దేవతల పర్వతాలైన హిమాలయాలను ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా సందర్శించాలి. హిమాలయాల్లో జీవించడమంటే పరమశివుని సాన్నిధ్యంలో జీవించడమే (గిరిరాజ్ శృంగే మహాదేవ సంఘే) అవుతుంది.
– భగవాన్ శ్రీరామకృష్ణులు
మాతృదేవి ఆశీస్సులు — భాగల్పూర్లో — కాలానికి అతీతమైన సంగీతం — జైన సన్న్యాసులతో — ఆంగ్ల నిషేధం – ‘సమాజం మీద పిడుగులా పడతాను’ — మనిషీ విశ్వమూ ఒకే అమరిక — ఫకీర్ ఇచ్చిన దోసకాయ – కాసార్ దేవి గుహలో — సోదరి మృతి — దుడ్డుకర్ర నెత్తితే దానం — ‘నా సోదరునికి చోటు ఇవ్వగలరా?’ — విచిత్రమైన మహాత్ములు – మళ్లీ మృత్యువు ఒడిలో — మరొక ‘వరాహ నగర మఠం’ — తల్లిలా వండి వడ్డించారు — ‘ఏకాంతవాసానికి పోతున్నాను’
మాతృదేవి ఆశీస్సులు
మ ఠం అభివృద్ధి చెందాలి, దేవాలయ నిర్మాణం జరగాలి – ఇవి స్వామీజీలోనిరంతరం మెదులుతున్న ఆలోచనలు. కాని వీటినన్నింటినీ మించి ఆయనమనస్సు ఏకాంత జీవితం కోసం పరితపించింది. హిమాలయాలలో కొంతకాలం గడపిన అఖండానంద స్వామి అప్పుడే తిరిగివచ్చారు. ఆయన తెలిపిన వర్ణనలు, యాత్రా విశేషాలు స్వామీజీ ఉత్సుకతను మరింత ఉద్దీపింపజేశాయి. “గంగాతీరంలో ఒక చోట దీర్ఘకాలం ధ్యానం చెయ్యాలనుకుంటున్నాను…… హిమాలయాలకు ఒక్క పరుగులో వెళ్లాలనితపించిపోతున్నాను” అని ఆయన వ్రాశారు. ఈ ఉద్దేశంతోనే ఆయన ఒకటి రెండుసార్లు బయలుదేరడం కూడా తటస్థించింది. కాని ఏవో ఆటంకాలు కలిగేవి; ప్రతిసారి ఏదో కారణంగా ఆయన వెనుకకు తిరిగి రావలసి వచ్చింది. కనుక ఈసారి మాతృమూర్తి శ్రీ శారదాదేవి ఆశీస్సులు పొంది మరీ బయలుదేరాలనినిర్ణయించుకొన్నారు. మాతృదేవి అనుగ్రహం ఉంటే సమస్తం సాధ్యమేనని ఆయనకు గట్టి నమ్మకం.
అఖండానందను వెంటబెట్టుకొని వెళ్లాలని నిశ్చయించుకొని, ఆయనతోకలసి వెళ్లి మాతృదేవిని దర్శించుకొన్నారు. “అమ్మా! అత్యున్నత అనుభూతిపొందకుండా నేను తిరిగి రాను” అని మాతృదేవితో స్వామీజీ చెప్పారు. శ్రీరామకృష్ణుల దివ్యనామం పేరిట మాతృదేవి ఆయనను ఆశీర్వదించారు. తరువాత అఖండానందతో, “నాయనా! నా సంపత్తినే (స్వామీజీనే) నీకు అప్పగిస్తున్నాను. నీకు హిమాలయ ప్రాంతాలు సుపరిచితాలు. నరేన్ భోజనానికి అవస్థపడకుండా చూసుకో” అని చెప్పారు. ఈ విధంగా మాతృదేవి ఆశీస్సులు పొంది 1890 జూలై ఆఖరున స్వామీజీ బయలుదేరారు. “నేను ఒకసారి స్పృశిస్తే ఆ వ్యక్తి జీవితంలో మార్పు కలగాలి. అట్టి శక్తిని సముపార్జించకుండా తిరిగి రాను” అని తమ సోదర సన్న్యాసులతో తెలిపి, సుదీర్ఘ యాత్రకు స్వామీజీ బయలుదేరారు.
భాగల్పూర్లో
అంగాతీరం వెంబడి నడిచి వెళ్లాలని స్వామీజీ అనుకొన్నారు. ఆగస్టు నెల స్వామీజీ, అఖండానంద భాగల్పూర్ చేరుకొన్నారు. అక్కడ గంగాతీరంలో ఒక చోట బసచేశారు. ప్రయాణపు బడలికతోను, ఆకలితోను వారి ముఖాలు వాడిపోయినప్పటికీ, ఆ వదనాలలో దేదీప్య మానంగా ప్రకాశించే ఆధ్యాత్మిక తేజస్సు వారిని ఇతరుల కన్నా విశిష్టమైనవారిగా చూపింది. స్వామీజీ పట్ల అనేకులు ఆకర్షితులయ్యారు. వారిలో ఒకరు ఆ ఊళ్లో సుప్రసిద్ధుడైన కుమార్ నిత్యానంద సింగ్. ఆతడి మిత్రుడయిన మన్మథనాథ్ చౌధురీ అనే వ్యక్తి ఇంట్లో స్వామీజీకి, అఖండానందకు బస ఏర్పాట్లు చేశారు.
ఈ ఇద్దరు సన్న్యాసులను గురించి మొదట్లో మన్మథనాథ్ గొప్పగా భావించ లేదు. ఎందరో సన్న్యాసులు వస్తూపోతూ ఉంటారు, వాళ్లలాంటి వారే ఈ ఇద్దరూ నని అతడు అనుకొన్నాడు. ఒక రోజు మధ్యాహ్న భోజనానంతరం అందరూ కూర్చుని విశ్రాంతి తీసుకొంటున్నారు. మన్మథనాథ్ వారితో మాట్లాడడం ఇష్టం లేనట్లు కాస్త దూరంగా కూర్చుని బౌద్ధమతం గురించిన ఆంగ్ల పుస్తకం ఒకటి చదవసాగాడు. కాసేపు గడిచింది. స్వామీజీ అతడితో, “ఏం పుస్తకం అది?” అని అడిగారు. అందుకు మన్మథనాథ్ పుస్తకం పేరు తెలిపి, “మీకు ఆంగ్లం తెలుసా?” అని అడిగాడు. “ఏదో కొద్దిగా” అని స్వామీజీ జవాబిచ్చారు. సంభాషణ కొన సాగింది. ఆంగ్ల సాహిత్యంలోని పలు గ్రంథాల నుండి ఉదాహరణలు చూపుతూ అనర్గళంగా స్వామీజీ మాట్లాడసాగారు. నిశ్చేష్టితుడయ్యాడు మన్మథనాథ్. ఒక సన్న్యాసి ఆంగ్లంలో, అందునా ఇంత అనర్గళంగా మాట్లాడడం ఆ రోజుల్లో ఊహా తీతం! కాసేపట్లోనే స్వామీజీ పాండిత్యాన్నీ, మేధస్సునూ గ్రహించాడు మన్మథనాథ్. యోగం, ఉపనిషత్తుల లాంటి అనేక విషయాలలో స్వామీజీకి అపారమైన జ్ఞానం ఉందని కొద్ది రోజుల్లోనే ఆతడికి అవగతమైంది.
అక్కడ స్వామీజీ బస చేసిన రోజుల్లో అనేకులు ఆయన వద్దకొచ్చి సాహిత్యం, తత్త్వశాస్త్రం, మతం లాంటి పలు విషయాలను గురించి ముచ్చటించారు. స్వామీజీ మేధాశక్తీ, వారు వివరించే (కొత్త) తరహా అందరినీ ఆకట్టుకొన్నాయి.
ఒక రోజు స్వామీజీని ఆ ఊళ్లోని శ్రీమంతుల వద్దకు తీసుకువెళ్లి పరి చయం చేస్తానని మన్మథనాథ్ చెప్పాడు. “నా బండిలోనే పోదాం. మీకు శ్రమ ఉండదు” అని కూడా చెప్పాడు. కాని స్వామీజీ అందుకు సమ్మతించక, “అది సన్న్యాస ధర్మం కాదు. శ్రీమంతులను ఆశ్రయించడం సన్న్యాస పథానికి విరుద్ధం” అని నిర్మొహమాటంగా చెప్పేశారు. స్వామీజీ పరిత్యాగం మన్మథనాథ్పై చెరగి పోని ముద్రవేసింది.
కాలానికి అతీతమైన సంగీతం
ఒక రోజు స్వామి మెల్లగా పాడుకొంటున్నారు. అది విన్న మన్మథనాథ్, “స్వామీజీ, మీకు పాడడం వచ్చా?” అని అడిగాడు. “ఏదో కాస్త వచ్చు” అన్నారు స్వామీజీ. స్వామీజీ చెప్పిన ‘ఏదో కాస్త వచ్చు’ లాంటి మాటలకు పూర్తి అర్థం అప్పటికే తెలిసివున్న మన్మథనాథ్ ఆయనను పాడమని బలవంతం చేశాడు. చాలాసేపు సంకో చించిన తరువాత స్వామీజీ పాడారు. “అతడు పాడుతున్నప్పుడు, నాలోని వ్యక్తి నాదస్వరం విన్న నాగుపాములా నిశ్చలంగా నిలబడిపోయాడు” అని శ్రీరామ కృష్ణులే శ్లాఘించిన స్వామీజీ పాట ఎలా ఉంటుంది! మన్మథనాథ్ ఆ పాటలో మైమరచిపోయాడు. మర్నాడు స్వామీజీ అనుమతితో పలువురు సంగీత విద్వాంసు లను ఇంటికి ఆహ్వానించాడు. రాత్రి స్వామీజీ పాడటానికి తగిన ఏర్పాటు చేశాడు. రాత్రి తొమ్మిది పది గంటలకల్లా కార్యక్రమం పూర్తవుతుందని భావించిన మన్మథనాథ్ ఆహ్వానితులకు రాత్రి భోజనాల ఏర్పాటు చేయలేదు. పాటలు ప్రారంభమయ్యాయి. 9, 10, 11 గంటలూ గడచిపోతూనే ఉన్నాయి. స్వామీజీ సంగీతం ఆగలేదు. ఎవరూ కదల్లేదు. ఆకలి దప్పికల ధ్యాసే ఎవరికీ లేదు. మర్నాడు ఉదయం మూడు గంటల దాకా స్వామీజీ పాడారు. ఎవరూ కూర్చున్న చోటు నుండి అటూ ఇటూ కదల్లేదు. తబలా వాయించిన వ్యక్తి చేతులు మొద్దుబారి ఆపిన తరువాతనే ఆ సంగీత కార్యక్రమం ముగింపునకు వచ్చింది.
జైన సన్న్యాసులతో
చుట్టుపక్కల ఉన్న ఒకటి రెండు చోట్లకు రెండుసార్లు వెళ్ళడం తప్ప స్వామీజీ భాగల్పూర్లోనే తమ సమయమంతా గడిపారు. సమీపంలోని నాథనగర్ ఒక జైన క్షేత్రం. పలువురు జైన సన్న్యాసులు అక్కడ నివసిస్తున్నారు. జైన మతాన్ని సనాతన ధర్మంలో ఒక భాగంగానే పరిగణించారు. స్వామీజీ ఒక రోజు అక్కడకు వెళ్లి ఆ సన్న్యాసులతో జైనమతం గురించి చాలాసేపు సంభాషించారు. ఈ అనుభవం ఆయనకు ఎంతో తృప్తినిచ్చింది.
స్వామీజీ భాగల్పూర్ నుండి బయలుదేరడానికి చాలాసార్లు ప్రయత్నించి నప్పటికీ మన్మథనాథ్ ఆయనను విడిచిపెట్టలేదు. కనుక ఒక రోజు ఆతడు ఇంట్లో లేనప్పుడు, కుటుంబ సభ్యుల వద్ద సెలవు పుచ్చుకొని స్వామీజీ, అఖండా నందలు హిమాలయాల వైపుగా బయలుదేరారు. ఇంటికి తిరిగి వచ్చాక మన్మథనాథ్ జరిగింది తెలుసుకొని ఎంతో ఆవేదన చెందాడు. బద్రీనాథ్ వెళ్లాలని ఒకసారి స్వామీజీ చెప్పినట్లు జ్ఞాపకం వచ్చి అతడు అల్మోరా దాకా వెళ్ళి స్వామీజీ కోసం వెదకాడు. కాని అంతలోనే స్వామీజీ అక్కణ్ణుండి వెళ్ళిపోయారు.
ఆంగ్ల నిషేధం
తరువాత ఇద్దరూ వైద్యనాథంలో బసచేశారు. అక్కడ బాబూ రాజ్ నారా యణ్ బోస్ అనే వ్యక్తిని కలుసుకొన్నారు. ఆయన బ్రహ్మసమాజ ప్రచారకునిగా సంఘంలో ఆదరణీయునిగా ఖ్యాతిగాంచాడు. చిన్నతనంలో ఆంగ్లేయ వ్యామోహంలో భారతదేశాన్నీ, భారతదేశానికి సంబంధించిన అన్ని విషయాలనీ ఈయన ద్వేషించాడు; తల్లిదండ్రుల మరణానంతరం పాశ్చాత్య వ్యామోహాన్ని విదిలించుకొని భారతదేశాన్నీ, దాని మహత్త్వాన్నీ కీర్తించసాగాడు. పాశ్చాత్య వ్యామోహం ఎంత తీవ్రంగా ఉండేదో అదే తీవ్రతను ప్రతిఘటించడంలోనూ చూపించసాగాడు. ఆంగ్లేయుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి మాత్రమే కాక పొరపాటుగా ఎవరైనా సభ్యులు ఆంగ్ల పదాలను ఉపయోగించినా కూడా ఒక పదానికి పైసా చొప్పున జరిమానా విధిస్తాడట.
వృద్ధుడైన రాజ్ నారాయణ్ బోస్ భావాలపట్ల మర్యాద చూపాలనే ఉద్దేశంతో స్వామీజీ తమకు ఆంగ్లవాసనే అంటనట్లు వ్యవహరించారు; అఖండానందను కూడా అట్లే వ్యవహరించమన్నారు. స్వచ్ఛమైన బెంగాలీ భాష లోనే సంభాషణలు సాగాయి. స్వామీజీకి ఆంగ్లం కించిత్తు కూడా తెలియదని రాజ్‌నారాయణ్ నమ్మాడు. ఒక రోజు మాటల మధ్యలో తొందరపాటున రాజ్ నారాయణ్ నోట ‘ప్లస్’ (plus) అనే పదం దొర్లింది. ఆ పదం స్వామీజీకి అర్థ మయిందో లేదో అనే సందేహంతో వేళ్ళును కూడిక గుర్తులా చేసి చూపించాడు. కాలాంతరంలో స్వామీజీ పేరు జగద్విఖ్యాతి గాంచినప్పుడు ఆయన పొందిన ఆశ్చర్యం వర్ణనాతీతం. “స్వామీజీ ఒక విచిత్రమైన వ్యక్తి” అని వ్యాఖ్యానించా రట!
‘సమాజం మీద పిడుగులా పడతాను’
వైద్యనాథం నుండి ఘాజీపూర్ మీదుగా ఇద్దరూ కాశీ చేరుకొన్నారు. కాశీలో ప్రమదాదాస్ ఇంట్లో బసచేశారు. కాశీలో ఉన్నప్పటికీ హిమాలయాలలోని మంచుపర్వత శిఖరాలను తిలకించాలనే ఉత్సుకత స్వామీజీలో నిండిపోయింది. ఒక రోజు స్వామీజీని కలుసుకోవడానికి పలువురు వచ్చారు. అప్పుడు స్వామీజీ ఏదో ఆవేశం ఆవహించినట్లు ప్రమదాదాస్తో, “ఇప్పుడు నేను కాశీ నుండి వెళ్లిపోతున్నాను. సమాజం మీద ఏదో ఒక రోజు పిడుగులా పడతాను; ఈ సమాజం ఒక కుక్కలా నన్ను అనుసరిస్తుంది. అంతదాకా ఈ నగరంలో అడుగుపెట్టను” అన్నారు. పిదప ఆ స్వాములిద్దరూ బయలుదేరారు.
మనిషీ విశ్వమూ ఒకే అమరిక
బదరీనాథ్ వెళ్లాలన్నదే వారి యోచన. కాశీ నుండి బయలుదేరిన వారు అయోధ్య, నైనిటాల్ మీదుగా అల్మోరా వెళ్లారు. దారిలో కాక్రిఘాట్ అనే చోటు చేరుకొన్నారు. కోసీ, సూయల్ అనే చిన్న నదులు సంగ మించే అందమైన కొండ ప్రాంతం అది. సంగమ స్థలానికి సమీపంలో ఒక పెద్ద రావిచెట్టు ఉంది. చుట్టూ ఎత్తయిన కొండ శిఖరాలు. “ఈ ప్రాంతం పరమాద్భుతంగా ఉంది. ధ్యానానికి ఎంతో అనువైన చోటు ఇది” అన్నారు స్వామీజీ చుట్టూచూస్తూ. అలా చెప్పడంతో ఆగ లేదు; నదిలో స్నానమాచరించి తీరంలో కూర్చుని ప్రగాఢ ధ్యానంలో మగ్ను లయ్యారు.
స్వామీజీ జీవితంలో అదొక ముఖ్యత్వం వహించిన రోజు. ఆయన కాలాం తర జీవితంలోను, ఉపన్యాసాలలోను, ప్రణాళికలలోను కానవచ్చే ఒక అద్భుత మైన భావనను నాటి ధ్యానంలో ఒక అనుభూతిగా పొందారాయన. ధ్యానం ముగించి లేవగానే ఆయన అఖండానందతో, “నా జీవితంలో ఒక మహోన్నత మైన క్షణం ఇది. జీవితపు అంతుబట్టని చిక్కుముడుల్లో అతిముఖ్యమైన ఒక దానికి ఈ రావిచెట్టు క్రింద నాకు పరిష్కారం లభించింది. మనిషికీ లోకానికీ మధ్య ప్రగాఢమైన సమైక్యత నెలకొని ఉండడం నేను గాంచాను. ప్రపంచంలో ఉన్న సమస్తమూ ఈ మానవ శరీరంలోనూ ఉంది. యావత్ప్రపంచాన్నీ నేను ఒక అణువులో చూశాను” అన్నారు. ఆ రోజంతా స్వామీజీ ఉన్నతమైన మనఃస్థితిలో ఉండిపోయారు; తాము అనుభూతిలో పొందిన విషయం గూర్చి అఖండానందతో మాట్లాడారు. ఒక కాగితంలో క్రింది విధంగా వ్రాసుకొన్నారు కూడా.
“ప్రారంభంలో వాక్కు ఉండేది. పిండాండాలు ఒకే అమరికలో ఉండేవి. వ్యక్తిగత ఆత్మ ఒక (సజీవ) దేహంలో నెలకొన్నట్లు, విశ్వాత్మ సజీవ ప్రకృతిలో, అంటే మనకు ద్యోతకమవుతున్న ప్రపంచంలో నెలకొని ఉంది. కాళీమాత శివుణ్ణి ఆలింగనం చేసుకొనివుంది. ఇది కల్పన కాదు. ఒకటి (ప్రకృతి) మరొక దానిని (ఆత్మ) ఆవరించడం, భావన – దానిని వ్యక్తం చేసే వాక్కుతోనూ పోల్చవచ్చు. అవి అభిన్నమైనవి. మనస్సే వాటిని విభజిస్తుంది. వాక్కు లేకుండా భావన లేదు. కనుక ప్రారంభంలో వాక్కు ఉండేదని చెప్పబడింది. విశ్వాత్మ యొక్క ఈ ద్వైత స్థితి శాశ్వతమయినది. శాశ్వతమైన సాకార నిరాకారాలు అనే రెండిటి సంయోగాన్నే మనం చూస్తున్నాం.”
ఫకీర్ ఇచ్చిన దోసకాయ
కాక్రీఘాట్ నుండి స్వాము లిద్దరూ అల్మోరా వైపుగా నడక సాగించారు. అల్మోరాకు రెండు మైళ్ళదూరంలో మహమ్మదీయుల శ్మశానవాటిక ఒకటి ఉంది. ఆ చోటు చేరుకొనేసరికి ఆకలిదప్పులతో స్వామీజీ స్పృహ కోల్పోయే స్థితికి వచ్చారు. ఆయనను అక్కడ కూర్చోబెట్టి అఖండానంద నీళ్ళ కోసం వెదుక్కొంటూ వెళ్ళాడు. ఆ శ్మశాన వాటిక పర్యవేక్షకుడయిన జుల్ఫికర్ అలీ అనే మహమ్మదీయ ఫకీర్ శ్మశానవాటిక సమీపంలో ఒక గుడిసెలో నివసిస్తున్నాడు. అతడివద్ద ఆహారం అంటూ ఏదైనా ఉన్నదీ అంటే, అది ఒక దోసకాయ మాత్రమే. స్వామీజీ పరిస్థితి చూడగానే అతడు పరుగెత్తుకొంటూ వచ్చి ఆ దోసకాయను ఆయనకు ఇచ్చాడు. మరీ బలహీనంగా ఉన్న స్వామీజీ ఆ కాయను తన నోటికి అందించమన్నారు. అందుకు ఆ ఫకీర్, “స్వామీ, నే నొక మహమ్మదీయుణ్ణి” అన్నాడు. “అయితే ఏమిటి! అదో పెద్ద విషయం కాదు. మనమందరమూ సోదరులమే కదా?” అని నవ్వుతూ స్వామీజీ అడిగారు. ఫకీర్ ఆ దోసకాయను స్వామీజీకి తినిపించాడు. స్వామీజీ బడలిక తీరింది. “నిజానికి ఆ వ్యక్తి నా ప్రాణదాత. ఆ విధంగా జీవితంలో ఎన్నడూ నేను అలసిసొలసిపోలేదు” అని కాలాంతరంలో స్వామీజీ చెప్పారు.
1890 ఆగస్టు నెలాఖరుకి స్వాములిద్దరూ అల్మోరా చేరుకొన్నారు. అక్కడ అంబాదత్ అనే వ్యక్తి ఉద్యానగృహంలో వారిద్దరూ బసచేశారు. శారదానంద, కృపానంద అప్పటికే అల్మోరాలో ఉన్నారు. వారు లాలా బద్రీషా అనే ప్రముఖుని ఇంట్లో బసచేశారు. వారు వచ్చి స్వామీజీని కలుసుకొన్నారు. ఆ తరువాత వారందరూ లాలా బద్రీషా ఇంట్లో బసచేశారు.
ఇక్కడ ప్రభుత్వోద్యోగియైన శ్రీకృష్ణ జోషి అనే వ్యక్తితో స్వామీజీ సుదీర్ఘచర్చలు జరిపారు. ‘మతాల ఆదర్శం త్యాగం’ అన్నది స్వామీజీ అభిప్రాయం.దీనిని గురించి వాదోపవాదాలు కూడా జరిగాయి. అక్కడి ప్రజల విన్నపాన్ని మన్నించి స్వామీజీ దయ్యంపట్టిన ఒక వ్యక్తి పరిస్థితిని నయంచేశారు కూడా.
కాసార్ దేవి గుహలో
కొన్ని రోజులు అక్కడ బసచేసిన స్వామీజీ ఏకాంత జీవితం కోసం పరితపించారు. కనుక ఒక రోజు అందరివద్దా సెలవు పుచ్చుకొని కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఒక గుహను ఎంచుకొని అక్కడే ఉండి తీవ్రమైన సాధనలు అనుష్ఠించసాగారు. ఆ గుహ కాసరాదేవి* ఆలయానికి సమీపంలో ఉంది. దట్టమయిన అరణ్య ప్రాంతం అది. కొంత కాలం అక్కడ నివసించిన స్వామీజీ ఏదో ఒక శక్తిచే ప్రేరేపితులైనట్లుగా మళ్ళీ తిరిగి లాలా ఇంటికి వచ్చారు. తీవ్రమైన తపోమయ జీవిత పర్యవసానంగా స్వామీజీ ముఖారవిందం దివ్య తేజస్సుతో భాసిల్లింది. “ఏకాంత జీవితాన్నీ తీవ్ర సాధన లనూ అభిలషించి ఈ విధంగా స్వామీజీ ఏకాంతంలో జీవితం గడపినప్పుడల్లా ఏదో ఒక శక్తి ఆయనను ప్రేరేపించి బయటికి తీసుకొనివస్తూన్నట్లుగా అనిపిం చేది. ఆయన కోసమే ఒక మహత్కార్యం వేచివుంది. ఆ కార్యం పూర్తిచేసేదాకా ఆయన ఏకాంత జీవితం గడపకుండా ఆ శక్తి అడ్డుకొంటున్నట్లుగా తోస్తోంది” అని అఖండానంద వ్యాఖ్యానించేవారు.
సోదరి మృతి
లాలా ఇంట్లో కొన్ని రోజులుగా బస చేస్తున్న స్వామీజీకి అశనిపాతం లాంటి వార్త అందింది; ఆయన సోదరీమణులలో ఒకరు ఆత్మహత్య చేసుకొ న్నారు. ఈ విషాదకరమైన దుర్ఘటన స్వామీజీని దిగ్భ్రాంతికి గురిచెయ్యటమేకాక ప్రగాఢ చింతనలో ముంచివేసింది. స్వామీజీతో బాల్యంలో ఆటలాడిన అత్యంత సన్నిహితురాలు ఆమె. చిన్నతనంలోనే ఆమెకు వివాహం చేశారు. కాని ఆమె వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. ఛాందసమైన ఆచారపరాయణుల ఇంట మెట్టిన ఆమె సర్దుకుపోలేకపోయింది. వివాహం జరిగిన నాటినుండే విషాదమూ, కన్నీరే ఆమెకు మిగిలాయి. జీవితంలో ఇక భరించలేని విషాదం ముంచుకొచ్చినప్పుడు తన జీవితాన్ని అంతం చేసుకొంది. “మళ్లీ తిరిగి రాకూడదని కొన్ని సంవత్సరాల క్రితం హిమాలయాలకు వెళ్లాను; నా సోదరి ఆత్మహత్య చేసుకొన్నదనే వార్త నాకు అక్కడ అందింది. నా దుర్బలమైన హృదయంలో అప్పుడు సంతరించుకోబోతున్న ప్రశాంతత దూర మైంది”* అని స్వామీజీ వ్రాశారు. “స్త్రీలకు విద్య నేర్పాలి, తమ సొంత కాళ్ల మీద నిలబడేట్లు వారిని తీర్చిదిద్దాలి” అని స్వామీజీ స్త్రీ జనోద్ధరణకై ఆక్రోశించ డానికి మూలమైన ప్రాతిపదికను ఈ దుర్ఘటనలో మనం చూడవచ్చు.
అల్మోరా నుండి కర్ణప్రయాగ, రుద్రప్రయాగల మీదుగా స్వామీజీ, శారదా నంద, అఖండానంద, కృపానందలు శ్రీనగర్ చేరుకొన్నారు. అలకనంద నదీ తీరంలో తురీయానంద ఒకప్పుడు నివసించిన కుటీరంలో అందరూ బసచేశారు. అక్కడ దాదాపు ఒకటిన్నర నెలల కాలం భిక్షాటన చేస్తూ జీవించారు. తమ పూర్తి సమయాన్ని ప్రార్థన, ధ్యానం, శాస్త్రాధ్యయనాలలో గడిపారు.
శ్రీనగర్‌లో తమ చిన్ననాటి పాఠశాల ఉపాధ్యాయుణ్ణి ఒకరిని స్వామీజీ కలుసుకోవడం తటస్థించింది. ఈయన ఇటీవలి కాలంలో క్రైస్తవమతం పుచ్చు కొన్నాడు. స్వామీజీ హిందూమత మహత్త్వాన్ని ఆయన దృష్టికి తెచ్చినప్పుడు, ఆ ఉపాధ్యాయుడు తాను తప్పు చేసినట్లు గ్రహించి మళ్ళీ హిందూమతానికి రావాలని పరితపించాడు. కాలాంతరంలో సన్న్యాసుల పట్ల అమిత గౌరవమర్యా దలు పాటించి వీలైనప్పుడల్లా వారిని తన ఇంటికి ఆహ్వానించి సేవించాడు.
దుడ్డుకర్ర నెత్తితే దానం
అక్కణ్ణుండి అందరూ టెహ్రీ చేరుకొన్నారు. ఒక గ్రామం గుండా వెళు తున్నప్పుడు రాత్రి కాసాగింది. ఆకలితో వారు నకనకలాడసాగారు. ఒక పాడుబడ్డ సత్రంలో సామాన్లు దించి, భిక్షకై బయలుదేరారు. ఎన్ని ఇళ్లలో యాచించినా ప్రయోజనం లేకపోయింది. వీరిని ఎవరూ అసలు పట్టించుకోలేదు. “హిమాలయ ప్రాంతంలోని (గార్హాల్) మనుషుల్లా దానమిచ్చేవారు మరెవ్వరూ లేరు. కాని వారు దానం ఇవ్వాలంటే మనం దుడ్డు కర్ర ఎత్తాలి” అనే సామెత ఒకటి ఉంది. దానిని అఖండానంద జ్ఞాపకం చేసుకొన్నాడు. కనుక అందరూ చేతికర్రలను ఎత్తి “భోజనం పెట్టకపోతే గ్రామాన్ని కొల్లగొడతాం” అంటూ బిగ్గరగా ఆవేశంతో కేకలుపెట్టి గ్రామస్థుల నందరినీ భయపెట్టారు. అంతే, ఆహారంతోపాటు, అవసరమైనవన్నీ వారు ఉన్న చోటికే తన్నుకొంటూ వచ్చాయి. కావలసినవన్నీ వారికి ఇచ్చి భయభక్తులతో గ్రామస్థులందరూ చేతులు కట్టుకొని నిలబడ్డారు!
టెహ్రీలో ఒక పాడుబడిన తోటలో సన్న్యాసులు బసచేయడానికి రెండుగదులు కట్టబడివున్నాయి. స్వామీజీ, సోదర సన్న్యాసులు ఆ గదుల్లో బసచేశారు. గంగాతీరంలో ఆ గదులు ఉన్నాయి. ఇక్కడ భిక్షాటనతో పొట్టపోసుకొంటూ, రోజంతా స్వామీజీ, తక్కినవారు ఆధ్యాత్మిక సాధనలలో గడపసాగారు. టెహ్రీ సంస్థాన దివాను రఘునాథ్ భట్టాచార్యతో వారికి పరిచయం కలిగింది. ఆయన విన్నపం మేరకు స్వామీజీ ఆయనకు కొన్ని రోజులు అతిథిగా ఉన్నారు. స్వామీజీని ఏదో రకంగా సేవించాలనే తీవ్ర వ్యాకులత దివాన్లో జనించింది. గంగాతీరంలో ఒక ఏకాంతమైన చోట నివసిస్తూ జపధ్యానాలు అనుష్ఠించాలనే అభిలాషస్వామీజీలో కలిగింది. దివాన్ తన వ్యాకులతను వ్యక్తం చేసినప్పుడు స్వామీజీ తమ అభిలాషను వెల్లడించారు. గంగానదీ విలంగనా నదుల సంగమ స్థానమైన గణ్శ్ప్రయాగలో స్వామీజీ కోసం ఒక కుటీరం నిర్మించి ఇచ్చాడు దివాను.
దివాను నిర్మించిన కుటీరంలో నివసించడానికి స్వామీజీ సిద్ధమయ్యారు. కాని భగవద్విలాసం మరో విధంగా ఉంది. హఠాత్తుగా అఖండానంద అస్వస్థు డయ్యాడు; శ్వాసనాళం వాపు (bronchitis) వ్యాధి తిరగబెట్టింది. కొండగాలి ఆయనకు పడలేదు, అదే సమయంలో శీతకాలం కూడా సమీపించసాగింది. ఆయనను దిగువ ప్రాంతాలకు తరలించవలసిన అగత్యం ఏర్పడింది. కనుక కుటీరంలో నివసించాలనే ప్రణాళికను వదలుకొని అందరూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ప్రయాణానికి కావలసిన గుర్రాలను దివానే ఏర్పాటుచేసి, దారి ఖర్చుల నిమిత్తం కొంత పైకం కూడా ఇచ్చాడు. దాదాపు ఇరవై రోజులు టెహ్రీలో గడపిన ఈ సన్న్యాసులు డెహ్రాడూన్‌కు బయలుదేరారు.
‘నా సోదరునికి చోటు ఇవ్వగలరా?’
దారిలో రాజ్‌పూర్‌కు సమీపంలో వారు పోతున్నప్పుడు, వారికి కాస్త ముందుగా మరొక సన్న్యాసి వెళుతూ ఉండడం కంటబడింది. చూడడానికి ఆయన తురీయానందలా కనిపించాడు. కనుక వేగంగా వెళ్లి ఆయనను సమీపించారు. “అవును, ఇతడు మన హరే!” అంటూ కేకపెట్టాడు వారిలో ఒకరు. హఠాత్తుగా ఒక సోదర సన్న్యాసిని కలుసు కోవడంలో వారు పొందిన ఆనందం వర్ణనాతీతం. అందరూ కలసి డెహ్రాడూన్ వెళ్లారు. ముందుగా ఒక వైద్యునికి అఖండానందను చూపించారు. ఆయన మందులిచ్చి కొండ ప్రాంతాలకు వెళ్ళకూడదని హెచ్చరిక చేశాడు.
డెహ్రాడూన్‌లో వెంటనే అఖండానంద కోసం ఒక చోటు వెదకాలి. స్వామీజీ ఇంటింటికీ వెళ్ళి అఖండానంద కోసం చోటు అడిగారు. ఆయన విన్నపాన్ని ఎవరూ పట్టించుకొన్న పాపానపోలేదు. చివరికి ఒక వ్యాపారస్థుడు, నిర్మాణం ఇంకా పూర్తిగాని తమ కొత్త ఇంట్లో వారు నివసించడానికి సమ్మతించాడు. ఇల్లు నిర్మాణానికి అవసరమైన సామగ్రి, కలప మొదలైన వస్తువులు చెల్లాచెదరుగా పడివున్న ఆ స్థలంలో ఆ సాధువులు బసచేశారు. కాని అఖండానందకు ఆ చోటు ఏమాత్రం అనుకూలించలేదు.
మరొక చోటు కోసం వెతకుతున్నప్పుడు స్వామీజీ తమ పాఠశాల సహాధ్యాయియైన హృదయ్బాబును కలుసుకోవడం తటస్థించింది. అతడు మనః స్ఫూర్తిగా అఖండానందకు తన ఇంట్లో బస ఏర్పాటు చేశాడు. ఆ మధ్య హృదయ్ బాబు క్రైస్తవ మతం పుచ్చుకొన్నాడు. అతడి ఇంట్లో బస చేసినప్పుడు ఒక రోజు స్వామీజీ కొందరు క్రైస్తవ మిషనరీలతో వాదించడం జరిగింది. స్వామీజీ భావనలను వారు అంగీకరించనూలేదు, వ్యతిరిక్త భావనలను వ్యక్తం చేయనూ లేకపోయారు. అసమర్థతా, కోపమూ ముప్పిరిగొనగా వారు అక్కణ్ణుండి వెళ్ళి పోయారు. తమకు తలదాచుకోవడానికి చోటిచ్చిన వ్యక్తి ఇంట్లో ఇలా జరిగినందుకు స్వామీజీ ఎంతగానో విచారం వెలిబుచ్చి, హృదయ్‌కు క్షమాపణ కూడా చెప్పారు. ఇక్కడ మరో సమస్య తలెత్తింది. హైందవ జీవితానికి అలవడిన అఖండానంద క్రైస్తవ ఆచారవ్యవహారాలతో నిండిన ఆ ఇంట్లో ఇమడలేక పోయాడు. దాంతో అందరూ మళ్ళీ పాత చోటికే బస మార్చారు.
స్వామీజీ మళ్ళీ ఇల్లిల్లూ ఎక్కి దిగసాగారు. “నా సోదర సన్న్యాసి అస్వస్థుడై ఉన్నాడు. మీ ఇంట్లో తలదాచుకోవడానికి కాస్త చోటిచ్చి, అన్నానికి ఏర్పాటు చేసిపెట్టగలరా?” అని అనేక చోట్ల అడిగారు. కాని ఎక్కడ నుండీ సానుకూల స్పందన లభించలేదు. చివరికి అనంత నారాయణ్ అనే పండితుడు స్వయంగా ఒక చిన్న ఇల్లు అద్దెకు పుచ్చుకొని, సన్న్యాసుల బసకీ, భోజనానికీ ఏర్పాటు చేశాడు.
డెహ్రాడూన్‌లో వారు దాదాపు మూడు వారాలు గడిపారు. ఆ తరువాత కృపానందను తోడిచ్చి అఖండానందను అలహాబాద్‌కు పంపించి, స్వామీజీ శారదానందతో కలిసి హృషీకేశ్ వైపుగా బయలుదేరారు.
విచిత్రమైన మహాత్ములు
అందమైన పర్వతాలు, పచ్చని చెట్టుచేమలతో నిండిన దట్టమైన అరణ్యాలు, పొంగిపొరలి ప్రవహిస్తూ ఎన్నటికీ ఎండిపోని జీవనదియైన గంగానది, సాధు బృందాలు, అనేక దేవాలయాలతో ఇప్పటికీ ఒక తపో భూమిగా విలసిల్లుతున్నది హృషీకేశ్. స్వామీజీ, శారదా నందలు చండీశ్వరుని ఆలయం సమీపంలో ఒక కుటీరం నిర్మించుకొని జీవించసాగారు.
హిమాలయ ప్రాంతాలలో పలువురు మహాత్ములను దర్శించుకొన్నారు. దేహ స్పృహ అన్నదే లేకుండా, సుఖదుఃఖాలను గురించి కలత చెందకుండా జీవి స్తూన్న ఎందరినో స్వామీజీ అక్కడ చూశారు. ఒక వ్యక్తి చూడడానికి పిచ్చివాడిలా ఉన్నాడు. ఒంటి మీద గుడ్డ పీలిక కూడా లేకుండా తిరుగుతున్న ఆ వ్యక్తి పిల్లలకు ఒక ఆట వస్తువు. ఆతణ్ణి చూడగానే రాళ్ళురువ్వడం పిల్లలకు ఒక ఆట. తమాషా ఏమిటంటే ఆతడు కూడా దానిని వినోదంగానే భావించేవాడు. వారంతా రాళ్ళు రువ్వడం వలన ఆతడి శరీరమంతా రక్తసిక్తమయింది. అయినప్పటికీ అది ఆతడికి బాధగా అనిపించలేదు. రాళ్ళు రువ్వుతూ పిల్లలు చప్పట్లుకొడుతూ కేరింత లతో ఆనందించినట్లే అతడు కూడా ఆనందించాడు. ఒకసారి స్వామీజీ అతణ్ణి తీసుకువెళ్ళి అతడి గాయాలను కడిగి, మందు పూశారు. రక్తం స్రవిస్తున్నప్పుడు అతడు ఎలా నవ్వాడో, స్వామీజీ అతడికి శుశ్రూష చేస్తున్నప్పుడు కూడా ఆనం దంతో పరవశించిపోయాడు. మధ్యమధ్యలో, “అంతా నా తండ్రి లీల” అంటూ మళ్లీ నవ్వసాగాడు.
కొందరు మహాత్ములు ఎవరినీ తమ దరి చేరనివ్వరు. అందుకోసం వారు అవలంబించే పద్ధతులు విచిత్రంగా ఉంటాయి. కొందరు మనుషులను చూడగానే రాళ్లు రువ్వుతారు. మరొకరు తాను జీవిస్తున్న గుహ చుట్టూ మనిషి ఎముకలను పరచి ఉంచుతారు! చూసేవారికి ఆతడు శవాలను తినేవాడిలా కనిపించడంతో ఎవరైనా ఆతణ్ణి సమీపిస్తే ఒట్టు! దాంతో ఆతడు కూడా ఎలాంటి ఆటం కాలూ లేకుండా నిర్విఘ్నంగా సాధనలలో లయించిపోతాడు. ఇటువంటి పలు వురు సన్న్యాసులను స్వామీజీ దర్శించారు.
మళ్లీ మృత్యువు ఒడిలో
ఈలోపు కృపానంద స్వామి తిరిగి వచ్చాడు. తాము నివసిస్తున్న కుటీరాన్ని కాస్త పెద్దదిగా చేయాలనుకొన్నారు. స్వామీజీ తప్ప తక్కిన వారంతా వెదురు బొంగులు తేవడానికి అడవిలోకి వెళ్ళారు. వారు తిరిగి వచ్చే సరికి స్వామీజీ విపరీతమైన జ్వరంతో బాధపడుతూ కనిపిం చారు. జ్వరంతోపాటు గొంతువాపు నొప్పి (diphtheria) కూడా ఆయనకు సోకింది. అక్కడ వైద్య సౌకర్యాలు మృగ్యం. ఆదరణ కరవయిన ఆ పరిస్థితిలో భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప మరోమార్గం ఏదీ వారికి కనిపించ లేదు. స్వామీజీ నాడి బలహీనంగా కొట్టుకొంటూ క్రమక్రమంగా ఆగిపోయే స్థితికి దిగజారింది; శరీరం చల్లబడసాగింది. అందరికీ నమ్మకం పోయింది; వారు విల పించనారంభించారు. హఠాత్తుగా అప్పుడు ఎక్కడ నుండో ఒక సాధువు అక్కడకు వచ్చాడు. తన సంచీ నుండి కాస్త తేనె, కొన్ని భస్మాలు తీసి, వాటిని తేనెలో రంగ రించి స్వామీజీ నోట్లో పోశాడు. సంజీవనిలా పనిచేసింది ఆ ఔషధం. కాసేపటి కల్లా స్వామీజీ శరీరం వేడెక్కింది, స్పృహ కూడా వచ్చింది.
మరికొంతసేపటికి స్వామీజీ కళ్ళు తెరిచి మెల్లగా మాట్లాడారు. కాని మాటలు స్పష్టంగా లేకపోవడంతో ఒక సోదర సన్న్యాసి ఆయన నోటి వద్ద తన చెవిని ఆనించి మాటలు జాగ్రత్తగా విన్నాడు. “సోదరులారా చింతించకండి, నేను చావను” అన్నారు స్వామీజీ.
బయటికి స్వామీజీకి వచ్చిన జ్వరం మృత్యుముఖం దాకా తీసుకువెళ్లినప్ప టికీ, ఆంతరికంగా అది ఆయనకు ఒక అద్భుత సందేశాన్ని అందజేసింది. ఆ అర్ధబాహ్య చైతన్య స్థితిలో ఆయన కొక మహాసత్యం ఆవిష్కృతమయింది. తాను ఈ లోకంలో నిర్వర్తించవలసిన మహత్కార్యం ఒకటి ఉంది. ఆ కార్యం పూర్తయ్యే దాకా విశ్రాంతి అన్నదే లేదని ఆ సమయంలో తనకు తెలిసినట్లు స్వామీజీ తదనంతరం చెప్పారు. ఆయనలో అపరిమితమైన ఆధ్యాత్మిక శక్తి ఉప్పొంగడం సోదర సన్న్యాసులు గమనించకపోలేదు. ఆ శక్తి కార్యోన్ముఖమవడానికి తగిన సమయం కోసమూ, చోటు కోసమూ వేచివున్నట్లుగా తోచింది.
మరొక ‘వరాహ నగర మఠం’
కఠోర సాధనలు అనుష్ఠించడానికి స్వామీజీ హృషీకేశ్ నుండి హరిద్వార్ వెళ్లారు. హరిద్వార్ సమీపంలోని కంఖల్ అనే చోట స్వామి బ్రహ్మానంద అప్ప టికే సాధనామయ జీవితం గడపుతున్నాడు. స్వామీజీ రాక తెలియగానే బ్రహ్మానంద వెళ్ళి ఆయనను కలుసుకొన్నాడు. తదుపరి తక్కిన సన్న్యాసులు కూడా వచ్చి చేరుకొన్నారు. అందరూ కలసి సహరాన్‌పూర్‌కు వెళ్ళారు. అక్కడ బసచేసివున్న అఖండానంద అప్పటికే మీరట్ వెళ్ళిపోయాడు. దాంతో వీరందరూ మీరట్‌కు బయలుదేరారు. మీరట్‌లో యజ్ఞేశ్వరబాబు అనే వ్యక్తి ఇంట్లో అందరూ బసచేశారు. హృషీకేశ్‌లో స్వామీజీ జబ్బు పడినప్పటి నుండి అంతదాకా పూర్తిగా కోలుకోలేదు. ఆయనకు మరింత చికిత్సా, పౌష్టిక ఆహారమూ ఆవశ్యకాలయినాయి. కనుక పదిహేను రోజులు అక్కడే ఉండిపోయి, యజ్ఞేశ్వరబాబు మిత్రుడైన సేట్జీ అనే వ్యక్తి ఇంట్లో బసచేశారు.
అప్పటికే అక్కడికి తీర్థయాత్రలకు వచ్చివున్న అఖండానంద వారిని చేరుకొ న్నాడు. శ్రీరామకృష్ణుల సన్న్యాస శిష్యులు పలువురు సేట్జీ ఇంట్లో బసచేసి ఆధ్యా త్మిక సాధనల్లో మునిగిపోవడంతో ఆ స్థలం వరాహ నగర మఠాన్ని తలపింప చేసింది. జపధ్యానాలు, ప్రార్థన, భజన, శాస్త్రాధ్యయనాలతో వారు రోజులు గడపసాగారు. తమ భోజనాదులను స్వయంగా వారే వండుకొనేవారు. సాయం త్రాల్లో కాస్త దూరం పచార్లు చేసిరావడమో లేదా ప్రక్కనే ఉన్న మైదానంలో సైనికుల కవాతు, క్రీడవంటివి తిలకించడానికి వెళ్ళేవారు.
తల్లిలా వండి వడ్డించారు
కన్నతల్లిలా అక్కడ అందరికీ వండి వడ్డించడం గురించి తురీయానంద ఏమంటున్నారో విందాం: “మీరట్‌లో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాను. నా మనస్సులో శాశ్వతంగా నిలచిపోయిన సంఘటన అది: ఆ రోజు మా అందరికీ పులావు వండి వడ్డించారు స్వామీజీ. ‘చాలా బాగుంది’ అని మేం చెప్పగానే వండినదంతా ఆయన మాకే వడ్డించేశారు. ఆయన పిడికెడు కూడా నోటబెట్టుకోలేదు. ‘మీరు కూడా తినండి’ అన్న విన్నపానికి జవాబుగా, ‘ఇవన్నీ నేను కావలసినంత తిన్నాను. మీకు వడ్డించడంతో నా మనస్సు ఆనందంతో నిండిపోయింది. కాస్త కూడా మిగల్చకుండా అంతా తినండి’ అన్నారు. ఈ సంఘటన పెద్దదేమీ కాదు. కాని నా మనస్సులో అది చెరిగిపోని ముద్రవేసింది. ఎన్ని ప్రయాసలు, ఎంతటి ప్రేమ, ఎన్నెన్ని కథాకమామిషులు, ఎంత ప్రయాణం – అన్నీ నా మనోఫలకంపై మెదలుతున్నాయి!”
సేట్జీ ఇంటికి సమీపాన ఒక గ్రంథాలయం ఉంది. అక్కడ నుండి స్వామీజీ కోసం అఖండానంద పుస్తకాలు తెచ్చియివ్వడం పరిపాటి. ఒక రోజు స్వామీజీ Sir John Lubbock సాహిత్య సంపుటాలు తీసుకురమ్మన్నారు. అఖండా నంద నిత్యం ఒక సంపుటాన్ని తేవడమూ, స్వామీజీ దానిని చదివి మర్నాడు తిరిగి ఇచ్చివేయడమూ జరుగుతోంది. గ్రంథాలయాధికారికి సందేహం కలిగింది; ఒక సంపుటాన్ని ఒకే రోజులో చదివి ముగించడం అసాధ్యం – స్వామీజీ నిజంగా చదువుతున్నారా లేక చదువుతున్నట్లు నటిస్తున్నారా? ఒక రోజు తన సందేహాన్ని గురించి ప్రత్యక్షంగా అఖండానందనే అడిగాడు. దీనిని గురించి విన్న స్వామీజీ తిన్నగా గ్రంథాలయాధికారిని కలుసుకొని, తాను కేవలం చదవడం మాత్రమే చేయడం లేదనీ, ఆ సంపుటాలలో నుండి ఏ ప్రశ్ననైనా, ఏ విధంగానైనా తనను అడగమనీ అతడికి చెప్పారు. ఇదే అదను అనుకొని ఆ గ్రంథాలయాధికారి ప్రశ్నల వర్షం కురిపించి స్వామీజీని పరీక్షించారు. ఏమాత్రం తడుముకోకుండా అన్ని ప్రశ్నలకూ సుస్పష్టంగా స్వామీజీ జవాబు లిచ్చారు. ఆ తరువాత ఇదెలా సాధ్యమయిందని స్వామీజీని అఖండానంద అడిగినప్పుడు ఆయన ఇలా జవాబిచ్చారు: “ఏదీ నేను ఒక్కో పదంగా చదవను; ఒక్కో వాక్యంగానూ, కొన్ని సమయాలో పేరాలు పేరాలుగాను చదవడం వలన అమిత వేగంగా చదువగలుగుతాను.”
‘ఏకాంతవాసానికి పోతున్నాను’
భగవదన్వేషణలోనే జీవితం గడపడం అసిధారా వ్రతం లాంటిదని కఠోపనిషత్తు వచిస్తున్నది.* ప్రతి క్షణమూ అప్రమత్తంగా వ్యవహరించకపోతే మార్గం నుండి వైదొలగే ప్రమాదాలు ఈ జీవితంలో కోకొల్లలు. సొంతాలు, బంధాలు అన్నీ పారమార్థిక మార్గంలో ఆటంకాలని ఎంచి వాటిని త్యజించి సన్న్యాసం స్వీకరిస్తాడు మనిషి. కాని అతడి ఎరుక లేకుండానే మిత్రులు, శిష్యులు, సోదర సన్న్యాసులు, మఠం అంటూ క్రొత్త బంధాలు తగిలించుకొంటాడు. ఎంతో అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఈ బంధాలు సైతం ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలుగా పరిణమిస్తాయి. అలాంటి బంధనాల్లో ప్రస్తుతం తాను చిక్కువడుతున్నట్లుగా స్వామీజీకి తోచింది. సోదర సన్న్యాసులతో జపధ్యానాలూ, ఆధ్యాత్మిక సాధనల తోనే రోజులు గడిచాయి. అయినప్పటికీ వారితో కలసి ఉండడం ఆయనకు ఒక అడ్డంకిగానే అనిపించింది. హృషీకేశ్లోనూ, హిమాలయాల్లోనూ తనకు తారస పడ్డ సన్న్యాసులు ఆయన మనస్సులో తళుక్కున మెదిలారు. ఎలాంటి బంధాలూ లేకుండా సర్వస్వతంత్రంగా వారు గడుపుతున్న జీవితాలు స్వామీజీని గాఢమైన చింతనకు లోను చేశాయి. ఒక గట్టి నిర్ణయానికి ఆయన వచ్చారు.
ఒక రోజు అఖండానందను పిలిచి తాను ఏకాంతంలోకి వెళ్ళగోరు తున్నట్లుగా తెలియజేశారు స్వామీజీ. అందుకు అఖండానంద, “మధ్య ప్రాచ్య ప్రాంతాలకు వెళ్ళాలనే నా ఆకాంక్షను ప్రక్కకు పెట్టి నేను ఈ యాత్రలో పాల్గొనడం మీ కోసమే. ఇప్పుడు నన్ను వదలిపెట్టి వెళ్ళిపోతామంటున్నారే!” అన్నాడు ఆవేదనతో. ఆ మాటలు విన్న స్వామీజీ ఇలా అన్నారు: “సోదర సన్న్యా సులే అయినప్పటికీ బంధం బంధమే; ఆధ్యాత్మిక జీవితానికి వారు కూడా అడ్డం కులే. నువ్వే చూడు, టెహ్రీలో నీకు జబ్బు చేసింది. అప్పుడు నేను కూడా సాధన లేవీ అనుష్ఠించలేకపోయాను కదా! సోదర సన్న్యాసి అనే మాయను సైతం అధిగ మించకుంటే తపోమయ జీవితంలో పూర్తిగా మునగలేం. తపోమయ జీవితంలో పూర్తిగా మునిగిపోవాలని నేను తలచినప్పుడల్లా గురుదేవులు ఏదో ఆటంకాలను కల్పిస్తున్నట్లుగా తోస్తున్నది. ఇప్పుడు నేను ఏకాంతంలోకి పోతున్నాను. ఎక్కడికి వెళ్ళేదీ, ఎక్కడ బస చేసేదీ ఎవరికీ చెప్పను.” అందుకు అఖండానంద, “మీరు పాతాళానికి వెళ్ళినప్పటికీ నేను వెదకి తెలుసుకొంటాను” అన్నాడు. అందుకు జవాబుగా స్వామీజీ మౌనంగా నవ్వి ఊరకున్నారు.
చెప్పినట్లుగానే ఎవరికీ చెప్పాపెట్టకుండా ఒక రోజు మీరట్ నుండి స్వామీజీ బయలుదేరి వెళ్లారు. అది జనవరి 1891.