భగవంతుడు లోకాన్ని సృజింపగోరాడు. అందుకోసం తపస్సు చేశాడు. తపశ్శక్తితో లోకాన్ని సృజించాడు….. తపస్సే భగవంతుడు. తపస్సు అనుష్ఠించి ఆయనను పొందుతావుగాక!
– తైత్తిరీయ ఉపనిషత్తు
(2.6.3; 3.2)
శ్రీరామకృష్ణులు జీవిస్తున్నారు! — అస్థుల విషయంలో తలెత్తిన భేదాభిప్రాయాలు — కాశీపూర్‌కు వీడ్కోలు — సురేంద్రుని మహోన్నత ఔదార్యం — నరేంద్రుని ప్రయత్నాలు — వరాహ నగర మఠం : ఒక వర్ణన — మఠ జీవితం — దారిద్ర్యం — దయార్ద్ర హృదయం — అధ్యయనం — వేడుకలూ వినోదాలూ — అత్యున్నత భావభూముల్లో — పెరిగింది సింథీ: ఆంట్పూర్ — విరజా హోమం — సమాజ దృక్పథం — మిషనరీల ప్రయత్నం — రామకృష్ణ ఆరాధన — స్వామీజీ మార్గదర్వకత్వంలో — నిలువ నీరు : బసచేసే సన్న్యాసి
శ్రీరామకృష్ణులు జీవిస్తున్నారు!
శ్రీ రామకృష్ణులు నిష్క్రమించలేదు, తమతోనే జీవిస్తున్నారనే భావన నరేంద్రాదు లలో బాగా పాదుకుపోయింది. దానిని ధ్రువీకరిస్తున్న రీతిలో శ్రీశారదాదేవి అనేక దృశ్యాలను గాంచారు. నరేంద్రుడు కూడా అలాంటి దృశ్యం ఒకటి గాంచాడు. ఒక రోజు రాత్రి ఎనిమిది గంటల సమయం. అతడు, హరీశ్ మాట్లాడుకొంటూ తోటలో పచార్లు చేస్తున్నారు. అప్పుడు వస్త్రం కప్పుకొనివున్న జ్యోతిర్మయ రూపం ఒకటి తమ వైపుగా దాదాపు పది అడుగుల దూరంలో వస్తూవుండడం నరేంద్రుడు చూశాడు. ఆ ఆకృతి గురుదేవులదిలా ఉంది. బహుశా తన భ్రమ ఏమోనని అతడు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు హరీశ్, నరేంద్రుణ్ణి తాకి అతడి చెవిలో అతిమెల్లగా, “అదిగో, అక్కడ జ్యోతిర్మయ రూపంలో వస్తున్నది ఎవరు?” అని అడిగాడు. హరీశ్ కూడా ఆ జ్యోతిర్మయ రూపాన్ని చూశాడు కనుక తనది భ్రమ కాదని రూఢి చేసుకొన్న నరేంద్రుడు, “ఎవరది?” అని బిగ్గరగా అడిగాడు. అతడి కేక విని ఇంట్లో నుండి అందరూ పరుగెత్తుకొంటూ వచ్చారు. అంతలో వారి ముందున్న మల్లెపొదలో ఆ ఆకారం మాయమైపోయింది. లాంతర్లు తెచ్చి వెతికారు. అక్కడ ఎవరూ కనిపించలేదు. కనిపించింది శ్రీరామకృష్ణులేనని అందరూ నమ్మారు.
శ్రీరామకృష్ణులు సజీవులే, తమతోపాటే జీవిస్తున్నారనే ప్రగాఢ విశ్వాసంతో వారందరూ అస్థికలశం ముందు భక్తిప్రపత్తులతో కూర్చుని నిత్యం జపధ్యానా దులు చేయసాగారు. శ్రీరామకృష్ణుల దివ్యమయ జీవితం గురించి ముచ్చటించు కొనేవారు. గృహస్థ శిష్యులు కూడా అప్పుడప్పుడు వచ్చి వారిని కలుసుకోవడం కద్దు.
అస్థుల విషయంలో తలెత్తిన భేదాభిప్రాయాలు
1886 ఆగస్ట్ 31 వ తేదీతో కాశీపూర్ ఉద్యానగృహ బాడుగ గడువు తీరి పోయింది. ఇల్లు ఖాళీచేసి ఇవ్వవలసిన అగత్యం ఏర్పడింది. ఆ యువకులు ఎక్కడకు పోగలరు? వారిలో పలువురు అక్కడే నివసించి శ్రీరామకృష్ణుల అస్థికలను ఆరాధించుకొంటూ తపోమయ జీవితం గడపాలని ఆశించారు. కాని అద్దె ఎవరు చెల్లిస్తారు? బలరాంబోసు, సురేంద్రనాథ్ మిత్ర, గిరీశ్ ఘోష్, ‘మ’ ప్రభృతులు యువ శిష్యులు నివసించడానికి ఒక మఠం ఏర్పాటు చేయవచ్చుననే అభిప్రాయానికి ఆమోదముద్ర వేశారు. కాని రామచంద్రదత్తా, మరి ఒకరిద్దరు ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించి ఆ యువకులతో, “ఈ విధంగా మీరు ఇల్లూవాకిలీ త్యజించి సన్న్యాసులు కావాలని గురుదేవులు చెప్పలేదు. మీ మీ ఇళ్లకు తిరిగి వెళ్లిపోండి. గురుదేవులు చెప్పినట్లు సంసారంలోనే ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని రూపొందించుకోండి. అస్థికలను పూజించే విషయం గురించి మీరు ఆందోళన చెందనక్కరలేదు. కాంకూర్గాచ్ఛిలో నాకు ఒక తోట ఉంది. అక్కడ ఆయన అస్థికలను ప్రతిష్ఠించి నిత్యారాధన చేసేలా ఏర్పాట్లు చేశాను. దానిని గురించి మీరు ఏమాత్రం ఆందోళన చెందనవసరం లేదు” అని చెప్పాడు.
యువకులలో ఎవరూ రామచంద్ర దత్తా యోచనను సమ్మతించలేదు. గంగాతీరంలో ఒక అనువైన స్థలంలో అస్థికలను ప్రతిష్ఠించి నిత్యార్చనకు ఏర్పాట్లు చేయాలని వారు అభిలషించారు. ఇలాంటి భావననే ఒకసారి శ్రీరామకృష్ణులు మునుపు వ్యక్తం చేశారు. కాని ప్రస్తుతం అందుకు మార్గం లేనట్లు కనిపించింది. తక్షణమే ఒక స్థలం ఏర్పాటు చేసుకోవడం కుదరని పని. నెమ్మదిగా ఆ పని చేయవచ్చు. కనుక అస్థులను తమ వద్దే ఉంచుకోవాలని యువకులు భావించారు. ఈ అభిప్రాయభేదం పాకానపడి ఒక సమస్యగా పరిణమించింది. ఇదంతా విన్న మాతృదేవి, “సాటిలేని మహాపురుషుణ్ణి కోల్పోయి నిలబడి ఉన్నాను. వారేమో ఆయన అస్థికల కోసం పోట్లాడుకొంటున్నారు” అన్నారు ఆవేదనతో.
చివరికి నరేంద్రుడు జోక్యం చేసుకొని, “సోదరులారా! మనం ఇలా పోట్లాడుకోవడం సబబు కాదు. పరమహంస శిష్యులు అస్థికల కోసం పోట్లాడు కొంటున్నారని లోకులు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకండి. అంతేకాదు; ఇకపై మనం ఎక్కడ నివసించాలో కూడా నిర్ణయించుకోలేదు. ఇది ఇలావుండగా అస్థి కలను ఎలా పదిలపరచగలం? రాంబాబు తన ఉద్యాన గృహంలో అస్థికలను ప్రతిష్ఠించి, దానిని శ్రీరామకృష్ణుల పేరిటే కదా ఏర్పాటు చేయబోతున్నాడు! మనమూ అక్కడకు వెళదాం, ఆయనను ఆరాధించుకొందాం. గురుదేవులు చూపిన ఆదర్శం ప్రకారం జీవించి చూపితే అది ఈ అస్థికలను పూజించడం కన్నా మహత్తరమయినది” అన్నాడు. నరేంద్రుడు చెప్పిన తరువాత అందరూ అందుకు అంగీకరించారు. ఆగస్ట్ 23 వ తేదీ కృష్ణజయంతి పర్వదినం నాడు అస్థికలను ప్రతిష్ఠించాలని నిర్ణయించారు.
ఈ ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ యువశిష్యులలో ఏదో చెప్పరాని వెలితి ఉండనే ఉంది. చివరికి నరేంద్రుణ్ణి సంప్రతించి యువకులందరూ ఇలా తీర్మానించారు: ఆగస్ట్ 22 వ తేదీ అస్థులలో అధిక భాగం ఎవరికీ తెలియకుండా మరొక కలశంలో మార్చి తమ కోసం ఉంచుకొన్నారు.
కృష్ణ జయంతి రోజు ఉదయం శశి అస్థికల కలశాన్ని తన తల మీద పెట్టుకొని మోసుకు రాగా, అందరూ కాంకూర్గాచ్ఛికి వెళ్లి విధివిహితంగా అక్కడ అస్థులను ప్రతిష్ఠించి పూజలు నిర్వర్తించారు.* కాని యువశిష్యులు అస్థికలు విభజించిన విషయం త్వరలోనే అందరికీ తెలియవచ్చింది. అప్పుడు గృహస్థ భక్తులు, “గురుదేవుల సంకల్పం అదే అయితే, అట్లే జరగనీ” అని చెప్పి మౌనంగా ఉండిపోయారు.
కాశీపూర్‌కు వీడ్కోలు
ఆగస్ట్ నెలాఖారులోగా కాశీపూర్ ఇంటిని ఖాళీ చేసి ఇవ్వాలి. మాతృదేవి ఎక్కడకు వెళతారు? యువకులు ఎక్కడకు పోతారు? ఇంటిని ఖాళీ చేయవద్దని మళ్లీ ఒకసారి గృహస్థ భక్తులకు, యువశిష్యులు విన్నవించారు. “మేం భిక్షాటన చేసి అయినా మాతృదేవిని పోషించు కొంటాం” అని చెప్పి చూశారు. కాని గృహస్థ భక్తులు ఇంటిని ఖాళీచేసి తీరాలని పట్టుబట్టారు. ఆగస్ట్ 21 వ తేదీ మాతృదేవిని బలరాంబోస్ తన ఇంటికి తోడ్కొని వెళ్లాడు. యువకులు తమ కోసం పదిలపరచుకొన్న అస్థికల కలశాన్ని మాతృదేవి తమతో కూడా బలరాంబోసు ఇంటికి తీసుకుపోయి నిత్యం పూజించసాగారు. శ్రీరామకృష్ణులు ఉపయోగించిన వస్తువులను కూడా మాతృదేవి తమతో తీసుకు వెళ్లారు. ఆగస్ట్ 30 వ తేదీ యువభక్తులైన కాళీ, యోగీన్, లాటూలతోను, భక్తు రాండ్రతోను బృందావనం మొదలైన పుణ్యస్థలాల తీర్థయాత్రకు మాతృదేవి బయలుదేరారు.
మరి యువశిష్యులు?
వారు ఎక్కడకు పోగలరు? మాతృదేవితో ఒకరిద్దరు వెళ్లారు. ఒకరిద్దరు ఇంటికి తిరిగి వెళ్లిపోయి తమ చదువులు కొనసాగించారు. నరేంద్రుడు అప్పు డప్పుడు ఇంటికి వెళ్లివచ్చేవాడు. పెద్దగోపాల్, నిరంజన్ ప్రభృతులు ఇల్లు ఉన్నా లేకపోయినా, మఠం ఉన్నా లేకపోయినా సన్న్యాస జీవితం కొనసాగించాలని నిర్ణయించుకొన్నారు. “పాము తనకంటూ నివాసం ఏర్పాటు చేసుకోదు. ఇతర జంతువుల నివాసాలలో నివసిస్తుంది. సన్న్యాసి కూడా అంతే. అతడు ధర్మ సత్రాలు, చావిళ్ళలో జీవితం గడపాలి. మనం కూడా అట్లే చేద్దాం” అన్నాడు నిరంజన్. “ఆగకుండా ప్రవహించే నీటిలా సన్న్యాసి ఒకే చోట ఉండిపోకుండా పయనించాలి” అన్నారు మరొకరు. ఏది ఏమైనప్పటికీ సన్న్యాస జీవితం కొనసాగించాలని వారు గట్టిగా నిర్ణయించుకొన్నారు. కాని ఎక్కడ బస చేయాలి?
సురేంద్రుని మహోన్నత ఔదార్యం
శ్రీరామకృష్ణులు ఏదో ఒక దారి చూపుతారని యువశిష్యులకు అచంచల విశ్వాసం. ఒక కొత్త సందేశంతో అరుదెంచి, దానిని లోకమంతటా ప్రచారం చేయడానికి యువకులకు శిక్షణనిచ్చిన ఆయన అనుగ్రహించకుండా ఉంటారా? లేదు, అనుగ్రహించారు. ఆయన వరదాభయ హస్తాలు యువశిష్యులకు చేయూత నిచ్చాయి.
శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యులలో ముఖ్యమైన వారిలో సురేంద్రనాథ్ మిత్రా ఒకరు. నరేంద్రుడు ఇతడి ఇంట్లోనే ప్రప్రథమంగా శ్రీరామకృష్ణులను దర్శించాడు. అతడు ఒక రోజు కార్యాలయం నుండి తిరిగి వచ్చాక అలవాటు ప్రకారం పడు కొన్నాడు. హఠాత్తుగా “సురేన్” అంటూ ఎవరో పిలవడం వినిపించింది. ఎవరా అని చూడగా శ్రీరామకృష్ణులు – సజీవంగా నిలబడి ఉన్నారు. ప్రశాంతంగా సురేంద్రుణ్ణి చూస్తూ, “నా బిడ్డలు ఇటూ అటూ తిరుగాడుతున్నారు. నువ్వు వారి కోసం ఏమీ చేయవా?” అని అడిగి, మాయమయ్యారు. సురేంద్రుడు తక్షణమే లేచి నరేంద్రుని ఇంటికి పరుగుతీశాడు. అతడితో, “సోదరా! మనం వెంటనే ఒక ఇల్లు బాడుగకు తీసుకొందాం. అక్కడ గురుదేవులకు ఆలయం రూపొందించి, ఆయనను ఆరాధించుకొందాం. మేం భార్యాబిడ్డలంటూ సంసార జీవితంలో కొట్టు మిట్టాడుతూ ప్రశాంతత కోసం అక్కడకు వస్తాం. కాశీపూర్ ఉద్యాన గృహంలో గురుదేవులు నివసించినప్పుడు నేను ప్రతి నెలా ఒక మొత్తం ఇస్తూవచ్చాను. అదే మొత్తాన్ని ఇప్పుడు సంతోషంగా మీకు అందజేస్తాను. అది మీ ఖర్చులకు ఉపయోగపడుతుంది” అని చెప్పాడు. సురేంద్రుని వాగ్దానం విని నరేంద్రుడు ఆనందభరితుడయ్యాడు.
వెంటనే ఇంటి కోసం అన్వేషణ మొదలయింది. వరాహ నగర్లో పది రూపాయల బాడుగకు ఒక పాడుపడిన ఇల్లు కుదిరింది. ఇదే కాలాంతరంలో సన్న్యాసుల నివాస స్థలంగా, సన్న్యాసుల మఠంగా పరిణమించింది. ఈ విధంగా ప్రపంచ మత చరిత్రలో నూతన యుగారంభానికి సురేంద్ర పునాది వేశాడు; చరిత్రలో శాశ్వతస్థానం పొందాడు. సురేంద్రుని గురించి ఉద్వేగభరితంగా ‘మ’ ఈ విధంగా వ్రాస్తున్నారు:
“సురేంద్రా, నువ్వు ధన్యుడవు! మొట్టమొదట ఈ మఠం నీచే స్థాపించ బడింది. దీని స్థాపనకు నీ ఇచ్ఛే కారణం. నిన్ను పరికరంగా చేసుకొని శ్రీరామ కృష్ణుల మూలమంత్రమైన కామినీ కాంచన పరిత్యాగ చిహ్నం అమరింది. పరి శుద్ధాత్ములైన నరేంద్రుడు మొదలైన యువ సన్న్యాసుల ద్వారా అమరమైన హైందవ ధర్మాన్ని జనం ముందు నెలకొల్పారు శ్రీరామకృష్ణులు. సోదరా! నీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోగలరు? ఆ యువ సన్న్యాసులు అనాథల్లా, ‘నువ్వు ఎప్పుడు వస్తావు?’ అని నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ‘నేడు ఇంటి అద్దె చెల్లించినందున డబ్బంతా అయిపోయింది. తినడానికి తిండి లేదు. నువ్వు వస్తే తిండికి ఏర్పాటు చేస్తావు. నువ్వు ఎప్పుడు వస్తావు?’ అని ఎదురుచూస్తున్నారు. నీ అనురాగాన్నీ, దేన్నీ ఎదురుచూడని సేవనూ తలచుకొంటే ఎవరి కళ్ల వెంట అశ్రువులు స్రవించవు!”*
ప్రపంచ ఖ్యాతిగాంచిన రామకృష్ణ మఠం ఈ విధంగా 1886 సెప్టెంబర్/ అక్టోబర్‌లో ప్రారంభించబడింది. మొదట్లో కొన్ని నెలల దాకా సురేంద్ర ప్రతి నెలా 30 రూపాయలు ఇస్తూవచ్చాడు. ఆ తరువాత మఠంలో క్రమంగా ఎక్కువ మంది నివసించసాగినందు వలన ఆ మొత్తాన్ని 60 రూపాయలకు పెంచాడు. పిదప 100 రూపాయలకు పెంచి ఇవ్వసాగాడు. ఇంటి అద్దె నెలకు రూ. 11, వంటవాడికి రూ. 6, ఇక మిగిలింది భోజనాలకు వినియోగించేవారు. చిన్న గోపాల్‌ను మఠంలోనే ఉండమనీ, అతడి కుటుంబ ఖర్చులను తానే భరిస్తాననీ చెప్పాడు సురేంద్ర. చిన్న గోపాల్ ఈ ప్రతిపాదనకు అంగీకరించాడు. చిన్న గోపాల్ ద్వారా ఎప్పటికప్పుడు మఠ పరిస్థితులు తెలుసుకొని తదనుగుణంగా సురేంద్ర సాయం అందిస్తూవచ్చాడు. సురేంద్ర (1890 మే 25), బలరాంబోసు (1890 ఏప్రెల్ 13) మరణానంతరం గిరీశ్ మఠం ఖర్చులను భరించసాగాడు. వరాహ నగర వాస్తవ్యుడైన యోగీంద్రనాథ్ ఛటర్జీ అనే వ్యక్తి కూడా ఎప్పుడైనా మఠంలో ఆహార కొరత వాటిల్లినట్లు తెలియవస్తే తక్షణమే ముందుకొచ్చి సాయం చేసేవాడు.* ఈ రకంగా ప్రారంభకాల తొలినాళ్లలో యువకులకు శక్తివంచన లేకుండా సాయం అందించడం ద్వారా రామకృష్ణ సంఘ చరిత్రలో వారు శాశ్వత కీర్తిని పొంది, తరించారు.
నరేంద్రుని ప్రయత్నాలు
యువ శిష్యులలో కొందరు గురుదేవుల నిర్యాణానంతరం ఇంట్లోనే ఉంటూ చదువు కొనసాగించారు. కాని నరేంద్రుడు వారిని అట్లే వదలిపెట్టలేదు. వరాహ నగర మఠ ప్రారంభానికి ముందే సమయం చిక్కినప్పుడల్లా వెళ్లి వారిని కలుసుకొని సన్న్యాస జీవితం గురించి నొక్కివక్కా ణించేవాడు. “ఈ చదువులన్నీ ఎందుకు? భగవదనుభూతి పొందకపోతే జీవితమే వ్యర్థం. పరీక్షలను త్రోసిరాజనండి, పట్టాలను విదిలించి వేయండి. భగవంతుణ్ణి గ్రహిద్దాం, అనుభూతి పొందుదాం. మరే విధమైన తెలివి తేటల వలనా ఎలాంటి ప్రయోజనమూ లేదు. అంతా అజ్ఞానం, అంతా మూర్ఖత్వం. మన గురుదేవులు మాత్రమే సత్యం” అంటూ వారితో మాట్లాడి, వారి మనస్సులు సన్న్యాస మార్గం నుండి వైదొలగకుండా జాగ్రత్త వహించాడు. రాత్రి పగలని ఎంచక ఎప్పుడు సమయం చిక్కితే అప్పుడు వారి ఇళ్లకు వెళ్లివచ్చేవాడు.
నరేంద్రుడు అలా వెళ్లడం తక్కిన యువకులలోని కొందరు ఇంటివారికి నచ్చలేదు. అతని కారణంగానే తమ కుమారులు చదువుకు స్వస్తి చెబుతున్నారని వారు భావించారు. కనుక నరేంద్రుడు వస్తే అతడికి ఆహ్వానమో, ఆతిథ్యమో ఇచ్చేవారు కారు; కొన్ని సమయాలలో అతడు వస్తున్నప్పుడు తలుపులు కూడా మూసివేయడం కద్దు. శోచనీయం ఏమిటంటే, నరేంద్రుడు తమ ఇంటికి రావడం కొందరు యువకులకే నచ్చలేదు. అతడు రావడం వలన తమ చదువుకు అంత రాయం కలుగుతుందని భావించి, నరేంద్రుడు రాగానే ఏదో ఒక గదిలోకి పోయి తలుపులు బిడాయించుకొనేవారు. కాని నరేంద్రుడు వదలిపెట్టే రకం కాదు. వారు విసుగుచెందో, భయపడో తెరిచే దాకా తలుపులు తడుతూనే ఉండేవాడు. తరు వాత వారితో అక్కడే కూర్చునో లేకపోతే వీథిలో నడుస్తూనో మాట్లాడేవాడు; గురుదేవుల మహత్త్వాన్ని వివరించి చెప్పేవాడు, సన్న్యాస జీవితపు ఔన్నత్యాన్ని గురించి మాట్లాడేవాడు. వ్యతిరేకత, నింద, అవమానాదులను వేటినీ అతడు ఖాతరు చేయలేదు. ఎందుకంటే: గురుదేవులు అప్పగించిన కార్యం ఒక్కటే అతని మనస్సును నింపి ఉంచింది. పేదరికం, న్యాయస్థానం, వ్యాజ్యాలు లాంటి కుటుంబ సమస్యల భారం అణగద్రొక్కిన సమయంలో, ఈ విధంగా పలువురి నిందలను, అవమానాలను భరించీ అతడు అందరినీ సమైక్యపరిచాడని గ్రహించాలి.
చివరికి నరేంద్రుని ప్రేమకూ, ఎడతెగని ప్రయత్నానికీ అందరూ లొంగి పోయారు. 1886 డిసెంబర్లో దాదాపు అందరినీ నరేంద్రుడు సమైక్యపరచగలి గాడు. దీని తరువాతే నిజానికి మఠ జీవితం ప్రారంభమయింది. తాము తిరస్క రించీ, తల్లితండ్రులు తిరస్కరించీ, ప్రతిఘటనలను, అవమానాలను ఖాతరు చేయక తమను ఈ జీవితానికి అంకితం చేసిన నరేంద్రుని పట్ల తక్కిన యువ శిష్యుల హృదయాలలో కృతజ్ఞతాభావం పొంగిపొరలింది; అతణ్ణి అందరూ మనఃస్ఫూర్తిగా తమ నేతగాను, మార్గదర్శిగాను అంగీకరించారు. పలువురు అతణ్ణి గురువుగా గౌరవించారు.
వరాహ నగర మఠం : ఒక వర్ణన
సురేంద్రుడు ప్రతి నెలా రూ. 30 ఇచ్చేవాడు. సుమారు 15 మందికి ఒక నెల ఖర్చులకు సరిపడే మొత్తం అది. అన్న వస్త్రాలు, ఇతర ఖర్చులతోబాటు ఇంటి అద్దె కూడా ఈ మొత్తంలోనే సరిపెట్టుకోవాలి. రూ. 10 కన్నా అద్దె ఎక్కువ ఇచ్చుకోవడం కుదరని పని. ఆ మొత్తంలో ఒక ఇంటిని వెదకాలి. వెతికారు. మనుష్యులు నివసించే స్థితిలో ఉన్న ఏ ఇల్లూ ఆ అద్దెకు లభించలేదు. ఒక పాడుబడ్డ ఇల్లు మాత్రమే లభించింది. దయ్యాలు సంచరించే చోటుగా ఆ ఇంటిని గురించి ఒక వదంతి ప్రచారంలో ఉండడం వలన అది ఖాళీగానే ఉంటూవచ్చింది. “ఫరవా లేదు. ఒక రకంగా మేం కూడా దయ్యాలమే. మమ్మల్ని ఏ దయ్యమూ ఏమీ చేయలేదు” అని ఆ ఇంట్లో తలదాచుకొన్నారు యువశిష్యులు.
అది ఒక మేడ ఇల్లు. పూర్తిగా శిథిలమైపోయి అక్కడక్కడ కూలిపోయి చూడడానికే భయంకరంగా కానవచ్చింది. క్రింది అంతస్తు ఎవరూ నివసించ లేనంతగా కూలిపోయి, చెట్టుచేమలు మొలిచి పొదలమయంగా ఉంది. దాన్లో పాములు, నక్కలు, ఇంకా పలురకాల ప్రాణులు నివసించసాగాయి. చాలా రోజు లుగా నివసిస్తున్న వాటిని ఇబ్బంది పెట్టకూడదని ఈ నూతన యుగ సన్న్యాసులు మేడ భాగం మాత్రం ఉపయోగించుకొన్నారు.
ఇంటి వెనుక వైపు తోట అనే పేరిట పొదలు దట్టంగా పెరిగి ఉన్నాయి. వెనుక ఒక చిన్న కొలను ఉంది. దాన్లోని నీళ్లు పాచిపట్టి దోమల ఉత్పత్తికి స్థావరంగా నిలిచాయి.
మేడ మీద పలు చిన్నాపెద్దా గదులు ఉన్నాయి. వాటిలో చాలావాటికి కిటి కీల, తలుపుల పేరిట కేవలం చట్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దూలాలు చాలాచోట్ల పాడుబడి, వాటికి బదులుగా వెదురు బొంగులు పెట్టబడి ఉన్నాయి.
దక్షిణాగ్రంలో ఉన్న ఒక గదిని ఏకాంతంగా ధ్యానం చేసుకోవడానికి, అధ్య యనం చేయడానికి కేటాయించారు. కాళీ ఈ గదిలోకి వెళ్లి తలుపు మూసుకొని చాలాసేపు గడపడం పరిపాటి. కనుక ఈ గదిని ‘కాళీ తపస్వి గది’ అని పేర్కొనేవారు. దీనికి ఉత్తరం వైపు ఉన్న గదిని పూజామందిరంగా చేసుకొన్నారు. దాని ప్రక్కన గదిని నైవేద్యం తయారుచేసే గదిగా పెట్టుకున్నారు. ఈ గదిలో కూర్చుని హారతి దర్శించవచ్చు. దాదాపు భక్తులందరూ ఇక్కడ నుండే గురుదేవులకు ప్రణమిల్లేవారు. నైవేద్యం తయారుచేసే గదికి ఉత్తరాన ఉన్న గది దానవుల గది.* ఇది విశాలమైన చావడి. మఠ సోదరులు ఇక్కడే సమావేశమయ్యే వారు. భక్తులు, అతిథులు వస్తే వారిని ఈ గదిలోకే ఆహ్వానించేవారు. ఈ గది ప్రక్కన ఉత్తరం వైపున ఉన్న చిన్నగదిలో భక్తులు భుజించేవారు. ఆహ్వానితుల గదికి తూర్పున ఒక వసారా ఉంది. ఉత్సవ దినాలలో భక్తులు ఈ వసారాలోనే కూర్చుని భుజించేవారు. వసారాకు ఉత్తరం వైపు వంటగది ఉంది. నరేంద్రుడు, తక్కిన సోదరులు కొన్ని సమయాలలో సాయంత్రంపూట డాబా మీదికి వెళ్లేవారు. అక్కడ కూర్చుని శ్రీరామకృష్ణుల ఉపదేశాలు, శంకర, రామానుజ, ఏసుక్రీస్తు, మన దేశ, పాశ్చాత్య తత్త్వాలను, వేదం, పురాణం, తంత్రం మొదలైన వాటి గురించి ముచ్చటించుకొని ఆనందించేవారు.
మఠ జీవితం
ప్రప్రథమంగా మఠానికి వచ్చి నిరంతరంగా నివసించింది పెద్దగోపాల్. శరత్ కొన్ని రోజులు బసచేశాడు. శశి, బాబూరాం, నిరంజన్, కాళీలు అవకాశం చిక్కినప్పుడల్లా వచ్చిపోసాగారు. బృందావనం నుండి తిరిగివచ్చిన తారక్ నిరంతరంగా మఠంలో నివసించ సాగాడు. 1887 జూన్ నుండి నరేంద్రుడు మఠంలో నిరంతరంగా ఉండిపో సాగాడు. ఆ రోజుల్లో నరేంద్రుని కుటుంబ సభ్యులు తమ సొంత ఇంట్లో నివసించలేదు. కుటుంబ వివాద కారణంగా, ఆతడి తండ్రి జీవించి ఉన్నప్పుడే అద్దె ఇంట్లో నివసిస్తూ వచ్చారు. నరేంద్రుడు మఠంలో బసచేయ నారంభించి నప్పటి నుండి భువనేశ్వరీదేవి తమ తల్లిగారి ఇంట్లో నివసించసాగింది. నరేంద్రుని తమ్ముడయిన మహేంద్రుడు అప్పుడప్పుడు మఠానికి వచ్చేవాడు. కొన్ని సందర్భాలలో ఒకటి రెండు రోజులు మఠంలోనే బసచేసేవాడు కూడా.
గృహస్థ భక్తులు తరచు మఠానికి వచ్చి వారితో ముచ్చటించి ఆనందం పొందేవారు. వారితోపాటు ధ్యానం, శాస్త్రాధ్యయనాదులలో గంటల పర్యంతం, కొన్ని సమయాలలో కొన్ని రోజులు కూడా గడపడం కద్దు. అట్టి వారిలో ఒకరైన ‘మ’ వరాహ నగర మఠ తపోమయ జీవితం గురించి ఇలా వ్రాస్తున్నారు:
“వరాహ నగర మఠంలో* ఈ యువ సన్న్యాసులు గడపిన కఠోర ఆధ్యా త్మిక జీవితం గురించి ఏం చెప్పాలి! బాహ్య ప్రపంచం నుండి నిష్క్రమించినశ్రీరామకృష్ణులను తన హృదయాంతరాళంలో ఆవాహనం చేయాలనే ఉద్విగ్నతలో వారు మునిగివున్నారు. అప్పుడప్పుడు వారు గాంచిన దివ్యదర్శనాలు ఎంతటి దారిద్ర్యాన్ని, ఆవేదనను, బహిష్కరణను, ఎకసెక్కాలను లెక్కించక పదే పదే ప్రయత్నించే స్థితికి వారిని పిచ్చివారిని చేసినవి. బాహ్యచైతన్యరహితులై భక్తి గీతాలను ఆలపించడంలో, నృత్యం చేయడంలో రుచి గలిగినవారై అహర్నిశలూ ప్రార్థనలలోను, ధ్యానంలోను, శాస్త్రాధ్యయనంలోను ఆసక్తిపరులై వారు విరాజిల్లారు. భగవద్దర్శనమే వారి జీవిత ఏకైక లక్ష్యంగా మారింది. వేదపురాణ తంత్ర గ్రంథాలలో పేర్కొన్న సన్న్యాస జీవిత నియమాలు తు.చ. తప్పక మనఃస్ఫూర్తిగా పాటించసాగారు. పగటి వేళ మఠంలోను, చెట్టు క్రింద; అర్ధరాత్రి వేళ సమీపంలోని శ్మశానంలోను, గంగాతీరంలోను ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిం చారు; తపస్సు ఆచరించారు. శ్రీరామకృష్ణులు అనుష్ఠించి చూపిన అనుపమాన తపస్యాదుల గురించి జ్ఞాపకం వారి తపోగ్నిని ప్రజ్జ్వలనం చేసింది. ధ్యానం కొనసాగించడానికై ఆ యువకులు పస్తులు వుండి చావడానికైనా సిద్ధమైనారు.”
ఆ రోజుల గురించి కాలాంతరంలో స్వామి వివేకానంద ఇలా చెప్పారు:
“శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం మేం వరాహ నగర మఠంలో ఎన్నో పారమార్థిక సాధనలు చేశాము. వేకువజామున మూడు గంటలకే లేచే వాళ్లం. దంతధావనం మొదలైన కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి కొందరు, చేయ కుండా కొందరు – ప్రార్థనా మందిరంలో చేరి జపధ్యానాలలో మునిగిపోయే వాళ్లం. ఆహా! ఆ రోజుల్లో ఎటువంటి వైరాగ్యం ఉన్నదో! ప్రపంచం ఉందా లేదా అనే ధ్యాసే మాకు ఉండేది కాదు. ఇంట్లో గృహిణి ఏ ప్రకారంగా ఉంటుందో ఆ ప్రకారంగా శశి (స్వామి రామకృష్ణానంద) రాత్రింబవళ్లు శ్రీరామకృష్ణుల సేవ, అర్చన మొదలైన కార్యాలలో నిమగ్నుడై ఉండేవాడు. శ్రీరామకృష్ణుల పూజకు, మా భోజనానికి కావలసిన వాటి నన్నిటిని అతడే చాలావరకు బిచ్చమెత్తి తెచ్చే వాడు….. ఉదయం నుండి సాయంత్రం నాలుగు, ఐదు గంటల దాకా జప ధ్యానాలు సాగిన రోజులున్నాయి…… ఆహా! ఏం అద్భుతమైన రోజు లవి. మే మా రోజుల్లో గడిపిన జీవిత విధానాన్ని చూసి భూతాలే భయపడేవి అంటే, ఇక మనుష్యుల మాట చెప్పాలా!”*
నరేంద్రునికి సంబంధించినంతవరకు అతడు ఇరవై నాలుగు గంటలూ పనిచేశాడనే చెప్పుకోవాలి. ఆవేశంతో అతడు పనిచేసినట్లు కనిపించేది. వేకువనేనిద్ర లేచేవాడు. పిదప, “లేవండి, లేవండి! దివ్యామృతాన్ని గ్రోలబోయే మీ రందరూ లేవండి!” అంటూ అందరినీ నిద్ర నుండి లేపేవాడు. తరువాత అందరూ ధ్యానంలో కూర్చునేవారు. భజన, చర్చాదులలో మధ్యాహ్నం దాకా గడిపేవారు. శశి అంతలో వంట, పూజ మొదలైనవి పూర్తిచేసి వారిని భోజనానికి పిలిచేవాడు. ఆ తరువాత కూడా చర్చలు, భజన కొనసాగేవి. సాయంత్రం హారతి. కొన్ని సమయాలలో ఉదయం ప్రారంభమైన భజన భోజనం, విశ్రాంతి ఏదీ లేకుండా రాత్రి దాకా కొనసాగిన రోజులు కూడా లేకపోలేదు. కొన్ని సందర్భాలలో డాబా మీద కూర్చుని అందరూ కలిసి రాత్రి బాగా ప్రొద్దుపోయే దాకా రామనామ జపం చేసేవారు.
నరేంద్రుని ధ్యానమయ జీవితం తీవ్రతరమయింది. “అతడు రాత్రి తొమ్మిది గంటలకు కూర్చుని ఉదయం 5 గంటల వరకు అట్లే ధ్యానంలో మగ్నుడై ఉండేవాడు. ఆ తరువాత లేచి స్నానానికి వెళ్లేవాడు. ఒక కంబళి కప్పినట్లుగా అసంఖ్యాకంగా దోమలు ఆతడి శరీరం మీద వ్రాలి ఉండేవి. ఆ ధ్యాసే అతడికి ఉండేది కాదు. మహాశివుడు ధ్యానమగ్నుడైనట్లుగా అతడు కూడా ధ్యానంలో లయించిపోయేవాడు. ఇంద్రియాలు, మనస్సు పూర్తిగా అతడి అధీనంలో ఉండేవి. పరిపూర్ణ సమతాస్థితిలో ఉండేవాడు అతడు. ఇది సత్త్వగుణ లక్షణం. ఇది విన్న విషయం కాదు, నేను ఆతడి ప్రక్కనే ఉండి ప్రత్యక్షంగా చూసిన విషయం” అని కాలాంతరంలో హరి (స్వామి తురీయానంద) చెప్పాడు.
దారిద్ర్యం
సమాజ వ్యతిరిక్తత లేదా బహిష్కరణ, కుటుంబ సభ్యుల బలవంతాలతో ఆ యువ సన్న్యాసుల బాహ్య జీవితం సాగింది. అంతరంగ జీవితమో జపం, ధ్యానం, శాస్త్రాధ్యయనాదులతో భగవన్మార్గంలో సాగింది. దారిద్ర్యం వారితో నిరంతర మిత్రత్వం చేసింది. సురేంద్రుడు ప్రతి నెలా అధికతమంగా రూ. 100 ఇస్తూవచ్చాడు. బలరాం, ‘మ’, మరి కొందరు అప్పుడప్పుడు సహాయం అందించేవారు. కాని దాదాపు 15 మందికి అన్న వస్త్రాలు, అద్దె, ఇతర ఖర్చులకు ఈ మొత్తం సరిపోయేది కాదు. దానిని గురించి స్వామి వివేకానంద ఇలా చెప్పారు:
“డబ్బు లేని కారణంగా కొన్నిసార్లు మఠాన్ని మూసివేద్దామనుకొన్నాను. కాని శశిని అందుకు ఒప్పించలేకపోయాను. అతడే ఈ మఠానికి మూలస్తంభం. మఠంలో అన్నం మెతుకులైనా లేని రోజులు ఉన్నాయి. భిక్షాటన వలన అన్నం లభిస్తే, ఉప్పు ఉండేది కాదు. కొన్ని రోజులు కేవలం అన్నం, ఉప్పు మాత్రమే ఉండేవి. కాని ఎవ్వరూ ఏమాత్రం లక్ష్యపెట్టలేదు…… ఒక్కోసారి నెల పొడవునా అన్నం, ఉప్పు, ఉడికించిన దొండాకుకూర మాత్రమే మా భోజనం….. శశి భోజనం సిద్ధం చేసి మా కోసం వేచి ఉండి, చివరికి జపధ్యానాల నుండి బల వంతాన మమ్మల్ని ఇవతలకు లాగేవాడు. ఆతడి ప్రేమ ఎంత అద్భుతమయింది.”*
దుస్తుల విషయంలోనూ అంతే. అందరికీ ఉమ్మడిగా ఒక పంచె, ఒక తువ్వాలు మాత్రమే ఉన్నాయి. బయటికి వెళ్లేవారు వాటిని ధరించాలి. ఇకపోతే ఒక కౌపీనం, ఒక తువ్వాలు మాత్రమే వారి దుస్తులు.
దయార్ద్ర హృదయం
ఇంటి సమస్యలు ఒక వంక, మఠ దారిద్ర్యం మరో వంక ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ నరేంద్రుని దయార్ద్ర హృదయం సదా పరుల కోసం తపించి పోయేది. ఒక రోజు అతడు బలరాంబోసు ఇంట్లో కూర్చుని ఉన్నాడు. నీతిమాలిన జీవితం గడుపుతున్నాడని పలువురిచే వెలివేయబడిన మిత్రుడొకడు నరేంద్రుణ్ణి చూడడానికి అక్కడకు రావడం తటస్థించింది. మాటల మధ్యలో వంగవాసి పత్రికకూ, తారకేశ్వర శివాలయ నిర్వాహకునికీ మధ్య ఉన్నత న్యాయస్థానంలో జరుగుతున్న వ్యాజ్యెం గురించిన ప్రస్తావన వచ్చింది. దానిని గురించిన వార్త నాటి వార్తాపత్రికలలో వెలువడింది. ఆ వ్యాజ్యెపు పోకడనూ, వాదోపవాదాలనూ ఎరిగివున్న నరేంద్రుడు వాటిని పరిహ సిస్తూ, “నేను కనుక ఆ ఆలయ నిర్వాహకుని న్యాయవాదినైతే ఇలా ఇలా వాదించే వాణ్ణి” అంటూ విభిన్న వాదాలను తెలియజెప్పాడు. అమిత ఆశ్చర్యానికి లోనైన మిత్రుడు ఆ వాదన లన్నింటినీ తు.చ. తప్పక వ్రాసుకొన్నాడు.
పిదప తిన్నగా ఆలయ నిర్వాహకుని వద్దకు పోయి ఆ వాదాల నన్నింటిని తెలిపి, సన్మానంగా రూ. 250/– పారితోషికం కూడా పుచ్చుకొన్నాడు. మర్నాడు అతడు ఈ విషయం చెప్పినప్పుడు నరేంద్రుడు నవ్వాడు. దీనిని గురించి విన్న శరత్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. అందుకు నరేంద్రుడు, “పోనీలే! అతడు దారిద్ర్యంలో జీవిస్తున్నాడు. అతడికి ఎలాంటి సహాయమూ నేను చేయలేను. ఈ విధంగానైనా అతడికి ఒక పూట తిండికైనా ఏర్పాటు జరిగి నందుకు నాకు సంతృప్తిగా ఉంది” అన్నాడు. నరేంద్రునిది అంతటి దయార్ద్ర హృదయం.
అధ్యయనం
ఆధ్యాత్మిక జీవితంలో అధ్యయనానికి అమిత ముఖ్యత్వం ఉంది. సదా భగ వంతుని చింతనలోనే మనసును లగ్నం చేయలేనప్పుడు, మనస్సు నిమ్న స్థితులకు దిగజారిపోకుండా పరిరక్షించడానికి అధ్యయనం ఉపయోగ పడుతుంది. నిజమైన జ్ఞానపిపాస గలవారు మనస్సు నిమ్నస్థితులకు దిగజారడం నుండి తప్పించుకొంటారు. కనుక అధ్యయనాన్ని ఒక తపస్సుగా పరిగణించారు మన పూర్వులు. “నేర్చుకోవడమూ, నేర్పించడమూ ప్రధానం. అదే తపస్సు, అదే తపస్సు”* అంటున్నాడు నాక మౌద్గల్యుడనే ఋషి సత్తముడు.
నూతన సమాజాన్ని రూపొందింప వచ్చిన ఈ కొత్త సన్న్యాసులు దీన్లో ఒక నూతనత్వాన్ని ప్రవేశింపజేశారు. సాధారణంగా వేదాలు, ఉపనిషత్తులు, గీతలాంటధార్మిక గ్రంథాలు మాత్రమే సన్న్యాసుల స్వాధ్యాయంలో చోటుచేసుకొంటాయి. కాని వరాహ నగర మఠ సన్న్యాసులు ఇతర గ్రంథాలను కూడా అధ్యయనం చేశారు. “సమాజ కర్తవ్యాలకు ప్రాధాన్యం కల్పించి భారతదేశ చరిత్రలో ఉద్భవించిన ప్రప్రథమ సాధువుల సంఘం” అని రామకృష్ణ సన్న్యాస సంఘం గురించి అభివర్ణించింది సోదరి నివేదిత. సమాజం నుండి వైదొలగకుండా, దానితోనే తాము పెనవేసుకొని జీవించాలి కాబట్టి వారు సామాజిక సంబంధిత తక్కిన గ్రంథాలనూ అధ్యయనం చేశారు. మార్క్‌ట్వయిన్ గ్రంథాలను, The Innocents At Home, The Innocents Abroad లాంటి గ్రంథాలను ఇష్టపడి చదివాడు శశి. కొన్ని సమయాలలో అతడు తనకు ఎంతో నచ్చిన గణిత పాఠ్య పుస్తకాన్ని తీసుకొని బీజగణిత సమస్యలను పరిష్కరించడం కద్దు.
జ్ఞాన నిధిగా విరాజిల్లిన నరేంద్రుడు ఆ యువ సన్న్యాసులకు తత్త్వం, మతం, చరిత్ర, సాంఘిక చరిత్ర, సాహిత్యం, కళ, విజ్ఞానం మొదలైన తరగతులు నిర్వహించాడు. సామాన్యంగా అతడు ఉపన్యాస ధోరణిలో తరగతులు నిర్వహించే వాడు; అంటే అటూ ఇటూ పచార్లు చేస్తూ మాట్లాడేవాడన్నమాట. కొన్ని సందర్భా లలో తోటలోని బిల్వవృక్షం నీడన తరగతులు నిర్వహించడం కద్దు. భారతీయ తత్త్వ, పాశ్చాత్య తత్త్వ, బౌద్ధ తాత్త్విక చింతనలు ఈ తరగతులలో చోటుచేసు కొన్నాయి. శరత్‌కు అతడు సంగీతం నేర్పించాడు. కాళీకి పఖ్వాజ్ వాయించడం నేర్పించాడు. అప్పుడప్పుడు అందరూ కలిసి భజనలు చేసేవారు. కొన్ని సమయా లలో బలరాం బోస్, గిరీశ్, రామచంద్రదత్తా ప్రభృతుల ఇళ్లకు వెళ్లి అక్కడ భజ నలు చేయడమూ కద్దు.
వేడుకలూ వినోదాలూ
ఇంతటి కఠోరమయ జీవితంలో కూడా ఆ యువకులు తమ వేడుకలూ వినోదాలను వదలిపెట్టలేదు. ఒక రోజు నరేంద్రుడు శ్రీరామకృష్ణుల సమాధి స్థితిని అభినయించి చూపాడు. ఒక రసగుల్లాను నోట్లో ఉంచుకొని నిశ్చలంగా నిలబడ్డాడు. కళ్లు మిణకరించ లేదు. ఒక ‘భక్తుడు’ అతడు పడిపోకుండా ఆసరాగా పట్టుకొన్నాడు. కాసేపటి తరువాత నరేంద్రుడు రసగుల్లాను నోట్లో ఉంచుకొనే కళ్లు తెరచి శ్రీరామకృష్ణులు చెప్పే విధంగా, “నేను బాగానే ఉన్నాను” అన్నాడు. అందరూ బిగ్గరగా నవ్వారు.
మరో రోజు ఒక సోదరుడు పడుకొని, భగవద్దర్శనం కలుగనందున జనిం చిన పట్టరాని దుఃఖంతో భరించలేనట్లుగా, “అయ్యో, ఒక కత్తిని ఇవ్వండి. ఇక జీవించడంలో ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఇక దీనిని భరించలేను” అన్నాడు. వెంటనే నరేంద్రుడు గంభీరంగా, “ఇదిగో, నీ ప్రక్కనే కత్తి ఉంది! పుచ్చుకొని పొడుచుకో” అన్నాడు. అందరూ పగలబడి నవ్వారు.
అత్యున్నత భావభూముల్లో
మఠ నిర్వహణ, కుటుంబ సమస్యలు ఏవీ నరేంద్రుని ఆధ్యాత్మిక అత్యున్నత భావభూములను చలింపజేయలేదు. ఆతడి మనస్సు సదా అత్యున్నత భావ భూముల్లోనే సంచరించసాగింది. ఒక రోజు సాయంత్రం 4 గంటలు అయ్యుండవచ్చు. ఆ రోజు నరేంద్రుణ్ణి చూడడానికి ఆతడి సోదరుడైన మహేంద్రుడు మఠానికి వచ్చాడు. మెట్లెక్కి మేడ మీది వసారాలోకి వచ్చినప్పుడు అక్కడ నరేంద్రుడు పచార్లు చేస్తూ కనిపిం చాడు. పచార్లు చేస్తున్నాడో లేక ఎవరైనా ఆతణ్ణి నడిపిస్తున్నారో తెలియరాలేదు. అలాంటి స్థితిలో ఆతడున్నాడు – నిశ్చలమైన కళ్లు, ఊర్ధ్వముఖమైన దృష్టి, శారీరకస్మృతిలేని ఆకృతి, దివ్య తేజస్సుతో ప్రకాశించే ముఖాకృతి! చెరిగిపోని పరమ ప్రశాంతత ఆ ప్రాంతమంతా ఆవరించి ఉంది.
మహేంద్రుడు చాలాసార్లు నరేంద్రుణ్ణి పిలిచాడు, స్పందన లేదు. అతడు నడుస్తూ తన ప్రక్కకు వచ్చినప్పుడు బిగ్గరగా పిలిచి చూశాడు. అయినప్పటికీ నరేంద్రుని నుండి ఎలాంటి జవాబు లేదు. మహేంద్రునికి భయం వేసింది. వెను కకు కాస్త దూరం వెళ్లగా అక్కడ రాఖాల్, శరత్ ప్రభృతులు ఏమీ పాలుబోక నిల బడి కనిపించారు. “మధ్యాహ్నం ఒకటిన్నర నుండి ఇలాగే ఉన్నాడు. అతణ్ణి ఈ స్థితిలో మేం ఎన్నడూ చూసింది లేదు. కొన్ని రోజులు జపధ్యానాదులలో బాగా లయించిపోయి ఉన్నాడు. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అంటూ బాగా లోతైన విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చింతనలో ఆతడి మనస్సు అత్యున్నత స్థితులలో నెలకొని ఉన్నది. నువ్వు ప్రయత్నించి అతడి మనస్సును సామాన్య స్థితికి తీసుకురాగలవేమో చూడు. ఇలా అత్యున్నత స్థితులలో మనస్సు నెలకొనే దశలో శరీరం రాలిపోతుందని గురుదేవులు చెప్పేవారు. మా అందరికీ ఎంతో ఆందోళనగా ఉంది” అని వారు మహేంద్రునితో చెప్పాడు.
చీకటి పడసాగింది. మహేంద్రుడు నరేంద్రుని ప్రక్కకు వెళ్లి బిగ్గరగా అతణ్ణిపేరుపెట్టి పిలువసాగాడు. ఫలితం శూన్యం. కాళ్లు యాంత్రికంగా నడుస్తూనేఉన్నాయి; చూపు ఎక్కడో చూస్తూన్నట్లుగా ఉంది. అతడు మామూలు స్థితికి వచ్చేసూచనలు ఏమీ కనిపించడం లేదు. మహేంద్రుడు కూడా ఎడతెగక బిగ్గరగాపిలవడమేగాక, తిట్టడం కూడా ప్రారంభించాడు. అలా ఏడెనిమిది నిమిషాలుగడిచిపోయాయి. ఆ తరువాత నరేంద్రుడు క్రమక్రమంగా సాధారణ స్థితిలోకి రాసాగాడు. అనంత జ్యోతిర్మయ లోకాన్ని తిలకించిన ఆతడి నేత్రాలు వెలుగు చీకట్లు మారిమారి వచ్చే ఈ లోకాన్ని ప్రప్రథమంగా చూస్తూన్నట్లుగా అనిపిం చాయి. నూతన లోకాన్ని చూస్తూన్నట్లుగా ఆతడి కళ్లు దేనినీ నిలకడగా చూడలేక పోతున్నాయి. చివరకు అస్పష్ట స్వరంలో, “ఏమిటిది, ఏమిటిది” అనే మాటలు ఆతడి నోటి నుండి వెలువడ్డాయి. చాలాసేపు గడచిన తరువాతే అతడు పూర్తి బాహ్యస్మృతిలోకి రాగలిగాడు.
పెరిగింది సింథీ: ఆంట్పూర్
ఆధ్యాత్మిక సాధనలు, అనుభవాలు, అధ్యయనం, వేడుకలూ వినోదాలతో గడచిపోతున్న యువశిష్యుల జీవితంలో ఒక ముఖ్య సంఘటన జరిగింది. యువ శిష్యులలో ఒకడైన బాబూరాం తల్లియైన మాతంగినీ దేవి శ్రీరామకృష్ణుల శిష్యురాలు. ఆయన శిష్యుల పట్ల కూడా ఆమెకు ఎనలేని ప్రేమాభిమానాలున్నాయి. డిసెంబర్ నెలలో ఒక రోజు వారిని ఆమె తమ ఇంటికి ఆహ్వానించింది. ఆమె ఇల్లు కలకత్తాకు దాదాపు 24 మైళ్ల దూరంలోని ఆంట్పూర్ అనే గ్రామంలో ఉంది. ఆమె ఆహ్వా నాన్ని పురస్కరించుకొని ఆంట్పూర్కు నరేంద్రుడు, బాబూరాం, శరత్, శశి, తారక్, కాళీ, నిరంజన్, గంగాధర్, శారదా వెళ్లారు. అక్కడ కూడా వారి సాధనా మయ జీవితం కొనసాగింది. కొన్ని రోజుల తరువాత రాఖాల్ కూడా వారిని చేరుకొన్నాడు.
ఒక రోజు రాత్రి ధుని రగిల్చి అందరూ దాని చుట్టూ కూర్చుని ప్రగాఢ ధ్యానంలో మగ్నులయ్యారు. అగ్ని జ్వాలలు పైపైకి లేస్తూవుండగా వారందరి మనస్సులలో త్యాగాగ్ని తీవ్రతరమై ప్రజ్జ్వలించసాగింది. ఏదో ఆవేశం ఆవహించి నట్లు నరేంద్రుడు సన్న్యాస మహత్త్వాన్ని గురించి ఉద్ఘాటించసాగాడు. ఏసు క్రీస్తును గురించీ మాట్లాడాడు. ఆయన శిష్యులు ఎలా ఆయన సందేశాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేశారో, అదే విధంగా తమ జీవితాలను కూడా అంకితం చేయాలని ఉద్వేగభరితంగా ప్రసంగించాడు. అసాధారణమయిన ప్రశాం తత వారిలో నెలకొంది. అందరూ చాలాసేపు ధ్యానం చేశారు. శ్రీరామకృష్ణులు వారి హృదయాలలో వెలిగించిన సన్న్యాస జ్యోతి నాడు జాజ్వల్యమానంగా వెలుగసాగింది. ఆ తరువాతే నాడు క్రిస్మస్కు ముందటి రోజనే సంగతి [ 1886 డిసెంబర్ 24 వ తేదీ] వారికి జ్ఞాపకం వచ్చింది. “గురుదేవులు మమ్మల్ని సన్న్యాసు లుగా రూపొందించారు. కాని ఒక వ్యవస్థీకృత సంఘంగా మేము వ్యవహరించా లన్న భావన నిజానికి మాకు ఆంట్పూర్లోనే బలపడింది” అని కాలాంతరంలో తారక్ (స్వామి శివానంద) చెప్పారు. ఒక వారం రోజులు ఆంట్పూర్లో గడిపి అందరూ కలకత్తాకు తిరిగివచ్చారు.
విరజా హోమం
ఆ యువకులు ఆంతరికంగా సన్న్యాసులుగానే వ్యవహరిస్తున్నారు. శ్రీరామ కృష్ణులు వారిలో కొందరికి కాషాయాంబరాలు ఇవ్వనే ఇచ్చారు. అయినప్పటికీ బాహ్యంగా కూడా పరిపూర్ణ సన్న్యాసులుగా ఉండగోరాడు నరేంద్రుడు. విరజాహోమమనే క్రతువును నిర్వహించి, ఆ హోమకుండం ముందు కొన్ని ప్రతిజ్ఞలు తీసుకొన్నప్పుడే ఒక వ్యక్తి పరిపూర్ణ సన్న్యాసిగా పరిగణింపబడతాడు. కనుక నరేంద్రుడు విరజాహోమం చేయ గోరాడు. ఆ హోమ మంత్రాలు తనకు తెలుసునని కాళీ చెప్పినప్పుడు నరేంద్రుడు పరమానందభరితుడయ్యాడు.
1887 జనవరి మూడవ వారంలో ఒక రోజు ఉదయం అందరూ గంగా నదిలో స్నానం చేసి పూజామందిరంలోకి వెళ్లారు. యథాప్రకారం శ్రీరామకృష్ణు లకు శశి పూజచేశాక అందరూ శ్రీరామకృష్ణులను ఆరాధించారు. ఆ తరువాత విరజాహోమం మొదలయింది. కాళీ మంత్రాలు పఠించాడు. ముందుగా నరేం ద్రుడు ఆ తరువాత రాఖాల్, బాబూరాం, నిరంజన్, శరత్, శశి, శారదా ప్రభృ తులు చివరన కాళీ ఆహుతు లర్పించారు. ఈ విధంగా శ్రీరామకృష్ణుల యువ శిష్యులు నరేంద్రుని నేతృత్వంలో సన్న్యాసులయ్యారు. నరేంద్రుడు వారికి సన్న్యాస నామధేయాలు ఇచ్చాడు. రామకృష్ణానంద నామధేయాన్ని తాను స్వీకరించగోరాడు నరేంద్రుడు. కాని శశి భక్తి కారణంగా ఆతడికి ఆ పేరును ఇచ్చాడు; తను వివిధిషానంద నామధేయాన్ని స్వీకరించాడు.*
నరేంద్రుడు వివిధిషానంద నామధేయాన్ని స్వీకరించినప్పటికీ, ఆ పేరిట అప్పుడు ఆయన చలామణి కాలేదు. న్యాయస్థానంలో కుటుంబానికి సంబంధిం చిన వ్యాజ్యెం ఒకటి కొనసాగుతూన్నది. ఆ పరిస్థితిలో పేరు మార్పిడో, సన్న్యాసం స్వీకరించడమో వ్యాజ్యెంలో తనకు అసాఫల్యాన్ని వాటిల్లజేయవచ్చునని అతడు భావించాడు. ఆయన ‘స్వామీజీ’ అనే నామధేయంతో నాటి నుండి పేర్కొన బడ్డారు. ఇక నుండి మనమూ ఆయనను అలాగే పేర్కొందాం.
సమాజ దృక్పథం
శ్రీరామకృష్ణులు స్థాపించనున్న ఒక నూతన యుగ ఉషోదయాభిముఖంగా ఈ యువశిష్యులు ముందడుగు వేస్తూవుంటే, సమాజం వారిని అంగీకరించడానికి సంకోచించింది. “నరేంద్రునికి పిచ్చిపట్టింది. ఏం మాట్లాడు తున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఏదీ అర్థం కావడం లేదు. శంకరాచార్యులను అధ్యయనం చేస్తున్నారట, ఉపనిషత్తులు, పంచదశీ కంఠస్థం చేస్తున్నారట! తలాతోకా లేదు” అంటూ పలువురు వ్యాఖ్యానం చేయసాగారు. ఆ యువకులను ఎరుగనివారు మాత్రమే కాదు, ఎరిగినవారు, పరిచయస్థులు సైతం ఆ విధంగానే భావించారు. కనుక వారికి సాయం చేయడమో, వారిని అంగీకరించడమో అనే మాటకే చోటులేకపోయింది.
సమాజం అలా ప్రవర్తించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నాటి వంగదేశంలో సన్న్యాసులో, మఠాలో చాలా అరుదు. ఉత్తర భారతదేశం నుండి వచ్చే సన్న్యాసులే అక్కడక్కడ తారసపడేవారు. వారు కౌపీనం మాత్రం ధరించి, జటాధారులై, స్నానం మొదలైన బాహ్య పారిశుద్ధ్యాన్ని అంతగా పట్టించుకోకుండా జీవించే వారు. వారికంటూ నిరంతరమైన చోటు ఉండేది కాదు. భిక్షాన్నం తింటూ ఏదో చెట్టు క్రింద కాలం వెళ్లబుచ్చేవారు. వారికి కాస్త అన్నం పెట్టడాన్ని ప్రజలు పెద్ద విషయంగా ఎంచలేదు. అయినప్పటికీ వారిపట్ల సామాన్యంగా ఎవరూ పెద్దగా మర్యాద మన్నన చూపేవారు కారు.
మరొక వర్గ సన్న్యాసులు వంగదేశంలో కనిపించేవారు. వారు ‘వైరాగి’ అని పేర్కొనబడే వైష్ణవ సాధువులు. వీరు ఏక్తార అనే ఏకతంత్రీ వాద్యం మీటు కొంటూ రాధాకృష్ణుల ప్రేమ గురించి వంగభాషలో గీతాలు గానం చేస్తూ భిక్షా టన చేసేవారు. ఆ పాటల కోసం వీరిని ప్రజలు సామాన్యంగా ఆదరించినప్పటికీ వీరిని ఆధ్యాత్మికవాదులుగా పరిగణించేవారు కారు.
రామకృష్ణ సాధువులు ఈ రెండు కోవలకూ చెందనివారు. వీరు మంచి విద్యావంతులు, ఆధునిక విద్య నభ్యసించినవారు. అందరూ కలసికట్టుగా ఒకే చోట నివసించారు. వీరిలో పలువురు శ్రీమంతుల కుటుంబాలలో జన్మించారు. కాని ఇంటిని వదలిపెట్టి ‘దయ్యాల కొంప’ అని పేర్కొనబడే ఒక పాడుబడ్డ ఇంట్లో జీవిస్తున్నారు. రాత్రుళ్లు నిద్రకు స్వస్తిచెప్పి ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తు న్నారు. శుభ్రమైన వస్త్రాలు ధరిస్తున్నారు. ఇవన్నీ నాటి సమాజంలో వింతగా కనిపించాయి. వారి లక్ష్యాన్నో, ఆసక్తినో సమాజం అవగతం చేసుకొన్నట్లుగా తెలి యడం లేదు. సందేహ దృష్టితోనే వారిని నాటి వంగదేశ సమాజం చూసిందని చెప్పడం సబబు.
సరళ హృదయులైన మహిళామ తల్లులు ఆ యువకుల పట్ల సానుభూతి కనబరచారు. “అయ్యో! ఈ యువప్రాయంలో ఇలాంటి ఒక జీవితాన్ని ఎన్నుకొన్నారే!” అంటూ ఆవేదన చెంది, ఇంటికి తిరిగి వెళ్లిపొమ్మని వారికి హితోపదేశం చేశారు. ఇక పిల్లలో, వారు వీథిలో పోతున్నప్పుడు, “పరమహంసం పోతున్నది” అని అరుస్తూ, బాతుల్లా అభినయిస్తూ వారి వెంట పరిగెత్తేవారు.*
యువకులు, శ్రీమంతులు, విద్యావంతులు, ఆంగ్లం నేర్చుకొన్నవారు – వీరు కలిసికట్టుగా ఒక పాడుబడ్డ ‘దయ్యాల కొంప’ లో ఏం చేస్తున్నారో తెలుసు కోవడానికి వరాహ నగర మఠ సమీపంలో నివసిస్తున్న వారు ఎంతో ఆసక్తి కన బరచారు. కొందరికి వారి జీవితాలను గురించి సంశయమూ లేకపోలేదు. కొన్ని సమయాల్లో రాత్రంతా నామసంకీర్తనం, నాట్యం, పాటలలో వారు చేసే శబ్దం రాత్రిపూట నెలకొన్న ప్రశాంతతను భగ్నంచేసి చుట్టుప్రక్కలవారి నిద్రను పాడు చేయడం కూడా కద్దు. వీరిని ఏం చేయాలో పాలుబోక వారు విస్తుబోయారు. ఒక రోజు రాత్రి మఠం నుండి ఒక స్త్రీ పాడుతున్న పాట వినవచ్చింది. సుశ్రావ్యంగా ఒక స్త్రీ పాడడం వినగానే ఇరుగుపొరుగువారు తమ సందేహం సరైనదేనని నిశ్చయించుకొన్నారు. వారిని నేరం చేస్తూవుండగానే పట్టుకోవాలని కొందరు చడీ చప్పుడు లేకుండా మఠంలోకి వెళ్లారు. అడుగులో అడుగు వేసుకొంటూ పాట వినవస్తున్న గది వైపుగా వెళ్లారు. ఠక్కున పట్టుకొందామని లోపలికి వెళ్లి చేస్తే అక్కడ పాడుతున్న వ్యక్తి ఒక పురుషుడు – శరత్! అతడిది స్త్రీ కంఠస్వరం! వారి ముఖాలలో కత్తివేటుకు నెత్తురుచుక్క లేదు! ఏదో కుంటిసాకు చెప్పి చప్పున బయటకు జారుకొన్నారు! ఈ రీతిలో వ్యతిరేకత, సంశయం, కొన్ని సమయాల్లో ఆమోదంతో సమాజం ఆ యువసన్న్యాసులను చూడసాగింది.
మిషనరీల ప్రయత్నం
అదే సమయంలో క్రైస్తవ మిషనరీలు కూడా ఒక ప్రయత్నంలో నిమగ్ను లయ్యారు. యువకులు, ఒక ఉన్నతాదర్శం కోసం సంసార జీవితాన్ని త్యజించిన వారు తమ వైపున ఉంటే బాగుంటుందని వారు ఊహించు కొన్నారు. కనుక ఒక రోజు వారు వరాహ నగర మఠానికి వచ్చి ఏసుక్రీస్తు కీర్తిని, క్రైస్తవ మత ప్రాశస్త్యాన్ని ఏకరువు పెట్టారు. శ్రీరామకృష్ణ శిష్యులలో పలువురు బైబిల్, ముఖ్యమైన ఇతర క్రైస్తవ గ్రంథాలను క్షుణ్ణంగా చదివి ఉన్నారు. వచ్చిన వారు ఏకరువు పెట్టినదంతా వీరు ఓర్పుతో విన్నారు. చివరికి వారందరూ దిగ్భ్రమచెందే రీతిలో స్వామీజీ క్రైస్తవ మత సిద్ధాంతాలను విశదీకరించారు. ఏ రీతిలో చూసినా అవి వేదాంత సిద్ధాంతాల ముందు దిగదుడుపేనని నిరూపించారు. వీరి వద్ద తమ పప్పులు ఉడకవని గ్రహించిన మిషనరీలు వేరే ప్రయత్నాల్లో దిగారు. అవసరమైనంత డబ్బు ముట్టజెబుతామనీ, క్రైస్తవ మతం పుచ్చుకోమనీ తమ మామూలు ధోరణిలో ప్రయత్నించారు. యువ సన్న్యాసులు ఆ ఆకర్షణకు లోనుకాకపోవడంతో చివరకు స్త్రీలను కూడా సరఫరా చేయడానికి సంకోచించని హీనస్థితికి ఆ మిషనరీలు దిగజారారు. కాని, ‘కామినీ కాంచనాలు మనిషికి బద్ధశత్రువులు’ అని బోధించిన గురుదేవుల శిష్యులను ఈ ఆకర్షణలు చలింపజేయగలవా? తమ ప్రయత్నాలన్నీ విఫలమయ్యేసరికి వారు తలదించుకొని వెళ్లిపోయారు.
రామకృష్ణ ఆరాధన
బలరాంబోసు ఇంటి నుండి శ్రీరామకృష్ణుల అస్థుల కలశాన్ని తీసుకువచ్చి, దానిని విడిగా ఒక గదిలో అమర్చి ఆ గదిలోనే ధ్యానం మొదలైన ఆధ్యాత్మిక సాధనలు ఆ యువ సన్న్యాసులు అనుష్ఠించసాగారు. స్వామి రామకృష్ణానంద మఠంలో నిరంతరంగా నివసించనారం భించినప్పుడు ఆ గదిని తీర్చిదిద్దాడు. గది మధ్యలో గురుదేవుల చిత్రపటాన్ని అమర్చి నిత్యపూజకు శ్రీకారం చుట్టాడు. స్వామీజీతో సహా పలువురు సోదర శిష్యులకూ, సురేంద్రాదులకు ఇది నచ్చలేదు. శ్రీరామకృష్ణులు తమను అర్చించ మని ఎవరితోనూ చెప్పలేదని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేగాక విరజాహోమం నిర్వర్తించి యథావిధిగా సన్న్యాసం పుచ్చుకొన్న తరువాత పూజాది క్రతువుల అగత్యం లేదన్నది వారి వాదం.
ఒక రోజు పూజామందిరంలో నిలబడే ఆరాధనను ప్రతిఘటిస్తూ వాడిగా వేడిగా స్వామీజీ వాదించసాగారు. అందుకు స్వామి రామకృష్ణానంద కూడా యుక్తమైన జవాబులిచ్చాడు. కాసేపటికల్లా వాదాలు తారస్థాయిని చేరుకొన్నాయి. ఒక ఘట్టంలో స్వామి రామకృష్ణానంద స్వామీజీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొంటూ పూజామందిరం నుండి బయటికి త్రోసివేశాడు. అంతా కళ్లుమూసి తెరచేటంత లోనే జరిగిపోయింది. పిదప తన చర్యకు పశ్చాత్తాపం చెంది స్వామీజీని క్షమా పణ కోరాడు. మనఃస్ఫూర్తిగా క్షమించడం మాత్రమే కాక ఆతడి గురుభక్తిని స్వామీజీ ఎంతగానో శ్లాఘించారు. ఈ విషయంగా పలుమార్లు భేదాభిప్రాయాలు తలెత్తినప్పటికీ రామకృష్ణ ఆరాధన మాత్రం కొనసాగింది.
స్వామి రామకృష్ణానంద పూజా విధానాన్ని చూసినవారు అక్కడ గురుదేవుల దివ్యసాన్నిధ్య అనుభూతి పొందారనడం అతిశయోక్తి కాదు. సజీవులయిన వారికి ఎలా సకలోపచారాలు చేస్తామో, అదే విధంగా గురుదేవులను ఆయన ఆరాధించాడు. ఆయనకు నైవేద్యం అర్పించబడింది. పొగాకు లాంటి ఆయన ఉపయోగిం చిన తదితర పదార్థాలు కూడా అర్పింపబడ్డాయి. ఆరాత్రికం నిర్వహించారు. ఆరాత్రిక సమయంలో “జై గురుదేవా, శ్రీ గురుదేవా” అని అందరూ కలసి ఉచ్చరించేవారు; కొన్ని సమయాల్లో గురుగీత శ్లోకాలు పారాయణ చేసేవారు. దీపారాధన కన్నులపండువగా ఉండేది. అందరూ ముక్తకంఠంతో ‘జయ శివ ఓంకార’* అనే పాట పాడేవారు.
రోజులు గడిచేకొద్దీ పూజా విధానాన్ని మరింతగా క్రమబద్ధీకరించాడు రామకృష్ణానంద స్వామి. సంస్కృతంలో చక్కని అభినివేశం గల ఆయన తగిన మంత్రాలు చేర్చి రామకృష్ణ పూజా పద్ధతిని రూపొందించారు.
నిత్య పూజే కాకుండా శివరాత్రి, కాళీపూజ లాంటి విశేష పర్వదినాలను, క్రిస్మస్ను వారు ఉత్సవం మాదిరి జరుపుకొన్నారు.
స్వామీజీ మార్గదర్వకత్వంలో
వడివడిగా సాగిపోతున్న కాలపోకడలో ఆ యువసన్న్యాసులు భగవదను భూతిని మాత్రమే తమ ఏకైక లక్ష్యంగా గైకొని కఠోర తపోమయ జీవితం గడప సాగారు. జీవిస్తున్నామా లేదా అనే స్ఫురణ కూడా లేకుండా వారు గంటల పర్యంతం ధ్యానంలో మగ్నులు కాసాగారు; ధుని రగిలించి దాని చుట్టూ కూర్చుని సాధనలు అనుష్ఠించ సాగారు. కాని అధ్యయనమైనా, సాధనలయినా ఏదీ మితిమీరకుండా పర్యవేక్షిం చారు స్వామీజీ. కొన్ని సమయాల్లో కఠోర తపమాచరించడానికి ఉపక్రమించి నప్పుడు వారిని వారించి, “ఏమిటి? అందరూ రామకృష్ణ పరమహంసలయిపోవా లని ఉద్దేశమా? అది ఎన్నటికీ సాధ్యం కాదు. రామకృష్ణ పరమహంస ఒక్కసారి మాత్రమే జన్మిస్తారు” అనడం కద్దు. కొన్ని సందర్భాలలో, “సోదరులారా! గురు దేవులు చెప్పిన చీమ, చక్కెర కొండ ఉపమానం మరచిపోయారా? మీకు ఒక చక్కెర పలుకు చాలు. కాని మీరు ఏకమొత్తంగా చక్కెర కొండనే తీసుకుపోవాలని భావిస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు చేయకండి” అంటూ ప్రేమాభిమానాలతో వారికి మార్గదర్శకత్వం వహించేవారు. ఎవరైనా ఆయన మాటను మీరి కఠోర సాధనల్లో మగ్నులయితే, “మిమ్మల్ని శ్రీరామకృష్ణులు నా బాధ్యతలో వదలిపెట్టి వెళ్లారని మరచిపోకండి” అని ప్రాథేయపూర్వకంగా చెప్పి తమ దారికి తీసుకు వచ్చేవారు. శ్రీరామకృష్ణులు చెప్పడం వల్ల మాత్రమే కాదు; స్వామీజీ వ్యక్తిత్వం కూడా వారి మీద ఎంతో ప్రభావం చూపింది. స్వామీజీ ముఖవర్చస్సు, మాట తీరు, కళ్లు, వారి పట్ల ఆయన ప్రవర్తించిన తీరుతెన్నులు, అంతెందుకు కొన్ని సమయాల్లో ఆయన కోపగించుకొన్న ధోరణీ అన్నీ కలసి ఆ యువ సన్న్యాసుల విలక్షణమైన నేతగా ఆయనను రాణింపజేశాయి.
కాని స్వామీజీ వారికి ఎలా మార్గదర్శకత్వం వహించినప్పటికీ, చివరికి చీవాట్లు పెట్టినప్పటికీ దానికి వెనుకనున్నది ఆయన నిస్వార్థ ప్రేమ ఒక్కటే అన్నది నిర్వివాదాంశం. ఇది ప్రతి ఒక్కరికీ తెలియనిది కాదు. ఒకసారి హఠాత్తుగా త్రిగుణాతీతానంద చెప్పాపెట్టకుండా మఠం నుండి వెళ్లిపోయాడు. ఆతడి సమస్య కాస్త విభిన్నమైనది. “నరేంద్రుడు తరచు ఇంటికి వెళ్లివస్తున్నాడు, కుటుంబ వ్యాజ్యెం నడిపిస్తున్నాడు. నాకు కూడా ఎక్కడ అలా ఇంటికి వెళ్లాలనే కోర్కె కలుగుతుందేమోనని భయపడుతున్నాను” అనేవాడతడు. నరేంద్రుడు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడి పరిస్థితులు అతడి మనస్సుపై ప్రభావం చూపవు; కాని తనకు అలాంటి విరాగం సాధ్యం కాదని తలచి అతడు బాధపడ్డాడు. ఈ విధంగా మఠం నుండి బయలుదేరిన అతను పదిమైళ్ల కన్నా ఎక్కువ దూరం వెళ్లలేకపోయాడు. దాంతో కొద్ది రోజుల్లోనే మఠానికి తిరిగివచ్చేశాడు. అప్పుడు బ్రహ్మానంద స్వామి అతడితో, “ఎందుకు ఇలా చేశావు? నువ్వు ఎక్కడకు పోతావు? ఎక్కడకు వెళ్లినా నరేంద్రుని ప్రేమను ఎక్కడైనా చవిచూడగలవా?” అని అడిగాడు. ఈ రీతిలో తన సమస్యలూ, కుటుంబ సమస్యలూ అన్నింటిని అతిక్రమించి అందరినీ ప్రేమాభి మానాలతో పెనవేశారు స్వామీజీ.
గురుదేవులు ఒక రోజు భావపారవశ్య స్థితిలో, “జీవులకు సహాయపడడం అసాధ్యం, సేవ చేయడం మాత్రమే సాధ్యం” అని వచించడాన్ని స్వామీజీ ఒక నూతన దృక్పథంలో అవగతం చేసుకోవడం గురించి ఇంతకు మునుపే చూశాం. జీవులను భగవంతునిగా పరిగణించి వారికి సేవ చేయడమే ముక్తికి మార్గమన్న స్వామీజీ భావనను సోదర సన్న్యాసులలో పలువురు అంగీకరించలేదు. ఈ విష యంగా అప్పుడప్పుడు వాదోపవాదాలు తలెత్తడం కద్దు. ప్రేమానురాగాలతో స్వామీజీ క్రమక్రమంగా వారిలో ఆ భావనను పాదుగొల్పజేశారు. శ్రీరామకృష్ణుల సందేశమూ, దాని నూతనత్వాన్నీ, దానిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అన్న విషయాల గురించీ ఆయన వారికి విశదపరచి క్రమక్రమంగా వారిని ఆ దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.
వీటితోబాటు స్వామీజీకి ఉన్న మరో ముఖ్యమైన కార్యం. తక్కిన సోదర సన్న్యాసుల తల్లితండ్రులను సంబాళించడం. “ఈ ‘అనర్థాలకు’ అన్నింటికీ నరేం ద్రుడే కారణం. అతడే మా పిల్లలను పాడుచేస్తున్నాడు. అతడు లేకపోతే వారు తమ చదువులను కొనసాగించేవారు” అని పలువురి తల్లితండ్రులు స్వామీజీపై నిందవేశారు. వారు వచ్చినప్పుడల్లా వారి నిందలు సహించి, ఓపిగ్గా మాట్లాడి వారికి ఉపచారాలు చేసి మరీ పంపించేవారు.
నిలువ నీరు : బసచేసే సన్న్యాసి
బ్రహ్మచర్యం, నిరాడంబరత, ఆధ్యాత్మిక సాధనలు అనే మూడూ సన్న్యాసికి మౌలిక ఆవశ్యకాలుగా పేర్కొనబడ్డాయి. బ్రహ్మచర్యం అన్నది కామానికి అతీతంగా జీవితం గడపడం, నిరాడంబరత అంటే అవసరానికి మించి సంచయనం చేసుకోకపోవడం; జీవించడానికి ఏ మేరకు అతి కనిష్ఠ అవసరాలు కావలసివస్తాయో వాటిని మాత్రమే సన్న్యాసి ఉపయోగించాలి. ఆ తరువాత వచ్చేవి ఆధ్యాత్మిక సాధనలు, తపస్సు స్వాధ్యాయం వంటివి.
వరాహ నగర మఠ సన్న్యాసులలో ఈ మౌలిక లక్షణాలన్నీ సహజంగానే నెలకొని ఉన్నవి. భగవంతుడే మనిషిగా అవతరించిన గురుదేవుల సాంగత్యం వారికి చిన్నతనంలోనే కలిగింది. ఆయన అనుగ్రహం వల్ల భగవదనుభూతిని మాత్రమే జీవిత లక్ష్యంగా పరిగణించి వారు తపస్సులో మగ్నులయ్యారు. తపస్సుకు అనేక మార్గాలు, విధానాలు పేర్కొనబడ్డాయి. వాటిలో ఒకటి ప్రవ్రజనం. అంటే ఒకే చోట బస చేయకుండా సంచరించడం.
“నిలువ నీరు, బసచేసే సన్న్యాసి అధోగతి పాలవుతారు” అంటారు. నీరు ప్రవహిస్తూనే ఉండాలి, లేకపోతే దాన్లో అశుద్ధం చేరి త్రాగడానికి నిరుపయోగ మవుతుంది. సన్న్యాసి ఒకే చోట బసను కొనసాగిస్తే ఆ చోటుతోను, అక్కడి వ్యక్తులతోను అతడికి అనురక్తి జనించి భగవన్మార్గానికి ఆటంకం ఏర్పడుతుంది. కనుక సన్న్యాసి పయనం కొనసాగిస్తూనే ఉండాలి.
సన్న్యాసపు తక్కిన నియమాలకు అద్దంపట్టిన జీవితం గడుపుతున్న వరాహ నగర మఠ సన్న్యాసులు తీర్థయాత్రకు వెళ్లాలనుకొన్నారు. హిమాలయాలు, పూరీ జగన్నాథం, కాశీ తదితర క్షేత్రాలకు వెళ్లగోరారు. 1888 నుండే పలువురు తీర్థయాత్రలకు వెళ్లడానికి ప్రారంభించారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు వరాహ నగర మఠాన్ని ఒక తపోమయ క్షేత్రంగా మార్చిన తదనంతరం సన్న్యాస జీవిత తరువాయి పరిమాణం ప్రారంభమయింది. ప్రారంభంలో స్వామీజీ ఇలా తీర్థయాత్రలు చేసేవారిని గర్హించినప్పటికీ ఆయన మనస్సులోను ఆ ఉత్సు కత మొలకెత్త నారంభించింది. ఆయన కూడా తనకంటూ కొన్ని కార్యక్రమాలను రూపొందించుకొన్నారు.