కోల్పారా, మే / జూన్ 1909
సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో శరత్ మహరాజ్, యోగీన్ మా, గోలాప్ మా ప్రభృతులతో మాతృదేవి కలకత్తాకు వెళుతూ కోల్పారా ఆశ్రమానికి వస్తారని విన్నాను. మా ఉపాధ్యాయుడైన కేదార్నాథ్ దత్తా ఇంటి పూజాగృహంలో మాతృదేవి బసచేయడానికీ, మా పాఠశాలలో తక్కిన వారు ఉండ డానికీ తగిన ఏర్పాట్లు జరిగాయి. సాయంత్రమయింది. వారు ఇంకా రాలేదు. బండి నదీతీరాన ఏదో ఇబ్బందికి గురి అయిందని తెలిసి కొందరు భక్తులు తక్షణమే అక్క డకు వెళ్లారు. రాత్రి దాదాపు పది గంటలకు అంతా వచ్చారు.
మాతృదేవి బండి నుండి దిగి, ముఖమంతా కప్పుకొని, కాస్త కుంటుకొంటూ కేదార్బాబు తల్లితో కలిసి వారి పూజ గదిలోకి వెళ్లారు. గురుదేవులకు ప్రణమిల్లి, కూర్చున్న తరువాత, అక్కడున్న వారంతా మాతృదేవికి ప్రణమిల్లారు. నేను కూడా ప్రణామం చేశాను. కేదార్బాబు తల్లికి కాస్త చెవుడు కనుక మాతృదేవి మగవాళ్లతో నా మూలంగా మాట్లాడారు.
రాత్రి బాగా పొద్దుపోయిందని శరత్ మహరాజ్ చెప్పిపంపడంతో మాతృదేవి కంచంలోని మిఠాయిలో ఒక తుంపు తీసుకొన్నారు. తరువాత నీళ్లు త్రాగి, లేచారు. అందరితోపాటు నేను కూడా మాతృదేవికి ప్రణమిల్లి, మా నాన్న మాతృదేవికి ఇవ్వమని ఇచ్చిన కానుకను ఆమె చేతుల్లో పెట్టాను. మాతృదేవి ప్రేమతో నా చుబుకాన్ని తడిమి, “నాయనా, ఏ కానుకనైనా పాదాల వద్ద సమర్పించాలి” అన్నారు. ఆ తరువాత మెల్లగా లేచి బండి ఎక్కారు.
ఒకటి రెండు మాటలతోనే మాతృదేవి అవ్యాజ ప్రేమ నా మనస్సులో నాటుకుపోయింది.
జగద్ధాత్రి పూజా సందర్బం. కలకత్తా నుండి జయరాంబాటికి పోతూ మధ్యలో మాతృదేవి కోల్పారా ఆశ్రమానికి వచ్చారు. మర్నాడు బయలుదేరుతున్నప్పుడు ఒకరితో, “ఇక్కడ మీరే నా బాంధవ్యులు. మీ విశ్వాసం గొప్పది. అందుకే గురు దేవులు ఇక్కడ వెలసివున్నారు” అని చెప్పారు. తదనంతరం ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించి, “అప్పుడప్పుడు జయరాంబాటికి వస్తూవుండండి. జగద్ధాత్రి పూజకు తప్ప కుండా అందరూ రండి” అని ఆహ్వానించారు.
జగద్ధాత్రి పూజ నాడు మాలో ముగ్గురం మా తోటలో కాసిన కూరగాయలు తీసుకొని జయరాంబాటికి వెళ్లాం. మిమ్మల్ని చూసి మాతృదేవి ఎంతో సంతోషించి, “ఈ కూరగాయలు అన్ని వేళలా లభించవు. తరచూ ఎంతో కష్టం మీద దొరుకు తాయి. కనుకనే గురుదేవులు మీ ద్వారా అన్ని ఏర్పాట్లూ చేయిస్తున్నారనిపిస్తున్నది” అన్నారు. ఆ నాటి నుండి మాతృదేవి గ్రామంలో నివసిస్తున్నప్పుడల్లా ఆశ్రమం పనులు ముగించుకొన్నాక మఠానికి రెండు మూడుసార్లు మా తోటనుండో లేక సంత నుండో కూరగాయలు తీసుకొని ఆమెకు ఇచ్చి వచ్చేవారం.
మేం వెళ్లినప్పుడు కొన్ని సమయాలలో మాతృదేవి పడుకొని ఉండేవారు. ఆమె చూపిన చోట తెచ్చిన వస్తువులు ఉంచి, ప్రణమిల్లేవారం. ఆమె కూడా కాస్త తల పైకెత్తి, “మీలో చైతన్యం జాగృతి చెందుగాక! భక్తివిశ్వాసాలు పెంపొందుగాక!” అంటూ ఆశీర్వదించేవారు. కొంచెం మరమరాలు ఇచ్చేవారు. మేం వాటిని తింటూ నడుచుకొంటూ తిరిగి వెళ్లేవారం. కొన్ని సందర్భాలలో ఆశ్రమం చేరుకోవడానికి రాత్రి పన్నెండు గంట లవడం కూడా కద్దు.
శీతకాలంలో ఒక రోజు సాయంత్రం కూరగాయలు, నెయ్యి మొదలైన వస్తు వులు తలమీద మోసుకొని, చెమటలు పోస్తూవుండగా జయరాంబాటికి చేరుకొన్నాం. మా స్థితి చూసి అక్కడున్న స్త్రీలలో ఒకరు, “భక్తులుగా ఉంటే ఎంత శ్రమో చూడు! బరువులు మోసి ఈ పిల్లల తలలు అరిగిపోతున్నాయి” అని వ్యాఖ్యానించారు. ఆ మాటలు విన్న మాతృదేవి, “వారికి తల లెక్కడున్నాయి? వాటిని గురుదేవులకు అప్ప గించేశారు కదా!” అని చెప్పారు. పిదప ఎంతో ఆప్యాయంగా మా తలలను స్పృశించి ఆశీర్వదించారు. “అన్నింటినీ ఒకే రోజు పంపకండి. ఎండిపోయి, వృథా అవుతాయి” అని ఆశ్రమానికి కబురు పంపారు. ఆ తరువాత కొంచెం కొంచెంగా తీసుకొని తరచూ మాతృదేవి వద్దకు వెళ్లివచ్చేవారం.
జగద్ధాత్రీ పూజానంతరం మాతృదేవి కలకత్తాకు వెళ్లనున్నారు. ఆ రోజుల్లో స్వదేశీ ఉద్యమం కోల్పారా ఆశ్రమాన్ని బాగా కుదిపివేసింది. జపధ్యానాలు, పూజా పారాయణాల కంటే రాట్నం, చేతిమగ్గం ఇత్యాదుల పట్ల ప్రతి ఒక్కరూ ఎక్కువ మక్కువ చూపసాగారు.
మాతృదేవి బయలుదేరుతున్నారని తెలియగానే కేదార్బాబు ఆమెను దర్శించు కోవడానికి జయరాంబాటికి వెళ్లాడు.
మాతృదేవి: చూడు నాయనా! మీరు గురుదేవులకు ఒక చోటూ, దారిలో విశ్రాంతికై మాకు విడిదీ ఏర్పాటు చేశారు. అందువలన ఈసారి వచ్చినప్పుడు అక్కడ గురుదేవులను ప్రతిష్ఠించి వెళతాను. అందుకు తగిన ఏర్పాట్లు చేయించు. పూజ, నైవేద్యం, ఆరతి మొదలైనవన్నీ నియమానుసారం జరగాలి. స్వదేశీ, స్వదేశీ అంటూ కేకలుపెడితే ఏమవుతుంది? మనం ఎవరమైనప్పటికీ, మన మూలాధారం గురుదేవులు. ఆయనే మన ఆదర్శం. మనం ఏది చేసినా చేయకపోయినా ఆయనను అనుసరించి జీవిస్తే ఏ సమస్యా తలెత్తదు.
కేదార్బాబు: దేశసేవ గురించి స్వామీజీ ఎంతో నొక్కివక్కాణించి ఉన్నారు. ఆయన ఇప్పుడు జీవించి ఉంటే ఈ దేశం కోసం ఎన్నెన్నో సేవాకార్యాలు నిర్వ ర్తించి ఉండేవారు.
మాతృదేవి: ఆహా! నా నరేన్ ఇప్పుడు జీవించివుంటే కంపెనీ (ఆంగ్లప్రభుత్వం) ఆతణ్ణి ఊరకే వదలిపెట్టేదా? చెరసాలలో వేసివుండేవారు. అది చూస్తూ నేను బ్రతికి ఉండగలనా? ఒర నుండి దూసిన కత్తిలాంటి వాడు నరేన్. పాశ్చాత్య దేశాలకు వెళ్లి తిరిగివచ్చి నాతో, ‘అమ్మా! ఈసారి సముద్రాన్ని లంఘించకుండా మీ అనుగ్ర హంతో ఓడలోనే వెళ్లాను. అక్కడ కూడా గురుదేవుల మహత్వం చూశాను. ఆయన ఉపదేశాలను ఎందరో సజ్జనులు మంత్రముగ్ధులై ఆలకించి, ఆయన ఆదర్శాలను స్వీకరించారు’ అని చెప్పాడు. వారు కూడా నా బిడ్డలే కదా!
కలకత్తా వెళుతూ మధ్యలో మాతృదేవి కోల్పారా ఆశ్రమంలో గురుదేవులను ప్రతిష్ఠించారు. గురుదేవుల ఛాయాచిత్రంతోపాటు తమ ఛాయాచిత్రానికి కూడా విశే షంగా పూజ చేశారు. హోమం ఇత్యాదులను కిశోరి నిర్వహించాడు.
ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు ముందే రాత్రి భోజనం తయారుగా ఉండాలని ప్రకాష్ మహరాజ్ ఆదేశించారు. కానీ ఎంత ప్రయత్నించినా నియమిత సమయంలో వంట పూర్తికాలేదు. ప్రకాష్ మహరాజ్‌కు కోపం ముంచుకొచ్చేసింది. వెంటనే రాజేన్, “మీరు అనుకొన్న సమయానికే బయలుదేరండి. భోజనం తయారవ గానే తలల మీద పెట్టుకొని, ఎంత దూరం మీరు వెళ్లినప్పటికీ అక్కడికి తీసుకు వస్తాం” అన్నాడు. అది విని మాతృదేవి, ప్రకాష్ మహరాజ్‌తో, “అనవసరంగా ఎందుకు కోపగించుకొంటావు? ఇది మన గ్రామం. కలకత్తాలో మాదిరి ఇక్కడ కూడా గడియారానికి బానిసగా ఉండాలా ఏమిటి? చూడు. ఉదయం నుండి ఈ బిడ్డలు నిర్విరామంగా పనిచేస్తున్నారు. నువ్వు ఏం చెప్పినా సరే, వంట పూర్తయ్యాక ఇక్కడే భోజనం చేసి, ఆ తరువాత బయలుదేరతాం” అనేశారు. భోజనాలు పూర్తయ్యేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది. తదనంతరం ఎనిమిది ఎడ్లబళ్ల మీద అందరూ విష్ణుపూర్‌కు బయలుదేరారు.
ఉద్బోధన్, 1911
రామేశ్వర తీర్థయాత్ర పూర్తిచేసుకొని మాతృదేవి కలకత్తాకు తిరిగి వచ్చారు. మేం మగ్గురమూ మాతృదేవిని దర్శించుకోవడానికి మేడ మీదకు వెళ్లాం. ఆమెకు ప్రణమిల్లి కూర్చున్న తరువాత కోల్పారా, జయరాంబాటి విశేషాలను గురించి అడిగి తెలుసుకొన్నారు.
మాతృదేవి (కేదార్బాబుతో) : నువ్వు వస్తావని నీ ఆశ్రమం కోసం రెండు రామేశ్వర ఛాయాచిత్రాలు తెచ్చివుంచాను. వెళ్లేటప్పుడు తీసుకెళ్లు. అక్కడ పూజలో ఉంచు.
కేదార్బాబు: మీరే అక్కడ గురుదేవులను ప్రతిష్ఠించారు. ఆయననే సర్వదేవీ దేవతాస్వరూపులుగా భావించి పూజించాలని ఆదేశించారు. ఇప్పుడు ఈ ఛాయా చిత్రాలను ఇస్తున్నారు. ఎందరు దేవతలను పూజించడం? ఇతర దేవతలను పూజించడం మా వల్ల కాదు.
మాతృదేవి: పోనీలే. పటం కట్టించి పూజగదిలో అలంకరించు.
తరువాత మాతృదేవి నైవేద్యం అర్పించడానికి లేచి వెళ్లిపోయారు. మేం కూడా కిందికి దిగివచ్చేశాం.
శ్రీకృష్ణ జన్మాష్టమికి ఒకటి రెండు రోజులు మునుపు మాతృదేవిని ఆ రోజు నాకు మంత్రదీక్ష ప్రసాదించమని వేడుకొన్నాను. అది విని గోలాప్ మా తన సహజ మైన కంచు కంఠంతో, “ఇంత చిన్న వయస్సులోనా? (నా కప్పుడు పదమూడేళ్లు) రెండు రోజుల్లో మంత్రాన్ని మరచిపోతావు. ఇప్పుడే మంత్రదీక్ష ఎందుకు? ఇదంతా ఆ కేదార్ పని. మాతృదేవి మీ ఊరి వాస్తవ్యులే కదా! ఆమె అక్కడకు వచ్చినప్పుడు బాగా యోచించి మంత్రదీక్ష పుచ్చుకో” అని చెప్పి వెళ్లిపోయింది. ఆ మాటలు విన్న మాతృదేవి, “గోలాప్ మాటలు పట్టించుకోకు. చిన్న వయస్సులో చక్కగా అభ్యసిస్తే మరచిపోవడం జరుగుతుందా? ఇప్పటి నుండి అతడు చేయగలిగినంత చేయనీ! తరువాత నేను ఉండనే ఉన్నాను కదా!” అన్నారు హామీ ఇస్తూన్న ధోరణిలో.
జన్మాష్టమి నాడు పూజ ముగించి మాతృదేవి నాకు మంత్రదీక్ష ఒసగారు. ఆమె ఆదేశం మేరకు నేను జపం చేయడం చూసి మాతృదేవి, “అంతే! ఇది మనస్సులో నిలుపుకోలేవా? తప్పకుండా నిలుపుకోగలవు. తరువాత అవసరమై నప్పుడు నీకు అన్నీ చెప్పిస్తాను” అన్నారు. ఆ తరువాత నా తలను, ఛాతీని స్పృశించి ఆశీర్వదించి తమతో రమ్మనమన్నారు. నేను ప్రణమిల్లి ఆమెతోబాటు పక్క గదిలోకి వెళ్లాను. ఉట్టి నుండి రెండు మిఠాయిలు తీసి ఒకదాన్లో చిన్నముక్క తమ నోట్లో వేసుకొని మిగిలింది నా కిచ్చి తినమన్నారు. ఆమె ముందు నిలబడి తినడానికి సిగ్గేసింది. అప్పుడు మాతృదేవి, “సిగ్గుపడకు. మంత్రదీక్ష పుచ్చుకోగానే ప్రసాదం తినాలి” అన్నారు. ఒక గ్లాసు నీళ్లు కూడా ఇచ్చారు.
కోల్పారా
ఫిబ్రవరి / మార్చ్‌లో మాతృదేవి జయరాంబాటికి వచ్చారు. ఆమెను మార్గ మధ్యంలోనే కలుసుకోగోరి కోల్పారా నుండి మేం ముగ్గురం వేకువనే బయలుదేరాం. బళ్లను దూరం నుండి చూడగానే మాలో ఒకరం ఆశ్రమానికి కబురు అందించడానికి వెళ్లిపోయాం. బళ్లతో కలిసి వెళదామని నేను అక్కడే నిలబడిపోయాను. దూరం నుండే మాతృదేవి నన్ను గుర్తుపట్టారు. నేను దగ్గరకు వెళ్లి ప్రణమిల్లిన వెంటనే అందరి క్షేమసమాచారాలూ విచారించారు. నేను బండితోపాటు నడుస్తూ వెళ్లాను. మాతృదేవి బయటికి తొంగిచూస్తూ ఇది ఏ గ్రామం, ఈ చెరువు ఎవరిది, కోల్పారా ఇంకా ఎంతదూరం అంటూ అడుగుతూన్నారు. కోతుల్పూర్ దాటిన తరువాత, “ఇంకా ఎంతసేపు నడుస్తావు? బండిలో కూర్చో” అన్నారు. బండిలో రాధూ కూడా ఉంది. కాసేపయ్యాక బండివాడు, “నేను నడుస్తాను, మీరు ముందువైపు కూర్చోండి” అన్నాడు. నేను బండిలో కూర్చుని ఎడ్లను కాస్త హుషారుపరచగానే అవి దౌడు తీశాయి. అప్పుడు మాతృదేవి నవ్వుతూ, “బాగానే నడుపుతున్నావే! అన్ని పనులూ తెలుసుకొని ఉండడం మంచిదే” అని వ్యాఖ్యానించారు.
ఆశ్రమం చేరుకొన్నాం. వాతం కారణంగానూ, బండిలో చాలాసేపు కూర్చుని రావడం వలనా మాతృదేవి కాళ్లు మొద్దుబారిపోయాయి. కేదార్బాబు తల్లిని ఆసరాగా చేసుకొని మాతృదేవి మెల్లగా దిగి పూజగది వసారాలో కూర్చున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకొన్న తరువాత నాతో, “నాయనా! కేదార్ తల్లితో మళ్లీ నేను అరవలేను (ఆమెకు చెవుడు). నువ్వు బట్టలు మార్చుకొని పూజకు ఏర్పాట్లు చేయి” అని చెప్పారు.
మాతృదేవి తడి బట్ట చుట్టుకొని పువ్వులు కోయడానికి వెళ్లాను. నన్ను చూసి కేదార్బాబు తల్లి విస్తుబోయి, “ఏమిట్రా ఇది? మాతృదేవి బట్టను చుట్టుకొన్నావు. వెళ్లు, వెళ్లి ముందు దానిని విప్పు!” అన్నారు. కానీ మాతృదేవి, “చుట్టుకొంటే ఏం? చిన్న పిల్లవాడు. నువ్వు వెళ్లు నాయనా. వెళ్లి పువ్వులు కోసుకురా” అని చెప్పారు.
ఒక రోజు కేదార్బాబు, మాతృదేవితో ఇలా అన్నాడు: “అమ్మా! మీ బిడ్డ లందరూ పండితులు. ఇక్కడుంటున్న మాబోటి కొద్దిమంది మాత్రం పామ రులం. శరత్ మహరాజ్ గురుదేవుల చరిత్ర రచించారు, ప్రచారం కూడా చేస్తున్నారు. తక్కిన వారు ప్రసంగాలిస్తున్నారు. ఎన్ని పనులు జరుగుతున్నాయి.” ఈ మాటలు ఆలకించి మాతృదేవి ఇలా అన్నారు:
“అదేమిటి నాయనా, అలా అన్నావు. గురుదేవులకే చదవనూ, వ్రాయనూ తెలియదు. భగవంతుని వైపు మనస్సును మళ్లించడమే అసలు విషయం. నీ మూలంగా ఇక్కడ ఎన్నో పనులు జరుగనున్నాయి. ధనికుడు – పేదవాడు, పండి తుడు – పామరుడు అందరినీ తరింప చేయడానికే గురుదేవులు ఏతెంచారు. మలయ మారుతం చక్కగా వీస్తున్నది. ఎవరు తెరచాపను విప్పి ఉంచుకొన్నారో, ఆయనను శరణుజొచ్చి జీవిస్తున్నారో ఆ వ్యక్తి ధన్యుడవుతాడు. వెదురు, పచ్చగడ్డి తప్పితే కాస్త చేవవున్నవి కూడా ఈసారి చందనంగా మారుతాయి.* ఎందుకు వ్యథ చెందుతారు? మీరు నాకు చెందినవారు. కాని అసలు విషయం ఏమిటో తెలుసా? పండితుడైన సాధువు బంగారు దంతాలు గల ఏనుగులాంటి వాడు.”
ఇలా చెప్పి మాతృదేవి పూజ చేయడానికి వెళ్లిపోయారు. సాయంత్రం అవ డానికి కాస్త ముందే పల్లకీలో జయరాంబాటికి బయలుదేరారు.
జయరాంబాటి
జగద్ధాత్రి పూజా సమయంలో వంటపనులు పర్యవేక్షింపవలసిన వ్యక్తి హఠాత్తుగా జబ్బుపడ్డాడు. ఆ బాధ్యతలను నేను తీసుకొని పూజారంభం నాడు జయరాంబాటికి వెళ్లాను. మాతృదేవి నన్ను చూడగానే, “నువ్వు రావడం మంచి దయింది. ఈ రోజు అంతా చక్కగా పరిశీలించు. రేపు ఉదయం స్నానం చేశాక భాండారానికి వచ్చేయి. కొంతదాకా ఆచారనియమాలను పాటించి పనిచేయడం మంచిది” అన్నారు. ఆ ఊరి జనం ఆచారనియమాల పట్ల మరీ పట్టింపుగలవారు కనుక మాతృదేవి అలా చెప్పారు.
జగద్ధాత్రి పూజ రోజు ఉదయం నుండే మాతృదేవి భాండారంలో ఉన్నారు. ఒక మూట మీద కాళ్లు వ్రేలాడదీసుకొని కూర్చున్నారు. ఎవరైనా వచ్చి అడిగిన వస్తువును నేను తీసి మాతృదేవికి చూపి ఇచ్చేస్తున్నాను. పూజ పూర్తయ్యే సమయంలో మాతృదేవి స్నానం చేసి తడిబట్టలతో, కొందరిని తీసుకొని పువ్వులు సమర్పించడానికి మండపానికి వెళ్లారు. దేవీ పాదపద్మాలకు మూడు పువ్వులు సమర్పించారు. చేతులు జోడించి కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చున్నారు. నిర్విఘ్నంగా పూజ ముగిసింది. మధ్యాహ్నం గ్రామస్థులందరికీ ప్రసాదం పంచిపెట్టారు.
దేవీ ప్రతిమను మాతృదేవి మూడు రోజులు అట్లే ఉంచేస్తారు. రెండవ రోజు నాకు జ్వరం వచ్చినందున మాతృదేవియే స్వయంగా భాండాగారపు పనులను చూసు కోవలసి వచ్చింది.
సాయంత్రం ఆరాత్రికం తరువాత సాధువులూ భక్తులూ అందరూ కలిసి నామసంకీర్తన చేశారు.
మాతృదేవిని దర్శిస్తామని కల కనబోకు
ఆమె నీకూ నాకూ మాత్రమే తల్లా
లోకానికంతా ఆమే కదా అమ్మ!
అనే పాటను పదేపదే పాడారు. మాతృదేవి పక్కగదిలో స్త్రీలతోపాటు కూర్చుని, తన్మయమైపోతూ వినసాగారు. ఆ రాత్రి నాతో, “సంకీర్తన బాగుంది. భక్తులలో కుల భేదాలేమిటి? అందరూ ఒక్కటే! అందరికీ సహపంక్తి భోజనం పెట్టాలని నా కోర్కె. కానీ ఈ దౌర్భాగ్యమైన ఊళ్లో కుల వ్యత్యాసాలు ఇంకా అంతరించలేదు. పోనీలే, అందరూ కలిసి కూర్చుని మరమరాలు తినడానికి అభ్యంతరం లేదు. నువ్వొక పని చేయి. రేపు ఉదయమే కామార్పుకూర్కు వెళ్లి రెండు సేర్లు పెద్ద పెద్ద జిలేబీలు పట్రా” అని చెప్పారు.
మర్నాడు ఉదయం దాదాపు తొమ్మిది గంటలకు జిలేబీలు తెచ్చాను. మాతృదేవి వాటిని గురుదేవులకు నైవేద్యం చేసి ఒక పెద్ద పళ్లెంలో మరమరాలు పోసి, దానిపై జిలేబీలు అమర్చి భక్తులకు పంపించారు. మేమంతా ఆనందంగా తిన సాగాం. పక్క గదిలో నిలబడి మాతృదేవి ఇదంతా తిలకించారు.
అది వానాకాలం. జయరాంబాటిలో మలేరియా, అతిసార వ్యాధులు వ్యాపించివున్నాయి. మాతృదేవి కూడా చాలా రోజులు అతిసారంతో బాధపడ్డారు. డాక్టర్ కంజీలాల్ చికిత్సతో కోలుకొన్నారు. నీళ్లలోను, బురదలోను తిరగడం వలన కోల్పారా ఆశ్రమంలోని మాకందరికీ జ్వరం వచ్చింది. పది పదిహేను రోజులుగా మేమెవరమూ జయరాంబాటికి వెళ్లకపోవడంతో సంగతేమిటో తెలుసుకురమ్మని మాతృదేవి ఒక స్త్రీని పంపారు. మర్నాడు రాధూ చేత ఒక ఉత్తరం వ్రాయించి మాకు పంపించారు. దాన్లో ఇలా వ్రాసివుంది:
“ప్రియమైన కేదార్, మీ ఆశ్రమంలో నేను గురుదేవులను ప్రతిష్ఠించాను. ఆయన అన్నం, చేపలు ఆరగిస్తారు. కనుక మంగళ, శనివారాలలో వాటిని ఆయ నకు నైవేద్యం చేయాలి. కానీ ఆదివారం నాడు చేపలు నివేదన చేయరాదు. ఏది ఎలావున్నా మూడు రకాల కాయగూరలు ఉండే తీరాలి. ఇలా కడుపుకు పస్తులు పెడితే ఊళ్లో వ్యాపించివున్న మలేరియాను ఎలా తట్టుకోగలరు?”
ఒకసారి మాతృదేవి కలకత్తా నుండి కేదార్బాబుకు, “కోల్పారాలో నా కోసం ఒక గదిని ఏర్పాటు చేయగలిగితే గ్రామానికి వచ్చేటప్పుడు మీ ఆశ్రమంలో కూడా అప్పుడప్పుడు బస చేయగలను” అని వ్రాశారు. అందువలన ఆమె కోసం ప్రత్యేకంగా ఒక పర్ణశాలను ఏర్పాటుచేశాం. అదే ‘జగదంబ ఆశ్రమం.’
మాతృదేవి అక్కడకు మొదటిసారి వచ్చినప్పుడు దాదాపు పదిహేను రోజులు బస చేసి, తరువాత జయరాంబాటికి వెళ్లారు. ఆ తరువాత మాతృదేవి ఒక రోజు సాయంత్రం రావాలని నిర్ణయించుకొన్నారు. మేం పల్లకీని కూడా సిద్ధం చేసుకొన్నాం. కానీ ఆ రోజు ఉదయం నుండే కుండపోతగా వర్షం కురవసాగింది. నదిలో కూడా నీరు పొంగి ప్రవహిస్తున్నదని విన్నాం. అయినా కేదార్బాబు, “మాతృదేవి ఆదేశించి నట్లు పల్లకీ తీసుకొని నిర్ణీత సమయానికి జయరాంబాటికి వెళ్లండి. ఆమె ఎలా చెబితే అలా చేయండి” అన్నారు. నదిని దాటి వెళ్లలేనంతగా నీరు పొంగి ప్రవహిస్తున్నది. రాజేన్ మహరాజ్ ఈదుకొంటూ వెళ్లి ఒక చిన్న పడవను తెచ్చారు. మేం పల్లకీతో సహా ఆ పడవలో కూర్చుని దాదాపు మూడు గంటలకు జయరాంబాటి చేరాం.
మమ్మల్ని చూసిన కాళీ మామయ్య కోపంగా, “ఈ కుంభవృష్టిలో అక్కయ్యను తీసుకువెళుతున్నారా?” అని అడిగాడు. కానీ మా రాక మాతృదేవికి వినోదం కలిగించింది. “మాతృదేవిని తోడ్కొనివెళ్లి సేవించే విషయం మా నిర్ణయంలోనిదా? ఈ రోజు పల్లకీ తీసుకువస్తామని చెప్పాం కనుక వచ్చాం. అంతే” అన్నారు రాజేన్ మహరాజ్. మాతృదేవి కూడా నవ్వుతూ, “ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకొన్నప్పుడు, నేను మాత్రం నిలబెట్టుకోవాలి గదా! నేను వస్తున్నాను, నన్ను తీసుకెళ్లండి. తక్కినవారు తరువాత రావచ్చు” అన్నారు. మేం ఓటమిని ఒప్పుకొని, “వద్దమ్మా! ఈ జడివానలో ఎవరైనా బయలుదేరతారా? మిమ్మల్ని వానలో తడిపించి అనారోగ్యం పాలయ్యేలా చేస్తామా?” అన్నాం. కాళీ మామయ్య, మాతృదేవి పెద్దగా నవ్వారు. మేం పల్లకీతో ఆశ్రమానికి తిరిగి వెళ్లిపోయాం.
మాతృదేవి అనారోగ్య స్థితి కొనసాగినందున కొన్ని నెలల తరువాతే ఆమె కోల్పారాకు రాగలిగారు. ఒక రోజు ఉదయం పదకొండు గంటలకు జగదంబ ఆశ్రమానికి వెళ్లాను. అక్కడున్న స్త్రీలంతా ఆదుర్దాగా ఉన్నట్లు కనిపించారు. నాతో కేదార్బాబు తల్లి హీనస్వరంలో, “మాతృదేవి పారవశ్య స్థితిలో ఉన్నారు. ‘గురుదేవా’ అంటూ బాహ్యస్మృతిని కోల్పోయారు” అన్నారు. మాతృదేవి ముఖం మీద, కళ్ల మీద నీళ్లు చిలకరించారు. కొంతసేపటికి మాతృదేవి కళ్లు తెరిచారు. వెంటనే నళిని, “అత్తయ్యా, ఏమయింది?” అని ఆదుర్దాగా అడిగింది. అందుకు మాతృదేవి, “ఏం జరిగింది? సూదిలో దారం పోగు ఎక్కిస్తూంటే తల కాస్త తిరిగింది” అన్నారు. అంతే, మళ్లీ దానిని గురించి ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
తదనంతర కాలంలో ఉద్బోధన్లో చివరిసారిగా అనారోగ్యంతో పడుకొని వున్నప్పుడు ఈ సంఘటన గురించి మాతృదేవి నాకు చెప్పారు. అప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటి గంటన్నర లేదా రెండు గంటలయివుంటుంది. ఆమెకు జ్వరం ఎక్కువ కాసాగింది. మామూలు ప్రకారం ఆమె పరుపు పక్కన కూర్చుని విసురు తున్నాను. తడిచేత్తో సుతిమెత్తగా ఆమె నుదుటి మీద రుద్దుతున్నాను. మాతృదేవి ఆప్యాయంగా నా వీపును, ఛాతీని స్పృశించి నా వైపే చూస్తూ, “ఈ శరీరం పోతే మీ కందరికీ అపరిమితమైన బాధ కలుగుతుందని నాకు తెలుసు” అన్నారు. “అమ్మా, మందుల మూలంగా కూడా ఆశించిన ఫలితం కానరావడం లేదు. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు? గురుదేవులతో కాస్త చెప్పరాదా! చెబితే అంతా సరిపోతుంది” అన్నాను నేను. మాతృదేవి సన్నగా నవ్వారు. తరువాత ఇలా అన్నారు:
“కోల్పారాలో అంత జ్వరం వచ్చింది కదా! స్పృహకోల్పోయి పరుపు మీద నుండి కిందపడిపోయాను. ఆరోగ్యం కోసం ఆయనను స్మరించినప్పుడల్లా ఆయన దర్శనం లభిస్తూవచ్చింది. మరీ బలహీనంగా ఉన్నప్పుడు ఒక రోజు వసారాలో కూర్చుని ఉన్నాను. నళిని, మరికొందరు ఏదో కుట్టుకొంటున్నారు. బయట ఎండ మండిపోతోంది. హఠాత్తుగా ముఖద్వారం గుండా గురుదేవులు లోపలకు వచ్చి చల్లగావున్న వసారాలో పడుకోవడం చూశాను. తక్షణమే ఆదరాబాదరా చీర కొంగును పరచడానికి వెళ్లాను. పరుస్తున్నప్పుడు ఏదో అయిందనిపించింది. కేదార్ తల్లి, ఇతర స్త్రీలు గడబిడ చేసేశారు. అందువలన వారితో, ‘సూదిలో దారం ఎక్కించేటప్పుడు తల తిరిగిం’ దని చెప్పాను. మీ నిమిత్తం నా దేహం కోసం గురు దేవులను ప్రార్థించకుండా ఉంటానా ఏమిటి? కానీ ప్రస్తుతం నా ఆరోగ్యం నిమిత్తం స్మరిస్తే ఆయన దర్శనమే లభించడం లేదు. ఈ దేహం ఇక నిలవడం ఆయనకు ఇష్టం లేదని తోస్తూన్నది. శరత్ ఉండనే ఉన్నాడు కదా!”
ఒక రోజు మధ్యాహ్నం రెండు గంటలకు కోల్పారా వెళ్లాను. ఎండ మండి పోతున్నది. మాతృదేవి మిఠాయి, నీళ్లు నాకు ఇస్తూ, “నాయనా, బాగా ఎండగా ఉంది. కాసేపు విశ్రమించు. ఎండ తగ్గిన తరువాత బయలుదేరవచ్చు. గోపేష్ ఎలా ఉన్నాడు? అవునూ, ఈ రోజు ఏం తిన్నావు? వంట ఏమిటి? వెళ్లేటప్పుడు పండ్లు, బియ్యం మొదలైనవి పట్టుకెళ్లు” అన్నారు. “గోపేష్ మహరాజ్ చెప్పినట్లు అరటికాయలు, బంగాళాదుంపలు మొదలైనవి వేసి ఒక వంటకం చేశాం. కానీ అంచనా తెలియక ఏడెనిమిది మందికి సరిపడేట్లు చేశాం” అన్నాను నేను.
అప్పుడు ఆకాశం మేఘావృతమైంది. “కాస్త వాన పడితేనయినా నేల చల్లబడు తుంది” అన్నారు మాతృదేవి. కాసేపటికి గాలి, వడగళ్లవాన మొదలైనాయి. అది చూసి మాతృదేవి ఎంతో ఆనందించారు. ఒకటి రెండు వడగళ్లు నోట్లో వేసుకొన్నారు. హఠాత్తుగా ఇలా శీతలంలో తిరగడం మాతృదేవిని జ్వరంలోకి దింపింది; త్వరలోనే ఆ జ్వరం తీవ్రరూపం దాల్చింది.
మాతృదేవి కోల్పారాలో వ్యాధిగ్రస్థురాలై ఉన్నప్పుడు అక్కడ ఉద్బోధన్లో ప్రజ్ఞానానందస్వామి పరమపదించారు. ఆయన సోదరీ, నివేదితా పాఠశాల నేతా అయిన సోదరి సుధీర తన ఉద్వేగాన్ని అణచుకొని ప్రశాంతంగా అప్పుడు ఆయన పక్కన కూర్చుందని విన్న మాతృదేవి ఇలా అన్నారు: “హా, ఒక్కసారి విలపించి ఉంటే ఆమె దుఃఖం కొంత ఉపశమించి ఉండేది. ఆమె ఇప్పటికే హృద్రోగి. ఆమెకు ఏమీ కాకుండా చూసుకోండి” అని వ్యాఖ్యానించారు.
ఒక రోజు కోల్పారా నుండి జయరాంబాటికి వస్తున్నాను. కొన్ని సామాన్లు ఒక వృద్ధ స్త్రీ మోసుకువస్తూన్నది. జయరాంబాటి చేరుకొనేసరికి పది గంటలయి వుంటుంది. ఆమె సామాన్లు దింపి మాతృదేవికి ప్రణమిల్లింది. మాతృదేవి ఆమెతో, “నువ్వెందుకు చాలా రోజులుగా ఇటువైపు రాలేదు?” అని ఆప్యాయంగా అడిగారు. అందుకు ఆమె, “ఏం చెప్పమంటావమ్మా! రోజులు గడవడం ఎంతో కష్టంగా ఉంటోంది. తిండికి అటూ ఇటూ తిరుగాడవలసివస్తోంది. కాస్తో కూస్తో సంపాదిస్తున్న నా కుమారుడు కూడా చనిపోయాడు” అంటూ విలపించసాగింది.
“ఎంత దుఃఖం!” అంటూ మాతృదేవి బాధపడ్డారు. ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. మాతృదేవి బాధపడడం చూసి ఆమె భోరున ఏడవసాగింది. ఆమె పక్కన కూర్చుని, వసారాలోని స్తంభానికి తల ఆన్చి ఆమెతోపాటు మాతృదేవి కూడా విలపించసాగారు. ఇద్దరూ ఇలా వెక్కివెక్కి ఏడవడం చూసి ఇంట్లోని వారంతా పరుగున వచ్చి, ఆ దృశ్యం చూసి విస్తుబోయారు. కాసేపు అలాగే గడిచింది. ఏడుపు ఆగిన తరువాత మాతృదేవి కొబ్బరినూనె తెప్పించి స్వయంగా తామే ఆమె తలకు రాశారు. పిదప మరమరాలు, చక్కెర మొదలైనవి ఒక గుడ్డలో మూటగా కట్టి ఆమెకు ఇస్తూ, “మళ్లీరా అమ్మాయీ” అన్నారు ఆప్యాయంగా. అప్పటికీ మాతృదేవి కళ్లు చెమ్మగిల్లే ఉన్నాయి. ఆ స్త్రీ ఎంతో అనునయం పొందినట్లు ఆమె ముఖమే చెప్పక చెప్పింది.
మాతృదేవి సాయంత్రం మామూలుగా కాస్త మిఠాయి తిని, కొంచెం నీళ్లు త్రాగుతారు. నేను వస్తే నాకూ ఇస్తారు. “రోజంతా శ్రమపడ్డాక ఏదైనా కాస్త తిను. కాసిని నీళ్లు కూడా త్రాగితే ఒంట్లో నూతనోత్సాహం కలుగుతుంది. ఆ తరువాత జపమో, ధ్యానమో, మరో పనో చేసినా మనస్సు సులభంగా ఏకాగ్రమవుతుంది” అనేవారు మాతృదేవి.
ఒక రోజు రాధూ గదికి ఎదుటి వసారాలో మాతృదేవి వద్ద కూర్చుని లెక్కలు వ్రాస్తున్నాను. అప్పుడు అటువైపుగా వెళుతున్న ఒక భక్తురాలి చీర కొంగు నాకు తగిలింది. అది చూసి మాతృదేవి కోపంతో, “ఏమిటది? ఇతడు నా ముందు కూర్చుని వ్రాసుకొంటున్నాడు. నువ్వు కించిత్తు కూడా పట్టించుకోకుండా నీ చీర కొంగు అతడికి తగిలేలా పోతున్నావు. వీళ్లు బ్రహ్మచారులు. స్త్రీలయిన మీరు వీరిపట్ల మర్యాదగా మెలగాలి. అతడికి నమస్కరించు” అన్నారు. మాతృదేవి కోపం చూసి అక్కడున్న స్త్రీలందరూ విస్తుపోయారు.
కొత్తగా కోల్పారా ఆశ్రమంలో చేరిన ఒక బ్రహ్మచారి కొన్ని రోజులు మాతృదేవి సాన్నిధ్యంలో గడపాలని ఆశించాడు. అతడితో మాతృదేవి ఇలా అన్నారు: “నా వద్ద కొన్ని రోజులు గడపాలనుకొంటున్నావు. కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుంది. నా కిక్కడ ఎన్నో పనులున్నాయి. ఈ అరణ్యంలో నేను రాధూతో ఉంటున్నాను.”
కానీ మాతృదేవి వద్ద కొన్ని రోజులు గడపాలనే ఆతడి తీర్మానం చూసి మాతృదేవి, “మంచిది. కేదార్‌కు తెలిపి కొన్ని రోజులు ఇక్కడ ఉండు. తరువాత ఆలోచిద్దాం” అన్నారు. అదే సమయంలో రాధూను చూసుకొనే వ్యక్తి కూడా కొన్ని రోజులు కలకత్తాకు వెళ్లవలసి వచ్చింది. ఈ కొత్త బ్రహ్మచారి ఆ పని చూడగలడా అని విచారించి, అతడు సరేననగానే, వెళ్లబోతున్న వ్యక్తి నుండి ఆ పని నేర్చుకోమని మాతృదేవి చెప్పారు.
మొదటి రోజే రాధూకు ఆహారం తీసుకువెళుతున్నప్పుడు చేయిజారి ఆహారం నేలపాలయింది. ఏం చేయడానికి తోచక అతడు ఖాళీ గిన్నెలను మాతృదేవి వద్దకు తీసుకువెళ్లాడు. ఆ రోజంతా రాధూ తిండి లేకుండా ఉండవలసి వచ్చింది. దాంతో మాతృదేవి ఎంతో విసుగుచెంది, ఇలా అన్నారు:
“ఒక సాధువుగా అతడు మంచివాడయి ఉండవచ్చు: కానీ కార్యదక్షులే నాకు అవసరం. చెట్టు నీడన నివసించే సాధువు నా పనులు చేయలేడు. కొందరు క్షణి కోత్సాహంలో మహత్కార్యాలు చేయగలరు. కానీ సామాన్యమైన పనులు చేయడంలో ఒక వ్యక్తి కనబరచే శ్రద్ధే అతడి యోగ్యతను చాటిచెబుతుంది.”
కలకత్తాకు వెళ్లిన వ్యక్తి ఒకటి రెండు రోజులలో తిరిగి వచ్చేయడంతో ఈ కొత్త బ్రహ్మచారికి అక్కడ ఉండే అవకాశం లేకుండాపోయింది.
ఒక రోజు సాయంత్రం మాటల సందర్భంలో మాతృదేవి ఇలా అన్నారు:
“నాయనా! ఇప్పుడల్లా ఎవరి తప్పులనూ నేను చూడనూలేదు, విన డమూ లేదు. ప్రారబ్ధ కర్మానుసారమే మనిషి ప్రవర్తిస్తాడు. నాగలి గుచ్చుకొని చీరుకుపోవలసివుంటే కనీసం ఒక సూదియైనా గుచ్చుకొని తీరుతుంది.
“ ‘అ’ – గురించి అనేకులు నాతో చెడుగా చెప్పారు. అతడు నాకు ఎన్ని సేవలు చేశాడు! అప్పుడు మా తమ్ముళ్ల ఇళ్లలో నేను వడ్లు ఉడికించేదానను. మా మరదళ్లు ఇంకా చిన్నపిల్లలు. చలి, వాన ఏదీ పట్టించుకోకుండా ‘అ’ మాత్రమే నాతోపాటు పనిచేసేవాడు. ఉదయం నుండి సాయంత్రం దాకా పెద్దపెద్ద కుండలను పొయ్యిల మీద పెట్టే, వడ్లను ఉడికించే పనిలో నాతో కలిసి పనిచేసేవాడు. ఇప్పుడు తప్పులు ఎంచేవారంతా అప్పుడు ఏమయ్యారు? ఇప్పుడు అనేకమంది భక్తులు ఉన్నారు. ఆ రోజుల్లో నాకు ఎవరున్నారు? అప్పుడు జరిగినదంతా మరచిపోగలమా? అసలు అతడు ఏం తప్పుచేశాడు?
“ఇతరుల తప్పిదాలు మొదట్లో నా కళ్లలో కూడా పడేవి. కన్నీరుమున్నీరై నేను గురుదేవులను, ‘ప్రభూ! నేను ఎవరి తప్పిదాలనూ చూడదలచుకోలేదు’ అంటూ ఎంతగానో ప్రార్థించాను. తదనంతరమే ఆ గుణం నాలో లుప్తమైపోయింది. ఒక డికి వేయిసార్లు మంచి చేసి, ఒక్కసారి కీడు తలపెట్టు; అంతే. ముఖం అటువైపు తిప్పేసుకొంటాడు. ఇదే మానవ నైజం. మనిషి తప్పులనే చూస్తాడు. కానీ సుగుణాలను చూడాలి.”
మహాత్ముల సేవకులలో కొందరు దుర్జనులై ఉండడం గురించి మాతృదేవి ఇలా చెప్పారు:
“ఇదిగో చూడు. సేవాపరాధ మన్నది ఒకటి ఉండడం నిజమే. సేవాపరాధ మంటే ఏమిటి? సేవలు చేసి చేసి తాము ఎవరిని సేవిస్తున్నామో వారు తమకు లోబడిన వారనే అహంభావం క్రమంగా తలెత్తుతుంది. చివరకు ఆ మహాత్ముడు తాము చెప్పినట్లు చేయాలని ఆకాంక్షిస్తారు. ఆయన కూర్చొవడం, నిలబడడం, లేవడం అన్నీ తమ ఆదేశానుసారమే చేయాలని భావిస్తారు. తదనంతరం సేవాభావం పూర్తిగా లుప్తమయిపోతుంది. కానీ తమ సుఖాలూ, సౌకర్యాలూ అన్నీ విస్మరించి ఆ మహాత్ముని సుఖదుఃఖాలనే తమవిగా భావించి సేవించే వారికి సేవాపరాధం ఎలా చుట్టుకొంటుంది?
“సేవకులలో పలువురు పతనం చెందడం గురించి చెబుతున్నావా? అలా ఎందుకు జరుగుతుంది? ఒక మహాత్ముడుంటే ఆయన చుట్టూ నలువైపులా తేజస్సు వ్యాపించి ఉంటుంది. ఆయనకు సేవలు చేయడానికి వచ్చేవారంతా ఆ తేజస్సులో మైమరచిపోతారు. కీర్తిని, ఖ్యాతిని సర్వస్వంగా ఎంచి వాటిలో మునిగివుంటారు. ఒక మహాత్ముణ్ణి నిజాయితీతో సేవించేవారు ఎంతమందో చెప్పు చూద్దాం?
“ఒక కథ ఉంది. నిశ్చలమైన ఒక చెరువు నీటిలో చంద్రబింబం ప్రతిఫలిం చింది. దానిని చూసి చిన్నచిన్న చేపలు ఎంతో సంతోషించాయి. ఆనందంగా ఈదుతూ బింబంతో ఆడుకొన్నాయి. చంద్రబింబం కూడా తమలాంటి ఒక చేపే అని భావించాయి. కానీ చంద్రుడు నిష్క్రమించగానే బింబం కూడా మాయమయింది. ఇదంతా ఆ చేపలకు ఏమీ అర్థం కాలేదు.”
నేను: ‘గురువుతో ఎక్కువ రోజులు ఉండరాదు. ఆయన సామాన్యుడిలా జీవించడం చూసి కొన్ని సమయాలలో ఆయన పట్ల మనకున్న భక్తివిశ్వాసాలు తరిగిపోవచ్చునని కేదార్ మహరాజ్ చెప్పారు.
మాతృదేవి (నవ్వుతూ) : నాయనా! ఇలాంటి విషయాలను గురించి యోచిస్తూ మీ మనస్సులను పాడుచేసుకోకండి. అలా ఎవరూ నాతోపాటు ఉండకపోతే నా పనులు ఎలా సాగుతాయి? నన్ను అలా ఒక దైవంలా పరిగణించకుండా ఒక మానవ స్త్రీగా ఎంచితే చాలు. అందుకు తగ్గట్లు పనిచేయి. భయం వద్దు.
భక్తుల నుండి అనేక ఉత్తరాలు వచ్చాయి. వాటినన్నిటినీ చదివి మాతృదేవికి వినిపించాను. విని ఆమె ఇలా అన్నారు:
“చూశావా? ఎన్ని రకాల బిడ్డలో! వారికి ఎన్ని రకాల కోర్కెలో! ‘ఇంతగా ప్రార్థిస్తున్నాను, జపధ్యానాలు చేస్తున్నాను. ఏదీ కలగడం లేదు’ అని ఒకడు వ్రాస్తున్నాడు, ‘పేదరికమూ, రోగాలూ అవీ ఇవీ అంటూ సంసారంలో ప్రశాంతత కరువయింది’ అంటూ ఒక ఉత్తరం! ఓహ్! వీటి నన్నిటినీ వినడం నా వల్ల కాదు. ‘ప్రభూ! ఇహపర జీవితాలను మీరే చూసుకోండి’ అని గురుదేవులను ప్రార్థిస్తాను. అమ్మనైన నేను మరేం చేయగలను?
“కానీ నిజానికి ఎందరు భగవంతుణ్ణి పొందగోరతారు? అలాంటి మనోవ్యాకు లత ఎందరికి ఉంది? ఒక వైపు తమ భక్తిని, చిత్తశుద్ధిని చాటుకొంటారు. మరో వైపు అల్ప సుఖభోగాలు దక్కితే ఆనందిస్తూ, ‘ఆహా! భగవంతుడు ఎంత కరుణా మయుడు!’ అంటారు. ఇక్కడికి వచ్చి, ‘రాధూ ఎలా వుంది?’ అని క్షేమసమాచారాలు విచారిస్తారు. అవన్నీ నన్ను తృప్తిపరచడానికే! నేను పోయాక రాధూను కన్నెత్తి కూడా చూడరు.”
ఒక భక్తురాలు: అమ్మా! పిల్లలందరూ మీకు సమానమే కదా! కానీ గార్హస్థ్య జీవితం ఆశించేవారిని అందుకు అనుమతిస్తున్నారు. సన్న్యాస జీవితం కోరుకొనే వారికి ఆ జీవిత ఔన్నత్యాన్ని శ్లాఘిస్తూ దారి చూపుతున్నారు. ఏ మార్గం సర్వులకూ శ్రేష్ఠమో ఆ మార్గంలోనే అందరినీ తీసుకువెళ్ల రాదా?
మాతృదేవి: భోగలాలస తీవ్రంగా ఉన్నవారితో, ‘వీటిని త్యజించండి’ అంటే నా మాట వింటారా? కానీ ‘అంతా మాయాప్రభావం, భగవంతుడు మాత్రమే నిత్య’ మనే సత్యాన్ని తమ పూర్వజన్మ సుకృతం వలన అవగతం చేసుకొన్నవారికి నేను ఒకింత సాయపడకూడదా? ఈ లోకంలోని దుఃఖాలకు అంతు ఉందా?
ఒకరోజు నళిని కొందరితో వాదిస్తూవుంది. చివరకు అందరూ మాతృదేవి వద్దకు వచ్చారు.
నళిని: అత్తయ్యా! ఎలాంటి అబద్ధం మంచిది?
మాతృదేవి (ఆశ్చర్యంతో): అబద్ధమన్నదే తప్పు. ఇందులో మంచి అబద్ధమూ, చెడు అబద్ధమూ అని ఉన్నాయా ఏమిటి? అబద్ధమే అయినప్పటికీ ఒక వ్యక్తిని ధనవంతుడని పేర్కొంటే అతడు సంతోషిస్తాడు. ‘ఓహో, నువ్వు గొప్ప ధనవంతుడవు కదా!’ అని ఎవరితోనైనా అంటే బహుశా ఆ వ్యక్తి వినయం ప్రదర్శిస్తాడు లేకపోతే కసురుకొంటాడు. కానీ ఇదంతా బయట వరకే! లోలోపల ఎంతో సంతోషిస్తాడు.
అవన్నీ సరే! ఏదీ మిమ్మల్నందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, కచ్చితంగా జవాబు చెబుతారో లేదో చూస్తాను. భగవంతుణ్ణి ఏం కావాలని ప్రార్థిస్తారు?
నళిని: అత్తయ్యా! జ్ఞానం, భక్తి లాంటివి, దేనివలన సంతోషంగా జీవించ గలమో అవి – వాటి కోసం మాత్రమే ప్రార్థించాలి.
మాతృదేవి: ఒక్క మాటలో చెప్పాలంటే నిర్వాసన (కోర్కెలేమి) కోసమే మనం ప్రార్థించాలి. కోరికే అన్ని దుఃఖాలకూ మూలకారణం. జననమరణ చక్రంలో చిక్కువడి పదేపదే తిరగడానికి కారణం ఈ కోర్కే. అంతే కాదు. ముక్తి పథానికి అడ్డంకిగా ఉండేది కోర్కే!
మహాష్టమి రోజు. ఒక భక్తుడు బుట్ట నిండా తామర పువ్వులు తెచ్చాడు. నన్ను చూడగానే ఆ బుట్టతోసహా చేతులు పైకెత్తి నమస్కరించాడు. కాస్త దూరం నుండి మాతృదేవి దీనిని గమనించారు. ఆ తరువాత నాతో, “ఈ పువ్వులతో మనం గురుదేవులను అర్చించలేం, వీటిని పారెయ్యి” అని చెప్పారు.*
మాలో ఇద్దరు అంచులేని ధోవతి ధరించి ఉన్నారు. అది చూసి మాతృదేవి ఇలా వ్యాఖ్యానించారు: “మీ రెందుకు అంచులేని ధోవతులు ధరించారు? మీరు యువకులు! చక్కని అంచుగల ధోవతులు ధరించాలి. లేకపోతే మనస్సు ముసలిదై పోతుంది. మనస్సును ఎప్పుడూ ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి.”
ఇలా అంటూ మాతృదేవి పెట్టె తెరిచి కొత్త ధోవతులు తీసి మా ఇద్దరికీ ఇచ్చారు.
ఆ రోజు సాయంత్రం, మాతృదేవి పాదాల వద్ద తామర పువ్వులు అర్పించి అనేకులు ప్రణమిల్లారు. “ఇంకా బోలెడు పువ్వులు పట్రా! రాఖాల్, తారక్, శరత్, కోకా, యోగీన్, గోలాప్ – వీరందరి తరఫునా పువ్వులు అర్పించు. నాకు తెలిసిన, తెలియని నా బిడ్డలందరి తరఫునా పువ్వులు సమర్పించు” అన్నారు మాతృదేవి. నేను అలాగే చేశాను. మాతృదేవి చేతులు జోడించి చాలాసేపు గురుదేవులనే తదే కంగా చూస్తూ కూర్చుండిపోయారు. ఆ తరువాత “అందరికీ ఇహపరాలలో శ్రేయస్సు కలుగుగాక!” అని అన్నారు.
కేదార్ మహరాజ్: అమ్మా! బాగా స్తోమత ఉన్నవారు కూడా మన వైద్యశాలకు వచ్చి ఉచితంగా ఇచ్చే మందులు తీసుకొంటున్నారు. కాని మన వైద్యశాల పేదల కోసం మాత్రమే నెలకొల్పబడింది. స్తోమత ఉన్నవారిని అనుమతించవచ్చా?
మాతృదేవి (సన్నగా నవ్వి) : నాయనా! ఈ ఊళ్లో అందరూ పేదలే! మన ఆశ్రమం గురించి తెలిసికూడా ఉచిత మందుల కోసం మనల్ని ఆశ్రయిస్తే వారికి కూడా చేతనైనంత సేవ చేయండి! యాచకుడు పేదవాడే కదా!
కేదార్ మహరాజ్: అమ్మా, సర్వమతసామరస్యమనే నూతన సందేశ పరివ్యాప్తి కోసమేనా గురుదేవులు ఈసారి వచ్చారు?
మాతృదేవి: ఇలా చూడు నాయనా! సర్వమతసామరస్యాన్ని బోధించడానికి ఆయన ఇతర మత సాధనలను అనుష్ఠించారని నాకు అనిపించడం లేదు. ఆయన సదా దివ్యోన్మత్తతలో మునిగిపోయి ఉండేవారు. క్రైస్తవుడు, మహమ్మదీయుడు, వైష్ణవుడు అందరూ ఏయే మార్గాలలో భగవంతుణ్ణి ఆరాధించారో, భగవదనుభూతి పొందారో, ఆ యా మార్గాలలో సాధనలు అనుష్ఠించి భగవంతుని లీలావిలాసాన్ని చవిచూసి ఆనందించారు. రేయింబవళ్లు ఎలా గడిచాయో ఆయనకు తెలిసేది కాదు. కానీ ఒక్క విషయం: త్యాగమే ఆయనలో విశిష్టతగా ఒప్పారింది, ఇలాంటి సహజ త్యాగాన్ని ఎవరైనా ఎన్నడైనా చూసి ఎరుగుదురా? సర్వమత సామరస్యాన్ని గురించి చెప్పావు. అదీ సరే! మునుపటి అవతారాలలో ఏదో ఒక్క మార్గమే నొక్కి వక్కాణింపబడింది, ఇతర మార్గాలు దాని తరువాతే!
ఆ రోజు సాయంత్రం గడిచింది. చపాతీలు చేసే పని పూర్తిచేసి, ఉత్తరాలు చదవడానికి యథాప్రకారం మాతృదేవి వద్దకు వెళ్లాను. అప్పుడు ఒక భక్తురాలు మాతృదేవిని అనేక రీతుల్లో శ్లాఘిస్తూ ఉత్తరం వ్రాసింది. అంతా విని మాతృదేవి ఇలా అన్నారు:
“ఇలా చూడు. అనేక సమయాలలో నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. నేను అదే రామముఖర్జీ కుమార్తెను. నా వయస్సుగల స్త్రీలు అనేకులు జయరాంబాటిలో ఉన్నారు. వారి నుండి నేను ఏ రకంగా భిన్నమైన దానను? ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తున్నారు, నమస్కారాలు చేస్తున్నారు – అడిగినప్పుడు కొందరు డాక్టర్లు, కొందరు న్యాయవాదులు అని తెలియవస్తోంది. వీరంతా ఎందుకు అలా వస్తున్నారు?”
మాతృదేవి కాసేపు మౌనం వహించారు.
నేను: అమ్మా! మీ కెప్పుడూ మీ స్వస్వరూపం జ్ఞాపకం రాదా?
మాతృదేవి: అది సదా జ్ఞాపకంలో ఉండడం ఎలా సాధ్యం? అలా జరిగితే ఈ పనులన్నీ ఎలా సాగుతాయి? కానీ ఎటువంటి పనులలో నిమగ్నమైవున్నా, ఎప్పుడు కోరుకొంటే అప్పుడు ఒక చిన్న ఆలోచన చాలు! మనస్సు తక్షణమే చైతన్యవంతమయిపోతుంది. మహామాయ లీలావిలాసం పూర్తిగా అర్థమయిపోతుంది.
ఒక భక్తుడు: ఎక్కడమ్మా! ఎంత ప్రయత్నించినా ఏమీ అవగతం కావడం లేదు.
మాతృదేవి: అర్థమవుతుంది నాయనా, అర్థమవుతుంది! మీ రెందుకు కలత చెందుతారు? సముచిత తరుణంలో అంతా సిద్ధిస్తుంది.
ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయేదాకా సంభాషణ కొనసాగింది.
నేను: ‘బాగా శ్రమించి పనిచేయండి. అప్పుడే జరగవలసింది దానంతట అదే జరుగుతుంది’ అని కేదార్ మహరాజ్ చెబుతున్నారు.
మాతృదేవి: తప్పకుండా పని చేయవలసిందే. పనిచేయడం వలన మనస్సు చైతన్యం సంతరించుకొంటుంది. కానీ జపధ్యానాలూ, ప్రార్థనా కూడా ఎంతో అవసరం. ఉదయం వేళ, సాయంత్రంపూట ఒక్కసారైనా సాధనల కోసం కూర్చుని తీరాలి. అది ఓడకు చుక్కాని లాంటిది. సంధ్యాసమయంలో కాసేపు కూర్చుని చూడు; ఆ రోజంతా చేసిన మంచి చెడులు మనస్సులో ప్రతిఫలిస్తాయి. పిదప నిన్నటి మానసిక స్థితితో నేటి మానసిక స్థితిని పోల్చుకోవాలి. తదనంతరం జపం ప్రారంభించాలి. క్రమంగా ధ్యానం చేయాలి. ధ్యానంలో తొలుత ఇష్టదేవత ముఖం కానరావడం సహజం. కానీ పాదాల నుండి ప్రారంభించి సమగ్ర రూపాన్ని ధ్యానిం చాలి. ఉదయ సాయంకాలాలలో జపధ్యానాలు చేయకుంటే నువ్వు ఏం చేస్తున్నావో, ఏం చేయడం లేదో ఎలా తెలుస్తుంది?
నేను: ఎంత పనిచేసినా ఏమీ లభించదు, సదా జపధ్యానాలు చేయగలిగితే మాత్రమే లభిస్తుందని కొందరు అంటున్నారు కదా!
మాతృదేవి: ఇది అనుష్ఠిస్తే లభిస్తుంది, అది అనుష్ఠిస్తే లభించదని వీరెలా గ్రహించారట? ఏదో కొన్ని రోజులు జపధ్యానాలు చేస్తే సమస్తం సాధించినట్లయి పోతుందా? మహామాయ దారి ఇవ్వకపోతే ఏం చేసినా ఏదీ జరగదు. ఆ రోజు చూశావు కదా! ఒకడు బలవంతంగా తన శక్తికి మించి జపం చేశాడు. దాని పర్యవసానం ఏమిటి? మతిభ్రఘ్టడయ్యాడు. పిచ్చి పట్టింది. మతిభ్రష్టుడయితే ఏం మిగులుతుంది? మనస్సు మరమేకులాంటిది. కాస్త వదులైతే చాలు, పిచ్చిపడుతుంది; లేకపోతే మహామాయ వలలో చిక్కుకొని, ‘నేను చాలా తెలివిగలవాణ్ణి, నేను చాలా బాగున్నాను’ అనుకొంటాడు. మరమేకును సరిగా బిగిస్తే ఆ వ్యక్తి సరైన దారిలో పురోగమించి శాంత్యానందాలు పొందుతాడు.
సదా సర్వవేళలా భగవంతుణ్ణి స్మరించాలి, ఆయనను గురించి చింతన చేయాలి. ‘ప్రభూ! సద్బుద్ధిని ప్రసాదించు’ అని ప్రార్థించాలి. అవిరామంగా జపధ్యానాలు ఎందరు చేయగలుగుతారు? ప్రారంభంలో ఏదో చేస్తారు. తరువాత (అక్కడున్న ఒక స్త్రీని చూపిస్తూ) ఇదుగో ఆమె మాదిరి ఊరకనే కూర్చుని కూర్చుని మెదడును వేడెక్కిస్తారు. ఊరకే కూర్చుని చెట్టు, కొండ అంటూ వేటి గురించో ఆలోచిస్తారు. మనస్సు ప్రశాంతతను కోల్పోతుంది.
ఇలా మనస్సును ఇష్టం వచ్చినట్లు వదలివేయడం కంటే పనిలో పాల్గొనేలా చేస్తే ఎంతో మంచిది. చంచలమైన మనస్సు గందరగోళాన్నే సృష్టిస్తుంది. నా నరేన్ ఇదంతా చూసే కదా ‘నిష్కామ కర్మ’ అనే మార్గాన్ని రూపొందించాడు.
(మళ్లీ ఆ స్త్రీని చూపిస్తూ) ఈమెనే చూడు, సోమరిగా కూర్చుని కూర్చుని మనస్సును ఎలా కల్మషపరచుకొంటోందో! ఆచారం ఆచారం అంటూ కొట్టుకుపో వడమే ఎక్కువగా ఉంది. అందుకు తోడు మనశ్శాంతి లేదని గొడవ చేస్తూంది. మనశ్శాంతి ఎందుకు ఉండదు? ఇంత అనుభవించినా ఇంకా మనస్సులో వివేకం ఉదయించడం లేదే?
శీతకాలం. మాతృదేవి ఆరోగ్యం బాగా క్షీణించింది, అయినా వేకువజామున మూడు గంటలకు లేవడం మాత్రం మానుకోలేదు. మూడింటికి లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, ఒక దళసరి కంబళి కప్పుకొని, పరుపు మీద కూర్చుని ధ్యానం చేసే వారు. అనారోగ్యం కారణంగా కాసేపటికే మళ్లీ పడుకొనేవారు. మేం నిశ్శబ్దంగా ఆ గదిలోకి వెళ్లి తలుపులు మూసి ఆ చీకటిలో మాతృదేవి దివ్యసాన్నిధ్యంలో కూర్చుని ధ్యానం చేసేవారం. కొన్ని సందర్భాలలో, “ఈ సమయంలో ఫలానా దేవతా మంత్రాన్ని ఈ పద్ధతిలో జపించు” అంటూ మమ్మల్ని ప్రోత్సహించేవారు.
అనారోగ్యంగా ఉన్నప్పుడు సాధువులు, గృహస్థులతో కలసి నివసించడం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు, మాతృదేవి ఇలా అన్నారు:
“అనారోగ్యంగా ఉన్నంత మాత్రాన సాధువు, గృహస్థు ఇంటికి వెళ్లి జీవించాలా ఏమిటి? మఠం ఉంది, ఆశ్రమం ఉంది. సాధువు పరిత్యాగానికి ఆదర్శమూర్తి. ఒక స్త్రీమూర్తి చెక్కబొమ్మ దారిలో పడివుందనుకో. సాధువు తన పాదాలతో సైతం దానిని తాకి, నిలబెట్టి, ముఖం వైపు కూడా చూడరాదు. సాధువు డబ్బు కూడబెట్టడం ఘోరమైన తప్పు. డబ్బుతో సాధించలేనిది ఏదీ లేదు – ప్రాణాలు కూడా తీయవచ్చు. పూరీలో, సముద్రతీరాన ఒక సాధువు నివసించేవాడు. ఆయన వద్ద కొంచెం డబ్బు ఉండేది. ఈ సంగతి తెలిసిన ఆయన శిష్యులిద్దరూ పేరాసకు లోనై ఆయ నను హతమార్చి డబ్బుతో ఉడాయించారు.
రాధూ పెంపుడు పిల్లి వసారాలో పడుకొనివుంది. ఒక స్త్రీ ఆ పిల్లినే పక్క. నిలబడి తన పాదంతో లాలిస్తూ ఉంది. మెల్లమెల్లగా ఆమె తన పాదాన్ని పిల్లి తల మీద పెట్టింది. ఇదంతా చూసి మాతృదేవి, “ఇదుగో చూడమ్మా! నువ్వేం చేస్తున్నావు? శిరస్సు గురుస్థానం, అక్కడ పాదం పెట్టవచ్చునా? ఆ పిల్లికి నమస్క రించు” అన్నారు.
ఒకనాటి ఉదయం కలకత్తా నుండి కొందరు భక్తులు వచ్చారు. ఖరీదైన, నవనాగరికమైన దుస్తులు ధరించివున్నారు. పండ్లు అవీ ఇవీ అంటూ చాలా కానుకలు మాతృదేవి కోసం తెచ్చారు. వారికి కావలసినది చేయడంతోనే మాతృదేవికి పగలంతా సరిపోయింది. సాయంత్రం ఆమె స్వగతంలో ఇలా చెప్పుకోసాగారు:
“ఓహ్! నా ప్రాణాలు తోడేశారు. ఇక నా వల్ల కాదు తండ్రీ కాదు! కొందరు పిల్లలు వచ్చినప్పుడు నా ఇల్లంతా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. వారికి కావలసిన బియ్యమూ, కాయగూరలూ అన్నీ ఎలాగో సమకూరతాయి. నేను ఆందోళన చెందనవసరంలేదు. పెట్టింది తింటారు, విస్తరి తీసి వెళ్లిపోతారు. ఆహా! వారు మాట్లాడితేనే నా హృదయం చల్లబడుతుంది. కానీ వీరిని చూడు, ఉదయం నుండి గందరగోళం. ఒక బుట్ట పండ్లు తెచ్చారు. వాటిలో సగం కుళ్లిపోయినవి. అవి ఎరువుగా పనికిరావచ్చునేమో గాని మరెందుకూ పనికిరావు. వాటిని ఎక్కడ పారేయాలో నాకు తోచడం లేదు. ధరించిన బట్టలు, ఆభరణాలు నవనాగరికమైనవి. కానీ, ‘తువ్వాలు తీసుకురాలేదు మరచిపోయాం’ అన్నారు. తువ్వాలుకు నేనెక్కడికి వెళ్లాలి? ఎలాగో వెతికి ఒకటి తీసి ఇచ్చాను. ఇక, రాత్రి ఏం వండాలి? ఇదే నా ఆందోళన. దోమతెర కట్టడానికి తాడు లేదంటున్నారు. హరి దాని కోసం వెతుకుతున్నాడు. ఓ దేవుడా! ఇది నీ ప్రపంచం, నువ్వే ఇవన్నీ చూసుకో. నేను ఇంతకంటే చేయలేను. ఒక వైపు రాధూ, మరోవైపు వీళ్లు.”
జయరాంబాటిలో ఒక రోజు. శ్యాంబజార్ నుండి సాయంత్రం నేను తిరిగివచ్చాను. అప్పుడు మాతృదేవి వసారాలో ఒక చాప మీద పడుకొని ఉన్నారు. నన్ను చూడగానే కాస్త విసుగ్గా ఇలా అన్నారు:
“మీరంతా ఇక్కడ ఉన్నారు. కానీ పనుల కోసం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇవాళ ఒకడు వచ్చాడు, కాస్త వృద్ధుడు. దూరం నుండి అతణ్ణి చూడగానే నేను లోపలికి వెళ్లి మంచంమీద కూర్చున్నాను. అతడు బయట నుండే నమస్కరించాడు. అది ఫరవాలేదు. కానీ లోపలకు వచ్చి పాదాలు తాకి నమస్కరింప ప్రయత్నించాడు. వెంటనే నేను ‘వద్దు, వద్దు’ అంటూ అడ్డుపడ్డాను. కానీ అతడు తన ప్రయత్నం మానలేదు. బలవంతంగా పాదాలు తాకి నమస్కరించాడు. భరించలేని పాదాల మంట. దాంతోపాటు కడుపునొప్పి కూడా మొదలయింది. మూడు నాలుగుసార్లు పాదాలు కడుగుకొన్నాను. అయినా ఫలితం శూన్యం. మీరు కనుక దగ్గర ఉండివుంటే నా సంజ్ఞలను అర్థం చేసుకొని ఆతణ్ణి అడ్డుకొని ఉండేవారు. కలకత్తాలో భక్తులను అనుమతించే విషయంలో నిష్కర్షగా ఉంటున్నారు. అలా ఉండకపోతే కుదరదు. హా! ఎన్ని తరహాల వ్యక్తులు వస్తున్నారు. మీరు పసివారు, ఇవన్నీ మీకు అర్థంకావు.”
బయటి పనులన్నీ పూర్తిచేసుకొని సాయంత్రం మాతృదేవి వద్దకు వచ్చాను. అప్పుడు ఆమె ఇలా అన్నారు:
“ఈ సాయంత్రం వి– ఒక పోలీసు అధికారిని తీసుకువచ్చాడు. ఎలాంటి అధికారో ఏమిటో? మీసాలు తిప్పుకొంటూ వచ్చి నమస్కరించాడు. నా పాదాలు తాకి నమస్కరించాలని ఆశించాడు. అందుకు నాకు మనస్కరించలేదు. ఓహ్! ఏం అశాంతి! వి– నా సమక్షంలోనే అతణ్ణి ఏకబిగిన ప్రశంసించసాగాడు. అతడూ ఆ ప్రశంసలను వింటూవున్నాడు. ఆతడి బారి నుండి తప్పించుకోవడం ఎలా అని ఆలోచించసాగాను. చివరకు కాస్త హల్వా తయారుచేసి ఇచ్చి, అతణ్ణి పంపించాను.
శరత్ మహరాజ్ కాశీ నుండి కలకత్తాకు వెళ్లగానే, జయరాంబాటి నుండి మాతృదేవిని తోడ్కొని రావడానికి మనిషిని పంపించారు. ఎప్పటిలా పనిమనుషు లతోను, మూటముల్లెలతోను ఒక రోజు ఉదయం మాతృదేవి బయలుదేరారు. అందరూ ప్రణమిల్లారు. చివరకు కి– మహరాజ్, ఒక భక్తుడు ప్రణమిల్లారు. తాము ఉపయోగిస్తూవచ్చిన ఒక బట్టను, దుప్పటిని వారికి ఇస్తూ, “వీటిని ఉంచు కోండి” అంటూ వారి శిరస్సులను స్పృశించి ఆశీర్వదించారు. ఆ తరువాత చెమ్మ గిలిన కళ్లతో బయలుదేరారు. నేను పల్లకీ పక్కనే సైకిల్ మీద పోసాగాను.
సిహోర్ శాంతినాథస్వామి ఆలయం వచ్చింది. మాతృదేవి పల్లకీ నుంచి దిగారు. రెండు రూపాయలకు మిఠాయి, చక్కెర, బెల్లం కొని, శివునికి నైవేద్యం చేయమని పంపించారు. పిదప అందరికీ ప్రసాదం పంచిపెట్టారు; తాము కూడా కాస్త తీసుకొన్నారు. రాధూ కోసం కొంత ప్రసాదం తీసి చీర కొంగులో ముడివేసు కొన్నారు.
కోల్పారా చేరుకొన్న తరువాత, రాధూ తదితర స్త్రీలు ఎడ్లబండ్లలో విష్ణుపూర్‌కు బయలుదేరారు. మర్నాడు ఉదయం ఐదు గంటలకు కోల్పారా జగదంబ ఆశ్రమానికి నేను వెళ్లినప్పుడు మాతృదేవి పూజ అప్పుడే పూర్తిచేశారు. గురుదేవుల పటాన్ని పువ్వులతో అలంకరించి ఉన్నారు. మిఠాయిలు నైవేద్యంగా అర్పించారు. తరువాత గురుదేవులతో, “ఇక బయలుదేరుదామా! వేళ అయింది” అంటూ ఆయన పటాన్ని ఒక గుడ్డలో చుట్టి తమ పెట్టెలో పెట్టుకొన్నారు.
నన్ను చూడగానే, “వచ్చేశావా! ఇంత ఆలస్యమయిందేం! ఆలస్యం అయ్యేకొద్దీ ఎండ తీక్షమవుతుంది. ఇదుగో పూజాపుష్పం తీసుకో” అంటూ పువ్వును తమ తలకు తాకించి, నా కిచ్చారు. ఆ తరువాత అందరి వద్దా సెలవు పుచ్చుకొని పల్లకీ ఎక్కారు. కాస్త దూరం వెళ్లాక, “ఎప్పుడూ నాకు దగ్గరలోనే ఉంటూ జాగ్రత్త రా. రాధూ, మాకూ ఆభరణాలన్నీ పల్లకీలో ఉన్నాయి” అని చెప్పారు.
జైపూర్ రాగానే పల్లకీ దింపమన్నారు మాతృదేవి. పల్లకీ దిగి సత్రానికి వెళ్లారు. మునుపు ఒకసారి జయరాంబాటికి పోతున్నప్పుడు మాతృదేవీ, మేమూ ఈ సత్రంలోనే దిగి వంట చేసుకొని భోజనం చేశాం. ఇప్పుడు ఆ సత్రం శిథిలా వస్థలో ఉంది. దానిని చూడగానే మాతృదేవి నవ్వి, “ఆహా! అదే సత్రం నాయనా!” అని వ్యాఖ్యానించారు. ఒక దుప్పటి పరచి దాని మీద కూర్చున్నారు. నాకు రెండు రూపాయలిచ్చి, “బోయీలకు (పల్లకీ మోస్తున్న వారికి) మరమరాలు కొని ఇవ్వు” అని చెప్పారు. మాకూకూ బిడ్డకు పాలు వేడిచేసి ఇచ్చారు. దగ్గరలోనే ఉన్న చెరువు వద్దకెళ్లి కాళ్లు చేతులు కడుగుకొని వచ్చారు. “నాకు కూడా ఒక పైసకు మరమరాలు పట్రా. కాసిని నోట్లో వేసుకొంటాను. నీకూ, మాకూకూ వేయించిన మసాలా మరమరాలు దొరకుతాయేమో చూడు” అన్నారు. అన్నీ కొని తీసుకువచ్చాను. మాతృదేవి కాసిని తిని, “ఇక తినలేను” అంటూ వాటిని మాకు ఇచ్చేశారు.
బోయీలు తినగానే మళ్లీ ప్రయాణం కొనసాగింది. నాలుగు మైళ్లు అడవిని దాటి తాంతిపుకూర్ చేరుకొన్నాం. అక్కడ ఒక దుకాణం వద్ద కొందరు కూలీలు కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్నారు. వీలైనంత త్వరగా ఆ చోటు నుండి వెళ్లిపోవాలని నాకు అనిపించింది. రెండు మైళ్లు పోతే కాస్త జనసంచారం ఉన్న ప్రాంతం వస్తుందనీ, ఆ తరువాత ఆందోళన పడనక్కరలేదనీ అనుకొన్నాను.
కానీ పల్లకీ నుండి తొంగిచూసి దుకాణం కంటపడగానే నాతో, “కాస్త పల్లకీ దింపమను. కూర్చుని కూర్చుని కాళ్లు మొద్దుబారిపోయాయి. రెండు పైసలకు సాల్ ఆకుపై వేసి నూనె తీసుకురా, కాళ్లకు రాచుకోవాలి” అన్నారు మాతృదేవి. ఆ మాటలు వినగానే భయపడిపోయాను.
నేను (మాతృదేవితో): ఇక్కడ ఉన్నవారు మొరటు మనుషుల్లా కనిపిస్తున్నారు. మీరు దిగకండి. లోపలే ఉండండి. నేను వెళ్లి నూనె తీసుకువస్తాను.
మాకూ: మరమరాలు తినడంతో దాహమేస్తోంది. నీళ్లు తాగాలి.
మాతృదేవి: తాగు. పక్కనే చెరువు ఉంది కదా! వెళ్లి నీళ్లు తాగిరా.
నేను: చెరువు నీళ్లు తాగడమా? అవి మంచినీళ్లు కాదు.
మాతృదేవి: అదేమిటి? బాటసారులు అనేకులు తాగడం లేదా? ఏమీ కాదు. వెళ్లు, వెళ్లి నీళ్లు తాగి రా, (నాతో) ఆమెకు తోడుగా వెళ్లు.
నూనె కొని మాతృదేవికి ఇచ్చి, మాకూతో పాటు వెళ్లాను. నేను తిరిగి రాగానే ప్రయాణం కొనసాగింది.
మధ్యాహ్నం 12 గంటలకు విష్ణుపూర్‌లో సురేశ్వర్బాబు ఇల్లు చేరుకొన్నాం. కొన్ని నెలల క్రితమే సురేశ్వర్ గతించాడు. “ఆహా! నేను ఇక్కడకు వచ్చినప్పుడల్లా సురేశ్ చేతులు జోడించుకొని నిలబడే ఉండేవాడు. నేను వసారాలో ఉంటే, వసారాలోకి అడుగుపెట్టడు. ఏం భక్తి” అన్నారు మాతృదేవి. ఆ రోజు విష్ణుపూర్‌లో బసచేసి, మర్నాడు మధ్యాహ్నం భోజనానంతరం అందరమూ రైలులో, మూడవ తరగతి పెట్టెలో ప్రయాణం చేసి, రాత్రి దాదాపు పది గంటలకు ఉద్బోధన్ చేరుకొన్నాం.
మాతృదేవిని చూడగానే యోగీన్ మా, గోలాప్ మాలు మాతో, “మీరు మాతృదేవినా తీసుకొచ్చారు? కారునలుపు భూతంలా కదా ఉన్నారు. కొన్ని ఎముకలకు, చర్మం కప్పి తీసుకువచ్చినట్లుంది. మాతృదేవి ఆరోగ్యం ఇంతగా దిగజారిపోయిందని మేం ఊహించలేదు” అన్నారు. మర్నాటి నుండి మాతృదేవి చికిత్సకు శరత్ మహరాజ్ ఏర్పాటు చేశారు. చికిత్స ఫలితంగా మాతృదేవి బాగా కోలుకొన్నారు.
ఈ రోజుల్లో ఒకనాటి సాయంత్రం కొందరు భక్తురాండ్రు మాతృదేవి దర్శనార్థం వచ్చారు. వారిలో ఒక స్త్రీ ఆభరణాలు, విలువైన దుస్తులు ధరించి మహా ఆడంబరంగా ఉంది. ఆమెను సూచిస్తూ మాతృదేవి ఇలా వ్యాఖ్యానించారు:
“స్త్రీకి లజ్జయే ఆభరణం. ఒక పువ్వు ఎప్పుడు ధన్యమవుతుందో తెలుసా? భగవంతునికి అర్పింపబడినప్పుడే! లేకుంటే అది చెట్టుకే వాడిపోయి నేల రాలడం ఉత్తమం. షోకిల్లారాయుళ్లు ఆ పువ్వులు కోసి, గుత్తిగా పుచ్చుకొని, ఒకటి రెంటినివాసన చూస్తూ, ‘ఆహా! ఏం సువాసన!’ అంటూ ఆహ్లాదించినప్పుడు నే నెంతగానో పరితపించిపోతాను. దేవుడా, దేవుడా! మరుక్షణమే బహుశా వాటిని దూరంగా పారేస్తారు. అవి చెప్పుల కింద నలిగి నశిస్తాయి, తిరిగి కూడా చూడకుండా తమ దారిన వెళ్లిపోతారు.”
ఒక రోజు రాంలాల్, ఆయన కుమార్తె, లక్ష్మి ప్రభృతులు మాతృదేవి దర్శనానికి దక్షిణేశ్వరం నుండి వచ్చారు. ఎంటాలీలో ఒక ఉత్సవం నిమిత్తం వారు వచ్చారు. మాతృదేవికి ప్రణమిల్లి, శరత్ మహరాజ్‌ను చూడడానికి రాంలాల్ కిందికి వెళ్లిపోయారు. మాతృదేవి, తదితరుల కోర్కె మేరకు లక్ష్మి పాడింది. పాటతో పాటు, ఖోల్ వాద్య ధ్వనిని నోటితోనే అనుకరించింది. అది విని అంతా నవ్వారు. ఆ తరువాత గురుదేవుల జన్మస్థలం, అక్కడ నిర్మించబోయే ఆలయం మొదలైన విషయాల ప్రస్తావన వచ్చింది.
లక్ష్మి: అక్కడ ఆలయం నిర్మిస్తే అది మన ఆధ్వర్యవంలోనే ఉంటుంది కదా? వీరి (రాంలాల్, శివరాం) పిల్లలూ, సంతితివారే పూజాదికాలు నిర్వహిస్తూ, అక్కడ నివసిస్తారు కదా!
మాతృదేవి: అదెలా కుదురుతుంది? అక్కడ ఉండేవారు సాధువులూ, భక్తులూ! వారు కులాన్ని అంతగా పట్టించుకొంటారా? దేశదేశాల నుండి జనం వస్తారు, నివసిస్తారు, భోజనం చేస్తారు. మా జీవితం భక్తులతో ముడిపడి ఉంది. వీరంటే గృహస్థులు. సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని జీవించవలసి ఉంది. పిల్లలకు వివాహం వంటివి చేయాల్సివుంది. ఇటువంటి వీరు సాధువులతో పాటు నివసించగలరా ఏమిటి?
ఇలా కొంతసేపు మాట్లాడిన తరువాత మాతృదేవి, మళ్లీ కొనసాగించారు: “మీ అందరికీ విడిగా ఇళ్లు కట్టవచ్చు. ఇప్పుడు మీరు ఉంటున్న ఇళ్లలాగానే! కానీ ఇనుము మొదలైన వాటితో ఆ యుగుల తోటకు సమీపంలోనో లేకపోతే పశ్చిమం వైపునో కట్టవచ్చు.
లక్ష్మి: అలా అయితే రఘువీరుడు, శీతలాదేవి కూడా నిర్మింపనున్న గురు దేవుల ఆలయంలోనే ప్రతిష్ఠింపబడతారా?
మాతృదేవి: అదెలా? వాళ్లు మీ కులదైవాలు. పండుగ రోజులలో మీ కుటుంబ స్త్రీలు, కోడళ్లు మాత్రమే వారిని పూజించాలి. అందువలన అందరినీ ఒకే ఆలయంలో ప్రతిష్ఠించడం జరగదు. కనుక రఘువీరునికి విడిగా ఆలయం నిర్మించి ఇస్తారు. పక్కన సన్నని దారి ఏర్పాటు చేసియిస్తారు. నువ్వు, రాంలాల్, శివరాం ప్రభృతులు ఎవరు ఆ దారి గుండా వెళ్లినా భక్తులతోపాటు మీకూ ప్రసాదం ఇస్తారు. మరి ఇంకా ఏం కావాలి?
రాంలాల్, ఇతరులూ మేడ మీదనున్న శరత్ మహరాజ్ గదికి వచ్చారు. మాతృదేవి ప్రతిపాదనను రాంలాల్, లక్ష్మి మనఃస్ఫూర్తిగా అంగీకరించారు. ఈ ఏర్పాటు గురించి విని శరత్ మహరాజ్ కూడా ఎంతో సంతోషించారు.
రాంలాల్, లక్ష్మి వెళ్లిపోయిన కొంతసేపటికి హఠాత్తుగా మాతృదేవి నన్ను పిలిచి, “ఇదుగో చూడు నాయనా! మాటల్లోపడి లక్ష్మికి బట్టలు, డబ్బు ఇవ్వడం మరచిపోయాను, వెంటనే కృష్ణలాల్తో ఎంటాలీకి వెళ్లి ఉత్సవం కూడా చూసి, వీటిని లక్ష్మికి ఇచ్చిరా! ఎంటాలీలో విగ్రహానికి అలంకారం బాగా చేస్తారు” అని చెప్పారు. తరువాత డబ్బు, బట్టలు ఇస్తూ ఇలా అన్నారు: “లక్ష్మి గురుదేవుల ముందు గాయకురాలిలా పాడేది, నృత్యం కూడా చేసేది, వాళ్లలా అభినయించేది. అయినా గురుదేవులు నాతో, ‘అది ఆమె నైజం. ఆమెను చూసి నువ్వు కూడా లజ్జను విస్మరించకు’ అనేవారు.”
జయరాంబాటి వాస్తవ్యుడైన ఒక ఫలానా వ్యక్తిని దొంగతనం చేసినందుకు ఖైదు చేశారని ఎవరో ఉత్తరం వ్రాశారు. ఆ సంగతి విని మాతృదేవి ఇలా అన్నారు:
“విన్నావా నాయనా! అతడు దొంగ అని నాకు తెలుసు. అతడిపట్ల నేనెంతో ఆప్యాయంగా వ్యవహరించాను. ఎన్ని వస్తువులు ఇచ్చాను! వాడు కూడా నా పట్ల విధేయతతోనే మెలగాడు. నా వద్దకు వచ్చేటప్పుడు ఎంతో వినమ్రంగా ఉండేవాడు. ఈ ఆడవాళ్ల, వారి ఆభరణాల బాధ్యతతో నే నక్కడ నివసిస్తున్నాను. మీరంతా ఎప్పుడుంటారో, ఎప్పుడు వెళతారో నిశ్చయంగా తెలియదు. ఏ విధంగానైనా దుష్టులను దూరంగా ఉంచే తీరాలి.”
జయరాంబాటిలో ఒక రోజు ఒక వ్యక్తి ఒక స్త్రీని నానా చీవాట్లు పెట్టాడు. అది చూసి మాతృదేవి ఇలా అన్నారు:
“ఇదేమిటి నాయనా! మనస్సు నొచ్చుకొనేలా మాట్లాడవచ్చా? నిజమే అయినప్పటికీ, ఇతరుల మనస్సు నొచ్చుకొనేలా మాట్లాడకూడదు. ఇలాగే కొనసాగిస్తే చివరకు అదే నీ స్వభావం అయిపోతుంది. సున్నితత్వాన్ని కోల్పోతే నీ మాటలకు హద్దూపద్దూ లేకుండాపోతుంది. ‘ఒక కుంటి వ్యక్తిని అతడెలా కుంటివాడయ్యాడో అడగాలనుకొంటే, ‘ఎలా కుంటివాడివయ్యావు?’ అని కటువుగా అడగకూడదు. ‘నీ కాళ్లు ఎందువల్ల వంకరగా ఉన్నాయి?’ అని అడగాలి – అని గురుదేవులు చెప్పేవారు.”
చివరి రోజుల్లో మాతృదేవి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఎక్కువసేపు కూర్చోలేకున్నారు. అయినా పడుకొనే ఎక్కువసేపు జపం చేసేవారు. జయరాంబాటిలో ఉన్నప్పుడు ఏదో కారణంగా ఒకసారి ఆమెను రాత్రి ఒంటిగంటకు లేపవలసి వచ్చింది. పిలవగానే ఆమె నుండి జవాబు వచ్చింది. “అమ్మా! మీరు నిద్రపోలేదా?” అని అడిగినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“ఏం చేయమంటావు నాయనా? నా బిడ్డలు ఆతురతతో వచ్చి మంత్రదీక్ష పుచ్చుకొంటారు. కానీ శ్రద్ధగా ఎందరు జపం చేస్తారు? శ్రద్ధగా అనడమెందుకు, అనేకులు అసలు జపమే చేయరనవచ్చు. వారి బాధ్యత తీసుకొన్న నేను వారిని చూసుకోవాలి కదా! అందుకే జపం చేస్తున్నాను. గురుదేవులను ‘ప్రభూ! వారిలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతి చేయండి. వారికి ముక్తి ప్రసాదించండి. ఈ లోకంలో ఎన్ని కష్టాలు, క్లేశాలు! ఇందులోకి వాళ్లు మళ్లీ రాకుందురుగాక! అని ప్రార్థిస్తాను.”
ఇలా అంటూ మాతృదేవి మెల్లగా లేచి కూర్చున్నారు. పిదప కొనసాగించారు:
“ఎంతో ఆతురతతో మంత్రదీక్ష పుచ్చుకొంటారు. కానీ ఎందుకు సాధన చేయరు? అదేం అంత కష్టమైనదా? కాస్త అభ్యాసంతో సాధనలు అనుష్ఠిస్తే ఎంత ఆనందం సొంతమవుతుంది! ఆహా! బృందావనంలో ఉన్నప్పుడు యోగీన్, నేను ఎంత ఆనందంగా జపం చేసేవాళ్లం! దోమలు కుట్టి ముఖమంతా పుండులా అయిపోయేది. కానీ మా కెలాంటి ఎరుకా ఉండేది కాదు.”
ఒక రోజు మాతృదేవి ఇలా అన్నారు:
“ఎంత జపం కావలసినా చేయి, ఎంత ప్రయత్నమన్నా చేయి. మహామాయ దారి కనుక ఇవ్వకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. ఓ మనిషీ! శరణు పొందు! శరణు పొందు! అప్పుడే అనుగ్రహించి ఆమె నీకు దారి ఇస్తుంది.”
ఇలా అంటూ కామార్పుకూర్లో గురుదేవులు ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను ఇలా తెలిపారు:
“ఒక రోజు సాయంత్రం. కుండపోతగా వర్షం కురుస్తోంది. పొలాలన్నీ నీళ్లలో మునిగిపోయాయి. డోంపాడా వీథిలో గురుదేవులు వరదనీళ్లలో నడుస్తూ పోతున్నారు. పెద్దపెద్ద చేపలు పైకి రావడం చూసిన గ్రామస్థులు దుడ్డుకర్రలతో వాటిని బాదసాగారు. ఇంతలో ఒక చేప వేగంగా వచ్చి గురుదేవుల పాదాల చుట్టూ తిరిగివచ్చింది. వెంటనే గురుదేవులు గ్రామస్థులతో, ‘ఈ చేపను చంపకండి, ఇది నా పాదాల వద్ద శరణు పొంది నన్నే ప్రదక్షిణ చేస్తూవుంది. సాధ్యపడితే ఎవరైనా దీనిని తీసుకెళ్లి చెరువులో వదలేయండి’ అన్నారు. ఆ తరువాత స్వయంగా తామే ఆ చేపను చెరువులో వదలిపెట్టారు. ఇంటికి తిరిగి వచ్చాక, ‘ఆహా! ఇలా ఎవరైనా శరణు జొచ్చినప్పుడు మాత్రమే గతి కలుగుతుంది’ అన్నారు.”
ఒక రోజు ఉద్బోధన్లో సాయంత్రం ఆరాత్రికం తరువాత మాతృదేవి మంచం మీద పడుకొన్నారు. నేను పాదాలు ఒత్తుతున్నాను. నేల మీద చాప పరచి యోగీన్ మా పడుకొనివున్నారు. అనేక విషయాల గురించి ముచ్చటించిన తరువాత మాతృదేవి ఇలా అన్నారు:
“ఈ మానవజన్మ ఎంత శ్లాఘనీయమైనదో తెలుసా? కనుక ఎంతో కృషిచేసి భగవంతుణ్ణి ప్రార్థించు. తీవ్ర కృషి చేయాలి, కృషి చేయకుంటే ఏదీ సిద్ధించదు నాయనా! కాని మనిషి అంత సులభంగా భగవంతుణ్ణి ప్రార్థించడానికి ముందుకు వస్తాడా ఏమిటి? జీవితంలో ఎదురు దెబ్బతినకుండా ఎవరైనా రామనామం జపిస్తారా? ఫలానా వ్యక్తి విషయమే తీసుకో! జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది. అన్ని దెబ్బలు తిన్న తరువాతే ఆమెలో వైరాగ్యం ఉదయించింది. భగవంతుని వైపు మనస్సు మళ్లింది. ఒక పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేసింది. ఒక యువకుడితో పరిచయమయింది. ఆతడితో పారిపోయింది. తరువాత ఎవరికీ తెలియకుండా ఆతణ్ణి వివాహం చేసుకొంది. ఒక బిడ్డ కూడా పుట్టింది. ఆ బిడ్డ మరణించింది. అందువలన దుఃఖం కలిగింది. ఆ వ్యక్తి దుష్ప్రవర్తనతో మనస్సు విరిగి, అతణ్ణి వదలిపెట్టేసింది. అనేక చోట్లకు వెళ్లింది. ఎన్నో తపస్సులు చేసింది. ఆమెకు చాలా భాషలు తెలుసు. ఎలాగో బలరాం వద్దకు వచ్చిచేరింది. ఆయన చివరకు గురుదేవుల వద్దకు తీసుకువచ్చాడు. పురుష స్వభావం ఆమెది. ఉపన్యాసాలు ఇస్తూవుంటుంది.”
జయరాంబాటిలో ఒక రోజు మాతృదేవి పాదాలు ఒత్తుతున్నాను. కొందరు భక్తుల ఉత్తరాలకు మాతృదేవి జవాబులిచ్చారు. అదంతా అయ్యాక నేను మాట్లాడ సాగాను.
నేను: అమ్మా! మిమ్మల్ని అడగడానికి నా వద్ద ఎలాంటి గొప్ప ప్రశ్నా లేదు. నేను చేస్తూన్న జపధ్యానాలు కూడా అంతగా చెప్పుకోదగ్గవిగా లేవు. ఏదో మత్తులో సదా తేలుతూన్నట్లు ఆనందంగా రోజులు దొర్లిపోతున్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. దాని గురించిన ఆందోళన కూడా లేదు.
మాతృదేవి: ఎందుకు ఆందోళన చెందాలి?
నేను: అది కూడా తెలియదు.
మాతృదేవి: ఏదేదో యోచిస్తూ మనస్సును పాడుచేసుకోకు. నువ్వు చేస్తూన్నది కొనసాగించు. నానా వైపులకూ మనస్సు పోతే ఒక్క పని కూడా సక్రమంగా జరగదు. ఆందోళన ఎందుకు? క్రమేణా అంతా జరుగుతుంది, అన్నిటినీ నువ్వు అర్థం చేసుకొంటావు.
ఇదుగో చూడు! పరిశోధన చేయడం, మనస్సులో తలెత్తే భిన్నవిభిన్న ప్రశ్నలను అడగడం, జపధ్యానాలు అనుష్ఠించడం, పనిచేయడం – ఇవన్నీ ఎందుకు? మనస్సు పరిశుద్ధం కావడానికే కదా! అనిత్యమైన వస్తువుల నుండి మనస్సును మరల్చి అనేక భాగాలుగా విడిపోయిన దానిని ఏకం చేసి, పరిశుద్ధపరచి, భగవంతుని అనుగ్రహం కోసం మనస్సును పరితపింపచేయాలి. ఆయన అనుగ్రహం ఎలా ప్రాప్తిస్తుందో ఆయనకే ఎరుక. కానీ ఒక్క సంగతి: తక్కిన అన్నిటి కంటే ఆయన దేనికి సంతోషిస్తాడో తెలుసా? నువ్వు చేస్తూ వస్తున్నావే దాని వలన మాత్రమే ఆయన సంతోషిస్తాడు – అదే సేవ. అడవిలో మృగాల, పక్షుల పర్యంతం సాక్షాత్తూ భగవంతుని వరకు అందరూ సేవ ద్వారా వశవర్తులవుతారు. కనుక మనస్సును ఆందోళనకు గురిచేయకుండా నువ్వు అనుష్ఠిస్తూన్న దానినే కొనసాగించు! భగవంతుడే నా వాడై ఉన్నప్పుడు ఆయనను ప్రత్యేకంగా ఏదైనా కోరుకోవాలా ఏమిటి?
ఉద్బోధన్