చెన్నై శ్రీరామకృష్ణ మఠ వ్యవస్థాపకులైన స్వామి రామకృష్ణనందగారు 1911 ఫిబ్రవరి ఒకటవ తేదీ నా తండ్రియైన డాక్టరు పి. వెంకటరంగంకు ఒక ఉత్తరం వ్రాశారు. కర్నాటక రాష్ట్రంలో రామకృష్ణ కేంద్రాలు వెలిసేందుకు ప్రారంభకాలంలో పనిచేసిన వారిలో ఈయన ఒకరు. మాతృశ్రీ శారదాదేవి బెంగళూరుకు రానున్నట్లూ, అందుకు తగిన ఏర్పాట్లు చూడమనీ ఆయన వ్రాశారు.
1911 మార్చి నెలలో మాతృదేవి బెంగళూరుకు వచ్చారు. అక్కడి రామకృష్ణ ఆశ్రమం పూజగదిలో ఆమె బస చేయడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఒక శుక్ర వారం రోజు ఆమె వేంచేసి, ఆదివారం రోజు తిరిగి వెళ్లిపోయారు. భక్తులు తండోప తండాలుగా వచ్చారు. మా అమ్మ, మేమూ వెళ్లాం. మా అమ్మకు వంగభాష తెలియదు. మాతృదేవికి తమిళం తెలియదు. అయినా ఇద్దరూ చాలాసేపు మాట్లాడు కోవడం నాకు బాగా జ్ఞాపకముంది. అప్పుడప్పుడు వారు నవ్వుకున్నారు కూడా. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు; భాష అడ్డంకి కాలేదు.
ఇలాంటి ఒక సందర్భంలోనే మా నాన్న నన్నూ, నా సోదరినీ మాతృదేవి సేవకు అర్పిస్తున్నట్లు విన్నవించారు. అందుకు మాతృదేవి మేము చాలా చిన్న పిల్లలమనీ పెరిగి పెద్దవారయిన తర్వాత తమ వద్దకు రావచ్చనీ చెప్పారు. అప్పుడు నాకు 13–14 ఏళ్ల వయస్సు.
1917 అక్టోబరు 13 వ తేదీ. మేము మాతృదేవి సేవ కోసం వారి వద్దకు వెళ్లాం. మా అత్త కుమార్తె, రాజగోపాలనాయుడూ మాతోపాటు వచ్చారు. మేము కలకత్తాకు వెళ్లినప్పుడు మాతృదేవి అక్కడ లేరు. జయరాంబాటికి వెళ్లున్నారు. మాకు చాలా నిరాశ కలిగింది.
మాతృదేవి తిరిగి రావడానికి మూడు నాలుగు నెలలు పట్టింది. అది కూడా ఒక రకంగా మంచిదే అయింది. ఎందుకంటే ఆ వ్యవధిలో మేం కొంత వరకు వంగభాష నేర్చుకున్నాం. కనుక మాతృదేవితో చక్కగా మాట్లాడగలిగాం. మాతృదేవిని దర్శించినప్పుడు ఆమె పలికిన మొట్టమొదటి మాటలే మమ్మల్ని ఆనందంలో ముంచెత్తివేశాయి. “పిల్లలారా! మీ రాక కోసం జయరాంబాటిలో వేచివున్నాను, మీరు రాకపోవడంతో నేనే వచ్చేశాను.” ఎంతటి మాతృభావం ఉప్పొంగే మాటలివి!
మేము శ్రీ శారదా మాతృమందిరంలో ఉంటున్నాము. అక్కడికి ఉద్బోధన్ చాలాదగ్గర. మేము ఉన్న చోటునుండి, అక్కడి స్త్రీలతో పాటు వచ్చి మాతృదేవిని దర్శించుకొనేవారం; వారికి కొన్ని సేవలు చేసేవారం. ఉదయం 9 గంటలకు మాతృదేవి స్నానానికి మునుపు వారి తలకూ, శరీరానికి నూనె రాచే భాగ్యం నాకు కలిగింది. తలకు నూనె మర్దించేటప్పుడు తెల్లవెంట్రుకలు కొన్ని రాలిపోయేవి. నేను వాటిని సేకరించి చీర కొంగులో ముడివేసుకునే దానను. ఒక రోజు అది మాతృదేవి చూశారు. నవ్వుతూనే, “ఎన్నో వెంట్రుకలు ఎప్పుడో రాలిపోయాయి, నీకు ఇంత ఇష్టమని ముందుగానే తెలుసుంటే వాటి నన్నిటినీ సేకరించి నీకు ఇచ్చేదాననే!” అన్నారు.
ఒక రోజు సాయంత్రం ఏడు గంటలకు మాతృదేవి నుండి పిలుపు వచ్చింది. తమ సమక్షంలో తమిళంలో మాట్లాడమని మాతృదేవి మాతో అన్నారు. తమిళంలో పాటలు కూడా పాడమన్నారు. వాటిని విని ఎంతో ఆనందించారు ఆమె.
ఒక రోజు వారిని దర్శించి తిరిగి వచ్చేటప్పుడు మాతృదేవి కూడా కాస్త దూరం మాతో వచ్చారు. రాధూ కోసం కొద్దిగా చారు చేసి తీసుకురమ్మన్నారు. మేము అట్లే చేసి తెచ్చాం. ఒకసారి బియ్యం అప్పడాలు చేసివ్వమన్నారు. మేము కూడా బెంగళూరుకు ఉత్తరం వ్రాశాం. మా నాన్న రైల్వే పార్సల్ ద్వారా వాటిని పంపారు. మాతృదేవి కూడా వాటిని తిని ఉండేవారు. కానీ ఏం చేయడం? మాతృదేవితో పాటు ఉంటున్న ఇతర స్త్రీలు దానిని వారించారు – రైలు ద్వారా వచ్చిన ఒక పదార్థాన్ని ఆచారం పాటిస్తున్న స్త్రీలు తినరాదట!
ఒక రోజు సాయంత్రం వెళ్లాను. నేను కడుపునొప్పితో అప్పుడప్పుడు బాధపడేదానను. అందువలన మాతృదేవి ఎంతో ఆప్యాయంగా నా ఆరోగ్యం గురించి విచారించారు. ఆ రోజు ఆకాశం మేఘావృతమై ఉంది. అందువలన ఆ రోజు బెంగళూరు వాతావరణంలా ఉందని సూచించిన మాతృదేవి తమకు బెంగళూరు ఎంతగానో నచ్చిందని చెప్పారు. ఆ ప్రాంతపు ప్రజలు సహజంగానే భక్తిభావం గలవారని ప్రశంసించారు.
మాతృదేవి కాశీలో ఉంటున్నప్పుడు మమ్మల్ని అక్కడికి తీర్థయాత్రకు తీసుకెళ్లారు. అక్కడ కూడా నాకు కడుపునొప్పి వచ్చింది. మాతృదేవికి ప్రణమిల్లడానికి వచ్చిన ఒక వ్యక్తితో నా ఆరోగ్యం గురించి అడిగి మూడు నాలుగు కమలాపండ్లు నా కోసం పంపించారు.
1918 మార్చి నెలలో మాతృదేవి జయరాంబాటి నుండి వచ్చినప్పుడే నేను నా మంత్రదీక్ష విషయంగా సంప్రదించాను. మర్నాడే మంత్రదీక్ష ఇస్తానని మాతృదేవి అన్నారు. కానీ మరొక స్త్రీ కూడా మంత్రదీక్ష కోసం వేచివుండడమూ, ఆ సమయంలో ఆమె అక్కడ లేకపోవడంతో నేను కూడా ఆమె రాక కోసం వేచివుండాల్సి వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత ఒక రథయాత్ర రోజున మా ఇద్దరికీ మాతృదేవి మంత్రదీక్ష ప్రసాదించారు.
మేము ఇంటి నుండి వచ్చి రెండు సంవత్సరాలైనాక ఒక రోజు శరత్ మహరాజ్ మమ్మల్ని ఒకసారి ఇంటికి వెళ్లిరమ్మన్నారు. మాకు అంతగా ఇష్టం లేకపోయినా పెద్దవారు చెప్పారని బయలుదేరాము. బయలుదేరేటప్పుడు మాతృదేవికి ప్రణమిల్లాం. మమ్మల్ని ఆశీర్వదించి, కలకండ ప్రసాదమిచ్చి గరుదేవుల పూజలోవున్న ఒక పుష్పాన్ని కూడా ఇచ్చారు.
సుమారు 20 రోజులు బెంగళూరులో గడిపాము. అంతలో మాతృదేవి ఆరోగ్యం బాగా క్షీణించి మంచం పట్టారని కబురువచ్చింది. మేము వెంటనే బయలుదేరాం. మాతృదేవి మంచం పట్టినా ఆవిడ జ్ఞాపకశక్తి చెక్కుచెదరలేదు. మమ్మల్ని గురించీ, మా ఊరు గురించీ వివరాలన్నీ అడిగారు.
మాతృదేవి ఆరోగ్యం బాగా క్షీణించడంతో సదా వారి దగ్గర ఎవరైనా ఉండవలసి వచ్చింది. సరళాదేవి సేవాశుశ్రూషలలో తర్ఫీదు పొందింది. ఆమె మా గదిలోనే ఉండసాగింది. మాతృదేవి సేవాశుశ్రూషలన్నీ ఆమె చూసుకున్నారు. ఇతర స్త్రీలు రాత్రంతా వంతుల ప్రకారం మాతృదేవి పక్కన మేల్కొని చూసుకున్నారు. నా వంతు ఉదయం రెండు గంటలనుండి నాలుగు గంటల వరకు.
ఎవరు తమ పక్కన మేల్కొని కూర్చునివున్నారని మాతృదేవి అడిగి తెలుసు కునేవారు. తల నుండి పాదాలదాకా మృదువుగా ఒత్తేదానను. పక్కగదిలో శరత్ మహరాజ్ పడుకుని ఉండేవారు. మాతృదేవి గదిలో వినవచ్చే చిన్నశబ్దం కూడా ఆయనకు తెలిసిపోయేది. వెంటనే అక్కణ్ణుండే దాని గురించి అడిగేవారు. అందువల్ల మేము ఎంతో అప్రమత్తంగా మెలగేవారం.
ఒక రోజు రాత్రి వ్యాధి తీవ్రత వలన మాతృదేవి ఏమేమో మాట్లాడసాగారు. బేలూర్ మఠం వెళ్లాలి, బెంగళూరుకు వెళ్లాలి అనసాగారు. ఆరోగ్యం నయమయ్యాక వెళదామని చెప్పి నేను శాంతింపచేశాను. ఆమె పడుకుని ఉన్నప్పుడు దోమతెరలో కూర్చొనే నేను సేవ చేసేదానను. కొన్ని సమయాల్లో మాతృదేవి నన్ను కూడా తమతోనే పడుకోమనేవారు. ఇది మహద్భాగ్యమనడంలో సందేహం లేదు. అయినా నాకు సంకోచంగా ఉండేది.
సరళాదేవి నా గదిలో ఉండడం కూడా నా భాగ్యమనే చెప్పాలి. ఆమె మాతృదేవికి చికిత్స చేయడం వలన మాతృదేవి శరీరం నుండి రాలిన చర్మం పొరలు గోళ్లు, తలవెంట్రుకలు మొదలైనవి సేకరించి పెట్టుకున్నారు. నేను అడిగితే వాటిలో కొన్ని నాకు కూడా ఇచ్చారు.
మాతృదేవి ఆరోగ్యం బాగా దెబ్బతిని చివరకు మహాసమాధి పొందారు. అప్పుడు కూడా వెళ్లి చూశాను. వారి దివ్యశరీరం దహనం చేయబడినప్పుడు కూడా చూశాను. చితిలో మేము కూడా కొందరం నేయి పోశాము. నేను నేయి పోసినప్పుడు అగ్నికీలలు నా చేతికి సోకాయి, మాతృదేవి తుదిస్పర్శగా దానిని నేను ఎంచాను. అది దీర్ఘకాలం నా స్మృతిపథంలో నిలిచిపోయింది. మహాసమాధి తర్వాత నిర్దేశింపబడిన రోజుల్లో ఒక పూట మాత్రం ఆహారం తీసుకుంటూ వ్రతం అనుష్ఠించాం. ఇలా మాతృదేవితో బాహ్యసంసర్గం ముగింపునకు వచ్చింది.