ఆ రోజు జయరాంబాటిలో భక్తులు ఎవరూలేరు. రాత్రి భోజనసమయంలో మాతృదేవి కొంత దూరంగా నిలబడి, నేను భోజనం చేస్తూవుండడం చూస్తూవున్నారు. పగలంతా నేను భోజనం చేయలేదని తెలుసుకొని ఎంతో ఆప్యాయంగా నాకు భోజనం పెట్టారు.
మరుసటి రోజు నాకు మంత్రదీక్ష. ఎప్పుడు తెల్లవారుతుందా అనే ఆరాటంతో రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదనే చెప్పాలి. తెల్లవారుజామునే లేచి కొలనులో స్నానం చేసి మాతృదేవి పిలుపు కోసం ఎదురు చూస్తూవున్నాను. దీక్షకు ఏమేం కావాలో నాకు తెలియదు. దానిని గురించి ఎవరినీ అడగనూలేదు. బొత్తిగా నా దగ్గర డబ్బు లేదు. ఉదయం ఎనిమిది గంటలయింది. మాతృదేవి సేవకుడైన సాధువు ఒకరు వచ్చి నన్ను పూజగదిలోకి తీసుకెళ్లి బయట నుండి తలుపు మూసేశాడు.
మాతృదేవి ఆసనం మీద కూర్చొని పూజ చేస్తున్నారు. ఆమెకు సమీపంలో మరొక ఆసనం ఉంది. గురుదేవులకు ప్రణమిల్లి దానిపై కూర్చోమన్నారు మాతృదేవి. నేను కూర్చున్న వెంటనే చేతిలో కాసిని గంగాజలం ఇచ్చారు. నా మీద కొద్దిగా గంగాజలం చల్లి తలను, శరీరాన్ని తమ చేత్తో స్పృశించారు. మాతృదేవి స్పర్శ నన్ను పులకితాంగుణ్ణి చేసింది. వర్ణనాతీతమైన ఆనందానుభవంతో మనస్సు నిండిపోయింది. మాతృదేవి కొంతసేపు కళ్లు మూసుకొని కూర్చున్నారు. ఆ స్థితిలోనే నాతో, “గురుదేవులు నీకు ఇష్టమే కదా?” అని అడిగారు. అవునంటూ నేను చెప్పినప్పుడు మూడుసార్లు ఒక మంత్రాన్ని చెప్పారు. తర్వాత నన్ను కూడా వారితో పాటు మంత్రం ఉచ్చరించమన్నారు. అలా ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా గోడవైపుగా చేతులు చాచి, “ఇదిగో, ఇదిగోచూడు. ఇదే నీ ఇష్టదైవం” అన్నారు. కళ్లు మిరిమిట్లు గొలిపే తేజస్సు ఒకటి ఆ దిశలో ఆవిర్భవించింది. సజీవమైన దివ్యకాంతులతో కూడిన ఒక దేవీమూర్తి ఆ తేజస్సులో సాక్షాత్కరించింది. అ దేవి కరుణాపూరిత నయనాలతో నన్ను చూసింది. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను; మైమరచిపోయాను. మాతృదేవి స్వరూపం కూడా అప్పుడు మరోవిధంగా కనిపించింది. ఇవన్నీ ఒకటి రెండు క్షణాల్లో జరిగిపోయాయి.
కొంతసేపయ్యాక మాతృదేవి ఆప్యాయంగా, “నాయనా! భయపడిపోయావా?” అని అడిగారు. మాతృదేవికి బదులు చెప్పే శక్తి నాలో లేదు. కనుక తల దించు కొని కూర్చున్నాను. తర్వాత మాతృదేవి నా ఎడమచేతిని పట్టుకుని జపం ఎలా చేయాలో చూపించారు. ఆమె మాట్లాడారు. ఆమె మాట్లాడుతూవుంటే నా లోపల ఏదో జరుగుతున్నట్లుగా ఉంది. నా చేతి వ్రేళ్లను అదిమి, మంత్రాన్ని ఉచ్చరించి, నన్ను కూడా తమతో పాటు ఉచ్చరింపమన్నారు. నేను కూడా అట్లే చేశాను. తర్వాత గురుదేవుల ఛాయాచిత్రం చూపించి, “గురుదేవులకు ప్రణామం చేయి. ఆయనే నీ ఇష్టదైవం. ఆయనే గురువు. ఇహపరాలకంతా ఆయనే! ఆయన సర్వదేవదేవీ స్వరూపులు” అన్నారు. నేను గురుదేవులకు ప్రణమిల్లి, మాతృదేవికి కూడా ప్రణమిల్లాను. ఎంత జపంచేయాలి, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాల గురించి వివరించారు మాతృదేవి.
నిజానికి ఆ రోజు మాతృదేవి ఎవరో, ఏ పదార్థమో నాకు అవగాహన కాలేదు – ఇప్పటికీ అవగతం కాలేదు. కానీ అనుకున్న మరుక్షణం దైవదర్శనం ప్రసాదించగల శక్తిమంతురాలని మాత్రం తేటతెల్లనయింది.
మాతృదేవి ఆసనం సమీపాన పండ్లు ఉన్నాయి. వాటిని నా చేతుల్లో ఉంచి, “ఈ పండ్లు నా కివ్వు” అన్నారు. నేను అట్లే చేశాను. ఇదే గురుదక్షిణ అని అనుకున్నాను. డబ్బు, పండ్లు, పూలు అంటూ ఏదీ నేను తీసుకెళ్ల లేదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నా శరీరం వణకసాగింది.
మాతృదేవికి మళ్లీ ప్రణమిల్లాను. ఆమె ఇంత సమీపంలో ఉండడం నాకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది; తృప్తినిచ్చింది. “ఇక నువ్వు నీ గదికి వెళ్లి నేను నేర్పించినట్లు కొద్దిగా జపంచేయి. తర్వాత ఏమైనా తిను” అన్నారు.
సాయంత్రం మళ్లీ మాతృదేవి దర్శనార్థం వెళ్లాను. ఆమె వసారాలో కూర్చొని కాయగూరలు తరుగుతున్నారు. బాంకూరాకు చెందిన వైకుంఠ మహరాజ్ ఇచ్చిన మందుతో వాతనొప్పి కాస్త ఉపశమించినట్లు చెప్పారు. కరపు నివారణపనుల వివరాలన్నిటిని అడిగారు. కరవులో బాధపడుతున్న వారి కోసం మాతృదేవి హృదయం ఎంతగా ద్రవించిందో తెలుసుకోగలిగాను. ప్రతి పేదవాని ఇంటికి వెళ్లడమూ, చీటీలు ఇవ్వడమూ, వారు వాటిని తీసుకువచ్చి చూపించి బియ్యం తీసుకెళ్లడమూ, స్త్రీలకు బట్టలు యివ్వడమూ లాంటి వన్నీ నేను వివరించాను. అప్పుడు వివరించిన ఒక సంఘటన విని మాతృదేవి చలించిపోయారు:
మేము నివారణాకార్యం చేపట్టిన ఫలానా గ్రామానికి ఒక రోజు ఉదయం వెళ్లాం. బియ్యం తీసుకువెళ్లిన ఎవరూ ఇంట్లో కనబడలేదు. పనిమీద బయటికి వెళ్లి ఉంటారనుకున్నాం. పని దొరికిన వారికి బియ్యం ఇవ్వడం ఆపివేయాలి; దానిని తెలుసుకోవడానికే మేం వెళ్లాం. అప్పుడు గ్రామానికి బయట మోకాళ్ల వరకు బురదలో నిలబడి చాలామంది నాట్లు వేస్తున్నారు. మేము అటువైపుగా వెళ్లాం. మమ్మల్ని చూడగానే ఒక స్త్రీ పొలం నుండి బయటికి వచ్చి దాక్కుంది. ఆమె ఎందుకు అలా చేసిందని అడిగినప్పుడు ఒక హృదయవిదారమైన విషయం తెలిసింది. మొన్నటి రోజే ఆమె ప్రసవించింది. ఆ పసిగుడ్డును ఒక గుడ్డలో చుట్టి గట్టు మీద పడుకోబెట్టి పనికి వచ్చింది – అంతా కూటికోసమే. ఆమె పని చేస్తూవుందని మాకు తెలిసిపోతే బియ్యం ఇవ్వడం ఆపేస్తాం కదా! అందుకని దాక్కుంది. కరవు కఠిన్యం ఎంతగా ఆమెను బాధించివుండాలి! ఆ రోజు పుట్టిన చంటిబిడ్డను తీసుకుని పనికోసం వచ్చిందంటే ఆమె పేదరికం అలాంటిది – ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మా హృదయాలను ఎవరో కెలికివేసినట్ల నిపించింది.
నేను మెల్లగా ఆ స్త్రీ వద్దకు వెళ్లి, “అమ్మా! కలతచెందకు. నీకు బియ్యం యివ్వడం ఆపం” అని చెప్పాను. ఈ మాటలు వినగానే ఆమెకు కాస్త ధైర్యం వచ్చింది. చేతులు జోడించి, “మహరాజ్! ఎంతో కష్టంలో ఉన్నాను. అందుకే పనికి వచ్చాను” అని చెప్పింది. ఒక రోజు పని చేస్తే ఆమెకు ఒక అరసేరు వడ్లు ఇస్తారు.
ఈ సంఘటన విన్న మాతృదేవి శరీరం వణకిపోయింది. ఆమె ఏడుస్తూ, “నువ్వు ఏమంటున్నావు నాయనా! ఆ రోజే ప్రసవించిన మనిషి పనికి రావడమా! పొలంలో పనిచేయడమా? నువ్వు మంచిపనే చేశావు నాయనా! గురుదేవులు నిన్ను ఆశీర్వదిస్తారు” అన్నారు. తర్వాత ఆర్ద్రంగా గురుదేవులతో “ప్రభూ! ఇవన్నీ మీరు చూడలేకున్నారా! లోకులు ఎన్ని బాధలు, కష్టాలు అనుభవిస్తున్నారు! ఇలా కష్టాలలో చిక్కుకుంటే మనిషి ఏం చేయగలుగుతాడు? దీనికొక పరిష్కారం చూపలేరా?” అంటూ ప్రార్థించారు. ఆమె కంఠం గద్గదమయింది. ఇప్పటికీ ఆ కంఠస్వరం నా చెవులలో మార్మోగుతూన్నది. కరుణాసాగరులు కదా మాతృదేవి!
కరవు నివారణ కార్యక్రమంలో మా జీవిత విధానం గురించి వివరంగా అడిగారు మాతృదేవి. మేము ఏం ఆహారం తీసుకుంటాం, ఎక్కడ వుంటాం, ఏమేం పనులు చేస్తామనే విషయాలనన్నీ అడిగారు. నేను ఇలా అన్నాను:
“ఒక రోజు ఒక గ్రామంలో నివారణ కార్యాలను పర్యవేక్షించేందుకు వెళ్లాను. చిన్న నదిని దాటి వెళ్లవలసి వుంది. 20, 25 అడుగుల వెడల్పు ఉంటుంది. కాని మోకాళ్ల వరకే నీళ్లు ప్రవహిస్తూ ఉండడంవలన కాలినడకనే ఆ నదిని దాటాను. పగటి పూట బాగా వర్షం పడింది. తిరిగి వచ్చేటప్పుడు చూస్తే ఆ నది పొంగి ప్రవహిస్తువుంది. చీకటి పడసాగింది. నదిని దాటేందుకు మరో మార్గం కనబడలేదు. గుడ్డలు విప్పి తలకు చుట్టుకుని, ఒక చేత గొడుగు పట్టుకుని నదిలో దూకేశాను. నీటి వేగం నన్ను లాగుకుంటూ వెళ్లిపోయింది. ఒక ముళ్లపొదలో చిక్కుకున్నాను. ప్రాణాలతో బయటపడతానా అనిపించింది. ఒక చేత్తో నీళ్లను తోసుకుంటూ ఎలాగో అవతలి ఒడ్డు చేరాను.”
ఇది విన్నప్పుడు మాతృదేవి ముఖం వివర్ణమయిపోయింది. కరుణ ఉట్టిపడే కంఠంతో ఆమె ఇలా అన్నారు: “నాయనా! గురుదేవులే నిన్ను కాపాడారు. ముళ్లపొదలో చిక్కుకుంటే ఇక బయటపడడం అసంభవం. పోనీలే, ఇకపై ఎప్పుడూ ఇలా చేయవద్దు.”
నేను ఎలాంటి కష్టమూ దుఃఖమూ అనుభవించానో వాటిని మాతృదేవి అట్లే అనుభవించారు. నేను అనుభవించిన ఆవేదనతో తల్లి మనస్సు బాధపడింది. ఇప్పటికీ ఏ ప్రమాదమో ఆపదో ఎదురైతే తక్షణం మాతృదేవి హెచ్చరిక నా హృదయంలో మారుమ్రోగుతుంది.
మాట వరుసగా మరుసటి రోజు కామార్పుకూర్కు వెళ్లడానికి మాతృదేవిని అనుమతి కోరాను. అందుకు మాతృదేవి, “వద్దు నాయనా! ఇప్పుడు కామార్పు కూరుకు పోవడం మంచిది కాదు. తర్వాత ఎప్పుడైనా వెళ్లు. ఎలాగైనా ఇక్కడ మూడు రోజులు గడుపు. ఇది భయంకరమైన మలేరియా సమయం. మలేరియా సోకని ఇల్లంటూ లేదు. ఈ సమయంలో ఇక్కడికి రమ్మని నేను ఎవరితోనూ చెప్పను” అన్నారు.