సర్వమత మహాసభలో పాల్గొనడానికి ఒక వ్యక్తిని (స్వామీజీ) పంపు తున్నాను. విద్యాధికులయిన మన ఆచార్యు లందరినీ ఏకంచేసినా వారంతా ఈయన జ్ఞానానికి సాటిరారు.
ప్రొఫెసర్ హెన్రీ రైట్
(పరిచయ పత్రంలో)
వసంతకాల మందపవనం — చికాగో — ప్రదర్శనలో — అవమానాలు — పత్రికలు — ధన లేమి — పదే పదే పరీక్షలు — బోస్టన్‌లో — అనుగ్రహమనే అద్భుతం — మందమారుత పచ్చిక బయలు — బోస్టన్ రోజులు — శ్రీరామకృష్ణుల అభయం — రమాబాయి బృందాలు — సూర్యుడు ప్రకాశించడానికి యోగ్యతాపత్రమా? — కార్యారంభం — చికాగోలో — తలుపు తెరచుకొంది
వసంతకాల మందపవనం
రెం డు నెలలు! దాదాపు 13, 000 కి.మీ. దూరం! అపరిచిత ప్రదేశానికి ఒక యువసన్న్యాసి ఒంటరి పయనం! ఎన్నో ఆటంకాల మధ్య ఒంటరి ప్రయాణం! ఇప్పుడు తలచుకొన్నా కూడా మనస్సు కాస్త ఉలిక్కిపడు తుంది. స్వార్థం ఇసుమంత కూడా లేని ఇటువంటి మహాత్ములను గురించే శంకరాచార్యులు, “ప్రశాంతతనూ, మహత్త్వాన్నీ సంతరించుకొన్న మహాత్ములు ఉన్నారు. ప్రాకుకొంటూ వచ్చే వసంతకాల మందపవనంలా వారు మానవాళికి హితం చేస్తారు. ఈ సంసార సాగరాన్ని వారు దాటారు; ఇతరులు కూడా ఆ విధంగానే దాటాలనే ఉద్దేశంతో కించిత్తు కూడా స్వార్థం లేకుండా పాటుపడతారు. సూర్యుని తీక్ష్ణ కిరణాలతో దహింప బడిన భూమిని చంద్రుని శీతల కిరణాలు సహజంగా చల్లబరచేటట్లు, ఇతరుల దుఃఖాలను బాపడానికి పాటుపడడం వారి నైజమవుతుంది”* అని వచించారు.
“ఇతరుల దుఃఖాలను బాపడానికి పాటుపడడం” అన్నది సామాన్యంగా ఒక మహాత్ముని జీవితంలో ఆధ్యాత్మికతకు సంబంధించినదిగా ఉంటుంది. తమను వెదక్కుంటూ వచ్చేవారికికాని, కొన్ని సమయాలలో స్వయంగా తామే వెదక్కుంటూ వెళ్ళైనా వారు కొందరి జీవితాలలో జ్ఞానదీపాన్ని వెలిగిస్తారు; ఆధ్యాత్మికత అనే మహోన్నత సహాయం అందిస్తారు. శిష్యుల పాపాలను స్వీకరించి గురువు శారీరకంగానూ మానసికంగానూ బాధలనుభవించడం కద్దు. అయినప్పటికీ ఆ బాధలను స్వీకరించి శిష్యులను పురోగతి పథంలో పయనింపచేస్తారు ఆ కరుణా సింధువులు.
స్వామీజీ విషయంలో, ఆయన ఇంతకన్న అనేక మెట్లు క్రిందినుండి పాటు పడవలసి వచ్చింది. భారతీయులను ఆధ్యాత్మిక జీవితంకన్నా ముందుగా సామాన్య జీవితానికి ఆయన సంసిద్ధపరచవలసి వచ్చింది. “దేవతలవండి, ఇతరులనూ దేవతలుగా మార్చండి” అన్నది వారి తారకమంత్రమైనా, దీనిని అంగీకరించి ఆచరణలో పెట్టగల స్థితిలో భారతీయులు లేరని ఆయన గ్రహించకపోలేదు. ఆంగ్లేయుని పాదాల క్రింద నలిగి, తన సంస్కృతినీ, నాగరకతనూ విస్మరించి, కేవలం బానిసగా జీవిస్తూన్న ఆతడు దేవత అవడం ఎలా సాధ్యం? కనుకనే, “మనుష్యులను రూపొందించండి, అందు నిమిత్తం సర్వత్రా విద్యావ్యాప్తి గావించండి” అన్నారు స్వామీజీ. పశుప్రాయులుగా జీవిస్తున్న వారిని మానవ స్థాయికి ఎదగజేయడమే స్వామీజీ ఆదర్శాలలో ఒకటి. అప్పటి భారతీయునికి అవసరమైనది ఆధ్యాత్మిక ఆహారం కాదు, కనీసం సగం కడుపు నిండే ఆహారమే అన్నది ఆయన చక్కగా అవగతం చేసుకొన్నారు. కనుక ఆతడికి ముందుగా కడుపు నిండా ఆహారం అవసరం. అందుకు డబ్బు కావాలి. కనుక నిధుల కోసం వెతకాలి అనే నిశ్చయానికి వచ్చారు స్వామీజీ.
సాధారణమైన మహాత్ములు, “డబ్బును, కోర్కెలను త్యజించి భగవంతుణ్ణి వెదకండి” అని చెప్పే స్థితిలో ఉంటారు. కాని స్వామీజీ మాత్రం, “డబ్బు కోసం వెదకండి, చక్కని జీవితం గడపండి, తదనంతరమే, దాని పర్యవసానంగా ఆధ్యాత్మిక జీవితం వికసిస్తుంది” అని చెప్పవలసిన స్థితిలో ఉన్నారు. ధనాన్ని త్యజించిన ఆ యతిరాజు భారతీయుల కోసం నిధులను అన్వేషించారు. సుదూరంలోని ఈ దేశానికి అందునిమిత్తమే ఆయన వచ్చారు; యాతనలు, ఆటంకాలు, దుఃఖాలు, ద్రోహాలు, ప్రతిఘటనలు, విమర్శలు అన్నీ భరించారు. ఎంతటి మహోన్నత త్యాగం ఇది! ఎంతటి మహోన్నత కారుణ్యం!
చికాగో
ఆ కరుణాసాగరులైన స్వామీజీని, దాదాపు మరొక 500 మందిని తీసుకు వచ్చిన ‘ఇండియా సమ్రాజ్ఞి’ జూలై 27 వ తేదీన వాంకూవర్ చేరుకొంది. వాంకూవర్ నుండి చికాగో 2000 మైళ్ల దూరంలో ఉంది, రైలులో అయిదు రోజుల ప్రయాణం. రెండు వైపుల రమణీ యమైన ప్రకృతి దృశ్యాలను ఆనందంతో తిలకిస్తూ స్వామీజీ పయనించారు. విసుగు పరచిన ఓడ యానం తరువాత ఈ రైలు ప్రయాణం నూతనోత్సాహంకలిగించింది. జూలై 30 వ తేదీన ఆయన చికాగో చేరివుంటారు.
ఇచ్చిపుచ్చుకోవడాలు, బేరసారాలు చేయడం లాంటి లౌకిక వ్యవహారా లేవీ స్వామీజీకి అసలు తెలియవు. కనుక ఆయన ప్రతి చోటా మోసపోయారు. రైలు నుండి సామాన్లు దించడానికి కూడా ఎంతో ఎక్కువ కూలీ ఇచ్చి ఎలాగో బయటకు వచ్చారు. ఎక్కడ చూసినా జనం వెల్లువలా ఉన్నారు. ప్రపంచ ప్రదర్శన సందర్శింప వచ్చిన జనసందోహం!
చికాగో అనుభవం ఆయనకు పూర్తిగా క్రొత్తది. రైలు నిలయంలో దిగిన ఆయన ఒక క్షణం సందిగ్ధావస్థలో పడ్డారు. ఎక్కడకు పోవాలో తెలియదు. ధోవతి, తలపాగాతో ఉన్న ఆయన వేషధారణ ఆ పరాయి దేశంలో వింతగాకనిపించింది. పిల్లలు ఏదో వింతమనిషిని చూస్తూనట్లు గోలచేస్తూ ఆయన వెంట బడ్డారు. తక్కిన వారు కూడా ఆయనను ఏదో వింత చూస్తున్నట్లుగా చూశారే తప్ప ఎవరూ ఆయనకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. మైత్రి, ప్రేమ లాంటివి చూపించి స్నేహహస్తాలు చాపి ఆయనను ఆదరించడానికి ఆ పరాయి దేశంలో ఎవరూ ఉన్నట్లు తెలియలేదు.
స్వామీజీకి ఏంచేయాలో పాలుబోలేదు. చివరికి ఒక హోటల్లో బసచేయ డానికి నిశ్చయించుకొన్నారు. అందుకోసం ఒక హోటల్ ఏజెంట్‌ను కలుసుకొ న్నారు. తమ హోటల్ అతి శ్రేష్ఠమైనదని అతడు చెప్పాడు. అంతా అగమ్యగో చరంగా కానవచ్చే ఆ నూతన ప్రపంచంలో మంచి హోటల్లోనే బసచేయగోరి స్వామీజీ ఆతడితో వెళ్లారు. తన పెట్టెలను, మూటాముల్లెలను గదిలో పడేసి హమ్మయ్య అనుకొని, స్తిమితంగా కూర్చున్నారు. అన్ని సమస్యలను, కలతలను ప్రక్కకు నెట్టివేసి మనస్సును ప్రశాంతమయం చేయడానికి ప్రయత్నించారు.
ప్రదర్శనలో
మర్నాడు ప్రపంచ ప్రదర్శనను తిలకించడానికి వెళ్లారు. అక్కడ ఆయన చూసినవన్నీ వినూత్నమైనవీ, క్రొంగ్రొత్తవిగా కనిపించాయి. వరుసగా పన్నెండు రోజులూ వెళ్లి యంత్రాలు, కళాత్మక వస్తువులు, వైజ్ఞానిక అద్భుతాలు వంటి అనేక విభాగాలను పరికించారు. నీటి యావిరి, విద్యుచ్ఛక్తి తోడ్పాటుతో పనిచేసే యంత్రాలను స్వామీజీ ప్రప్రథమంగా అక్కడే చూశారు. మానవ మేధస్సు ఆవిష్కరించిన అద్భుతాలన్నింటినీ చూసి ఆయన ఆశ్చర్యచకితులయ్యారు.
ఏం చూసినా, ఏం విన్నా స్వామీజీ మనస్సు ఏదో ఆందోళన చెందుతూనే ఉందని చెప్పాలి. వేలమంది జనసమూహంలో స్వామీజీ ఏకాకిగా ఉన్నారు. పరిచయస్థుడో, స్నేహితుడో అని చెప్పుకోవడానికి అక్కడ నా అన్న వారెవరూ లేరు. స్నేహితునిగా సహాయం చేయకపోయినప్పటికీ, ఆయనను చిన్నబుచ్చ కుండా ఉండివుండవచ్చు కదా! కాని జరిగింది అదే.
అవమానాలు
ఒక రోజు స్వామీజీ ప్రదర్శనను తిలకిస్తూ వెళుతున్నారు. హఠాత్తుగా ఎవరో వెనుక నుండి ఆయన తలపాగా పట్టుకొని లాగారు. స్వామీజీ వెనక్కు తిరిగి చూశారు. ఆ వ్యక్తి చక్కని దుస్తులు ధరించి దర్జాగా కనిపించాడు. “నా తలపాగాను ఎందుకు లాగారు?” అని స్వచ్ఛమైన ఆంగ్లంలో స్వామీజీ ప్రశ్నించేసరికి ఆ వ్యక్తి ఆశ్చర్యచకితుడైనాడు; సిగ్గుతో వెళ్లిపోయాడు.
మరొకసారి ఒక వ్యక్తి స్వామీజీ వెనుకగా వచ్చి ఆయనను పట్టుకొని నెట్టాడు. కాస్త కోపంతో ఎందుకలా చేశావని స్వామీజీ ఆ వ్యక్తిని నిలదీసి అడిగినప్పుడు అతడు క్షమాపణ చెప్పే ధోరణిలో, “మీరెందుకు ఇలా విడ్డూరంగా దుస్తులు ధరించారు? అందుకే” అన్నాడు. ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. “గొప్ప నాగరకులమని చాటుకొనే మీ దేశంలోనే ఒకసారి ‘నేను ఒక హిందువు’ అయినందున కూర్చోవడానికి నాకు కుర్చీ కూడా ఇవ్వలేదు” అని స్వామీజీ వ్రాశారంటే ఆయన భరించిన అవమానాలు ఎన్నెన్నో!
కొన్ని రోజుల తరువాత బోస్టన్‌లో ఒకసారి ఆయన ప్రాణాలు కాపాడుకోవ డానికి పరుగెత్తవలసివచ్చింది. ఒక రోజు ఒక వీథి గుండా నడిచిపోతున్నప్పుడు హఠాత్తుగా ఆయన భుజానికి ఏదో గట్టిగా తగిలింది. వెనక్కు తిరిగి చూసేసరికి పురుషులు, బాలురతో కూడుకొన్న ఒక గుంపు ఆయనపై దాడి చేయడానికి వస్తోంది. ఎలాగో వీథి మలుపులోని ఒక చీకటి ప్రాంతానికి పరుగుదీసి వారి దాడి నుండి స్వామీజీ తప్పించుకొన్నారు.
పత్రికలు
క్రమంగా స్వామీజీ పత్రికల దృష్టిలోకి వచ్చారు. ఆయనను ప్రపంచ ప్రదర్శనలో కలుసుకొని, హోటల్లో కలుసుకొని పత్రికలు వ్రాయసాగాయి. కొందరు స్వామీజీ బస చేసిన హోటల్ మేనేజర్‌ను కలుసుకొని, ఆతడు అందించిన ఏవేవో సమాచారాలను ప్రచురించారు. స్వామీజీ పేరును స్వామి వివేకానోంద, వివేకానొండ, స్వామి వివేక్యోనంద, రాజా స్వామి వివేక్యోనంద తదితర రీతుల్లో ప్రచురించి ఒక సహస్రనామాన్ని రూపొందించారు. అన్నింటికీ మించి ఆయనను సందిగ్ధ పరిస్థితిలో ఇరికించారు కూడా. దానిని గురించి స్వామీజీ మాటల్లోనే చూద్దాం:
“కపుర్తలా మహారాజు ఇక్కడ ఉన్నాడు. చికాగోలో కొందరు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. నేను ఆయనను ఒక రోజు కలుసుకొన్నాను. కానిఆయన మహారాజు! నా లాంటి బుక్కా ఫకీరుతో మాట్లాడతాడా! ఒక వెర్రిమహారాష్ట్ర బ్రాహ్మణుడు, ధోవతి కట్టుకొని, గోటితో గీచిన బొమ్మలను సంతలో అమ్ముతున్నాడు. ఇతడు ఆ రాజాకు వ్యతిరేకంగా అనేక కట్టుకథలను పత్రికా విలేఖరులకు చెప్పాడు. ఈ రాజా నిమ్న కులస్థుడనీ, ఈ రాజులందరూ కేవలంబానిసలనీ, సర్వసాధారణంగా వీరు నీతిబాహ్యమైన జీవితాలు గడపుతారనీ, మరి ఇటువంటివే ఏవేవో ఏకరువు పెట్టాడు. ‘నిజాయతీపరులైన’ ఈ అమెరికా పత్రికా విలేఖరులు అతడు చెప్పిన కాకమ్మకథలకు కొంత ప్రాధాన్యమిచ్చి, ఆ అవాకులుచవాకులు నేను చెప్పానని, నన్ను ఆకాశానికి ఎత్తుతూ, మర్నాడే తమ పత్రికలలో ఈ భారతదేశం నుండి వచ్చిన మేధావిని (నన్ను ఉద్దేశించి) గూర్చి ఏమేమో సవిస్తరంగా ప్రచురించారు. ఆ మహారాష్ట్ర బ్రాహ్మణుడు కపూర్చెప్పినదంతా నాకు ఆపాదిస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. ఇది మంచికే జరిగిందా అన్నట్లు దానితో చికాగో సంఘం తక్షణమే ఆ రాజానుబహిష్కరించింది…. ఈ వార్తాపత్రికా సంపాదకులు నా దేశీయుణ్ణి బహిష్కరించడంలో నన్నే ఎక్కువగా ఉపయోగించుకొన్నారు. ఏదిఏమైనా ఈ దేశంలోధన వైభవం కన్నా, బిరుదుల కన్నా, మేధస్సుకే ఎక్కువ గౌరవముందని ఈ విషయం వ్యక్తం చేస్తున్నది.”*
ధన లేమి
ఇవన్నీ ఒక వంక; కాని స్వామీజీ డబ్బు సమస్యనే ముఖ్యంగా ఎదుర్కొనవలసి వచ్చింది. ప్రయాణ ఖర్చులకు ఉంటే చాలు, అమెరికాకు వెళ్లిపోవచ్చు; అక్కడకు వెళ్లాక ‘ఎలాగయినా’ సంబాళించుకోవచ్చునని ఆయనా, ఆయన చెన్నై శిష్యులూ భావించారు. ఈ ‘ఎలాగయినా’ అంటే – భారతదేశంలోలా దక్షిణ, చందా ఇవేవీ లేకపోతే భిక్షలాంటి వాటితో రోజులు గడపవచ్చు అని అర్థం. కాని అమెరికాలో ఇవేవీకుదరవని వారు తలంచలేదు. భిక్షమెత్తడం అమెరికాలో చట్టప్రకారం నేరం. ఇక సన్న్యాసిగా పర్యటిస్తూ జీవించడం ఊహాతీతమైనది!
చెన్నై మిత్రులలో ఒకరైన వరదరావు చికాగోలోని తన అమెరికా మిత్రునికిస్వామీజీ గురించి వ్రాసివున్నాడు. ఆతడు, ఆతడి కుటుంబ సభ్యులూ స్వామీజీని ఎంతో ఆదరించారు. వారి పరిచయం ఒక ఎడారిలో నీటి చెలమలా (Oasis) స్వామీజీకి లభించింది. చివరి దాకా స్వామీజీ వారిని మరచిపోలేదు. అయి నప్పటికీ ధనలేమితో అమెరికాలో జీవించడం అంత సులభం కాదు. వస్తువులధరలు విపరీతం. దేనిని తాకినా బోలెడంత ఖరీదు చెబుతున్నారు. దానితోబాటు స్వామీజీకి అమెరికా డాలర్ విలువ గురించి అంతగా తెలియనందున, వెళ్లిన ప్రతిచోటా ఎంతో కొంత మోసానికి గురయ్యారు. చేతనున్న డబ్బు శరవేగంతో కరగిపోసాగింది.
పదే పదే పరీక్షలు
డబ్బు ఇబ్బందిని ఎలా సంబాళించాలోనని ఆలోచిస్తున్న స్వామీజీకి పిడుగు లాంటి మరొక వార్త అందింది. సర్వమత మహాసభ సెప్టెంబర్ నెలకు వాయిదా వేయబడ్డది. దాంతో ఇంకా ఒక నెల ఆయన చికాగోలో గడపవలసిన అగత్యం ఏర్పడింది. అందుకు కావలసిన పైకం ఆయన వద్ద లేకపోవడం అనే సమస్య ఒక వైపు ఉండగా, అట్లే సెప్టెంబర్ దాకా ఏదోరకంగా గడపినప్పటికీ సర్వమతమహాసభలో ఒక ప్రతినిధిగా ఆయన పాల్గొనగలుగుతారా అనే ప్రశ్న ఉత్పన్నమయింది. సముచిత మైన పరిచయపత్రం లేకుండా ఎవరినీ అనుమతించకూడదని కార్యకర్తలు చేతులు ముడుచుకొన్నారు.
ఇవన్నీ జరుగుతున్నవి అనేక వేల మైళ్ల దూరంలోని ఒక అపరిచిత దేశంలో ఏకాకిగా, చేత చిల్లిగవ్వలేని ఒక ముప్ఫై ఏళ్ల యువకునికి! కాని ఆయువకునికి భగవంతుని పట్ల ఎనలేని నమ్మకం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, తానొక మహత్కార్య సాధనకై జన్మించిన వ్యక్తిననే నమ్మకం ఉంది, అందు కోసం తనకు భగవంతుడు ఆదేశానుగ్రహం ప్రసాదించాడనే నమ్మకమూ ఉంది! ఆయన నిస్పృహ చెందలేదు.
అయినప్పటికీ ఈ మేరకు దూరాలోచన లేకుండా వచ్చేశానే అని స్వామీజీకి తన మీదా, తనను పంపించిన వారి మీదా అనుతాపం కలుగకపోలేదు. ఇంతకూ ఆయనను పంపిన వారిలో మున్షీ జగ్మోహన్లాల్, ఖేత్రీ మహారాజు లాంటి లోకాను భవంగల పలువురు ఉండనే ఉన్నారు. పరిచయపత్రం అవసరమని ఎవరూ ఆలోచించకపోవడం శోచనీయం. ఈ విషయంగా నివేదిత ఆశ్చర్యపోతూ ఇలా అంది: “అమెరికా సంప్రదాయాలనో, నియమనిబంధనలనో ఆ చెన్నై శిష్యులు అసలు ఎరుగరు. స్వామీజీ పట్ల వారికున్న అపరిమిత నమ్మకం దానిని గురించి వారిని ఆలోచింపజేయనివ్వలేదు. స్వామీజీ వెళితే చాలు, అన్ని తలుపులూ వారి కోసం వాటంతట అవే తెరచుకొంటాయి, అన్ని అవకాశాలూ ఆయనను వెతుక్కొంటూ వస్తాయని వారి దృఢనమ్మకం. శిష్యుల కన్నా వేయిరెట్లు నిష్కళంక హృదయులు స్వామీజీ. తమకు భగవంతుని ఆదేశానుగ్రహం ఉంది కనుక ఎలాంటి ఆటంకాలూ దారిలో వాటిల్లవని ఆయన కూడా దృఢంగా నమ్మారు.సంస్థాగత రీత్యా వ్యవహరించడం హిందూమతంలో కించిత్తు కూడా లేదనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా? లేకుంటే యావత్ప్రపంచపు డబ్బూ, బలమూ కేంద్రీకృతమై అపారశక్తితో విరాజిల్లుతున్న ఒక దేశానికి పరిచయపత్రమో, మరో ఆధికారిక మద్దతో లేకుండా ఒకరిని పంపడానికి సాహసిస్తారా?”
బోస్టన్‌లో
సర్వమత మహాసభలో ఒక ప్రతినిధిగా పాల్గొనడం ప్రశ్నార్థకమయినప్పుడు, ఒక ప్రేక్షకునిగా అందులో పాల్గొనాలన్నా స్వామీజీ ఇంకా నెలరోజులు చికాగోలో ఉండి తీరాలి. కాని చేతనున్న పైకం కరిగిపోతున్న వేగం చూస్తూవుంటే అది సాధ్యం కాదని తోచింది. గత్యంతరం ఏమిటని దీర్ఘంగా ఆలోచించిన స్వామీజీకి సాంత్వనపరచే రీతిలో బోస్టన్ గురించి వార్త వచ్చింది. బోస్టన్ చికాగో నుండి 985 మైళ్లదూరంలో ఉంది; చికాగో కన్నా అక్కడ ఖర్చులు తక్కువ. కనుక అక్కడకు వెళ్లాలని ఆయన నిశ్చయించుకొన్నారు. పన్నెండు రోజులు చికాగోలో గడిపిన తరువాత స్వామీజీ రైలులో బోస్టన్‌కు బయలుదేరారు.
అనుగ్రహమనే అద్భుతం
భగవంతుడనే మహోన్నతశక్తిని విశ్వసించి, కేవలం ఆయన అనుగ్రహంపై ఆధారపడి జీవించేవారు ఎలాంటి పరిస్థితులలోనూ పరిత్యజింపబడలేదు. కాని ఆఅనుగ్రహం ఎలా పనిచేస్తుందో, ఏ మార్గంలో మనలను కాపాడుతుందో భగవంతునికే ఎరుక. భగవంతుని లీలలు అద్భుతమైనవి! మామూలు మనిషి జీవితంలో ఇది నిజమయితే, భగవంతుని ఆదేశానుగ్రహంతో పనిచేసే స్వామీజీ లాంటి అనుగ్రహపాత్రుల జీవితంలో అది ముమ్మాటికీ నిజమే! అట్లే జరిగింది కూడా. సర్వత్రా గాఢాంధకారం ఆవరించిన గదిలో తల్లడిల్లే వ్యక్తికి ఎక్కణ్ణుండో వస్తున్న సన్నని ఒక కాంతి కిరణం ఇచ్చే నమ్మకమూ, సాంత్వనా మాదిరి స్వామీజీ మీద కూడారైలు ప్రయాణంలో విశ్వాసకిరణం ఒకటి ప్రసరించింది.
ఆ రైలులో స్వామీజీతోపాటు పయనం చేసిన వ్యక్తి మిస్ కేథరిన్ ఆబట్ శాన్బాన్. క్లుప్తంగా కేటె శాన్బాన్గా పేర్కొనబడే ఆ 54 ఏళ్ల మహిళ స్వామీజీ పట్ల అమితంగా ఆకర్షితురాలయింది. దాంతో ఆయనను సమీపించి సంభాషించ సాగింది. హిందూమత ప్రతినిధిగా సర్వమత మహాసభలో పాల్గొనడానికి వచ్చిన హైందవ సన్న్యాసి ఆయనే అనీ, ఆయన ప్రస్తుత పరిస్థితీ తెలుసుకొన్న కేథరిన్ తన ఇంట్లో అతిథిగా బస చేయమని స్వామీజీని ఆహ్వానించింది. దానిని సాక్షాత్తు జగజ్జనని ఆహ్వానంగానే స్వీకరించారు స్వామీజీ.
మందమారుత పచ్చిక బయలు
బోస్టన్‌కు సమీపంలోని ఒక గ్రామం మెట్కాఫ్. అక్కడ కేథరిన్‌కు ఒక ఉద్యానగృహమూ, పొలాలూ ఉన్నాయి. తన ఇంటికి ఆమె బ్రీజీ మెడోస్ (మందమారుత పచ్చికబయలు) అని పేరుపెట్టుకొంది. ఇంటి మీద ద్రాక్షతీగలు అల్లుకొని ఉన్నాయి. సమీపంలో ఆంబల్ పుష్పాలు వికసించిన ఒక చిన్న కొలను ఉంది. దాని చుట్టూ దేవదారు (Pine) వృక్షాలు దట్టంగా పెరిగి ఉన్నాయి. ఆ ప్రకృతి అందాన్ని ద్విగుణీకృతం చేస్తూ ప్రక్కనే మర్మరధ్వనులతో రెండు సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి. వాటి రెండు తీరాల్లోనూ పసుపు చుక్కలుగల నీలిరంగు పుష్పాలు (Forgetmenots) కోకొల్లలుగా పూచి ఉన్నాయి. ప్రకృతిని ఆరాధించే, అద్వితీయమైన ప్రకృతి సౌందర్యంలో భగవంతుని మహత్త్వాన్ని గాంచే స్వామీజీకి ఈ ప్రదేశం అమితంగా నచ్చడంలో వింతేమీ లేదు. మహదానందంతో ఆయన అక్కడ బస చేశారు.
జగజ్జనని అనుగ్రహంచే స్వామీజీకి మార్గదర్శకత్వంలో ఒక వారధిగా అమరిన కేథరిన్ ఒక సుప్రసిద్ధ మహిళ. ఆమె ఒక ప్రాసంగికురాలు, ఆమె అతి దగ్గరి బంధువైన ఫ్రాంక్లిన్ బెంజమిన్ శాన్బాన్ ఒక గొప్ప చింతనాశీలుడు, అనేక గ్రంథాల రచయిత, సమాజ సేవకుడు, తత్త్వశాస్త్రం పట్ల చక్కని అభిరుచి గల వ్యక్తి.
సమాజంలో పేరుప్రతిష్ఠలున్న కేథరిన్ తారసపడడం ఆ సంక్లిష్ట పరిస్థితిలో స్వామీజీకి ఒక అనుకోని మేలుగా పరిణమించింది. కేథరిన్ మూలంగా ఆయన పలువురు ప్రఖ్యాత వ్యక్తులను కలుసుకోగల ఆస్కారం లభించింది. ఆ రకంగా ఆయన కలుసుకొన్న వ్యక్తులలో ఒకరే జాన్ హెన్రీ రైట్. సర్వమత మహాసభలో స్వామీజీ పాల్గొనడంలో ఈయన కీలక పాత్ర వహించారు. కనుక సర్వమత మహాసభ సమావేశమయ్యే చికాగో నుండి దూరంగా వెళ్లిపోయినట్లుగా అనిపించి నప్పటికీ నిజానికి అందులో పాల్గొనడానికి సానుకూల పరిస్థితికి సమీపంలోనే జగజ్జనని ఆయనను తోడ్కొని వెళ్లిందని చెప్పవచ్చు!
బోస్టన్ రోజులు
స్వామీజీ మెట్కాఫ్లో బస చేసినప్పుడు అమెరికాలో వేసవికాలం. ఈ రోజుల్లో జనం సామాన్యంగా పట్టణాల నుండి సముద్రతీరాలకూ, శీతల ప్రదేశాలకూ పోవడం రివాజు. వేసవి ముగిసి శీతకాలం ప్రారంభమయ్యేటప్పుడు తిరిగి వస్తారు. కనుక ఈ రోజుల్లో ఎవరినీ కలుసుకోవడమో, తరగతులు నడపడమో, ప్రసంగాలు ఇవ్వడమో సాధ్యం కాదు. స్వామీజీకి సంబంధించినంత వరకు ఈ రోజులూ బాగా ఉపయుక్తంగానే గడిచాయి. సర్వమత మహాసభలో పాల్గొనడానికి సంసిద్ధమయ్యే రోజులుగా వాటిని ఆయన పరిగణించారు.
ఒక రోజు సమీపంలో ఉన్న స్త్రీల చెరసాల సంరక్షకురాలయిన మిసెస్జాన్సన్ స్వామీజీని కలుసుకోవడానికి వచ్చింది. ఆ చెరసాలను సందర్శించడానికి ఆమె స్వామీజీని ఆహ్వానించింది. అట్లే స్వామీజీ దానిని సందర్శించి వచ్చారు. “ఇక్కడ దానిని చెరసాల అని పేర్కొనరు, సంస్కరణాలయమంటారు. నేను అమెరికాలో చూసిన వాటి అన్నింటిలో అది అత్యుత్తమమైనది. ఖైదీలు ఇక్కడఎంత దయతో చూడబడుతున్నారో, ఏ విధంగా వారు సంస్కరింపబడి, మంచిపౌరులుగా సంఘంలోకి తిరిగి పంపబడుతున్నారో, ఇది ఎంత అద్భుతంగాను, సుందరంగాను ఉందో మీరు కళ్లారా చూస్తేగాని నమ్మలేరు. ఆహా! భారతదేశంలోబీదలను, అనాథలను గూర్చి తలచినప్పుడు బాధతో నా హృదయం ఎట్లాతపిస్తోందో! వారికి గతిలేదు, తప్పించుకొనే అవకాశం లేదు. పైకి రావడానికి దారిలేదు”* అంటూ అక్కడ కూడా భారతీయుల గురించే బాధపడ్డారు స్వామీజీ.
శ్రీరామకృష్ణుల అభయం
డబ్బు వాయువేగంతో కరిగిపోసాగింది; స్వామీజీ వద్ద ఇంకా 130 డాలర్లేమిగిలివున్నాయి. డబ్బు సమస్య ఒక వంక, సర్వమత మహాసభలో పాల్గొనగలనా అనే సందిగ్ధం మరోవంక, ముందువెనుకలు తెలియని లోకం ఒక వైపు – స్వామీజీ పరిస్థితిని మనం కొంత ఊహించుకో వచ్చు. “ఇక్కడకు రావడానికి ముందు మనోహరంగా కనిపించిన కలలన్నీ కరిగిపోయి అసాధ్యమైన వాటిని ఎదుర్కొన వలసి ఉన్నాయి.ఈ దేశాన్ని వదలివేసి తిరిగి అక్కడికి రావాలని ఎన్నోసార్లు నాకు తలంపుకలిగింది. కాని దృఢసంకల్పుడనై ఉన్నాను. నాకు భగవదాదేశం ఉంది. నాకు అన్యమార్గమేదీ కనిపించడం లేదు. ఆయన దివ్యనేత్రాలే నన్ను కనిపెట్టి ఉన్నాయి”* అని కలతచెంది స్వామీజీ వ్రాశారు.
వ్రాయడం మాత్రమే కాదు; “పస్తులుంటున్నాను. డబ్బంతా కరిగిపోయింది.అక్కడికి తిరిగి రావడానికయినా పైకం పంపించు” అని అలసింగకు తంతిపంపారు. తిరిగి భారతదేశం చేరడానికి కూడా చేత డబ్బు లేకుండాపోతుందేమోనని స్వామీజీ కలతచెందారు. కలత, గందరగోళాలతో ‘అర్ధ మృతప్రాయుని’ గా నేలమీద పడుకొన్నారు. ఆయన వ్రాసినట్లే అప్పుడు భగవంతునిదృక్కులు ఆయన మీద ప్రసరించాయి. ఆయన వరదాభయహస్తాలను స్వామీజీవైపు సాచారు. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు అక్కడ ప్రత్యక్షమైనారు! స్వామీజీవద్దకొచ్చి ఆయనను తాకి, “ఏమిటిది! లే నాయనా! లోకం పోకడ తలపోసి ఇంతగా అశాంతి చెందకు” అని చెప్పి మాయమైనారు.
శ్రీరామకృష్ణుల అభయంతో స్వామీజీ ఎంతో సాంత్వన పొందారు.సర్వమత మహాసభలో స్వామీజీ పాల్గొనడానికి వీలుగా శ్రీరామకృష్ణులు తలుపులుతెరచారు. అందుకై ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ మూలంగా మార్గం ఏర్పడింది.
రమాబాయి బృందాలు
బోస్టన్‌లోనే ప్రప్రథమంగా స్వామీజీ రమాబాయి బృందాల పట్ల ప్రతిఘటనచూపవలసిన అగత్యం కలిగింది. అక్కడ ఒక మహిళా సంఘంలో ఆగస్టునెలాఖరున ప్రసంగించడానికి స్వామీజీకి ఆహ్వానం వచ్చింది. రమాబాయికి సహాయం అందిస్తూన్న సంఘం అది. రమాబాయి ఒక మరాఠీ బాలవితంతువు. తన 22 వ ఏట ఒక బెంగాలీని వివాహం చేసుకొని రెండేళ్లలో మళ్లీ వితంతువయింది. ఆ తరువాత ఇంగ్లాండ్ వెళ్లి క్రైస్తవ మతం పుచ్చుకొంది. పిదప అమెరికా పోయి అక్కడ అనేక కేంద్రాలు నెలకొల్పింది. అమెరికాలో నిధులు సేకరించి భారత దేశంలోని బాలవితంతువులకు పాఠశాలలు ప్రారంభించాలన్నది ఆమె లక్ష్యం. లక్ష్యమేమో ఉన్నతమైనదే గాని ఆమె ఆచరణ విధానం ఆమోదయోగ్యమైనదిగా లేదు. భారతదేశంలో స్త్రీలకూ, వితంతువులకూ లభించే నిరాదరణను అతిహీ నంగా చిత్రించి నిధులు వసూలు చేసింది. స్త్రీలు తమను ఆలయ ఊరేగింపు సమయంలో రథచక్రాల క్రింద అర్పించుకొని ప్రాణత్యాగం చేయడం, ఆడశిశువు లను గంగలో మొసళ్లకు వేయడం లాంటి అనేక కట్టుకథలు చెప్పింది. ఆమెకు నిధులు లభించడం అన్నది పక్కకిపెడితే, క్రైస్తవ మిషనరీలు ఈ కట్టుకథలను హిందూమత వ్యతిరేక ప్రచారానికి చక్కగా ఉపయోగించుకున్నారు.
స్వామీజీ తమ ఉపన్యాసాలలో రమాబాయి కట్టుకథలను ఛిన్నాభిన్నం చేశారు. ఇవన్నీ కట్టుకథలని చెప్పి, అసలు పరిస్థితిని తెలియజేశారు. ఇప్పుడు ఆరంభమయిన ఈ సమస్య దీర్ఘకాలం స్వామీజీ కార్యకలాపాలకు ఆటంకంగానే ఉండిపోయింది.
కేథరీన్ స్వామీజీ పట్ల గౌరవమర్యాదలు వ్యక్తం చేసినప్పటికీ, స్వామీజీ వేషధారణ, విచిత్ర ఆచార వ్యవహారాలను కాస్త పరిహాసపూర్వకమైన ధోరణిలోనే చూసిందనవచ్చు. ఇరుగుపొరుగు వారినీ, మిత్రులనూ పిలిచి, “భారతదేశం నుండి వచ్చిన విచిత్రం” అంటూ స్వామీజీని వారికి పరిచయం చేసింది. అన్నింటినీ స్వామీజీ సహించారు.
సూర్యుడు ప్రకాశించడానికి యోగ్యతాపత్రమా?
ఒక రోజు కేథరీన్ బంధువయిన బెంజమిన్ స్వామీజీతో మాట్లాడుతున్నాడు. మొదట్లో ఆతడికి స్వామీజీ పట్ల అంత గొప్ప అభిప్రాయం లేదు. కాని మాట్లాడే కొద్దీ ఆతడి అభిప్రాయం మారిపోయింది. పర్యవసానంగా స్వామీజీ పట్ల ఆతడు అమితంగా ఆకర్షితుడైనాడు. బోస్టన్లోని తన ఇంటికి విచ్చేయమని ఆహ్వానించాడు. ఈ రోజుల్లోనే ప్రొఫెసర్ రైట్ను స్వామీజీకి పరిచయం చేసింది కేథరిన్.స్వామీజీని గురించి విన్న రైట్ ఆయనను తనతో కొన్ని రోజులు బసచేయమని ఆహ్వానించాడు. ఆ సమయంలో ఆయన బోస్టన్‌కు దాదాపు 30 మైళ్ల దూరంలోని అన్నిస్క్వామ్ అనే ప్రాంతంలోని ఒక ప్రశాంతమైన గ్రామంలో సెలవులను గడపడానికి వచ్చాడు. ఆగస్టు 26, 27 తేదీలు ఆయనతో స్వామీజీ గడిపారు. ప్రొఫెసర్ విద్యాధికుడు. ఇద్దరూ అనేక విషయాల గురించి ముచ్చటించుకొన్నారు.
భారతదేశంలో అనేక చోట్ల జరిగినట్లే ఇక్కడా జరిగింది. కొద్దిసేపు మాట్లాడగానే స్వామీజీ అసామాన్యులని రైట్‌కు అవగతమయింది. సర్వమతమహాసభలో పాల్గొనడానికి వీలుండదేమోనని కలతచెందిన స్వామీజీతో, “హిందూమత ప్రతినిధిగా మీరు పాల్గొనే తీరాలి. మీ గురించి అమెరికా తెలుసుకోవాలంటే అదొక్కటే తప్ప మరో మార్గం లేదు” అని చెప్పి రైట్ ఆయనను ఉత్సాహపరిచాడు. “కానీ అందుకు అవసరమైన పరిచయ పత్రమో, యోగ్యతా పత్రమో నా వద్ద లేవు” అన్నారు స్వామీజీ సంకోచిస్తూ! “స్వామీజీ! మీకు యోగ్యతాపత్రమా? సూర్యుడు ప్రకాశించడానికి యోగ్యతాపత్రం అడిగినట్లుగా ఉంది ఇది” అన్నాడు రైట్.
రైట్ అక్కడితో ఆగిపోకుండా, స్వామీజీని ఎలాగైనా సర్వమత మహాసభలో ఒక ప్రతినిధిగా పాల్గొనేటట్లు చేసితీరాలని నిశ్చయించుకొన్నాడు. “స్వామీజీ! మీరు పాల్గొనడానికి నా శక్తివంచన లేకుండా తోడ్పడతాను” అని స్వామీజీకి వాగ్దానం చేశాడు కూడా. స్వామీజీ కళ్లలో నమ్మకమనే మెరుపు మెరిసింది.
మహాసభలో పాల్గొనబోయే ప్రతినిధులను ఎంపికచేసే సంఘానికి అధ్యక్షు డయిన డాక్టర్ బారోస్కు ఒక ఉత్తరం వ్రాశాడు: “సర్వమత మహాసభలో పాల్గొన డానికి ఒక వ్యక్తిని పంపుతున్నాను. విద్యాధికులయిన మన ఆచార్యు లందరినీ ఏకం చేసినా వారంతా ఈయన జ్ఞానానికి సాటిరారు” అంటూ ప్రొఫెసర్ రైట్ ఆఉత్తరంలో వ్రాశాడు. స్వామీజీ వద్ద పైకం లేదని గ్రహించి చికాగో వెళ్లడానికి పైకమూ, అక్కడ ఇతర ప్రతినిధులతో పాటు బసచేయడానికి పరిచయ పత్రాలు కూడా ఇచ్చాడు. నిష్క్రమించీ నిష్క్రమించక కాపాడుతున్న గురుదేవులను తలచుకొని స్వామీజీ పులకితాంతరంగులయ్యారు.
సేలం వెళ్లాక ప్రొఫెసర్‌కు తన కృతజ్ఞతలు తెలుపుకొంటూ స్వామీజీ సెప్టెంబర్ 4 వ తేదీన ఒక లేఖ వ్రాశారు: “మీరూ, గౌరవనీయురాలైన మీ శ్రీమతిగారు, మీ ముద్దుబిడ్డలు నా మనస్సుపై చెరగిపోని ముద్రవేశారు. మీతో ఉన్నంత కాలం స్వర్గంలో ఉన్నట్లు భావించాను. వరాలను ప్రసాదించే ఆభగవంతుడు తన అమూల్యమైన దీవెనలను మీపై వర్షించుగాక!”*
ఆ లేఖతోపాటు తమ హృదయంలో చెలరేగిన ఉద్వేగానికి అద్దంపట్టే రీతిలో ‘భగవదన్వేషణ’* అనే కవితను కూడా వ్రాసి పంపించారు. తమ కష్టాలలో, ప్రయాసలలో భగవంతుడు ఏ విధంగా కనిపించని తోడుగా ఉండి మార్గదర్శ కత్వం వహిస్తున్నాడో ఈ కవితలో అద్భుతంగా స్వామీజీ వర్ణించారు.
కార్యారంభం
చికాగో బయలుదేరడానికి ముందు ఒక వారం స్వామీజీ సత్వరంగా పనిచేయవలసి వచ్చింది. ఆగస్టు 27 వ తేదీ ఆదివారం నాడు ఆయన అన్నిస్క్వామ్లోని ఒక చర్చ్‌లో ఉపన్యసించారు. “భారత దేశానికి తక్షణ ఆవశ్యకత సాంకేతిక విద్యే కాని మతం కాదు” అనే అంశాన్ని ఆ ప్రసంగంలో నొక్కివక్కాణించారు. ఆ ప్రసంగం ఉద్వేగమూ, ఉప్పొంగే కార్యతత్పరతలతో నిండిపోయింది. అది విన్న శ్రోతలు కూడా ఆ ఉద్వేగానికి స్పందించి, అటువంటి విద్యను తక్షణమే అమలుపరచే కళాశాలను భారతదేశంలో స్థాపించడానికి నిధులు వసూలు చేయనారంభించా రట! స్వామీజీ గురించీ, అన్నిస్క్వామ్లో ఆయన గడపిన రోజుల గురించీ శ్రీమతి రైట్ దీర్ఘమయిన వివరణ ఇచ్చారు:
“ఆయన సామాన్యంగా మోకాలు దిగువ దాకా వచ్చే పొడవైన కాషాయపు అంగీ ధరించేవారు. ఫాదరీలు ధరించే మాదిరిగా అది ఉంది. పొడవైన, మందమయిన ఒక కాషాయ వస్త్రాన్ని నడుముకు బిగించుకొనేవారు. కాళ్లను కాస్త ఈడుస్తూ నడుస్తూన్నట్లుగా కనిపించినా ఆయన నడకలో ఒక ప్రత్యేక ఠీవి ఉంది. పైకెత్తిన తల, తిన్నని మెడ, సునిశిత దృక్కులూ ఆయనకు ఒక ఆధికారిక వైఖరిని కల్పించాయి. అంతేకాదు ఆయనను దాటుకొంటూ వెళ్లే ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆగి ఆయనను చూడకుండా ఉండలేకపోయారంటే అతిశయోక్తి కాదు. ఆయన మెల్లగా నడుస్తారు, ఆయనలో తొందరో, వేగమో కనిపించదు. ఆయన విశాలనేత్రాలు కొన్ని సమయాలలో నిప్పులు వర్షిస్తాయి.
“ప్రశాంతంగా కూర్చునివున్న ఆయన కొన్ని సమయాలలో తల పైకెత్తి దృష్టిని పైకప్పుకేసి త్రిప్పి ‘శివ శివ’ అనడం కద్దు. ఆయన ఉద్వేగం అగ్నిపర్వతపు లావాలా వ్యాపించి అక్కడున్న అందరినీ మాడ్చివేసేదిగా ఉండేది.
“ఒకసారి ఆయనతో ఒకవ్యక్తి, ‘క్రైస్తవ మతమే అందరినీ రక్షిస్తుంది’ అని చెప్పినప్పుడు స్వామీజీ తమ విశాల నేత్రాలను ఆతడి వైపుగా త్రిప్పి ‘అలా అయితే అది ఎందుకు ఇథియోపియా ప్రజలను, అబిసీనియా ప్రజలను రక్షించలేదు?” అని ఠక్కున అడిగారు. అంతే కాదు, అదే ఉద్వేగంతో అలా రక్షిస్తుందని భరోసా ఇస్తున్న పాశ్చాత్య దేశాల వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఆ దేశాలలో జరిగే నేరాలు, స్త్రీల పరిస్థితి, సమాజంలో నెలకొన్న అవినీతి, మద్యం ప్రభావం, దొంగతనాలు, రాజకీయ కుట్రలు, హత్యలు ఇత్యాదుల జాబితా వల్లించారు. ఆయన మాటల్లో అందరూ మైమరచిపోయారు – స్త్రీల కళ్లు మెరశాయి, చెక్కిళ్లు ఉద్వేగంతో ఎర్రబారాయి. చిన్నపిల్లలు సైతం ఆయన తమతో చెప్పింది జ్ఞాపకముంచుకొని అదే మాట్లాడారు. చిత్రకారులు తదేకంగా చూస్తూ ఆయన చిత్రాన్ని గీయనారంభించారు.
“ఈ లోకంలో సత్యం అంటూ ఏదైనా ఉందీ అంటే అది ఆధ్యాత్మిక జీవితం మాత్రమే అంటూ గడపడానికి ఆయన శిక్షణ పొందినట్లుగా అనిపించింది. భగవంతుని పట్ల ప్రేమ, మనిషి పట్ల ప్రేమ ఇవే సత్యమని ఆయన నమ్మకం.”
ఈ విధంగా సాగుతుంది శ్రీమతి రైట్ దీర్ఘవివరణ. డబ్బు విషయంలోస్వామీజీ అనాసక్తతను గురించి ఆమె ప్రత్యేకంగా ఇలా వ్యాఖ్యానించింది: “ఎవరైనా స్వామీజీకి డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు, వారు తమ కేదో కీడు తలపెట్టినట్లు వైదొలగేవారు. ‘ఆహా! సరిపడినంత కష్టాలను నేను అనుభవించాను. వాటిలో నన్ను ఎక్కువగా పరీక్షించింది ఏదో తెలుసా? డబ్బును పదిలపరచడమే’ అంటూ పిల్లవాడిలా ఆయన చెప్పేవారు. డబ్బు లేకుండా ఏమీ చేయలేం అనే స్థితిలో కూడా ఆయన డబ్బును తిరస్కరించడం మేం నమ్మలేక పోయాం. డబ్బు పట్ల ఒక వ్యక్తి ఇంత అనాసక్తతతో ఉండగలరా అనే ఆలోచన ఆయన వెళ్లిపోయిన చాలా రోజుల దాకా మా మనస్సులలో పాదుకుపోయింది.”
అనేక చోట్ల నుండి స్వామీజీకి ఆహ్వానాలు రాసాగాయి. వాటిని పురస్కరించుకొని స్వామీజీ సేలం, మాసాచుసెట్స్ లాంటి చోట్లకు వెళ్లి ఉపన్యాసాలు చేశారు. మాసాచుసెట్స్‌లో మిసెస్ ఉడ్స్ అనే మహిళామణి ఇంట్లో స్వామీజీ ఒక వారం బసచేశారు. ఆ సమయంలో ఆయన రెండు చర్చ్‌లలో ప్రసంగించారు. మిసెస్ ఉడ్స్ ఉద్యానంలో పిల్లల కోసమూ, యువకుల కోసమూ ఒక రోజు ప్రసంగించారు. అక్కణ్ణుండి సెలపు పుచ్చుకొని పోతున్నప్పుడు చేతికర్ర, దుప్పటి, పెట్టెను తమ జ్ఞాపకార్థం అక్కడ విడిచిపెట్టి వెళ్లారు.
సేలంలో ఆయన మొదటి ఉపన్యాసం అక్కడి ప్రజలలో భారతదేశం గురించి ఒక నూతన దృక్పథాన్ని జనింపజేసింది. “భారతదేశానికి తక్షణ ఆవశ్యకత మతం కాదు, సాంకేతిక విద్యే” అనే అంశాన్ని ఆయన నొక్కివక్కాణించి నప్పుడు ఇద్దరు క్రైస్తవ మిషనరీలు దానిని ఆవేశపూరితులై ప్రతిఘటించారు; ప్రశ్నల వర్షం కురిపించారు. స్వామీజీ కించిత్తు కూడా సహనం కోల్పోకుండా సమాధానాలిచ్చారు. ఈ సంఘటన చిన్నదే అయినప్పటికి రాబోయే రోజుల ధోరణిని స్వామీజీకి ముందుగానే సూచించిందనే చెప్పాలి.
సెప్టెంబర్ 4 వ తేదీన సారటోగా స్ప్రింగ్స్ అనే చోట స్వామీజీ రెండు రోజులు ‘భారతదేశంలో మహమ్మదీయుల పాలన’, ‘భారతదేశంలో వెండి చలామణి’ అనే అంశాలపై ప్రసంగించారు.
ఈ విధంగా చికాగో వెళ్లడానికి ముందే స్వామీజీ మూడు వారాలలో 11 ప్రసంగాలూ, సంభాషణలూ గావించారు. విభిన్న తరగతులకు చెందిన అమెరికా దేశపు ప్రజలను కూడా కలుసుకొన్నారు: రమాబాయి కేంద్రంలో ప్రసంగించారు; చెలిమితో మెలగిన ఫాదరీలను, ఏహ్యభావంతో మెలగిన ఫాదరీలను కలుసు కొన్నారు; చెరసాలలో ఖైదీలతో మాట్లాడారు; మహిళా మండలిలో మాట్లాడారు; పిల్లలతో మాట్లాడారు; దేశంలోని పలువురు మేధావులను ఆకట్టుకోగలిగారు. ఇవన్నీ ఆయన చికాగో దిగ్విజయానికి నాందిగా అమరినాయి.
చికాగోలో
ప్రశంసలూ, వ్యతిరేకతలూ ఒకదానివెంట ఒకటి ఎదురవుతుండగా దాదాపు మూడు వారాలు గడిపిన తరువాత స్వామీజీ చికాగోకు తిరిగి వెళ్లారు. ఆ సరికే సర్వమత మహాసభలో ఆయనను ప్రతినిధిగా స్వీకరిస్తున్నట్లు అధికారపూర్వకమైన లేఖ సెప్టెంబర్ 2 వ తేదీన ఆయనకు అందింది. సర్వమత మహాసభలో పాల్గొనడానికి అవసరమైన పరిచయ పత్రాలు, యోగ్యతాపత్రాలు ఇప్పుడు ఆయన వద్ద ఉన్నాయి. సమధికోత్సాహంతోనూ, ప్రగాఢ నమ్మకంతోనూ సర్వమత మహాసభలో పాల్గొనడానికై స్వామీజీ చికాగో బయలుదేరారు.
రైలులో వెళుతున్నప్పుడు స్వామీజీ ఒక వర్తకుణ్ణి కలుసుకొన్నారు. స్వామీజీ వెళ్లవలసిన చోటికి దారి చూపి సాయం చేస్తానని అతడు మాట ఇచ్చాడు. కాని చికాగో రైలు నిలయంలో దిగినప్పుడు అతడు అంతా విస్మరించి ఆదరాబాదరాగా వెళ్లిపోయాడు. పోతే పోయాడులే అనుకొని డాక్టర్ బారోస్ చిరునామా కోసం స్వామీజీ వెదికారు. కానీ అది దొరకలేదు!
రైలు నిలయం నగరానికి ఈశాన్యం వైపు ఉంది. ఆ ప్రాంతంలో జర్మనీవారు ఎక్కువగా నివసిస్తున్నారు. భాషా సమస్య కారణంగా స్వామీజీకి ఎవరి నుండీ సాయం అందలేదు. అంతేకాక స్వామీజీని ఒక నల్లజాతి వ్యక్తిగా ఎంచి ఆ ప్రాంతీయులు ఆయనను ఏవగించుకొని, అసలు పట్టించుకోలేదు. ఏదన్నా హోటల్‌కు పోదామన్నా దారి చూపే నాథుడెవరూ ముందుకురాలేదు. దాంతో ఏ సహాయమూ లభించని దిక్కుతోచని స్థితిలో అలసిసొలసిపోయారు స్వామీజీ.
చీకటి పడసాగింది. భారతదేశంలో లాగానే అమెరికాలోనూ రైలు నిలయం లోని సరకు రైలు పెట్టెలు పేదలకూ, గతిలేనివారికీ తలదాచుకొనే స్థావరాలు. స్వామీజీ కూడా అలాగే ఒక రైలు పెట్టెను ఎన్నుకొని దాన్లో ఆ రాత్రి గడిపారు. ఇక ఒకే రోజులో అమెరికాను కంపింపజేయనున్న ఆయన నాడు నిరాదరణకులోనై ఒక రైలు పెట్టెలో పడివుండవలసివచ్చింది!
తలుపు తెరచుకొంది
ఉదయమయింది, సూర్యుడు ఉదయించాడు. స్వామీజీ మనస్సులోనూ నమ్మకం అంకురించింది. రైలు నిలయం నుండి బయటికి వచ్చి కాళ్లు తీసుకు పోతున్న వైపుగా నడుస్తూన్న స్వామీజీ తానొక విశాలమైన వీథి గుండా పోతున్నట్లు గ్రహించారు. భారతదేశంలా భావించి ఇంటింటికీ వెళ్లి సహాయం కోసం తలుపులు తట్టారు. కాని ఆయన ఉన్నది అమెరికాలోనని తెలియజేయబడింది! సహాయం లభించకపోగా, ఆయన ముఖం మీదే తలుపులు మూయబడ్డాయి. స్వామీజీ నిస్పృహ చెందారు. భగవంతుడు చూపే మార్గం కోసం ఎదురుచూస్తూ వీథి మూలన కూర్చుండిపోయారు.
లోకం చేయూతనివ్వని చోట భగవంతుని హస్తాలు చాచుకొంటాయి. లోకం తలుపులు మూతబడిన చోట భగవద్ద్వారాలు తెరచుకొంటాయి. కచ్చితంగా అలాగే జరిగింది. స్వామీజీ కూర్చున్న చోటికి ఎదురుగా ఉన్న ఇంటి తలుపులు భళ్లున తెరచుకొన్నాయి. గాంభీర్యం ఉట్టిపడుతున్న ఒక మహిళ ఆ ఇంట్లో నుండి స్వామీజీ వద్దకు వచ్చి, అతి కోమల కంఠస్వరంలో, “మీరు సర్వమత మహాసభలో పాల్గొనడానికి వచ్చారా?” అని అడిగింది. అప్పటి నుండి ప్రారంభమయింది ఒక దివ్యానుబంధం; స్వామీజీ జీవితంలో శాశ్వతమైన స్థానం సంతరించుకొంది ఆ మహిళామతల్లి. ఆమె మిసెస్ హేల్. ఆమె కుటుంబం స్వామీజీ జీవితంలో విడదీయలేని ఒక భాగంగా విరాజిల్లింది.
స్వామీజీ పరిస్థితిని గ్రహించిన మిసెస్ హేల్ ఆయనను సాదరంగా తన ఇంట్లోకి తోడ్కొని వెళ్లింది. ఆమె తోడ్పాటుతో స్వామీజీ సర్వమత మహాసభ కార్యనిర్వాహకులను కలుసుకొన్నారు; ఒక ప్రతినిధిగా ఆమోదం పొందారు.
రోజులు గడిచాయి. ధ్యానం, ప్రార్థనలతో స్వామీజీ కాలం గడపసాగారు.