ఒక వివేకానంద ఒక్క రోజులో ఉద్భవించడు. వంశానుగతంగా కుటుంబంలో పాదుగొన్న ఉన్నతోన్నత గుణగణాల వలననే ఉద్భ విస్తాడు.
మహేంద్రనాథ్ దత్త
[స్వామీజీ సోదరుడు]
దుర్గాప్రసాద్ — విశ్వనాథ్ దత్త — భువనేశ్వరీదేవి — సంతానం
దుర్గాప్రసాద్
ఇ ప్పటిలా నాడు కూడా సిమూలియా పేట బాగా రద్దీగా ఉండేది. వాడుకగా సిమ్లా అని పేర్కొనబడే ఈ పేట ఉత్తర కలకత్తాలో ఉంది. క్షత్రియ వంశస్థులైన దత్త కుటుంబం అక్కడ బాగా ప్రాచుర్యం వహించింది. సంపద, చదువు, దానధర్మాలు, స్వతంత్ర చింతనాధోరణులకు ఆ కుటుంబం పేరెన్నికగన్నది.
సిమూలియాలో రామమోహనదత్త జీవిస్తూ వచ్చాడు. ఒక ఆంగ్లేయ న్యాయ వాది వద్ద ఆయన ప్రధాన గుమాస్తాగానూ, వృత్తిలో భాగస్వామిగానూ ఉండేవాడు. వృత్తి ద్వారా బాగా ఆర్జించిన ఆయన తన బంధువులతో కలిసి గౌర్మోహన్ వీథిలో ఒక ఇంట్లో నివసించసాగాడు. దానిని ఇల్లు అనడంకన్నా పెద్ద భవనం* అనడం సముచితంగా ఉంటుంది. ఇంటి ముఖద్వారం బ్రహ్మాండంగా ఉండేది. లోపల సైతం పెద్ద స్తంభాలతో అనేక గదులతో ఒక రాజభవనంలా కనిపించేది.
రామమోహన్కి దుర్గాప్రసాద్, కాళీప్రసాద్ అనే ఇద్దరు కుమారులు, కొందరు కుమార్తెలు కలిగారు. తన ముప్ఫై ఆరవ ఏట కలరా సోకి రామ మోహన్ మృతి చెందాడు. దుర్గాప్రసాద్ పారశీక, సంస్కృత భాషల్లో చక్కని పాండిత్యం గడించాడు. ఆయన ఒక దివాను కుమార్తెయైన శ్యామసుందరిని వివాహం చేసుకొన్నాడు. న్యాయశాస్త్ర కోవిదుడైన ఆయన కూడా తండ్రిలా బాగా ఆర్జిస్తాడని అందరూ ఆశించారు. కాని అందుకు మారుగా ఆయన సన్న్యాస జీవితంపై మొగ్గుచూపాడు. ఒక కుమారుడు జన్మించిన కొద్ది కాలానికే సర్వసంగ పరిత్యాగం చేసి, ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. అప్పుడు ఆయన వయస్సు 25 ఏళ్లు. 1835 లో జన్మించిన ఆ కుమారుడే స్వామి వివేకానంద తండ్రియైన విశ్వనాథ దత్త.
విశ్వనాథ్‌కు మూడేళ్ల ప్రాయంలో తల్లియైన శ్యామసుందరి బిడ్డను తీసుకొని కాశీయాత్రకు వెళ్లింది. రైలుబళ్లు లేని ఆ రోజుల్లో దాదాపు 500 మైళ్లు పడవ మీద పయనించవలసి వచ్చింది. కాశీని సమీపిస్తూండగా విశ్వనాథ్ అకస్మాత్తుగా గంగానదిలో పడిపోయాడు. బిడ్డను రక్షించడానికి క్షణం కూడా తట పటాయించకుండా ఆమె కూడా నదిలో దూకేసింది. కాని ఆమెకు ఈత రాదు. అయినా బిడ్డను ఎలాగో గట్టిగా పట్టుకొంది. తల్లీబిడ్డలు నీళ్లలో మునిగిపోతున్న సమయంలో హఠాత్తుగా ఒక వ్యక్తి నీళ్లలోకి దూకి ఆ ఇద్దరినీ సురక్షితంగా తీరానికి చేర్చాడు. శ్యామసుందరి గట్టిగా పట్టుకొన్న ఫలితంగా ఏర్పడ్డ మచ్చ విశ్వనాథ్ శరీరం మీద చాలాకాలం చెరిగిపోలేదు.
కాశీలో శ్యామసుందరి పూజాపునస్కారాలు చేస్తూ కొన్ని రోజులు గడిపింది. ఒక రోజు గంగలో స్నానం చేసి విశ్వనాథ ఆలయానికి పోతున్నప్పుడు దారిలో కాలుజారి కిందపడడంతో ఆమెకు స్పృహతప్పింది. ఆ సమయంలో ఆ దారిలో వెళుతున్న ఒక సన్న్యాసి ఆమెను మెట్ల మీదకు చేర్చి స్పృహ తెప్పించడానికి ప్రయ త్నించసాగాడు. మెల్లగా స్పృహలోకి వచ్చిన శ్యామసుందరి కళ్లు తెరచి చూసింది. తనకు స్పృహ తెప్పించి అభిమానంతో చూస్తున్న వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు తన భర్తయైన దుర్గాప్రసాద్ అని ఆమెకు చటుక్కున స్ఫురించింది. ఇద్దరూ పరస్పరం గుర్తుపట్టారు. అది ఒక్క క్షణమే! దుర్గాప్రసాద్ ఠక్కున లేచాడు. “ఆహా! మాయ, మాయ!” అంటూ రివ్వున అక్కణ్ణుండి వెళ్లిపోయాడు. శ్యామసుందరి కూడా మెల్లగా భారంగా లేచి ఆలయ ప్రదక్షిణకు బయలుదేరింది.
ఈ సంఘటన జరిగిన పన్నెండు సంవత్సరాల తరువాత ఒకసారి దుర్గా ప్రసాద్ కలకత్తాకు వచ్చి, ఒక మిత్రుని ఇంట్లో బసచేశాడు. ఆ మిత్రుడు ఈ సంగతి దుర్గాప్రసాద్ ఇంట్లో చెప్పడంతో, బంధువులంతా వచ్చి బలవంతంగా ఆయనను ఇంటికి తీసుకువెళ్లారు. చెప్పాపెట్టకుండా మళ్లీ వెళ్లిపోతాడేమోనని భయపడి ఆయనను ఒక గదిలో ఉంచి, తాళం పెట్టారు. దుర్గాప్రసాద్ ప్రతిఘటించ లేదు. తన నిరసనను మౌనంగా వ్యక్తం చేశాడు. మూడు రోజులు నిద్రాహారాలు మానుకొన్నాడు. ఇదే తీరు కొనసాగితే ఆయన బలవన్మరణం పొందుతాడేమో నని భయపడి బంధువులు ఆయనను వదలిపెట్టారు. కాలాంతరంలో ఆయన కాశీలో ఒక మఠానికి అధ్యక్షుడైనట్లు వినికిడి. కాని ఎలాంటి ఇదమిత్థమైన సమాచారమూ అందలేదు. విశ్వనాథ్ పెరిగి పెద్దవాడై సంపాదనాపరుడయ్యాక ఒకసారి కాశీకి వెళ్లి తండ్రి ఆచూకీ కోసం గట్టిగా ప్రయత్నించాడు. కాని ఫలితం లేకపోయింది.
విశ్వనాథ్ దత్త
కాలాంతరంలో విశ్వనాథ్ పేరుప్రతిష్ఠలు సంపాదించుకొన్నప్పటికీ ఆయన యువప్రాయం ఆనందంగా గడవలేదు. తండ్రి సన్న్యాసం పుచ్చుకోవడంతో అతడికి తండ్రి ప్రేమ కరవయింది. తండ్రి ఇల్లు విడిచి వెళ్లిపోయాక పినతండ్రియైన కాళీప్రసాద్ కుటుంబ బాధ్యత చేగొన్నాడు. ఆయనకు సంపాదనంటూ ఏమీ లేదు. అందువలన కుటుంబ ఖర్చులన్నీ ఉమ్మడి ఆస్తి నుండి జరిగిపోసాగాయి. దాంతో నానాటికీ ఆస్తి తరిగిపోసాగింది. న్యాయంగా విశ్వనాథ్‌కు ఆస్తిలో సగంవాటా రావలసివున్నా, పినతండ్రి అందుకు అభ్యంతరం పెట్టాడు. శ్యామసుందరి ఎంతో కష్టంతో కుమారుణ్ణి పెంచసాగింది. తల్లి ప్రేమకు కూడా విశ్వనాథ్ ఎక్కువ కాలం నోచుకోలేదు. విశ్వనాథ్‌కు పదవ ఏడు జరుగు తున్నప్పుడు శ్యామసుందరి మరణించింది. దాంతో విశ్వనాథ్ ఏకాకి అయ్యాడు. పినతండ్రి కుటుంబం నుండి అతడికి ఎలాంటి ప్రేమానురాగాలు లభించలేదు.
అయినప్పటికీ దత్త వంశ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడించేలా విశ్వనాథ్ పెరిగి పెద్దవాడయ్యాడు. ఆంగ్లం, ఉర్దూ, అరబిక్, పారశీకం, హిందీ, బెంగాలీ భాష లలో అతడు చక్కని పాండిత్యం గడించాడు. చరిత్ర సాహిత్యాలలో ఎంతో ఆసక్తి కనబరిచాడు. సంస్కృతం నేర్చుకొన్నాడు. ఏదైనా వృత్తి చేపట్టాలని తొలుత ప్రయ త్నించాడు. కాని ఆ ప్రయత్నంలో సఫలీకృతుడు కాలేకపోయాడు. ఆ తరువాత న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై 1866 లో న్యాయవాది అయ్యాడు. ఆ రంగంలో అనతికాలంలోనే విశ్వనాథ్ బాగా రాణించాడు.
ఒక వైపు రెండు చేతులా ఆర్జిస్తూన్న విశ్వనాథ్ మరొక వైపు ఎడాపెడా ఖర్చు చేయసాగాడు. స్నేహితులూ, బంధువులూ, పనిమనుషులూ, వాహనాలూ అంటూ ఆర్భాటపు జీవితం గడపసాగాడు. పాకకళలో నిష్ణాతుడైన విశ్వనాథ్ అప్పుడప్పుడు విందుభోజనాలు ఏర్పాటు చేసేవాడు. తాను తినడంతో సరిపెట్టుకోకుండా ఇతరు లకు కూడా మృష్టాన్న భోజనాలు వడ్డించి ఆనందించేవాడు.
వృత్తి నిమిత్తమై విశ్వనాథ్ దేశంలో పలు ప్రాంతాలలో నివసించవలసి వచ్చింది. అందుమూలంగా పొందిన అనుభవాలను ఆధారంగా చేసుకొని ఆయన వంగభాషలోను, హిందీలోను ‘శిష్టాచార్ పద్ధతి’ (సంప్రదాయ పద్ధతులు) అనే పుస్తకం రచించాడు. రెండు సంపుటాలు గల ఈ పుస్తకం మొదటి సంపుటం 1882 లో వెలువడింది. 1884 లో ఆయన మృతి చెందడం వలన కుటుంబ పరిస్థితులు తలక్రిందులవడంతో రెండవ సంపుటం వెలువడలేదు. వంగభాషలో ‘సులోచన’ అనే నవలను కూడా ఆయన రచించాడు. జ్యోతిశ్శాస్త్రం కూడా నేర్చుకోవడం వలన ఆయన తన పిల్లల జాతకాలను స్వయంగా తనే గణిం చాడు. సంగీతాది లలితకళలలో సైతం ఆయనకు అభినివేశం ఉంది. చక్కని గాత్రం కలిగిన ఆయన సంప్రదాయానుసారం సంగీతం నేర్చుకొన్నాడు. సుశ్రావ్యంగా పాడేవాడు.
వీటి అన్నింటికన్నా మిన్నయైన ఉన్నతమైన చింతనా సరళి, విశాల దృక్ప థమూ విశ్వనాథ్‌ను ఒక సమున్నత వ్యక్తిత్వం గల మనిషిగా రూపొందించాయి. కుల పట్టింపులూ, మతోన్మాదమూ పాతుకుపోయిన ఆ రోజుల్లో విందుభోజనా లకూ, ఇతర వేడుకలకూ మహమ్మదీయులను ఇంటికి ఆహ్వానించేవాడు. వారికి సముచితమైన ఆహారం వండించి, వడ్డించేవాడు. హైందవ శాస్త్రాలతోపాటు, బైబిల్, పారశీక కవియైన హఫీస్ కవితా సంపుటి దివాన్–ఇ–హఫీసును కూడా ఆయన శ్రద్ధగా చదివాడు.
దాతృత్వం విశ్వనాథ్ నరనరంలోనూ ఊరిపోయిందంటే అతిశయోక్తి కాదు. సహాయార్థం ఆయనను ఆశ్రయించి రిక్తహస్తాలతో తిరిగి వెళ్లినవారు లేరు. ‘దాన విశ్వనాథ్’ అని ఆ ప్రాంతంవారు ఆయనను పేర్కొనేవారు. బంధుమిత్రులు పలు వురు ఆయన ఇంట్లోనే బసచేసి ఆయన ఖర్చుతోనే విద్యావంతులయ్యారు. “నా కుమారులను గురించి నేను చింతించాల్సిన పని లేదు. వారి భవిష్యత్తు వారే చూసుకొంటారు. అందుకు కావలసిన తెలివీ, శక్తీ వారికున్నాయి. కాని పేదలకు ఆ శక్తిలేదు. వారికి మాత్రమే సహాయం అవసరం” అనేవాడు. అందువలన తనను గురించీ, తన పిల్లల భవిష్యత్తు గురించీ కించిత్తు కూడా యోచించకుండా, తన సంపాదనంతా ఇతరులకోసం వ్యయం చేశాడు.
కాని విశ్వనాథ్ దాతృత్వాన్ని బంధువులు కొందరు తమకు అనుకూలంగా ఉపయోగించుకొన్నారు. వారు ఎలాంటి పనిపాటలు చేసుకోకుండా హాయిగా త్రాగుతూ, వినోదిస్తూ కాలం వెళ్లబుచ్చారు. ఇలా త్రాగుబోతులకూ, చరిత్రహీను లకూ నీళ్లలా డబ్బు ఖర్చుచేయడం పెద్ద కుమారుడైన నరేంద్రుడు ప్రతిఘటిం చాడు. అప్పుడు విశ్వనాథ్ ఇలా అన్నాడు: “మధుపానం చేసి తాత్కాలికంగానైనా తమ బాధలను మరచిపోవడానికి ప్రయత్నించే ఈ పేదల గురించి నీ కెలా తెలుస్తుంది? నువ్వు కూడా పెరిగి పెద్దవాడయ్యాక వారి పట్ల జాలి చూపు తావులే!”
ఇలా డబ్బును ఎడాపెడా వృథాగా ఖర్చు చేస్తున్న తండ్రిని నిలదీసి నరేం ద్రుడు ఒకసారి, “అవును, ఇలా ఖర్చు చేస్తున్నారే! నా కోసం ఏం పొదుపు చేసి ఉంచారు?” అని అడిగాడు. అందుకు విశ్వనాథ్ బదులు చెప్పక, అతణ్ణి ఒక నిలువు టద్దం ముందు నిలబెట్టాడు. అద్దంలోని నరేంద్రుని ప్రతిబింబాన్ని చూపిస్తూ, “చూడు, ఇదుగో ఈ బలిష్ఠమైన శరీరాన్ని నీకు ఇచ్చాను. ఇదే నేను నీ కిచ్చిన ఆస్తి” అన్నాడు. మంచి చదువు, ఆరోగ్యవంతమైన శరీరం, చక్కని జీవన ప్రమాణం పిల్లలకు అందిస్తే వారి భవిష్యత్తు ఉజ్జ్వలంగా రూపొందుతుందని ఆయన ఉద్దేశం. అందుకు తగ్గ రీతిలోనే ఆయన పిల్లలను పెంచాడు. పిల్లలకు అపరిమిత ఆస్తిని కూడబెట్టడం కన్నా జీవితాన్ని ఎదురొడ్డి నిలిచేవారిగా వారిని తీర్చిదిద్దడమే ప్రధాన మని ఆయన భావించాడు.
విశ్వనాథ్ పినతండ్రియైన కాళీప్రసాద్ ఒక కన్ను కోల్పోయాడు. తమ వాటా ఆస్తిని కాజేసి తమను నిరాదరించిన ఆయననూ, ఆయన భార్యనూ విశ్వ నాథ్ చేరదీసి ఆదరించాడు. కుటుంబ నిర్వహణ కూడా వారికే అప్పజెప్పాడు. నిజానికి విశ్వనాథ్ భార్యాపిల్లలు సైతం వారి దాక్షిణ్యం క్రిందే జీవించవలసి వచ్చిందని చెప్పుకోవాలి. సంపాదిస్తున్న వ్యక్తి భార్యాబిడ్డలకన్నా పరాయివారినే వారు బాగా చూసుకొంటున్నారనే సంగతి విశ్వనాథ్‌కి తెలియకపోలేదు. కాని వారు వృద్ధులవడం వలన ఓర్పు వహించాడు; అదే విధంగా మెలగమని తన భార్యతో కూడా చెప్పాడు.
వితంతు పునర్వివాహాలను దుయ్యబట్టే నాటి రోజుల్లో కూడా దానిని విశ్వ నాథ్ ఆమోదించాడు; ఆయన భార్య కూడా అట్లే. క్లుప్తంగా చెప్పాలంటే విశ్వనాథ్ తన అలవాట్లలోనూ, ప్రవర్తనలోనూ ఒక హిందువుగా వ్యవహరించాడు. అదే సమయంలో విస్తృత దృక్పథం, విశాల హృదయం, పరాయి మతాలను ఆదరిం చడం లాంటి గుణగుణాలలో ప్రత్యేకించి విరాజిల్లాడు.
భువనేశ్వరీదేవి
1851 లో తన పదహారవ ఏట విశ్వనాథ్ పదేళ్ల భువనేశ్వరీదేవిని వివాహం చేసుకొన్నాడు. తెలివితేటలూ, బుద్ధిసూక్ష్మతా సంతరించుకొన్న వ్యక్తి భువనేశ్వరీ దేవి. ఆ ఉమ్మడి కుటుంబాన్ని ఆమె దక్షతతో నిర్వహించింది. తీరికలేని ఇంటి పనుల మధ్య సంగీతం, కుట్టుపని, రామాయణ మహాభారత పారాయణం లాంటి వాటికి ఆమె రోజులో ఒక ప్రత్యేక సమ యాన్ని కేటాయించేది. కొద్దిగా ఆంగ్లం కూడా ఆమె నేర్చుకొంది. గాంభీర్యం ఉట్టి పడే వ్యక్తిత్వం గల ఆమె మితభాషి. సుఖదుఃఖాలను అన్నింటినీ యథాతథంగా స్వీకరించి భగవదనుగ్రహం మీద ఆధారపడి జీవించడం ఆమె అలవరచుకొంది.
భక్తి, పూజాదికాలు భువనేశ్వరి నిత్య జీవితంలో ప్రాధాన్యం వహించాయి. ఆమె నిత్యపూజలో శివపూజ విశిష్టతను సంతరించుకొంది. సుశ్రావ్యంగా ఆమె కృష్ణుని గూర్చి ఆర్తితో పాడేది. మంచి జ్ఞాపకశక్తి గల ఆమెకు రామాయణ, మహా భారతాలు పుటలకొద్దీ కంఠస్థం. వీథిలో బిచ్చగాళ్లు పాడుకొనే పాటలను ఒక్క సారి వినగానే ఆమెకు కంఠస్థమయ్యేదంటే అతిశయోక్తి కాదు. వంగభాషలో ఆమె కవితలు కూడా రచించడం కద్దు.
సంతానం
భువనేశ్వరీ విశ్వనాథ్ దంపతులకు నలుగురు మగపిల్లలు, ఆరుగురు ఆడ పిల్లలు కలిగారు. పెద్ద కుమారుడు ఎనిమిది నెలలకే చనిపోయాడు. రెండవ సంతానమైన ఆడపిల్ల రెండున్నర ఏళ్ల వయస్సులో మృతి చెందింది. మూడవ సంతానమైన కుమార్తె హరమణి (హరమోహిని) ఇరవై రెండేళ్లు జీవించింది. నాలుగవ సంతానమైన స్వర్ణమణి 72 ఏళ్లు జీవించింది. తదుపరి జన్మించిన ఆడపిల్ల యుక్తవయస్సులో మరణించింది. ఆ తరువాత నరేంద్రుడు. ఆ తరువాత జన్మించిన కిరణ్‌బాల 16 ఏళ్లు జీవిం చింది. ఆమె పిదప జన్మించిన జోగేంద్రబాల 22 ఏళ్లు జీవించింది. చివరగా మహేంద్రనాథ్ (1869–1956), భూపేంద్రనాథ్ (1880–1961) జన్మించారు.