మాతృదేవిని మొట్టమొదటిసారిగా జయరాంబాటిలోని ప్రసన్న మామయ్య ఇంటి వసారాలో దర్శించుకొన్నాను. ప్రణమిల్లిన వెంటనే, “మళ్లీ రా” అన్నారు.కారుణ్యం ఉట్టిపడే ఆ మాటలను మాత్రమే ఆ రోజు విన్నాను. మరేమీ మాట్లాడడానికి వీలుపడలేదు.
రెండవసారి మాతృదేవిని దర్శించింది కూడా అదే ఇంట్లోనే. భోజనాలు అయిన తరువాత మాతృదేవి నిలబడివున్నారు. మేం ప్రణమిల్లినప్పుడు, “రండి, అందరూ బాగున్నారు కదా!” అని అడిగారు. అవునన్నాను నేను. అనేక విషయాలుమాట్లాడిన తర్వాత మాతృదేవి ఇలా అన్నారు:
“ఇదిగో చూడు, వందేమాతరం అని నినదిస్తూ ఊరకే ఆర్భాటం చేయవద్దు.రాట్నం తీసుకురా. వస్త్రాలు నేయి. ఒక రాట్నం దొరికితే నూలు తీయాలనుకొంటు న్నాను. పని చేయండి, ఊరకే ఆర్భాటం చేయడం మంచిది కాదు. యువకులు ఎటు పయనిస్తున్నారో చూడు!
తరువాత నాకు ఉద్బోధన్ పత్రిక ఒకటి ఇస్తూ, “ఇందులో నరేంద్రుడు చెప్పిన విషయాలున్నాయి. చదువు. గురుదేవుల పుస్తకాలు చదివావా?” అని అడిగారు. “అవును. కథామృతం లాంటి కొన్ని పుస్తకాలు చదివాను” అన్నాను నేను.
ఆ రోజు మాతృదేవి పలుకులు మాకు మార్గాన్ని నిర్దేశించాయనే చెప్పాలి. సర్వత్రా చీకటి ఆవరించిన మార్గంలో వారి ప్రేమవచనాలు మాకు మార్గదర్శకా లయ్యాయి.
ఈరోజు మాతృదేవి కోల్పారాకు వచ్చారు. మఠంలోని నూతన భవనంలో మాతృదేవి గురుదేవులను ప్రతిష్ఠ చేయాలని మా అందరి కోరిక. ఈ విషయం మాతృదేవికి ముందుగానే తెలియజేశాం. నిర్ణీత సమయంలో మాతృదేవి పూజ గదిలోకి వచ్చి ఆసనం మీద కూర్చున్నారు. గురుదేవుల పటాన్ని తీసుకుని పీఠంలోని చిన్న ఆసనంపై అమర్చారు. తమ పటాన్ని దాని ఎడమవైపు ఉంచి పూజ చేశారు.
తరువాత నాతో, “నువ్వు హోమం చేయి’ అన్నారు. నేను హడలిపోయాను. స్వదేశీ ఉద్యమంలో దేశదిమ్మరిగా తిరిగిన నాకు పూజ, హోమాల గురించి అసలు తెలియదు. అందువలన మాతృదేవితో, “అమ్మా! నాకు హోమం గురించి ఏమీ తెలియదు. నేను ఎలా హోమం చేయను?” అన్నాను. అందుకు మాతృదేవి, “దానికేం! నేను నీ పక్కన నిలబడతాను. గురుదేవుల పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తూ అగ్నిలో నేయి అర్పించు, హోమం చేయి!” అన్నారు. అలా అంటూ పూజగది తలుపు మీద చేయి వేసి నిలబడ్డారు. నేను కూడా అగ్నిని రగిలించి, గురుదేవుల బీజమంత్రం ఉచ్చరిస్తూ నిర్ణీత బిల్వదళాలను సమర్పించి హోమం చేశాను.
హోమం పూర్తవగానే మాతృదేవి, “ఇదిగో, హోమం సమాప్తమయింది. ఇక భస్మాన్ని సేకరించి హోమరక్ష తయారుచేయి. హోమకుండంలోని భస్మాన్ని సేకరించి కొద్దిగా నేయి కలిపి బాగా రుద్ది హోమరక్ష తయారుచేయి. దానితో అందరికీ బొట్టు పెట్టు” అన్నారు. నేను అట్లే చేశాను. ప్రసాద రక్షతో మాతృదేవి నెత్తిపై బొట్టు పెట్టాను. తర్వాత భక్తుల కందరికీ అలాగే చేశాను. “గురుదేవులు మీ కందరికీ శ్రేయస్సు ప్రసాదించెదరు గాక! పూజను స్వీకరించెదరు గాక!” అన్నారు మాతృదేవి. నైవేద్యం అర్పించిన పిదప మాతృదేవి భక్తురాండ్రతో కలిసి ఆనందంగా భోజనం చేశారు. పూజగదికి పక్కగదిలో విశ్రాంతి తీసుకున్నారు.
కోల్పారా జగదంబ ఆశ్రమానికి మాతృదేవి వేంచేశారు. భక్తుల ప్రార్థన మన్నించి వారు అక్కడ కొద్ది రోజులు బసచేసేటట్లు ఏర్పాటు జరిగింది. వంటకు ఎవరినీ ఏర్పాటు చేయలేదు. కేదార్ మహరాజ్ మాతృదేవి వద్దకు వెళ్లి, “వంటకు ఒక మనిషిని ఏర్పాటు చేయనా?” అని అడిగారు. మాతృదేవి నా వైపు తిరిగి, “నువ్వు వంట చేయి” అన్నారు. నాకు వంట గురించి బొత్తిగా ఏమీ తెలియదు. ఈ విషయం మాతృదేవితో చెప్పినప్పుడు ఆమె “నీకు తెలిసింది చేయి” అన్నారు.
వంట గదికి వెళ్లాను. ఒక్కటి కూడా సరిగ్గా కుదరలేదు. తర్వాత మాతృదేవి భోజనానికి వచ్చి కూర్చున్నారు. నవ్వారు. అందుకు కారణం ముందుగానే నాకు తెలుసు కదా! మర్నాటి నుండి 10/12 రోజులు రోజూ వంటగదికి వచ్చి పక్కనే నిలబడి అంచెలంచెలుగా వంట నేర్పించారు.
ఒక రోజు మాతృదేవి, నేను కూర్చుని కూరగాయలు తరుగుతున్నాం.
నేను: అమ్మా! బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఈ కళ్లతో బాహ్య వస్తువుల నన్నిటినీ చూస్తున్నాను. వీటి నన్నిటిని బ్రహ్మంగా ఎలా తీసుకోను? ఈ అనుభూతి ఎలా సిద్ధిస్తుంది? బ్రహ్మజ్ఞానం కలుగక పోతే ముక్తి లేదని స్వామీజీ అంటున్నారు. ఏమీ అర్థమవడంలేదు.
మాతృదేవి: అది చాలా కఠినమైన దారి. అలాంటి సాధనలు అనుష్ఠించి పురోగమించడానికి చాలాకాలం పడుతుంది. నువ్వు గురుదేవులను ప్రార్థించు. ఆయనను ఆశ్రయించి జీవించు. సముచిత తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన అన్నిటినీ గ్రహింప చేస్తారు. నువ్వెందుకు ఆందోళన చెందుతావు? గురుదేవుల అనుగ్రహం కలిగితే అంతా సిద్ధిస్తుంది. ఇదిగో చూడు. చాలా రోజుల తర్వాత నిన్న ఇక్కడ గురుదేవులను చూశాను. భోజనానంతరం ఆయన విశ్రమిస్తున్నట్లు అనిపించింది. జనసంచారంలేని ఏకాంతమైన ప్రదేశం ఇది!
దుర్గాపూజ సమయం. మాతృదేవి జయరాంబాటిలో ఉన్నారు. అనేక ప్రాంతాల నుండి ఎందరో భక్తులు వస్తున్నారు. ఆ రోజు ఒకరికి సన్న్యాస దీక్ష, పలువురికి మంత్రదీక్ష ప్రసాదించారు మాతృదేవి. అష్టమి రోజు సాయంత్రం నాలుగు గంటలకు నేను కోల్పారా నుండి బయలుదేరాను. సుమారు ఒకటిన్నర గంటలలో జయరాంబాటి చేరుకున్నాను. ప్రసన్న మామయ్య ఇంటికి వెళ్లి మాతృదేవికి ప్రణమిల్లాను. ఆరోగ్యం బాగా లేకున్నా ఆ సమయంలో కూడా మాతృదేవి మోకాళ్ల మీద కూర్చొని మైదాపిండి సిద్ధం చేస్తున్నారు. సుమారు రెండు కిలోల పిండి. లూచీలు తయారుచేసి అందరికీ ప్రసాదంగా పంచుతారు. పక్కనే పలువురు నిల బడి ఉన్నారు. అయినా వారెవ్వరూ మాతృదేవి కష్టపడుతూండడం గురించి పట్టించు కున్నట్లు తోచలేదు.
నేను వెళ్లి ప్రణమిల్లినప్పుడు మాతృదేవి, “రా నాయనా! అందరూ క్షేమమే కదా?” అని అడిగారు. “క్షేమమే” అన్నాను నేను. తర్వాత “అమ్మా! ఇదేమిటి! ఇక్కడ ఇందరు ఉన్నారు. ఆరోగ్యం బాగాలేని ఈ స్థితిలో మీ రెందుకు ఇవన్నీ చేస్తూ కష్టపడుతున్నారు?” అని అడిగాను. అందుకు మాతృదేవి, “ఎవరూ రావడం లేదు. మరేం చేయను? నేనే పిండి సిద్ధం చేస్తున్నాను. ఈ రోజు నువ్వు ఇక్కడే ఉంటే బాగుంటుంది. లేకపోతే అన్నీ నేనే చేసుకోవాల్సివస్తుంది” అన్నారు. నేను భరించలేకపోయాను. ఇంతమంది ఉండగా, ఆరోగ్యం బాగాలేని స్థితిలో కీళ్లనొప్పు లున్నా కాళ్లు మడిచి కూర్చొని మాతృదేవి పనిచేయడం నన్ను తల్లడిల్లజేసింది. “రాత్రి ఎంతసేపు పట్టినా సరే, నేను ఈ పని పూర్తిచేసే వెళతాను” అని చెబుతూ కూర్చున్నాను. మరొక సాధువు కూడా వచ్చి సాయమందించారు. పనంతా ముగించి రాత్రి పది గంటలకు కోల్పారాకు తిరుగుముఖం పట్టాను.
జయరాంబాటిలో కొత్త ఇంట్లో ఉంటున్నారు మాతృదేవి. జగద్ధాత్రి పూజ దగ్గర పడుతూవుంది. అందుకోసం వస్తువులను ఇప్పటి నుండే సేకరించడం మొదలుపెట్టారు. దీపం వత్తులు లాంటివి కూడా తయారుచేసేశారు. ప్రతి వస్తువునూ అత్యంత శ్రద్ధగా, భక్తితో సేకరించారు. చూసిన వారికే అది అర్థమవు తుంది. అందులో వందలో ఒక పాలు శ్రద్ధ మనకుంటే మనకు సద్గతి కలుగుతుంది. పూజా మండపంలో ముగ్గులు వేయాల్సివుంది.
నేను: మీ ఇంటి ఆడవారిని పిలవమంటారా? మామూలుగా వారే కదా ముగ్గులు వేస్తారు. పిలువకపోతే గోరంతలు కొండంతలు చేస్తారు.
మాతృదేవి: వద్దు వారి నెవ్వరినీ పిలవవద్దు. నా ఆడపిల్లలు కూడా మీరే. మగపిల్లలూ మీరే! మీరు వేస్తే చాలు.
నేను: నాకు ముగ్గులు వేయడం రాదమ్మా!
మాతృదేవి: నీకు తెలిసినంత వేయి.
వేరే మార్గంలేక నాకు తెలిసినట్లుగా ముగ్గులు వేశాను. మాతృదేవి వాటిని ప్రశంసించడమే కాకుండా అందరినీ పిలిచి చూపించారు కూడా.
పూజ ముగిసింది. నైవేద్యప్రసాదం అందరికీ పంచి పెట్టారు. మాతృదేవి తండ్రి వంశపు పురోహితుడే పూజ చేశాడు. ఆయనకు ప్రసాదం, దక్షిణలన్నీ ఇచ్చారు మాతృదేవి. తర్వాత రవ్వ పాయసం తీసుకువచ్చి ఇవ్వమని ఒక సాధువుకు చెప్పారు. కానీ దానిని స్వీకరించడానికి నిరాకరించాడు పురోహితుడు. ఆ సాధువు బ్రాహ్మణుడైనా అప్పుడు జంద్యం వేసుకోలేదు. అందువలన ఆ సాధువు నుండి ఏదైనా పుచ్చుకోవడం ఆచారానికి విరుద్ధమని నిరాకరించాడు పురోహితుడు. ఇది విన్న మాతృదేవి “వీరి చేతుల మీదుగా తిననంటున్నారే! వీరు ఇచ్చే ఆహారం తింటే మీ పద్నాలుగు తరాలవారు పుణ్యం పొందుతారు!” అన్నారు. అక్కడ నిలబడ్డ కాళీ మామయ్య, “అక్కయ్యా! నువ్వు ఊరకో. ఈయన మనకు గురువు” అన్నాడు. “గురువట గురువు! చెప్పడంతో సరిపోయిందా!” అన్నారు మాతృదేవి.
పూజకోసం రోజంతా బొంగరంలాగా తిరిగారు మాతృదేవి. భోజనానికో, విశ్రాంతికో కాస్త సమయం కూడా దొరకలేదు. తీరిక దొరికినప్పుడు కొద్దిగా షర్బత్తు, తీపి తిని, నాకూ ఇచ్చారు. భోజనాలవేళ అయింది. ఎవరు ఎక్కడ కూర్చోవాలో నాకు వివరించి చెప్పారు మాతృదేవి. నేను అలాగే చేశాను. అంతలో మరొక సమస్య తలెత్తింది.
అది ప్రతి సంవత్సరమూ తలెత్తే సమస్యే – కుల పట్టింపు సమస్య. ఈ సమస్యను లేవదీయడాని కంటూ ఆ ఊళ్లో కొందరు పెద్ద మనుషులున్నారు. అన్ని కులాలవారు శిష్యులుగా ఉన్నారు, కొందరు బ్రాహ్మణులైనా జందెం వేసుకోలేదు, అంటరానితనం గురించి పట్టించుకోవడం లేదు – అంటూ ఏదో ఒక దానిని లేవనెత్తి గోరంత సమస్యను కొండంతగా చేసేస్తారు. తర్వాత దక్షిణ అనే పేరుతో వారికి డబ్బిచ్చి వారితో సరిపెట్టుకోవడం జరుగుతుంది. ఆ రోజూ అలా ప్రారంభమైన వెంటనే మాతృదేవి, “మీకు కావలసింది డబ్బే కదా! దానిని సూటిగా అడగవచ్చు కదా! నాకు ఇంత కష్టం కలిగించి డబ్బు గుంజుకోవలసిన అవసరం ఏమొచ్చింది? నేను అన్నిటినీ సహిస్తూ వెళుతున్నాను. కానీ మా అబ్బాయిలు కూడా ఇలాగే ఉంటారని కలలు గనకండి” అన్నారు మాతృదేవి. మొత్తానికి అంతా సవ్యంగా జరిగిపోయింది.
మాతృదేవి దర్శనార్థం దేశం నలుమూలల నుండీ భక్తులు వచ్చేవారు. పాటలూ, భజనలూ సాగుతూండేవి. ఎల్లప్పుడూ ఆనంద ప్రవాహం కట్టలు తెంచుకొని ప్రవహిస్తూ ఉండేది. ఇలా ఏదైనా జరుగుతున్నప్పుడు సాధువు ఒకాయన, తాను ఏ పని చేస్తున్నాసరే అది వదలిపెట్టి ఈ వేడుకలలో పాల్గొనేవాడు. దానిని చూసిన మాతృదేవి ఒక రోజు ఇలా అన్నారు:
“గురుదేవులు వేంచేశారు. అందువల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఎంతో జరుగబోతోంది. కొత్త కొత్తగా ఇంకా ఎన్నెన్నో చూడబోతున్నారు. అందుకని ఆయన సేవలను వదలుకొని ఇలా పరుగెత్తుకుంటూ రావాలా? ఇంద్రజాలం చేసేవాడు తన విద్యను చూపుతున్నాడు, చూసేవారు భ్రమించిపోతున్నారు. కానీ ఆతని ఇంటి స్త్రీలు వాటిని అసలు పట్టించుకోకుండా తమ పనులు చేసుకుంటూ పోతారే కానీ ఇంద్రజాలంలో భ్రమించిపోరు. నువ్వు మాత్రం ఎందుకు పరుగెత్తాలి? నిశ్చలమైన మనస్సుతో పనిచేయి. ఇలా పడీలేచీ పరుగెత్తుకుంటూ రాకూడదు.”
మాతృదేవి ఇల్లు మట్టిగచ్చుది. ఈ కారణంగా వర్షాకాలాల్లో మాతృదేవికి ఎంతో అసౌకర్యం కలిగేది. ఇంటిని ఇటుకలు, సిమెంటుతో కట్టాలనీ, అందుకయ్యే ఖర్చు తాను భరిస్తాననీ నారాయణ అయ్యంగారు (కాలాంతరంలో శ్రీవాసానంద స్వామి) అనే భక్తుడు మునుపే మా ద్వారా మాతృదేవికి విన్నవించాడు. కానీ అప్పుడు మాతృదేవి, “వద్దు నాయనా! ఇటుకలు, సిమెంటుతో ఇల్లు కడితే ‘వీరికి డబ్బు ఎక్కువగా వచ్చేసింది’ అని అంటారు. అందువలన ప్రస్తుతానికి అవసరం లేదు!” అని చెప్పేశారు. అందువలన ఆ ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు మళ్లీ ఆయన తన కోరికను వెలిబుచ్చినప్పుడు మాతృదేవి సమ్మతించారు. ఈ విషయం శరత్ మహరాజ్‌కు కూడా తెలిపారు. శరత్ మహరాజ్‌కు నారాయణ అయ్యంగార్ డబ్బు అందజేశారు. ఇంటి నిర్మాణం మొదలయింది.
అప్పుడు ఒక రోజు మాతృదేవి నాతో, “నేను పుట్టిన స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ ఒక ఇల్లు కట్టాలని వ్రాయి. పిల్లలంతా అక్కడ ఉంటారు. మీరందరూ ఎక్కడ ఉంటారు? అందువలన దీనిని గురించి శరత్‌కు వ్రాయి!” అన్నారు.
నేను: మీ తమ్ముళ్లు ఆ స్థలాన్ని ఇస్తారా? మీరు పుట్టిన చోటును సూచిస్తూ రాంచీ భక్తులు ఒకసారి ఒక గుర్తు కోసం ఒక రాయి నాటారు. దానిని చూడగానే కాళీ మామయ్య, “మీరు సూచించిన ఈ స్థలం ఖరీదు ఇచ్చేయండి” అన్నారు. అక్కడే వాళ్లు ధాన్యం ఇత్యాదులను నిల్వచేసుకొంటున్నారు. కనుక వారు ఆ స్థలాన్ని ఇస్తారా?
మాతృదేవి: కాళీని పిలువు, నేను చెబుతాను.
కాళీ మామయ్య వచ్చారు.
మాతృదేవి: ఇదుగో చూడు కాళీ! మీరు ముగ్గురూ 300 రూపాయలు తీసుకొని నేను పుట్టిన స్థలాన్ని ఇచ్చివేయండి. నాకు ఎందరో పిల్లలున్నారు. వాళ్లు ఆ స్థలాన్ని తీసుకొనే తీరతారు. అంతకు ముందే, నేను ప్రాణాలతో ఉన్నప్పుడే ఈ 300 రూపాయలు మీరు మువ్వురూ పుచ్చుకొని ఆ స్థలాన్ని ఇచ్చేయండి.
కాళీ: అక్కయ్యా! నువ్వు పుట్టిన స్థలంలో ఒక ఇల్లు కట్టబోతున్నారంటే నేను ఆ స్థలాన్ని వదలకుండా ఉంటానా? తప్పకుండా వదలుకుంటాను. కానీ నాకు విడిగా వందరూపాయలు ఇవ్వాలి. నా కష్టం నీకు తెలిసిందే కదా!
మాతృదేవి (నాతో) : ఇతడికి వందరూపాయలు ఇవ్వాలని శరత్‌కు వ్రాయి.
అన్ని విషయాలూ శరత్ మహరాజ్‌కు వ్రాశాను. ఆయన కూడా డబ్బు ఇవ్వడానికి సంతోషంగా సమ్మతించారు.
తర్వాత మాతృదేవి వరదుణ్ణి పిలిచారు.
మాతృదేవి: ఇదిగో చూడు, వరదా! మీరు ముగ్గురూ 300 రూపాయలు తీసుకుని నేను పుట్టిన స్థలాన్ని ఇచ్చేయండి. నా అబ్బాయిలు ఉన్నారు. వారు ఎప్పుడో ఒక రోజు ఆ స్థలాన్ని తప్పకుండా తీసుకుంటారు. దానికన్నా నేను ఉంటు న్నప్పుడే వారికి ఇచ్చేయడం మంచిది కదా!
వరదుడు: అక్కయ్యా! నువ్వు పుట్టినచోట ఒక ఇల్లు కడుతున్నారంటే ఆ స్థలాన్ని నేను వదలుకోనా? అందరూ నమ్మతిస్తే నాకు ఎలాంటి ఆక్షేపణా లేదు!
ప్రసన్న అప్పుడు కలకత్తాలో ఉంటున్నాడు. ఆయనకు కూడా విషయం తెలిపారు. ఆయన కూడా ఆ స్థలం ఇవ్వడానికి సమ్మతించారు.
మాతృదేవి శిష్యుడైన లలిత్ చంద్రుణ్ణి పంపించి వ్రాతకోత పనులను చూడమని శరత్ మహరాజ్ చెప్పారు.
మాతృదేవి ఆరోగ్యం బాగా దెబ్బతింది. అయినప్పటికీ వచ్చేవారితో మాట్లా డడమూ, తమ్ముళ్ల ఇంట్లో పనులూ, దైనందిన కార్యాలలో ఎలాంటి మార్పూలేకుండా సాగిపోతూ వచ్చింది. మాతృదేవి మానసిక స్థితిలో ఒక మార్పు స్పష్టంగా కనబడింది. అందరిలోనూ గురుదేవులను చూసి వారిని తమ తనయులుగా భావించి మెలగసాగారు.
ఒక రోజు నైవేద్యానికి ముందే దాని నుండి కాస్త తీసుకొని ఒక బాలుడికి తినడానికి ఇచ్చారు. నేను వెళ్లి “అమ్మా! ఇంకా నైవేద్యం కాలేదు. అంతలో వాడికి ఇచ్చేశారే?” అని అడిగాను. అందుకు మాతృదేవి, “నాయనా! ఆతడిలోనూ గురుదేవులే కదా ఉంటున్నారు! తిననీ!” అనేశారు.
ఒకసారి ఒక భక్తురాలికి తమ తలగడను ఇచ్చేశారు. ఆమెతోపాటు నేను కూడా తిరస్కరించినప్పుడు, “ఎందుకు వద్దంటున్నారు? మీలో కూడా గురుదేవులే కదా ఉంటున్నారు. ఆయన వాడుకోవడానికే కదా ఇస్తున్నాను” అన్నారు.
ఒక రోజు నైవేద్యానికి మునుపే గురుదేవుల పాత్రలోనే నాకు పాలు ఇచ్చారు. అందుకు కూడా అదే కారణం తెలిపారు.
ఆరోజు మాతృదేవి పుట్టిన రోజు. రాధూ బిడ్డను మాతృదేవి తమ ఒళ్లో బెట్టుకొని మంచం మీద కూర్చొనివున్నారు. వారి పాదపద్మాలకు పుష్పాలు, చందనం సమర్పించి అందరూ ఆరాధించారు. నేను మల్లె పూలతో చేసిన మాలను మాతృదేవి కంఠంలో వేసి వారి పాదాలకు పుష్పాలర్పించి ప్రణమిల్లాను. తర్వాత మాతృదేవితో, “అమ్మా! ఈ రోజు మీ జన్మదినం. మిమ్మల్ని దర్శించుకోవాలనీ, ప్రణమిల్లాలనీ అనేకుల కోర్కె. కానీ ఈ ఊరికి రావడం చాలాకష్టం. కాబట్టి రాలేకపోయిన వారందరి తరఫున నేను ప్రార్థన చేస్తున్నాను. అమ్మా! అందరికీ శ్రేయస్సు కలగాలని ఆశీర్వదించండి” అన్నాను. మాతృదేవి ఎంతో సంతోషించి “అవును నాయనా! అందరి శ్రేయస్సు కోసమూ గురుదేవులను ప్రార్థిస్తాను. అందరికీ ఆయన శ్రేయస్సును ప్రసాదించెదరుగాక!” అన్నారు.
మాతృదేవి కోర్కె మేరకు నేను ఆమె వెంటే ఉన్నాను. పూజా అదీ ఇదీ అంటూ పనులు ఉంటూనే ఉంటాయి. ఒక రోజు మఠంలోని సన్న్యాసులు కొందరు తపోమయజీవితం కోసం ఎక్కడికో వెళుతున్నారని విన్నాను. వెంటనే నేను మాతృదేవితో “అమ్మా! ఇలా ఎల్లప్పుడూ పని చేసుకుంటూ ఉండడం అంత సబబుగా కనబడడం లేదు. నేనూ తపస్సు చేయాలని అనుకుంటున్నాను. మీరు అనుమతి నివ్వాలి” అన్నాను. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు: “ఇదేం మాటలు నాయనా! నువ్వు నా సేవ చేస్తున్నావు, గురుదేవుల సేవ చేస్తున్నావు. ఇదేమిటి తపస్సు కంటే తక్కువా? ఇప్పుడు వెళ్ళడంలో ఎలాంటి ప్రయోజనమూ లేదు. పోవాలని మరీ అనిపించినప్పుడు ఒకటి రెండు నెలలు ఎక్కడికైనా వెళ్లి రా!”
జయరాంబాటి మలేరియా ప్రాంతం. మాతృదేవికి కూడా అప్పుడప్పుడు మలేరియా సోకి ఎంతో కష్టపడ్డారు. అందువలన ఒకసారి భక్తులు మాతృదేవిని దర్శించడాన్ని శరత్ మహరాజ్ నిషేధించారు. ఆ సమయంలో బారిసాల్ నుండి ఒక భక్తుడు మాతృదేవి దర్శనానికి ఎంతో ఆతురతతో వచ్చాడు. నేను ఆతణ్ణి లోపలికి వెళ్లనివ్వలేదు. ఆయన వెళ్లాలనీ, నేను కూడదనీ మొండికేశాం. అది క్రమంగా వాగ్వాదంగా పరిణమించింది. మాటలు కూడా తారస్థాయిని చేరి మాతృదేవి చెవులలో పడ్డాయి. కొద్దిగా కలతచెందిన మాతృదేవి బయటికి వచ్చి “ఆతణ్ణి ఎందుకు లోపలికి పంపడం లేదు?” అని నన్ను అడిగారు. అందుకు నేను, “అమ్మా! ఎవరినీ లోపలికి వెళ్లనివ్వరాదని శరత్ మహరాజ్ ఆదేశించారు. ఆరోగ్యం బాగాలేని స్థితిలో మీరు మంత్రదీక్ష ఇవ్వడం జరిగితే, ఆరోగ్యం ఇంకా దిగజారుతుంది” అన్నాను నేను. “అది చెప్పడానికి శరత్ ఎవరు? నేను ఇందుకోసమే జన్మించాను. నేను ఇతడికి మంత్రదీక్ష ప్రసాదిస్తాను” అంటూ ఆ భక్తునితో, “నాయనా! ఈ రోజు భోజనం చేయి! రేపు నీకు మంత్రదీక్ష ఇస్తాను” అన్నారు. మంత్రదీక్ష పుచ్చుకొన్న తరువాతే తినాలని సంకల్పం చేసుకున్నాడు ఆ భక్తుడు!
ఒక రోజు సాయంత్రం మాతృదేవి కొత్త ఇంటి వసారాలో విశ్రాంతిగా కూర్చొని ఉన్నారు. మేము ప్రణమిల్లడానికి వెళ్లాం. మాతృదేవి తమంతట తామే ఇలా అన్నారు:
“ఈ పిల్లలు (సాధువులు) భోజనంలో రుచి కోసం వెతుక్కుంటూ మఠం నుండి మఠం వెళుతున్నారని ఫలానా వ్యక్తి అంటున్నాడు. ఏం మాటలో చూశావా? వారందరూ నా పిల్లలు, గురుదేవుల సంతానం. వారికి భోజనానికి కష్టం వస్తుందా? ఎన్నటికీ అలా జరగదు. గురుదేవులతో, ‘ప్రభూ! ఎన్నటికీ మీ పిల్లలకు భోజనానికి లోటు రాకూడదు’ అంటూ నేనే ప్రార్థన చేస్తున్నాను. రుచి కోసం వెతుక్కుంటూ వారు అటూ ఇటూ వెళుతున్నారని ఆతడు ఎలా చెబుతాడు? వారందరూ ఎందుకు రుచికరమైన ఆహారం తినకూడదు? అనురక్తి ఉన్నవాడే దుఃఖీస్తాడు.”
ఒక రోజు నేను మాతృదేవితో, “అమ్మా! నేను ఎక్కడ మునిగిపోతానో అని కొన్ని సమయాల్లో భయమేస్తోంది. మనస్సు అంతగా చంచలమవుతున్నది” అన్నాను. అందుకు మాతృదేవి, “అదెలా నాయనా? నువ్వు ఎలా మునిగిపోతావు? గురుదేవుల తనయులయిన మీరు మునిగిపోగలరా? అలా ఏనాటికీ జరగదు. గురుదేవులు మిమ్మల్ని కాపాడతారు.”