భగవంతుడొకడు ఉన్నాడు. ఆయనే తల్లి, ఆయనే తండ్రి. తన బిడ్డలను ఆయన ఎన్నడూ వదలిపెట్టడు, ఎన్నటికీ వదలిపెట్టడు, వదలడు, వదలడు. నా ఆత్మ నాయకా! నా దేవుడా! నీకు జయం! జయం!
– స్వామి వివేకానంద
‘లెక్చర్ బ్యూరో’ — హేల్ కుటుంబం — డెట్రాయిట్లో — మంచు తుపాను సూచన — మూడు ప్రశ్నలు — మత మార్పిడా? — ఏసుక్త్రీస్తుకు అభిముఖంగా తిరగండి — ఫాదరీల ప్రతిఘటన — గారడీ ప్రదర్శనలు వద్దు — మజుందార్ ప్రచారం — రమాబాయి వర్గం వారు — దివ్యజ్ఞాన సమాజస్థుల ప్రయత్నం — విషం ఏం చేస్తుంది? — స్వామీజీ ప్రయత్నం — హిందువుల మందకొడితనం — భారతదేశంలో నవ జాగృతి — శత్రువు పట్ల సైతం ద్రవించే మనస్సు — పరిస్థితే ఆస్కారంగా…. — లెక్చర్ బ్యూరో నుండి వైదొలగడం — ‘శివోఽహం’ అంటున్నాను! — తరగతి ప్రసంగాలు — ప్రేతాత్మవాదుల బెదరింపులు — స్వేచ్ఛాయుత చింతనాశీలుర ప్రతిఘటన
‘లెక్చర్ బ్యూరో’
పా శ్చాత్య దేశాలకు సందేశం అందించాలి – ఇది స్వామీజీ పాశ్చాత్య దేశాల విజయంలో ఒక వైపు. మరో వైపు, గత వైభవం పొందేలా భారతదేశాన్ని ఉద్ధరించడం, అందుకైన కార్యాచరణ ప్రణాళికకు అవసరమైన నిధులు సేకరించడం. కాని జరిగింది మరొకటి. కార్యాచరణ ప్రణాళిక దాకా ఎందుకు, దైనందిన ఖర్చులకే పైకం అందడం లేదు. “నిరుపేదలైన నా దేశంలోని సోదరులకు సాయం కోరడానికై నే నిక్కడికి వచ్చివున్నాను; క్రైస్తవ దేశంలో పరాయి మతస్థులకు సాయాన్ని పొందడం ఎంత కష్టమో పూర్తిగా నాకు అర్థమయింది’* అంటూ సర్వమత మహాసభలో సెప్టెంబర్ 20 వ తేదీన స్వామీజీ పేర్కొన్నారు.
కనుక నిధులు సేకరించే ఉద్దేశంతో ఉపన్యాసాలు చేయాలని స్వామీజీ నిశ్చయించుకొన్నారు. “నా ప్రణాళికల నిమిత్తం తీవ్రంగా పాటుపడబోతున్నాను. నా ప్రణాళికలను వెంటనే బయటపెట్టను. వాటిని నేపథ్యంలో ఉంచుకొని, తక్కిన వక్తల మాదిరే నేనూ పనిచేస్తాను” అని అలసింగకు ఆయన వ్రాశారు. తక్కిన వక్తలని స్వామీజీ సూచించింది పూనాకు చెందిన క్రైస్తవ మహిళ కుమారి సోరబ్జీ, సర్వమత మహాసభలో జైన మత ప్రతినిధిగా పాల్గొన్న వీర్చంద్ గాంధీ. అప్పటికే వారిద్దరూ అనేక చోట్ల ప్రసంగాలు చేసి నిధులు సేకరింపనారంభించారు.
ఈ ప్రసంగ ప్రణాళికా పథకంలో ఒక భాగంగా మూడు సంవత్సరాలకు ‘స్లేటన్ లైసియం లెక్చర్ బ్యూరో’ తో స్వామీజీ ఒక ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఆయన ప్రసంగాలకు పైకం వసూలు చేయబడుతుంది; వారు ముందుగా నిర్ణయించబడిన మొత్తాన్ని స్వామీజీకి అందజేస్తారు. ఈ రీతిలో స్వామీజీ ప్రసంగాలు కొనసాగాయి.
నవంబర్ 20 వ తేదీన చికాగో నుండి స్వామీజీ మ్యాడిసన్‌కు బయలు దేరారు. ఈ రోజులు ఉత్తేజభరితమైనవిగా గడిచాయి. కాస్త కూడా విశ్రాంతి లేకుండా స్వామీజీ బొంగరంలా గిరగిరా తిరిగారు. దాదాపు వేయి మైళ్ల పరిధిలో ఉన్న విస్కాన్సిన్, మిన్నసోటా, అయోవా అనే మూడు రాష్ట్రాలలో ఎడతెగక ప్రయాణం చేస్తూ ఆయన ఉపన్యాసాలు చేశారు. 1894 జనవరిలో చికాగో తిరిగి వచ్చారు.
హేల్ కుటుంబం
తాను జన్మించిన కుటుంబాన్ని సన్న్యాసి పరిత్యజిస్తాడు. కాని ప్రపంచమనే అతిపెద్ద కుటుంబాన్ని స్వీకరిస్తాడు. అక్కడ కూడా తల్లి, తండ్రి, సోదరులు, సోదరీమణులు, బంధువులు ఉంటారు. కాని ఆ బాంధవ్యాలు సంకుచితమైనవి కాకుండా విస్తృతించిన, విశాలమైన పరి మాణంలో ఉంటాయి. రక్తసంబంధాలు కానీ, ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు కానీ లేని పావనమైన బంధుత్వం అది.
భారతదేశంలో సోదర సన్న్యాసులూ, శిష్యులూ స్వామీజీ సోదరులుగా, కుమారులుగా విరాజిల్లినట్లే, అమెరికాలో కూడా అనేకులు ఆయనకు సన్నిహిత బంధువులుగా మెలగారు. హేల్ కుటుంబం ఆ కోవకు చెందినది. మొదట్లో దిక్కులేని స్థితిలో వీథి ప్రక్కన కూర్చున్నప్పుడు, తన ఇంటి తలుపులు తెరచి ఆయనకు సర్వమత మహాసభకు దారి చూపిన వ్యక్తి మిసెస్ హేల్. ఆమెను స్వామీజీ ‘మదర్ చర్చ్’ అని సంబోధించేవారు. స్వామీజీని కలుసుకొన్నప్పుడు ఆమెకు 56 ఏళ్లు. ఈమెను స్వామీజీ సాక్షాత్తు తల్లిగానే పరిగణించారు. మిసెస్ హేల్ కూడా స్వామీజీని తన కుమారునిగానే భావించింది. పాశ్చాత్యుల ఆచార వ్యవహారాలు పాటించడం తెలియని స్వామీజీకి వాటిని నేర్పించడంతోబాటు కొన్ని సమయాల్లో ఆయనను మందలించడం కూడా కద్దు. మిస్టర్ హేల్‌ను ‘ఫాదర్ పోప్’ అని స్వామీజీ సంబోధించేవారు.
హేల్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు – మేరీ హేల్, హారియట్ హేల్; ఒక కుమారుడు – శామ్యుల్. వారికి సమవయస్కులైన వరుసకు సోదరీమణులు ఇద్దరు – ఇసబెల్ మెకిన్లీ, హారియెట్ మెకన్లీ; వీరు కూడా ఆ కుటుంబంతోనే ఉంటున్నారు.
ఈ నలుగురు మహిళలు స్వామీజీ కన్నా చిన్నవారు. వీరికి స్వామీజీ అనేక ఉత్తరాలు వ్రాశారు. ఈ ఉత్తరాల నుండి స్వామీజీ జీవితంలో ఈ స్త్రీలకు గల స్థానం స్పష్టంగా తెలియవస్తుంది. “నా ఉత్తేజభరిత, వేగవంతమైన జీవితంలో మీరే సుమధుర సంగీతంగా భాసిల్లుతున్నారు. మీకూ, అమ్మకూ సమస్త ఆశీస్సులూ లభిస్తాయిగాక” అంటూ వీరిని గురించి వ్రాసివున్నారు.
తొలుత హేల్ కుటుంబమే స్వామీజీ కార్యాలయ కేంద్రమయింది. స్వామీజీ లేఖలకు ఉత్తరప్రత్యుత్తరాలను చూసుకోవడంతోపాటు ఆయన పుస్తకాలు, దుస్తులు లాంటి అన్నింటినీ వారే పదిలపరచేవారు. ఆయనకు అవసరమైనప్పుడు ధన సహాయం కూడా చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే, అలసిసొలసి వచ్చే వ్యక్తికి ప్రశాంతతను, విశ్రాంతిని అందించే ఇల్లులా, తుపాను వేగంతో ఉపన్యాసాలు ఇచ్చి అలసిపోయి తిరిగివచ్చే స్వామీజీకి ప్రశాంతమయిన ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించారు హేల్ కుటుంబం వారు.
డెట్రాయిట్లో
అప్పుడప్పుడు హేల్ కుటుంబంతో బస చేస్తున్న స్వామీజీ 1894 ఫిబ్రవరి 12 వ తేదీన డెట్రాయిట్ వెళ్లారు. చికాగో నుండి దాదాపు 270 మైళ్ల దూరంలో ఉంది డెట్రాయిట్. స్వామీజీ అమెరికా కార్యాచరణకు డెట్రాయిట్ ఒక స్థావరమైందనవచ్చు. విత్తనాలు నాటడానికి ముందు పొలం దున్ని సిద్ధపరచాలి. భారతీయ ఆధ్యాత్మికతా బీజాలను అమెరికా అనే క్షేత్రం స్వీకరించాలంటే, అందుకు అమెరికా ప్రజల మనస్సులు భారతదేశ యథార్థ స్థితిగతులను గ్రహించాలి. కాని పరిస్థితి అలా లేదని ఈలోపు గానే స్వామీజీ స్పష్టంగా తెలుసుకొన్నారు. క్రైస్తవ మిషనరీలు, రమాబాయి బృందాలు లాంటివి కల్పించి చెప్పినవి, నిజానికి వ్యతిరేకమైన చిత్రణలే వారికి తెలుసు. పేదరికం, ఆకలి, పస్తులు, కరవు, అంటువ్యాధులతోను, బిడ్డలను మొసళ్ల నోట్లో విసిరివేసే మహిళలు, రథ చక్రాల క్రింద ఆత్మాహుతి చేసుకొనే భక్తులతోను నిండిన ఘోరమైన దేశంగా భారతదేశాన్ని అమెరికన్లు భావించారు. అవన్నీ నిజాలు కావని యథార్థ పరిస్థితిని తెలియజేయడం స్వామీజీ ప్రథమ కర్తవ్యం. డెట్రాయిట్ ఉపన్యాసాలలో స్వామీజీ అదే చేశారు. భారతీయ ఆధ్యాత్మికతలోని వివిధ పరిమాణాలు ఆయన ఉపన్యాసాలలో ముఖ్యాంశాలైనప్పటికీ, ప్రతి ప్రసంగం లోను భారతదేశపు వాస్తవిక చిత్రాన్ని వారి ముందుంచడానికి ప్రయత్నించారు. ఇటువంటి అవాస్తవిక చిత్రాన్ని అమెరికన్లకు ప్రదర్శించి చూపిన ఫాదరీలను, మిషనరీలను ప్రతిఘటించవలసిన అవసరం స్వామీజీకి అనివార్యమయింది.
మంచు తుపాను సూచన
స్వామీజీ డెట్రాయిట్ రోజులు ఎలా ఉండబోతాయో సూచించే రీతిలో ఒక ప్రకృతి వైపరీత్యం జరిగింది. ఆయన డెట్రాయిట్ చేరుకొన్న రోజున ప్రచండమైన మంచు తుపాను చెలరేగింది. నగరమే సర్వనాశనమై పోతుందే మోనని భయపడేటంత ఉద్ధృతంగా చెలరేగింది ఆ మంచు తుపాను. స్వామీజీ కూడా తమ పాశ్చాత్య కార్యాచరణలో అత్యంత తీవ్రమైన ప్రతిఘటనను అక్కడ చవిచూశారు. స్వామీజీ డెట్రాయిట్లో మిసెస్ బాగ్లీ అనే మహిళ ఇంట్లో బసచేశారు. మిచిగన్ గవర్నరుగా పనిచేసిన జాన్ హడ్సన్ వితంతువు ఆమె. ఆమె అనేక సామాజిక సేవాకార్యక్రమాలలో పాల్గొని ప్రజలలో ఎంతో ప్రాచుర్యం సముపార్జించుకొన్నది. చికాగో ప్రపంచ ప్రదర్శన కార్యకర్తలలో ఒకరుగా ఆమె వ్యవహరించింది. డెట్రాయిట్ వచ్చినప్పుడు స్వామీజీకి ఘనమైన స్వాగతం ఇచ్చిందామె. డెట్రాయిట్‌లోని పెద్దమనుషులు 300 మంది, ఫాదరీలు, బిషప్పులు యూదుమత గురువులు, ప్రొఫెసర్లు, మేయర్ మొదలైనవారు ఆ స్వాగతోత్సవంలో పాల్గొన్నారు.
మంచు తుపాను వస్తున్న సూచన ఆ స్వాగతోత్సవంలోనే రూఢి అయింది. హఠాత్తుగా ఒక మహిళ లేచి స్వామీజీ వద్దకు వచ్చింది. ఆయన ఎదుట నిలబడిప్రతిఘటిస్తూ నోటికి హద్దూపద్దూ లేకుండా ఆయనను నానా దుర్భాషలాడింది. బిగ్గరగా అరవసాగింది తక్కినవారు జోక్యంచేసుకొని ఆమెను బయటికి పంపిం చారు. కాని స్వామీజీ ప్రశాంతతగాని, గాంభీర్యంగాని చెక్కుచెదరలేదు. ఇది అందరికీ ఆశ్చర్యంగా కనిపించింది. ఆయన పట్ల వారికిగల గౌరవం ఇనుమడించింది.
డెట్రాయిట్లో ఒక వారం గడిపి, మూడు ప్రసంగాలు చేసేటట్లుగా ఏర్పాట్లు చేశారు. కాని ప్రజల నుండి అనుకోనంతగా ఆదరణా, స్వామీజీ మరిన్ని ప్రసంగాలు చేయాలని వారు చూపించిన ఉత్సాహమూ ఆయన ప్రయాణాన్ని వాయిదా వేయించాయి. ఇక్కడ చక్కని ఆదరణ లభించినట్లే స్వామీజీని ఘాటుగా విమర్శించిన వారూ లేకపోలేదు. ప్రత్యేకించి ఆయన క్రైస్తవ మిషనరీల గురించి చేసిన వ్యాఖ్యానాలు దారుణమైన నిరసనలకు గురయ్యాయి. ఇంతలో చికాగోకు తిరిగి వెళ్లిపోయిన స్వామీజీ ఆ నిరసనలకు బదులు చెప్పడానికి మళ్లీ డెట్రాయిట్కు రావలసివచ్చింది. మొత్తం మీద ఫిబ్రవరి 12 నుండి 23 వరకు మొదటిసారి, తదుపరి మార్చ్ 9 నుండి 30 వరకు రెండవసారి స్వామీజీ డెట్రాయిట్లో గడిపారు. ఈ కాలఘట్టంలో 8 బహిరంగ ఉపన్యాసాలు చేశారు. ఇవే కాకుండా చుట్టుప్రక్కల గల ఊళ్లలోను ప్రసంగాలు చేశారు. తరగతి ప్రసంగాలు, భేటీలులాంటివి కూడా నిర్వహించారు.
విమర్శలు, అవమానాలు, వదంతులు–ఇలా అన్నిటా మిసెస్ బాగ్లీ స్వామీజీకి ఒక పరిరక్షకురాలిగా నిలిచింది. మతమౌఢ్యం తాండవించిన ఆ రోజుల్లో పరాయి మతానికి చెందిన ఒక వ్యక్తికి ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమనేది తక్కిన క్రైస్తవుల నుండి దారుణమైన విమర్శలనూ, విరోధాన్నీ ఆహ్వానించడమే అవుతుంది. కాని బాగ్లీ వీటినన్నింటినీ అపరిమిత భక్తితోను, మనఃస్థైర్యంతోను ప్రతిఘటించింది. బాగ్లీకి తొమ్మిదేళ్ల మనుమరాలు ఉంది. క్రైస్తవేతరునికి ఇంట్లో బస ఇచ్చినందుకు పాఠశాలలలో తోటి విద్యార్థులు ఆమెను ఎగతాళి చేశారట! చిన్నపిల్లలలో సైతం మత జాతి మౌఢ్యం ఎంతగా పాదుకుపోయిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
మూడు ప్రశ్నలు
ఎక్కడకు వెళ్లినా స్వామీజీకి తప్పనిసరిగా ఎదురైన ప్రశ్నలు మూడు. భారతదేశాన్ని గురించి ఫాదరీలు, మిషనరీలు, రమాబాయి వర్గీయులు ఎలాంటి చిత్రాన్ని ప్రదర్శించి చూపారో ఈ ప్రశ్నల నుండి తెలుసుకోవచ్చు. ఆ ప్రశ్నలు:
- భారతదేశంలో తల్లిదండ్రులు శిశువులను మొసలి నోట్లో విసిరివేస్తారా?
- జనులు జగన్నాథ రథచక్రాల క్రింద పడి ఆత్మాహుతి చేసుకొంటున్నారా?
- భర్త మరణిస్తే అతడితోపాటు భార్యను సజీవంగా దహనం చేస్తారా?
ఒకసారి యూనిటేరియన్ చర్చ్‌లో స్వామీజీ ప్రసంగానంతరం, “ఇక ప్రశ్నలు అడగగోరేవారు అడగవచ్చు” అని ప్రకటించారు. ఒక కాగితం మీద ప్రశ్నలు వ్రాసి ఒక పెట్టెలో వేయాలి. స్వామీజీ వాటిని చూసి జవాబులిస్తారు. వాటిలో కూడా ఇలాంటి ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి. వాటికి స్వామీజీ పరిహాసంగాను, హాస్యపూర్వకంగాను జవాబులు చెప్పారు. ఆ తరువాత గంభీరంగా ఇలా అన్నారు: “కాని మిత్రులారా, ఒక్క విషయం నేను రూఢిగా చెప్పగలను. మేం ఎన్నడూ
మంత్రగత్తెలను సజీవదహనం చేయలేదు.”* స్వామీజీ ఈ మాటలు చెప్పగానే ఆ సభామండపం కరతాళధ్వనులతో మార్మోగింది.
మరొకసారి స్వామీజీ ఇలా అన్నారు: “మేం మతమౌఢ్యులం. అయితే మమ్మల్ని మేమే హింసించుకొంటాం, మమ్మల్ని మేము పెద్ద రథ చక్రాల క్రింద ఆత్మార్పణ చేసుకొంటాం, మా గొంతులనే నరుక్కొంటాం, ముళ్ల పడకల మీద శయనిస్తాం. కాని మీరు మతోన్మాదులు. పరుల గొంతులను తెగనరుకుతారు, పరులను పట్టుకొని అగ్నికి ఆహుతి చేస్తారు, ముళ్ల పడకల మీద బలవంతంగా పడుకోబెడతారు. కాని మిమ్మల్ని చక్కగా పరిరక్షించుకొంటారు!”
మత మార్పిడా?
“క్రైస్తవుడు హిందువుగాగాని, బౌద్ధుడుగాగాని మారనక్కర్లేదు. లేదా హిందువుగాని, బౌద్ధుడుగాని క్రైస్తవునిగా మారనక్కర్లేదు. కాని ప్రతి వ్యక్తీ ఇతరుల భావాలను – ఇతర మత సారాన్ని – గ్రహిస్తూవుండి తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకొని, స్వీయవికాస నియమానుసారం అభివృద్ధిగాంచాలి”* అని తమ చికాగో ఉపన్యాసాలలోనే స్పష్టంగా వెల్లడించిన స్వామీజీ సైతం మత మార్పిడి సమస్యను ఎదుర్కొనవలసి వచ్చింది! స్వామీజీ కీర్తి వ్యాప్తిగాంచేకొద్దీ ఆయనను గురించి కట్టుకథలు, వదంతులు అదే వేగంతో వ్యాపించాయి. అందులో ఒకటి, ఆయన అందరినీ హిందుమతంలోకి మారుస్తున్నా రనేది. ఇప్పటికే ఆయన చాలామందిని తమ మతంలోకి మార్చివేశారు, అందుకోసమే డెట్రాయిట్‌కి వచ్చారనే వదంతి వ్యాపించసాగింది. మిసెస్ బాగ్లీ ఇంట్లో ఒక స్త్రీ స్వామీజీని దుర్భాషలాడడానికి కారణం ఇదే. “మతం గురించి బోధించడానికి ఒక క్రైస్తవేతరుణ్ణి డెట్రాయిట్కు తీసుకురావలసిన అవసరం ఏమొచ్చింది! అమెరికా వచ్చినప్పటి నుండి ఆయన అనేకులను మతం మార్చుకొనేలా చేశారట” అని ఒక పత్రిక వ్రాసింది.
ఒక రోజు ప్రసంగానంతరం ఒక పత్రికావిలేఖరి స్వయంగా దీనిని గురించి అడిగాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్వామీజీ జేబు నుండి ఒక పుస్తకం తీశారు. “క్రీ.పూ. 200 ఏళ్ల క్రితం అశోక చక్రవర్తి వ్రాసిన శాసనం ఇది. దీనిని చదివితే మీకు సరైన జవాబు లభిస్తుంది” అంటూ ఆ శాసనాన్ని చదివారు:
“మత శాఖల మధ్య వ్యత్యాసాలు ఉండడం సహజం. కాని వాటి మధ్య ఒక సామాన్య మౌలికత ఉంటుంది. కనుక తమ మతం గురించి గొప్ప చెప్పుకోవడం కాని, ఇతర మతాలను అగౌరవపరచడం కాని చెయ్యకూడదు. ప్రతి మతాన్ని సుహృద్భావంతో చూడాలి; వాటికి సముచిత గౌరవాన్ని ఇవ్వాలి. ఈ సుహృద్భా వంతో ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన మత కీర్తిని ఇనుమడింప జేస్తాడు. అలా చేయని వ్యక్తి తన మతవినాశానికి కారణభూతుడవుతాడు.”
ఇది చదివి స్వామీజీ, అశోక చక్రవర్తి గురించి కొనసాగించారు: “మేధావి యైన ఈ చక్రవర్తి యుద్ధం వద్దన్నాడు. దాని పర్యవసానంగానే ఇతర దేశాలు వాయువేగంతో పురోభివృద్ధి చెందినప్పుడు, భారతదేశం వెనుకబడిపోయింది. దాని ఆర్థికస్థితి అస్తవ్యస్తమయింది. ఎడతెగని శక్తీ, రక్తప్రవాహమూ తక్కిన దేశాలను సుసంపన్నం చేసినప్పుడు భారతదేశం దానిని వర్జించింది. దాని పర్యవసానంగా దాని సంపన్నత క్షీణించింది.”
తరువాత ఆ విలేఖరి, “ఈ 19 వ శతాబ్దపు ఆవశ్యకతలను పూర్తిచేయ డానికి పోటీలుపడుతున్న పాశ్చాత్యదేశాలు అహింస లాంటి సిద్ధాంతాలు స్వీకరింప సాధ్యమా?” అని అడిగాడు. అందుకు స్వామీజీ, “ఎందుకు, సింహబలంతో మేక మృదుత్వాన్ని జతపరచలేమా?” అని అడిగారు.
ఏసుక్త్రీస్తుకు అభిముఖంగా తిరగండి
ఒకసారి స్వామీజీ, “ప్రాచీన హైందవ తత్త్వజ్ఞానులు బోధించింది ఏమిటి?” అనే అంశం మీద ప్రసంగించారు. ఈ ప్రసంగం మిసెస్ బాగ్లీ ఇంట్లో జరిగింది. న్యాయవాదులు, న్యాయమూర్తులు, మిషనరీలు, సైనికాధికా రులు, పారిశ్రామికవేత్తలు మొదలైన అనేక రంగాలకు చెందిన వ్యక్తులు వచ్చారు. బాగ్లీ ఇంట్లో గదులు, చావడులు శ్రోతలతో క్రిక్కిరిసిపోయాయి. స్వామీజీ రెండు గంటల సేపు ప్రసంగిం చారు. దీనిని ‘ఆఖరి పేలుడు’ అంటూ పత్రికలు అభివర్ణించాయి. కాని పత్రికల వ్యాఖ్యానాలు పక్షపాతమైనవి. ఆయన ప్రసంగాంశం వదలిపెట్టి, క్రైస్తవ మిషనరీల గురించి చెప్పినవి మాత్రమే అవి ప్రచురించాయి. వాటిలో కొన్నిటిని చూద్దాం:
“ఏసుక్రీస్తు తన రక్తంతో మనకు స్వర్గరాజ్యాన్ని ఇచ్చినట్లుగా మీ తత్త్వం చెబుతున్నది. కాని ఇటువంటి భావన హిందూమతంలో లేదు. ఒకరి రక్తంతో స్వర్గానికి వెళ్లడానికి హైందవుడు ససేమిరా ఇష్టపడడు.
“ఒక విషయం చెప్పే తీరాలి. మిమ్మల్ని తీవ్రంగా విమర్శిస్తున్నానని భావించకండి. మీరు మిషనరీలకు శిక్షణ, విద్య, దుస్తులు, జీతం అన్నీ ఇస్తున్నారు. ఎందుకు? మా దేశానికి వచ్చి మా పూర్వీకులను, మతం పేరిట మా దేశంలోని సమస్తాన్ని విమర్శించడానికి. వారు మా దేవాలయాల ప్రక్కనే నిలబడి, ‘విగ్రహా లను ఆరాధించే అజ్ఞానులారా! మీరు నరకానికే పోతారు’ అని బిగ్గరగా కేకలు పెడుతున్నారు. మహమ్మదీయులతో ఈ విధంగా ప్రవర్తించడానికి సాహసిస్తారా? సాహసించరు. ఎందుకంటే వారి ఖడ్గాలు ఒర నుండి బయటికి దూసుకువస్తాయని మిషనరీలకు బాగా తెలుసు. కాని హైందవుడు శాంతికాముకుడు. మిషనరీల అర్థరహితమైన వాగుడు విని, ‘మూర్ఖుల్ని మాట్లాడుకోనీ’ అని శాంతంగా నవ్వి వెళ్లిపోతాడు. ఆతడి వైఖరి అది.”
స్వామీజీ ఆవేశంతో ఇలా అన్నారు: “ఒక చేత బైబిల్, మరో చేత ఖడ్గమూ పుచ్చుకొని మీరు వస్తున్నారు. మీ వద్ద ఉన్నది నిన్న మొలకెత్తిన మతం. మీరు బోధించడానికి రావడమా, మీ ఏసుక్రీస్తులా పవిత్రులైన మా ఋషులచే వేలాది సంవత్సరాలుగా బోధింపబడుతూ వస్తున్న ప్రజలకు! మీరు మమ్మల్ని త్రొక్కివేస్తు న్నారు. మీ పాదాల క్రిందపడివున్న ధూళికి సమంగా మమ్మల్ని పరిగణిస్తున్నారు. అమూల్యమైన వన్యమృగాలను నాశనం చేస్తున్నారు. మీ త్రాగుడు అలవాటుతోను, వినోదాలతోను మా ప్రజలను అవమానిస్తున్నారు. మా స్త్రీలను కించపరుస్తున్నారు. అంతెందుకు, మీ మతం కన్నా ఏ విధంగానూ తీసిపోని, మానవత్వంతో నిండివున్నందు వలన మీ మతం కన్నా ఉన్నతమైన మా మతాన్ని అపఖ్యాతి పాల్జేయ చూస్తున్నారు. ఈ రకంగా అనేక రకాలుగా మీ కన్నా ఉన్నతమైన ఒక దేశానికి మీ మతం ప్రచారం చేయడానికి వెళ్లి, ‘సత్వరమే ప్రచారం చేయ లేకున్నాం’, ‘క్రైస్తవ మతం భారతదేశంలో మందకొడిగా వ్యాపిస్తున్నది’ అంటూ ఆశ్చర్యచకితులవుతున్నారు కూడా! అది ఎందుకు త్వరితగతిన వ్యాపించలేదో తెలుసా? ఎందుకంటే మీరు మీ ఏసుక్రీస్తు లాంటి వారు కారు కనుక. మేం ఏసుక్రీస్తును కీర్తించగలమూ, గౌరవించగలమూ కూడా. మీరూ ఆయనలా నిరాడంబరులుగా, అతిసామాన్యులుగా, ప్రేమ సందేశాన్ని మోసుకొని, ఇతరుల కోసం జీవించి, పనిచేసి, కష్టపడే వారుగా మా గుమ్మం వద్దకు వస్తే మిమ్మల్ని మేం స్వీకరించమనుకుంటున్నారా? తప్పకుండా కాదు. అటువంటి వ్యక్తి ఒకరు వస్తే ఆయనను మేం మా ఋషులకిచ్చే గౌరవమర్యాదలతో ఆహ్వానిస్తాం, ఆయన మాటలు ఆలకిస్తాం.
“మమ్మల్ని దుర్భాషలాడడానికీ, విమర్శించడానికీ శిక్షణనిచ్చి మా దేశానికి మనుషులను పంపిస్తున్నారు. వారు మమ్మల్ని గర్హించినదాంట్లో వేయిలో ఒక్క వంతు నేను ఇక్కడ వెల్లడిస్తే మీరు హాహాకారాలు, ఆర్భాటమూ చేస్తున్నారు. ‘ఓ, మమ్మల్ని తాక కూడదు. మేం అమెరికన్లం. ప్రపంచంలోని యావన్మందినీ మేం దుర్భాషలాడవచ్చు, గర్హించవచ్చు, విమర్శించవచ్చు, ఏదైనా చెప్పవచ్చు. కాని మమ్మల్ని మీరు ఏమీ అనకూడదు, తాకితే మేం ముకుళించుకుపోతాం!’…. అనుకుంటూ ఒక్కటి మరచిపోకండి. భారతీయులందరూ కలసి హిందూమహా సముద్రంలోని బురదనంతా తీసి పాశ్చాత్యదేశాలపై విసిరివేసినా మీరు మాకు చేస్తున్న క్రౌర్యాలలో కోటిలో ఒక్క వంతు కూడా ఈడు కాదు….
“కనుక సోదరులారా! మీరూ, మీ దేశమూ జీవించాలంటే ఏసుక్రీస్తు వద్దకు తిరిగి వెళ్లండి. మీరు క్రైస్తవులు కారు! ‘దేవకుమారునికి తలదాచుకోవడానికి చోటులేదు’ అని వచించిన ఆ వ్యక్తి వద్దకు తిరిగి వెళ్లండి. ‘పక్షులకు గూళ్లు ఉన్నాయి, మృగాలకు గుహలున్నాయి. కాని దేవకుమారునికి తలదాచుకోవడానికి చోటులేదు.’ కాని మీ మతం ఆడంబరంగా బోధింపబడుతున్నది. చోద్యం చూడండి!”
ఫాదరీల ప్రతిఘటన
ఫిబ్రవరి 23 వ తేదీన డెట్రాయిట్ నుండి స్వామీజీ ఓహియో అనే నగరానికి వెళ్లారు. కాని డెట్రాయిట్లో ఆయన ఉత్పన్నం చేసిన తరంగం, ఢీకొని చిందర వందర కాసాగింది. ఆయనను ప్రతిఘటిస్తూ ఫాదరీలు పత్రికలలో వ్రాశారు. చివరికి మార్చ్ 5 వ తేదీన ఒక బహిరంగ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. హిందూమతాన్ని ఏ మేరకు దూషించవచ్చో ఆ మేరకు దూషించి, చివరగా, “హిందూమతంలో రక్షకుడంటూ ఎవరూ లేరు. ఏసుక్రీస్తు మాత్రమే భారతదేశాన్ని రక్షించగలడు” అని ఏకగ్రీవంగా తీర్మానించారు. దీనికి కొనసాగింపుగా ఒకటి రెండు రోజుల్లో ఒక ప్రెస్బెటేరియన్ చర్చ్ తమ సాంవత్సరిక సమావేశంలో ఆంగ్లేయులు భారతదేశాన్ని అణచి ఉంచడం న్యాయమేననే తీర్మానాన్ని ఆమోదించింది. వితంతువులను సజీవంగా దహనం చేయడం, ఆడ శిశువులను మొసళ్ల నోట్లో విసిరివేయడం, మానవ రక్తంతో దాహం తీర్చుకోవడానికి తహతహలాడే దేవతలను ఆరాధించడం లాంటి సంప్రదాయాలను పాటించే భారతీయులను సంస్కరించి తీరాలని వారు నిర్ణయించారు.
అంతేకాకుండా ఫిబ్రవరి 28 వ తేదీ నుండి మార్చ్ 4 వ తేదీలోగా భారత దేశానికి మిషనరీలుగా వెళ్లడానికి శిక్షణ పొందుతున్న యువకుల కోసం రెండవ ప్రపంచ మహాసభ కూడా అక్కడ ఏర్పాటు చేయబడింది. ఇందులో 300 విద్యాసంస్థలకు చెందిన 1200 మంది యువతీ యువకులు పాల్గొన్నారు.
మార్చ్ 9 వ తేదీన మళ్లీ స్వామీజీ డెట్రాయిట్కు వచ్చారు; ఈసారి పామర్అనే వ్యక్తి ఇంట్లో బసచేశారు. ఈయన డెట్రాయిట్‌లోని సంపన్నులలో ఒకరు. బోలెడంత పరపతి ఉన్న వ్యక్తి; చికాగో ప్రపంచ ప్రదర్శనను వ్యవస్థీకరించిన వారిలో ప్రధానుడు; రాష్ట, కేంద్ర ప్రభుత్వాలలో అనేక పదవులను అలంకరించిన వ్యక్తి. అరవై ఏళ్ల పైబడ్డ ఈయనకు సమవయస్కులైన మిత్రులు అనేకులున్నారు. తమ బృందాన్ని ‘వృద్ధుల క్లబ్’ అని పేర్కొనేవాడు. అమెరికాలో స్వామీజీకి ఎంతో సహాయం చేసిన వ్యక్తులలో ఈయన ఒకరు. అనేకసార్లు తన ఇంట్లో విందు ఏర్పాటుచేసి, అనేకమంది ప్రముఖులను ఆహ్వానించి స్వామీజీకి పరిచయంచేశాడు. “మిష్టర్ పామర్ ప్రేమాస్పదుడు, సరదా మనిషి, సజ్జనుడు, ధనవంతుడు. నా పట్ల ఎంతో అభిమానంతో ఉన్నాడు”* అని స్వామీజీ వ్రాస్తున్నారు.
పామర్ సరదా వైఖరి స్వామీజీ తమ లేఖలో ప్రస్తావించారు: “ఇక్కడి పత్రిక లలో నన్ను గురించి వ్రాసిన వింత విషయం ఒకటి ఉంది: ‘ఝంఝామారుతం లాంటి ఒక హైందవ సన్న్యాసి వచ్చి పామరుగారికి అతిథిగా ఉన్నారు. పామరుగారు హిందువైపోయి, భారతదేశం వెళ్లాలనుకొంటున్నారు. పామరుగారికి రెండు సంస్కరణలు చెయ్యాలని ఉంది. వాటిలో ఒకటి: ఆయన లాంగ్ హౌస్ అనే పొలంలో పెంచబడిన గుర్రాలతో జగన్నాథస్వామి రథం లాగించడం. రెండవది జెర్సీ ఆవును హిందువులు ఆరాధించే గోవుగా పరిగణించడం.’ తమాషాగా ఉంది కదా! ఫ్రెంచి గుర్రాలు, జెర్సీ ఆవులంటే ఆయనకు పంచ ప్రాణాలు. ఆయన వద్ద అవి చాలా ఉన్నాయి.”*
పామర్ ఇంట్లో గడపుతూనే స్వామీజీ తమ ప్రసంగాలను కొనసాగించారు. అప్పటికే పత్రికలు ఆయనను గురించి అనేక అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఆయన ప్రసంగాలకు మునుపటి కన్నా అధిక సంఖ్యలో జనం రాసాగారు.
మార్చ్ 11 వ తేదీన ‘భారతదేశంలో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు’ అనే అంశం మీద స్వామీజీ ప్రసంగించారు. ఆయన అప్పటి దాకా చేసిన ప్రసంగాలలో ఇది ఆణిముత్యంగా భావింపబడింది. ఆ రోజు ఆయన రెండున్నర గంటలసేపు ప్రసంగించారు. తమను దుర్భాషలాడిన యావన్మంది నోళ్లూ మూతపడేలా చేసింది ఆ ప్రసంగం; దానితోబాటు ఎప్పటిలా ఆ ప్రసంగంలో అద్భుతమైన ఆధ్యాత్మిక భావనలు జాలువారాయి.
స్వామీజీ చేసిన ఈ ఉపన్యాసం విన్నాక కొంతకాలం ఫాదరీలూ పత్రికలూ సద్దుమణగినట్లు కనిపించాయి. కాని ఆయనపై మరో కోణం నుండి దాడి ప్రారంభించారు. స్వామీజీ ప్రవర్తనను కళంకితపరచి మాట్లాడనారంభించారు. మొదట్లో వదంతులు వ్యాపింపజేశారు. ఆ తరువాత బహిరంగంగానే మాట్లాడ సాగారు.
ఈ వదంతులు సమస్యలను సృష్టించాయి. కొన్ని ఇళ్లవారు స్వామీజీని తమ ఇళ్లకు ఆహ్వానించినప్పుడు, ప్రత్యర్థులు ఆ ఇంట్లో ఈ వదంతుల పురాణం విప్పే వారు. పర్యవసానం? స్వామీజీ వెళ్లినప్పుడు ఆ ఇల్లు గడియపెట్టి ఉండడంతో ఆయన తిరిగి పోవలసివచ్చేది. కాని అనేక సందర్భాలలో నిజం తెలిశాక అదే ఇంటివారు స్వామీజీని క్షమించమని వేడుకొని, మళ్లీ ఆహ్వానించడం కద్దు.
స్వామీజీ కలత చెందలేదు, నిస్పృహ చెందలేదు. సర్వకాల సర్వావస్థలలో భగవంతుణ్ణి ఆధారం చేసుకొని జీవితం గడిపారు.
గారడీ ప్రదర్శనలు వద్దు
భారతదేశం గురించి నాటి అమెరికాలో రెండు విధాలయిన అభిప్రాయాలు ఉండేవి. ఒకటి, ఇంతకు క్రితమే చూశాం. అంటే, మూఢనమ్మకాల పుట్ట, ఆకలి పస్తులతో అలమటించే దేశం లాంటి అభిప్రాయాలు. మరొకటి, గారడీలు. భారతదేశంలో మహాత్ములు కోకొల్లలు, వారు ఏది కావాలన్నా చేయగల సమర్థులు; క్లుప్తంగా చెప్పాలంటే, ఒక మహాత్ముడంటే ఆయనకు గారడీ కరతలామలకమై ఉండాలి. మొదటి అభిప్రా యంతో స్వామీజీని ఏమీ చేయలేకపోయారు. భారతదేశం గురించి వారు చెప్పిన కట్టుకథల నన్నింటినీ స్వామీజీ రూపుమాపారు. కనుక ప్రత్యర్థులు రెండవ అభిప్రాయాన్ని పట్టుకొన్నారు. “వివేకానంద నిజానికి ఒక మహాత్ముడయివుంటే ఆయన గారడీలు ప్రదర్శించాలి” అని ఎలుగెత్తి నినదించసాగారు. ఈవెనింగ్ న్యూస్ ఇలా వ్రాసింది:
గారడీలు ప్రదర్శించాలి
తమను నిరూపించుకోవడానికి వివేకానందకు ఇదొక చక్కని ఆస్కారం. తాను గారడీలు ప్రదర్శించగలనని ఆయన నిరూపించాలి. లేకుంటే నోరు మూసుకోవాలి. యూనిటేరియన్ చర్చ్‌లో ప్రసంగించ నున్న వివేకానంద గారడీలు ప్రదర్శించి తమను నిరూపించు కొంటారా, లేకపోతే కేవలం నోటి మాటల ప్రతాపంతో ఆగిపోతారా?…
ఇందుకు స్వామీజీ జవాబివ్వడానికి ముందు ఆయన అభిమానులలో పేరెన్నికగన్న ఓ.పి. టెల్టాక్, ‘రహస్యాలూ గారడీలూ’ అనే అంశంపై తగిన జవాబు వ్రాసి పంపారు. దాన్లోని కొన్ని భాగాలు:
“ఏసుక్రీస్తు అంత్యదశలో మూర్ఖులు ఇలాగే అరిచారు. శిలువ వేయడానికి ఆజ్ఞాపించడం జరిగిపోయింది. ఆయన మరణాన్ని వాంఛించిన దుష్ట బృందం, ‘ఏదైనా గారడీ ప్రదర్శించి నిన్ను కాపాడుకో’ అని ఎలుగెత్తి అరిచారు. ఏసుక్రీస్తు తక్షణమే నడుం బిగించి గారడీ ప్రదర్శించారా? లేదు; ప్రశాంతంగా వారితో, ‘మోసెస్నూ తక్కిన దీర్ఘదర్శులనూ మీరు నమ్మారా? మృతుడు ప్రాణం వచ్చి లేచినప్పుడు కూడా మీరు నమ్మలేదే!’ అనే కదా చెప్పారు. మూర్ఖులే గారడీలను అపేక్షిస్తారు.
“అమెరికా ఉనికికి మునుపే సంస్కృతిలో ఔన్నత్యాన్ని సంతరించుకొంది భారతదేశం. అక్కడి మేధావులు తాము గారడీలు ప్రదర్శిస్తునట్లు ఎన్నడూ వెల్లడించ లేదు. దీర్ఘకాల ఉపవాసాలు, అధ్యయనం, జితేంద్రియులై జీవించడం, ధ్యానం మొదలైనవి అనుష్ఠించి వారు ఉన్నత ఆధ్యాత్మిక శక్తిని పొందారు. ఆశ్చర్యచకితులై, దిగ్భ్రాంతులయ్యే రీతిలో వారు అద్భుతాలు సృజించగల శక్తిశాలురు…
“ప్రశాంతత, పవిత్రత, త్యాగశీలత, సౌభ్రాతృత్వాల సందేశాన్ని వివరించడంలో వివేకానంద విజయం పొందివుంటే– మతమౌఢ్యపు గ్రుడ్డి కళ్లను తెరవడంలో ఆయన విజయం పొందివుంటే– సహనరహిత చెవిటి చెవులను తెరవడంలో ఆయన విజయం పొందివుంటే– క్రైస్తవులలో లేని కొన్ని మంచివి క్రైస్తవేతరులలో ఉండవచ్చునని ఆయన ఋజువు పరిచివుంటే– వీటిన్నింటికీ మించి మానవాళి కఠోర హృదయాల్ని ఆయన ద్రవింపజేయగలిగితే– ఆయన చేయగలిగారన్నదే సత్యం– ఆయన కార్యం వృథాకాలేదన్నదే తాత్పర్యం.”
ఆ తరువాత స్వామీజీ తమ అభిప్రాయాన్ని అదే పత్రిక విలేఖరికి విస్పష్టంగా వ్యక్తం చేశారు. అది ఆ పత్రికలో ఫిబ్రవరి 17 వ తేదీన ప్రచురితమయింది.
నిజమైన హిందూమతంలో
గారడీలకు స్థానం లేదు
నా మతాన్ని నిరూపించుకోవడానికి ఎలాంటి గారడీలు నేను చేయలేను. మొదటగా, గారడీలూ అద్భుతాలూ చేస్తూ తిరిగే వ్యక్తిని కాను నేను. రెండవదిగా, ఏ హిందూమత ప్రతినిధిగా నేను వచ్చానో, ఆ నిజమైన హిందూమతం గారడీలను, అద్భుత సంఘటనలను ఆధారంగా గైకొనలేదు. అద్భుత సంఘటన లంటూ వేటినీ మేం అంగీకరించం. అతీంద్రియ సంఘటనలు కొన్ని జరగడంనిజమే. కాని అవీ కొన్ని నియమాల మేరకే జరుగుతున్నాయి. వాటికీ, మా మతానికీ ఎలాంటి సంబంధమూ లేదు. భారతదేశంలో అద్భుత సంఘటనలూ, గారడీలూ జరుగుతున్నాయని ఇక్కడి పత్రికలు అభివర్ణించేదంతా నిజం కాదు. మహాత్ములు వాటి జోలికి పోరు. డబ్బు కోసం వీథుల్లో విన్యాసం చూపేవారే వీటిని ప్రదర్శిస్తారు. సత్యాన్ని గ్రహించాలనే ఉత్సుకత గలవారు మాత్రమే యథార్థాన్ని అవగతం చేసుకో గలరు; ఏదో ఆషామాషీగా తెలుసుకోగోరేవారికి ఏదీ అర్థం కాదు.
గారడీ పేరిట స్వామీజీని అప్రతిష్ఠ పాలుచేయాలనుకొన్న మిషనరీలకూ, తక్కినవారికీ ఆయన జవాబు ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బలా’ పరిణమించింది. ఆ తరువాత గారడీ గురించి ప్రస్తావిస్తే ఒట్టు.
మజుందార్ ప్రచారం
ఫాదరీల ప్రతిఘటనలో కొంత తర్కం ఉందనుకోవచ్చు, మిషనరీల వ్యతిరేక తను అవగతం చేసుకోవచ్చు, మతమౌఢ్యుల ఆవేశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాని స్వదేశస్థుడూ, శ్రీరామకృష్ణులను దర్శించిన వ్యక్తీ అయిన ప్రతాప్‌చంద్ర మజుందార్ ఆ ఫాదరీల బృందంతో చేయి కలపడం అర్థం చేసుకోలేం. అసూయ చేయనిదేముంది! తాను సుప్రసిద్ధ బ్రహ్మసమాజ నేతగా శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లినప్పుడు కేవలం కళాశాల విద్యార్థిగా, తన ప్రసంగం వినే శ్రోతగా ఉన్న ఒక యువకుడు నేడు తననే మించిపోయి అమెరికా ప్రజల హృదయాలను దోచుకొంటునప్పుడు ఆ సాధారణ వ్యక్తి తలక్రిందులవ డంలో వింతేమీ లేదు. బొంబాయి వాస్తవ్యుడూ, సర్వమత మహాసభలో పాల్గొన్న వ్యక్తీ అయిన నగర్కర్ కూడా మజుందార్‌తో చేతులు కలిపాడు.
మంజుదార్ నేతృత్వంలో ప్రచురితమవుతున్న పత్రికలో (Unity and the Minister) స్వామీజీని ఆక్షేపిస్తూ ఆయన వ్రాసింది 1894 మే 16 వ తేదీన (Boston Daily Advertiser) బోస్టన్ డైలీ అడ్వర్టైజర్ అనే పత్రిక ఉదాహరిస్తూ ఇలా వ్రాసింది:
“బాబు నరేంద్రనాథ్ దత్తా / వివేకానంద బ్రహ్మసమాజ నవబృందావన్ నాటక వేదిక మీద నటించడానికీ పాడడానికీ మా వద్దకు వచ్చే రోజుల నుండి మాకు పరిచితుడు.* ఎన్ని పత్రికలు ఎంతగా ఆయనను శ్లాఘిస్తూ వ్రాసినా, ఆయన గురించీ, ఆయన ప్రవర్తన గురించీ క్రొత్తగా మాకు అవి చెప్పబోయేది ఏదీ లేదు. మాకు మంచి మిత్రులైన ఆయన ఇటీవలి కాలంలో గొప్ప ప్రసంగాలు చేసి అమెరికాలో జోహార్లు అందుకొంటున్నారు. కాని ఆయన బోధిస్తున్నది సనాతన హిందూమతం కాదు; అదొక క్రొత్త హిందూమత శాఖ. సనాతన హైందవుడు సముద్రాన్ని దాటడు, ఎడతెగకుండా పొగత్రాగడు, మ్లేచ్ఛుల ఆహారం తినడు. కాని వీటన్నింటినీ మా మిత్రుడు చేస్తున్నాడు. ఒక సనాతన హిందువుకు చెల్లించ వలసిన గౌరవాన్ని మేం ఆయనకు ఇవ్వలేం. ఆయన కీర్తిని ప్రచారం చేయడానికి అందరూ ప్రయత్నించవచ్చు. కాని ఆయన చేస్తున్న కరడుగట్టిన మూర్ఖత్వాన్ని మేం సహించలేం.”
రమాబాయి వర్గం వారు
దీనితోబాటు రమాబాయి వర్గం వారు కూడా అగ్నికి ఆజ్యంలా తమ వంతు అపనిందలు, కట్టుకథలు ప్రచారం చేశారు. “రమాబాయి వర్గం వారు నా మీద ఆరోపిస్తున్న నిందలను గురించి విని నేను ఆశ్చర్యపోయాను. మనిషి ఎంత జాగ్రత్తగా మెలగినా అతడి మీద ఘోరమైన అపవాదులను ఆపాదించేవారు కొందరు ఉంటారు. చికాగోలో అలాంటివి నాకు నిత్యానుభవాలు. అంతేగాక ఈ స్త్రీలు ముఖ్యంగా క్రైస్తవుల్లో క్రైస్తవులు!”* అంటూ వ్రాస్తున్నారు స్వామీజీ.
స్వామీజీ గురించి అబద్ధాలూ, వదంతులూ ప్రచారం చేయడంలో మజుందార్, నగర్కర్, రమాబాయి వర్గీయులతో చేతులు కలిపిన మరొక భారతదేశానికి చెందిన వ్యక్తి కుమారి కార్నీలియా సోరబ్జీ. సర్వమత మహాసభలో ఈమె కూడా పాల్గొన్నది. పార్సీ వనితయైన ఈమె క్రైస్తవ మతం పుచ్చుకొంది. ఈమెను డాక్టర్ బారోస్, “పాపం నుండి రక్షింపబడిన పార్సీ స్త్రీలకు ఈమె గొప్ప ఉదాహరణ” అని వ్యాఖ్యానించారు.
దివ్యజ్ఞాన సమాజస్థుల ప్రయత్నం
స్వామీజీ మార్గానికి ఆటంకాలు కల్పించిన మరొక వర్గం వారు దివ్యజ్ఞాన సమాజస్థులు. అమెరికా బయలుదేరడానికి ముందు చెన్నైలో వారిని కలుసుకొని ఒక పరిచయ పత్రం ఇవ్వమని అడిగినప్పుడు వారు నిరాకరించడం ఇంతకు మునుపే చూశాం. అమెరికా వచ్చిన తొలినాళ్లలో సరిపడినంత పైకం లేక, దుస్తులు లేక బాధపడుతున్నప్పుడు, ఈ సంగతి విన్న దివ్యజ్ఞాన సమాజ నేత, “ఆహా! ఈ దయ్యం చలిలో చావబోతున్నాడు! సంతోషం!” అని వ్యాఖ్యానించాడు. కాని ఆతడు ఆశించినట్లు జరగలేదు. చికాగో సర్వమత మహాసభలో స్వామీజీ విజయ దుందుభి మ్రోగించినప్పుడు దివ్యజ్ఞాన సమాజస్థులు తమ తప్పును గ్రహించారు. అమెరికాలోనూ, భారతదేశంలోనూ ఉన్న స్వామీజీ అభిమానులతో ఆయన తమ ఆప్తుడనే పంచ రంగుల చిత్రాన్ని ప్రదర్శింప ప్రయత్నించారు. అంతెందుకు, స్వామీజీ విజయానికి సోపానాలు అమర్చింది తామేనని కూడా ప్రచారం చేసుకోసాగారు. అలసింగతోనే ఇలాంటి ప్రయత్నం చేసి విజయులయ్యారు. కాని స్వామీజీ వెంటనే గ్రహించి అలసింగకు ఇలా వ్రాశారు:
“నువ్వు దివ్యజ్ఞాన సమాజం వారితో చేతులు కలుపుతున్నావా?… దివ్యజ్ఞాన సమాజంవారితో నాకు సంబంధమున్నట్లు ఏ మాత్రం అనుమానం కలిగినా అమెరికాలోనూ, ఇంగ్లండులోనూ నా ఉద్యమం పూర్తిగా చెడిపోతుంది. వివేక వంతులంతా వారిది తప్పుడు మార్గమని భావిస్తున్నారు. నిజంగా వారు ఆ విధంగానే భావింపబడుతున్నారు. ఆ విషయం నీకు బాగా తెలుసు.”*
అలసింగ, తక్కినవారూ అప్రమత్తులయినారు. దివ్యజ్ఞాన సమాజస్థుల ధ్యేయం నెరవేరలేదు. తమ ప్రయత్నాలు విఫలమయినప్పుడు వారూ స్వామీజీకి ఇబ్బంది కలిగించే ఉద్దేశంతో క్రైస్తవ మిషనరీలతో చేతులు కలిపారు.
స్వామీజీని ప్రతిఘటించి ఏమీ చేయలేని స్థితిలో మిషనరీలు మరో యుక్తి పన్నారు; ఆయనను తమ వైపుకు త్రిప్పుకోవడానికి ప్రయత్నించారు. తమతో చేరమనీ, తమ సిద్ధాంతం ప్రకారం క్రైస్తవ మతాన్ని బోధించమనీ చెప్పారు. నిరాకరిస్తే ప్రమాదమనీ భయపెట్టారు. ఇక్కడ కూడా స్వామీజీ ప్రశాంతంగా వారిని ప్రతిఘటించారు. వారి బెదరింపులు స్వామీజీ వద్ద ఫలించలేదు.
వీరందరూ స్వామీజీ గురించి అపవాదులు ప్రచారం చేశారు. కాని స్వామీజీ కలత చెందలేదు. అందరూ కంకణం కట్టుకొని రూపుమాపడానికి ప్రయత్నించి నప్పుడు కూడా స్వామీజీ వారికి ఎలాంటి కీడూ తలపెట్ట యత్నించలేదు.
“భగవదనుగ్రహం వలన అంతా సమకూరుతుంది…. ఛాందసులైన మతాధికారులు (ఫాదరీలు) నాకు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రత్యక్షంగా నాతో తంటాలు పడలేక, వారు నాకు అంతరాయాలు కలిగిస్తూ, దూషిస్తూ, నన్ను అపఖ్యాతి పాలు చేయాలనుకొంటున్నారు. మన మజుందారు వారికి తోడైనాడు. అసూయతో అతడికి పిచ్చిపట్టింది. నేనొక మోసగాణ్ణనీ, వంచకుణ్ణనీ వారికి లేని పోనివి ఎక్కించాడు. నేను తప్పుదార్లు తొక్కుతూ అమెరికాలో పాపిష్టి జీవితం గడపుతున్నానని కలకత్తాలో ప్రచారం చేస్తున్నాడు. భగవంతుడు అతణ్ణి అను గ్రహించుగాక! సోదరా! విఘ్నాలు వాటిల్లకుండా ఏ సత్కార్యాన్నీ సాధించలేం. చివరి దాకా ఎవరు నిలబడగలరో వారే జయిస్తారు”* అని వ్రాస్తున్నారు స్వామీజీ.
విషం ఏం చేస్తుంది?
సైద్ధాంతిక మౌఢ్యమూ, అసూయా నిండిన మనిషి ఏం చేయడానికైనా వెనుదీయడు. కాని లోకానికి ఒక సందేశం అందించాలనే భగవదాజ్ఞ పొంది జన్మించిన వ్యక్తిని, సదా సర్వవేళలా శ్రీరామకృష్ణులు అండగా ఉండి మార్గం చూపుతున్న వ్యక్తిని ఏ ప్రతిఘటన ఏం చేయగలదు?
తదుపరి కుయుక్తిగా ఫాదరీలు స్వామీజీపై స్త్రీలను ప్రయోగించారు. ఆయనను నైతికంగా పతనం గావిస్తే పెద్ద మొత్తం ఇస్తామని వారికి ఎరజూపారు. కాని కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు తమను దరిజేరబోయిన ఒక స్త్రీతో, “మృత్యువు మన వాకిలి తడుతున్నది. దానిని ప్రతిఘటించడానికి ఏమైనా సాధనలు చేశావా? ఈ తుచ్ఛ వాంఛతో పరితపిస్తున్నావే!” అని పలికిన ఒక వ్యక్తిని ఏ స్త్రీ సైతం ఏం చేయగలదు? వచ్చినవారంతా పరాజితులై తిరుగుముఖం పట్టారు.
ఇంతకన్నా ఏం చేయడానికీ ఫాదరీలకు పాలుబోలేదు. ఇక ఆయనపై విష ప్రయోగం జరపడం మూలంగా మాత్రమే తాము బ్రతికి బట్టగట్టగలమని ఎంచి, ఆ ప్రయత్నంలో మునిగిపోయారు. డెట్రాయిట్లో స్వామీజీని ఒక విందుకు ఆహ్వా నించారు. విందులో ఇచ్చిన కాఫీ త్రాగడానికి స్వామీజీ నోటి దాకా తీసుకొచ్చారు. సదా సర్వవేళలా ఆయనకు తోడునీడగా ఉండి పరిరక్షిస్తున్న శ్రీరామకృష్ణులు అక్కడ ప్రత్యక్షమై, “ఆ కాఫీ త్రాగకు, దాన్లో విషం కలిపారు” అని హెచ్చరించారు. దాంతో స్వామీజీ అప్రమత్తులయ్యారు. ఫాదరీల ఆఖరి ప్రయత్నం కూడా విఫలమయింది.
స్వామీజీ ప్రయత్నం
మొదట్లో స్వామీజీ ఇలాంటి ప్రతిఘటనలకు అంతగా ప్రాధాన్యమివ్వలేదు. కాని విషప్రయోగమూ, అంతకన్నా నీచమైన అపనిందలు ఆపాదించడమూ, విదేశీ ఫాదరీలతో చేతులు కలిపి మాతృదేశస్థులు కొందరు హేయంగా ప్రవర్తించడమూ చూశాక స్వామీజీ తాము కూడా ఏదైనా ప్రతి చర్య చేసి తీరాలని నిశ్చయించుకొన్నారు. తమ దేశ ప్రజలు ఇందుకు దీటైన జవాబు చెప్పాలని ఆయన ఆశించారు. కనుక చెన్నైలోని అలసింగకు 1894 ఏప్రెల్ 9 వ తేదీన ఈ విషయంగా లేఖ వ్రాశారు:
“ఒక పని చేయగలిగితే చేయి. చెన్నైలో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ ఏర్పాటు చేయగలవా? రామనాథపురం రాజాగారినో లేక అటువంటి మరో ప్రముఖుణ్ణో అధ్యక్షునిగా చేసి, నేను ఇక్కడ వహిస్తున్న హిందూమత ప్రాతినిధ్యం మీ అందరికీ సమ్మతంగా ఉందని తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని చికాగో హెరాల్డ్, ఇంటర్ ఓషన్, న్యూయార్క్ సన్, డెట్రాయిట్ కమర్షియల్ అడ్వర్టైజర్ లాంటపత్రికలకు పంపించు…. చికాగో సర్వమత మహాసభాధ్యక్షుడయిన డాక్టర్ బారోసుగారికి కూడా పంపించు….
“ఎంత బ్రహ్మాండమయిన సభను ఏర్పాటు చేయగలిగితే అంత పెద్ద సభ ఏర్పాటుచేయి. హేమాహేమీలందరినీ దాన్లో చేర్చు. తమ దేశం కోసమూ, మతం కోసమూ వీరు ఈ సభలో పాల్గొనక తప్పదు. ఈ సమావేశాన్నీ, దాని ఉద్దేశాన్నీ తాము ఆమోదిస్తున్నామనే ఉత్తరాలను మైసూర్ మహారాజాగారి నుండి, ఆయన దివాన్ నుండి సంపాదించు. అదేవిధంగా ఖేత్రీ మహారాజుగారివి కూడా తెప్పించు. నీకు వీలైనంత ఆర్భాటం చేసి, అధిక సంఖ్యలో జనం సభలో పాల్గొనేట్లు చూడు. నన్ను ఇక్కడకు పంపించిన చెన్నై హిందూసమాజం నేను ఇక్కడ చేసిన పనికి తన పూర్తి ఆమోదముద్ర వేసి తీర్మానించాలి.
“ఇప్పుడే ఇది నీకు సాధ్యపడుతుందేమో ప్రయత్నించి చూడు. ఇదేమంత ఘనకార్యం కాదు. నీకు అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాల నుండి సాను భూతి లేఖలు సంపాదించి, వాటిని ముద్రించి, సాధ్యమయినంత త్వరలో వాటిని అమెరికా పత్రికలకు పంపించు. నా సోదరులారా! ఇది మనకెంతో సహాయపడుతుంది. బ్రహ్మసమాజస్థులు నానారకాలైన అబద్ధాలు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సాధ్యమయినంత త్వరలో మనం వారి నోళ్ళు మూయించాలి.”*
హిందువుల మందకొడితనం
కాని స్వామీజీ ఎదురుచూసినంత సులభంగా భారతదేశంలో ఏమీ జరగ లేదు. మూడు నెలలు వేచిచూసిన స్వామీజీ ఆవేదన అంచున నిలబడి, 1894 జూన్ 28 వ తేదీన చెన్నైకి ఇలా వ్రాశారు: “భారతదేశంలో నన్ను ఎలా కొనియాడుతున్నారనే విషయాన్నే పదేపదే నీ ఉత్తరాలు తెలుపుతున్నాయి. అది మనిద్దరి మధ్య విషయమే. అలసింగ పంపిన ఒక మూడు అంగుళాల ముక్క తప్ప భారతదేశంలోని పత్రికలు ఏం వ్రాస్తున్నాయో నాకు కించిత్తైనా తెలియడం లేదు. దానికితోడు భారతదేశంలోని క్రైస్తవులు చెప్పినదంతా, ఇక్కడ మిషనరీలు అత్యంత మెలకువతో సేకరించి, క్రమం తప్పక ప్రచురిస్తున్నారు. వారు ఇంటింటికి పోయి ప్రచారం చేసి నా మిత్రులైన వారిని నాకు దూరం చేస్తున్నారు. నాకు అనుకూలమైన మాట ఒక్కటి కూడా భారతదేశం నుండి రాకపోవడం వల్ల, వారి ఆటలు చక్కగా సాగాయి. భారతదేశంలోని హైందవ పత్రికలు నన్ను ఆకాశానికి ఎత్తుతూ శ్లాఘించి ఉండ వచ్చు. కాని వాటిలో ఒక్క వాక్యమైనా అమెరికా చేరలేదే! అందువల్ల ఇక్కడి వారు నన్ను మోసగాణ్ణని భావిస్తున్నారు. మిషనరీల ప్రచారం, దానికి తోడు ఇక్కడున్న హిందువులు వారికి అందించే తోడ్పాటుతో నేను నిరుత్తరుడనైనాను. నేనుగా చెప్పడానికి నా వద్ద ఒక్క మాటైనా లేదు…
“ఏ అధికార పత్రాలూ లేకుండా నేను ఇక్కడకు వచ్చాను. బ్రహ్మ సమాజస్థులూ, క్రైస్తవ మిషనరీలూ చేస్తున్న ప్రచారం ముందు నేను మోసగాణ్ణి కానని ఎలా నిరూపించుకోగలను? కొన్ని మాటలు చెప్పడం కన్నా, సులభమైన పని మరొకటి లేదని ఇప్పుడు తలుస్తున్నాను. మద్రాసులోను, కలకత్తాలోను కొంతమంది పెద్దమనుషులను ఆహ్వానించి, సభ ఏర్పాటుచేసి, ఆ సభలో నాకూ, నా పట్ల దయ జూపిన అమెరికన్లకూ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయడం, ఆ తీర్మానాన్ని ఆ సభా కార్యనిర్వాహకుల ద్వారా అమెరికాకు పంపడం, ఉదాహరణకు ఒక ప్రతి డాక్టర్ బారోసుగారికి పంపడం; దానిని బోస్టన్‌లోనూ, న్యూయార్క్‌లోను, చికాగో లోను వివిధ పత్రికలలో ప్రచురించమని కోరడం అంత కష్టమయిన పని కాదని నేను అనుకుంటున్నాను. కాని అంతమాత్రం పనిచేయడం కూడా భారతీయులకు దుష్కరకార్యమని నేను తెలుసుకొన్నాను. ఒక సంవత్సరంలో నాకు అనుకూలమైన వారు ఒక్కరూ కనిపించలేదు. కాని అందరూ ప్రతికూలురే! మీ ఇళ్లలో నన్ను గురించి మీరు ఏం చెప్పుకొని ఏం ప్రయోజనం? దాన్ని గురించి ఇక్కడి వారికి ఏం తెలుసు? ఈ విషయంగా రెండు నెలల క్రితమే అలసింగకు వ్రాశాను. ఆఖరుకు అతడు నాకు ప్రత్యుత్తరం కూడా వ్రాయలేదు. అతడి హృదయం దుర్బలమైపోయిందని భయపడుతున్నాను. ముందుగా మీరు ఈ విషయాన్ని గూర్చి ఆలోచించి, ఆ తరువాత ఈ ఉత్తరాన్ని మద్రాసు వారికి చూపండి. అంతేగాక నా సోదర సన్న్యాసులు కేశవచంద్రసేన్ను గురించి అర్థరహితంగా మాట్లాడడం, నేను ఏది వ్రాసినా అదంతా మద్రాసువారు దివ్యజ్ఞానసమాజం వారికి తెలియజేయడం నాకు విరోధులను సృష్టించింది. ఆహా! నిజమైన శక్తిసామర్థ్యాలు, బుద్ధిగలవాడు ఒక్కడైనా భారతదేశంలో నాకు అండగా ఉంటే ఎంత బాగుండేది! కాని దైవ సంకల్పమే నేరవేరుతుంది. నేను మాత్రం ఈ దేశంలో మోసగాడినైపోయాను….
“ప్రతిక్షణం భారతదేశం నుండి ఏదో వస్తుందని నిరీక్షించాను. అది రానేలేదు. ముఖ్యంగా గత రెండు మాసాలుగా నేను అనుక్షణం వ్యథతో కుమిలి పోయాను. ఆఖరుకు ఒక్క వార్తాపత్రిక కూడా భారతదేశం నుండి రాలేదు. నా మిత్రులు వేచివున్నారు. నెలల తరబడి అలా కాచుకొని ఉన్నారు. కాని ఏ ఒక్కటీ రాలేదు. అధమపక్షం ఒక్క మాట కూడా వినిపించలేదు. అందువల్ల అనేకులు నిరాశచెంది, చిట్టచివరకు నన్ను వదలివేశారు.”*
భారతదేశంలో నవ జాగృతి
కాని ఈ ఉత్తరం అందడానికి ముందే చెన్నైలోని ఆప్తులు కార్యాచరణకు దిగారు. అయినప్పటికీ హిందువులకే చెందిన మందకొడితనం వలనా, తాము ఏం చేస్తున్నామో స్వామీజీకి తెలియపరచాలనే ఆలోచన లేక పోవడం వలనా స్వామీజీ వ్యథ చెందవలసివచ్చింది. స్వామీజీ చేస్తున్న కార్యాన్ని శ్లాఘిస్తూ ఇండియాలో మొదటిసారిగా చెన్నైలో ఏప్రెల్ 28 వ తేదీన పచ్చయప్ప హాలులో బహిరంగ సభ జరిగింది. అధిక సంఖ్యలో జనం దాన్లో పాల్గొన్నారు. రాజా సర్ రామస్వామి మొదలియార్, దివాన్ బహదూర్ ఎస్. సుబ్రహ్మణ్య అయ్యర్, సి.ఐ.ఇ. లాంటి ప్రముఖులు పలువురు పాల్గొని స్వామీజీని ఎడతెగకుండా ప్రశంసించారు. రామనాథపురం మహారాజు, రాయ్ బహాదూర్ ఎస్. శేషయ్య బి.ఏ. లాంటివారు తంతి, లేఖల మూలంగా తమ అభినందనలు తెలియజేశారు.
దీనికి కొనసాగింపుగా కలకత్తాలోనూ ఇటువంటి బహిరంగ సభ జరిగింది. ఈ సభ ఏర్పాటుచేయడానికి స్ఫూర్తి కలకత్తా ప్రజలకు మహాబోధి సొసైటీ కార్య దర్శియైన ధర్మపాలుని నుండి లభించింది. ఈయన స్వామీజీతోపాటు సర్వమత మహాసభలో పాల్గొన్నారు. మజుందార్ మాదిరి కాకుండా ఈయన స్వామీజీ గురించీ, ఆయన ఘనవిజయాన్ని గురించీ శ్లాఘిస్తూ ఇండియన్ మిర్రర్ ఏప్రెల్ 12 వ తేదీ సంచికలో ఇలా వ్యాఖ్యానించారు: “సర్వమత మహాసభ విజయవంతం కావడానికి స్వామి వివేకానంద ముఖ్య కారణం. కనుక ప్రతి హైందవుడూ ఆయనకు అభినందనలు పంపించాలి.” అంతేకాక ఏప్రెల్ నెలలో ఆలంబజార్ మఠానికి వెళ్లి స్వామీజీ సోదర సన్న్యాసులను కలుసుకొని సర్వమత మహాసభ వివరాలు తెలియజేశాడు. ఆ తరువాత కలకత్తాలో బహిరంగ సభ జరిగింది.
ఒకటి వెంట ఒకటిగా కుంభకోణం, బెంగళూరు లాంటి అనేక చోట్ల సభలు జరిగాయి. వాటి వివరాలు, ఆ సభలలో చేయబడిన తీర్మానాల లాంటివి స్వామీజీకి పంపించారు. ఎదురుతెన్నులు చూస్తూన్న సంఘటనలు కార్యరూపం దాల్చడం చూసి స్వామీజీ జగజ్జనని అనుగ్రహాన్ని తలచుకొని ద్రవించిపోయారు:
“జగదంబకు జయం! నా ఊహకు మించినంత జయం చేకూరింది. ప్రవక్త గౌరవింపబడ్డాడు. తీవ్రంగా, నిస్సంశయంగా ఆయన అనుగ్రహం చూసి పసిబిడ్డలా విలపిస్తున్నాను. సోదరీమణులారా! ఆయన తన సేవకుణ్ణి ఎన్నడూ విడనాడడు. నేను పంపుతున్న ఉత్తరం ద్వారా సంగతులన్నీ విశదమవుతాయి. అమెరికా ప్రజల వద్దకు ప్రకటింపబడిన కొన్ని కాగితాలు రానున్నాయి…. సోదరీమణులారా! ఈ ఉత్తరం మీకు అన్ని విషయాలూ తెలుపుతుంది. ఇటువంటి అనుగ్రహాన్ని చవి చూస్తూ అనుక్షణం నేను ఆయన సంరక్షణలో ఉన్నానని తెలిసినా అప్పుడప్పుడు విశ్వాసం సన్నగిల్లుతోంది. కొన్నిసార్లు నిరుత్సాహపడుతున్నాను. నేనెంతటి దుర్మార్గుణ్ణి? సోదరీమణులారా! భగవంతుడున్నాడు– జగజ్జనకు డున్నాడు. జగజ్జనని ఉంది. వారు తమ బిడ్డలను విడనాడరు ఎన్నటికీ, ఎన్నటికీ, ఎన్నటికీ! విపరీత సిద్ధాంతాలను ప్రక్కకునెట్టి, పసిపిల్లలుగా ఆయన శరణు చేరండి. ఎక్కువ వ్రాయలేను. ఆడదానిలా విలపిస్తున్నాను. నా హృదయనాథా! నీకు జయం, నీకు మంగళం!”* అంటూ తమ హృదయంలో ఉప్పొంగుతున్న ఉద్వేగాన్నంతా హేల్ సోదరీమణులకు వ్యక్తం చేశారు స్వామీజీ.
శత్రువు పట్ల సైతం ద్రవించే మనస్సు
స్వదేశస్థుడైన మజుందార్ స్వామీజీకి ఎన్నో కష్టనష్టాలను కల్పించాడు. అయినప్పటికీ ఆతణ్ణి స్వామీజీ ఎన్నడూ ద్వేషించలేదు. ఇష్టానిష్టాలు లేని మహాత్మునిగానే ఆయన సదా విరాజిల్లారు. అమెరికా ప్రజలకు అవగతం చేయడానికి కొన్ని సభలు, ప్రశంసాత్మక ప్రసంగాలు అవసరమైనప్పుడు చేయమని భారతీయులను ప్రేరేపించారు. ఆశించిన దానికన్నా ఎక్కువగా భారతదేశంలో సంఘటనలు జరిగినప్పుడు జగజ్జనని అనుగ్రహం తలచుకొని ద్రవించిపోయారు. అప్పుడే జూలై నెలలో మజుందార్ రచించిన ఒక పుస్తకం వెలువడింది. దానిని గురించి మేరీ హేల్‌కు ఇలా వ్రాశారు: “నా మిత్రుడు మజుందార్ పుస్తకాన్ని ఇంటీరియర్ పత్రిక ప్రశంసిస్తూ వ్యాఖ్యానించడం చూశాను. ఆయన పెద్దవాడు, సజ్జనుడు; స్వదేశీయుల కోసం ఎంతో చేసిన వ్యక్తి.” తమను నానా దుర్భాషలాడి, తమ ప్రవర్తన గురించి అపవాదులు ప్రచారం చేసిన ఒక వ్యక్తిని శ్లాఘించడానికి ఎంత విశాలహృదయం ఉండాలి!
శ్రీరామకృష్ణుల నుంచి ఆయన నేర్చుకొన్నది అదే! ఒకసారి శ్రీరామకృష్ణులు యువ నరేన్‌తో, “భగవంతునిలో జీవించేవారిని కొన్ని సమయాలలో లౌకికులు విమర్శిస్తారు, పరిహసిస్తారు. ఏనుగు గంభీరంగా వెళుతున్నప్పుడు వీథి కుక్కలు దాని వెనుక మొరుగుతూ పరుగెత్తుతాయి. ఏనుగు వాటిని కించత్తయినా లెక్క చేస్తుందా? నాయనా, నిన్ను పలువురు వెనుక నుండి దూషిస్తున్నారనుకో, వారిని నువ్వు ఏం చేస్తావు?” అని అడిగారు. అందుకు నరేన్, “అదే, వీథికుక్కలు నా వెనుక మొరుగుతున్నాయి అనుకొని ఖాతరు చేయను” అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వి, “వద్దు నాయనా! అంతదూరం పోవద్దు. అందరిలోనూ ఉన్నదీ ఆ భగవంతుడే కదా! యావత్తు చరాచర ప్రపంచంలోనూ ఆయనే విరాజిల్లుతున్నాడు. కనుక అన్నింటికీ సముచిత గౌరవమివ్వాలి” అన్నారు. స్వామీజీ దాన్నే పాటించారు.
“క్రైస్తవ మిషనరీలు నా తత్త్వాన్ని అవగతం చేసుకోలేదు. కామ కాంచనా లను ఏ మాత్రం సరకు చెయ్యనివారిని వారు ఎన్నడూ చూసి ఉండరు. ఇది సాధ్యమని వారు మొదట నమ్మలేకపోయారు. పాపం ఏ విధంగా నమ్మగలుగు తారు! బ్రహ్మచర్యం విషయంలోనూ, పవిత్రతలోనూ భారతీయులకున్న ఆశయాలు పాశ్చాత్యులకున్నాయని మీరు భావించకూడదు”* అని వ్రాస్తున్నారాయన.
భగవంతునిలా ధర్మాన్ని విశ్వసించిన వారు ఆయన. “ధర్మో రక్షతి రక్షితః” అని గ్రహించిన వ్యక్తి ఆయన. కనుక ఆయన దేనికీ జంకలేదు, సంకోచించలేదు. ధర్మం ఆయనను విడిచిపెట్టలేదు. ఫాదరీలతోపాటు తక్కిన అందరి ప్రతిఘటన లనూ అతిక్రమించి ప్రజలు స్వామీజీని ఆదరించారు, అభిమానించారు. అదే లేఖలో స్వామీజీ ఇలా కొనసాగించారు:
“ఇప్పుడు జనం తండోపతండాలుగా నా వద్దకు వస్తున్నారు. విషయ వాంఛలను నిజంగా నిగ్రహించగలవారు ఉన్నారని వందలాది పాశ్చాత్యులకు ఇప్పుడు నమ్మకం కలిగింది. సనాతన తత్త్వ విషయంలో వారిలో గౌరవ, ఆదర భావాలు పెంపొందుతున్నాయి. ఓర్పుతో ఎవరు వేచివుంటారో వారికి సర్వం సిద్ధిస్తుంది.”*
పరిస్థితే ఆస్కారంగా….
తమను ప్రతిఘటించిన మిషనరీలను, ఫాదరీలను స్వామీజీ ఈ రీతిలో ఒక ఉన్నత దృక్పథంతో చూశారు. అంతేకాదు; వారు కల్పించే ఇబ్బందులను తాము పాఠం నేర్చుకోవడానికి ఒక ఆస్కారంగా మార్చుకొనే పరిణతి పొందిన వ్యక్తిగా ఆయన భాసిల్లారు. ఒక సందర్భంలో ఆయన ఒక మిషనరీ గదిలో బస చేయవలసి వచ్చింది. ఆతడు మొదట స్వామీజీ మిత్రునిగా ఉండి, పిదప మిషనరీగా మారిన వ్యక్తి. ఆయన ఒక మిషనరీ కనుక స్వామీజీ భావనలు ఆతడిలో ఎంతో ద్వేషాన్ని రగిల్చాయి. ఆ ద్వేషాన్ని ఆతడు స్వామీజీ మీద బహిరంగంగానే ప్రదర్శించాడు.
ఈ విషయం గురించి మిత్రుడొకడు, “స్వామీ! మీకు ఇబ్బంది కలిగిస్తూ, మిమ్మల్ని ద్వేషించే ఒక వ్యక్తితో మీరెందుకు బసచేశారు?” అని స్వామీజీని అడిగాడు.
అందుకు స్వామీజీ నవ్వి, “ఓ, నన్ను నేను అదుపులో ఉంచుకోవడానికి ఆతడు నాకు ఒక ఆస్కారం ఇస్తున్నాడు! భగవంతుడు ఆతణ్ణి అనుగ్రహించు గాక!” అన్నారు.
స్వామీజీ డెట్రాయిట్ రోజులు ప్రతికూల పవనాలను సంబాళించు కోవడంలోనే గడచిపోయినప్పటికీ కొందరు సుమనస్కులు ఆయనకు చేరువ అయ్యారు. వారిలో ముఖ్యమైన వ్యక్తి మిస్ క్రిస్టైన్ గ్రీన్స్టిడల్ (కాలాంతరంలో సోదరి క్రిస్టైన్). స్వామీజీకీ ఈమెకూ మధ్య వెల్లివిరిసిన సంబంధం తండ్రీ కుమార్తెల అనుబంధంగా శాశ్వతంగా విరాజిల్లింది. కాలాంతరంలో ఈమె సోదరి నివేదితతో భారతదేశంలో సేవాకార్యాల్లో పాల్గొని, ఇతోధికంగా సేవలందించింది. మరొకరుమిసెస్ మేరీ ఫంకే. ఈమె కూడా కాలాంతరంలో స్వామీజీ సన్నిహిత శిష్యురాండ్ర లలో ఒకరైనారు.
లెక్చర్ బ్యూరో నుండి వైదొలగడం
స్వామీజీ తమ ఉపన్యాసాల కోసం ఒక లెక్చర్ బ్యూరోతో మూడేళ్లకు ఒప్పందం చేసుకొన్నారు కదా! వారి హద్దు మీరిన ప్రమేయం కారణంగా ఒప్పందం గడువు పూర్తి కాకమునుపే ఆయన దాని నుండి వైదొలగారు. వారు ఏర్పాటు చేసే కార్యక్రమాలలో మాత్రమే స్వామీజీ పాల్గొనాలన్నది ఒక వంక. మరెవరైనా ఆహ్వానించి స్వామీజీ వెళితే అక్కడ లభించే నిధిలో సైతం లెక్చర్ బ్యూరో వారు తమ వాటాను ముట్ట జెప్పమని అడిగారు. ఊరూరా తిరుగుతూ సర్కస్ కార్యక్రమాలు జరిపేవారు ప్రచారం చేసేటట్లు తమను వారు ప్రచారం చేయడం స్వామీజీ జీర్ణించుకోలేక పోయారు. నిరాడంబర మనస్కులైన స్వామీజీని వారు ఘోరంగా దగా చేశారు. ఈ కారణాల వలన స్వామీజీ వారితో తెగతెంపులు చేసుకోవలసి వచ్చింది. “డెట్రాయిట్లో చేసిన ఉపన్యాసానికి 900 డాలర్లు, అంటే రూ. 2, 700/– వచ్చాయి. తక్కిన ఉపన్యాసాలలో 2, 500 డాలర్లు, అంటే రూ. 7, 500/– సంపాదించాను. కాని నా చేతిలో పడింది 200 డాలర్లు మాత్రమే. ఉపన్యాసాలను ఏర్పాటు చేసే ఒక సంస్థ నన్ను ఘోరంగా దగా చేసింది. ఇప్పుడు వారితో తెగతెంపులు చేసుకొన్నాను”* అని 1894 జూలై 11 వ తేదీన అలసింగకు ఆయన వ్రాశారు.
అప్పటికే లెక్చర్ బ్యూరో ఒప్పందంలో సంతకం చేసినందున దానిలోనుండి వైదొలగలేనని స్వామీజీ అనుకొన్నారు. దానితో ఆయన కాస్త ఆదుర్దా చెందారు. ఆ సమయంలో సహాయంగా నిలబడ్డాడు పామర్. ఆయన న్యాయవాదులతో మాట్లాడి, ఎన్నో ప్రయత్నాలు చేసి స్వామీజీని ఆ లెక్చర్ బ్యూరో కబంధ హస్తాల నుండి విడిపించాడు.
‘శివోఽహం’ అంటున్నాను!
జూలై 26 వ తేదీన స్వామీజీ గ్రీనేకర్కు వెళ్లారు. గ్రీనేకర్ రోజులుస్వామీజీకి ఒక క్రొత్త అనుభవంగా రూపొందాయి. విశాల మనోభావాలున్న కొందరు కలసి అక్కడ ఒక మత సంస్థను నెలకొల్పారు. వివిధ మతాలవారి ప్రసంగాలు ఏర్పాటుచేశారు. ఇందుకు సూత్రధారి మిస్ సారా ఫార్మర్. ఈమె స్వామీజీని న్యూయార్క్‌లో కలుసుకొని ఆయనను గ్రీనేకర్కు ఆహ్వానించింది.
దట్టమైన అడవి. అందమైన విశాల నదీతీరం– స్వామీజీ అక్కడ బసచేశారు. హిమాలయాల్లోని దట్టమైన అరణ్యాలలోనూ, గంగా తీరంలోనూ జీవింపగోరిన స్వామీజీకి అట్టి వాతావరణం అమెరికాలో లభించడంతో ఆయన మనస్సు అపరిమిత ఆహ్లాదాన్ని చవిచూసింది. ప్రాచీన గురుకుల విధానంలో ఆయన ఒక దేవదారు వృక్షం క్రింద కూర్చుని తరగతులు నిర్వహించారు. భారతీయ ఆధ్యాత్మికత పట్ల అభిలాషగల స్త్రీలూ పురుషులూ ఆయనను పరివేష్ఠించి పాఠాలు విన్నారు. “ప్రతి ఉదయం నేను ఒక దేవదారు వృక్షచ్ఛాయలో హైందవ పద్ధతిలో కూర్చుని ప్రవచనం చేశాను… ఒక సంవత్సరం జంతువులా గడపిన తరువాత నేలపై పరుండి అడవిలో చెట్టు క్రింద ధ్యానం చేయడం!… శిబిరంలోని వారందరూ ఆరోగ్యవంతులు, యౌవనులు, ఋజువర్తనులు, పవిత్రులు. నేను ‘శివోఽహం’, ‘శివోఽహం’ అని వారికి చెబితే వారు ఆ విధంగానే ఉచ్చరిస్తారు. నిష్కపటులు, నిర్మలులు అయినటువంటి వీరు అప్రతిహతమైన ధీరులు. అందుకే నేను ఆనందాన్నీ, గౌరవాన్నీ అనుభవిస్తున్నాను”* అంటూ స్వామీజీ వ్రాశారు. ఈ దేవదారు వృక్షం కాలాంతరంలో ‘స్వామీజీ పైన్’ గా ప్రసిద్ధిగాంచింది. అక్కడ ముఖ్యంగా అవధూత గీత, రాజయోగం మొదలైనవి స్వామీజీ నేర్పించారు.
స్వామీజీ దాదాపు రెండు వారాలు గ్రీనేకర్లో గడిపారు. “ప్రసంగాలు, పాఠాలు, వనభోజనాలతో కాలం వేగంగా పరుగెత్తుతూ ఉంది” అంటూ ఆయన వ్రాశారు. ఆయనకు విశ్రాంతి తప్పనిసరయింది. “గ్రీనేకర్లో రోజుకు ఏడెనిమిది గంటలు ప్రసంగించవలసి వచ్చింది – విశ్రాంతి అంటే అదే. కాని ఆ ప్రసంగ మంతా భగవంతుని గూర్చినదే. దానితోపాటు అది శక్తిని ఇస్తుంది”* అని స్వామీజీ వ్రాశారు. ఈ రోజులు ఆయన మనస్సుకు ఎంతో సాంత్వన కలిగించాయి. ఈ రోజులను ఆయన ‘స్వర్గలోక పరిస్థితి’ అని అభివర్ణించారు. “చెట్ల క్రింద నిద్రించి, నివసించి, బోధించడం కొన్ని రోజులే అయినప్పటికీ మళ్లీ స్వర్గలోక పరిస్థితిలో ఉండడం గురించి” అంటూ ఆ రోజులను ఆయన ప్రస్తావించారు.
మనస్సుకు విశ్రాంతి నివ్వడమే కాక గ్రీనేకర్లో గడిపిన రోజులలో స్వామీజీ జీవితంలో ముఖ్యపాత్ర వహించబోయే ఒక వ్యక్తి కూడా పరిచయం అయ్యారు. ఆమె మిసెస్ సారా బుల్. అక్కడ స్వామీజీ కలుసుకొన్న మరొక వ్యక్తి డాక్టర్ లూయి జి. జేన్స్.
గ్రీనేకర్ రోజులు స్వామీజీ కార్యప్రణాళికలో ఒక గొప్ప మలుపుగా పరిణమించాయనవచ్చు.
తరగతి ప్రసంగాలు
తమ ప్రసంగాల పట్ల ఆకర్షితులై తమ దరిచేరిన వారిలో కొందరయినా జీవితంలో ఆధ్యాత్మిక పరమావధిని చేరుకోవాలనే విషయంలో స్వామీజీ ఎంతో ఆసక్తి చూపారు. కాని ఆధ్యాత్మిక పురోభివృద్ధి అనేది ఉపన్యాసాలు వినడం మూలంగాకానీ, మేధాశక్తితోకానీ సిద్ధించేది కాదని మన ఉపనిషత్తులు స్పష్టంగా వచిస్తున్నాయి.* అందుకు సముచిత గురూపదేశం అవసరం. వారు నిర్దేశించిన మార్గంలో నిరంతరాయంగా ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించాలి. “ఈ విధంగా ఒక్కరికైనా సహాయపడగలిగినా నా జీవితం సార్థకమైనట్లు భావిస్తాను” అన్నారు స్వామీజీ.
ఈ ఉద్దేశంతో కార్యాచరణలో దిగాలని స్వామీజీ అనుకొన్నారు. ఇంతలో స్వామీజీ పాశ్చాత్య జీవితంలో దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు గడచిపోయాయి. న్యూయార్క్, చికాగో, బ్రూక్లిన్లలో బొంగరంలా గిరగిరా తిరుగుతున్న స్వామీజీ మళ్లీ 1894 డిసెంబర్ 26 వ తేదీన న్యూయార్క్ వచ్చారు. తమ నూతన ప్రణాళిక ప్రకారం పాఠాలు ప్రారంభించడానికి ప్రయత్నించారు. చికాగోలో హేల్ కుటుంబం ఆయనకు చోటు ఇచ్చినట్లు న్యూయార్క్‌లో కర్న్సీ దంపతులు స్వామీజీని తమ ఇంటికి ఆహ్వానించారు. వారి ఇంటిని స్వామీజీ తమ న్యూయార్క్ కేంద్రంగా చేసుకొన్నారనడం అత్యుక్తి కాదు.
తుపానులా పరిభ్రమిస్తూ ప్రసంగాలు చేయడమూ, నిధులు సముపార్జించ డమూ తమకు సముచితంగా స్వామీజీకి అనిపించలేదు. “గత సంవత్సరం ఈ దేశంలో నేను ఎన్నో ప్రసంగాలిచ్చాను. ఎన్నో అభినందనలు అందుకొన్నాను. కాని ఇదంతా నా కోసమే చేశానని గుర్తించాను. ఓర్పుతో నిర్మించుకొన్న ఉదాత్త శీలం, సత్యదర్శనానికై చేసే తీవ్రసాధన అనేవే భావికాలంలో మానవవాళిలో పరిణామం కలిగిస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం ఈ విధానంలో పనిచేయాలని అనుకొంటున్నాను – కొందరు స్త్రీ పురుషుల బృందాన్ని రూపొందించి, అద్వైత సాక్షాత్కారానికై తగిన శిక్షణ నివ్వదలచుకొన్నాను”* అంటూ తమ ఉద్దేశాన్ని స్వామీజీ వ్యక్తం చేశారు.
ఇటువంటి ఉద్దేశానికి మరొక కారణం కూడా ఉంది. ఈ కారణం అంతగా బయటికి తెలియదు. కాని ఈ కారణం ఉండడమేమో నిజమే. తమ తరువాత అమెరికాలో తన కార్యాచరణను కొనసాగించడానికి కొందరిని తీర్చిదిద్దడం కూడా ఆయన ఉద్దేశమే. “ఈ సందేశాన్ని భారతదేశంలో భారతీయులకూ, అమెరికాలో అమెరికన్లకూ బోధించాలి” అని ఆయన అన్నారని సోదరి క్రిస్టైన్ వ్రాసింది.
అప్పటికే గ్రీనేకర్లో ఆయన ఇలాంటి ఒక ప్రయత్నం ప్రారంభిచారు. మిసెస్ సారా ఇంట్లో కూడా గత అక్టోబర్‌లో ఇలాంటి తరగతులను ప్రారం భించారు. ఈ ఉద్దేశంతోనే 1894 నవంబర్‌లో ఆయన ‘వేదాంత సొసైటీ’ అనే సంస్థను న్యూయార్క్‌లో స్థాపించారు.
1895 జనవరిలో ఈ తరగతుల నిమిత్తం స్వామీజీ రెండు గదులు బాడుగకు తీసుకొన్నారు. గత సంవత్సరం న్యూయార్క్‌లో ఆయనను కలుసుకొన్న లియాన్ లాన్స్బర్గ్ ఇందుకు సహాయం చేశాడు. ప్రసంగాలు మానుకోవడంతో డబ్బు కోసం స్వామీజీ ఇబ్బంది పడవలసి వచ్చినప్పటికీ ఆయన ఈ జీవితాన్నే అభిలషించారు. “నే నిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. లాన్స్బర్గ్, నేనూ కలిసి కొంత అన్నం, కూరగాని లేక బార్లీగాని వండుకొని భోజనం త్వరగా ముగించి, వ్రాసుకోవడంలోనూ, గ్రంథ పఠనంలోనూ గడుపుతున్నాను. జిజ్ఞాసువులై వచ్చిన పేదవారిని ఆదరిస్తున్నాను. ఆ విధంగా నేను, ఇంతకు మునుపుకన్నా ఇప్పుడు అమెరికాలో బాగా సన్న్యాసి జీవితం గడుపుతున్నాను”* అంటూ వ్రాస్తున్నారు స్వామీజీ.
స్వామీజీ జీవితంలో ప్రముఖ స్థానం వహించిన కొందరు ఈ తరగతుల ద్వారానే వారికి పరిచయమయ్యారు. మెక్లౌడ్ సోదరీమణులు, మిస్ సారా క్లేన్ (కాలాంతరంలో సోదరి దేవమాత), మిస్ ఎస్.ఇ. వాల్డో (కాలాంతరంలో సోదరి హరిదాసి) వారిలో మచ్చుకు కొందరు.
తొలి రోజుల్లో స్వామీజీ నివసించిన చిన్న గదిలో తరగతులు జరిగాయి. తరగతులకు హాజరయిన వారు కేవలం ముగ్గురు. కాని ఆ సంఖ్య, ఆశ్చర్య పోయేటంతగా పెరిగింది. ఈ తరగతులు జరుగుతున్నప్పుడు స్వామీజీ, శ్రోతలు నేల మీదే కూర్చున్నారు. లక్షాధికారులు సైతం ఆయన పాదాల మ్రోల కూర్చుని పాఠాలు విన్నారు. ఈ తరగతులకు రుసుము ఏమీ వసూలు చేయబడలేదు. పర్యవసానం? చేతిలో చిల్లిగవ్వలేని రోజులు కూడా లేకపోలేదు. కనుక అప్పుడప్పుడు నిధుల కోసం కూడా స్వామీజీ ప్రసంగాలు చేశారు.
డబ్బు కోసం ఇబ్బందిపడుతున్న ఇలాంటి సమయాలలో స్వామీజీకి కొందరు సహాయం చేయడం కద్దు. కాని వారు ఫలానా చోటే తరగతులు జరపాలి, ఫలానా వారినే ఆహ్వానించాలనే నిబంధనలు పెట్టినప్పుడు స్వామీజీ వారిని త్రోసిరాజన్నారు.
ప్రేతాత్మవాదుల బెదరింపులు
ఇక్కడ కూడా స్వామీజీకి ఇబ్బందులు తప్పలేదు. ఇక్కడ ఇబ్బంది పెట్టిన వారు ప్రేతాత్మవాదులు (Spiritualists). స్వామీజీ వలన ఎక్కడ తమ ‘జీవనోపాధి’ కి భంగం వాటిల్లుతుందోనని జంకి వారు స్వామీజీ బస చేసి వున్న ఇంటి వద్దకొచ్చి, తరగతులను నిలిపివేయమని వాకిలి వద్ద నిలబడి అరిచారు. నిలపకపోతే బలవంతంగా తామే ఆపివేయవలసి వస్తుందని భయపెట్టారు. అర్థంపర్థం లేని కొన్ని సిద్ధాంతాలనూ, బుద్ధికి పొంతనలేని భావనలనూ వీరు బోధిస్తూవచ్చారు. ప్రేతాత్మలతో సంబంధం పెట్టుకొని, గారడీలు చేయడం వారి లక్ష్యం. ఇటువంటివి ప్రదర్శించి వారు ప్రజలను తమ వైపు ఆకర్షించుకొన్నారు. తమ బృందంలో ఒకరిని చేర్చుకోవ డానికి 25 నుండి 100 డాలర్ల దాకా రుసుము వసూలు చేసేవారు. వారి పెంపునకూ, దగా పనులకూ అంతరాయంగా స్వామీజీ వచ్చినప్పుడు వారు ఆగ్రహోదగ్రులయ్యారు.
తదుపరి ఘట్టంగా వారు స్వామీజీని తమ బృందంలో చేరమని బలవంతం చేయడమేగాక, చేరకపోతే తంతామని బెదరించారు. కాని స్వామీజీ? డబ్బుతో కొనలేని, భీతి చెందని, మూర్తీభవించిన తెగింపునకు అపరరూపమైన ఒక వ్యక్తిని ప్రప్రథమంగా ఆయనలో చూశారు. “నేను సత్యం కోసం జీవిస్తున్నాను, సత్యాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నాను, సత్యం ఏనాడూ అసత్యంతో చేతులు కలపదు. ఈ ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా తరలివచ్చినా నేను సత్యమార్గంలోనే పోతాను. చివరికి సత్యమే జయిస్తుంది” అని వారితో తిన్నగా చెప్పేశారు.
స్వేచ్ఛాయుత చింతనాశీలుర ప్రతిఘటన
స్వామీజీని ప్రతిఘటించిన మరొక బృందం వారు స్వేచ్ఛాయుత చింతనా శీలురు (free thinkers). నాస్తికులు, భౌతికవాదులు, సంశయవాదులు, హేతువాదులు, మత వ్యతిరేకులు – వీరి బృందం అది. వారు స్వామీజీని ఒక రాత్రి విందుకు ఆహ్వానించారు. తమ తెలివితేటలతో, వాదనా పటిమతో స్వామీజీని మట్టికరిపించవచ్చని గాలిమేడలు కట్టుకొన్నారు. కాని పాపం! వారే మట్టికరిచారు. బైబిల్, ఖురాన్, అనేక మతాలు, విజ్ఞానం, మనస్తత్త్వశాస్త్రం – ఇలా స్వామీజీ విస్తృత జ్ఞానం ముందు వారు నీరుగారిపోయారు. వారు స్వామీజీతో ప్రేమతో మెలగి, చెలిమితో సెలవు పుచ్చుకొన్నారు.
ఈ విధంగా విజ్ఞానశాస్త్రవేత్తలు కొందరు ఒకసారి స్వామీజీని విందుకు ఆహ్వానించారు. ‘మేధాపరమైన’ తమ భావనలు చెప్పి స్వామీజీని తికమక పెట్టడం వారి ఉద్దేశం. కాని ఇతర చోట్లలో జరిగినట్లే ఇక్కడా జరిగింది. ఆధ్యాత్మికమనే ఖడ్గాన్ని చేతిలో జళిపిస్తూ వారి వాదనల నన్నింటినీ స్వామీజీ చీల్చి చెండాడారు. జీవితం, ప్రాణం లాంటి అనేక ప్రశ్నలకు పాశ్చాత్య విజ్ఞానం జవాబులు చెప్పలేక విస్మయం చెందడం ఎత్తి చూపారు. విజ్ఞానపరమైన జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానం కాదని తర్కపూర్వకంగా నిరూపించారు. “ఆ రోజు స్వామీజీని వాదనలో గెలవాలని వచ్చిన వారందరూ మర్నాటి నుంచీ విద్యార్థులుగా ఆయన పాదాల వద్ద కూర్చుని పాఠాలు వినడానికి వచ్చారు” అని వ్రాస్తున్నాడు లాన్స్బర్గ్.