భగవత్సేవకా వర్ధిల్లు!
సనాతన మునిగణ చరణ సేవకా వర్ధిల్లు!
శాంతి ప్రవక్తకు స్వాగతం!
శ్రీరామకృష్ణుల ప్రశస్త తనయునికి సుస్వాగతం!
– చెన్నై స్వాగత కమాను (arch) లలోని వాక్యాలు
చెన్నై యువకుల మీదే నా ఆశ — స్వాగత ఏర్పాట్లు — మత్స్యకారుల ఆనందం — స్వామీజీ విచ్చేస్తున్నారు! — ‘కుమారా, రా!’ — జ్ఞానసంబంధ మూర్తి — ‘మదనా రా!’ — కేసిల్ కెర్నన్లో — నవరాత్రి — సన్న్యాసానికి అర్హత — గీతా బాణీలో — ‘విజయానికి కారణభూతుడు భగవంతుడే!’ — సార్వజనీన ఆలయం — తమిళుల పట్ల ఆశ — ప్రేమమూర్తి — చెన్నైలో శాశ్వత సంస్థ — సెలవు పుచ్చుకొన్నారు — ‘అగ్నిపర్వతంలా బ్రద్దలవుతాను!’
చెన్నై యువకుల మీదే నా ఆశ
స్వామి వివేకానందను కనుగొన్నది తమిళనాడే అని సగర్వంగా చెప్పుకోవచ్చు. బహుశా అందువల్లేనేమో స్వామీజీకి తమిళనాడు పట్ల ఎంతో నమ్మకం. ఆయన తమిళనాడులో చేసిన ప్రసంగాలలో ఈ నమ్మకమూ, ఆశలూ స్పష్టంగా చూడవచ్చు. “చెన్నై* యువకులారా! మీ మీదే ఆశలు పెట్టుకొన్నాను” అన్నారు స్వామీజీ. అందుకే తమ లేఖలలో ప్రస్తావించి ఉన్నారు. అదేకాక, ఆయన పిలుపునకు ప్రప్రథమంగా చెవి ఒగ్గి, ఒక సుస్థిరమైన ఆధ్యాత్మిక కేంద్రం తమిళనాడులో నెలకొల్పాల్సిందిగా చెన్నై పురజనులే ఆయనకు విన్నవించారు.
తాను కనుగొన్న ఒక సన్న్యాసి పాశ్చాత్య దేశాలలో భారతీయ ఆధ్యాత్మిక విజయ కేతనాన్ని ఎగురవేసి మాతృదేశానికి తిరిగివస్తూన్నప్పుడు తమిళనాడు, ముఖ్యంగా చెన్నై ఎంత మహదానందం పొందివుంటుంది! ఆయనకు ఇచ్చిన స్వాగతం లాంటిది అంతదాకా ఏ రాజకీయ నాయకునికీ, మరే ఇతర నాయ కునికీ ఇచ్చివుండలేదని The Hindu లాంటి దినపత్రికలు వ్యాఖ్యానిం చాయి.
స్వాగత ఏర్పాట్లు
స్వామీజీకి స్వాగతం చెప్పడం కోసం 1896 డిసెంబర్ మాసాంతంలో ఏర్పాట్లు ప్రారంభమైనాయి. డిసెంబర్ 21వ తేదీ అలసింగ పెరుమాళ్ తదితరులు మెరీనా సముద్రతీరంలో నెలకొనివున్న కౌసిల్ కెర్నన్* (Castle Kernen) అనే భవనంలో సమావేశమై స్వాగత సంఘాన్ని ఏర్పరచారు. స్వామీజీ శిష్యులైన అలసింగ పెరుమాళ్, బాలాజీరావు, పి. సింగార వేలు మొదలియార్, చెన్నై పురప్రముఖులైన వి. భాష్యం అయ్యంగార్, వి. కృష్ణస్వామి అయ్యర్, వి.సి. శేషాచార్య, ప్రొఫెసర్ రంగాచార్య, ప్రొఫెసర్ కె. సుందరరామ అయ్యర్, డాక్టర్ నంజుండరావు, పి.ఆర్. సుందర అయ్యర్ ఈ స్వాగత సంఘ సభ్యులు. న్యాయమూర్తి సుబ్రహ్మణ్య అయ్యర్ ఈ సంఘ అధ్యక్షత బాధ్యతను స్వీకరించారు. థియోసాఫికల్ సొసైటీకి చెందిన కల్నల్ ఆల్కాట్, భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారార్థం వచ్చిన డాక్టర్ ఫరోజ్ కూడా ఈ స్వాగత సంఘంలో సభ్యులవడం గమనార్హం.
ఎగ్మూరు రైలు నిలయం నుండి కాసిల్ కెర్నన్ దాకా అలంకారయుతమైన కమానులు (arches), తోరణాలు మొదలైనవి అమర్చడానికి ఏర్పాట్లు చేశారు. కాసిల్ కెర్నన్కు ఎదురుగా ఒక పందిరి నిర్మించారు. స్వామీజీ బస చేయడానికీ, ఆయన స్వాగత ఏర్పాట్ల కోసమూ కల్నల్ ఆల్కాట్ ఒక భవనాన్ని, ఒక హాలును సిద్ధం చేసి ఉంచాడు. అయినప్పటికీ స్వామీజీ కాసిల్ కెర్నన్లోనే బస చేశారు. స్వామీజీ రాకను తెలుసుకొని తమిళనాడులోని ఇతర ప్రాంతాల నుండి కూడా జనం తండోపతండాలుగా చెన్నై రాసాగారు. వారిలో యువకులూ, విద్యార్థులూ అధిక సంఖ్యాకులు. బయటి ఊళ్ల నుండి పరీక్షలు వ్రాయడానికి వచ్చిన విద్యా ర్థులు పలువురు పరీక్షలు ముగిసిన తరువాత కూడా స్వామీజీని దర్శించడంకోసం చెన్నైలోనే ఉండిపోయారు. బస అద్దె పెరుగుతున్నప్పటికీ, తక్షణమే ఇంటికి తిరిగి రమ్మని తల్లితండ్రులు పోరుపెడుతున్నప్పటికీ ఖాతరు చేయక వారు స్వామీజీకై వేచివున్నారు. రోజులు గడిచేకొద్దీ, ‘స్వామీజీ ఎప్పుడు వస్తున్నారు?’ అన్న ప్రశ్న అందరి మనస్సుల్లోనూ మెదలసాగింది.
మత్స్యకారుల ఆనందం
చెన్నై సమీపంలోని ఒక రైలు నిలయంలో స్వామీజీ దర్శనార్థం జనం రైలుపట్టాల మీద అడ్డంగా పడుకోవడం ఇంతకు మునుపే చూశాం. ఆ బృందంలో సూరజ్రావు* అనే యువకుడు ఉన్నాడు. మహారాష్ట్రకు చెందిన ఈయన స్వామీజీ మాతృదేశాగమనం గురించి విని ఆయన దర్శనార్థం వచ్చాడు. రైలు నిలయంలో స్వామీజీని చూసిన తరువాత ఆయన చెన్నై వెళ్లదలచుకొన్నాడు; కాని ప్రయా ణానికి సరిపడ పైకం లేదు కనుక సముద్రతీరం వెంట నడవనారంభించాడు. దారిలో మత్స్యకారుల గుడిసెలు ఉన్నాయి. అన్ని గుడిసెలలోను వరుసగా దీపాలు వెలిగింపబడి ఆ ప్రాంతం ప్రకాశవంతంగా ద్యోతకమయింది. అందుకు కారణం తెలియని సూరజ్రావు అక్కడున్న వారిలో ఒకరిని దానిని గురించి అడిగాడు. “ఏమిటీ, మీకు తెలియదా? జగద్గురువులు చెన్నై విచ్చేస్తున్నారు” అన్న జవాబు వచ్చింది. స్వామీజీ రాక గూర్చి పేదలైన మత్స్యకారులకు సైతం తెలిసి ఉండడం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది.
స్వామీజీ విచ్చేస్తున్నారు!
ఎగ్మూరు రైలు నిలయం నుండి మెరీనా దాకా బాటలన్నీ తోరణాలతో ద్విగుణీ కృతమైన అందాలను సంతరించుకొన్నాయి. “వివేకానందా వర్ధిల్లు!, “భగవత్సేవకా వర్ధిల్లు!”, “సనాతన మునిగణ చరణ సేవకా వర్ధిల్లు!”, “ఆధు నిక భారతమా వర్ధిల్లు!”, “స్వామి వివేకానందకు సుస్వాగతం!”, “శాంతి ప్రవక్తకు స్వాగతం!”, “శ్రీరామకృష్ణుల ప్రశస్త తనయునికి సుస్వాగతం!” “పురుష సింహానికి సాదర స్వాగతం!” లాంటి వచనాలున్న పదిహేడు అలంకారయుతమైన కమానులు (arch) దారి పొడవునా నిర్మిత మైనాయి. “ఏకం సత్ విప్రా బహుధా వదన్తి” (సత్యం ఒక్కటే మహాత్ములు దానిని పలు రకాలుగా పేర్కొంటారు) అన్న వేద వచనమూ పలుచోట్ల కానవచ్చింది.
ఫిబ్రవరి 6 వ తేదీ వేకువజాము నుండే రైలు నిలయం వద్దకు జనం తండోప తండాలుగా రాసాగారు. టికెట్ ఉన్నవారికి మాత్రమే రైలు నిలయంలోకి అను మతి ఉన్నప్పటికీ, రైలు నిలయంలో ఇసుకవేస్తే రాలనంతగా జనం క్రిక్కిరిసి ఉన్నారు. పతాకాలు, తోరణాలతో రైలు నిలయం కన్నుల పండువగా ఉంది.
స్వామీజీ పయనించిన రైలు ఉదయం ఏడున్నర గంటలకు వచ్చి చేరింది. స్వామీజీ రైలు నుండి దిగగానే “జై వివేకానందా!” అన్న జయజయధ్వానాలు మిన్నుముట్టాయి. స్వామీజీ మీద పన్నీటి వర్షం చిలకరించారు, గులాబీపూరేకులు చల్లారు. న్యాయమూర్తి సుబ్రహ్మణ్య అయ్యర్ స్వామీజీని పుష్పమాలాలంకృతుని గావించి, పుష్పగుచ్ఛం సమర్పించి స్వాగతం పలికారు. స్వామీజీతోబాటు స్వామి నిరంజనానంద, స్వామి శివానంద కూడా రైలు నుండి దిగారు.వారితోబాటు బ్రాహ్మణునిలా కచ్చపోసి ధోవతి ధరించిన గుడ్విన్ దిగడం అందరినీ ఆశ్చర్యపరచింది. జనసమ్మర్దం కారణంగా స్వామీజీ అతి నెమ్మదిగానే బయటకు రాగలిగారు. బ్యాండు వాద్యం మ్రోగింది.
‘కుమారా, రా!’
ఠీవిగా ఉన్న రెండు తెల్లగుర్రాలు పూన్చిన బండిలో స్వామీజీని ఆసీనులనుచేశారు. ఆ బండిని అనేక బళ్లు ఊరేగింపుగా అనుసరించాయి. వందకు పైగారక్షకభటులు రాకపోకలను క్రమబద్ధం చేయసాగారు. దారి పొడవునా స్వామీజీపై పువ్వులవర్షం కురిసింది. పండ్లు మొదలైన కానుకలను ఎడతెరపి లేకుండా సమర్పించారు.
స్వామీజీకి చెన్నై పౌరులు అర్పిస్తూన్న నీరాజనాలను తిలకించడానికి ఆయన ప్రథమ శిష్యుడైన స్వామి సదానంద అక్కడకు వచ్చివున్నారు. క్రిక్కిరిసినజనసమూహంలో ఉండకుండా దారిలో ఒక ప్రక్కన నిలబడి తమ గురువుకుతమిళనాడు శ్లాఘిస్తూ ప్రణమిల్లడం మహదానందంతో చూస్తూవుండిపోయాడు.ఆ దారిలో వస్తున్నప్పుడు స్వామీజీ దృష్టి ఆయన మీద పడింది. ఆప్యాయతకట్టలు తెంచుకోగా, “కుమారా, సదానందా! ఇక్కడకు రా” అని స్వామీజీ కేకవేసి, బండిని ఆపించి, తమ ప్రియతమ కుమారుణ్ణి ప్రక్కన కూర్చోబెట్టుకొన్నారు.
జ్ఞానసంబంధ మూర్తి
దారిలో ఒక చోట జనసమూహంలో కష్టపడి దారిచేసుకొంటూ ఒక వృద్ధురాలు వచ్చి స్వామీజీకి ప్రణమిల్లింది. శ్రీలంకలో ప్రారంభమైన భావన ఇక్కడావ్యాపించింది; ఆ వృద్ధురాలు స్వామీజీని తిరుజ్ఞాన సంబంధర్ అవతారంగా పరిగణించింది. అలాగే చెబుతూ జ్ఞానసంబంధమూర్తి అవతారమైన స్వామీజీకి ప్రణమిల్లి తన పాపాల నుండి తాను విముక్తిపొందినట్లుగా తెలిపింది.
‘మదనా రా!’
‘ఆంధ్ర ప్రకాశిక’ కార్యాలయం ఎదుటకు వచ్చినప్పుడు ఊరేగింపు కాసేపు ఆగింది. అక్కడ పందిరి వేసివున్నారు. చెన్నైలో నివసించే తెలుగువారి తరఫున అక్కడ స్వామీజీకి స్వాగతం ఇచ్చారు. నాడు వసంత పంచమి పర్వదినం; మన్మథుడు లేదా మదనుణ్ణి శ్లాఘించే రోజు అది. అందానికి మారుపేరు మన్మథుడు. ఆ స్వాగతంలో మన్మథుణ్ణి, స్వామీజీని పోల్చి ప్రసంగించారు. “మన్మథుడు పూలబాణంతో గెలుస్తాడు; మీరు మీ దివ్యశక్తితో, మీ కంఠస్వరంతో, మీ వచనశక్తితో గెలిచారు” అని వారు ఆ స్వాగత పత్రంలోతెలిపివున్నారు. మరొక చోట సంస్కృత స్వాగతపత్రం సమర్పించారు.
స్వామీజీ ఊరేగింపు చింతాద్రిపేట, నేపియర్ పార్క్, మౌంట్‌రోడ్, వాలాజా రోడ్, చేపాక్, పైక్రాఫ్ట్స్రోడ్, బీచ్‌రోడ్ గుండా వెళ్లింది. చింతాద్రిపేటలోను, పలు ఇతర చోట్లలోను మహిళలు స్వామీజీకి కర్పూర హారతి పట్టారు. దేవతా విగ్రహా లను ఊరేగింపు నిమిత్తం బయటకు తీసుకుపోతున్నప్పుడు పాటించే విధివిహిత సంప్రదాయాలన్నీ ఆ ఊరేగింపులో తు.చ. తప్పక పాటించారని చెప్పడం అతిశయోక్తి కాదు.
చేపాక్ వద్ద ఒక భజన బృందం ఊరేగింపులో కలిసింది. అక్కడ రాజా ఈశ్వరదాస్ బహదూర్ ఏర్పాటుచేసిన అందమైన కమాను ఒకటి ఉంది. ఊరేగింపు దానిని దాటుతున్నప్పుడు బ్యాండ్ బృందం కూడా జత చేరింది. కేసిల్ కెర్నన్ దాకా ఈ బృందం వాద్యాలు వాయిస్తూ వచ్చింది.
ఆఖరికి ఊరేగింపు బీచ్‌రోడ్ చేరింది. అక్కడ కూడా ఊరేగింపులో అసం ఖ్యాకులు కలుసుకొన్నారు. వీరిలో విద్యార్థులు అధిక సంఖ్యాకులు. ఈ విద్యా ర్థులు, స్వామీజీ ఎంత చెప్పినా వినకుండా, గుర్రాలు విప్పివేసి స్వయంగా తామే స్వామీజీ బండిని కేసిల్ కెర్నన్ దాకా లాగారు. అది ఎంత అద్భుతమైన దృశ్యం!
కేసిల్ కెర్నన్లో
ఉదయం తొమ్మిదిన్నర సమయంలో స్వామీజీ కేసిల్ కెర్నన్ చేరుకొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పందిరిలో ఆయనకు ఘనస్వాగతం ఇచ్చారు. ఆ భవంతిని అత్యంత సుందరంగా అలంకరించి ఉన్నారు. అక్కడ కూడా స్వామీజీకి ఘన స్వాగతం లభించింది. సంస్కృతంలోనూ, కన్నడంలోనూ స్వాగత పత్రాలు చదివారు. ఒకటి రెండు క్లుప్తమైన ప్రసంగాల అనంతరం కార్యక్రమం ముగిసింది. స్వామీజీకి విశ్రాంతి అవసరమైనందున, సుబ్రహ్మణ్య అయ్యర్ అందరికీ సెలవిచ్చి పంపివేశారు.
స్వామీజీ తమ సోదర సన్న్యాసులతో లోపలికి వెళ్లి ఉపాహారం పుచ్చుకొని విశ్రాంతి తీసుకొన్నారు. కాని అది చాలాసేపు కొనసాగలేదు. చెన్నైలో ఆయన కార్యక్రమాలను రూఢిపరచడానికి అలసింగ పెరుమాళ్ ప్రభృతులు స్వామీజీ గది లోకి వెళ్లారు.* “నేను ఏయే అంశాల మీద ప్రసంగించాలో, వాటిని మీరే ఎంపిక చేసి నాకు తెలిపితే చాలు” అని స్వామీజీ చెప్పారు. ‘నా ఉద్యమ ప్రణాళిక’, ‘భారతీయ ఋషివరేణ్యులు’, ‘హైందవ జీవితం: వేదాంతం’, ‘భారతదేశ భావి భాగ్యోదయం’ లాంటి నాలుగు ముఖ్యాంశాలను వారు ఎంపిక చేశారు.
నవరాత్రి
స్వామీజీ చెన్నైలో తొమ్మిది రోజులు బసచేశారు. అది చెన్నై పురజనులకు ఒక నవరాత్రి. ప్రతి రోజూ స్వామీజీ ప్రసంగాలతో, భేటీలతో కేసిల్ కెర్నన్ ఒక ఆనంద సంతగా మారింది. ఆ దివ్యపురుషుని సాన్నిధ్య భాగ్యం పొందిన ప్రతి ఒక్కరూ పరమానందసాగరంలో మునిగితేలారని చెప్పడం అతిశయోక్తి కాబోదు. నిర్ణీత సమయాలలోనే స్వామీజీని కలుసుకోవడానికి అనుమతి నిచ్చారు. కాని జరిగింది వేరు. ఉదయం నుండి సాయంత్రం దాకా, అదే విధంగా రాత్రి కూడా ఎడతెరపి లేకుండా పురుషులూ స్త్రీలూ వచ్చి స్వామీజీని దర్శించుకోసాగారు. స్వామీజీ తిరుజ్ఞాన సంబంధర్ అవతారమనే భావన వ్యాపించినందువలన జనసమూహం ఇంకా అధికమైంది.
నిత్యమూ పలువురు మహిళలు స్వామీజీని దర్శించుకొని ఆయన పాద పద్మాల మ్రోల పుష్పాలు అర్పించి, పూజించారు. తిరుపతి నుండి వచ్చిన ఒక వృద్ధుడు స్వామీజీ పాదాలకు ప్రణమిల్లి, ఆయనను పూల మాలాలంకృతుని చేసి, “మీరు వైఖానసుని* అవతారమే” అని శ్లాఘించి కళ్లు చెమ్మగిల్లగా సెలవు పుచ్చుకొని వెళ్లిపోయాడు.
వచ్చిన వారందరూ స్వామీజీకి స్వాగతం పలుకడానికీ, ఆరాధించడానికీ మాత్రమే వచ్చారని భావించరాదు. ఆయనతో వాదించి, ఆయనను తమ దారికి తీసుకురాగలమని కొందరు; ఆయన మేధను పరీక్షించడానికి కొందరు; ఆయ ననే పరీక్షించడానికి కొందరంటూ విభిన్న తరహా వ్యక్తులు అక్కడ సమావేశ మైనారు. ఇవేవీ స్వామీజీకి క్రొత్త కాదు. ఎలాంటి పరిస్థితినైనా అందుకు తగినట్లు ఎదుర్కొని, విజయోపేతులై స్వామీజీ విరాజిల్లారు. ఉదాహరణగా ఒక సంఘటన పరికిద్దాం:
సన్న్యాసానికి అర్హత
ఒక రోజు ఒక పండితుడు స్వామీజీని కలుసుకోవడానికి వచ్చాడు. “బ్రాహ్మణులకు మాత్రమే సన్న్యాసానికి అర్హత ఉంది. మీరు బ్రాహ్మణేతరులు. అలాంటప్పుడు మీరెలా సన్న్యాసి అవుతారు?” అని అడిగారు. అందుకు స్వామీజీ, “ప్రతి బ్రాహ్మణుడూ, ‘యమాయ ధర్మరాజాయ చిత్రగుప్తాయ వై నమః’* అని పారాయణం చేస్తూ ఎవరి పాదపద్మాల మ్రోల పువ్వులు అర్పిస్తున్నారో ఆ చిత్ర గుప్తుని వంశీయుణ్ణి నేను. కనుక బ్రాహ్మణులకు సన్న్యాసం పుచ్చుకొనే హక్కు ఉంటే నాకు వారికన్నా ఎక్కువ హక్కు ఉన్నది” అని జవాబిచ్చాడు. తరువాత ఆ పండితునితో, “మీరు సంస్కృతంలో నన్ను ప్రశ్నించారు. కాని మీ సంస్కృత ఉచ్చారణలో క్షమించరాని దోషం ఉంది. ‘న మ్లేచ్ఛితం వై న అపభాషితం వై ।’ అని పాణిని గర్హిస్తున్నాడు. అందువలన ఈ వివాదాన్ని కొనసాగించే అర్హత మీకు లేదు” అని చెప్పి, వివాదాన్ని ముగింపు నకు తెచ్చారు.
ఫిబ్రవరి 7 : ప్రశ్నోత్తరాలు
ఉదయం దాదాపు 200 మంది కేసిల్ కెర్నన్ ఎదుట వేసిన పందిరిలో సమావేశమయ్యారు. ఆ రోజు ‘ప్రశ్నోత్తరాలు’ కార్యక్రమం జరుగనున్నది. మనస్సుకూ, జడవస్తువులకూ మధ్యనున్న వ్యత్యాసం ఏమిటి, భగవంతుడు నిరా కారుడా, సాకారుడా లాంటి అనేక ప్రశ్నలు ఆ ప్రశ్నోత్తర కార్యక్రమంలో చోటు చేసుకొన్నాయి. స్వామీజీ ఆ ప్రశ్నలన్నిటికీ ఓపికతో, స్పష్టంగా జవాబు లిచ్చారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కార్యక్రమాన్ని వాయిదా వేసి, మళ్లీ సాయంత్రం కొనసాగుతుందని ప్రకటించారు.
సాయంత్రం తిరుపత్తూర్ నుండి శైవమతస్థులు కొందరు అద్వైతం గురిం చిన ఒక ప్రశ్నపత్రం పుచ్చుకొని వచ్చారు. స్వామీజీ వారికి జవాబులు ఇవ్వ డానికి సిద్ధమయ్యారు.
ప్రశ్న : అవ్యక్తమైన పరమాత్మ నుండి వ్యక్తమై కానవస్తూన్న ఈ లోకం ఎలా అభివ్యక్తమౌతున్నది?
ఠక్కున స్వామీజీ జవాబిచ్చారు.
స్వామీజీ : ఎలా, ఎందుకు, ఎక్కణ్ణుండి లాంటి ప్రశ్నలు ఇహానికి సంబం ధించినవి. కాని పరమాత్మ లోకాతీతుడు. మార్పులు, కార్యాకారణ నియతి లాంటి వాటికి అతీతుడు. కనుక మీ ప్రశ్న సబబైనది కాదు. సబబైన ప్రశ్న అడగండి, జవాబు చెబుతాను.
ఈ విధంగా వారి ప్రశ్నలన్నింటికీ తగిన జవాబులు వెంటవెంటనే వచ్చాయి. ప్రశ్నలడిగి ఈయనను ఉక్కిరిబిక్కిరి చేద్దాం, ఇరకాటంలో పెడదామని ఎవరన్నా భావిస్తే, అది పొరబాటని అప్పుడు వారికి తేటతెల్లమయింది. ప్రశ్నలడిగినవారు స్తబ్ధులైనారు.
అన్ని ప్రశ్నలకూ గంభీరంగా జవాబిచ్చిన స్వామీజీ పిదప కరుణామూర్తు లైనారు. ప్రశాంతంగా ఇలా అన్నారు: “భగవంతుని సేవించడానికీ, ఆయన అనుగ్రహం పొందడానికీ శ్రేష్ఠమైన మార్గం పేదలకు సేవ చేయడమే; క్షుధార్తు లకు ఆహారం సమర్పించడం, దుఃఖంతో బాధపడుతున్నవారిని సాంత్వనపర చడం, నిరాధారులైన వారికి చేయూతనిచ్చి పరిరక్షించడం, రోగులకు శుశ్రూష చేయడం – ఇవే అవసరమైనవి.”
స్వామీజీ వచనాలతో పులకితాంతరంగులైన శైవులు వినమ్రంగా ఆయన వద్ద సెలవు పుచ్చుకొని వెళ్లిపోయారు. ఆ రోజు ఆధ్యాత్మికత గురించి ఒక ప్రకాశం ద్యోతకమైందని వారి ముఖాలు చెప్పక చెప్పాయి.
ఆ తరువాత స్వామీజీని స్తుతిస్తూ రచించిన ఒక సంస్కృత శ్లోకం చదివి, ఆయనకు సమర్పించారు. మళ్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది.
ప్రశ్న : కర్మ, విధి – వీటి మధ్యగల తారతమ్యం ఏమిటి?
స్వామీజీ : ఒకరు ఒనరించిన చేతల ఫలమే కర్మ. ఎవరో మన మీద బలవంతంగా ప్రయోగిస్తున్నదని భావింపబడేది విధి. కర్మ అన్నది మనం చేసిన, చేస్తున్న చేతల ఫలంగా ఉండడం వలన మనం దానిని మార్చవచ్చు. అంటే మన కర్మను మనం నిర్ణయించుకోవచ్చు. కాని విధి అందుకు వ్యతిరేకమైనది. మన జీవితాన్ని మనకు నచ్చిన రీతిలో మలచుకోవచ్చునన్న భావనను అది అంగీకరించదు.
తెలుగువాడైన ప్రొఫెసర్ పి. లక్ష్మీనరసు ప్రశ్నలు అడగడం ప్రారంభించిన తరువాత నాటి ప్రశ్నోత్తరాల కార్యక్రమం పాకానపడ్డది. ఆయన బౌద్ధం పుచ్చుకొన్న వ్యక్తి. ఆయన మిత్రుడైన ఎన్.కె. రామస్వామి అయ్యర్ అప్పటికే The Awakener of India అనే పత్రికను నడుపున్నాడు. దాన్లో నరసు వ్యాసాలు వ్రాస్తూవచ్చాడు. ఇప్పుడు స్వామీజీ సహాయంతో The Awakened India (ప్రబుద్ధ భారతం; జాగృతం చెందిన భారతం) అనే వేదాంత పత్రిక ప్రారంభమవడం నరసుకు నచ్చలేదు. స్వామీజీ చేతలు భారతదేశాన్ని జాగృతం చేయలేదు; అందుకు మారుగా తమ పత్రికే భారతదేశాన్ని జాగృతం చేసిందని రామస్వామి అయ్యర్ అభిప్రాయం. కనుక బౌద్ధమత భావనలూ, వేదాంతమూ గురించిన చర్చ అవసర మని నరసు అభిప్రాయపడ్డాడు. స్వామీజీ అందుకు అంగీకరించారు. వేదాంతం గురించిన నరసు వ్యక్తం చేసిన ప్రతి ఖండననూ విడివిడిగా తీసుకొని స్వామీజీ సముచితమైన జవాబులిచ్చారు.
ఫిబ్రవరి 8 : స్వాగతం
అందరూ ఎన్నో ఆశలతో నిరీక్షించిన రోజు అది. సాయంత్రం నాలుగున్నర గంటలకు స్వామీజీకి విక్టోరియా హాల్లో బహిరంగంగా స్వాగతం పలుకడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. విక్టోరియా హాల్ సమీపంలోనూ, దారిపొడవునా ఇసుక వేస్తే రాలనంత జనం గుమిగూడారు. స్వామీజీ రాక మునుపే హాలు నిండి పోయింది. కనీసం పదివేల మంది బయట నిలబడ్డారు. జనసమూహంలో ఎంతో శ్రమతో దారిచేసుకొంటూ వేదిక వద్దకు స్వామీజీ రాగలిగారు. పుర ప్రముఖులు పలువురు అప్పటికే వేదికను అలంకరించి ఉన్నారు. చెన్నై స్వాగత సంఘం, వైదిక విద్వత్ సభ, చెన్నై సామాజిక సంస్కరణ సంఘం లాంటి సంస్థలు స్వాగత పత్రాలు సమర్పించాయి. ఖేత్రీ రాజు పంపిన స్వాగత పత్రం చదివారు. ఇవి కాక సంస్కృతం, ఆంగ్లం, తమిళం, తెలుగు భాషలలో ఇరవై స్వాగత పత్రాలు చదువబడ్డాయి.
గీతా బాణీలో
ఇంతలో బయట నిలబడివున్న జనసమూహం కట్టలు తెంచుకొంది. స్వామీజీ ఆరుబయటకు వచ్చి ప్రసంగించాలని కేకలుపెట్టారు. తక్షణమే స్వామీజీ స్పందించారు. ఠక్కున లేచి, “నేను ప్రజల కోసం వచ్చాను. బయట ఉన్నవారినీ నేను కలుసుకోవాలి” అంటూ బయటకు వచ్చారు. ఆయన కోసం వేచివున్న ‘కోచ్’ బండి మీదికెక్కి నిలబడ్డారు. అప్పుడు ఆ అసంఖ్యాక జన సమూహంలో ఉత్సాహం పరవళ్లు తొక్కింది. వారిని ఉద్దేశించి ప్రసంగించాలి, వారి ఉత్సుకతను సఫలీకృతం చేయాలని స్వామీజీ ప్రసంగించనారంభించారు:
“తానొకటి తలస్తే దైవం మరొకటి తలస్తుంది. ఈ స్వాగతపత్ర సమర్పణ, అందుకు ప్రత్యుత్తరం ఇంగ్లీషువారి ఆచారాన్ననుసరించి జరగాలని ఏర్పాటు చేశారు. కాని భగవంతుని సంకల్పం మరోవిధంగా ఉంది. నే నిప్పుడు రథం మీద నిలబడి భగవద్గీత ఘట్టంలోలా అక్కడక్కడ చెదరుమదురుగా కూర్చున్న ఈ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించవలసి వచ్చింది”….. అంటూ కొన్ని నిమిషాల పాటు ప్రసంగించి ఉంటారు. అంతలో జనసమ్మర్దం మితిమీరిపోయింది. అందు వలన, “మిత్రులారా! మీ ఉత్సాహం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మీ పట్ల నాకు కోపం వచ్చిందని మీరెంత మాత్రం అనుకోకండి. మీరు చూపుతున్న ఈ ఉత్సాహానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎంతటి ఉత్సాహం? అదే కావల సింది. దాన్ని సుస్థిరం చేసుకోండి…. మిత్రులారా, ఇప్పటికి సెలవు పుచ్చు కొంటున్నాను. మీరంతా కోరుకొన్న రీతిలో ప్రసంగించడం సాధ్యం కాదు. కనుక నేటికి నన్ను చూడడంతోనే తృప్తి చెందండి. మరో సందర్భంలో ప్రసంగిస్తాను. ఉత్సాహపూరితమైన మీ స్వాగతానికి కృతజ్ఞతలు” అని తమ ప్రసంగాన్ని ముగించారు.
ఫిబ్రవరి 9
స్వామీజీ రెండు ప్రసంగాలు చేశారు. అలసింగ పెరుమాళ్ తిరువళ్లిక్కేణి సాహితీ సమాజానికి స్వామీజీని ఆహ్వానించాడు. అక్కడ స్వామీజీ, ‘మన ముందున్న పని’ శీర్షిక క్రింద ప్రసంగించారు. నాటి సాయంత్రం విక్టోరియా హాల్లో స్వామీజీ మొదటి ప్రసంగం జరిగింది. దాని శీర్షిక, ‘నా ఉద్యమ ప్రణాళిక’.
‘విజయానికి కారణభూతుడు భగవంతుడే!’
స్వామీజీ పాశ్చాత్య విజయానికి తామే కారణమని కొందరు ప్రచారం చేసుకొంటున్నారు. దానిని ఖండించి, యథార్థ స్థితి ఏమిటో ఈ ప్రసంగం ద్వారా స్వామీజీ విడమరచి తెలిపారు. ఆ ప్రసంగంలో పలువురి నిజ స్థితిని ఆయన వ్యక్తం చేయవలసి వచ్చింది. దివ్యజ్ఞాన సమాజం వారూ, బ్రహ్మసమాజస్థులూ, క్రైస్తవ ఫాదరీలు నిజానికి ఆయనకు సహాయం చేయలేదు. పైగా ఆయనకు ఎన్ని అడ్డంకులు కలిగించాలో అన్నీ చేశారన్న విషయం సన్న్యాసియైన ఆయన నిస్సంకోచంగా, ధైర్యంగా వెల్లడించారు. స్వామీజీ చేసిన ఈ ప్రత్యక్ష దాడి పలు వురికి నచ్చలేదు. స్వామీజీకి అతి సన్నిహితుడూ, చెన్నై స్వాగత సంఘ అధ్యక్షుడూ అయిన న్యాయమూర్తి సుబ్రహ్మణ్య అయ్యర్, స్వామీజీతో సన్నిహితంగా మెలగడం మానేశారు. ఎందుకంటే ఆయన దివ్యజ్ఞాన సమాజంలో అమిత ప్రాధాన్యం వహించిన సభ్యుడు కనుక. కాని ఇలాంటి ఏ సమస్యలూ స్వామీజీ మీద కించిత్తు ప్రతికూలతనూ చూపలేదు. తమ స్థితిని గూర్చి ఆయన బ్రహ్మానంద స్వామికి వ్రాశారు: “దివ్యజ్ఞాన సమాజస్థులూ, తదితరులూ నన్ను భయపెట్టజూశారు. కాబట్టి వారికి నా అభిప్రాయాలను కొంత విడమర్చి చెప్పవలసి వచ్చింది. వారితో కలవనందువల్ల నేను అమెరికాలో ఉన్నంతకాలం వారు నన్ను ఇబ్బంది పెట్టారని నీకు తెలుసు…. నువ్వు భయపడనవసరం లేదు. నేను ఏకాకిగా పని చేయడం లేదు. భగవంతుడు సదా నాతోనే ఉన్నాడు.”*
ఫిబ్రవరి 10
హైందవ సంస్కరణ సంఘం స్వామీజీని అతిథిగా ఆహ్వానించింది. ‘సంస్కరణ, సంస్కరణవాది’ లాంటి అంశాలపై తమ అభిప్రాయాలను అక్కడ స్వామీజీ విపులీకరించారు; ఆ అంశంపై పలువురు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమం పూర్తయ్యాక అక్కణ్ణుండి స్వామీజీ బయలుదేరు తూండగా ఆ సంఘం వారు ఒక అందమైన విసనకర్రను స్వామీజీ కానుకగా సమర్పించారు.
సార్వజనీన ఆలయం
ఫిబ్రవరి 11
ఉదయం స్వామీజీ లజ్ చర్చ్ రోడ్డులో ఉన్న న్యాయమూర్తి సుబ్రహ్మణ్య అయ్యర్ ఇంటికి ఆహ్వానితులై వెళ్లారు. లడ్డు, కాఫీ మొదలైనవి స్వామీజీకి సమర్పించారు. వాటిని ఆయన కాస్త రుచి చూశారు. ఆ రోజు ప్రొఫెసర్ సుందరం అయ్యర్ కూడా అక్కడే ఉన్నారు. తిరువనంతపురంలోనూ స్వామీజీతో సన్నిహితంగా మెలగిన వ్యక్తి ఆయన. భోజన విషయంలో స్వామీజీ పెద్దగా పట్టించుకోరని ఆయన తెలిపారు. నాడు న్యాయమూర్తితో స్వామీజీ తమ, ‘సార్వజనీన ఆలయం’ భావన గూర్చి ముచ్చ టించారు: హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ, బౌద్ధులందరినీ సౌభ్రాతృత్వ భావ నతో ఆ ఆలయంలో సమావేశపరచడం సాధ్యం; ఆ ఆలయ నిర్మాణమే వినూ త్నంగా ఉంటుంది. అన్ని మతాలకు చెందిన ప్రవక్తల శిలావిగ్రహాలూ దాన్లో పొందుపరచి ఉంటాయి. ఆ ఆలయం వెనుక ప్రాంగణంలో ఒక స్తంభంపై ‘ఓం’ చెక్కివుంటుంది.
ఆ రోజు విక్టోరియా హాల్లో స్వామీజీ, “భారతీయ ఋషులు” అన్న శీర్షిక క్రింద రెండవ బహిరంగ ప్రసంగం చేశారు.
ఫిబ్రవరి 12
కాసిల్ కెర్నన్కు ఎడతెగని జనం రాసాగారు. సాయంత్రం నాలుగు గంటలముప్ఫై నిమిషాలకు స్వామీజీ హిందూ థియోలాజికల్ ఉన్నత పాఠశాలకువెళ్లారు. అక్కడ ఆయనకు రెండు స్వాగత పత్రాలు సమర్పించారు. స్వామీజీవాటిని స్వీకరించి, ప్రసంగించారు. ఈ కార్యక్రమానంతరం పెరంబూర్ అన్నదానసమాజం ఆరవ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పచ్చయప్ప హాల్లో నిర్వహించారు. అక్కడ కూడా స్వామీజీ క్లుప్తంగా ప్రసంగించారు.
ఫిబ్రవరి 13
సాయంత్రం పచ్చయప్ప హాల్లో, ‘హైందవ జీవితం – వేదాంతం’ అనేశీర్షిక క్రింద 3 వ బహిరంగ ప్రసంగం చేశారు స్వామీజీ. ఆ రోజు వేదికను జి. సుబ్రహ్మణ్య అయ్యర్* కూడా అలంకరించారు. ప్రసంగం మధ్యలో స్వామీజీయువకులకు పిలుపునిచ్చే ప్రస్తావన వచ్చింది: “మొదట మన యువకులు బలిష్ఠులు కావాలి. మత నిష్ఠ ఆ తర్వాత దానంతట అదే వస్తుంది… భగవద్గీతాపారాయణ కన్నా ‘ఫుట్‌బాల్’ ఆటే మిమ్మల్ని త్వరగా మోక్షమార్గానికి తీసుకొనివెళుతుంది…. మీ జబ్బలు, కండరాలు ఇంకా కొంచెం బలపడినప్పుడు మీరింకాబాగా గీతను అర్థం చేసుకోగలుగుతారు”* అని ప్రసంగించారు. ఇది వింటూన్నసుబ్రహ్మణ్య అయ్యర్ ప్రక్కనే ఉన్న వ్యక్తితో తమిళంలో, “ఇదే నేనూ పదే పదేచెబుతున్నాను. కాని ఒక్కరు కూడా దానిని పెద్దగా పరిగణించడం లేదు. ఇప్పుడుస్వామీజీ చెబుతున్నారు, అంతా కరతాళధ్వనులు చేస్తున్నారు” అన్నారట.
ప్రసంగం ముగించి స్వామీజీ రాయపేట పేటర్సన్ ఉద్యానంలోని ఎల్.గోవిందదాస్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. ఆంగ్లేయులు పలువురు అక్కడసమావేశమై ఉన్నారు. స్వామీజీకి స్వాగతపత్రం సమర్పించారు. పిదప వీణ, గిటార్ వాద్య ప్రదర్శనలు నిర్వహించారు. తదనంతరం స్వామీజీకి నారింజరంగు పట్టు వస్త్రాలు అర్పించి ఆయనను పుష్పమాలాలంకృతుని చేశారు.
ఫిబ్రవరి 14
హార్మ్స్టన్ సర్కస్ ఆవరణలో స్వామీజీ చివరి బహిరంగ ప్రసంగం చేశారు. దాదాపు మూడువేల మంది హాజరయ్యారు. శీర్షిక ‘భారతదేశ భావిభాగ్యోదయం’. “స్వామీజీ ప్రసంగశక్తి నాడు పరాకాష్ఠకు చేరుకొంది. వేదిక మీద అటూ ఇటూ పచార్లు చేస్తూ ఆయన ప్రసంగించడం ఒక సింహం ఏకాంతంలో పచార్లు చేస్తూ, గర్జిస్తూన్నట్లు ఉంది. ఆయన కంఠం అన్ని వైపులా ప్రతిధ్వనించి, శ్రోతల హృద యాలలో చొచ్చుకొనిపోయినట్లు ఉంది” అని సుందరరామ అయ్యర్ వ్రాశారు.
తమిళుల పట్ల ఆశ
ఈ ప్రసంగంలోనే స్వామీజీ తమిళ ప్రజల పట్ల గల తమ ఆశనూ, తమ నమ్మకాన్నీ వ్యక్తం చేశారు: “చెన్నపురి యువకులారా! నా ఆశలు మీ మీదే ఉన్నాయి. మీ జాతి పిలుపును మీరు ఆలకిస్తారా?”* ఇది తమ చివరి ప్రసంగం కావడం వల్లనో ఏమో ఆయన తమిళుల పట్ల అంతటి అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగం పూర్తి కాగానే కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. “ఇక మీదట స్వామీజీ ప్రతి సంవత్స రమూ చెన్నైకి విచ్చేస్తారు” అని ప్రకటించబడ్డది. కాని దేవుని సంకల్పమేమిటో అలా ఉన్నట్లు లేదు!
ప్రేమమూర్తి
స్వామీజీ తమతోనే అనవరతం ఉండిపోవాలనే ఆకాంక్ష ఎవరికి మటుకు ఉండదు? కాని చెన్నైతోనే ఆయన ఉద్యమ కార్యం ఆగిపోదు కదా! ఆయన పయనం కొనసాగాలి. ఇంకా అసంఖ్యాక హృదయాలకు సాంత్వనం కలిగించాలి, ఇంకా ఎన్నో పనులకు రూపకల్పన చేయాలి. కాబట్టే ఆయన 15 వ తేదీ బయలుదేరడానికి నిర్ణయించుకొన్నారు. మరో విషయం. స్వామీజీ చెప్పినట్లు, “సన్న్యాసులకూ శరీరం అంటూ ఒకటి ఉంది” కదా! నిరంతర పయనమూ, అటూ ఇటూ తిరుగాడడమూ ఆయన దేహారోగ్యాన్ని దెబ్బతీశాయి. “ఒకింత విశ్రాంతి లభించకుంటే ఇంకా ఆరు నెలలు ప్రాణంతో ఉంటానో లేదో తెలియడం లేదు” అని శ్రీమతి సారాకు ఆయన వ్రాశారు.
స్వామీజీ ఉద్యమ కార్యం సాధారణ మానవ దేహం తట్టుకోగల కార్యమా? దేహరీత్యా మాత్రమే యోచించినా కూడా ఆశ్చర్యంగా ఉంటుంది! సామాన్యంగా మాట్లాడడంలోనే ఎక్కువ శక్తి వృథా అవుతుంది. పైగా ధ్వని విస్తరణ సాధనం (microphone) లేని ఆ కాలంలో వేలమంది సమావేశమైన సభల్లో అందరికీ వినబడేట్లు ప్రసంగించడంలో ఎంత శక్తిని వినియోగించాలో యోచించండి! ఇలాంటి ప్రసంగాలు ఎన్నో కదా! ఇదంతా భరిస్తూ ఆయన జీవించారే, అదే ఆశ్చర్యం, మనం చేసుకొన్న మహద్భాగ్యం! స్వామీజీని ‘ప్రేమమూర్తి’ అని శ్లాఘిస్తూన్నది ఒక స్తుతి. మన కోసం, దేశం కోసం, తమ దేహారోగ్య స్థితితో సహా సమస్తం త్యాగం చేసిన ప్రేమమూర్తి ఆయన!
చెన్నైలో శాశ్వత సంస్థ
స్వామీజీ కొన్ని రోజులు తమతో గడిపి, ఆ తరువాత వెళ్లిపోతారన్న విషయాన్ని చెన్నై భక్తులు జీర్ణించుకోలేకపోయారు. అయినప్పటికీ నిజం అదేనన్నది వారికి తెలియకపోలేదు. ఆయన సందేశాన్ని పదిలపరచుకోవడం ఆయననే తమ వద్ద ఉంచుకొన్నట్లు; ఇంకా చెప్పాలంటే, స్వామీజీకి కూడా అదే సమ్మతమని గ్రహించిన చెన్నై భక్తులు అందుకోసం పాటుపడ ప్రయత్నించారు. చెన్నై నుండి స్వామీజీ బయలుదేరడానికి ముందు రోజు చెన్నైలో ఒక శాశ్వత సంస్థ ఏర్పాటు చేయడాన్ని గురించి ఆయనతో ముచ్చటించారు. సంవత్సరంలో ఒకసారైనా స్వామీజీ వచ్చి ఆ సంస్థ సముచిత రీతిలో సాగేటట్లు చూడవలసిందని వారు విన్నవించారు. శాశ్వత సంస్థ ఒకటి అవసరం అన్నంత దాకా స్వామీజీ వారి ఆకాంక్షకు సమ్మతించారు. కాని తమ రాక గూర్చి ఆయన ఏమీ చెప్పలేదు. అందుకు బదులుగా “నేను మీ కోసం నా సోదర సన్య్యాసిని ఒకరిని పంపుతాను. ఇక్కడున్న శ్రోత్రియులకే శ్రోత్రియునిగా విరాజిల్లే వ్యక్తి ఆయన” అని తెలిపారు.*
సెలవు పుచ్చుకొన్నారు
రైలులో పయనించడం కన్నా నౌకలో వెళ్లడం దేహారోగ్యానికి మంచిదని ఎంచి స్వామీజీ కలకత్తాకు నౌకలో బయలుదేర నిర్ణయించారు. ఫిబ్రవరి 15 వ తేదీ ఉదయం 8 గంటలకు స్వామీజీ నౌకాశ్రయానికి వెళ్ల వలసి ఉంది. వేకువన నాలుగు గంటల నుండే అధిక సంఖ్యలో జనం అక్కడ గుమిగూడసాగారు. సాగనంపే ఉత్సవార్థం అక్కడ ఒక పందిరి నిర్మించారు. ఏడున్నరకు స్వామీజీ అరుదెంచారు. ఆర్యవైశ్య కులస్థుల (తెలుగు కోమట్లు) తరఫున ఒక వందన సమర్పణ పత్రం చదివి, స్వామీజీకి సమర్పించారు. స్వామీజీ అందుకు జవాబుగా ప్రసంగించలేదు. “పొంగిపొరలే భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి మౌనమే అత్యుత్తమ మార్గం” అని, స్వామీజీ నౌక ఎక్కడానికి బయలుదేరారు. హృదయభారంతోను, చెమ్మ గిల్లిన కళ్లతోను స్వామీజీని సాగనంపారు తమిళనాడు భక్తులు. ఆయనతో సేవియర్ దంపతులూ, గుడ్విన్, అలసింగ పెరుమాళ్, నరసింహాచార్యులు, కిడి కూడా వెళ్లారు.
‘అగ్నిపర్వతంలా బ్రద్దలవుతాను!’
రుగ్మత, అలసట కారణంగా స్వామీజీ తరచూ నీళ్లు త్రాగవలసి వచ్చేది. మంచినీళ్లకు బదులుగా లేత కొబ్బరికాయ నీరు త్రాగడం దేహారోగ్యానికి మంచి దని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఈ సంగతి తెలిసిన భక్తులు నౌకలో కొబ్బరిబోండాలను గుట్టలుగుట్టలుగా పేర్చిపెట్టారు. స్వామీజీతో పయనించనున్న శ్రీమతి సేవియర్కు ఇదంతా ఏమీ అర్థం కాలేదు. ఆమె స్వామీజీతో, “స్వామీజీ, మనం సరకుల నౌకలోనా పయనించబోతున్నాం?” అని అడిగింది. స్వామీజీ చిన్నగా నవ్వి, విషయం వివరించి చెప్పారు.
నౌక లంగరు తీయడానికి ఇంకా కొంత సమయం ఉంది. ప్రొఫెసర్ సుందరరామ అయ్యర్ కూడా స్వామీజీని సాగనంపి రావడానికి నౌకలోకి వెళ్లారు. అప్పుడు ఆయన, “స్వామీజీ! పాశ్చాత్యంలో మీరు ఒనరించిన పని ఏ మేరకు వారికి శాశ్వత ప్రయోజనకారిగా ఉంటుంది?” అని అడిగాడు. అందుకు స్వామీజీ, “పెద్దగా ఏమీ చెప్పలేం. ఇక్కడా అక్కడా కొన్ని బీజాలు వెదజల్లాను. కాలక్రమంలో అవి కొందరికైనా సత్ఫలాన్ని అందించవచ్చు” అన్నారు వినమ్రంగా. అయ్యర్ మళ్లీ, “స్వామీజీ! మిమ్మల్ని మేం మళ్లీ చూడగలమా? దక్షిణ భారతదేశ ఉద్యమ కార్యాలను కొనసాగిస్తారా?” అని అడిగారు. “తప్పకుండా, నిస్సం దేహంగా, హిమాలయాల్లో ఒకింత విశ్రాంతి తీసుకొంటాను. ఆ తరువాత దేశ వ్యాప్తంగా అగ్నిపర్వతంలా బ్రద్దలవుతాను” అన్నారు స్వామీజీ. కాని జగజ్జనని సంకల్పం ఏమిటో అలా ఉన్నట్లు లేదు!
నౌక కలకత్తా వైపుగా బయలుదేరింది.