కన్యాకుమారిలో, కుమారీ మాత ఒడిలో, భారతదేశపు దక్షిణాగ్రంలోని ఆ మహాశిల మీద కూర్చుని చింతన చేశాను. నా మనస్సులో ఒక మహాప్రణాళిక ఉదయించింది.
– స్వామి వివేకానంద
పరివ్రాజక జీవితం : సంగ్రహం — జీవిత విధానం — నేర్చుకొన్నవి — మహారాజులను ఎందుకు కలుసుకొన్నారు? — పరివ్రాజక జీవితం : ముగింపు — మార్గాన్వేషణ — కన్యాకుమారిలో — భారతదేశ దక్షిణాగ్ర శిల మీద… — స్వామీజీ అనుష్ఠించిన ధ్యానం — ఆ భారతం ఎక్కడ? — మధురైలో — రామేశ్వరంలో — పాండిచ్చేరిలో
పరివ్రాజక జీవితం : సంగ్రహం
వ రాహ నగర మఠ స్థాపనతో స్వామీజీ జీవితంలోని తొలి ఘట్టం పూర్తయింది. మఠంలో రెండు సంవత్సరాలు గడిపి సోదర సన్న్యాసులలో స్ఫూర్తిని నింపారు; మఠ జీవితానికి ఒక ఆకృతిని కల్పించారు. 1888 లో పరివ్రాజకునిగా ఆయన జీవితంలోని రెండవ ఘట్టం ప్రారంభమయింది. మొదటిసారి కాశీ, అయోధ్య, లక్నో, ఆగ్రా, బృందావనం మీదుగా హిమాలయాలకు వెళ్లారు. ప్రకృతి సౌందర్యాన్నీ, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్నీ అక్కడ చవిచూసిన స్వామీజీ కొన్ని కారణాల వలన వరాహ నగర మఠానికి తిరిగి రావలసి వచ్చింది. 1890 లో మళ్ళీ హిమాలయాలను సందర్శించారు. కాని సత్వరమే తిరిగి వచ్చేశారు. 1891 లో తమ ప్రణాళికలో కొద్ది మార్పులు చేశారు.
“నువ్వు అభిలషించవలసినది నీ ముక్తి కాదు; ప్రపంచానికి నీడనిచ్చే మర్రిచెట్టులా విరాజిల్లాలి” అని గురుదేవులు ఒకసారి చెప్పిన మాటలు స్వామీజీ జ్ఞాపకం చేసుకొని ఉంటారు. ప్రతిసారి “తిరిగిరాను” అని చెప్పి వెళ్ళేవారు. కాని అలా వెళ్లిన ప్రతిసారి వెనుకకు తిరిగి రావలసి వచ్చింది. హిమాలయాల లోని ఒక గుహలో ఆయన జీవించి ఉండవచ్చు, బాహ్యప్రపంచంతో ఎలాంటి సంబంధమూ లేకుండా భగవద్ధ్యాసలో లయించి మైమరచిపోయి ఉండవచ్చు. తద్ద్వారా ఇంతదాకా ఏతెంచిన మన మహామునుల కోవలో ఒక సంఖ్య పెరిగి ఉండవచ్చు, అంతే. ప్రపంచ దృక్పథంలో మార్పు వచ్చి ఉండదు, ప్రపంచ చింతనా వైఖరిలో విప్లవాత్మక పరిణామం చోటుచేసుకొని ఉండదు.
హిమాలయాల పట్ల తమకున్న అపరిమిత మక్కువకు తిలోదకాలిచ్చి స్వామీజీ తమ దృష్టిని ప్రజల మీద సారించడం మానవాళి భాగ్యమనే చెప్పాలి. అందుకు శ్రీరామకృష్ణుల సంకల్పం కూడా ఒక కారణమే! పలుమార్లు స్వామీజీ గుహలలో ఆవాసం చేశారు. కాని ఎక్కువ రోజులు ఆయన అక్కడ గడపలేకపోయారు. “గుహల నుండి ఎవరో నన్ను బలవంతంగా పట్టుకొని బయటకు త్రోసివేసి, ‘వెళ్లు, వెళ్లి తిరిగిరా’ అంటున్నట్లు అన్పించేది” అని కాలాంతరంలో స్వామీజీ చెప్పడం కద్దు. ఆయన విపరీతంగా పర్యటించారు. సోదర సన్న్యాసో, మరెవరూ తమ వెంట రాకూడదనే విషయంలో ఆయన నిష్కర్షగా వ్యవహరించారు. కేవలం చేతి కర్ర, కమండలం, ఒకటి రెండు పుస్తకాలు తీసుకొని, భగవంతుని అనుగ్రహాన్ని మాత్రమే ఆధారం చేసుకొని స్వామీజీ బయలుదేరారు. రాజపుఠాణా, గుజరాత్, బొంబాయి, మైసూర్, కేరళలలో ఆయన పర్యటన దాదాపు రెండు సంవత్సరాలు కొనసాగింది; భారతదేశ దక్షిణాగ్రమైన కన్యాకుమారిలో ముగింపునకు వచ్చింది.
జీవిత విధానం
ఈ నాలుగున్నర సంవత్సరాల పరివ్రాజక జీవితంలో స్వామీజీ మహారాజుల రాజప్రాసాదాలలో జీవించారు, నిరుపేదల గుడిసెలలో వసించారు, సమాజం బహిష్కరించిన అంటరాని వారితో మెలగారు. మహారాజుల తోను, మంత్రులతోను చర్చలు జరిపారు. పండితులతో వాదోపవాదాలు చేశారు. ముత్తెపు చిప్పలు సేకరించేవాడు సముద్రంలో లోతుగా మునిగి అన్వేషించే రీతిలో ఆయన భారతదేశమనే సముద్రంలో మునిగి సత్యాన్వేషణ చేశారు. ప్రజల సుఖదుఃఖాలు, ఆశానిరాశలు, ఆదర్శాలు, నమ్మకాలు అన్నీ ప్రత్యక్షంగా చూశారు. శాస్త్రాలలో గల జ్ఞానానికి దీటైన ఆర్థికశాస్త్ర పరిజ్ఞానం కూడా ఆయన సంతరించుకొన్నారు. ప్రజల జీవిత విధానాన్ని నిర్దేశించే ఆర్థికశాస్త్రంలో ఆయనకు గల విశేషమయిన జ్ఞానం వలన దేశ పరిస్థితిని ఆయన స్పష్టంగా ఆకళింపు చేసుకోగలిగారు.
“స్వామీజీ ఈ కాలఘట్టంలో నూతన అనుభవాలను అన్వేషిస్తూనే ఉన్నారు. వినూత్న ఆలోచనలు ఏవైనా స్ఫురిస్తాయా అని పరితపించారు. ధార్మిక, సామాజిక అభిప్రాయాల సేకరణ కొనసాగించారు. పరస్పర వైరుద్ధ్యాలను అర్థంచేసుకొ న్నారు. వాటిని పోల్చి చూశారు. విభిన్న ప్రదేశాలలో నెలకొన్న తాత్త్విక చింతనా ధోరణులను, స్థానిక సంప్రదాయాలను తెలుసుకొన్నారు. సామాన్య ప్రజల జీవితాలను నిశితంగా పరిశీలించారు” అని స్వామీజీ పరివ్రాజక జీవితం గురించి ఆయన సోదర సన్న్యాసులలో ఒకరు అభివర్ణించారు.
నేర్చుకొన్నవి
అంతేకాదు. ఈ పరివ్రాజక జీవితంలో స్వామీజీ అనేక విషయాలు నేర్చుకొ న్నారు కూడా. అనేక విషయాలు అనేకులకు అనేక విధాలుగా నేర్పించారు కూడా. ‘నేర్చుకోవడమూ నేర్పడమూ తపస్సు’ అని ఉపనిషత్తులు వచించే ఆ తపస్సు అనుష్ఠిస్తూనే దేశమంతా పర్యటించారు. హిమాలయాలను సందర్శించిన యాత్రల్లో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వగైరా అధ్యయనం చేశారు. జైపూర్‌లో సంస్కృత వ్యాకరణమూ, అహమ్మదాబాద్‌లో జైన, మహమ్మదీయ సాహిత్యాలను అధ్యయనం చేశారు. గోవాలో క్రైస్తవ ధర్మ శాస్త్రం ఆపోశన పట్టారు. పోరుబందర్లో కొన్ని నెలలు బసచేసి ఆ సంస్థానపు దివానునుండి వైదిక మతాన్నీ, వైదిక తత్త్వాలను నేర్చుకొన్నారు.
గ్రంథపఠనం ద్వారా మాత్రమే కాదు, జీవితంలో తమకు ఎదురైన సంఘటనల నుండి కూడా ఆయన ప్రతి క్షణమూ నేర్చుకొంటూనే ఉన్నారు. ఉదాహరణకు ఖేత్రీలో నర్తకి నృత్యంచేసిన సంఘటన. సూరదాసు పాట వినగానే స్వామీజీ తమ పొరపాటును గ్రహించారు. తరువాతి సంఘటన బృందావనానికి వేళ్లే దారిలో ఆయనలో జనించిన కుల వివక్ష. అదీ ఒక్క క్షణమే, మరుక్షణమే ఆ భావన తొలగింది. కాశీలో ఆయన కోతుల నుండి పాఠం నేర్చుకొన్న విషయం ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాదు. ఈ విధంగా ప్రకృతి, పరిస్థితులు, సంఘటనలు ఇత్యాదులనుండి సదా నేర్చుకొంటూ ఆయన భారతదేశ పర్యటన కొనసాగించారు.
ధనికుడైనా, దరిద్రుడైనా; నగరవాస్తవ్యుడైనా, గ్రామస్థుడైనా – అందరికీ దుఃఖాలు ఉంటాయి, కోర్కెలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, నిరాశలూ ఉంటాయి, వీటి మధ్య చిన్నచిన్న సుఖాలు కూడా ఉంటాయి. ప్రతిక్షణమూ స్వామీజీ ఈ సత్యాన్ని ప్రత్యక్షంగా దర్శించారు. లోకంలో ఏ గ్రంథమూ అందించ లేని జ్ఞానాన్ని ఈ అనుభవాలు ఆయనకు సంతరింపజేశాయి.
స్వామీజీ ఇతరులకు నేర్పించినవి కోకొల్లలు. ఆళ్వార్ మహారాజుకు విగ్రహారాధన, ఖేత్రీ మహారాజుకు ఆధ్యాత్మికత, మతంతోపాటు భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, ఖగోళశాస్త్రం నేర్పించారు; ఈ పర్యటనలో ఆయనను కలుసుకొన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నేర్చుకొన్నారన్నది తిరుగులేని సత్యం. స్వప్రయత్నం, నిజాయతీగా జీవించడం మాత్రమే కాక, శరీరానికి చమురు రాచుకోవడం వలన కలిగే ప్రయోజనం లాంటి అతిసామాన్యమైనవి కూడా స్వామీజీ నేర్పించారు. మైసూరు మహారాజు స్వామీజీ సభలో అసత్యం పలుకడానికి నిరాకరించిన సంఘటన ఒక్కటే అక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికీ ఎన్నో గుణపాఠాలు నేర్పివుంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు!
వీటన్నింటికీ తలమానికంగా భాసిల్లింది జైపూర్ సంఘటన! ఎలాంటి వాదాలతోనూ నరేంద్రుడు ప్రభావితం కానప్పుడు శ్రీరామకృష్ణులు ఆతడికి అనుభవజ్ఞానాన్ని ప్రసాదించిన రీతిలో, జైపూర్ సేనాధిపతియైన హరిసింగ్ భగవంతుని గురించిన ఎలాంటి వివరణనూ ససేమిరా అంగీకరించనప్పుడు ఆతడికి సజీవమైన కృష్ణుని దర్శనం కలిగించిన శక్తిసంపన్నులైన మహాత్ములు స్వామీజీ. ఆయనను కలుసుకొన్న, ఆయనకు పరిచయమైన ప్రతి వ్యక్తీ ఆధ్యాత్మిక పథంలో పురోగతి పొందివుంటారు, భగవంతుని వైపుగా ముందడుగు వేసివుంటారనడంలో ఎలాంటి సంశయమూ లేదు.
మహారాజులను ఎందుకు కలుసుకొన్నారు?
స్వామీజీ పరివ్రాజక జీవిత ఘట్టాలను ముగించే ముందు ఒక ప్రశ్నకు జవాబుకోసం ప్రయత్నిద్దాం. స్వామీజీ నిరుపేదలను కలుసుకొని, వారితో జీవిం చడం నిజమే అయినప్పటికీ మహారాజులు, దివానులు, తక్కిన ఉన్నతాధికారుల వంటి వారిని ఎక్కువగా కలుసుకోవడం మనం చూస్తున్నాం. అదెందుకు? ఇందుకు జవాబు కావాలంటే ఆనాటి రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకోవడం అత్యవసరం.
మహారాజులంటే సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు, హర్షుడు, రాజరాజచోళుడు లాంటి చక్రవర్తులు ఠక్కున మనకు జ్ఞాపకానికి వస్తారు. తమ శక్తిసామర్థ్యాలతో శత్రువులను గడగడలాడించి, ప్రజలను కంటికి రెప్పలా కాపాడారు వారు. కాని బ్రిటిష్‌వారి కాలంలోని రాజులు కేవలం కీలుబొమ్మలు మాత్రమే; పాలకులు ఆంగ్లేయులు.
1858 ఆగస్ట్ 2 వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొంది. 1876 లో విక్టోరియా మహారాణి తనను తాను ‘భారతదేశ సామ్రాజ్ఞి’ గా ప్రకటించుకొంది. భారతదేశంలో ఆంగ్లేయులు మూడు రకాల పరిపాలనా పద్ధతులను చేపట్టారు.
- కొన్ని ప్రాంతాలలో మహారాజుల పాలనను అట్లే కొనసాగనిచ్చారు. మహారాజు, ప్రధానమంత్రి వంటివారు భారతీయులే. కాని బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి (Resident) ఒకరు అక్కడే నివసిస్తాడు. ఆతడి ఇచ్ఛానుసారమే మహారాజు వ్యవహరించాలి. జమ్ము–కాశ్మీర్, లడాక్ వంటి ప్రాంతాలు ఈ కోవకు చెందాయి.
- కొన్ని ప్రాంతాలలో గవర్నరు, సహాయ గవర్నరు, కమీషనర్ అంటూ ఆంగ్లేయులే పూర్తిగా పరిపాలన కొనసాగించారు. అజ్మీర్, అండమాన్ నికోబార్, అస్సాం, వంగరాష్ట్రం, బొంబాయి, మద్రాసు లాంటి పరగణాలు ఈ వర్గానికి చెందాయి.
- ఇవి కాకుండా 500 కన్నా ఎక్కువ సంస్థానాలున్నాయి. హైదరాబాద్, మైసూర్, బరోడా, వారణాసి, ఆళ్వార్, కొచ్చి, జైపూర్, పోరుబందర్, తిరువాన్కూర్ మొదలైనవి ఈ కోవకు చెందాయి. ఇక్కడ మహారాజులు ఉన్నారు. వీరిని ‘సామంతులు’ అనీ, ఈ పరగణాలను ‘సామంత రాజ్యాలు’ (Princely States) అనీ ఆంగ్లేయులు పేర్కొన్నారు. ఎందుకంటే ‘ప్రభుత్వం’ అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కటే కనుక.
ఈ మహారాజులకు పూర్తి అధికారాలు లేవు. వీరు ప్రక్కనున్న సంస్థానాల తోను, పొరుగు దేశంతోను ఎలాంటి సంబంధమూ పెట్టుకోరాదు. సంస్థాన రక్షణలాంటివి ఆంగ్లేయ అధికారులే చూసుకొన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఈ మహారాజులకు పెద్దగా ఎలాంటి పనీ ఉండేది కాదు. కనుక వీరు వేట, వినోదాలు, పాశ్చాత్య వ్యామోహాదులలో కాలం వెళ్లబుచ్చారు. ఎలాగైనా ఆంగ్లేయు లను ప్రశంసించి తమ రాజరికాన్ని నిలుపుకోవడమే వీరిలో పలువురి ధ్యేయం. అదే ఆంగ్లేయుల కోరిక కూడా.
కాని ప్రజలకు మేలు చేయగోరిన రాజులుకూడా పలువురు లేకపోలేదు. కాని ఇందువలన ప్రజలలో జాగృతి జనించి, తమ అధికారానికి ముప్పు కలుగుతుందేమోనని భయపడ్డ ఆంగ్లేయులు ఆయారాజుల మంచి ప్రయత్నాలను అడ్డుకోవడానికి కూడా వెనుకాడలేదు. అందుకు ఆ సంస్థానపు దివాను సహకరిం చడం కద్దు. సామాన్యంగా ఆతడు ఆంగ్లేయుల వత్తాసుదారునిగా ఉంటాడు. అందువలన మహారాజుల ఏ ప్రయత్నమూ ఆంగ్లేయులకు తెలియకుండా జరగడానికి ఆస్కారంలేదు.
పర్యవసానం? పామరులు అధోగతిపాలయ్యారు. ఒక వైపు ఈ ‘మహారా జులు’, మరోవైపు ఆంగ్లేయులు – మద్దెల లాంటి పరిస్థితి వారిది. వారికి చదువు సంధ్యలు శూన్యం, హక్కులూలేవు; పొలంలో నుదుటచెమట చిందేలా శ్రమించాలి, తద్ద్వారా లభించే ఫలసాయం పన్నుగా చెల్లించాలి. వారు చేయాల్సింది అంతే. అన్ని దుఃఖాలనూ సహించి, ఇద్దరికీ ఊడిగం చేయవలసిన పరిస్థితిలో వారున్నారు. కరవు కాలంలో ఎంతో ప్రాణనష్టం జరిగింది. అప్పుడు కూడా వారికి ఎవరూ సహాయం చేయలేదు.
ఈ పరిస్థితిని చూసి స్వామీజీ ద్రవించిపోయారు. మహారాజులను కలుసు కొని వారి కర్తవ్యాన్ని వారికి ఎరుకపరచగోరారు ఆయన. పౌరులను కాపాడడం క్షత్రియుని కర్తవ్యమని వారితో నొక్కివక్కాణించాలనుకొన్నారు. ఒకరిద్దరయినా మనస్సు మార్చుకొని పేదలకు మంచి చేస్తారేమో అని స్వామీజీ తపించిపోయారు. ఈ ఉద్దేశంతోనే మహారాజులను కలుసుకొన్నారు, వారితో చాలాసేపు మాట్లాడారు. కొందరు రాజులు ఆయన భావనలకు స్పందించి వెంటనే కొన్ని సత్కార్యాలు ప్రారంభించారు కూడా.
మహారాజులవద్ద మహాత్ములు మంత్రుల్లా విరాజిల్లి వారికి మార్గదర్శకత్వం వహించడం పురాణాలలోనూ, చరిత్రలోనూ చూడవచ్చు. దశరథునికి వసిష్ఠుడు, శివాజీకి సమర్థ రామదాసు, హరిహర బుక్కరాయలుకు విద్యారణ్యుడు – ఇలా ఈ మునుల మార్గదర్శకత్వంలో మహారాజులు చరిత్ర సృష్టించారు. స్వామీజీ కూడా మహారాజులు తమ విధ్యుక్తధర్మాలను విస్మరించినప్పుడు వాటిని గుర్తుచేశారు. అందు నిమిత్తమే వారిని కలుసుకొన్నారు. ఈ విధంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న సమయంలోనే భారతదేశాన్నీ, దాని పరిమాణాలనూ, భారతీయులనూ, వారి విభిన్న పరిమాణాలనూ తెలుసుకొంటూ పరివ్రాజకునిగా స్వామీజీ పర్యటించారు.
పరివ్రాజక జీవితం : ముగింపు
స్వామీజీ నేర్చుకొన్నారు, నేర్పించారు, చూశారు, తెలుసుకొన్నారు, పరిశోధించారు – ఇవన్నీ జరిగాయి. కాని వివేకానంద అనే మహోన్నత మానసం అవిశ్రాంతంగా ఉండిపోయింది! గురుదేవులు నిర్దేశించిన కార్యం, మానవాళికి ఒక మహోన్నత సందేశం అనే అగ్నికణాన్ని హృదయంలో పదిలపరచుకొని దానిని లోకానికి ఎలా అందించాలి అనే తపనతో పర్యటించారు. అదొక్కటే ఆయన హృదయాన్ని పూర్తిగా ఆక్రమించింది. ఆ మార్గం కూడా భగవంతుడే చూపుతాడని ఆయన ప్రగాఢ నమ్మకం. ప్రణాళికలు లేవు, ఇల్లూవాకిలీ లేదు, బంధువులు లేరు, ఎవరూ లేరు – ఆయనతోపాటు ఉన్నది భగవంతుడు మాత్రమే! రాజప్రాసాదంలో జీవించినా, గుడిసెలో నివసించినా ఆ భగవంతుడినే ఆసరాగా చేసుకున్నారు స్వామీజీ.
మార్గాన్వేషణ
ఈ నాలుగున్నర సంవత్సరాలలో స్వామీజీ పొందిన అనుభవాలు ఎన్నో, నేర్చుకొన్న పాఠాలు అనేకం. ఇకమీదట? గురుదేవుల ముఖతః నేర్చుకొన్నవాటిని, జీవితంలో తానే నేర్చుకొన్నవాటిని జోడించి ఒక మార్గం అన్వేషించి తీరాలి. మళ్లీ భారతదేశం ప్రపంచ వేదికపై తలెత్తి నిలబడడానికి, సత్యయుగం మళ్లీ అంకురించడానికి నేటి మానవాళికి ఒక మార్గం చూపాల్సివుంది.
అందుకు ఏం చేయాలి?
“ముందుగా అనుభవాలను పొందు, పిదప దీర్ఘంగా చింతనచేయి, తరువాత కార్యాచరణలోకి దిగు”* అని వచిస్తున్నాయి శాస్త్రాలు. అనుభవాలు పొందడం జరిగిపోయింది. ఇక చింతన చేయాలి. అందుకు ఒక ప్రశాంతమైన చోటు అవసరం. అది ఏది?
సముద్రపు అలలు ఉవ్వెత్తున లేచి ఘోషించినా, నెలకొనివున్న ప్రశాంతత చెక్కుచెదరక నిలబడే తపస్సు చేస్తున్న కన్యాకుమారీదేవి వెలసిన భారతదేశపు దక్షిణాగ్రాన్ని స్వామీజీ ఎంపిక చేసుకొన్నారు.
కన్యాకుమారిలో
తిరువనంతపురం నుండి దాదాపు 55 మైళ్ల దూరంలో కన్యాకుమారి ఉంది. ముక్కడలి సంగమ తీర్థం అది. చేత జపమాలతో నిలబడిన భంగిమలో ఇక్కడ దర్శనమిస్తున్నది కుమారీదేవి. 1892 డిసెంబరు ఆఖరున స్వామీజీ ఇక్కడకు వచ్చారు. దేవిని ఆరాధించిన తరువాత సముద్రతీరానికి వెళ్లారు. ఆయన మనస్సు నాడు అనుపమాన ప్రశాంతతలో లీనమైవుంది.
“అనుభవం, అనుభవం, అనువభపూర్వకంగా తెలుసుకొంటేనే దేనినైనా నమ్ముతాను, అనుభవం కన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఎలాంటి ప్రమాణాన్నీ అంగీకరించను” అని పరితపించిపోయిన ఆయనకు కావలసినన్ని అనుభవాలు లభించాయి. ఆంతరిక జీవితానికి సంబంధించినంత వరకు ఆధ్యాత్మిక స్థితుల పరాకాష్టయైన, శాస్త్రాలు వచించే నిర్వికల్ప సమాధి స్థితిని ఆయన పొందే వున్నారు. అంతకు మించిన అనుభవమో, అభిలాషో, అవసరమో ఇంకేదీ లేదు. ఒక సాధారణమైన మహాత్ముని జీవితం ఇంతటితో ఆగిపోతుంది. ఆ తరువాత అన్వేషణ ఉండదు; తమ కర్మఫలం తీరే దాకా జీవించి శరీరాన్ని త్యజిస్తాడు.
కాని స్వామీజీ ఈ అనుభవాన్ని పొందిన తరువాత కూడా ప్రశాంతతలేకుండా తపించిపోయారు. ఎందుకంటే స్వామీజీ ఈ ఇలపైకి ఒక సందేశంతో ఏతెంచినవారు కనుక. శ్రీరామకృష్ణులు పురమాయించిన మహత్కార్యం సాధించే వరకు ఆయనకు ఆ తపన నుండి విముక్తి లేదు. ఆ తపనే ఆయనను ఈ నాలుగున్నర ఏళ్లుగా యావద్భారతదేశం పర్యటింపజేసింది.
పరిస్థితుల ద్వారా పొందిన జ్ఞానం, గురుదేవుల వద్ద నేర్చిన పాఠాలు, పరివ్రాజక జీవితంలో గడించిన అనుభవాలు, స్వీయ అనుభూతి – ఈ నాలుగింటి నుండి దేశ ప్రగతికి మార్గం కనుగొనాలి. దేశ ప్రగతి వ్యక్తి ప్రగతిని బట్టి ఉంటుంది. కనుక తాము అన్వేషించబోయే మార్గం వ్యక్తి ప్రగతిని, దేశ ప్రగతిని సమైక్యపరచేదిగా ఉండాలి.
ఆ మార్గం ఏది?
దీర్ఘంగా ఆలోచించగోరారు స్వామీజీ.
కన్యాకుమారీదేవిని ఆరాధించారు, హృదయపూర్వకంగా ప్రార్థించారు.తమతోపాటు వచ్చిన మన్మథనాథ్ చిన్న కుమార్తెను దేవిగా భావించి పూజించారు. దారి చూపించమని మనఃస్ఫూర్తిగా దేవికి మొరపెట్టుకొన్నారు.
సముద్రం లోపల రెండు కిలో మీటర్ల దూరంలోని శిలలు స్వామీజీ దృష్టిని ఆకర్షించాయి. అక్కడకు వెళ్లి ఏకాంతంగా కూర్చుని, ప్రగాఢంగా ధ్యానించి, దేవి అనుగ్రహంతో దారి కనుగొనాలని ఆయన హృదయం అభిలషించింది.
భారతదేశ దక్షిణాగ్ర శిల మీద…
అక్కడ రెండు శిలలున్నాయి; ఒకటి మరీ పెద్దది, మరొకటి చిన్నది. ఆ పెద్ద శిల మీద ఒక ప్రక్కన దేవి నిలబడి తపమాచరించినట్లు ఐతిహ్యం. అక్కడి పాదాల గుర్తులు సాక్షాత్తు ఆ దేవివే అని చెప్పుకొంటారు. దేవి దివ్యపాదాల ముద్రలున్న ఆ శిలను ‘శ్రీపాద శిల’ అని పేర్కొంటారు. కాని అక్కడికి వెళ్లడం ఎలా? దుంగలతో చేర్చికట్టిన తెప్ప (Catamaran) మీద తీసుకువెళ్లమని అక్కడి జాలరులను ఆయన అడిగారు. వారు డబ్బు చెల్లించమన్నారు. ఆయన వద్ద డబ్బు లేకపోవడంతో ఆ జాలరులు నిరాకరించారు. ఈదుకొని వెళ్లడం కన్నా మరో మార్గం కనిపించలేదు. ఇక దేనికోసమూ ఎదురుచూడకుండా, తెగించి సముద్రంలో దూకి, ఆ శిల వైపుగా స్వామీజీ ఈదసాగారు.
స్వామీజీ కన్యాకుమారి చేరగానే సదాశివం పిళ్లై అనే వ్యక్తి ఆయననుచూశాడు. స్వామీజీ వ్యక్తిత్వం పట్ల ఇట్టే ఆకర్షితుడైన సదాశివం ఆయనను వెంబడించాడు. స్వామీజీ సముద్రంలో దూకి ఈదుకొంటూ వెళ్లడం సదాశివంతో పాటు మరికొందరు కూడా చూశారు. ఉత్సుకత, గందరగోళం ఆవరించడంతో వారు స్వామీజీని వెంబడించారు. అప్పుడు స్వామీజీ వారితో తమను గురించి కంగారు పడవద్దని చెప్పి వారిని తిరిగి వెళ్లిపొమ్మన్నారు. ఆహారం గురించి అడిగినప్పుడు, “నాకు ఏదైనా ఇవ్వాలని మీరు మనఃస్ఫూర్తిగా అభిలషిస్తే, అదుగో అక్కడ కనిపిస్తున్న ఆ చిన్న రంధ్రంలో పాలు, పండ్లు, కొబ్బరిబొండాం లాంటివి ఏదైనా తెచ్చి ఉంచండి. బహుశా అవసరం ఉండకపోవచ్చునేమో! అవసరమైతే తీసుకొని తింటాను” అన్నారు. సదాశివం అలాగే చేశాడు.
స్వామీజీ శిల మీద ఆసీనులయ్యారు. చుట్టూ విస్తృతమైన సముద్రం. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం సంగమించే చోటు అది. ఆయనకు ముందు, ఆయన దృష్టి పడే చోట దేవి పాదపద్మాలు. ఇంకా కాస్త ముందు జగజ్జనని ఆలయం వెలసివుంది. అక్కణ్ణుండి భారతదేశం వ్యాపించింది.
స్వామీజీ ప్రగాఢ ధ్యానం అనుష్ఠించారు.
అక్కడ మూడు రోజులు నిరంతరాయంగా ఆయన ధ్యానంలో లీనమైపోయారు.
స్వామీజీ అనుష్ఠించిన ధ్యానం
ఏ దైవాన్ని స్వామీజీ ధ్యానించారు? ఏ దైవాన్నీ కాదు; ఆయన ధ్యానించింది భారతదేశాన్ని. చరిత్రను కూలంకషంగా అధ్యయనం చేసినవారు ఆయన. భారతదేశ చరిత్ర మాత్రమే కాదు, ప్రపంచ దేశాల చరిత్రలు సైతం ఆయనకు కరతలామలకం అంటే అత్యుక్తి కాదు. ఆయన ఆలోచనలు గిర్రున తిరిగాయి: “విజ్ఞానం ఇతర దేశాలకు పోవడానికి మునుపే తన స్వగృహంగా చేసుకొన్నది ఈ ప్రాచీన భూమినే! ఆధ్యాత్మికజ్ఞాన ఆగమనాన్ని సూచించే స్ధూల చిహ్నాలా అన్నట్లు మన అఖండ హిమాలయ పర్వత పంక్తులు సోపాన పరంపరలుగా స్వచ్ఛమైన శిశిర కిరీటాలను ధరించి, ఆకాశంలోనికి అత్యున్నతంగా వ్యాపిస్తూన్నది ఇక్కడే! ఏనాడో లోకంలో అవతరించిన అత్యంత పూజనీయులైన ఋషిసత్తముల పాదస్పర్శచే పవిత్రీభూతమైన క్షేత్రాలూ ఈ భారతదేశంలోనే ఉన్నాయి! మానవుని అభ్యంతర ప్రకృతిని గూర్చి, ఆంతరిక ప్రపంచాన్ని గూర్చి పరిశోధనలు ప్రప్రథ మంగా ప్రారంభమయింది ఇక్కడే! జీవాత్మ అమృతత్వాన్ని గూర్చి, భగవంతుని పరిపాలనా కర్తృత్వాన్ని గూర్చి, ప్రకృతిలో – మనిషిలో అంతర్యామిగా ఉన్న భగవంతుణ్ణి గురించిన సిద్ధాంతాలు తొలుదొల్త బయలుదేరింది ఇక్కణ్ణుండే!మతధర్మం, తత్త్వశాస్త్రాలకి చెందిన అత్యున్నత ఆదర్శాలు తమ పరమ ప్రాప్యస్థానాన్ని పొందగలిగింది ఇక్కడే! ప్రపంచాన్ని పలుమార్లు ముంచి లేవనెత్తిన ఆధ్యాత్మిక జ్ఞానం, తత్త్వవిద్య అనే మహోత్తుంగ తరంగాలు బయలుదేరిందీ ఈ దేశం నుండే! మానవకోటిలో శుష్కించి నిర్జీవమైపోతున్న జాతులను మరల ఒకసారి పునరుజ్జీవింపజేసి, జవసత్వాలు చేకూర్చడానికి అలాంటి తరంగజాలం ఇక బయలుదేరవలసి ఉన్నది కూడా ఈ భారతక్షేత్రం నుండే! వందలాది విదేశీ దాడులను, భిన్నభిన్నమైన ఆచార సంప్రదాయాల సమ్మేళనం వలన కలిగిన వందలాది విప్లవాలను భరించి నిలిచిన భారతభూమి ఇదే! చెక్కుచెదరని శౌర్యంతోను, వినాశమెరుగని చైతన్య ప్రభలతోను, లోకంలోని ఏ శైలరాజాన్నైనా మించగలిగిన సుస్థిరత్వంతోను నిలిచింది ఈ పవిత్రదేశమే! ఆద్యంతాలులేక, అమృతమై ఒప్పారే నిత్యాత్మ ఎలాంటిదో, ఈ పవిత్ర దేశ జీవితం కూడా అలాంటిదే!”*
ఆ భారతం ఎక్కడ?
తాత్త్విక చింతనలలో అత్యున్నత శిఖారాలను అధిరోహించిన వారిగా నేటికీ జ్ఞానులు స్తుతించే మహామునులను అందించిన ఆ భారతం ఎక్కడ? అశోకుడు, సముద్రగుప్తుడు లాంటి చక్రవర్తుల పరిపాలనలో స్వర్ణ యుగాన్ని చవిచూసిన భారత మెక్కడ? గ్రీసు, రోమ్, పశ్చిమ ఆసియా, తూర్పు ఆఫ్రికా, ఆగ్నేయ – ఆసియా దేశాలు, చైనా లాంటి అనేక పరాయి దేశాలతో వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకొని సముద్రాన్ని దాటించి వారిని తన వైపుగా ఆకట్టుకొన్న భారత మెక్కడ? గ్రీసు, మధ్య ఆసియా, శ్రీలంక, బర్మా, జావా, సుమత్రా, కాంబోడియా, చైనా, టిబెట్ ప్రభృత దేశాల నుండి వచ్చిన విద్యార్థులకు ఉన్నత విద్యలో శిక్షణనిచ్చిన తక్షశిల, నలందా, విక్రమశీల, విజయపురి, కాంచీపుర విశ్వవిద్యాలయాలను కలిగివున్న ఆ భారతం ఎక్కడ? అజంతా, ఎల్లోరా, గనేరీ, మహాబలిపురం లాంటి ప్రదేశాలలో అమరమైన చిత్తరువులను, శిల్పాలను, గుహాలయాలను అర్పించిన శిల్పులు, చిత్రకారులు, కళాకారులు జీవించిన భారత మెక్కడ? ఖగోళశాస్త్రంలో ఆర్యభట్టు, జ్యోతిశ్శాస్త్రంలో వరాహమిహిరుడు, గణితశాస్త్రంలో భాస్కరరాయడు, ఆయన కుమార్తె అయిన లీలావతి, వైద్యశాస్త్రంలో శుశ్రుతుడు, చరకుడు, రాజకీయ శాస్త్రంలో చాణక్యుడు అగ్రగణ్యులుగా విరాజిల్లిన భారత మెక్కడ?
స్వామీజీ చింతనలు గిర్రున తిరిగాయి…
గిర్రున తిరిగి ఆవలివైపున కానవచ్చింది ప్రస్తుత భారతం: “అన్ని చోట్ల, ప్రక్కల ఎదుట వెనుక కూలిపోతున్న మట్టి గోడలపై, శిథిలాలపై, కప్పును కోల్పోయి, బయటికి కానవచ్చే వెదురు వాసాలనే అస్థిపంజరాలున్న కుటీర సమూహాలు; ఎన్నో శతాబ్దాలుగా అనుభవిస్తూన్న నైరాశ్య దారిద్ర్యాలచే ముఖాల్లో లోతైన రేఖలేర్పడి, చీలికపేలికలు కట్టుకొని, ఇటూ అటూ తిరుగాడే శల్యావశిష్టదేహులైన యువకులు, వృద్ధులు; అన్ని చోట్ల సర్వసామాన్యంగా సంచరించే ఆవులు, ఎద్దులు, దున్నలు – వాటిలో కూడా అలాంటిదే అయిన దౌర్బల్యం, త్రోవల ప్రక్కన పెంటలు, చెత్తకుప్పలు – ఇది నేటి భారతదేశం!
“అతిప్రశస్త సౌధరాజాలను ఆనుకొనే జీర్ణావస్థలోని పూరిగుడిసెలు; దేవాలయాలకు అతిసమీపంలోనే పెంటపోగులు; అతివిలువైన వలువలు అలంకరణలు ధరించిన వారి ప్రక్కనే నడయాడే కౌపీనమాత్ర ధారులైన సన్న్యాసులు; సంపదలతో కడుపార తిని తిరిగే వారిని కాంతివిహీన నేత్రాలలో, దైన్య దృక్కులతో చూస్తున్న అన్నార్తులైన నిరుపేదలు; – వీరితో కూడిందే మన స్వదేశం!”*
ఎందుకు? ఎందుకు ఈ తలక్రిందులైన పరిణామం?
స్వామీజీ చింతనలు మళ్లీ గిర్రున తిరిగాయి…
“పలువురు చింతనాశీలురు, సంస్కర్తలు వాపోయేటట్లు భారతదేశ పతనావస్థకు కారణం మతమా? కానే కాదు. ఎందుకంటే, మతానికి ఆరోపించే అపార్థానికి బాధ్యత మతానిది కాదు. దాని తప్పేమీ లేదు. ఏ మతమూ ప్రజలను హింసించలేదు. ఏ మతమూ మాంత్రికులను నిండుప్రాణాలతో కాల్చి చంపలేదు. ఎన్నడూ ఏ మతమూ ఇలాంటి పని చేయలేదు. అయితే ప్రజలను ఇలాంటి పనులకు పురికొల్పేది ఏది? రాజకీయాలేగాని మతం ముమ్మాటికీ కాదు. ఇలాంటి రాజకీయాలు మతం పేరు పెట్టుకొంటే ఆ దోషం ఎవరిది?”*
“దేశంలోని విద్యాబుద్ధులన్నీ రాజ్యాధికారం, గర్వం గల ఏ కొద్దిమంది కైవసంలోనే ఉండడమే భారతదేశ పతనానికి ముఖ్య కారణం. మళ్లీ మనం అభివృద్ధి చెందాలంటే, మనం అదే విధానాన్ని అనుసరించాలి. అంటే జనసామాన్యంలో విద్యావ్యాప్తి గావించాలి. సంఘసంస్కరణ విషయాల్లో ఒక అర్ధశతాబ్దం గొప్ప ఆర్భాటం లేవదీయబడింది. గత పది సంవత్సరాలుగా భారతదేశంలో అనేక చోట్ల పర్యటించాను. ఎక్కడ చూసినా సంఘసంస్కార సంఘాలే కుప్పలుతెప్పలుగా కనిపించాయికాని, ‘పెద్దమనుషులు’ గా చలామణి అవుతున్న వారు, ఎవరి రక్తాన్ని పీల్చి తాము ‘పెద్దమనుషులు’ గా అనిపించు కొంటున్నారో, అలాంటి జనసామాన్యాన్ని ఉద్ధరించడానికై ఏర్పడ్డ ఒక్క సంఘం కూడా నాకు కనిపించలేదు. మహమ్మదీయులు ఎంతమంది సిపాయిలను వెంట బెట్టుకొచ్చారు? ఎంతమంది ఆంగ్లేయులు వచ్చారు? కేవలం ఆరు రూపాయలకు తమ తండ్రుల, సోదరుల గొంతులను తెగనరికే వందలమంది భారతదేశంలో కాక మరే దేశంలో ఉన్నారు? ఏడు శతాబ్దాల్లో మహమ్మదీయులు ఆరు కోట్లు అయినారు. నూరు సంవత్సరాల క్రైస్తవ పరిపాలనలో ఇరవై లక్షల మంది తిరువాన్కూర్ పరగణాలో మాత్రమే క్రైస్తవులైనారు. ఎందుకు ఆ విధంగా జరిగింది? స్వతంత్రమైన ఆలోచనాశక్తి దేశం నుండి పూర్తిగా ఎందుకు పలాయన మయింది? హస్తకౌశలం ఉన్న మన శిల్పులు, కళాకారులు ఐరోపావారితో పోటీలో ఎందుకు నానాటికీ అంతరిస్తున్నారు? అనేక వందల సంవత్సరాలుగా దృఢంగా పాతుకుపోయిన ఆంగ్లేయ కార్మికులను, జర్మన్ కార్మికులు ఏ శక్తితో కదల్చివేయగలిగారు? విద్య, విద్య, ఒక్క విద్య వల్లే!….
“కాని మన బాలురు నేరుస్తూన్న విద్య నిరాశాజనకమయింది. పాఠశాలలో బాలుడు నేర్చుకొనేది శూన్యం. వాడి చిత్తసంస్కారం పూర్తిగా ధ్వంసమవుతుంది. ఫలితం శ్రద్ధావిహీనత లేక అశ్రద్ధ. వేదవేదాంతాలన్నింటికీ కీలకం శ్రద్ధ. నచికేతుణ్ణి యముడి ముందు ముఖాముఖీ నిలిపి ప్రశ్నింపచేసిన శ్రద్ధ! శ్రద్ధ వలన ఈ లోకం నడుస్తోంది. అలాంటి శ్రద్ధ (ప్రస్తుతం) నశిస్తోంది! ‘అజ్ఞశ్చాశ్రద్ధ ధానశ్చ సంశయాత్మా వినశ్యతి’* – అజ్ఞుడు, శ్రద్ధావిహీనుడు, సంశయాత్ముడు వినాశం పాలవుతాడు. కాబట్టి మనం వినాశానికి సమీపంలో ఉన్నాం.
“విద్యావ్యాప్తే దీనికి తరణోపాయం. అన్నింటికన్నా ముఖ్యమయింది ఆత్మ జ్ఞానం. ఆత్మజ్ఞానం అనగానే జడలు, దండం, కమండలం ధరించి కొండకోన ల్లోకి వెళ్లడం అని నా అభిప్రాయం కాదు. అయితే నా ఉద్దేశమేమిటి? సంసార బంధాలను ఛేదించి మోక్షాన్ని ప్రసాదింపజేసే జ్ఞానం, ఐహికమైన భౌతికసంపదలను కలుగజెయ్యదా? నిస్సందేహంగా కలుగజేస్తుంది…
“భారతదేశంలో తలెత్తిన ఏ సంప్రదాయమైనా – ఈ విషయంలో ఒకే అభిప్రాయం కలిగివుంది. అదేమంటే జీవాత్మలో అఖండశక్తి ఉంది. అభివ్యక్తీకరణలోని భేదం మాత్రమేగాని, పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరిలోను ఒకే ఆత్మభాసిల్లుతున్నది. (నీరు పారడానికి) ‘వ్యవసాయదారు ఆటంకాలు తొలగిస్తాడు.’ (పాతంజల యోగసూత్రం కైవల్యపాదం– 3). అవకాశం చిక్కగానే ఆ శక్తి సరైన కాలంలో, సరైన సమయంలో అభివ్యక్తమవుతుంది. అభివ్యక్తమయినా, కాకపోయినా బ్రహ్మాదిస్తంభ పర్యతం ఒకే శక్తి అన్నింట్లోను నెలకొని ఉంది. మనం ప్రతి గుమ్మం వద్దకు వెళ్లి ఆ శక్తిని జాగృతం చేయవలసివుంది.
“రెండవది: దీనితోపాటు విద్య నేర్పాలి. చెప్పడానికి ఇది సులభమే. కాని ఆచరణరూపంలోకి తేవడం ఎలా? సర్వసంగపరిత్యాగులూ, నిస్స్వార్థపరులూ, దయార్ద్రహృదయులూ అయిన మహనీయులు వేలమంది మన దేశంలో ఉన్నారు. ఏ లాభాన్నీ కాంక్షించక ఆధ్యాత్మిక బోధ గావించేవారు ఏ విధంగాపర్యటిస్తున్నారో, అదే విధంగా మనకు కావలసినట్లు వారిలో సగంమందినైనా ఏ ఖర్చూలేక మనం ఉపాధ్యాయులుగాను, విద్యావ్యాప్తి చేసేవారుగాను సుశిక్షితులను చేయవచ్చు.”*
కాని దేనికైనా డబ్బు అవసరం. ఏ పని జరగాలన్నా డబ్బు అవసరం. అందుకు మార్గమేమిటి? డబ్బు ఎక్కడుందో, అక్కణ్ణుండి పొందాలి. పాశ్చాత్య దేశాలలో ఉన్న డబ్బు భారతదేశానికి రావాలి. అందు నిమిత్తం భారతదేశం పాశ్చాత్యదేశాల ముందు చేతులు జోడించి, కిమ్మనకుండా, వంగి వినమ్రంగా నిలబడాలా? కాదు. ఇక్కడున్న దానిని అక్కడ ఇద్దాం, అందుకు మారుగా అక్కడున్న డబ్బు పుచ్చుకొందాం.
ఇక్కడ భారతదేశంలో ఉన్న దేమిటి? వేలాది సంవత్సరాలకు మునుపు జీవించిన ఋషులు మనకు వారసత్వంగా ఇచ్చి పోయిన ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత మాత్రమే మన వద్ద ఉన్నది. శాశ్వతమైన ఆ ఆధ్యాత్మికతను పాశ్చాత్యదేశాలకు అందిద్దాం.
పాశ్చాత్యదేశాలకు వెళ్లడం ఎలా?
ఇంతవరకు ఏ భగవంతుడు తనను పరిరక్షిస్తూ వచ్చాడో ఆ భగవంతుడే దీనికీ దారి చూపిస్తాడని స్వామీజీకి స్పష్టమయింది.
స్వామీజీ ధ్యానం పూర్తయింది.
ఇంతలో మూడు రోజులు గడచిపోయాయి. ఇది 1892 డిసెంబర్ 24 వ తేదీ నుండి 26 వ తేదీ లోపు జరిగివుండవచ్చు.*
నాలుగవ రోజు ఒక తెప్ప మీద స్వామీజీని తీరానికి తోడ్కొని వచ్చారు. ఇంతలో ఆయన గురించి విని అనేకులు ఆయనను చూడడానికి అక్కడకు వచ్చారు. తమను గురించి అడిగిన అన్ని ప్రశ్నలకూ స్వామీజీ ఇచ్చిన ఒకే సమాధానం: “నేను శ్రీరామకృష్ణ పరమహంస శిష్యుణ్ణి. ఆయనను గురించి లోకం త్వరలోనే తెలుసుకోబోతున్నది.” “స్వామీజీ, శిల మీద మీరు ఏం చేశారు? ఎలాంటి అనుభూతి పొందారు?” అని కొందరు ప్రశ్నించారు. అందుకు స్వామీజీ ఇలా అన్నారు: “బాహ్యంగాను, ఆంతరికంగాను నేను ఇంత కాలంగా దేనిని అన్వేషిస్తూ తిరిగానో అది ఇక్కడ నాకు లభించింది.”
మధురైలో
కన్యాకుమారి నుండి మదురైకి వచ్చిన స్వామీజీ అక్కడ రామనాథపుర మహారాజయిన భాస్కర సేతుపతిని కలుసుకొన్నారు. పేదలకు విద్య, వ్యవసాయాభివృద్ధి వంటి భారతదేశంలో గల అనేక సమస్యలు, వాటికి పరిష్కారాలు మొదలైన వాటి గురించి మహారాజుకు విపులంగా స్వామీజీ తెలియజేశారు. స్వామీజీ వేషభాషల పట్ల, ప్రగాఢ జ్ఞానం పట్ల అమితంగా ఆకర్షితుడైన మహారాజు ఆయనకు శిష్యుడయ్యాడు. అమెరికాలో జరుగనున్న సర్వమత మహాసభలో పాల్గొనవలసిందిగా స్వామీజీని బ్రతిమ లాడాడు మహారాజు. యథాప్రకారం నిర్ణయాన్ని భగవంతునికే వదలిపెట్టి మహారాజు వద్ద సెలవు పుచ్చుకొని స్వామీజీ రామేశ్వరం వైపుగా బయలుదేరారు.
రామేశ్వరంలో
లంకలో సీతను చెర నుండి విడిపించి తిరిగి వచ్చిన శ్రీరాముడు స్వహస్తాలతో ప్రతిష్ఠించిన దేవాలయం రామేశ్వరమని ఐతిహ్యం. రామేశ్వరం వెళ్లడంలో స్వామీజీ ఎంతో ఉత్సుకత చూపేవారని ఇంతకు మునుపే చూశాం. ఆయన అక్కడకు వెళ్లి రామేశ్వర శివుణ్ణి ఆరాధించారు. అక్కణ్ణుండి మద్రాసు బయలుదేరారు.
పాండిచ్చేరిలో
రామేశ్వరం నుండి మద్రాసు బయలుదేరిన స్వామీజీ దారిలో పాండిచ్చేరివెళ్లారు. అక్కడ మన్మథనాథ్ భట్టాచార్యకు అతిథిగా కొన్ని రోజులు ఉన్నారు. ఇక్కడ ఆయన ఒక సనాతన పండితునితో కఠినంగా వాదించవలసి వచ్చింది. హిందూమతం కాలాతీతమైనది, కనుక ఎలాంటి సంస్కరణా దానికి అవసరంలేదని పండితుని వాదన. అందుకు స్వామీజీ ఇలా అన్నారు: “హిందూమత భావనలను విశ్లేషించి చూడాలి, సంశోధించి చూడాలి. విద్యావంతుడైన ప్రతి హైందవుని కర్తవ్యమది. ఇందుకు, ముందు మన సంకుచిత అభిప్రాయాల నుండి బయటపడాలి; వర్తమానకాలం అమితవేగంతో ప్రగతిపథంలో వెళుతూవుండడం చూడాలి. మన ఆచార సంప్రదాయాలు ఏవైనప్పటికీ అవి మన సాంఘిక జీవనానికో, తాత్త్విక వైఖరికో ఒక ఆటంకంగా ఉండే పక్షంలో వాటిని తుంగలో తొక్కి ముందుకు సాగిపోవాలి.”
ఒక హైందవుడు సముద్రం దాటి వెళ్లడమే ఒక పాపకృత్యం అని చెప్పే టంతటి సంకుచిత వైఖరి గల ఆ పండితుడు స్వామీజీ విశాల భావాలను జీర్ణించుకోలేకపోయాడు.
స్వామీజీ మద్రాసు బయలుదేరారు.