1. వ్యక్తుల పరిచయం
కేదార్: స్వామి కేశవానంద.
కేదార్ బాబా: వివేకానందస్వామి శిష్యుడైన స్వామి అచలానంద.
కృష్ణమయి: బలరాంబోసు కుమార్తె. తమ ఆధ్యాత్మిక సాధనల కాలంలో గురుదేవులు ఒకసారి దర్శించిన దేవీ స్వరూపం ఈ కృష్ణమయిలా ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఖగేన్: స్వామి శాంతానంద.
ఖోఖా (1867 – 1932) : ఖోఖా అంటే వంగభాషలో బిడ్డడని అర్థం. పిల్లవాడి వంటి కల్లాకపట రహితునిగా ఉన్నందున ఈయనను ఖోఖా అని పేర్కొన్నారు. గురుదేవుల ప్రత్యక్ష శిష్యులలో ఒకరు. ఈయన సన్న్యాస నామధేయం స్వామి సుబోధానంద.
గిరీష్ బాబు (1844 – 1912) : 19 వ శతాబ్దపు సుప్రసిద్ధ వంగదేశ నాటక ప్రయోక్త. తాగుబోతుగా ఉన్న ఈతడు గురుదేవుల అనుగ్రహంతో ఆధ్యాత్మిక జీవిత శిఖరాలను అధిరోహించాడు.
గోపాలేర్ మా (1822 – 1906) : అఘోరమణీదేవి. బాల్యం నుండే తీవ్రతపశ్చర్యా దులతో జీవితం గడిపారు. కృష్ణుణ్ణి బాలగోపాలునిగా భావించి, ఆరాధించి ఆ రూపంలోనే ఆయన సాక్షాత్కారం పొందిన వ్యక్తి. బాలగోపాలుడు తన ముందు రావడమూ, ఆటలాడడమూ, అది కావాలి ఇది కావాలి అని హఠం పట్టినట్లుగా ఆమె జీవితం గడిచింది. ఈ కారణంగా గోపాలేర్ మా (గోపాలుని తల్లి)గా పేర్కొనబడ్డారు.
గోపేష్: స్వామి శారదేశానంద. మాతృదేవి సేవకులలో ఒకరు. అంతిమ కాలంలో బృందావనంలో నివసించిన వీరు తన దివ్యజీవిత ఖ్యాతిచే పలువురు సాధకులకు మార్గదర్శకులై విరాజిల్లారు. ఈయన రచించిన మాతృదేవి స్మృతులు ‘The Mother as I saw Her’ చెన్నై, రామకృష్ణ మఠం వారు ప్రచురించారు.
గౌరీ మా (1857 – 1938) : అసలు పేరు మృడాని. చిన్నతనంలోనే హిమాలయాలలో తపోమయ జీవితం గడిపారు. 1882 లో గురుదేవులను ప్రప్రథమంగా కలుసు కొన్నారు. కాలాంతరంలో స్వామి వివేకానంద ఆదర్శాన్ని చేగొని స్త్రీలకు, వితంతువు లకు విద్య గరపడం మొదలైన సామాజిక కార్యాలలో తీవ్రంగా పాల్గొన్నారు. ఇందు నిమిత్తం ఈమె ప్రారంభించిన ‘శ్రీశ్రీ శారదేశ్వరీ ఆశ్రమం’ శాఖోపశాఖలుగా విస్తరించి, అలరారుతూన్నది.
గోలాప్ మా (1844 – 1924) : గురుదేవుల శిష్యురాండ్రలో ఒకరు. కాలాంతరంలో మాతృదేవితో కలిసి జీవించారు. ఈమె తోడు లేకుండా మాతృదేవి బయటకు వెళ్లేవారు కారు. జపతప సాధనలు అనుష్ఠించిన ఈమె అనేక ఆధ్యాత్మిక అనుభూతులు పొందారు.
నాగమహాశయ (1846 – 1899) : దుర్గాచరణ్ నాగ్. శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో ఒకరు. ‘శ్రీరామకృష్ణులను ఎవరూ అవగతం చేసుకొన్నది లేదు. కించిత్తు అయినా ఆయనను అవగతం చేసుకొన్నారని చెప్పవలసి వస్తే, వారు నరేంద్రుడూ, నాగమహాశయుడూ మాత్రమే అని చెప్పాలి’ అని గిరీశ్చంద్ర ఘోష్ వ్యాఖ్యానించాడు.
నారాయణ అయ్యంగార్: మాతృదేవి శిష్యుడు. తమిళనాడుకు చెందిన వ్యక్తి. కాలాంతరంలో స్వామి శ్రీవాసానంద.
జ్ఞాన్: స్వామి జ్ఞానానంద.
తోతాపురి: శ్రీరామకృష్ణుల అద్వైత సాధనల గురువు.
దుర్గ: గౌరీ మా పెంపుడు కుమార్తె.
దేవవ్రతుడు: మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకొన్నారు. కాలాంతరంలో స్వామి ప్రజ్ఞానానంద. సోదరి సుధీర అన్నగారు. మాతృదేవి వద్దకు రాక మునుపు శ్రీ అరవిందులతోను, స్వాతంత్ర్యోద్యమంతోను సంబంధం కలిగి ఉన్న వ్యక్తి. రామకృష్ణ మిషన్ ఆంగ్ల పత్రికలలో ఒకటైన ‘ప్రబుద్ధ భారత’ కు సంపాదకులుగా వ్యవహరించారు.
నరేన్: స్వామి వివేకానంద.
నళిని, మాకు: మాతృదేవి తమ్ముడైన ప్రసన్నుని కుమార్తెలు. వీరు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. నళిని ఛాందసురాలు. తనకు అసలు ఇష్టంలేని ఒకరిని నిర్బంధంగా వివాహం చేసుకోవలసిన స్థితి ఈమెకు ఏర్పడింది. మాకు తనను పోషించలేని ఒక పేదవానికి భార్య అయింది. కనుక వీరిద్దరూ భర్తలను వీడి మాతృదేవితోనే జీవించారు.
పూర్ణుడు (1871 – 1913) : పూర్ణచంద్ర ఘోష్. గృహస్థ శిష్యులలో ఈయన ఒక్కరినే శ్రీరామకృష్ణులు ఈశ్వరకోటిగా పరిగణించారు. ‘మ’ ప్రేరణతో చిన్నతనంలోనే శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాడు. స్వామి వివేకానందతో ఎంతో సంసర్గం కలిగి వున్నాడు. కాలాంతరంలో ‘వివేకానంద సొసైటీ’ ని స్థాపించి అనేక సత్కార్యాలు ఒన రించాడు.
బలరాం బోస్ (1842 – 1890) : శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో ఒకరు. ఈయన ఇంటికి గురుదేవులు నూరుసార్లకంటే ఎక్కువసార్లే వెళ్లివుంటారు. ఈయన ఇంటి ఆహారం పవిత్రమైనదనేవారు శ్రీరామకృష్ణులు. ఈయన ఇల్లు బలరాం మందిర్ పేరిట ప్రస్తుతం రామకృష్ణ మిషన్ శాఖలలో ఒకటిగా విరాజిల్లుతూన్నది.
బాబూరాం (1861 – 1918) : యువ శిష్యులలో ఒకరు. కాలాంతరంలో స్వామి ప్రేమానంద.
బ్రహ్మచారి రాస్బిహారి: మాతృదేవి సేవకులలో ఒకరు. కాలాంతరంలో స్వామి అరూపానంద. ఈయన స్మృతులు ఈ పుస్తకంలో చోటుచేసుకొన్నాయి.
బ్రహ్మచారి వరద: స్వామి ఈశానంద. ఈయన స్మృతులు ఈ పుస్తకంలో పొందు పరచబడి ఉన్నవి.
భూదేవ్: మాతృదేవి సోదరుడైన కాళీకుమార్ తనయుడు.
భైరవీ బ్రాహ్మణి: శ్రీరామకృష్ణుల తాంత్రిక సాధనల గురువు.
‘మ’ [మహేంద్రనాథ్ గుప్త (1854 – 1932) ]: మాతృదేవి వద్ద మంత్రదీక్ష పొందారు. శ్రీరామకృష్ణ కథామృతాన్ని లోకానికి అందించడంలో చరిత్రలో ఆచంద్రతారార్క కీర్తిని గడించారు. ‘శీమ’ గా కూడా పేర్కొనబడ్డారు.
మథుర్ బాబు: మథుర్ మోహన్ విశ్వాస్. దక్షిణేశ్వర ఆలయాలను నిర్మించిన రాణీరాస్మణి అల్లుడు. ఆ ఆలయాల నిర్వాహకుడు. శ్రీరామకృష్ణుల సాధన కాలంలో ఆయన అవసరాలన్నిటినీ సమకూర్చిన వ్యక్తి.
యోగేన్ (1861 – 1899) : యోగేంద్రనాథ్ రాయ్ చౌధురి. శ్రీరామకృష్ణుల సన్న్యాస శిష్యులలో ఒకరు. కాలాంతరంలో స్వామి యోగానంద.
రాంలాల్: శ్రీరామకృష్ణుల చిన్న అన్నగారైన రామేశ్వర్ కుమారుడు. తండ్రి మరణా నంతరం ఇతడు దక్షిణేశ్వర కాళికాలయ పూజారిగా నియమితుడైనాడు.
రాఖాల్ (1863 – 1922) : స్వామి బ్రహ్మానంద. శ్రీరామకృష్ణుల సన్న్యాస శిష్యులలో ఒకరు. రామకృష్ణ మిషన్ ప్రప్రథమ అధ్యక్షులు.
రాణీరాస్మణి (1793 – 1861) : దక్షిణేశ్వర ఆలయ నిర్మాత. శ్రీరామకృష్ణుల దివ్యత్వాన్ని గుర్తించిన మొదటి కొద్దిమందిలో ఒకరు.
రాధూ: మాతృదేవి చిన్నతమ్ముడైన అభయచరణ్ కుమార్తె. శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం ఈ లోకంలో జీవించడానికి మాతృదేవికి ఎలాంటి అనురక్తీ లేకుండాపోయింది. కనుక తమ అవతారకార్యాన్ని నెరవేర్చడానికి ఆమె రాధూను ఆధారంగా చేసుకొని జీవించారు. “రాధూ పై నుండి ఎప్పుడు నా మనస్సు వైదొలగుతుందో ఆ తరువాత ఈ ఇలలో నేను జీవించలేను” అనేవారు మాతృదేవి.
రామ్ (1851 – 1899) : రామచంద్ర దత్త. శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో ఒకరు.
లక్ష్మి (1864 – 1926) : శ్రీరామకృష్ణుల చిన్న అన్నగారైన రామేశ్వర్ కుమార్తె. ఈమెకు 11 వ ఏటనే వైధవ్యం ప్రాప్తించింది. మాతృదేవికి తోడుగా నహబత్లో జీవించారు. శ్రీరామకృష్ణులను ఇష్టదైవంగా ఆరాధించిన ఈమె, భక్తిసాధనలలో ఉన్నత స్థితులను పొందినవారు.
విలాస్ మహరాజ్: స్వామి వీరేశ్వరానంద.
శరత్ (1865 – 1927) : శరత్ చంద్ర చక్రవర్తి. గురుదేవుల యువ శిష్యులలో ఒకరు. కాలాంతరంలో స్వామి శారదానంద. మాతృదేవి కలకత్తాలో నివసించడానికి ‘ఉద్బోధన్’ భవంతిని కట్టించారు. 1909 నుండి మాతృదేవి కలకత్తాకు విచ్చేసినప్పు డల్లా ఇక్కడే బసచేసేవారు. భవన నిర్మాణానికి చేసిన ఋణాన్ని తీర్చడానికి ఈయన ‘శ్రీరామకృష్ణ పరమహంస’ (శ్రీరామకృష్ణుల సమగ్ర జీవితగాథ) గ్రంథాన్ని రచించారు.
శారదా (1865 – 1915) : శ్రీరామకృష్ణుల యువభక్తులలో ఒకరు. కాలాంతరంలో స్వామి త్రిగుణాతీతానంద. కొంతకాలం మాతృదేవి సేవకులుగా వ్యవహరించారు. రామకృష్ణ మిషన్ వంగ మాసపత్రిక ‘ఉద్బోధన్’ సంపాదకులుగా కూడా ఉన్నారు.
శివరాం (1866 – 1933) : శ్రీరామకృష్ణుల చిన్న అన్నగారైన రామేశ్వర్ కుమారుడు.
సారా బుల్: వివేకానంద స్వామి పాశ్చాత్య శిష్యురాలు.
సిస్టర్ క్రిస్టైన్: వివేకానంద స్వామి పాశ్చాత్య శిష్యురాలు. స్త్రీల పాఠశాలలో సోదరి నివేదితతో కలిసి పనిచేశారు.
సుధీర: సోదరి సుధీర. మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకొన్న వ్యక్తి. సోదరి నివేదితతో కలిసి పనిచేశారు. దేవవ్రత మహరాజ్ (స్వామి ప్రజ్ఞానంద) చెల్లెలు.
సోదరి నివేదిత (1867 – 1911) : వివేకానంద స్వామి శిష్యురాలు. ఐర్లాండ్లో జన్మించిన ఈమె అసలు పేరు మార్గరేట్ నోబెల్. భారతదేశంలో స్త్రీల అభ్యున్నత కార్యక్రమాలకై తన మాతృదేశాన్ని వదలివచ్చిన వ్యక్తి. ఈమె ప్రారంభించిన ‘సోదరి నివేదిత పాఠశాల’ నేటికీ కలకత్తాలో సుప్రసిద్ధమై అలరారుతున్నది.
స్వామి నిర్మలానంద (1863 – 1938) : తులసీచరణ్ దత్త. శ్రీరామకృష్ణుల యువభక్తు లలో ఒకరు.
హృదయ్: శ్రీరామకృష్ణుల వరుసకు సోదరుని కుమారుడు. శ్రీరామకృష్ణుల మహత్తర జీవితంలో చెరిగిపోని చోటు చేసుకొన్న వ్యక్తి. 1855 లో దక్షిణేశ్వరానికి వచ్చిన ఇతడు, 25 ఏళ్లు శ్రీరామకృష్ణులను సేవించాడు. శ్రీరామకృష్ణుల సాధనల, ఆనాడు జరిగిన అనేక సంఘటనల గురించిన వివరాలు ఈతడి మూలంగానే తెలియ వచ్చాయి.
2. పారిభాషిక పదాలు
అంతరంగ భక్తులు: శ్రీరామకృష్ణులు తమ భక్తులను రెండు తరగతులుగా విభజిం చారు. సాధారణ భక్తులు ఒక కోవకు చెందినవారు. అంతరంగ భక్తులు, ఆయనకు బహుసన్నిహితులేకాక ఆయన అవతార కార్యంలో సహాయపడడానికి పై లోకాల నుండి వచ్చినవారు.
అనాహత ధ్వని: వెలువడని ధ్వని. ఎవరి నుండి వెలువడని, సదా సర్వత్రా విన వస్తూవున్న ఓంకారనాదం. యోగులు దీనిని వినగలరని చెబుతారు.
అభ్యాసయోగం: అభ్యాసం అంటే శిక్షణ. ఒక సాధన పద్ధతిని తీసుకొని దాని అభ్యాసాన్ని కొనసాగించడం.
ఆచమనం: పూజ, హోమం వంటి వాటని ప్రారంభించడానికి ముందు తనను పరిశుద్ధ పరచుకోవడానికి చేసే క్రియ.
ఆహుతి: దేవతలకు, దేవుళ్లకు హోమాగ్నిలో సమర్పించే నైవేద్యం, నెయ్యి మొదలైనవి.
ఈశ్వరకోటి: లోకహితం కోసం జన్మించేవారు. సామాన్యంగా అవతార పురుషులు జన్మిస్తున్నప్పుడు వారి కార్యంలో సహాయపడడానికి వీరూ జన్మిస్తారు.
కల్పతరువు: దేవలోక వృక్షం. దాని క్రింద నిలబడి దేనిని కోరినా ప్రసాదిస్తుందని పురాణాలు వచిస్తున్నాయి.
కవచం: మంత్రం వ్రాయబడిన లేదా యంత్రం గీయబడిన రాగిరేకు లేదా తాళపత్రం. లోహగొట్టంలో అమర్చి భుజం, మెడ వంటి భాగాలలో ధరిస్తారు, దీనిని తాయెత్తు అని కూడా పేర్కొంటారు.
కామినీకాంచనాలు: ఉన్నత జీవితానికి ఆటంకంగా శ్రీరామకృష్ణులు దీనిని పేర్కొనే వారు. దీనిలో కామిని అనే పదం కామాన్ని, కాంచనం దురాశను సూచిస్తాయి.
కాళీకీర్తన్: కాళీదేవిని గురించిన కీర్తనలు. కాళీపూజ వంటి విశేష పూజాసందర్భాలలో వంగదేశంలో ఈ కీర్తనలను గానం చేస్తారు. దీనికంటూ ప్రత్యేక రాగాలు ఉన్నాయి.
కుండలినీ / షడ్చక్రాలు: ప్రతి వ్యక్తిలోను నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక శక్తి. తంత్ర శాస్త్రం ప్రకారం ప్రతి దేహంలో మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనే ఆరు కేంద్రాలు ఉంటాయి. ఇవి క్రియాశీల కేంద్రాలు; ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి జీవశక్తిని సంతరించుకొని సముచితమైన ఆధ్యాత్మిక దర్శనంతో యోగదృష్టితో అభివ్యక్తీకరణ పొందుతుంది. సుషుమ్నా నాడిలో నెలకొని ఉన్న యీ కేంద్రాలు వెన్నెముక అడుగు నుండి సహస్రారం దాకా కుండలినీ యొక్క ఆరోహణ క్రమంలోని మెట్లు. ఈ కేంద్రాల గుండా సుషుమ్నా పొడవునా కుండలినీ నిరాఘాటంగా ఎగువకూ దిగువకూ సంచరించినప్పుడు షట్చక్రభేదనం జరిగిందని చెబుతారు. జననేంద్రియానికి, అపానానికి నడుమన ఉన్న మూలాధార చక్రం కుండలినీ స్థానంగా పరిగణిస్తారు. ఈ కేంద్రాలను ఆధిభౌతికంగా పద్మాల క్రింద అభివర్ణిస్తారు. మూలాధారం చతుర్దళ పద్మంగా పేర్కొంటారు. జననేంద్రియ మూలంలో ఉన్న స్వాధిష్ఠానం షష్ఠదళ పద్మం. నాభి ప్రదేశంలోని మణిపూర చక్రం దశదళ పద్మం. హృదయ స్థానంలోని అనాహత చక్రం ద్వాదశ (12) దళపద్మం. కంఠం దిగువ స్థానంలోని విశుద్ధ చక్రం పదహారు రేకుల పద్మం. భ్రూమధ్యంలో ఉన్న ఆజ్ఞాచక్రం ద్విదళ పద్మం. సహస్రార స్థానం సహస్ర దళ పద్మం. ఇది శివుని నివాసం. ఇది పూర్ణచంద్రుని ధవళ వర్ణంలోను, మెరపు ప్రకాశంలోను ఉంటుంది. ప్రసన్నతలో చంద్రకాంతికి దీటుగా ఉంటుంది. ఇదే అత్యున్నత గమ్యస్థానం. జాగృతి పొందిన ఆధ్యాత్మిక శక్తి యీ స్థానంలోనే దేదీప్యమానంగా అభివ్యక్తీకృతమవుతుంది.
గుణాలు: సత్వరజస్తమోగుణాలు.
గురుబాయీలు: ఒకే గురువు శిష్యులు.
చరణామృతం: అభిషేక తీర్థం. శ్రీపాద తీర్థమని కూడా పేర్కొంటారు.
చాతుర్మాస్య వ్రతం: నాలుగు మాసాల వ్రతం. జ్యేష్ఠం నుండి భాద్రపదం దాకా వానాకాలం. భిక్ష మెత్తి జీవించే సాధువులు ఈ కాలంలో వానల కారణంగా బయటకు వెళ్లడమో, సంచారం చేయడమో సాధ్యం కాదు. కనుక జ్యేష్ఠ పౌర్ణమి (గురుపూర్ణిమ) నుండి నాలుగు నెలలు ఒకే చోట బసచేసి ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తారు.
జగధాత్రి పూజ: దుర్గాపూజ తరువాత నవంబర్ నెలలో ఈ పూజను చేస్తారు. ఎర్రని రంగులో కాలుమీద కాలు వేసుకొన్న రీతిలో సింహవాహనంపై ఆసీను రాలైన దేవిని ఆరాధిస్తారు.
దుర్గాపూజ: దక్షిణ భారతదేశంలో నవరాత్రి పర్వదినాలే వంగదేశంలో దుర్గాపూజ రోజులుగా ఆరాధింపబడుతున్నవి. దుర్గ ఆవాసం హిమాలయాలు. ఆమెను నవరాత్రి రోజుల్లో ఇక్కడకు ఆహ్వానించి తీసుకురావడమనే ఈ సంఘటనను ‘ఆగమని’ అంటారు. పిదప బంకమన్నుతోను, ఎండుగడ్డితోను రూపొందించిన అందమైన రూపాలలో ఆమెను ఆవాహన చేస్తారు. దీనిని బోధన్ అంటారు. భాద్రపద మాసం అమావాస్య నుండి 6 వ రోజును బోధన్ అంటారు. భాద్రపద మాసం అమావాస్య నుండి 6 వ రోజు (షష్ఠి) ప్రారంభమై, నవమి దాకా విశిష్ట పూజలు జరుగుతాయి. అష్టమి నవమి తిథుల సంధ్యాకాలాన దుర్గ మహిషా సురుణ్ణి వధించినట్లు ఐతిహ్యం. ఈ సమయంలో జరిపే విశేష పూజను సంధిపూజ అంటారు. దశమినాడు ఉదయాన దుర్గను మళ్లీ హిమాలయాలకు పంపించి, ఆ పావన విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ తంతును విసర్జనమని చెబుతారు. దుర్గాపూజ వంగదేశంలో ఒక మత ఉత్సవంగానే కాక, సామాజిక ఉత్సవంగా అందరిచేతా ఆడంబరంగా జరుపుకోబడుతుంది.
ధారణ: యోగమార్గం ఎనిమిది సోపానాలను తెలుపుతున్నది. దాని ఏడవ సోపానం ధ్యానం. దానికి ముందు సోపానం ధారణ. ధ్యానంలో మనస్సు తైలధారలా నిరాటంకంగా ధ్యేయ వస్తువును పట్టుకొని ఉంటుంది. ధారణ దాని ముందటి పోరాట స్థితి. ఇక్కడ మనస్సు ధ్యేయ వస్తువును ఆశించడమూ మరుక్షణం దాని నుండి వైదొలగడమూ జరుగుతుంది. అల్లకల్లోలమైన మనస్సును ధ్యేయవస్తువుపై కేంద్రీకరించే ప్రయత్నమే ధారణ.
పంచతప: తపస్సాధనలో సాధకుడు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలలో అగ్నిని రగిలించి, వాటి మధ్య తాను కూర్చుంటాడు. అతడి నడినెత్తిన చండప్రచండంగా గ్రీష్మ సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు.
పంచవటి: మర్రి, రావి, వేప, ఉసిరి, బిల్వ వృక్షాలు ఉన్న చోటు; ఆధ్యాత్మిక సాధ నలకు ఉత్కృష్ట స్థలంగా పరిగణింపబడుతున్నది.
పోటు – పాటు: ప్రత్యేకమైన కొన్ని రోజులో, ప్రత్యేక వేళలలో గంగానదిలో కాన వచ్చే అద్భుత దృశ్యం. సామాన్యంగా ఉత్తరం నుండి దక్షిణంగా ప్రవహించే నది, సముద్ర నీరు పొంగటం చేత వ్యతిరేక దిశలో, అంటే దక్షిణం నుండి ఉత్తర దశలో ప్రవహిస్తుంది. ఇది జరగడానికి కాస్త ముందు నీటి ప్రవాహం స్తంభించిపోతుంది. పిదప హఠాత్తుగా వ్యతిరేక దిశలో నురుగుతో వరద ప్రవాహం మొదలవుతుంది. ఆ ప్రవాహంలో చిక్కుకున్న ఏదీ తప్పించుకోలేదు. అంతటి వేగం. తీరం నుండి చూస్తే కనుల విందుచేసే దృశ్యం అది. మళ్లీ ఉత్తరం వైపుగా ప్రవహించడం పాటు అనబడుతుంది.
ప్రారబ్ధ కర్మ: సుఖదుఃఖాది భోగాలను అనుభవింప తిరిగి జన్మ కలిగించే కర్మ.
బీజమంత్రం: బీజ మంటే విత్తనం. ఎలా ఒక విత్తనం పెద్ద వృక్షాన్ని తనలో ఇముడ్చుకొని ఉంటుందో అదే విధంగా మహాశక్తిని తనలో ఇముడ్చుకొన్న మంత్రం. ఐం హ్రీం వంటివి బీజమంత్రాలు.
మంత్రదీక్ష: ఇష్టదైవ మంత్రాన్ని అర్హతగల గురువు నుండి విధాయకంగా స్వీకరించడం.
వాసన: కోర్కె మనలో రేకెత్తడానికి మూలమైన బీజం. ఆ బీజం మనలో నెలకొని ఉన్నంత దాకా అప్పుడప్పుడు మొలకెత్తుతూనే ఉంటుంది. ఒక బీజాన్ని నశింపచేస్తే, అది మొలకెత్తి వృక్షమై అందించే కాయల పళ్లను నాశనం చేసినదానితో సమానం. అదే విధంగా వాసనను నశింపచేయడం కోర్కెలను కూకటివేళ్లతో పెకలించడం వంటిది.
విచారణ: ఆధ్యాత్మిక జీవిత ప్రారంభ కాలంలో అత్యావశ్యమైన ఒక సాధన. సత్యం ఏది, అసత్యమేది, శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనది ఏది అన్నది విచారణ చేసి సత్యమైనదాన్ని శాశ్వతమైన దాన్ని మనస్సులో నెలకొల్పడానికి చేసే అభ్యాసం ఇది. ఏ మార్గంలోనైనా ప్రారంభంలో దీనిని అనుసరించాలి. లక్ష్యం వైపుగా మనలను తీసుకొని వెళ్లడంలో విచారణ గొప్ప పాత్ర వహిస్తుంది.
శ్రాద్ధం: మరణించిన పూర్వీకుల కోసం జరిపే క్రతువు.
సంస్కారం: గత అనుభవాల ముద్రలు. ప్రతి అనుభవమూ మన మనస్సులో ఒక ముద్రను వదలి వెళుతుంది. ముద్ర అంటే కర్మరహితమైన, మందమైనదని కాదు. ఒక్కొక్క సంస్కారమూ ఒక శక్తికేంద్రంగా వ్యవహరిస్తుంది. ఏ కర్మ అనుభవంతో ఒక సంస్కారం ఏర్పడిందో అదే కర్మను మళ్లీ మనలను చేయమని ప్రోద్బలం చేసేది సంస్కారం.
సత్సంగం: సజ్జన సాంగత్యం. సజ్జనుల జీవితాలు మనకు విశ్వాసాన్ని కలిగించి మన పురోగతికి దోహదపడతాయి.
సమాధి: ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత అనుభవం. సమాధిలో రెండు కోవలున్నాయి. 1. సవికల్ప సమాధి: దీన్లో మనస్సు ఇష్టదైవాన్ని మాత్రమే చింతన చేస్తూ దాన్లో నెలకొని ఉంటుంది. 2. నిర్వికల్ప సమాధి: దీనిలో మనస్సు పూర్తిగా కరిగిపోయి పరమాత్మతో తాదాత్మ్యమవుతుంది. మనోరహిత స్థితి.
సప్త ఋషులు: తపోలోకంలో సదా సమాధి స్థితిలో మగ్నులైవున్న మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు అనే మునులు.
సాలగ్రామం: మహావిష్ణువు చిహ్నంగా ఆరాధింపబడే నల్లనిగుండ్రని రాయి. నేపాల్ నుండి ఉత్తర బీహారు వైపుగా ప్రవహించి గంగలో కలిసే గండకీ నదిలో ఈ రాళ్లు కానవస్తాయి.
హరిబోల్: బోల్ అంటే చెప్పడం అని అర్థం. హరిబోల్ అంటే హరి అని చెప్పడం.