న, తనను సకల ప్రాణికోటిలో నెలకొనివున్న చైతన్య వస్తువుగా అనుభూతి చేసుకొన్న మహాత్ముడు స్వామీజీ. కొన్ని సమయాలలో జాగృతం చెందించే ఆయన ఉపన్యాసాలు, చేతలను సరిగా అర్థం చేసుకోనప్పుడు ఆయనను కేవలం ఒక దేశ భక్తునిగా, సంస్కర్తగా పరిగణించడం కద్దు. కానీ అవి నిజానికి ఒక వైపు మాత్రమే. ఆయన ఒక దేశభక్తునిగా, సంస్కర్తగా, ఇంకా ఎన్నెన్నో పరిమాణాలు సంతరించుకొన్న వ్యక్తిగా వెలుగొందారనడం ముమ్మాటికీ నిజం. కానీ వీటన్నింటినీ ఒకే త్రాటిమీద నిలిపింది ఆయన ఒక భగవదనుభూతి పొందిన వ్యక్తి అన్న అంశమే.
సర్వాంతర్యామి తత్త్వాన్ని అవగతం చేసుకొన్న స్థితిలో లయమయేటప్పుడు కొన్ని సమయాలలో ఇలాంటి అనుభవాలు ఏర్పడడం కద్దు. ప్రాణికోటి సుఖ దుఃఖాలను వారు అప్పుడు అనుభూతం చేసుకొంటారు. ఇద్దరు పడవ నడిపే వ్యక్తులు కొట్టుకొన్నప్పుడు, ఆ దెబ్బలు తమకు తగిలినట్లు త్రుళ్లిపడ్డారు శ్రీరామ కృష్ణులు – ఆయన వీపు కూడా ఎర్రబారింది.* శిష్యు డొకడు కాలితో పిల్లిని త్రోసి నప్పుడు, “నాయనా, పిల్లిని కొట్టవద్దు! ఎందుకంటే ఆ పిల్లిలోనూ నేనే ఉన్నాను” అన్నారు మాతృమూర్తి శ్రీ శారదాదేవి.* ఈ విధంగా స్వామీజీ కూడా అనుభూతం చేసుకొన్న సంఘటన ఇది. ఇక్కడ ఆ పేదరాలి నొప్పిని సాక్షాత్తూ తనకు కలిగిన నొప్పిగా ఆయన అనుభూతం చేసుకొన్నారు.
కేవల భావోద్వేగాలు ఆధ్యాత్మికం కాదు
స్వామీజీ బస చేసిన ఇంట్లో మోతీలాల్ ముఖర్జీ అనే వ్యక్తి కూడా బసచేసి ఉన్నాడు. ఇతడు కొన్ని సమయాలలో ఒక రకమైన భావోద్వేగ స్థితులకు లోనవు తాడు. అప్పుడప్పుడు నేల మీద దొర్లడం, పొర్లడం, కేకలు పెట్టడం, కాళ్లూ చేతులూ కొట్టుకోవడం లాంటి రభస సృష్టిస్తాడు. దీనిని అతడు ఆధ్యాత్మిక పారవశ్యంగా పేర్కొంటాడు. ఇలా కేకలు పెట్టడం, దొర్లడం లాంటివి పారవశ్య స్థితి కాదనడం ఒక ప్రక్క ఉండగా, యథార్థమైన పారవశ్య స్థితినే నియంత్రించుకోవాలని స్వామీజీ భావన. మోతీలాల్‌తో పలుమార్లు దీనిని ఆపుకోమని నచ్చజెప్పారు. అది అతడు చేయలేక పోయాడు. కనుక ఒక రోజు అతడి ఛాతీని స్వామీజీ స్పృశించారు. నాటి నుండి మోతీలాల్ భావోద్వేగాలు అణగిపోయాయి. అతడు ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టాడు. 1899 లో సన్న్యాసం పుచ్చుకొని స్వామి సచ్చిదానంద నామధేయం స్వీకరించాడు.
మళ్లీ దక్షిణేశ్వరంలో
వారం కన్నా కాస్త ఎక్కువగా స్వామీజీ డార్జిలింగ్‌లో బసచేశారు. అంతలో ఖేత్రీ రాజు తమను చూడడానికి కలకత్తాకు వచ్చిన సమాచారం విని ఆయన కలకత్తాకు తిరిగి వెళ్లవలసివచ్చింది. డార్జిలింగ్‌లో ఆయన ఆరోగ్యం ఒకింత మెరుగుపడింది. కానీ హఠాత్తుగా కలకత్తాకు తిరిగి వెళ్లవలసి వచ్చినందున ఆయన విశ్రాంతికి భంగం వాటిల్లింది. స్వామీజీ వచ్చిన రైలు సియాల్దా స్టేషన్లోకి వచ్చినప్పుడు రాజు తనే స్వయంగా రైలులోకి వెళ్లి స్వామీజీని పుష్పమాలాలంకృతుని గావించారు. అది 1897 మార్చ్ 21 వ తేదీ అయివుండవచ్చు. ఆ రోజు సాయంత్రం స్వామీజీ, రాజూ, మరికొందరూ దక్షిణేశ్వర కాళికాలయానికి వెళ్లి ఆరాధించారు. శ్రీరామకృష్ణుల జీవితంతో ముడిపడివున్న చోట్ల నన్నింటినీ రాజుకు త్రిప్పి చూపించారు స్వామీజీ.
ముందుగా కాళికాలయాన్నీ, రాధాకాంతాలయాన్నీ దర్శించుకొని అందరూ శ్రీరామకృష్ణులు నివసించిన గదికి వెళ్లారు. గది పువ్వులతో అందంగా అలంక రించబడి ఉంది. గురుదేవుల మంచం మీద పువ్వులు రాసులు రాసులుగా పోసి ఉంచారు. గురుదేవుల అన్నగారి కుమారుడైన రాంలాల్ కూడా వచ్చివున్నాడు. గదిలోకి వెళ్లగానే స్వామీజీ గది నలుమూలలకూ పరుగెత్తి, ప్రతిచోటా సాష్టాంగ నమస్కారాలు చేశారు, ఉత్సాహంతో దొర్లారు. అది చూసి రాజుగారు, తక్కిన వారు కూడా సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆ తరువాత స్వామీజీ చేతులు జోడించుకొని గురుదేవుల చిత్రపటాన్ని తదేకంగా చాలాసేపు చూస్తూ ఉండి పోయారు. తదనంతరం అందరూ కలసి పంచవటికి వెళ్లారు.
పంచవటిలో స్వామీజీ పారవశ్య స్థితిని పొందారు. ఒకసారి పంచవటికి ప్రదక్షిణ చేసి, అక్కడ కూర్చుని ధ్యానంలో మగ్నులయ్యారు. తరువాత ఒక పిల్ల వాడి మాదిరి పంచవటిలోని మర్రిచెట్టును ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చుని ఊగ సాగారు. ఖేత్రీ రాజుగారిని పిలిచి, “గురుదేవుల రోజుల్లో మేం ఇలాగే ఈ చెట్టు మీదికి ఎక్కి ఆడుకొని ఆనందించేవారం. నేడు ఆ జ్ఞాపకాలు స్మృతిపథంలో మెద లాయి. గంగాతీరంలోని ఈ చోటు ఎంత మనోజ్ఞంగా ఉందో! ఎంత అందమైన పరిసరాలు! చూడండి” అన్నారు. ఆ తరువాత అందరూ అక్కడ కూర్చుని ధ్యానం చేశారు. అరగంట తదుపరి స్వామీజీ లేచారు. తదనంతరం గురుదేవుల గదికి ఉత్తరాన ఉన్న వసారాలోకి వెళ్లి నిలబడ్డారు.
తరువాత రామ్‌లాల్ ప్రభృతులు రాజుగారిని సముచిత గౌరవమర్యాదలతో ఆహ్వానించారు; రాజు వాటిని శిరసావహించి స్వీకరించాడు. అప్పుడు దక్షిణేశ్వర ఆలయాల యజమానియైన త్రైలోక్య బిస్వాస్ కుమారుడైన ఒక యువకుడు వచ్చి స్వామీజీకి పాదాభివందనం చేశాడు. స్వామీజీ అతడితో, “ఏం నాయనా! మీ తండ్రిగారు ఎక్కడ?” అని అడిగారు. అందుకు అతడు, “కార్యాలయంలో ఉన్నారు” అని జవాబిచ్చాడు. వెంటనే స్వామీజీ, “ఆయన ఎందుకు రాలేదు?” అని అడి గారు. ఆ యువకుడు మౌనం వహించాడు. తదుపరి అందరూ ఆలంబజార్ మఠానికి బయలుదేరారు.
ఆలంబజార్ మఠంలో
మఠంలో సాయంత్రం హారతి నిర్వర్తించారు. ప్రేమానంద హారతి అర్పిం చారు. సాధువులు, బ్రహ్మచారులు సుశ్రావ్యంగా స్తుతులు గానం చేశారు. మధ్య మధ్యలో స్వామీజీ, “జై గురు, జై గురు” అంటూ గంభీర స్వరంలో ఉచ్చరించడం అందరి హృదయాలలో ఆధ్యాత్మిక తరంగాలను సృష్టించింది. హారతి పూర్తి కాగానే స్వామీజీ, రాజుగారు తక్కిన అందరూ గురుదేవులకు సాష్టాంగ నమస్కారం చేశారు. తరువాత అందరూ కలిసి బయట ఉన్న పెద్ద గదిలోకి వచ్చారు. స్వామీజీ ‘మ’ తో, “రాజుగారితోపాటు పాశ్చాత్య దేశాలకు వెళ్లగోరాను. సముద్రయానం నా ఆరో గ్యాన్ని మెరుగుపరుస్తుంది. కానీ ఘనవైద్యులు ఎవరూ నా పయనాన్ని ఆమో దించలేదు. అందుకు మారుగా అల్మోరాకు వెళ్లమని సలహా ఇచ్చారు” అన్నారు. అప్పుడు ఖేత్రీ రాజుగారు, “సముద్రయానం స్వామీజీ ఆరోగ్యానికి మంచిదని నేను భావిస్తున్నాను. కానీ వైద్యులు ఎందుకిలా అంటున్నారో తెలియడం లేదు. రేపు ఆంగ్లేయ డాక్టర్ వస్తున్నాడు. ఆయన సలహా ప్రకారం చేద్దాం” అన్నారు.
ఆ తరువాత భజన జరిగింది. స్వామీజీ ఒకటి రెండు పాటలు పాడారు. పిదప రాజుగారితో ఆయన నివాసానికి వెళ్లారు.
దక్షిణేశ్వర ప్రవేశ నిషేధం
స్వామి వివేకానంద కాళికాలయానికి వెళ్లిన రోజు మథుర్నాథ్ కుమారుడూ, ఆలయ నిర్మాత రాణీరాస్మణి మనుమడూ, ఆలయ ధర్మకర్తా అయిన త్రైలోక్యబాబు ఆలయంలోనే ఉన్నాడు. ముందుగానే సమాచారం తెలిసినప్ప టికీ అతడు స్వామీజీని, రాజుగారిని ఆహ్వానించడానికి రాలేదు. ఈ వార్త పత్రికలలో వెలువడింది. ఆ వార్తను త్రైలోక్యుడు ఖండించగా, ప్రతిఖండనలు పత్రికలలో ధారావాహికంగా రాసాగాయి. స్వామీజీని, ఆయన కార్యకలాపాలను సదా ఆక్షేపించే క్రైస్తవ మిషనరీలు, ప్రతాపచంద్ర మజుందార్ ఈ వాగ్యుద్ధాన్ని పరోక్షంగా రగిలించారు. స్వామీజీ హైందవుడు కాడు, సన్న్యాసి కాడు, బ్రాహ్మణుడు కాడు; ఆయన శూద్రులలో సైతం అట్టడుగు వాడు; ఆయనకు సన్న్యాస అర్హత లేదు; ఆయన హిందూమతాన్ని బోధించలేదు; ఆయన హిందూమత ప్రతినిధి కాడు అంటూ దుష్ప్రచారం ప్రారంభించారు. స్వామీజీ వీటికి ఖండన తెలుపలేదు. చివరగా త్రైలోక్యుడు వ్రాసింది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆతడు ఇలా వ్రాశాడు:
“స్వామి వివేకానంద, ఆయనతో వచ్చినవారు ఆలయం నుండి వెళ్లగొట్ట బడ్డారు. కానీ భోలానాథ్ (ఆలయ కోశాధికారి) చెప్పినట్లు వారిని ప్రత్యక్షంగా వెళ్ల గొట్టలేదు; వారిని ఆహ్వానింప నేనూ వెళ్లలేదు, ఎవరినీ పంపనూ లేదు, అంతే. పాశ్చాత్య దేశాలను సందర్శించీ, తనను ఒక హైందవునిగా పరిగణించుకొంటున్న ఒకరిని మరేమీ చేయలేకపోయినప్పటికీ కనీసం చూడకుండానైనా ఉందామను కొన్నాను. స్వామి, తక్కినవారు ఆలయం వదలి వెళుతున్నప్పుడు, వారు నన్ను కలుసుకోవడానికి వీలులేదని భోలానాథ్ వారికి తెలియజేశాడు….. ఆలయంలోని విగ్రహానికి పరిహారాభిషేకం చేయాలని మీరు చెప్పింది నిజమే.”
అంతేకాదు; ఇకపై స్వామీజీ దక్షిణేశ్వర ఆలయంలోకి ప్రవేశించకూడదని త్రైలోక్యుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఇది స్వామీజీకి కాస్త కలత కలిగించింది. ఆయన జీవితంతో పెనవేసుకుపోయిన చోటు దక్షిణేశ్వరం. అక్కడకు వెళ్లరాదంటే….. స్వామీజీ ఆలోచనలు గిర్రున తిరుగసాగాయి. అయినప్పటికీ ఆయన ఒక సన్న్యాసి, ఆపైన ఒక పరిపూర్ణుడైన జ్ఞాని. కనుక ‘జరుగబోయేది జరుగుగాక’ అని అంతా గురుదేవులకే వదలిపెట్టేశారు.
కానీ తనపై విధించిన ఆంక్ష కారణంగా గురుదేవుల జన్మదినోత్సవాన్ని జరుపుకోవడంలో ఆటంకం వాటిల్లుతుందేమోనని భయపడ్డారు స్వామీజీ. ఎందు కంటే ఇంతవరకు శ్రీరామకృష్ణుల జయంతి దక్షిణేశ్వరంలోనే జరుపబడుతూ వచ్చింది. ఒకింత నిరాశా నిస్పృహలతో, “ఈ సంవత్సరం శ్రీరామకృష్ణుల జయం త్యుత్సవం జరుపుకోవడానికి ఆస్కారం ఉన్నట్లుగా లేదు. నేను పాశ్చాత్య దేశాలు సందర్శించి వచ్చినందున రాస్మణి ఉద్యాన యాజమాన్యం నన్ను ప్రవేశించ నివ్వరు”* అని స్వామీజీ వ్రాశారు.
గుడ్డిలో మెల్ల
మంచి మిశ్రమం కాని చెడు లేదు, చెడు మిశ్రమం కాని మంచీ లేదు. ఇది లోక నియతి. అందుకే మహాత్ములు చెడూ వద్దు, మంచీ వద్దు అని రెంటినీ అతిక్రమించి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. కానీ లోకంలో కొన్ని కార్యాలు నిర్వర్తించాలంటే రెంటినీ స్వీకరించే తీరాలి. భగ వంతుని ఆలంబనం చేసుకొని కార్యాలను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఎదురయ్యే ఆటంకాలు మంచిగానే పరిణమిస్తాయి. బ్రాహ్మణులలో బ్రాహ్మణుడూ, ఆచార్యు లలో ఆచార్యుడూ, సాక్షాత్తూ భగవంతుడే అవతారంగా రూపుదాల్చిన మహా పురుషుడైన శ్రీరామకృష్ణులే ఏ నరేంద్రుణ్ణి శ్లాఘించారో, ప్రతి బ్రాహ్మణుడూ వేకువన స్తుతించే సప్తర్షులలో ఒకరి అవతారమని ఎవరిని ప్రశంసించారో ఆ స్వామీజీ ఆలయంలో ప్రవేశించరాదంటూ ఆంక్షను విధించిన ఆ వ్యక్తిని గురించి ఏం చెప్పగలం?
కానీ దీని ద్వారా ఒక మహత్కార్యం సత్వరపరచబడింది. “కలకత్తాలో మఠం స్థాపింపబడినప్పుడు నా మనస్సు కుదుటపడుతుంది. దేని నిమిత్తం యావ జ్జీవితం పడరాని పాట్లుపడ్డానో, ఆ పని నా అనంతరం నశించిపోదని మఠ స్థాపన తరువాత ఆశిస్తాను”* అని స్వామీజీ వ్రాశారు. ఒక శాశ్వత మఠ నిర్మాణ కార్యాన్ని తక్షణమే సత్వరపరిచాయన. “మన సొంత స్థలంలోనే ఉత్సవాన్ని జరిపి తీరాలి. ఏది ఏమైనా ఇది నీ ప్రథమ కర్తవ్యమని జ్ఞప్తికి ఉంచుకో”* అని స్వామి బ్రహ్మానందకు ఆయన వ్రాశారు.