ప్రపంచమే ఒక బాలక్రీడ – ప్రచారం చేయడమూ, బోధించడమూ అన్నింటినీ చేర్చే చెబుతున్నాను.
– స్వామి వివేకానంద
స్విట్జర్లాండ్‌లో — మంచు పర్వత శ్రేణులలో — విశ్రాంతి మృగ్యం — కృపానంద మనస్సు మార్చుకోవడం — వేశ్యలూ భక్తురాండ్రే — జర్మనీలో — పాల్ డ్యూసన్తో — ‘ఉమాదేవిలా వర్ధిల్లుగాక!’ — భారతం ఆహ్వానిస్తున్నది — ధూళిని సైతం ప్రేమిస్తాను!
స్విట్జర్లాండ్‌లో
స్వి ట్జర్లాండ్లో కొన్ని రోజులు గడపమని ప్రతిపాదన చేసినప్పుడు స్వామీజీ ఎంతో సంతోషించారు. స్విట్జర్లాండ్ అనగానే స్వామీజీకి హిమాలయాలూ, వాటి అత్యద్భుత పరిసరాలూ జ్ఞాపకానికి వచ్చివుంటాయి. “ఆహా! మంచు పర్వత శిఖరాలను తిలకించడానికి, సుదీర్ఘమైన కొండ బాటలలో నడిచివెళ్లడానికి నా మనస్సు ఎంత తపిస్తున్నదో తెలుసా?” అన్నారు స్వామీజీ భావోద్వేగంతో.
ఐరోపాలోని సుందరమైన పర్వతశ్రేణులలో ఒకటియైన ఆల్ప్స్ స్విట్జర్లాండ్‌లో నెలకొన్నది. దేశ విస్తీర్ణంలో 60% స్థలాన్ని ఆ పర్వతశ్రేణి ఆక్రమించింది. 10, 000 నుండి 15, 000 అడుగుల ఎత్తు గల 71 శిఖరాలు ఆ శ్రేణిలో ఉన్నాయి. అత్యంత ఎత్తైన ‘మౌంట్ బ్లాంక్’ సుప్రసిద్ధ జెనీవా నగరం నుండి 40 మైళ్ల దూరంలో ఉంది. వేలాది హిమానీనదాలు ఆ పర్వత శ్రేణిలో కదులుతున్నాయి. వేలకొద్దీ జలపాతాలు పడుతున్నాయి. 100 అడుగుల ఎత్తు 340 అడుగుల వెడల్పుగల అతి పెద్ద రైన్ జలపాతం అక్కడే వెలసివుంది. ఈ ప్రకృతి దృశ్యాలన్నీ స్వామీజీ కళ్లలో ఒక హిమాలయ కలను కల్పింపజేశాయి. పరివ్రాజక సన్న్యాసి జీవితం మళ్లీ ఆయన కనుల ముందు అస్పష్టంగా మెదలింది.
1896 జూలై 19 వ తేదీన స్వామీజీ లండన్ నుండి స్విట్జర్లాండ్ బయలు దేరారు. సేవియర్ దంపతులు, మిస్ ముల్లర్ కూడా ఆయనతోబాటు వెళ్లారు. దారిలో ఒక రోజు రాత్రి ప్యారిస్‌లో గడిపి మర్నాడు జెనీవా చేరుకొన్నారు. వారు బసచేసిన హోటల్ ఒక అందమైన సరోవరతీరంలో ఉంది. జెనీవా చేరుకొన్నాక స్వామీజీ ఒక బాలుడే అయ్యారని చెప్పాలి – అంతలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందపరవశులయ్యారు.
కొయ్య చేతిపనుల, కొయ్య శిల్పాల ప్రదర్శనశాలను చూస్తూ మొదటి రోజు గడిపారు. ఆ రోజు సాయంత్రం గాలితో నింపిన బెలూన్ సాయంతో గగనవీథిలో సంచారం చేశారు. “పైకి–పైకి–పైకి! బెలూన్ ఇలా పైపైకి పోతూనేవుంది. ఒక పక్షి ఆకాశమార్గంలో అలవోకగా ఎగిరిపోతున్నట్లుగా ఈ బెలూన్ తేలుతూ వెళుతూన్నది. బెలూన్ నుండి చూసినప్పుడు సూర్యాస్తమానం అత్యద్భుత దృశ్యంగా కనిపించింది” అంటూ స్వామీజీ వ్రాశారు. పైనుండి క్రిందికి చూసినప్పుడు స్విట్జర్లాండ్ దేశం యావత్తు ఒక చిత్తరువులా కనబడడం చూసి ఆయన ఉత్సాహం అవధులు దాటింది.
మంచు పర్వత శ్రేణులలో
మౌంట్ బ్లాంక్ శిఖరాన్ని సందర్శించాలనే ఆతురతతో అందరూ సోమేనీ గ్రామం చేరుకొన్నారు. వెళ్లే దారి కనులపండువ చేసే ప్రకృతి రమణీయ దృశ్యాల కొలువై ఉంది. అనేక కొండలతో ఆవృతమైన ప్రాంతం అది. కాని హిమాలయ మంచుపర్వతాలకూ ఇక్కడి వాటికీ తారతమ్యం ఉందని స్వామీజీ వ్యాఖ్యానించారు. మౌంట్ బ్లాంక్ ప్రదర్శించిన దృశ్యం హిమాలయాలలో సైతం తాను చూడని అరుదైన దృశ్యంగా ఆయన అభివర్ణించారు. మౌంట్ బ్లాంక్‌ను చూడగానే దానిని ఆరోహించాలనే ఉత్సుకత ఆయనలో జనించింది. కాని పర్వతారోహణలో శిక్షణ పొందినవారు మాత్రమే దానిని ఆరోహించగరని నచ్చజెప్పి ఆయనను ఆ ప్రయత్నం నుంచి విరమింపజేశారు.
ప్రపంచంలో అందమైన హిమానీనదాల్లో ఒకటైన మెర్ – డి – గ్లేస్ అక్కడే నెలకొని ఉంది. దానినైనా దాటాలని స్వామీజీ అభిలషించి ఆ ప్రయత్నంలో దానిలోకి దిగారు. అనుకొన్నంత సులభసాధ్యంగా కనిపించలేదది. నడక సాగించిన కాసేపటికే స్వామీజీకి శ్రమ తెలియవచ్చింది. దానిని దాటిన తరువాత ఒక నిటారైన ప్రాంతం ఎదురయింది. దానిని దాటగలిగితేనే గ్రామాన్ని చేరుకోవడం సాధ్యం. దానిని ఆరోహించినప్పుడు ఎత్తు కారణంగా గాలిలో ఆక్సిజన్ తగ్గడంతో స్వామీజీకి తల తిరిగింది.
సెయింట్ ఫ్రాన్సిస్ జన్మించిన లిటిల్ సెయింట్ బెర్నాడ్డ్ అనే ఊరిని వారు సందర్శించారు. అందమైన కుక్కపిల్లలకు ఆ ఊరు ఖ్యాతిగాంచింది. ఆ కుక్క పిల్లలను చూసిన స్వామీజీ వాటిలో ఒక్కదాన్నైనా భారతదేశానికి తీసుకొని వెళ్లాలని అభిలషించారు. కాని అవన్నీ అప్పటికే కొనుగోలు చేయబడ్డాయి.
ఒక రోజు అందరూ ఒక మంచుకొండను ఎక్కుతున్నారు. స్వామీజీ ఉపనిషత్ మంత్రాలు ఉచ్చరిస్తూ వాటిని విపులీకరిస్తూ వస్తున్నారు. కాసేపటికల్లా వాటి భావంలో మగ్నులైపోయి మౌనం దాల్చారు. ఆయన గమనవేగం తగ్గింది. బహుశా ఆయనకు ఇబ్బంది కలిగించరాదనే ఉద్దేశంతో తక్కినవారు కాస్త ముందుగా నడవసాగారు. క్రమంగా స్వామీజీ బాగా వెనకబడిపోయారు. ఇనుప ఆధారంగల చేతికర్రను మంచు మీద ఆనుస్తూ ఆయన నడుస్తున్నారు. హఠాత్తుగా ఆ చేతికర్ర మంచులో కూరుకుపోయింది. ఆయనకూడా మంచులో కూరుకుపో సాగారు. కాని పూర్తిగా కూరుకుపోయేంతలో అదృష్టవశాత్తూ కాపాడబడ్డారు. ఆ రోజు తాను మంచులో సజీవ సమాధి కాకుండా తప్పించుకోవడం భగవంతుని అనుగ్రహమేనని ఆ తరువాత స్వామీజీ తక్కినవారితో చెప్పారు. అది విని అందరూ నిర్ఘాంతపోయారు. భగవంతుని అనుగ్రహానికి కృతజ్ఞత చెల్లించి, ఇకపై మరెప్పుడూ స్వామీజీని ఒంటరిగా వదలిపెట్టరాదని నిర్ణయించుకొన్నారు.
తిరిగి వస్తున్నప్పుడు ఒక అందమైన చిన్న చర్చ్ తారసపడింది. దారిలో వస్తున్నప్పుడు స్వామీజీ కొన్ని సుగంధభరిత పుష్పాలను సేకరించారు. వాటిని మిసెస్ సేవియర్కు అందించి మేరీమాత పాదాల మ్రోల సమర్పించమన్నారు. “ఆమె కూడా నా తల్లే కదా!” అన్నారాయన. అయినప్పటికీ క్రైస్తవేతరుడయిన తాను పుష్పాలు అర్పిస్తే చర్చ్‌లోని వారు అభ్యంతరం చెప్పవచ్చునేమోనని మిసెస్ సేవియర్ ద్వారా సమర్పించారు!
విశ్రాంతి మృగ్యం
ఆల్ప్స్ పర్వతాల మనోహర పరిసరాలలో ఆల్పైన్ గ్రామంలో విశ్రాంతి తీసుకొంటున్నప్పటికీ స్వామీజీ వ్యవహారాలన్నిటి నుండి వైదొలగగలిగారా అంటే లేదనే చెప్పాలి. “విశ్రాంతి అనే పదమే నా నుదుట వ్రాసిలేదు” అంటూ కాలాంతరంలో ఆయన వ్యాఖ్యానించడం, ఆయన యావజ్జీవితానికి ఆపాదించుకోవచ్చు.
హిమాలయాల్లో ఒక ఆశ్రమం నెలకొల్పి ప్రశాంత జీవితం గడపాలనుకొన్న సేవియర్ దంపతుల నిర్ణయానికి ఆల్పైన్ గ్రామీణ జీవితం శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. హిమాలయాల్లో తప్పనిసరిగా ఆశ్రమం నెలకొల్పాలనే ఉద్దేశం ఇప్పుడు వారి మనస్సుల్లో స్థిరపడింది. అందుకోసం స్వామీజీ అల్మోరా వాస్తవ్యుడయిన లాలా బద్రీషాకు జాబు వ్రాశారు.
ఇంతలో చెన్నై నుండి స్వామీజీకి అలసింగ లేఖ అందింది. బ్రహ్మవాదిన్ పత్రిక ప్రచురించడం ఎంతో కష్టంగా ఉందనీ, ఆర్థిక సహాయం ఏదీ అందలేదనీ అతడు వ్రాశాడు. “నీ ఉత్తరం ద్వారా బ్రహ్మవాదిన్ పత్రిక ఆర్థిక దుఃస్థితిలో ఉందని తెలిసింది. లండన్‌కు తిరిగి వెళ్లాక నీకు సాయం చేయడానికి ప్రయత్ని స్తాను….. అలాంటి పత్రిక సహజంగా, స్వకీయ సహాయం ద్వారానే నడవాలి. మనం ఆ విధంగా తప్పక చేద్దాం. కొన్ని నెలలు ఓపిక వహించు”* అంటూ ఆతడికి జవాబు వ్రాశారు స్వామీజీ.
కృపానంద మనస్సు మార్చుకోవడం
తదుపరి ఆఘాతంగా వచ్చాయి అమెరికా ఉత్తరాలు. స్వామీజీ నుండి సన్న్యాసదీక్ష పుచ్చుకొన్న వారిలో ఒకరైన లియాన్ లాన్స్బర్గ్ (స్వామి కృపానంద) స్వామీజీ నుండి వైదొలగ నారంభించాడు. 1894 ప్రారంభ కాలంలో ఆతడు స్వామీజీని కలుసుకొన్నాడు. దివ్యజ్ఞాన సమాజ సభ్యుడైన ఆతడు రష్యాదేశానికి చెందిన ఒక యూదుడు. ఎలాంటి ఉన్నత లక్ష్యాలూ లేకుండా జీవితం గడపిన వ్యక్తి అతడు. “ప్రేమించడానికి ఎవరూ లేరు, ప్రయత్నించడానికి ఏదీ లేదు. మధుర స్వప్నాలను కల్పించి హృదయాన్ని ప్రకాశవంతం చేయడానికి ఏదీ లేదు” అంటూ తనను గురించి ఆతడు వ్రాసుకొన్నాడు. స్వామీజీ సాంగత్యం ఆతడికి ఆ మధుర స్వప్నాన్ని లభింపజేసింది. కాని ఆ హఠాత్ మాధుర్యాన్ని ఆతడు తట్టుకోలేకపోయి ఉంటాడు కాబోలు! ఆతడిలో భక్తి, కారుణ్యం, విశాలహృదయం, బీదసాదలపట్ల సానుభూతి లాంటి ఎన్నో సద్గుణాలతోపాటు స్వార్థమూ, మితిమీరిన కోపమూ, ఆత్మ కనికరమూ, అసూయా మొదలైన దుర్గుణాలు కూడా ఉన్నాయి. వీటి కారణంగా ఆతడు స్వయంగా తనూ కష్టపడి, ఇతరులకూ కష్టాలు వాటిల్లజేశాడు. 1895 లో న్యూయార్క్‌లో తరగతులు నిర్వహించినప్పుడు స్వామీజీకి చేదోడువాదోడుగా ఆతడు ఉన్నాడు. తదనంతరం సహస్రద్వీప వనంలో స్వామీజీ వద్ద సన్న్యాసదీక్ష పుచ్చుకొని కృపానంద నామధేయాన్ని సంతరించుకొన్నాడు.
1895 జూలైలో ఆతడి గురించి అనేక విపరీత వార్తలు స్వామీజీకి అందసాగాయి. పిదప అనేకులకు ఆతడు వ్రాసిన లేఖల నుండి ఆతడి మానసిక స్థితి అస్తవ్యస్తంగా ఉందని తెలియవచ్చింది. స్వామీజీ కార్యాచరణకే అడ్డంకులు కల్పించే రీతిలో ఆతడు వ్యవహరించాడు. స్వామీజీ అంతులేని ఆవేదన చెందారు. ఈ విషయంగా గుడ్విన్కు స్వామీజీ వ్రాసిన లేఖ అత్యద్భుతం:
“వివిధ లేఖల ద్వారా కృపానందుడి గురించి ఎంతో తెలుసుకొన్నాను. అతణ్ణి చూసి విచారపడుతున్నాను. అతడిలో ఏదో వక్రత కనిపిస్తోంది. అతడి దారిన ఆతణ్ణి పోనివ్వు. అతణ్ణి గురించి మీ రెవరూ బాధపడవద్దు.
“నన్ను నొప్పించడమా? దేవదానవులక్కూడా నన్ను నొప్పించే శక్తి లేదు. కనుక నిశ్చింతగా ఉండు. అచంచలమైన ప్రేమ, పరిపూర్ణ నిస్వార్థం సర్వాన్ని జయిస్తుంది. వేదాంతులమయిన మనం ఏ సంకటం వాటిల్లినా, ఏ విషమ సమస్యలు ఎదురైనా, ‘నా కెందుకు ఆ విధంగా కనిపిస్తూన్నది? ప్రేమచే దీన్ని ఎందుకు జయించలేను?’ అని మనలను మనం ప్రశ్నించుకోవాలి…..
“మహత్కార్యాల సాధనకు నిరంతర దీర్ఘకాల ప్రయత్నం అవసరం. అది ఫలించకపోయినా మనం కలత చెందకూడదు. ఆధ్యాత్మికాగ్నిచే తరిమివేయబడు తున్నప్పుడు అనేకులు పతనం చెందడం, కష్టాలు వాటిల్లడం, అప్రతిహతమైన ఆటంకాలు పొడసూపడం, మానవ హృదయంలో స్వార్థం మొదలైన పిశాచాలు కఠోరంగా పెనగులాడడం సహజం. ఈ విశ్వంలో నిశ్శ్రేయతకు దారి కఠినంగాను, నిటారుగాను ఉంటుంది. అనేకులు సాఫల్యమవడం ఆశ్చర్యం. కాని అనేకమంది పడిపోవడంలో ఆశ్చర్యంలేదు. సహస్రాధికమైన పతనాల వల్లనే నడవడి ఏర్పడు తుంది.
“నా బడలిక చాలావరకూ తీరింది. కిటికీలో నుండి చూసినప్పుడు నా ముందున్న ఘనీభవించిన మంచు ప్రవాహాలు కనిపించి హిమాలయాల్లో ఉన్నానా అనిపిస్తోంది. ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. నా నరాలు సహజమైన బలాన్ని పుంజుకొన్నాయి. నువ్వు వ్రాసినటువంటి చిన్న చిన్న కలతలు నన్ను అసలు స్పృశించడంలేదు. ఈ పిల్లల ఆట వలన నే నెలా చలిస్తాను? ప్రచారం, ప్రబోధం ఇత్యాదులతో కూడిన ఈ లోకమే ఒక పిల్లల ఆట…..
“కొన్ని రోజుల క్రితం కృపానందునికి జాబు వ్రాయాలనే అణచుకోలేని కోర్కె అకస్మాత్తుగా కలిగింది. అతడు దిగులుపడి నన్ను తలచి ఉండవచ్చు. అందుకే ఆతడికి ప్రేమపూర్వకమైన జాబు వ్రాశాను. అమెరికా నుండి అందిన సమాచారం వలన, ఆ విధంగా ఎందుకు జరిగిందో నాకు తెలిసింది. ఘనీభవించిన ఈ మంచుప్రవాహాల వద్ద సేకరించిన కొన్ని పుష్పాలను అతడికి పంపించాను. ఆతడికి కొంత పైకం, అధికంగా ప్రేమ పంపమని వాల్డోకు వ్రాశాను. ప్రేమ ఏనాటికీ నశించదు. బిడ్డలు ఏం చేసినా, ఎలా ఉన్నా తండ్రి ప్రేమ ఎన్నటికీ సమసిపోదు. అతడు నా బిడ్డ. అతడు దుఃస్థితిలో ఉన్నందున నా ప్రేమ, నా సహాయాల్లో ఆతడికి ఇతరులతో సమానంగా కానీ లేక అధికంగా కానీ పాలు ఉంది.”*
తమ ప్రేమనంతా రంగరించి స్వామీజీ కృపానందకు ఒక ఉత్తరం వ్రాశారు. సమీపంలోని మంచుపర్వతాల వద్దకి వెళ్లి ఆతడి కోసం ఒక పుష్పం కోసి దానిని కూడా ఆ లేఖతోపాటు పంపించారు:
“పవిత్రుడవుగా మెలగు. అన్నిటికన్నా ఎక్కువగా నిష్కపటంగా ఉండు. ఒక్క క్షణమైనా భగవద్విశ్వాసాన్ని కోల్పోకు. అప్పుడు నీకు దారి కనిపిస్తుంది. ఏది సత్యం అన్నది నిత్యం. సత్యం కానిదాన్ని ఎవరూ నిలుపజాలరు. అన్వేషణ ద్వారా ప్రతి విషయం వెల్లడి అవుతున్న ఈ తరుణంలో మనం జన్మించడం వలన ఉపకారం పొందాం. ఇతరులు ఏం తలచినా, ఏం చేసినా సరే, నువ్వు మాత్రం నీ పావనత్వ, నైతికవర్తన, భగవద్భక్తి స్థాయులను దిగజార్చకు. అన్నింటి కన్నా ముఖ్యంగా రహస్య సంఘాల విషయంలో అప్రమత్తంగా ఉండు. భగవంతుణ్ణి ప్రేమించే వాడెవ్వడూ మోసాన్ని చూసి భయపడనవసరం లేదు. భువిలోగాని, దివిలోగాని పవిత్రత ఒక్కటే సర్వోత్కృష్టమయిన దివ్యశక్తి…. నువ్వు మాత్రం భగవంతుని చేతిని విడువకుండా ఉండు. అది చాలు…
“నిన్న ‘మాంటిరోసా’ లోని ఘనీభవించిన మంచుప్రవాహం వద్దకు వెళ్లి, సదా మంచుతో నిండిన ప్రాంతంలో పూచిన కొన్ని దృఢమైన పుష్పాలను సేకరించాను. ఈ ఐహిక జీవితం అనే మంచులో నువ్వు అలాంటి ఆధ్యాత్మిక స్థైర్యాన్ని పొందుతావనే ఉద్దేశంతో ఆ పుష్పాలలో ఒక దానిని ఈ ఉత్తరంతోపాటు పంపుతున్నాను.”*
వేశ్యలూ భక్తురాండ్రే
తరువాత కలకత్తా నుంచి వచ్చిన ఒక ఉత్తరం సమస్యను తెచ్చింది. ఆ సంవత్సరం శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవం దక్షిణేశ్వరంలో జరిపారు. దాన్లో కొందరు వేశ్యలు పాల్గొన్నారు. ఈ విషయం విని కొందరు ఆ ఉత్సవంలో పాల్గొనడానికి సంకోచించారు. ఈ విషయంగా స్వామీజీ అభిప్రాయమేమిటో తెలుపమని మఠం నుండి ఉత్తరం వచ్చింది. అందుకు స్వామీజీ వ్రాసిన జవాబు ఆయన కారుణ్య వెల్లువకూ, సామాజిక స్పృహకూ ఒక ఉత్కృష్ట ఉదాహరణగా భాసిల్లుతూన్నది:
“ఈ విషయంలో నా నిర్ణయం ఇది:
“ 1. దక్షిణేశ్వరం లాంటి గొప్ప తీర్థస్థలానికి వేశ్యలను రానివ్వకపోతే, వారు మరెక్కడికి పోతారు? ప్రత్యేకించి పాపాత్ముల కోసమే భగవంతుడు అవతరించాడు; అంతగా పుణ్యాత్ముల కోసం కాదు.
“ 2. నరక ద్వారాలైన స్త్రీ పురుష భేదం, కుల, ధన, విద్యాది వ్యత్యాసాలను లోకానికి మాత్రమే పరిమితం చేయి. పవిత్ర తీర్థ స్థలాల్లో అలాంటి భేదాలు ఎడతెగక పాటిస్తూంటే, వాటికీ నరకానికీ తేడా ఏముంది?
“ 3. మనది మహత్తరమైన జగన్నాథ క్షేత్రం. పుణ్యాత్ములకూ, పాపాత్ములకూ, సాధువులకూ, దుర్మార్గులకూ వయోభేదం పాటించక స్త్రీలకూ, పురుషులకూ, బాలలకూ – అందరికీ అక్కడ సమానమైన హక్కు ఉంది. సంవత్సరంలో ఒక్క రోజయినా వేలాది స్త్రీ పురుషులు పాపభావాన్నీ, భేదభావాన్నీ విస్మరించి, ప్రభు నామాన్ని గానం చేస్తూ, ఆలకిస్తూ మెలగడం అనేదే పరమ శ్రేయస్కరమైన విషయం.
“ 4. తీర్థ స్థలంలోనే ఒక్క రోజు చెడు భావన అణగిపోకపోతే ఆ లోపం మీదిగాని, వారిది కాదు. దగ్గరకు వచ్చిన వారినందరినీ కొట్టుకొనిపోగల ఆధ్యాత్మిక ఉత్తుంగ తరంగాన్ని సృష్టించండి.
“ 5. దేవాలయంలోనే ఈమె వేశ్య, అతడు నిమ్నకులస్థుడు, ఇతడు పేదవాడు, అతడు పామరుడు అని వివేచించేవారు (మీరు పెద్దమనుషులనే వారు) ఎంత తక్కువమంది వస్తే అంత మంచిది. స్త్రీ పురుష వ్యత్యాసాన్నీ, కుల తారతమ్యాన్నీ గమనించేవారు, భక్తులుగా నటించేవారు మన ప్రభువును అర్థం చేసుకోగలరా? వందలాది వ్యభిచారిణులు వచ్చి, ఆయన పాదపద్మాల మ్రోల అవనత శిరస్కులవాలని ప్రార్థిస్తున్నాను. ఒక్క పెద్దమనిషి అయినా రాకపోయినా ఫరవాలేదు. ఓ వ్యభిచారిణులారా రండి! ఓ తాగుబోతులారా రండి! చోరులారా రండి! మీరంతా రండి! శ్రీరామకృష్ణుల వాకిలి మీ అందరికీ తెరువబడివుంది. ‘ధనికుడు స్వర్గసామ్రాజ్యంలో ప్రవేశించడం కన్నా, సూదిబెజ్జంలో ఒంటె దూరడం సులభం.’ అలాంటి క్రూర రాక్షస భావాలు మీ మనస్సులో చోటుచేసుకోనివ్వకండి.
“ 6. కాని కొంత సాంఘిక భద్రత అవసరం. మనం దాన్నెలా సమకూర్చ గలం? కొందరు పురుషులు (ముఖ్యంగా వృద్ధులు) ఈ ఉత్సవం నాడు భద్రత కాపాడేవారుగా మసలుకోవాలి. ఉత్సవ ప్రాంగణం చుట్టూ వారు తిరుగుతూ, ఏ స్త్రీగాని, ఏ పురుషుడుగాని మాటలోగాని, ప్రవర్తనలోగాని అసభ్యత కనబరిస్తే, ఆ వ్యక్తిని తోట ఆవరణ బయటికి పంపివెయ్యాలి. సత్ప్రవర్తన కలిగి ఉన్న స్త్రీ, పురుషులు – వారు యోగ్యులైనా, వ్యభిచారిణులైనా కూడా – వారు భక్తులే, గౌరవనీయులే.”*
ఒక కోణం నుండి చూసినప్పుడు, ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులూ, సమస్యలూ స్వామీజీకి అవసరమనే చెప్పాలి. కించిత్తు ఉద్దీపనతోనే ధ్యానంలోనూ, సమాధిలోనూ లయించిపోయే వ్యక్తి ఆయన. ఆల్పైన్ లాంటి ప్రశాంత ప్రాంతాలు ఆయనను ఏకమొత్తంగా తమలో లయింపచేసుకోకూడదనే ఉద్దేశంతో గురుదేవులే వీటిని కల్పించి ఉండాలి!
జర్మనీలో
సిట్జర్లాండ్ నుండి స్వామీజీ జర్మనీ వెళ్లారు. ముందుగా వారు హైడిల్బర్గ్ అనే ఊరికి వెళ్లారు. జర్మనీలోని గొప్ప పేరుగాంచిన విశ్వవిద్యాలయాలు అక్కడ నెలకొనివున్నాయి. వాటిని సందర్శించారు. ఆ ఊళ్లోని ప్రాచీనమైన కోటను కూడా సందర్శించారు. అక్కడున్న ఒక నేలమాళిగలో ఉంచబడిన ప్రపంచంలోని అతి పెద్ద ద్రాక్షసారా జాడీని చూశారు. రైన్ నది గుండా స్టీమర్లో పయనించి వారు కోలోన్ చేరుకొన్నారు. అక్కడ కొన్ని రోజులు గడిపారు. బంగారు పనితనంతోనూ, కొయ్య పనితంతోనూ కనులపండువ చేసే చర్చ్‌లను సందర్శించారు.
జర్మనీ రాజధాని బెర్లిన్. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన సైనికబలం గల దేశంగా ఆనాడు జర్మనీ పరిగణింపబడ్డది. అక్కడకు వెళ్లాలని స్వామీజీ ఎంతగానో అభిలషించారు. బెర్లిన్ నగర సౌందర్యాన్నీ, ఐశ్వర సమృద్ధినీ చూసి ఆయన ఆశ్చర్యచకితులయ్యారు.
పాల్ డ్యూసన్తో
స్వామీజీ బృందం తదుపరి కీల్ నగరానికి వెళ్లారు. అక్కడ ప్రొఫెసర్ పాల్ డ్యూసన్ను కలుసుకొన్నారు. జర్మన్ తత్త్వశాస్త్ర శాఖలో ప్రొఫెసరైన ఆయన ప్రాచ్యదేశాల తత్త్వాలపట్ల ఎంతో ఆసక్తిగల వ్యక్తి. సంస్కృతంలో చక్కని పాండిత్యం గడించిన డ్యూసన్ భారత దేశాన్ని ఎంతగానో అభిమానించాడు, భారతదేశాన్ని సందర్శించాడు కూడా. ప్రొఫెసర్, ఆయన సతీమణీ స్వామీజీని ఆహ్వానించారు. స్వామీజీ, ప్రొఫెసర్ – ఇద్దరూ ఎంతో ఆసక్తితో పరస్పర భావనలను చర్చించుకొన్నారు. తాను భారతదేశానికి వచ్చినప్పుడు చూసిన దృశ్యాలనూ, పొందిన అనుభవాలనూ డ్యూసన్ వివరించాడు. ఇద్దరి మధ్య చక్కని మైత్రి పెంపొందింది.
పాల్ డ్యూసన్ ఇంట్లో ఒకటి రెండు రోజులు స్వామీజీ బసచేశారు. అక్కడ కూడా ఒకసారి ఆయన అమేయ జ్ఞాపకశక్తి వెల్లడయింది. ఒక రోజు స్వామీజీ ఒక కావ్యం చదువుతున్నారు. అప్పుడు అక్కడికి వచ్చిన పాల్ డ్యూసన్ స్వామీజీని పిలిచాడు, మాట్లాడాలని ప్రయత్నించాడు. కాని స్వామీజీ నుండి ఎలాంటి స్పందనా లేదు. ఒకటి రెండుసార్లు పిలిచి ఆయన వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తరువాత ఒక రోజు ఈ విషయం గురించి ఆయన స్వామీజీతో ప్రస్తావించాడు. అందుకు స్వామీజీ తాను చదవడంలో నిమగ్నుడై ఉన్నందున ఆయన పిలుపును వినలేదని చెప్పారు. ఈ జవాబు పాల్ డ్యూసన్కు తృప్తి కలిగించలేదు. ఆ రోజు ఇద్దరూ మాట్లాడుకొంటున్నప్పుడు, ఆ కావ్యం నుండి స్వామీజీ అనేక ఉదాహరణలను పేర్కొనడం చూసి పాల్ డ్యూసన్ విస్తుబోయాడు. స్వామీజీ జ్ఞాపకశక్తి ఆతణ్ణి ఆశ్చర్యచకితుణ్ణి చేసింది.
మాక్స్ ముల్లర్కూ, పాల్ డ్యూసన్కూ మధ్య ఎంతో తారతమ్యం ఉంది. మాక్స్ ముల్లర్లా ఈయన తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేక పోయాడు. ఆంగ్లో–ఇండియా అధికారుల ఆదరణా, ఇంగ్లండ్‌లోని తక్కిన పండితుల సహకారమూ అవసరమైనందున భారతదేశం పట్ల గల ఆసక్తినో, ఉత్సుకతనో పాల్ డ్యూసన్ బాహాటంగా వెల్లడించలేకపోయాడు.
‘ఉమాదేవిలా వర్ధిల్లుగాక!’
దాదాపు రెండు నెలలు ఐరోపా యాత్రలలో ప్రశాంతంగా గడిపిన తరువాత సెప్టెంబర్ 17 వ తేదీన స్వామీజీ ఇంగ్లండ్ తిరిగి వచ్చారు. ఆయన ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడింది. మళ్లీ ఇంగ్లండ్‌లో తమ కార్యాచరణను ప్రారంభించారు. ఇంతలో అమెరికా కార్యాచరణను కొనసాగించడానికి అభేదానంద త్వరలో భారతదేశం నుండి రానున్న వార్త కూడా ఆయనకు ఆనందాన్ని కలిగించింది. హేరియేట్ హేల్ వివాహ వార్త కూడా అక్కడ ఆయన కోసం ఎదురుచూస్తోంది. ఆయన హేరియేట్కు ఇలా జవాబు వ్రాశారు:
“ప్రతి దానినీ సాధ్యమయినంత వరకు చక్కగా నిర్వర్తించాలి. నీ విషయంలో నాకు తెలిసినంత వరకు, నీది శాంత స్వభావం. దాని వలన నీకు ఎంతో ఓర్పు, సహనశక్తి ఉన్నాయి.
“నీకూ, నీ భర్తకూ సకల శుభాలూ కలుగుగాక! నీలాంటి మంచి, తెలివైన, ప్రేమించే, అందమైన భార్య దక్కడం తన మహద్భాగ్యమని అతడు సదా గుర్తించేట్లు భగవంతుడు చేస్తాడుగాక! ఇంత త్వరలో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి రావడం సాధ్యం కాదని భయపడుతున్నాను. నీ వివాహాన్ని తిలకించాలని నేను అభిలషిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో నేను చెయ్యగలిగింది మా గ్రంథాల్లోని ఒక దాన్లో నుండి ఉదాహరించడమే:
‘ఈ జీవితంలో కోరదగినవన్నీ పొందడానికి నీ భర్తకు సాయం చేస్తూ అవిచ్ఛిన్నమైన ఆతడి ప్రేమను సదా అనుభవిస్తూంటావు గాక! మనుమలను, మనుమరాళ్లను చూసి, జీవిత నాటకం ముగిసే సమయం ఆసన్నమయినప్పుడు, ఏ పావనాంబువుల స్పర్శ వలన సకల భేదాలూ లయించి మనమంతా ఏకమౌతామో, ఆ అనంత సచ్చిదానంద సాగరాన్ని చేరడానికి మీరు ఒండొరులు సహాయం చేసుకొంటారు గాక!’*
‘నువ్వు జీవితాంతం ఉమాదేవిలా పతివ్రతగానూ, పరిశుద్ధురాలిగానూ విరాజిల్లుతావు గాక! నీ భర్త ఉమాదేవిపట్ల తన ప్రాణాన్ని ఉంచుకొన్న పరమ శివునిలా ఉంటాడు గాక! ఉంటాడు గాక!’*
భారతం ఆహ్వానిస్తున్నది
ఎందుకో లండన్ కార్యాచరణ గురించి స్వామీజీకి ఒక సందేహం ఉండనే ఉంది. “లండన్‌లో పని క్రమంగా అభివృద్ధి చెందుతోంది. తరగతులు అంతకంతకూ విస్తృతమవుతున్నాయి. ఈ లెక్కనుబట్టి ఈ పని వృద్ధి చెందు తుందనడంలో సందేహం లేదు. ఆంగ్లేయులు స్థిరచిత్తులు, విశ్వసనీయులు. కాని నేను వదలిపెడితే ఈ సౌధం కుప్ప కూలుతుంది. ఏదో ఒకటి జరుగుతుంది. ఈ పని చేయడానికి సమర్థుడు ఉద్భవిస్తాడు. ఏది మంచిదో భగవంతుడికి తెలుసు”* అంటూ ఆయన అలసింగకు వ్రాశారు.
ఇంగ్లండు పనుల అభివృద్ధికి తాను అక్కడ ఉండడం ఎంతో ఆవశ్యకమని స్వామీజీకి తెలియకపోలేదు. 1897 ఏప్రెల్‌లో ఆయన రష్యా వెళ్లాలని కూడా నిశ్చయించుకొన్నారు. కాని హఠాత్తుగా ఒక రోజు మాతృదేశానికి తిరిగిపోనున్నట్లు ప్రకటించారు. ఆయన ఈ విషయం చెప్పినప్పుడు ఆయన మిత్రులూ, శిష్యులూ, విద్యార్థులూ నిజంగానే దిగ్భ్రాంతి చెందారు.
“ఇంకొక మూడు ప్రసంగాలతో నా లండన్ కార్యాచరణ పూర్తి కాబోతున్నది. పని ‘ఉచ్చస్థితి’ అందుకొన్న సమయంలో దానిని వదలిపెట్టడం సమంజసం కాదని అందరూ అభిప్రాయపడుతున్నారు. కాని ఆప్తుడైన భగవంతుడు ‘ప్రాచీన భారతదేశానికి బయలుదేర’ మంటున్నాడు. దానినే నేను శిరసావహిస్తున్నాను”* అని ఆయన ‘జో’ కు వ్రాశారు.
జీవితంలో ఏ నిర్ణయాన్ని అయినా భగవంతుని సంకల్పం ప్రకారమే కదా స్వామీజీ నెరవేర్చేవారు! ఆ భగవంతుడు ఆయన భారతదేశానికి తిరిగి వెళ్లాలని సంకల్పిస్తే దానిని జవదాటుతారా ఏమిటి? నవంబర్ మధ్యలో ఒక రోజు ఆయన మిసెస్ సేవియర్‌ను పిలిచి, నేపిల్స్ నుండి ఇటలీ మీదుగా భారతదేశం వెళ్లే ఓడలో వీలయినంత త్వరలో నాలుగు టికెట్లు కొనమన్నారు. స్వామీజీ హఠాత్ నిర్ణయాలూ, మార్పులూ ఆమెకు క్రొత్త కాదు. అయినప్పటికీ ఆమె కాస్త ఉలికిపడింది. కాని వెంటనే డిసెంబర్ 16 వ తేదీన బయలుదేరే ఓడలో నాలుగు టిక్కెట్లు కొనుగోలు చేసింది. స్వామీజీ, సేవియర్ దంపతులు, గుడ్విన్ – వీరే ఆ నలుగురు.
ధూళిని సైతం ప్రేమిస్తాను!
స్వామీజీ వెళ్లిపోతున్నారనే వార్త అందరి మనస్సులనూ శోకతప్తం చేసింది. వీడ్కోలు విందులు మొదలయ్యాయి. అనేక చోట్ల ఆయన గౌరవార్థం విందులు ఏర్పాటుచేశారు. ఆయన భారతదేశానికి బయలుదేరే ముందు ఒక మిత్రుడు ఆయనతో, “స్వామీజీ! పటాటోపమూ, సంపత్తీ అధికంగా ఉన్న పాశ్చాత్యదేశాలలో నాలుగేళ్లు గడిపారు. ఇదిగో ఇప్పుడు మాతృదేశానికి తిరిగి వెళుతున్నారు. మీ మాతృదేశం గురించి ఇప్పుడు ఏం అనుకొంటున్నారు?” అని అడిగాడు. స్వామీజీ కళ్లలో ఆనంద కిరణ పుంజం వెల్లివిరిసింది. ఆయన ముఖారవిందాన పరమానందం ద్యోతకమయింది. భావోద్వేగంతో, “అక్కడ నుండి వచ్చే ముందు నేను భారతదేశాన్ని ప్రేమించాను. ఇప్పుడో భారతీయ ధూళి సైతం నాకు పరమపావనంగా తోస్తున్నది. అక్కడ వీస్తున్న గాలి సైతం పావనం. అదొక పుణ్య భూమి. అదొక తీర్థ స్థలం” అన్నారు.
స్వామీజీ ఓడ మాతృదేశం వైపుగా సాగింది. సేవియర్ దంపతులతో ఆయన ఇలా అన్నారు: “ఇప్పుడు నా మనస్సులో ఉన్నది ఏకైక చింతన మాత్రమే. అది భారతదేశం. భారతదేశం చేరుకోవాలని నేను ఆతురతతో ఎదురుచూస్తున్నాను.”
చెన్నై శ్రీరామకృష్ణ మఠంలోని శ్రీరామకృష్ణ దేవాలయమూ అక్కడ ఆరాధింపబడుతున్న స్వామి వివేకానంద్