నరేన్! నా బిడ్డలందరినీ నీ బాధ్యతలో వదలిపోతున్నాను. అందరిలోకీ బుద్ధిశాలివీ, ప్రతిభావంతుడమా నువ్వే. ప్రేమతో అందరికీ నేతృత్వం వహించు. నా కోసం పని చేయి!
– శ్రీరామకృష్ణులు
దక్షిణేశ్వరానికి వీడ్కోలు — కాశీపూర్ — ‘కోర్కెలను దగ్ధం చేద్దాం’ — నరేంద్రుని వైద్య పరిజ్ఞానం — వ్యాధి నిమిత్త మాత్రమైనది — నరేంద్రుని నేతృత్వం — తీవ్ర మనోవ్యాకులత — కొన్ని అనుభవాలు — శక్తిని ప్రసారం చేయగల సమర్థత — ‘మర్రిచెట్టులా ఉండు’ — నిర్వికల్ప సమాధిలో — ఇంటి సమస్యలు — బుద్ధుని అన్వేషణలో — భువనేశ్వరీదేవి ఆవేదన — వృత్తాన్ని దాటి…. — శ్రీరామకృష్ణుల సంకల్పం — ‘అన్ని నోళ్ల ద్వారా తింటున్నాను’ — భగవంతుడు ఉన్నాడా? — శ్రీరామకృష్ణులను గురించి — ఎక్కడకు తోడ్కొని వెళ్లినా వస్తాను — సన్న్యాసులను రూపొందిస్తున్నారు — ‘నరేన్ ఉపదేశిస్తాడు’ — శక్తిని ధారపోస్తున్నారు — ‘రాముణ్ణీ కృష్ణుణ్ణీ నేనే!’ — బాధ్యత అప్పగింత — శ్రీరామకృష్ణులు నిష్క్రమిస్తున్నారు — ‘నేను మృతిచెందలేదు!’
దక్షిణేశ్వరానికి వీడ్కోలు
ద ట్టంగా పెరిగిన మహావృక్షం అనేకులకు నీడనిచ్చి కాపాడుతుంది. కాని ఆ నీడలో కొత్తచెట్లు ఏపుగా పెరగవు. ఆ నీడ ప్రభావం నుండి విడివడినప్పుడే తక్కిన చెట్లు పెరగగలవు. శ్రీరామకృష్ణులనే కల్పతరువు తన నీడలో పలు మొలకలను కూడా పెరగనిచ్చింది. అయి నప్పటికీ అవి ఏపుగా పెరగాలంటే ఆ తరువు తన నీడను ఉపసంహరించుకోవాలి. అందుకు శ్రీరామకృష్ణులు సంకల్పించుకొన్నారు.
1884 వ సంవత్సరాంతం నుండే శ్రీరామకృష్ణుల ఆరోగ్యం క్షీణించ సాగింది. ఆయన పేరు కలకత్తా యావత్తూ వ్యాపించడంతో జనం తండోప తండాలుగా ఆయన వద్దకు రాసాగారు. వచ్చిన వారందరితోను ఆయన మాట్లా డారు, పాడారు, నృత్యం చేశారు; పారవశ్య స్థితులలోకి వెళ్లారు. ఇవి ఆయన ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరించినా ఆయన ఖాతరు చేయలేదు. ప్రాపంచికమైన దుఃఖాలలో కొట్టుమిట్టాడుతూ తమ వద్దకు వచ్చిన లోకులకు కించిత్తు అయినా తమ వలన సాంత్వన లభించే పక్షంలో అందుకోసం ఏది చేయడానికైనా ఆయన సిద్ధపడ్డారు.
1885 వేసవికాలం ఎండ ఎంతో తీక్ష్ణంగా ఉన్నందువలన శ్రీరామకృష్ణులు ఐసు, శీతలపానీయాలు కాస్త ఎక్కువగా సేవించారు. దాని పర్యవసానంగా ఆయన గొంతులో నొప్పి రాసాగింది. ఒక నెలలో ఆ నొప్పి ప్రకోపించింది. వైద్యుణ్ణి రప్పించారు. ఎక్కువగా మాట్లాడడం వలనా, పాడడం వలనా, పారవశ్య స్థితుల కారణంగాను గొంతులో రక్త ప్రసరణ అధికరించడంతో ఆ నొప్పి ఏర్పడిందనీ, కనుక వాటినన్నింటినీ ఆపివేయమనీ వైద్యులు సలహా ఇచ్చారు.
రోజులు గడిచేకొద్దీ వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ కాసాగింది. దాంతో శ్రీరామకృష్ణుల సంభాషణలు, పాటలు అన్నీ కూడా మోతాదును మించాయి. జూన్ నెల తరువాత హఠాత్తుగా ఆయన గొంతులో రక్తం స్రవించింది. మామూలు గొంతు వ్రణమై ఉంటుందని భావించబడిన ఆయన రుగ్మత, అంత సామాన్యమయినదిలా కనిపించలేదు. భక్తులు కలత చెందారు. “ఎవరిని కేంద్రంగా చేసుకొని మనం ఆనందంలో తేలియాడుతున్నామో ఆయన మనలను వదలి నిష్క్రమిస్తారని అనిపిస్తున్నది. నేను కొన్ని వైద్యగ్రంథాలు చదివాను, కొందరు వైద్య మిత్రులను సంప్రతించాను. వీటన్నిటి దృష్ట్యా చూడగా ఈ గొంతు వ్రణం క్రమంగా క్యాన్సర్‌గా పరిణమించే అవకాశం ఉంది” అని నరేంద్రుడు అన్నాడు.
శ్రీరామకృష్ణులకు ఉత్కృష్ట వైద్యచికిత్స చేయించాలని భక్తులు నిర్ణయిం చారు. అందుకు తగిన సౌకర్యాలు దక్షిణేశ్వరంలో లేవు. కనుక కలకత్తాలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొన్నారు. ఆ ఇల్లు మరీ చిన్నది. దక్షిణేశ్వరంలో ఆరుబయట జీవించడానికి అలవాటుపడిన శ్రీరామకృష్ణులు ఆ చిన్న ఇంట్లో ఇమడలేక బాగా ఇబ్బందికి గురి కావడంతో శ్యాంపుకూర్ అనే ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు పుచ్చుకొన్నారు.
శ్రీరామకృష్ణులకు ఉన్నతమైన చికిత్స చేయించడానికి భక్తులు చక్కని సౌకర్యాలు కల్పించారు. మాతృమూర్తి శ్రీశారదాదేవి పథ్యపానాదుల బాధ్యత వహించారు. యువశిష్యులు శ్రీరామకృష్ణులతోపాటు ఉండి, సేవాశుశ్రూషలు చేస్తూ, ఆయనను కంటికి రెప్పలా కాపాడసాగారు.
కాశీపూర్
శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్‌కు వచ్చి మూడు నెలలు గడచిపోయాయి. వైద్యుల చికిత్స, మాతృదేవి పరిపోషణ, యువశిష్యుల సేవాశుశ్రూషల ఫలి తానికి విరుద్ధంగా ఆయన వ్యాధి రోజురోజుకీ తీవ్రం కాసా గింది. మునుపు కాస్త సత్ఫలితాలను ఇచ్చిన మందులు కూడా ఇప్పుడు నిష్ప్రయోజనమయ్యాయి. కలకత్తా కలుషిత వాతావరణ కారణం గానే వ్యాధి ప్రకోపిస్తున్నదని నిర్ధారణ చేసిన వైద్యులు, నగర ప్రాంతాన్ని వదలి, బాగా విశాలంగా ఉండే నగర శివార్లకు ఆయనను తరలిస్తే బాగుంటుందని సూచించారు. వారి సూచన మేరకు భక్తులు కాశీపూర్ అనే ప్రాంతంలో ఒక ఉద్యాన గృహాన్ని అద్దెకు తీసుకొన్నారు. 1885 డిసెంబర్ 11 వ తేదీన శ్రీరామకృష్ణుల బసను అక్కడకు మార్చారు.
రామకృష్ణసంఘ చరిత్రలో కాశీపూర్ చెరగని స్థానం పొందింది. ఇక్కడ శ్రీరామకృష్ణులు దాదాపు ఎనిమిది నెలలు గడిపారు. అద్వితీయమైన ఆయన దివ్య జీవితంలో మరపురాని ముఖ్య సంఘటనలు ఇక్కడే జరిగాయి. ఇక్కడే ఆయన నరేంద్రుని జీవితానికి ఒక ఆకృతి కల్పించి, యువకులను అతడికి అప్పగించి రామకృష్ణసంఘానికి అంకురార్పణ చేశారు. ఈ ఎనిమిది నెలలలో ఆ వ్యాధి క్రమంగా ప్రకోపించి ఆయన శరీరాన్ని కేవలం ఒక ఎముకల గూడుగా మార్చివేసింది. అయినప్పటికీ అచంచలమైన ఆయన మనస్సు వ్యాధినీ, తద్ద్వారా సంక్రమించిన నొప్పినీ వైదొలగజేసింది. ఇక్కడ ఆయన శిష్యులకూ, భక్తు లకూ అవసరానికి తగినట్లు విడివిడిగాను, కొన్ని సమయాల్లో సామూహికంగాను శిక్షణ నిచ్చారు. ప్రత్యేకంగా, నరేంద్రుణ్ణి ఒంటరిగా పిలిచి ఉపదేశించారు. కొన్ని సందర్భాలలో తలుపులు, కిటికీలు బిగించి, అతడికి ప్రత్యేకంగా బోధించారు. ఆయన బోధించిన దేమిటో నరేంద్రుడు ఎవరికీ వెల్లడించలేదు. కాని యువకుల బాధ్యతను అప్పగించడం గురించీ, వారికి శిక్షణను ఇవ్వడం గురించీ ఆయన నరేన్‌తో చర్చించి ఉంటారని తక్కిన శిష్యులు భావించారు.
‘కోర్కెలను దగ్ధం చేద్దాం’
భక్తుల సంఖ్య పెరిగేకొద్దీ శ్రీరామకృష్ణుల కార్యకలాపాలు ఒక నిజాన్ని సూచించాయి – ఆయన ఇక ఎక్కువ రోజులు జీవించబోరనే నిజమే అది. 1886 ప్రారంభంలో ఒక రోజు రాత్రి నరేంద్రుడు ఈ విషయాన్నే తక్కిన యువకులతో చర్చించి పడుకోవడానికి వెళ్లాడు. కాని ఎంతకీ నిద్రపట్టలేదు. తన మాదిరే నిద్రపట్టక పెద్దగోపాల్, శరత్, కాళీ ప్రభృతులు మేల్కొని ఉండడం చూసి, వారిని వెంటబెట్టుకొని తోటలో పచార్లు చేయసాగాడు. నడుస్తూ ఇలా అన్నాడు: “గురుదేవుల వ్యాధి తీవ్రరూపం దాలుస్తూన్నది. శరీరాన్ని ఆయన త్యజించగోరుతున్నట్లు నాకు అనిపిస్తున్నది. ఆయనకు సేవ చేస్తూ, ప్రార్థన ధ్యానాదులు అనుష్ఠించి ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి చేతనైనంత ఇప్పుడే ప్రయత్నించండి. ఆయన నిష్క్రమించిన తరువాత వాపోయి లాభం లేదు. కర్తవ్యాలన్నీ పూర్తిచేసిన తరువాత భగవంతుణ్ణి ఆశ్రయించవచ్చునని తలచడం మూర్ఖత్వం. మనం కోర్కెలను కూకటివేళ్లతో సహా పెకలించివేయాలి.”
నరేంద్రుడు ఉద్వేగపు వెల్లువలో మునిగిపోయినట్లు కానవచ్చాడు. కాసేపు మాట్లాడిన తరువాత ఒక చెట్టు క్రింద ప్రశాంతంగా కూర్చుండిపోయాడు. ప్రక్కనే ఉన్న కొన్ని ఎండుపుల్లలను చూసి అతడు, “మన కోర్కెలను దగ్ధం చేయడానికి అగ్ని రగుల్చుదాం” అన్నాడు. అంతా కలిసి ఎండు పుల్లలను సమీకరించి అగ్ని రగిలించారు. ఆ రాత్రి చీకటిలో అందరూ ప్రజ్వరిల్లుతున్న ఆ మంట చుట్టూ కూర్చున్నారు. తమ కోర్కెలను దగ్ధం చేస్తున్నట్లుగా భావించి ప్రతి ఒక్కరూ ఒక ఎండుపుల్లను ఆ అగ్నికి ఆహుతినిచ్చారు; పిదప ప్రశాంతంగా ధ్యానమగ్ను లయ్యారు. ఆనాటి రాత్రి వారికి ఒక మహోన్నత రాత్రిగా భాసిల్లింది.
నరేంద్రుని వైద్య పరిజ్ఞానం
“శ్రీరామకృష్ణుల అంతిమ రోజులివి” అని నరేంద్రుడు ఊరకే చెప్పలేదు; అత డికి వైద్యశాస్త్రంలో చక్కని పరిజ్ఞానం ఉంది. ఆ పరిజ్ఞానం ఆధారంతోనే అలా చెప్పాడు. గురుదేవుల వ్యాధి గురించి చర్చించడానికి ఒక రోజు డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్‌ను కలుసుకోవడానికి అతడు వెళ్లాడు. ఈయనే శ్రీరామకృష్ణులకు చికిత్స చేస్తున్నాడు; ఈయన ఖ్యాతి గాంచిన వైద్యుడు. డాక్టర్ గురుదేవుల వ్యాధి గురించి తన అభిప్రాయం వెలి బుచ్చి, ఆ అభిప్రాయానికి ఆధారంగా ఒక వైద్యగ్రంథాన్ని ఉదాహరించాడు. అంతా విని నరేంద్రుడు, “డాక్టర్, మీరు ప్రస్తావించిన గ్రంథాన్ని పూర్తిగా చదివారా? లేక అక్కడక్కడ చూశారా?” అని అడిగాడు. ఈ ప్రశ్న విని డాక్టర్ దిగ్భ్రాంతు డయ్యాడు. నిజమే, తాను పూర్తిగా చదవలేదని అంగీకరించాడు. నరేంద్రుడు ఆ గ్రంథంలోని అధ్యాయాలను యథాతథంగా ఒప్పజెప్పి, వైద్యుడు వెలిబుచ్చిన అభి ప్రాయాలను విశదీకరించాడు. డాక్టర్ ఎంతమాత్రం దీనిని ఎదురుచూడలేదు. ఆయన మహదానందంతో నరేంద్రుణ్ణి శ్లాఘించి, ఆశీర్వదించాడు.
వ్యాధి నిమిత్త మాత్రమైనది
శ్రీరామకృష్ణుల వ్యాధి అతి భయంకరమైనది, ఆయన తమ అంతిమ రోజు లను సమీపిస్తున్నారని అందరికీ అర్థమయింది. అందరూ శ్రీరామకృష్ణుల సేవలో మనఃస్ఫూర్తిగా పాల్గొన్నారు. యువకులలో పలువురు కాశీ పూర్లోనే బస చేశారు. నరేంద్రుడు వారినందరినీ సమైక్య పరచి, అందరూ కలసి అధ్యయనం, చర్చలు, పాటలు, ధ్యానం ఇత్యాది ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించసాగారు. ఒక వైపు శ్రీరామ కృష్ణుల నిస్వార్థ ప్రేమ, మరొక వైపు నరేంద్రుని సోదరప్రేమ అందరినీ అక్కడ కట్టిపడేసింది. యువకులు పన్నెండు మంది ఉన్నారు. వారు: నరేంద్రుడు, రాఖాల్, బాబూరాం, నిరంజన్, యోగీన్, లాటూ, తారక్, పెద్దగోపాల్, కాళీ, శశి, శరత్, చిన్నగోపాల్.
యువకులు వంతులవారీగా శ్రీరామకృష్ణుల సేవాశుశ్రూషలలో మునిగి పోయారు. కాని కొందరి మనస్సుల్లో ఒక సంకోచం ఊగిసలాడింది – శ్రీరామ కృష్ణుల వ్యాధి ఒక అంటువ్యాధా? బహుశా అలా అయివుంటే తమకూ సంక్ర మించవచ్చు కదా అని కొందరు భయపడ్డారు. ఇది గ్రహించిన నరేంద్రుడు ఒక రోజు అందరి సమక్షంలో, శ్రీరామకృష్ణులు త్రాగి మిగిల్చిన రవ్వపాయసం తీసు కొని త్రాగేశాడు. అందులో శ్రీరామకృష్ణుల లాలాజలం కలిసింది. ఇది చూసిన తరువాత యువకుల సందేహం తీరింది.
నరేంద్రుడూ, తక్కిన యువకులూ శ్రీరామకృష్ణుల వ్యాధిని వ్యాధిగానే పరిగణించారు. కాని గృహస్థ శిష్యులయిన గిరీశ్, రామచంద్రదత్తా ప్రభృతులు ఈ వ్యాధికి ఒక అమానుష రంగు పులిమారు. శ్రీరామకృష్ణులు ఒక అవతార పురు షుడు; ఆయన సంకల్ప మాత్రానే ఈ వ్యాధిని సంక్రమింపజేసుకొన్నారు; ఏదో ఒక రోజు హఠాత్తుగా తమ దివ్యశక్తిని ప్రదర్శించి వ్యాధిని నయం చేసుకొంటారని వారు విశ్వసించారు.
కాని ఈ వ్యాధిని నిమిత్తమాత్రంగా కనబరిచారు శ్రీరామకృష్ణులు. “నా వ్యాధి నిమిత్తమాత్రమే. ఈ వ్యాధి మీ అందరినీ ఐక్యం చేసింది” అన్నారాయన. ఆ వ్యాధి కారణంగానే భక్తులందరూ ఐక్యం కాగలిగారు; వారి మధ్య ఒక అనురాగబంధం పెంపొందింది; అది భవిష్యత్ సంఘానికి ఆధారభూతమయింది.
నరేంద్రుని నేతృత్వం
ఈ రోజుల్లోనే నరేంద్రుని కార్యం ప్రారంభమయిందని చెప్పవచ్చు. ఒక కొత్త యుగాన్ని సృష్టించడానికి శ్రీరామకృష్ణులు ఏతెంచారు; ఇందులో నూతన చింతనలు, కొత్త మార్గాలు రూపొందుతాయని నరేంద్రుడు గ్రహించాడు. కాని తక్కినవారు దానిని గ్రహించడం కాదు కదా, అలా యోచించడం కూడా చేయలేదు. అందువలన భక్తులలో పలు వురు పాత మార్గాలలోనే వెళ్లడానికి ఉపక్రమించారు. వారిని దారిలోకి తీసుకు రావడం నరేంద్రుని ప్రధానమైన పని. శ్రీరామకృష్ణులు ఒక రోజు హఠాత్తుగా అతీంద్రియ శక్తితో తన వ్యాధిని నయం చేసుకొంటారని నమ్మిన వారికి నరేంద్రుడు నిజాన్ని స్పష్టంచేసి, “శ్రీరామకృష్ణుల శరీరమూ పంచభూతాత్మకమయి నది, ప్రకృతి నియమాలకు లోబడింది, ఒక రోజు అది నశించే తీరాలి. కనుక హఠాత్తుగా అతీంద్రియశక్తితో ఆయన వ్యాధి నయమవుతుందని ఆశించరాదు” అని స్పష్టంగా తెలియచేశాడు.
మరోవైపు మరికొందరు శ్రీరామకృష్ణులు ఒక అవతారం, మునుపటి అవ తారంలో ఆయన ఎవరో, ఇప్పుడున్న భక్తులలో ఎవరెవరు పూర్వపు అవతారా లలో ఎవరెవరుగా ఉన్నారోనన్న ఊహల్లో మునిగి తేలసాగారు. పారవశ్యస్థితి అని చెప్పుకొంటూ కొందరు పాటల్లో, నృత్యాల్లో నిమగ్నులయ్యారు. వీటిని ఆపడానికి నరేంద్రుడు శాయశక్తులా ప్రయత్నించాడు. కన్నీరు స్రవించడం, రోమాంచితం గావించడం లాంటివి నిజమైన ఆధ్యాత్మికత లక్షణాలు కావు; వీటిని నివారించక పోతే శరీరమూ, మనస్సూ వ్యాధిగ్రస్థాలయ్యాయని అర్థం చేసుకోవాలి. ఇది నరాల బలహీనత కారణంగా కూడా సంభవించవచ్చు. కనుక పౌష్టిక ఆహారం తినాలి, మంచి వైద్యుణ్ణి సంప్రతించాలని వారితో చెప్పాడు.
నరేంద్రుని సలహాలను కొందరు ఆమోదించారు; తమను తాము నియం త్రించుకొని నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని చవిచూడసాగారు. కొందరు ఆమో దించలేదు. నరేంద్రుడు వారిని తేలికగా వదలిపెట్టలేదు. అనేకుల ముందు వారిని పరిహసించాడు. వారి పారవశ్య స్థితులను తాను అనుకరించి చూపుతూ వారిని సిగ్గుపడేలా చేశాడు. అదే సమయంలో శ్రీరామకృష్ణుల మహజ్జీవితం నుండి అనేక ఉదాహరణలు చూపి వారికి నిజమైన ఆధ్యాత్మికత అవగతమయ్యేలా చేశాడు.
అన్నింటినీ మించిన అద్భుతమైన ఒక భావనను చెబుతూ వారు నిజాన్ని గ్రహించేలా చేశాడు నరేంద్రుడు. ‘క్రీస్తు అనుకరణ’ (Imitation of Christ) అనే పుస్తకం నుండి ఇలా ఉదాహరించాడు: “నిజమైన దేవుని కుమారుడు క్రీస్తును ప్రేమించే వారి జీవితం పూర్తిగా ఆయన జీవితం మాదిరే అయిపోతుంది. ఇదే మనకు గీటురాయి. మన జీవితం శ్రీరామకృష్ణుల జీవితంలా పరిణమిస్తే మనం ఆయనను ప్రేమిస్తున్నామని అర్థం. మరేదీ నిజం కాబోదు.” ఏదో కొన్ని సమయాల్లో పాడుతూ, నృత్యం చేస్తూ కన్నీరు స్రవించే రీతిలో ఉంటూ, తక్కిన సమయాల్లో ఇష్టప్రకారం జీవించడం శ్రీరామకృష్ణులు చూపిన జీవితం కాదు అనే సత్యాన్ని ఇందుమూలంగా నరేంద్రుడు తేటతెల్లం చేశాడు.
తీవ్ర మనోవ్యాకులత
శ్రీరామకృష్ణుల అంతిమ రోజులు సమీపించేకొద్దీ నరేంద్రుడు తనలో ఏదో శూన్యాన్ని మరింతగా అనుభవించసాగాడు. ఆధ్యాత్మిక జీవితంలో తాను ఇంకా ఏదీ సాధించలేదేమోననే భావన అతడి హృదయాన్ని బాధించింది. మరో వంక ఇంటి పరిస్థితి పెద్ద భారంగా అతణ్ణి అణచసాగింది. ఇంటి పరిస్థితిని చక్కదిద్దడానికి అతడు న్యాయ విద్యను కొనసాగించవలసి వచ్చింది. పరీక్షలు దగ్గరపడడంతో కాశీపూర్కే తన పుస్తకాలు తెచ్చుకొని చదువుకోసాగాడు. కాశీపూర్లోనే బసచేసినప్పటికీ కొన్ని సమయాల్లో చదువులో మునిగివుండడంతో మేడ మీదకు పోయి శ్రీరామకృష్ణులను కలుసు కోవడానికి కూడా వెళ్లకపోవడం కద్దు. ఇదంతా గమనించిన శ్రీరామకృష్ణులు ఒక రోజు, “ఇదుగో చూడు, నువ్వు ఒక న్యాయవాదివైతే నీ చేతుల మీదుగా నీళ్లు కూడా ముట్టను” అన్నారు. గురుదేవుల మాటలు విన్న తరువాత ఇక న్యాయ శాస్త్రానికి స్వస్తి పలికి, ఆధ్యాత్మిక సాధనలలో లీనమయిపోవాలని అతడు నిర్ణయించుకొన్నాడు.
1886 ప్రారంభంలో నరేంద్రుడు ఒక రోజు శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్లి, “అందరికీ ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతున్నాయి. నాకు మటుకు ఎందుకు ఏదీ లభించడం లేదు? నాకు కూడా ఏదైనా లభించాలి” అన్నాడు. “సరే, నీకు ఏం కావాలి?” అని శ్రీరామకృష్ణులు అడిగారు. అందుకు నరేంద్రుడు, “మూడు నాలుగు రోజులు అవిచ్ఛిన్నంగా సమాధి స్థితిలోనే లీనమై ఉండిపోవాలి. ఏదో ఆహారం నిమిత్తం అప్పుడప్పుడు మనస్సు క్రిందికి దిగి రావాలి” అన్నాడు. ఆ మాటలు విని శ్రీరామకృష్ణులు, “నువ్వొక అవివేకివి. ఇదా ఉన్నత స్థితి? ఇంతకన్నా అత్యున్నత స్థితి ఉంది. ‘ఉన్నవన్నీ నువ్వే’ అని నువ్వే పాడతావు కదా! ఆ స్థితిని నువ్వు అనుభవించవచ్చు. కాని అంతకు ముందు నీ కుటుంబానికి అవసరమైన ఏర్పాట్లు చేసి రా” అన్నారు.
మర్నాడు నరేంద్రుడు ఇంటికి వెళ్లాడు. చదువు, తిండి విషయాలలో ఏమీ పట్టించుకోకుండా ఉంటున్నందుకు తల్లి అతణ్ణి గట్టిగా మందలించింది. కుటుం బానికి ఏమైనా చేయాలని మళ్లీ చదువు మీదకు దృష్టి సారించాలనుకొన్నాడు నరేంద్రుడు. కనుక అమ్మమ్మ ఇంటికి వెళ్లి చదువుకోనారంభించాడు. పుస్తకం చేతిలోకి తీసుకోవడమే తరువాయి ఎక్కణ్ణుండో భయోద్వేగం వచ్చి అతణ్ణి ఆవహించింది. తాను ఏదో తప్పు చేస్తున్నట్లుగా అతడికి అనిపించింది. ఏమను కొన్నాడో ఏమో హఠాత్తుగా పుస్తకాలను అట్లే విసిరివేసి పరుగెత్తసాగాడు. ఏదో ఒక శక్తి అలా పరుగెత్తించినట్లుగా ఆవేశంలో అతడు పరిగెత్తాడు. పరుగు వేగంలో చెప్పులు, ఇతర వస్తువులు దారిలో చెల్లాచెదరుగా అక్కడక్కడా పడి పోయాయి. దారిలో ఉన్న గడ్డివామును మోదుకోవడంతో ఒళ్లంతా గడ్డిపరకలే! అందుకు తోడు జోరున వాన! పిచ్చిపట్టిన వాడిలా అతడు పరుగెత్తాడు. చివరికి ఆగింది కాశీపూర్‌లో. వర్షంలో బాగా తడిసి ముద్దయి, బురద బట్టలతో అతడి ఆకారం వికారంగా తయారయింది.
అక్కడ ఉన్న ‘మ’ తో, “నేను విలపించాను. ఇలా నా జీవితంలో ఎన్నడూ విలపించ లేదు.” అని నరేంద్రుడు చెప్పాడు.
తరువాత నరేంద్రుడు తిన్నగా మేడ మీద ఉన్న శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లాడు. అప్పుడు ఆయన నిద్రపోతున్నారు. భరించరానంత గొంతు నొప్పితో బాధపడుతున్నారు. రాత్రి దాదాపు తొమ్మిది గంటలకు ఆయన నిద్రలేచారు. లేవ గానే నరేంద్రుణ్ణి గురించే మాట్లాడారు: “నరేంద్రుని పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంది. ఒకప్పుడు అతడు సాకార భగవంతుణ్ణి విశ్వసించేవాడు కాడు. ప్రస్తుతం చూడు, భగవదనుభూతి కోసం ఎంత తల్లడిల్లిపోతున్నాడో!”
కొన్ని అనుభవాలు
నరేంద్రుని మానసిక వ్యాకులత తీవ్రతరమయింది. 1886 జనవరి ప్రారం భంలో ఒక రోజు శ్రీరామకృష్ణులతో తాను దక్షిణేశ్వరం వెళ్లి, అక్కడ బిల్వవృక్షం కింద ధునిని రగిలించి, దాని ప్రక్కన కూర్చుని ధ్యానం చేయబోతున్నట్లు అతడు చెప్పాడు. “వద్దు. ప్రక్కనే ఉన్న మందుగుండు కార్ఖానా వారు అందుకు సమ్మతించరు. పంచవటి అందమైన చోటు. పలువురు సాధువులు జపధ్యానాలు అనుష్ఠించిన స్థలం. కాని అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, పైగా కటిక చీకటి కూడా” అన్నారాయన. ఆ తరువాత, “అవునూ, చదువు కొనసాగించాలనుకొంటున్నావా?” అని అడిగారు. అందుకు నరేంద్రుడు, “ఇంతదాకా చదివిన చదువునంతా మరచిపోవడానికి ఏదైనా మందు దొరుకుతుందా అని పరితపిస్తున్నాను. అలాంటప్పుడు చదువు కొనసాగించ డమా?” అన్నాడు. అప్పటి నుండి నరేంద్రుని మనస్సు ఆధ్యాత్మిక సాధనలలో తీవ్రంగా లీనమయింది. అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వెళ్లి ధ్యానంలో మగ్నుడవ సాగాడు.
ఒకసారి నరేంద్రుడు గిరీశ్తోపాటు దక్షిణేశ్వరానికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి పంచవటిలో ధ్యానానికి కూర్చున్నారు. దోమలు కుడుతున్నందువలన గిరీష్ ధ్యానం చేయలేకపోయాడు. నరేంద్రుని వైపు తిరిగి చూశాడు. అతడి శరీరాన్నంతా ఒక దుప్పటిలా దోమలు క్రమ్మివేశాయి. అతడు బాహ్యస్మృతిని కోల్పోయి ప్రగాఢ ధ్యానంలో మగ్నుడై ఉన్నాడు. అతణ్ణి పేరుపెట్టి పిలిచి చూశాడు గిరీశ్. జవాబు లేదు. తాకి చూశాడు, స్పృహ లేదు. గట్టిగా పట్టుకొని కుదిపాడు – అంతే, ఒక దుంగలా వాలిపోయాడు నరేంద్రుడు. అప్పటికీ అతడికి బాహ్యస్మృతి కలగ లేదు. చాలాసేపటి తరువాత బాహ్యస్మృతిలోకి వచ్చినప్పుడు, జరిగిందేదీ అతడికి తెలియదు.
మరొక రోజు ధ్యానం చేస్తున్నప్పుడు త్రికోణ రూపంలో ప్రకాశమానమైన ఒక అద్భుత కాంతి నరేంద్రునికి కానవచ్చింది. అది సజీవంగా ఉన్నట్లు అతడికి అనిపించింది. శ్రీరామకృష్ణులకు ఈ విషయం తెలిపినప్పుడు, “మంచిది, మంచిది. నువ్వు బ్రహ్మయోనిని దర్శించావు. బిల్వవృక్షం కింద సాధనలు చేస్తున్నప్పుడు నేను కూడా దానిని దర్శించాను. దాని నుండి ప్రతిక్షణం అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉద్భవిస్తూ రావడం కూడా చూశాను” అన్నారు.
ఒక రోజు ధ్యాన సమయంలో ఇడ, పింగళ మొదలైన నాడుల కార్యకలా పాలనూ, కుండలినీ శక్తి జాగృతం చెందడాన్నీ అతడు అనుభూతి పొందాడు.
ఒక రోజు శ్రీరామకృష్ణులు తమ ఇష్టమంత్రమయిన రామనామ మంత్ర దీక్షను నరేంద్రునికి అనుగ్రహించారు. అతి చిన్నతనం నుండే శ్రీరాముని పట్ల కలిగివున్న భక్తిప్రపత్తులు, శ్రీరామకృష్ణులు అనుగ్రహించిన మంత్ర శక్తితో అత డిలో ద్విగుణీకృతమయినాయి. అతడు ఆనందపారవశ్యంలో ‘రామ, రామ’ అంటూ ఉచ్చరిస్తూ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయసాగాడు. సమయం గడిచేకొద్దీ అతడి కంఠస్వరం తీవ్రస్థాయికి చేరసాగింది. ఆ పరిస్థితిని చూసినవారు అతణ్ణి సమీపించడానికే భయపడ్డారు. ‘రామ, రామ’ అంటూ గంటల తరబడి ఉచ్చ రిస్తూ ప్రదక్షిణలు చేయడం చూసి ఈ సంగతి శ్రీరామకృష్ణులకు తెలియపరి చారు. అందుకు ఆయన, “అతణ్ణి అలాగే వదలిపెట్టింది. త్వరలోనే మామూలు స్థితిలోకి వస్తాడు” అన్నారు. కొన్ని గంటలు గడచిపోయాక కూడా అతడు మామూలు స్థితిలోకి రాకపోవడంతో శ్రీరామకృష్ణులు అతణ్ణి తమ వద్దకు తోడ్కొని రమ్మన్నారు. కాని ఎవరూ నరేంద్రుణ్ణి ఆపలేకపోయారు. చివరికి ఒక వ్యక్తి బల వంతంగా అతణ్ణి పట్టుకొని ఎలాగో గురుదేవుల వద్దకు తోడ్కొని వెళ్లగలిగాడు. పిదప శ్రీరామకృష్ణులు క్రమక్రమంగా అతణ్ణి మామూలు స్థితిలోకి తీసుకు రాగలిగారు. తరువాత అతడితో, “నాయనా, నరేంద్రా! ఎందుకింతగా ఆర్భాటం చేస్తావు? ఇదంతా నిష్ప్రయోజనం. ఈ ఒక్క రాత్రి నువ్వు ఏ రీతిలో గడిపావో, నా జీవితంలో పన్నెండేళ్లు అలా గడిచాయి. ఒక భయంకరమైన తుపానులా వచ్చి వెళ్లిపోయింది. ఒక్క రాత్రిలో నువ్వు ఏం సాధించగలవు, నాయనా!” అని చెప్పి, అతణ్ణి సాంత్వనపరిచారు.
శక్తిని ప్రసారం చేయగల సమర్థత
ఈ రోజుల్లో తనలో ఒక అసాధారణ శక్తి పెంపొందడాన్ని నరేంద్రుడు గుర్తించాడు. ఆ శక్తిని పలువురికి ప్రసారం చేయడం ద్వారా వారి మనస్సులలో పరివర్తన కలిగించే సమర్థత తనకు ఉన్నట్లు అతడు గ్రహించాడు. మార్చ్ నెల, శివరాత్రి పర్వదినం. నరేంద్రుడు శివుని మీద ‘తాథయ్యా తాథయ్యా’ అనే భజన గీతాన్ని రచించాడు. భజన, పూజ, ధ్యానాదుల సాధనలలో యువకులు మునిగి పోయారు. మొదటి యామ పూజ పూర్తయింది. నరేంద్రుడు యువకులతో మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరుగా పలువురు బయటికి వచ్చారు. తన హుక్కా సిద్ధం చేయమని నరేంద్రుడు ఒకరికి పురమాయించాడు. గదిలో కాళీ, నరేంద్రుడు మాత్రమే ఉన్నారు. అప్పుడు తనలోని శక్తిని పరీక్షించాలనే ఉత్సుకత నరేంద్రునిలో జనించింది. ఆతడు కాళీతో, “కాళీ, నేను ధ్యానం ప్రారంభిస్తాను. కాసేపయ్యాక నన్ను తాకు” అంటూ ధ్యానంలో మగ్నుడయ్యాడు.
బయటికి వెళ్లిన వ్యక్తి హుక్కా సిద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు సంభ్రమాశ్చ ర్యాలు కలిగించే ఒక దృశ్యం చూశాడు. నరేంద్రుడూ, కాళీ ధ్యానంలో లయించి ఉన్నారు. కాళీ కుడిచేయి నరేంద్రుని కుడి మోకాలు మీద ఉంది; ఆ చేయి వణకసాగింది. కాసేపటికి నరేంద్రుడు కళ్లు తెరిచాడు.
నరేంద్రుడు : కాళీ! చేయి తీసేయి. నీకు ఏమనిపించింది?
కాళీ : విద్యుచ్ఛక్తి నా శరీరంలో ప్రసరించినట్లుగా అనిపించింది. నా చేతులు వణికాయి.
యువకుడు : నువ్వు నరేంద్రుని తాకడం వల్లనే నీ చేతులు వణికాయా?
కాళీ : అవును. ఎంత ప్రయత్నించినప్పటికీ నా చేతులు వణకడం ఆపలేక పోయాను.
శివరాత్రి పూజలు కొనసాగాయి. కాళీ ధ్యానంలో లయించిపోయాడు. ఇలా అతడు ప్రగాఢ ధ్యానంలో మునిగిపోవడం ఎవరూ ఇంతదాకా చూడలేదు. నరేంద్రుణ్ణి తాకడం వల్లనే ఇది సాధ్యమయిందని అందరూ భావించారు.*
వేకువజామున 4 గంటలకు నాలుగవ యామ పూజలు ముగిశాయి. అప్పుడు పూజామందిరంలోకి వచ్చిన శశి, నరేంద్రునితో, “గురుదేవులు నిన్ను పిలుస్తున్నారు” అన్నాడు. శశితోబాటు నరేంద్రుడు మేడ మీదకు వెళ్లాడు. ఆతణ్ణి చూడడమే ఆలస్యం, గురుదేవులు చీవాట్లు పెడుతున్న ధోరణిలో, “ఏమిటిది! పొదుపు చేయడానికి బదులు ఖర్చు చేయడమా? మొదట అవసరమైనంత మేరకు పొదుపు చేయి. ఎక్కడ ఎప్పుడు దానిని ఖర్చు చేయాలో తరువాతే నీకు తెలు స్తుంది, జగజ్జననే స్వయంగా దానిని నీకు గ్రహింపజేస్తుంది. నీ శక్తిని కాళీలోకి ప్రసరింపజేయడం ద్వారా అతడి కెంత హాని కలిగించావో తెలుసా? అతడు ఒక ప్రత్యేక మార్గంలో పురోగమిస్తున్నాడు. ఆరో నెలలో వాటిల్లిన గర్భస్రావంలా అది నిష్ప్రయోజనమైపోయింది. పోనీలే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట ఆలోచనారహితంగా ఏ పనీ చేయవద్దు. ఇంకా నయం, మరింత అనర్థం జరగక పోవడం కాళీ అదృష్టం” అన్నారు.
మౌనంగా నరేంద్రుడు బయటికి వచ్చేశాడు. “ఆశ్చర్యచకితుడనయ్యాను. పూజా సమయంలో జరిగింది యావత్తు ఆయనకు తెలిసిపోయింది. ఆయన నన్ను చీవాట్లు పెడుతున్నప్పుడు మౌనం వహించడం తప్ప మరేం చేయగలను!” అన్నాడు నరేంద్రుడు.
‘మర్రిచెట్టులా ఉండు’
ఈ విధంగా ఉన్నతమైన భక్తి, ధ్యాన అనుభవాలతో నరేంద్రుని కాశీపూర్ రోజులు గడిచాయి. సదా సర్వవేళల్లో ఉన్నత మనఃస్థితులలో లయించిపోవాలి, సమాధి స్థితిలో మగ్నమై ఉండాలనే తపన నరేంద్రునిలో రోజురోజుకూ అధికమవసాగింది. కనుక నిర్నిరోధమైన తప నతో ఒక రోజు శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్లి, “నాకు నిర్వికల్పసమాధి స్థితిని అనుగ్రహించండి” అని అడిగాడు.
ఈ ప్రశ్న శ్రీరామకృష్ణులకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది.
శ్రీరామకృష్ణులు : ముందు నా ఆరోగ్యం కుదుట పడనీ. ఆ తరువాత నువ్వు కోరిందల్లా ఇస్తాను.
నరేంద్రుడు : కాని మీరు నిష్క్రమిస్తే నా గతి ఏమిటి?
శ్రీరామకృష్ణులు ఒక క్షణం పాటు నరేంద్రుణ్ణి ఆప్యాయంగా తేరిపార చూశారు – ‘ఇతడు ఏమనుకొంటున్నాడు? నా దేహం కనుమరుగైనా నాకు నాశనం లేదని ఇతడికి ఇంకా అర్థం కాలేదా? ఆ తరువాత కూడా ఇతడు కోరిందల్లా నేను ఇవ్వనా?’ అంటూ ఆయన భావిస్తున్నట్లుగా ఉంది ఆ చూపు. అయినప్పటికీ తమ అనుంగు శిష్యుణ్ణి ప్రేమతో అడిగారు.
శ్రీరామకృష్ణులు : నాయనా, నీకు ఏం కావాలి?
నరేంద్రుడు : మునుపు చెప్పిందే. నేను ఎడతెగకుండా కొన్ని రోజులు సమాధిస్థితిలో మగ్నుడనై ఉండిపోవాలి. శరీర పోషణార్థం మాత్రం అప్పు డప్పుడు సమాధ్యవస్థ నుండి బయటికి రావాలి.
శ్రీరామకృష్ణులు గంభీర వదనంతో ఇలా అన్నారు:
“ఛ ఛ! నువ్వు విశాలహృదయుడవని అనుకొన్నాను. కాని ఇలా కోరుతున్నావే! ఇది నీకు తగునా? జీవితంలో దెబ్బలు తిని, దుఃఖంతో వచ్చే వేల మందికి నువ్వొక మర్రిచెట్టులా నీడనిస్తావని నేను ఆశించాను. కాని నువ్వో; స్వీయముక్తిని అభిలషిస్తున్నావు. ఏకపక్షమైన ఇలాంటి లక్ష్యాన్ని నువ్వెలా చింతన చేయగలిగావు? సర్వతోముఖ ప్రగతినే నేను కోరుకొంటాను. చేప కూరను నేను తింటాననుకో. పులుసు, కూర, పచ్చడిగా దానిని పలురకాలుగా తినగోరతాను. సమాధిస్థితిలో మగ్నమై భగవద్భావనలో లయించిపోయిన ఆనందంతో మాత్రం నేను సంతృప్తి చెందను. మానవ సంబంధాలలా భగవంతునితో అనేక మార్గా లలో సాంగత్యం నెరపి భగవదానందాన్ని నానారకాలుగా అనుభవించాలని నేను కోరుకొంటాను. నువ్వు కూడా అదే విధంగా ఉండాలన్నదే నా ఆరాటం.”
నిర్వికల్ప సమాధిలో
శిష్యునితో ఇలా చెప్పినప్పటికీ అతడికి ఆ అనుభవం చవిచూపాలని శ్రీరామ కృష్ణులు నిర్ణయించుకొన్నారు. ఇలావుండగా ఒక రోజు సాయంత్రం ధ్యానం చేస్తు న్నప్పుడు హఠాత్తుగా నరేంద్రునికి అద్వైత పరాకాష్ఠయైన నిర్వికల్పసమాధి స్థితి సిద్ధించింది. ముందు ఆతడి తల వెనుక భాగంలో ఒక దివ్యజ్యోతి కానవచ్చింది. పిదప అతడు మెల్లమెల్లగా బాహ్య, శరీర స్మృతులను కోల్పోయి సమాధిలో మగ్నుడయ్యాడు. ఇంద్రియాలకూ, మనస్సుకూ, లోకాలకూ, సమస్తానికీ అతీతమైన చైతన్యమయమైన నిర్వికల్పసమాధిలో లయించిపోయాడు. అలా చాలాసేపు గడచిపోయింది. సమాధిస్థితి నుండి దిగి వచ్చిన తరువాత కూడా అతడికి శరీర స్మృతి పూర్తిగా రాలేదు. తల మాత్రమే ఉండడం అతడి కెరుక, తక్కిన దేహం ఉన్నట్లు అసలు తెలియలేదు. కాబట్టి, “నా శరీరం ఎక్కడ? నా శరీరం ఎక్కడ?” అంటూ కేకలుపెట్టాడు. అతడి కేకలు విని పరుగున వచ్చిన పెద్దగోపాల్, ఆతడి శరీరాన్ని తాకి చూపి, “ఇదుగో ఉంది నరేన్, ఇదుగో ఉంది” అన్నాడు. గోపాల్ మాటలు నరేంద్రునికి వినిపించినట్లు లేదు. ముందు మాదిరిగానే కేకపెట్టాడు. దాంతో భయపడిపోయిన గోపాల్ పరుగెత్తుకొని మేడ మీదికి వెళ్లి శ్రీరామకృష్ణులకు ఈ విషయం వివరించి చెప్పాడు. అంతా ప్రశాంతంగా విన్న శ్రీరామకృష్ణులు నవ్వుతూ, “అతణ్ణి ఆ స్థితి లోనే ఇంకా కొంతసేపు ఉండనివ్వు. ఈ స్థితి కావాలని పలుమార్లు అతడు నన్ను వేధించాడు” అన్నారు.
చాలాసేపు గడచిన తరువాతే నరేంద్రునికి బాహ్యస్మృతి వచ్చింది. కళ్లు తెరచి చూసిన అతడికి తన చుట్టూ సోదర శిష్యులు విచారవదనంతో కూర్చుని ఉండడం కనిపించింది. ఇన్ని రోజులుగా ఆతడి మనస్సులో చెలరేగుతున్న తుపాను ఉపశమించింది; అమిత ప్రశాంతత నెలకొంది. ఆ తరువాత అతడు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లాడు. అతణ్ణి ఆనందంగా చూస్తూ ఆయన, “కాళీమాత ఇప్పుడు నీకు సమస్తాన్నీ చూపించింది. కాని ఈ అనుభవం తాత్కాలికంగా తాళం వేయబడి ఉంటుంది. దాని తాళం చెవి నా వద్ద ఉంటుంది. నువ్వు ఆమె కార్యాన్ని పూర్తిచేయగానే ఈ పెన్నిధి మళ్లీ నీకు దక్కుతుంది; మళ్లీ నీకు సమస్తమూ అవగతమవుతుంది” అన్నారు.
నరేంద్రునికి ఇంకా ఆ స్థితిలోనే లయించి ఉండిపోవాలనే తపన తగ్గలేదు. కనుక అతడు, “ఆహా! నేను ఆ స్థితిలో ఎంతో ఆనందం పొందాను. నన్ను ఆ స్థితిలోనే ఉండనివ్వండి” అని శ్రీరామకృష్ణులను అడిగాడు. శ్రీరామకృష్ణులు మళ్లీ అతణ్ణి చీవాట్లు పెట్టారు: “ఏమిటిది! జగజ్జనని అనుగ్రహంతో ఈ అనుభూతి నీకు స్వతస్సిద్ధంగానే లభిస్తుంది. సకల ప్రాణికోటిలోను ఒకే భగవంతుడు నెల కొని ఉండడం మామూలు స్థితిలోనే నీకు అనుభూతమవుతుంది. లోకంలో నువ్వు మహోన్నత కార్యాలు ఎన్నో సాధిస్తావు. అసంఖ్యాకులలో నువ్వు ఆధ్యాత్మిక చైత న్యాన్ని కలుగజేస్తావు. పేదసాదల కష్టాలను బాపుతావు” అన్నారు.
నరేంద్రుడు వెళ్లిపోయిన తరువాత, తక్కిన శిష్యులతో శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు: “స్వీయ సంకల్ప మాత్రాననే నరేన్ లోకం నుండి నిష్క్రమిస్తాడు. తాను ఎవరో గ్రహించిన మరుక్షణమే అతడు శరీరం త్యజిస్తాడు. తన మేధాశక్తితోను, ఆధ్యాత్మిక శక్తులతోను అతడు లోకపు పునాదులనే కదలించివేసే సమయం ఆసన్నమవుతుంది. అతడు పరమ సత్యాన్ని అనుభూతి పొందకుండా ఉండాలని నేను జగజ్జననిని ప్రార్థించాను. ఎందుకంటే అతడు దానిని పొందితే, ఆ తరువాత లోకంలో జీవించడు. అతడు చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. పరమ సత్యాన్ని అతడు పొందడానికి అడ్డుగా ఒక తెర మాత్రమే ఉంది. ఆ తెర ఎంతో పలుచనిది, ఏ క్షణంలోనైనా తొలగిపోవచ్చు.”
ఇంటి సమస్యలు
ఒక వైపు ధ్యానం, సమాధి స్థితులు కొనసాగుతున్నాయి అదే సమయంలో కుటుంబ సమస్యలు నరేంద్రుని మనసును కలచివేయసాగాయి. “నీ కుటుంబానికి ఏదో మార్గం చూపిరా” అని శ్రీరామకృష్ణులు చెప్పిన విషయం నరేంద్రుని మనసులో నాటుకుపోయింది. కనుక మర్నాడు ఒక స్నేహితుని వద్ద నూరు రూపాయలు అప్పుగా పుచ్చుకొని ఇంటికి వెళ్లాడు. ఆ పైకంతో కుటుంబ సమస్యలను మూడు నెలల వరకు గట్టెక్కించ వచ్చని అతడు భావించాడు.
కాని మూడు నెలలలో పరిష్కారమయ్యేదేనా కుటుంబ సమస్య? ఎవరో బాధపడితేనే కరుణతో కరగిపోయే నరేంద్రుడు తన తల్లీ, సోదరసోదరీమణులు ఆకలితో అలమటించడం చూస్తూ ఊరుకోగలడా? కనుక అతడి సమస్యలు కొనసాగుతూనే వచ్చాయి. గయలో ఒక జమీందారు వద్ద కార్యనిర్వాహకునిగా చేరదలచుకొన్నాడు. అక్కడకు వెళ్లడం కన్నా విద్యాసాగర్ పాఠశాలలో ఉద్యోగం దొరికితే బాగుటుందని అతడు ‘మ’ తో చెప్పను కూడా చెప్పాడు. కాని ఇవి ఏవీ జరుగలేదు.
బుద్ధుని అన్వేషణలో
నరేంద్రుడు ఈ రోజుల్లో బుద్ధుని జీవితాధ్యయనంలో మునిగిపోయాడు. ఉన్నత ఆధ్యాత్మిక జీవితానికీ, బాంధవ్యానికీ మధ్య కొట్టుమిట్టాడిన బుద్ధుని మహోన్నత జీవితం నరేంద్రుణ్ణి ఆకర్షించడంలో ఆశ్చర్యం లేదు. నిర్వాణ స్థితి తన ఎదురుగానే ఉన్నప్పటికీ దానిని త్రోసిరాజని, జీవరాశుల దుఃఖాన్ని బాపడానికి, వాటి సేవకు తన జీవితాన్ని అర్పించిన మహోన్నత కరుణాసాగరుడు కదా ఆయన! దాదాపు అటువంటి స్థితిలోనే ఉన్న నరేంద్రుడు, ఆయన జీవితంపై ఆకర్షితుడు కావడంలో ఆశ్చర్యం లేదు. లోకుల పట్ల గల కరుణతో బుద్ధుడు నిర్వాణాన్ని త్యజించాడు. నరేంద్రుడు సైతం లోక సేవ కోసం చరమస్థితిని త్యజించవలసి వచ్చింది. బుద్ధుని మహోన్నత కారుణ్యమయ జీవితం నరేంద్రుణ్ణి పూర్తిగా ఆకట్టుకొంది. అతడు, తారక్, కాళీ బుద్ధుని జీవితాన్ని క్షుణ్ణంగా చదివారు, చింతన చేశారు. సత్యాన్ని అవగతం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో బుద్ధుడు అశ్వత్థ (రావి) వృక్షం క్రింద ఆసీనుడై నప్పుడు చేసుకొన్న సంకల్పాన్ని ధ్యానమందిరంలోని గోడ మీద వ్రాసి ఉంచాడు.
ఈ ఆసనంపైనే నా శరీరం శుష్కించి కృశించిపోవుగాక! నా చర్మం, ఎముకలు, కండరాలు కరిగిపోవుగాక! యుగాల పర్యంతం ప్రయత్నాలు చేసినా దుర్లభమయిన అనుభూతి (బోధ)ని పొందకుండా నేను ఈ ఆసనం నుండి లేవనుగాక!*
బుద్ధుని స్మృతులలో మునిగిపోయేకొద్దీ నరేంద్రునికి బుద్ధగయకు వెళ్లాలనే ఆసక్తి పెరిగింది. బుద్ధుడు అనుభూతి పొందిన బోధిచెట్టు క్రింద కాసేపయినా కూర్చుని ధ్యానం చేయాలనే తపన ఆతడిలో తీవ్రతరం కాసాగింది. కనుక ఏప్రిల్ మొదటి వారంలో ఒక రోజు మధ్యాహ్నం నరేంద్రుడు, తారక్, కాళీ ఎవరికీ తెలియకుండా ఇంటి దొడ్డిదారి గుండా బుద్ధగయకు బయలుదేరారు.
ముగ్గురూ కాషాయాంబరాలు ధరించారు. సన్న్యాసులు ఉంచుకొన్నట్లు చేతిలో పటకారు* ఉంచుకొన్నారు. బుద్ధగయకు పోవడానికి మర్నాడు ఉదయం దాకా రైలు లేనందువలన ఆ రాత్రి ఒక దుకాణంలో గడిపారు. నరేంద్రుడు వేకువన మూడు గంటలకల్లా లేచి కిచ్చుడి వండాడు. అది తిని ముగ్గురూ బయలుదేరారు. దారి పొడవునా బుద్ధుని జీవితం గురించే మాట్లాడుకొన్నారు. మూడవ రోజు ఉదయం గయ చేరుకొన్నారు. అక్కడ ఫల్గు నదిలో స్నానం చేసి, పితృ తర్పణాలర్పించారు. అక్కడ నుండి ఎనిమిది మైళ్లు నడిచి సాయంత్రం బుద్ధ గయ చేరారు.
సాయంత్రం సద్దుమణిగాక ముగ్గురూ బోధిచెట్టు క్రింద ధ్యానంలో కూర్చు న్నారు. కాసేపటికి నరేంద్రుని ముందు ఒక అసాధారణమైన దివ్యకాంతి కన బడింది. అతడి మనస్సు ప్రశాంతమై, ఆనందంతో నిండిపోయింది. నరేంద్రుడు ఆ ఆనందంలో మునిగిపోయినట్లు కూర్చున్నాడు. బుద్ధుని అద్భుతమైన గుణగణాలు, సాటిలేని కరుణ, మానవత్వం ఉట్టిపడే ఉపదేశాలు, బౌద్ధమత ప్రభావంతో భారతదేశ చరిత్రలో జరిగిన పరిణామాలు మొదలైనవన్ని ఆతడి మనోనేత్రం ముందు భాసించాయి.
ఆతడి కళ్ల వెంట ఆనందబాష్పాలు స్రవించాయి. ఆ దృశ్యం చెదరిపోగానే ఆతడు తారక్‌ను కౌగిలించుకొని పిల్లవాడిలా విలపించాడు. తారక్, కాళీలు కూడా పరమానందాన్ని చవిచూశారు. మర్నాడు ఉదయం విలపించడానికి కారణం ఏమిటని నరేంద్రుణ్ణి అడిగినప్పుడు, “బుద్ధునితో సంబంధం గల స్థలంలో, ఆయన లేడనే ఆలోచన వచ్చినప్పుడు నా హృదయం వేదనతో తల్ల డిల్లింది. అందుకే విలపించాను” అన్నాడు.
అక్కడ కాశీపూర్‌లో హఠాత్తుగా ఈ ముగ్గురూ కనిపించకుండా పోవడం పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అందరూ ఎంతో దిగులు చెందారు. చివరికి వాళ్లు బుద్ధగయకు వెళ్లిన విషయం ఎలాగో తెలిసింది. ఈ సంగతి గురుదేవులతో చెప్పినప్పుడు ఆయన, “అతడు ఎక్కడకు పోగలడు? ఎన్ని రోజులు ఉండి పోతాడు? త్వరలో తిరిగి వస్తాడు. దిగులుపడకండి” అన్నారు. కాసేపటి తరువాత, “మీరు ప్రపంచం నలుమూలలా పయనించి చూడండి. మీరు దేనినీ చూడ లేరు. అక్కడ ఉన్నవన్ని (తమ దేహాన్ని చూపుతూ) ఇక్కడ ఉన్నాయి” అన్నారు శ్రీరామకృష్ణులు.
భువనేశ్వరీదేవి ఆవేదన
నరేంద్రుడు ఈ విధంగా సన్న్యాసి వేషంలో ఎవరికీ తెలియకుండా హఠాత్తుగా వెళ్లిపోవడం భువనేశ్వరీదేవికి తెలిసింది. మాతృహృదయం క్షోభిం చింది. దెబ్బ మీద దెబ్బలా ఎన్నో అగ్నిపరీక్షలకు ఎదురొడ్డి నిలిచిన వ్యక్తి ఆమె. ఒకప్పుడు జమీందారిణిలా జీవించి ఇప్పుడు దారిద్ర్యపు పిడికిలిలో నలిగిపోతున్న స్థితిలో ఉన్నప్పటికీ ఆమెకు ఒకే ఒక్క ఆలంబనంగా ఉన్నది నరేంద్రుడే! అతడు సంసారం పట్ల విరక్తితో జీవించడం ఆమెను అమిత ఆవేదనకు గురిచేసింది. అయినప్పటికీ కాశీపూర్లోనే కదా నివసిస్తున్నాడని తనను తానే సాంత్వన పరచుకొంది ఆ తల్లి. కాశీపూర్ నుండి అప్పుడప్పుడు నరేంద్రుడు ఇంటికి వెళ్లివచ్చేవాడు. అతడి సోదర శిష్యులు కొందరు కూడా వచ్చేవారు. ఇప్పుడు కాశీపూర్ నుండి కూడా అతడు ఎటో వెళ్లిపోయాడనే వార్త వినగానే ఆమె తిన్నగా కాశీపూర్ వెళ్లి శ్రీరామకృష్ణులను కలుసుకొంది. నరేంద్రుడు శ్రీరామకృష్ణులను దర్శించడానికి కారకుడైన రామచంద్ర దత్తా తండ్రి నరసింహ ప్రసాద్ దత్తా కూడా భువనేశ్వరితోపాటు వెళ్లాడు.
శ్రీరామకృష్ణులు భువనేశ్వరీదేవిని సాదరంగా ఆహ్వానించి, “అతణ్ణి ఆపడా నికి నేనెంతో ప్రయత్నించాను. అయినప్పటికీ అతడు వెళ్లిపోయాడు. నేనేం చేయ గలను? అతడు తప్పక తిరిగి వస్తాడు” అంటూ ఆమెను సాంత్వనపరిచారు. కాని భువనేశ్వరీదేవి ఆవేదన అంత సులభంగా తీరుతుందా? ఆమె కేవలం నమ్మ కంతో ఇంటికి తిరిగి వచ్చింది.
వృత్తాన్ని దాటి….
రెండు రోజులు గడచినా నరేంద్రుడు తక్కిన వారితో తిరిగి రాకపోవడంతో మిగతా శిష్యులు కలతచెంది మళ్లీ శ్రీరామకృష్ణులను ఆశ్రయించారు. శ్రీరామ కృష్ణులు ప్రశాంతంగా లేచి తమ చేత్తో ఒక వృత్తం గీచి, “ఈ వృత్తం దాటి నరేంద్రుడు వెళ్లలేడు” అన్నారు. అందరూ తేలిగ్గా ఊపిరిపీల్చుకొని, నిరీక్షించసాగారు.
ఆ ముగ్గురూ బుద్ధగయలో మూడు నాలుగు రోజులు గడిపారు. ఇంతలో హఠాత్తుగా నరేంద్రునికి విరేచనాలు పట్టుకొన్నాయి. దాంతో అతణ్ణి నిస్సత్తువ ఆవ హించింది. ఆ పైన వారు అక్కడ ఉండదలచుకోలేదు. వెంటనే కాశీపూర్‌కు తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకొన్నారు. కానీ చేత చిల్లిగవ్వ లేదు. తాము బస చేసిన ఆలయ ప్రధాన సన్న్యాసిని డబ్బు అడగాలని ఆయన వద్దకు వెళ్లారు. అక్కడ నరేంద్రుడు ఒకటి రెండు పాటలు పాడాడు. ఆ పాటలు విన్న ఆ సన్న్యాసికి ఎంతో ఆనందం కలిగింది. ప్రయాణ ఖర్చు కోసం ఆయన కొంత డబ్బు ఇచ్చాడు.
ముగ్గురూ గయలో అడుగుపెట్టినప్పుడు అనుకోకుండా నరేంద్రుని తండ్రి స్నేహితులలో ఒకరు అతడికి తారసపడ్డాడు. తమ ఇంట్లో ఒక సంగీత కార్య క్రమం ఏర్పాటు చేశాననీ, నరేంద్రుడు వచ్చి అందులో పాడాలనీ ఆయన తన అభిలాషను వ్యక్తం చేశాడు. అందుకు అంగీకరించి అక్కడికి వెళ్లి నరేంద్రుడు పాడాడు. ప్రయాణ ఖర్చులకు అవసరమైన తక్కిన డబ్బును ఆయన ఇచ్చారు. మొత్తం మీద ఆ ముగ్గురూ కాశీపూర్ చేరుకొన్నారు. శ్రీరామకృష్ణులు ఆనందంగా వారితో బుద్ధుని గురించీ, బౌద్ధమతం గురించీ ముచ్చటించారు.
శ్రీరామకృష్ణుల సంకల్పం
ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలు గడచిపోయాయి. శ్రీరామకృష్ణుల ఆరోగ్యం బాగా క్షీణించింది. అల్లోపతి, హోమియోపతి ఆయుర్వేదం లాంటి అనేక వైద్యపద్ధతులతో ఆయనకు చికిత్స చేశారు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోగా, నానాటికీ మరింతగా క్షీణించ సాగింది. ఈ రుగ్మత నుండి తాను బయటపడనని రూఢిగా తెలిసినా, అది తెలిస్తే తక్కినవారు బాగా కలత చెందుతారనే కారణంగా ఎవరితోను ఈ విషయం గురించి ప్రస్తావించలేదు. ఒకసారి ‘మ’ తో, “నా నిష్క్రమణానంతరం మీరందరూ మనఃక్లేశంతో విలపిస్తూ వీథుల్లో తిరుగుతారని అనుకొన్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది; ఈ దేహాన్ని త్యజించడానికీ మనస్సు ఒప్పడం లేదు” అని అన్నారు. కాని ప్రారంభం అంటూ ఒకటి ఉన్నప్పుడు ముగింపు అనేది కూడా ఉండే తీరాలి కదా! ఆయన నిష్క్రమించడానికి సంక ల్పించుకొన్నారని అందరూ గ్రహించారు. ఎందుకంటే! తాను నిష్క్రమించే సమయంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని ఆయన చెప్పారో అవి ఒక్కొక్కటిగా జరగసాగాయి.* కలలు, దృశ్యాలు లాంటి పలు అపశకునాలను శ్రీ శారదాదేవి గాంచారు.*
‘అన్ని నోళ్ల ద్వారా తింటున్నాను’
తమ వ్యాధి నయంకాదని శ్రీరామకృష్ణులు నిర్ధారణ చేసుకొని, దానిని అట్లే స్వీకరించాలని సంకల్పించుకొన్నారని ఈ క్రింది సంఘటనలు తెలుపుతున్నాయి. ఒక రోజు శశధర పండితుడు కాశీపూర్ వచ్చాడు. ఆయన గురుదేవులతో, “మహాత్ముల అలౌకిక శక్తులను గురించి శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వారికి వ్యాధి సంక్రమిస్తే తమ మనఃశక్తిని వ్యాధిగ్రస్థమైన శరీర భాగం మీద ప్రసరింపజేయడం ద్వారా ఆ వ్యాధిని నయం చేసుకోగలిగేవారు. మీరు కూడా ఎందుకు అలా చేయకూడదు?” అని అడిగాడు. ఇది గురుదేవులకు సుతరామూ నచ్చలేదు. కాస్త చీవాట్లు పెట్టే ధోరణిలో, “ఉద్దండ పండితుడివై ఉండీ నీలో ఇలాంటి ఆలోచనలా? ఈ మనస్సు పరిపూర్ణంగా భగవంతునికి అర్పితమయింది. దానిని ఆయన నుండి నిరుపయోగ మైన ఈ శరీరం మీదికి మరల్చడమా?” అని అడిగారు. పండితుడు మౌనం వహిం చాడు. కాని శిష్యులు పట్టుబట్టారు. “ఎలాగైనాసరే మీరు ఈ రుగ్మతను నయం చేసుకొనే తీరాలి. మా కోసమైనా దీనిని చేయండి” అంటూ అందరూ ప్రాథేయ పడ్డారు. “అంతా జగజ్జనని సంకల్పం మేరకే జరుగుతుంది” అన్నారు శ్రీరామ కృష్ణులు. “అలా అయితే ఆమెనే ప్రార్థించండి. మా కోసం మీరు దీనిని జగజ్జననిని కోరే తీరాలి” అన్నాడు నరేంద్రుడు. సంకోచిస్తూ అందుకు ఆయన సమ్మతించారు.
కొన్ని గంటలు గడిచాయి. నరేంద్రుడు గురుదేవులతో, “జగజ్జననిని ప్రార్థిం చారా?” అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు ప్రశాంతంగా ఇలా జవా బిచ్చారు: “అవును. అడిగాను. ‘అమ్మా! గొంతు నొప్పి కారణంగా నేను ఏమీ తినలేకపోతున్నాను. నేను ఏదో కాస్త తినేలా అనుగ్రహించు తల్లీ’ అని ఆమెను ప్రార్థించాను. అందుకు ఆమె ఏం చెప్పిందో తెలుసా? ‘ఎందుకు? ఈ ఒక్క నోటి తోనే నువ్వు తినాలా? ఎన్నో నోళ్ల ద్వారా తింటున్నావుగా! అది చాలదా?’ అని అడిగింది. నేను సిగ్గుపడ్డాను. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను.”
మరొక రోజు రాఖాల్, శ్రీరామకృష్ణులతో ఈ వ్యాధిని నయం చేయడం గురించి మాట్లాడాడు.
రాఖాల్ : మీ దేహం ఇంకా కొంతకాలం నిలిచి ఉండాలని జగజ్జననిని ప్రార్థించండి.
శ్రీరామకృష్ణులు : అంతా జగజ్జనని సంకల్పం ప్రకారం జరుగుతుంది.
నరేంద్రుడు : మీ సంకల్పమూ, జగజ్జనని సంకల్పమూ వేర్వేరా? రెండూ ఒకటయ్యాయి కదా!
శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత ఇలా అన్నారు: “నేను జగజ్జననితో మాట్లాడినా ప్రయోజనం ఉండదు. నేనూ ఆమె ఒకటే అయిపోయినట్లుగా ఇప్పుడు చూస్తున్నాను.”
భగవంతుడు ఉన్నాడా?
చికిత్స, ప్రార్థన మొదలైన విధానాలలో ప్రయత్నించినప్పటికీ శ్రీరామ కృష్ణుల రుగ్మత నయం కాకపోవడంతో నరేంద్రుని మనస్సు మళ్లీ సందిగ్ధంలో కొట్టుమిట్టాడసాగింది. పాత సంశయాలు మళ్లీ తలెత్తినట్లుగా ఉంది. భగవంతుడు నిజంగానే ఉన్నాడా, అలా ఉండివుంటే ఇలాంటి సజ్జనునికి ఎందుకు ఈ వ్యాధి సంక్రమించాలి? అనే ప్రశ్నలు అతడి హృదయాన్ని రంపపు కోతకు గురిచేశాయి. ఏప్రిల్ మాసాంతంలో ఒక రోజు హీరానందుడనే వ్యక్తి శ్రీరామకృష్ణుల వ్యాధి గురించి విని ఆయనను చూడడానికి వచ్చాడు. ఇతడికి శ్రీరామకృష్ణులతో ఇంతకు మునుపే పరిచయం ఉంది. నరేంద్రుడు హీరానందునితో మాట్లాడినప్పుడు ఈ భావనలు వ్యక్తమయ్యాయి.
హీరానందుడు : భక్తునికి కష్టాలు ఎందుకు కలుగుతాయి?
నరేంద్రుడు : ఎందుకంటే సృష్టి విధానమే పైశాచికం కనుక. నేను సృష్టించి ఉంటే ఇంతకన్నా మంచి లోకాన్ని సృష్టించి ఉండేవాణ్ణి.
హీరానందుడు : దుఃఖం లేకుండా సుఖం అంటే ఏమిటో తెలుసుకో గలమా?
నరేంద్రుడు : ప్రపంచాన్ని సృష్టించాలన్న విషయమై నేను కొత్త ప్రణాళిక ఏదీ చెప్పడం లేదు. కాని ప్రస్తుతం ఉన్న ప్రపంచాన్ని గురించి నా అభిప్రాయం తెలియజేస్తున్నాను, అంతే. కాని ఈ సమస్య లన్నింటికీ సమాధానం – ప్రకృతి సర్వత్రా ఒకే భగవంతుడు నెలకొని ఉన్నాడనే (Pantheism) విశ్వాసం కలిగి ఉండడం. అలాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు సంశయాలన్నీ సమసిపోతాయి. అంతా చేస్తున్నది ఆ భగవంతుడే.
అందరూ మౌనంగా ఉండిపోయారు. ఈ సంభాషణను శ్రీరామకృష్ణులు కూడా విన్నారు. పిదప హీరానందుడు, నరేంద్రుణ్ణి పాడమని అడిగాడు. నరేం ద్రుడు శంకరాచార్యుల వారి ‘కౌపీనపంచకమ్’* పాడాడు. శ్రీరామకృష్ణులు అది విని ఎంతో ఆనందించారు. ఆ తరువాత ‘ఉండేది నీ వొకడవే ఈ సర్వము నీ మయమే….’ అనే పాట పాడమని అడిగారు. నరేంద్రుడు పాడాడు.
హీరానందుడు : అవును. నువ్వే పాడుతున్నావు – ఉండేది నీ వొకడవే! ‘నేను’ కాదు, ‘నువ్వే’ ఉన్నావు.
నరేంద్రుడు : నువ్వే నేను, నేనే నువ్వు. నేను తప్ప అన్యమైనది ఏదీ లేదు.
ఈ భావాన్ని వ్యక్తంచేసే ‘అష్టావక్ర సంహిత’ లోని కొన్ని శ్లోకాలు నరేం ద్రుడు వల్లించాడు. వెంటనే శ్రీరామకృష్ణులు నరేంద్రుని చూపుతూ, హీరానందు నితో, “ఇతడు ఒర నుండి తీసిన ఖడ్గం చేత పట్టిన వ్యక్తిలా నడుస్తున్నాడు!” అన్నారు. పిదప హీరానందుణ్ణి చూపుతూ, ‘మ’ తో, “ఎంత శాంతంగా ఉన్నాడు! మంత్రగాడి ముందు నాగుపాము పడగ విప్పి నిశ్చలమైపోయినట్లు” అన్నారు.
నరేంద్రుడు ‘మ’ తో ఇలాంటి భావాన్ని వ్యక్తం చేసే సంభాషణ కూడా ఈ రోజుల్లో జరిగింది.
నరేంద్రుడు : దేవుడు, గీవుడు అంటూ ఏదీ లేదు.
‘మ’ : భగవన్మార్గంలో ఇలాంటి అపనమ్మకాలు సహజం. నువ్వు ఈ రోజు చెప్పినదానిని రేపు కాదంటావు.
నరేంద్రుడు : ఇదిగో నేను ఈ చెట్టును చూస్తున్నాను. ఆ విధంగా ఎవరైనా భగవంతుణ్ణి చూశారా?
‘మ’ : ఎందుకు, గురుదేవులు చూశారు కదా!
నరేంద్రుడు : అది మనోభ్రాంతి జనిత దృశ్యంగావచ్చు.
‘మ’ : చెట్టును చూసినట్లు భగవంతుణ్ణి చూడడం గురించి చెప్పావు. అట్లే భగవంతుడు ఒక ఆకృతిని దాల్చి నీ ముందు నిలబడి, ‘నేనే దేవుణ్ణి’ అని చెబితే మాత్రం నువ్వు నమ్ముతావా ఏమిటి? వాద తర్కాల ద్వారా భగవత్సాక్షాత్కారం పొందలేమని గురుదేవులు చెబుతారు కదా! అవసరమైనది విశ్వాసం. అది ఉంటే జ్ఞానం, భగవత్సాక్షాత్కారం, భగవంతునితో మాట్లాడడం అన్నీ సంభవమే.
ఇతరులతోనే అనడం ఎందుకు ఒక రోజు సాక్షాత్తు గురుదేవులతోనే నరేంద్రుడు, “నాకు దేవుడూ వద్దు, మరెవరూ వద్దు. నాకు కావలసినదంతా శాంతి, శాంతి మాత్రమే. నాకు సత్యం కావాలి, జ్ఞానం కావాలి, అనంతం కావాలి” అన్నాడు.
శ్రీరామకృష్ణులను గురించి
భగవంతుని భావన గురించే కాదు, శ్రీరామకృష్ణుల గురించి కూడా నరేం ద్రుని భావన క్రమక్రమంగా మారుతూ రావడం మనం గమనించవచ్చు. మొదట్లో శ్రీరామకృష్ణులు, “అవతారం కాదు” అన్నాడు. ఆ తరువాత, “దేవుడికీ మనిషికీ మధ్యలో అవగతం కాని ఏదో ఒక దశ లోని వారు” అన్నాడు. అతడి భావన మరింత వికాసం చెంది, “మీ సంకల్పమూ జగజ్జనని సంకల్పమూ భిన్నమైనవా?” అని అడగడం దాకా రావడం చూస్తాం. చివరికి ఈ కాలఘట్టంలో ఆతడి భావన ఇంకా మారి పోయింది.
ఒక రోజు రాఖాల్, శ్రీరామకృష్ణులతో, “ఇప్పుడిప్పుడే మిమ్మల్ని నరేంద్రుడు బాగా అర్థం చేసుకోనారంభించాడు” అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ “అవును, నిజమే” అన్నారు. కాసేపటి తరువాత మళ్లీ ఆయన, “సమస్తమూ – ఉన్న సమస్తమూ – దీని నుండే (అంటే తమ నుండే) ఉద్భ వించినట్లుగా నేను గాంచుతున్నాను” అని చెప్పి, నరేంద్రుణ్ణి, “దీని నుండి నీకు ఏం అర్థమయింది?” అని అడిగారు. అందుకు అతడు, “సృష్టి యావత్తూ మీ నుండే ఉద్భవించింది” అన్నాడు. ఆ జవాబు విని శ్రీరామకృష్ణులు ఎంతో సంతోష పడ్డారు.
నరేంద్రుని భావనలు క్రమంగా పరిణతి చెందడం గమనించిన, ‘మ’, అతడితో ఒక రోజు, “నీ విషయంలో మాత్రమే కాదు, తమకు కూడా ఇలాంటి స్థితులు ఏర్పడినట్లు గురుదేవులు ఒక రోజు నాతో చెప్పారు” అని చెప్పాడు.
ఎక్కడకు తోడ్కొని వెళ్లినా వస్తాను
శ్రీరామకృష్ణుల వ్యాధి పలు ఉద్దేశాల సాఫల్యానికి నిమిత్తమాత్రంగా సంక్రమించిందని ఇంతకు మునుపే చూశాం. దీని ద్వారా భక్తుల మధ్య ఒక అనురాగబంధం పెనవేసుకొంది. భవిష్యత్తులో సన్న్యాసులు కాబోయే యువకుల మధ్య సోదర ప్రేమ జనించింది. అదే సమయంలో శ్రీరామకృష్ణుల పట్ల పరిపూర్ణ విశ్వాసం లేనివారిని ఆయన నుండి వైదొలగించడానికి కూడా ఈ వ్యాధి దోహదం చేసింది. ఈ రోజుల్లో శ్రీరామకృష్ణుల యువశిష్యులు, గృహస్థ భక్తులు, శిష్యురాండ్రు ఆయన సేవాశుశ్రూషల్లో సమధికోత్సాహంతో పాలుపంచుకొన్నారు. గృహస్థ భక్తులు ఖర్చులు భరించసాగారు. తమ వ్యాధి పేరిట పైకం వసూలు చేయడం శ్రీరామకృష్ణులకు సుతరామూ నచ్చలేదు. గురుదేవులకు అయ్యే ఖర్చులను బలరాంబోసు భరించాడు. ఇంటి బాడుగ సురేంద్రనాథ్ మిత్ర ఇవ్వసాగాడు. ఈ రకంగా మొత్తం ఖర్చులను పలువురు పంచుకొన్నారు. చిన్న గోపాల్ జమాఖర్చుల పద్దు చూసుకోసాగాడు.
ఖర్చులు ఎక్కువయినప్పుడు, గృహస్థ శిష్యులు యువకులను తప్పుబట్టారు. వారు ఎక్కువ ఖర్చులు చేస్తున్నారు. కనుక ఖర్చులు తగ్గించాలన్నారు. అంతేకాదు; శ్రీరామకృష్ణులకు ఇద్దరు మాత్రం సేవలందిస్తే చాలు, తక్కినవారు తమ తమ ఇళ్లలోనే ఉండిపోయి, ఇక్కడకు వచ్చి చూసుకొంటే మాత్రం చాలని అభిప్రాయ పడ్డారు.
ఇది యువకులకు ఏ మాత్రమూ నచ్చలేదు. ఈ రెండు బృందాల మధ్య అభిప్రాయభేదాలు పెరగడం గమనించిన నరేంద్రుడు విషయం యావత్తు శ్రీరామకృష్ణులకు విన్నవించాడు. నరేంద్రుని బాధను చూసి ఆయన, “ఇక గృహస్థ భక్తుల డబ్బు నాకు వద్దు. ఓ నా నరేన్, నీ భుజస్కంధాలపై నన్ను నువ్వు ఎక్క డకు మోసుకుపోయినా నేను అక్కడకు వచ్చి ఉంటాను నాయనా” అన్నారు ఉద్వేగభరితంగా. తరువాత ఆ యువకులతో, “మీరు సన్న్యాసులు. భిక్షాటనతో పొట్టపోసుకోవడమే మీ ధర్మం. అలా జీవించడం ఇప్పటి నుండే మీరు అల వాటు చేసుకోండి” అన్నారు. యువకులు కూడా ఆ విధంగా జీవించాలనే నిర్ణయించుకొన్నారు.
గృహస్థ భక్తుల నుండి డబ్బు పుచ్చుకోవడం మానివేశారు. వారు వచ్చి శ్రీరామకృష్ణులను కలుసుకోవడాన్ని కూడా నిరోధించారు. లక్ష్మీనారాయణ్ అనే మార్వాడీ భక్తుడు డబ్బు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. కాని శ్రీరామకృష్ణులు నిరాకరించారు. పిదప గిరీశ్‌ను పిలిచి పరిస్థితిని వివరించి చెప్పారు. మొత్తం ఖర్చులను తానే భరిస్తాననీ, అవసరమైతే తన ఇంటిని తెగనమ్మివేస్తాననీ గిరీశ్ చెప్పాడు. కాని సమస్య అంతదాకా పోవడానికి ముందే శ్రీరామకృష్ణులే స్వయంగా రెండు బృందాల వారినీ పిలిపించి, మాట్లాడి పరిస్థితిని చక్కబరిచారు. అభిప్రాయ భేదాలు తొలగి మళ్లీ అందరూ కలసికట్టుగా శ్రీరామకృష్ణుల సేవకు అంకిత మయినారు.
సన్న్యాసులను రూపొందిస్తున్నారు
ఒక రోజు పెద్ద గోపాల్ కొన్ని కాషాయాంబరాలను, రుద్రాక్ష మాలలను ఒక మూటగా కట్టి శ్రీరామకృష్ణుల వద్దకు తెచ్చాడు; వాటిని ఉత్తములైన సన్న్యాసులకు ఇవ్వబోతున్నట్లు తెలిపాడు. అప్పుడు శ్రీరామ కృష్ణులు తమ ముందున్న యువ శిష్యులను చూపి, “వీరి కన్నా శ్రేష్ఠులయిన సన్న్యాసులు లేరు. వీరికే అవి ఇవ్వు” అన్నారు. పెద్ద గోపాల్ మూటను తెచ్చి శ్రీరామకృష్ణుల ముందు ఉంచాడు. వాటిని ఆ యువకులకు* స్వయంగా ఆయనే ఇచ్చారు. ఒక రోజు సాయంత్రం సన్న్యాసానికైన క్రతువు ఒకటి ఆచరించమని, ఊళ్లోకి పోయి భిక్షమెత్తి రమ్మని వారితో ఆయన చెప్పారు.
శ్రీరామకృష్ణుల ఆదేశానుసారం భిక్షార్థం అందరూ బయటికి వెళ్లారు. వారిలో కొందరు శ్రీమంతుల పిల్లలు; బాగా గారాబంగా పెరిగినవారు. అయి నప్పటికీ శ్రీరామకృష్ణుల ఆదేశాన్ని శిరసావహించి మహదానందంతో బయలు దేరారు. శ్రీరామకృష్ణులు అనుగ్రహంచిన కాషాయాంబరాలు ధరించారు. వారు తమ ప్రప్రథమ భిక్షను మాతృదేవి నుండే యాచించారు. వారు భిక్ష యాచించ డమే ఆలస్యం, మాతృదేవి ఒక రూపాయి వారి భిక్షాపాత్రలో వేశారు. ఈ విధంగా మాతృదేవి రామకృష్ణ సంఘానికి ప్రథమంగా అనుగ్రహశక్తిని ఒసగారు. ఆ తరువాత వారు భిక్షకై బయటకు వెళ్లారు.
భిక్షాటనలో వారు విభిన్న అనుభవాలు చవిచూశారు. కొన్నిచోట్ల బియ్యం, బంగాళాదుంపలు, అరటికాయలు, వంకాయలు మొదలైనవి భిక్షగా వేశారు. కొన్నిచోట్ల పెద్దగా హితోపదేశాలు చేసి, తరిమివేశారు. కొందరు, “పుష్టిగా బాగానే ఉన్నారు కదా! పనిచేసి ఎందుకు సంపాదించుకోకూడదు? ఇలా కాషాయ వస్త్రాలు ధరించి ఎందుకు భిక్షమెత్తాలి?” అని అడిగి మరీ తరిమివేశారు. మరి కొందరు, “వీరు కచ్చితంగా ఏదో దొంగల ముఠాకు చెందినవారై ఉండాలి. పగటి పూట ఈ రకంగా సన్న్యాసుల్లా వచ్చి వివరాలు సేకరించుకొనిపోతారు” అన్నారు.
మొత్తం మీద లభించిన బియ్యం, కాయగూరలను శ్రీరామకృష్ణుల వద్దకు తీసుకుపోయారు. ఆయన వాటిని మాతృదేవికి ఇచ్చి వండమన్నారు. వండిన ఆహారం నుండి కాస్త తీసుకొని నోట్లో వేసుకొని, “ఇది అత్యంత పవిత్రమైన ఆహారం” అని వ్యాఖ్యానించారు. ఆయన చెప్పలేనంత సంతృప్తి చెందారు. మళ్లీ ఒకటి రెండుసార్లు ఆయన యువకులను బయటికి పంపి భిక్షాటన చేసిరమ్మ న్నారు. ఈ విధంగా ఆయన రామకృష్ణ సన్న్యాససంఘానికి శ్రీకారం చుట్టారు.
‘నరేన్ ఉపదేశిస్తాడు’
సన్న్యాస సంఘ ప్రారంభం జరిగిపోయింది. తరువాత? ఒకసారి ఒక కాగితం ముక్కమీద, “జై రాధే ప్రేమమయీ! నరేన్ లోకానికి ఉపదేశిస్తాడు. సర్వత్రా వెళ్లి సత్యాలను చాటిచెబుతాడు” అని శ్రీరామకృష్ణులు వ్రాసి చూపారు.* నరేంద్రుడు దానిని నిరాకరించి, “అవన్నీ నా వల్ల సాధ్యం కాదు” అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, “నువ్వు చేసి తీరాలి. కాలక్రమంలో నా శక్తులు నీ ద్వారా అభివ్యక్తమవుతాయి” అన్నారు.
రోజులు దొర్లిపోతున్నాయి. ఒక రోజు శ్రీరామకృష్ణులు యోగీన్ను పిలిచి పంచాంగం తీసుకురమ్మన్నారు. ఆగస్టు తొమ్మిదవ తేదీ నుండి వరుసగా తిథు లనూ, నక్షత్రాలనూ, వాటి ఫలితాలనూ చదువుతూరమ్మని చెప్పారు. నెలాఖరు తేదీ రాగానే ఆపైన చదవవద్దని సైగ చేశారు.
శక్తిని ధారపోస్తున్నారు
ఈ సంఘటన జరిగి నాలుగయిదు రోజులు గడిచాయి. ఒక రోజు శ్రీరామ కృష్ణులు నరేంద్రుణ్ణి తమ వద్దకు రమ్మని పిలిచారు. అప్పుడు గదిలో వారిద్దరు మాత్రమే ఉన్నారు. నరేంద్రుణ్ణి ఎదుట కూర్చోమని చెప్పి, ఆతణ్ణే తదేకంగా చూస్తూ గాఢ సమాధిమగ్నులయ్యారు: కాసేపటికల్లా నరేంద్రుడు తన శరీరంలో విద్యుత్తు లాంటి ఒక శక్తి ప్రసరించే అనుభూతి పొందాడు. క్రమక్రమంగా అతడు కూడా బాహ్యస్మృతి కోల్పోయాడు. అలా ఎంతసేపు తాను సమాధి స్థితిలో మగ్నుడై పోయాడో అతడికి తెలియలేదు. బాహ్యస్మృతి కలిగి కళ్లు తెరిచి చూసేసరికి శ్రీరామకృష్ణులు కన్నీరు కారుస్తూ కూర్చుని ఉండడం కనిపించింది. అందుకు కారణం ఏమిటని నరేంద్రుడు అడిగినప్పుడు, “నాకున్న సర్వస్వమూ నీకు ధార పోసి నేను బికారినయిపోయాను. ఈ శక్తుల ద్వారా నువ్వు లోకానికి ఎంతో శ్రేయస్సు ఒనగూరుస్తావు. ఆ తరువాత నువ్వు ఎక్కణ్ణుండి వచ్చావో ఆ చోటికే మరలిపోతావు” అని చెప్పారు. ఈ రీతిలో ఆయన తమ శక్తిని నరేంద్రునికి ధార పోశారు.
‘రాముణ్ణీ కృష్ణుణ్ణీ నేనే!’
రెండు రోజులు గడిచాయి. తాను అవతార పురుషుడనని శ్రీరామకృష్ణులు చెప్పుకొనే విషయాన్ని పరీక్షించాలనే ఆలోచన నరేంద్రునిలో తలెత్తింది. ఆ రోజు భరించరాని నొప్పితో శ్రీరామకృష్ణులు తల్లడిల్లిపోతున్నారు. ‘శారీరక వ్యాధి వలన ఇంతగా తల్లడిల్లిపోతున్న ఈ స్థితిలో కూడా ఆయన తమను అవతారపురుషునిగా వచించే పక్షంలో, ముమ్మాటికీ ఆయన అవతారపురుషులేనని నమ్ముతాను’ అని నరేంద్రుడు అను కొన్నాడు. ఇలా అతడు అనుకోవడమే ఆలస్యం, పడక మీద పడుకొనివున్న శ్రీరామకృష్ణులు తమ శక్తినంతా కూడదీసుకొని లేచి కూర్చుని సుస్పష్టమైన స్వరంలో ఇలా అన్నారు: “నరేన్! మునుపు ఎవరు రాముడుగాను, కృష్ణుడుగాను అవతరించారో, వారే ఇప్పుడు రామకృష్ణులుగా ఈ శరీరంలో ఉన్నారు: కాని నీ వేదాంత భావన ప్రకారం కాదు.” ఎన్నో దివ్య దృశ్యాలూ, శక్తులూ ఆయనలో చూసిన తరువాత కూడా ఇంకా తనకు సంశయం నివృత్తి కాకపోయినందుకు నరేంద్రుడు సిగ్గుతో, అవమానంతో తలవంచాడు.
బాధ్యత అప్పగింత
ఒక రోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి తప్ప తక్కిన తమ యువశిష్యులను పిలిపించారు. ఆయన మాట్లాడలేకపోతున్నారు. అయినప్పటికీ అతి మెల్లని స్వరంలో, “ఇదిగో చూడండి! మిమ్మల్ని నరేంద్రుని బాధ్య తలో వదలి పోతున్నాను. అతడు చెప్పినట్లు మెలగండి. అతడి ఆరోగ్యాన్నీ, శ్రేయస్సునూ గమనించి మసలుకోండి” అన్నారు. ఆ తరువాత నరేంద్రుణ్ణి పిలిచి, “ఇదిగో చూడు నాయనా, నరేన్! ఈ నా బిడ్డలనందరినీ నీకు అప్పగించిపోతున్నాను. అందరిలోను బుద్ధిశాలివీ, ప్రతిభావంతుడివీ నువ్వు. ప్రేమతో వారికి నేతృత్వం వహించు. నా కోసం పనిచేయి” అన్నారు.
శ్రీరామకృష్ణులు నిష్క్రమిస్తున్నారు
ఆగస్ట్ 15 వ తేదీ. ఏ రోజు రాకూడదని భక్తులు పరితపించారో ఆ రోజు రానే వచ్చింది. నాడు ఆదివారం. శ్రీరామకృష్ణుల వ్యాధి అంతదాకా లేనంత తీవ్రరూపం దాల్చింది. ఆయన నాడి అస్తవ్యస్తంగా ఉంది. అతుల్ అనే భక్తుడు ఆయన నాడిని పరీక్షించి, ఆయన పరిస్థితి విషమిస్తూన్నదని గ్రహించాడు. చుట్టూవున్న వారితో ఇక ఆయన బ్రతకడం కష్టమని తెలిపాడు.
సూర్యాస్తమయం కాబోతున్నది. శ్రీరామకృష్ణులు శ్వాసించడంలో బాగా ఇబ్బందిపడుతున్నారు. శ్వాస లాగనారంభించింది. భక్తులు వెక్కివెక్కి ఏడ్వ సాగారు. తమ జీవితాలలో ఇంతవరకు ఏ దివ్యప్రకాశం ఆనందాన్ని నింపుతూ వచ్చిందో, అది ఆరిపోతున్నదని గ్రహించిన అందరూ ఆయన చుట్టూచేరారు. కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు తనకు ఆకలిగా ఉందన్నారు. ద్రవాహారం ఇచ్చారు. కాని ఆయన త్రాగలేకపోయారు. ఎంతో శ్రమతో కాస్త త్రాగగలిగారు. మూతి తుడిచి మెల్లగా ఆయనను పడుకోబెట్టారు. రెండు కాళ్లను బార్లగా జాపి దిండు మీద ఉంచారు. ఇద్దరు విసరసాగారు. పడుకొని ఉన్నవారు హఠాత్తుగా అట్లే సమాధిమగ్నులయ్యారు. దేహం శిలలా నిశ్చలమయిపోయింది, శ్వాస స్తంభించింది.
ఇన్ని రోజులుగా రేయింబవళ్లు ప్రక్కనే ఉండి సేవలు చేస్తూవచ్చిన శశికి ఈ సమాధిస్థితి మామూలుగా కలిగే సమాధి స్థితిలా తోచలేదు. ఏదో పెద్ద మార్పు ఉన్నట్లు అనిపించి విలపించసాగాడు. అప్పుడు నరేంద్రుడు అందరిని, “హరిః ఓం తత్సత్” అని ఉచ్చరించమన్నాడు. చాలాసేపు ఆ మంత్రాన్ని ఉచ్చ రించారు.
అర్ధరాత్రి గడిచాక శ్రీరామకృష్ణులకు బాహ్యస్మృతి కలిగింది. ఆకలిగా ఉందన్నారు. భక్తులు పట్టుకోగా లేచి కూర్చున్నారు. అందరూ ఆశ్చర్యపోయేలా ఒక గ్లాసు జావ సునాయాసంగా త్రాగారు. ఇంత ఆహారం ఆయన పుచ్చు కొని చాలారోజులయింది. జావ త్రాగాక ఒంట్లో కాస్త సత్తువ వచ్చినట్లుగా ఉందన్నారు. ఆయన నిద్రపోతే మంచిదని నరేంద్రుడు సూచించాడు. నొప్పి కారణంగా ప్రక్కనే ఉన్నవారికి సైతం వినపడనంత అతిమెల్లగా మాట్లాడే శ్రీరామకృష్ణులు హఠాత్తుగా బిగ్గరగా, “అమ్మా, కాళీ!” అంటూ మూడుసార్లు పిలిచి మెల్లగా పడుకొన్నారు. పిదప నరేంద్రుడు క్రిందికి వెళ్లాడు.
రాత్రి ఒంటి గంట రెండు నిమిషాలు. మంచం మీద పడుకొని ఉన్న శ్రీరామకృష్ణుల శరీరంలో హఠాత్తుగా పారవశ్యస్థితి జనించింది. రోమాంచిత మయింది. దృష్టి నాసికాగ్రంలో ఏకాగ్రమయింది. పెదవులపై దరహాస చంద్రికలు వెల్లివిరిసాయి. ఆయన సమాధిమగ్నులయ్యారు. ఇంతకాలంగా ఆయన అనుభ విస్తూ వచ్చిన సమాధి కాదది, మహాసమాధి; కాళీమాత ఒడిలో ఆమె అనుంగు పుత్రుడు శాశ్వతంగా నిద్రించిన ప్రగాఢ సమాధి! ఈ సమాధి తదుపరి ఆయన ప్రాణం శరీరంలోకి తిరిగి రాలేదు. అది 1886 ఆగస్ట్ 16 వ తేదీ.
‘నేను మృతిచెందలేదు!’
అప్పుడు మాతృమూర్తి శ్రీశారదాదేవి ఆయన ప్రక్కన లేరు. కబురు అంద గానే ఒక్క పరుగున మంచం ప్రక్కకు వచ్చి, “అమ్మా కాళీ! ఎక్కడికి వెళ్లిపోయావు తల్లీ!” అంటూ బిగ్గరగా విలపించారు. అందరి హృదయాలూ ద్రవించిపోయాయి. శ్రీరామకృష్ణుల పావన భౌతికకాయం కాశీపూర్ శ్మశాన వాటికలో దహించబడింది. ఒక కంచు పాత్రలో అస్థికలు సేకరించి గురుదేవుల పడక మీద ఉంచారు.
ముప్ఫై మూడేళ్లు మాత్రమే నిండిన మాతృదేవి ఆ సాయంత్రం వితంతు వేషధారణకు ఉపక్రమించారు. కాని ఆమె భర్త మరణించారా? ఆయన అమరులు కదా! మాతృదేవి తమ బంగారు గాజులు తీసివేయబోతున్నప్పుడు ఆమె ఎదుట శ్రీరామకృష్ణులు సాక్షాత్కరించారు: “నేను మరణించాననా నీ సుమంగళీ వేష ధారణను తీసివేస్తున్నావు? నేను మరణించలేదు. ఇదిగో ఇక్కడే ఉన్నాను” అంటూ మాతృదేవి ప్రయత్నాన్ని నిలిపివేశారు. ఆ తరువాతి రోజుల్లో మళ్లీ రెండుసార్లు మాతృదేవి తమ గాజులు తీసివేయడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా గురుదేవులు మునుపటి మాదిరే ప్రత్యక్షమై ఆ ప్రయత్నాలను వారించారు. ఆ తరువాత మాతృదేవి గాజులను, సన్నని అంచుగల చీరను ధరించి నిత్య సుమంగళిగానే జీవించారు
కాశీపూర్ శ్మశానం నుండి శ్రీరామకృష్ణుల అస్థికలను ఒక కలశంలో సేకరించి దానిని మోసుకొని కాశీపూర్ ఉద్యాన గృహం చేరుకొన్నారు భక్తులు. “భగవాన్ శ్రీరామకృష్ణదేవ్కీ జై” అనే నినాదంతో దానిని శ్రీరామకృష్ణుల మంచం మీద ఉంచినప్పుడు, శ్రీరామకృష్ణుల సాన్నిధ్యాన్ని అనుభూతం చేసుకొన్నా, వారి మనస్సులను శూన్యం ఆవరించింది. కాని వారు, ఆయన జీవితకాలంలో ఎలాంటి వినాశం లేని ప్రేమతో పెనవేసుకొని ఉన్నారో అదే ప్రగాఢ ప్రేమ ఇప్పుడు సైతం వారిని పెనవేసి ఉంచింది. ఒకే లక్ష్యంతో జీవించిన వారు పరస్పరం సాంత్వనపరచుకొంటూ, మెల్లగా తేరుకొంటూ గట్టి నమ్మకంతో ముందుకు సాగారు.